అధ్యాయం 7


ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నించటం

సత్రంలో నిద్ర లేచి కాఫీ తాగుతూ …శ్రీశైలంలో జరిగిన వయోవృద్ధుల సంఘటన మరియు కలగా వచ్చిన నగ్న యువకుడి దర్శనము సంఘటనను గుర్తు చేసుకుంటూ… నిజంగా వీళ్లు ఎవరు? దేవుళ్ళు ఉన్నారా లేదా? దేవుళ్ళు లేదా దయ్యాలు ఉంటే మనుషుల్లాగే ఎందుకు లేరు? బాగా వృద్ధులుగా ఎందుకు ఉన్నారు ?లేదా కాపాలికులు అయితే నిజంగా వండుకుని తినొచ్చు కదా! నేను చూసిన దృశ్యం నిజం కాకపోతే నేను ఎందుకు భయపడాలి? నిజమైతే నాకు అనిపించాలి కదా అవి నిజంగా జరిగిన సంఘటన అని…. నాకు అలా అనిపించడం లేదు… అంటే ఈ సంఘటన జరిగిన జరగలేదా… జరిగి జరగనట్లుగా ఉన్నాయా… ఏమీ అర్థం కావడం లేదు? ఇప్పుడు ఏం చేయాలి? 

గుడి లోపల ఉన్న త్రిఫలా చెట్టు కిందకి చేరుకుని ఆ రోజు చేయవలసిన గాయత్రి అనుష్టానము పూర్తి చేసుకుని ధ్యానము చేసుకోగానే  … అప్పుడు యధాలాపంగా ఘంఠా మఠము లో ఉన్న ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం నా కళ్ళముందు కదలాడింది! దానితో సత్రానికి చేరుకున్నాను! ఇక్కడ ఉన్న నా వయస్సు ఉన్న బంధువులు అందరితో … వారితో ఈ విషయం గురించి అనగా ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం చెప్పి విమాన ఖర్చు లేకుండా విమానంలో లాగా ఆకాశంలో ఎగర వచ్చునని… నేను వారితో నాకే తెలియని విషయం గురించి వారికి ఆశ కల్పించి… ఆకాశ సిద్ధి ప్రయత్నం చేయాలని పురికొల్పడం జరిగినది! నాతో పాటుగా ధైర్యవంతులు అని… ఉత్సాహవంతులను ముగ్గురిని ఎంపిక చేసుకుని మధ్యాహ్నము 12:00 గంటలకి ఘంఠా మఠము వైపు అడుగులు వేయడం జరిగినది! అక్కడ మేము చేసే పనికి అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో… నాకు మాత్రం తెలియని భయంతో ఆ చెప్పిన విధంగా నేను ఆ  పెద్ద గంట ను ఆపకుండా మ్రోగించే విధంగా … మాలో ఒకడు 108 నీటి బిందులు నీళ్ళు తోడే టట్లుగా… అలాగే మరొకడు ఆ నీటిని అక్కడ ఉన్న శివలింగం మూర్తి మీద పోసేటట్లుగా…  మరొకడు శివ పంచాక్షరి మంత్ర ప్రాణాయామం చేసేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము! ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆకాశంలోకి వెళతాడని తెలుసుకుని మాలో ఉన్న ఒక ధైర్యవంతుడికి ఈ పని అప్పజెప్పి … అందరూ తలా ఒక పని చేయడం ప్రారంభించాము!
ఈ క్రతువు పూజ మొదలైంది! రాత్రి ఇక్కడ జరిగిన అనుభవాల దృష్ట్యా నాలో తెలియని భయం మొదలైంది! ఎవరికీ చెప్పుకోలేని… బయటికి కనిపించకుండా ఉండటానికి… నాలో నేను తంటాలు పడుతూ ఆ పెద్ద గంట మోగిస్తున్నాను! ఈ పెద్ద గంట శబ్ధానికి ఎవరైనా బయటి వాళ్లు వచ్చి తిట్లు తిడతారేమోనని భయం… అయినా ఏదో తెలియని ధైర్యం … ఆ రోడ్డు వెంట యాత్రికులు, అక్కడ ఉన్న వారు మమ్మల్ని చూసిన … ఏమి అనకుండా, ఏమి చూడనట్లుగా, ఏమి గమనించనట్లుగా,  తెలిసి తెలియనట్లు, ఏమీ తెలియనట్లుగా వెళ్ళటం నేను నా ఓరకంట ద్వారా చూస్తున్నాను! నాకైతే నోట మాట రాలేదు! 

గంట మోగుతూనే ఉంది! శివయ్యకి అభిషేకం జరుగుతుంది! నీళ్ళు తోడేవాడు తోడుతూనే ఉన్నారు! అభిషేకం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు! గంట మోగిస్తూనే ఉన్నాను! ప్రాణాయామం చేసే వ్యక్తి చేస్తూనే ఉన్నాడు! ఒక అనుకోని సంఘటన ఎదురైంది! మావాడు 98 నీటి బిందె శివ అభిషేకం జరుగుతుండగా… ప్రాణాయామం చేస్తున్న వాడు.. కాస్త ఒక అడుగు ఎత్తుగా గాలిలో ఉండటం గమనించి మిగిలిన వాళ్ళకి నేను చెప్పేసరికి …. వారికి భయంతో కూడిన ముచ్చెమటలు పోయటం…  ఒకవేళ వీడు ఆకాశంలో ఎగిరిపోతే ఎలా కిందకి దించాలి నాకే తెలీదు అనుకుంటూ ఆలోచన నాకు వచ్చేసరికి … నాలో తెలియని భయం… మిగిలిన ముగ్గురికీ ఒకేసారి స్పష్టంగా కనపడినాయి! ఏకాగ్రతగా ప్రాణాయామం వ్యక్తికి గాలిలో ఉన్న విషయం తెలియడం లేదని…. గమనించే సరికి మాలో తెలియని భయం వచ్చి … మేము చేస్తున్న పనులు ఆపి ఆ ప్రాణాయామం చేస్తున్న వ్యక్తి వైపుకి వెళ్లడం …. ఆ పనులు ఆగిపోవటంతో … గాలిలో ఎగురుతున్న వ్యక్తి దబ్బున నేల మీద పడటం ఏకకాలంలో జరిగినాయి! ఆ దెబ్బకి అతడి మూత్ర కోశం దెబ్బతిని మల మూత్ర ద్వారం నుండి రక్తం రావడం నేను గమనించే సరికి భయంతో … ఏమి జరిగిందో తెలుసుకునే లోపల నేను కళ్లు తిరిగి పడిపోవడం జరిగింది!
నేను కళ్ళు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నాను! ప్రాణాయామం వ్యక్తికి చికిత్స తర్వాత క్షేమంగా ఉన్నాడని తెలిసి నాలో తెలియని ఆనంద భయాలు వేసినది! ఇంట్లో వాళ్ళు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టినారు! అయిన బాధ లేదు! ఎందుకంటే శక్తులు ఉన్నాయని… వాటిలో ఆకాశ సిద్ధి ఒకటి ఉన్నదని… వెళ్లే విధానం తప్పు కావచ్చు కానీ చేసే విధానం నిజము గావడముతో … నాకు ఏదో తెలియని ఆనందం వేసింది! ఏదో తెలియని విషయాన్ని అంతవరకు పుస్తకాలలో… శిలాఫలకాలలో ఉన్న విషయం నిజంగా మా కళ్ళ ముందు ఒక నిజ సంఘటన లాగా అగుపించి… జరిగేసరికి నాలో నాకే తెలియని ఆనందం వేసింది! లేని వాడి కోసం వెతకడానికి మంత్ర శక్తి ఉపయోగపడుతుందని…. ఈ యోగ శక్తి అనుభవం నాకు ఏదో తెలియని ధైర్యం ఇస్తున్నట్లుగా అనిపించసాగింది! దానితో నేను మళ్ళీ మగత నిద్రలోకి జారుకోవడం జరిగినది! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

 *******************************************

గమనిక: ఇది 1994వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో ఉండగా ఈ శ్రీశైల క్షేత్రంలో జరిగిన యదార్థ సంఘటన! ఇది కల్పితం కాదు! ఇప్పటికీ అక్కడ ఆకాశ సిద్ధి ప్రయత్నించే వారి కోసం ఇప్పుడు కూడా ఆ మఠములో శిలాఫలకం ఎదురుచూస్తోంది! దయచేసి తెలిసి తెలియని వయస్సు… మిడిమిడి జ్ఞానంతో ఈ దైవ ప్రయత్నాలు చేయవద్దని నా మనవి! మంత్ర సిద్ధి గాని… ప్రాణాయామ సిద్ధి పొందిన వారికి మాత్రమే ఈ ఆకాశ సిద్ధి వచ్చిందో లేదో పరీక్షించుకోవటానికి ఏర్పాటు చేసిన విధి విధానం అని గ్రహించి జాగ్రత్తగా మసలుకోండి! ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మఠంలో శిలాఫలకం, శివలింగము, నీళ్లబావి కుండము, పెద్ద గంట మాత్రమే నామకే వాస్తుగా ఉన్నాయి ! వాటిని ఉపయోగించేవారు… ఉపయోగించే నిజ సిద్ధపురుషులు లేకపోవడంతో అవి శిధిలావస్థలో చేరుకున్నాయి! మిడిమిడి జ్ఞానంతో ప్రయత్నించి వాటి జోలికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి! ఒకప్పుడు నేను కూడ మీకు లాగానే ఉడుకు రక్తం తో వెర్రిమొర్రి వీరావేశముతో పోయి అనుభవాలు కావాలి అనుకుంటూ ప్రయత్నించిన ప్రయత్నవాదినేనని గమనించండి! ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత గాలిలోకి ఎగిరిన ప్రాణాయామ వ్యక్తికి కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకి అనంత లోకాలకు వెళ్లి పోవడం నన్ను బాధించిన మరిచిపోలేని బాధాకర సంఘటనగా మిగిలిపోయింది! విచిత్రంగా ఈ వ్యక్తికి శ్రీశైల శిఖర దర్శనము అయినది! ఇది జరిగిన వారు ఆరు నెలలు మించి బ్రతకరని… వారికి ముక్తి కలుగుతుందని… శ్రీశైల శిఖర చరిత్ర చెప్పడము జరుగుతోంది!


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించు
  2. aakasha siddhi adi ela pondalo kuda ala bommalu geesi undatam gurinchi...aakaasha siddhiki prayatninchina vyakthi kaalam cheyatam baadhakaram kaani shikara darshanam avvatam aya adrushtam...kaani ayna chanipovatam baadhaakaram

    రిప్లయితొలగించు