విష్ణు గ్రంధి (118)

                                                                           విష్ణు గ్రంధి 




బీహార్ లోని గయాక్షేత్రం


సాధన కుటుంబం అంతా ఉజ్జయిని క్షేత్రం నుంచి బీహార్ లోని గయాక్షేత్రానికి వెళ్లడం జరిగింది. ఇంతలో బాల గణపతికి ఒక సందేహం వచ్చి శివ నందినితో

బాల గణపతి:- అమ్మ!  నాస్తికుడు గొప్పవాడా?  ఆస్తికుడు గొప్పవాడా?

శివ నందిని:- వాళ్ళు ఎవరు? 

అని తెలియనట్టుగా శివనందిని అనేసరికి ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడని అనుకునేవాడు…..నాస్తికుడు అంటే దేవుడు లేడు అని అనుకునేవాడు . సరే నేను దీనికి సంబంధించిన మూడు కథలు చెబుతాను.  ఆ కథల ఉద్దేశం బట్టి మీరే నిర్ణయం చేసుకోండి. అది ఏది గొప్పదో…. అనేసరికి అయితే చెప్పమ్మా!  అనేసరికి ఒక ఊరిలో నాస్తికుడు, అదే ఊరిలో ఆస్తికుడు ఉండేవారు.  వీరిద్దరూ స్నేహితులు.  వీరిద్దరి మధ్య దేవుడు ఉన్నాడని…. దేవుడు లేడు అని గొడవలు జరుగుతూ ఉండేవి. మదన పడుతూ ఉండేవాళ్లు. కానీ ఆస్తికుడు ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మకంతో ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్లి అభిషేకం చేసుకొని…. శివుడికి బిల్వ దళాలు, ఫలాలు సమర్పించి వస్తూ ఉండేవాడు.  సాయంత్రం వేళ కూడా శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని పవళింపు సేవ దాకా గుడిలో ఉండి సాయంత్రం తిరిగి వచ్చేవాడు.  మధ్యకాలంలో తనకి సంబంధించిన వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు.  అదే నాస్తికుడు వచ్చేసరికి దేవుడు ఉన్నాడా లేడా వేదాలు ఏం చెప్తున్నాయో…. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో…. ఇతిహాసాల గ్రంధాలలో ఏముంది అని  రోజుకి ఒకటి చదువుతూ దేవుడు లేడు అని నిరూపించే ప్రశ్నలన్నింటినీ కూడా ఒక నోట్స్ గా రాసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. అనుకోకుండా వీరిద్దరూ మరణించడం జరిగింది. ఆ తర్వాత నాస్తికుడు కోసం శివదూతలు రావడం…. ఆస్తికుడు కోసం యమదూతలు వచ్చేసరికి…. విషయం అర్థం కాక  వీరిద్దరు కాస్త  అసలు విషయం ఏమిటి అని అయోమయంలో పడడం జరిగింది.  ఎందుకంటే ఆస్తికుడు కాస్త దేవుడు ఉన్నాడు అనే భావంతో ఉండటం నిజమే….అది ఏదో ఉద్యోగ బాధ్యతగా చేసేవాడు.  అంటే ఉదయకాలం వెళ్లి దర్శనం చేసుకుని… అభిషేకాలు చేసుకొని… తన వ్యాపార పనులలో పడిపోయేవాడు. దేవుడి గురించి ఆలోచించేవాడు కాదు.  మళ్ళీ సాయంత్రం వేళ తన కోరికలు అవసరాలు బాధలు చెప్పుకొని…. కష్టసుఖాలు చెప్పుకొని వచ్చేవాడు.  మళ్ళి దేవుడి గురించి ఆలోచించేవాడు కాదు.  కానీ నాస్తికుడు అలా కాదు….తన ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా ఆలోచించకుండా ఒకవేళ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు లేడు అని ఎలా నిరూపించాలి అనే ఆలోచనతోనే…. సతమతమవుతూ ఉండేవాడు. దేవుడు లేడు  అనుకుంటూనే నామస్మరణ నిత్యం చేస్తూ ఉండేవాడు. 24 గంటలు నాస్తికుడు దేవుడు గురించి ఆలోచించడం వలన శివలోక ప్రాప్తి కలిగింది అని.. దైవ స్మరణ అనేది ఒక బాధ్యతగా అవసరాలు తీర్చేవాడిగా ఆస్తికుడు భావించడంతో అతనికి యమ లోక  ప్రాప్తి కలిగింది అని చెప్పడం జరిగింది. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి…. అనేసరికి వీరిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇంకొక కథ చెబుతాను వినండి. అంటే ఒక మహాశివరాత్రి నాడు ఇద్దరు ప్రాణ స్నేహితులు గుడికి వెళుతున్న సమయంలో…. వ్యభిచారిణి ఎదురుపడటం జరిగింది. అందులో ఒకడు ఇప్పుడు గుడికి వెళ్లి మనం చేసేది ఏముంది?  భజనలు చేయడం జాగరణ చేయడమే కదా!  నేను ఈమెతో సుఖపడతాను అనేసరికి…. ఇవాళ శివరాత్రి.  శివరాత్రి నాడు ఇలాంటివి చేస్తే పంచమహా పాతకాలతో పాటుగా ఏడు జన్మలు పాపాలు చేసినట్టు అవుతుంది.నేను మాత్రం ఈ తప్పుడు పనులు చేయను అని చెప్పేసి ఒకడు గుడికి వెళ్ళిపోవడం జరిగితే…. ఒకడు వేశ్యను తీసుకొని తన ఇంటికి వెళ్లడం జరిగింది. కొంతసేపు అయిన తర్వాత వేశ్య తో ఉన్నవాడు కాస్త తన స్నేహితుడి గురించి ఆలోచిస్తూ…….శివాలయంలోకి వెళ్లి శివరాత్రి జాగరణ చేసుకుంటూ శివోపాసన చేస్తూ శివమంత్రం చేసుకుంటూ సంతోషంగా ఉండి ఉంటాడు అనుకుంటూ ఉంటే ….శివాలయానికి వెళ్ళినవాడు కాస్త ఏముంది!  ఇక్కడ భజనలు తప్ప మనసు భక్తి మీద లేదు… నామస్మరణ చేయలేకపోతున్నాను… చక్కగా వాడు ఆడదానితో సుఖపడుతున్నాడు.  అక్కడ సుఖం పొంది ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉన్నాడు. ఆడదాని దగ్గర సుఖం పొందే వాడేమో  దైవం గురించి ఆలోచిస్తూ ఉంటే….. శివాలయంలో ఉన్నవాడు ఆడదాని గురించి ఆలోచించడం జరిగిందన్నమాట!  ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు కూడా మరణించడం జరిగింది. ఆ ఆడదాని సుఖం పొందినవాడి కోసం శివ దూతలు రావడం జరిగింది.  శివాలయానికి వెళ్ళిన వాడి కోసం యమదూతలు రావడం జరిగింది. దీనితో విషయం అర్థం కాకపోయేసరికి….. అప్పుడు శరీరం మలినమైనప్పటికీ…. మనసు శివుడి మీద పెట్టి ఆ రోజంతా శివుడి గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, కానీ శివాలయానికి వెళ్లిన నువ్వు జాగరణ చేశావే కానీ మనసంతా కూడా ఆడదాని మీద,  కామం గురించి, వీడు ఏ విధంగా సుఖపడుతున్నాడు అని ఆలోచనలు చేస్తూ కూర్చున్నారు.  అందుకోసం అని నీకోసం యమదూతలు రావడం జరిగింది అని చెప్పడంతో  శరీరం ప్రధానం కాదు…. మనసు ప్రధానం అని చెప్పేసి మనసు భావం పట్టుకోవాలి అని చెప్పి చెప్పకనే చెప్పారు అని వాళ్ళకి అర్థం అయింది. ఈ కథను దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడవ కథగా ఒక యతీశ్వరుడు ఒక వేశ్య ఇంటి ముందు ఉండి తన ఇంటికి వచ్చే విటులను చూస్తూ ఈమె ఎంత పాపం చేస్తుందో కదా!  ఎంత పాపం మూట కొట్టుకుంటుందో కదా!  ఎంతమంది సంసార జీవితాలను నాశనం చేస్తుందో కదా!  ఆ వచ్చే విటులను లెక్క కట్టాలి అని చెప్పి తన ఇంటికి వచ్చే విటులను చూస్తూ ఒక రాయిని పేర్చడం మొదలుపెట్టాడు.  కొంతకాలం అయ్యేసరికి వీరిద్దరూ చనిపోవడం జరిగింది. వేశ్య కోసం శివ దూతలు, మునీశ్వరుని కోసం యమ దూతలు రావడంతో ….విషయం అర్థం కాక బిక్కముఖం వేసుకొని చూస్తూ ఉంటే…. అప్పుడు శివ దూతలు కాస్త మునీశ్వరుడితో అయ్యా ! నువ్వు శరీరానికి యోగం ఇచ్చావు… కానీ మనసుకు భోగం ఇచ్చావు.  ఆ వేశ్య ఇంటికి వచ్చే విటుల గురించి నీ ఆలోచనలు వెళ్ళినాయి. ఆమె ఏ విధంగా సుఖం ఇస్తుంది…. వాళ్ళు ఏ విధంగా సుఖపడుతున్నారు. ఆమె ఏ విధంగా పాపం కట్టుకుంటుంది అని దీని గురించే పదేపదే ఆలోచనలు చేయడం జరిగింది. కానీ అదే  వేశ్య మాత్రం తన దగ్గరికి వచ్చినవాడు శివ స్వరూపం శివుడే…. ఆ రూపంలో వచ్చి సుఖాలు పొందుతున్నాడు.  ఇదం శరీరం పరోపకారార్థం అని చెప్పేసి… శివ ఉపాసనతో, శివారాధన చేస్తూ ఉండేది.  మనసు శివుడి మీద లగ్నం చేసేది. శరీరానికి భోగాన్ని, మనసుకు యోగాన్ని ఇచ్చింది. అదే నువ్వు వచ్చేసరికి మనసుకు భోగాన్ని ఇచ్చావు… శరీరానికి యోగాన్ని ఇచ్చావు. తద్వారా నీ శరీరం గంధపు చెక్కలతో దహనం చేస్తే ఈమె శరీరం అనాధ శవంలాగా దహనం అవడం జరిగింది. కావాలంటే చూడు అనేసరికి… భూలోకంలో తన శరీరం గంధపు చెక్కలతో దహనం అవడం గమనించాడు.  చెత్త కుప్పల మధ్యలో అనాధ శవంలాగా వేశ్య శరీరం దహనం అవడం తను గమనించింది. కానీ ఈ శరీరాలు అంతటితో దహనం అవటంతో మనసు ప్రదానం కానీ శరీరం ప్రధానం కాదు అని వాళ్ళు గ్రహించారు.  ఈ విధంగా దీనిబట్టి నాస్తికుడా? ఆస్తికుడా? శరీరంతో సాధన? మనసుతో సాధన? అనేది మీరే ఆలోచించుకోవాలి అనేసరికి బాల కుమారస్వామి వెంటనే అమ్మా!  కథలన్నీ బట్టి చూస్తుంటే శరీరం అప్రదానం….మనసే ప్రదానం అని తెలుస్తుంది.  మనసు అనే భావం ఆలోచన పట్టి మన సాధన ఉంటుంది. 24 గంటలు దైవం గురించి ఆలోచన చేసినవాడే దైవ సన్నిధికి చేరుకుంటాడు అని చెప్పి అర్థం అవుతుంది అని చెప్పేసరికి……అవునమ్మా అర్థమవుతుంది నువ్వు చెప్పింది నిజమే, శరీరం ప్రధానం కాదు, శరీరం భోగంలో ఉన్నప్పటికీ మనసు యోగంలో ఉంటే సరిపోతుందని అర్థం అవుతుంది.  భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే మనకి శివ సన్నిధానంలోకి వెళ్ళటం జరుగుతుంది. దైవసాంగత్యమును పొందడం జరుగుతుంది. మనసు ప్రధానం కానీ శరీరం ప్రధానం కాదు. ఆలోచన ప్రదానం కానీ భావం ప్రధానం కాదు అని అర్థమవుతుంది అని బాల గణపతి అనేసరికి సత్యం తెలుసుకున్నారు…. ఇప్పుడు నువ్వు ఆస్తికుడివా నాస్తికుడివా యోగివా భోగివా అనేది పక్కన పెట్టాలి. సాధనకి మనసు ప్రధానం.  నువ్వు ఎంత ఎక్కువ దైవం గురించి ఆలోచిస్తే అంతలా దైవానికి దగ్గరగా ఉంటావు. శరీరంతో పూజలు చేసినంత మాత్రము చేత శుద్ధిలేని మనసుతో సాధన చేసినప్పటికీ ఉపయోగం లేదు.అదే మనసులో ఒక క్షణకాలం పాటు సాధన చేసిన శ్రద్ధ భక్తులతో సర్వస్య శరణాగతి భావంతో సాధన చేసినా …..అది నీకు అనంతకోటి ఫలితాలను ఇస్తుంది అని శివ నందిని అనేసరికి నిజమే అని వాళ్ళు అనుకున్నారు.  ఆ తర్వాత ఈ గయా స్థలపురాణం విశేషాలు చెప్పమని అడిగేసరికి అప్పటికే దీనికి సంబంధించిన స్థల విశేషాలు చదివి ఉండటం వలన వాటి గురించి వివరించడం ప్రారంభించింది. 


పూర్వకాలంలో గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.  అతను మహా విష్ణువుకి పరమ భక్తుడు. విష్ణువు కోసం తీవ్రమైన ధ్యాన తపస్సు చేయడం జరిగింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవడం జరిగింది. భూమండలంలోని అన్ని పవిత్ర తీర్థాల పవిత్రత తన శరీరం పొందాలని వరం కోరుకోవడం జరిగింది. దానితో విష్ణువు కాస్త తధాస్తు అని చెప్పేసి వరం ఇవ్వటం జరిగింది. తద్వారా ఈ గయాసురుడు శరీరం స్పర్శ తాకినా పంచ మహా పాతకాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యాత్ములుగా మరి స్వర్గలోకమునకు వెళ్లడం జరుగుతూ ఉండేది.  నరక లోకంలోకి ఎవరు వెళ్లకపోవడంతో అందరూ స్వర్గలోక పుణ్య జీవులుగా మారడంతో…. సృష్టిక్రమానికి భంగం వాటిల్లింది.  అంతేకాకుండా గయాసురుడు అనేక హోమాలు, యాగాలు చేయడంతో ఇంద్రలోక పదవికి రావటం జరిగింది. దానితో ఇంద్ర పదవి చిత్తుడు అయిన ఇంద్రుడు, త్రిమూర్తుల కోసం ఘోర తపస్సు చేయటం జరిగింది.  త్రిమూర్తులు ప్రత్యక్షం అయ్యేసరికి…. తన ఇంద్ర పదవి పోవటం అలాగే గయాసురుడు వలన సృష్టిలో జరుగుతున్న లోపం గురించి చెప్పేసరికి… గయాసురుడికి మోక్షం ఇవ్వాలని చెప్పేసి….. వీళ్ళ ముగ్గురు కూడా గయాసురుడి దగ్గరకు వెళ్ళటం జరిగింది. అది కూడా ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి అతనితో అయ్యా!  విశ్వశాంతి కోసం మాకు యజ్ఞవాటిక కావాలి. ఈ భూమండలంలో అన్ని పుణ్యక్షేత్రాలు…. ఆ పుణ్యక్షేత్రంలోని నదులు ….మానవులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవడంలో ఆ నదులు  మలినం అయిపోయయాయి. కాబట్టి నీ శరీరంలో స్వర్గ తీర్థాలు పుణ్యఫలం ఉందని తెలుసుకొని మీ శరీరంలో యజ్ఞవాటిక…. అగ్నివాటిక చేసుకొని విశ్వశాంతి కోసం యాగం చేయాలని సంకల్పించాము అనేసరికి….. గయాసురుడు అందుకు సంతోషించి…. వచ్చినది త్రిమూర్తులు అని గ్రహించి…. సాక్షాత్తు త్రిమూర్తులు తన శరీరం గురించి తన ఉన్నత స్థితి గురించి పొగిడేసరికి ఆ పొగడ్తలకు గయాసురుడు పొంగిపోయి…. తన శరీరమును యజ్ఞవాటికగా చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దానితో ఆయన శరీరం భారీగా పెంచడం జరిగింది.  అనగా తలభాగం ప్రస్తుతం ఉన్న గయాక్షేత్రంనకు…. నాభిప్రాంతం ఒరిస్సా ప్రాంతంలోని జాజ్ పూర్ ప్రాంతమునకు, పాదాలను ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం దాకా సాగదీసి దేహమును పెంచడం జరిగింది. దానితో విష్ణువు కాస్త తలభాగం నందు యాగం మొదలు పెడితే….. బ్రహ్మ కాస్త నాభిభాగం నందు యాగం మొదలుపెడితే…. శివుడు కాస్త పాదభాగమునందు ఉండి విశ్వశాంతి కోసం ఏడు రోజులు యజ్ఞం చేయడం జరిగింది. కాకపోతే ఈ యజ్ఞం ఆరంభం సమయంలోనే గయాసురుడికి త్రిమూర్తులు కాస్త ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ కారణం చేత అయిన గాని మేం చేస్తున్న యజ్ఞానికి సమస్య వాటిల్లితే నువ్వు మరణం పొందక తప్పదు.  మోక్షం పొందక తప్పదు అని చెప్పి చెప్పడంతో….. గయాసురుడు అందుకు అంగీకరించడం జరిగింది. ఏడు రోజుల యజ్ఞంలో ఆరు రోజుల పాటు ఎలాంటి సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా త్రిమూర్తులు యజ్ఞం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయకాలంలో కోడి కూతను బట్టి ఏ రోజుకి ఆరోజు ఎన్ని రోజులు పూర్తయినాయో గయాసురుడు తెలుసుకుంటూ ఉండేసరికి….. ఈ విషయం గమనించిన శివుడు కాస్త, ఎలాగైనా గయాసురుడి మరణం ఇవ్వాలని నిశ్చయించుకుని…. ఏడవ రోజు కోడి కూయకముందే ఈయన కోడి రూపంలో మారి ముందుగానే కోడి కూత కూయడంతో…. గయాసురుడు కాస్త ఓహో!  ఈ రోజు యజ్ఞం పూర్తి అయింది అనుకుంటూ  తల భాగం కదపటం జరిగింది. తద్వారా యజ్ఞం పూర్తికాకుండానే అసంపూర్తిగా ఆగిపోవడంతో…. ఈ విషయం గయాసురుడికి చెప్పడంతో…. నిజానికి కోడి కూత కూయలేదని, కోడి రూపంలో ఉన్న శివుడే కూత కూశాడని….తనకి ఇంక మరణం సంభవించింది అని గ్రహించి…. పరమ దైవం అయిన విష్ణుమూర్తి చేతిలోనే తనకి మరణం ప్రసాదించమని….అలాగే ఈ మూడు క్షేత్రాలలో ఎవరైనా  పితృదేవతల శ్రాద్ధ కర్మలు లాంటి కార్యక్రమాలు చేస్తే,  వాళ్ళకి మోక్షం ప్రసాదించమని చెప్పేసి… ఈ మూడు క్షేత్రాలలో త్రిమూర్తులు ఆవాసం చేయాలి అని చెప్పేసి…. తన మరణకాల సమయంలో గయాసురుడు వరం కోరుకోవడంతో…. ఈ త్రిమూర్తులు కాస్తా తధాస్తు అనటం జరిగింది. అప్పుడు ఆఖరిగా విష్ణుమూర్తి తన కుడి పాదమును ఈ గయాసురుడి వక్షస్థలం మీద పెట్టి నొక్కుతూ ఉండేసరికి…. గయాసురుడు యోగ నిద్రాసాధనలో మరణం పొంది మోక్షమును పొందడం జరిగింది.  తద్వారా విష్ణు పాద ముద్ర బీహార్ లోని గయాలో ఈ దృశ్యం …మనకి ఇప్పటికీ చూడటం జరుగుతుంది.  అలాగే శివుడు కాస్త కోడి రూపంలో కూత కూయడంతో పిఠాపురం క్షేత్రంలో పాదగయలో మనం కుక్కుటేశ్వర స్వామిగా శివుడు వెలియడం జరిగింది. ఇక్కడ అమ్మవారి శక్తి పీఠం కూడా పురుహూతికా దేవిగా శక్తిపీఠము ఉండటం జరిగింది. ఈ మూడు గయాల్లో పాదగయ ఉన్నతమైనది అని స్థల పురాణం చెప్పడం జరిగింది. ప్రస్తుతం బీహార్ లో ఉన్న గయా ప్రాంతంలో ఫాల్గు నది తీరంలో ఉంటుంది. అక్కడ ఉన్న మంగళ గౌరీ శక్తిపీఠమునకు దర్శనం కోసం వెళ్లడం జరుగుతుంది. అష్టాదశ పీఠాలలో ఇది 16వ శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ అమ్మవారి వక్షోజాలు పడ్డాయని స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. ఈ గయకి రెండు కిలోమీటర్ల దూరంలోనే విష్ణుపాదగయ ఉంటుంది.  దీనికి 12 కిలోమీటర్ల దూరంలోనే మనకి బౌద్ధ గయ కూడా ఉంటుంది.  ఇక్కడ బుద్ధుడు జ్ఞానం పొందిన రావి చెట్టుని మనం చూడడం జరుగుతుంది.  అంటే మంగళ గౌరీ గయా, విష్ణు పాదగయ, బుద్ధగయ ఈ మూడు ప్రాంతాలను ఇక్కడ చూడటం జరుగుతుంది అని చెప్పేసి పిల్లలికి శివ నందిని వివరించడం జరిగింది. ఈ గయాలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఇక్కడ ఉన్న సీతా కుండ్ అనే ప్రాంతంలో ఆడవాళ్లు పితృదేవతలకు పిండ ప్రధానం చేస్తారు.  ఎందుకు అంటే పూర్వకాలంలో వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజుకు పిండ ప్రధానం చేయడానికి అని చెప్పేసి ఈ కుండ్ దగ్గరికి రావడం జరిగింది.  రామలక్ష్మణులు కాస్త ఈ పిండ ప్రదానానికి కావలసిన సామాగ్రి కోసం దగ్గర్లో ఉన్న గ్రామమునకు వెళ్లడం జరిగితే ……వీళ్ళు వచ్చే సమయానికి పూజకు అన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి సీతాదేవి కాస్త ఈ ఫాల్గు నదిలోకి దిగి స్నానాధికాలు చేసుకొని…. ఈ నది ఒడ్డున ఉన్న మట్టితో గౌరీదేవి రూపం తయారు చేయాలని చెప్పి…. మట్టిని ఒక ముద్దగా చేస్తూ ఉండేసరికి…. దశరథ మహారాజు కాస్త ఆత్మ స్వరూపంలో వచ్చి అమ్మ!  నాకు ఆకలేస్తుంది.  ఏదైనా పెట్టు…అనేసరికి మామగారు!  మీ పిండ ప్రధాన ఏర్పాట్లు చేయడానికి మీ కొడుకులు వెళ్లారు.  వీళ్ళు వచ్చి దానికి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేస్తారు అనేసరికి…అమ్మ!  నాకు అంత సమయం లేదు. నీ చేతిలో ఉన్న మట్టి ముద్దని నాకు పిండ ప్రధానంగా పెట్టు….అనేసరికి ఇక చేసేది లేక మట్టి ముద్దనే పిండంగా భావన చేసి… దశరథునికి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఫాల్గు నది, బ్రాహ్మణుడు, ఆవు, రావి చెట్టు సాక్షులుగా ఉండి…సీతాదేవి ఈ విధంగా మట్టితో చేసిన పిండం దశరధునికి పెట్టడం జరిగిందన్నమాట!  ఆ తర్వాత కొద్దిసేపటికి రామలక్ష్మణులు పిండ ప్రదానానికి కావలసిన సామాను తీసుకుని వచ్చి పిండ ప్రధాన కార్యక్రమంలో ఆ బ్రాహ్మణుడి చేత పూర్తి చేయించారు. కానీ పిండమును తినటానికి దశరధ మహారాజు  ఆత్మ రాకపోయేసరికి రాముడు ఆలోచనలలో పడితే …..అప్పుడు జరిగిన విషయం అంతా సీతాదేవి చెప్పేసరికి…. మట్టితో చేసిన పిండప్రదానం  మా తండ్రి భుజించడం ఏమిటి?  దీనికి సాక్ష్యం ఏమిటి?  అనేసరికి దీనికి సాక్ష్యంగా ఫాల్గు నది, అలాగే బ్రాహ్మణుడు, ఈ ఆవు, రావి చెట్టు ఉన్నాయని చెప్పి వాటిని సాక్ష్యంగా పిలిచేసరికి…. ఫాల్గు నది కాస్త రాములవారు తన నది సమక్షంలో దశరధుడుకి కాస్త పిండ ప్రధానం చేయడేమో అనే  అనుమానంతో…. సీతాదేవి పిండ ప్రధానం చేయలేదని చెప్పడంతో…. అలాగే ఆవు కూడా సీతాదేవి చేసిన మట్టి పిండమును తినలేక పోవడంతో.. రాముడు చేసే పిండ ప్రదానం వలన వచ్చే అపారమైన పుణ్యము వలన వచ్చే దానమును, మేతను తినవచ్చు కదా ! అనే ఉద్దేశంతో పిండ ప్రదానం చేయలేదని, అలాగే బ్రాహ్మణుడు కూడా రాములవారు ఇచ్చే బంగారమునకు ఆశపడి సీతాదేవి పిండ ప్రదానం చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. దానితో సీతాదేవి కాస్త కోపోద్రేకురాలై ఫాల్గు నది కేసి చూస్తూ నువ్వు కళాహీనం అవ్వమని చెప్పి అలాగే ఆవు కేసి చూస్తూ….. నీకు ముందు భాగం కన్నా వెనక భాగం పూజించేందుకు అర్హత పొందుతుంది అని చెప్పి…. అలాగే బ్రాహ్మణుడి కేసి చూస్తూ నీకు ఎన్ని దానధర్మాలు వచ్చినా కూడా సంతృప్తి లేని జీవితాన్ని పొందుతావు అని చెప్పేసి శాపాలు ఇవ్వడం జరిగింది. ఇక ఆఖరిగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లేసరికి సీతాదేవి పిండ ప్రధాన విధి విధానం అంతా నిజమే అని చెప్పడంతో సీతాదేవి ఈ వృక్షమున కేసి చూస్తూ శాశ్వత మరణం లేని స్థితిని పొందు…అక్షయంగా ఉండు…. ఈ ప్రాంతంలో నీ సమక్షంలో జరిగే పితృదేవతా కార్యక్రమాలలో  ఎలాంటి ఆటంకం లేకుండా…. అవాంతరం లేకుండా మోక్షమును పొందుతారు అని వరం ఇవ్వటం జరిగింది. అక్కడ మనకి అక్షయ వృక్షం అనేది కనబడుతుంది అని చెప్పడం జరుగుతుంది… అని చెప్పి శివ నందిని చెప్పడం జరిగింది.  ఆ తర్వాత రాముల వారు విషయం తెలుసుకొని ఈ క్షేత్రంలో 64 ప్రాంతాల్లో దశరథ మహారాజుకు పిండ ప్రధాన కార్యక్రమాలు చేశారని చెప్పేసి స్థల పురాణం చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక రాత్రి అవడంతో ఎవరికి వారే విశ్రాంతి తీసుకుని నిద్రలోకి జారుకోవడం జరిగింది.

సాధన కుటుంబం కాస్త రైలులో మూడు రోజులు ప్రయాణించి బీహార్ లోని గయా కి చేరుకోవడం జరిగింది. తర్వాత ఈ క్షేత్రానికి చేరుకుని దగ్గరలో ఉన్న హోటల్ కి  వెళ్లి గది తీసుకొని స్నానాధికాలు పూర్తి చేసుకుని… దేవీ దర్శనానికి బయలుదేరడం జరిగింది. ఈలోపు   టిఫిన్లు పూర్తి చేసుకుని గుడికి వెళ్ళటం జరిగింది. అక్కడ అమ్మవారి శక్తి పీఠమైన మంగళ గౌరీ కూడా గుడి చాలా చిన్నదిగా ఉన్నట్లు వీళ్ళు గమనించారు.  లోపలికి వెళ్లేసరికి అమ్మవారి వక్ష స్థలాన్ని పోలిన రెండు శిలలు అఖండ జ్యోతి దర్శనంతో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆ పక్కనే ఉన్న మహా మంగళేశ్వర శివలింగమును దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్షయ వటవృక్షమును దర్శించుకోవడం జరిగింది. అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్న వారిని చూడటము జరిగింది. ఇది సీతాదేవి వరం ఇచ్చిన వటవృక్షమని శివ నందిని కాస్త పిల్లలకి చెప్పడం జరిగింది. ఆ తరువాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు పాదగయకి వెళ్ళటం జరిగింది. అక్కడ గుడి లోపల మూడు అడుగుల విష్ణు పాదం మాత్రమే కనపడటం….దానిమీద పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉండటం గమనించారు. ఆ పాదములు తాకి నమస్కారాలు చేసుకున్నారు. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలి అనుకున్నప్పటికీ….పిండ ప్రధాన కార్యక్రమాల హడావిడితో తనకి ధ్యానం సరిగ్గా కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు చేసుకుందాం అని చెప్పేసి అనుకొని, అక్కడి నుండి సీత కుండ్ కి వెళ్ళటం జరిగింది. అక్కడ సీతాదేవి ఆలయం, దశరథ మహారాజు దేవాలయం దర్శించుకుని రావటం జరిగింది. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధగయ క్షేత్రానికి చేరడం జరిగింది. ఇక్కడ బుద్ధుడి యొక్క బంగారపు రంగులో ఉన్న శిలా విగ్రహ మూర్తిని దర్శించుకోవడం జరిగింది. బుద్ధుడు జ్ఞానం పొందిన రావి చెట్టును కూడా వీళ్లంతా దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నారు. సుమారుగా రెండు మూడు గంటల పాటు వాళ్ళు ధ్యానంలో ఉన్నారు.కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు వాళ్ళకి కలగలేదు. కానీ ఏదో తెలియని ప్రశాంత స్థితి, మనసు సంతృప్తి పొందటం వీళ్ళు గమనించారు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి అమ్మవారి క్షేత్రమునకు చేరడం జరిగింది. ఆ మంగళ గౌరీ సమక్షంలో కూర్చుని యధావిధిగా ధ్యానం చేసుకోవడం ప్రారంభించారు. కానీ శివ నందిని కాస్త తనలో విష్ణు గ్రంధి విభేదనం కోసం ఎలాంటి ముద్రలు చేయాలో… ఏ మంత్రం ధ్యానం చేయాలో…. అర్థంకాక అలా మౌనంగా ఉండటం ఆరంభించింది. అలా రెండు మూడు గంటలు ఇదే స్థితిలో ఉండేసరికి తనలో ఉన్నట్టుండి నేను,నాది అనే భావం పోయి…. మనది అనే ఆలోచనలు రావటం మొదలయ్యింది. జీవుడు పోయాడు, శివుడు ఉన్నాడు అనే ఆలోచన రావటం కలిగింది. శివనందిని ఈ శివుడు ఉన్నాడా? అమ్మవారు ఉందా? అనే ద్వంద ప్రవృత్తి ఆలోచనలు రావటం జరిగింది. అదేవిధంగా ఉన్నట్టుండి ఏడుపు రావడం…. సంతోషం కలగటం… అలాగే తనలో ఉన్నట్టుండి ఆశ ,దురాశలు పెరగటం… అకారణంగా మిత్రుల గురించి ఆలోచనలు రావడం… శత్రువుల గురించి ఆలోచనలు రావటం… బంధుమిత్రుల మీద, కుటుంబ సభ్యుల మీద ప్రేమ కలగటం… బంధుమిత్రుల మీద ద్వేషం కలగటం…. ఇలా ద్వంద ప్రవృత్తిలో ఉన్న ఆలోచనలు రావటం శివ నందిని గ్రహించింది. అంటే తన కుండలిని శక్తి విష్ణు గ్రంధిలోనికి ప్రవేశించినట్లు…. తద్వారా ఈ లక్షణాలు వస్తున్నాయని చెప్పేసి రుద్ర స్వామి చెప్పేసరికి సరే అని అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంది. కానీ తనలో ఈ భావాలు ఎలా ఉన్నాయి అంటే…. తండ్రీకొడుకులు గొడవ పడినప్పుడు మధ్యవర్తి వచ్చి తగు తీర్చినట్టుగాను, తనలో జీవుడు గొప్పవాడా! శివుడు గొప్పవాడా? అన్నప్పుడు మధ్యలో విష్ణుమూర్తి వచ్చి మధ్యవర్తిగా ఉండి తగువును తీరుస్తున్నాడు అనే భావం గమనించింది. అంటే ఈయన మధ్యవర్తిగా ఉండే సమ భావంతో… సమవర్తిగా…సమదృష్టి …సమ దర్శనం కలిగేటట్టు చేస్తాడు అని చెప్పేసి ఇదే విష్ణు మాయ అనిపించింది. అంటే రాగము, ద్వేషము, శత్రుత్వము, మితృత్వము, ఆశ, దురాశ, దుఃఖం, సంతోషం,ఏదీ కూడా శ్రుతి మించకుండా చూసేవాడే విష్ణువు అని చెప్పి…. ఇదే విష్ణుకార్యం అని చెప్పేసి ఇదే విష్ణు మాయగా పరిగణించబడుతుంది అని చెప్పి శివ నందిని గ్రహించింది. అంటే ఇప్పుడు తన సాధన ద్వారా ద్వంద ప్రవృత్తి నుంచి ఏక ప్రవృత్తికి రావాలి.. జీవుడు గొప్పవాడా? శివుడు గొప్పవాడా ? లేదంటే శివుడు గొప్పవాడా? ఆదిపరాశక్తి గొప్పదా? అని ఇలా ద్వంద ప్రవృత్తిలో ఉన్న రెండు రకాల భావాలను జయించి…. ఈ భావాల నుంచి ఏక భావంలోకి రావాలని అలా వస్తే గాని విష్ణు గ్రంధి విభేదనం కాదు అని చెప్పేసి ఆమె గ్రహించడానికి సుమారుగా 15 రోజులు పైనే పట్టింది. కాకపోతే ఈ మాయాశక్తి ఈ ద్వంద ప్రవృత్తి ఎలా పోతుంది అనేది శివ నందినికి దీనికి ఒక పట్టానా అర్థం కాలేదు. ఏం చేయాలా అని రుద్రస్వామిని అడిగేసరికి… నాకేం తెలుస్తుందమ్మా!  బ్రహ్మ గ్రంధి విభేదనం ఎలా అయితే నీకు జరిగిందో…. అదే విధంగా విష్ణు గ్రంధి విభేదనం కూడా జరుగుతుందేమో! అక్కడ బ్రహ్మ గ్రంధి విభేదనానికి ఏ మంత్రం ఉపయోగించావో…. అదే తంత్రం ఈ విష్ణు గ్రంధి విభేదనానికి కూడా ఉపయోగించు అనేసరికి…. అప్పుడు బ్రహ్మ గ్రంధి విభేదనం కోసం ఓం బ్రహ్మ గ్రంధి విభేదనాయ నమః అనే మంత్రం చదువుతూ ఉంది. ఈ ఆలోచన రావడంతోనే ఓం శ్రీ విష్ణు గ్రంధి విభేదనాయ నమః అని మంత్రం చదవటం ఆరంభించింది. ఈ మంత్రమును దాదాపు 41 రోజులు ధ్యానంగా చేస్తూ ఉండేసరికి…. ఒకరోజు ధ్యాన అనుభవంగా తనలో రెండు భావాలు పోయి, ఏక భావంలోకి రావటం మొదలైంది. కానీ ఆ ఏకత్వ స్థితిలో ఎక్కువసేపు నిలబడట్లేదు. అంటే శివుడు గొప్పవాడా? ఆదిపరాశక్తి గొప్పదా?  అని భిన్న భావాలలో తన మనసు కొట్టుకుంటూ ఉండేసరికి….ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటూ… హృదయ చక్రం దగ్గర చేయి పెట్టి స్వామి! స్వామి!  నా ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి అని అనేసరికి ….తన పక్కనే ప్రత్యక్షమైన శివ స్వామి కాస్త 

శివ స్వామి:- ఏమైంది దేవి!  

శివ నందిని:-  రెండు విభిన్న భావాలతో నా మనసు సతమవుతమవుతుంది.  ఎవరు గొప్ప..? ఎవరు ఎక్కువ! ఎవరు తక్కువ?  అని మరో విధంగా చూస్తే రాగద్వేషాలు, సుఖం, సంతోషం, ఇలా ఒకే పదార్థంలో రెండు భావాలు కనపడుతూ ఉన్నాయి. దీనిలోకి వచ్చేసరికి జీవుడు గొప్పవాడా !శివుడు గొప్పవాడా? విష్ణువు గొప్పవాడా! శివుడు గొప్పవాడా? అమ్మవారు గొప్పదా? శివుడు గొప్పవాడా? అనే భిన్న భావాలు కలుగుతున్నాయి.

శివ స్వామి:-సరే పదా! నీకు విషయం చెబుతాను.

అని శివ స్వామి కాస్త శివ నందిని తీసుకొని ఫాల్గు నది తీరమునకు  వెళ్ళటం జరిగింది. అక్కడ నదిలోకి వెళ్లి ఇసుకను తీసుకువచ్చి మట్టి బొమ్మను చేయడం జరిగింది. ఒక మట్టి బొమ్మకి పురుషుడు మరొక మట్టి బొమ్మతో స్త్రీ మూర్తి రూపమును చేయటం జరిగింది. ఇక్కడ పురుషుణ్ణి నువ్వు శివా అనుకోవచ్చును… విష్ణుమూర్తి అనుకోవచ్చును… ఏదైనా అనుకోవచ్చును , ఇక్కడ స్త్రీ మూర్తి అమ్మవారు అనుకోవచ్చును…. లక్ష్మీదేవి అనుకోవచ్చును….. సరస్వతి దేవి అనుకోవచ్చును…. ఏదైనా అనుకో… అంటే ఈ స్త్రీ,పురుషులు అనే భావం కలుగుతుంది.  ఇందులో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?  అనే భావం కలుగుతుంది. ఆశ, దురాశ, కష్టం, సుఖం, రాగం, ద్వేషం అనేది ఈ రెండు భావాలకి కారకం అవుతాయి.  పురుషుడు,స్త్రీ అని చెప్పకనే తెలుస్తుంది కదా!  ఇప్పుడు ఈ రెండు మట్టి ముద్దలను నేను ఏం చేస్తానో చూడు …

అని చెప్పేసి ఆ రెండు మట్టి ముద్దలను కూడా పిసికేసి రూపం లేకుండా ఒక ఇసుక మట్టి ముద్దగా వచ్చే మార్చేసరికి…. ఇందులో ఏ మట్టి ముద్ద అమ్మవారో చెప్పు అని చెప్పేసి అనేసరికి….శివ నందినికి విషయం అర్ధమయ్యి….అంటే నామరూపాలు లేని స్థితిని తను పొందాలి అని ఇక్కడ జీవుడు గొప్పవాడా? శివుడు గొప్పవాడా? అమ్మవారు గొప్పదా? విష్ణుమూర్తి గొప్పవాడా? అని మనం ఆలోచన చేయకూడదు. ఈ రెండు భావాలు ఏక భావ స్థితిలోకి రావలెను అని చెప్పి శివ నందిని గ్రహించేసరికి…. తనలో కనిపించే విష్ణు మాయ కాస్త మాయమై పోవడంతో…. ఈ గ్రంధి విభేదనం క్షణకాలంలో జరిగి విశుద్ధ చక్రము వైపు కుండలిని శక్తి ప్రవేశం జరిగి…. చక్రం జాగృతి చేస్తున్నట్లుగా శివ నందిని ధ్యానంలో ధ్యాన దృశ్యంగా చూసి అనుభవం పొందడంతో శివ స్వామి అక్కడ నుంచి అదృశ్యం అవడం… ఏకకాలంలో జరిగింది.  దానితో విష్ణు మాయ అంటే రెండు భావాలను కల్పించేది. ఆ భావాలు శృతిమించకుండా సమస్థితిలో ఉంచుతారు. నిజానికి ఇక్కడ రెండు భావాలు అనేవి లేవు. ఏక భావమే ఉన్నది. ఆ ఏక భావంలోనే మనసుని స్థిరపరచాలి అని చెప్పేసి గ్రహించింది. అంటే బ్రహ్మ గ్రంధిలో నేను,నాది అనే ప్రకృతి సంబంధమైన భావాలు కలిగితే…. విష్ణు గ్రంధిలో రాగద్వేషాలు, శత్రుమిత్రుత్వ లక్షణాలు… ద్వంద ప్రవృత్తి లక్షణాలు… కలుగుతాయని చెప్పేసి ఆ లక్షణాలను ఏకకాలంలో తీసుకురావాలని చెప్పేసి ఏకత్వంలోకి వచ్చాక…. ఆ ఏక భావం ఏమిటి?  ఆ ఏకతత్వం ఏమిటి అనేది రుద్ర గ్రంధిలో తెలుస్తుంది అని జ్ఞాన స్ఫురణ అందడంతో…. ఇక తన సాధన కాస్త విష్ణు గ్రంధి విభేదనం జరగటం పూర్తి అయ్యింది అని చెప్పి తన కుండలిని శక్తి విశుద్ధ చక్రం వైపుకు వెళ్ళింది అని శివనందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. దానితో ఒక విధమైన స్థిరమైన ఏక భావంతో మనసు ఉంటుండగా… ధ్యానంలో విష్ణుపాద ముద్రతో ఉన్న రాయి రూపం కనిపించేసరికి ….ఆశ్చర్య ఆనందాలకు లోనయింది.తను  కాస్త తీవ్ర ధ్యానం చేస్తూ ఉండేసరికి…. సుమారు మూడు గంటల ధ్యాననిష్ట తరువాత ఆ రాయి ఫాల్గు నది ప్రాంతంలో ఉన్నది అని చెప్పేసి తెలుసుకొని రుద్ర స్వామికి ఈ విషయం చెప్పేసరికి…. అందరూ కలిసి ఈ రాయి కోసం వెతకడం జరిగింది. బాల కుమారస్వామికి ఈ విష్ణుపాద రూపం మూడు అంగుళాలలో ఉన్నట్టుగా కనిపించేసరికి…. దానిని తీసుకొని ఇదేనా అమ్మ!  నీకు ధ్యానంలో కనపడిందా?  అనేసరికి అవును ….నాయనా!  ఇదే కనపడింది అని చెప్పేసి ఆ రాయిని తాకుతూ ఉండేసరికి….  ఆ రాయిలో శంఖు చక్రాలు, బాణము, ధనస్సు ఇలా సుమారుగా 16 గుర్తులు ఉండేసరికి…. ఈ గుర్తులు అన్నీ కూడా విష్ణుపాదంలో కూడా చూశాము అని పిల్లలు అనడం జరిగింది. విష్ణుమూర్తి యొక్క దైవిక చిహ్నాలు అన్నీ కూడా ఈ రాయిలో ఉండేసరికి రుద్ర స్వామి కూడా…

రుద్రస్వామి:- అమ్మ!  సాక్షాత్ విష్ణు మూర్తి నీకు ఈ రాయి వరప్రసాదంగా ఇచ్చారు. విష్ణుమూర్తి కాదు… జగన్మోహిని యొక్క తత్వము.  ఆ రెండు తత్వాలు కాస్త ఏకత్వంలోకి రావడం జరిగింది. ఇది మంగళ గౌరీ యొక్క అనుగ్రహ ప్రసాదం..

అని చెప్పి దానిని తాకుతూ ఉండేసరికి విష్ణుమూర్తి కాస్త జగన్మోహినిగా మారటం… పురుషుడు కాస్త స్త్రీ మూర్తిగా మారడం…. తద్వారా జగన్మోహిని రూపం కూడా మారి శివుడిగా మారడంతో ….ఏక భావ స్థితిలో మనస్సు స్థిరపడాలి అంటే… రుద్ర గ్రంధి విభేదనంతోనే అవుతుంది అని శివ నందినికి అర్థం అయింది. ఆ రాయిని యధావిధిగా తన సంచిలో పెట్టుకోబోతూ ఉండేసరికి…. అక్కడికి కృష్ణస్వామి మరియు యోగాంబిక కాస్త రావడం జరిగింది. ఈ క్షేత్రంలోనే నా చేతుల మీదుగా నీకు పిండ ప్రదానం చేయాలని ఆరోజు నిశ్చయించుకుని వచ్చాను అనేసరికి… సాధన కుటుంబం అంతా చూస్తూ ఊరుకున్నారు. ఇంతలో కృష్ణస్వామి కాస్త శివ నందిని చేతిలో ఉన్న విష్ణుపాద రాయిని బలవంతంగా తీసుకొని…. నది మధ్యలో పడవేయడంతో… వీళ్లంతా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు నీకు విష్ణు గ్రంధి విభేదనం అయింది అని అనుభవమే అయ్యింది.. కానీ అనుభూతిని నువ్వు పొందలేదు.  పొందటానికి ఈ రాయి నీకు సహకరించదు.  తద్వారా నువు విష్ణు మాయలోనే కొట్టుకుంటూ ఉంటావు. విష్ణు మాయ ఛేదించడం మానవమాత్రుల వల్ల కాదు. ఆ మాయలోనే ద్వంద ప్రవృత్తిలోనే ఉండిపోతావు అని చెప్పి అనేసరికి…. శివ నందిని కాస్త అవునా అని తనకున్న ప్రాప్తి సిద్ధితో సంకల్పించుకొని…ప్రార్థన చేయగా… యధావిధిగా తన చేతుల్లోకి రాయి వచ్చేసరికి… వీళ్ళ ఇద్దరూ ఆశ్చర్య ఆనందాలకు వెళ్లి…. అంటే నీ సిద్దులను నీ స్వార్థం కోసం ఉపయోగిస్తున్నావు. నీ సాధన పతనం అవుతుంది. ఆ విధంగా అయినా కూడా మేము గెలిచినట్లే కదా!  అని చెప్పేసి అనేసరికి ….ఇది నా స్వార్థం కోసం నేను ఉపయోగించడం లేదు. వస్తువును నువ్వు నీటిపాలు చేయడంతో… తిరిగి నేను సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ నా స్వార్థం ఏముంది. నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి నేను ఉపయోగించడం లేదు కదా!  నాకు విశ్వాధినేత అవ్వాలని…. పరమపదవులు పొందాలనో లేదా కాలాతీత స్థితిలో ఉండిపోవాలని…. చిరంజీవి తత్వం పొందాలనో నేను అనుకోవడం లేదు కదా!  నేను విశ్వానికి సంబంధించి ఏమీ చేయట్లేదు కదా!  నా సాధన నేను చేసుకుంటున్నాను. నా మోక్షమును నేను పొందాలనుకుంటున్నాను. ఆ మోక్షం కాస్త విశ్వమోక్షం అవుతుంది అని కర్మ విధాత శివుడే చెప్పడం జరిగింది. అంతేకానీ నేను ఇక్కడ స్వార్థంగానో… కోరిక కోసమో చేయలేదు కదా!  అనేసరికి ఏదైనాప్పటికీ నిన్ను వదిలి పెట్టేది లేదు… నీ ప్రాణాలు తీయకుండా ఉండేది లేదు…. అనేసరికి కృష్ణస్వామి కాస్త సుదర్శన చక్ర ప్రయోగమును శివనందిని మీద చేయటం యోగాంబికా కాస్త తన త్రిశూలంతో శివ నందిని మీద ఏకకాలంలో వీరిద్దరూ కలిసి దాడి చేస్తూ ఉండేసరికి…. అప్పుడు శివ నందిని మనసు కాస్త ఇదే కాబోలు ద్వంద ప్రవృత్తి. ఒకటి పురుష భావం, రెండు స్త్రీ భావం.  ఈ రెండు భావాలు తను ఏకకాలంలో చూడడం జరుగుతుందని రాగం, ద్వేషం, ఆశ, దురాశ, దుఃఖం, సుఖం, పురుష, స్త్రీ ఇలాంటి ఆలోచనలు శివ నందిని గ్రహిస్తూ ఉండేసరికి… రుద్ర స్వామి కాస్త అమ్మ!  వాళ్ళు నీ మీద దాడి చేస్తూ ఉంటే …నువ్వేదో ఆలోచనలు చేస్తూ ఉన్నావు.  వాళ్ళని వ్యతిరేకించు అనేసరికి వీళ్లిద్దరిని నువ్వు ఒక ఆట ఆడుకోవాలని చెప్పి అనేసరికి…. తనకి వచ్చిన సిద్దులను శివ నందిని ఒక్కొక్కటి ప్రయోగించడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా మారడం జరిగింది. అర అంగుళం పరిమాణంలో శివ నందిని మారిపోయేసరికి వీళ్లిద్దరి కంటికి శివ నందిని కనిపించలేదు.  ఏమైందని అనుకుంటూ ఉండేసరికి…. కాలికింద గోరంత పరిమాణంలో శివనందిని కనిపించేసరికి…. దీనికి ఇక్కడే నలిపివేయాలి అని కృష్ణస్వామి పాదం కాస్త శివ నందిని మీద వేస్తూ ఉండేసరికి…. ఈ విషయాన్ని గమనించిన శివనందిని కాస్త భారీ కాయంగా ఉన్నట్టుండి 60 అడుగుల రూపంలో కనిపించేసరికి…. వీళ్ళిద్దరూ కూడా చిన్న రేణువులుగా శివనందిని ముందు ఉండేసరికి…. అంతటి భారీ శరీరాన్ని చూసేసరికి…. తమ ఆయుధాలు చిన్నబోవడంతో వీళ్ళిద్దరూ కూడా ప్రాణ భయంతో ముందుకు వెళుతూ ఉండేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరిని తన అరచేతిలోకి తీసుకొని నలిపివేయబోతూ ఉండేసరికి ….. వీళ్ళు అదృశ్యం అవ్వడం జరిగింది. దానితో వీళ్ళ పీడ విరగడయింది అని శివనందిని కాస్త యదార్థ రూపంలోకి వచ్చేసరికి వీళ్ళు కాస్త మళ్ళీ గాలిలో నుంచి వచ్చి శివ నందిని మీద మళ్ళీ దాడి చేయడం చేసేసరికి…. ఈసారి శివనందిని కాస్త వాయు మార్గంలో ఫాల్గు నది దగ్గరికి వీళ్లిద్దరిని గాలిలో ఎత్తుకొని తన సంకల్లో పట్టుకొని గిరగిరా తిరుగుతూ….. నది పైభాగమంతా సంచరిస్తూ వీళ్ళ మెడలను నలుపుతూ ఉండేసరికి…. ప్రాణభయంతో వీళ్ళు ఆక్రందనలు చేయడం జరిగేసరికి… పిల్లలు ఇద్దరు భలే భలే అమ్మ!  ఇలాగే చెయ్యి.  వీళ్ళిద్దరిని చంపేసేయి.  ఒక పని అయిపోతుంది అనేసరికి రుద్రస్వామి కాస్త మౌనంగా ఏం జరుగుతుందో అని మౌనంగా చూస్తూ ఉండేసరికి…ఫాల్గు నది మధ్య మార్గంలో వాయు మార్గం ద్వారా ప్రయాణించి వాళ్ళిద్దరిని ఆశగా చూస్తున్న సొర చేపలకి ఆహారంగా వదిలివేయడం జరిగింది. వీళ్ళు ఈ విషయం గ్రహించి ఆ సొర చేపల లోపలకి ప్రవేశించినప్పటికీ… కూడా వీరికి ఉన్న సిద్ధవిద్యలతో సొర చేపలను చంపి బయటకు రావడం జరిగింది. ఇక శివ నందిని మనం ఏమీ చేయలేము…. తనకి సిద్ధులు వచ్చినాయి. ఏదో ఒక రకంగా తను సాధనలో తప్పు చేసే విధంగా మనం ఏమీ చేయలేము అని వీళ్ళిద్దరూ కూడా గ్రహించి అదృశ్యం అవటం జరిగింది. శివ నందిని కాస్త యధావిధిగా తిరిగి రుద్రస్వామి ఉన్న చోటికి రావడం జరిగింది. వాళ్ళు అదృశ్యం అయ్యారు అని గ్రహించి….తన సంచిలోనికి విష్ణుపాద రాయిని తీసుకుని గదికి వెళ్ళటం జరిగింది. 

ఇలా ఒకరోజు రాత్రిపూట శివనందిని తీవ్ర ధ్యాననిష్ఠలో ఉండగా….బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం నుంచి ఆత్మ స్వరూపంగా ఆత్మ జ్యోతి బయలుదేరి వస్తున్నట్లుగా ధ్యానం అనుభవం అయింది.  ఆ ఆత్మజ్యోతి కాస్త ధ్యానంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి…. ఆ ఆత్మజ్యోతి స్వరూపంలో ఉన్న బుద్ధుడు ధ్యానంలో కనిపించి…. అమ్మ!  పరమహంస వలన నా జ్యోతి శరీరం మోక్షం పొందడం జరిగింది.  కానీ నా మనో శరీరం మోక్షం పొందలేదు.  విచారణ చేస్తే నా భార్య అయిన యశోద దేవి, నా ఆది ధర్మపత్ని యొక్క మానసిక క్షోభ వలన నా మనో శరీరం మోక్షం పొందలేదు అని చెప్పేసి పరమహంస గారి అనుభవాల ద్వారా భార్యకి,  ధర్మపత్మికి ఉన్న భేదాలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా ఆత్మ విచారణ చేసుకుంటే….వీరిద్దరి ఆత్మఘోష వలన నాకు మనో శరీరం మోక్షం పొందలేదని తెలుసుకున్నాను. ఈ ఇద్దరి ఆత్మలు ఏకాత్మగా మారి…. ఆత్మఘోష తీరటంతో…. నా మనో శరీరమునకు నీ ద్వారా మోక్షం పొందే జ్ఞానం ఉందని తెలియడంతో…. నీ దగ్గరికి ఆత్మ జ్యోతి స్వరూపంగా రావడం జరిగింది అనేసరికి….. సరే స్వామి!  నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  మీ సాధన పరిసమాప్తి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు అనేసరికి… ఆయన ఆత్మ స్వరూపం ఆత్మ శక్తితో విష్ణు గ్రంధిలోని కి బుద్ధుడు ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణు పాద ప్రాంతం నుంచి ఆత్మ స్వరూపం బయలుదేరి రావటం,  ధ్యాన దృశ్యంగా అనుభవం అయ్యింది.  అప్పుడు ఆ జ్యోతి రూపంలో విష్ణుమూర్తి కనిపించి తల్లి! నాకు కూడా ధర్మపత్ని మరియు భార్య యొక్క తేడాలు తెలియడంతో…. వారి ఆత్మఘోష సంపూర్తి అవ్వటంతో….నీ ద్వారా నేను మోక్ష ప్రాప్తి పొందాలి అనుకున్నాను అని అనేసరికి…. అయ్యా!  స్వామి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేసరికి…. ఆయన ఆత్మశక్తి కూడా శివ నందిని యొక్క విష్ణు గ్రంధి లోనికి నిక్షిప్తం అవటం జరిగింది. మరికొద్ది సేపటికి మంగళ గౌరీ ఆలయంలో నుంచి అక్కడ ఉన్న వక్షస్థలంలో ఉన్న అఖండ జ్యోతి కాస్త ధ్యానంలో కనిపించేసరికి…..మంగళ గౌరీ కనిపించగానే … శివ నందిని కాస్త ….తల్లి!  నీ మాంగల్య బలం కోసం లేని శివుడు ఉన్నాడని భ్రమ భ్రాంతిలో విష్ణు మాయ వలన  ఉన్నా అని తెలుసుకున్నావా?  అంటే అవును తల్లి!  నేను ఇన్నాళ్లు నా పతిదేవుడు బతికే ఉన్నాడు… సజీవంగా ఉన్నాడు అనే మాయలో ఉన్నాను అని అర్థమయింది. విష్ణుమాయ వల్ల లేనిది ఉన్నట్టుగా… జరుగుతుంది అని గ్రహించాను. నా మాంగల్యం సజీవంగా శాశ్వతంగా ఉంది అని తెలుసుకున్నాను. కానీ నా పతిదేవుడు ఏనాడో మోక్షం పొందాడు అని జ్ఞాన స్పురణ అందడంతో నేను కూడా నెమ్మదిగా మోక్షం పొందాలి అని చెప్పి….. అందుకు ఈ శరీరం సాధన శరీరం గా ఉపయోగపడుతుందని… ధ్యాన స్ఫురణ అందడంతో….. ఆత్మ జ్యోతి స్వరూపంగా నీ యందు ప్రవేశించాలని అనుకుంటున్నాను… అనేసరికి సరే తల్లి!  నీ సాధన పరిసమాప్తి అవుతుందని నమ్మకం ఉంటే నువ్వు ఆత్మ స్వరూపంగా నాలో ప్రవేశించు.  నాకేమీ అభ్యంతరం లేదు…  ఒకవేళ నేను తెలిసో తెలియకో మాయలో పడితే ఈ దేహం  దహనం అవుతున్న సమయంలో…. మీ శక్తి స్వరూపాన్ని కూడా బయటకి తీసుకొని యధావిధిగా మరో సాధన శరీరం కోసం ఉపయోగించే వీలుతో నా శరీరంలోనికి ప్రవేశించండి… అనేసరికి సరే మంచిది తల్లి!  అనగానే మంగళ గౌరీ ఆత్మశక్తి కూడా శివనందిని శరీరంలో నిక్షిప్తం అవటం జరిగింది. ఇలా ఈ మూడు ఆత్మ జ్యోతులు కాస్త ఏక జ్యోతి స్వరూపంగా మారి…. తన విష్ణు గ్రంధిలో నిక్షిప్తం అయినట్టుగా శివ నందినికి ధ్యాన అనుభవం అయింది. తనలో పాజిటివ్, నెగిటివ్ ,మరియు న్యూట్రల్ శక్తిలు కలవడం వలన ఈ మూడు స్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి శివ నందిని గ్రహించింది. ఇందులో నెగిటివ్ శక్తి అమ్మవారి గాను …..పాజిటివ్ శక్తి విష్ణుశక్తిగాను….. ఈ రెండింటి కలయిక వలన ఏర్పడిన న్యూట్రల్ శక్తి బుద్ధ శక్తిగాను…. మారిందని రెండు భావాలు కాస్త ఏక భావంగా మారిందని…. పురుష ,స్త్రీ భావాలు కాస్త నపుంసక భావంగా మారిందని ….ఏకత్వస్థితి ,ఏక భావంలోకి వచ్చిందని…. ఆ ఏక భావంలోనికి వచ్చింది అనగానే ఏక భావం అనగానే శివుడు, ఆదిపరాశక్తి కలిసి శివుడుగా ఏకత్వ స్థితిలోకి మారి ఉండవచ్చు అని జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది. ఆ తర్వాత ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లలు కాస్త అమ్మ !అమ్మ ! ఇప్పుడు నీ సాధన కాస్త విష్ణు గ్రంధి విభేదనం పూర్తి అయ్యింది కదా!  ఈ క్షేత్రంలో నీ సాధన పూర్తి అయింది కదా!  ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అనేసరికి …..ఏమున్నది మనకి వచ్చిన విష్ణు పాద రాయిని సాధన విగ్రహ మూర్తికి ఎడమవైపు ఉన్న పద్మములో పెడితే తెలుస్తుంది… అనగానే గబగబ బాల గణపతి కాస్త ఆ రాయిని తీసుకొని శివ నందిని చెప్పినట్లు చేసేసరికి…. సాధన విగ్రహ మూర్తిలో… విష్ణు గ్రంధిలో అప్పటిదాకా నిక్షిప్తమై ఉన్న కుండలిని శక్తి ప్రవాహం కాస్త….. విశుద్ధ చక్రం లోనికి ప్రవేశించి చుట్టూ తిరిగేసరికి…. దివ్య కాంతితో, దివ్య తేజస్సు వస్తూ ఉండేసరికి…. దాని లోపల నుంచి రాగిరేకు బయటకు రావడం జరిగింది. అమ్మ ! విశుద్ధ చక్రం జాగృతి అయినట్లు ఉంది. దానికి సంబంధించిన ఆధారం బయటకు వచ్చింది అని రాగిరేకును విడదీసి బాలగణపతి చదవడం ఆరంభించాడు.  అందులో ఈ విధంగా రాసి ఉంది.  


నేను విజ్ఞానానికి ప్రతీక అయితే, నా సవతి బ్రహ్మజ్ఞానానికి ప్రతీక….

 మా వారికి గుడి లేదు.. అర్చన లేదు…

ఈయన ఐదు తలలు కాస్త, 

నాలుగు అయినాయి…. 

నా సవతికి పంచముఖాలు ఉన్నాయి… దేశానికి తల భాగంలో నా ఆవాసం. 

అనేసరికి అందరూ ఆలోచనలలో పడటం జరిగింది. ఇక్కడ ఏ శక్తి పీఠం నుంచి చెబుతున్నారో అర్థం కాలేదు.  కానీ ఏదో అమ్మవారి క్షేత్రమని చెప్పకనే చెబుతున్నారని గ్రహించారు. అప్పుడు రుద్ర స్వామి కాస్త

రుద్రస్వామి:- మా వారికి గుడి లేదు… అర్చన లేదు… అంటే  బ్రహ్మదేవుడికి సంబంధించింది అయి ఉండాలి.  బ్రహ్మదేవుడికి గుడి లేదు… దేవాలయం లేదు కదా! అర్చన లేదు కదా! 

బాల కుమారస్వామి:- బ్రహ్మ దేవుడికి రాజస్థాన్లోని పుష్కర్ అనే ప్రాంతంలో గుడి ఉంది అని చెప్పి చెబుతారు కదా!  అక్కడ బ్రహ్మదేవుడికి ఒకపక్క గాయత్రి మాత, ఒకపక్క సరస్వతి మాత ఉంటారని చెప్పేసి అంటారు కదా!  

రుద్రస్వామి:- ప్రపంచంలో ఏకైక దేవాలయం అది.  కానీ ఇప్పుడు శివాలయాలు, విష్ణు ఆలయాలు, దేవి ఆలయాలు, రామాలయాలు ఉన్నట్లుగా బ్రహ్మదేవుడికి మెండుగా ఉండవు కదా! అరుదుగా ఏదో ఒక చోట మాత్రమే ఉంటుంది కదా!

అనేసరికి అవును అదే నిజమే…. ఈ లెక్కన బ్రహ్మదేవుడికే అని అనుకుంటే బ్రహ్మదేవుడికి విజ్ఞానానికి ప్రతీక సరస్వతి అవుతుంది. ఆ రకంగానే ఈయన సవతి బ్రహ్మ జ్ఞానానికి ప్రతీక అంటే గాయత్రీ మాత ను చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మ దేవుడికి అయిదు తలలు పూర్వం ఉండేవి.  కాలభైరవుడి కోపానికి బ్రహ్మ తలకాస్తా తెగిపడటం జరిగింది.  ఐదు తలలు కాస్త నాలుగు తలలుగా మారడం జరిగినాయి కదా!  నా సవతికి పంచముఖాలు ఉన్నాయి…అంటే గాయత్రీ మాతకి పంచముఖాలు ఉన్నాయి కదా!  అలాగే దేశానికి తలభాగంలో నా ఆవాసం ఉంది అంటే భారతదేశానికి తలభాగం కాశ్మీర్ కదా!  కాశ్మీర్లో సరస్వతీ విద్యాపీఠం ఉన్నది అని చెప్పి స్థల పురాణం చెప్పడం జరిగింది.  కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇది సరస్వతి దేవి గురించి చెప్పడం జరిగింది…అనేసి రుద్రస్వామి విశ్లేషణ చేసేసరికి…. శివ నందిని కాస్త ఇది అవునా కాదా అని ధ్యానంలో కూర్చునేసరికి సరస్వతీదేవి రూపము, గాయత్రీ దేవి రూపము లీలా మూర్తిగా కనిపించేసరికి….ఇప్పుడు తను కాశ్మీర్లో ఉన్న సరస్వతీ క్షేత్రానికి వెళ్లాలి అని చెప్పి నిర్ధారణ చేసుకునేసరికి….మహాదేవి కాస్త అక్కడకి రావడం జరిగింది. శివ నందినితో మహాదేవి కాస్త…

మహాదేవి:- నీ విష్ణు గ్రంధి విభేదనం అయ్యిందని నిన్న రాత్రి ధ్యానంలో ధ్యాన స్ఫురణ అందడంతో… ఇక ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరే సమయం ఆసన్నమైనదని ఇక్కడికి రావడం జరిగింది.

శివ నందిని:- నేనే మీకు ఈ విషయం చెప్పాలి ….నువ్వు ఉన్నచోటికి రావాలి అనుకున్నాను …కానీ ఎలా రావాలో ఎక్కడికి రావాలో అర్థం కాలేదు.

మహాదేవి:-నువ్వు ఎప్పుడైతే అఘోర స్థితికి గాని కాపాలిక స్థితికి గాని తంత్రసాధనలో దీక్ష తీసుకుని అడుగు పెడతావో …..నేను ఎక్కడ ఉన్నాను, ఏంటి అనేది నీకే తెలుస్తుంది.  ప్రస్తుతం నువ్వు దక్షిణాచారంలో ఉన్నావు కాబట్టి… నీకు ఇవేవీ తెలియకపోవచ్చును.  ఎప్పుడైతే వామాచారంలోకి వస్తావో….అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనేది నా సాధన వివరాలు కూడా నీకు తెలుస్తాయి అనేసరికి….ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలి..

శివ నందిని:- విశుద్ధ చక్రం శుద్ధి కోసం మనం కాశ్మీరు క్షేత్రానికి వెళ్లాలి.  ఆ ప్రాంతంలో ఉన్న సరస్వతీ క్షేత్రానికి వెళ్లాలి అని సాధన విగ్రహ మూర్తి ద్వారా తెలుసుకున్నాము..

అని చెప్పేసరికి ఇక అందరూ కూడా హోటల్ గదికి 

వెళ్లి బీహార్ నుంచి కాశ్మీర్ కు విమానం టికెట్లు బుక్ చేయడం జరిగింది. మూడు గంటల్లో కాశ్మీర్ ప్రాంతానికి చేరుకుంటామని తెలియడంతో…. అందరూ విమానాశ్రయానికి చేరుకుని కాశ్మీర్ వెళ్లే విమానాన్ని ఎక్కడం జరిగింది.

శుభం భూయాత్ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి