అధ్యాయం 94


మా అనుభవ పాండిత్య బోధనలు
                                            
( సాధకుడు ప్రశ్నలు - మా సమాధానాలు )

                                                  -      శ్రీ  పవనానంద సరస్వతి

స్వామి! నిజ జ్ఞానం పొందిన వాడు మాట్లాడనని…. మాట్లాడినవాడు ఏమి పొందనట్లుగా… చెప్తారు! మరి మీ సాధన అనుభవాలు చెబుతున్నారు కదా! మరి మీరు?

 నాయనా…  పసిపాప మనస్సున్న వాడు అలాగే సాధనలు అంతిమ సాధన పరిసమాప్తి చేసుకున్నవారికి… చెప్పటానికి… మాట్లాడటానికి… వాళ్లకి  ఏమీ ఉండదని అనుభూతి పొందటంలో వారంతా వివిధ సాధన బ్రహ్మల స్ధాయి నుండి మౌన:బ్రహ్మగా మారిపోతారు! ఇప్పుడు మేము చెప్పిన సాధన అనుభవాలు కూడా సాధన ఆరంభమునుండి సాధన పరిసమాప్తి మధ్యలో జరిగిన వాటిని మాత్రమే చెప్పడం జరిగింది! శ్రీ వేద వ్యాసుడు, వాల్మీకి, శంకరాచార్యుడు ఇలా వారంతా గ్రంధాలు వ్రాయకపోతే …. వారికి మరియు మనకు ఎలా శబ్ద పాండిత్యము వచ్చేది? పతంజలి నుండి బుద్ధుడు వరకు వారి సాధన అనుభవాల సిద్ధాంతాల ప్రచారం చేయకపోతే …. మనకి అనుభవ పాండిత్యం ఎలా తెలిసేది? మనకి సాధన విషయాలు ఎలా తెలిసేది? వీటికి వీరంతా మనకి చెప్పి మౌనముగా మారిపోయారు! అంతెందుకు… ఆదియోగి పరమేశ్వరుడు అనేక సాధన అనుభవాలు అనగా 114 దాకా మనకి చెప్పి మౌన బ్రహ్మగా దక్షిణామూర్తి గా ఉన్నాడు కదా! ఆయన లోకానికి ఈ విజ్ఞానం అందించడం వలన ఆయన నిజ బ్రహ్మజ్ఞానము పొందినాడో లేదో నీవే ఆలోచించు! అంటే వారి సాధన అనుభవాలు చెప్పడం… ఆ తర్వాత వారు మౌనంగా మారిపోవడం జరుగుతోంది! నిజ బ్రహ్మజ్ఞాని పొందే అంతిమ సాధన స్థితి మౌన బ్రహ్మ స్థితి అని తెలుసుకో!  అంటే సాధనలో అనుభవాలు తెలుసుకోవాలి… అంటే తెలుసుకోక తప్పదు…. ఇతరులకి చెప్పక తప్పదు … ఆపై మౌనం వహించక తప్పదు! ప్రస్తుతం మేము కూడా మా సాధనా విషయ అనుభవాలు మీకు చెప్పడంతో ఆపై మేము గూడ మౌనం వహించి … మౌన బ్రహ్మగా మారక తప్పదు!
 
 
1.  దేవుడు ఉన్నాడా ? 
నామ రూపాలు ఉన్న దేవుడు లేడు! కబీర్ దాస్ అన్నట్లుగా వీరంతా ఉన్నట్లుగా కనిపించే భ్రమ,భ్రాంతులు అని మన సాధనలో వీరు కనపడతారని..వీరిని దాటుకుని ముందుకు వెళ్ళాలని లేదంటే మనకి మనమే మహా మోహమాయలో పడతామని చెప్పడము జరినది! అలాగే రామకృష్ణ పరమహంస...నామదేవుడు.. తోతాపురి...ఇలా ఎందరో యోగుల అనుభవాలతో చూస్తే మా అనుభవ అనుభూతి సత్యమని తెలిసినది. నామ రూపాలు లేని అనంతుడు… సర్వాంతర్యామి కాస్తా అంతర్యామి గా … విశ్వ శక్తి కాస్తా దైవ శక్తి గా …ఈ విశ్వమంతా (సర్వాంతర్యామి గా), మనలో (అంతర్యామి గా) విస్తరించి ఆవరించి వ్యాప్తి చెంది మహా శూన్యము లో సర్వేశ్వరుడు శూన్య బ్రహ్మ గా ఉన్నాడు! ఈయనే నిరాకార పరబ్రహ్మంగా పరమ శూన్యము గా ను …. ఆకార పరబ్రహ్మంగా బ్రహ్మకపాలంగా ను …. సాకార పరబ్రహ్మంగా చితాగ్ని యే పరంజ్యోతి స్వరూపము గా ను ఉన్నట్లుగా మేము అనుభవ బ్రహ్మ జ్ఞాన అనుభూతి పొందినాము!
 
2.    దేవుడు నిజ స్వరూపం ఏది?
ఆది దేవుడు అనేవాడు ఒకప్పుడు ఉన్నాడు! పుట్టి పెరిగి జీవసమాధి చెందినాడు! ఆయనే నామరూప ఆది బ్రహ్మగా ఖ్యాతి చెందినాడు! ఇప్పుడే ఆయన ఆది బ్రహ్మకపాలం గా బ్రహ్మరంధ్రము నందు 36 కపాలాలతో  ఆది సదాశివమూర్తి గా శూన్య బ్రహ్మ గా ఉన్నాడు! ఈ మూల బ్రహ్మకపాలమునకు ప్రాణము ఉండటం వలన జ్ఞాన శక్తి వలన తన సంకల్పాలతో సృష్టి స్థితి లయలతో అండ,పిండ,బ్రహ్మాండాలను నడిపించే విశ్వంలో జగన్నాటకము తో నిజము లాంటి కల లాంటి మాయ భ్రమ భ్రాంతులతో జగన్నాటకం ఆడుతోంది! అందుకే మన దేవుళ్ళు కూడా పుట్టి పెరిగి శరీర త్యాగం చేశారు! ఇప్పటికీ చేస్తున్నారు! శివుడు, శివాని, విష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ,బుద్ధుడు, షిరిడి సాయి బాబా, అల్లా, ఏసుప్రభు, గురు నానక్, మహావీర్ ఎందరో దేవుళ్ళు, ఎందరో యోగులు, ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు శూన్య బ్రహ్మ స్థితికి వచ్చి శరీర త్యాగం చేస్తున్నారు! నామ రూపాలు ఉన్న దేవుడు గా పూజలందుకుంటున్నారు!

3.  దేవుడంటే ఎవరు ?
 పసిపాప మనస్సున్న వాడు… పరిపూర్ణమైన నిజమైన ప్రేమ ఉన్నవాడు… నిష్కామ పరుడు… నిస్వార్థపరుడు… ప్రతిఫలాపేక్ష లేనివాడు… దేనిని ఆశించని వాడు… దేనిని కోరనివాడు… అన్నిటియందు సమదృష్టి సమదర్శనం పొందేవాడు… వివేక జ్ఞానబుద్ధి కలిగిన వాడు… ఇతరులను రక్షించువాడు… ఓర్పు, సహనం కలిగిన వాడు… సర్వస్యశరణాగతి కలిగిన వాడు… పాప కార్యాలు చేయాలంటే భయపడేవాడు.. అన్నిటియందు నమ్మకం కలిగిన వాడు… ధర్మనిష్ట కలిగిన వాడు…. ధర్మ జీవితమును జీవించేవాడు… ధర్మ సంపాదన కలిగిన వాడు… దాన గుణం కలిగిన వాడు… దేనికీ భయపడని వాడు… అంతెందుకు కౌరవ సభలో ద్రౌపది కి అవమానం జరుగుతున్నప్పుడు రక్షించినవాడు శ్రీకృష్ణుడు కావటం వలన ఆయనే దేవుడు అయినాడు! అలాగే అక్కడ ఉండి దీనిని ప్రతిఘటించడం వలన అశ్వద్ధామ మరణ అవస్థ లేని చిరంజీవి తత్వమును పొంది చిరంజీవి అయినాడు! ఇప్పటికీ ఈయన హిమాలయాల్లో సంచారం చేస్తున్నాడు! అక్కడున్న యోగులకి ,సాధకులకు, గురువులకు సంవత్సరంలో ఏదో ఒక సమయంలో కనపడతాడని తమ అనుభవాలలో హిమాలయ గురువులు చెప్పడం జరిగింది! అలాగే షిరిడి సాయి బాబా వారు “ పసిపాప మనస్సున్న ప్రతి మనిషి లోను పరమాత్మ ఉంటాడని” చెప్పడం జరిగింది!
 
4.  అవును మరి…. మీరు ఎవరు స్వామి?
           మౌనము 
 
5.   స్వామి! మీరు మౌనం వహిస్తే నువ్వు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది?
 
 ఇక్కడ తెలియటానికి ఏముంది! నామ రూపాలు లేనివాడిని! ఆత్మస్వరూపం కానీ వాడిని! ఉన్నానో  లేదో తెలియని వాడిని! మోక్ష ప్రాప్తి కలిగిందో లేదో తెలియని వాడిని! ఉల్లిపాయ పొరలు తొలిగిపోతే ఉల్లిపాయ ఉంటుందా… ఏవైనా మిగులుతుందా… ఉల్లిపాయలాంటిస్థితి మా స్థితి! దాని గురించి ఏమని చెప్పాలి! ఎలా చెప్పాలి! మేము శూన్యంలో ఉన్నామని… మేమే శూన్యమని మాకు అనుభవ జ్ఞాన అనుభూతి కలిగింది! అనుభూతిని చెప్పలేము కదా! అనుభవం నీకు తెలియదు! అనుభవం మీకు చూపించలేము!
 
 
6.  మరి మీరు నామరూప దేవుని చూశారా?
 
చూడలేదు! ఉంటే కదా చూడటానికి! ఆయనను చూడటానికి వెళ్తే నే బ్రహ్మరంధ్రం వద్ద మూలక పాల దర్శనము! ధ్యానము లో ఉన్న అస్థిపంజరము కనపడినది! అది కూడా 36 కపాలాల తో కనపడినది! పైగా చితాగ్ని లో దహనం అవుతూ.. ఇదే బ్రహ్మరంధ్రము వద్ద మనకి అగుపించే పరంజ్యోతి స్వరూపము! దీనికి అధిపతి గా ఆదిపరాశక్తి ఉంటుందని… అది కూడా మూడు రూపాల్లో ఉంటుందని అనగా దీప దుర్గా, దీప కాళీ, దీప చండీమాత గా ఉంటుందని శాస్త్ర వచనము! మేము ఈ నామ రూప దర్శనాలు పొందడం జరిగినది! ఇవి నిజముకాదని మాయ భ్రాంతు లేనని తెలుసుకుని వీటిని దాటుకుని వెళితే మాకు పరమ శూన్య దర్శనం అయింది! శూన్యము అక్కడ మేము లేము! దైవ స్వరూపాలు లేవు! నామరూపాలు లేవు! ఆత్మ లేదు! మనస్సు లేదు! శరీరం లేదు! నేను, నువ్వు లేవు! నాది నీది లేదు! ఏమి ఉన్నదో తెలియని స్థితి! అంత ఒకటే స్థితి! ఇది ఎలా ఉంటుందంటే గది బయట ఉన్న వాడు గది లోపల ఏమున్నదని లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేకపోగా.. కనిపించకపోగా.. చూసేవాడు.. చూసేది లేకపోవడం జరిగినది! అంటే శూన్యము కాస్తా శూన్యమైనది! శూన్యం శూన్యం అన్నమాట! అంటే చూడటానికి ఉల్లిపాయ కనపడుతుంది! చివరికి దాన్ని పొరలు తీసుకుంటూ వెళ్ళిపోతే ఉల్లిపాయ కనపడుతుందా?.. ఆలోచించు! ఇలా ఉల్లిపాయ లాంటివాళ్ళు మీరు చెప్పే నామ రూప దేవుళ్ళు అని గ్రహించు! వీళ్ళని దాటుకుంటూ పోతే ఉల్లి పొరలు తొలిగిపోయి నట్లుగా చివరికి మనకి ఉల్లి లేనట్లుగా ఎలా అయితే కనపడుతుందో అలా మాకు వీరందర్నీ దాటుకుంటూ వెళితే ఏమీలేని పరమ శూన్యము కనపడింది! మరి ఈ లెక్కన మీ నామ రూప దేవుళ్ళు ఉన్నారో లేదో ఆలోచించుకో ? సాధన ద్వారా స్వానుభవం పొందితే కానీ మా స్థితికి రాలేదు! ఆ స్థితికి రానంత వరకు నీవు తెలుసుకో లేవు! అప్పటిదాకా మేము చెప్పినది నమ్మలేని స్థితిలో ఉంటావు!
 
 
7.  మరి మీరు త్రిమూర్తులను చూశాను.. శ్రీకృష్ణుని చూశాను.. దక్షిణామూర్తి ని చూశాను ..చిన్నమస్తా దేవిని ఇలా మీ అనుభవాల్లో చెప్పినారు కదా మరి వాళ్ళు ఎవరు?
 
 నిజానికి వీళ్లంతా ఆయా చక్ర స్థితులలో అనగా మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము వద్ద వరకు మాకు మూల గణపతి నుండి మూల కపాల దర్శనము అయ్యే మధ్యలో ఉన్న 13 చక్ర స్థితులలో 36 రకాల నామ రూప దైవ దర్శనాలు కనిపించాయి! అగుపించాయి! కానీ నిజానికి వీళ్లంతా గత జన్మలలో మేము ఎత్తిన అవతార రూపాలే అని నా రూపాలను నాకు నేనుగా చూడటం జరిగినది! ఆదిలో నేను పరమాత్మనే! కానీ జ్ఞాన  మాయ ఇచ్చే అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానము మరిచి పోవుట వలన నేను పరమాత్మ అనే విషయం మర్చిపోయి పరమాత్మ గా ఉన్న మేము కాస్త జీవాత్మగా అంటే పీజీ చదివినవాడు అన్నీ మరిచిపోయి ఎల్కేజీ చదవడం ఎలాగో అలా మేము పరమాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయి కు వచ్చినాము ! మళ్లీ యోగ సాధన ద్వారా మర్చిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకుని వివిధ చక్రాల లో ఉన్న నేను ఎత్తిన దైవ స్వరూపాలను అనగా 36 రూపాలను మళ్ళీ మేము చూడటం జరిగింది! అంటే నా రూపాలను మళ్లీ తిరిగి నేను చూడటం జరిగినప్పుడు అందులో నేనే ఉన్నప్పుడు ఇంకా తేడా ఏమిటి? అంతా నేనే అయినప్పుడు… నేను ఉన్నప్పుడు.. నేనై యున్నప్పుడు… అంత ఒకటే కదా మరొకటి లేదు కదా! మరో రూపం ఉండదు కదా! మేము గుర్తు చేసుకున్న రూపాలను మీకు చెప్పడం జరిగినది!
 
8.  మరి దైవ సాక్షాత్కారం పొందిన వారి పరిస్థితి ఏమిటి?
       నిజానికి దైవసాక్షాత్కారం అనేది వారి ఇష్టముగా పూజించే ఆరాధించిన దైవాన్ని చూడటమే కదా! కానీ దైవ స్వరూపం నువ్వే అని తెలియనంత వరకు నువ్వు వేరు … వాళ్ళు వేరు అనుకుంటున్నావు ! అంతా నువ్వే ఉన్నావు ఉన్నప్పుడు మరి దైవం అనేది వేరుగా లేదు కదా! మరి ఇంకా కొత్తగా సాక్షాత్కార ప్రసక్తి ఏముంటుంది? మన సాధనను ముందుకి వెళ్ళనీయకుండా సాక్షాత్కారాలు అనేది మనస్సు చేసే భ్రమ భ్రాంతులను ఆపేది అన్నమాట! రామకృష్ణ పరమహంస మొదట్లో తన ఇష్ట దైవంగా కాళీ మాతను పూజించి ఆరాధించి సాక్షాత్కారం పొందినారు అని చెప్పినారు కదా! చివరికి వచ్చేసరికి అమ్మ లో ఉన్నది నేనే! నేనే అమ్మను! నేనే అమ్మను… అమ్మ నేనే ! అని ఆయనకాయనే పూజించు కున్నారు కదా! ఈ తేడా ఎందుకు వచ్చిందో ఆలోచించు? మూలం తెలుస్తుంది! ఇదే సాక్షాత్కార వాదన అవుతుంది! 

9.  ఈ లెక్కన చూస్తే నామరూప దేవుడు ఉన్నట్లే కదా?
                 నువ్వు ఉన్నావ్ అని అనుకుంటే ఆయన ఉన్నట్లే! నువ్వే ఆయన కాబట్టి ! నామ రూపాలు అనేవి భగవంతుడు యందు నమ్మకం కలిగించే విగ్రహమూర్తులే! నిజానికి విగ్రహమూర్తి లో ఏమీ లేదు… మీ నమ్మకశక్తియే ఉంది! ఆయన ఈ విగ్రహంలో ఉండి నీ కష్టాలు తీరుస్తాడు అనే నమ్మకం మాత్రమే ఉంది! ఈ నమ్మకమును విగ్రహాలకే పరిమితం చేయకుండా విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధన కి రండి! మీరు పూజించే విగ్రహంలోనే కాదు… ఈ విశ్వంలోని ప్రతి జీవిలోనూ…. ప్రతి ప్రాణిలోను… ప్రతి వస్తువులోను… ప్రతి అణువులోనూ… ప్రతిరేణువులోనూ…. ఆయనే ఉన్నాడని… నువ్వే ఆయనని …. ఆయనే నువ్వే….  అని తెలుసుకో! ఈ విశ్వమంతా విశ్వాసంతో నడుస్తోందని గ్రహించు ! అది చాలు!
 
10.             మరి నేనే దేవుడిని అని తెలుసుకోవడం ఎలా?
         ముందు నువ్వు ఎవరో తెలుసుకో! నిన్ను నువ్వు ఎవరో తెలుసుకుంటే… ఆయనను ఎవరో తెలుసుకున్నట్లు అవుతుంది! అద్దంలో ప్రతిబింబం ఎవరిదో తెలుసుకుంటే… ఆయనను తెలుసుకున్నట్లు! ఆయనే నువ్వు…. నీవే ఆయన అని జ్ఞాన అనుభూతి పొందుతారు! 
 
11.             మరి నాకు దేవుడిని చూపించగలరా?
             పిచ్చివాడా! నీవే వరాలు ఇచ్చేవాడివి! నీవే వరాలు అడగటం లాగా ఉంది నీ పరిస్థితి! నీవే దేవుడివి…. కానీ నువ్వు గుర్తించలేని స్థితి! ఎవరో… ఎక్కడో ఉన్నారు అని అనుకుంటున్నావు ! మేము చెబితే నమ్మవు!  నమ్మకం కుదిరితే కానీ నమ్మలేరు! నమ్మకం లేని చోట మేము  ఏమి చెప్పినా… చూపించిన నీవు నమ్మలేవు!

12.             మరి నాకు మీ మీద అపారమైన నమ్మకం ఉంది! భక్తి విశ్వాసాలు ఉన్నాయి! మరి నాకు దేవుని చూపించగలరా?
        అయితే ఈ ఇడ్లీయే మీ దేవుడు...ఈ దోశయే మీ దేవత అంటే నమ్ముతావా నమ్మలేవు కదా! ఎందుకంటే దేవుడు అంటే మీ దృష్టిలో ఫలానా నామములో ఉండాలి! ఫలానా ఆకారంలో ఉండాలి! శివుడు ఇడ్లీ లో ఉన్నాడు అంటే నమ్మలేవు! శివాని ఈ దోశలో ఉంది అంటే నమ్మలేవు! కానీ దోశ ఆకారములో ఉన్న శ్రీచక్రము లో ఉంది అంటే నమ్ముతావు! మీరు మీ శ్రీ చక్రంలో మీరు అనుకున్న నామరూపధారిని చూపిస్తేనే దేవుడు అని నమ్ముతారు కదా! అన్ని కూడా బ్రహ్మపదార్థాలు కదా! బ్రహ్మము కానీ పదార్థము ఏదియు లేదు! కాబట్టి ఇడ్లీ లోను, దోశలోను, శ్రీ చక్రములోను, శ్రీ లింగములోను అన్ని ఉన్నది ఒకటే… అన్నీ కూడా బ్రహ్మపదార్థాలు అని ముందు తెలుసుకో! నిన్ను నువ్వు తెలుసుకున్న ట్లే! అన్నిటి యందు ఏకరూపము...ఏకనామము...ఏకభావము...చూడటమే  అసలైన అద్వైత స్థితి! అప్పుడు దేవుడు వేరే విధంగా లేదని…. నువ్వే దేవుడవని జ్ఞాన అనుభూతి పొందుతారు!

13.             మరి నాకు ఈ దోశలో నా ఇష్ట రూపధారి అయిన దేవుడుని చూపించగలరా?
  అందులో చూపించడానికి ఏముంటుంది? నువ్వే చూడాలి! నువ్వే చూడగలిగే స్థాయిలో నువ్వు మారాలి! అప్పుడు ఈ దోశలోనే కాదు… ఆయన లేని చోటు లేదని తెలుసు కుంటావు! భక్త ప్రహ్లాదుడుకి స్తంభములో దేవుడు కనిపించాడు! నామ దేవుడికి విగ్రహంలో దేవుడు కనిపించాడు! దేవదాసుకి తాగుడు లో దేవుడు కనిపించాడు! అందరూ యోగులే! అందరికీ అందరిలోనూ, అన్నింటిలోనూ, మీ దేవుడిని చూచినవారే!

14.              మీరు అన్నట్లుగా మరి నాకు ఇడ్లీ లో దేవుడు ఎందుకు కనిపించడములేదు? 
          మీ దేవుడి ఇడ్లీ లోనే ఉన్నాడు! కానీ మీకు దాని యందు పరిపూర్ణమైన నమ్మకం లేకపోవడం వలన… మీ మనస్సు యందు అది కాస్త మాయా తెరగా ఏర్పడటం వలన నువ్వు చూడలేకపోతున్నావు! మనస్సుకి నువ్వు అపనమ్మకం ఇవ్వటం వలన ఉన్నవాడు లేనివాడిగా ఇడ్లీలో కనపడుతున్నాడు! నీ మనస్సుకి ఉన్న ఈ మలినము తొలగించుకుని చూస్తే అన్నీ తెలుస్తాయి! మాయ మాయమవుతుంది! మనస్సులో మలినం ఉంటే అంతా కూడా మలినముగానే… మాయగా కనపడుతుంది! అనగా మనస్సులో మాయ ఉంటే అంతా మాయ గానే కనపడుతుంది! అంత పెద్ద దేవుడు ఇంత చిన్న ఇడ్లీలో ఎలా ఉంటాడు అనే సందేహం ఉన్నంతవరకు మీకు దేవుడు కనబడడు! అంత ఎందుకు ఇంత చిన్న విత్తనములో అంత మర్రి చెట్టుగా ఉన్నవాడు … ఇంత చిన్న ఇడ్లీ లో అంత రూపధారి ఉండటం నిజమే కదా! ఆలోచించు! కాబట్టి మీ మనస్సు పరిశుద్ధమవ్వాలి! అపుడే మీకు గావలసిన దేవుడు ...మీకు గావలసిన రూపములో కనపడతాడు!

15.              నా మనస్సు పరిశుద్ధం అయితే దేవుడు కనిపిస్తాడా?
            నీ మనస్సుకున్న నేను అనే అహం మాయ తొలగితేనే మనస్సు పరిశుద్ధము అయినట్లే! అసలు మాయ అంటే ఏంటో ముందు తెలుసుకో! దానిని వదిలించుకో! ఇప్పుడు నీకు ఉన్న మనస్సు కూడా మాయం అవుతుంది! అప్పుడు ప్రశ్నించేవాడు, చూసేవాడు, చూడాలనుకునే వారు అనేది ఉండదు! వేరేగా దేవుని చూడాలి అనే తపన ఉండదు! అంటే వేరేగా కనిపించడమేమిటి… నువ్వే ఆ దేవుడిని అని కూడా అనుభూతి పొందుతావు! మీరిద్దరూ కూడా అద్దంలోని బింబము…ప్రతిబింబము లాంటివారని… అంతా ఒక్కరేనని… అది నువ్వే దేవుడని అని తెలుసుకుంటావు!

16.              అసలు మాయ అంటే ఏమిటి?
              మాయ అంటే మనస్సుకు నిశ్చలత్వం లేకపోవడం! మనస్సుకి ఏదో ఉంది…. ఏదో తెలుసుకోవాలనే తపన ఉండటం… ఏదో చూడాలి అనే సంకల్పం ఉండటం… ఏదో చెయ్యాలనే ఆలోచన ఉండటం…. ఏదో గావాలని అనుకుని స్పందించడం…. అంటే ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు గుణాలు వలన మన మనస్సు స్థిరంగా ఉండకుండా…. నిశ్చలముగా ఉండక… అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది! నిజానికి తెలుసుకోవటానికి, చూడటానికి, పొందటానికి, ఇక్కడ ఏమీ లేదు! ఏదో ఉంది అని అనుకోవడమే మాయ అవుతోంది! దీనికి కారణం మన మనస్సు పరిశుద్ధంగా లేకపోవటం! 

17.              మరి మన మనస్సు పరిశుద్ధము అవ్వాలంటే ఏమి చేయాలి?
            సాధన చేయాలి! నీలో ఉన్న అన్ని రకాల వికారాలను, పాపాలను, మర్మాలను తొలగించుకోవాలి! అందుకని ఆరుగురు శత్రువులైన అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలి! అలాగే సప్త వ్యసనాలకు దూరంగా ఉండాలి! అలాగే వివిధ రకాల దైవిక లక్షణాలు కలిగి ఉండాలి! అనగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, ఆశకి ,భయానికి దూరంగా ఉండటం, శరీర శుద్ధి కలిగి ఉండటం, ఎల్లప్పుడు మనస్సు శుద్ధి కలిగి ఉండటం, అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం, ఆత్మనిష్ఠ కలిగి ఉండటం, కోపము అహంకారం లేకుండా ఉండటం, భూత దయ కలిగి ఉండటం, సమదర్శి గా ఉండటం, ధర్మనిష్ఠ కలిగి ఉండటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ధర్మ  జీవితం కలిగి ఉండటం, ఇతరుల దోషాలు చెప్పకుండా ఉండటం, చెప్పుడు మాటలు వినకుండా ఉండటం, అస్ధిర బుద్ధి లేకుండా ఉండటం, రాగద్వేషాలు లేకపోవటం, మమకార వ్యామోహాలకు దూరంగా ఉండటం, శ్రద్ధ కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ఓర్పు ఓపిక ఉండటం, అన్నింట యందు నమ్మకం కలిగి ఉండటం మున్నగు అనేక లక్షణాలు మనలో ఉంటే మన మనస్సు నెమ్మది నెమ్మదిగా పరిశుద్ధి అవ్వడం మొదలవుతుంది!

18.               మరి నేను పరిశుద్ధ మనస్సుని కలిగి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది?
            ఎల్లప్పుడూ ఏదో తెలియని ఉత్తేజపూరితమైన ఆనందస్థితిలో ఉంటావు! అన్నిటియందు వివేక జ్ఞానబుద్ధి తో ఉంటావు! సాక్షిభూతంగా ఉంటావు! దేనియందు రాగద్వేషాలు ఉండవు! అన్నిటి యందు సమదృష్టి, సమదర్శి గా కలిగి ఉంటారు! అహము ఉండదు! మోహా, వ్యామోహాలు ఉండవు! ఆశ వుండదు! భయము ఉండదు! మరణ భయం ఉండదు! కోరికలు ఉండవు! ఇది కావాలని తపన తాపత్రయాలు ఉండవు! ఇది లేదు అనే బాధలు, భావాలు ఉండవు! ఇది పొందాలని ఆతృత తాపత్రయాలు ఉండవు! మనస్సునందు ఎలాంటి సందేహాలు ఉండవు! ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలి, ఏదో చెయ్యాలనే అనే ఆలోచనలు ఉండవు! అనుమానాలు, అవమానాలు ఉండవు! సుఖదుఃఖాలుయందు సమాన భావం ఉంటుంది! కొత్తగా వచ్చేది ఏమీ ఉండదని …కొత్తగా పోయేది ఏమీ ఉండదని తెలుసుకుంటావు! ఒకరకంగా చెప్పాలంటే పసిపాప మనస్సున్న పసిపిల్లవాడిలా గా మారినప్పుడు నీ మనస్సు పరిపూర్ణ పరిశుద్ధ స్థితికి వెళ్ళినట్లే ! అప్పుడే నీ మనస్సు కాస్తా పసిపాప మనస్సుగా మారిపోతుంది! పరిపూర్ణ బాలోన్మత పిశాచ స్ధితి అయిన అవధూతగా మారిపోతావు! పరమాత్మ గా మర్చిపోయిన బ్రహ్మజ్ఞానమును పొందుతావు!

19.              మరి మీరు ఇంత ఇదిగా చెబుతున్నారు కదా మీ మనస్సు పరిశుద్ధం అయినదా?
            అయితే మేము ఇక్కడ ఎందుకు ఉంటాము? నీతో మాట్లాడుతూ ఎందుకు ఉంటాము? మనలో లక్షా పాతిక వేల కర్మలు ఉన్నాయి! దానికి తగ్గట్టుగానే కోటీ పాతిక లక్షల కర్మఫలితాలు ఉన్నాయి! అనుభవించటానికి 8 జన్మలలో చొప్పున పది లక్షల ఆయుష్ తో 36 కోట్ల దైవ, 84 లక్షల జీవ జన్మ రూపాలు ఉన్నాయి! వీటికి అన్నిటికి మూల కారణం మన అంతర్గతంగా ఉన్న ఏకైక ఇష్ట కోరిక! ఈ కోరికను దాటితే పదార్థం దాటినట్లు! అప్పుడే కదా యదార్థం తెలుస్తుంది! పదార్థం దాటితేగాని యదార్థం తెలియదు! యధార్థ జ్ఞానమును పొందితే గాని మనస్సు స్థితిగతులు మనకి తెలియవు! మనస్సుకి జ్ఞానము ఉన్నంతవరకు మన మనస్సు పరిశుద్ధం కాదు! పరిశుద్ధము అంటే ఆరు నెలల పసిపాప లాంటిది! శుద్ధము అంటే మూడు సంవత్సరాల వయసున్న పసివాడు లాంటిది! అనగా ఆరు నెలల పసిపాప కి లోకం తెలియదు! ఆకలి తెలీదు! నిద్ర తెలియదు! అమ్మ, అయ్య ఎవరో తెలియదు! ఎప్పుడూ ఆనందమే తెలుసు! నోట్లో వేలు పెట్టుకోవడం తెలుసు! బుడ్డి బుడ్డి చేతులు, కాళ్లు నోట్లో పెట్టుకోవడం తెలుసు! నిజానికి ఇవన్నీ చేస్తూనే విషయం వాడికి తెలియదు! కానీ మనకి మాత్రమే తెలుస్తుంది! చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది! ఎందుకు ఏడుస్తున్నాడు… ఎందుకు నవ్వుతున్నాడో వాడికి తెలియదు! ఏడుస్తున్నానని, నవ్వుతున్నానని తెలియని అతితమైన స్థితి అది! ఇలాంటి స్థితి ఉన్నవాడు మనుసు పరిశుద్ధమైనట్లు లెక్క! వందకి వంద శాతం ఉన్నట్టే లెక్క! 3 సంవత్సరాల పిల్లవాడికి మాత్రం ఆకలి ,నిద్ర, ఏడుపు, ,అమ్మానాన్న, తమ్ముడు, చెల్లెలు, బాబాయ్ పిన్నిలు, ఇలా పలురకాల బంధాల గురించి తెలుసు! వాడికి ఏమి కావాలో తెలుసు! వాడికి కావలసింది తినే జ్ఞానము ఉన్నది! అంటే ఇలాంటి వారి మనస్సులు 99% శాతం శుద్ధము గా ఉంటుంది! వీళ్ళు ఎవరికి హాని చేయాలని, మోసం చేయాలని, బాధపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, చంపాలని ఇలా క్రూర ఆలోచనలు , పాప కర్మలు చేయాలనే ఆలోచన ఉండక పోవడం వలన …కారణము కొద్ధిపాటి జ్ఞానము కలిగి ఉండుటవలన… వీరి మనస్సులు 99% శాతం శుద్ధము గా ఉన్నట్టు! కానీ మనస్సు పరిశుద్ధము అంటే వందకి వంద శాతం ఉన్న వాడికి మాత్రమే! కానీ అలాంటి పరిశుద్ధ మనస్సుని భగవంతుడు ఇంతవరకు ఎవరినీ సృష్టించలేదు! మన మనస్సు పరిశుద్ధం కాకపోవటం వలన మన మనస్సులో ఒక కోరిక మిగిలిపోతుంది! కోరిక కోసం పున: జన్మ ఎత్తవలసి వస్తుంది! ఆ కోరిక తెలుసుకో లేక… ఒకవేళ తెలుసుకున్న దానిని దాటలేక… దానిని దాటాలని తెలియక… అది ఎలా దాటాలో తెలియక… పునర్జన్మ అవతారాలు ఎత్తవలసి వస్తుంది!  మనలో ఆ కోరిక ఏమిటో తెలియాలి… అంటే మన సాధన అంతిమ స్థితి అయిన హృదయ చక్రానికి రావాలి! అప్పుడు దాకా మన మనస్సు స్థితి ఏమిటో తెలియదు! అప్పుడు మన మనస్సుకు ఉన్న ఇష్ట కోరిక ఏమిటో తెలుస్తుంది! ఆ కోరిక మాయలో పడటం అనేది మన యొక్క సాధన బట్టి ఉంటుంది! ఒకవేళ దాటగలిగితే మనం పరిశుద్ధమైనట్లే! మాయ జయించినట్లే! మనోజయం పొందినట్లే ! దాటక పోతే మాత్రం పునర్జన్మకి కారణం అవుతుంది! ఇది ఎలా ఉంటుంది అంటే… మన కష్టసుఖాలకు కోరికే కారణమని తెలుసుకున్న బుద్ధుడు… కోరికలు లేని సమాజం చూడాలని కోరిక… ఎలాగైతే పెట్టుకున్నాడో… అలా ఇష్ట కోరిక మాయ మనకి తెలియకుండానే మాయలో పడి పోతాము! మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతాము! మోక్షప్రాప్తి పొందాలనే కోరిక గూడ ఒక కోరికయే గదా! ఈ కోరిక గూడ లేకపోతే మనము సాధన దేనికోసము చేయ్యాలో గూడ తెలియదు! పోనీ ఈ కోరిక ఉంటే అది కాస్తా ఇష్టకోరిక మాయగా మారి మన సాధనను ఆపివేస్తుంది! అంటే కోరిక వుంటే ఒక తంటా... లేకపోతే మరో తంటా! దీనిని ఎలా వదిల్చించుకోవాలో ఎవరికి తెలియదు! ఈ ఇష్టకోరిక మాయ ఉన్నంతవరకు ఎవరుగూడ వారి మనస్సు పరిశుద్ధము గానట్లే! అనగా పరమశూన్యములో ఎలా ఐక్యం చెందాలో... దీనిని ఎలా ఆరాధించాలో కబీర్ దాసుకి ఆజన్మాంతము అర్ధము కాలేదు! పోనీ ఈ పరమశూన్యమునకు ఏదైన నామరూపము పెట్టి పూజిస్తే... అది కాస్తా ఇష్టదైవ మాయగా మారి దాటలేరు! అంటే మన సాధనకి పరిపూర్ణము అవ్వటానికి అనగా మన ఇష్టకోరిక మాయ దాటడానికి సరియైన సాధన విధివిధానము లేదు! ఎందుకంటే బలహీనత లేని బలవంతుడుని ఇంతవరకు ఆ భగవంతుడు పుట్టించలేదు! కారణము ఆ భగవంతుడికి బలహీనత ఉంది! బలహీనత లోపమున్నవాడి నుండి పుట్టిన మనకి బలహీనత లేకుండా ఎలా వుంటుంది! ఒకసారి తీవ్రముగా ఆలోచించండి! అసల యధార్ధ జ్ఞానము తెలుస్తుంది!
                                 
20.             మరి నా మనస్సు పరిశుద్ధం కావటానికి ఎంత కాలము పడుతుంది ?
           ఒక క్షణం చాలు లేదా ఒక మహా కల్పమే పట్టవచ్చును! ఎవరికి తెలుసు! నీ మనస్సు నీకు ఎన్నాళ్లకి వశము అవుతుందో చెప్పగలవా… చెప్పలేవు కదా! నీ మనస్సు బట్టి ధ్యానము ఉంటుంది! ధ్యానము బట్టి నీ సాధన స్థాయి ఉంటుంది! ఈ సాధన స్థితిని  బట్టి నీ యోగచక్ర స్థితి ఉంటుంది! నీ యోగచక్ర స్థితి బట్టి అనుభవ అనుభూతి స్థితి ఉంటుంది! నీ అనుభవ అనుభూతి స్థితిని బట్టి నీ మనస్సు స్థాయి స్థితి ఏమిటో తెలుస్తుంది! ఇదంతా జరగడానికి ఒక క్షణం చాలు లేదా ఒక యోగమే పట్టవచ్చును! రౌతు బట్టి గుర్రం ఎలాగో నీ చేతల బట్టి నీ మనస్సు అలాగే ఉంటుంది!
 
21.             నా మనస్సు పరిశుద్ధం కాకపోతే దేవుడు కనిపించడు కదా! 
          పిచ్చివాడా! అమాయకుడా! దుమ్ము ధూళి బాగా మురికి పట్టిన అద్దంలో నీ ప్రతిబింబం చాలా స్పష్టంగా అందంగా కనపడుతుందా! కనిపించదు కదా! అలాగే నీ మనస్సు అశుద్ధముగా ఉంటే శుద్ధమైన వాడు ఎలా కనిపిస్తాడు చెప్పు! ఎప్పుడైతే నీ మనస్సు అనే అద్దంలో మలినాలు లేకుండా అనగా కోరికలు లేకుండా చూసుకుంటావో… అప్పుడు పరిశుద్ధ స్థితిలో నీవే దేవుడిగా అందులో చక్కగా కనపడతారు! ఒకటి బాగా గుర్తుంచుకో! నీ మనసంతా ఆ ఆ ఇ ఈ !  అనగా అహం నుంచి ఆత్మదాకా…. ఇహం నుంచి ఈశ్వరుడిదాకా అన్నమాట! ఇందులో అహం అహం అనే స్థితిలో ఈ మనస్సు ఉంది అంటే ఇది అవుతుంది అన్నట్లే నీ మనస్సు ఉంది అంటే బుద్ధి అవుతున్నట్లే ఇందులో అహం - ఇహం అనే స్థితిలో నీ మనస్సు ఉంది అంటే శుద్ధి కానట్లే! మహామాయ లో ఉన్నట్లే! కోరిక మాయ, మర్మ, మోహ ,వ్యామోహ, భ్రమ, భ్రాంతులను, ఆశ, భయము, ఆనందము లో ఉన్నట్లే! అదే ఆత్మ- ఈశ్వరుడు అనే స్థితిలో ఉంటే నీ మనస్సు కాస్త శుద్ధము నుండి పరిశుద్ధం వైపు అడుగులు వేస్తున్నట్లు! మాయల నుండి, మర్మాల నుండి, కోరికలనుండి, భ్రమ నుండి, భ్రాంతుల నుండి, బంధనాల నుండి విముక్తి చెందుతున్నట్లు అన్నమాట!

22.             దైవదర్శనం లేదా దైవసాక్షాత్కారం అంటే ఏమిటి?
               చాలామంది దైవ సాక్షాత్కారము అంటే ధ్యానంలోను లేదా కలలో దైవరూపాలు లేదా విగ్రహరూపాలు కనపడితే అదే దైవసాక్షాత్కారం అనుకుంటారు! అది నిజం కాదు! ఎందుకంటే ఎవరైతే తీక్షణముగా కొన్ని క్షణాలపాటు విగ్రహమును గాని లేదా దైవ ఫోటోలు గాని చూస్తే… వారికి ఆయా రూపాలు ధ్యానంలోను లేదా కలలో తిరిగి కనపడతాయి! అంటే నీ మనస్సు మీద వేసుకున్న ముద్రరూపాలు తిరిగి మీకు కనపడతాయి! ఇలా కనపడటం దైవదర్శనం లేదా దైవసాక్షాత్కారం కాదని గ్రహించండి! నిజమైన దైవసాక్షాత్కారం అంటే నీ మనస్సు ఆయా దైవరూపాలను విశ్వంలోని అన్ని జీవరాశులలోను, అన్ని వస్తువులలో ను ప్రత్యక్ష అనుభవ అనుభూతిగా చూడగల్గితే ఆ స్ధితిని దైవసాక్షాత్కారం అంటారు! అనగా ఇలాంటి వారికి వారి ఇష్ట స్వరూపమే నిరంతరంగా ఏకంగా కనపడుతుంది! అనగా ఆహారంలోనూ, మలములోను, కుర్చీలో, పీటలో, నాలోను, నీలోను, ఎక్కడ చూసినా, ఎటు చూసినా, ఎప్పుడు చూసినా, ఎలా చూసినా, ఆ ఏక స్వరూపమే మయంగాను కనపడుతుంది! అందుకే మన వాళ్లు దీనిని శివమయం గాను, విష్ణుమయం గాను, దేవి మయంగా, ఆనందంమయంగా ఇలా వారి ఇష్ట స్వరూపమే కనపడుతుందని చెప్పటం జరిగినది! ఉదాహరణకి వీరికి శివుడు అంటే నాగాభరణధారి గాను, గంగాధర ఇలా ఉండాలని… కనపడాలని ఉండదు ! వారికి విశ్వంలో ప్రతి దానిలోనూ, ఆయా రూపంలో శివుడు ఆ రూపంలో ఉండాలనిపిస్తుంది! అనగా వారికి శివుడు తప్ప వేరే వస్తువు మరొకటి కనబడదు! విశ్వమంతా శివమయం గానే కనపడుతుంది! ఇది మీకు బాగా తెలియాలి అంటే సుమన్ నటించిన సత్యనారాయణ స్వామి సినిమా చూడండి! అందులో చంద్రమోహన్ పాత్రధారి నిజమైన దైవసాక్షాత్కారం పొందిన యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో బాగా చెప్పడం జరిగినది! ఈ పాత్రధారికి తన ఈ విశ్వంలో సర్వం విష్ణుమయం గా ఎలా కనబడుతుందో అలాగే నిజ దైవ సాక్షాత్కారము అనుభూతి పొందిన వారికి కూడా వారి ఇష్ట దైవ సాక్షాత్కారము ఉంటుంది! కనపడుతుంది! నిజానికి ఈ దైవ సాక్షాత్కారము అనేది కూడా ఒక మాయ అని గ్రహించండి! మనస్సు యొక్క భ్రాంతు అని గ్రహించండి! వీరిని పట్టుకుంటే వారి ధ్యాసయే మన ధ్యానముగా మారి వారిని దాటలేరని తెలుసుకోండి! ఒకప్పుడు వారంతా మనలాంటి యోగ సాధకులే అని అనుకుంటూ… మాయా భ్రాంతి… అనుకుంటూ కబీరుదాసు లాగా మనము కూడా వారిని దాట్టుకోవడం జరగాలి లేదంటే ఏదో ఒక చక్రం వద్ద దానికి సంబంధించిన క్షేత్రంలో ఆయా దేవత స్వరూపం దగ్గర ఆగిపోయి… ఆయనే సర్వం అనే మాయలో ఉండిపోవాల్సి వస్తుంది! ఈ మాయని దాటితేగాని అసలు మూలం మనకి తెలియదు అనగా పదార్థం దాటితేగాని యధార్థ జ్ఞానం ఏమిటో మనకు తెలియదు!
23.             అంటే ఈ లెక్కన ఎప్పుడు దైవచింతనలో ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది అని అంటారా?
              అది నిజమే! కానీ దైవ చింతన అంటే ఎప్పుడు నామరూప విగ్రహాల ముందు కూర్చుని నిత్య దూప నైవేద్యాలు ప్రసాదాలు చేయడం కాదు! ఇవేమీ చేయకపోయినా మీ మనస్సు యందు ఎల్లప్పుడూ దైవ నామ స్మరణ, దైవ స్వరూపము గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే నెమ్మదిగా మనస్సు పరిశుద్ధమవుతుంది! మీ ఇష్టదైవాన్ని కేవలం విగ్రహమూర్తి లో చూడకు! అన్నిటియందు, అన్నిట్లోనూ చూడు! ఫలానా దేవుడు అంటే అలా ఫలానా పోలికలు చెప్పలేని స్థితిలో నువ్వు మారాలి! నిజమైన దైవ చింతన అంటే దేవుడిని మానవుడిగా పూజించకు! మానవుడిలో మాధవుడిని చూసే స్థాయికి రావడం అవుతుంది! నన్ను నన్నుగా చూడకు ! నాలో ఉన్న దైవమును చూడు! నేనే నీకు కావాల్సిన నీ నామ రూప దైవంగా పడతాను! 

24.             విగ్రహ పూజలు చేయకూడదా?
                 విగ్రహ పూజలు చేయాలి ఎంతవరకు మీకు నిగ్రహం వచ్చేవరకు! ఆ పై నిగ్రహం వస్తే …. విగ్రహం తో ఏం పని ఉంటుంది! పేరాలు రాసేవాడికి అక్షరాలతో పని ఉంటుందా! ఉండదు గదా! అక్షరాలు ప్రధానం …. ప్రారంభ మనస్సుకి విగ్రహాలు అవసరం! పేరాలు వ్రాసే స్ధాయికి వచ్చినప్పుడు… నీకు నిగ్రహం వచ్చినప్పుడు విగ్రహారాధన ఎందుకు చెప్పండి! మీ దేవుడు విగ్రహంలోనే ఉన్నాడా… ఒకవేళ ఆ విగ్రహం పగిలి పోతే మరి మీ దేవుడు పగిలిపోయినట్లేనా! ఒకవేళ ఆ విగ్రహానికి మైలు సోకితే మరి మీ దేవుడికి మైలు సోకిన నట్లేనా… ఆలోచించు! విగ్రహంలోనే నీ నామ రూపధారి ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి కదా! ఒకవేళ మీరు విగ్రహానికి పూజలు ప్రసాదాలు మీరు ఒకవేళ పెట్టకపోతే …. ఎక్కడా కూడా నీ నామ రూపధారి కూడా పూజలు ప్రసాదాలు జరగకూడదు కదా! కానీ అలా జరక్కుండా ఉంటుం దా! మీలాంటి విగ్రహ రూపం అన్ని చోట్లా… అన్ని విగ్రహాలలోను పూజా విధిగా జరుగుతూనే ఉంటాయి కదా మరి! మీ దేవుడికి వేరే చోట మీలాంటి మీ దేవుడి కి తేడా ఉందా! లేదు కదా! మరి మీ దేవుడు విగ్రహంలోనే ఉన్నాడా అని అనుకోవడం… మీ పూజలు, ప్రసాదాలు పెడితేనే జరుగుతాయని అనుకోవడం… ఈ రోజు సరిగ్గా పూజ చేయ లేదు…. సరిగ్గా ప్రసాదాలు పెట్టలేదే అనుకోవడం… ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి! బాధపడవద్దని అనలేదు! నేను సరిగ్గా చేయలేదు అని బాధ పడండి! అంతేగానీ నేను మాత్రమే ఆయనకు దిక్కు అనుకోవద్దు! అన్ని దిక్కులు ఉన్నవాడు! దిక్కులే వస్త్రాలు ధరించిన మీ దేవుడు అని తెలుసుకోండి! ఈ దేవుడు మీరు పూజించే విగ్రహం లోనే కాదు! ఈ విశ్వమంతా… సకల దైవ, జీవ స్వరూపాలలో సర్వాంతర్యామి కాస్తా అంతర్యామిగా ఉన్నారని గ్రహించండి! 

25.             మనకి నిగ్రహం వచ్చిందని ఎలా తెలుస్తుంది?
              కోరికలు లేని స్థితికి వెళ్లడమే పరిపూర్ణ నిగ్రహం అవుతుంది! నిజానికి వరాలు ఇచ్చేది మీరే! వరాలు పొందేది మీరే! వరాలు గావలసినది మీరే! కానీ మధ్యవర్తిగా విగ్రహారాధన పెట్టుకుని, వాడి పేరు చెప్పుకొని, వాడే కోరికలు తీరుస్తున్నాడని… సంబరాలు చేసుకోవడం…తీర్చడము లేదని ఆవేశపడటం… మనమే చేస్తున్నాము! ఇందులో దేవుడికి ఎలాంటి పాత్ర గాని సంబంధం గానీ లేదని తెలుసుకోవడమే నిగ్రహం అవుతుంది! కోరికలు తగ్గిపోతాయి! కర్మలు తగ్గిపోతాయి! ఆశ,భయాలు తగ్గిపోతాయి!కర్మ ఫలితాలు ఆశించడము తగ్గిపోతుంది! 

26.             కోరికలు తీర్చలేనప్పుడు పూజలు చేయడం ఎందుకు?
            అదే తప్పు! కర్మలు చేయడం మన వంతు! ఫలితాలు ఇవ్వటం మీ నామ రూపధారి అయిన దేవుడు వంతు! అంతేగాని పనికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో కూడా మనమే నిర్ణయించుకుని వాడికి చెప్పడమే మనం చేస్తున్న అతిపెద్ద తప్పు! కోరికలు అడగండి కాని ఆ కోరిక ఫలితాలు ఇలాగే ఉండాలని మాత్రం కోరకండి! పదో తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ రాని వాడు స్టేట్ ర్యాంక్ కావాలని కోరుకోవడం లాగా ఉంటుంది! నిజానికి ఈ కర్మ ఫలితం అనేది కూడా మీ దేవుడి చేతిలో ఉండదు! మీ ప్రారబ్ధ కర్మల ఫలితాలు చేతిలో ఉంటుంది!  స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకున్న వాడు… కనీసం స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం అసలు పరీక్ష లో పాస్ అవుతాడో లేదో తెలియని వాడికి స్టేట్ స్టేట్ ర్యాంక్ రావటం అనేది…. ఈ జన్మలో జరగదు! చేసుకున్న పూర్వజన్మల కర్మల ఫలితాలను బట్టి ఆధారపడుతుంది! ఇది ప్రతి కర్మకి, ప్రతి కోరికకి వర్తిస్తుంది! గత జన్మలో చేసే దానిని బట్టి ఈ జన్మలో దాని ఫలితాలను పొందుతారు! ఎప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో తెలుసు ఉన్నవాడు కాబట్టి మనము ఆయనికి తప్పకుండా పూజలు చెయ్యాలి!చేసుకోవాలి! కోరికలు కోరాలి! ఆ కోరిక ఫలితాలు ఆశించకూడదు! ఎట్టి ఫలితము ఇచ్చినా కూడా మనం మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరించాలి! మీ దృష్టిలో చెడు అనిపించవచ్చును ! ఆయన దృష్టిలో అది మీకు మంచి అవుతుంది! ఆయనకి విగ్రహారాధన పూజలు చేయటం వలన లేదా దైవ పూజలు చేయటం వలన లేదా జపము ధ్యానము చేయటం వలన ఉపాసనలు చేయటం వలన, తపస్సు చేయటం వలన, మనం గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాలు తగ్గిపోయి… ఈ జన్మలో అవి మన మీద పడకుండా చేసుకోవచ్చు అన్నమాట !

27.             మనం అనుకున్న ఫలితాలు రావాలంటే ఏమి చేయాలి?
          అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవాలి! చేయాలి! ఇతరులకు దానం ఇవ్వాలి! ఇతరుల అవసరాలు సాధ్యమైనంతవరకు తీర్చాలి! వేటియందు అతి ఉండకూడదు! అనగా అతి దానాలు, అతి అప్పులు, అతి పూజలు, అతి పుణ్యకార్యాలు చేయకూడదు! అతిగా చేసి మనం అప్పులపాలు అవకూడదు! మనకున్నంతలో పావు వంతు దైవకార్యాలకు ఉపయోగించాలి! ఎప్పుడో ఏదో వస్తుందని ఈనాడు చేస్తే మనం బ్రతకలేము కదా!

28.             అసలు కోరికలు ఎందుకు కలుగుతాయి?
            మనకి తీరని ఏకైక ఇష్ట కోరిక ఒకటి ఆదిలో ఉండిపోయినది ! ఆ కోరిక ఏమిటో మనం మర్చిపోయి ఏవేవో కోరికలు అడుగుతున్నాను! ఏవేవో కోరికలు అడుగుతూ తీర్చుకుంటూ సంతృప్తి చెందక నానా అవస్థలు పడుతూ ఏ కోరిక కావాలో ఏ కోరిక తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలో తెలియక పరి విధాలుగా నానా ఇబ్బందులు పడుతున్నాం !ఉదాహరణకి మనకి ఇష్ట కోరిక తిరుపతి లడ్డు తినటం అనుకోండి! ఈ లడ్డు లాంటి బూంది లడ్డు, బందరు లడ్డు ఇలా ఎన్నో రకాల ఇన్ని రకాల లడ్డూలు తిన్నా కూడా మనం సంతృప్తి చెందలేదు కదా! మనకి తినవలసిన లడ్డు ఏమిటో తెలియక వివిధ రకాల లడ్డూలు తింటూ పడుతూ సంతృప్తి చెందక ఇది కాదు అది అంటూ అది కాదు ఇది అంటూ, ఇది వేరే దంటూ, మరొకటి అంటూ కోరికలు పెరుగుతున్నాయి! వీడికి తగ్గట్టుగానే కర్మఫలితాలు పెరుగుతాయి! వీటికి తగ్గట్టుగానే కర్మ జన్మ పెరుగుతాయి! అయినా మనం సంతృప్తి చెందని అప్పటిదాకా మన ఇష్ట కోరిక ఏమిటో తెలిసే దాకా మన ఇష్ట కోరికైనా తిరుపతి లడ్డూ తినేదాకా అన్నమాట! పోనీ దీని తర్వాత అయినా సంతృప్తి చెందుతారు అంటే అమితంగా సంతృప్తి చెంది ఇదే ఇంత రుచి గా ఉంటే ఇలాంటివి వేరే పదార్థాలు ఇంకా ఎంత రుచిగా ఉంటాయో కదా అనుకుని మళ్ళీ వేట మొదలవుతుంది! అంటే అంతమయ్యే చోట ఆరంభమవుతుంది! మళ్లీ కర్మ జన్మలు మొదలు! మళ్లీ రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువులు ఎందుకు కావాలని అనుకుంటుందో ఆలోచించే వాడికి కోరికలు ఉండవు! 

29.             త్రిగుణాల మాయ వలన కోరికలు కలుగుతాయి అని చదివాను అది తప్పా?
                     త్రిగుణాలు అంటే సత్వ, రజో, తమో గుణాలే కదా! సత్వ అంటే మంచి గుణములు …. రజో అంటే మంచి చెడు గుణాలు….  తమో అంటే చెడు గుణాలు అనే కదా! త్రిగుణాలు అంటే కోరిక లోని వివిధ స్థాయిలు యొక్క ప్రతీకలు!  కోరికలు లేని సిద్ధి పొందటమే అవుతుంది మంచి కోరికలు కలిగి ఉండటం అనేది సత్వగుణం అవుతుంది! మంచి-చెడు రెండూ మిళితమైన కోరికలు కలిగిఉండటం రజోగుణము అవుతుంది! కేవలం ఇతరులకు హాని కలిగించే కోరికలు కలిగిఉండటం తమోగుణం అవుతుంది! మన కోరికలు త్రి స్థాయిలో ఉంటాయని త్రిగుణాలు రూపంలో చెప్పడం జరిగినది! గుణాలకు ప్రతిరూపమే త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,శివ అని గ్రహించండి! మన త్రివిధ కర్మలయొక్క ప్రతిరూపమే త్రిశక్తులు అని గ్రహించండి! అంతే త్రిశక్తులు ,త్రిమూర్తులు మన కర్మలకి ప్రతిరూపాలన్నమాట! మన కోరికలకి ప్రతిరూపాలన్నమాట! మనలో కోరిక ఉంటే వాళ్లు ఉన్నట్లే! మనలో కోరిక లేకపోతే వాళ్లు లేనట్లే! నిజంగా వాళ్ళు లేరు! వాళ్ళు ఉన్నారని మీ మనస్సు అనుకోవడం వల్ల వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తోంది!

30.             అంటే దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు లేరా?
              ఇప్పుడే చెప్పాను కదా! మీ కోరికని బట్టి మీ కోరికలు తీర్చే రూపముతో రూపమే మీ నామ రూపాలు! ఇన్ని నామరూప దేవతలు లేరు! ఉన్నది ఒకటే ! నామ, రూపము లేని స్థితి శూన్య స్థితి మాత్రమే ఉన్నది! ఈ శూన్య స్థితి నుండి ఎవరి మనస్సు వారికి తగ్గట్లుగా ఏవో నామాలు, రూపాలు ఊహించుకొని … పూజలు చేస్తోంది! ఆరాధన చేస్తోంది! హారతినిస్తూ నైవేద్యాలు పెడుతోంది! ఇదంతా మనస్సు మాయ లీల అని తెలిసిన నాడు నువ్వే భగవంతుడిని అవుతావు! నీ కోరిక తగ్గట్టుగానే ఈ మనస్సు దాని తగ్గ నామ రూప ధారిని చూస్తోంది! అందువలన అప్పటిదాకా మనస్సు మనో భ్రాంతిలో కలలాంటి నిజం అని నమ్ముకుని ఉంటావు! మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటావు! మా మతం గొప్పదని విర్రవీగుతాడు! మతాలు సమానమని… దేవుడు ఒకటేనని…ఆ దేవుడు నీవేనని…. ఇప్పుడు మేము చెప్పిన నమ్మలేని స్థితిలో పరిస్థితిలో ఉన్నారు! అది చెబితే అది చదివితే అర్థమయ్యే పరిస్థితి కాదు! ఎవరికి వారే తమ స్వానుభవ అనుభూతి పొందితేగాని నమ్మలేరు! తెలుసుకోలేరు!

31.              అంటే నన్ను నేను తెలుసుకుంటే భగవంతునిని తెలుసుకున్నట్లేనా?
             అవును! ఎందుకు అంటే భగవంతుడు నీలో “నేను కాని నేను” రూపంలో ఉన్నాడు! నేను అనేది మనస్సు! నేను కానీ నేను అనేది ఆత్మ అని నువ్వు తెలుసుకోవాలి ! ఆత్మయే సర్వం విశ్వాత్మ అని తెలుసుకోవాలి! ఈ విశ్వాత్మ విశ్వంలో సర్వాంతర్యామి గాను మనలో అంతర్యామిగా ఆత్మ రూపంలో ఉన్నదని తెలుసుకోవాలి! ఇది తెలుసుకోవాలి అంటే…. నేను ఎవరిని అని ఆత్మ విచారణ చేస్తే ….సమస్త విచారాలు పోయి…. నీవే  ఆయన అని జ్ఞప్తిని పొందుతారు! మేము తెలుసుకున్నాము! ఇంకా నువ్వు ఇంకా తెలుసుకోలేదు! అదే తేడా! 

32.             మరి నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను?
             చంచలమైన నీ మనస్సు వల్లనే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు! రూపం లేని నీ మనస్సు రూపంలో ఉన్న భౌతిక వస్తువులు కావాలని…. వాటిని పొందాలని...వాటిని అనుభవించాలనే…. విపరీతమైన ధోరణులు కలిగి ఉండుటవలన …. నువ్వు తెలుసుకోలేని మాయా మోహము నీ మనస్సు ఇరుక్కు పోయినది! అది కోరికల మాయలలో ఇరుక్కున్న విషయం తెలిసిన బయటికి రాలేని నీ మాయలో నువ్వున్నావు! అంతా భ్రాంతియేనని తెలుసు! అంతా భ్రమ అని తెలుసు! తెలిసి తెలిసి ఎందుకు అగచాట్లు పడుతున్నా రని అందరికీ తెలిసినా…..  ఏమీ చేయలేని స్థితి అని తెలుసు!

33.             మరి నేను ఎప్పుడు తెలుసుకుంటాను?
             నీ మనస్సు కాస్త చంచల స్థితి నుండి స్థిరత్వం పొంది…. అస్ధిర మనస్సు కాస్తా కుదుటపడి స్ధిరముగామారితే…. అన్ని రకాల భ్రమలు,భ్రాంతులు తొలగిపోతూంటే… వివేక వైరాగ్యాలు వలన మాయలు,మర్మాలు  తొలగిపోతూంటే… నేను అనేది ఏమిటో తెలుసుకుంటావు! అది తెలుసుకుంటే సమస్తమూ తెలుసుకున్నట్లు! ఇది తెలుసుకోకపోతే సమస్త విషయాలు తెలుసుకున్న ఏమీ తెలియనట్లే అవుతుంది! దానికి మనము కోరికలు లేని స్థితికి వెళ్లిపోతే సహజసిద్ధంగానే మనము మనస్సు స్థిరపడిపోతుంది! 

34.             మరి నా మనస్సు ఎప్పుడు స్థిరపడుతుంది?
                   మొదట కోరికలు లేని స్థితికి వెళ్లాలి!  ఆ తర్వాత కర్మలు చెయ్యని స్థితికి వెళ్లాలి! ఆ తర్వాత కర్మఫలితాలు ఆశించని స్థితికి వెళ్లాలి! అన్నిటి యందు సమదృష్టి, సమ దర్శనం కలిగే స్థితి కి వెళ్ళాలి! ఆపై ఆలోచన లేని స్థితికి వెళ్లాలి! అప్పుడే నీ మనస్సు కాస్త చంచల స్థితి నుండి స్థిరపడుతుంది! విభిన్న భావాలనుండి ఏక భావానికి రావాలి! విభిన్న ఆలోచనల నుండి ఏక ఆలోచనకి రావాలి! విభిన్న కోరికల నుండి ఒక కోరిక కి రావాలి! మొత్తంమీద భిన్నత్వం నుండి ఏకత్వం లోనికి రావాలి! ఈ ఏకత్వ స్థితి అనేది మీ నామరూప దేవుడు కావచ్చును లేదా మీ ఇష్ట గురువు కావచ్చును లేదా మీ ఇష్ట కోరిక కావచ్చును లేదా మీ ఇష్ట ఆలోచన కావచ్చును లేదా మీ ఏకైక సంకల్పం కావచ్చును! ఇందులో ఏదో ఒకటి ఏక స్థితిని పొందాలి! ఏకత్వంలో ఉండాలి! మదిలో ఒక ఆలోచన ఉండాలి! ఇలా ఉండగలిగినంత అప్పుడే నీ మనస్సు మీ భిన్నత్వం నుండి ఏకత్వంకు వచ్చి స్థిరత్వమును పొందుతుంది! అప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని ఉన్నది ఒకటే నేను అదే పరమశూన్యమని తెలుసుకుంటావు!

35.             నాకున్న బాధల వలన వాటి నివారణ కోసం వివిధ రకాల ఆలోచనలు చేయడం జరుగుతుంది! మరి ఆ ఏక ఆలోచన ఎలా వస్తుంది?
               నిజమే! నువ్వు నానారకాలుగా బాధపడుతున్నావు! ఆకలి కోసం, నిద్ర కోసం, ఉన్నతి కోసం, ఉద్యోగం కోసం, కుటుంబం కోసం, నానా అగచాట్లు పడుతు న్నావు! నిజానికి ఇవి బాధలు పడుతున్నాయి నీ మనసా లేదా నీ శరీరమా ఒక్కసారి ఆలోచించు! ఈ రెండు అంటావు! కానీ నిజానికి ఇది ఏది బాధపడటం లేదు! బాధ పడుతున్నాయని అనుకుంటున్నావు! మీ శరీరానికి బాధ లేదు! నీ మనస్సుకి బాధ లేదు! కానీ అవి బాధలో ఉన్నాయని భ్రమ భ్రాంతి లో ఉన్నావు! ఎలా అంటే కడుపునిండా భోజనం చేసి పడుకుంటే….  నీ కలలో ఆకలి వేస్తున్నట్లుగా, భోజనం చేయాలని అన్నట్లుగా కల కంటే…  అప్పుడు మేలుకొని చూస్తే ఏమవుతుంది! అది నిజం కాదని కల అని తెలుసుకుంటారు! నీకు ఆకలి వేసినట్లు గాని ఇతరులకు ఆకలి వేస్తున్నట్లు గాని, నువ్వు భుక్తికోసం కష్టపడుతున్నట్లు గానే, వాళ్లంతా కూడా కష్టపడుతున్నట్లు గానే, కలలో చూస్తున్నారు అనుకో! ఇది నిజము కాదు కదా! అలాగే ఈ లోకమే ఒక కల అని తెలుసుకో! భ్రమ భ్రాంతి అని గ్రహించు! 

36.             అంటే నాకు నిజంగానే ఆకలి వేసినా తినకూడదు! ఎందుకంటే నేను కలగంటున్నాను కదా! అదే కదా మీరు అనేది? 
             అది తప్పు! ఇదియే మిడిమిడి జ్ఞానం మెట్టవేదాంతం! నేను చెప్పింది వేరు… నువ్వు అర్థం చేసుకున్నది వేరు! మన మనస్సు ఒక స్త్రీమూర్తిని చూపించి తల్లి అంటుంది! మరొకరిని భార్య అంటుంది! మరొకరిని కూతురు అంటుంది! నిజానికి స్త్రీ మూర్తి ఒక్కరే! ఆమెకి నామరూపాలు అనే కదా! అంటే నీ భార్య ఒకరికి తల్లి కావచ్చు! మరొకరికి కూతురు కావచ్చు! మరొకరికి సోదరి కావచ్చు! మరొకరికి అత్త కావచ్చు! ఒక నీ భార్య ఇన్ని పాత్రలు పోషిస్తోంది! ఆమెకి నామ రూపాలు అనేకం! అంటే ఇది అంతా మన మనస్సు యొక్క భ్రమ, భ్రాంతి మనోవికార రూపాలే కదా! అలాగే మీకు నిజంగానే ఆకలి వేస్తోంది! నేను తింటాను అనుకోవద్దు! ఇదే తినాలని అనుకోవద్దు! ఇది తింటేనే  నా ఆకలి తీరుతుంది అనుకోవద్దు! ఆకలి కి ఆ భగవంతుడు ఇచ్చిన దానితో అనగా గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితం ఆధారంగా నీకు ఏది కావాలో…  ఏది ఇవ్వాలో అదే వచ్చింది…  నేను దానిని వదిలి పెట్టి వదిలిపెట్టకుండా…  దానిని పూర్తిగా సంతృప్తి గా అవకాశాన్ని ఉపయోగించుకుని తీసుకోవాలి! ఇలా ఎంతమంది ఉంటున్నారు! జానెడు పొట్టకోసం కోట్లను కోట్ల రూపాయలు అవసరమా? అందరికి ఏమి కావాలి! ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలిసిన వాడు ఒక పక్క ఇస్తుంటే…. నాకు బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలి అనుకుంటూ…..  లేనిదాని కోసం మనశ్శాంతిని మనం కోల్పోతున్నాము కదా! ఎవరికైనా ఆకలి తీరేది పట్టెడు అన్నమే కదా! అది పచ్చడి మెతుకులు అయితే నష్టమా? ఆకలి తీరదా చెప్పండి! ఖచ్చితంగా తీరుతుంది కదా! మరి పులి హారాలు, దద్దోజనం, బిర్యానీ తింటే ఆకలి తీరుతుందా? తీరక ఆయాసం వస్తుంది! అపసోపాలు పడవలసి వస్తుంది! అనారోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిపాలు అవ్వడం జరుగుతుంది కదా! అంతా మన యొక్క కోరిక యొక్క వల్ల ఫలితం వలనే జరిగింది కదా! మన కోరిక మితంగా ఉండాలి! దానికి పరిమితులు ఉండాలి! మన కోరిక ఎపుడైతే అపరిమితంగా మారుతుందో దాని వలన ఏర్పడే బాధ వలన బాధపడటం జరుగుతుంది! మనశ్శాంతిని కోల్పోవడం జరుగుతుంది! అన్నిటినీ నేనే చేస్తున్న వాడికి తొక్క బాధలు ఉంటాయి! అన్నిటికీ స్పందించే వాడికి దుఃఖ బాధలు ఉంటాయి! అన్ని రకాల ఆలోచనలు చేసే వాడికి చుక్కలు ఉంటాయి! అంటే తాను యొక్క వ్యక్తి నేనే భావం పోయేదాకా బాధలు తీరవు! ఎప్పుడు కలుగుతూ ఉంటాయి! నేను చేస్తున్నాను అని అహం వదిలి …. కేవలం ఆ సర్వేశ్వరుడు అని ఆయన చేస్తున్నాడు అని తెలుసుకో! ఇక సుఖదుఃఖాలు లేని ఆత్మ శాంతిని పొందుతావు! ఆత్మ శాంతిని పొందుతూ ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఈ లోకంలో ఒక చెట్టు లాగా సాక్షీభూతంగా, ఆధారంగా కోపతాపాలకు స్పందించిన స్థితిలో ఉండాలి! అంటే ఈ చెట్టుమీద పక్షులు వాలినా పట్టించుకోదు! చెట్టు కింద నిద్రపోయే వారిని పట్టించుకోదు! కాయలు, పువ్వులు కోసిన తిట్టదు! కొడవలితో నరికిన వారిని వారించదు! అలా ఈ లోకంలో నువ్వు అన్నిటియందు, అన్ని వేళలయందు, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాల యందు ఉండగలిగితే…. నువ్వు కనే ఒక కలగా ప్రపంచమంతా భావించుకుని చూడు….  మాయలు, మర్మాలు, భ్రాంతులు, భ్రమలు లేని స్థితిని పొందుతారు! ఇది అంతా ఒక నిజం లాంటి కలయని అనుభవం అనుభూతి పొందు తావు! ఇదియే పరిపూర్ణ అవధూత స్థితిని అని శాస్త్ర వచనం! ఇది స్థితిని పొందిన వారిని పరమహంస , పరమ గురువు, పరమ అవధూత అని పిలుస్తారు! కొనియాడ బడుతారు!
                        
ప్రశ్న 37. ఇలా ఉండాలని చెప్పడం చాలా తేలిక కానీ ఆచరణలో అది సాధ్యపడుతుందా?
          నీ యోగ్యత అర్హత పరిమితులు ఏమిటో తెలుసు. పక్కవాడు డబుల్ బెడ్ రూమ్ కొన్నాడని నువ్వు ట్రిపుల్ బెడ్ రూం అప్పులు చేసి కొంటే ఆ తర్వాత అప్పులు తీర్చలేక బాధపడేది నువ్వే. ఆలోచించు. మన అర్హతను బట్టి మనకి ఏది నచ్చితే ఉన్నంతలో అదే కొనుక్కొని బాదరబందీ లేకుండా నయాపైసా లేకుండా ఉంటే మీకు కలిగేది ఆత్మ తృప్తియే కదా. మన కోరిక పరిమితులు దాటినప్పుడే అవి వస్తాయని ఆశపెట్టుకుని అప్పులు చేస్తే ఒకవేళ ఉన్న ఉద్యోగం పోతే ఉద్యోగంలో జీతాలు పెరగకపోతే మీ జీవితం కష్టాల కడలిలోనికి మీకు మీరే త్రోసినట్లే కదా. ఇది మీ అవివేకం వలన ఇతరుల మాటలు వినటం వలన మీ స్థోమతగురించి అతిగా ఊహించుకోవటం వలన జరిగినది. అంటే మనకి ఏమి కావాలో మనకి పరిమితి ఏమిటో మనకు తెలిసినప్పుడు మన కోరికను అదే పరిమితి లో ఉంచుకుంటే తీర్చుకుంటే సరిపోతుంది కదా. లేని వాటి కోసం తాపత్రయపడటం అవసరమా? అత్యాశకు పోతే చంకలు నాకవలసి వస్తుంది కదా. మనస్సు బట్టి కోరిక ఉంటుంది. కోరిక తీరే దానిని బట్టి ఉంటుంది. కోరికలు అదుపులో ఉంచుకుంటే సంతృప్తి. అది కాస్తా దాటితే మిగిలేది అసంతృప్తి. దీనిని బట్టి మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకుంటే సమస్తము ఆధీనం అయినట్లే కదా. సాధన సాధ్యతే సర్వం సాధ్యం. 

ప్రశ్న 38. కోరిక లేని వాడు ….ఆలోచన లేని వాడు…. ఎవరైనా ఉంటారా?
 ఉండరు. ఉండలేరు. బలహీనత లేని బలవంతుడుని ఇంతవరకు ఆ భగవంతుడే సృష్టించలేదు. ఎందుకంటే ఆయనకి ఏదో తెలియని బలహీనత ఒకటి ఉంది కాబట్టి ఆఖరికి సమాధి స్థితిలో కూడా ఉన్నాను అని ఆలోచన మిగిలే ఉంటుంది. ఆనందము శాంతి ప్రేమ ఏకాగ్రత భావాలు ఉంటాయి. ఏదో ఒకటి చేయాలనే తలంపు ఏదో ఒకటి ఏదో ఒకదానికి స్పందించడం ఒక ఆలోచన కలిగి ఉండటం చిట్ట చివరి దాకా ఉంటుంది. కానీ కోరికలు తగ్గించుకునే వారు కోరికలు దాటినవారు కోరికలు ఆధీనమైనవారు ఉన్నారు అని తెలుసుకోండి. 

ప్రశ్న 39.  కోరిక మిగిలిపోవడానికి కారణం ఏమిటి?
 మనము కావలసిన కోరిక మనకు అనుకూలంగా పరిస్థితి ఏవిధంగా అనుభవించక పోవడమే కోరిక మిగిలిపోవడానికి కారణమవుతోంది. మన కోరిక ఏ విధంగా తీర్చితే సంతృప్తి చెందుతారో తెలుసు కానీ ఇతరులను చూసి ఆ విధంగానే ఆ కోరిక తీర్చుకోవాలి అని అనుకోవడమే మాయ కి లోనవుతున్నాం. మాయకి గురి అవుతాము. చాలామంది మాయ అంటే ప్రేమ అని చెబుతారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గానే చూపించే భ్రమ లాంటిది ఈ మాయ అంటారు. కానీ నా స్వానుభవం ప్రకారంగా చూస్తే మాయ అనేది జ్ఞానం కలిగి ఉండుట అని తెలిసినది. రూపం లేని మనస్సు రూపము వస్తువులను పొందాలనుకోవడం జరుగుతుంది. దానివలన కోరిక మిగిలిపోతుంది. అది ఎలా సాధ్యం. 

ప్రశ్న 40. మాయ అంటే ఏమిటి?
 పౌర్ణమి వెన్నెలలో ఉన్నప్పుడు దారి మీద ఉన్న తాడుని చూసి ఒక క్షణం అది పాము అనిపిస్తే ఇందులో ఏది నిజానికి మాయ చెప్పండి. తాడు కాస్త పాములాగా అనిపించటం లేదా తాడే పాము అనే భ్రమ కనిపించిన…. ఇందులో ఏది మాయ అవుతుందో చెప్పండి. దానికి ఈ తాడు మాయ కాదు. మీకు పాము అని జ్ఞానము ఉండటం వలన తాడు కాస్త పాము లాగా అనిపించింది. మీకు జ్ఞానం లేకపోతే ఎలా అనిపించేది. పాముని సంబంధించిన జ్ఞానము లేకపోతే అది మీకు తాడు అనేది తాడుగానే కనిపిస్తది. కొంపతీసి పాము కాదు కదా అని భయంతో కూడిన జ్ఞానమునే మాయ అంటున్నాము. అది నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి. ఇలాగే మన కోరికలు తీర్చుకుంటున్నాము.

ప్రశ్న 41. మరి మాయ అనేది మన మీద ఎలా చూపిస్తుంది? ఎలా ప్రభావం చూపిస్తుంది?
 నేను వేరు - నువ్వు వేరు అనే భావన కలిగిస్తుంది. నిజానికి మనము ఇద్దరం అద్దంలో ప్రతిబింబం లాంటి వారము. తమకి తమ ప్రతిబింబానికి నిజానికి ఏమీ తేడా ఉండదు కదా. కానీ తేడా ఉంటుంది అని జ్ఞానం ఇచ్చిన ఇది మనల్ని వేరుచేసి చూపించేది మాయ అన్నమాట. 

ప్రశ్న 42. అంటే నేను మీరు ఈ జనాలు ఈ జీవులు అంతా ఒక్కటేనా?
 ఒక్కటే. మనమంతా ఒక తాను బట్టలోని ప్రోగులమే. ఒక పెద్ద కేకు తెచ్చి దానిని చిన్న చిన్న ముక్కలు చేసి ఇప్పుడు అలాగే ఒకటైన వేర్వేరుగా ఉంటుంది. ముక్కలు చేసి పంచినారు. ఇప్పుడు ఈ కేకుకి ముక్కలుకి తేడా ఏమైనా ఉంటుందా? ఆలోచించు. మనమంతా కూడా ఒక పదార్థంలోని వాళ్ళమే కదా. అలాగే వివిధ రంగులతో ఆవులు ఉన్నప్పటికీ మనమంతా కూడా వాటి నుంచి వచ్చే పాలు తెల్లగానే ఉంటాయి కదా. అలాగే మనము కూడా బ్రహ్మ పదార్థము లోని వారమే. మనమంతా ఒకటే. మనము వేరు అనుకునే జ్ఞానం కలిగి ఉంటే మాయ అవుతుంది. మాయ తొలగితే అంతా అర్థమవుతుంది. పదార్ధము దాటితేగాని యదార్థ జ్ఞానము తెలియదు. 

ప్రశ్న 43. ఈ లెక్కన స్త్రీ పురుషులు కూడా ఒక్కటేనా?
వీరిద్దరికి ఎలాంటి భేదము ఉండదు. ఒక అద్దమును పగలగొడితే అది రెండు సమాన భాగాలుగా అవుతుందా. అవ్వదు కదా.రెండు సమాన ముక్కలు కానంత మాత్రాన ఇవి అద్దములోని భాగాలు కాకుండా పోవుగదా.ఇలాంటి వారే స్త్రీ పురుష భాగాలన్నమాట. లింగ భేదం వలన నువ్వు వారిని వేరు గా చూస్తున్నావు. అదే ఈ జ్ఞానము లేకపోతే నువ్వు వారిని వేరు చేయగలవా? లింగ భేద జ్ఞానము ఉన్నవారికి నగ్నత్వం కనపడితే లింగ భేద జ్ఞానము లేని వారికి దిగంబరత్వం కనపడుతుంది అని తెలుసుకో. 

ప్రశ్న 44. స్త్రీమూర్తులు గర్భం ధరిస్తారు కదా. మరి పురుషులు గర్భం ధరించరు కదా. మరి వాళ్ళు వీళ్ళు ఎలా ఒకటవుతారు?
 అదే పెద్ద తప్పు. నిజానికి పురుషులు కూడా గర్భమును ధరిస్తారు. ఆహారం ద్వారా తమ కోరిక తగిన సంతానము తమ గర్భంలో ఉంచుకుంటారు. వీర్య రూపముగా ఉంచుకుంటారు. మంచి సంతానం కావాలని కోరిక కలిగినప్పుడు స్త్రీమూర్తి ని చేరి వారి మైధున ప్రక్రియ ద్వారా వీరి గర్భమును వారికి ఆపాదించి వారిని గర్భవతిని చేస్తారు. సంతానమును పొందుతారు. మూల జ్ఞానము తెలుసుకుంటే సందేహాలు ఉండవు.

ప్రశ్న 45. మరి మనుషులు అలాగే జంతువులు ఎలా ఒకటి అవుతాయి?
 అన్ని జీవరాశులకు ఆకలి నిద్ర మైధునం భయము అనే గుణాలు ఉంటాయి. కానీ మానవుడికి వీటితో పాటు జ్ఞానం అనే గుణం ఉంటుంది. అందువలన మానవులు వీటి నుండి వేరు చేయబడినట్లుగా కనపడుతున్నాడు అని ఈ జంతువులకు కూడా జన్మాంతర జ్ఞానం ఉంటుందని ఎవరికీ తెలియని నగ్నసత్యం. ఎలా అంటే అప్పుడే పుట్టిన లేగ దూడకి ఆవు పొదుగు దగ్గర పాలు దొరుకుతాయి అని ఎలా తెలుస్తుంది చెప్పండి. గత జన్మలో ఇదే పని చేయటం వలన ఆ యొక్క జ్ఞానము దానికి జన్మజన్మలకు లో ఉండి పోయింది. దానిని మనము జన్మాంతర జ్ఞానము అంటాము. ఇది ప్రతిజీవిలోనూ ఉంటుంది. అంటే వాటికి వాటి స్వరూపము మేరా వాటికి కావాల్సిన జ్ఞానము వాటికి ఉన్నట్లే కదా. జ్ఞానము లేని జీవితం లేదని తెలుసుకోండి. అంతెందుకు. జ్ఞాన ప్రదాతగా గుర్రం తల ఉన్న హయగ్రీవుడిని నామరూపధారి దేవునిగా చేసినారు కదా. అంటే జంతువులకు జ్ఞానం ఉన్నట్లే కదా. ఆ లెక్కన చూస్తే అవి మన నుండి ఎలా వేరుచేయబడతాయి. అంటే అవి మనము ఒకటే కదా. మన శరీరాలులాగానే వాటి శరీరాలు కూడా పంచభూత నిర్మితమే. దశేంద్రియాల నిర్మితమే అని తెలుసుకోండి. మీరు అనుకోవడం వేరు చేయడమే మాయ అవుతుంది. 

ప్రశ్న 46. మరి మాయని జయించలేమా?
 ఇది మాయా గుణమని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే మనకున్న మాయ మాయమవుతుంది. మనిషికి నీడలాగా జీవుడికి జ్ఞానమనే మాయ అలాంటిదే. ఎండలో ఉంటే నీడ కనపడి మాయ కలిగిస్తుంది. అదే నీడలో ఉంటే మాయ మాయమవుతుంది. నేను అనే అహం రూపంలో అందరిలోనూ ఉండేది మాయ అనితెలుసుకోండి. మూల మహామాయ అని తెలుసుకోండి.  

ప్రశ్న  47. ఈ లెక్కన చూస్తే సృష్టియే మాయ అవుతుందా?
 సృష్టి అనేది ఉంది అనుకుంటున్న జ్ఞానమే మాయ అవుతుంది. నిజానికి విశ్వము లేదు. సృష్టి లేదు. స్థితి లేదు. లయము లేదు.జీవుడు లేడు. దేవుడు లేడు. లోకాలు లేవు. భయము లేదు.అండ పిండ బ్రహ్మాండం లేవు.నక్షత్రాలు లేవు. గ్రహాలు లేవు. సూర్యచంద్రులే లేవు.వున్నాయని జ్ఞానమనే భ్రమ భ్రాంతి మాయ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నారు. నిజానికి ఇవేవీ లేవు అని తెలుసుకుని అనుభవ అనుభూతియే బ్రహ్మ తదాకార స్థితి అవుతుంది. ఏ మాయ కి స్పందించని పరిపూర్ణ అంతిమ సాధన స్థితి అన్నమాట. కలలు కనేవాడు లేడు.కలలు లేవు. మాయా లేదు.

ప్రశ్న 48. మీరే త్రిలోకాలు త్రిమూర్తులు చూశాను అని చెప్పినారు కదా. మరి ఇప్పుడు ఏమి లేవంటున్నారు?
 నిజమే. అవి ఉన్నాయి. వాటిని చూశాను. అక్కడున్న వారిని చూశాను. అది నిజం కాదు. అది మా యొక్క భ్రమ భ్రాంతి అన్నమాట. నిజము లాంటి కల… కల లాంటి నిజమని గ్రహించు. ఒకప్పుడు అవి ఉన్నాయని అనిపించినాయి. అంటే ఒకప్పుడు మా ముత్తాత ఉండేవాడు. ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. మరి లేరు అనలేము. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నాడు అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు లేడు కదా. ఇవన్నీ కూడా ఒక ఉల్లిపాయ లాంటిదే. విశ్వమంతా ఒక ఉల్లిపాయ అనుకో. ఈ పొరలు అనేది దేవతలు గ్రహాలు నక్షత్రాలు మనుష్యులు అనుకుంటూ తీసుకుంటూ పోతే ఏమి మిగులుతుంది. ఉల్లి పొరలున్న ఉల్లిపాయ కనిపించదు కదా. అప్పటిదాకా ఉన్న ఉల్లిపాయ ఏమైంది. ఇది నిజమా అబద్దమా ఆలోచించు. ఉల్లిపాయ అనేక పొరలు కలిసి ఉండటం వలన అది మనకి ఒక ఉల్లిపాయ లాగా నిజము లాంటి పదార్థంగా కనబడింది. నిజానికి అది నిజం కాదు కదా. అదే నిజమైతే అదే శాశ్వతంగా ఉండిపోవాలి కదా. మరి ఉల్లి పొరలు పూర్తిగా తీయగానే ఏమైంది. పోయింది కదా. మరి ఉల్లిపాయ వుండటం నిజం కాదు కదా.సత్యములాంటి అసత్యమే కదా. కనిపించేది అసత్యము. కనిపించనిది సత్యము అని తెలుస్తోంది కదా. అలాగే మేము కూడా మా స్వరూప పొరలు తీసుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి దేవుళ్లు దేవతలు దైవిక వస్తువులు ఉన్నాయి. ఇవి నిజాలు కాదు. ఒట్టి మాయ జ్ఞాన భ్రమ భ్రాంతులేనని అనుకుంటూ వీటిని దాటుకుంటూ అనగా ఉల్లి పొరలు తీసుకుంటూ పోతే అనగా దైవసాక్షాత్కారం దైవ దర్శనాలు ఆత్మసాక్షాత్కారం ఆత్మ దర్శనాలు అన్ని దాటుకుంటూ పోతే మాకు చిట్టచివరికి చితాగ్నిలో మూల కపాల దర్శనము అయింది. ఆపై శూన్యమే మిగిలినది.ఎవరు లేని ఏమీ లేని నేనే లేని స్థితి కనపడింది. మిగిలినది అంటే ఉల్లిపాయ మాయం అయినట్లుగా విశ్వం మాయమయినది. అప్పటిదాకా సత్యములాగా ఉన్న విశ్వము కాస్తా అసత్యమైనది.ఒకటి ఆలోచించు. ఇంత చిన్న విత్తనములో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో ఆలోచించు. నిజానికి ఉండదు కదా. విత్తనమును విడదీస్తే మనకి చెట్టు కనపడుతుందా?మరి అదే విత్తనమును నాటితే మర్రిచెట్టు ఎలా వస్తుంది. ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచిస్తే మర్మమేమిటో నీకే తెలుస్తుంది. నిజానికి అందరూ మర్రిచెట్టు భ్రమ భ్రాంతి అంటారు. ఈ చెట్టు తో పాటు విత్తనం కూడా భ్రమ భ్రాంతి అని నేనంటున్నాను. ఈ రెండూ కూడా సత్యాలు కావు. అసత్యాలే. విత్తనం నుంచి చెట్టు రావటం అనేది నిజం లాంటి కల అయితే అదే చెట్టు నుండి విత్తనము తిరిగి రావటం అనేది కలలాంటి నిజం అవుతుంది. ఈ లెక్కన రెండూ కూడా అసత్యాలే. దేవుడు లేడు.జీవుడు లేడు. అవి ఉన్నాయని అనుకునే దాని వల్లనే జరిగినది. నువ్వే అసత్యం అయినప్పుడు నీవే దేవుడువి అయినపుడు సత్యము ఎలా అవుతావు. దేవుడికి మరణం ఉన్నది. నీకు ఉన్నట్లే. నువ్వు రూపమును అంతము చేసుకుంటే ఆయన రూపాంతరం చెందుతున్నారు. అంతే తేడా. నీవే దేవుడు అయినప్పుడు నువ్వు కూడా రూపాంతరం చెందుతావు. అసలు నువ్వు ఉన్నావు అని అనుకోవడమే మూల మాయ అవుతుంది. మనము ఆత్మ లేదు అని అనుకోవడమే మోక్షప్రాప్తి. నిజానికి మాయ అనేది ఎక్కడో లేదు. నేను అనే అహం రూపంలో నీలోనే ఉందని తెలుసుకో.

ప్రశ్న 49. ఈ లెక్కన జననమరణాలు నిజము కాదా?
 ఇక్కడ సృష్టియే మాయ అన్నప్పుడు సృష్టిలోని ఒక భాగమైన సృష్టియఙ్ఞము మాయ కాకుండా ఎలా ఉంటుంది. ఎవరు పుడుతున్నారు. ఎవరు చస్తున్నారు. పుట్టుక లేని వాడికి మరణం ఎక్కడ ఉంటుంది. ఆలోచించు. మరణం లేనివాడికి పుట్టుక ఎక్కడ ఉంటుంది. నువ్వు పుట్టావని ఆనందపడటం నువ్వు చనిపోయావని బాధపడటం అనేది మనస్సు యొక్క భావన మాయ. ఇది ఎలా అంటే మీ పుట్టుకకి కారణం మీ అమ్మగారు ఈవిడకి పుట్టుకకు కారణం వాళ్ల అమ్మగారు. ఆవిడకి పుట్టిన కారణంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చోటకి వచ్చేసరికి వారి పుట్టుకకి  మహర్షులు వస్తారు. వారే గోత్రనామాలుతో రుషులు అన్నమాట.వీరిని దాటితే దేవతలు వస్తారు. వీటిని దాటితే పరమాత్మ వస్తాడు. ఈ లెక్కన నీ పుట్టుక మీ అమ్మ దగ్గర నుండి మొదలు పెడితే చివరి దాకా వచ్చినది. చివరికి పరమాత్మ దాకా వచ్చినది. మరి ఈయన ఎక్కడి నుండి పుట్టినాడు. శూన్యము నుండే కదా. శూన్యం అంటే ఖాళీ ప్రదేశమే కదా. ఒక ఉల్లిపొర నుండి ఉల్లిపాయ వచ్చినట్లుగా నువ్వు కూడా ఒక దైవ కణం నుండి మరో సారిగా నామ రూపధారి స్వరూపంగా వచ్చినావు కదా. అంటే ఖాళీగా ఉన్న స్త్రీ గర్భాశయము నుండి ఒక పిండము నామరూపధారిగా వచ్చినది. ఇలా రావటం అనేది మీ తల్లిదండ్రులు కన్న కల. వారి ఆశయాలు ఆశలు ఆశయాలు కన్నవారికలలు అని తెలుసుకో. ఇలా నువ్వు పుట్టడం అనేది ఈ తల్లిదండ్రుల కన్న కల వారి కలలో పాత్ర అని తెలుసుకో. కల పుడితే జననం కల అయిపోతే మరణం. కలలు కనే కళ్ళు కూడా కళ్ళు మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం. మరి ఇందులో ఏది నిజం.

ప్రశ్న 50. నాకు అంతా గందరగోళంగా అయోమయంగా ఉంది. నేను నిజం కాదని ఎలా నమ్మేది?
 యోగ సాధన ద్వారా అనుభవ అనుభూతులు పొందితే స్వానుభవం కలిగినప్పుడు నేను అనే మహా మాయ తొలగి అసలైన సత్యం తెలుస్తుంది. అందుకు మొదట నేను ఎవరిని? నన్ను సృష్టించింది ఎవరు? నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ నీకు నీవే విచారణ చేసుకుంటూ పోతే సమస్త విషయాలు తొలగిపోతూ అనగా ఉల్లిపాయలోని ఉల్లి పొరలు తొలగినట్లుగా నీకు ఉన్న మనో భ్రమ భ్రాంతులు.. నిజంలాంటి కలలు.. కలలులాంటి నిజాలు అన్నీ కూడా పోయినప్పుడు నేను అనే స్థితికి చేరుకుంటారు. అప్పుడు నేను అనేది త్యాగము చేస్తే సర్వ పరిత్యాగిగా దేనికి స్పందించని బ్రహ్మ తదాకార స్థితికి అనగా ఈ సాధన హృదయానికి చేరితే అక్కడ ఏమీ చేయటానికి లేని స్థితి ఏమీ లేని స్థితికి చేరుకుంటారు. పరమ శూన్యము స్థితికి చేరుకుంటారు.అప్పుడు నిజ బ్రహ్మజ్ఞాన స్థితిని అనుభవ అనుభూతిగా పొందినప్పుడు నేను ఏమిటో తెలుసుకుని నేను నిజముకాదని అనుభూతి పొందుతారు. అప్పటిదాకా మేము ఏమి చెప్పినా ఈ సందేహ అనుమానపు బుద్ధి వలన నమ్మలేవు. నమ్మకం రాదు. 

ప్రశ్న 51. అంటే నేను ఎవర్ని తెలుసుకుంటే సాధన అయిపోతుందా?
 ఖచ్చితంగా అయిపోతుంది. అసలు నువ్వు ఎవరు ఫలానా వాడి అబ్బాయివి లేదా అమ్మాయివి అంటావు. అది కాదు అంటాను. అప్పుడు ఫలానా  పేరు ఉన్న వాడివి అంటావు. అది కాదు అంటాను. ఫలానా వ్యక్తివి అంటావు. అది కాదు అంటాను. ఫలానా వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాడివి అంటావు. కాదు అని నేనంటాను. ఫలానా తల్లిదండ్రులకు పుట్టిన వాడిని అంటావు. అది నేను కాదు అంటాను. ఫలానా వ్యక్తిని ఫలానా బంధువుల వ్యక్తిని ఫలానా స్నేహితుల వ్యక్తిని. ఫలానా వ్యక్తికి భార్య లేదా భర్తని అంటూ ఉంటావు. నేను కాదు అని అంటుంటాను. అంటే ఇలా ప్రతి దానికి నువ్వు చెప్పే ఫలానా నువ్వు కాదని తెలుసుకోవాలి. వాటిని దాటి కోవాలి. అప్పుడు నేను ఫలానా సాధకుడిని. అప్పుడు నేను ఫలానా యోగిని అని ఫలానా  భక్తునిని అని ఫలానా జ్ఞానిని ఫలానా ధ్యానయోగి. నేను ఫలానా శబ్ద పాండిత్యాన్ని. ఫలానా అనుభవ పాండిత్య యోగిని. ఇలా ఫలానా ఆత్మ అని చివరికి వస్తావు. ఇవేవీ కాదు అనుకుని చివరికి ఇవి కూడా నువ్వు కాదని దాటుతావు. అప్పుడు నేనే దేవుడు. నేను ఫలానా దేవుడ్ని. ఫలానా దేవతనని ఫలానా మహర్షిని అని ఫలానా ఋషి అని ఫలానా అవధూత అని ఫలానా పరమహంస అని చెప్పుకుంటూ వస్తావు. చివరికి ఇలా చెప్పినవన్నీ కూడా నేను కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు నేను ఫలానా భూలోక వాసిని అని నేను ఫలానా చోట వాటిని అని నేను ఫలానా కారణం లోకవాసిని అని ఫలానా ఇష్ట లోకవాసిని అని ఫలానా కోరిక అని ఫలానా భావన అని నేను ఫలానా ఆనందం అని నేను ఫలానా కర్మ అని నేను ఫలానా క్రియ అని నేను ఫలానా జన్మ అని నేను ఫలానా అఖండజ్యోతిని నేను ఫలానా ఆత్మ జ్యోతిని నేను ఫలానా దివ్యజ్యోతిని నేను ఫలానా జ్యోతి బిందువని నేను ఫలానా జ్ఞాన జ్యోతివని నేను ఫలానా పరంజ్యోతి అని చెబుతారు. ఇవి కూడా నేను కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు నీకు శూన్యస్థితిలో చితాగ్నిలో దహనమవుతున్న బ్రహ్మకపాల దర్శనం అవుతుంది. ఇది కూడా నేను కాదు అని తెలుసుకుంటావు. నేను అనేది అహం అని తెలుసు కుంటావు. నేను అనేది త్యాగము చేస్తే ఆత్మశాంతి కలిగి పరమ శూన్య స్థితిని పొందుతారు. అంతటితో సాధన పరిసమాప్తి అయినట్లే. నువ్వు లేదు. నేను అనేది లేదు. మనది అనేది లేదు. నీది లేదు. నాది లేదు. నువ్వు లేవు. నేను లేను. ఇవేమీ లేని పరిపూర్ణ పరిస్థితిని పొందినప్పుడు కలిగే బ్రహ్మానంద స్థితియే సచ్చిదానందము. ఇప్పుడు నువ్వు పొందే స్థితియే బ్రహ్మ తదాకార స్థితి అవుతుంది. అంటే పసిపాప మనస్సు లేని స్థితిని పొందుతాడు అన్నమాట. కోరిక లేని ఆలోచన లేని భావన లేని స్పందన లేని సంకల్పం లేని కర్మ లేని జన్మ లేని స్థితి అది ఇలాంటి స్థితి కావాలి. అంటే వారు మనస్సు లేని స్థితి పొందాలి అన్నమాట. నిశ్చల స్థితి పొందాలి అన్నమాట. వచ్చిన చిక్కంతా నేను అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో మాయలో పడిపోయి ఆగిపోవడం జరుగుతుంది.

ప్రశ్న 52. ఈ లెక్కన యోగ సాధన అంటే వెనక్కి వెళ్లడమే అవుతుంది కదా?
 అవును. నిజమే ప్రస్తుత జన్మ నుండి వెనక్కి వెళుతూ వెళుతూ నువ్వు అనుభవించిన గత జన్మలు ఎత్తిన దేవతా రూపాలను చూసుకుంటూ వారిని వాటిని దాటుకుంటూ నీ సూక్ష్మధారి రూపాలు నీ కారణ శరీరాలు సంకల్ప శరీరధారి రూపాలు ఆకాశ శరీరధారి వివరాలు లోకాలు దాటుకుంటూ నీ అది జన్మ వివరాలు నీ ఆది జన్మ మానవజన్మ వివరాలు నీ ఆది జన్మ జంతువు జన్మ వివరాలు నీ ఆది జన్మ దైవ స్వరూప దర్శనాలు నీ ఆది జన్మ అయిన మూలకాల దర్శనము పొందడమే నిజమైన యోగ సాధన అవుతుంది. దీని కోసము కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలి మార్గాలు ఉన్నాయి. పతంజలి అష్టాంగ యోగమైన బుద్ధుడు అష్టాంగ యోగమైన మరే ఇతర సాధనాలు మార్గమైన చివరికి నువ్వు అనేది లేని స్థితికి పరమ శూన్య స్థితికి తీసుకొని వెళతాయి. అంటే నువ్వు గాలి నుండి పుట్టినావు. తిరిగి గాలిలో కలిసి పోవటమే యోగసాధన అవుతుంది. శూన్యము నుండి శూన్య బ్రహ్మ గా అవతరించి నీకున్న నేను అనే మాయ వలన దైవ బ్రహ్మగా జీవబ్రహ్మగా పరంబ్రహ్మగా ఒక్క జన్మ నుండి వెయ్యి కోట్ల జన్మలు ఎత్తినావు. 36 కోట్లలో దైవ జన్మలు ఎత్తినా 84లక్షల జీవరాసులూ జన్మలెత్తినా నానా కష్టాలు పడిన మళ్లీ తిరిగి జీవాత్మ నుండి జీవ బ్రహ్మమై ఆపై పరబ్రహ్మమై ఆపై విశ్వాత్మవై శూన్య బ్రహ్మగా మారి శూన్యములో కలిసిపోవడమే యోగసాధన అవుతుంది.

ప్రశ్న 53. నేను మరణించినప్పుడు నా ఈ రూపాలు అంతరించి పోవాలి కదా. అలా ఎందుకు జరగడం లేదు?
 బాగుంది. నీ దేహం అంతా పంచభూత నిర్మితమే కదా. అలాగే పంచ వలయాలు ఉన్నాయని ఈ పంచభూతాలకి పంచ శరీరాలు నీలోనే ఉన్నాయి. అంటే భూతత్వానికి ప్రస్తుతం మన స్థూల శరీరము అలాగే జలతత్వానికి సూక్ష్మశరీరము అగ్నితత్వానికి కారణశరీరము అలాగే వాయుతత్వానికి సంకల్ప శరీరము అలాగే ఆకాశతత్వానికి ఆకాశ శరీరము ఉన్నాయి. ఎలా అంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి. దీనిలో పెంకు పెంకు కింద ఒక కోడిగుడ్డు తీసుకోండి. దీనిలో పెంకు ఇది శరీరము కింద ఉన్న పలుచని పొర శరీరమైతే కారణశరీరము శరీర నిర్మాణము పెంకు స్థూల శరీరము దీని కింద ఉన్న స్థూల శరీరము దీని కింద ఉన్న పలుచని తెల్ల సోన కారణశరీరము పచ్చ సోన సంకల్ప శరీరము దీని లోపల ఉన్న రేణు వంటి నిర్మాణము ఆకాశ శరీరము ఇప్పుడు నువ్వు చనిపోతే ప్రస్తుత శరీరమైన స్థూల శరీరము నాశనం అవుతుంది కానీ మిగిలిన నాలుగు శరీరాలు వాటి ధర్మాలు అలాగే ఉండిపోతాయి. ఇవి కాస్త మనం సరైన సమయంలో అదృశ్యమవుతాయి. మరణం అంటే కొత్త జన్మకి నాంది అని తెలుసుకో. మరణం అంటే పాత జన్మకి స్వస్తి అని తెలుసుకో. మరణం నుండి జననం అలాగే జననం నుండి మరణం అనగా విత్తనము నుండి చెట్టు లాగా చెట్టు నుండి తిరిగి విత్తనము లాగా అన్నమాట. అప్పుడు నువ్వు నిజంగానే మరణించడం లేదు. కేవలం నీ దేహమును వదిలి పెడుతున్నావు. దానిని మేము దహనం చేస్తున్నాము. మరి చనిపోయిన వాడివి ఆత్మగా ప్రేతాత్మగా ఎందుకు తిరుగుతున్నావు. ఆలోచించు. అందుకే సత్ గ్రంధాలు చదువు. గరుడ పురాణం చదివితే మరణ రహస్యాలు కూడా తెలుస్తాయి. 

ప్రశ్న 54. కోరిక వల్ల కర్మ ఏర్పడుతుంది దానివల్ల జన్మ వస్తుంది వీటిని ఇచ్చినది దేవుడే కదా. ఇందులో నా పాత్ర ఏముంది?
 మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఇదే కాబోలు అంతమయ్యే చోట ఆరంభము అవటం అంటే. నీ కోరికకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా. ఆదిలో ఉన్నది నీవే. శాశ్వతం మరణం పొందకుండా వెనక్కి తిరిగి వచ్చింది అది నువ్వే. నువ్వే కోరుకుంటున్నావు. నువ్వే తీర్చుకుంటున్నావు. నువ్వే ఆనందం పొందుతున్నావు. నీకు నువ్వే బాధలు పడుతున్నావు. ఇందులో దేవుడు పాత్ర ఏముంది. ఇందులో పరమ శూన్యము నుండి ఆదిదేవుడిగా వచ్చినది నీవే కదా. నీ నుండే కదా. మేమంతా ఈ లోకాలు ఈ జీవులు ఈ విశ్వము వచ్చింది. అసలు నువ్వు ఉన్నావని నీ కోరికలు తీర్చు కోవాలని కోరికలు అనుభవించాలని కోరికలు పొందాలని కోరిక తీరాలని ఇలా నేను ఉండాలని నేను అలా ఉండాలని అనుకోవడం భ్రమ భ్రాంతి అలా ఉంటుందని ఇలాంటి భ్రమ భ్రాంతులే మాయ అవుతుంది. నీకున్న ఏకైక కోరిక వలన నువ్వు ఇన్ని జన్మలు ఇన్ని అవతారాలు నీకు నువ్వే ఎత్తినావు కదా. ఎవరి వలన నీ వల్లనే కదా. ఇందులో దేవుడు పాత్ర ఉందా? లేదు కదా. ఆలోచించు. అన్నీ మీకే తెలుస్తాయి. 

ప్రశ్న 55. నా చుట్టూ నా అంతటా వ్యాపించి ఉన్న భగవంతునిని చూడటం ఎలా?
 మొదట నేను అనేది ఎవరు అని విచారించు. నీలో అంతర్యామిగా ఉన్న వాడు ఎవడో తెలుస్తుంది. వాడే సర్వాంతర్యామి అని అనుభవ అనుభూతి పొందుతారు. భగవంతుడిని చూడటం అంటే నువ్వు భగవంతుడిని అవ్వటం. ఈ మనస్సుకి ఏ భావాలు ఇస్తే అది నీ చూపులకి అదే భావం ఇస్తుంది. నీ మనస్సుని భోగం చేస్తే భోగిగా కనబడుతుంది. అదే నీ మనస్సు యోగము చేస్తే యోగిగా అవుతావు. లోకమంతా అయోమయంగా కనబడుతుంది. ఈ మనస్సుకి నీ ఇష్టమే ఇష్టదైవ రూపం ఇస్తే లోకమంతా ఆ రూపమే కనపడుతుంది. యద్భావం తద్భవతి అన్నమాట. అంటే భగవంతుడికి భిన్నంగా ఏమీ లేదు. నువ్వు భగవంతుడిని అనే విషయం అపస్మారక స్థితి యందు మరిచి పోయినావు. అది ఙ్ఞప్తికి తెచ్చుకుంటే నీకు భిన్నంగా ఏమీ లేదు అని తెలుసుకుంటారు. నీలో భగవత్తత్వం బయట పెడితే విశ్వమంతా భగవంతునిని చూడగలవు. అదే నీలో ఇంకా మాయ తత్వం ఉంటే యజమానివి కాస్తా పనివాడిగా ఈ లోకంలో భగవత్తత్వము ను కామన్ గా చూస్తావు. అంతా నీ మనస్సును బట్టి ఉంటుందని గ్రహించు.

ప్రశ్న 56. అయితే నేనే దేవుడ్ని అనుకుంటే సరిపోతుంది కదా?
 అదే తప్పు. నేనే దేవుడిని అనుకోవడం కాదు. నేనే దేవుడిని అనుభవ అనుభూతి పొందమని చెప్పాను. అనుభూతి వలన మర్చిపోయిన జ్ఞాన అనుభూతిని అనగా నేను ఎవరో ఇక అవడమే అవుతుంది. నేను దేవుడిని అనుకోవటం అనేది దేవుడు పాత్రలు వేసే పాత్రధారి అవుతారు. దేవుడు అవ్వటానికి దేవుడు పాత్రధారికి దేవుడుకి తేడా ఉంది కదా. నేనే దేవుడిని అనుకోవడం కూడా దేవుడు అవతారం వేసే పాత్రధారి లాగానే ఉంటుంది. 

ప్రశ్న 57. నేను చేసే ప్రతి పనికి కర్త నేనా లేదా భగవంతుడా? 
నువ్వే భగవంతుడివి అనే అనుభవ అనుభూతి పొందేవరకు నువ్వు కర్త కాదు. నువ్వు అనుకున్న నామరూపధారి దేవుడవుతాడు.నిజానికి ఇక్కడ రెండు భగవంతుడులు లేరు. ఉన్నది ఒక్కటే కానీ మాయ వల్ల రెండు భగవంతుడులుగా కనపడతాడు. ఒకరు నామము రూపము లేని నిరాకార బ్రహ్మం గా మరొకరు నామమున్న ఆకార బ్రహ్మంగా కనపడతారు. అదే సమాధిస్థితి లోనికి వెళితే నీవే భగవంతుడు. అదే సమాధి స్థితి నుండి బయటికి వస్తే నువ్వు వేరు భగవంతుడు వేరు అనే భావాలు వస్తాయి. చిక్కల్లా తాను భగవంతునిని కన్నా భిన్నమైనది అనుకోవడమే మాయా స్వరూపమైనది.

ప్రశ్న 58. నేనే దేవుడిని అని అనుభవ అనుభూతి పొందడం ఎలా? 
దానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. అష్టాంగ యోగాలు ఉన్నాయి. విగ్రహారాధనలు ఉన్నాయి. గురువుల ఆరాధనలు ఉన్నాయి. శబ్ద నాదయోగాలు ఉన్నాయి. మంత్ర తంత్రాలు యంత్రాలు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఙ్ఞాన మార్గం ఉన్నది. కర్మ మార్గము ధ్యాన మార్గము జపతప మార్గము  ఉన్నాయి. అన్నీ కూడా నేను ఎవరిని అనేది దాని దగ్గరికి తప్పకుండా తీసుకువెళతాయి.సమస్యల్లా మనస్సు కోతి వంటిది. ఈ మనస్సుకు నచ్చిన మార్గంలోకి మనం తీసుకొని వెళితే సాధన అయిపోయినట్లే. కానీ అలా జరగదు. ఒక మార్గం నుండి మరొక మార్గం లోనికి మనస్సు మారుస్తూ ఉంటుంది. ఏదో ఒక సాధనామార్గం ఒక సాధన గురువు ఒక సాధన దైవము సాధన మంత్రము ఒక సాధన పూజా విధానము ఒక సాధనము ఇలా ఏదో ఒకటి గట్టిగా వదిలిపెట్టకుండా పట్టుకుని వెళ్లండి. నేను అనేది ఏమిటో తెలుసుకుని దానిని వదిలిపెట్టరు. అనుమానాలకు సందేహాలకు తావు ఇవ్వద్దు. వదలిపెడితే కథ మొదటికి వస్తుంది. మూలాధార చక్రం తో మొదలయ్యి బ్రహ్మరంధ్రము వరకు మన సాధన ఆపకుండా కొనసాగిస్తూనే ఉండాలి. ఈ మధ్యలో వచ్చే ప్రమాదాలకు మానుకోవాల్సి వస్తుందని గ్రహించండి. 

ప్రశ్న 59. సాధనకి విగ్రహము అలాగే గురువు అవసరమా?
నిగ్రహము ఉన్నవాడికి విగ్రహంతో పని లేదు. నిగ్రహము ఉన్నవాడికి గురువుతో పనిలేదు. నిగ్రహము ఉండాలి అంటే మనస్సు స్థిరపడాలి. మనస్సు స్థిరపడాలంటే విగ్రహారాధన ఉండాలి. అలాగే అజ్ఞానము తొలగాలి. అంటే జ్ఞానం ఉన్న గురువు సహాయం కావాలి. అప్పుడే మన జ్యోతి వెలుగుతుంది. తద్వారా జ్ఞానము వలన మాయ మాయమవుతుంది. 

ప్రశ్న 60. సాధనకి ఏ మార్గం అవసరం? 
సాధనకి తప్పనిసరిగా పంచ మార్గాలు పంచ సాధనా మార్గాలు ఉండాలి. అవి కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని మార్గాలు అన్నమాట. కర్మ మార్గము వలన కర్మ రాహిత్యమును పొందు స్థితిని పొందుతారు. భక్తి మార్గము వలన విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధనకు వెళ్లగలుగుతారు. జ్ఞానము మార్గము వలన నేను అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాము. ధ్యాన మార్గం వలన నేను కానీ నేను ఏమిటో అనుభవ అనుభూతి పొందుతాము. కుండలిని మార్గము వలన కర్మ రాహిత్యము జన్మరాహిత్యము స్పందనా రాహిత్యము పొంది నిశ్చల స్థితిని పొంది తద్వారా ఆత్మ శాంతిని పొంది తద్వారా ప్రశాంత స్థితిని పొందుతారు. అనగా మోక్షప్రాప్తిని పొందుతాడు.

ప్రశ్న 61. మోక్షమనేది సన్యాసికే వస్తుందా? గృహస్థునికి కూడా వస్తుందా?
 అసలు మోక్షం అంటే ఏమిటి? నిజానికి మోక్షం అంటే ఒక్కొక్క దానిని విడవడమే కదా. విడుస్తూ ఆత్మయందే లయం చెందటమే కదా. దీనికి సన్యాసికి అలాగే గృహస్థుడుకి ఏమీ భేదం ఉంటుంది. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించడం కుటుంబ సంబంధాలను ఆస్తులను వదిలి పెట్టడం కాదు. నిజమైన సన్యాసం అంటే మన కోరికలు వ్యామోహాలు వదిలిపెట్టడం అని తెలుసుకో. దీనిని చేయకపోతే సన్యాసి అయినవాడు సన్నాసి అవుతాడు. అలాగే నిజమైన గృహస్థుగా అంటే అన్నీ నేనే చేస్తున్నానని అనుకోరాదు. చేసేది చేయించేది నాలోని అంతర్యామి అయిన ఆత్మస్వరూపం అనుకోవాలి. దీనికి ఇష్టమైనవి ఒకటి గుర్తుంచుకోండి. సన్యాసి అయిన గృహస్థుడైనా కర్మలు ఉంటే వాటిని చేయకతప్పదు. అనుభవించక తప్పదు. జరగవలసింది తప్పకుండా జరుగుతుంది. ఇద్దరు కూడా ఆకలి గురించి నిద్ర గురించి భయం గురించి ఆలోచిస్తారు. ఒకరు మఠంలో నిద్రపోతే మరొకరు మంచం మీద నిద్ర పోతారు. కాబట్టి మనస్సులో ఎలాంటి ఆలోచనలు రానీయకుండా విచారణ చేస్తూ ఆత్మధ్యానము చేసుకుంటూ ఆత్మానందం ఎవరైతే పొందుతారో వాళ్ళు తప్పక మోక్షం పొందక తప్పదు. 

ప్రశ్న 62. మాయ భ్రమ భ్రాంతి అంటున్నారు. అది అంటే ఏమిటి?
 నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చినావో ఆలోచించు. ఇంటి దగ్గర నుండి బస్సులో బయలుదేరి రైలు ఎక్కి నావు. నేను ఉన్న చోటికి చేరుకున్నారు కదా. బాగానే ఉంది. నువ్వు పొద్దునే ఏమి చేసావు అని అడిగితే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీ దగ్గర రావడానికి ప్రయాణం చేసి వచ్చినావు అంటావు. ఇది నిజమేనా? కాదు కదా. అసలు విషయం ఏమిటంటే నువ్వు ప్రయాణించలేదు. నువ్వు అలాగే ఉన్నావు. కానీ ప్రయాణం చేసింది కేవలం నువ్వు ఎక్కి వచ్చిన వాహనాలు కదా. జాగ్రత్తగా ఆలోచించు. ఇందులో ఉన్న మర్మము అర్థమవుతుంది. వాహనాలలో రావటం భ్రమ అవుతుంది. కదిలే వాహనాల్లో నువ్వు వచ్చానని (ప్రయాణం) అనుకోవడం భ్రాంతి అవుతుంది. నేను ప్రయాణం చేసి వచ్చాము అని అనుకోవటం మాయ అవుతుంది. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. 

ప్రశ్న 63. నేను ఎవరిని అని అనుకుంటే సరిపోతుందా?
 నేను ఎవరిని అనుకోవడం అనేది మంత్రం కాదు. జపం కాదు. అలాగే భావం కాదు. ఆలోచన కాదు. నిరంతరం తపన తాపత్రయంతో కూడిన ఆత్మ విచారణ చేసే మార్గం అని గ్రహించండి. నేను ఎవరిని అని అనుకుంటే సరిపోదు. అసలు నేను ఎవరిని అంటూ విచారణ చేసుకుంటూ మనస్సులో ప్రశ్నించుకుంటూ వేదన పడుతూ ఆందోళన చెందుతూ లోపలకి మన లోపలికి వెళ్లి మనలో ఉన్న అంతర్యామిని ప్రశ్నించాలి. సమాధానం దొరికే దాకా కొనసాగించాలి. నేను ఎవరిని అనుకోవడం కాదు. తెలుసుకునే అనుభూతి అని గ్రహించండి.

ప్రశ్న 64. నేను ఎవరిని అని తెలుసుకోవడం ఎలా?
 మీ ఉద్దేశంలో దీని గురించి ఎవరైనా దేవుడు గానీ గురువు గాని లేదా సాధన గాని మంత్రం గాని చెబుతుందా అని అనుకుంటున్నారా. అది ఎన్నటికీ చెప్పదు. ఎవరు చెప్పరు. నీకు నువ్వే తెలుసుకోవాలి. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. అసలు నువ్వే లేవు. నువ్వు నిజం కాదు అని తెలుసుకోవడమే నేను ఎవరిని అని తెలుసుకోవటం అసలు నువ్వు నిజం కాదని తెలుసుకోవటం ఎలా? అసలు నువ్వు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం నువ్వే చేయాలి కదా. ఎవరో వస్తారు. ఏదో చూపిస్తారు అనుకోవటం భ్రమ భ్రాంతి మాయ అవుతుంది. ఈ ఆత్మయే నీ ఆత్మ గురువు అవుతాడు. ఈ ఆత్మయే నీ ఇష్టం అవుతుంది. మీలోనే అన్నీ పెట్టుకుని బయట వెతకటం ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించు. పరితపించు. బాధపడుతూ తెలుసుకోవాలని ఉంది. ఎప్పటికైనా తెలుసుకుంటానని ఉండు. తపన పడి పరితపించు. ఏడువు. బాధ పడు. ఆవేశపడు. ఆవేదన ఆందోళనపడు. తెలుసుకోవాలని కాంక్షకలిగి ఉండు. అన్నిటి యందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండు. ఎప్పటికైనా తెలుసుకుంటాను అని నమ్మకం కలిగి ఉండు.ఓర్పు శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగి ఉండు. 

ప్రశ్న 65. మరి ఎందుకు చాలామంది నేను ఎవరిని అనేది తెలుసుకోలేకపోతున్నారు? 
చాలామంది నేను ఎవరిని అనేది అనుకోవడమే చేస్తున్నారు గాని తెలుసుకునే ప్రయత్నం చేయటంలేదు. ఎలా తెలుసుకోవాలో అలాగే అర్థం కాక ఆపి వేస్తున్నారు. ఒకవేళ తెలుసుకోవాలని అనుకున్నా ఏదో ఒక దేవుడిని పూజలు ఆరాధనలు జపాలు తపాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. పూజలో లోపాలు ఉన్నాయని తపన పడుతున్నారు. కానీ తను చేయవలసిన పూజ భౌతిక పూజ కాదని విగ్రహమూర్తి పూజలు కాదని తెలుసుకోవడం లేదు. విగ్రహారాధన నుండి విశ్వఆరాధనకు రావటం లేదు. విగ్రహంలో దేవుడు ఉన్నాడు గాని ఆ విగ్రహం చెక్కిన శిల్పిలో దేవుడు ఉండడా? ఆలోచించు. నిజానికి వీడు చేయవలసింది ఆత్మ పూజ.ఆత్మ జ్ఞానం పొందవలసిందే. ఆత్మజ్ఞానం అంటే ఇవి కొత్త రకపు పూజలు ధ్యానాలు కాదని తెలుసుకోండి. మీ మనస్సును నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటూ ధ్యాసే శ్వాస అవ్వాలి. ప్రశ్నకి సమాధానాలు వెతకాలి. నీలోనే సమాధానాలు వస్తాయి. వాటిని తీసుకుంటూ తీసుకుంటూ ప్రశ్న లేని సహజ స్థితి సమాన స్థితి సమాధానం లేని ప్రశ్న స్థితి అయిన హృదయ చక్రానికి చేరుకోవాలి. నేను అనేది ఎవరు ప్రశ్నిస్తున్నారు. నేను అనేది ఎక్కడి నుండి వస్తుంది అని తెలుసుకోవడమే తెలుసుకోవడం అని గ్రహించాలి.

ప్రశ్న 66. మరి సాధనలో వచ్చే మనో దర్శనాలు అనగా దైవ సాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారం వివిధ దర్శనాలు నిజమా అబద్దమా? 
సాధనలో ఇలాంటి మనో దర్శనాలు కలుగుతాయి. కలగాలి. కలిగితే గానీ మన సాధన ముందుకు వెళ్ళినట్లుగా మనం అనుకోలేము. కానీ మనం మాయలో పడిపోయి ఆగిపోకూడదు. అది బాగా గుర్తించుకోవాలి. అంతెందుకు. ఈ మనో దర్శనాలు నిజమైతే సత్యమైతే రామకృష్ణ పరమహంసకి నిత్యం కాళీ మాత దర్శనం అయ్యేది మాట్లాడేది అని అందరికీ తెలుసు కదా. మరి వారి గురువైన రామకృష్ణ నాయనా! నువ్వు కాళీమాతను దాటాలి. ముందుకు వెళ్లాలని ఎందుకు చెబుతాడు. ఒకసారి ఆలోచించండి. అలాగే నామదేవుడు అనే భక్తుడికి పాండురంగడు ప్రతినిత్యం కనబడేవాడు. మాట్లాడేవాడు. ఆయనే స్వయంగా ఒక సద్గురువుని చూసుకోమని ఎందుకు చెబుతాడు. అంటే పరిపూర్ణ జ్ఞానము ఇంకా పొందలేదని అందులకు గురువును వెతుక్కోమని వారి వారి ఇష్టదైవాలను అలాగే కొందరు గురువులు కాస్త వారి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారో చెప్పండి. అంటే మనకి ధ్యానములో కనిపించే దైవదర్శనాలు గురు దర్శనాలు వివిధ దర్శనాలు వివిధ శక్తులు సిద్ధులు శబ్దాలు ఇలాంటివి నిజం కాదని తెలుసుకోండి. ఇవన్నీ మనస్సు చేసే మనో భ్రాంతులు భ్రమలు అని గ్రహించండి. అక్కడితో ఆగిపోకుండా సాధన ముందుకు కొనసాగించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఆగిపోయారు అంటే అది మీకు మాయగా మారిపోతుంది. అంతెందుకు. కబీరుదాసు నిత్యం నామస్మరణ చేస్తే ఒకసారి అయోధ్య రాముడు తన శరీరంతో దర్శనమిచ్చాడు. దానికి కబీరుదాసు నవ్వుతూ మీరు ఎవరు? నేను పిలిచింది మిమ్మల్ని ఏమి కాదు. నాకు కావాల్సింది రామ అన్న పేరు ఉన్న వ్యక్తి కాదు. రూపం ఉన్న వ్యక్తి కాదు. నా దృష్టిలో రామ అనేది చైతన్యం. చైతన్యం అనేదానికి నామము లేదు. రూపం లేదు. అది కావాలి. నువ్వు కాదు అనగానే రాముడు అదృశ్యమయ్యారు. ఇంతటి సాధన శక్తి మనలో అందరికీ ఉంటుంది అని అనుకుంటూ ఆయన దాటుకుంటూ వెళ్లారు. కానీ ఇదే అయోధ్య రాముని సూక్ష్మశరీరము చూసి త్యాగయ్య పోతన రామదాసు తమ సాధనను ఆపివేసుకోవడం జరిగింది. రాముడు కాస్త కబీరుదాసుకి కనపడితే నిజము కాదు. భ్రమ అన్నాడు. రాముడు వీళ్ళకి కనపడితే ఆనందపడిన దానికి రామ అన్న నామాలు లేని రూపం లేనిస్థితికి తీసుకొని వెళ్ళాడు. వెళ్లాలి. వెళతాయి. కానీ మనకి మనమే కావాలని ఈ మనో దర్శనాలు మాయలో పడి పోతాము అని అనుకోను. దాటాలని ప్రయత్నాలు చేస్తున్నామని భ్రాంతిలో ఉంటున్నాము. 

ప్రశ్న 67. ఈ మనో దర్శన మాయలు మనకి ఏ చక్రాలలో ఉంటాయో తెలుసా? చెప్పగలరా?
 మనలో ఉన్న 13 యోగ చక్రాలకు 13 యోగ మనో దర్శనాలు ఉన్నాయి. మూలాధార చక్రము నందు గణపతి దర్శనం స్వాధిష్ఠాన చక్రము నందు విష్ణువు దర్శనము మణిపూరక చక్రము నందు ఇష్ట దైవ దర్శనం అనాహత చక్రము నందు మహాకాళుడు మహాకాళిక దర్శనము విశుద్ధి చక్రమునందు సరస్వతి దేవి దర్శనం ఆజ్ఞా చక్రము నందు శివశక్తి దర్శనము గుణ చక్రమునందు దత్త దర్శనం కర్మ చక్రము నందు శ్రీ రామ దర్శనం కాల చక్రము నందు కాలభైరవ దర్శనం బ్రహ్మ చక్రమునందు ఏకపాద శివమూర్తి నటరాజు దర్శనము సహస్రార చక్రము నందు శ్రీ కృష్ణ దర్శనము ఆత్మసాక్షాత్కారము దక్షిణామూర్తి దర్శనము జీవనాడి యందు హనుమంతు దర్శనము హృదయ చక్రమునందు ఇష్ట లింగ దర్శనము ఇష్టకామేశ్వరుడు కామేశ్వరి దర్శనం బ్రహ్మరంధ్రము నందు కపాల దర్శనము చితాగ్ని దర్శనము ఆదిపరాశక్తి దర్శనము పరమ శూన్యము స్థితి ఇలా ఈ దర్శనాలు అన్నింటిని దాటుకుంటూ పోయి పరిపూర్ణ శూన్యస్థితి అంతర్యామి సర్వాంతర్యామి ఉందని అది నీలోను నాలోను ఉన్నదని తెలుసుకోవడమే అంతటా వ్యాపించి విస్తరించి ఉన్నదని ఇదియే నేను అనేది అనుభవ అనుభూతి పొందే దాకా మన సాధనను కొనసాగించాలి.

ప్రశ్న 68. మనలో చాలా మంది ఏ మాయల దగ్గర ఆగిపోతున్నారో చెప్పగలరా? 
అసలు మనకి మనో దర్శనాలు కలగడానికి కారణం మనలో ఉన్న పంచ శరీరాలు ముందు తెలుసుకోవాలి. మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము ద్వారా స్థూల శరీరంలో దర్శనాలు ఉంటాయి. ఇది బయట చూస్తే జీవ ప్రకృతి అన్నమాట. అనగా పంచభూతాలతో నిర్మితమైనా ప్రకృతి అంటే మనకి కనిపించే ప్రకృతి అవుతుంది. దీనిలో వచ్చే పంచభూతాల మాయలు సిద్ధులలో 80 శాతం మంది పడిపోతారు. ఆజ్ఞా చక్రము నుండి బ్రహ్మ చక్రం ద్వారా సూక్ష్మ శరీరములో దర్శనాలు ఉంటాయి. ఇది మహా ప్రకృతి అవుతుంది. ఇందులో మానవ ప్రకృతి జీవ ప్రకృతి కలిసి ఉంటాయి. అంటే అర్ధనారీశ్వర తత్వం ఇందులో ఉంటుంది. శివ శక్తి ఇందులో ఉంటుంది. విష్ణు శక్తి ఇందులో ఉంటుంది. శివకేశవ శక్తి ఇందులో ఉంటుంది. శివ శక్తి మాయలు దాటలేక 20% సాధకులు సాధనలో ఆగిపోతారు. 10% సాధన చేసేవారు సాధన చేసే సాధకులు ఈ మాయలో పడిపోయి ఉంటారు. ఇక సహస్ర చక్రానికి వస్తే కారణ శరీరం యొక్క మాయలో దర్శనాలు ఉంటాయి. ఇందులో కృష్ణ దర్శనాలు రాధాకృష్ణ దర్శనాలు మహాదేవుడు దర్శనాలు ఉంటాయి. వీరిలో ఐదు శాతం మంది పడిపోతారు. అంటే 95 శాతం మంది సాధకులు ఈ సాధనకు వచ్చేసరికి ఆగిపోతారు అన్నమాట. ఇక హృదయ చక్రానికి వస్తే ఇష్ట కోరిక రూపంలో సంకల్ప శరీరధారి మన కోసం కాచుకుని ఉంటాడు. సహస్ర చక్రము నుండి ఈ చక్రానికి తొమ్మిది మంది మాత్రమే వస్తారు. అందులో ఎనిమిది మంది మాయలో పడిపోతారు. అది ఇలా అంటే మనకి కష్టసుఖాలుకి కారణము కోరికలు అని తెలుసుకుని కోరిక లేని సమాజము చూడాలని కోరిక ను పెట్టుకుని బుద్ధుడు ఎలాగైతే సాధన చేశాడో దానినే ఇష్ట కోరిక మాయ అంటారు. ఇందులో ఈ కోరికను ఒకడు దాటుకుని బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకుంటాడు. ఆదిపరాశక్తి  చూపించే సహనశక్తిని తట్టుకోగలిగితే వాడికి మోక్షప్రాప్తి.బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు. ఇలా వచ్చిన ఒక్కడు కూడా ఏదో ఒక సహన శక్తిని కోల్పోయి స్పందన ఆలోచన సంకల్పముతో వెనక్కి తిరిగి వచ్చి మళ్లీ మూలాధార చక్రానికి చేరుకుంటాడు.

ప్రశ్న 69. ఈ లెక్కన ఎవరూ పరిపూర్ణ యోగి కాలేదా?
 ఇప్పటివరకు కాలేదు. పరిపూర్ణ జ్ఞాని అయినా కానీ సంపూర్ణ యోగిగా లేరు. ఎందుకంటే సాధన అంశంలో మూలకాల దర్శనము అలాగే దర్శనము అవుతాయి. కపాలమునకు జ్ఞాన శక్తి ఉంటుంది. అనగా ప్రాణం ఉన్న కుండలిని శక్తి బ్రహ్మరంధ్రము వద్ద ఆకాశ శరీరధారిగా ఉంటాడు. అలాగే చితాగ్నికి దహన శక్తి ఉంటుంది. జ్ఞాన శక్తి అలాగే సహనశక్తిని సాధకుడు దాటలేక పోతున్నాడు. కారణం అక్కడికి వెళ్ళిన తర్వాత 96 నిమిషాల పాటు సహన శక్తి తో కలిగే స్థితిలో ఉండాలి. తను శాశ్వత మరణము పొందుతున్నాను అనే మహా మృత్యు భయం అతనికి తనకున్న జ్ఞానము వల్ల కలుగుతుంది. మహా నిర్వాణ శక్తి ఉన్న చితాగ్నిలో నానా అవస్థలు పడుతూ మరణించాలని జ్ఞానము వలన 96 నిమిషాలపాటు తట్టుకునే శక్తిని కొన్ని క్షణాలపాటు కోల్పోవడం జరుగుతుంది. దానితో సహన శక్తిని కోల్పోవటం వలన తిరిగి రావాల్సి వస్తుంది. ఇదంతా ఒక సినిమా కథ లాగా విఠలాచార్య సినిమా లాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరికి వారే తమ స్వానుభూతిని పొందితే తప్ప యధార్థ జ్ఞానాన్ని నమ్మలేరు. అప్పటిదాకా నమ్మకం రాదు. మేము కూడా మొదట ఇదంతా నమ్మలేదు. ఆ తర్వాత నమ్మక తప్పలేదు. శూన్యంలో పుట్టిన వాడు తిరిగి శూన్యంలోనికి వెళ్లలేకపోతున్నారు. శూన్యముగా మిగిలిపోతున్నాడు. శూన్య బ్రహ్మగా మిగిలిపోతున్నారని మేము గ్రహించాము. దీనికి కారణము ఆలోచన స్పందన సంకల్పము వీటిలో ఏదో ఒకటి తన సహనశక్తి కోల్పోయినప్పుడు ఏదో ఒకటి బయటకు వచ్చి ఒక కోరికగా మారుతుంది. దానితో శాశ్వత మరణం పొందవలసిన వాడు కాస్త అశాశ్వత మరణం పొందుతాడు. మోక్షమార్గమును పొందవలసిన వాడు కాస్త ముక్తి పధమును మాత్రమే పొందుతున్నాడు. 

ప్రశ్న 70. ఈ లెక్కన చూస్తే అందరూ కూడా ఏదో తెలియని భయానికి గురి అవుతున్నారా?
 అవుతున్నారు. అసలు భయం అంటే ఏమిటి. అది ఒక భావన మాత్రమే. ఏదో పోతుందని భావమే భయాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదో కావాలనే భావన కోరికను కలిగిస్తుంది. ఏదో పొందేది ఏమిటి? అది ఏమిటి అని విచారణ చేస్తే పోయేది ఏమీ లేదని ఉంది ఏమీ లేదని అందులో పనిచేసే బలహీన మనస్సు యొక్క మరణ భయం అలాగే ఇష్ట కోరిక అని తెలుస్తుంది. ఇది తెలియని వారందరికీ కూడా ఇష్ట కోరిక నందు మరణభయము నందు శాశ్వతంగా ఉండిపోతారు. 

ప్రశ్న 71. మరి ఈ భయాల నుండి…. కోరికలనుండి మనస్సుని ఎలా తప్పించాలి?
 యోగ సాధన ద్వారా అనగా సాధన అభ్యాసం వలన అవివేకం వలన మాత్రమే సాధ్యపడుతుంది. నువ్వు నీ ఆత్మపై దృష్టిని పెట్టే కొద్ది మనస్సులోని వివిధ రకాల ఆలోచనలు భావాలు కోరికలు సంకల్పాలు అనేవి వాటంతటవే తగ్గిపోతాయి. మనస్సుకు ఇష్టమైన యోగసాధన మార్గమును మీరు తెలుసుకుని ఎంచుకుని అమలు చేసినప్పుడు అది కాస్తా అంతర్యామిగా ఆత్మానందము చూడటం మొదలు పెడితే మీరు ఆగమన్నా ఆగదు. పోతూనే ఉంటుంది. స్థిర మనస్సుగా సాధనను కొనసాగిస్తుంది. ఆత్మ శాంతి అయిన ప్రశాంత స్థితిని పొందుతుంది. ఇదియే సాధన పరాకాష్ట అవుతుంది. 

ప్రశ్న 72. ఆత్మను తెలుసుకోవటం ఎట్లా?
 ఆత్మ అనేది నీకు భిన్నంగా వేరేగా లేదు. వేరుగా ఉందని వేరు చేస్తుందని నీకున్న జ్ఞానం వల్లనే కలుగుతుంది. నువ్వు ఉన్నది ఆత్మగానే పరమాత్మ అనే భగవంతుడు గాని బాగానే ఉన్నావు కానీ ఆ విషయం మరచి పోయావు. మరిచి పోయిన విషయం జ్ఞప్తికి చేసుకోవటానికి యోగ సాధన చేయవలసి ఉంటుంది. నువ్వు వేరు ఆత్మ వేరు అనుకుంటున్నావు. సముద్రం వేరు అలలు వేరు అన్నట్లుగా సూర్యుడు వేరు సూర్య కాంతి వేరు అన్నట్లుగా భావించటం వలన ఈ తిప్పలు కలుగుతున్నాయి. నేను ఫలానా అనే భావన విడిచిపెట్టు. నేను అనే మాయని ధ్వంసం చేసుకుంటే కానీ నేను అలా నాది అనే భావన పోదు. ఎప్పుడైతే అహం పోతుందో అప్పుడు ఇది లేదు. అది లేదు. ఏది ఉన్నది. ఏది లేదు అని అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా మౌనముగా నీ మనస్సు మారిపోతుంది. అదియే ఆత్మ స్థితి. ఇక ప్రశ్నించడానికి పొందటానికి ఏమీ ఉండదు.

ప్రశ్న 73. నేను ఆత్మ అనుకుంటే సరిపోతుంది కదా?
 అసలు అనుకునేది ఎవరు. అనుకోవటానికి చేయటానికి ఏముంది. అనుకునేవాడిని అయినా నేను ఎవరిని అనే అతనిని కనుక్కో. ఆత్మ అనుకుంటే సరిపోదు. ఆత్మానుభూతి పొందాలి.వల్లె వేయటం వలన ఏమీ జరగదు. అనర్థాలు తేడాలు తప్ప ఏమీ ఉండదు. అనుకోవటం తెలుసుకోవటం ప్రశ్నించడాలు సమాధానాలు చేసేది ఎవరు. ముందు వాడిని వాటిని వెతికి అసలు ప్రశ్నించేవాడు ఎవడో వాడిని తెలుసుకో. ఎక్కడి నుంచి వస్తుందో ముందు తెలుసుకో. వాడే నీ ఆత్మని వాడే నీ అంతర్యామి వాడే సర్వాంతర్యామి అని చెప్తే నువ్వు నమ్మవు కదా. నమ్మకం రాదు కదా. నమ్మకం రావాలి అంటే నువ్వు అనుభూతిని పొందాలి. ఆత్మ అని అనుకోవడం కాదు. ఆత్మ విచారణ చేయడం వలన తెలుస్తుంది. ఉదాహరణకు దొంగను పట్టుకోవాలి అని అనుకుంటూ కూర్చుంటే దొంగ ఎవరో తెలుస్తుందా. దొంగ దొరకడు కదా. నీ మనస్సు కూడా అంతే. దొంగతనం ఎలా జరిగింది దాని విధివిధానాలపై అక్కడ ఉన్న వివిధ రకాల ఆధారాలను బట్టి ఆ దొంగ ఎలా ఉంటాడో దొరికే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఆ దొంగ ఎలా ఉంటాడో విచారిస్తూ పోతే చివరికి దొంగ దొరికే అవకాశం ఎలా అయితే ఉంటుందో అలాగే ఆత్మ గురించి ఆత్మ విచారణ చేస్తే ఆత్మ ఏమిటో తెలుస్తుంది. విచారణ చేయకుండా విచారించకుండా కూర్చుంటే దొంగ ఎలా అయితే దొరకడో అలా నీ మనస్సు దొరకదు. అంతర్యామి అయినా నీ మనస్సు యొక్క ఆత్మ నందు అంటే మొట్ట మొదట నిన్ను నువ్వు చూడు. ఆ తర్వాత కనపడుతుంది. ఆ తర్వాత ప్రపంచమును చూస్తే నీ ఆత్మస్వరూపంగా కనబడుతుంది. అంతట నీవే ఉన్నావు. నువ్వు కానిది నువ్వు లేనిది ఏమీ లేదని తెలుసుకుంటావు. ఇదియే విశ్వరూప దర్శనం లేదా విరాట్ స్వరూపం దర్శనానుభూతి అవుతుంది. ఇవే ఆత్మ అయితే ఈ ప్రపంచమంతా బ్రహ్మముగా కనబడుతుంది. 

ప్రశ్న 74. ఇలా ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి?
 చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉంటాడు. చెప్పేవాడు లేకపోతే వినేవాడు ఎవరుంటారు. మొదట ఒక సందేహం వస్తుంది. దానిని తీరుస్తాం. దాని వెనుక ఒక సందేహం వస్తుంది. దానిని తీరుస్తాం. ఇలా ఒకదానితో మొదలై ఇప్పటిదాకా 72 ధర్మసందేహాలు వచ్చాయి.సందేహాలు ఇంకా మిగిలి ఉన్నాయి అవి వస్తూనే ఉంటాయి. సమాధానాలు ఇస్తూనే ఉండాలి. ఇట్లా వీటిని ఆపడం జరగదు. అలాగని ఇవ్వటం కుదరదు. అసలు ఈ సందేహాలు ఎవరికి వస్తున్నాయో ఆలోచించు. వాటి మూలాలుకి వెళ్ళు. వెతుకు. విచారించి సందేహాలు అడిగేది ఎవరు? ఎవరని అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? ఎలా అడుగుతున్నాడు అనగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు మీకే తెలుస్తుంది. మూలాధార చక్రము నుండి మొదలయ్యి హృదయ చక్రానికి చేరుకునేసరికి నీ సాధన పరి సమాప్తి అయిపోతుంది. అక్కడ నిశ్చలంగా ఆత్మశాంతితో ఉండిపోతావు. ఉండిపోవాలి. అప్పుడు సందేహాలు రావు. ప్రశ్నలు ఉండవు. సమాధానాలు ఉండవు. మౌనమే ఉంటుంది. మౌనము అంటే ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవడం. ఇతరులకు ఏదో చెప్పాలని అనిపించకపోవడం. ఇతరుల కోసం ఏదో చేయాలని అనుకోవడం అనిపించకపోవడం బ్రహ్మ తదాకార స్థితి అవుతుంది. నిజానికి మౌనభాషతో మాట్లాడుతూనే ఉంటుంది. కలుగుతూనే ఉంటుంది. మాట్లాడలేని మాట్లాడాలనిపించని స్థితియే ఆత్మ స్థితి పొందిన నిజ బ్రహ్మ ఙ్ఞానికి అలవడుతుంది. అసలైన పరిపూర్ణమైన సంపూర్ణమైనది దక్షిణామూర్తిగా ధర్మసందేహాలు ఈ మౌనమే అసలైన పరిపూర్ణమైన సంపూర్ణమైన ఉపదేశమును అదియే ప్రస్తుతము నాకు అర్థమైనది. ఇదియే చిదంబర రహస్యం. అంటే చిదంబర క్షేత్రంలో శివలింగ దర్శనం అయితే మోక్ష ప్రాప్తి అని పరమేశ్వరుడు ఉవాచ. చాలామంది దీనిని చూడటానికి ఈ క్షేత్రానికి వెళితే అక్కడ ఒక తెల్లని వస్త్రము దాని మీద బంగారు బిల్వ మాల ఉంటుంది. వారికి శివలింగం కనిపించదు. దానితో శివలింగ దర్శనం కాలేదని బాధపడతారు. నిజానికి ఈ తెల్లని వస్త్రము పరమశివుని శివలింగం అని ఎవరు గ్రహించారు. వస్త్రమే శివలింగం అని గ్రహించరు. వస్త్రము మీద శివలింగాకారం గుర్తు ఉంటుందని అనుకుంటారు.వస్త్రమే శివలింగం అని తెలుసుకోవాలి. తెలుసుకోరు. గుడ్డమీద శివలింగము ఉండాలని అనుకుంటారు. గుడ్డ శివలింగం ఆకాశమే పరమశూన్య లింగమని గ్రహించినవాడే ఆకాశలింగము అంటే ఆకాశములో శివలింగం చూడటం కాదని ఆకాశమే శివలింగమని ఎవరైతే గ్రహిస్తారో వారే పరిపూర్ణంగా శూన్యబ్రహ్మ అవుతారు. చిదంబర దక్షిణామూర్తి లాగా మౌన దీక్ష తో మౌనముగా మౌనదీక్షతో మౌనంగా ఉండి పోతారు. అంటే ఆకాశములో శివలింగం చూడాలనుకున్న వాడు వెనక్కి తిరిగి వస్తాడు. ఆకాశమే శివలింగం అని గ్రహించిన వాడు నిశ్చల స్థితి పొంది ఆత్మ శాంతి పొంది ప్రశాంత స్థితిని పొందుతాడు. అనగా చిదంబర దక్షిణామూర్తి లాగా అన్నమాట. ప్రస్తుతము నేను ఈ స్ధితికి సంపూర్ణముగా చేరుకోవడముతో మౌన:బ్రహ్మగా నా సాధన పరిసమాప్తి అయినది.

శుభంభూయాత్
పరమహంస పవనానంద
*****************************************

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి