అధ్యాయం 29


ఎవరిని పూజించాలి?
(నా భక్తి మార్గం)


కర్మ మార్గం మాకు సరి కాదని తెలుసుకుని అమ్మాయిల కన్నా అమ్మవారు మిన్న అని గ్రహించి మేము అనగా నేను మరియు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి కూడా విగ్రహరాధన లోనికి అడుగు పెట్టినాము! నిత్యం పూజించే గుడిలోని లింగారాధన కన్నా మా ఇంటిలో మాకు కావలసిన విగ్రహల తెచ్చుకొని పూజించాలని నిర్ణయించుకున్నాము! ఎటూ గుడిలో ఉన్న లింగమూర్తి మాట్లాడడు!కనిపించడు! అందుకని కనీసం మేము తెచ్చుకొని పూజించిన విగ్రహమూర్తి అయినా మాతో మాట్లాడతాయోమోనని ఆశతో భక్తి మార్గం లోనికి ప్రయాణించాము! దీనికి ఒక కారణం ఉన్నది! 

రామకృష్ణ పరమహంస కి, నామ దేవుడికి, రామదాసు కి, పోతన కి కబీరుదాసు కి, త్యాగయ్య కి ఇలా పలు మందికి వారి వారి ఇష్టదైవాలు మనిషి రూపేణా మాట్లాడే వారని వారి చరిత్ర లో చదివి… మా విగ్రహలు కూడా మాతో మాట్లాడతా యోమోనని పిచ్చి అమాయక భక్తి భ్రమలో విగ్రహరాధన మార్గమైన భక్తి మార్గం లోనికి అడుగు పెట్టడం జరిగింది! దానితో ఏ విగ్రహలు తీసుకోవాలి, ఎవరిని పూజించాలి అనే సమస్య మా ఇద్దరి మధ్యలో వచ్చినది! నేనేమో ఇన్నాళ్లుగా శివయ్యను లింగమూర్తి గా ఆరాధించిన ఉలకలేదు, పలకలేదు కదా కాబట్టి నేను అమ్మవారిని పూజించాలి అని నిర్ణయించుకున్నాను! 

ఎందుకంటే అమ్మవారు ఈ కలియుగంలో కూడా మనుషుల్లాగానే మాట్లాడుతుందని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనుభవాల ద్వారా తెలుసుకోవటంతో అమ్మవారిని పూజించాలని నేను నిర్ణయించుకోవడం జరిగినది! కానీ ఏ అమ్మవారిని పూజించాలో అర్థమై చావలేదు! ఇదిలా ఉండగా జిజ్ఞాసి కైతే రామదాసుకి, కబీరుదాసు కి శ్రీ రామ దర్శనం జరిగినదని వారి జీవిత చరిత్రలలో చదివి ఉండటంతో వాడు కాస్త శ్రీరామభక్తుడై నాడు! ఆయన విగ్రహమూర్తి తెచ్చుకుని పూజించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు! కానీ నాకే ఏ అమ్మవారి విగ్రహరాధన చేయాలో అర్థం కాలేదు! నేను చేసే గాయత్రీ మంత్ర దేవత అయిన గాయత్రీ మాత ఎవరికి అంత తేలిగ్గా కనిపించదని తెలుసుకున్నాను! అలాగే బాల దేవత ఎన్నో కఠిన పరీక్షలుపెట్టి… వాటిని దాటిన వారికి మాత్రమే కనపడుతుందని ఈ మంత్రం ఉపాసన చేసిన వారి అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగినది! దాంతో ఎవరిని ఏ అమ్మవారిని పూజించాలో నాకు అర్థమవ్వలేదు!

కొన్ని రోజులకి మహా శివరాత్రి నాడు మేం మా ఊరి పక్కనే ఉన్న గ్రామంలో శివరాత్రి జాతర జరుగుతోందని వెళ్లినాము! అక్కడ ప్రభల ఊరేగింపు,రికార్డింగ్ డ్యాన్స్ లు   జరుగుతున్నాయి! చాలా సందడి వాతావరణం లాగా కనపడినది! నాకు అదే మొదటి సారిగా మా ఊరి గుడి జాతర కాకుండా వేరే ఊరి గుడి జాతర చూడటం! బాగుంది అనిపించింది! అక్కడ పెట్టిన వివిధ రకాల బొమ్మలు కొట్లు చూసుకుంటూనే మేమిద్దరం ముందుకు సాగిపోతున్నాము! ఇంతలో ఒక ముసలావిడ రెండు అడుగుల ధ్యాన ముద్ర శివుడు మట్టి బొమ్మను అలాగే ఒక అడుగున్నతిరుపతి వెంకన్న మట్టి బొమ్మను…. మా ఇద్దరి దగ్గరికి చేతుల్లో పెట్టి “అయ్యా! పొద్దుటి నుండి ఇప్పటి దాకా అన్నీ మట్టిబొమ్మలు అమ్ముడుపోయాయి! కానీ ఈ రెండు మట్టి బొమ్మలు మాత్రం అమ్ముడు పోవడం లేదు! ఎవరిని అడిగిన వద్దు అని అంటున్నారు! ఈ రెండు బొమ్మలు ఇంటికి తీసుకుని వెళ్ళే ఓపిక నాకు లేదు! నాయందు దయ ఉంచి ఈ రెండు మట్టి బొమ్మలు కొనండి! మీకు తోచిన డబ్బులు ఇవ్వండి! కొననని చెప్పవద్దు” అంటూ డబ్బులు కోసం చేతులు చాచటం…. నేను వీటిని వినే స్థితిలో నేను లేనని…. నా జిజ్ఞాసి గ్రహించి 200 రూపాయలు చేతిలో పెట్టగానే ఆ ముసలావిడ సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళి పోతుంటే…  నా చేతిలో ఉన్న ధ్యాన శివుడు బొమ్మ అలాగే మా వాడి చేతిలో ఉన్న వెంకన్న బొమ్మను చూసి ఆశ్చర్యపోతుండగా…. “నేనే నీ దగ్గరికి స్వయంభూగా వచ్చినాను” అని ఎవరో అన్నట్లుగా నాకు అనిపించేసరికి…. అది నిజమేనని అన్నట్లుగా గుడిగంటలు మోగి నాయి! ఆ గుడి యందు సుప్రభాత సేవ మొదలైంది! ముసలావిడ మా ఇద్దరి చేతుల్లోనే ఈ రెండు విగ్రహలు ఎందుకు పెట్టింది అని ధర్మసందేహము నాకు వచ్చినది! పైగా నేను శివభక్తుడు అని… మావాడు రామభక్తుడు అని ఆమెకు ఎలా తెలిసింది! విగ్రహలు మార్చకుండా పైగా మీకు తోచిన డబ్బులు ఇవ్వమని చెప్పింది కానీ ఈ బొమ్మలకు ఖరీదు చెప్పలేదు! డబ్బులు కావాలని పట్టుబట్ట లేదు !అంటే ఈమె నిజంగానే బొమ్మల అమ్ముకునే స్త్రీనా లేక ఎవరైనా దైవరూపమా అనుకోగానే మా వాడితో వెంటనే “ఆ ముసలి దాన్ని పట్టుకో! ఎక్కడైనా ఉందేమో చూడు” అంటూ నేను వాడిని కంగారు పెట్టేసరికి… నా డబ్బులు దొంగతనం చేసింది అని అనుమానంతో వాడు వెతకడం ప్రారంభించినాడు! సుమారు మేము నాలుగు గంటలు పైగా వెతికినా ఎక్కడా అగుపించలేదు! అక్కడే ఉన్న మట్టి బొమ్మలు అమ్మే వారిని ఈమె గురించి అడిగితే… ఈమెకి అసలు మట్టి బొమ్మల కొట్టు లేదని, బొమ్మల చూసి ఒక్కడు..ఇవి రాత్రి ఆ ముసలావిడ మా దగ్గర రెండు వందల రూపాయలు ఇచ్చి ఈ రెండు బొమ్మలు మాత్రమే కొన్నదని తెలిపినాడు! ఆ ముసలావిడ తను కొనుక్కున్న ఈ రెండు మట్టిబొమ్మలు మా ఇద్దరికీ ఖచ్చితంగా దైవారాధన తగ్గట్లుగా వాటికి అనుగుణంగా మా ఇద్దరి చేతిలో పెట్టడం ఉద్దేశం ఏమిటి? ఈమె నిజంగానే మానవ ముసిల్ది కాదు… మానవ రూపంలో వచ్చిన దైవరూపం అయ్యుండాలి! అవునని చెప్పలేము కాదని చెప్పలేము… ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో విగ్రహలు తీసుకుని మా ఊరి బస్సు వైపు అడుగులు వేసినాము! 

ఇంటికి వెళ్లి అక్కడ నుండి నేను తెచ్చిన శివమూర్తి విగ్రహన్ని చూసి మా అయ్య సంతోషపడి “దీనితోపాటు అమ్మవారి విగ్రహం తీసుకొని ఉంటే మరింత బాగుండేది! అయ్యవారి పక్కన అమ్మవారు తప్పనిసరిగా ఉండాలి! అమ్మవారు లేకపోతే అయ్య వారు లేనట్లే! అయ్యవారు లేకపోతే అమ్మవారు లేనట్లే! ఒకరినొకరు తోడుగా ఉండి అర్థ భాగాలతో అర్ధనారీశ్వర తత్వం తో ఒకే శరీరంలో రెండు సమభాగాలుగా జీవిస్తున్నారు! పూజింపబడుతున్నారు” అని చెప్పి గుడిలోనికి వెళ్ళిపోయినారు! ఇన్నాళ్లుగా నేను కేవలం అమ్మవారు లేని లింగమూర్తి ని పూజించడం వలన వారు నాకు కనిపించడం లేదేమో అని అనుమానం కలిగింది! మళ్లీ శివుడితో పాటు ఉండే అమ్మవారు ఎవరై ఉంటారో నాకు అర్థం కాలేదు! కొంతమంది పార్వతి మరికొంతమంది గంగాదేవి మరికొంతమంది బాలత్రిపురసుందరి ఇంకొంతమంది దుర్గాదేవి… సుమారు 50 మంది పేర్లు చెప్పడం జరిగింది! వామ్మో! ఈయన కోసం ఇంత మంది అమ్మవారి విగ్రహ మూర్తులని తీసుకుని వచ్చి పూజించాలా అని సందేహం వచ్చింది! తప్పదు కదా! ఆయన ఉన్నాడో లేదో తెలియాలంటే ఇంతమంది అమ్మవారి విగ్రహలు సేకరించి పూజించాలి అని అనుకుని విగ్రహలు సేకరించడం మొదలు పెట్టాను!

గమనిక:  ఆ ముసలావిడాచ్చిన రెండు మట్టి విగ్రహలు కూడా ఎవరి ఇళ్లల్లో వారికి వరసగా 12  మరియు 15 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా విరిగిపోకుండా ఉన్నాయి! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహలు నెమ్మదిగా విరిగిపోవటం ఆరంభించినాయి!! కొన్ని సంవత్సరాల సాధన తర్వాత ఆ ముసలావిడ మానవ స్త్రీ కాదని శివుడినే భర్తగా పొందిన శివాని అని తెలిసి ఆనందపడ్డాను! పాద నమస్కారం చేయనందుకు అలాగే ఆవిడని గుర్తించినందుకు మా ఇద్దరిలోనూ ఇప్పటికీ మర్చిపోలేని బాధాకరమైన అనుభవంగా మిగిలి పోయింది! ఇలా ఎవరైనా మీ దగ్గరికి మీరు అడకుండానే దైవిక వస్తువులు గాని దేవతా విగ్రహలు గాని ఇస్తే వారు అడిగిన డబ్బులు కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకోండి! కాదు అని చెప్పవద్దు! వద్దు అని అనవద్దు! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు! ఏ విగ్రహంలో ఏ దైవిక శక్తి ఉన్నదో ఎవరికి ఎరుక! నిజమే కదా!

ఆ తప్పు చేసాను!
(నా భక్తి మార్గం)

నాకు తెలీకుండానే నేను యోగపరంగా, దైవపరంగా తప్పు చేశాను! అది ఏమిటంటే దేవతలను మార్చటం, మంత్రాలను మార్చడం, పూజా విధానం మార్చడం ధ్యాన విధానాలు మార్చటం, విగ్రహములను సేకరించడం ఇలా ఎన్నో తప్పులు చేశాను! ఒకే దైవాన్ని, ఒకే మంత్రాన్ని, ఒకే ధ్యాన విధానమును పాటించకుండా చెయ్యకుండా ఏకత్వం నుండి భిన్నత్వం లోనికి వచ్చి… ఏక దైవము నుండి విభిన్న దైవమూర్తుల దాకా వెళ్లి …చివరికి మళ్లీ మొదలైన ఏక దైవం దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోండి! ఇది అందరూ తెలిసీ తెలియక చేస్తున్న అతిపెద్ద తప్పు! దానితో ఏ దేవుడికి  ఏ విధంగా పూజలు,హారతులు, నైవేద్యాలు ఆవిధంగా చేసుకుంటూ వచ్చేసరికి …. ఇంట్లో వాళ్ళు ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు మొదలవుతాయి! దానితో మనం కూడా ఏ ఒక దేవుడు మీద కూడా ఏకాగ్రత పెట్టకుండా అసంతృప్తిగానే పూజలు ముగించవలసి వస్తుంది!


నా నిత్య విగ్రహారాధన పూజ



 ప్రేత శక్తి వలన నేను బాధ పడినాను అని తెలుసు కదా! దీని నివారణ కోసం హనుమంతునిని పూజించడం మొదలు పెట్టాను! శివునిని పూజిస్తే  ప్రేతాత్మలు, భూతాలు మన చుట్టూ తిరుగుతాయని… ఎందుకంటే ఆయన భూతనాధుడని ఇలా ఎవరో అజ్ఞాన పెద్దలు నాతో అనేసరికి…. అది నిజమా కాదా అని తెలుసుకునే వయస్సు నాకు లేనందున …. ఇది నిజమే అనుకొని…  మాకున్న ప్రేతాత్మ బాధలు తొలిగించుకోవటానికి మనో ధైర్యం ఇచ్చే హనుమంతుని పూజ చేసుకోవాలని… వారు చెప్పడంతో సోమవారం పూజలు కాస్త మంగళవారం పూజలు గా మార్చబడినాయి! ఆంజనేయ స్వామి పూజలు ఇది కూడా కొన్నాళ్ళు బాగానే జరిగినది! ఆ తర్వాత చదువులో మంచి మార్కులు రావాలంటే చదువులో అఖండ విద్యా ప్రాప్తి కలగాలి అంటే…. సరస్వతి పూజలు చేయాలని చెప్పడంతో… మంగళవారం పూజలు కాస్త బుధవారం పూజలు గా అనగా సరస్వతి పూజలు గా మార్చబడినది! ఆ తర్వాత అన్ని రకాల జ్ఞానాలు కావాలంటే గురువులు అనుగ్రహం పొందాలి అని అందుకని దత్తాత్రేయస్వామిని గురువారం పూజించడం ఆరంభమైనది! ఇక ఆపై అన్ని రకాల ధనప్రాప్తి కోసం, అదృష్టం కోసం మహాలక్ష్మిని పూజించాలని చెప్పడంతో… శుక్రవారం పూజలు మొదలైనవి! గ్రహ బాధలు కలిగించే శనిగ్రహ బాధలు తొలగించుకోవాలంటే శనివారాలు పూజలు మొదలైనాయి! ఇలా చేసే పూజలలోను, మనము చేసే పనులకు ఆటంకాలు, సంకటాలు లేకుండా ఉండాలి అంటే….. గణపతి పూజలు ఆదివారంనాడు మొదలైనాయి! ఇలా ఒక్క రోజు పూజలు కాస్త వార దేవతల పూజలు గా మారినాయి! నా పూజా విధానాలు మారినాయి! ఇంతవరకు బాగానే ఉన్నది!

ఆ తర్వాత పండుగల పేర్లు తో పూజలు మొదలైనాయి! శివరాత్రి పూజలు, దేవి నవరాత్రి పూజలు, ఏకాదశి పూజలు, దీపావళి, వినాయక చవితి, సత్యనారాయణ వ్రత పూజ ఇలా పండుగల పూజలు మొదలైనాయి ! వారాల పూజలతో ,పండుగల పేరుతో పాటు నా జీవితంలో మాస పూజలు మొదలైనాయి! ఇక ఆపై మాస పూజలు అనగా శ్రావణ మాస పూజలు, కార్తీకమాస పూజలు, ధనుర్మాస పూజలు మొదలైనాయి! వీటితో పాటు ఉపవాస దీక్షలు కూడా మొదలయ్యాయి! ఇలా ఈ పూజలకు సంబంధించి ఆయా దేవతా విగ్రహ మూర్తులు సుమారుగా 84 దాక నా దగ్గరికి చేరినాయి! ప్రతిరోజు వీటికి అభిషేకాలు, పూజలు, హారతులు, నైవేద్యాలు పెడుతూ ఉండే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది! ఏ పూజలు చేయకపోతే ఏ కష్టాలు వస్తాయేమోనని భయం ఒక పక్క…. మరోపక్క మనస్ఫూర్తిగా పూజలు చేయలేక పోతున్నానే బాధలు ! ఇలాంటి అయోమయ పూజలు చేస్తున్న సమయంలో కూడా నాకు గురుమంత్రం గా వచ్చే గాయత్రి మంత్రమును వీలునుబట్టి రోజు 1000 నుండి 11 వరకు తప్పకుండా చేసే వాడిని! ఇదే నాకు తెలియకుండా నేను చేసిన మంచి పని! ఎక్కడా కూడా గురుమంత్రం ఆపకుండా...వాయిదాలు వెయ్యకుండా...కేవలము నాకున్న వీలును బట్టి జపసంఖ్యను మార్చుకొని … ఏకధాటిగా 12 సంవత్సరాలు చేయగలిగి మంత్రసిద్ది పొందగలిగినాను! ఇది అయిన తర్వాత మిగిలిన 84 విగ్రహ మూర్తుల పూజలు చేసే వాడిని!

ఈ 84 దైవ విగ్రహ మూర్తులు పూజలు పూర్తయ్యే సరికి…. నా సామిరంగా నా పరిస్థితి… ఎలా ఉండేదంటే….. స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు- శ్రీ లక్ష్మి దంపతులు చేసే పూజలు లాగా ఉండేది! కాకపోతే వారికి నాకు తేడా ఏమిటంటే అందులో వాళ్ళు దేవుడు ఫోటోలకి హారతిచ్చి మసి పట్టిస్తే …. నేనేమో ఈ 84 దైవ విగ్రహ మూర్తులకు హారతిచ్చి మసి పట్టిచ్చేవాడిని! రానురాను ఏ దేవుడి విగ్రహం అది అని గుర్తుపట్టలేని స్థితికి నా పూజలు ఉండేవి! అలాగే రానురాను ఈ విగ్రహ పూజలు చేసే సమయం కూడా ఉండేది కాదు! పైగా నా మనస్సు ఈ పూజలు చేయడానికి వాయిదాలు కోరుకుంటూ ఉండేది! దానితో నేను నెమ్మది నెమ్మదిగా వార పూజలు, పండగ పూజలు, మాస పూజలు తగ్గించుకుంటూ వచ్చేవాడిని! అప్పుడప్పుడు ఏవో మానసిక సమస్యలు వచ్చేవి! వాటిని నేనే స్వయంగా పరిశీలించుకుని పరిష్కరించుకునే వాడిని!

దాంతో నేను మళ్లీ అయోమయ స్థితికి చేరుకున్నాను! విగ్రహారాధన అంటే విరక్తి వచ్చేసింది! అయ్యవారి పక్కన ఏ అమ్మవారిని పూజించాలి? ధర్మ సందేహం మళ్ళీ మొదలైంది! ఈసారి ఒక అమ్మవారిని మాత్రమే ఎంచుకుని వారిని పూజించాలి అని నిర్ణయం తీసుకున్నాను! కానీ 50 మంది అమ్మవార్లలోఎవరిని పూజించాలో అర్థంకాని అయోమయ స్థితికి వచ్చాను! నా స్థితిని గమనించిన మా అమ్మ నా దగ్గరకు వచ్చి… అసలు విషయం ఏమిటో అడిగి తెలుసుకున్నది! దానికి ఆమె చిరునవ్వు నవ్వి “దీనికి ఎందుకురా అంత కంగారు! మన కుల దైవం దుర్గాదేవి! ఆవిడ మల్లికార్జున సహిత దుర్గమ్మ అని ఆయనతో ఉంటుంది కదా! కాబట్టి మీ అయ్యవారి పక్కన అమ్మవారి గా దుర్గాదేవి విగ్రహ మూర్తి ని తీసుకుని పూజించు! నాలుగు రోజులలో మనం విజయవాడలో జరిగే పెళ్లికి వెళ్లాలి! అక్కడే దుర్గాదేవి స్వయంభూగా వెలిసినది కదా! ఆ క్షేత్రం లోనికి వెళ్లి అక్కడ నీకు నచ్చిన ఒక దుర్గమ్మ విగ్రహం మూర్తిని తెచ్చుకుని పూజించు! అప్పుడు అమ్మ వారి పక్కన అయ్య వారిని ఇద్దరిని కలిపి పూజిస్తే…. మీ సమస్య తీరినట్లే కదా!” అని చెప్పి వెళ్ళిపోయింది! దానితో మా కులదైవంగా దుర్గాదేవి ఉన్నప్పుడు… మరే ఇతర అమ్మవారి రూపాలు పూజించడం అవసరం లేదని గ్రహించి…. పెళ్లి కోసం…. రాబోయే దుర్గమ్మ విగ్రహం మూర్తి కోసం ఎదురు చూస్తున్నాను!

గమనిక: అదే మనస్ఫూర్తిగా, మనకి ఇష్టమైన, మన కంటికి నచ్చిన, మన మనస్సు మెచ్చిన ఏకైక దైవమును ఆ దైవం యొక్క విగ్రహ మూర్తి ని … ఆ దైవ మంత్రమును మనస్ఫూర్తిగా చేసుకుంటే… ఆయనే మనకున్న కష్టనష్టాలు లాభనష్టాలు తీరుస్తాడని… మన కోరికలు నివేదించుకుంటే కచ్చితంగా తీరుస్తాడని తెలుసుకోండి! అనేక దైవాలను నమ్ముకుంటే ఆ దేవుడు చూసుకుంటాడని ఈ దేవుడు… ఈ దేవుడు చూసుకుంటాడని ఆ దేవుడు…ఇలా ఎవరికి వారే అనుకుని…. మన కోరికలు తీర్చలేని అయోమయ పరిస్థితి వస్తుంది! దానితో కోరిక తీరక కోపతాపాలకు, వైరాగ్య భావాలు ఏర్పడే ప్రమాదం ఉంది! కాబట్టి మీ ఇష్టదైవమును మాత్రమే ఎంచుకోండి! వారే మీకు గురువు, తల్లి, తండ్రి, దైవము, స్నేహితుడు, ఆత్మబంధువు అనుకోండి! కష్టాలు చెప్పుకోండి! కోరికలు నివేదించండి! ఫలితాలు ఆశించకండి! వచ్చిన వాటిని స్వీకరించండి! అంతే యోగక్షేమాలు స్వయంగా ఆయనే మన దైవ శక్తి రూపంగా మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతారు! అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు! అనగా రామకృష్ణ పరమహంసకి -కాళీమాత లాగా, నామ దేవుడికి -పాండురంగడు లాగా, రమణ మహర్షి కి- జ్ఞాన జ్యోతి స్వరూపంగా, శ్రీనివాస రామానుజన్ కి అఖండ జ్యోతి స్వరూపంగా, తాడేపల్లి రాఘవ శాస్త్రి గారికి బాలిక- బాల రూపంగా, త్రైలింగ స్వామికి మంగళ గౌరీ గా… ఇలా వారి ఇష్టదైవాలు సంచారం చేశారని వారి చరిత్రలు తెలుసుకోండి! వీరంతాగూడ వారి ఇష్టదైవముగా ఏకదైవము మాత్రమే పూజించినారని గ్రహించండి!



దుర్గమ్మ ను చూడటానికి వెళ్తే
(నా భక్తి మార్గం)

మా బంధువులు పెళ్లి జరుగుతోందని దానికోసం మా కుటుంబ సభ్యులంతా పెళ్లి కి వెళ్లాలని తెలుసుకున్నారు కదా! అప్పుడు అక్కడి నుండి ఒక దుర్గా దేవి విగ్రహ మూర్తి ని కూడా తెచ్చుకోవాలని నేను అనుకున్నాను అని తెలుసు కదా! ఎందుకంటే శివయ్య లేని అమ్మవారిని…. అమ్మవారు లేని శివుడిని పూజించరాదని మా అయ్య చెప్పడంతో దుర్గాదేవి సమేతంగా శివుడుని పూజించాలని నిర్ణయించుకున్నాను! పెళ్లిలో బంధువులందరూ కలిసినారు! అందులో శ్రీశైలంలోని ఘంటామఠములో నాకు సహాయం చేసిన మిగిలిన వ్యక్తులు కూడా కలిసినారు! యధావిధిగా మా ముచ్చట్లన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు మరలినది! 20 సంవత్సరాల వయస్సు నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వారంతా ఆ చర్చలో పాల్గొన్నారు! దైవం మీద ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతూ చెప్పడం జరుగుతోంది! నేను వీటిని అన్నిటినీ సావధానంగా వినడం జరుగుతోంది! వీటిని ఖండించేవారు ఖండిస్తున్నారు! ఆమోదించేవారు ఆమోదిస్తున్నారు! నేనయితే ఎటు ఉండాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాను! నా శ్రీశైల ఆధ్యాత్మిక అనుభవాలు వారితో పంచుకోవడం జరిగింది! ఇది చాలామంది సత్యమని నమ్మితే …. మరికొంతమంది ఇది నా మానసిక మనోభావాలని కొట్టిపారేశారు!

ఇంతలో అక్కడికి సుమారుగా 24 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువకుడు వచ్చినాడు! వారిని నేను చాలా చిన్నప్పుడు చూసినట్లుగా గుర్తుగా ఉంది! ఆ వ్యక్తి మా అందరి వైపు తిరిగి “అయితే మీలో ఎవరికైతే దైవశక్తి చూడాలనిపిస్తే నాతో పాటుగా చింతామణి దుర్గమ్మ ని చూడటానికి రండి! నేను ఇంతవరకు ఆమె నిజ స్వరూపమును చూడలేదు! కేవలం ఈమెకి అనుసంధానము చేసిన మహిషాసురమర్ధిని విగ్రహ మూర్తి ని చూశాను! నేను ఇప్పుడు ఆమె నిజమూర్తి నిజ రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను”! అనగానే నాకు ఏమీ అర్థం కాలేదు! విగ్రహమూర్తి ఏమిటో, సజీవ మూర్తి ఏమిటో నాకైతే అర్థం కాలేదు! ఇదే సందేహాన్ని వారిని అడిగితే దానికి అతను నవ్వుతూ “విగ్రహ మూర్తి అంటే ప్రస్తుతం దేవాలయంలో మహిషాసురమర్ధిని పూజింపబడుతున్న మూర్తి! అందరు చూస్తున్నారు, చూస్తారు, పూజలు చేస్తున్నారు! నిజానికి ఈ క్షేత్రములో రెండు దైవవిగ్రహమూర్తులున్నాయి!అందులో ఒకటి మానవుల పూజలకి అనుగుణముగా ఉన్న మహిషాసురమర్ధిని విగ్రహమూర్తి కాగా రెండవది అసలు సిసలైన సిద్దపురుషుల చేత పూజలందుకునే చింతామణి దుర్గ! నేను అనేది మహిషాసురమర్ధిని విగ్రహమూర్తి లోని దైవిక శక్తి స్వరూపమైన సజీవమూర్తియైన చింతామణి దుర్గమ్మను చూడాలని అనుకుంటున్నాను! అనగా సిద్ధపురుషుడు ప్రవేశపెట్టిన ఆధ్యాత్మిక శక్తి స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను! అది అంత తేలికైన విషయం కాదని గ్రహించండి! ఎంతోమంది దేవిఉపాసకులు ఈ చింతామణి దుర్గ గుడి ప్రాంతానికి వెళ్లేసరికి కొంతమందికి భైరవుడు ఇబ్బంది పెట్టినారని...మరికొంతమందికి తాంత్రికశక్తులు భయపెట్టినాయని...దానితో ఈ చింతామణి దుర్గమ్మను చూడలేక వెనుతిరిగినారని మాకు వివిధ గ్రంధాలు ద్వారా తెలిసినది! ఆ ప్రాణశక్తి ఉన్న ప్రాంతానికి వెళ్లాలి! అప్పుడే ఆవిడ కరుణించి మనకి కనపడుతుంది! ఈ మూర్తికి ప్రతినిత్యము అర్ధరాత్రిపూట దేవతలు, దేవమునులు, దేవమహర్షులు,దేవయోగులు,యక్షులు,కిన్నెరులు,గంధ్వరులు ఇప్పటికి సూక్ష్మశరీరాలతో వచ్చి ఆరాధన చేసి వెళ్ళుతున్నారని చెప్పడము జరిగినది!

ఆవిడ సజీవమూర్తిగా బాలిక రూపములో అనగా ఎనిమిది సంవత్సరాల వయస్సున్న బాలిక రూపంలో ఆ ప్రాంతంలో తిరుగుతుందని వివిధ మంత్ర గ్రంధాల ద్వారా తెలుసుకున్నాను! స్వయంభూమాత ఉన్న దేవాలయానికి వెళ్లాలనుకుంటున్నాను! కొండ చివర పైన చిన్న గుడిగా ఉన్నది అని తెలుసుకున్నాను! ఇప్పుడు మనం చూస్తున్న గుడి కాకుండా ఆ కొండపైన అగ్రభాగంలో సిద్ధ పురుషుడు చేత నిర్మించబడిన అతి చిన్న దేవాలయంలో అమ్మవారి యొక్క సజీవ రూపం అది కూడా ఒక అడుగు రాతి విగ్రహముతో తయారుచేయబడిన మూర్తి స్వరూపం ఉన్నదని ….. దానిని ఇంతవరకు ఎవరూ చూడలేదని, దాని దగ్గరికి ఇంతవరకు ఎవరూ కూడా వెళ్లే సాహసం చేయలేక పోతున్నారు అని తెలిసినది! నిజమైన దైవశక్తి అక్కడే ఉన్నదని,కేవలం కింద గుడిలో ఉన్న రేఖాచిత్రంగా తేనెమైనపు మహిషాసురమర్ధిని విగ్రహనికి దైవశక్తిని అనుసంధానం చేసినారని …చెబుతుంటే ఏమనాలో అర్థం కాలేదు! ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు! ఇది ఇలా ఉండగా అతను మళ్ళీ నిజానికి దుర్గాదేవి అనే ఆవిడ అమ్మవారు గాదని ప్రేత శక్తి అని, ఆ తర్వాత ఈ శక్తిని సిద్ధ పురుషులు తమ తపో శక్తితో దైవ శక్తి గా మార్చినారని…. దానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దైవ శక్తి బయటకు రాకుండా ఉండటానికి ఆదిశంకరాచార్యుడు శ్రీచక్ర ప్రతిష్ఠ గావించారని…. గావాలంటే శ్రీ పోతుకూచి సుబ్రమణ్యం గారు రచించిన “శ్రీ కనకదుర్గాదేవి మహిమ” అను గ్రంథమును చదివితే...ఈయన ఈ చింతామణి గుడికి వెళ్ళి భంగపడి ఎలా వచ్చినారో మీకే తెలుస్తుంది అంటూ ఈ గ్రంథమును చదివితే మీకే అర్థమవుతుంది అని చెప్పటం జరిగినది! ఈపేజిలో మాధవవర్మ యొక్క తోబుట్టువు చనిపోయి దుర్గాదేవిగా వెలిసినట్లుగా తెలుగు విజ్ఞానసారస్వతము నందు ఉన్నదని చెప్పడము జరిగినది!గమనించగలరు!



ఇక ఈ గ్రంథకర్త ఏవిధంగా చింతామణి దుర్గాదేవిని చూడలేకపోయినాడో తెలుసుకోండి!

అపుడు ఈ గ్రంథమును చదివితే... “ప్రేతశక్తి ఎలా దుర్గాదేవి అయినదో వివరంగా లేదని” నేను ఆ యువకుడితో అంటే..ఆయన వెంటనే మరో పుస్తకమును ఇచ్చి దీనిని చదివితే అసలు విషయము తెలుస్తుందని చెప్పడముతో…వెంటనే నేను ఆ పుస్తకం తీసుకుని ఆ విషయమును అందరికీ వినపడేటట్లు గా పెద్దగా చదవడం ఆరంభించాను! విషయం ఏమిటంటే కనకమ్మ అనే వైశ్య కూతురు ఉండేదని…. ఆమెకి మాంసము తినాలని కోరిక ఉండేదని… అప్పుడు ఉన్న ఆచారవ్యవహారాల వలన అవకాశము దొరకలేదని…. తినాలని కోరిక తీరకపోవడంతో… ఆమె కాస్తా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది! ఆపై ఈ మాంసమును తినాలని కోరిక కోసం ప్రేతాత్మగా మారి అక్కడ ఉన్న పశువులు, మనుషులు, కోళ్లు, మేకలు, గొర్రెలు తినటం ఆరంభించింది! ఈమె బాధ తట్టుకోలేక అక్కడ ఉన్న గ్రామ పెద్దలు కొంతమందికలిసి ఒక దేవాలయమును కట్టించి ఇస్తామని మొక్కుకున్నారు! ఈమె ప్రతిరూపముగా వేప చెట్టు తో తయారు చేసిన ఒక విగ్రహ మూర్తి ని పెట్టి…. ఆ విగ్రహ మూర్తికి కనకదుర్గమ్మ అని పేరు నామకరణం చేశారు! అయినా కూడా అప్పుడప్పుడు ఆ గ్రామ ప్రజల స్త్రీల మీద కి వచ్చి….  నానాయాగీచేస్తూ ఉండేది! అకారణంగా ఆ స్త్రీలు నదిలో దూకి ప్రాణాలు కోల్పోతూ ఉండేవాళ్ళు! ఈ కథనము ఉన్న పేజిని మీకోసం ఇక్కడ ఇవ్వడము జరుగుతోంది!గమనించగలరు!


ఇది గమనించిన కొంతమంది సిద్ధ పురుషులు ఈ  ప్రేతశక్తిని తపోశక్తితో ఒక దైవ శక్తిగా మార్చి… రేఖాచిత్రంలో బంధనం చేసినారు! ఆ తర్వాత ఈ బంధం యొక్క శక్తిని  ఒక అడుగు రాతి విగ్రహము లోనికి తీసుకు వచ్చినారు! ఈ రాతి విగ్రహం చింతామణి దుర్గ మూర్తిగా ఆరాధించడం మొదలు పెట్టినారు! ఈ విగ్రహము నుంచి ఈ దైవశక్తి ఎప్పుడు బయటకు రాకుండా ఉండటానికి శ్రీచక్ర ప్రతిష్ఠ గావించినారు! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన…. సిద్ధ పురుషులు తపో ప్రతిష్ట విగ్రహశక్తిని భక్తులు తట్టుకోలేకపోవడముతో....ఆ గుడిని మూసివేసి...దీనికి దూరంగా... కొండమధ్యలో వేపచెట్టు కొమ్మతో చేసిన మరో ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గావించినారట! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన…. ఈ చెక్కవిగ్రహనికి అభిషేకాలు చెయ్యలేని కారణముగా...మరో రాతి విగ్రహమును ప్రతిష్టించినారట! తురుష్కులు దండయాత్ర వలన ఈ విగ్రహము ముక్కలు చెయ్యడము...అపుడు మా వంశ మూలపురుషులలో ఒకరైనా బుద్ధు ఉమ్మన్న(ఉమాపతి)అనే సిద్ధపురుషుడు యోగ శక్తి వలన ముక్కలన్నీ చేర్చి… వాటికి తేనె మైనముతో అతికించినారని తెలిసినది! అతను ఈ విషయాలన్నీ చెబుతుంటే నెమ్మది నెమ్మదిగా నా మతి పోవటం మొదలైనది! ఏమిటి ఒక ప్రేతశక్తి …. దైవ శక్తి గా మారినదని అనగా కనకమ్మ కాస్త కనకదుర్గమ్మ గా మారినదని నాకు తెలియడముతో… అసలు ఏమి జరుగుతోంది…. ఒక ప్రేత శక్తి దైవ శక్తిగా ఎలా మారింది…. అందులో మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఇందులో ప్రమేయమున్న సాధ్యమేనా? ఏమీ అర్థం కావడం లేదు! ఏది నమ్మాలో… ఏది నమ్మకూడదో! వామ్మో! ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకుంటున్న సమయంలో…. ఆ వ్యక్తి నా వైపు అదోలా చూస్తూ…

చింతామణి దుర్గ

“కావాలంటే ఈ మధ్యాహ్నం ఆది గుడి అయిన కనకమ్మ ఒక అడుగు రాతి విగ్రహ గుడికి వెళ్ళుతున్నాను! గావాలంటే వచ్చే వాళ్ళు నాతో రావచ్చును!” అన్నాడు! దానితో నాకు కూడా ఏదో ఒక విషయం తెలుసుకోవాలని అనిపించి… నేను కూడా ఆ చింతామణి దుర్గను చూడాలనిపించి… ఆరుగురుతో కలిసి ఆదిగుడి చూడటానికి బయలుదేరాను! యధావిధిగా మైనపు విగ్రహం ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకుని… కొండపైన అంతర్భాగంలో ఉన్న రేఖాచిత్రము తో కూడిన ఒక అడుగు రాతి విగ్రహము గుడి వైపుకి అనగా సిద్ధపురుషులు చేత పూజింపబడుతున్న చింతామణి దుర్గ విగ్రహం గుడికి బయలుదేరాము!

గుడి మాకు కనుచూపుమేరలో కనిపించి కనిపించగానే… ఎక్కడి నుండో ఒకసారిగా అతి తీవ్రమైన గాలి రావటం మొదలైంది! దీని తీవ్రత దెబ్బకి మేమంతా తలో ఒక దిక్కులో చచ్చిన శవాలు లాగా పడినాము! అందరూ సృహతప్పి నారు! కొన్ని గంటల తర్వాత మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చిన వ్యక్తికి మాత్రమే మొదట తెలివి వచ్చింది! అతను మేము ఎక్కడ పడినామో గుర్తించి… మాకు తిరిగి తన మంత్ర శక్తితో సృహ తెప్పించినాడు! ఇలా సుమారు యధావిధిగా రావడానికి కొన్ని గంటల పైనే పట్టింది ! అంటే ఈ విగ్రహం గుడి చుట్టూ సిద్ధపురుషుల మంత్రశక్తి వలయాలు ఉన్నాయని ….అందువల్ల మనం వీటి లోనికి ప్రవేశించ లేకపోయామని …. ఈ గుడికి మనము ప్రవేశిస్తున్నామని తెలుసుకుని… పంచభూతాలు మన మీదకు ప్రయోగించినారని… ఇక ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదమని…. మనకి ఆక్సిజన్ కూడా అందకుండా చేస్తారని…. అతను చెప్పుతున్నాడు!

మాకు జరిగిన ఈ విచిత్ర అనుభూతి ఎలా అర్థం చేసుకోవాలో … అర్థం కాక ప్రాణభయంతో…. కొండ నుండి కిందకి మౌనంగా దిగడం ఆరంభించే సరికి… నాకు దగ్గరలో ఉరుము మేఘము లేకుండానే ఒక పిడుగు పడి ఒక చెట్టు తగలబడిపోతుంటే … ఇదంతా మాకు అగుపించని సూక్ష్మ శరీరాలతో ఉన్న సిద్ధ పురుషుల పని గ్రహించి… వారికి మనస్సులో నమస్కారాలు చేస్తూ…. దైవశక్తికి రక్షణ కవచంగా ఉన్న వారికి కృతజ్ఞత భక్తితో ….కృతజ్ఞతలు చెబుతూ మౌనంగా ప్రాణభయంతో వడివడిగా వేగంగా… అక్కడ ఉంటే ఏమి చూడవలసి వస్తుందనే భయంతో…. కిందకి దిగడం ఆరంభించినాము! యధావిధిగా ఎవరికీ ఏమీ అనుమానం కలగకుండా పెళ్లి పనులు లో పాల్గొన్నాము!  ఆ తర్వాత మా ముత్తాత ఉమ్మన్నగారికి దుర్గాదేవి తన భుజమును కానుకగా ఇచ్చినదని అక్కడున్నవారంతా చెప్పేసరికి… మేము ఆ తల్లిని చూడటానికి వెళితే రానీయని తల్లి….. ఈయనకి తన భుజమును కానుకగా ఎలా ఇచ్చిందో నాకు అర్థమై చావలేదు! ఎలా ఇచ్చినదో తెలుసుకోవాలని అనిపించి… అక్కడ ఉన్న ఆ వంశస్థులను వివరాలు సేకరించడం మొదలు పెట్టినాను!

గమనిక: కొన్ని సంవత్సరాల తర్వాత మా ముత్తాతలు పూజించిన బాలాదుర్గ యంత్రరాధన శక్తితో నేను ఒక్కడినే ఈ ఆదిగుడికి వెళ్ళడము... అక్కడ ఉన్న ఒక అడుగు ఉన్న రాతి చింతామణి దుర్గాదేవి విగ్రహమూర్తిని ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటము జరిగినది! కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆది గుడికి వెళ్లడానికి ఎలాంటి అవకాశాలు లేవని గ్రహించాను! అలాగే చల్లపల్లి రాజావారు ఈ చింతామణి దుర్గాదేవి ఆకారపు ఒక అడుగు బంగారు విగ్రహమూర్తిని మా ముత్తాతల సహాయముతో చేయించుకొని ఆరాధించేవారని మా అమ్మమ్మగారు దీనిని చూసినట్లుగా నాతో చెప్పడము జరిగినది! అలాగే  ప్రేతశక్తులు కాస్త దైవ శక్తి దేవతలుగా ఈ ఆంధ్రదేశంలో 7చోట్లలో అనగా బుచ్చమ్మ దేవతగా, లింగమ్మ దేవతగా, సూరమ్మ దేవతగా, తోటకూర దేవతగా, వరద అచ్చమ్మ దేవతగా, కులగొల్లమ్మదేవతగా ….  ఇలా ప్రేత శక్తులుగా ఉన్న వారు కాస్త దేవతలుగా కొనియాడబడుతున్నారని ఆ తర్వాత నాకు తెలిసినది! విచిత్రమేమిటంటే దేవాలయాల్లో జరిగే ప్రతిష్టలకు దైవ ప్రతిష్టలకు సరిగ్గా తాంత్రిక ఉపాసకుల రావటం నేను ఎన్నో ప్రతిష్టల సమయంలో స్వయంగా చూసేసరికి…. ప్రేత శక్తిని దైవ శక్తిగా మారుస్తారని రూఢిగా నమ్మకం ఏర్పడింది! అలాగే వరంగల్ జిల్లా లో పాత కాలం నాటి కట్టడాలు, ఇండ్ల మీద…. గొంతు కోసుకున్నట్లుగా బొమ్మల గుర్తులు ఉంటాయి! దీనికి కారణము అలనాటి కాలంలో…. ఒక మహారాజు ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు తవ్వించాలని…. కూలీలకు బంగారం ఇస్తానని ఆశ చూపించి… ఒక అతి పెద్ద చెరువును తవ్వించాడు! తీరా వీళ్ళకి బంగారం బదులుగా వెండి ఇస్తానని చెప్పే సరికి…. వాళ్ళు తట్టుకోలేక ఆ కూలీలంతా…. తమ కత్తులతో తమ గొంతు కోసుకుని ప్రాణత్యాగం చేసి….  ప్రేతాత్మలుగా మారి ఆ రాజును, ఆ రాజ్య ప్రజలను నానా ఇబ్బందులు గురి చేయటం మొదలు పెట్టినారు! ఈ బాధలను భరించలేక ఆ రాజు కాస్తా తాంత్రిక గురువులను సంప్రదించినప్పుడు…..  వారి సలహా మేరకు వీరి  ప్రేతాత్మలను…. దేవతలుగా పూజించే సరికి వీరి ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారి… ఇప్పటికీ పూజింపబడుతున్నారు! అలాగే ఈ ప్రేతశక్తి తట్టుకోవటానికి మహాస్మశాన వాసి అయిన భద్రకాళీ అమ్మవారిని స్థాపించడం జరిగింది! అంటే ఈ లెక్కన ప్రేతశక్తి కాస్త దేవి శక్తి అయినది కదా! అలాగే మరో విచిత్రం ఏంటంటే ఒక మతం వారు తమ దేవుడు భూతనాధుడు అని స్మశాన వాసి అంటారు! మరొక మతం వారు తమ దేవుడు  శిలువకి బందీ అయ్యి...మరణమును పొంది...మూడు రోజుల తర్వాత సూక్ష్మశరీరముతో దర్శనమిచ్చినారని... అని చెబుతారు! మరొక మతం వారు తమ దేవుడు జీవసమాధి చెందటం వలన…. మేము ఆ సమాధిని పూజ చేస్తున్నామని చెబుతున్నారు! అంటే ఈ లెక్కన దేవుడు ఉన్నాడు అని చెప్పే ఈ మతాలు చివరికి వారి దైవాలు స్మశానమునకు ఎలా చేరినారో చెప్పడం జరుగుతుంది కదా! అంటే ప్రేతశక్తి కాస్త దేవి శక్తి గా మారిందని తెలుస్తోంది కదా! నా నమ్మకం నిజమో కాదో నాకే తెలియదు! అలాగే ఈ కథనాలు సత్యమో అసత్యమో కూడా నాకు తెలియదు! కేవలం ఇవి నా అభిప్రాయాలు మాత్రమే గ్రహించండి! ఇవి నిజమో గాదో మీకే వదిలేస్తున్నాను! నాకు ఈ విషయాలు చెప్పిన యువకుడు రాబోవు కాలములో మాకు నిజభౌతిక గురువైనారు!ఈ వివరాలు మీకు “విచిత్ర వేదాంతి” అనే అధ్యాయములో తెలుస్తాయి!


భుజం ఇచ్చిన దుర్గాదేవి
(నా భక్తి మార్గం)


మా ఉమ్మన్న పంతులు గారు

ఉమ్మన్న పంతులు గారు ఈయన మా అమ్మగారి వంశమైన బుద్ధు వంశం యొక్క మూల పురుషులలో ఈయన ఒకరు! ఈయన 17వ శతాబ్ధమునకు చెందినవారు! వీరిని ఉమాపతి అని లేదా ఉమ్మన్న లేదా ఉమ్మన్న పంతులు గారు అని పిలిచేవారు! ఈయన చాలా అమాయకుడు! అసలు చదువుకోలేదు! లౌకిక జ్ఞానము గూడ లేదు! వీరు లక్షమ్మను వివాహామును చేసుకొని తన తమ్ముడి కుటుంబ సభ్యులతో ఉండేవారు! కాని వీరికి సంతానయోగము లేదు! వీరి తమ్ముడి గారి పేరు చలపతి శాస్త్రి! ఇది ఇలా ఉండగా పెద్దబావగారైన ఉమ్మన్నగారు పనీపాట లేకుండా ఇంట్లో తిరుగుతూ ఉండటం చూసిన ఇతని భార్య ఇతనిని ఉపాధి ధ్యాస దారి లోనికి తీసుకు రావాలని ఒకరోజు నానా తిట్లూ తిట్టింది! దానితో ఈయనకు జీవితం మీద విరక్తి కలిగి “ఈ జీవితం ఇచ్చినది అమ్మవారే కదా! ఆమె ఉన్న గుడికి వెళ్లి ఆమె కళ్ళ ముందరే ఆమె కాళ్ళ దగ్గర చనిపోవాలని….  గుడికి వెళ్లి తల బాదుకోవడం చేసినాడు!

ఇలా సుమారుగా ఆరు నెలలుపాటు నిద్ర, ఆహారము లేకుండా పిచ్చోడి మాదిరిగా ధూపదీప నైవేద్యాలు లేని ఆ అమ్మవారి గుడిలో ఏడుపు తో గడుపుతూ"అర్ధం లేని జీవితము వ్యర్ధమని...తనకి మరణము ప్రసాదించమని లేదా జ్ఞానమైన ప్రసాదించమని” వేడుకోవడము చేసినారట! అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై “ఏమిరా బిడ్డ! ఎందుకు ఏడుస్తున్నావు? చదువు లేని వాడు, సంపాదన లేని వాడు, దేనికి పనికి రాడు గదా! ఏందులోను గుర్తింపు ఉండదు కదా! ఇదే విషయం ఆమె చెప్పినది కదరా! నీ మంచి కోరే వారు మీకు శత్రువులు ఎలా అవుతారు? ఆమె మీద కోపంతో ఈ అమ్మ దగ్గరికి వచ్చావా? పైగా చావాలని వచ్చావురా? ఇదేమైనా న్యాయమా? నీ వలన లోకానికి జ్ఞాన ఉద్ధారణ జరగాలని ఉంది… అంటూ ఆయన నాలిక మీద బీజాక్షరాలు రాసినది! అనగా దుర్గ మంత్ర బీజాక్షరాలు పొందడం జరిగినది! దానితో ఆయన బ్రహ్మ జ్ఞానమును పొంది ఆత్మ, తత్వ, లౌకిక జ్ఞానాలు పొందడం జరిగినది!

             
అమ్మవారు ఇచ్చిన దుర్గాదేవి యంత్రము

                                                           
ఈ బీజాక్షరాలను ఆయన ఒక బంగారు రేకు మీద గీసుకుని ఒక యంత్రము లాగా పూజించడం ఆరంభించినాడు! దానితో ఈయనకి మంత్రం, తంత్రం, యంత్ర రహస్యాలు సహజసిద్ధంగా వచ్చినది! తనకు వచ్చిన మంత్రశక్తితో ఈయన దుర్గాదేవిని ఆరాధన చేయడం ఆరంభించాడు! దానితో ఈయన కృష్ణాజిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామములోని దుర్గాదేవి గుడి పూజారులుగా పనిచేసినారు! అమ్మవారు ఇచ్చిన మంత్రమునందు సిద్ధి పొంది గొప్ప దేవి ఉపాసనసిద్ధి పొందినారట! ఎంతగా అంటే ఎనిమిది సంవత్సరాల పాపగా ఆయనకి ప్రతినిత్యం దుర్గాదేవి ఆయన ఇంటి చుట్టూ అలాగే తన చుట్టూ తిరుగుతూ అందరికీ కనపడుతూ ఉండేది! శుక్రవారం ఈయన దగ్గరికి వచ్చి గారెలు అలాగే పులిహోర అడిగి చేయించుకుని తిని వెళ్ళేది! ఏమైనా పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు అందరికీ గానే ఎరుపు లంగా జాకెట్ తో ఎరుపు గాజులు కావాలని అడిగి తీసుకునేది! ఈయన గొప్ప మంత్ర, తంత్ర, యంత్ర ఉపాసకుడు అయినాడు! ఇంటి చుట్టు దైవశక్తి ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉండేది! తనకు వచ్చిన జ్ఞానముతో ఇతరుల జాతక సమస్యలు, ప్రేత సమస్యలు… వాటి పరిహారాలు చెప్పి… వాటిని వదిలించే వారు! దానితో ఈయన ఒక గొప్ప మంత్ర ఉపాసకుడుగా ఖ్యాతి పొందినారు! ... ప్రతిదినము ఎక్కువకాలము సమాధిలో ఉంటూ...అలాగే గృహస్ధాశ్రమునందు ఆదర్శవంతమైన జీవితమును గడుపుతూ...ఇలా ఉండగా… వీరి ధ్యాన నిమిగ్నతను చూసి ఆ ఊరి పండితుడు ఒకరు చూసి అసూయ చెంది వీరి ధ్యానపరీక్ష చేయాలని తలంచి...ఈయన వ్రాసిన గ్రంథములోని కొన్ని పేజీలు ఎక్కడ ఉన్నాయో వీరు ఎంత వెతికిన అవి కనిపించలేదు!అపుడు వీరు ఉమ్మన పంతులుగారిని సవాలు చేస్తూ...తన పుస్తకములోని పేజీలు ఎక్కడ ఉన్నాయో నువ్వు చెప్పగలిగితే... నువ్వు నిజముగానే ధ్యాన యోగివని నేను నమ్మి...అందరిని నమ్మిస్తాను” అన్నారుట!దానికి ఉమ్మన్న గారు ఒక చిరునవ్వు నవ్వి రెండునిమిషాలు కళ్ళుమూసుకుని...ఆపై కళ్ళు తెరిచి...మీ పుస్తకములోని పేజీలు మీ  ఇంటి చావడి చూరులో ఉన్నాయని చెప్పగానే...నిజముగానే అవి అక్కడే ఉన్నాయట!

ఇది ఇలా ఉండగా తురుష్కలు వలన విజయవాడ మహిషాసురమర్ధిని దేవి అమ్మవారి విగ్రహము తునాతునకలు అయినది! దానితో ఈ అమ్మవారికి 32 కళల యధాశక్తిని ఎవరు తిరిగి తెప్పిస్తారా అని ఆలయ అర్చకులు వెతుకుచూయుండగా…  పెద్దకళ్లేపల్లి గ్రామంలో ఉన్న మా ముత్తాత తాతగారైన ఉమాపతి గారి విషయం వారికి తెలిసింది! దానితో వీరిద్దరు అన్నదమ్ములు అనగా ఉమాపతి శాస్త్రి, చలపతి శాస్త్రి ….  ఇద్దరూ కలిసి విజయవాడ ఆలయములో మకాం పెట్టి… ఆమెని పునర్జీవనం చేసి… ఆమెకి యధాశక్తి ఇవ్వటానికి మంత్ర ధ్యాన తపోశక్తి ఆరంభించినారు! విరిగిపోయిన అమ్మవారి విగ్రహం ముక్కలను ఒక చోట చేర్చి… వాటికి తేనె మైనము పూసి అతికించి… యధావిధిగా ప్రస్తుత మహిషాసురమర్ధిని అమ్మవారి రూపు రేఖల విగ్రహ మూర్తి గా తయారు చేసినారు! అమ్మవారు స్వయంభూ కాబట్టి మనము మళ్ళీ యధావిధిగా ప్రాణప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదని చెప్పి…నిత్యదైవారాధన స్ధితికి ఈ విగ్రహమూర్తిని తెప్పించినారుట! కొన్నిరోజులకి ఒక విచిత్ర సంఘటన జరిగినది! ఈ ఇంటి ఆడవాళ్ళు పండక్కి గాజులు అమ్మేవాడిని పిలిపించి...వారికి గావాలసిన గాజులు వేయించుకొన్నారుట! తీరా వాడికి డబ్బులు ఇవ్వబోయేసరికి... “అది ఏమిటి నేను అయిదురుకి గాజులు వేస్తే...మీరు నలుగురికే డబ్బులు ఇస్తున్నారని” ...గొడవ పడినాడు! నిజానికి ఆ ఇంటిలో నలుగురు ఆడవాళ్ళే ఉన్నది! మరి వీడి ఎవరికి క్రొత్తగా పైగా ఎరుపు గాజులు వేసినారో … పైగా లంగా జాకెట్ వేసుకొని ఉన్న ఎనిమిది సం!!రాల బాలికయని ఖచ్చితముగా చెపుతూండేసరికి... అక్కడున్న వారికి అర్ధముకాని సమయములో...ఒక స్త్రీమూర్తి మీద అమ్మవారు పూని..."వాడు చెప్పిన ఎరుపు గాజులు నేనే వేయించుకొన్నాను" అని చెప్పినది! దానితో ఉమ్మన్నగారు వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళిచూస్తే...అమ్మవారి విగ్రహమూర్తి చేతులకి ఎరుపు గాజులు ఉండటము చూసి...ఆనాటి నుండి అమ్మకి ఎరుపుగాజులు సమర్పించడము ఆచార ఆనవాయితిగా వస్తోంది!

ఇది ఇలాయుండగా యధావిధిగా ఒకరోజు ఉమాపతిగారు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు క్రింద ధ్యానము చేసుకుంటుండగా అమ్మవారు వారికి ధ్యానములో కనిపించి "నీవు నాకోసము చేసిన మంత్ర తపస్సుకి మెచ్చి నీకు ఒక కానుక ఈ రోజు ఒకటి ఇస్తున్నాను”! అనిచెప్పి అదృశ్యమైందట! ఈయనకి ఆ కానుక ఏమిటో అర్ధము కాలేదట!


అదే రోజు తెల్లవారుజామున అమ్మవారి గుడి తలుపులు ఆలయపూజారులు తెరవగా… అమ్మవారి కుడి భుజస్కందము క్రింద పడిపోయి కనిపించినది! దానితో వారు భయపడిపోయి ఈ విషయాన్ని ఉమ్మన్నపంతులు గారికి చెప్పినారుట! అపుడు ఆయన వెంటనే గంధముతో ఊడిపోయిన భుజ స్ధానములో దీనిని అమర్చాలని విశ్వప్రయత్నము చేసినను… ఇది యధాస్ధానములో అమరకపోయేసరికి...దీనికి కారణము ఏమైంటుందని వీరు తిరిగి ధ్యానములోనికి వెళ్ళగా…. తిరిగి అమ్మవారు వీరికి కనిపించి “ఈ భుజమును తీసుకోమని...అదియే తన కానుకయని” ...అని చెప్పి......“దీనిని తన ప్రతిరూపముగా ప్రతినిత్యము పూజించుకొమ్మని...ఇలా చేస్తే మీ వంశమునందు సంతాన తాపత్రయం లేని బ్రహ్మజ్ఞానులు నా అనుగ్రహము వలన కలుగుతారని” అని చెప్పి...ఆమె ఒక ఔషధరసము గూర్చి చెప్పి...దానిని తయారుచేసి గంధముతో మా భుజము లేనిచోట రాసినచో మరో భుజము మొలుచునని చెప్పడముతో… ఆ విధముగా అమ్మకి చెయ్యగానే...భుజము కొత్తది వచ్చినది! అపుడు వారు ఈ విధముగా అమ్మవారి నుండి ఈయన పొందిన దక్షిణ భుజమును తీసుకొని తిరిగి తమ గ్రామమైన పెద్దకళ్ళేపల్లికి చేరుకున్నారని...ఈ భుజమును వారి జీవితకాలమంతా దీనిని పూజించడము జరిగినదని.... మంచెం వెంకట భాస్కర దత్తాత్రేయశర్మ రచించిన “శ్రీ కనకదుర్గా క్షేత్ర వైభవము” అను గ్రంథము నందు మీకు కనపడతాయి! అలాగే వీరు పూజించిన అమ్మవారి భుజస్కందమును ఇప్పటికి మనము కృష్ణాజిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామములోని దుర్గాదేవి గుడి యందు చూడవచ్చును! దీనిని మేము స్వయంగా ఆ గుడికి వెళ్ళి ఈ అమ్మవారి భుజస్కందమును చూడటము జరిగినది! అలాగే ఫోటోలు తీయ్యడము జరిగినది! మీ కోసము వాటిని పెడుతున్నాము! చూసి తరించండి! అలాగే ఈ దేవాలయం గుడి స్తంభం మీద ఆయన శిలామూర్తి రూపము కూడా ఉన్నది!

తర్వాత మూడవ తరములో ఈ వంశము నందు పుట్టిన మహాబ్రహ్మజ్ఞాని అయిన బుద్ధు కుటుంబరావు గూర్చి తెలుసుకోవాలి! వీరు మాకు ముత్తాత అవుతారు! గాకపోతే వీరు బాలదేవి ఉపాసకులు గావడము విశేషము! వేద పండితులు, అశ్వమేధయాగం కూడా చేయించగలిగేవారుట! ఈయన నీటిమీద నడిచే శక్తిని పొందినాడు! ఎంతోమంది యోగులు, సాధకులు, గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, హిమాలయ గురువులు, కాశీక్షేత్ర వేదపండితులు వీరి దగ్గరికి వచ్చి ధర్మ సందేహాలు తీర్చుకునేవారుట! ఇలా వచ్చినవారు తమ సందేహాలు తీర్చుకొని వెళ్ళిపోతున్న వారిని చూసి తన పిల్లలతో"ఓరేయి! ఇపుడే హంస వచ్చి..తన సందేహామును తీర్చుకొని...ఎగిరిపోయినదని... అని అనేవారని మా అమ్మ చెప్పినది!ఈయన చిన్నవయస్సులో ఉండగా ప్రతిరోజు వెళ్ళే గుడికి వెళ్ళగా...ఒకరోజు ఈ గుడిలో ఒక సాధువు కూర్చునియుండగా… పిల్లలందరు ఈయన చుట్టు చేరగానే...ఈ సాధువు వీరి కోసము పటిక బెల్లం సృష్టించి ఇవ్వగా... మా ముత్తాత దీనిని తీసుకోకుండా అది ఎలా సృష్టించబడినదో చెప్పమని అడినారుట! అపుడు ఆ సాధువు చెపుతానని ఈయన తలమీద చెయ్యి పెట్టగానే శక్తిపాతము జరిగిందిట! అపుడు ఈ సాధువు ఈయనకి బాలమంత్రోపదేశము చెయ్యగా...దానిని ఈయన శ్రద్ధాభక్తితో చెయ్యగా...ఈ మంత్రదేవత అయిన బాలదేవి ఎనిమిది చేతులతో...ఎరుపురంగు చీరలో కనిపించి...వీరి నాలిక మీద బాలామంత్ర బీజాక్షరాలు వ్రాసి అదృశ్యమైనది! అపుడు నుండి వీరు తరుచుగా సమాధిస్ధితిలోనికి వెళ్ళడము జరుగుతూండేది!

 అనుకోకుండా వీరి చేతికి మా ఉమ్మన్నతాత గారి దుర్గ బంగారపు యంత్రము రావడము...ఈయన దీని వెనుకవైపున తన నాలుక మీద అమ్మవారు వ్రాసిన బాలా బీజాక్షరాలు వ్రాయించడము జరిగినది! దానితో ఈ యంత్రము కాస్తా బాలాదుర్గ యంత్రమైనది! దీని ఆరాధనతో ఈయనికి సహజసిద్ధంగా బ్రహ్మజ్ఞానసిద్ధి కలిగి...ఎన్నో వేదాంత గ్రంథములు చదివి...వాటిని సరళభాషలో ఇతరులకి బోధ చేస్తూండేవారు! అనుకోని విధముగా వీరికి రెండసారి 40రోజులపాటు సమాధిలోనికి వెళ్ళడము...ఆపై స్మశానవైరాగ్యము కల్గి... చేస్తున్న హెడ్ మాష్టార్ ఉద్యోగమును అలాగే భార్యపిల్లలను వదిలేసి...కాలినడకన మద్రాసు మీదగా ట్రావంకూర్ వద్ధ ఉన్న అడవికి చేరుకొని...ఏడు సం!!రాలు పాటు అక్కడున్న సాధువులతో చేరి...ఎన్నో ఆధ్యాత్మికరహస్యాలు తెలుసుకొని...జలసిద్ధుడై తిరిగి స్వగృహమునకు వచ్చి...ఉపాధ్యాయుడిగా వృత్తిని సేకరించి... ప్రతిదినము ఎక్కువకాలము సమాధిలో ఉంటూ...అలాగే గృహస్ధాశ్రమునందు ఆదర్శవంతమైన జీవితమును గడుపుతూ...వీరు గ్రంథరచన చెయ్యడము చేసినారు! వీరు సైకాలజీ మీద రాసిన వ్యాసాలు “న్యూయార్క్ టైము” నందు ప్రచురించబడినాయి! అలాగే వీరు గీతాప్రపంచము, రామతత్వము, దేవాలయ విజ్ఞానము అను ముద్రిత గ్రంథములు రచించగా...అముద్రిత గ్రంథములుగా అనేక మంత్ర శాస్త్ర రహస్య వ్యాసాలు మనకి అందుబాటులో దొరకకుండా పోవడము జరిగినది! వీరు రచించిన “గీతాప్రపంచము” అను గ్రంథమును ఈ సైట్ యందు ఉంచడము జరిగినది! గమనించగలరు! అలాగే వీరు బందరులో 12-2-1967 లో జీవసమాధి చెంది స్ధూలకపాలమోక్షస్ధితిని పొందడము జరిగినది! ఆ తర్వాత ఇదే ప్రాంతము నందు 27-3- 1978 సరిగ్గా 11 సం!!రాలకి వీరి అంశతో మా జననము జరిగినది!

వీరికి లాగానే మేము బ్రహ్మజ్ఞాన సిద్ధికి వీరు పూజించిన బాలదుర్గ బంగారపు యంత్రమును తిరిగి పొందడము జరిగినది! అలాగే వీరికి లాగానే మేము యోగదర్శనం, జాతకప్రశ్న, సంపూర్ణ విశ్వగురుచరిత్ర, కపాలమోక్షం అను ముద్రిత గ్రంథములు రచించడము జరిగినది! అటుపై 11-3-2019 సం!! మహాశివరాత్రినాడు మాకు మా ముత్తాత అంశయైన మా సూక్ష్మశరీర కపాలమోక్షం పొందడము జరిగినది! అనగా మా మాడు మధ్యభాగ బ్రహ్మరంధ్రము నుండి తెల్లని పదార్ధము ఒక చారిక లాగా బయటికి వచ్చినది! మోక్షమంటే చనిపోవడము గాదని తెలుసుకొండి! ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధకర్మలను కర్మశేషము లేకుండా పూర్తిచేసుకుని...వాటి నుండి విముక్తి పొంది...ఆ శరీరము మనో నిశ్చలస్ధితి పొందినట్లు అన్నమాట! అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట! ఇలా మన శరీరములో ఉన్న పంచశరీరాలు అనగా స్ధూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి మోక్షస్ధితిని పొందాలి అన్నమాట! అదే జీవసమాధి అంటే మరణించడము అన్నమాట! అనగా మన పంచశరీరాలు పంచకపాలస్ధితికి చేరుకొని ఏకకాలములో ఒకదానితర్వాత మరొకటి విభేదనము చెందుతూ పరమశూన్యము నందు ఐక్యం చెందడమే జీవసమాధి అవుతుంది! అనగా యోగసిద్ధి పొందటం అవుతుంది! అలాగే ఈ ముత్తాత కి ఆడసంతానము యొక్క పెద్ధకుమారుడు ఘంటసాల సాయిబాబా గూడ శబ్ద, అనుభవ బ్రహ్మజ్ఞాని అయ్యి మాకు భౌతిక గురువైనారు! వీరి గూర్చి మీకు విచిత్ర వేదాంతి అనే అధ్యాయములో వస్తుంది! నేనేమో ఈ ముత్తాత యొక్క ప్రధమ కుమారుడి యొక్క ప్రధమ కుమార్తె యొక్క ద్వితీయ పుత్రుడిని అన్నమాట!


          ఇక ప్రస్తుత విషయానికి వస్తే విగ్రహరాధన కోసము దుర్గామాత విగ్రహమును తీసుకోవాలని నేను నిశ్చయించుకోవడము జరిగినది! విగ్రహలు అమ్మే కొట్టుకి వెళ్ళడము జరిగినది! అక్కడ అంగుళము నుండి ఆరు అడుగుల పంచలోహ విగ్రహమూర్తులు కనిపించాయి! అందులో ఏ విగ్రహనికి నిజ దైవత్వమున్నదో...ఎలా కనిపెట్టాలో అర్ధమవ్వక జుట్టు పీకుంటున్న సమయములో... ఒక 35 సంవత్సరాలు ఆవిడ ఎరుపు రంగు చీర- నల్ల జాకెట్టు వేసుకున్న ఆవిడ నా దగ్గరికి వచ్చి పది రూపాయలు అడిగి తీసుకుని… నావైపు అమాయకంగా చూస్తూ...ఒక అంగుళము ఉన్న పంచలోహ దుర్గావిగ్రహమును నా చేతిలో పెట్టగానే...ఎవరో ఆ సమయములో గుడి గంటలు మ్రోగించడము...అటుపై ఈ స్త్రీ మూర్తి కనిపించకపోవడము జరిగిపోయినాయి!ఆ తర్వాత నేను అమ్మవారికి ముత్తయిదువు వస్తువులు సమర్పించి... అమ్మవారు ఇచ్చిన ఈ అమ్మవిగ్రహమూర్తిని తీసుకొని మా ఇంటికి రావడము జరిగినది! దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించినాను!

ఇలా దాదాపుగా మూడు దేవినవరాత్రులు జరుగగా...అనుకోకుండా మరుసటి దేవినవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సమయములో...ఒక విచిత్ర సంఘటన జరిగినది! అది ఏమిటంటే...మా ఇంటికి మా మామయ్య వచ్చి"ఓరేయ్! పవనా! నీకు ఒక విషయము చెప్పాలని వచ్చినాను! అది ఏమిటంటే మన ముత్తాతలు పూజించిన బాలదుర్గ బంగారపు యంత్రమును నా అవసరాలకి తాకట్టు పెట్టడము జరిగినది! దానికి ఈ రోజుతో గడువు ముగుస్తుంది! దానికి డబ్బులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు! ఈ బాకీ కట్టకపోతే ఆ యంత్రమును కరిగించి ఏవో వస్తువులుగా తయారుచేసి అమ్ముకుంటాడని నాతో చెప్పడము జరిగినది! నాకు అలా చెయ్యడము ఇష్టము లేదు! రాత్రి అమ్మవారు నా కలలో ఉగ్రస్వరూపముగా కనిపించి...చేతిలో చిన్న అంగుళమున్న దుర్గావిగ్రహమూర్తిని చూపించి...అటుపై నిన్ను చూపించినది అని చెప్పగానే...అసలు వాడు ఏ యంత్రము గూర్చి చెపుతున్నాడో నాకు మొదట అర్ధము కాలేదు! ఆ తర్వాత వాడి దగ్గర నుండి వాడికి తెలిసిన ఈ యంత్ర వివరాలు నాకు చెప్పేసరికి నాకు బుర్ర తిరగడము మొదలైంది!కేవలము 3వేల రూ!!లకి మన ముత్తాతలు తయారుచేసిన మహిమాన్వితమైన యంత్రమును తాకట్టు పెట్టినందుకు వాడిమీద వీర్రావేశము కలిగి నానాబూతులు తిట్టి...ఆ యంత్రము విడిపించటానికి సమయానికి నా దగ్గర గూడ డబ్బులు లేకపోతే ... మా అన్నయ్యని అడిగి… వాడు డబ్బులున్న ఇవ్వనని అనేసరికి బాధ వేసి...వెంటనే మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి...ఆ మూడు వేలు వీడి దగ్గర అప్పుగా తీసుకొని...ఆ తాకట్టు నుండి ఈ యంత్రమును విడిపించడము జరిగినది! అపుడే ఈ యంత్రమును చూడటము జరిగినది! ఇలాంటి యంత్రము ఒకటి ఉన్నదని తెలుసుకోవడము అదే మొదటిసారి అన్నమాట! మా మామకి ఈ యంత్రమును తిరిగి ఇచ్చి ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యవద్దని చెప్పి...నేను ఇంటికి బయలుదేరినాను! నేను నా నవరాత్రి పూజ హడావుడిలో ఉండగా... సరిగ్గా దుర్గాష్టమి నాడు మళ్ళీ మా మామ నా దగ్గరికి ఈ యంత్రముతో వచ్చి... “దీనికి వారసుడు నేనేయని...రాత్రి అమ్మవారు కలలో కనిపించి చెప్పినదని” వాడు చెప్పితే…నేను నమ్మలేదు! “నా కలలో గాని, ఇలలో గాని ఈ అమ్మవారు కనిపించి చెప్పితే అపుడు నమ్ముతాను...అపుడిదాకా ఈ యంత్రమును నేను తీసుకోను” అని చెప్పినాను! ఆ రోజు దుర్గాష్టమి...పూజ కోసము అన్నీ సిద్దము చేసుకుంటుండగా...ఎవరో నా వీపుమీద గట్టిగా చాచి కొట్టి…. “వాడికి  చెప్పినది చాలకా...నీకు గూడ చెప్పాలా...నేనే వచ్చినానమ్మవా?”  అని అరిచినట్లుగా అనిపించినది! చుట్టూ చూస్తే ఎవరు కనిపించలేదు...కేవలము ఆశరీరవాణి మాత్రమే వినబడినది!ఆ సమయములో నా ముందున్న పూజపళ్లెములో నాకు వచ్చిన దుర్గమ్మవారి విగ్రహము ఎవరి ప్రమేయము లేకుండా కదులుతూండేసరికి...నాలో తెలియని భయమును చూసి మా మామ చిరునవ్వు నవ్వి"శంఖములో పోస్తే గాని తీర్ధము గానట్లుగా...ఆమె కొడితే గాని నీకు నేను చెప్పినది నిజమని నమ్మలేదు అంటూ...మా పూజపళ్ళెములో తను తెచ్చిన యంత్రమును పెడుతూ... “గత జన్మలలో ఎవరైతే దీనిని గీసి అర్చించినారో...మళ్ళీ ఈ జన్మకి వాళ్ళ దగ్గరికే చేరేటట్లుగా చేసినావా అమ్మ” అంటూ... ఆ యంత్రమును అందులో పెట్టి మౌనముగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు! ఈ యంత్ర అనుభవాలు మీకు తెలియాలంటే...మా ఆఙ్ఞాచక్ర అనుభవాలు వచ్చేదాకా వేచిచూడక తప్పదు!

దానితో నేను దుర్గాదేవి మూర్తికి మా తాతలు ఆరాధించిన స్వయంభు బాలదుర్గా యంత్రమును అనుసంధానము చేసి ఆరాధించడం మొదలు పెట్టినాను! దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించినాను! వీలున్నప్పుడల్లా ఆమెకు గారెలు, పులిహోర నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది! అలాగే ఎప్పుడైనా కావాలి అంటే ముత్తైదువు వస్తువులు సమర్పించడం జరుగుతుంది! కానీ విచిత్రం ఏమిటంటే ఇంటిలో నెలసరి రోజులు జరిగిన తర్వాత ఇంటిని శుద్ధి చేయకపోతే మా ఇంటి లోని వాటర్ ట్యాంక్ లోంచి నీళ్లు వాటంతట అవే బయటకు వచ్చి ఇంటిని శుద్ధి చేయటం మొదలవుతుంది! ఇదే ఆమె ప్రస్తుతం నాకు చూపిస్తున్న ప్రత్యక్ష అనుభవం! అలాగే దేవీ నవరాత్రులు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపములో ఒక స్త్రీ మూర్తిగా మా ఇంటికి వచ్చి అంటే తెలిసిన వారు లేదా తెలియని వారు రావచ్చును! ఆరోజు ప్రసాద నైవేద్యాలు తిని సంతోషంగా వెళ్లిపోవడం …. ఇది ఇప్పటికీ నాకు విచిత్ర సంఘటన లాగానే ఉన్నది!

నేను మహిమాన్వితమైన బాలదుర్గ యంత్రము ఆరాధన వలన మనస్సు శుద్ధి అవుతున్న కొద్దీ… మనలో దైవత్వ లక్షణాలు కనిపించడము మొదలైనాయి! వీటితో పాటుగా సమ్మోహన, ఆకర్షణ, తేజస్సు వంటివి మొదలైనాయి! తద్వారా స్త్రీమూర్తులు మళ్ళీ యధావిధిగా… నా మాటలకి, నా చూపులకి, నా చేష్టలకి ఆకర్షితులై…వారికి తెలియకుండానే నా సమ్మోహన మాయలో పడటం మొదలు పెట్టినారు! తిరిగి కర్మ మార్గం లో ఉన్నప్పుడు ఆడవాళ్ళ సమస్యలు, అవమానాలు, అనుమానాలు తిరిగి మళ్ళీ భక్తిమార్గంలో కనిపించడం మొదలైంది! దానితో నాకు ఈ భక్తి మార్గం కూడా నా వంటికి సరిపడదని గ్రహించాను! నా పరిస్థితి ఇలా ఉంటే మన జిజ్ఞాసి ఎంచుకున్న శ్రీరాముడు విగ్రహరాధన వలన …. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి! వాడిని చూస్తే శ్రీరాముడు నిజంగానే ఇలా ఉంటాడా అని అనిపించేది! కేవలం మూడున్నర సంవత్సరాలలో సాక్షాత్తు శ్రీరాముడు నోటి నుండి పుట్టిన వాడిలాగా వీడి ఉపాసన వలన ఆయన రూపం లోనికి మారిపోయాడు! కానీ నాకు ఆడవాళ్లు ఆకర్షితులు అయితే మన వాడికి మగవాళ్ళు ఆకర్షించటం మొదలుపెట్టినారు! పనిమాలా వీడి దగ్గరికి వచ్చి వీడి బుగ్గల నొక్కటం, స్పర్శ కోసం తపన పడటం చూసేసరికి… మనవాడిలో భయం మొదలైంది! ఇలాంటి చేష్టలు ఎవరైనా చూస్తే తను తేడా అనుకునే ప్రమాదం ఉందని గ్రహించి… నెమ్మది నెమ్మదిగా శ్రీరామ ఉపాసన అలాగే నేను బాలాదుర్గయంత్రోపాసనను తగ్గించడము మొదలు పెట్టినాము! శ్రీరామ ఉపాసన వలన తను కేవలం శ్రీరాముడు రూపమును పొందుతున్నాను గాని తన సాధన పరిసమాప్తి చేసే మార్గం దొరకటం లేదని పలు విధాలుగా బాధపడేవాడు! తను మరో రామావతారం గా మారినంత మాత్రాన సాధన పరిసమాప్తి కాదని అలాగే నేను మరో దేవి రూపంగా మారినంత మాత్రాన ఉపయోగం లేదని మా ఇద్దరికీఅర్థమైంది! భక్తిమార్గంలో ఉంటే వారి ఇష్ట దైవ రూపాలుగా వారి ఉపాసన స్థాయిని బట్టి మారతారని వివిధ దైవ ఉపాసకులను చూసి గ్రహించి నాను! ఇలా మారటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు! ఎందుకంటే అసలు దైవ స్వరూపాలు సృష్టించింది ఎవరు? వారికి వారే ఏ కారణం చేత సృష్టించబడినారో తెలుసుకోవాలనే …. తపన మా ఇద్దరిలో ఆగటంలేదు! దాంతో మేము కూడా కర్మ, భక్తి మార్గాలకు తిలోదకాలిచ్చి జ్ఞానమార్గం వైపుకి అడుగుపెట్టి నాము! మరి ఇంకా ఆలస్యం ఎందుకు…. మీరు కూడా మాతో పాటు ముందుకు ప్రయాణం చేయండి!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

***************
గమనిక: అందరికి తమ ఆఙ్ఞాచక్ర స్ధితి వద్ద దుర్గాదేవి ఆరాధన వస్తుంది! అలాగే ఈ ఆరాధన వలన మనం ఈమె అనుగ్రహమును పొందితే మనకి బ్రహ్మరంధ్రము వద్ద ఆదిపరాశక్తి యొక్క త్రివిధ రూపాలలో అనగా దీపదుర్గ, దీపకాళిక, దీపచండి రూపాలలో మనకి కపాలమోక్షము దీపదుర్గ ఇచ్చేఅవకాశము కలుగుతుంది! మాకు మాత్రము దీపదుర్గ ఇస్తే...మా జిజ్ఞాసికి దీపచండి కపాలమోక్షము ఇచ్చినది! ఎందుకంటే ఈ ఆఙ్ఞాచక్రము వద్ద వచ్చిన దుర్గాదేవిని మనవాడు పూజించలేదు!నేను చేసిన విగ్రహరాధన వలన నాకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో మీకు తెలుసు గదా! కొన్ని నెలలకి నేను నిత్యం చేసే గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు 24 గురువులు 24 అస్త్రాలు ఉన్నారని శబ్ద పాండిత్యము ద్వారా తెలుసుకుని…. ఈ 84 దైవ విగ్రహ మూర్తులలో నాకిష్టమైన రూపముగా మహా శివ లింగ మూర్తి ని….  ఇష్టదైవంగా దుర్గామాతను… గురువుగా శిరిడి సాయి బాబాను….  ఇష్టమంత్రముగా గాయత్రి మంత్రమును…. ఆరాధిస్తూ వచ్చేవాడిని! మిగతా దేవతామూర్తులను మూటకట్టి బీరువాలో ఉంచడం జరిగింది! రానురాను ఈ శివుడిని, దుర్గామాతను, శిరిడి సాయి బాబా వారిని కూడా పూజించడం మానివేసి…

ఏక స్వరూపముగా సకల దైవ స్వరూపముగా విశ్వ శక్తి, కాంతి శక్తి ఉన్న నవ పాషాణ ఇష్టలింగమును నా ప్రాణ లింగేశ్వరుడు గా మెడలో ధరిస్తూ …. నిత్య శివదీక్ష గా పూజించే స్థాయికి చేరుకున్నాను! అనగా మూలాధార చక్ర స్థితి గణపతి నుండి అంతిమ చక్ర స్థితి అయిన హృదయ చక్ర శక్తి అధిపతి అయిన ఇష్ట లింగేశ్వరుడు వరకు వచ్చినాను! అనగా సోమవారం పూజ తో అనగా శివపూజ తో మొదలైన నా పూజలు తిరిగి హృదయ చక్ర వాసిని ఇష్ట లింగేశ్వరుడితో ఆగిపోవటం విచిత్రమే కదా! కాబట్టి మీరు కూడా నేను చేసిన తప్పు చేయకండి! మీకు ఉన్న లేదా వచ్చే వాటి దేవతా విగ్రహమూర్తులను మీ పూజా మందిరంలో ఉంచండి! కాకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరము లేదు! ఇక అమితంగా ఇష్టపడే దైవ స్వరూపమును ఒకదానిని ఎంచుకోండి! దానికే ప్రతి రోజు పూజలు చేయండి! ప్రార్థించండి! నివేదనలు అర్పించండి! హారతిని ఇవ్వండి! ఆయనలోన లేదామీ లోనే సకల దేవతలు ఉన్నారు అని గ్రహించండి! ఒక గోమాత లోనే 36 కోట్ల విశ్వ దేవతలు ఉంటారని శాస్త్రవచనము కదా! అలాగే మీరు ఎంచుకున్న మీ ఇష్ట దైవము లో ఉండకుండా పోతారా ఆలోచించండి! ఖచ్చితంగా ఉంటారు కదా! ఉదాహరణకి మీ ఇష్టదైవం శివుడు అనుకోండి! వీరిని గణపతి లోనూ, అమ్మవారి లోనూ, బాబా వారిలోనూ, ఇలా మీకు కావాల్సిన రూపాలలో శివ రూపం చూసుకోవడం అలవాటు చేసుకోండి! అనగా శివ గణపతి గాను, శివాని గాను, శివ సాయి గాను, అన్నమాట! ఇలా మీరు అన్ని రూపాలలో మీ ఇష్ట రూపము చూడగలిగితే విగ్రహరాధన నుండి త్వరలోనే విశ్వారాధనకి వస్తారు! అనగా విగ్రహములో దేవుని చూసే మీరు కాస్త…. మానవుడిలో మాధవుడిని చూసే ఆత్మనివేదన భక్తి స్థాయికి రాగలుగుతారు! ఇవి మీకు సాధ్య పడాలి అంటే మీరు ఏకైక ఇష్టదైవమును మాత్రమే పూజించాలి… నమ్మకం ఉంచుకోవాలి… విశ్వసించాలి… ఆరాధించాలి! మీ ఏకైక ఇష్టదైవమునకు నిత్యపూజలు చేసుకోవాలి! నిత్య మంత్రాలను చేసుకోవాలి! నిత్య మంత్రారాధన చేసుకోవాలి! నిత్య దైవారాధన చేసుకోవాలి! నిత్యం ధ్యానం చేసుకోవాలి! తద్వారా మీకు దైవ అనుభవ అనుభూతులు కలుగుతాయి! తద్వారా మీకు మీ ఇష్ట దైవ అనుగ్రహమును పొంది మీ ఇష్ట దైవ సాక్షాత్కరమును పొందడము జరుగుతుంది! గాకపోతే ఇలాంటి ఏకత్వ భావస్ధితి అన్నింటయందు కల్గడము అంత తేలికైన విషయం కాదని గ్రహించండి!

















2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeru vigrahalu enchukovatam opicaga sarva devathapujalu cheyatam, masi pattinchatam aakhariki durga ammavaarini pujinchatam...okkarike enduku cheyyali cheppatam bagundi....

    రిప్లయితొలగించండి