అధ్యాయం 55


స్మశాన కాపరి ఇంటికి వచ్చాడు 
(అనాహత చక్రానుభవాలు):


అనాహత చక్రం స్థితి నా డైరీలో:

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.

జనవరి 4: ఈ రోజు నా వక్షస్థలం మధ్య ఉండే అనాహత చక్రం గూర్చి ధ్యానము చెయ్యడం ప్రారంభించాను. దీనికోసం వివిధ రకాల స్పర్శలను అనుభవిస్తున్నట్లుగా ధ్యానంలో భావించుకొమ్మని గురుదేవులు చెప్పినారు.
జనవరి :6 స్పర్శ భావాలు చేస్తుంటే నా శరీరంలోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. పైగా ఏదో తెలియని చలి వేస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఏమైనా జ్వరము వచ్చినదా? ఎవరికి తెలుసు.
జనవరి 10: ఈ రోజు ఎందుకో నాకు బాగా ధ్యానం చేయాలని అనిపిస్తుంది. పైత్యము చేసి మెదడు దొబ్బినదా?
జనవరి 15: ఈరోజు విపరీతంగా జపం చేస్తే గాని నా మనస్సు స్థిమిత పడలేదు. కారణం తెలియదు.
జనవరి 18: ఈ రోజు విపరీతంగా విగ్రహరాధన చేస్తూనే ఉన్నాను.
జనవరి 20: ఈ రోజు ఎందుకో నాకు చావు భయం పట్టుకుంది. నేను అకారణంగా చనిపోతానా?

P2:

జనవరి 25: ఈ రోజు కలలో నేను కాస్త గుండెనొప్పితో చనిపోతున్నట్లుగా కనిపించింది. వామ్మో.
ఫిబ్రవరి 5: ఈరోజు నాకు భయంకరమైన రోగము ఏదో వచ్చి నోటి నుండి రక్తం రావటం కలలో కనిపించినది. అంటే నా చావు దగ్గరకి వచ్చినదా?
ఫిబ్రవరి 8: ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పుకున్నాను. లేదంటే ఇంటికి వచ్చే వాడిని కాను.
ఫిబ్రవరి 15: ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన మరణ భయం పట్టుకున్నట్లుగా అనిపించినది.
ఫిబ్రవరి 18: ఈ రోజు నా మనస్సు ధ్యానము మీద లేదు. చావు ఆలోచనల మీద ఉంది. ఆతర్వాత లీలామాత్రముగా నల్లని ఆకారాలతో మహా కాళికా ఉగ్రస్వరూపము కనపడి అదృశ్యమైనాడు.నాకు ధ్యానభంగమైనది.

ఫిబ్రవరి 20: ఈరోజు నా దగ్గరకి విచిత్రముగా మా వదినగారి అక్క గారు ఇష్టపడి కొనుకున్న రెండు నల్ల సాలగ్రామాలను నా సజీవబాబాకి ఇచ్చి వెళ్ళిపోయినారు. కారణము వీటిని ఇంట్లో పెట్టుకొని పూజించాలంటే ఎంతో నియమనిష్టలు పాటించాలని ...పైగా వీటిని ఆడవాళ్ళు పూజించరాదని తెలిసిన పెద్దలు భయపెట్టేసరికి...మా బాబా గూర్చి తెలుసుకొని ఆయనకి ఇవ్వడము జరిగినది. నిజానికి నాకు ఈ స్ధితిలో ఈ చక్రదేవతలైన మహకాలుడు,మహకాళిక విగ్రహమూర్తులు రావాలి.చక్రశుద్ధిలో రావలసిన సాలిగ్రామాలు అపుడే ఎలా వచ్చినాయో నాకైతే అర్ధమై చావలేదు.
ఫిబ్రవరి 28: ఈరోజు నా ధ్యానము నందు ప్రమాద దృశ్యాలు చూడడం జరిగినది. అవి ఫలాన ప్రాంతపు గుర్తుల సహా నాకు తెలియడము కనపడినది.ఇన్నాళ్ళు కేవలము ప్రమాద దృశ్యాలు మాత్రమే కనిపించేవి.ఇపుడు అవి జరుగుతున్న ప్రాంత వివరాలు కనపడుతున్నాయి.అంటే రేడియో నుండి టి.వికి నా సాధన స్ధితి వచ్చినదని తెలిసినది.అవి ఎక్కడైనా జరిగినాయా? జరగబోతున్నాయా? ఎవరికి తెలుసు.ఇదియే  దూరదృష్టి సిద్ధి వచ్చింది కాబోలు.

మార్చి 5: ఈ రోజు నాకు ధ్యానము నందు చనిపోయిన నా స్నేహితుడు కనిపించాడు. ఏదో మాట్లాడుతున్నాడు. నాకైతే అర్థం కాలేదు. నేను ఆఫీస్ కి వెళ్ళుతుండగా నాకు రోడ్డుమీద ఒక కాకినీల రంగు రాయి దొరికినది.దానిని ఆఫీస్ కి తీసుకొని వెళ్ళి పరిశోధన చెయ్యగా అది ఒక ముడి ఇంద్రనీలి రంగు రాయి అని,పైగా దీని మీద ఒకవైపు శనిశంగనపూర్ శనేశ్వరుడి గుర్తు అలాగే ఒక నల్లకాకి బొమ్మ గుర్తు ఉన్నట్లుగా స్ఫష్టంగా కనిపించేసరికి నాకు బుర్ర తిరగడము మొదలైనది.
మార్చి 12: ఈ రోజు ధ్యానములో స్మశానము కనిపించినది. ఏవో తెల్లని శరీరాలు ఉన్న వాళ్లు నాకు కనిపించారు. వాళ్లు నన్ను చూసి నవ్వినారు.నాకు భయం వేసింది.

P3:

మార్చి 18: ఈరోజు నాకు ధ్యానములో ఏదో ప్రేతాత్మ నన్ను పట్టుకుని చంపుతున్నట్లుగా కనిపించినది. దానితో నాకు భయం వేసి ధ్యానము ఆపివేసినాను.
మార్చి 19: ఈరోజు చనిపోయిన బంధువుల ఆత్మలు వరుసగా కనిపించినాయి. నాకు భయం వేసింది. పైగా చనిపోయిన నా పెంపుడు జంతువు లైన పిల్లులు, కుక్కలు, పావురాలు, చిలుకలు కనిపించినాయి.
మార్చి 21: ఈ రోజు నాకు కలలో ఏదో ప్రమాద దృశ్యాలు కనిపించినాయి.
మార్చి 23: ఈ రోజు నాకు ధ్యానము నందు ఎవరో ప్రేతాత్మలుగా కనబడి భయపెట్టినారు.
మార్చి 27: ఈ రోజు నేను చనిపోతే ఎలా ఉంటుందో నాకు ధ్యానము నందు కనిపించింది. పైగా ఈ రోజు నా పుట్టిన రోజు కూడా అంటే ఇదే రోజున వర్ధంతి కూడానా.

P4:

మార్చి 30: ఈ రోజు నా గురుదేవుడుకి నాకు కలిగే ధ్యాన అనుభవాలు గురించి అడిగితే దానికి ఆయన “నాయనా! నువ్వు అనాహత చక్రం లో ఉన్నావు.ఈ చక్రము నందు మరణ భయం అలాగే వివిధ ప్రేతాత్మ దర్శనాలు కలుగుతాయి. వీటికి భయపడకు. అవి నిన్ను ఏమీ చేయవు .కేవలం భయపెడతాయి. ఒకవేళ నువ్వు భయపడితే నీ కుండలినీ శక్తి కాస్తా మణిపూరక చక్రములోనికి ప్రవేశిస్తుంది.ఆలోచించుకో.ధైర్యంగా ఉండు. మహా స్మశాన వాసి అయిన మహాకాలుడు మహాకాళిక యోగమాయలే అని గ్రహించు. మనో ధైర్యంగా ధ్యానము చేసుకో. ఆవు నెయ్యి కలిపిన అన్నం తిను.ఈ చక్రమునకు బలం చేకూరుతుంది. ఇలాంటి మనోవికారాల దృశ్యాలు అలాగే రోగానికి సంబంధించిన దృశ్యాలు కనిపించవు” అని చెప్పినారు.
ఏప్రిల్ 2:ఈ రోజు నాకు ధ్యానంలో ఎలాంటి ఇబ్బంది కలిగించే దృశ్యాలు కనిపించలేదు.
ఏప్రిల్ 5: ఈ రోజు నాకు ధ్యానములో ప్రేతాత్మలు కనిపించినను భయము కలగలేదు.అవి గూడ మనలాంటి వారేనని మనో ధైర్యం కలిగింది.
ఏప్రిల్ 6: ఈ రోజు అనేక రకాలుగా నా చావు దృశ్యాలు కలలో అలాగే ధ్యానములో కనిపించినాయి. అది అంతా కూడా ఈ చక్ర మహామాయలేనని మనో  ధైర్యంగా సాక్షిభూతంగా చూస్తూ ఉండినాను. ఆతర్వాత లీలామాత్రముగా నల్లని ఆకారాలతో మహాకాలుడు ఉగ్రస్వరూపము కనపడి అదృశ్యమైనాడు.నాకు ధ్యానభంగమైనది.

ఏప్రిల్ 8: ఈరోజు మా వదినగారి చెల్లెలు ఏదో హ్యండిక్రాఫ్ట్ షాపింగ్ కి వెళ్ళితే ఎదో తనకి గావాలసిన వస్తువులు కొని ఇంటికి వస్తే...తను కొన్న వస్తువులలో ఒక వస్తువుకి బదులుగా మళ్ళీ రెండు నల్లని సాలగ్రామాలు వచ్చినాయి.వాటిని తిరిగి ఇచ్చే అవకాశము లేకపోవడముతో వాటిని పూజించకూడదని భావముతో మళ్ళీ ఈ రెండు గూడ బాబా చెంతకి చేరినాయి.అంటే మొత్తం నాలుగు అనగా రెండు జతల నల్లని సాలగ్రామాలు చేరినాయి. ఇవి ఎందుకు వచ్చినాయో నాకైతే అర్ధమై చావలేదు. వీటి గూర్చి గురుదేవుడిని అడిగినపుడు "నాయన ఈ చక్ర జాగృతి సమయములో మనకి ఈ చక్రదైవాలు అయిన మహాకాలుడు,మహాకాళిక పంచలోహ విగ్రహమూర్తులు రావాలి.అవి దొరకని సమయములో ప్రకృతిమాత వాటికి బదులుగా మహాకాలుడు సంకేతముగా ఒక జత అలాగే మహాకాళిక సంకేతముగా మరో జత సాలగ్రామాలు ఏర్పాటు చేసినది.కంగారు పడకు.విగ్రహమూర్తులు బదులుగా ఇవి వచ్చినాయని గ్రహించి నిత్యపూజలో ఉంచి ఆరాధన చేసుకో...ఈ చక్రజాగృతి చేసుకో” అని చెప్పినారు.ఈ విధంగా నా సాధనకి ప్రకృతి సహాకరిస్తోందని తెలియగానే ఏదో తెలియని ఆనందమేసినది.

P5:

ఏప్రిల్ 10: ఈ రోజు నాకు ధ్యానంలో తీవ్రమైన స్థితిలో ఉండగా నాకు నల్లటి శరీరాలు ఉన్న ప్రాంతం లీలగా కనబడింది. దీని ప్రధాన ద్వారం దగ్గర రెండు భయంకరమైన నల్లటి దట్టమైన బొచ్చు ఉన్న తోడేలు వంటి కుక్కలు కాపలాదార్లుగా ఉన్నట్లుగా కనిపించింది.
ఏప్రిల్ 11: ఈరోజు కూడా నిన్నటి దృశ్యమే నాకు ధ్యానమునందు కనిపించింది. కాని ఈ రోజు ఏదో అతి విచిత్రమైన అతిపెద్ద పురుగులు కనిపించాయి.
ఏప్రిల్ 12: ఈరోజు నాకు ధ్యానమునందు నిన్నటి దృశ్యములే కనిపించినాయి. ఈ ద్వారం లోపల నుండి ఎవరో చాలామంది కేకలు పెడుతున్నట్లుగా బాగా ఏడుస్తున్నట్లుగా ఏదో బాధలు పడుతున్నట్లుగా ఆవేదనలు, ఆర్తనాదాలు విపరీతంగా వినిపించాయి. నాకు విపరీతమైన భయం వేయడంతో ధ్యాన భంగం అయినది. ఇదియే నరకమని వివిధ గ్రంథాలు అనగా గరుడపురాణం చదివిన తర్వాత తెలిసింది.

P6:

ఏప్రిల్ 18: ఈ రోజు తెల్లని శరీరంతో కాంతితో ఉన్నవారు నాతో ఉన్నట్లుగా అనిపించింది.
ఏప్రిల్ 20:ఈ రోజు ధ్యానమునందు తెల్లని బ్రహ్మ కమలాలు సుగంధ పుష్పాలు ఉన్న ప్రాంతము లీలగా కనిపించినది.
ఏప్రిల్ 21:ఈ రోజు నిన్నటి దృశ్యం కనిపించింది కానీ ఏదో తెల్లని శరీరం ఉన్న స్త్రీలు నన్ను చూసి అదోలా చూస్తూ కవ్విస్తూ ఏదో అందిస్తున్నట్లుగా అనిపించినది. నాకు ఇది ఏమిటి అనుకోగానే ధ్యానభంగమైనది.
ఏప్రిల్ 22: ఈ రోజు ధ్యానము నందు తెల్లని శరీరం ఉన్న స్త్రీ, పురుషులు వివిధ రకాలుగా వివిధ భావాలను వివిధ రకాల పద్ధతులలో వివిధ రకాల పదార్థాలు పానీయాలు సర్వ సుఖాలు అనుభవిస్తున్నట్లుగా విచిత్రం గా కనిపించారు. ఇదే స్వర్గము అని నాకు అర్థం అయింది.

P7:
మే 5: ఈ రోజు నాకు ధ్యానములో ఒక విచిత్ర అనుభవం కనబడినది. నేను మా ఇంట్లో ఉండగా ఎవరో గాని కనిపించలేదు. ఏదో త్రాడు లాంటిది నా మీద వేసినట్లుగా అనిపించింది. అపుడు నాలాంటి శరీర వ్యక్తి తెల్లని శరీరంతో నా నుండి బయటికి వచ్చి మా ఇంటి పై కప్పు పైకి వెళ్లి పోతున్నాడు. అలాగే నాలాంటి శరీరము ఉన్నవాడు నేల మీద పడుకునే ఉన్నాడు.మరి ఇంటి మీద నాలాంటి వాడు ఎవడు అనుకునేసరికి నాకు ధ్యానభంగమైనది.
మే 6: ఈ భయంకర దృశ్యం చూసిన నాటినుండి నా మాట తడబడటం, గుండె దడ, విపరీతమైన పిరికితనము నాకు ఆవహించాయని నాకే తెలుస్తుంది.
మే 10: బాగా నీరసపడి పోతున్నాను. ఎవరితోనూ కలిసిమెలసి ఉండలేక పోతున్నాను. నాలో ఏదో తెలియని భయం పట్టుకున్నది అనిపిస్తోంది.
మే 12: అసూయ, ద్వేషము, ఓపిక తగ్గుట, ఓర్పు తగ్గుట, అనుమానించే గుణాలు పెరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది.
మే 15 :సాంసారిక ఆర్థిక, సాంఘిక మానసిక, శారీరక ఒత్తిడులు నేను తట్టుకోలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. గురుదేవుని అడగాలి.
మే 18: ఈ రోజు నా గురుదేవుని కలిసినాను. అప్పుడు ఆయన నాకు జరిగిన ఇవి అన్నియు కూడా ఎప్పుడైతే అనాహత చక్రం బలహీన పడుతుందో అప్పుడు జరుగుతాయని దీని నివారణకోసమని ఈ చక్రమునకు బలము చేకూర్చుటకు నాకు వాయు ముద్ర,అపాన వాయు ముద్ర గూర్చి చెప్పి నా చేత అభ్యాసము చేయించారు.
 మే 30: ఈ రోజు నాకు ఈ చక్రము బలహీన పడినపుడు కలిగిన అనుభవాలు తగ్గుతున్నాయని అనిపించసాగినది. కారణం ఈ చక్ర ముద్ర అని నాకు అర్థం అయింది.
జూన్ 5: ఈరోజు నాకు శివ పంచాయతనములో ఉపయోగించే నర్మదానది బాణలింగము ఓంకార క్షేత్రము నుండి వచ్చినది.అంటే ఈ చక్రశుద్ధి ఆరంభమైనదని నాకు అర్ధమైనది.

P8:

జూన్ 10: ఈరోజు నాకు ధ్యానము నందు లీలగా గుడిలో గంట మ్రోగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక నాదం లీలగా వినబడినది. విచిత్రంగా అనిపించింది.
జూన్ 18: ఈ రోజు చాలా స్పష్టముగా గుడిగంట నాలో వినబడింది. అంటే నా దేహమే దేవాలయము అయిందా లేదా నా మెదడు దొబ్బినదా?

జూన్ 20: ఈ రోజు చాలాసేపు దీర్ఘకాలికంగా ఈ గంటానాదం వినబడుతూనే ఉంది. బయట ఎలాంటి శబ్దాలు లేని చోట అందులోనూ నాలో ఒక దీర్ఘగంట ధ్వని వినిపించడం నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఈరోజు హనుమంతుడున్న పెద్ద పూజ గంట వచ్చినది.ఈ గంటను మ్రోగిస్తే నాకు ధ్యానములో వినిపించే దీర్ఘ గంటనాదములాగా ఉండటము నాకు చాలా ఆశ్చర్యమనిపించినది.

జూన్ 25: ఈ రోజు నాకు  ధ్యానము నందు ఆకుపచ్చరంగులో 12 దళాలు వుండి 'యం' అనే బీజాక్షరము ఉన్న ఒక పద్మము కనిపించినది.ఇదే అనాహత చక్రం అనుకునే లోపల నాకు ధ్యానభంగం అయినది.
జూలై 2: అందరితోనూ ఈరోజు నవ్వుతూనే మాట్లాడినాను. మనస్సులో ఎలాంటి బాధ లేదు. భయము లేదు.ఒత్తిడి లేదు. కారణం తెలియదు.

P9:
జూలై 10: ఈరోజు మా గురువు దేవుడు నాకు వాయిధారణ ముద్ర ఎలా చేయాలో చెప్పినారు. దీని యందు సిద్ధి పొందితే శరీరం తేలికై మనస్సునందు నిగ్రహ శక్తి కలిగి శరీరము నందు వ్యాధినిరోధక శక్తి పెరిగి శరీరము క్షీణించదని సాధకుడు అపమృత్యువాత పడడని వాయుసంబంధ ప్రమాదాలు జరగవు అని చెప్పి గాలిలో ఎగరగల శక్తి వస్తుందని చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా అని నేను పరీక్షించుకోదలచుకోలేదు. నాకు కావలసినది వాయువు మీద ఆధిపత్యం గాదు వాయువు ఏర్పరచినవాడు ఎవడో తెలుసుకోవాలి అదే నా అంతిమ లక్ష్యం అని మా గురుదేవునికి చెప్పి వచ్చాను.
జూలై 12: ఈ రోజు ఎందుకో వాయువు మీద ఆధిపత్యం పొందాలని సంకల్పం కలిగింది. సిద్దుల కోసం నా మనస్సు తపన పడుతుంది అని నాకు అర్థం అయింది.

P10:

జూలై 15 ఈరోజు నాకు కలలో కాళికామాత కాస్త నగ్నంగా కనిపించి నా మీద మలమూత్రాలు పోస్తూ “ఇవియే నేను నీకు ఇచ్చే సిద్ధులు” అని వీరావేశంతో చెబుతుంటే సరికి నాలో తెలియని భయం మొదలయ్యే సరికి నాకు స్వప్నభంగం అయినది.అంటే యోగ శక్తులు, యోగసిద్ధులు అనేవి మలమూత్రాదులతో సమానం అని అమ్మవారు చెపుతోందని నాకు అర్థమైనది. దానితో సిద్ధుల మీద నాకు స్మశాన వైరాగ్యం భావాలు కలిగినాయి.అవి వద్దు అనుకున్న కూడా వస్తాయి. కాకపోతే వాటిని పట్టించుకుంటే అంతటితో సాధన పరిసమాప్తి అవుతుందని వివిధ యోగుల అనుభవాలు ద్వారా ఈ పాటికే గ్రహించాను.
జూలై 18: ఈ రోజు మనిషి మరణం తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక విపరీతంగా కలుగుతోంది. కారణం తెలియదు. నిజంగానే మరణము తర్వాత ఏమైనా జరుగుతుందా.

P11:

జూలై 20: ఈ రోజు అర్ధరాత్రి నాకు ఒక విధమైన కలలాంటి అనుభవం కలిగింది. నేను చనిపోయి ఎటో వెళ్లిపోయినాను. అది ఎలా ఉంది అంటే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. నా చుట్టూ నాకు తెలిసినవారు, మా వాళ్లు అందరూ ఏడుస్తూ కనిపించారు.నా శరీరము నుండి నాలాంటి కాషాయ రంగు లో ఉన్న కాంతి శరీరము బయటకి వచ్చింది. అది అందర్నీ చూస్తోంది. కానీ ఎవరు దానిని చూడటం లేదు. నా శరీరం చుట్టూ తిరుగుతూ నెమ్మది నెమ్మదిగా ఆకాశం వైపు బయలుదేరింది. ఒక ఆకాశం మధ్య ప్రాంతానికి వచ్చేసరికి నడుము దాకా ఉన్న శరీర మనుషులు కనిపించారు. విచిత్రంగా వీరందరికీ ఏదో ఒక అవయవము లోపము ఉన్నట్లు కనిపించింది.వీరి స్థూల శరీరాలు ఎలా ఉన్నాయో అలా వీరి కాంతి శరీరాలు ఉన్నాయి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎవరితోనూ సంబంధం లేదు. తాము చనిపోయారు అనే విషయం వీరికి తెలియని స్థితిలో ఉన్నారని తెలిసింది. అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లుగా గాలిలో తేలుతూ కనబడినారు.వాళ్లు ఎవరో కూడా నాకు తెలియదు. సుమారుగా 25 మంది దాకా ఉండవచ్చును. అందరూ కూడా వివిధ వరుసక్రమంలో ఉన్నట్లుగా కనిపించారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తరువాత నల్లటి శరీరాలు ఉన్న వాళ్లు కనిపించారు.  ఏడుస్తూ బాధపడుతూ ఆవేదన పడుతూ ఆవేశపడుతూ ఆర్తనాదాలు చేస్తూ భయపడుతూ కనిపించారు. వీరు పూర్తిగా శరీరాలతో ఉన్నారు. కానీ వీరు ఎందుకు బాధ పడుతున్నారో దేనికి బాధ పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కొంత దూరం వెళ్ళిన తరువాత నాలాంటి కాషాయరంగు శరీర వ్యక్తులు కనిపించారు. వీరంతా కూడా ఏదో తెలియని తన్మయత్వం ఆనందం స్థితిలో ఉన్నారు. అందరూ ఏదో చేస్తున్నారు. ఏమి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకు అయితే ఇతమిద్దంగా అర్థం కాలేదు. ఆ తర్వాత వెలుగులు చిమ్ముతున్న ఒక లోతైన గుహలోపలికి టెంపుల్ రన్ ఆటలాగా వేగంగా వెళ్ళిపోయింది. ఆ గుహ చివర ఒక సన్నని దీపకాంతి లాంటి వెలుగు ఒకటి కనిపించి “ఇక్కడికి నువ్వు వచ్చే సమయం ఆసన్నం కాలేదని ఎలా  వచ్చినావో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపో” అనే మాట వినబడినది. దానితో నా ఆత్మ వెనుతిరుగుతుండేసరికి అప్పటిదాకా వెలుగులతో ఉన్న ఆ గుహ  చీకటి అవుతూ నాకు కనిపించినది. దానితో నాకు విపరీతమైన భయం వేసింది. కలలాంటి అనుభవం చెదిరినది.మెలుకువ వచ్చినది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆత్మల ప్రేతాత్మలకు సంబంధించిన పుస్తకాలు చదివితే ఎవరైతే ప్రశాంతంగా చనిపోతారో వారి ఆత్మకు కాషాయ రంగు ఉంటుందని అలాగే ఎవరైతే అర్ధాంతరంగా ప్రమాదాల వలన లేదా ఆత్మహత్య వలన లేదా తీరని కోరికల వలన చనిపోతారో వారి ఆత్మ నలుపు రంగులో ఉండి ప్రేతాత్మలుగా మారతాయని నేను చూసిన గుహయే మృత్యుగుహయని దీని ద్వారానే ఆత్మలు  స్వర్గమునకు లేదా నరకమునకు వెళ్లతాయని తెలుసుకున్నాను.ఇదే మరణ యాత్ర అని గరుడ పురాణం చెప్పిన అన్ని విషయాలు కూడా అక్షర సత్యాలే అని నేను నమ్మక తప్పలేదు.

జూలై 26: ఈ రోజు నాకు ధ్యానము నందు లీలగా సజీవమూర్తిగా మొదట కాళీమాత కపాలమాలలతో కనబడినది. కొద్దిసేపటికి ఈమె కాస్త శూన్యము లోనికి వెళ్లి అదృశ్యమైనది.ఆ తర్వాత ఉగ్ర స్వరూపముగా స్మశానవాసిగా మహాకాలుడు కపాల దండముతో లీలామాత్రంగా కనిపించి తిరిగి శూన్యము నందు అదృశ్యమైనాడు. అంటే ఈ చక్రం నామ రూప దైవాలు కూడా శాశ్వతం కాదని పరమ శూన్యము నందు చేరుకున్నారని నాకు అర్థమయ్యే సరికి నా ధ్యానము భంగమైనది.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
అనాహత చక్ర మా సాధనానుభవాలు:

అనాహత చక్రము జాగృతి:
 నేను మూడు చక్రాలు సాధన స్థాయి దాటి నాలుగవ  చక్రమైన అనాహత చక్రముపై దృష్టి పెట్టి సాధన చేయడం ప్రారంభించాను. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో నన్ను తాకి తట్టిలేపుతున్నారని అనిపించగానే నాకు ధ్యానభంగమై కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కూడా కనిపించేవారు కాదు. కానీ నన్ను ఎవరో తట్టి లేపిన జ్ఞానము నాకు కలిగేది. ఇలా తరచుగా ఈ మధ్య ధ్యానములో నాకు కలుగుతుండేది. ఏమో దెయ్యాలు గాని ప్రేతాత్మలు గాని ఈ పని చేయటం లేదు కదా. అయినా భూశుద్ధి మంత్రం చదువుకొని పసుపు నీళ్ళతో చుట్టూ చల్లుకొని సాధన ఆరంభిస్తున్నాను కదా. మరి ఎవరి స్పర్శలు నాకు కలుగుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు.ఇది ఇలా ఉండగా ధ్యానములో నాకు 28 సంవత్సరముల నగ్న యువకుడు ఒక శవమును భుజము మీద పెట్టుకొని ఒక మర్రి చెట్టు కిందకి వెళ్లి అక్కడ రాతి మీద ధ్యానం చేస్తున్నట్లు చుట్టూ పుర్రెలు,ఎముకలు, జంతువుల అరుపులు వినబడేసరికి నాకు భయమేసి కళ్ళు తెరిచే వాడిని. వామ్మో! ఈయన ఎవరు? ఒకవేళ మృత్యు దేవుడా? మృత్యువుకి దేవుడు కాదు కదా దేవత కదా ఉండేది. అందుకే మృత్యు దేవత అంటారు గదా. మరి ఈయన ఎవరు?శవాలను పీక్కు తినేవాడా? శవాలను మోసే వాడా?  శవాలను దహనం చేసే వాడా? వీడికి ఆ మర్రిచెట్టుకి సంబంధం ఏమిటి? వామ్మో! నన్ను అర్ధాంతరంగా చంపటానికి వచ్చాడా? నేను ధ్యానములో ఉండగా ఈ మధ్యకాలంలో నన్ను తాకి తట్టి లేపుతున్న వాడా? అసలు ఏమీ అర్థం కావడం లేదుకదా అని అనుకుంటూ కళ్ళు తెరిచే వాడిని. ఇలా కొన్ని వారాల పాటు జరిగినది. అప్పుడు నాకు త్రినేత్రం తెరుచుకోవడము ఆరంభమైనది. ఇది ఇలాయుండగా ఈ చక్ర జాగృతి సమయములో నాకు అనుకోకుండా నాలుగు నల్లని సాలగ్రామాలు వచ్చినాయి.వాటిని పూజలో ఉంచి ఆరాధించడము మొదలుపెట్టినాను.

నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఈసారి ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, ఆయా వ్యక్తుల పేర్లు కూడా కనబడటం మొదలైనది. గుప్తనిధులు ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో వాటికి ఉన్న బంధన శక్తులు ఏమిటో కూడా ఖచ్చితంగా అన్ని వివరాలు కనపడటం ప్రారంభమైనది. అంటే లోగడ సినిమా హాల్లో మా వాసు మామయ్యకి కలిగిన అనుభవం మీకు తెలుసు కదా. వాడికి రైలు ప్రమాద దృశ్యాలు పూర్తిగా అన్ని వివరాలు ఎలా తెలిసింది నాకు అర్థమైనది. అంటే వాసు మామయ్య కూడా తన సాధన స్థాయి ఈ అనాహత చక్రం స్థాయిలో ఉండేదని ఇప్పుడు నాకు అర్థమైంది. మణిపూరక చక్రంలో కేవలము ప్రమాద దృశ్యాలు మాత్రమే అనగా రేడియోలాగా తెలిస్తే ఈ అనాహత చక్రములో ప్రమాదాలు ఏ ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో అనగా T.V లాగా తెలుస్తోందని నాకు అర్థమైనది. అనగా దూరదృష్టి వచ్చిందని యోగ శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాను.అనగా అనాహత చక్రం జాగృతి ఆరంభమైనది అనుకుని బహుశా నాకు ధ్యానములో కనిపించిన ఆ యువకుడు మహాకాలుడు అయ్యి ఉంటాడనే అనిపించసాగింది. ఎందుకంటే ఈ చక్ర  దేవతలుగా మహాకాలుడు /మహాకాలిక ఉందురు.పైగా వాళ్ళు స్మశాన వాసులు. విచిత్రముగా అనుకోకుండా నా దగ్గరకి రెండు జతల నల్లని సాలగ్రామాలు ఈ చక్ర విగ్రహమూర్తులకి బదులుగా వచ్చినాయని తెలిసినది.నాకు ఆనందమేసినది.

అనాహత చక్రం శుద్ధి:

ఇలా కొన్ని వారాలు జరిగిన తర్వాత నాకు ఓంకార క్షేత్రం యొక్క నర్మదా నది నుండి  బాణలింగము వచ్చినది. దీనినే ప్రాణ లింగము గా భావించుకొని లింగాయతులు ఈ లింగమును ఒక బాక్స్ లో పెట్టుకొని మెడలో ధరిస్తారు.వచ్చిన నా బాణలింగమును నా నిత్య పూజలో ఉంచుకొని నా పంచాయతనంలో ఇప్పటిదాకా బాణలింగము, విష్ణు సాలిగ్రామం, గణపతి శిల, సూర్యుని స్పటికము వచ్చినాయని ఇక అయిదవది అయిన అమ్మవారి లోహశిలమూర్తి రావాలని అప్పుడే పంచాయతన పూజ అనగా పంచ దేవతలు అయిన శివ, దుర్గ, విష్ణు, గణపతి, సూర్యుడుతో కలిసి పంచాయతన పూజ కి అర్హత  కలుగుతుంది అని నాకు అవగతమైనది. ఆవిడ రావాలంటే ఐదవ చక్రమైన విశుద్ధి చక్రమును దాటాలి.ఇందులోనికి ప్రవేశించాలంటే అనాహత చక్రముపై ఉన్న  విష్ణు గ్రంథి శుద్ధి అవ్వాలి అనుకొని నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాను. కొన్ని వారాల తరువాత నాకు ధ్యానంలో 'యం' అనే మధ్య బీజాక్షరముతో గూడిన 12 దళాలతో కూడిన ఆకుపచ్చ పద్మము కనిపించసాగింది. ఇది వాయుమండలము మధ్యలో ఉన్నట్లు అనుభూతి కలగ సాగింది. ఎంతో విచిత్రంగా నా శ్వాసలో మార్పులు రాసాగాయి. ఒక పట్టాన శ్వాస లోపలికి వెళ్ళడము లేదు. ఒకవేళ వెళ్ళితే ఒక పట్టాన బయటికి రావటం లేదు. ఈ లోపల పొట్ట అలాగే బుగ్గలు గాలితో నిండి ఉబ్బి పోతున్నాయి. నాకు తీవ్రమైన ప్రాణ భయము వేసేసరికి బయటకి చాలా వేగంగా వచ్చేస్తుంది లేదా లోపలకి అంతే వేగంగా వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని వారాలు నా ప్రమేయం లేకుండా జరిగేది. ఇదే ప్రాణాయామము విధి విధానం అని నాకు తెలిసినది కాదు. భయము వేసి ధ్యానము ఆపేసే వాడిని. మళ్లీ తిరిగి ధ్యానము మొదలు పెట్టే సరికి మళ్ళీ తిరిగి శ్వాస వ్యవస్థలో మార్పులు రావడం జరిగేది. నేను ధ్యానము ఆపటం జరిగేది.

అనాహత చక్రం ఆధీనము:                          
                                    
ఇది ఇలా ఉండగా … ఒక రోజు నేను ఆఫీస్ కి వెళ్ళుతుండగా నాకు రోడ్డుమీద ఒక కాకినీల రంగు రాయి దొరికినది.దానిని ఆఫీస్ కి తీసుకొని వెళ్ళి పరిశోధన చెయ్యగా అది ఒక ముడి ఇంద్రనీలి రంగు రాయి అని,పైగా దీని మీద ఒకవైపు శనిశంగనపూర్ శనేశ్వరుడి గుర్తు అలాగే ఒక నల్లకాకి బొమ్మ గుర్తు ఉన్నట్లుగా స్ఫష్టంగా కనిపించేసరికి నాకు బుర్ర తిరగడము మొదలైనది. దానిని నేను పూజలో పెట్టుకుని ఆరాధన చేస్తుండగా నాకు ఏవో ప్రేతాత్మలు ధ్యానములో కనపడి మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గా అనిపించేది. ఒకవేళ మహాకాలుడు ఈ రూపములో నా దగ్గరికి రాలేదు కదా అనే ఆలోచనలు రాగానే నాకు ధ్యాన భంగం అయ్యేది. తీరా మళ్లీ ధ్యానానికి కూర్చోగానే ఈ ప్రేతాత్మల దృశ్యాలు కనిపించేవి.నాలో తెలియని భయం ప్రారంభమైనది. హనుమాన్ చాలీసా చదవడం హనుమాన్ గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడం చేసిన కూడా ఈ ప్రేతాత్మల  దృశ్యాలు కనిపించటం మానేవి కావు.ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను అనుకోకుండా అర్ధరాత్రి 12 గంటల ప్రాంత కాలంలో నేను ఇంటికి బయలుదేర వలసి వచ్చింది. దారిలో చిమ్మ చీకటి. ఒక బ్రిడ్జి కూడా వస్తుంది. ఆ తర్వాతనే ఊరి పొలిమేరలు ఉండేది. కానీ వీటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నడక దారిన ఊర్లోకి వెళుతుండగా బ్రిడ్జి మీద నా చిన్ననాటి స్కూల్ మేట్ కనిపించి నాతో మాట్లాడి వెళ్లిపోయినాడు. వాడు దాదాపు అరగంట సేపు పైగానే మాట్లాడినాడు.నేనేమో ఇవి ఏమీ గమనించకుండా ఇంటికి వెళ్లిపోయి పడుకున్నాను. తెల్లవారి లేచి యధావిధిగా గుడిలో పూజాదికాలు చెయ్యటానికి వెళుతూ నాకు మరో స్నేహితుడు కనబడితే వాడికి నిన్న కనిపించిన స్నేహితుడి గూర్చి చెబుతుంటే వాడు నన్ను ఒక దయ్యం చూసిన వాడిలా చూస్తూ “ఏమిరా! నాటకాలు ఆడుతున్నావు. వాడు చనిపోయి ఆరు నెలలు అవుతుంది. బ్రిడ్జి దగ్గర వాడికి వాహన ప్రమాదము జరిగి చనిపోయాడని నాకు తరువాత తెలిసింది. నువ్వేమో రాత్రి వాడిని చూశాను అంటావు. వాడి దహనసంస్కరాలు కి నేనే వెళ్లి వచ్చాను కాబట్టి సరిపోయింది లేక పోతే నీవు చెప్పే కథలు నమ్మేవాళ్ళు అంటూ వాడు వీడు చూసాడో చచ్చిన వాడు చావలేదో అర్థం కావడం లేదని” నన్ను అదోలా చూస్తూ వెళ్లి పోయే సరికి నాకు తెలియకుండానే నా మడి పంచలో అదేదో కారడం మొదలు పెట్టింది అనుకోగానే ఇంటి లోనికి వెళ్లి పని పూర్తి చేసుకున్నాను. దానితో ఈ రాయి మీద సందేహము కలిగి దీని పరిశోధన చెయ్యగా తాంత్రిక విధానములో ఇంద్రనీలి శనీశ్వరుడు కాస్త మహాకాలుడిగా పూజింపబడతాడని తెలిసినది. పైగా ఆరోగ్యప్రధాతగా సూర్యుడు ఉంటే మరణప్రధాతగా శనీశ్వరుడు ఉంటాడని జ్యోతిష్యశాస్త్రవచనము. ఈ లెక్కన చూస్తే మహామృత్యువును ఇచ్చే మహాకాలుడు ఈ ఇంద్రనీలి రాయి రూపములో వచ్చినాడని నాకర్ధమైనది.

ఇలా కొన్ని వారాలు జరిగిన తర్వాత ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో ప్రేత శక్తి నాకు కనపడి నా కోరిక తీరిస్తే నీ కోరిక తీరుస్తాను. నేను మీ బానిసగా ఉంటాను. నాకు కావలసినవి చెయ్యి. మీకు కావలసినవి చేస్తాను. లేదంటే నేను నిన్ను చంపేస్తాను అంటూ వెకిలిగా భయంకరముగా నవ్వుతూ నా మీదకి వస్తుండేది. మరికొన్ని రోజులపాటు ఇదే కనపడేది. కానీ నాలో ఏదో తెగింపు బయలుదేరి దానితో ఏమి? ఏంటి నువ్వు నన్ను చంపేది. నా దగ్గర ఇంద్రనీలి రాయి శివలింగ మూర్తిగా మహాకాలుడు ఉన్నాడు.ఆయనే భూతనాధుడు. ఆయనే నాకు రక్షణగా ఉన్నాడు. అయినా నీకు నాకు తేడా ఏముంది. నువ్వు సూక్ష్మ శరీరధారివి. నేనేమో స్థూల శరీరధారిని. మీ కోరికలు తీరుస్తూ నా కోరికలు తీర్చుకునే భూత స్థాయికి నేను రాను. ఒకవేళ చేస్తే నేనే ఒక క్షుద్రోపాసకుడిగా మారి పోతాను. నాకు అవసరం లేని స్థితి. మానవ స్థాయి నుండి దైవ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాను. మీరేమో వివిధ ఆకారాలతో నాకు కనిపించి నన్ను భయపెట్టి నాకు చావు భయము కలిగించాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది. ఈ చక్ర స్థితిలో చావు, మరణ భయాలు  ఉంటాయని నాకు అవగతమైంది. అనగానే ఆనాటి నుండి ప్రేతాత్మలు నాతో మాట్లాడి ఉపయోగం లేదని గ్రహించి నన్ను భయపెట్టటం అలాగే తమ చేష్టలతో  బెదిరించటం తగ్గిస్తూ వచ్చినాయి అని నాకు అర్థం అయింది. ఏదైనా ఫలానాది మాయ అనగానే అది మాయమవ్వక తప్పదు అది తెలియనంత వరకు ప్రతిదీ మాయగా కనబడుతుంది. ఆట ఆడిస్తుంది. మాయను మాయ అనగానే మాయ మాయం అవ్వక తప్పదు.
కల్ప వృక్ష చక్రము: 

ఇలా కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో ఒక వృక్షము కనబడినది. అది వటవృక్షము లాగా ఉంది .ఇది ఒక అష్ట దళ పద్మము మధ్యలో ఈ వృక్షముఉన్నట్లుగా అగుపించినది. ఈ వృక్షము క్రింద జీవాత్మ ఆసీనుడై ఉన్నాడు. ఇంతవరకు పలు విధాలుగా నాకు కనిపించి ఇబ్బంది పెట్టేది. ఈ వృక్షము ఏమిటో ఆ జీవాత్మ ఏమిటో నాకు అర్థం అయి చచ్చేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఈ వృక్షము పైన నుండి శ్రీకృష్ణుడు వటపత్రశాయిగా ఉన్నట్లుగా అగుపించటం ఆరంభమైనది. మరి కొన్ని రోజులకి ఈ వృక్షము క్రింద ఉన్న జీవాత్మ నా పోలికలతో నాకు లాగానే ఉందని అర్థమయ్యే సరికి నా మతి పోయింది. అంటే ఈ వృక్షం ఒకవేళ వంశ వృక్షమా?దీని క్రింద పితృదేవతలు ఉన్నారా? ఏమో ఎవరికి తెలుసు ఇది అని అనుకోగానే ధ్యాన భంగము అయ్యేది. 

కొన్నాళ్ల తర్వాత నాకు పూరి క్షేత్రము నుండి పూరి జగన్నాథుడి విగ్రహమూర్తి అన్నతో, చెల్లితో కలిసి ఉన్నది వచ్చినది. దానిని యధాలాపంగా పూజలు పెట్టి ఉంచేవాడిని. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానములో పూరి జగన్నాథుడు కనిపించి” నాకు బాగా ఆకలి వేస్తుంది ఏదైనా తీపి పదార్థం పెట్టు. నీ జీవాత్మ శాంతించును” అని చెప్పి అదృశ్యమైనాడు. నాకు మొదట ఏమీ అర్థం అవ్వలేదు. అసలు ఈ పూరి క్షేత్రానికి అలాగే నాకు ధ్యానములో కనిపించే వృక్షానికి ఏదో సంబంధం ఉందని అనిపించి ఆ పూరి క్షేత్రం గూర్చి ఆరా తీయగా పూరిలో కల్పవృక్షము ఉంటుందని దాని క్రింద ఒక జీవాత్మ యొక్క 48 తరాల వారి జీవాత్మలు ఉంటాయని ఎవరైతే ఈ ఈ క్షేత్రానికి వెళ్లి ఆయనకు తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే వాటికి విముక్తి కలిగించి వారు కోరుకున్న ఉత్తమ లోక ప్రాప్తి కలిగిస్తాడు అని తెలిసినది. అంటే నాకు ధ్యానంలో కనిపించిన వృక్షము ఖచ్చితంగా కల్పవృక్షమే. అలాగే నా జీవాత్మ సంబంధీకులు ఈ వృక్షము క్రింద ఉన్నారని ఈ కల్పవృక్ష అధిదేవతగా పూరి జగన్నాథుడు ఉంటున్నాడని నాకు అవగతమైనది. వెంటనే తీపి పదార్థం ఈయనకి పెట్టడం ఆనవాయితీగా మారింది. నా జీవాత్మ ఉండేదే అనాహత చక్రం స్థానమైన కల్పవృక్షం చక్రములోనని నాకు తెలిసినది. ఇది హృదయానికి దగ్గరగా ఉండే చక్రము. ఆనాటి నుండి ఏదో భారము తగ్గుతున్నట్లుగా అనుభూతి కలగ సాగింది. నా స్థూల కర్మలు నశిస్తున్నాయని తద్వారా నా సూక్ష్మ శరీరం తేలికగా అవుతుందని అవగతమైనది. ఇది ఇలా ఉండగా నాకు ధ్యానములో ప్రమాద దృశ్యాలు, గుప్తనిధుల దృశ్యాలు, ప్రేత శక్తి దృశ్యాలు, వంశ వృక్షం దృశ్యాలు అన్ని కూడా నెమ్మది నెమ్మదిగా అదృశ్యం అవ్వసాగినాయి. దాంతో నా మనస్సు గాలిలో ఎగిరినట్లు గా అనుభూతి కలగ సాగింది. ఎందుకంటే ఈ చక్ర ఆధీనము వాయువే గదా. అంటే ఈ చక్రం చూపించే దూరదృష్టి సిద్ధి ఉపయోగించుకొని ఉంటే ఈ పాటికి ఆయా గుప్తనిధుల పుణ్యమా అని కోటీశ్వరుడిని అయ్యేవాడిని. నా సాధక జన్మ పరిసమాప్తి అయ్యేది లేదా ప్రేత శక్తులను ఉపయోగించి డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా మెండుగా ఉండేవి.కానీ అలా చేయకపోవడం వలన ఈ చక్ర సిద్ధిని నేను ఎక్కడ కూడా నా స్వార్ధానికి అలాగే ఇతరుల కోసం ఉపయోగించకపోవడం వలన మహాకాలుడు సంతోషించినట్లు గా ఉన్నాడు. ఎందుకంటే నేను ఈరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా రుద్రుడు సూరీడుబింబములో అలాగే చంద్ర బింబములో ఉన్నట్లుగా అగుపించాడు.ఇలా మూడు రోజుల పాటు అగుపించాడు. దీనికి అర్థం ఇప్పుడు నాకు తెలియక పోవచ్చును కానీ ఇందులో ఏదో పరమార్ధము ఉన్నది అని నా గట్టి నమ్మకం.

ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత నాకు ఉజ్జయినిక్షేత్రము నుండి రెండు స్ఫటిక సాలగ్రామాలు అనగా మహాకాలుడు,మహాకాళిక సంకేతకముగా వచ్చినాయి. విచిత్రము ఏమిటంటే ఇంతకుముందు చక్రాలలో మొదట తెల్ల దైవికవస్తువులు వచ్చి ఆపై చిట్టచివరికి నల్లదైవిక వస్తువులు వచ్చి ఆ చక్ర పరిసమాప్తి అవుతుంది.కాని ఈ చక్రమునందు మాత్రము ప్రారంభములో నల్లని దైవిక వస్తువులు అంతములో తెల్లని వస్తువులు రావడము నాకు ఆశ్చర్యమనిపించినది.నా అదృష్టం ఏమిటంటే ప్రతి సారి నా చక్రాల సాధన స్థితుల సమయంలో ఆయా చక్ర దేవతలు తమ క్షేత్రాల నుండి దైవిక వస్తువులు పంపించడము విశేషమే గదా.అందుకే  యోగం ఉంటే యోగి కాక తప్పదు కదా.

జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు

ఇక జిజ్ఞాసి తన అనాహత చక్రం సాధన అనుభవాలు వారి మాటల్లోనే చూద్దాం. “శివా!నువ్వు నీ అనాహత చక్రం సాధన అనుభవాలు నాకు నీ టెలిపతి ద్వారా తెలిసినాయి. నాకు ఒక సందేహము. మరి మీలాగా నాకు ఎలాంటి దైవిక వస్తువులు రాకపోయినా నా సాధన ఎలా ముందుకి వెళుతుందో అర్థం కావటం లేదు” అని సూచనలు పంపించాడు. దానికి నేను వెంటనే “సిద్ధా! నీవు మూలాధారచక్రము లో ఉన్నప్పుడు చింతామణి శిల, అలాగే స్వాధిష్ఠాన చక్రం లో ఉన్నప్పుడు లక్ష్మి మహా శంఖం,అదే మణిపూరక చక్రములో ఉన్నప్పుడు సిద్ద పాశుపత యంత్రము వచ్చినాయి కదా.వాటిని చూసి పరీక్షించి అవి నీకు ఉపయోగపడవని భావించి సాధనకు అడ్డంకిగా అవుతాయని గ్రహించి వదిలేసినావు కదా. ఇలాంటి మహత్తర దైవిక వస్తువులు నాకు రాలేదు. ఎందుకంటే నేను కేవలం యోగసిద్ధులు ఉన్నాయా లేదా నా అనుభవం లోనికి తెచ్చి వదిలి పెడితే నువ్వు నీ సిద్ధ మార్గములో వాటిని అదే యోగసిద్ధులు సాధించి విజయం పొందుతున్నావు. నాకు పంచభూతాలు అదుపులో ఉండవు. నీకు పంచభూతాలు నీ ఆజ్ఞను పాటించే స్థాయిలో నీ సాధన ఉంది. అదే జ్ఞానమార్గానికి మరియు సిద్ధమార్గానికి ఉన్న తేడా. జ్ఞాని తన యోగ శక్తులు త్యాగం చేస్తే సిద్ధుడు వాటిని సిద్ధింప చేసుకుంటాడు. మరి నాలగవ చక్రమైన అనాహతచక్రములో నీకు ఎలాంటి దైవిక వస్తువులు వచ్చినాయో వినాలని ఉంది” అని వారికి సూచనలు పంపించాను.శివజ్ఞాని!నువ్వు చెప్పినది అక్షర సత్యమే. ఇప్పుడే నాకు అన్ని గుర్తుకు వస్తున్నాయి. అంటే మీ సాధన స్థాయికి తగ్గట్టుగా నా సాధన స్థాయికి తగ్గట్టుగా తప్పకుండా దైవిక వస్తువులు వస్తాయని నీ ద్వారా తెలిసినది. నా అనుభవాలు ఏమిటంటే ఎప్పుడైతే నేను మణిపూరక చక్ర తత్వమును అనగా అగ్ని మీద ఆధిపత్యం వచ్చినదో ఆనాటి నుండి నాలుగవ చక్రమైన అనాహతము మీద దృష్టి పెట్టి చక్ర ధ్యానం చెయ్యడం ప్రారంభించాను.

ఈ సారి నాకు ధ్యానములో వివిధ రకాల ప్రమాద దృశ్యాలు అవి జరిగే ప్రాంతాలతో సహా ముందుగానే కనబడటం ఆరంభమైనది. వీటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అవి ఎక్కడో జరిగిన దృశ్యాలు చూపిస్తుంటే మనకి ఏమి లాభమో అర్థం కాలేదు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లిన ఎటువంటి ప్రయోజనం ఉండదు.జరిగేది జరగక మానదు కదా. జరుగుతున్నది చూడటం తప్ప ఏమీ చేయలేము. అక్కడి దాకా వెళ్ళిన ప్రయోజనం ఉండదని ఏదో చూసేది ఇక్కడి నుంచే చూస్తే సరిపోతుంది గదా అనుకునేవాడిని. కానీ విచిత్రంగా నాకు ఒక గుప్త నిధులు అవి ఉండే ప్రాంతాల వివరాలు వాటి యజమాని ముఖాలు తరచుగా కనపడ సాగినాయి. నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే ఆ కనిపించే యజమాని నాకు బాగా తెలిసిన వ్యక్తి.అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి వాడి ధర్మ సందేహాలు తీర్చుకుని ఏదో ఒక పరక ఇచ్చి వెళ్తాడు. నేను వెంటనే వాడి ముందే గంగానదిలో వేసేవాడిని. అయినా వాడు బాధపడకుండా చిరునవ్వు నవ్వి నమస్కారం చేస్తూ వెళ్లిపోయేవాడు. మళ్ళీ ఎప్పటికో కనిపించేవాడు కాదు. కానీ తరచుగా నాకు ఈ నాగ బంధ సహిత గుప్త నిధులు కనిపించే దృశ్యంలో వీడు కనిపించటమే ఆశ్చర్యంగా ఉండేది. 

ఆ తర్వాత నాకు ధ్యానములో శ్వాసలో విపరీతమైన మార్పులు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడము నాకు తెలియకుండానే నా శరీరము ఏవో ఆసనాలు వేయటం నా చేతులు నా ప్రమేయం లేకుండానే యోగ ముద్రలు వేయడం జరుగుతూ వచ్చినది. అప్పుడు నాకు అర్థమైనది. ఇవి అన్నియు కూడా ఈ చక్ర శుద్ధి చేస్తున్న పనులని దానితో నేను ప్రేక్షక పాత్ర వహించి వాటిని కొన్ని వారాలు చేసేవాడిని. ఆ తరువాత కొన్ని రోజులకు నాకు ధ్యానములో యం బీజాక్షరములో 12 దళాల పద్మము కనిపించేసరికి చక్ర శుద్ధి ఆరంభమైనదని నాకు అర్థమైనది. ఆ తర్వాత ధ్యానములో సూర్యబింబము నుండి మహారుద్రుడు అలాగే చంద్రబింబము నుండి మహాకాళి తరచుగా అగుపించారు. దానితో ఈ చక్ర ఆధీనము సమయము ఆసన్నమైనదని నాకు అర్థమైనది. ఆ తరువాత కొన్ని రోజులకు నాకు ధ్యానమునందు ఒక కల్ప వృక్షం కనిపించి దాని క్రింద నా జీవాత్మ దర్శనం అయింది.దాంతో ఇది ఆత్మ దర్శనం అని నాకు అర్థమైనది. నా జీవాత్మ ఉండేదే అనాహత చక్రం స్థానమైన కల్పవృక్షం చక్రములోనని నాకు తెలిసినది. ఇది హృదయానికి దగ్గరగా ఉండే చక్రము. అలాగే కొన్ని వారాల తర్వాత వివిధ రకాల ప్రేతశక్తులు నాతో మాట్లాడాలని వాటిని ఈ ప్రేత జన్మ నుండి విముక్తి కలిగించాలని ఆరాటపడటం  నా ధ్యానమునందు అగుపించాయి. అన్నింటినీ ప్రేక్షకపాత్రతో చూస్తూ ఉండిపోయాను. వాటిలో కొన్ని నన్ను చంపాలని నాకు ప్రాణభయం కలిగించాలని మరణభయము అంటే ఏమిటో చూపించాలని విశ్వ ప్రయత్నం చేయటం నాకు ధ్యానము నందు అగుపించాయి. అయినా దేనికి భయపడక దేనికి ఆశపడకుండా ప్రేక్షకపాత్రుడిగా ఉన్నాను.ఇలా కొన్ని వారాలు జరిగిన తర్వాత గంగానది పుష్కరాలు రావడంతో ఎవరికి తగ్గట్టుగా వారు దానము చేస్తున్నారు.అందులో ఒక రోజు ఒక పెద్ద నల్ల బాణ లింగము వచ్చినది. విచిత్రం ఏమిటంటే అందులో కొబ్బరికాయలో నీళ్లు ఉన్నట్లుగా ఈ లింగము లో నీళ్ళు ఉన్నాయి.ఊపితే నీళ్ళ శబ్దం వినిపించసాగినది. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఈ చక్రంలో రుద్ర బాణ లింగం వుంటుందని యోగశాస్త్రం చెబుతున్న విషయం జ్ఞాపకం వచ్చినది. దానిని ఏమి చేయాలో అర్థం అవ్వక గంగానదిలో వదిలిపెట్టాను. నా శరీరంలో ఉన్న రుద్ర బాణలింగము ఉండగా మిగిలిన వాటితో నాకు ఏమీ పని అని అనిపించింది. అది నిజమే కదా. ఆ తర్వాత దూరదృష్టి సిద్ధి వచ్చినదని నాకు అర్థమైనది. దానివల్ల నాకు జరగబోయే ప్రమాదం సూచనలు ముందుగానే తెలిసేవి. అవి ఇతరులకు చెప్పి వాటి నుండి వారిని రక్షించే పనిగా పెట్టుకుంటే అది నాకు మహామాయ గా మారి నా జన్మ పరిసమాప్తి అవుతుంది అని గ్రహించి మౌనం వహించాను. తెలిసినవారు కనబడిన తెలియనివారు కనపడిన వారి గూర్చి ప్రమాద విషయాలు తెలిసిన వారితో చర్చించడం జరగలేదు. చెప్పి వారిని ముందుగా భయపెట్టటం అనవసరమని నాకు అనిపించినది. 

ఒకరోజు నేను గంగా నది ఒడ్డున ఉండి తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు ఎదురుగా ఉన్న గంగానది భాగములోని నీళ్లు సుడులు తిరుగుతూ గాలిలోకి పైకి లేవడము ఆరంభమైనది. ఇదంతా కళ్లు మూసుకుని ధ్యాన దృష్టిలో ప్రస్ఫుటంగా కనబడేది. కళ్లు తెరిచి చూస్తే నీళ్ళు సుడులు తిరుగుతూ కనిపించాయి. ఎప్పుడైతే నేను ధ్యానము ఆపివేశానో అపుడు ఈ నీళ్ళు తిరగడము ఆగిపోయేది.నాకు ఆశ్చర్యం తో పాటుగా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. ఇలా కొన్ని వారాలు జరిగిపోయిన తరువాత విచారణ చేస్తే అది ఈ చక్రం యొక్క వాయుతత్వం లక్షణమని అనగా దానితో ఈ చక్ర ఆధీన స్థాయికి అనగా పంచభూతాలలో ఒక్కటి అయిన వాయువు మీద ఆధిపత్యం దిశలో తాను ఉన్నానని నాకు అవగతమైనది. దానితో నేను అరుణాచలం వెళ్లి గుప్తంగా ఉన్న 18 సిద్ధగురువులు సమక్షంలో వారు చెప్పిన విధి విధానాల ద్వారా వాయువు మీద ఆధిపత్యం పొందటం జరిగింది. ఎక్కడైనా ఎప్పుడైనా గాలి వానలు వస్తే వాయువును ఆగిపోవాలని ఆజ్ఞాపించగానే వాయువు ఆగిపోయి వాన మాత్రమే పడేది. కానీ ఇలా చేయడం కూడా ప్రకృతి విరుద్ధము కదా అనుకుని ఈ ఈ వచ్చే సిద్ధులు ఎవరికీ ఎప్పుడూ ప్రదర్శించకూడదని అనిపించసాగింది. అవి వచ్చినాయో లేదా పరీక్షించుకుని వచ్చేదాకా చక్ర సాధన కొనసాగించటం అలవాటు చేసుకోవడం జరిగినది. దాంతో నాకు ఈ చక్రము మీద ఆధిపత్యం వచ్చిందని అవగతమై ఈ చక్రమునకు పైన ఉన్న విష్ణు గ్రంధిని జాగృతి,శుద్ధి,ఆధీనము ఎలా చేసుకోవాలో ఆలోచిస్తూ శ్రీశైలము వైపు బయలుదేరుతున్నాను.మరి తమరు గూడ ఈ గ్రంథి గూర్చి ఆలోచించు భయ్యా” అని వాడు నాకు సూచనలు పంపించి ఊరుకున్నాడు.మరి ఆలస్యం ఎందుకు. మీరు కూడా నాతో ముందుకు పదండి.

 శుభం భూయాత్

పరమహంస పవనానంద

*******************************

గమనిక: ఈచక్ర స్ధితిలో మనకి మధ్యమ స్ధాయిలో త్రినేత్రము తెరుచుకుంటుంది.తద్వార మనకి ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అన్నిగూడ వీడియో దృశ్యాలుగా కనపడతాయి.పైగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు,గుప్తనిధులు ఉండే ప్రాంతాలు...ఇలా అన్ని రకాల దృశ్యాలు కనపడతాయి. మనకి ఈ త్రినేత్రం తెరుచుకుంటే ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. 
1.               తిండి మీద ధ్యాస పోతుంది.
2.               మాడు,భ్రూమధ్య ప్రాంతములో తరచుగా నొప్పి వస్తుంది.
3.               దేనియందు ధ్యాస ఉండదు.
4.               కంటికి సూక్ష్మధారులు కనపడతారు.
5.               ఎదుటివారి మనోభావాలు,వారి ఆలోచనలు సహజ సిద్ధంగా తెలుస్తాయి. 
6.               ఏకాంతముగా ఉండటానికి అలవాటుపడతారు.
7.               ఏవరితోను మాట్లాడాలని అనిపించదు.మౌనముగా ఉంటారు.
8.               దేనియందు ఆసక్తి,అనురక్తి,ఆశ,భయముండవు. 
ఇది ఇలాయుండగా అనగా నాకు బొట్టు పెట్టుకొనే ప్రాంతంలో నాకు విపరీతమైన నొప్పి మొదలైంది. అది ఎందుకు వస్తుందో నాకు తెలిసేది కాదు. ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు. కాకపోతే నేను తీవ్ర ధ్యానము చేసినప్పుడు మాత్రమే ఈ నొప్పి తగ్గుతుండటము గమనించి ఈ నొప్పి నివారణ కోసం నా ధ్యాన సమయమును 40 నిమిషాల నుండి నాలుగు గంటల దాకా చేసేవాడిని. అప్పుడే ఈ నొప్పి తగ్గేది. నాకు ఆశ్చర్యము వేసింది. కొన్ని రోజులకి చూస్తే ఈ ప్రాంతం నుండి ఒక సన్నని గీతలాగా పాపిట బొట్టుదాకా ఏర్పడినది. అంటే శ్రీ వైష్ణవాచార్యులు ఎలాగైతే నిలువు గీత లాగా తిలకమును పెట్టుకుంటారో అలా నా తల భాగం మీద నుండి క్రింద అనగా ఈ బొట్టు ప్రాంతములో నిలువు సన్నని గీత ఉండేది. ఇది ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం అయ్యేది కాదు. నాకు తెలియని భయం వేసేది. ఒకవేళ నా తల రెండు భాగాలుగా తీవ్ర ధ్యానము వలన విరిగిపోయేదా అని భయం వేసేది. ఎవరికి ఏమి చెప్పుకోలేను. అసలు నాకు నాకే ఏమి జరుగుతుందో తెలియక చస్తున్న సమయంలో నాకు కళ్ళముందు విచిత్రంగా స్త్రీ పురుష నగ్న దృశ్యాలు,రతి క్రీడా దృశ్యాలు వీడియోస్ చూస్తున్నట్లుగా నాకు చాలా స్పష్టంగా కనిపించే సరికి మతి పోయేది. ఉన్న సమస్యలు చాలక ఇదేమి క్రొత్త సమస్య అని నాలో నాకు తెలియని భయాలు మొదలయ్యాయి. విచిత్రంగా ఎవరినైనా నేను తీక్షణముగా చూస్తే ఏ ప్రేమజంట లేదా పెళ్లయిన జంటలను చూస్తే రాత్రికి వారి మధ్య జరిగే మైథున దృశ్యాలు నాకు స్పష్టంగా కనబడేవి. నిజంగా వారి మధ్య అవి జరుగుతున్నాయో లేదో అని నాకు సందేహాలు వచ్చేవి. వాళ్లని అడిగితే చెప్పు తీసుకొని కొడతారు అని నా భయం. నేను అడగలేను. అసలు నాకు ఏమి జరుగుతుందో నాకే తెలియని విచిత్ర స్థితి….పరిస్థితి…. 

ఇలాంటి విచిత్ర పరిస్థితిలో ఉండగా ఒకడు నా దగ్గరికి వచ్చాడు. క్రొత్తగా పెళ్ళి అయినది. పైగా వారం రోజుల నుండి వీరి మైథున దృశ్యాలు నాకు ధ్యానములో కనబడుతున్నాయి.వాటిని చూడలేక చస్తున్నాను. ఎవరికీ చెప్పుకోలేను. వాళ్ళని అడగలేను. అది నిజమో కాదో నాకు తెలియక చస్తున్న సమయంలో వీడు ఏదో సహాయం కావాలని నా దగ్గరికి వచ్చేసరికి నాలో ఏదో తెలియని ధైర్యం వేసినది. అప్పుడు వాడికి మైధున ప్రక్రియలో వాడు చేస్తున్న తప్పులు గురించి చెప్పే సరికి వాడు నోరు వెళ్ళబెట్టినాడు. “స్వామి!నా మైథున ప్రక్రియ విషయాలు మీకు ఎలా తెలిసినాయి?కొంపదీసి మా దగ్గర ఏమైనా కెమేరా పెట్టినారా” అనేసరికి “అదిగాదు స్వామి! రాత్రి స్వామివారు నాకు కలలో కనిపించి నా నిజ భక్తుడు ఒక సమస్యతో మీ దగ్గరికి వస్తాడని వారికి నా సమాధానం చెప్పమని నిన్ను చూపించినాడని” వాడికి చెప్పి తప్పించుకున్నాను. నిజానికి నా మనోనేత్రమే కెమేరా  అని వాడికి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడేమోఅని భయంతో చెప్పలేకపోయాను. అంటే నా మనోనేత్రం ముందు కనిపించే దృశ్యాలు అన్నీ కూడా సత్యమేనని వివిధ రకాల అనుభవాల ద్వారా రుజువైంది. 

ఇలాంటి విచిత్ర స్థితిలో ఉండగా ఒక అమెరికా మోక్షభక్తురాలు స్వాతి నటరాజన్  కావాలని తనకి త్రినేత్రం దృశ్యాలు చూడాలని తపన పడినది. నేను వద్దు అన్నా కూడా వినకుండా కావాలని పట్టుపట్టినది. దానితో నా సాధన శక్తితో ఆమెకి 48 గంటలు మాత్రమే తెరిచే విధంగా ఆమె త్రినేత్రం తెరవటం జరిగింది. దానితో ఆమె కళ్లు మూసినా తెరిచినా కూడా వివిధ రకాల వ్యక్తుల రతి దృశ్యాలు కనిపించేసరికి పాపము పిచ్చెక్కినట్లయింది. 48 గంటలు 48 యుగాలుగా గడిపినది. భరించలేకపోయింది. ఆ దృశ్యాలు చూడలేక అన్నం తినలేక, నిద్ర లేక నానా అవస్థలు పడినది. తన గురువు ఏ సాధన స్థితిలో ఉన్నాడో తెలుసుకొని నాకు దండం పెట్టినది. దానితో ఆమెకి ఉన్న త్రినేత్ర శక్తిని ఉపసంహరించటం జరిగినది. దానితో తిరిగి మామూలు మనిషి కాకలిగినది. ఆతర్వాత మరొక అమెరికా వాసిరాలైన కాశి స్వాతి విశ్వనాధన్ అనే ఆవిడికి తన జీవిత సంఘటనలు ఒకదానితర్వాత మరొకటి చెపుతూండేసరికి ఆమె వెంటనే “అయ్యా!మీరు నాకు సంబంధించిన వీడియో దృశ్యాలు చూసినట్లుగా చెపుతున్నారు” అనగానే నాకు నవ్వు ఆగలేదు. నిజానికి నిజము అదే గదా!

ఈ చక్ర జాగృతి లో నల్లని శాలిగ్రామలింగాలు, నర్మాదనది బాణలింగము, పూరి క్షేత్రము నుండి పూరి జగన్నాథుడి విగ్రహమూర్తి,ఉజ్జయిని నుండి స్ఫటిక సాలగ్రామాలు వచ్చినాయి.అలాగే ఈ చక్రమాయగా మరణ భయమున్నది.అలాగే మా ఆవిడకి తన ధ్యానములో దొంగతనం దృశ్యాలు, ప్రమాద దృశ్యాలు, పాముకాటు దృశ్యాలు, గుప్తనిధుల దృశ్యాలు అవి ఏఏ ప్రాంతాలలో జరుగుతున్నాయో చాలా స్ఫష్టముగా తన ధ్యానము నందు అలాగే స్వప్నమునందు  కనబడుతున్నాయని చెప్పగానే ఈ చక్రము లో వచ్చిన దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చాను.అసలు నాకులాగా ఈ చక్రము నందు మహాకాలుడు,మహాకాళికా దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలు ఉన్న "పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి" పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి గూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది. 

నా సాధన పరిసమాప్తి సమయములో

ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను ఒకసారి ప్రయాగ క్షేత్రము నందు ఉజ్జయిని మహాకాలుడు,మహా కాళిక ఉన్న గుడి దర్శనానికి వెళ్ళడము జరిగినది.అక్కడ నాకు ఒక కాళికా దేవి ఉపాసకుడు కనిపించాడు.వాడు ఏదో తెలియని సాధన సమస్యతో భాదపడుతున్నాడని నాకు అనిపించి వారి దగ్గరకి వెళ్ళి అడిగితే"స్వామి!వారం క్రితము నా చావుకి సంబంధించి ధ్యాన దృశ్యము నాకు కనిపించినది. రాబోవు మూడు రోజులలో చనిపోతాను.అందుకే నా దిగులు” అన్నాడు.దానికి నేను వెంటనే “మంచిదే గదా.అందరు ఉండేది కూటికోసం...పోయేది కాటికే గదా” అనగానే దానికి అతను “స్వామి!నాకు గావలసినది సాధారణ మరణము గాదు.శాశ్వత మరణము గావాలి.జననమరణాలు లేని మరణము గావాలి.కాని దానికి నా సాధన సమయము లేదు.శాశ్వత మరణము పొందకుండా అర్ధాంతర భౌతిక మరణము పొందుతాను  అనే ఆలోచనకే నాకు మృత్యుభయం వేస్తుంది” అనగానే “అయితే నీకు శాశ్వత మరణము పొందటానికి సాధన సమయము గావాలి అంటావు.బాగానే ఉంది.” అంటూ ఉండగానే నేను వాడి చేతిమీద బలంగా గాటు పెట్టేసరికి రక్తము విపరీతముగా కారసాగింది.వాడికి విషయము అర్ధమై... “స్వామి!నాకున్న అపమృత్యుభయం ఈ విధముగా తొలగించారు గదా!తలకాయ పోవలసిన చోట ...చేతి గాయముతో శాంతి చేసి సూక్ష్మములో మోక్షం నాకు కలిగించారు.నాకున్న మృత్యుభయం తొలగించారు.శాశ్వత మరణ సాధనకి యోగ్యత కలిపించారు.అమ్మ భయపెడితే అయ్యలాగా మీరు వచ్చి అభయమిచ్చారు.ధన్యుడిని” అంటూ పాదాభివందనము చేసినారు.దానితో నేను అక్కడనుండి మౌనముగా బయలుదేరినాను.

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. a aah atha chakram lo meeku Pramadaalu, nidhulu kani po’ Charan trinetram
    therchukovatam vere vyakti vishayalanni thelvatam.... meeku ra ravalsina vigrahaaniki baduluga
    Baana lingalu raavatam.... Swarga narakaalu ela untayi ani... alage chanipoyina mee mithrudu
    meeku bridge kinda kanapadi maatladatam...meeku road Mida neeli rangu raayi dorukatam......
    prathi dhaantlo vishwasam undalani meeru cheppinavi laahiri gaariki kuda ave anubhavalani chupinchadam bagundi... chivarlo saadhakudiki marana bhayam tholaginchatam ilanti anubhavam kuda cheppadam adi prathi adhyaayam lo cheppatam nachindi

    రిప్లయితొలగించండి