అధ్యాయం 81


బలహీనతను దాటలేమా?

చాలామంది యోగ సాధన గురించి చిట్టచివర సాధారణ స్థితికి వచ్చేసరికి ఒక ధర్మ సందేహం కలుగుతుంది. అది ఏమిటంటే “ఈ విశ్వమంతా మాయ భ్రాంతి భ్రమ అని తెలుసు. కానీ మా నిశ్చల స్థితిని దెబ్బ తినే విధంగా ఈ భోగ ప్రపంచములో ఎన్నో అంతరాయాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కదా. మరి వాటికి స్పందించకుండా వాటి గురించి ఆలోచించకుండా వాటి గురించి ఆశ పడకుండా భయపడకుండా ఎలా ఉండేది “అన్నప్పుడు దీనికి సమాధానం ఏమిటంటే ఒక మహారాజుకి నిశ్చలస్థితి అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అనే ధర్మ సందేహం వచ్చి దీనికి సమాధానంగా చిత్రకారులు మధ్య ఒక పెద్ద పోటీ పెట్టి ఈ నిశ్చలస్థితి అనేది ఎలా ఉంటుందో బొమ్మల రూపంలో గీయమని పోటీ పెట్టినారు. అందులో చివరికి రెండు చిత్రపటాలు వచ్చినాయి. 

ఒకటి ప్రశాంతత స్థితిలో ఉన్న చెరువు బొమ్మ…. రెండవది గాలి వానలతో ఉరుములతో మెరుపులతో వరదలతో చెట్లు విరిగి పోతున్న తుఫాన్ బీభత్సం వాతావరణంలో ఒక చెట్టు తొర్రలో ఒక చిన్న పక్షి తన తల్లి కోసం ఎదురు చూస్తున్నట్లుగా గీయబడినది. ఆ రాజ్య రాజగురువు ఈ తుఫాన్ వాతావరణం ఉన్న రెండో చిత్రమే అసలైన నిశ్చలస్థితికి తార్కాణం అని నిర్ధారించడం జరిగింది. కారణం ఈ చిత్రంలో పెను తుఫాన్ దృశ్యాలు తన కళ్లముందు కనబడుతున్న కూడా ఆ పక్షి ఏ మాత్రం భయపడకుండా చలించకుండా తన ఏకాగ్రత అంతా తన తల్లి పక్షి రాక కోసం ఎదురు చూస్తూ మనో నిశ్చల స్థితిలో ఉందని చెప్పడం జరిగినది. అలాగే సాధకుడు కూడా ప్రపంచంలో ఏమి జరుగుతున్న వాటిని సాక్షీభూతంగా వైరాగ్య భావంతో చూడగలిగేలా సాధన చేస్తూ ఉండాలి. నిజానికి సాధకుడికి తన ధ్యానము నందు ధ్యానానుభవాలుగా  గత జన్మలలో అలాగే భవిష్య జన్మల అనుభవాలు దృశ్యాలుగా కనపడితే వాటికి స్పందించకుండా వాటి గురించి ఆలోచించకుండా వాటి గురించి సంకల్పించకుండా వాటిని చూసి భయపడకుండా, బాధపడకుండా, ఆశ పడకుండా నిశ్చల స్థితిలో ఉండాలి. ఇదే అసలు సిసలైన బ్రహ్మ తదాకార స్థితి.

అంతెందుకు మీరు అమెరికా నుంచి ఇండియాకు వస్తే మీరు వచ్చినట్టా మీరు ప్రయాణం చేసిన వాహనాలు ప్రయాణించినట్టా ఆలోచించండి. నిజానికి మీరు ఎక్కడ ప్రయాణించలేదు. కేవలం ప్రయాణించే వాహనంలో మీరు ఉండటం వలన మీరు ప్రయాణం చేసి వచ్చినారని అనుకుంటున్నారు. నిజానికి ప్రయాణం చేసింది మీరు ఎక్కి వచ్చిన విమానం కార్లు అన్నమాట.అలాగే ఈ భోగ ప్రపంచంలో అన్ని నేనే చేస్తున్నాను. నేను లేకపోతే ఏమీ జరగదు. నేను లేకపోతే ఏమీ ఉండదు. నేను లేకపోతే నా వాళ్లకి కష్టాలు కలుగుతాయి. నేను చేయకపోతే నష్టాలు వస్తాయి. ఇలా మనం అనుకుంటున్నాము. మనం ఉన్నా లేకపోయినా ఈ భోగ ప్రపంచము తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. ఎవరు ఉన్నా లేకున్నా దానికి సంబంధం గాని అనుబంధంగాని ఉండదని గ్రహించండి. ఈ భోగ ప్రపంచమునందు జరిగేది జరుగుతూనే ఉంటుంది. జరగనిది ఎప్పటికి జరగదు అని గ్రహించండి. మీరు ఉన్నా లేకపోయిన దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కాకపోతే ఇది నేను చేస్తున్నాను. నేను చేయాలి. నేనే చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. మీరే చేస్తున్నారని భ్రమ భ్రాంతి పడుతున్నారు. మా తాత చనిపోయాడు. ప్రపంచం ఆగినదా? మన దేవుడు లేడు. ఈ ప్రపంచం ఆగినదా? నేను లేను జరిగే ప్రపంచం ఆగుతుందా అంటే మనమంతా నిజానికి రైలులో ప్రయాణించే ప్రయాణికులమే కానీ ప్రయాణం చేసేది రైలు అయితే దాని ఆధారం చేసుకుని అందులో ఉండే మనం ప్రయాణం చేస్తున్నామని భ్రమ భ్రాంతి మాయలో పడుతున్నాము. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఆకాశ లింగము అంటే మనమంతా ఆకాశ ములో లింగం ఉంటుందని దానిని చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఎవరైతే ఆకాశమే లింగమని గ్రహిస్తారో వాడు ఈ భ్రమ భ్రాంతి మాయ నుండి తప్పుకుని జితేంద్రియుడై నిశ్చల స్థితిని పొందుతాడు. తాను ప్రయాణం చేయటం లేదని, ఏ పని చేయటం లేదని, ఇదంతా తానే చేస్తున్నామని మాయ భ్రమ భ్రాంతులు ఈ భోగ ప్రపంచం కలిగిస్తుందని తెలుసుకుంటాడు. ఇది స్వానుభూతి కలిగిన వారికి ఈ ప్రపంచంతో పని ఉండదు. పదార్థమును దాటి యదార్ధము తెలుసుకుంటాడు కదా. ఈ ప్రపంచంలో మీరు నిశ్చల స్థితిలో లేరు అంటే మీలో మీకు తెలియని రవ్వంత నేను అనే అహం ఉండి ఉంటుంది. దానిని కూడా త్యాగము చెయ్యండి. అప్పుడు ఈ ప్రపంచంలో మీరు కూడా సాక్షీభూతంగా స్థితప్రజ్ఞత వైరాగ్యభావమైన నిశ్చల స్థితిలో ఉంటారు. 
 
అసలు నిజం ఏమిటంటే అందరు కూడా ఈ ప్రకృతి యందు నిశ్చల స్థితి లోనే ఉన్నారు. కానీ దానిని ఎవరూ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అందరూ కూడా ఎవరికి వారు ఒంటరిగా ఏకాకిగా నిశ్చల స్థితిలో ఉన్నారు. ఆకాశమే లింగంగా ఉన్నారు. కానీ తాము ఈ పరిస్థితిలో లేమని… తాము ఈ నిశ్చల స్థితిలో లేమని… భ్రమ భ్రాంతి పడుతూ నిశ్చల స్థితిని కోల్పోతున్నారు.కనిపించే విశ్వమంతా నిశ్చల స్థితిలో ఉంది. కానీ మన మనస్సుని మనం అనిశ్చిత స్థితిలో ఉంచడం వలన ఈ నిశ్చల స్థితి కాస్త అనిశ్చల స్థితిగా అనిపిస్తుంది. అనగా కదులుతున్న ప్రపంచంగా కనబడుతోంది. నిజానికి ఇక్కడ ఏమీ కదలటం లేదు. కానీ మన మనస్సు మాత్రమే అస్థిరమై కదులుతోంది. అది స్థిరమైతే నిశ్చలంగా ఉన్న ఈ ప్రపంచం నిశ్చలంగానే ఉంటుంది.మన మనస్సులు స్థిరము కావాలి అంటే అరిషడ్వర్గాలు స్థిరము అవ్వాలి. ఇవి స్థిరం అవ్వాలి అంటే దశేంద్రియాలు మన అదుపులోనికి రావాలి.అంటే యోగ నిద్రావస్థను పొందాలి. ఇది వస్తే గానీ జితేంద్రియుడు అవుతావు. అప్పుడు నిజ స్థితి అయిన ఈ ప్రపంచం అంతా కూడా నిశ్చలముగానే కనపడుతుంది. మన మనస్సును బట్టి విశ్వ ప్రపంచం ఉంటుంది అని గ్రహించండి. కదిలేదీ కదిలించేది కదులుతున్నట్లు గా భ్రమింపచేసేది మన మనస్సు అన్నమాట. ఈ మనస్సుకు కాస్త యోగ నిద్రావస్థను ఇచ్చినట్లయితే ఇంకా దీనిలో స్పందనలు భయాలు ఆశలు ఆలోచనలు సంకల్పాలు ఆనందాలు తగ్గుతూ వచ్చి మనో నిశ్చల స్థితిని పొందుతుంది. అప్పుడు ఈ విశ్వం అంతా ఒక జీవ నాటకమని… అందులో తను ఒక పాత్రధారి అని…. ఆడేవాడు ఆడించేవాడు తానేనని… నేను లేను నేను సత్యం కాదని… సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమని యదార్ధ జ్ఞాన అనుభూతిని స్వానుభవముగా పొందటం జరుగుతుంది. 

తాను ఎప్పుడు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలో తాను ఉన్నానని కాకపోతే తనకు వచ్చిన అపస్మారక స్థితి వలన తను తెలుసుకున్న జ్ఞానమును మరిచి పోవటం వలన ఇది జరిగిందని ఆ జ్ఞాన స్పురణకు జ్ఞప్తికి రావటం జరిగిందని గ్రహించి సాక్షి భూతంగా మౌనంగా ఉండిపోతాడు. ఉండిపోయేది ఏమిటి. ఎప్పుడూ ఉండే స్థితి అదే కదా. మేధా దక్షిణామూర్తి స్థితియే కదా. నిజానికి మనం అంతా కూడా శివకేశవ తత్వంలో ఉండగలగాలి. అంటే భోగ ప్రపంచంలో మేధా దక్షిణామూర్తి లాగా నిశ్చల స్థితిలో ఉండాలి. అదే యోగ ప్రపంచమునందు కేశవుడిలాగా యోగ నిద్రావస్థలో ఉండగలిగితే చాలు. ఈ ప్రపంచంమనకు ఎల్లప్పుడూ నిశ్చలస్థితిలోనే కనబడుతుంది. ఉంటుంది. ఎందుకంటే మన మనస్సు నిశ్చలం అవుతుంది కదా. ఇది నిశ్చలము కాని వాడికి ఈ విశ్వమంతా కూడా కదులుతూనే ఉంటుంది. అదే నిశ్చలమైన వాడికి కదులుతున్న విశ్వమంతా కూడా నిశ్చలము అవుతుంది.యద్భావం తద్భవతి. అంతా మనలోనే ఉంది. మన మనస్సులోనే ఉంది. చేసేదెవరు. చేయించేది ఎవరు. పొందేది ఎవరు. పొందబడినది ఎవరు. అనుభవించేది ఎవరు. చచ్చేది ఎవరు. బ్రతికేది ఎవరు. అంతా మన మనస్సు అనిశ్చలమే కారకము. కారణము. మనస్సును ఆధీనం చేసుకున్నవాడు యోగి అయితే మనస్సుకు ఆధీనమైనవాడు భోగి అన్నమాట. యోగికీ విశ్వమంతా ఒక కల అయితే భోగికి విశ్వమంతా ఇల అన్నమాట. యోగికి ఇదంతా అసత్యమైతే అదే భోగికి ఇదంతా సత్యంగా కనపడుతుంది. అంటే మన మనస్సు నిశ్చలమైతే అంతా నిశ్చలమైనట్లే కదా .ఇది నిశ్చలముకావడం లేదు అంటే మీ మనస్సు నిశ్చలం కానట్లే కదా. అనగా మీరు మీ మనస్సుకి ఆధీనమైనట్లే కదా. ఈ లెక్కన మీరు యోగి అలాగే భోగికి మధ్యస్థలో ఉన్నట్లే. మీ శరీరం యోగి అవుతుంది. మీ మనస్సు భోగి అవుతోంది. నిజానికి మీ శరీరం భోగి అవ్వాలి. మీ మనస్సు యోగి అవ్వాలి. అప్పుడే విశ్వమంతా నిశ్చలము అవుతున్నట్లు అనుభవం అనుభూతి పొందగలుగుతారు. యదార్ధ ఙ్ఞానానుభూతి పొంది యదార్థ మీ సహజ స్థితిని తిరిగి పొందుతారు. అంటే యదార్ధ మనస్సు స్థితికి చేరుకుంటావు. అదే నిశ్చలస్థితి. అదియే సహజస్థితి. అదే అద్వైత స్థితి. అది తత్వమసి. అదే మోక్ష స్థితి. అది అవిముక్త స్థితి. 
 
కాకపోతే సంపూర్ణంగా ఇట్టి స్థితిలో ఇంతవరకు ఏ సాధకుడు, ఏ యోగి, ఏ దేవుడు,ఏ దేవత, ఏ పరమాత్మ, ఏ గురువు లేడు. కారణము బలహీనతలేని బలవంతుడు లేడు. ఎందుకంటే శూన్య బ్రహ్మ సాధన స్థాయి అంటే 99.99% స్థితికి వచ్చినట్లే. అప్పుడు ఇట్టి స్థితిలో ఉన్నవారికి 0.1% ఏదో ఒక దానికి సంబంధించిన బలహీనమైన క్షణానికి అనగా బలహీనతకు గురి అవ్వడం జరిగి వెనుతిరగటం జరుగుతోంది. అనగా వంద శాతానికి కేవలం 99.99 శాతం మాత్రమే సాధన పూర్తి చేస్తాడన్నమాట. ఇందులో మిగిలిన 0.01% శాతం బలహీనత వలన రూపం అంతం చేసుకోవాల్సిన చోట రూపాంతరం చెందుతాడు. అనగా 0.01% పూర్తి చేసుకున్న వాడైనట్లయితే సంపూర్ణ నిశ్చల స్థితిని పొంది నిశ్చలము అవుతాడు. తను ఈ స్థితిని పొందే సమయానికి 0.01% బలహీనత బలహీన క్షణంలో ఇట్టి స్థితి లొంగుతాడు. తద్వారా సంపూర్ణ నిశ్చల స్థితిని పొందలేదని సంపూర్ణ ఏకత్వ స్థితిని పొందలేక పోవడం వలన తిరిగి భిన్నత్వ స్థితిలోకి మారతాడని నా అనుభవంలో తెలిసింది. 

నా సూక్ష్మశరీర భవిష్యజన్మ:

ఎలాగంటే నా సూక్ష్మ శరీరం ఏదో ఒక గుర్రపు బండి మీద ఎక్కడకో ప్రయాణం చేస్తున్నట్లుగా ఒకరోజు నాకు అర్థం అయినది. మరుసటి రోజు నేను కాస్త వెలుతురు చీకటి మధ్య వాతావరణం ఉన్న సంధ్యాకాలము వంటి వాతావరణం ఉన్న ఏదో గ్రహమునందు నేను అదే నా సూక్ష్మశరీరం చేరుకొన్నట్లుగా కనిపించింది.అక్కడ అందరూ నాకు తెలిసిన బంధుమిత్రులు కనిపించారు. కాకపోతే రూపురేఖలు ఒకటిగా ఉన్న వేషభాషలు వేరువేరుగా ఉన్నాయి. గుర్తులు వేరువేరుగా ఉన్నాయి. వీరందరిని నేను ఉన్న భూలోకవాసులుగానే నాకు పరిచయం ఉన్న వారేనని నేను గ్రహించాను. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానము నందు ఈ గ్రహం గురు గ్రహం అని… నాలాంటి వాళ్ళు వివిధ గ్రహ వాసులుగా లోకాలలో సుమారుగా 1080 లోకాలలో తొమ్మిది గ్రహవాసులుగా ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యము చెందినాను. అప్పుడు నా జన్మ జాతకం చూసుకుంటే అదే నా భవిష్యత్ జన్మ గురుగ్రహ వాసి అని తెలియటంతో నా బుర్ర తిరగటం మొదలైంది. మరి ఇన్నాళ్ళు నేను చేసిన సాధన ఫలితం ఏమైంది. స్వప్న సాధనము ఏమైంది. ఈ సాధన కోసం 1994వ సంవత్సరంలో 20 నిమిషాల నుండి యోగా నిద్రావస్థ సాధనతో మొదలయ్యి 2019 8 గంటల నుండి 16 గంటలపాటు యోగనిద్ర సాధన చేసి నాకు ఉన్న అన్ని రకాల కర్మలను అనగా 48 లక్షల కర్మలను నాశనం చేసుకున్నట్లుగా కర్మశేషము మూడు లక్షలు కర్మలను కాశీ క్షేత్రమునందు అనుభవిస్తే సరిపోతుందని ధ్యానానుభవాలు పొందడం జరిగింది కదా. మరి నా భవిష్యత్ జన్మ అదే గురుగ్రహవాసుడిగా ఎలా వచ్చిందో మొదట నాకు అర్థం కాలేదు. దీనిమీద పరిశోధన చేయగా నేను నా సాధన స్థాయి ఉన్న శూన్యబ్రహ్మ స్థితి కి వచ్చినప్పుడు నేను కాస్త కామగుణమునకు స్పందించడం జరిగింది అని అందరికీ తెలుసు కదా. అలాగే మా జిఙ్ఞాసి అయితే ఈ సాధన స్థితిలో భయానికి స్పందించడం జరిగింది అని తెలుసు కదా. అంటే మేమిద్దరం కూడా ఒకరు కామానికి మరొకరు భయానికి స్పందించి బలహీనమైనట్లుగా తెలుస్తోంది కదా. అనగా 0.01% సాధనను మేమిద్దరం మిగుల్చుకోవడం జరిగింది అన్నమాట. అనగా వందకి 99.99 శాతం మాత్రమే మేము సాధనలో 0.01% సాధన వద్ద బలహీనతకు గురికావడం వలన అది కాస్త కర్మ శేషమై అది కాస్త రాబోవు జన్మగా గురుగ్రహవాసిగా సూక్ష్మ శరీరధారిగా అవతారమునకు నాంది అయినది. అలాగే మా జిజ్ఞాసికి బుధ గ్రహ వాసిగా సూక్ష్మ శరీరధారిగా అవతారము అయినది. అంటే ఇన్నాళ్ళు మా సాధన అంతా కేవలం భూలోక కర్మల నివారణ చేసుకుని భూలోకమందు పునర్జన్మలు లేని స్థితిని పొందడం జరిగినది. భవిష్యత్ జన్మలుగా కాస్త నేను కాస్త గురుగ్రహవాసి జన్మ అయితే అదే మా జిఙ్ఞాసి అయితే బుధగ్రహ వాసి జన్మ అని తెలిసినది. కాకపోతే ఇక్కడ స్థూల శరీరంతో కర్మలు నాశనం చేసుకుంటే అక్కడ ఆయా గ్రహాలు యందు సూక్ష్మ శరీరాలతో సూక్ష్మకర్మలను నాశనం చేసుకోవాలని గ్రహించాను. పళ్ళు రాల కొట్టుకోవడానికి నాపరాయి అయితే ఏమిటి కంకరరాయి అయితే ఏమిటి. నా బొందా. నా బూడిద. ఇన్నాళ్లు మా సాధన అంతా కేవలం స్థూల శరీరానికి సరిపోతే భవిష్య జన్మగా సూక్ష్మ శరీరంతో మళ్లీ అక్కడ జన్మలెత్తి కష్టాలు పడి లేస్తూ పడుతూ నా నా  చంకలు నాకవలసిందే కదా. 

మళ్లీ అక్కడ సూక్ష్మ శరీరముతో సాధన చేసుకుని శూన్య బ్రహ్మగా మారి అక్కడున్న కృష్ణ బిలములోనికి పడితే అది తిరిగి మరో లోకానికి అదే కారణ శరీరం కారణలోకవాసుడిగా మారుస్తుంది. మళ్లీ అక్కడ జన్మలు పునః జన్మలెత్తి నా నా కష్టాలు పడి నా నా చంకలు నాకితే అప్పుడు మళ్ళీ మళ్ళీ మనకి సాధన జన్మతో కారణ శరీరంతో సాధన చేస్తే అక్కడున్న కృష్ణ బిలములోనికి ప్రవేశిస్తే తిరిగి మనకు ఇష్టలోకవాసిగా సంకల్ప శరీరము రావడం జరుగుతుంది అక్కడనుండి సాధన జన్మ స్థితికి వస్తే అక్కడ ఉన్న కృష్ణ బిలములోనికి ప్రవేశిస్తే ఆకాశంలో ఆకాశ శరీరంతో సాధన చేసే జన్మ వస్తుంది. మళ్లీ ఇక్కడ ఉన్న కృష్ణ బిలమునందు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ ఆది జన్మ అయిన స్థూల శరీర భూలోక వాస జన్మ వస్తుంది.మళ్ళీ కథ మొదలు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అటుపై మళ్ళీ తిరిగి ఇదే వరుస క్రమంలో వస్తూనే కాలచక్రంలో మనం నిరంతరం తిరుగుతూనే ఉంటాము. కారణము సాధన ఆగిపోయే సమయంలో అనగా వంద శాతము స్థితికి శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వచ్చేసరికి అక్కడ ఉన్న బలహీనత వలన కూడా తప్పనిసరిగా బలహీనం అవుతున్నాడు. దానితో పునః కాలచక్రంలో పునర్జన్మలతో భిన్నత్వంగా మారిపోతున్నాడు. మారిపోతాడు. అంతం కావాల్సిన చోట రూపాంతరం చెందుతున్నాడు కదా. మేమిద్దరమే కాదు మా ముందు సాధన చేసిన వారంతా ఈ బలహీనత స్థితికి వచ్చేసరికి మాయలో పడినారు. బోల్తా పడినారు. బుద్ధుడు అయితే కోరిక లేని సమాజం చూడాలి అంటే దత్తాత్రేయుడి కాస్త దీనజనోద్ధరణ కోసం ఉండాలని బలహీనతను పొందినాడు.ఆదియోగి అయితే మరణ భయానికి గురి అయితే మహావిష్ణువు స్థితికి అదే బ్రహ్మ అయితే సృష్టి కార్యాల బలహీనత అయితే ఆదిపరాశక్తి కాస్త ఆనందము బలహీనతకు గురి అయినది. అందువలన బలహీనతలేని బలవంతుని ఆ భగవంతుడు ఇంతవరకు ఎవరినీ సృష్టించలేదు. సృష్టించలేడు. కారణం నువ్వే. ఆ భగవంతుడు నువ్వే. ఆ పరబ్రహ్మవి. నీలోనే ఆ బలహీనత ఉంది. దానిని నువ్వే దాట లేవు. ఎందుకంటే అది నిన్ను దాటి లేదు. నీలోనే ఉంది. నీవై ఉన్నది. ఈ ప్రపంచంలో ఏది వ్రాసినా తప్పుగానే ఒకటి ఉంటుంది. అదే 'తప్పు' అనే పదము అన్నమాట. ఈ పదమును పలికిన లేదా వ్రాసిన లేదా చూసిన అది తప్పు అని అనే శబ్దం సూచిస్తుంది కదా. అలాగే ప్రతి జీవిలోనూ బలహీనత అనేది అంతర్గతంగా తన లోనే ఉంటుంది. దానిని పోగొట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు. సాధ్యం కాదు కదా. అది పోనంతవరకు సాధకుడు సాధన అంతా కూడా 99.99% మాత్రమే పరిమితమవుతుంది. 0.01% శాతం మాత్రమే ఎపుటికి అవిశ్రాంతిగా అవిచ్చిన్నంగా బలహీనత రూపంలో తన రూపంలో మిగిలిపోయే ఉంటుంది. ఈ బలహీనత లేని జీవియే ఇంతవరకు పరమ శూన్యమే సృష్టించలేదు.కారణము దానికే బలహీనత ఉంది కదా. ఒక కేకును మీరు ఎన్ని ముక్కలుగా అనగా పెద్ద ముక్కల నుండి చిన్న ముక్కలుగా చేసినా కూడా దాని రుచి ఎలా అయితే పోదో అలా ప్రతి జీవిలోనూ ఉన్న బలహీనత పోదు.స్థూల శరీరము నుండి పిసరంత ఆకాశ శరీరములు గా వచ్చినా కూడా పోదని గ్రహించండి. 

కాకపోతే స్వప్న సాధన వలన త్వరగా కొండ ఎక్కటం చేస్తారు. కొండ అగ్రభాగాన కి చేరుకుని అక్కడ ఏమీ లేదని భావన చేసుకుని మనో నిశ్చలస్థితి పొందాలని పరమ ప్రశాంత స్థితిని పొందాలని అక్కడి నుండి కొండ దిగువభాగానికి ప్రయాణం చేస్తారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మళ్లీ ప్రశాంతత లేదు అని మళ్లీ కొండపైన ఉంటుందని కష్టపడి కొండ అగ్రభాగానికి చేరుకోవడము మళ్ళీ అక్కడ ప్రశాంతంగా లేదనుకొని మళ్లీ అంతే కష్టంతో కొండ దిగువ భాగానికి చేరుకుంటాడు. ఇదే తంతు ఇదే సాధన అన్నమాట. ఎండలో ఉంటే నీడ కావాలి అనిపిస్తుంది. అదే నీడలో ఉండే ఎండ కావాలనిపిస్తుంది. అలాగే బొమ్మలు ఉంటే అమ్మ కావాలనిపిస్తుంది. అదే అమ్మ ఉంటే బొమ్మలు కావాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే అంతులేని కథ లాంటిది అని గ్రహించండి. ఎవరు కూడా ఈ కథను అంతం చేయలేదు. కానీ అంతం చేసే స్థితికి 99.99% శూన్యబ్రహ్మ స్థితికి వస్తారు. అక్కడున్న బలహీనత వలన రూపం అంతం చేసుకోవాల్సిన చోట రూపాంతరం చెంది కథను అంతం చేసుకోవాల్సినచోట ఆరంభము చేసుకోవడం జరుగుతుంది. అందరికీ వారి తగ్గట్లుగా ఏదో ఒక బలహీనత ఉంటుంది. నాకు ఆహారపదార్థాల్లో మిరపకాయ బజ్జీలు ఇష్టం. అలాగే జిజ్ఞాసికి గోంగూర పచ్చడి అలాగే మీకు అయితే చుక్కకూర ఇలా ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది. బలహీనత లేని వాడు లేడు. అనగా సంపూర్ణ కపాలము పొందినవాడు అలాగే పొందేవాడు లేనట్లే కదా. ఎందుకంటే బలహీనత ఉండనే ఉంటుంది కదా. తప్పు అనే పద భావం ఎలా అయితే మార్చలేమో అలాగే మనము బలహీనత అనే లక్షణమును మార్చలేము. 
 
మరి సాధన ఎందుకు అంటే శాశ్వత మరణావస్థను పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తద్వారా ఇట్టి సాధకుడు ఒక లోకం నుండి మరొక లోకవాసిగా రూపాంతరం చెందుతాడు. జీవాత్మ స్థాయి నుండి విశ్వాత్మ స్థాయికి వస్తారు.కాకపోతే అదే మళ్లీ విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి వస్తారు అనుకోండి. అది వేరే విషయం. కాకపోతే సాధన చెయ్యకపోతే భౌతిక మరణం పేరుతో విశ్వాత్మ స్థాయి యజమానిగా ఉండవలసిన మీరు కాస్త జీవాత్మ స్థాయిగా పని వారిగా మారి సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేసే కర్మల నుండి సేవలు చేయించుకొనే స్థితికి రావాలి. అంటే సాధన చేయక తప్పదు. తద్వారా మీరు ఎంత తొందరగా నిశ్చల స్థితికి చేరుకుంటారో శూన్యబ్రహ్మ స్థాయికి వస్తారో 99 99% శాతానికి స్థితికి వస్తారు. అప్పుడే మీ జీవాత్మ కాస్త విశ్వాత్మ అయ్యి విశ్వాధినేత అవుతుంది. మళ్లీ ఇట్టి స్థితిలో బలహీనత వలన మళ్ళీ మీరు కాస్త విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి రావటం మళ్లీ కొన్నాళ్లకు స్వప్న సాధన వలన విశ్వాత్మ స్థాయికి చేరుకోవటం అక్కడున్న బలహీనత వలన తిరిగి జీవాత్మ స్థాయికి రావటము ఇప్పటివరకు జరుగుతున్న ఆనవాయితీ అని గ్రహించండి. దీనిని ఎవరూ మార్చలేరు. మారదు. ఎందుకంటే బలహీనత అనేది మీలోనే ఉంది. నాలోనూ ఉంది. అది లేనివాడిని ఇంత వరకు ఎవరూ సృష్టించలేదు. ఎందుకంటే అమృతము తో పాటు విషము ఏర్పడినట్లగానే బలంతో పాటు బలహీనత అనే పదం ఏర్పడింది. ఒప్పు అనే పదం తో పాటు వ్యతిరేక పరంగా తప్పు అనే పదము ఏర్పడినది. ఇది మీరు ఎప్పుడు చదివినా తప్పు అనే భావం ఇచ్చినట్లుగానే మనలో బలహీనత ఎప్పుడు కూడా బలహీనత గుణ భావమునే ఇస్తుంది.దానిని దాటలేము. దాటటానికి అది బయట ఎక్కడా లేదు. మనలోనే ఉంది. మరి మాయను దాటినప్పుడు ఈ బలహీనతని ఎందుకు దాటలేము అనే సందేహం వస్తుంది. జ్ఞాన స్పురణ వలన మాయ మాయమవుతుంది కానీ బలహీనత అలాంటిది కాదు. అది బలహీనత అనే జ్ఞాన స్పురణ కలిగిన కూడా ఇది పోదని గ్రహించండి. ఎందుకంటే కష్టాల మాయకి కారణము కోరికలని బుద్ధుడు తెలుసుకున్నాడు. అంటే కష్టాల మాయకి కారణం కోరికలని గ్రహించాడు కదా. మరి ఆయన ఎందుకు మళ్ళి కోరిక లేని సమాజం చూడాలని కోరిక అనుకున్నారో చెప్పండి. ఈయన బలహీనత ఏమిటంటే కష్టాలు లేని సమాజం చూడాలని అనుకోవడమే జరిగినది. దానితో దీనికి తెలియకుండానే మళ్ళీ కోరిక మాయలో పడినారు కదా.పునః జన్మ పొందడం జరిగినది.అది కాస్తా భూలోక వాసి నుండి సూక్ష్మ లోకవాసిగా పునర్జన్మ ఎత్తినాడు. దాని వలన స్థూల శరీరధారి నుండి సూక్ష్మ శరీరధారిగా మారి లోక పూజ్యుడైనాడు. రూపమును అంతం చేసుకోవాల్సిన చోట రూపాంతరం చెంది గౌతముడు నుండి బుద్ధుడు అయ్యాడు. ఇలా ఈయనే కాదు అందరూ చేస్తున్నారు.చేయబోతున్నారు. మేమే కాదు మీరు కూడా చేస్తారు. కాకపోతే కాస్త వెనకా ముందు అంతే తేడా అన్నమాట. అందరూ విశ్వాత్మలే. అందరికీ బలహీనతలు ఉన్నాయి. కాకపోతే అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానం మర్చిపోవడం వలన విశ్వాత్మగా ఉన్నా మీరు కాస్త జీవాత్మగా అనుకుంటున్నారు. భ్రమ భ్రాంతి మోహము, వ్యామోహ, ఆశ ,ఆనంద మాయలో పడుతున్నారు. అదే స్వప్న సాధన ద్వారా జ్ఞానం పొంది విశ్వాత్మ అని తెలుసుకుని అక్కడున్న బలహీనత గుణమునకు లొంగి బలహీనమై తిరిగి అపస్మారక స్థితి పొంది జీవాత్మగా మారుతున్నారు. తద్వారా యజమాని కాస్త పనివాడిగా మారుతున్నారు. 

అంతా చూస్తుంటే వైకుంఠపాళి ఆట గుర్తుకు వస్తుంది. ఇందులో ఒకటి నుండి 107 వ గడి వరకు ఒక పెద్ద కొండచిలువ పాము ఉంటుంది 108 లో గడి వస్తే ఆట ఆగిపోతుంది. 107 గడి దాక వచ్చిన తర్వాత బలహీనతనే కొండచిలువ నోటిలో పడి 1వ గడి అనగా విశ్వాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి చేరుకోవడం జరుగుతుందని నా అనుభవ దృష్ట్యా నాకు అర్థమైంది. ఎవరు కూడా ఈ విశ్వ క్రీడ అయిన జీవనాటకమును అంతం చేయలేకపోతున్నారు. చేస్తే నేను ఎందుకు ఉంటాను. మీరు ఎందుకు ఉంటారు. నాలో ఉన్న బలహీనత మీలోనూ ఉండటం వలన దానిని దాట లేకపోవడం వలన పునర్జన్మలతో వేరే లోక గ్రహవాసులుగా వేరే శరీరధారులలో ఈ నాటకం అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా కొనసాగుతూనే ఉంటుంది. అంతులేని కథ లాగా అంతమే ఆరంభంగా కొనసాగుతూనే ఉంటుందని గ్రహించండి. దీన్ని బట్టి శాశ్వత మరణంను ఇచ్చే మోక్షమే లేదని గ్రహించాను. శరీరాలు మార్చే జీవన్ముక్తి మాత్రమే ఉన్నదని తెలుసుకున్నాను. మరి నిశ్చలస్ధితిని పొందాలంటే బలహీనతను దాటాలి.ఇది ఎలా దాటాలో తెలుసుకోవడమే నా ప్రస్తుత సాధన లక్ష్యం అని జ్ఞానస్ఫురణ ద్వారా తెలుసుకోవడము జరిగినది. మరి ఈ బలహీనతను దాటలేనపుడు నా సూక్ష్మశరీర భవిష్యజన్మల వివరాలు తెలుసుకోవాలని ఉందా? దానికి మీరు ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా.అంటే నాతోపాటుగా మీరు గూడ ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి.

శుభంభూయాత్

 పరమహంస పవనానంద

******************************************
 

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి