అధ్యాయం 98


ఆధ్యాత్మిక చిత్ర  -  చిదంబర రహస్యము
 

పరమహంస పవనానంద ముద్ర
 
ఈ గ్రంథ సారాంశము:
ఈ చిత్రములో 1.హనుమంతుడి ముఖము 2.హంస 3.మండే పాము 4. మండుతున్న బ్రహ్మాండ చక్రము 5.దివ్యతార అను పంచభాగాలున్నాయి! వీటిలో తార అనేది ఆకాశమునకు,హనుమంతుడు వాయువుకు,మండే బ్రహ్మాండ చక్రము అగ్నికి,హంస అనేది జలమునకు,పాము అనేది భూమికి అనగా పంచ భూతాలకి సంకేతము అన్నమాట! ఇక నల్లటి చీకటి ప్రాంతము పరమశూన్యమునకు సంకేతమని గ్రహించండి! దీనిని ఆధ్యాత్మికపరంగా చూస్తే...మనకి పరమశూన్యము నందు తార వంటి చితాగ్ని దర్శనమవుతుంది!ఇది ఏర్పడటానికి మూలకపదార్ధము ఆక్సిజను కారకమైనది! వీటి పరిధి మన బ్రహ్మాండ చక్ర కృష్టబిలమంతా ఉంటుంది! ఇది నశిస్తే అన్ని గూడ నశించి చిట్టచివరికి నల్లటి కటిక చీకటియైన పరమశూన్యముంటుంది!

ఇక దీనిని సాధనాపరంగా చూస్తే...మనము హనుమంతుడిలాగా(హనుమంతుడి ముఖము) సంపూర్ణ యోగసాధన చేసి...పరమహంసలాగా(హంస) బ్రహ్మజ్ఞాన సిద్ధుడై...జాగృతి చేసుకున్న యోగాగ్ని(మండే పాము) కుండలీనిశక్తితో...ఎవరైతే తమ బ్రహ్మరంధ్రమున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము(మండుతున్న చక్రము)నందు నిప్పురవ్వ(దివ్యతార)లాగా మారి నశించుతారో వారే అవిముక్త జీవుడవుతాడు! అంటే ఈయన వాయువుకి పుట్టి...చివరికి అదే వాయువులో వాయుపుత్రుడిగా కలిసిపోయి...అవిముక్తి జీవుడై(ఎట్టి బంధము లేనివాడై)భవిష్య బ్రహ్మ అయినాడు! అంటే మనమంతా గూడ గాలిలో పుట్టి అదే గాలిలో అంతరించిపోవడమే అనగా మనకి శ్వాస ఆడితే జననం - అదే శ్వాస ఆడకపోతే మరణం గదా! మనోనిశ్చలస్ధితి పొంది...పరమశాంతిని అందుకున్నాడు! తద్వారా జీవన్ముడైనాడు! ఇదియే జీవన్ముక్తి..అదియే సంపూర్ణ మోక్షం!

నాకు ఆదర్శమూర్తి అయినాడు!ఈయన మన మనస్సుకి సంకేతము!మనస్సు ఆధీనమైతే మాధవుడిని చేస్తుంది!ఆధీనమై..ఆధీనము గాకుండా ఉంటే మానవుడిని చేస్తుంది!అసలు ఆధీనము కాకపోతే వానరుడిని చేస్తుంది! ఒకప్రక్క శ్రీరామ భక్తుడిగా ఉంటూనే...చిరంజీవితత్వముతో వేటియందు బంధి గాకుండా అన్నింటయందు బంధవిముక్తుడై..భవిష్యబ్రహ్మ అయినాడు!ఒక భక్తుడు కాస్తా దైవమైనాడు!అలాగే సాధన సంపూర్ణముగా పరిసమాప్తి చేసుకున్న నామరూప దేవుడు ఈయనే గావడము విశేషము! అంతిమ సత్యము ఏమిటంటే...ఈ విశ్వసృష్టి అనేది త్రస్యరేణువు అనే నిర్జీవ పదార్ధమునుండి ఏర్పడినది!ఇదియే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రమని గ్రహించండి! దీనినే మనశాస్త్రవేత్తలు కృష్ణబిలము అని అన్నారు!రెండు నిర్జీవపదార్థాల కలయక నుండి జీవపదార్ధము ఏర్పడినది!అనగా యూరియా ఏర్పడినట్లుగా అన్నమాట! ఇక జీవపదార్ధము అంటే మండే నక్షత్రమైన ధ్రవతార అని...నిర్జీవపదార్ధము అంటే కాంతిహీనమవుతున్న నక్షత్రమైన కృష్ణబిలమని గ్రహించండి! మనపూర్వక మహర్షులు వీటికి అనగా జీవపదార్ధమును ప్రకృతిగాను..ఆదిపరాశక్తిగా…ఆత్మగా...పిలిస్తే… అదే నిర్జీవపదార్ధమును ప్రకృతిపురుషుడిగా..ఆదిదేవుడిగా…పరమాత్మగా… పిలిస్తే..ఇపుడు వీటినే మనశాస్త్రవేత్తలు అణువుగాను,పరమాణువుగా పిలుస్తున్నారు!ఈ విశ్వసృష్టి అనేది త్రస్యరేణువులు కలిసి న్యూట్రానుగా..ఆపై ప్రోటాన్లుగా..ఆపై ఎలక్ట్రాన్ గా రూపాంతరము చెందినది!ఈ మూడింటినే మన పూర్వీక మహర్షులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ,విష్ణువు,మహేశ్వరుడిగా అలాగే వీటిలో ఉండే శక్తులని త్రిమాతలుగా అనగా సరస్వతి,లక్ష్మీ,పార్వతిగా పిలవడము జరిగినది! ఈ త్రస్యరేణువును మన శాస్త్రవేత్తలు దైవకణమని పిలవడము జరిగినది! ఈ రేణువు స్వయంభూ అని తెలుసుకోండి! మూడు త్రస్యరేణువులు కలిసి పరమాణువుగాను..ఆపై ఇవి కలిసి అణువుగా..ఆపై ఇవి కలిసి జీవపదార్ధముగా రూపాంతరము చెందినాయని తెలుసుకోండి! అనగా 36 మూలకాలతో రేణువు పరిమాణములో మూలజీవపదార్ధము ఏర్పడినది! ఈ 36 మూలకాలే…36 మూలబ్రహ్మకపాలాలుగాను...36 భగవత్తత్వాలుగా చెప్పడము జరిగినది! ఆదిమూలబ్రహ్మపదార్ధమే…మన నామరూప సదాశివమూర్తియని తెలుసుకోండి!ఈ జీవపదార్ధములోని మూలక అణువుల మార్పులవలన వివిధరకాల జీవపదార్థాలుగా రూపాంతరము చెందినాయి! ఈ విశ్వములో ఏ పదార్ధము సృష్టించబడలేదు!నాశనము చెయ్యబడలేదు! కేవలము ఒక పదార్ధము నుండి మరొక పదార్ధముగా రూపాంతరము చెందుతున్నాయని తెలుసుకోండి! పూర్ణం కాస్త పూర్ణం గానే ఉంది!పూర్ణం నుండి పూర్ణం తీసివేసిన..పూర్ణం అవుతుంది! ఈ వివిధరకాల జీవపదార్థాలను మన పూర్వీకులు 36కోట్ల దైవాలుగా పిలిస్తే...ఇపుడు మనవాళ్ళు మూలకాలని పిలుస్తున్నారు! అంటే మన పూర్వీకులు వీటికి ప్రాణమున్నట్లుగా, శరీరములున్నట్లుగా భావనలు చేస్తే...ఇపుడు ఉన్నవారు వీటిని కేవలము ప్రాణము లేని మూలకాలుగా చూడటము జరిగినది! అంతెందుకు సల్ఫర్ తీసుకుంటే మనవాళ్ళు "S" అంటే మనపూర్వీకులు శివుడు అన్నారు! శివుడి(Shiva) పేరు "S" తో మొదలవుతుందని గ్రహించండి! ఇక బ్రహ్మ అంటే "B" అనగా బోరాన్...విష్ణువు అంటే "V" అనగా వెకాడియం...బాలాదేవి అంటే "B"భాస్వరము,చంఢీ అంటే "C" కార్బన్...విచిత్రము ఏమిటంటే ఈ మూలకాలకి ఏ లక్షణాలు ఉంటాయే అవే లక్షణాలు ఆయా దేవతలకి ఉంటాయి! అనగా "S" తీసుకుంటే సల్ఫర్ గదా! దీనికి నిరంతరము మండే గుణముంటుంది గదా!అలాగే మన శివుడు,శివాని లకి నిరంతరముగా కోపావేశాలతో ఏదో కారణానికి రగులుతూనే ఉంటారు గదా! జాగ్రత్తగా ఆలోచించండి! మన పేరులోని మొదటి అక్షరమును తీసుకుంటే...అది మన మూలకమేదో తెలుస్తుంది!దాని లక్షణాలు మన జీవపదార్దమునకు ఉంటాయి! అంటే మూల మూలకాలకి పూర్వమువారు కేవలము దైవాల నామాలు,వారి రూపాలు మాత్రమే పెట్టడము జరిగినదని తెలుస్తోంది గదా! ఈ లెక్కన చూస్తే విశ్వసృష్టి అనేది భగవంతుడు చెయ్యలేదని...కేవలము మూలకాలే చేసినాయని తెలిసినది గదా! ఈ లెక్కన భగవంతుడు అనేవాడు ఆదిమానవులలో బాగా పరిణితి చెందిన మానవుడేనని తెలుస్తోంది గదా! అంతెందుకు భగవద్గీత యందు ఎవరైతే గుణరహితముగా ఉందురో వారే పరమాత్మయని...ఎవరైతే కర్మఫల త్యాగము చేస్తారో వారే యోగి అని చెప్పడము జరిగినది గదా!అంటే పరిణితి చెందిన మానవుడే మాధవుడు... పరిణితి చెందిన జీవుడే శివుడు.. పరిణితి చెందిన ఆదిస్త్రీమూర్తియే ఆదిపరాశక్తి యని తెలుసుకోండి! ఇదియే అసలుసిసలైన అహ:బ్రహ్మస్మి...ఇదియే తత్వమసి...ఇదియే శివోహం...ఇదియే సంపూర్ణ అదైత్వస్ధితి.. అనగా నేనే దేవుడిని...నేనే భగవంతుడిని...నేనే శివుడిని...నేనేయున్నాను! చివరికి ఈ నేను గూడ అంతరించిపోయి...సర్వం ఏమిలేదని...సర్వము శూన్యమేనని తెలుసుకుంటారు! అన్ని మతములలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీభత్సాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . అమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదని , ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షలు లేని దేవుడు ఉన్నట్లుగా...వివిధ వేద,శాస్త్ర,పురాణ,ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడము జరిగినది!  నమ్మకమే జీవిత నావకు దిక్చూచి. నిజానికి ఈ విశ్వము విశ్వాసముతోనే నడుస్తోంది!  ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనస్సులు ... మనిషి మనిషి కి తేడా , మనస్సు మనస్సు కి తేడా ఉంటుంది . మనస్సు + శరీరము కలిస్తేనే మానవ జీవి . ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభూతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికి తెలియదు . తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు!తెలియనివాడు తెలుసుకోలేడు! ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తాను బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున.
 
 
 ప్రస్తుత విషయానికి వస్తే... జీవపదార్ధమునకు ఆక్సిజన్ గావాలి...అలాగే నిర్జీవ పదార్ధమునకు  హైడ్రోజన్ గావాలి! అనగా బ్రతికించేది ఆక్సిజన్ అయితే నాశనము చేసేది హైడ్రోజన్ అన్నమాట! బంధము కలిగించేది “O” అయితే బంధవిముక్తి కలిగించేది “H” అన్నమాట! ఇందులో బంధము కలిగించేది మూలాధారచక్రమైతే...బంధవిముక్తి కలిగించేది బ్రహ్మాండ చక్రము అని గ్రహించండి! మూలాధార చక్రము నందు ఉండే స్ధూలశరీరానికి  “O”  గావాలి! అదే బ్రహ్మాండ చక్రము నందు నశించటానికి ఆకాశశరీరానికి “H”  ఉండాలని గ్రహించండి! అలాగే భగవద్గీత యందు ఈ చక్రము నా చేత నడుపడుచున్నదని చెప్పడము జరిగినది! కృష్ణుడు అంటే "K" అనగా Kalium – పొటాషియం! అంటే ఈ చక్రము పొటాషియము అణువుల హెచ్చుతగ్గుల చేత తిరుగుతోందని తెలుస్తోంది గదా!దీని గుణము ఆక్సిజన్ తో కలిసి తెల్లని పొటాషియంపైరాక్సైడ్ గా మారి సెకన్స్ లలో పెద్ద విస్ఫోటనకారిగా మారుతుంది! కాబట్టి ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము నిరంతరము మండుతూనే ఉంటుంది! అలాగే అసలైన కృష్ణ వస్తువు లాగ యిది ఏ మాత్రము వెలుతురుని తిరిగి బయటకు వదలదు! దీని యొక్క మధ్యలో గురుత్వాకర్షణ ఏకత్వం  అనేది ఉంటుంది! ఇదియే అద్వైత సిద్ధాంతము! కృష్ణబిలము నందు “H”   ఉంటుందని మన శాస్త్రవేత్తలు కనిపెట్టినారు గదా!ఇక “H” అంటే హనుమంతుడు(Hanuman) గదా! అంటే మన హనుమంతుడు హైడ్రోజన్ (H) మూలక పదార్ధమని గ్రహించండి! అలాగే ఈయన వాయుపుత్రుడు గావడముతో ఆక్సిజన్  ప్రతీక అయినాడు! దానితో ఈయన అవిముక్తి జీవుడై(ఎట్టి బంధము లేనివాడై)భవిష్య బ్రహ్మ అయినాడు! అనగా జీవపదార్ధము నుండి నిర్జీవ పదార్ధముగా మారడమే యోగసాధన అని...మారితే అదియే సంపూర్ణమోక్షమని..మారకపోతే అది మాయని తెలుసుకోండి! ఇది అంతతేలిక అయిన విషయము గాదని గ్రహించండి! కామదేహము గావాలా...భగవత్ తత్వము గావాలా అని నిరంతరము జగత్ గురువైన జగత్ మనకి నిరంతర యోగపరీక్షలు చిట్టచివరిదాకా పెడుతూనే ఉంటుందని తెలుసుకోండి! వీటిని సహనముతో,శ్రద్ధతో,భక్తితో,అచంచల ఏకగ్రతతో దాటినవారికి వారి మాయ మాయం అవుతుంది! 
 
ఇక నా పరంగా చూస్తే...నా మర్కటనామధేయముతో పవనా (హనుమంతుడి ముఖము )...నా మర్కట సన్యాసిదీక్ష- జ్ఞాన: దీక్షతో (మండే పాము)...మర్కట బ్రహ్మజ్ఞానియై పరమహంస (హంస) లాగా… మౌన:బ్రహ్మ(దివ్యతార) స్ధితిని పొంది… అవిముక్తి జీవుడై… బ్రహ్మాండ చక్రము కృష్ణబిలము (మండుతున్న చక్రము) నందు మా పంచశరీరాలను తునాతునకలు చేసుకుంటూ విభూతిరేణువులుగా మారడము జరిగినది! ఎలా అంటే...మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు ఉన్న పంచభూతాల శక్తి అయిన జీవప్రకృతిని దాటలేమని అన్నారు...మేము దాటినాము...ఇక ఆఙ్ఞాచక్రము వద్ద దైవసాక్షాత్కారాలు దాటలేమని అన్నారు!మేము దాటినాము!ఇక సహస్ర చక్రము వద్ద అంతిముగా ఆత్మ ఉంటుందని...ఇది ఆత్మసాక్షాత్కారానుభూతిని ఇస్తుందని చెప్పడము జరిగినది! దీనిని మేము దాటితే శూన్యము కనపడినది! ఈ శూన్యమును దాటటానికి మా సాధనను హృదయచక్రము వద్దకు వెళ్ళితే పరమ శూన్యం కనపడినది! ఇందులో ఏముంటాయని ముందుకి అనగా బ్రహ్మరంధ్రము వద్దకు వెళ్ళితే… ఒక మూల కపాలము దర్శనమిచ్చినది! ఇందులోనికి వెళ్ళితే… మూలకపాలము యొక్కమండుతున్న చితాగ్ని దర్శనమైనది! ఇదియే పరంజ్యోతిగా అందరు దీనిని భావించినారని మాకు అర్ధమైనది! ఈ చితాగ్ని అధిదైవముగా 85సం!!రాల వయోవృద్ధురాలిగా ఆదిపరాశక్తి కనపడినది!ఈమెను సహనశక్తితో దాటినపుడు మాకు అధి దేవతలుగా దీపదుర్గ,దీపకాళి,దీపచంఢి కనపడినారు! వీరిని దాటినాము!అపుడు మాకు ఈ మూలకపాలములో ఏముంటుందని వెళ్ళితే...అందులో 36 కపాలాలుండి ధ్యానముద్రలో ఉన్న ఒక అస్ధిపంజరము దర్శనమైంది! ఈ కపాలాలు గూడ ఒక పిరమిడ్ ఆకారములో 1,3,5,7,9,11 లలో ఆరువరుసలతో… అమరి ఉన్నట్లుగా అగుపించినది!ఈ కపాలాలలోని అంతిమ ఏకకపాలము దగ్గరికి వెళ్ళితే...ఈ కపాల బ్రహ్మరంధ్రము వద్ద మాకు పిసరంత అగ్నిశిఖ కనపడినది! ఈ శిఖలో సుడులు తిరుగుతూ తనలో అన్నింటిని ఇముడ్చుకుంటున్న బ్రహ్మతేజస్సుతో ఉన్న...బ్రహ్మాండ చక్రము దర్శనమైనది! దీనినే మన శాస్త్రవేత్తలు కృష్ణబిలమని అన్నారని తెలుసుకున్నాము! ఇందులో ఏముంటుందని విశ్లేషణ చేస్తే … హైడ్రోజన్ వాయువు ఉండి...తన పరిధిలో ఉన్న అగ్నిశిఖలాంటి ధ్రవతారలను  అన్నింటిని నాశనము చేస్తూ..తనలోనికి కలుపుకుంటూ...వెనక్కి తిరిగి రానీయ్యకుండా చేస్తూ… ఎపుడైతే తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు పూర్తిగా అయిపోయినపుడు వీటి నూట్రాన్లలోని కాంతి తగ్గుతూ కాంతిహీనమై...చీకటిలోనికి అంతరించిపోతాయని మేము తెలుసుకున్నాము!దానితో మన బ్రహ్మాండ చక్రము అంతరించిపోతుందని... ఇదియే మరణానికి శాశ్వతమరణమైన సంపూర్ణ మోక్షమని గ్రహించినాము!అనగా జీవపదార్ధము కాస్తా నిర్జీవపదార్ధముగా అనగా "O" నుండి"H" గా మారిపోతుంది!దానితో జీవన్ముక్తి పొంది పరమశాంతిని పొందడము జరిగినది! గాకపోతే ఇది అంతాగూడ ఆదిలో జరిగిన మా జీవపాత్ర దృశ్యాలు అలాగే మా యోగసాధన యొక్క రికార్డ్ దృశ్యాలు ఇపుడు చూస్తున్నామని... చూశామని…తెలుసుకొనేసరికి మా బుర్ర కాస్తా బ్రహ్మాండ చక్రములాగా తిరగడము మొదలైంది! ఇలా మేము పొందిన స్వానుభావాల  ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాల సమాహారమే నా సాధన ఆత్మ కథ అయిన ఈ మహత్తర గ్రంథరాజమని గ్రహించండి! 
 
మాకు అలాగే మా చక్ర నామరూప దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడినది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అనిమేము అనుకుంటుండగా మా 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువైన కాశీ వాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి “మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని” ఆదేశం ఇవ్వటం,   మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తక డైరీలు యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. అలాగేఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగము ధరించి అది ఇచ్చే ఇష్ట కామ్య సిద్ధితో ఎవరి యోగసాధన దేనివలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించటం జరిగినది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వడంతో మంత్ర శక్తి,,చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వడంతో యంత్ర శక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతా శక్తులు, దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వటంతో దైవికశక్తి, గురువును గూర్చి చెప్పడంతో శక్తి పాతం, యోగుల అనుభవ వివరాలు చెప్పటంతో యోగశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది .అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటో కి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీ తోడు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి  ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి ,మధుర భక్తి,,నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు.కేవలం మోక్ష కాంక్ష మాత్రమే తీర్చును.  అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారికి మాత్రమే. వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది.అది ఏమిటంటే ఏదో ఒక దైవం మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని  అలాగే మీ ఇష్ట  గురువుగా భావించుకోండి.వారి బీజాక్షర మంత్రము గురు మంత్రంగా భావించి, మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజూ క్రమం తప్పకుండా, వేళతప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానంనందు స్థిరపడి  విశ్లేషణ శక్తి పెంపొందించుకుని వివేకబుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన  శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు లేదా మీ ఇష్ట దేవతను గురువు గావించుకుని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవము గురువుగా గురువే దైవము గాను మారుతుంది .కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తాపడి తమ యోగసాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయను చేధించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూసాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకూడదు. అది ఏమిటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్టభర్త/ఇష్ట భార్య గా భావించకూడదు. ఇది నా మనవి. మాకు లాగా ఈ గ్రంథము ద్వారా వివిధ రకాల సాధన యోగసాధకులు అంతిమ సత్యమేదో తెలుసుకొని...వారి సాధనను పరిసమాప్తి చేసుకొని...దాని యందు జయం పొందాలని.. ….ఆశయముతో...ఆశతో...ఆశిస్తూ…ఆశీస్సులు… ఆశీర్వచనాలతో…
                                                                        - పరమహంస పవనానంద

 
ఇంతకి నా సాధన ఎలా చేసి సంపూర్తి చేసినానో తెలుసుకోవాలని ఉందా...... దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద
****************************************
 
సాధానుభవ ఆత్మకధలు:

నా శిష్యులకి వచ్చిన సాధన సందేహలను తీర్చటానికి ఈ దేహము కాస్త వారికి శక్తిపాతము చేసి వారికి వారే ఈ అనుభవాలు పొంది సమాధానము పడేట్లుగా చెయ్యడము జరిగింది.అనగా స్వాతి అనే అమ్మాయికి మరణము తర్వాత ఏమి జరుగుతుంది అన్నపుడు తనే ఈ ప్రశ్నకి సమాధానముగా స్వానుభవపొందడము జరిగితే  యోగిత అనే అమ్మాయికి ఒక యోగికి కపాలమోక్షం జరిగేటపుడు ప్రత్యక్షముగా చూడాలినపుడు ఏమి జరిగినదో సాధానుభవ కధలుగా మీకు చెప్పడము జరుగుతోంది.వాటిని సావధానముగా వినండి.

మరణము తర్వాత జీవితము - అనుభవ కధ

స్వాతి...
ఈ మధ్యనే బి.సి.ఏ పూర్తి చేసి
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా...
ఈమె జీవితములో అనుకోని సంఘటన జరిగింది! తను ఇన్నాళ్లుగా ప్రాణప్రదముగా పెంచుకుంటున్న జంట తెల్లని ప్రేమపావురాలు తన కళ్ళ ముందర... తన చేతులలో అనుకొని విధంగా... ఎవరు ఊహించని విధంగా చనిపోవడము ఈమెను బాగా కలిచివేసింది! మరణ వేదన మొదలైంది! ఈ జీవులు లాగానే మనము గూడ ఎపుడో ఒకప్పుడు ఏదో ఒక వ్యాధితో లేదా కారణముతో ఆకారణముగా చనిపోవలసినదే గదా? అసలు మరణము అంటే ఏమిటి ? మనం చనిపోయిన తర్వాత మనకి ఏమి అవుతుంది! అసలు మరణము తర్వాత మనకి జీవితము ఉంటుందా? ఈ జీవితము గురించి మనకి గుర్తు ఉంటుందా? చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఒకవేళ స్వర్గానికి లేదా నరకానికి వెళ్లుతామా? నిజానికి ఈ లోకాలున్నాయా? లేక కల్పితమా? మరణించిన వారు ఎక్కడికైనా వెళ్లతారా?మరణించిన తర్వాత తిరిగి వెనక్కి వస్తారా? పునః జన్మ ఎలా సంభవిస్తుంది? అసలు పునఃజన్మ ఉందా? మరణాంతర జీవితము ఏమిటో... ఇలా ఎన్నో ధర్మ సందేహాలు ఈమెను చుట్టుముట్టినాయి. వీటి జవాబుల కోసము ఆ ఊరి శివాలయ పూజారిని అడిగితే గరుడ పురాణము చదివితే ఇందులో నీ ప్రశ్నలకి సమాధానాలుంటాయని చెప్పితే... ఈ పుస్తక గ్రంధమును చదవడము ప్రారంభించినది!

                     చనిపోయినవాడికి 12 రోజుల పాటు పెట్టే పిండాల వలన పిండదేహము ఏర్పడే విధానము , అదికాస్త 13 వ రోజు యమభటుల వెంట తను భూలోకములో చేసిన పాప కర్మలను క్షయము చేసుకొనుటకు యమపురికి వెళ్లే విధానము , ఈ లోకానికి వెళ్లుటకు పట్టే ఒక సంవత్సర కాలములో పిండ ప్రధాన కార్యక్రమములో ఇచ్చే దశ దానాలు ఈ జీవుడికి ఎలా ఉపయోగ పడే విధానము అలాగే యమలోక వివరాలు , అక్కడ వేసే శిక్షలు గూర్చిన వివరాలు ఈమె తెలుసుకొని ఇదంతా చూస్తుంటే యమగోల సినిమా కథలాగా ఉందని... అటు నమ్మటానికి లేకుండా ఇటు నమ్మే విధముగా... అర్ధమై అర్ధముకాని విధముగా ఈ పురాణమున్నదని ఈమె గ్రహించినది! 

 దానితో ఇలా గాదనుకొని శాస్త్రాలు ప్రక్కన పెట్టి సైన్స్ ఈ విషయము గూర్చి ఏమి చెపుతుందోనని తనకి తెలిసిన వైద్యుడి దగ్గరికి వెళ్లి తన ధర్మసందేహమును ఆయనకీ చెప్పింది. ఆయన వెంటనే " అమ్మాయి! నేను గూడ గరుడ పురాణము చదివాను! అది చెప్పేది నిజమా కాదా యని గత కొన్ని సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చే రోగులలో చనిపోయేవారిని చాలా దగ్గరి నుండి పరిశీలించి చూసేవాడిని! వాళ్ళల్లో కొంతమంది చనిపోతూ...గు...గు...అంటూ...ఏదో గుహను చూస్తూ చనిపోతున్నట్లుగా... మరి కొంత మంది ఎంతో ప్రకాశవంతమైన కాంతి పుంజమును చూస్తున్నట్లుగా... కళ్ళను విప్పారించుకుంటూ... చనిపోవడము చూశాను. అదిగాక మరి కొంతమంది ఎందులో ఏదో నదిలో మునిగిపోతూ భయపడుతున్న కళ్ళను చూశాను! కొందరు ప్రశాంతముగా కన్నుమూస్తే మరి కొందరు అశాంతిగా కన్ను ముయ్యడము గమనించాను! అదియు గాకుండా మనిషి గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు స్పృహతో గూడిన ఏదో తెలియని అవగాహన స్థితిలో వాళ్ళు ఉంటారని... దీనికి కారణము గుండె ఆగిపోయిన 20 లేదా 30 క్షణాల వరకు మెదడు పని చెయ్యడము వలన ఇది జరుగుతోందని న్యూయార్క్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్యాం సోర్నియా చెప్పడము జరిగింది! పైగా చనిపోయేవారందరు గూడ ఏదో ఒక అవగాహన పొందుతున్నారని అది మనకి చెప్పలేకపోతున్నారని ఎందుకంటే వైద్యము కోసము వైద్యులు ఇచ్చే మత్తు మందు ప్రభావము లేదా రోగి వాడే మందుల ప్రభావము వలన ఈ అవగాహన విషయాలు అనుభూతులు వారు మర్చిపోతున్నారని... చచ్చి బ్రతికిన 40 % మంది అనుభవాలు బట్టి మనకి తెలుస్తోందని ఇంగ్లాండ్ లోని సౌత్ ఆంఫ్టన్ విశ్వ విద్యాలయ శాస్త్ర వేత్తలు చెప్పడము జరిగింది! 

ఈ పరిశోధనలో ఒకసారి ఒక విచిత్ర సంఘటన జరిగింది! అది ఏమిటంటే ఒక చనిపోయే వ్యక్తిని బ్రతికించాలని కార్టియో పల్మనరీ  రిసిపిటషన్ చేస్తున్నపుడు అతడి  గుండె ఆగిపోయింది! ఇతను మరణించాడని వైద్యులు నిర్ధారించుకున్న ఏడు నిమిషాల తర్వాత ఇతను కళ్ళు తెరవడము జరిగింది! ఇలా చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత బ్రతికిన వ్యక్తిని వైద్యులు ఒక ప్రశ్న అనగా నీకు ఈ ఏడు నిమిషాలలో ఏమి జరిగినది అన్నపుడు... అతడు.. నన్ను ఎవరో నా శరీరము నుండి నా ఆత్మను బయటికి లాగారు! ఇది చాలా తేలికగా అనిపించింది! ఆ తర్వాత ఇలా బయటికి వచ్చిన నేను ఈ ఆసుపత్రి రూము చివరిలో నిలబడి నా శరీర గుండెకి మీరు చేస్తున్న వైద్య విధానమును చూశాను! అందులో ముఖ్యంగా ఈ యంత్రము నుండి ప్రతి మూడు నిమిషాలకి ఒకసారి మాత్రమే విన్పించే ' బీప్ ' శబ్దాన్ని విన్నాను! ఆ తర్వాత నన్ను బయటికి లాగినవాళ్లు నన్ను ఒక గుహ మార్గము గుండా ప్రయాణింప చేశారు! ఇది చాలా గాఢాంధకార మార్గము! ఇలా ఈ మార్గముగుండా ఎంతసేపు ప్రయాణించానో నాకు తెలియదు! కాని ఈ మార్గము అవతలి వైపు ఒక దివ్యకాంతి ఉన్న అద్భుతమైన వెలుగుయున్న మహా తేజస్సును చూశాను! అక్కడ అది నన్ను అశరీరవాణితో ఏవో ప్రశ్నలు అడిగింది! వాటికి నేను సమాధానము చెప్పినట్లుగా గుర్తు! అ తర్వాత కళ్ళు తెరిచి స్పృహలోనికి వచ్చాను! అలా చచ్చి ఇలా బ్రతికి బయట పడ్డాను అని చెపుతుంటే వైద్యులు ఇతడు చెప్పే విషయాలను శ్రద్ధగా ఒక డైరీలో వ్రాసుకున్నాను! ఈ యదార్ధ సంఘటనను 1956 సంవత్సరములో డాక్టర్ రేమాండ్ మూడి అను వైద్యుడి సమక్షములో జరిగింది! తర్వాత ఈయన ఈ విషయాన్ని తను రచించిన Life after Death  అను పుస్తకములో చెప్పడము జరిగింది! అంటే ఈ లెక్కన చూస్తే లక్షలాది మంది మరణమునకు సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్న వాటిని శాస్త్రీయముగా నిరూపించే ప్రయత్నములో మన సైన్సు ఉన్నదని... " ఆయన చెప్పడముతో నమస్కారము చేసి స్వాతి అక్కడ నుండి నిరుత్సాహముగా తన ఇంటికి బయలుదేరినది!

            దారిలో గుడి పూజారి ఈమెకి ఎదురై " " అమ్మాయి! ఇంకా నీ ప్రశ్నకి సమాధానము దొరికినట్లుగా లేదని నీ ముఖము చూస్తుంటే తెలుస్తోంది. " అమ్మాయి! శాస్త్రాలు , సైన్స్ అన్నిగూడ నీ ప్రశ్నకి తగ్గ సమాధానము సాక్ష్యాధారాలుగా నిదర్శనాలు ఏవి చూపించలేవు! నీకు ఏమో నిదర్శనాలు లేనిదే దేనిని ఓ పట్టాన నమ్మవు! నమ్మకమును పెంచుకోవు! అంటే నీకు నీవు కళ్లారా ఎవరైనా మరణ అనుభవము చూస్తే కాని ఈ విషయములో నీ ప్రశ్నకి సమాధానము దొరికినట్లుగా అనుకుంటావు. శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యమునే నమ్ముతావు! ఇలాంటి జ్ఞాన గురువులు నీకు కాశీక్షేత్రములో తప్ప ఎక్కడ దొరకరు! కాబట్టి నీవు కాశీక్షేత్రానికి వెళ్లి నీ ప్రశ్నకి సమాధానము కనిపెట్టు! " అని చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు .

            దానితో ఇంటిలో వాళ్ళకి తన స్నేహితులతో కలిసి తీర్ధయాత్ర పేరుతో కాశీక్షేత్రం బయలుదేరి కాశీకి చేరుకుంది. అక్కడ ప్రతి 20 నిమిషాలకి వచ్చే శవాలను ప్రతినిత్యము చితాగ్ని దహనము చేసే మణికర్ణికా ఘాట్ ను ఈమె చూడగానే ఏదో తెలియని అద్వితీయమైన ప్రశాంత స్థితిని పొందసాగింది! ఎప్పుడు గూడ తన జీవితములో ఇలాంటి ఆనందస్థితి ఒకటి ఉంటుందని అనుకోలేదు! తను ఇలా పొందుతానని ఊహించుకోలేదు! అన్ని అనుకున్నట్లుగా జరిగితే అది జీవితము ఎందుకు అవుతుంది!

                 ఇలాంటి ఆనందస్థితిలో తను యుండగా... తన ఎదురుగా గంగాస్నానము చేస్తున్న నగ్న నాగసాధువు మీద ఈమె దృష్టి పడింది! తన ప్రశ్నకి ఈయన ఏమైనా సమాధానము చెపుతారా అని బలముగా అన్పించడముతో ఆయన రాకకోసము ఎదురుచూడసాగింది! ఈమె స్నేహితులు ఈమెను వదిలిపెట్టి వాళ్ళు గంగాస్నానము చెయ్యటానికి క్రిందకి దిగినారు! ఇంతలో నాగసాధువు బయటికి వచ్చి  అప్పుడే దహనము చేసినవాడి చితాభస్మమును విభూధిగా ఒంటినిండా పూసుకుంటూ... మెడలో రుద్రాక్షమాలలు , చేతిలో త్రిశూలము పట్టుకొని శివాంశ రూపధారిగా ఈ ఘాట్ నుండి బయటికి వెళుతున్న సమయములో.... ఇదే అదనుగా అక్కడే ఈ అవకాశము కోసము ఎదురు చూస్తున్న స్వాతి వెంటనే ఈయన కాళ్ళ మీదపడి " స్వామి! నా ప్రశ్నకి సమాధానము మీరు తప్ప ఎవ్వరు ఇవ్వలేరు! నాకు సంతృప్తి పరిచే సమాధానమును అనుభవపూర్వకముగా ఎవరిదైనా మరణ అనుభవము నాకు చూపించండి అని అంటుంటే... "  ఆ నాగ సాధువైన ఆత్మయోగి పరమహంస పవనానంద ఒక చిరునవ్వు నవ్వి

  " తల్లి! లోకోత్తరమైన ప్రశ్నతో ఉన్నావు! బ్రతికి ఉండగానే చచ్చేవాళ్లు ఎక్కడికి వెళ్లుతారో అక్కడికి వెళ్లి తెలుసుకోవాలనే నీ ఆలోచన సంకల్పము కోసము ఏకముగా ఈ క్షేత్రానికి రావడము బట్టి చూస్తుంటే నీ మనో సంకల్పబలము యెట్టిదో తెలుస్తోంది! లే! తల్లి! నీకు అన్ని వివరముగా చూపిస్తాను! నావంతు ప్రయత్నము నేను చేస్తాను! అంటూ ఈమెను పైకి లేపి... ఈమె భ్రూమధ్య స్థానములో తన బొటన వ్రేలు పెడుతూ " తల్లి! నీవు అడిగిన ప్రశ్నకి సమాధానానికి గావాలసిన అనుభవ నిదర్శనాలు నీ భౌతిక కళ్లతో చూడలేవు! అందుకే నాకున్న శక్తి పాత సిద్ధితో నీ మనోనేత్రమును తెరిపిస్తున్నాను! కాని ఈ కన్ను ద్వారా కనిపించే మనోదృశ్యాలను అన్నింటిని మౌనముగా... సాక్షిభూతముగా... దేనికి స్పందించకుండా... దేనికి భయపడకుండా.. దేనిని మార్చకుండా... దేనికి ఆశపడకుండా... దేనికి ఆలోచించకుండా జాగ్రత్తగా చూడు! అన్ని వివరాలు నీకే తెలుస్తాయి! అంటూ తన చేతిని తీసి వెయ్యగానే....

స్వాతి కనుబొమ్మల మధ్య... బొట్టు పెట్టుకొనే ప్రాంతములో ఏదో దివ్యకాంతి పుంజము వెలుగుతున్న దృశ్య అనుభూతి పొందుతూ అంటే యోగశాస్త్ర గ్రంధాలలో చెప్పబడే మూడవ కన్ను ఉండటం నిజమేనని.... అది మనోదృశ్యాలు చూపించడము నిజమేనని తను అనుకుంటూ తనతో వచ్చిన జలకాలాడుతున్న తన స్నేహితుల వంక త్రినేత్రముతో తేరిపార చూడగా... వారాంతాగూడ ఒకరు పందిగాను , మరొకరు కుక్కగాను , ఇంకొకరు పులిగాను , జింకగాను , ఏనుగుగా... మరొకరు సాధువుగా కనిపించేసరికి ఈమెకి ఏమి అర్ధము కాలేదు! ఆ తర్వాత ఈ నీటి ఓడ్డున గెంతులు వేస్తున్న చేపలు , అక్కడవున్న ఆవులు , కుక్కలను చూస్తుంటే వారంతా జటాధారియైన మహర్షులుగా , సాధువులుగా కనిపించేసరికి వామ్మో! ఈయన ఏదో చేసినాడు! అంతా తికమకగా కనబడుతోంది! మనుష్యులు కాస్త జంతువులుగాను... జంతువులు కాస్త మనుష్యులుగా కనబడుతున్నారు! ఏదో తెలియని భయానికి ఈమె గురి అవుతుండగా... అక్కడే ఉన్న ఆత్మయోగి ఇది గమనించి " తల్లి! కంగారుపడకు! నీ కళ్ళకి ఏమి కాలేదు! నీవు చూస్తున్నదే నిజమైనది! వారి వారి నిజ జన్మలు అవే! కర్మ నివారణకోసము మనుష్యులు కాస్త జంతువుల జన్మలు ఎత్తినారు! అలాగే జంతువుల రూపములో మనుష్యులు కాస్త సాధన చేసుకుంటున్నారు! అంతే తల్లి! ఇదే యదార్ధ జ్ఞాన రూపాలు! భౌతిక నేత్రాలకి కనిపించేది అంతాగూడ మర్చిపోయిన జ్ఞాపక జన్మలే! మనో నేత్రములో కన్పించేది అంతాగూడ జ్ఞప్తికి వచ్చిన జ్ఞానస్పురణ జన్మలు అన్నమాట! అంటుండగా

 " స్వామి! నాకు గావలసినది ఇదిగాదు! జన్మాంతర జ్ఞానము గాదు! అలాగే త్రికాల జ్ఞానముగూడ అవసరము లేదు! నా ప్రశ్నకి సమాధానము...అదిగూడ అనుభవపూర్వకమైన నిదర్శనాలతో గావాలి అనగానే.... "

అక్కడికే వస్తున్నాను తల్లి! కంగారుపడకు నెమ్మదిగా నేను చెప్పినట్లుగా పద్మాసనములో కూర్చొని... శ్వాస మీద ధ్యాసపెట్టు! నీలో వినిపించే ఓంకారనాద శబ్ధ బ్రహ్మను విను! నేను చెప్పేదాకా ఈ ధ్యానస్థితి నుండి బయటికి రాకు" అని చెప్పి చెప్పగానే స్వాతి కాస్త పద్మాసనములో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ శబ్ధనాదము వినడము ప్రయత్నములు మొదలు పెట్టింది! ఇంతలో ఈమెకి అనుకోకుండా శ్వాసకి ఇబ్బంది అయ్యి ఎగశ్వాస స్థితికి వచ్చింది! శరీరము శ్వాసకోసము బాగా ఊగిసలాడుతూ ఎగిరి ఎగిరి పడుతోంది! 

ఈమె శరీరమును చూసిన ఈమె స్నేహితులు ఈమె చుట్టూచేరి " స్వాతి! స్వాతి " నీకు ఏమైందే? ఎందుకు ఎగ శ్వాస పడుతున్నావు! లే! స్వాతి! లే! చలి ప్రాంతము గావడము వలన శ్వాసకి ఇబ్బంది పడుతోంది! అసలే దీనికి ఆస్తమా సమస్య గూడ ఉంది! దీనికి ఏమైనా జరిగితే దీని అమ్మానాన్నకు ఏమని చెప్పాలి? అనుకుంటూ భయపడుతూ , బాధపడుతూ ఉండగా.. ఎవరో ఈమె శ్వాసను చూసి "స్వాతి! శ్వాస ఆగిపోయింది!స్వాతి చచ్చిపోయింది" అని బిగ్గరగా అరిచేసరికి అందరు ఆ ఘాట్ లో ఏడుపు అందుకున్నారు! ఇంతలో స్వాతి అరుస్తూ " ఒసేయ్! నేను చావలేదే? నేను బ్రతికే ఉన్నాను! అంటున్న మాటలు తన స్నేహితురాళ్ళకి వినిపించడంలేదని తెలియగానే... అపుడు స్వాతికి తను నిజముగానే చచ్చిపోయినానని... తన సూక్ష్మదేహము అయిన ఆత్మ ఇదియని... తన భౌతిక పార్థివ దేహము ఎదురుగా కనిపించేసరికి స్వాతి సూక్ష్మ దేహమైన ఆత్మకి అసలు విషయము అర్ధమైంది! ఈ యోగి ఎవరో గాని తనకి ఇతరుల మరణ అనుభవము చూపించమని అడిగితే ఏకముగా తనని చంపి తనకే తన మరణ అనుభవమును చూపుతారా? అనుకుంటుండగా ఎవరో దూతలు ముగ్గురు వచ్చి తన ఆత్మను తీసుకొని వెళ్ళటానికి వచ్చినారని ఈమె గ్రహించింది! 

 అంటే మనిషి చనిపోయినపుడు దూతలు రావడము అనేది నిజమని ఈమె తెలుసుకుంది! ఈ విషయము గుర్తుపెట్టుకొని మనవాళ్లకి చెప్పాలి! ఏమిటి చెప్పేది నా బొంద! నా బూడిద! చచ్చి చాలాసేపు అయింది గదా! బ్రతికి ఉంటే చెప్పవచ్చును! ఇప్పుడు చెప్పిన ఎవరికి వినబడి చావదు! దీనమ్మ జీవితము! ఏదో అనుకుంటే ఏదో అయింది! నా చావు నాకే చూపించినాడు ఈ యోగి ! అనుకుంటుండగా... ఈమె పార్థివ దేహము చుట్టూ చేరిన స్నేహితుల ఏడ్పులు చాలా బిగ్గరముగా వినబడసాగినాయి! కాని తన మాటలు వాళ్ళకి వినిపించకపోయేసరికి ఈమె ఆత్మ కాస్త మరింత ఆవేదన చెంది తిరిగి పార్థివ దేహములోనికి ప్రవేశించగానే... ఈమె దేహములో సూక్ష్మ కదలికలు రావడము మొదలైంది! కాని శరీరములో తన ఆత్మ ఇముడలేక ఇబ్బంది పడటము ఈమె గమనించింది! ఏదో శక్తి తన శరీరము నుండి ఆత్మను ఆకర్షించబడి బయటికి లాగుతోందని తెలుసుకుంది! అది తన  వెంట ఉన్న ఇద్దరి దైవ దూతల యొక్క చేతుల నుండి ఏదో ఆకర్షణ శక్తి ద్వారా తన ఆత్మ ఆకర్షించబడి బయటికి వస్తోందని గమనించింది! దానితో ఈ ఆత్మ తన పార్థివ శరీరానికి 12 అడుగుల ఎత్తులో పైన ఉండడము గమనించింది! ఈ 12 అడుగుల దూరము కోసము పిండప్రధాన కార్యక్రమాలు 12 రోజులపాటు చేస్తారని...దాని వలన ఈ అడుగుల దూరము తగ్గి... పార్థివ దేహ సంబంధమున్న మరొక పిండ దేహము ఏర్పడే విషయమును గరుడ పురాణములో చదివిన విషయము స్వాతి ఆత్మకి గుర్తుకు వచ్చింది!

                           ఉన్నట్టుండి సూక్ష్మదేహ ఆత్మ యందు ఉన్న మూలాధార చక్రముతో ఈ పార్థివ దేహము ఉన్న వెండి తీగె లాంటి ప్రేగు బంధము తెగిపోవడము గమనించింది! అపుడు బ్రొటనవ్రేలు పరిమాణమున్న తనలాంటి రూపదేహమైన యాతనదేహముగా బయటికి వచ్చింది.అంటే ఈ క్షణము నుండి తన ఆత్మకి అలాగే తన పార్థివ దేహానికి యెట్టి సంబంధము లేదని గ్రహించిన ఆత్మకు కాస్త ఆత్మ క్షోభ మొదలైంది! స్నేహితుల మాటలు వినబడుతున్నాయి! తన తల్లిదండ్రులకి  ఫోన్ చేసి అన్ని విషయాలు చెపుతున్నట్లుగా వినబడటముతో తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేసరికి ఈమె ఆత్మకి శాంతి లేకుండా పోయింది! అందరు అన్ని గుర్తుకు రావడము మొదలైంది! చేసిన తప్పులు , పాపాలు , పుణ్యకార్యాలు , గుర్తింపులు , అవమానాలు అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకు రావడము ఆరంభమైంది! తన పార్థివ దేహము నుండి తన ఆత్మకి స్వేచ్ఛ లభించేసరికి ఏదో తెలియని అద్వితీయశక్తి ఆత్మకి వచ్చినట్లుగా ఈమె గ్రహించింది! అంటే మనిషి చనిపోతే 7 గ్రాముల బరువుకు తగ్గుతాడని చెప్పిన విషయము నిజమేనని ... ఈ బరువు అనేది సూక్ష్మదేహమైన ఆత్మబరువు అని తెలుసుకుంది. 

ఇంతలో ఈమె పార్థివ దేహానికి ఈ ఘాట్ యందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లులను అనగా  కాల్చడానికి పేర్చిన తన చితికి పదిమూరల దూరములో ఉండి ఈ తంతును ఈమె ఆత్మ కళ్లారా చూస్తుండగానే జరిగింది!కాని చితికి నిప్పు పెట్టడము వాయిదా పడినది.ఈమె తల్లిదండ్రుల రాక కోసము అందరు ఎదురుచూడసాగినారు.కాని ఏమి లాభము! తన ఆత్మఘోష వారికి... ఎవరికి వినబడదని తెలుసుకొని...దూతల సహాయ సహకారాలతో... తనకున్న ఆత్మశక్తితో చివరికోరికగా తనకి బాగా నచ్చిన ప్రాంతాలు , ప్రదేశాలు , ఆఫీసులు , పార్క్ లు , స్కూలు , కాలేజీ , స్నేహితుల ఇళ్లు, బంధుమిత్ర ఇళ్లు ఇలా అన్నింటిని ఆకాశగమన సిద్ధితో ఇచ్ఛా పూర్వకముగా చూసుకుంటూ ఉండగా తన ప్రాణస్నేహితురాలు మరణించిన దృశ్యము స్వాతి ఆత్మకి కనపడినది.ఏమి జరుతుందో చూడాలని ఆసక్తి ఈమెలో మొదలైంది.అపుడు ఈమెతో ఉన్న దూతలు"ఓ దేహమా!నీకు మరణాంతరము ఏమి జరుగుతుందో ప్రత్యక్షానుభవము గావాలనే ఆఖరి కోరికగా కోరుకున్నావు గదా.నీవు గూడ మాతోపాటు ప్రయాణించి ఇపుడు చనిపోయిన నీ స్నేహితురాలి మరణాంతర యాత్రను చూడు" అంటూ చనిపోయిన దేహము దగ్గరికి ఈ నలుగురు చేరుకున్నారు.

 అపుడు ఈ దూతలు ఈమె స్నేహితురాలి బ్రొటన వ్రేలు పరిమాణము ఉన్న యాతన శరీరమును ఒక సీసాలో పెట్టుకొని ఆకాశమార్గమున ఒక గుహామార్గమునందు రెండు ముహార్తల కాలము ప్రయాణము చేస్తూ యమపురికి చేరుకొని యమధర్మరాజు ముందు ఈ దేహమును ఉంచినారు.అపుడు ఆయన వారితో "  కింకరులారా!మంచిది!ఈ జీవుని 13వరోజున నా దగ్గరికి తీసుకొని రండి.అపుడు ఈ దేహము చేసిన పాపపుణ్యాల బట్టి శిక్షలు గురించి ఆలోచన చేద్దాం అని ఆజ్ఞ చెయ్యగానే...ఈ యమదూతలు కాస్త ఈ యాతన దేహమును తిరిగి ఈమె పార్ధవదేహమున్న చోటుకి తీసుకొని రావడము జరిగింది.  ఇంతలో ఈమె పార్థివ దేహానికి తన ఊరి పొరిమేరలలో ఉన్న స్మశాన వాటిక యందు యందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లులను అనగా  కాల్చడానికి పేర్చిన తన చితికి పదిమూరల దూరములో ఉండి ఈ తంతును ఈమె ఆత్మతో పాటుగా ముగ్గురు దూతలు అలాగే స్వాతి ఆత్మ గూడ చూడసాగింది. 

ఈమె స్నేహితురాలికి వివాహామై ఒక పుత్రుడు కూడ ఉండుటవలన ఈమె చితికి ఈమె కుమారుడు నిప్పు పెట్టే దృశ్యము వీరందరు చూడసాగినారు.ఆతర్వాత జరిగే దశదిన పిండప్రదాన కార్యక్రమాలలో భాగముగా పుత్రుడు చేసిన మొదటి దినం అపరకర్మ చేసే రోజున చేసే పిండం వల్ల శిరస్సు,2వరోజు చేసే పిండం వల్ల కంఠం-భుజాలు, మూడవరోజు పిండం వల్ల వక్షం,నాలువ రోజు పిండము వల్ల పొట్ట,5వ రోజు పిండము వల్ల బొడ్డు,6వరోజు పిండం వల్ల పిరుదులు,7వరోజు పిండం వల్ల గుహ్యావయవాలు,8వ రోజు పిండం వల్ల తొడలు,9వరోజు పిండం వల్ల కాళ్ళు,10వ రోజు పిండము వల్ల పూర్తి శరీరము హస్త పరిమాణము అంతా పిండదేహముఏర్పడము ఆటుపై 11వరోజు మరియు 12వ రోజు పిండ ప్రధాన కార్యక్రమము వలన ఈ పిండదేహము భుజించి తన ఆకలిదప్పికలు తీర్చుకోవడము జరగడము స్వాతి ఆత్మ గమనించింది.ఇలా 12 రోజులపాటు జరుగవలసిన దిన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత దూతలు కాస్త అపుడిదాకా సీసాలో ఉంచిన యాతన శరీరమును కొత్తగా ఏర్పడిన పిండదేహములోనికి ప్రవేశపెట్టడముతో..ఈ దేహానికి ప్రాణశక్తి వచ్చి...ఆత్మశక్తితో ప్రయాణానికి అనగా వెలిగించిన దీపకాంతితో...ఆ తర్వాత 13వ రోజున తమతో ఉన్న దూతలు కాస్త ఈ పిండదేహమును తమ పాశాలతో బంధించి కట్టిసిన కోతిలాగా  దూతలు చూపించిన ఒక గుహ  మార్గమునందు ఈమె ఆత్మ 13వ రోజున నుండి ప్రయాణించడము మొదలు పెట్టింది!ఈమెతో పాటుగా ఎలాంటి శిక్షలు లేని ఆత్మగా స్వాతి సూక్షదేహము వీరిని అనుసరించ సాగింది. నరకమార్గమున 86 వేల ఆమడల దూరములో ఉన్న యమపూరి వైపుకి ప్రయాణము కొనసాగిస్తారు.ఈ మార్గమును తను ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు కాలములో 247 ఆమడల చొప్పున నడవడము జరిగింది.ఈ మార్గప్రయాణములో తనతో వచ్చిన దూతలు తమ పాశాలతో తన స్నేహితురాలి పిండదేహమును చేసిన పాపపు ఆలోచనలకి శిక్షగా విపరీతముగా హింసించడముతో పాటుగా ఒక్కొక్కచోట కాళ్ళలో దిగే ముళ్ళవలన,విషపూరితమైన పాముల,తేలు కాట్లు వలన,ఈ పిండదేహము విపరీతమైన యాతనలకి గురి అవుతూ ప్రయాణము కొనసాగించడము స్వాతి ఆత్మ గమనించింది.   ఇలా  నడుస్తూ దశదిన కార్యక్రమాలలో ఇచ్చిన దశదానాల వస్తువులు ఈ మార్గ ప్రయాణములో ఉపయోగించుకుంటూ అనగా గొడుగు , చెప్పులు , మంచినీళ్ల కుండ , దీపదానం , పుస్తక దానం , భూదానం , గోదానం , తిలదానం , శయ్యాదానం , వస్త్రదానము ఇలా చేసిన పది రకాల దానాలు ఈ మార్గ ప్రయాణానికి ఉపయోగపడతాయని స్వాతి ఆత్మ గ్రహించింది.
   
 అలాగే యమపురికి వెళ్ళటానికి 16 పురాలు మరియు వైతరిణి నది దాటవలసి ఉంటుందని స్వాతి ఆత్మ తెలుసుకుంది. ఇలా వీరందరు సుమారు 17 రోజులపాటు నడిచి 18వ రొజున సౌమ్యపురము చేరడము ఈమె గమనించింది.ఈ పురమునందు ప్రేతాత్మలు అనగా అపమృత్యుదోషముతో మరణించినవారు, అకాల మరణాలు పొందినవారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు..పిండప్రదాన కార్యక్రమాలు జరగనివారు,దహనసంస్కారాలు జరగనివారు,తీరనికోరికలున్న వారు...ఇలా ప్రేతాత్మలుగా ఈ పురమునందు ఆవాసము చేస్తూంటారని ఈమె తెలుసుకుంది.అలాగే ఈ పురము నందు పుష్పభద్ర పేరుతో నది ప్రవహించడము చూసింది.అలాగే ఇక్కడున్న అతిపెద్ద మర్రిచెట్టు క్రింద తనస్నేహితురాలిగా లాగా తీసుకొనిరాబడిన ఇతర జీవుల దేహలు విశ్రాంతి తీసుకోవడము ఈమె గమనించింది.అక్కడ ఈమె స్నేహితురాలికి మొదటినెల శ్రాద్ధ భోజనము అందించడము దానిని భుజించిన తర్వాత ఈమెను అక్కడనుండి 2వ పురము అయిన సౌరపురానికి తీసుకొని వెళ్లడము జరిగింది.అక్కడ ఈ పురమును యముడు లాగా ఉన్న జంగముడ  అనే రాజు పాలకుడిగా ఉండటము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ ఈమె స్నేహితురాలికి రెండు నిమిషాలుపాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి 2వ నెల మాసికభోజనము అందించడము జరిగింది.ఇది తిన్న తర్వాత ఈమెను  3వ పురము అయిన నగేంద్రపురమునకు తీసుకొని వెళ్ళడము జరిగింది.ఇక్కడ ఉన్న అసిపత్ర వనం స్వాతి ఆత్మ  చూసింది.దీని పొడవు సుమారుగా 2వేల యోజనలు ఉందని..ఇందులో భయకరమైన గ్రద్ధలు, కాకులు, పులులు, సింహలు, గుడ్లగూబలు,విపరీత రోదనలు చేసే తేనెటీగలు,దోమలు ఉండటము..పైగా ఈ వనములో అతి భయకరమైన కార్చిచ్చు ఉండటము ఈమె గమనించింది.ఈ దావానలం వలన తన పిండదేహనికి తట్టుకోలేని వేడి సెగలు..దీనితో పాటుగా  ఈ వనములో ఉన్న చెట్ల ఆకుల వలన తన స్నేహితురాలి దేహనికి  విపరీతమైన భాదపూరితమైన గాట్లు పడటముతో ఈ వన ప్రయాణము ఈమె చెయ్యలేక పోతుంది.ఆగితే తనతో వచ్చిన దూతల పాశాల దెబ్బలు తినవలసి రావడముతో..వీళ్లు నిర్ధయతో ఈడుచుకొని తీసుకొని వెళ్లుతూండము స్వాతి ఆత్మ గమనించినది.ఈ వన ప్రయాణము పూర్తి అయిన తర్వాత ఈమె స్నేహితురాలికి మూడు నిమిషాలుపాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి మాసికభోజనము అందించడము జరిగింది.ఇది తిన్న తర్వాత ఈమెను  4వ పురము అయిన గంధర్వపురమును తీసుకొని వెళ్ళినారు.అక్కడ ఈమెకి మూడవ నెల మాసిక భోజనాలు అందించడము స్వాతి ఆత్మ గమనించినది.ఆతర్వాత ఈమెను అక్కడించి 5వ పురము అయిన నిరంతరంగా కురిసే రాళ్ళ వర్షాపురమైన శైలాగ పురమునకు వెళ్లడము ఈమెకి నాలుగవ మాసిక భోజనము అందించడము ..ఆపై అటునుంచి 6వ పురమైన క్రౌంచపురమునకు అక్కడ ఈమెకి 5వ నెల మాసికభోజనము అందించడము..ఇలా 7వ పురమునందు క్రూరపురమునకు వీరందరు చేరుకోవడము జరిగింది. అంటే వీళ్ళ ప్రయాణము భూమ్మీద కాలప్రమాణ ప్రకారము ఈ పురము చేరుకోవటానికి 171 రోజులు పట్టినట్లుగా స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ ఈమె స్నేహితురాలి పిండదేహానికి ఊనషాణ్మాసికం పిండాలు పెట్టడము దానితోపాటుగా ఈమె వాళ్ళు జరిపిన ఉదకుంభదానం వల్ల ఈమె దాహదప్పికలు తీరడము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడించి ఈమె పిండదేహమును 8వ పురమైన యముడు సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవన పురమునకు వీరందరు చేరుకోవడము జరిగింది.అక్కడ ఈమె దేహనికి ఎనిమిది నిమిషాలుపాటు ఏలాంటిశిక్షలు వెయ్యకుండా విశ్రాంతిని ఇవ్వడము స్వాతి ఆత్మ గమనించినది.
   
అక్కడ ఈమె మాసికభోజనము తిన్న తర్వాత ఈమె స్నేహితురాలి పిండదేహము దగ్గరికి కొంతమంది బెస్తవాళ్ళు వచ్చి"ఓ దేహమా?రేపు నీవు భయంకరమైన వైతరణి నదిని దాటాలి.అది దాటించడానికి మేము పడవ నడిపేవాళ్ళము.ఈ పడవ ప్రయాణము చెయ్యాలంటే నీవు భూలోకము నందు గోదానం చేసి ఉండాలి.అది నీవు చేసినావా? అని అడగటానికి మేము నీ దగ్గరికి వచ్చినాము అనగానే ఈ పిండదేహము ఎలాంటి గోదానము చెయ్యలేదని చెప్పడముతో ...వాళ్ళలో ఒకడు కనీసము గోవు సంకర్షణార్ధము ఏమైన దానము చేసినావా? అడిగితే దానికి ఈ పిండదేహము ఏమి చెయ్యలేదని చెప్పడముతో...బెస్తవాళ్ళలో సహనము తగ్గి ఆవేశము ఎక్కువై...కనీసము వరుసగా ఏడు మహాశివరాత్రులైన రాత్రి జాగరణ చేసినావా? అడిగితే దానికి ఈ పిండదేహము లేదని చెప్పేసరికి...ఈ బెస్తవాళ్ళలో ఒకడుఈమెతో "ఓ దేహమా!ఈ భయకరమైన ఈ వైతరణి నది ఓడ్డున శవాల ఏముకల గుట్టలుంటాయి.ఈ నది లోపల కుళ్ళి విపరీతముగా దుర్గంద వాసనలు ఇచ్చే మాంసాలు, నెత్తురు,చీము,ప్రవాహాలు,వెంట్రుకలే నాచుగా..మాంసమే బురదగా ...పైగా ఇందులో క్రూరమైన జలపక్షులు,మొసళ్ళు,విషపూరిత జలపాములు,సూదులాంటి ముక్కులు గల విచిత్ర పురుగులు,నీటికోతులు,వాడి ముక్కులు గల గద్దలు,బొంతకాకులు,మాంసభక్షణ చేసే చేపలు మరియు తాబేళ్ళు,జలగలు ..ఇలా జీవులు ఇందులో ఆవాసము చేస్తూ ఉంటాయి.పైగా ఈ నది జలము సల సల మండే రక్తము గావడము..దీనినే జలముగా త్రాగవలసి రావడము జరుగుతుంది.ఇలాంటి భయంకరమైన ఈ నదిని నీవు ఈదుకుంటు దాటవలసి ఉంటుంది.అదే గోదానము చేసినట్లయితే నీవు మా పడవలో కూర్చుని విశ్రాంతిగా ఈ నది ప్రవహామును దాటేదానివి.అదే గోసంరక్షణార్ధము ఏదైన ఆవు పోషణనకి గడ్డిదానము,ధనదానం ఇలా ఏదో ఒకటి చేసి ఉన్నట్లయితే ఆ ఆవు ఈ నది దగ్గరికి వచ్చి తన తోకను నీకు అందించి...తోకను గాలిలో ఉంచి..నిన్ను ఈ నదిని దాటించేది.అదే శివరాత్రి జాగరణ చేసి ఉన్నట్లే అయితే నీవు ఆకాశ గమన మార్గము ద్వారా ఈ నదిని దాటేదానివి అని చెప్పి వాళ్ళు అక్కడనుండి వెళ్లిపోవడముతో ఇలాంటి దానాలు ఏమి చెయ్యకపోవడముతో ఈ పిండదేహము ఏడ్వడము అలాగే భూమీద జరిగే గోదాన కార్యక్రమము వెనుక ఇంత కధ ఉన్నదా అని స్వాతి ఆత్మ తెలుసుకోవడము జరిగింది. మర్నాడు ఈ బెస్తవాళ్ళు వచ్చి తన స్నేహితురాలి పిండదేహమును పాశాలతో బంధించి వైతరణి నది వద్దకి తీసుకొని వెళ్ళడము స్వాతి ఆత్మ గమనించినది.ఆ తర్వాత స్వాతి ఆత్మ అలాగే ఈమెతో వచ్చిన ముగ్గురు దూతలు ఆకాశమార్గమున ఈ నదిని దాటుతుంటే...ఈ స్నేహితురాలి పిండదేహము మాత్రము సలసల మండే రక్తమున్న ఈ నది ప్రవహమును అందులో దిగి నడుచుకుంటూ..బెస్తవాళ్ళ చేపకి ముల్లు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా ఈమె పిండదేహమును ఈ నదిలో ఈడ్చుకుంటూ ఈ నదిని దాటించడము...ఈ నదిలో భయంకరమైన భీభీత్సమైన పరిస్ధితులకి ఈమె దేహము చేసే ఆర్తనాదాలు వినలేక స్వాతి ఆత్మ మౌనముగా రోదించింది.
   
ఈ నది ప్రయాణము పూర్తి అయిన తర్వాత ఈ పిండదేహనికి ఆరవ మాసిక భోజనాలు అందించడము..ఇది ఈమె తిన్న తర్వాత అక్కడనుండి 9వ పురమైన బహ్వాపదపురము చేరి అక్కడ ఏడోనెల మాసిక పిండాలు తిన్నడము స్వాతి ఆత్మ గమనించినది.ఆ తర్వాత 8వ మాసములో 10వ పురమైన దు:ఖద నగరము..అటుపై 9వ నెలలో 11వ పురమైన నానాక్రందపురము చేరడము...ఆపై 10వనెలలో 12వ పురమైన  సుతప్తభవనపురము..11వ నెలలో 13వ పురమైన రౌద్రపురము చేరుకోవడము..ఆపై 12వ నెల యందు 14వ పురమైన ప్రేతాత్మలనూ భాదించే వర్షమేఘాలున్న పయోవర్షణ పురానికి చేరుకొని అక్కడ తన స్నేహితురాలి పిండదేహనికి న్యూనాబ్ధిక పిండాలు భుజించిన తర్వాత అక్కడి నుండి 15వ పురమైన తట్టుకోలేని చలి ఉన్న శీతాఢ్యపురమునకు చేరుకోవడము...అక్కడ ఉన్నవారు తన స్నేహితురాలి పిండదేహమును చూస్తూ..ఆమె చేసిన పాప పుణ్యాల లెక్కలు చెప్పడము స్వాతి ఆత్మ గమనించినది.ఎపుడైతే ఈ పిండదేహానికి పుణ్యాలు కన్నా పాపాలు ఎక్కువుగా ఉన్నట్లయితే...ఇక్కడ ప్రధమాబ్ధికం రోజు ఇచ్చిన పిండోదకాలు తినిపించి...  అక్కడ నుండి 16 పురమైన బహుభీతి పురమునకు చేరుకోవడముజరుగుతుందని స్వాతి ఆత్మ గమనించినది.ఇలాగే తన స్నేహితురాలి ఆత్మ గూడ ఈ పురమునకు చేరుకోవడము...అక్కడ ఈ హస్త పరిమాణమున్న పిండదేహమునకు అన్ని రకాల బహుబంధనాల నుండి  విముక్తి చెంది మరణము పొంది చేసిన ప్రారబ్ధ పాప కర్మ నివారణ కోసము బ్రొటన వ్రేలు పరిమాణమున్న వాయురూపము గల యాతన శరీరమును ఈమె స్నేహితురాలు పొందడము స్వాతి ఆత్మ గమనించినది.
   
అక్కడ నుండి వీరంతా చేరువగా ఉన్నఈ పురానికి 44 ఆమడల దూరములో యమధర్మరాజు ఆవాసము చేసే యమపురం వైపు ప్రయాణము చేసి యమపురమునకు చేరుకోగానే అక్కడ ద్వారము వద్ద నల్లటి బొచ్చుతో...తోడెళ్ళు వంటి భయంకరమైన రూపముతో ఉన్న రెండు కుక్కలు కాస్త భయంకరమైన పదునైన వాడి పళ్ళును నోటిని తెరుస్తూ...ఓళ్ళు దడుసుకునే విధముగా ఈ కుక్కల అరుపుల ఆర్తనాదాలు వింటూండగా...ఇవి శమా...శలభా కుక్కలని స్వాతి ఆత్మ తెలుసుకొని అక్కడున్న ద్వారాలలో 60 యోజనాల పొడవు అనగా 720 అడుగుల ఉన్న (12*60=720)నాల్గు ద్వారాలలో దక్షిణ ద్వారము వైపు వీరంతావెళ్ళి అక్కడ ఈ ద్వారానికి కాపలాకాస్తున్న ధర్మధ్వజునితో ఈ దూతలు కాస్త పాపాత్మరాలు వచ్చినదని చెప్పడముతో... ఇతను లోపలకి అనుమతించడముతో...వీరంతా లోపలకి వెళ్ళుతూ ఉండటము స్వాతి ఆత్మ గమనించినది.
      
   లోపలకి వెళ్ళిన వీళ్ళకి అపుడిదాకా సాధారణ మహరాజుగా ఉన్న యమధర్మరాజు కాస్త తన యదార్ధ స్వరూపదర్శనం అనగా మూడు యోజనాలు అనగా 36 అడుగుల ఎత్తుతో...32 చేతులతో..వివిధ రకాల దండాయుధాలతో...కాటుక వంటి నల్లని రంగు గల శరీరముతో...ఎర్రని కన్నులతో..కోరలతో..పెద్ద ముక్కుతో...ఒక దున్నపోతును వాహనము చేసుకున్న భయంకర ఉగ్రస్వరూపమును చూసిన వీరందరిలో వణుకు మొదలైంది.అపుడు ఈయన తన చేతిలో ఉన్న మృత్యుదండమును ఒకసారిగా ఝాళి పిస్తూ...తన దగ్గర ఉన్న మృత్యువు మరియు జ్వరము అను పరివారమును ఒకసారి చూసి...కొత్తగా వచ్చిన స్వాతి స్నేహితురాలి ఈ యాతన శరీరము చూసిఈమె చేసిన పాపము గూర్చి ప్రళయకాల మేఘగర్జన స్వరముతో అడుగగా...వెంటనే అక్కడున్న చిత్రగుప్తుడు తన దగ్గర ఉన్న చిట్టాను తీసి..."స్వామి..ఈమె కాస్త భూలోకము నందు పాతివ్రత్య ధర్మమును తప్పినది" అనగానే...యమధర్మరాజువెంటనే..."అయితే ఈమెకి తప్తోర్మి నరక శిక్షను తక్షణమే అమలపర్చండి" అని ఆజ్ఞ ఇవ్వగానే అక్కడున్న పరివారము ఈ యాతన శరీరమును తీసుకొని వెళ్ళడము స్వాతి ఆత్మ గమనిస్తూండగా ఈమెను చూసిన యముడు కాస్త శాంతముగా ఓహో...కాశీ క్షేత్రమునందు ఈమెను పరమహంస పవనానంద యోగి తమ తపోశక్తితో ఈమెను మరణానంతర జీవితానుభవము కోసము ఊర్ధ్వోలోకాలకి పంపించిన  మన లోక సంచార యోగాత్మ ఈమెనా...ఆయన అనుజ్ణ ప్రకారము మనలోక శిక్షలు,విశేషాలు చూపిస్తే...వారి లోకమునకు వెళ్ళి చెపుతుంది అంటూ అక్కడున్న దూతలకి ఆజ్ఞ ఇచ్చి ఈయన లోపలకి వెళ్ళుతున్న యమధర్మరాజును స్వాతి ఆత్మ చూస్తూ...యమపురినడక ప్రయాణములో నానా రకాల నరకాలు కనపడినాయి గదా అనుకుంటు ఈయనకి నమస్కరిస్తూ...దూతలు వెంట స్వాతి ఆత్మ నడుస్తూ...తన స్నేహితురాలికి వేసిన శిక్షను చూడాలని అనుకుంటూ వెళ్ళుతూండగా..ఒక చోట ఈమెకి తన స్నేహితురాలి యాతన శరీరము కనిపించగా...దగ్గరికి వెళ్ళి చూడగా..మండుచున్న ఇనుప నగ్న పురుషుడి బొమ్మతో ఈమె కాస్త శృంగారము చెయ్యలేక ఆర్తనాదాలు చేస్తూంటే...ఈమె ప్రక్కనే ఉన్న దూతలు కాస్త తమ చేతిలో ఉన్న పాశాలతో ఈమె దేహమును దండిస్తూ...నీకు భూలోకము నందు బంగారము లాంటి భర్త ఉండగా...పర పురుషుడితో కామకాలపము చేసి ఆనందించినావు గదా...మరి ఇపుడు గూడ ఈ లోకములో ఆర్తనాదాలు ఆపి ఆనందించు ...అంటూ పాశముతో విపరీతముగా కొట్టుతూండేసరికి ఈ దృశ్యమును చూసిన స్వాతి ఆత్మ  మౌనముగా భాదపడి సాగింది.పడుతూ ముందుకి సాగుతూండగా
   
ఈమెతో వచ్చిన దూతలు ఈమెతో..." యోగాత్మ...ఈ లోకములో 84 లక్షల పాపాలకి తగ్గట్లుగా 21 నరక శిక్షలు అనగా 1. తామిస్ర నరకం,2. అంధతామిస్ర,3. రౌరవము,4. మహా రౌరవము,5. కుంభీపాకము 6. సూచీముఖీ, 7. అసిపత్రనరకం,8. అవీచి, 9. అంధకూపము,10. వైతరణి,11. పుయోద,12. కృమిభోజనం, 13. నానాభోజన,14. రేత:పానం,15. కాలసూత్ర,16. ప్రాణరోధ,17. తప్తోర్మి,18. శాల్మలి,19. వినశము,20. వజ్రకంటక,21.సందర్శ నరకం ఉన్నాయి.ఈ నరక శిక్షలు ఇపుడు తను చూస్తున్న శిక్షలు అని వీటిని చూసిన వారికి లేదా జరిగిన విన్నవారికి భూలోకము నందు పాపకార్యము చెయ్యడము దేవుడెరుగు...పాపపు ఆలోచన చెయ్యడానికే గుండె ఆగి ఛస్తారని స్వాతి ఆత్మ అనుకుంటూ ఉండగా దూతలు కాస్త ఈమెతో...యోగాత్మ..ఈ శిక్షలు అనుభవించిన యాతన దేహాలకి వారి కర్మశేష నివారణ కోసము భూలోకమునందు పున:జన్మలుగా జంతు జన్మలు వారు చేసిన పాప కర్మనివారణ కోసము ఎత్తించడము  జరుగుతుంది.అనగా అబద్ధాలు చెప్పినవాడికి స్ఫష్టమైన వాక్కులేని జన్మగా...మాంసము అపహరిస్తే గ్రద్ద జన్మగా...ఆత్మహత్య చేసుకున్నవాడు కాస్త కొండమీద నల్లత్రాచు జన్మ..పరపురుషుడిని కోరిన స్త్రీ కి రెండు తలాల పాము  జన్మ అని అనగానే అంటే తన స్నేహితురాలు పున:జన్మ రెండు తలాల పాము జన్మయని స్వాతి ఆత్మ గ్రహించి వెళ్ళుతూండగా...

తనతో వచ్చిన దూతలు కాస్త ఉన్నట్టుండి దైవదూతలుగా మారేసరికి స్వాతి ఆత్మ ఆశ్చర్యము చెందుతూండగా ..."తల్లి...ఇపుడు మనము యమపురి దాటి వచ్చినాము..ఇక్కడ నుండి ఆరు దేవత లోకాలు అనగా  భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక అనే ఊర్ధ్వ దైవ లోకాలకి సంబంధించినవి అన్నమాట. ఇందులో అత్యధికముగా పుణ్యాలు చేసిన పుణ్యజీవులు అనగా ముక్తిజీవులు ఆవాసము చేస్తూంటారు.
   
మరి ఈ లోకాలను చూద్దాం అంటూ వీరందరు ముందుకు ప్రయాణించగా..వీరికి మొదట భువర్లోకము (భూలోకము పైన) కనిపించినది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుష్యములైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెరా, కింపురుష, విద్యాధరులు ఇచ్చట ఉన్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన)కనిపించినది.  ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగములనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాము, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసము లేదు. స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..మహర్లోకము (సువర్లోకము పైన)కనిపించినది. ఇక్కడ దేవతలు తపమొనరించు చుందురు. ఎలా స్వర్గలోకములోని దేవతలు దివ్య సుఖమును అనుభవించుచున్నారో, అవియన్నియూ ఇక్కడ తపస్సు ద్వారా పరుపూర్ణముగా అనుభవించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..జనోలోకము (మహర్లోకము పైన) కనిపించినది.దీనిని కొందరు సత్యలోకమని కూడా అందురు. ఏ స్త్రీ భర్త మరణానంతరము సహగమనము చేయునో, ఆమె యొక్క పవిత్ర శీలప్రభావముచేత ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యము కలిగి, సతిపతులిరువును ఈ జనలోకములో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇచ్చట అయోనిజ దేవతలు కూడా తపమాచరించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..తపోలోకము (జనోలోకము పైన) కనిపించినది.ఇక్కడ అయోనిజ దేవతలు నివసించుచుందురు. పంచభూతములు, పంచేంద్రియములు వీరి ఆధీనములో ఉండును. కైలాసము, వైకుంఠము, మణిద్వీపము, స్కంధలోకము ఇచ్చటనే కలవు. ఈ లోకము సర్వదా సుగంధ ద్రవ్యముల సువాసనలతోను, శాంతియుతముగాను, సాంద్రానందముతోను కూడియుండును. భూలోకములో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసించిరో ఆయా మూర్తుల రూపములతో ఇచ్చట తపములాచరించుచున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలము అచ్చటనే ఉంది కర్మానుసారము భూలోకములో మరల జన్మించి, మరల పవిత్ర తపములు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయములో సర్వమూ లయమగునో అప్పుడు వీరుకూడ జన్మరాహిత్యము పొందుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..సత్యలోకము (తపోలోకము పైన)కనిపించినది. ఇచ్చటనే సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మయను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరము ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మములో లయమగుదురు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగము తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకములోకూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకములో ఆత్మజ్ఞానము పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావించుచుందురు. మహాప్రళయకాలములో బ్రహ్మలోక పర్యంతముగాగల సప్తలోకములు పరబ్రహ్మములో లయమగును. బ్రహ్మయొక్క ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయము సంభవించి, భూలోకము, భువర్లోకము, సువ(స్వర్గ)ర్లోకములు లయమును పొందును. అతని యొక్క పగటి కాలమందు పునః ఈ లోకములు సృష్టింపబడుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..ఇంతలో ఒక దివ్యమైన బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న జ్యోతి స్వరూపము ఒకటి ఈమె ఆత్మకి అగుపించి అదికాస్త అశరీరవాణితో " తల్లి! ఇక నన్ను దాటి వెళ్ళాలంటే నీవు అవిముక్త కేత్రమైన కాశీకేత్రమునందు మరణమును పొందితే కాని పాపపుణ్యాల కర్మఫలితము లేని కారణలోకమునకు చేరుతావు.నీవు వచ్చిన పని పూర్తి అయినది! నీకు గావాలసిన ప్రశ్నకి సమాధానము ఇదే అని చెపుతుండేసరికి...

ఇలా ఈ ప్రయాణము ముగింపుగా ఒక దివ్య తేజస్సు కాంతి పుంజాలు లాంటి గోళాకారపు భూమి లాంటి లోకాలను చూసింది. అందులో తనకి తెలిసిన బంధువులు , మిత్రులు , స్నేహితులు , ప్రేమికులు , శత్రువులు , బాధపెట్టినవారు , బాధించిన వారు , మోసగించిన వారు ఇలా వారందరు ఒక్కొక్కరిగా వివిధ లోకాలలో సుమారుగా ఇలా దాదాపుగా 1000 లోకాలలో ఉన్నవారిని స్వాతి ఆత్మ చూసింది! తను గుర్తు పట్టింది. కాని ఈమె ఆత్మను వీళ్ళు ఎవరు గూడ గుర్తు పట్టకపోయేసరికి ఈమెకి ఆశ్చర్యానందాలు వేసింది! మెరిసిపోయే దేహకాంతులున్న లోకమే స్వర్గమని... దేహకాంతి లేని క్రూర భయంకరముగా ఉన్న లోకమే నరకమని... పాపపుణ్యాలను బట్టి ఈ లోకాల ప్రవేశ యోగ్యతలు ఉంటాయని....అలాగే జీవుడు కాని నిత్య భౌతిక మరణము పొందితే తను చేసిన పాపఫలితాలను అనుభవించడానికి నరకలోకమునకు మరియు పుణ్యఫలాలను అనుభవించడానికి స్వర్గమునకు వెళ్ళతారని ... ఒకవేళ కర్మశేష నివారణ కోసము భూలోకము నందు తిరిగి పున:జన్మతో పున:రపి జననము పున:రపి మరణ కర్మ జన్మల చక్రములో పడి నిరంతరము తిరుగుతూనే ఉంటారని.....ఒకవేళ జీవుడుపంచ ముక్తులు పొందితే ఆరు ఊర్ధ్వో లోకాలయందు సూక్ష్మలోకవాసుడిగా ఆవాసము చేస్తారని...ఒకవేళ జీవుడు కాస్త నిర్వికల్ప సమాధిని పొందితే ఆ జీవుడు కాస్త విదేహిముక్తిని పొంది కారణలోకమునందు కారణలోక వాసుడిగా ఆవాసము చేస్తారని ...నిజానికి మరణము పొందడము అంటే ఒక లోకమును విడిచి మరొక లోకమునకు ప్రయాణించడము లాంటిదని  స్వాతి ఆత్మ తెలుసుకొంది! 


 ఇంతలో " స్వాతి! స్వాతి! నిద్రలేవే! కూర్చొని నిద్రపోతున్నావా? లే! " అంటూ తన స్నేహితురాళ్ల గొంతు బిగ్గరగా వినిపించేసరికి... ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వాతి కళ్ళు తెరిచి చూడగా... ఇదంతా గూడ యోగనిద్రలో తను పొందిన ఒక దివ్య ధ్యానానుభవమని తెలుసుకొని మృత్యు భయము తగ్గి... ఎదురుగా స్నానము చేస్తున్న నాగసాధువును చూసేసరికి " వామ్మో! ఈయనను చూసిన  ఒక్క క్షణ చూపుకే ఇంతటిశక్తి! తను ఏమి అడగకుండానే... తను కదలకుండా... ఆయన మెదలకుండా... తనకి చూపు ద్వారా శక్తిపాతము చేసి తన మరణ అనుభవమే ఒక కలగా... ధ్యాన అనుభవ దృశ్యముగా లీల మాత్రముగా చూపించి తన ప్రశ్నకి సమాధానమును ఈ విధంగా ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూపించిన ఆ నాగసాధువు వైపు కృతజ్ఞతతో చూడగా... 

ఇది గమనించిన ఆ సాధువు ఈమె వంక అదోలా చూస్తూ బిగ్గరగా...

 " ఓ మానవుడా.... 

అసలు మరణానికి ముందు
జీవితము ఉందా? అది
ఆలోచించు... "

 శంభో శంకర! హరహర మహాదేవా

అంటూ ఆ నది నుండి బయటికి వచ్చి మౌనముగా ఈమె వంక చూస్తూ అభయమిస్తూ వెళ్ళిపోసాగినాడు! అవునుగదా! తను ఇన్నాళ్లు మరణము తర్వాత జీవితము ఏమిటని ఆలోచించినది! కాని నిజానికి మరణము ముందు అసలు జీవితమే లేదుగదా అని అనుకుంటూండగా ...  
 ఇంతలో స్వాతికి  ఎక్కడ నుండో... దగ్గరిలో ఉన్న గుడి నుండి...



  " మానవుడు పాత దుస్తులు
   విడిచి... కొత్త వాటిని ధరించినట్లుగానే...
    ఆత్మగూడ పాత శరీరాన్ని విడిచి....
      క్రొత్త దేహములోనికి వెళుతుందని
    మరణించిన వాడికి జన్మం తప్పదని
    జన్మించిన వారికి మరణం తధ్యమని "
ఆత్మకు మరణములేదని... అది నాశనము గాదని...

అంటూ సుమధుర గాయకుడైన పూజ్య శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు చెప్పిన భగవద్గీత శ్లోకాలు గమకముగా  లీలగా విన్పించ సాగింది! దానితో స్వాతి మనస్సుకి అద్వితీయమైన ఆనందము కల్గుతూ ఇన్ని సంవత్సరాలకి ఈ శ్లోకార్థమును ప్రత్యక్ష ధ్యాన అనుభవ అనుభూతి ద్వారా తెలుసుకొన్నాను అనే ఆత్మశాంతితో ఆత్మ తృప్తి పడి ఆత్మానందముతో... కాశీ గంగ స్నానము చెయ్యసాగింది!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

కపాల మోక్షానుభవ ఆత్మకధ :


యోగిత...
ప్రముఖ న్యూస్ పేపర్ లో
పేరు ప్రఖ్యాతలు పొందిన జర్నలిస్ట్!
ఈమె ఏడాదికి లేదా రెండు యేళ్లుకి ఒకసారి
న్యూస్ పేపర్ యందు ఆర్టికల్స్ వ్రాస్తుంది!
ఈమె వ్రాసే ఆర్టికల్స్ చదవటానికి
కొన్ని కోట్లాది మంది పత్రికాభిమానులు
ఎదురుచూస్తుంటారు! కారణము ఈమె వ్రాసే ప్రతి ఆర్టికల్స్ మీద ఎంతో పరిశోధన పరిశ్రమ చేసి తను తృప్తి పడితే కాని ఆ ఆర్టికల్ న్యూస్ పేపర్ లోనికి రాదు! ముద్రించదు!


ఇంతటి పరిశోధనాత్మక ప్రతిభాశాలికి ఉన్నట్టుండి ఆధ్యాత్మిక విషయాల మీద అదిగూడ కపాలమోక్షము అంశము మీద పరిశోధన చేసి ఆర్టికల్ వ్రాయాలని సంకల్పము కలిగినది. దానితో తనకి తెలిసిన యోగ గురువులను కలిసి వాళ్లు రచించిన యోగగ్రంధాలను పురాణ ఇతిహాసాలను ఇతర పుస్తక గ్రంధాలను చదవడము ప్రారంభించినది!అరుణాచల రమణమహర్షి అలాగే శ్రీ కంచి నడిచే దైవమైన శ్రీచంద్రశేఖర సరస్వతి అలాగే కాశీ క్షేత్రమునందు నడయాడే కాశీ విశ్వనాధుడైన శ్రీ త్రైలింగస్వామి అలాగే ఈ క్షేత్రములో ఉండి గృహస్థ ఆశ్రమములో ఉంటూ శ్రీలాహరి ....కొంతమంది స్త్రీలు గూడ యోగ సాధన చేసి మోక్షప్రాప్తి పొందినారని తెలుసుకొని ...ఇలా వీరందరూ ఎలా కపాలమోక్షము పొందినారో తన పరిశోధనల ద్వారా తెలుసుకుంది!అలాగే హిమాలయాలలో ఇప్పుడికి చిరంజీవులుగా ఉన్న మహా అవతార్ బాబాజీ , శ్రీ శంకరాచార్యుడు , ఏసుప్రభు , సదాశివమూర్తి , దత్తాత్రేయుడు గూర్చిన వివరాలు తెలుసుకొని ఆశ్చర్యము చెందినది!

                     గాకపోతే కొంతమంది యోగులు అమరత్వము పేరుతో కపాలమోక్షము పొందితే మరికొందరు చిరంజీవి తత్త్వముతో కపాలమోక్షము పొందకుండా ఎందుకున్నారో ఈమెకి ఒక పట్టాన కారణము తెలియరాలేదు! ఇదే విషయాన్ని తనకి తెలిసిన ప్రముఖ యోగ గురువులను కలిసి అడిగితే అందులో కొందరు లోక కళ్యాణము కొరకు అలా ఉన్నారని.... మరికొందరు అయితే కర్మ నివారణ కోసము సాధన చేస్తూ అలా ఉన్నారని ఇలా విభిన్న సమాధానాలు చెపుతూండేసరికి
యోగితకి ఇందులో ఏదో తెలియని రహస్యము దాగుందని అనిపించి అసలు కపాలమోక్షము అంటే ఏమిటో తెలుసుకోవడము గాదని... అనుభవముగా చూడాలని గుప్తయోగిగా పేరు గాంచిన శ్రీ పరమహంస పవనానందను కలువటానికి ఈమె కాస్త కాశీక్షేత్రమునకు చేరుకుంది!

                అతి కష్టము మీద మారుమూల ప్రాంతములో ఉన్న పాతాళములో ఉన్న గుహయందు గుప్తయోగి యోగసాధన చేస్తున్నారని తెలుసుకొని... ఈ గుహ లోపలకి వెళ్ళటానికి భూమి లోపల 1300  అడుగుల లోతులో ఉన్న 3600 మెట్లు దిగి.... లోపల తీవ్ర ధ్యానస్థితిలో ఉన్న ఒక్క పలుచని.... ఎముకల గూడులాగా ఉన్న గుప్తయోగిని ఈమె చూడటము జరిగినది! విచిత్రము ఏమిటంటే అప్పుడిదాకా ఎవరికీ నమస్కరించని ఈమె ఉన్నట్టుండి ఈయనను చూడగానే.... ఈయన ముఖములో కనిపించే బ్రహ్మ తేజస్సుకి సమ్మోహనము చెంది నమస్కరించినది! ఆయన కాస్త ఈమె రాకను తన మనో నేత్రము ద్వారా గమనించి " వచ్చావా! తల్లి! నీరాక కోసమే ఎదురుచూస్తున్నాను! గత జన్మలలో నువ్వు నా ప్రియ శిష్యుడివి! కాని అనివార్య కారణాలవలన నీ మనస్సు చలించి భోగభాగ్యాల యందు ఆసక్తి కలిగి మాయ మోహిత శరీర జన్మలు పొందినావు! ఇదియే నీ ఆఖరి జన్మ! ఏమి గావాలి! చెప్పు? "

     యోగిత వెంటనే " స్వామి! మిమ్మల్ని చూడగానే నా మనస్సు స్తభత్త అయింది! ప్రశాంతమైనది! ఎన్నో సంవత్సరాల నుండి మీరు నాకు తెలిసినట్లుగా నా మనస్సు స్థితి ఉంది! మీరు చెప్పిన కారణాలు నిజమే గావచ్చును! కాని నాకు కపాల మోక్ష అనుభవము గావాలి? "

        " అమ్మా! మోక్షము అంటే అది ఒకరికి చూపించడానికి.... ఒకరికి చెప్పటానికి అందేదిగాదు! మనస్సు , బుద్ధి , అహము చిత్తము లేని స్థితి! పంచశరీరాలు లేని స్థితి! మాటలలో చెప్పటానికి... వాక్యాలలో వ్రాయటానికి చెప్పలేని స్థితి! ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవలసిన స్థితి! అని చెప్పగానే....

" స్వామి! నా ఉద్దేశ్యము ఇప్పుడిదాకా నేను ఎవరిని గూడ కపాలమోక్షము పొందుతున్నప్పుడు ప్రత్యక్షముగా చూడలేదు! కేవలము ఇది పొందినవారి గురించిన పుస్తక- గ్రంధాలలో మాత్రమే చదివినాను! కాని నాకు ఈ కపాలమోక్ష అనుభవమును ప్రత్యక్షముగా చూడాలని ఉంది! నా కళ్ళముందర మీరు ఎవరికైనా కపాలమోక్షము ఎలా కలుగుతుందో మీ యోగశక్తితో నాకు చూపించగలిగితే దానిని నేను నోట్స్ గా వ్రాసుకొని లోకానికి చెపుతాను అని అనగానే....

 " ఓ! అలాగే! ఎవరికో ఎందుకు! నేనే నీ కళ్ళ ముందర కపాలమోక్ష విధానము చూపుతాను! నీవే నీకళ్ళతో ప్రత్యక్షముగా చూడు! స్వయంగా దానిని అనుభవించు! లోకానికి చాటి చెప్పు! "

 " అంటే స్వామి! ఇప్పుడు మీరు నాకోసము నాకళ్ల ముందర కపాలమోక్షమును పొందుతారా? ఎంతటి విచిత్రము! అయితేదీనికి గావలసిన ఏర్పాట్లు చేసుకుంటాను అంటూ ఆటోమెటిక్ గా పనిచేసే అయిదు ఫోటో కెమెరాలు ఈయన చుట్టు ప్రక్కల అమర్చింది కాంతికోసమని బల్బ్ లు అమర్చింది! వీడియో కెమెరాలను అమర్చింది! వీటి అన్నింటిని గుప్తయోగి ఒకసారి తేరిపార చూసి " అమ్మా!నువ్వు నా ఎదురుగా పద్మాసనములో కూర్చో! నా శరీర మార్పులు నిశ్చింతముగా గమనించు! కపాలమోక్ష విధానము ఎలా జరుగుతుందో ప్రత్యక్ష అనుభవముగా నీ కళ్ళతో గమనించు అని చెప్పి యోగనిద్రావస్థలో కళ్ళు మూసుకున్నారు!

        ఈ విషయము గమనించిన యోగిత గూడ అమర్చిన కెమెరాలు సరిగ్గానే పని చేస్తున్నాయని గమనించి నిశ్చింతముగా... ప్రశాంతముగా... ఈయన శరీరములో జరిగే మార్పులను గమనించటానికి ఈయనకెదురుగా పద్మాసనములో కూర్చొని గుప్తయోగి మీద తదేక దృష్టిని పెట్టింది! కెమెరాలను గూర్చి పట్టించుకోవడముమాని వేసింది! కాని వాటి పని అవి చేస్తున్నాయి!

          ఇంతలో గుప్తయోగి శరీరములో శరీరావయవాలు అనగా గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండాలు , కళ్ళు , ఇలా అంతర భాగాలు ఎక్సరే లేకుండా చాలా స్పష్టముగా కనిపించడము యోగిత గమనించి మనస్సులోనే ఆశ్చర్యము చెందింది! కొంతసేపటికి రక్తము , రక్తనాళాలు , నాళాలలో ప్రవహించే ఎరుపు , నలుపు , రక్తాలు తేడా , ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు , ఇలా ప్రతిది గూడ చాలా స్పష్టముగా... తనకి కనబడుతున్నాయని ఈమె గ్రహించినది! మరి కొంత సేపటికి ఇలా రక్త మాంస శరీర అవయవాలు కనిపించడము మానివేసి... కేవలము ఆస్థి పంజరము అనగా కపాలము , ఎముకలు మాత్రమే చాలా స్పష్టముగా అంటే గుప్తయోగి మాంస శరీరము కాస్త ఆస్థి పంజరముగా కనబడుతోందని ఈమె గ్రహించింది!

మరి కొద్ది సేపటికి ఈ అస్థిపంజరములోని ప్రతి ఎముకలో ఉండే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన రక్తనాళాలు కనిపించడము మొదలు పెట్టినాయి. కొద్దిసేపటికి ఈ రక్తనాళాలు చాలా స్పష్టంగా పెద్దవిగా కనబడుతూ.... వీటికున్న 13 యోగచక్రాలు ఒక్కొక్కటిగా అనగా గుదస్థానమునందు మూలాధార చక్రము , మర్మాంగము నందు స్వాధిష్టాన చక్రము , బొడ్డు నందు మణిపూరక , వక్ష స్థల మధ్యలో అనాహత , కంఠము నందు విశుద్ధ చక్ర , బొట్టు పెట్టుకొనే భ్రూమధ్య స్థానము ఆజ్ఞ చక్రము , మెదడులో కర్మ , గుణ , కాల , బ్రహ్మ , సహస్ర చక్రాలు , హృదయము నందు హృదయ చక్రము , బ్రహ్మరంధ్రము నందు బ్రహ్మాండ చక్రము , ఇలా 13 యోగచక్రాలు ఏక కాలములో చాలా స్పష్టముగా యోగితకి గుప్తయోగి శరీరము నందు చాలా స్పష్టముగా కనిపిస్తూండేసరికి... అంటే యోగ గ్రంధాలు చెప్పిన చక్రపద్మాలు అనేవి నిజమేనని తెలుసుకొనే సమయములో ఈమె కాస్త ఏదో తెలియని ఉద్రిక్తతకు , మాటలలో చెప్పలేని స్థితిని తనకితెలియకుండానే పొందడము ప్రారంభించినది! అయిన గూడ ఇవేమి పట్టించుకోకుండా యోగిత మనస్సు అంతా గుప్తయోగి శరీరము మీద చాలా పటిష్టమైన ఏకాగ్రత దృష్టితో ఉంది!

          కొద్దిసేపటికి మూలాధార చక్రములో ఏదో కదలికలు ఏర్పడడము యోగిత గమనించి నిశిత దృష్టితో గుప్తయోగి శరీరమును చూడటము ప్రారంభించినది! కొన్ని క్షణాలు తర్వాత ఈ చక్రము నుండి ఏదో జేగురు రంగుతో పొగ వంటి ఆకారము... ఒక పాములాగా పైకి లేవడము గమనించినది! అంతే ఆశ్చర్యముగా... ఈ పొగ కదలిక గూడ పాము కదలికలాగా ఉండటము.... పాములాగా ఈ పొగ పైన ఉన్న చక్రాలలోనికి ప్రవేశించడము అంటే మూలాధారము నుండి స్వాధిష్టాన , మణిపూరక చక్రాలకి చేరుకోవడము ఈమె గమనించింది! అంతే విచిత్రముగా ఈ చక్రాల యందు వరుసగా సజీవ మూర్తిగా గణపతి , లక్ష్మీనారాయణుడు ,బాల అమ్మవారు రూపమూర్తులను చూసి ఈమె ఆశ్చర్యము చెంది...దేవతలు ఉండటము నిజమేనని గ్రహించినది! ఇదే సమయములో గుప్తయోగి శరీరము ఊగిసలాడటము గమనించింది! అప్పుడు ఎక్కడ నుండో ఒక పెద్ద మోటర్ సైకిల్ (బులెట్ బండి) చేసే శబ్ధనాదము వినడము... అదిగూడ మణిపూరక చక్రము నుండి వినబడుతోందని ఈమె గమనించినది! దానితో మరింత శ్రద్దా భక్తితో- అకుంఠిత తదేక దృష్టితో గుప్తయోగి శరీరమును గమనించడము ప్రారంభించినది! ఆ తర్వాత కాని మూలాధార చక్రము నుండి తుమ్మెదల నాదము అలాగే స్వాధిష్టాన చక్రము నుండి వేణునాదము వినబడుతున్నాయని ఈమె గ్రహించలేక పోయినది! అంటే యోగ గ్రంధాలు చెప్పిన శబ్ధనాదాలుండటము అలాగే వినబడటము నిజమేనని ఈమె గ్రహించినది! ఇంతలో గుప్తయోగి శరీర మణిపూరక చక్రము నుండి పెద్ద నాదముగా చిన్న ఘంటానాదం వినబడటము గమనించినది! మరి కొద్ది సేపటికి ప్రవేశించే పొగను కుండలినీశక్తియని.... దీని ప్రవాహము ఒక పాము నడక లాగా మెలికలు తిరుగుతూ ఉంటుందని... అందుకే యోగ గ్రంధాలు కాస్త కుండలినీశక్తిని సంకేతముగా పామును ఉంచినారని ఈమె గ్రహించినది! ఆ తర్వాత ఈ శక్తి కాస్త గుప్తయోగి శరీరములో అనాహత చక్రము లోనికి ప్రవేశించగానే దీర్ఘ గంటానాధం అను శబ్ధనాదము వినబడటము... ఆ తర్వాత విశుద్ధ చక్రమును నందు వీణానాదము... శబ్ధనాదము... ఇలా వరుసగా మిగిలిన చక్రాలలో వరుసగా... ఓంకారనాదం , దుందుభినాదం , కాంస్యనాదం , శృంగనాదం , మేఘగర్జన , శంఖనాదం , తుంకార నాదం , నిశబ్ధనాదం. ఈ శబ్ధనాదాలను ఆయా చక్రాల యందు కుండలినీశక్తి ప్రవేశించినపుడు యోగిత చాలా స్పష్టముగా వింది! అలాగే తన మనస్సులో ఈ చక్రస్థానాలు మరియు ఈ శబ్దనాదాలు , ఈ చక్రదైవాల రూపు రేఖలు ముద్రించుకుంది! 

మరి కొద్దిసేపటికి మూలాధార చక్రము నందు అంగుళ పరిమాణమున్న ఒక దీపకాంతి దివ్యతేజస్సుతో అక్కడ నుండి ఊర్ధ్వ ముఖముగా... పైన ఉన్న స్వాధిష్టాన చక్రము నందు ప్రవేశించడానికి బయలు దేరడము ఈమె గమనించే సరికి ఏదో తెలియని ఉద్రేకానికి... మరి కొద్ది క్షణాలలో ఒక యోగి కపాల మోక్షమునుప్రత్యక్షముగా జరుగపోయే దానిని చూస్తున్నాననే  ఉద్రేకానికి ఈమె లోనుగావడముతో దీనిని ఎంత అదుపు చెయ్యాలన్నా చెయ్యలేక పోవడము ఈమె గమనించి మౌనము వహించి ప్రశాంతస్థితిలో... జరగపోయే దానిని నిశ్చింతముగా చూడటము ప్రారంభించినది. అంటే ఇంతసేపటి వరకు అన్ని చక్రాలలో కుండలినీశక్తి ఒక పాము మాదిరిలాగా ప్రయాణించి... ఈ చక్రాలను శుద్ధి చేసినదని ఈమె గ్రహించే లోపుల... ఈ దివ్య కాంతి పుంజము కాస్త స్వాధిష్టాన చక్రములోనికి ప్రవేశించడము గమనించింది. అంతే విచిత్రముగా అప్పడిదాకా ఒకపద్మములాగా కనిపించిన మూలాధారచక్రము అదృశ్యమవ్వడము బట్టి చూస్తే... ఈ చక్ర విభేధనము  చెందుతాయని ఈమె గ్రహించేలోపుల... స్వాధిష్టాన చక్రము అదృశ్యమైంది! ఇలా వరుసగా... ఈ కాంతి పుంజ యానము కాస్త మణిపూరక నుండి బ్రహ్మాండ చక్రముదాకా జరుగుతున్న దృశ్యమును చూస్తున్నాకొద్ది యోగితలో చెప్పటానికి... వీలుకాని... తెలియని ఉద్రిక్తతలో చాలా తీవ్రస్థితికి చేరుకోసాగింది! మరి కొన్ని క్షణాలలో తను ప్రత్యక్షముగా ఒక యోగి కపాల మోక్షమును చూస్తున్నాననే ఆలోచనయే ఈమె గుండె భరించలేని తీవ్ర ఉద్రిక్తతకు ఈమె చేరుకుంటుండగా... గుప్తయోగి కళ్ళు తెరిచాడు! యోగిత బ్రహ్మ రంధ్రము నుండి రక్తము బయటికి విరజిమ్ముతుండగా... తల ప్రక్కకి వాలుస్తూ...శరీరము ప్రక్కకి ఒరగడము గమనించిన గుప్తయోగి ఈమెను చూస్తూ " కపాలమోక్ష ప్రాప్తిరస్తు " అని దీవించాడు!

          మరుసటిరోజు ఇదే అంశము గూర్చి  తెలుసుకోవాలని వచ్చిన మరొక విలేఖరి చేతికి  యోగిత కపాలమోక్షం తీసిన కెమెరాల ఫుటేజీని గుప్తయోగి మౌనముగా అందించాడు! తద్వారా ఈ విషయము గూర్చి లోకానికి తెలిసి యోగిత నిజముగానే గుప్తయోగిని అని అందరు అనుకొని ఈమె పార్థివదేహానికి నమస్కరించారు!

శుభం భూయాత్

పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

దత్తస్వామి దర్శనం-ఆత్మకథ

పవన్
గురువు అన్వేషణ కోసము
గురుచరిత్ర గ్రంధము చాలా శ్రద్ధగా చదువుతున్నాడు! 

అందులో ఒకచోట శ్రీ దత్తాత్రేయ స్వామివారు ప్రతిరోజు ఒకే విధమైన దినచర్య పాటించడము అనగా ఉదయ స్నానము కాశీక్షేత్ర గంగా నదిలోను కురుక్షేత్రంలో ఆచమనము ధూత పాపేశ్వరములో భస్మధారణ, కర్ణాటకములో సంధ్యావందనము చేస్తూ గాణ్గాపుర్ యందు భిక్షను అర్ధించి కొల్హాపూర్ యందు భిక్షను స్వీకరించి తుంగభద్రలో నీళ్లు త్రాగుతూ బదరి నారాయణములో శ్రవణము చేసి గిర్నార్ లో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత సాయంత్ర వేళ పండరీపురం చేరి కస్తూరి తిలకము ధరించి పశ్చిమ సముద్ర తీరములో సాయంత్ర సంధ్యావందనము జరిపి ఆపై రాత్రి సమయానికి మహుర్ గడ్ క్షేత్రానికి చేరి శయనిస్తాడని చెప్పడము విన్న పవన్ లో ఈ కలియుగములో నిజముగానే ఇప్పుడుగూడ శ్రీ దత్తస్వామి ఈ విధమైన దినచర్యను పాటిస్తున్నాడా? అని ధర్మ సందేహము వచ్చింది!

మరి ప్రశ్న వస్తే దానికి సమాధానము వెతికే దాకా పవన్ మనస్సు ఆగదు! ఆగలేడు! నిద్ర ఉండదు! ఆకలి ఉండదు! ఒకటే ధ్యాస! ఒకటే ధ్యానము! అప్పుడు పవన్ కి టెంబేస్వామి అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి అను దత్త భక్తుడికి గూడ ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు భిక్ష కోసము దత్తస్వామి ఎలాగో గాణ్గాపుర్  కి వస్తాడు గదా అప్పుడు ఆయనను ప్రత్యక్షముగా చూడవచ్చునని ఈయన కాస్త ఆ క్షేత్రానికి వెళ్ళడము జరిగింది! ఈ క్షేత్రములో ఉన్న నృసింహ సరస్వతి పాదుకలు దర్శనము ఈయన చేసుకొని అక్కడే ఉన్న ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈయనకి ఒక కునుకు పట్టింది! కలలో శ్రీ దత్తస్వామి వారు కనిపించి నువ్వు నన్ను చూడటానికి ఈ క్షేత్రానికి వచ్చావా? నా యోగమాయ నిన్ను నన్ను గుర్తు పట్టనివ్వదు! నీవు నన్ను గుర్తించలేవు! తెలుసుకోలేవు అని చెప్పి అదృశ్యమవ్వగానే ఈ టెంబేస్వామికి మెలుకువ వచ్చింది! అప్పుడు మధ్యాహ్న సమయము గావడముతో భిక్ష కోసమని ఈయన అక్కడున్న ఇళ్లకి వెళ్ళితే వాళ్లందరు ఇప్పుడే గదా స్వామి! భిక్షకి వచ్చినారు! మేము వేసినాము గదా అని ప్రతి ఇంటివాళ్లు అనేసరికి టెంబేస్వామి ఆశ్చర్యము చెందినారు! ఎందుకంటే తను ఇప్పుడిదాకా చెట్టు క్రింద నిద్రపోతున్నాడు! మరి వీళ్లేమో నాకు భిక్ష వేసినారు అంటున్నారు! ఈయనకి ఏమి అర్ధము గాక దత్తస్వామిని తలుచుకుంటూ ధ్యానము చేసుకున్న కొన్ని క్షణాలకి స్వయంగా దత్తస్వామి ఈ క్షేత్రానికి తన రూపముతో భిక్ష చేసినారని టెంబేస్వామి తెలుసుకొని కన్నీరు కార్చినాడని పవన్ తెలుసుకున్నాడు! అంటే ఈ కలియుగములో గూడ శ్రీ దత్తస్వామి చిరంజీవి తత్త్వముతో సంచారము చేస్తున్నాడని పవన్ గ్రహించి ఎలాగైనా శ్రీ దత్తస్వామి ప్రత్యక్ష సాక్షాత్కారానుభూతిని పొందాలని సంకల్పించుకొని కాశీ క్షేత్రములో ఉదయ గంగాస్నానానికి మణికర్ణికా ఘాట్ కి ఎలాగో వస్తారు గదా! అక్కడ ఈయనను పట్టుకోవాలని పవన్ కాస్త కాశీ క్షేత్రానికి బయలుదేరినాడు!

     ఈ క్షేత్రానికి చేరుకొని మణికర్ణికా ఘాట్ కి వెళ్లి ఉదయకాల గంగాస్నానము చేసి ఉదయ సంధ్యావందనము చేస్తూండగా... ఒక పిచ్చివాడు నాలుగు కుక్కలు పట్టుకొని...చిరిగిన బట్టలతో... మాసిన గడ్డముతో... వెకిలి చేష్ఠలతో....పిచ్చి త్రాగుబోతులాగా... పిచ్చి బూతులు తిట్టుకుంటూ... వాటిని తిడుతూ గంగాస్నానము చేస్తున్న దృశ్యము జపము చేసుకుంటున్న పవన్ దృష్టిలో పడినగూడ పెద్దగా పట్టించుకోలేదు! దత్తాత్రేయుడి రాకకోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు! ఈ పిచ్చివాడు కాస్త పవన్ దగ్గరికి వచ్చి "ఏరా! నన్ను గుర్తు పట్టలేదా? నా కోసము ఇక్కడ ఉన్నావా? నన్ను చూడటానికి వచ్చి నన్ను గుర్తుపట్టకపోతే ఎలారా? నన్ను చూడరా? నన్ను గుర్తు పట్టరా? నీకు దణ్ణం పెడతాను! దీవిస్తాను! నన్ను చూడరా! ఆ కుక్కలు చూడరా! అంటున్నగూడ పవన్ పెద్దగా పట్టించుకోలేదు! దానితో వీడు కాస్త అదోలా ఒక వెకిలి నవ్వు నవ్వి కుక్కలను తీసుకొని వెళ్ళిపోయినాడు! సాయంత్రముదాకా పవన్ ఈయన రాకకోసము ఈ ఘాట్ యందు ఉన్న దత్తస్వామి రూపురేఖలతో ఎవరుగూడ కనిపించకపోయేసరికి నిరుత్సాహముగా వెళ్ళిపోయినాడు! ఇలా ఒక వారము రోజులపాటు ఇదే తంతు జరిగింది! పవన్ సంధ్యావందనము చేసుకొనే సమయానికి ఆ పిచ్చివాడు రావడము పవన్ తో మాట్లాడి వెళ్లిపోవడము, పవన్ కాస్త ఇతగాడిని పట్టించుకోక దత్తస్వామి కోసము ఎదురు చూడటము జరుగుతూనే ఉంది!

    ఒకరోజు పవన్ లో తీవ్రమైన ఆవేదన భక్తి కలిగి "స్వామి! దత్తా! నువ్వు అందరికి కనిపించవు గదా! టెంబేస్వామికి, శిరిడి సాయిబాబాకి, ఏకనాధ్ స్వామి, జనార్ధన స్వామికి , మాణిక్య ప్రభువుకి ఇలా ఎందరికో కన్పించి వారిని నీ అంతటి వారిగా అనుగ్రహించినావుగదా! మరి నాకెందుకు కనిపించడము లేదు! ఈ రోజు ఎలాగైనా నీ ప్రత్యక్ష దర్శనము గాకపోతే ఈ గంగయందు శరీర త్యాగము చేస్తాను! ఆ పాపము నీదే అవుతుంది!" అంటూ వీర్రావేశముతో అంటూండగా... యధావిధిగా నాలుగు కుక్కలతో ప్రతిరోజులాగా ఆ పిచ్చివాడు వచ్చి గంగా స్నానము చేసి బయటికి వచ్చి వెకిలి చేష్ఠలు చేస్తూ పవన్ కేసి అదోలా చూసి నవ్వేసి... ప్రతిరోజులాగానే పవన్ తో మాట్లాడి ప్రక్కనే కూర్చుని కొంగ జపము చెయ్యడము ప్రారంభించాడు! ఇది ఏమిటి? వీడు ప్రతిరోజు నాదగ్గరికి వచ్చి నన్ను ప్రశ్నించి కుక్కలని తీసుకొని వెళ్ళిపోతాడు గదా! మరి ఈరోజు ఏమిటి? వింతగా కొంగ జపము చేస్తున్నాడు అని పవన్ అనుకున్నాడు! ఇంతలో గంగా స్నానము చేస్తూ అచ్చు గుద్దినట్లుగా ఉన్న ఇలాంటివాడు నాలుగు కుక్కలతో గంగాస్నానము చేస్తున్న దృశ్యము పవన్ గమనించి ఖంగు తిని ఆశ్చర్యము చెందుతూ కొంగ జపము చేస్తున్న పిచ్చివాడి కేసి చూడగా  ... మూడు తలలతో....ఆరు చేతులతో... నాలుగు వేద కుక్కలతో...గోమాతతో... శ్రీ దత్తాత్రేయ దివ్య మంగళ స్వరూపము కోటిసూర్యకాంతుల ప్రభావముతో విరజిల్లుతూ లీలా మాత్రముగా పవన్ కి కనిపించేసరికి పవన్ కి నోటమాట రాలేదు! అంటే ప్రతిరోజు వచ్చే పిచ్చివాడి రూపములో శ్రీ దత్తస్వామి వచ్చినాడని పవన్ గ్రహించి నిమిత్త మాత్రుడైన ఆ స్వామి....అందరిని ఆటలు ఆడించే...ఆటలు ఆడే... ఆ స్వామి దృశ్యము కాస్త అదృశ్యమయినాడు! శ్రీ దత్తస్వామి ఈ కలియుగములో గూడ చిరంజీవి తత్త్వములో ఉన్నాడని తనకి ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఇచ్చినందుకు పరమానంద పడుతూ... శ్రీ కాశీ విశ్వనాధ లింగమునకు పశ్చిమ దిక్కులో స్వయముగా శ్రీ దత్తాత్రేయ స్వామి  వారు ప్రతిష్ఠించిన శ్రీ దత్త శివలింగమును పవన్ దర్శించుకోవటానికి అక్కడ నుండి బయలు దేరినాడు! ఇలాంటి పవన్ కాస్త 12 సంవత్సరాల తర్వాత శ్రీ దత్తస్వామి అనుగ్రహము వలన దశ దత్త అవతారాలతో గూడిన సంపూర్ణ శ్రీ విశ్వ గురుచరిత్ర CD ని తయారు చేసి దత్తస్వామికి గురుదక్షిణగా సమర్పించిన పరమహంస పవనానంద అను దీక్ష నామముతో ఆత్మయోగిగా మారినాడు! యోగముంటే యోగి కాక తప్పదని నిరూపించాడు! శ్రీ దత్తగురువు అనుగ్రహము వలన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకొని మోక్షప్రాప్తి పొందినాడు!

శుభం భూయాత్ 

పరమహంస పవనానంద 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

గ్రహాంతరయానం-ఆత్మకథ

ఆ రోజు...
శనిత్రయోదశి....
శని దేవుడికి చాలా ఇష్టమైన తిధి! ఈ రోజున ఈయనకి ఇష్టమైన శనిదానాలు అనగా ఉప్పు, నువ్వులనూనె, నల్ల నువ్వులు, బెల్లం, తోటకూర, పాత ఇనుప ముక్క నల్లనివస్త్రాలు, ఒక బ్రాహ్మణుడికి శని దానముగా ఇస్తే... శని చెడు దృష్టిని కల్గించే ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని దోషాలు పోతాయని గ్రహశాస్త్ర వచనము! దానితో శని దోషాలు ఉన్నవారు శనిపూజలు, శనిజపాలు, శనిదానాలు, శనిగ్రహ హోమము చేయించుకొని మనః శాంతి పొంది గ్రహశాంతి పొంది ఆనందముగా ఉంటారని శని దేవుడికి ఇష్టమైన శని త్రయోదశి నాడు పూజలు చేసుకోవటానికి జనాలు ఎగబడుతుంటారు! ఇలాంటి వారిలో ప్రస్తుతము మన శ్రీనివాసాచారి గూడ ఒకడు! కాని ఇతనికి ఇలాంటి గ్రహ పూజల మీద నమ్మకము లేదు! తల్లి దండ్రులకి ఎవరో జ్యోతిష్కుడు తన జాతకము చూసి ఈ సంవత్సరము మీ అబ్బాయికి ఏలినాటి శని ప్రారంభము అవుతుందని... కాబట్టి శని దోష పరిహారాలు చేయించుకొమ్మని చెప్పడముతో... తనకి ఇష్టము లేకపోయిన తల్లిదండ్రుల తీవ్ర ఒత్తిడికి తలవొగ్గి ఈరోజు శ్రీనివాసాచారి శనిదానము ఇవ్వటానికి ఒప్పుకున్నాడు! ఈ దానము తీసుకొనే బ్రాహ్మణుడికి కాళ్లు కడిగి మరి శని దానాలు ఇచ్చాడు! అసలు ఆకాశములో ఉండే నవగ్రహాలు కాస్త భూమి మీద ఉండే మానవుడి మీద ఎలా ప్రభావము చూపుతాయో ఇతనికి అర్ధముకాలేదు! అర్ధం పర్ధము లేని పూజలతో నవగ్రహదానాల పేరులతో... నవగ్రహ జపాలతో... జీవగ్రహ హోమాలతో ప్రజలను భయపెట్టి మభ్య పెట్టి డబ్బులు దానము మీద నవధాన్యాలు, వస్త్రాలు, స్వయంపాకము  బ్రాహ్మణులు గుంజుతున్నారని...నాకు హాని కల్గించే శనిదేవుడు... నా దోషాలు తీసుకొనే బ్రాహ్మణునికి హాని కలిగించడా? ఇందులో ఇలాంటి లాజిక్ లేని పూజలు చెయ్యడము పైగా ఆకాశములో ప్రాణములేని గ్రహాలకి... ప్రాణప్రతిష్ట చేసిన రాతి గ్రహమూర్తులకి పూజలు చెయ్యడము మన శ్రీనివాసచారికి సుతారాము ఇష్టము లేదు! ఏదైనా పని చేస్తే దానికి ఒక అర్ధము, అంతరార్ధము, పరమార్థముండాలి! ఇలాంటివి ఏమిలేని గ్రహ పూజల వలన ప్రజలకి ఏమి లాభము చేకూరుతుందో తనకి అర్ధము గావడము లేదని ఆవేదన చెంది ఎలాగైనా లోకానికి ఈ గ్రహ పూజలు ఎందుకు పనికిరావని సాక్ష్యాధారాలతో నిదర్శనము చూపించాలని నిర్ణయించుకున్నాడు! అందుకు తనకి సహాయ పడే వారి గూర్చి వెతుకులాట ప్రారంభించాడు!

          అనుకోకుండా తన స్నేహితులందరు షిర్డి వెళ్లుతున్నారని తెలిసి మన శ్రీనివాసచారి గూడ వీళ్లతో కలిసి వెళ్లాడు! అక్కడ షిరిడి సాయిబాబా పాలరాతి విగ్రహమూర్తిని చూస్తూ శ్రీనివాసచారి " స్వామి! నా సంకల్పమును నెరవేర్చే... మార్గ దర్శకుడిని చూపించు! నాకు సహాయపడు అని వేడుకున్నాడు! తర్వాత స్నేహితులందరు కలిసి షిర్డికి 80 km  దూరములో ఉన్న శని సింగనాపూరు వెళ్లితే...శ్రీనివాసచారి గూడ ఇష్టములేకపోయిన వెళ్లక తప్పలేదు! అక్కడికి వెళ్లితే మనవాడికి ఆరడుగుల నల్లరాతి స్తంభమునకు నువ్వుల నూనెలతో అభిషేకము చేస్తున్న భక్తజనాలు కన్పించారు! ఇదిచూడగానే మనవాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది! ఆవేశము వచ్చింది! ఆవేదన బయలుదేరింది! ఆక్రోశము తన్నుకొని వచ్చి... శనీశ్వరుడి విగ్రహమూర్తి ముందు నిల్చొని " స్వామి! నువ్వు ఆకాశములో సంచరించే నవగ్రహాలలో ఒకడివి! సూర్య భగవానుడి పుత్రుడివి! గ్రహాలకి సంతానము ఉండటము ఏమిటో నాకు అర్ధము గావడము లేదు! ఎక్కడో ఉన్న నీవు నామీద చెడు దృష్టితో ఎలా చేస్తావో అర్థమయి చావడము లేదు! అసలు నీవు దేవుడివో లేదా గ్రహానివో అర్ధము గావడము లేదు! నీ పేరు మీద ఇక్కడ గ్రహ దోషాల నివారణతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారము జరుగుతోంది! నమ్మినవాడు మోసపోతున్నాడు! ఈ నమ్మకమును అమ్మకానికి పెట్టుకొని చాలా మంది భక్తి వ్యాపారము చేస్తున్నారు. నువ్వు మాత్రము ఇలా నల్లటి శిలా విగ్రహమూర్తిగా అందరిని చూస్తుంటావు! ఇలా మోసము చేసేవారికి లేని నీ దోషాలు మోసపోయేవారికి ఎందుకున్నాయో నాకు అర్థమయి చావడములేదు! ఉంటె ఇద్దరికి ఉండాలిగదా! ఒకరికి ఉండి మరొకరికి లేకపోవడము ఏమిటి? ఒకరి దోషాలు మరొకరికి ఎలా వెళ్ళుతాయి! అసలు నీవు గ్రహదోషము కలిగిస్తున్నావని నమ్మకము ఏమిటి? నాబొంద! నా బూడిద! అసలు నువ్వు ఉంటే గదా? నీ దోషాలు మా మీద పడటానికి! నువ్వు ఎటూ శిలామూర్తివే! మాట్లాడలేవు! దానితో నీ భక్తి వ్యాపారము చేస్తున్నారు! మాలాంటి వారు అమాయకముగా మోసపోతున్నారు! నీవు నిజముగా ఉంటే నా ముందుకిరా! నేను అడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పు... అని ఆవేదనతో తన మనస్సులో అనుకుంటూండగా... "నాయనా" అని పిలుపు వినబడితే వెనక్కి తిరిగి చూస్తే... నల్లటి దుస్తులతో... ఒక దీక్షాపరుడు కన్పించాడు! అచ్చంగా మానవమూర్తి శనిదేవుడిలాగా...

శ్రీనివాసచారి వెంటనే "ఎవరు మీరు స్వామి!" "నేను నేనే? నేను ఎవరో నెమ్మదిగా నీకే ఆఖరిలో తెలుస్తుంది! నీవు ఏదో నన్ను ప్రశ్నలు అడుగుతున్నావుగదా! వాటికి సమాధానాలు చెప్పాలని వచ్చాను!"

నేను మిమ్మల్ని ఇప్పుడే మొట్ట మొదటిసారి చూస్తున్నాను! నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను! నాకు గుర్తు గూడ లేదు

నాయనా! నేను నిన్ను నీవు పుట్టినప్పుడి నుండి చూస్తున్నాను! నీవు శని మహర్దశలో పుట్టినావు! ఇప్పుడు శని అంతర్దశలో నన్ను చూశావు! నా పూజలు చేశావు! నన్ను ప్రశ్నలు అడిగావు! నీ ఆవేదన భక్తి మెచ్చి సమాధానాలు చెప్పాలని వచ్చాను!

"మీరు గూడ ఆ శని దేవుడిలాగానే- నాకు అర్థమై చావడము లేదు! మీ సమాధానాలు ఏమిటో చెప్పండి వింటాను!"

"అసలు నీ ప్రశ్నలు ఏమిటో అడుగు? సమాధానాలు వాటంతట అవే వస్తాయి"

స్వామి! నా ప్రశ్నలన్నీ గూడ గ్రహ ప్రశ్నలే అసలు ఎక్కడో ఆకాశములో ఉన్ననవగ్రహాలు మన మీద ఎలా ప్రభావము చూపుతాయో చెప్పండి?

నాయనా! ఎందుకు ప్రభావము చూపవు! ఖచ్చితముగా చూపుతాయి! ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి రోజులలోనే మన సముద్రాలకి ఆటు పోటు విపరీతముగా కలుగుతున్నాయి! చంద్రుడి గ్రహ ప్రభావము వలనే సాధ్యపడుతుందని మీ విజ్ఞాన శాస్త్ర వేత్తలు గూడ నిరూపించారు గదా! ఎక్కడో ఉన్న చంద్రుడు కాస్త ఈ భూమిన ఉన్న సముద్రాల మీద ప్రభావము చెపుతుంటే... ఈ గ్రహమీద జీవించే గ్రహజీవుల మీద ఆకాశములో ఉండే నవ గ్రహాలు ఖచ్చితంగా ప్రభావము చూపుతాయని తెలుస్తోందిగదా! అని చెప్పగానే....

స్వామి! మీరు చెప్పినది నిజమే! కాని కొన్నిగ్రహాలు మంచి ప్రభావము .... మరి కొన్ని గ్రహాలు చెడు  ప్రభావము ... ఎందుకు చూపుతాయి?

నాయనా! నవగ్రహాల ప్రభావము అనేది భోజనములాంటిది! ఈ భోజనము వగరు,చేదు, తీపి, కారము, పులుపు ఉప్పతనం...ఇవి ఆహారములో రుచులను కల్గిస్తాయో... అలా నవగ్రహాలలో కొన్ని మంచివి గాను.. మరి కొన్ని చెడు ప్రభావము కల్గిస్తాయి! విచిత్రము ఏమిటంటే నీకు చెడు కలిగించే శని భగవానుడు కొంత మందికి అదృష్ట యోగాలు, రాజయోగాలు ఇస్తాడు! యోగ కారకుడు అవుతాడు! ఇది వాడి జాతక సంచార నవగ్రహ స్థితి బట్టి ఉంటుంది! అంటే చేదు నీకు ఇబ్బంది కల్గించ వచ్చు! అదే షుగర్ వ్యాధి ఉన్నవారికి చేదు అనేది దివ్య ఔషధముగా పని చేస్తుంది! అలా నవగ్రహ ప్రభావాల మార్పులు ఎవరి జాతక చక్ర గ్రహ స్థితిని బట్టి మార్పులు-చేర్పులుంటాయి!

స్వామి! బాగానే ఉంది! నాకున్న శని దోషాలు వేరే వాడు  తీసుకున్నప్పుడు వాళ్ళకి నా చెడు దోషాలు వెళ్లావా?

వెళ్తాయి! ఖచ్చితముగా వెళ్తాయి! కాని నీకు చెడుగా ఉన్న శని గ్రహ దోషము వాడికి శని గ్రహము యోగకారకుడిలో ఉంటాడు! అందువలన నీ చెడు దోషాల ప్రభావము వాడిమీద పని చెయ్యవు!
ఉదాహరణకు ఉప్పును తీసుకొని మహాసముద్రములో కలిపితే రుచిలో తేడా వస్తుందా? ఉప్పుతన శాతము ఏమైనా పెరుగుతుందా? పెరగదు గదా? అలా నీ చెడు గ్రహదోషాలు కాస్త మంచి గ్రహ దోషాలున్న బ్రాహ్మణుడికి దానముగా ఇస్తే... అవిగూడ మంచివిగా మారిపోతాయి! దీని కోసము వారు నిత్యమహా గాయత్రి మంత్రారాధనతో చెడు దోషాలను కాస్త మంచి దోషాలుగా మార్చుకుంటారు! అందుకే నవగ్రహ దానాలు తీసుకొనే బ్రాహ్మణుడు ఖచ్చితంగా మూడు కాలాల యందు త్రిసంధ్యలు చేసుకోవాలని పెద్దలు చెప్పారు! ఎందుకంటే ఈ జపము వలన తీసుకున్న గ్రహ దోష దానాల వలన రోగి కావలసినవాడు రోగికి సేవ చేస్తాడు! లేదంటే ఛస్తాడు!

బాగానే ఉంది! ఈ నవగ్రహ దోషాలకే నవగ్రహ ధాన్యాలే ఎందుకున్నాయి? అని ఎలా నివారణ చేస్తాయి!

నాయనా! నీ శని గ్రహ దోష నివారణ దానాల సంగతే చూడు! నిజానికి శని దేవుడు  మానవుడి రక్తము మీద ప్రభావము చూపుతాడు! అంటే హిమోగ్లోబిన్ మీద ప్రభావము చూపుతాడు! శనికి దానమిచ్చే వాటిలో ప్రధానమైనవి నల్ల నువ్వులు, నువ్వుల నూనె,తోటకూర,ఉప్పు! ఈ పదార్ధాలను జాగత్తగా పరిశీలించు! ఇవి అన్నిగూడ ఐరన్ పదార్దాలే! అంటే ఉప్పులో, నువ్వులలో, నువ్వులనూనెలో, తోటకూరలలో ఐరన్ శాతము చాలా ఎక్కువగా ఉంటుందని విజ్ఞాన శాస్త్రాలే ఒప్పుకున్నాయి గదా! ఇప్పుడు అసలు విషయానికి వద్దాం! ఐరన్ అంటే రక్తము లోని రక్త శాతము పెంచేదిగదా! మన శరీరములో ఐరన్ విటమిన్ శాతము ఎక్కువైనా లేదా చాలా తక్కువైనా... తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి గదా! రక్తహీనతయే రావచ్చును!లేదా రక్త ప్రవాహాల తేడాల వలన లో బి.పి లేదా హై బి.పి రావచ్చును! ఈ లెక్కన చూస్తే శని దోషాలంటే మానవ శరీరములోని రక్తదోషాలు అన్నమాట!ఈ రక్తము ప్రవహించే రక్తనాళాల దోషాలు, వీటిలో రక్తము సరిగ్గా ప్రవహించకపోతే గుండె,ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు, కళ్ళు లాంటి భాగాలు.... నరాల బలహీనత వలన వీటికి ప్రమాదము జరిగే అవకాశాలున్నాయని మన విజ్ఞాన శాస్త్రవేత్తలు నిరూపించారు గదా! అంతెందుకు శనివారము నాడు తోటకూర తినరాదని మన పూర్వికులు చెప్పారు గదా! ఎందుకంటే శనివారము అంటే శనిగ్రహ రోజు! శనిగ్రహము అంటే రక్తమునకు సంబంధించినది! తోటకూర అంటే ఐరన్ శాతము ఎక్కువగా ఉండే పదార్ధము! ఇప్పుడు శనివారము నాడు తోటకూర తింటే మన శరీరములో ఉండవలసిన ఐరన్ శాతము ఎక్కువ అవుతోంది గదా!తద్వారా మనకి తెలియకుండా అనారోగ్యమును పెంచుకున్నట్లేగదా! అందుకే శనివారము నాడు తోట కూర తినరాదని... అలాగే శనివారము నాడు పాత వస్తువులు తెచ్చుకోరాదని, ఇనుప వస్తువులు కొనరాదని, నూనె పదార్ధాలు, నూనెలు కొనరాదని మన పూర్వీక మహర్షులు చెప్పారు! వీటి వలన మన వంటిలో అలాగే మన ఇంటిలో శని దోషాలు పెరిగే ప్రమాదమున్నదని శనివారమునాడు కొనవద్దని అలాగే అమ్మవద్దని చెప్పారు!

స్వామి! అంటే ఈ లెక్కన నవగ్రహాలకి నవధాన్యాలకి, గ్రహాదానాలకి, గ్రహ జపాలకి, గ్రహ హోమాలకి అంతరార్ధముగా మానవుడికి శారీరక, మానసిక ఆరోగ్య సూచనలున్నాయని తెలుస్తుంది! ఈ రెండు బాగుంటే ఆరోగ్యముగా ఉంటాడు! ఆరోగ్య ఆలోచనలు చేయగలుగుతాడు! అప్పుడు అనుకున్న పనులు పూర్తి చెయ్యగల్గుతాడు! తద్వారా మానసిక, శారీరక ఆనందాలు పొందుతాడు అన్నమాట! దీని కోసము మన పూర్వీక మహర్షులు కాస్త గ్రహ దోషాలు కనిపెట్టి వాటిని నివారించే పదార్ధాలు, వస్తువులు, లోహాలు,రంగులు, రత్నాలు కనిపెట్టి వీటిని గ్రహదానాలుగా చేసి దోషనివారణ మార్గాలుగా చెప్పారని బాగానే తెలుస్తోంది! మరి వీళ్లు ఎక్కడో  ఆకాశములో ఉన్న గ్రహాల ప్రభావము ఎలా కనిపెట్టారు?

నాయనా! వాళ్లకి తెరుచుకున్న త్రినేత్రము ద్వారా సృష్టి రహస్యాల జ్ఞానము పొందడము జరిగింది! త్రినేత్రము అంటే నీ భాషలో చెప్పాలంటే విజ్ఞాన వేత్తలు ఉపయోగించే టెలిస్కోప్ లాంటిది అన్నమాట! దీని ద్వారా మనము గ్రహాలను చూడవచ్చు గదా! అలా పూర్వీక జ్ఞానులు తమ మనోనేత్రమైన త్రినేత్రమునుపయోగించే జ్ఞానము పొందితే... ఈనాడు మన విజ్ఞాన వేత్తలు కాస్త టెలిస్కోప్ , మైక్రోస్కోప్ ద్వారా బాక్టీరియాలు, వైరస్ లు గ్రహగతులు తెలుసుకుంటారు! జ్ఞానిది వారికి మాత్రమే తెలిసి లోకానికి చెప్పితే విజ్ఞానిది అందరికి ఉపయోగపడుతుంది! అంటే యోగసిద్ధి పొందిన జ్ఞానయోగి ఒక్కడు మాత్రమే భూచర సిద్ధితో ఆకాశములో ఎగిరితే.... అదే విజ్ఞాని కనిపెట్టిన విమానములో అందరు ఆకాశములో ఎగురుతున్నారు! జ్ఞాని మూస అయితే విజ్ఞాని దాని జిరాక్స్ లాంటి వాడు అన్నమాట! జ్ఞాని మూలపు ఆధార ఆలోచన ఇస్తే... దానిని అందుకొని విజ్ఞాని కాస్త ఈ ఆలోచనను ఆచరణలోనికి తీసుకొని వస్తున్నాడు! జ్ఞాని లేకపోతే విజ్ఞాని లేడు! విజ్ఞాని లేకపోయినా జ్ఞాని ఉంటాడు! ఆలోచన లేకపోతే ఆచరణ ఎలా చెయ్యగలడు! చెయ్యలేడు గదా!

               ఇలా జ్ఞానులు తెలుసుకున్న జ్ఞాన విషయాలకి ఆరోగ్య విషయాలు జోడించి విగ్రహపూజలు, ఆచార వ్యవహారాలు ఏర్పాట్లు మానవులను ఆరోగ్యవంతులు చేస్తున్నారు! నువ్వు ఎప్పుడైనా నవగ్రహాల పూజలు చేసేటపుడు కొన్ని గుర్తులు చెప్పడము లేదా ఆ గుర్తులున్న వస్తువులు ఉపయోగించడము చూశావా?

      శ్రీనివాసచారి ఆలోచనలో పడి.... మొన్న వారము జరిగిన శనిగ్రహ పూజను గుర్తు చేసుకుంటూ... ఆ!ఆ! గుర్తుకు వచ్చింది! అవును స్వామి! శనిగ్రహ హోమ మండపమును షట్కోణాకారములో ఇటుకలను పేర్చి హోమము చేసారు! అలాగే హోమము చేసే ఆయన మాత్రము ధనుస్సు ఆకారములో ఉన్న పూజాసనము మీద కూర్చుని హోమము చేశాడు! వీటికి శని గ్రహానికి ఏమి సంబంధముంది? అనగానే....

నాయనా! తమిళనాడు రాష్ట్రములోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న ఇరికుప్పము అనే గ్రామములో ప్రపంచములో ఎక్కడా లేని విధముగా షట్కోణ యంత్రము కలిగిన శివ లింగముంటుంది! దీనిని శని లింగమంటారు! ఎందుకంటే ఈ మధ్యనే మన విజ్ఞాన వేత్తలు శనిగ్రహము యొక్క ఉత్తర దృవము మీద శాటిలైట్ ల ద్వారా పరిశోధనలు చేస్తుండగా వారికి 25 వేల కి.మీ విస్తీర్ణములో వ్యాపించియున్న షట్కోణాకారములో మబ్బులు ఏర్పడి ఉండటము గమనించారు! ఇందులో మనము నివసించే భూమిలాంటి గ్రహాలు నాలుగు పడతాయి! ఎప్పుడో 1300 సంవత్సరాల క్రితమే శనిగ్రహము మీద షట్కోణ గుర్తులున్నాయని మన పూర్వీక భారతీయ మహర్షులు కనిపెట్టి ఈ ఇరికుప్పం గ్రామ శని శివలింగము మీద షట్కోణాకార యంత్రము భావితరాల వారికి తెలియ చెయ్యడానికి పూజ యంత్ర గుర్తు పెట్టారు అంటే ఒకసారి ఆలోచించు! మన జ్ఞానుల జ్ఞాన ప్రభావము యెట్టిదో అంతెందుకు శనిగ్రహము మీద కనిపించిన మేఘాలు దట్టముగా... స్థిరముగా... కరగకుండా... మెదలకుండా ఏదో కట్టడములాగా ఆరు గీతలున్న షట్కోణాకారములో శాశ్వతముగా ఉన్నాయని పైగా ఈ విధంగా ఈ ఒక్క గ్రహము మీద మాత్రమే కనపడినాయని... NASA కి చెందిన  కెవిన్ బెయిన్ అనే శాస్త్రవేత్త చెప్పినాడు! మరి జ్ఞానులు ఉన్న కాలములో ఇప్పుడున్న అత్యంత ఆధునికముగా పరికరాలు ఆనాడు అంతరిక్షములో ఉన్న గృహాలను పరిశీలించే సాంకేతిక పరిజ్ఞానము లేదు! అయినా తమకున్న త్రినేత్రము ద్వారా కలిగిన దివ్యదృష్టి సిద్ధి చేత నవగ్రహాల సంచారమును అంతరిక్షములో చూస్తూ... వాటి మీద వారికి కనిపించిన ఆకారాలను, గుర్తులను, అవి ప్రభావము చూపించే ప్రభావాలు, వాటి శక్తులు, ఈ శక్తి ప్రభావాలు ఏ యే వస్తువుల మీద ఏయే పదార్ధాల మీద పడతాయో... అలాగే వేటిమీద పడవో తెలుసుకొని వాటిని మన నిత్య జీవితములో ఉంచేందుకు నవగ్రహ పూజలు, దానాలు, జపాలు, హోమాలు ఏర్పాటు చేసి ఉంటారని నువ్వు ఈ పాటికే గ్రహించి ఉంటావు గదా!

                        స్వామి! ఇప్పుడిదాకా మీరు చెప్పినది అక్షర సత్యమే ! నేను నమ్ముతాను! కానీ భూమి మీద ఉన్న జ్ఞాన యోగులు ఆకాశములో ఉన్న గ్రహస్థితులను త్రినేత్రము ద్వారా చూశారని చెపుతున్నారు? అది ఎలా సాధ్యము!

నాయనా! సాధన సాధ్యతే సర్వం సాధ్యం! సాధన చేస్తే అన్ని సాధ్యపడతాయి! అసాధ్యము అనే పదములోనే సాధ్యముంది గదా! యోగసాధన చేసి యోగసిద్ధి పొందిన సిద్ధ పురుషులకి త్రినేత్రము ద్వారా త్రికాలజ్ఞానము అందుతుంది! అలాగే సూక్ష్మ శరీరముతో ఇలాంటి వారు ఏకముగా గ్రహయానాలు, దేవతలోకాలు సంచారము చేసి అక్కడున్న విశేషాలను వింతలను తెలుసుకొని సశరీరముతో భూమి మీద సత్ గ్రంధాలే వ్రాసినారు! అష్టాదశ పురాణాలు ఇందుకు నిదర్శనము అనగానే....

స్వామి! మీరు గ్రహాంతరయానము చేసారా?

లేదు! నాయనా! ఎందుకంటే నేను అంతరిక్ష వాసిని! అంతరిక్షములో నా నిత్య నివాసము! ఏనాడు నేను ఇతర గ్రహాల యానము చెయ్యలేదు! కానీ నా ప్రభావము అన్ని ఇతర గ్రహాల మీద చూపిస్తాను! దైవ లోకాల మీద, దైవాల మీద, మానవుల మీద.... ఇలా సమస్త విశ్వ దైవ జీవకోటి మీద నా ప్రభావము ప్రతిరోజు ప్రతిక్షణము ఉంటుంది! కానీ నీకు గ్రహాంతరయానము చేయాలంటే నాలాంటి గ్రహ యోగులను వశపరుచుకున్న యోగులు మహా స్మశానమైన కాశీక్షేత్రములో ఉన్నారు! అందులో నాకు తెలిసిన నా ప్రియ భక్తుడు... నా గ్రహయోగకారక్యతను పొందిన పరమహంస పవనానంద ఆత్మయోగి ఉంటారు! వారిని దర్శించుకో! వారి అనుగ్రహమును పొందు! అనగానే....

స్వామి! ఇంతకి మీరెవరు! మీకు ఇంతటి గ్రహ జ్ఞాన విజ్ఞానాలున్నాయంటే మీరు సామాన్యముగా కనిపించే అసామాన్య వ్యక్తులు! మీరు యోగులా?

నాయనా! యోగులకే యోగత్వమును ఇచ్చే యోగకారకుడిని! నన్ను అందరు తిట్టుకొనే దేవుడిని! నేను అంటే భయపడే దైవాలున్నవాడిని! నా మంచితనము అర్ధముకాని మానవులను కల్గిన వాడిని! నేను అంటే ఇష్టపడే వాడిని యోగిని చేస్తాను! నేను అంటే భయపడేవాడిని రోగిని చేస్తాను! నేను అంటే భయపడి పూజలు చేసేవాడిని భోగిని చేస్తాను! రాజుని పేదవాడిని చేస్తాను! బిక్షగాడిని రాజును చేస్తాను! మంచి వాళ్లకి మంచివాడిని! చెడ్డ వాళ్లకి చెడ్డవాడిని! అందుకే నా దగ్గర సమన్యాయముంటుందని న్యాయమూర్తులే నాకు ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరిస్తారు అంటూ లేవపోతూండగా...

అంటే!స్వామి! మీరు... మీరు.... శనిదేవుడా? అని శ్రీనివాసాచారి పలుకలేక పలుకుతుంటే....

ఆ నల్లటి వస్త్రధారి నవ్వుకుంటూ తన ఎదురుగా ఉన్న నల్లటి రాతి విగ్రహములోనికి వెళ్ళిపోతూ అంతర్ధానమైనారు! ఇది కళ్లారా చూసిన శ్రీనివాసచారికి ఒక్క క్షణము నోట మాటరాలేదు! శిలా విగ్రహములాగా బిగిసి పోయినాడు! కొద్దిసేపటికి తేరుకొని శనివిగ్రహ దేవుడికి నమస్కారము చేసి కేజీన్నర నువ్వుల నూనె పోస్తుంటే... గ్రహ దేవుడు గాదని అన్నవాడు కాస్త శని గ్రహ విగ్రహ దేవుడికి నూనెతో అభిషేకము చేస్తున్న శ్రీనివాసచారిని చూసిన స్నేహితులు ఆశ్చర్యానందముకు
గురి అయినారు! ఈ యాత్ర పూర్తి చేసుకొని ఎవరి ఇండ్లకు వాళ్లు చేరుకున్నారు!

            ఇంటికి చేరిన శ్రీనివాసచారికి మనస్సులో మనస్సుగా లేదు! ఎందుకంటే ఏకముగా శనిదేవుడి  చేతనే గొప్పవాడు అని అనిపించుకున్న కాశీక్షేత్రములో ఉండే గుప్తయోగిని ఎలాగైనా ఒకసారి దర్శించుకోవాలని ఇతగాడిలో తెలియని ఉబలాటము మొదలైంది! ఆగలేక పోయినాడు! కాశీక్షేత్రానికి బయలు దేరాడు! కాశీకి చేరుకొని ఈ ఆత్మయోగి గూర్చి అన్ని ఘాట్ లు వెతికిన గూడ... ఎవరిని అడిగిన గూడ ఈయన జాడ గూర్చి తెలియలేదు! అప్పుడికే వారము రోజులు గడిచిపోయినాయి! దీనితో చేసేది ఏమిలేక ఉన్న చిట్ట చివరి అవకాశముగా... కాశీ విశ్వనాధుడి సమక్షములో ఉన్న చిన్న శనీశ్వరుడి విగ్రహమూర్తి ముందు దీపారాధన చేసి "స్వామి! మీరు నాకు చెప్పిన గుప్తయోగి జాడ తెలియలేదు! మీరే నాకు మార్గము చూపించాలి అనగానే... వెనుక నుండి "ఎవడ్రా! నీవు! నా గూర్చి అన్ని ఘాట్ లలో... అన్ని గుడులలో విచారణ చేస్తూ విచారిస్తున్నావు! అంటూ! మానవులు , మాధవులు నాతో చెప్పలేక ఛస్తున్నారు! నాతో నీకు ఏమి? శనిగాడినే పట్టుకున్నావు అంటే నువ్వు సామాన్యుడివి గావు! గత జన్మలో సాధనలో ఏదో తప్పును చేసిన యోగివి అయ్యింటావు! లేదంటే నాలాంటివాడు నీకు కనిపించడు! నా అవసరముండదు! నా అవసరము నీకు ఉంది అంటే లోక విరుద్ధమైన విషయము ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నావు! అది ఏందో చెప్పు! లేదంటే నా చేతిలో ఛస్తావు! తిరుగు! నా వైపు తిరుగు! అనగానే... శ్రీనివాసాచారి బిక్క చచ్చిపోతూ...

స్వామి! నన్ను క్షమించండి! మిమ్మల్ని చూడాలని అన్పించి మీ కోసము విచారణ చేశాను! అంతే! చూశాను! చాలు! నేను వెళ్తాను!

ఎక్కడికి వెళ్తావురా! ఎక్కడికో వెళ్లాలని నా దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్లకుండా వచ్చిన ఇంటికే వెళ్తున్నావు అంటావేమిటిరా? నిన్ను ఎక్కడికి పంపించాలో ఆ శని గాడు నా చెవిలో ఎప్పుడో చెప్పాడు! వాడున్న చోటకే నిన్ను పంపిస్తాను! భయపడి చావుకు! చచ్చినవాడివి! క్రొత్తగా చచ్చేదేముంది! అయిన ఇవి నీకు అర్ధము కావులే! నాకే అర్ధమై చావడము లేదు! నీకు ఏమి అర్ధమవుతుంది చెప్పు! అంటూ... శ్రీనివాసచారిని ఒక అంతర్గత గుహలాంటి గదిలోనికి తీసుకొని వెళ్లారు!

శ్రీనివాసచారి వైపు చూస్తూ "ఇప్పుడు చెప్పు! నీవు ఏ గ్రహాంతరయానము చేస్తావు? ఏ గ్రహాలోకము చూస్తావు అనగానే....

స్వామి! గ్రహాంతరయానము చేయాలంటే కుండలినీశక్తి జాగృతి అవ్వాలి గదా! దానికి శక్తిపాత సిద్ధ గురువు గావాలి గదా! అప్పుడే మన సూక్ష్మ శరీరయానముతో గ్రహాంతరయానము అలాగే వివిధ లోకాల సంచారము జరుగుతుందని యోగ గ్రంధాలలో ఉండటం చదివాను!

అవి అన్ని నీకెందుకురా! అయినా నీకు గావలసిన ఏర్పాట్లు అన్నిగూడ ఆశనిగాడు చేసేశాడులే! నీవు వాడిని పూజలతో ముంచెత్తినావు గదా! దానితో వాడు అపకారము చేసేవాడు కాస్త ఉపకారము చెయ్యడము మొదలు పెట్టాడు! అపయోగము ఇవ్వవలసిన వాడు కాస్త ఉపయోగము ఇస్తున్నాడు! యోగమును ఇస్తున్నాడు! అదిగూడ 48 నిముషాలు మాత్రమే! ఆ తర్వాత ఇలాంటి యోగస్థితి నీకు రావాలంటే 19 సంవత్సరాల తర్వాతనే సాధ్యపడుతుంది! అయిన ఇవి అన్నియు నీకెందుకు? ఒక గ్రహము ఏమిటి? అన్ని గ్రహాలు నాతో పాటుగా చూద్దువురా! అంటూ... యోగనిద్రలో నిద్రపొమ్మని ఆజ్ఞనిస్తూ వీరిద్దరు యోగనిద్రావస్థను పొందిన మూడు క్షణాలకే నిద్రపోతున్న వీరిద్దరి భౌతిక దేహాల నుండి సూక్ష్మ దేహాలు బయటికి రావడము జరిగినది! సూక్ష్మధారి అయిన శ్రీనివాసాచారి... చచ్చిపడియున్న తన భౌతిక దేహమును చూస్తూ  అరే ! విచిత్రముగా ఉంది! అంటే ఇన్నాళ్లు కనిపించే భౌతిక దేహములో నాలాంటి రూపధారి ఉన్నాడు అన్నమాట! అంటే ఇదే సూక్ష్మ ధారి కాబోలు! అనగా ఆత్మ అన్నమాట అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆత్మయోగి సూక్ష్మధారి వెంట ముందుకి ప్రయాణించసాగినాడు! 

వీరిద్దరికి ఆకాశములో... భూచక్రమును వెలిగిస్తే వచ్చే వెలుగుల  జిమ్ములలో....తిరుగుతున్న బ్రహ్మాండ చక్రము కనబడినది! ఈ చక్రములో వివిధ గ్రహాలు, అందు గ్రహాలోకాలు అలాగే వివిధ దైవలోకాలు సుమారు 1000 దాకా శ్రీనివాసచారి గమనించాడు! మౌనముగా వచ్చాడు! వీరిద్దరు కలిసి వెలుతురు- చీకటి అంతగా లేని అంటే సంధ్య వాతావరణము లాంటి గ్రహమునందు సూక్ష్మ శరీరములలో దిగినట్లుగా... దిగుతున్నట్లుగా శ్రీనివాస గ్రహించాడు! ఒక్కసారి భయపడినాడు! అయిన మనోధైర్యముతో క్రిందికి దిగినాడు! అక్కడ వీరిలాంటి శరీర రూపురేఖలు ఉన్న వ్యక్తులు కనిపించారు! అచ్చముగా కవల పిల్లలు లాగా ఉన్నామని శ్రీనివాసచారి అనుకున్నాడు! గాకపోతే వేసుకొన్న దుస్తులు, చేసే వృత్తులు తేడా ఉన్నాయని తెలుసుకున్నాడు! ఇలా భూమి మీద తనకి పరిచయము ఉన్న వారంతాగూడ ఒక్కొక్కరిగా శ్రీనివాసచారికి కనిపిస్తూండగా- విపరీతముగా ఆశ్చర్యానికి గురి అయినాడు! కానీ ఎవరు గూడ తనని గుర్తు పట్టకుండా ఎవరి పనులలో వాళ్లు బిజీగా ఉన్నారు! తన ప్రక్కన నడిచే గుప్తయోగి ఏమాత్రము ఇవి ఏమి పట్టించుకోకుండా... ఎవరితోనూ మాట్లాడకుండా మనో వేగముతో నడకతో ముందుకి సాగిపోతున్నాడు! శ్రీనివాసచారి మాత్రము ఆత్రముతో... ఆశ్చర్యముతో అందరిని చూస్తూ... కొందరిని గుర్తుపడుతూ...పలకరించాలని ఉన్న పలకరించలేని స్థితిలో తాను ఉన్నానని తెలుసుకుంటూ ఆత్మయోగిని అనుసరించసాగినాడు! నాస్వామి రంగా! ఇదంతా చూస్తుంటే 'వర్ణ' సినిమాను చూస్తున్నట్లుగా ఉంది!

అందులో గూడ హీరో హీరోయిన్ గూడ గ్రహాంతర యానము తనలాంటి వారిని కలుసుకొని తిరిగి వస్తారు గదా! అలా ఉంది! భలేగా ఉంది అనుకుంటూండగా... ఆత్మయోగి ఒక్కసారిగా ఉన్నట్టుండి గాలిలోనికి  ఎగిరేసరికి తన ప్రమేయము లేకుండానే శ్రీనివాసచారి గూడ ఎగురుతూ... మరొక గ్రహ లోకమునకు అడుగు పెట్టినాడు! మొదటి గ్రహ లోక అనుభవము ఈ గ్రహము మీద ఇతనికి అన్పించింది! గాకపోతే అక్కడి వాతావరణము... ఇక్కడి వాతావరణము తేడా... అలాగే ఆకాశ రంగులలో మార్పులు, మనుష్యుల రూపు రేఖలలో, వస్త్రాలలో, చేసే వృత్తులలో తేడాలు ఉన్నాయి! గాకపోతే తనలాంటి వాళ్లు గూడ ఉన్నారు! తనకి తెలిసిన వ్యక్తుల రూపురేఖల వాళ్లున్నారు! చనిపోయిన తన బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్లు తను గుర్తుపట్టి గమనించిన వాళ్లు ఎవరు గూడ గుర్తు పట్టక పోవడము ఇతనికి చాలా ఆశ్చర్యము అన్పించసాగింది! ఎక్కడ గూడ ఆగలేదు! నడక కొనసాగిస్తూనే చుట్టూ పరిసరాలు గమనిస్తూనే ఉన్నాడు! 

అంటే ఈ లెక్కన నవగ్రహాలలోనే వాతావరణాలు నవరంగులలో ఉందని.... వీరు వాడే ఆయుధాలే నవగ్రహ పూజలలో వాడే ఆసనాలని... వీరు వాడే పదార్ధాలే.... ఆ గ్రహ ప్రభావ పదార్ధాలని.... వీరు అధికముగా పండించే పంటలే.... ఆ గ్రహ దాన ధాన్యాలని, వీళ్లు వాడే దుస్తుల రంగుల- గ్రహ దాన దుస్తుల రంగులని శ్రీనివాసాచారి ఇలా నవగ్రహాలే  గాకుండా సుమారుగా 36 గ్రహ మండలాలు చూస్తూ వచ్చేసరికి.... అనుకోకుండా శ్రీనివాస చారిలో శ్వాస సమస్య మొదలైసరికి.... ఆత్మయోగి గ్రహించి మౌనముగా.... అతడి సూక్ష్మ శరీరమును తమ భౌతిక దేహాలున్న భూమి మీద ఉన్న అంతర్గత గుహకి శ్రీనివాసాచారి భౌతిక దేహము దగ్గరికి వచ్చేసరికి అది విపరీతముగా ఏగ శ్వాసకి పడుతూండగా... చావు దగ్గర వచ్చినప్పుడు చచ్చేవాళ్ళు పడే మరణయాతనను తన భౌతిక దేహము పడుతోందని గమనించిన శ్రీనివాస సూక్ష్మ దేహము శరవేగముతో ఇందులోనికి యధావిధిగా వెళ్ళిపోయింది! 

కాని ఆత్మయోగి భౌతిక దేహములో ఎలాంటి మార్పులు లేకపోవడము.... భౌతిక దేహము నుండి లేస్తూ శ్రీనివాసాచారి గమనించి చుట్టూ చూస్తే... అక్కడున్న రాతి మీద ధ్యానస్థితిలో ఉన్న ఆత్మయోగి సూక్ష్మ శరీరమును తేరిపారా చూస్తూ... అంటే తనలాంటి అవసరాలని తీర్చడానికి ఈయన కాస్త భౌతిక దేహమును ఒక చొక్కా లాగా తొడుగులాగా ధరించి వాళ్ల దగ్గరికి వచ్చి- వారి అవసరాలను తీరుస్తూ... తీర్చిన తర్వాత చొక్కాను దండెమీద ఉంచినట్లుగా... తమ భౌతిక దేహాలను యోగనిద్రావస్థలో సమాధి స్థితిలో ఉంచుతూ... తాము మాత్రము యథేచ్ఛగా..విశ్రాంతిగా..ప్రశాంతముగా సూక్ష్మదేహముతో ధ్యానము చేసుకుంటూ ఉంటున్నారని.... అనుకొని ఆ గుహ నుండి బయటికి వస్తుండగా... ఇలా సూక్ష్మ దేహాలతో వరుసగా ఆత్మ ధ్యాన నిష్ఠలో ఉన్న ఆత్మయోగులుగా వరుసగా శ్రీ త్రైలింగస్వామి, శ్రీలాహిరి, కాలారామ్ లాంటివారు అలాగే తనకి తెలియని ఎందరో మర్మయోగులు ధ్యాన నిష్ఠలో కనిపిస్తుండేసరికి వారికి అందరికి నమస్కారాలు చేసుకుంటూ శ్రీనివాస చారి స్థూల శరీరముతో ఆ గుహ నుండి బయటికి వచ్చాడు!

ఇంతడి మహత్తర అవకాశము కల్పించిన శనిభగవానునికి, ఆత్మయోగి పరమహంస పవనానంద స్వామికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ.... పూర్వీక భారతీయ మహర్షులు కనుగొన్న సత్యాలను... మనకి వరాలుగా ఇచ్చారని.... ఇవి అసత్యాలుగా కనిపించే సత్యాలు ఇలాంటి సిద్ధి ఉన్న పురుషులందరికి గూడ కృతజ్ఞతలు చెప్పుకుంటూ.... తన ఊరికి ఆనందముగా బయలుదేరాడు!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

మోక్షనంది-ఆత్మకథ

పవన్....
గుడిలో పూజారి అయిన గూడ
ఏదో మ్రొక్కుబడిగా...ఒక ఉద్యోగ బాధ్యతలాగా శివాలయములోని విగ్రహాలకి అభిషేకాలు , పూజలు చేస్తూ... జనాల పిచ్చికాని! ఎవరో చెక్కిన రాతి విగ్రహాలకి...ఏవో మంత్రాలు పెట్టి ప్రతిష్టలు చేసినంత మాత్రాన రాతివిగ్రహాలు దైవ మూర్తులు అయిపోతాయా? నా బొంద! నా బూడిద! ఎవడో గాని తన బ్రతుకుతెరువు కోసము ఈ భక్తి వ్యాపారము మొదలు పెట్టి ఉంటాడు! దీనినే తరతరాలుగా తరగని ఆస్తిగా వారసత్వము పేరుతో ఆలయ పూజారులు కొనసాగిస్తున్నారు! అడిగే వాడులేడు! ఉన్నవాడు పట్టించుకోడు! ఉన్నాడో లేడో తెలియని దేవుడి పేరుతో జనాలు ఇచ్చే డబ్బులతో హుండీలు నింపుకుంటూ తమ కడుపులు నింపుతున్నారు! అనుకుంటూండగా  ఆ గుడిలోనికి ఒక బైరాగి కాస్త ప్రవేశించి మౌనముగా శివదేవుడైన శివలింగమూర్తిని , రాతి విగ్రహ అమ్మవారిని దర్శనము చేసుకొని బయటికి వచ్చి ధ్యాననిష్ఠలో కూర్చున్నాడు!
                     పవన్ కాస్త పూజ ముగించుకొని గుడి ఆరు బయటకి వచ్చి చూస్తే ధ్యానములో ఉన్న బైరాగిని చూడగానే...."వీళ్లు ఒకళ్ళు! చేసే బాధ్యతలకు భయపడి సన్యాసము పేరుతో సన్నాసిగా మారి జనాలను తమమాటలతో చేష్ఠలతో బోల్తా కొట్టించి వారిని ఆశపెట్టి లేదా భయపెట్టి డబ్బులు గుంజుతారు! లోపల ఉన్నవాడు మౌనముగా గుంజితే....వీళ్లు నాలుగు మాటలు చెప్పి గుంజుతారు! పాపము ఈ బైరాగికి పేరు ప్రతిష్టలు రాలేదేమో!లేకపోతే ఇంత తాపీగా కూర్చొని ధ్యానము ఎందుకు చేస్తాడు! రాబోయే కాలములో కాబోయే మహాస్వామిజీ అవతారమెత్తే వాడిలాగా ఉన్నాడు!" అనుకుంటుండగా... బైరాగి కళ్ళు తెరిచి "నాయనా!పవనా! నేను అందరి లాంటి వాడిని కాను! అందరితోనూ ఉంటూ ఎవరికి అందని స్థితిలో ఉంటాను! ఏదో సాధన సత్ సాంప్రదాయము ప్రకారము తీర్ధ యాత్ర పేరుతో ఊరిలో మూడు రోజులు మించకుండా సాధన చేస్తూ....సర్వసంగ పరిత్యాగిగా మారినాను! వినేవాళ్ళు ఉంటే మా ధ్యాన అనుభవాలు లేదా మేము చూసిన యదార్ధ సంఘటనలు లేదా మాకు తెలిసిన వింతలు విచిత్రాలు చెప్పి వెళ్లిపోయేవాడినే! అంటుండగా....

స్వామి! మీరు సాధన చేసి ఏమి సాధించారు? 

నాయనా! సాధించడానికి ఏముంది! సాధనలో వచ్చేది లేదు! పోయేది లేదు! పొందేది లేదు! మౌనము తప్ప!

చూసినవాడు చెప్పడు! చెప్పేవాడు చూసినట్టు కాదు అన్నమాట!

అవును కాని! పవన్! దైవ విగ్రహాలను బట్టలు ఉతికినట్లుగా ఏదో మొక్కుబడిగా అభిషేక పూజలు చేస్తున్నావు?

స్వామి! అసలు రాతి విగ్రహాలకి దైవశక్తి ఎలా వస్తుంది! ఎలా ఉంటుంది! జనాలని పిచ్చివాళ్ళని చెయ్యటానికి కాకపోతే....

పిచ్చివాడా! అలా ఎప్పుడు అనుకోకు!పూర్వము మంత్రసిద్ధి పొందిన సిద్ధ పురుషులు చూపుతో బొడ్డురాయి గూడ అమ్మవారు అవుతుంది! ప్రేతశక్తిని గూడ దైవశక్తిగా మార్చగలరు! సజీవ మూర్తులను గూడ దైవ మూర్తులుగా మార్చగలరు! అంతెందుకు! నా చిన్నప్పుడు నా జీవితములో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఒకటి చెపుతాను జాగ్రత్తగా విను!

     మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామము! ఈ గ్రామములో జరుపహరేశ్వర స్వామి శివాలయము ఉంది! జర + అపహర + ఈశ్వర స్వామి అంటే వ్యాధుల నుంచి రక్షించే స్వామిగా కీర్తి గడించాడు! ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే...ఈ ఆలయ ప్రధాన గోడ వెనుక వైపుకి వెళ్ళితే ఒక చిన్న రంధ్రము కనబడుతుంది! ఈ రంధ్రము గుండా చూస్తే 50 అడుగుల దూరములో ఉండే మోక్షనంది చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనబడుతుంది! మాములుగా చూస్తే నంది కాస్త దూరముగా ఉన్నట్లుగా కనబడుతుంది.ఇప్పుడు ఈ దేవాలయ మోక్షనందికి సంబంధించిన యదార్ధ సంఘటన గూర్చి నీకు చెప్పపోతున్నాను! దీని జన్మ వివరాలలోనికి వెళ్ళితే....

                మా ఊరిలో పూర్ణయ్య సిద్ధాంతిగారు ఉండేవారు! ఈయనకి వాస్తు , జ్యోతిష్య శాస్త్రాల యందు మంచి పట్టు , వాక్సుద్ధి ఉంది! చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది! ఈయన ఒకసారి ఈ శివాలయములో కూర్చొని తన జాతకమును తానే చూసుకుంటూ... తనకి మోక్షమిచ్చే దైవము ఎవరా అని ప్రశ్నించుకోగా....మరి కొన్ని గంటలలో ఈ ఊరిలో దక్షిణ భారతదేశములో ద్వాదశాదిత్యులు వలె సుప్రసిద్ధులయ్యే 12 మంది బసవన్నలలో ఒక నందీశ్వరుడు , ఒక ఎద్దు రూపములో ఈ గ్రామములో పుట్టపోతున్నాడని...ఈ అవతార పురుషుడి చేతిలోనే తనకి మోక్షము కలుగుతుందని ఈయన గ్రహించాడు! దానితో ఈయన ఈ గ్రామ వీధులలో మహత్తర జన్మముకు కారకమైన గోవు కోసము వెతకడము ప్రారంభించాడు! ఒక వీధిలోనికి ప్రవేశించగానే అక్కడ ఒక కపిలగోవు ప్రసవ వేదన పడుతున్న దృశ్యము కనిపించేసరికి... ప్రశ్న జాతకము వేసుకోగా... తన లగ్నానికి మోక్ష స్థానము పైన అయిదు శుభ గ్రహాలు శుభదృష్టికి మరి కొన్ని క్షణాలలో ఇవ్వపోతున్నాయని.... ఇట్టి మహోన్నత లగ్నములోనే మోక్షనంది జననము గూడ జరగపోతోందని తెలియగానే ఈయనకి బ్రహ్మానందమైంది!

ప్రసవవేదన పడుతున్న గోవు చుట్టు జనాలు నెమ్మది నెమ్మదిగా పోగుపడుతున్నారు! ఈ కపిలగోవు చుట్టు కొంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నారు! ప్రసవ సమయం దగ్గర పడింది! పూర్ణయ్య సిద్ధాంతి మాత్రము ఆవు దగ్గరికి వెళ్లి అక్కడ దీనికి సేవ చేస్తున్న దీని యజమాని దగ్గరికి వెళ్లి "నాయనా! నీ గోవు మహత్తర కోడె దూడకి జన్మ ఇవ్వబోతోంది ! అది ఇలాంటి అలాంటి ఎద్దు గాదు! సాక్షాత్తు పరమేశ్వరుడి నందియైన బసవేశ్వరుడే ఈ రూపములో జన్మ పొందుతున్నాడు! దీనిని చాలా జాగ్రత్తగా చూసుకో! ఈనాటి నుండి దీనిని ఊరికి దత్తత ఇవ్వాలి! దీనికి కావలసిన మేత , సదుపాయాలకి గావాలసిన డబ్బులు నేనే నీకు ఇస్తాను! అంటుండగా... ఈ గోవు కడుపు నుండి దూడ కొద్ది కొద్దిగా బయటికి రాసాగింది! రాను రాను పూర్ణయ్య కళ్ళు విశాలము అవుతున్నాయి! ఆవు యజమాని దీని వీపుపై రాస్తూ మాటలతో ఈ ఆవుకి ధైర్యము చెపుతున్నాడు! అంతలోనే దూడ బయటికి వచ్చింది! లెగాళ్లతో లేచి నుంచోవడానికి ప్రయత్నాలు చేస్తుంది! కానీ పూర్ణయ్య సిద్ధాంతి గారి చూపు.... ఈ పుట్టిన దూడపైన ఏమైనా దైవిక గుర్తులున్నాయోనని వెతకగా... దీని పృష్ఠ భాగములో మహాభోగాలు అనుభవించే పద్మాకార సుడిగుర్తు ఉండటము గమనించి... అయితే తన జాతక ఙ్ఞానస్ఫురణ నిజమేనని అనుకుంటున్న సమయములోఅనుకోకుండా ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి "స్వామి! నేను కాశీకి వెళ్ళినపుడు మీకోసము 10 లీటర్ ల కాశిగంగ నీళ్లు తెమ్మని చెప్పినారుగదా! ఇవిగో గంగనీళ్లు అంటూ నీళ్ల డబ్బా ఇవ్వపోతూంటే".... ముహూర్త బలము అంటే ఇదే అనుకుంటూ... తెచ్చిన గంగనీళ్లు కాస్త అప్పుడే పుట్టిన లేగదూడకి అభిషేకము చేసి... దానికి స్నానాలు చేయించినారు! ఆ తర్వాత ఇది కాస్త తల్లి పొదుగు దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది!

                  కాలచక్రము తిరిగింది! ఈ కోడెదూడ కాస్త యవ్వనములోనికి అడుగు పెట్టింది! ఉత్తమ లక్షణాలతో ఎనిమిది అడుగుల ఎత్తున్న నిలువెల్లా కోడె తనముతో... చారడేసి కళ్లతో... ఈ కళ్ల చుట్టు కాటుక పెట్టినట్లుగా నల్లటి రేఖలతో... ఉన్నతమైన మూపురముతో....సహజ సిద్ధ మెరుపు యున్న గిట్టలతో... శంఖ , పద్మాకార సుడులతో సాక్షాత్తు వృషభేశ్వరునిగా రూపము సంతరించుకుంది! దానితో వైదిక క్రతువులన్నింటిలో మహోత్క్రుష్టమైన 'వృఫోత్సర్జన' అనగా ఆంబోతుకి అచ్చు పోయడము అంటారు! ఈ కార్యక్రమము పూర్ణయ్య సిద్ధాంతి గారు తన సొంత ఖర్చుతో అంగరంగ వైభవముగా జరిపించినారు! అంటే దీని తోకకి రెండు వైపులా శంఖు చక్ర ముద్రలు వేయించి మోక్షనంది అను నామముతో ఆంబోతుగా వదిలి పెట్టారు! ఆనాటి నుండి ఈ మోక్షనందికి తిరుగు లేకుండా పోయింది!పుట్టింది మొదలు దీని ముక్కుతాళ్లు ఎరుగదు!ఏ  వేళప్పుడు  ఏ వీధిలో అడుగుపెట్టినా ఆ వీధిలోని వారంతా దీనికి  ఏదో ఒకటి అంటే శనగలు , బెల్లం , పత్తిగింజలు , వడ్లు , బియ్యము , కందులు ఇతర ఆహారాలు , ఆకుకూరలు ఏది పెట్టిన దిట్టముగా పెట్టేవారు! ఇది గాకుండా ఇది ఈ గ్రామ పొలిమేరలలో పొలాలన్నీ దీనివే! ఎక్కడ ఏ చేనులో మేసిన ఎవ్వరు కొట్టేవారు గాదు! తిట్టేవారు గాదు! అదిలించేవారు గాదు! అసలు బంధించేవారు గాదు! దానితో ఇది కాస్త రాజ భోగాలు అనుభవిస్తూ... తన వెంటపడే గోవులకి గర్భదానము చేస్తూ పశు సంతతిని అమితముగా పెంచసాగింది!

         రాను రాను ప్రజలలో దీనియందు భక్తి పెరగసాగింది! శెనగలు పెడితే గురు అనుగ్రహము కల్గి సంతాన వంతులు అవుతారని... గోధుమలు పెడితే సూర్య అనుగ్రహము కల్గి ఆరోగ్యవంతులు అవుతారని , తోటకూర బెల్లము కలిపిన నల్ల నువ్వులు కొంతమేర పెడితే శని గ్రహదోషాలు పోతాయని జనాలలో ప్రచారము పెరగసాగింది! దానికి తగ్గట్లుగానే అందరికి సత్ ఫలితాలు కలుగుతూండేవి! దానితో ప్రజలే ఇది ఎక్కడ ఉన్న వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళ కోరికలకు  తగ్గట్లుగా దీనికి ఆహారమును అందించేవారు! దీనికిఇష్టమైతే వీటిని తిని వాళ్ళ కోర్కెలు తీర్చేది! లేదంటే కాళ్ళగిట్టలతో ఈ ఆహారాలు చేటలు తొక్కేసి వెళ్లిపోయేది! దానితో వీళ్ళు అనుకున్న కోరికలు తీరేవిగావు! దీనివలన ఆనాడు వీరశైవ , వీరవైష్ణవ మతాల ఉదృతి తగ్గి.... కొత్తగా బసవేశ్వరుడు  అదే బసవ మతమునకు నాంది అయింది! దేవుళ్లను పూజించడము మాని దేవుడి వాహనమైన నందీశ్వరుడిని ఒక దైవముగా బసవేశ్వరుడిగా కొలవడముతో ఈ మతము మొదలైంది! దానితో ఈ నంది  యౌవన  కాలమంతాగూడ భక్తితో కొలిచిన వారి కామ కోర్కెలు తీర్చడము అలాగే యోగుల తపస్సుకి మెచ్చి మోక్షప్రాప్తి ప్రసాదించడముతో పూర్తి అయింది!

      దీనికి వయస్సు పెరగసాగింది! దానితో పాటుగా రాను రాను  దీనిలో అసహనము , ఆవేశము విపరీతముగా పెరగసాగింది! యేటి ఒడ్డుకి వెళ్లి యేటిగట్లు తెగిపడేలాగా కొమ్ములతో , గిట్టలతో రక్కుతూ...పొడుస్తూ... ప్రవహించే ఏరుల దిశలు మార్చేసేది! దానితో నీటి వసతి అందని పొలాలకి నీళ్లు అందుతుండేవి! మరొకసారి నగర వీధులలోనికి నీళ్లు వచ్చి ఇల్లు , వాకిళ్లు మునిగిపోయేవి! దీని వెర్రి ఆవేశానికి జనాలు నెమ్మది నెమ్మదిగా భయపడసాగినారు! దీని వలన దీని ఆవేశము వలన పంటలకి నీటి వసతి కలిగి ఊరంతా పచ్చదనముగా మారుతుండేసరికి భయముతో గూడిన గౌరవ భక్తి భావము దీని యందు జనాలకి రెట్టింపు అయింది! వందలాది శ్రామికులు చెయ్యలేని పనిని... ఈ నంది కాస్త వీర్రావేశముతో తన గిట్టలతో , కొమ్ములతో యేటి పాయలను సరిచేసి పంటలకి నీరు అందిస్తూ....ఇది సాధిస్తున్న విజయాలకి ప్రజలు బ్రహ్మరధం పెట్టేవాళ్ళు! ఆరాధన భావము పెంచుకొనేవాళ్ళు! కానీ దానికి పెరుగుతున్న వీర్రావేశానికి దీని దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్లు! ఇలాంటి స్థితి... పరిస్థితి ఉన్న మోక్షనంది దగ్గరికి వయస్సు పైబడిన ముసలి తనముతో.... చేతి కర్ర సాయముతో ఒకసారి పూర్ణయ్య సిద్ధాంతి గారు సమీపించి పత్తివిత్తనాలు , బెల్లము కలిపిన బియ్యమును తన చేతితో దీనికి పెట్టి.... గంగడోలు దువ్వుతూ "నాయనా! బసవేశ్వరా! నన్నురమ్మని నీ శివయ్య పిలుస్తున్నాడు! మరి నీవు అనుజ్ఞ చేస్తే ఆయన సన్నిధికి వెళ్తాను! ఏదో ఒకనాడు ఇద్దరం.....అక్కడ కైలాసములో కలుసుకుందాం! ఏమంటావు.... అనగానే... మోక్షనంది 'అవును' అన్నట్లుగా తల ఊపింది! ఆ రాత్రికే ఈయన కాస్త గుండెనొప్పితో శివసాయుజ్యం పొందినారు!

           ఇది జరిగిన కొన్ని రోజులకి ఈ గ్రామములోనికి హజరత్ పాషా అనే సిద్ధ పురుషుడు వచ్చి స్థిర నివాసము ఏర్పరచుకున్నారు! క్రమంగా ఈ మహాత్ముడి మహత్తు గూర్చి జనాలకి తెలియడముతో కోర్కెలు తీర్చుకోవటానికి ఈయన ఉన్న ఇంటికి క్యూ కట్టేవారు! దానితో ఈయనకి నిత్యము చేసుకొనే అల్లాహ్ ధ్యాన జపానికి విపరీతముగా అడ్డంకి మారినది! దీనికి తోడు ఎపుడైన ఈయన ధ్యానానికి కూర్చునే సమయములో ఎవరో చెప్పినట్లుగా మోక్షనంది ఈయన ఇంటి ముందుకి వచ్చి పెద్దగా రంకెలు వేస్తూ ధ్యానానికి గావాలని అవాంతరాలు కల్గించేది! దానితో ఈయనకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారేది! దీనికి ముకుత్రాడు వెయ్యడానికి ఈయన బయటికి వచ్చేసరికి అప్పడిదాకా రంకెలు వేసే ఈ నంది కాస్త ఏటో తుర్రుమని పారిపోయేది! ఎప్పుడైతే ఈయన ఇంటిలోనికి వెళ్ళినాడో... వెనువెంటనే ఇంటి ముందుకి వచ్చి తన రంకెలతో ఈయనతో దోబూచులాట ఆడేది! దీనికి సరదాగా ఉండేది! ఆయనకేమో చికాకుగా ఉండేది! ఇలా వరుసగా ఇదే తంతు వారం రోజులపాటు వీరిద్దరి మధ్య జరిగింది!

       దానితో ఒక పౌర్ణమినాటి మధ్యాహ్నము దీనికి విపరీతమైన భయంకర మహాపిచ్చి వీర్రావేశము కల్గింది! ఈయన ఇంటి ముందు చిందులు తొక్కసాగింది!దీని వీరంగము శృతి మించడముతో ఎలాగైనా ఈరోజు దీనికి ముకుత్రాడు వెయ్యాలని పాషాగారు అనుకొని దట్టమైన త్రాడుతో ఇంటి బయటికి రాగానే...ఈ నంది కాస్త ఈయనను కవ్విస్తూ పరుగు లంఘించుకుంది! అగ్రహారానికి అటు చివర ఉన్న ఏటిపాయ దగ్గరికి ఈ నంది చేరుకొని గండి కొట్టడం ప్రారంభించింది! ఈ గట్టు తెగితే అగ్రహారం అంతా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉండటంతో జనాలు అంతా ఈ నంది ఉన్నచోటుకే చేరి హారతులు ఇస్తూ శాంతపడమని కోరుతున్నారు! ఇంతలో అక్కడికి పాషాగారు చేరుకొని  ఈ నందికి ఎదురుగా నిలబడి నంది మెడను బిగించడానికి వీలుగా ఒక త్రాడును పట్టుకొని దానిమీద ఎన్నోసార్లు విసరగా అనుకోకుండా ఒక్కసారిగా మెడకు బంధం పడింది! దానితో ఈ మోక్షనందికి అలాగే ఈయనకి మధ్య పోరాటం మొదలైంది! అప్పుడు ఈ నంది కాస్త అతి వేగముగా యేటి గట్టు నుండి అగ్రహార వీధుల వైపు పరిగెత్తింది! ఈ త్రాడుని బలముగా పట్టుకొనియున్న పాషాగారు గూడ అదే బలముగా ఈ త్రాడును పట్టుకొనియున్నారు! దానితో ఈయనను గూడ తాడుతో సహా ఈ మోక్షనంది  ఈడ్చుకొనిపోతుంది! దీని పరుగు వేగాలు ఆపడము లేదు! కొన్ని గంటల తర్వాత ఈ నందికి వయస్సు పైబడటముతో అలుపు వచ్చి నడక వేగము తగ్గించి...చివరికి జరాపహారేశ్వరుని ఆలయము ముందుకి వచ్చి...ఆగి...అలుపు తీసుకుంటూ... ఆ స్వామిని చూస్తూ ఆరమోడ్పు కనులతో నిశ్చలముగా నిలబడగానే... అక్కడికి చేరుకున్న పాషాగారు వెంటనే ఈ నందిని త్రాళ్లతో బంధించసాగినారు! ఇది ఏ మాత్రము ప్రతిఘటించకుండా ఆయన చేస్తున్న చర్యలు మౌనముగా చూస్తూ... తదేక దృష్టితో శివలింగమూర్తిని తేరిపారా  ఒకసారి చూసి... ఏడమ కాలిని నిలబెట్టి ఉంచి.... మిగిలిన కాళ్లన్ని మడుస్తూ కూర్చుండిపోయింది! ఈయన తాను బిగించిన తాళ్లున్నింటిని ఈ మోక్షనంది వీపుపై ముడి వేసి.... తన అంగీలో దాచి తెచ్చిన అతి మహత్తరమైన మంత్రసిద్ధి కలిగిన పంచలోహ కడియమును ఈ మోక్షనంది ఏడమకాలికి తొడిగి తొడగగానే.... అది కాస్త జీవలక్షణము కోల్పోయి... పశు జన్మ నుండి విముక్తి పొంది... మోక్షనంది కాస్త శివసాయుజ్యం పొందింది! సర్వ అలంకారాలతో... కట్టుతాళ్లతో... కాలి కడియముతో... జీవసమాధి చెంది... అచ్చంగా శిలగా మారిపోయింది! చరిత్రలో సజీవనందిగా చిరంజీవి తత్త్వముతో మిగిలిపోయింది!

ఆ తర్వాత పాషాగారు ధ్యాన నిష్ఠలోనికి కొంతసేపు వెళ్లారు! అక్కడికి చేరుకున్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఈయన కళ్ళు తెరుస్తూ " నాయనా! మీ గ్రామ మోక్షనంది  ఈరోజు శివసాయుజ్యం పొందినది! దీనికి వేసిన మంత్ర పంచలోహ కడియమున్నంతవరకు దీనివలన మీకు ఏమాత్రము ఇబ్బంది కలుగదు! కాని ఈ కడియ ప్రభావము 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది! ఆ తర్వాత ఇది దొంగలించబడుతుంది! దానితో ఇది బంధ విముక్తి పొంది ఆత్మయోగి పరమహంస పవనానంద అనుగ్రహ ప్రాప్తితో... భూలోకమునుండి కర్మవిముక్తి చెంది బొందితో కైలాసము చేరుకుంటుంది! అప్పడిదాకా ఇది ఈ దేవాలయమునందు మోక్షనందిగా... జీవనందిగా.... రాజనందిగా... పేరు ప్రఖ్యాతలు పొంది కామకోరికల  నుండి మోక్షప్రాప్తిని అనుగ్రహించును! ఇంతటితో నేను వచ్చిన నా కర్మనివారణ పని పూర్తి అయింది! ఇక నేను ఈ గ్రామము విడిచి వెళ్లే సమయము ఆసన్నమైంది అంటూ అందరిని దీవిస్తూ ఆయన అక్కడనుండి మౌనముగా బయలుదేరి వెళ్ళిపోయినారు!

 

     ఇది జరిగిన 100 సంవత్సరాలకి అనగా 28 /07 /2012 రోజున ఈ మోక్షనందికి పాషాగారు అమర్చిన మంత్రయుత పంచలోహ కడియము దొంగలించబడింది! ఈ నంది ఎడుమకాలు కోసి ఈ కడియాన్ని దొంగలించగా... ఈ కాలి నుండి రక్తము ఏకధారగా స్రవించింది! మాంసపు ముద్ద కన్పించింది! మాంసపు వాసన వచ్చింది! భక్తుల కోరికమేర ఆధునిక టెక్నాలజీతో విరిగిన దీని ఏడుమకాలును అతికించి దీనికి మరో కడియమును అమర్చినారు! ఇది జరిగిన ఆరోజు ఊరిలో దాదాపుగా నాలుగు ఆంబోతులు అకారణముగా చనిపోవడము జరిగింది!ఈ విషయాలు ఆరోజు దినపత్రికలో పడినాయని... పవన్ కి ఆ బైరాగి న్యూస్ పత్రిక చూపించేసరికి.... పవన్ కి నెమ్మదిగా బుర్ర తిరగడము మొదలైంది! అంటే విగ్రహాలలో ప్రాణశక్తి ఉంటుందని... రాళ్ళల్లో గూడ పంచభూత శక్తి సహజ సిద్ధముగా ఉంటుందనే విషయాన్ని తాను ఇన్నాళ్లుగా గుర్తించనందుకు బాధపడుతూ తను నిత్యము పూజించే శివలింగము అలాగే నందీశ్వరుడి కేసి చూడగా... ఒక క్షణము పాటు అవి సజీవ మూర్తులుగా లీలా మాత్రంగా కనిపించేసరికి.... మాటలకి అందని అద్వితీయ ఆనందస్థితిలోనికి పవన్ వెళ్ళుతూండగా ఆనర్గళముగా నోటి వెంట....

నీ కళ్ళలో.... శివుడి రుద్రాక్షలు,

నీ శ్వాసలో.... శివుడి సోహం..అహం...,

నీ చూపులో..శివుడి రౌద్రం 

నీ రంకెలో ... శివుడి లయ పని

నీ ఫాలభాగం లో... శివుడి త్రినేత్రం

నీ మూత్రములో... శివుడి గంగ 

నీ మలములో ... శివుడి విభూది 

నీ చెవులలో ....శివుడి ఓంకారనాదం 

నీ వెన్నుపూసలో .....శివుడి త్రిశూలము 

నీ పాదాలలో .... శివుడి చేతులు,కాళ్ళు

నీ కొమ్ములలో.... శివుడి కొమ్ముబొర,

నీ గిట్టలలో.... శివుడి ఢమరుకనాదం,

నీ గంగడోలులో .....శివుడి మృందగం,

నీ తోకలో..... శివుడి పాము,

నీ మూపురములో..... శివలింగము 

నీ వృషణాలలో.... శివుడి వీర్యశక్తి

నీ కొమ్ముల మధ్యలో --శివసాక్షాత్కరానుభూతి


ఇలా భయపెట్టే శివతత్త్వమును 

నీ శరీరములో అణువుణు 

శివమయం చేసుకొని

భయపెట్టేభక్తుడైన 

ఓ నందీశ్వరా..ఓ బసవేశ్వరా..

పాహిమాం..

నీ శివభక్తికి ..నీ శివాంశరూపానికి 

దాసోహం..శివోహం...

నంది నుండి నందీశ్వరుడైన 

నీ శివనంది తత్త్వము ఇదే గదా....

అని స్తోత్రము చెయ్యగా...ఇది విన్న ఆ బైరాగి చిరునవ్వు నవ్వి పవన్ దీవించి...తను వచ్చినపని పూర్తి అయినది అన్నట్లుగా భైరాగి కాస్త ఆలయము బయటికి వచ్చి ఎద్దుగా మారి వెళ్ళిపోయినాడు! అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి చెంత ఉండే బసవేశ్వరుడే బైరాగిగా మారి తన గాధను చెప్పుకొన్నాడని పాపము పవన్ కి ఎన్నటికీ తెలియకుండానే దైవరహస్యముగా మిగిలిపోయింది!

-------------------శుభం భూయాత్----------------------

పరమహంస పవనానంద


గమనిక: ఇది యదార్ధ గాధ! పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామములోని జరాపహరేశ్వర స్వామి ఆలయములో ఈ మోక్ష నందిని దర్శించుకోవచ్చును! ఈ నంది కాలికియున్న కడియాన్ని చేతితో గూడ తిప్పవచును! అలాగే ఆలయానికి ప్రక్కనే హజరత్ పాషా షహీద్ మహాత్ముడి దర్గాను గూడ చూడవచ్చును! మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయము ఉంది! 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

బాల యోగిని-ఆత్మకథ
శివాని....
5 సంవత్సరాల పాప....
బాలరూప సౌందర్య రూపవతి!
పట్టులంగా....జాకెట్ వేస్తే.... అచ్చంగా సజీవ మూర్తిగా సాక్షాత్తు బాలాదేవిని చూసినట్లుగా ఉంటుంది! మాటలతో అందరిని ఆకట్టుకుంటూ చూపులతో అందరిని కట్టిపడ వేస్తుంది! అలాగే తనకి వచ్చే ధర్మ ప్రశ్నలతో అందరి బుర్ర తింటుంది! అడిగినదానికి సరియైన సమాధానము దొరికే దాకా అందరిని తన ప్రశ్నలతో వేధిస్తుంది! గాకపోతే అడిగే ప్రశ్నలు పెద్దవి.....సమాధానాలు అర్ధము చేసుకొనే వయస్సు ఈమెకి చిన్నది గావడముతో ఎలా చెప్పాలో.....ఏమి చెప్పి తప్పించుకోవాలో తెలియక అందరు ఎవరికి వారే మాకు సమాధానం తెలియదు! మీ తాతగారిని అడుగు! ఆయనకి తెలుసు అని....ఈమె అడిగే ప్రశ్నల నుండి సమాధానాలు చెప్పలేక ఈ విధంగా తాతగారి మీద పెట్టి తప్పించుకొనేవారు!

                గాకపోతే శివానికి మూడు సంవత్సరాల వయస్సులో ఒక రోడ్డు ప్రమాదములో ఈమె తల్లిదండ్రులు చనిపోయినారు! దానితో అమ్మమ్మ-తాతయ్య చెంతకు చేరినది! అనుకోని విధంగా అనారోగ్య సమస్యతో అమ్మమ్మగారు కూడా చనిపోయింది! పాపము చనిపోవడము అంటే ఏమిటో తెలియని వయస్సులో ఉన్న శివానికి ఎవరు ఎంత మంది ఓదార్చి చెప్పిన అర్ధమయ్యేది గాదు! తన తల్లిదండ్రులు, అమ్మమ్మ కనిపించరని ఇంటికి రారని చెప్పిన అర్ధము చేసుకొనే వయస్సుగాదు! వీళ్ళ కోసము రాత్రుళ్ళు నిద్రలో కలవరిస్తూ కలత చెందుతుంటే..... తాతగారి గుండె బాధతో.... ఆవేదనతో బరువెక్కేది! కానీ ఈయన మాత్రము ఏమి చెయ్యగలడు! జనన-మరణాలు కాలచక్ర పరిధిలో ఉంటాయి! పుట్టుకతో పాటే మరణము గూడ పుట్టుతుందని..... అందరికి తెలిసిన తెలియని వయస్సులో ఉన్న శివానికి తెలియదు గదా! ఇలాంటి శివానికి ఈరోజు అసలు దేవుడు అంటే ఎవరు? అనే ధర్మ ప్రశ్న వచ్చింది! దానితో ప్రొద్దుటి నుండి తనకి కనబడిన ప్రతి వాడిని ఇదే ప్రశ్నను అడిగితే కొందరు దేవుడంటే శివుడని, అమ్మవారని, విష్ణువని, గణపతియని, శ్రీరాముడని.....ఎదో వ్యక్తుల పేర్లు చెపుతున్నారని ఈమె అనుకొని తన తాతయ్య మాత్రమే దీనికి సరిగ్గా సమాధానము చెపుతాడని..... పేపరు చదువుతున్న తాతగారి దగ్గరికి శివాని వెళ్లి "తాత! తాత! దేవుడు అంటే ఎవరు? అడిగింది! తాతయ్య వెంటనే చదువుతున్న పేపర్ ను ప్రక్కన బెట్టి శివానిని తన ఒడిలోకి తీసుకొని "అంటే! ఈ రోజు నా చిన్నారికి దేవుడు అంటే ఎవరు తెలుసుకోవాలి అన్నమాట" అన్నాడు! దానికి శివాని తన చిన్న బుర్రను "అవునని" తల ఊపింది!

             అప్పుడు తాతగారు "శివాని! దేవుడు అంటే స్వార్ధములేని మంచిశక్తి ఉన్నవాడు అన్నమాట!" శివాని "తాత! స్వార్ధము అంటే ఏమిటి? మంచి అంటే ఏమిటి?" అని అడిగింది. దానికి ఈయన వెంటనే "శివాని! స్వార్ధము అంటే ఇతరుల నుండి తన అవసరాలు తీర్చుకొనే లాభాలు పొందేవాడిని స్వార్ధపరుడు అంటారు! అంటే మనము కుక్క, పిల్లి, పావురాలు, అవులు, గేదెలు పెంచుతున్నాము గదా! కుక్క ఏమి చేస్తుంది! మన ఇంటికి కాపలా కాస్తుంది! పిల్లి మన ఇంటిలోని ఎలుకలను తింటుంది! ఆవులు మనకి పాలను ఇస్తాయి! పావురాలు సందడి చేస్తాయి గదా! ఇలా ఇవి అన్నియు మనకి ఏదో ఒక విధముగా ఉపయోగపడుతున్నాయి! అదే పులిని గాని, సింహమును కాని, పాములను కాని పెంచుకుంటున్నామా? లేదు! ఎందుకంటే వీటి వలన మనకి ప్రమాదాలు జరుగుతాయి గదా! అంటే మనకి ఉపయోగపడుతూ, మనకి ప్రమాదములు కలిగించని జంతువులనే మనము పెంచుకుంటున్నాము! అంటే వీటిని మన అవసరాలకి ఉపయోగించుకుంటాము గదా! ఈ లెక్కన చూస్తే మనము ఎవరము? అనగానే శివాని వెంటనే "మనము  స్వార్ధపరులం" అంది. తాతయ్య వెంటనే "శివాని!మన ఇంటిలో శివుడి ఫోటోను ఎప్పుడైనా చూశావా? ఆ ఫొటోలో ఏమి జంతువులుంటాయో...చెప్పు" అనగానే... శివాని వెంటనే "శివుడి దగ్గర ఆవు, బొజ్జ గణపతి దగ్గర ఎలుక,అమ్మవారి దగ్గర పులి,కుమారస్వామి దగ్గర నెమలి ఉంటాయి" అంది. తాతయ్య "అయితే శివాని అన్ని బాగానే చెప్పావు గాని శివుడి మెడలో ఉన్న పాములు గూర్చి చెప్పలేదు!" అంటే శివుడు తనకి హాని కలిగించే పాములను పెంచుతున్నాడు గదా! కాని మనం పెంచడము లేదు గదా అనగానే...శివాని "తాతయ్య! అంటే శివుడికి స్వార్ధము లేనట్లే గదా! కాటు వేసే పాములను పెంచుతున్నాడు గదా అని చెప్పి...అవును "తాతయ్య! మా స్కూలులో మొన్న ఒకడు వచ్చి పాములతో ఆటలు ఆడించాడు" గదా! అంటే వాడు శివుడా? స్వార్ధము లేని వాడా? అని అడిగింది!

              దానికి శివాని అడిగిన అమాయక ప్రశ్నకి నవ్వుతూ "అమ్మా! శివాని! వాడు తన ఆకలి తీర్చుకోవటానికి పాములను ఆడించాడు! మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు గదా! అంటే తన ఆకలి కోసము పాముతో ఆట ఆడించాడు గదా అనగానే "అవును! తాతయ్య! నిజమే! మా అందరి దగ్గర ఒక రూపాయి చొప్పున తీసుకున్నాడు! వీడు గూడ స్వార్ధపరుడే అన్నమాట! అంటే దేవుడు గాదు! మనలాంటివాడే! అని చెపుతూ "తాత! స్వార్ధము లేని వాడు ఎవరైనా  ఉంటాడా? తాత వెంటనే "ఎందుకు ఉండరు! ఉంటారు!మొన్న నీవు ఒక పిల్లవాడికి నీ పుస్తకాలు ఉచితముగా ఇచ్చావు గదా! అందులో స్వార్ధము లేదు గదా! అనగానే అంటే తాత! ఇతరులకి సహాయం చేసేటపుడు వారి నుండి ఏమి తీసుకోకుండా ఉంటే స్వార్ధము గాదు అన్నమాట. మరి తాత! స్వార్ధము లేని వారిని ఏమంటారు?దేవుళ్ళా? అనగానే తాత వెంటనే "వాళ్ళని దేవుడు అనరు! నిస్వార్ధపరుడు అంటారు. అనగానే "తాత! ఇందాక స్వార్ధము లేనివాడిని దేవుడు అన్నావుగదా? అనగానే "తల్లి! స్వార్ధములేని మంచి శక్తి ఉన్నవాడిని దేవుడు అంటారు అన్నాను!" తాత! మంచి శక్తి అంటే ఏమిటి?" మంచి శక్తి అంటే మంచి మనస్సుతో నువ్వు ఏదైనా ఎదుటివాళ్ళు బాగుండాలని అనుకోవడమే మంచి శక్తి అవుతుంది! అదే ఎదుటి వాడు చనిపోవాలని, నాశనం అవ్వాలని, ఎదగకుండా కష్టాలు పడాలని, నష్టాలు పడాలని అనుకోవడమే చెడు శక్తి అవుతుంది! మంచి శక్తి ఉన్నవారిని దేవుళ్ళు అని....చెడుశక్తి ఉన్నవారిని  దెయ్యాలని అంటారు అన్నమాట! తాత! మనలో మంచి శక్తి ఉందా లేదా చెడు శక్తి ఉందా? అని ఎలా తెలుస్తుంది.....నువ్వు ఎదుటివాడి మంచి కోరితే నీలో మంచి శక్తి ఉంటుంది!అంటే నిస్వార్ధముగా ఉండాలి అన్నమాట! అదే నీలో స్వార్ధము ఉంటే చెడుశక్తి ఉన్నట్లే అన్నమాట!

మరి తాత! దేవుడు మంచి శక్తితో......నిస్వార్ధముగా ఉంటే అమ్మా, నాన్నను, అమ్మమ్మను ఎందుకు నాకు కనిపించకుండా చేశాడు! అందరు గూడ వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారని చెపుతున్నారు గదా! మరి దేవుడు స్వార్ధపరుడా? లేదా నిస్వార్ధపరుడా? అని అమాయకముగా అడిగేసరికి.... అమ్మా! శివాని! నిజానికి దేవుడికి స్వార్ధము లేదు! అలాగే నిస్వార్ధము లేదు! మంచిలేదు! చెడు లేదు! ఆయన ఎప్పుడు పసి పాప వంటి మనః స్తత్వమున్నవాడు. వీళ్లని చంపాలని... వాళ్ళని రక్షించాలని..., వీళ్లని తన దగ్గరికి పిలుచుకోవాలని...వాళ్ళని దూరంగా ఉంచాలని ఉండదు! కేవలము అన్నింటిని చిన్నపిల్లవాడిలాగా చూస్తూ ఉంటాడు! గాకపోతే మీ అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎప్పుడు గూడతమభక్తితో....భగవంతుడా!మాకు ముసలితనము రాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండావేటితో బాధపడకుండా, బాధపెట్టకుండా నీ దగ్గరికి పిలిపించుకో అని వేడుకున్నారు! దేవుడు సరేయని వీళ్లని తన దగ్గరికి పిల్చుకున్నాడు! ఇందులో మొదట దేవుడు పిలువలేదు! మీ అమ్మా,నాన్న, అమ్మమ్మ కాస్త దేవుడి దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు! మరి ఇందులో దేవుడి తప్పు ఉందా? శివాని తల అడ్డముగా ఊపుతూ "లేదు! తాతయ్య వీళ్ళు వస్తామని అంటే ఆయనే రమ్మని పిలిచాడు అంతేగదా! మన ఇంటికి చుట్టాలను పిలిస్తేనే వస్తారు గదా! అదే స్నేహితులు పిలువకుండా వస్తారు! అలా దేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్లారు అన్నమాట! అవును కాని తాత! దేవుడు ఎవరికి పుట్టారు? శివాని! దేవుడు గూడ మీ అమ్మమ్మకి.... మీ అమ్మ పుట్టినట్లుగా...వాళ్ళ అమ్మకి పుట్టాడు!ఆవిడ పేరే ....అమ్మలగన్న అమ్మ....పెద్దమ్మ! తాత పెద్దమ్మ అంటే మన గుడిలో ఉండి పెద్ద సింహము మీద కూర్చొని మూడు కళ్ళతో ఉండే ఆవిడకి పుట్టాడు కదూ!

అవును కాని తాత! పెద్దమ్మకి మూడు కళ్ళు ఉంటాయి! మనకేమో రెండు కళ్ళే ఉంటాయి గదా! మూడో కన్నుతో ఏమి చేస్తుంది!లోకాలను రక్షిస్తుంది!మనలాంటి వారిని ఎల్లప్పుడూ అందులోంచి చూస్తూ మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది! మనల్ని రక్షిస్తుంది!తాత! మనల్ని రక్షించడము అంటే ఏమిటి? ఏవిధంగా రక్షిస్తుంది.శివాని! రక్షించడము అంటే....నువ్వు ఎప్పుడు మన సముద్రపు ఓడ్డున ఉన్న ఇసుకతో ఏమి చేస్తూ ఉంటావు?తాత ఆ మట్టితో ఇల్లు కట్టి.....వాటితో గావాల్సినంత సేపు ఆడుకొని...పాత ఇండ్లను కాలితో తన్ని.....కొంతసేపు అయిన తరువాత మళ్ళి క్రొత్త ఇళ్లు కట్టుకుంటూ ఆడుకుంటాను! అవునుగదా! నీలాగే మన పెద్దమ్మ గూడ మనలాంటి మనుష్యులను, జంతువులను, మొక్కలను, మన ఇండ్లను....ఇలా ఎన్నింటినో మట్టితో చేసి...ఆడుకున్నంత సేపు మనతో ఆటలు ఆడి..... విసుగు వచ్చినప్పుడు ఈ మట్టి బొమ్మలను నాశనం చేస్తుంది! మళ్ళి క్రొత్తగా మట్టితో మనలాంటి బొమ్మలను చేసి ఆడుకుంటుంది!ఇలా మన పెద్దమ్మ మనల్ని తయారీ చేసి ఆటలు ఆడుకొనేటపుడు మన అవసరాలు తీరుస్తూ.... రక్షిస్తూ.... అవసరము తీరిన తర్వాత నాశనం చేస్తూ మరి క్రొత్త బొమ్మలను తయారు చేస్తుంది.అంటే! తాత! అచ్చంగా నేను ఆడుకున్నట్లుగా పెద్దమ్మ ఆడుకుంటుంది అన్నమాట! భలేగా ఉంది తాత!ఇందుకే చెప్పినాను గదమ్మా! దేవుడు అంటే పసిపాప మనస్సు ఉన్నవాడని! అందుకే పెద్దమ్మ కాస్త దేవత కాబట్టి నీలాంటి పసిపాప మనస్సుతో ఆటలు ఆడుతోంది! అనగానే....అవును తాత! నేను ఈ ఆటలు నాకున్న రెండు కళ్ళతోనే ఆడుతుంటే....మరి ఏమో....మన పెద్దమ్మ...ఈ మట్టి ఆటను మూడు కళ్ళతో ఎందుకు ఆడుతోంది! తొండిగదా!నాకు తెలియదు తల్లి! నీవే గుడికి వెళ్లి పెద్దమ్మను ఇదే సంగతి అడిగి చూడు! ఏమి చెపుతుందో చూద్దాం తాత! ఇప్పుడే గుడికి వెళ్లి పెద్దమ్మను అడిగివస్తాను అని చెప్పి అమాయక భక్తితో గుడిలో ఉన్న పెద్దమ్మ రాతి విగ్రహ మూర్తిని అడగటానికి నిజముగానే బయలుదేరితే..తాత గారేమో...పిచ్చితల్లి! ఆటలు ఆడుకోవటానికి ఈ నెపముతో బయటికి వెళ్లుతుందని అనుకుంటూ తిరిగి పేపరు చదవడములో మునిగిపోయారు!

                    గుడికి చేరుకున్న శివాని కాస్త అక్కడున్న నిలువెత్తు పెద్దమ్మవారి రాతి విగ్రహమూర్తిని అలాగే ఆమెకున్న మూడు కళ్ళను తదేకదీక్షతో చూస్తూ "పెద్దమ్మా! పెద్దమ్మా! నీకున్న మూడు కళ్ళతో మట్టి ఆటను తొండి చేసి ఆడుతున్నావు! నీకున్న ఈ మూడవ కన్ను నాకు ఇచ్చెయ్యి! అప్పుడు నీకున్న రెండు కళ్ళతో నాలాగా మట్టి ఆట ఆడుకో! అని హుంకరించింది ఈమె అమాయక భక్తికి పెద్దమ్మ అనుగ్రహించి విగ్రహ పెదవులు ఆడిస్తూ "అయితే శివాని! ఈ క్షణమే నాకున్న మూడవ కన్ను నీకు ఇస్తున్నాను! మరి నీవు ఈ మట్టి ఆటను ఎలా ఆడతావో నాకున్న రెండు కళ్ళతో చూస్తాను అంటూ...తన మూడవ నేత్రము నుండి దివ్యకాంతి బయలుదేరి....శివాని... భ్రూమధ్య స్థానములో అనగా త్రినేత్రస్థానములోనికి ఈ కాంతి పుంజము చేరినది! ఆ క్షణము నుండి శివానికి మూడో నేత్రము సహజ సిద్ధముగా తెరుచుకుంది! అంటే ఈ కాంతి భాగము నందు దివ్య దీప కాంతి లాగా తనకి మాత్రమే కనపడేటట్లుగా పెద్దమ్మ అనుగ్రహించింది! పాపము త్రినేత్రము అంటే ఏమిటో తెలియని శివాని కాస్త బొట్టు పెట్టుకొనే ప్రాంతములో ఏదో మెరుస్తూ కన్నులాగా కనపడేసరికి అమిత ఆనందపడుతూ "పెద్దమ్మ! నాకు తన మూడవ కన్ను ఇచ్చింది! అంటూ సంతోషముగా ఎగురుకుంటూ గుడి బయటికి పరిగెత్తుకొని వెళుతూ అక్కడ తన స్నేహితులు కనపడితే ఆటల ధ్యాసలో పడిపోయి తన మూడవ నేత్రము గూర్చి మర్చిపోయింది! గాకపోతే తనకి అవసరమైనప్పుడు అనుకోని విధంగా....ఎవరికి కనిపించకుండా... తనకి మాత్రమే కనబడుతూ జరగబోయే దృశ్యాలను చూపిస్తుందని పాపము శివానికి గూడ తెలియదు! ఇలా భవిష్యవాణి చెప్పే మూడవ కన్ను తనకి వరముగా లేదా శాపముగా మారుతుందో గూడ తెలియని స్థితిలో నిద్రలో జారుకుంది! తాతగారి ఒడిలో...

                  అనుకోకుండా ఒకరోజు తాతగారితో కలిసి శివాని ఆ ఊరి జాతరకి వెళ్ళింది! కావలసిన బొమ్మలు కొనుక్కొంది! ఆడవలసిన ఆటలు ఆడింది! రాతి దేవుడిని చూసింది! దేవుడి ప్రభలు చూసింది! కొబ్బరికాయ కొట్టింది! బాగా అలిసిపోయి తాత గారి భుజము మీద నిద్రలోనికి జారుకుంది! ఇంతలో ఈమె మూడో కన్ను ఒక దీపకాంతిలానేతెరుచుకొని ఏదో లారీ లాంటి వాహనముతో....అమ్మ, నాన్న ప్రయాణించే కారును గుద్దినట్లుగా...ఆ డ్రైవరు ముఖము చాలా పెద్దదిగా వికృతిగా కనిపించేసరికి...ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడి... లేచి...తాను ఎక్కడ ఉన్నదో అర్ధముగాక... తాత-తాత అని పెద్దగా అరిచేసరికి.... అమ్మా! శివాని! నీవు నా భుజము మీదే ఉన్నావు తల్లి!పడుకో! నిద్రవస్తుంది! మనింటికి కొద్దిసేపటి కల్లా వెళ్ళిపోతాము! భయపడకు! నేను ఉన్నాను గదా అంటూ బుజ్జగించేసరికి...సరే తాత! పడుకుంటాను అంటూ... తాత భుజము మీద తలవాలుస్తూ.. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళను పెద్దవి చేస్తూ "తాతా! అదిగో నాకు కలలో కనిపించిన వ్యక్తి! ఇప్పుడే కనిపించాడు! వాడే అమ్మ,నాన్నను చంపినాడు! వాడే తాత! వాడిని కొట్టు అంటూ పెద్దగా అరుస్తూ నన్ను క్రిందకి దింపు! వాడిని కొట్టి వస్తాను అంటూ మారాము చేసేసరికి....అసలు శివాని ఏమి మాట్లాడుతుంది... ఎవరిని చూసి ఎవరు అనుకొంటుంది...తన తల్లిదండ్రులను చంపినవాడా? వాడు జైలులో ఉన్నాడుగదా!మరి ఇది ఏమిటి? ఎవరినో చూపించి అమ్మ,నాన్నని చంపినవాడిని కొట్టు అంటోంది అనుకుంటూ శివాని చూపించిన వ్యక్తి దగ్గరికి తాతయ్య వెళ్ళగానే వాడి ముఖములో భయాందోళనలు కనపడటము తాతయ్య గ్రహించి అంటే శివాని తల్లిదండ్రుల విషయములో ఏదో జరిగినదని అప్పుడు ఆయనకి సందేహము వచ్చి అక్కడే నిలబడి బిగిసిపోయిన ఆవ్యక్తిని పట్టుకొని "ఒరేయ్! ఎవడివిరా! మా మనవరాలికి నీకు సంబంధము ఏమిటిరా? ఎక్కడైనా దీనిని చూశావా? నిజము చెప్పు? లేదంటే పోలీసులను పిలుస్తాను" అని బెదిరించగానే....వాడు వెంటనే "అయ్యా! అంతపని చెయ్యకండి!పెళ్ళాము పిల్లలున్నవాడిని!మీ మనవరాలు నాకు తెలుసు కాని ఆమెకు నేను తెలియదు ఎందుకంటే ఈమె తల్లిదండ్రులకి కారు ప్రమాదము అనుకోకుండా నా లారీతో నేనే చేశాను! కాని హత్యను నా క్రింద పని చేసే క్లీనర్ కి  డబ్బులు ఇచ్చి వాడి మీదకి వచ్చేటట్లు చేశాను! ఈ విషయము నాకు తప్ప ఇంక ఎవరికి తెలియదు! మరి మీ మనవరాలికి ఎలా తెలిసినదో నాకు తెలియదు! నన్ను క్షమించండి అంటూ వాడు తాత చెయ్యి ఒడుపు నుండి తప్పించుకొని పారిపోయాడు! అంటే శివానికి ఈ విషయము ఎలా తెలిసింది! అప్పుడప్పుడు తనతో చెప్పే మాట అంటే తాత! నాకు పెద్దమ్మ తన మూడో కన్ను ఇచ్చిమట్టి ఆటను ఆడుకోమంది అని చెప్పే మాటలు కొంపతీసి నిజము కాదు గదా అనుకుంటూ....అక్కడే నిలబడి భయపడుతున్న అమాయక శివానిని తీసుకొని తాతగారు అయోమయముగా అర్ధముకాని స్థితిలో తన ఇంటికి చేరుకున్నాడు!

             కొన్ని రోజుల తర్వాత ఇంటిలో జరిగిన దొంగతనము గూర్చి...దొంగ గూర్చి తన త్రినేత్రము ముందు కనిపించిన దృశ్యముతో చూసి....కాపలాకాసే కుక్కగూడ కనిపెట్టలేని దొంగను...పోలీసులు గూడ చేధించలేని ఈ దొంగతనము కేసును... సాక్ష్యాధారాలతో ఆ దొంగను పట్టించి చూపించేసరికి తాతగారిలో ఆలోచన మొదలైంది! అంటే అమ్మవారి అనుగ్రహము వలన శివానికి త్రినేత్రము తెరుచుకుందని అప్పుడు కాని ఆయనకి నమ్మకము రాలేదు! దానితోపాటు భవిష్యవాణి వరము వలన శివానికి ఏమి కష్టనష్టాలు వస్తాయోనని అనుమాన భయము మొదలైంది! ఇది నిజము చేస్తూ ఒకరోజు పనివాడిని చూస్తూ శివానికి త్రినేత్రము తెరుచుకొంది! అప్పుడు ఆ రాత్రికి పాము కాటుతో చస్తున్నట్లుగా లీలా దృశ్యము కనిపించే సరికి... అమాయకముగా వాడితోనే శివాని "ఒరేయ్! నువ్వు ఈ రోజు రాత్రి పాము కాటుతో చచ్చిపోతున్నావు" అనగానే.... వాడిలో ప్రాణభయము మొదలై చేసే పని గూడ మధ్యలోనే  ఆపివేసి...తాతగారికి ఇదే విషయము చెప్పి ఇంటికి వెళ్లి పెళ్లాముతో చెప్పి మంచము ఎక్కి పడుకున్నాడు! వీడికి ఏమి జరగకూడదని అక్కడేమో తాతయ్యగారు మనస్సులో అమ్మవారి స్తోత్రాలు చేస్తూ ఈ రాత్రి సమయములో వాడి మరణ వార్తను, ఎప్పుడు వినవలసి వస్తుందోనని భయపడుతూ వచ్చే నిద్రను ఆపుకుంటూ...ఇంటి వరండాలో వేసియున్న కుర్చీలో కునుకు పాటు పడుతున్నాడు! జరిగేది జరుగక మానదు గదా! ఇంటి చూరులోంచి ఒక పాము పిల్ల ఆ పనివాడి మీద పడి తల మాడు భాగములో కాటు వేసింది! వాడు నిద్రలోనే కన్నుమూశాడు! ఈ విషయము రాత్రికల్లా తాతయ్య చెవికి చేరినది! ఈయన గుండె గూడ ఆగిపోయింది! తాత గారి దహన సంస్కారాల కోసము.... ఈయన ఆస్తులు పాస్తులు కోసము.. శివానిని చూసుకోవటానికి బాబయ్య- పిన్ని వచ్చి ఈ ఊరిలో స్థిరపడిపోయినారు! రాను రాను శివాని చెప్పే భవిష్యవాణికి అందరు భయపడి పోసాగినారు! పాప ఏ క్షణములో ఏమి మాట్లాడుతుందో భయపడి పనికి రావడము అందరు మాని వెయ్యడము బాబయ్యకి కించిత్తు బాధవేసింది! పాపము! శివాని గావాలని అనడము లేదని.... ఏదో తెలిసి తెలియని వయస్సులో ఉన్న మనః స్తత్వముతో  ఏదో చెపుతూంటే అవి నిజముగా జరుగుతున్నాయని ఊళ్ళో వాళ్ళకి ఎంత నచ్చచెప్పినా ఎవరు ఈయన మాటలు పట్టించుకొనే స్థితిని దాటిపోయినారు! శివానిని చూస్తూ శని నోరు ఆ నోటితో ఏమి అంటే అది జరిగిపోతుంది! తాతకి బదులుగా ఇది చచ్చిపోయి ఉంటే మన ఊరికి పట్టిన శని పోయేది గదా అని శివానిని అంటుంటే...అర్ధము చేసుకొనే వయస్సుకి వచ్చిన శివాని చాలా బాధపడేది! తన భవిష్యవాణిని ఆపడము తన చేతుల నుండి ఎప్పుడో దాటిపోయిందని...జరిగేది జరుగక మానదని..జరగనిది ఎన్నడికి జరగదని తెలుసుకొని.... ఈ భవిష్యవాణి చూపించే త్రినేత్ర దృశ్యాలు ఎలా ఆపాలో... తెలియక చాలా రకాలుగా అవమానాలు పొందడము శివానికి అలవాటు అయ్యింది! రాను రాను ఆ ఊరి ప్రజల వేధింపులు శివానిలో ఏదో తెలియని భయాలు కల్గించడము ప్రారంభించినాయి! ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులకి దారి తీసినాయి! ఏ పెద్దమ్మతల్లి అయితే తనకి త్రినేత్రము ఇచ్చినదో... ఆ తల్లి ఉన్న గుడిలోని కోనేరులో ఆత్మహత్య చేసుకొని శివాని తనువు దాల్చినది! శవ సంస్కారాలకి ఎవరు గూడ ముందుకి రాకపోయేసరికి వయస్సు వచ్చిన శివానిని ఒక చిన్న పాపలాగా తన రెండు చేతులలో బాబయ్య పెట్టుకొని శవదహన సంస్కారాలు చేసే దుస్థితికి శివాని శవము స్మశానము నకు చేరుకుంది! అక్కడ ఈమె పార్థివ దేహానికి శవ సంస్కారాలు బాబయ్య ఒక్కడే చేసినాడు!

              గాకపోతే శివాని చనిపోతూ ఎలాగైనా తనకి వచ్చిన భవిష్యవాణి చెప్పే శక్తి తనకి మరుపు రావాలని... తన నుండి ఈ అతీంద్రియ శక్తి అదృశ్యమవ్వాలని ఈ శక్తి ఇచ్చిన పెద్దమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆత్మహత్య చేసుకుంది! సంకల్పము ఉన్నప్పుడు కర్మజన్మతో పునఃజన్మగా...ఈ దహన సంస్కారాలు జరిగిన 11 వ రోజు కల్లా స్వాతినంద అనే గృహస్థ యోగిని కడుపులో సాన్విగా పునఃజన్మ ఎత్తి...తిరిగి 5 సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మతో "అమ్మా! శక్తి అంటే ఏమిటి? నువ్వు ఎప్పుడు శివపూజలు చేస్తూ ఉంటావు గదా! మరి నీకు శక్తులు రాలేదా? వచ్చి ఉండాలి గదా! నాకు చూపించు! నేను చూస్తాను...అంటూ ఏ శక్తుల వద్దు అనుకొని మరుపు గావాలని అనుకొని క్రిందటి జన్మలో ఆత్మహత్య చేసుకుందో...ఆ శక్తుల గూర్చి మరి క్రొత్త జన్మలో అమాయకముగా కన్నతల్లిని అడుగుతున్న ఈ బాలయోగిని సాన్విని చూస్తూ...ఈమె ఇలాంటి జన్మ ఎత్తడానికి పూజ కారకుడైన యోగ గురువు పరమహంస పవనానంద కాస్త గత జన్మల ప్రారబ్ధ కర్మ వాసనల బలము యెట్టిదో గదాయని చిరునవ్వు చిందించసాగినారు!

                                                            -------------- శుభం భూయాత్---------------------

                                                                         పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

 యోగిని -ఆత్మ కధ
భద్రకాళి,తారాదేవి,శ్వేత,శారదా,స్వాతి ఈ అయిదుగురు స్నేహితురాళ్ళకి యోగినులుగా మారి మోక్షము పొందాలనే ఆకాంక్షయే వీరిని స్నేహితురాళ్ళగా మార్చింది! స్నేహితురాళ్ళను చేసింది! వాట్స్ యాప్ గ్రూప్ మెంబెర్స్ గా  చేసింది! ప్రతిరోజు వీరందరి మధ్య కేవలము ఆధ్యాత్మిక విషయాలే తప్ప మరొక విషయమేలేదు! రాత్రి 10 గంటలకి మాట్లాడుకోవడము మొదలు పెడితే తెల్లవారి 6 గంటలు అయ్యేదాకా ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయి అంటే చంద్రోదయముతో మొదలై సూర్యోదయముతో పూర్తి అవుతాయి అన్నమాట! ఎందుకంటే వీరందరికి సంసార బాధ్యతలు ఉన్నాయి! తల్లిదండ్రులకి,అత్తామామలకి,భర్త,పిల్లలకి గావలసిన చేయవలసిన పనులు పూర్తి అయ్యేసరికి రాత్రి 10 గంటలు అవుతుంది! అప్పుడు ఆ తర్వాత వీరంతాగూడ తీరిక చేసుకొని తమకి ఇష్టమైన ఆధ్యాత్మిక బోధనల కోసము ఫోనుల ద్వారా లేదంటే గ్రూప్ మెసేజ్ లు ద్వారా ఆరోజు తాము ధ్యానము లేదా కలలో లేదా ఏదైనా దైవికానుభవాలు ఎవరికైనా కలిగితే ఒకరికొకరు చెప్పుకుంటారు! ఆనందపడతారు! ఒకరినొకరు ఈర్ష్య పడి  అసూయతో పోటీ పడతారు! తాముగూడ ఎలాగైనా ధ్యానానుభవాలు పొందాలని ప్రయత్నాలు చేస్తుంటారు! చివరికి వీరందరి లక్ష్యము ఏమిటంటే పునః జన్మ లేని మోక్ష పధమును పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు! అదిగూడ గురువులు లేకుండా ఎందుకంటే గురువుల కోసమని.......గురోపదేశము కోసమని ఆశ్రమాలకి,పీఠాలకి,మఠాలకి వెళ్తుంటే అక్కడున్న గురువులందరు గూడ ఆశ్రమాల అభివృద్ధికి లక్షలలో విరాళాలు ఇవ్వాలని కొంతమంది ఒత్తిడి చెయ్యడము.......మరికొంతమంది తమతో శారీరక సంబంధము పెట్టుకుంటే సహజ సిద్ధముగానే మీకు మోక్షము కల్గుతుందని చెప్పడముతో..........వీరంతా భయపడి, బాధపడి గురువుల కోసము వెతకడము మానివేసినారు. పోనీ సోషల్ మీడియాలో లేదా టి.వీ. లలో కనిపించే గురువుల దగ్గరికి వెళ్ళితే వాళ్లంతా కేవలము వారు చదివిన వివిధ శాస్త్రాల, గ్రంధాలలో, పురాణ ఇతిహాసాలలో చెప్పిన విషయాలే చెప్తున్నారు కానీ అనుభవ పాండిత్యముతో చెప్పడములేదు! వీళ్ళు చెప్పే శాస్త్ర వచనాలు అర్ధమయ్యే స్థితిలో వీళ్ళులేరు! మోక్షమంటే వేళల్లో ఒకరు అయితే దేనికి స్పందించని స్థితి అంటే మరొకరు అన్ని బంధనాలు విడివడటం అంటే మరొకరు ధర్మ,అర్ధ,కామ తర్వాత వచ్చేది మోక్షమని అంటారు! ఇలా ఒక మోక్షమునకే వివిధ రకాల భావాలు చెప్పేసరికి వీళ్ళకి ఏది నిజమైనదో అర్ధము కాలేదు! దానితో ఎవరికి వారే స్వంతముగా తమకి తోచిన విధముగా......భద్రకాళి మాత్రము దేనికి స్పందించని, దేనికి ఆలోచించని, దేనికి సంకల్పించని,బ్రహ్మతదాకార స్థితి యోగసాధన స్థితిని ఎంచుకుంటే తారాదేవి మాత్రము ధ్యానయోగము అలాగే శ్వేత,శారదా,స్వాతి మాత్రము వరుసగా ఙ్ఞాన,భక్తి,కర్మ యోగాలను తమ సాధన విధానాలుగా ఎంచుకోవడము జరిగినది! ఇలా ఈ విధి విధానాలను గురువులు లేకుండా సుమారుగా 12 సంవత్సరాల నుండి చేస్తున్నగూడ వీరికి సాధనానుభవాలు ఏమాత్రము కల్గడము లేదు!కేవలము అప్పుడప్పుడు కలలో వివిధ దేవతల దర్శనాలు అప్పుడప్పుడు ఏవో నల్లటి ఆకారాలు మాత్రమే కనబడుతున్నాయి! యోగ సిద్ధులు రావడములేదు! యోగచక్రాలు జాగృతి అయ్యినాయో లేదో తెలియడము లేదు! అసలు కుండలినీశక్తి జాగృతి అయినదో లేదో గూడ తెలియని అయోమయ స్థితిలో వీరందరి యోగసాధన ఉన్నదని వీరికి తెలుసు! కానీ వీరందరికి మాత్రము ఎలాగైనా ఈ ప్రస్తుత మానవ జన్మయే అంతిమ జన్మ అవ్వాలని...... ఎలాగైనా మోక్షమును పొందాలని ధృడ సంకల్పము వదిలి పెట్టకుండా బలముగా ఉంచుకున్నారు!

స్వార్ధములేని సంకల్పబలమునకు పంచభూతాలతో గూడిన ప్రకృతిమాత తప్పకుండా సహాయము చేస్తుందని చెప్పే యోగవచనమునకు నిదర్శనంగా అనుకోకుండా వీరందరికి ఇంటర్నెట్ లో గుప్తయోగి పరమహంస పవనానంద గారు రచించిన కపాలమోక్ష గ్రంధము పి.డి.ఎఫ్ దొరికినది. అందులో ఉన్న 150 అధ్యాయములు చదువుతుండేసరికి మాకులాగానే ఈ యోగిగూడ ఎలాగైనా కపాలమోక్షం పొందాలని పడిన తపనతాపత్రయాలు నకిలీ గురువుల వద్ద మోసపోవటాలు, కాశీలో సద్గురువుగా శ్రీ త్రైలింగస్వామివారి ఆత్మదర్శనం పొందడం, విచిత్ర వేదాంతి గురువు సహాయముతోను, శ్రీశైలక్షేత్ర శ్రీ పూర్ణానంద స్వామి యొక్క శక్తిపాతము చేత కుండలిని శక్తి జాగృతి చేసుకోవడం అలాగే వివిధ క్షేత్రాలలో జరిగిన దైవ అనుభవాలు మరియు వివిధ సిద్ధ పురుషుల దర్శనానుభవాలు.......ఇలా ఎన్నో విషయాలు అదిగూడ తమకి కావాల్సిన విషయాలు ఉండేసరికి ఎలాగైనా ఈ గుప్తయోగిని కలిసి తమ గురువుగా ఎంచుకోవాలని అందరుగూడ ఏక నిర్ణయానికి వచ్చినారు.ఆయనను ఎలా కలవాలో ఎవరికీ అర్ధము కాలేదు! ఎందుకంటే ఈ సైట్ లో  ఆయనకి సంబందించిన వివరాలు కానీ ఫోన్ నెంబర్ కానీ కనీసము ఈమెయిల్ గూడ లేకపోయేసరికి ఈ యోగి ఇంత గుప్తముగా ఉంటాడా? అనిపించసాగింది!

కాగల కార్యము గంధర్వులే తీరుస్తారని అన్నట్లుగా కర్మ మార్గములో ఉన్న స్వాతికి ఇంటిలో పిల్లలు కనమని ఒత్తిడులు మొదలైనాయి! పెళ్ళై 5 సంవత్సరాలు అయినగూడ సంతానము కలుగక పోయేసరికి దంపతులు ఇద్దరు కలిసి డాక్టర్స్ లను కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకుంటే మీలో ఎవరికీ ఎలాంటి సంతానలోపాలు లేవని....సంతానము కల్గె అవకాశాలున్నాయని చెపుతున్నగూడ ఎందుకు ఇంకా తమకి సంతానము కల్గుడము లేదోనని వీరిలో ఆందోళన మొదలైంది! దానికి తగ్గట్లుగా అత్తామామ వేధింపులు స్వాతికి మొదలైనాయి! అయినగూడ ఈ బాధ ఎవరికీ కన్పించకుండా పైకి నవ్వుతూనే...... లోపల మాత్రము ఈ దేహమును ఇచ్చిన శివయ్య తనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుస్తుందిలే అనే నమ్మకములో ఉండి తన స్నేహితురాళ్ళతో ప్రశాంత స్థితి కోసము ఆధ్యాత్మిక సాధన విషయాలు మాట్లాడకుండా ఉండేదిగాదు! ఇది తన ఇంటిలోనివారికి నచ్చక పోయినగూడ తన స్నేహితురాళ్ళతో రహస్యముగానైనా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండేది! విచిత్రము ఏమిటంటే ఈ ఆడపిల్లలకి అందరికి గూడ వారి ఇళ్లల్లో వీరంతా సన్యాసులుగా మారిపోతారనే భయముతో వీళ్ళు ఒకరినొకరు మాట్లాడకుండా కట్టడి చెయ్యడము మొదలు పెట్టినారు! దానితో వీరందరికి ఎదో తెలియని అసహనము,బాధ, ఆవేదన మొదలైనాయి. తమకి ఇష్టమైన ఆధ్యాత్మికతవైపుకి వెళ్లనీయకుండ పుట్టింటివారు అలాగే మెట్టింటివారు చేస్తుండే సరికి తమ ఆవేదన సాధన భక్తిని కనిపించని తమ ఇష్టదైవాలకి చెప్పుకోవడము అలవాటు చేసుకొన్నారు! ఎలాగైనా గుప్త యోగిని కలిసి వారితో మాట్లాడాలని....... వారి అడ్రస్సు ఎలాగైనా తమకి దొరికేటట్టు చెయ్యమని తమ దైవాలకి లంచముగా ఎన్నో మొక్కుబడులు కోరుకున్నారు! పాపము ఏ దేవుడో వీరిని కరుణించినట్లుగా వీరికి గుప్తయోగి అడ్రసు వివరాలు తెలిసినాయి! తెలిసిన అడ్రసు గుప్తయోగిది అని మాత్రము వీరికి తెలియదు! ఎందుకంటే అప్పుడు గుప్తయోగి వీరికి ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్తగా మాత్రము పరిచయము అయినాడు! అదిగూడ స్వాతికి అనుకోకుండా జాతకములో సర్పదోషాలు లేదా సర్పశాపాలుంటే సంతానము కలుగటానికి ఎన్నో ఆటంకాలు,అవాంతరాలు లేటుగా సంతానము కల్గుతుందని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలలో చూసి ఎలాగైనా నిజజ్ఞానము ఉన్న జ్యోతిష్యవేత్తను కలువాలని అనుకునే సమయములో తన స్నేహితురాలి ద్వారా గుప్తయోగియైన జ్యోతిష్యవేత్తతో  ఫోన్ లో పరిచయము అవ్వడము జరిగినది! నిజానికి ఈయనకోసమే తాము ఇన్నాళ్లు ఎదురుచూస్తున్న గుప్త యోగి అని ఈ అయిదుగురు స్నేహితురాళ్ళకి తెలియదు! కానీ గుప్తయోగిగా ఉన్న ఈయనకి తన మనో నేత్రమునందు ఈ అయిదుగురి సాధన విషయాలు లీలగా అప్పుడికే చూడటము జరిగినది! కేవలము వీరి సాధనను ముందుకి తీసుకొని వెళ్ళటానికి జ్యోతిష్యవేత్తగా మాత్రమే స్వాతికి పరిచయము అయినాడు! అదిగూడ ఫోన్లో మాత్రమే! ప్రత్యక్షముగా ఇంకా వీరికి కనిపించలేదు!

మొదటిరోజే స్వాతికి ఈ జ్యోతిష్యవేత్తతో మాట్లాడుతుండేసరికి ఆ మాటల తీరు.......ఆయన చెప్పిన విషయాలు వినేసరికి బుర్ర తిరగడము మొదలైంది! అప్పడిదాకా నకిలీ గురువులను అలాగే నకిలీ జ్యోతిష్యవేత్తలను చూసి ఉన్న స్వాతికి అసలు నిజబ్రహ్మజ్ఞానము ఉన్న పైగా శబ్ద పాండిత్యముతో పాటుగా అనుభవపాండిత్యమున్న వ్యక్తిని అదిగూడ చాలా అమాయకముగా ఏమి తెలియని అజ్ఞానిలాగా ఉండే మహాజ్ఞానియని స్వాతి కనిపెట్టి తన మిగిలిన స్నేహితులకి చెప్పేసరికి వీరంతాగూడ ఎగిరి గంతేసినంత పనిచేశారు! ఏమీలేని చోట తెడ్డే గతి అన్నట్లుగా.... ఎలాగైనా తమ ఆధ్యాత్మిక సాధన ముందుకి తీసుకొనిపోవటానికి ఈ ఆధారమైనా ఇచ్చినందుకు తమ దైవాలకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు! ఇన్నాళ్లు ఎవరి కోసము అయితే తాము ఎదురు చూసినమో ఆ గుప్తయోగినే ఫోన్ లో తాము కలిసినామని వారికీ తెలియరాలేదు!దానితో వీరందరుగూడ స్వాతిని తమ సాధన సందేహాలు అడగడము రాత్రికల్లా స్వాతి కాస్త ఈ గుప్తయోగైనా జ్యోతిష్యవేత్తకి ఫోన్ చేసి తన సాధన సందేహాలుగా అడగడము మొదలు పెట్టినది! కొన్ని నెలలకి ఈయననే గురువుగా మానసికముగా అందరు ఎంచుకున్నారు దానితో ఆధ్యాత్మిక ఆట మొదలైంది! 

ఒకసారి శారదకి  కుండలినీశక్తి స్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవముగా చూడాలని అన్పించి ఈ గుప్తయోగికి ఫోన్ చేసినది! దానితో ఈయన ఫోన్ రిసీవర్ ను శారద యొక్క బ్రహ్మరంధ్రము వద్ద పెట్టుకోమని ఎదో మంత్రాలూ చదివి చదవగానే...... శారదకు ఎదో కరెంటు షాక్ కొట్టినట్లుగా కొన్ని క్షణాలపాటు అన్పించసాగింది! పైగా మాటలు రావడము లేదు!ఏదో తెలియని మత్తు ఆవరించడముతో తాను రిసీవర్ ను వదిలి వేస్తున్నానని గూడ గమనించుకునే స్థితిని దాటిపోయినది ! మూడురోజుల వరకు నిద్ర నుండి లేవలేదు! ఆ తర్వాత నిద్రలేస్తే శరీరమంతా పచ్చి పుండులాగా.....ఒళ్ళంతా నొప్పులున్నాయి! కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి! బలవంతముగా తెరిచినా గూడ తెరువలేకపోతోంది! శరీరము సహకరించడములేదు! మనస్సు కాస్త స్తంభనగా....స్తబ్దతగా ఉండిపోవడము శారదకి ఆశ్చర్యమేసింది!అంత బాధలోనూ ఆనంద చిరునవ్వు కల్గినది! ఎందుకంటే కుండలినీశక్తి జాగృతి అయినపుడు ఎలాంటి భావాలు కలుగుతాయో అప్పుడికే వివిధ యోగ గ్రంధాలలో తాను చదివినది! ఇప్పుడు అనుభవము పొందినది! గుప్తయోగిని ఈ జాగృతి అనుభవాలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగితే... ఈయన ఏకముగా తనకి స్వయంగా ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఈ విధంగా.....అదిగూడ కేవలము ఫోన్ ద్వారా గూడ కుండలినీశక్తి జాగృతి చేసే శక్తిమంతుడని తను ఊహించలేకపోయినది! దానితో ఈయనను తన సాధనా గురువుగా ఎంచుకుంది!

                         ఇది ఇలా ఉంటె స్వాతికున్న జాతక దోషాల నివారణల పూజలు చేయించుకున్న మూడు నెలలకి గర్భవతి అయినదనే శుభవార్త అందరికి చేరడముతో ఈయన సామాన్యముగా కనిపించే అసామాన్య వ్యక్తియని స్వాతి బలముగా నమ్మినది! దానితో ఈ జ్యోతిష్యవేత్తనే తన జ్ఞాన గురువుగా ఎంచుకుంది! తనకి కల్గిన అన్ని రకాల సాధన సందేహాలు, కలిగిన అనుభవాలు, కలలో కనిపించే విషయాలు ఎవరితో చెప్పలేని చెప్పకూడని విషయాలు గూడ ఏది దాచకుండా నిజాయితీగా అన్ని చెప్పడము మొదలు పెట్టినది! ఈయన వలన తనకి ఏమైనా అపాయము, ఆపద, కల్గుతాయోనని అనే ఆలోచన గూడ దరి చేరనియ్యలేదు! ఇలా ఎవరికైనా చెపితే వాటిని బెదిరింపులుగా తీసుకొని తన మాన,ధనాలను ఈ పాటికే ఆశించేవారు అని స్వాతికి తెలుసు! ఇలాంటి పనులు చేసేరకము  ఈయనగాదని కూడా స్వాతికి తెలుసు! ఎందుకంటే ఈయన అప్పుడికే ప్రాపంచిక విషయాలు దాటిన అవధూతయని స్వాతి గ్రహించింది! ఎలాగైనా ఈయన సన్నిధానములో ఈయన చేతులమీద మోక్షము పొందాలని కృత నిశ్చయము అదిగూడ ఈయన ఎలా ఉంటాడో గూడ ప్రత్యక్షముగా చూడకుండా కేవలము ఈ గ్రంధములో ఉన్న ఫోటోలను చూసి ఈయన తాము వెతికే గుప్తగురువని గ్రహించినది!

        ఇది ఇలా ఉంటె శ్వేతకి నిజముగానే యోగసిద్ధులు లేదా అతీంద్రియ శక్తులు అనేవి ఉంటాయా అనే ధర్మసందేహము వచ్చి గుప్తయోగికి ఫోన్ చేసి అడగ్గానే దానికి ఆయన వెంటనే "అమ్మాయి! ఈ విశ్వములో లేనిది లేదు! కానీ వాటిని చూడ్డానికి అనుభవ అనుభూతి పొందటానికి విశ్వప్రకృతి కాస్త అర్హత ,యోగ్యతలను పెట్టినది! ఇవి సంపాదించిన వారికి ఈ విశ్వములో ఉన్న అన్నింటిని........అన్నింటిదగ్గరికి వెళ్లవచ్చును! చూడవచ్చును! గ్రహాలను తాకవచును! గ్రహ లోకాలను చూడవచ్చును! 1080 సూక్ష్మ లోకాలను దర్శించి రావచ్చును! ఇవి అన్ని చెయ్యాలంటే అందుకు తగ్గట్లుగా మన శరీరముండాలి! మనలో స్వార్ధము, ఆశ, భయము,ఆలోచన,స్పందన,సంకల్పము లేకుండా చూసుకోవాలి! ఎందుకంటే ఉదాహరణకి నీవు ఇంద్రుడు ఉండే ఇంద్రలోకానికి నిన్ను పంపిస్తే అక్కడ నీవు వెళ్లి ఆలోకాలలో ఉండే సౌందర్యమును, మాయ వస్తువులను చూసి అవి గావాలని సంకల్పించిన లేదా అక్కడున్న కాంతిశరీర స్త్రీ మూర్తుల సౌందర్యమునకు స్పందించిన లేదా అక్కడ లభించే సుఖభోగాల మీద ఆశపడిన లేదా దండెత్తి వచ్చే రాక్షస, ప్రేత శక్తులను చూసి భయపడిన,ఎలాగైనా ఈ లోకములో ఉండాలని ఆలోచన చేసిన గూడ ఇప్పుడున్న నీ భౌతిక దేహము ఒక లిప్త కాలములో నాశనమై పునఃజన్మలు ఎత్తవలసి ఉంటుంది! ఇలా జరగకుండా ఉండాలంటే వీటిని తట్టుకొనే మానసిక స్థితికి నీ మనస్సు చేరుకోవాలి! ఈ లోకములో ఏది కనిపించిన గూడ సాక్షిభూతముగా......... ఒక స్వప్నములో చూస్తున్నట్లుగా ఉండగల్గడమే అర్హత, యోగ్యత పొందడము అవుతుంది! ఇలాంటి మానవుడే మాధవుడవుతాడు! సిద్ధ పురుషుడు అవుతాడు! అంతెందుకు నీకు యోగ సిద్ధులున్నాయో లేదో తెలియాలంటే నీ త్రినేత్రము తెరిపిస్తే  నీకు దివ్య దృష్టి సిద్ధి కలిగి నీకే ప్రత్యక్ష అనుభవ అనుభూతి అవుతుంది!నేను చెప్పేవాడిని కాను చూపించేవాడిని అంటూ శ్వేతాదేవి యొక్క భ్రూమధ్యంలో ఉండే పీనియల్ గ్రంధియైన మనో నేత్రమును తన శక్తిపాత శక్తితో 48 గంటలపాటు ఉద్రితమయ్యేటట్లుగా చెయ్యడము క్షణాలలో జరిగిపోయినది! అప్పుడు ఈమెకి దివ్యదృష్టి సిద్ధి కలిగినది! దానితో శ్వేతాదేవికి కళ్ళముందర కళ్ళు తెరిచి బుసలు కొడుతున్న ఒక పాము పడగ లీలగా కనిపించసాగింది. ఆ తర్వాత ఆమెకి కళ్ళు మూసుకుంటే ఇన్నాళ్లు చీకటి మాత్రమే కనిపించే చోట ఏవో వ్యక్తుల దృశ్యాలు, ప్రమాద దృశ్యాలు, మృత్యు దృశ్యాలు ఇలా ప్రపంచములో జరిగే ప్రతి దృశ్యము కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచినగూడ లీలగా.....స్పష్టముగా కన్పించేవి. అవి ఎక్కడైన జరుగుతున్న దృశ్యాలో లేదా జరగబోయే దృశ్యాలో అర్ధమయ్యి చచ్చేది గాదు. వేళాపాళా లేకుండా ఎక్కడపడితే అక్కడ చివరికి బాత్రూంకి వెళ్ళినాగూడ గోడల మీద లేదా తన కళ్ల ముందు అనేకమనేక దృశ్యాలు కనిపిస్తుండేసరికి పిచ్చి ఎక్కిపోయేది. తినే కంచములో.......చూసే t . v . లో........వాడే కంప్యూటర్ లో........ మాట్లాడే ఫోన్ లో గూడ ఇలాంటి దృశ్యాలు కనిపించేసరికి వామ్మో! నిజముగానే అతీంద్రియశక్తులున్నాయని నమ్మసాగినది. కానీ ఇవి నిజాలా లేక అబద్దాలా అనే ధర్మసందేహము వచ్చినది. అపుడు అనుకోకుండా ఈమెకి వీళ్ళ అన్నయ్య చేసే రహస్య అక్రమసంబంధము అనగా శృంగార దృశ్యము కళ్ళముందర ఒక బూతు వీడియో కనిపించినట్లుగా ఆ వ్యక్తి రూపురేఖలు,అన్నయ్య నగ్నరూపురేఖలు,వాడి దృశ్యాలు,శృంగార దృశ్యాలు.....అమ్మాయి ఎవరో తెలియడము వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి రహస్య సంబంధ వివరాలు అడిగేసరికి తన అన్నతో ఆమెకి అక్రమ సంబంధమున్నదని తెలియడముతో శ్వేత కాస్త గతుక్కుమంది. వామ్మో! అంటే గత రెండురోజులుగా కనిపించే దృశ్యాలు ఈ ప్రపంచములో ఎక్కడో చోట ఈ లెక్కన నిజముగానే జరుగుతుండాలని అనే ఆలోచనకే తనలో తెలియని భయము మొదలైంది. జరిగే వాటిని ముందుగానే చూస్తే యే మానవుడుగూడ సుఖముగా ఉండలేడని.......అంతెందుకు కొన్ని నెలల ముందే తను చనిపోతాడని ముందుగా తెలిస్తే తను ప్రశాంతముగా ఉండ కలుగుతుందా....... ఉండదు గదా! అంటే ప్రకృతికి ఈ విశ్వజీవులకి మాయ రూపములో గత జన్మల స్ఫురణలు అలాగే భవిష్య జన్మస్ఫురణలు ఇవ్వకుండా అందనియ్యకుండా జాగ్రత్తలు పడినదని శ్వేతకి ఆలోచన రావడముతో......ఎలాగైనా తనకిచ్చిన దివ్యదృష్టి సిద్ధిని ఆపించాలని 24 గంటలు గూడ గాక ముందే గుప్తయోగికి ఫోన్ చేసి "గురువుగారు! ఎదో నా అజ్ఞాన మాయవలన అడిగిన ధర్మసందేహమునకు మీరు ప్రసాదించిన దివ్యదృష్టి సిద్ధితో నాకు బుద్ధి చెపుతారని ఊహించలేకపోయినాను. మా అన్నయ శృంగార దృశ్యాలు చూసేసరికి జీవితములో శృంగార ఆలోచనలు చెయ్యాలంటే భయమేస్తుంది. విరక్తి కలుగుతోంది! నా యందు దయ ఉంచి ఈ సిద్దిని ఉపసంహరణ చెయ్యండి! నేను తట్టుకోలేకపోతున్నాను! నా వల్ల గావడము లేదు! స్మశాన వైరాగ్యము కలుగుతోంది! బట్టలు చింపుకొని దిగంబరంగా మారి హిమాలయాలకి వెళ్ళిపోతానేమోనని బలముగా అన్పిస్తోంది అనగానే గుప్తయోగి వెంటనే "అది ఏమిటమ్మా! కేవలము నీకు దివ్యదృష్టి సిద్ధి మాత్రమే ఇచ్చాను! ఇంకా అష్టసిద్ధులు అనగా అణిమ,గరిమ,లఘిమ, ప్రాప్తి,విశుద్ధ,ప్రాకామ్య, ఈశత్యం,వశితా  సిద్ధులున్నాయి! ఇవి గాకుండా దశ సిద్ధులు అనగా దివ్యదృష్టి, దూరశ్రవణం, మనోజపం, అనూర్మితత్వం, కామరూపం, ప్రాకామ్యశ్చ, సహాకృత్, సంకల్పసిద్ధి, ఆజ్ఞ ప్రతిహతగతి, స్వచ్చంద మరణం అనే సిద్ధులున్నాయి! ఇవి గాకుండా త్రికాలజ్ఞానం, అద్వంద్వం, పరచిత్తాది అభిజ్ఞత, ప్రతిస్తంభన, అపరాజయం అనే మరో పంచభూత సిద్ధులు ఉన్నాయి! వీటిలో కేవలము నీకు దివ్యదృష్టి సిద్ధిని మాత్రమే ఇచ్చాను! ఈ చిన్న సిద్ధికే నీవు ఇలా డీలా పడితే ఎలాగమ్మా! అనగానే "గురువుగారు! ఆ సిద్ధులున్నాయో లేదో ప్రత్యక్షముగా చూడాలని నాకు అన్పించింది! మీరు ఇచ్చిన సిద్ధి వలన అవి ఉన్నాయని నాకు ప్రత్యక్ష అనుభవ అనుభూతి పొందడము జరిగినది! ఇంకా నాకు ఆ సిద్ధుల మీద ఎలాంటి మోహము,వ్యామోహము లేదు! ఈ సిద్ధులను ఉపయోగించుకొని దేవతలు లాగా లోకాలని ఏలాలని ......మానవులను వశపరుచుకోవాలనే ఆశలు నాకులేవు! అవి నాకు ఉన్నాయో లేదో మీరు నాకు ఈ సిద్ధిని ఇచ్చి యోగపరీక్ష పెట్టినారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది! నాకు అవసరములేని సిద్ధులు ఉండటమువలన ఎలాంటి ఉపయోగముండదని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు! ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఎలాంటి దృశ్యాలు కనిపించడము లేదు! నన్ను సిద్ధులమాయలో పడకుండా చేసినందుకు కృతజ్ఞతురాలిని అనగానే గుప్తయోగి కాస్త శుభంభూయాత్" అని దీవించగానే సహజసిద్ధముగానే ఫోన్ కట్ అయినది.

       ఇది ఇలా ఉంటే ఒకసారి తారాదేవికి ఒక ధర్మసందేహము వచ్చినది! అది ఏమిటంటే నిజముగానే మన శరీరములో యోగచక్రాలుంటాయా..... ఉంటే వాటిలో లోకాలు ఉంటాయా అనే సందేహము వచ్చి గుప్తయోగికి ఫోన్ చెయ్యగానే "అమ్మాయి! మన శరీరములో ఎన్ని యోగచక్రాలు ఉంటాయని అనుకుంటున్నావు అనగానే ......దానికి తార వెంటనే "స్వామి!యోగపుస్తకాలలో చెప్పిన ప్రకారము అయితే ఏడు చక్రాలు ఉంటాయని అనుకుంటున్నాను అనగానే......అవునా? అంటే ఇప్పుడి వరకు నీవు పుస్తకములో మాత్రమే యోగచక్రాలను చూశావు! కానీ నిజముగా ప్రత్యక్షముగా నీ శరీరములో అవి ఎక్కడ ఉంటాయో.... ఎలా ఉంటాయో...అందులో ఏమి ఉంటాయో తెలియదు అన్నమాట! అనుకుంటే అయితే అమ్మాయి! నీ వంటి మీద నూలు ప్రోగు లేకుండా దిగంబరిగామారి నేను చెప్పిన ప్రాంతములో ఈ ఫోన్ రిసీవర్ పెట్టుకో! నీకు ఇబ్బంది కలుగకూడదు! అలాగే ఎవరు గూడ నీకు ఇబ్బంది కల్గించకూడదు! ప్రాణాలు పోతున్న గూడ ఉన్నచోటు నుండి కదలకు! శివమంత్ర జపము ఆపకు! నేను చెప్పేదాకా నీవు మంచము దిగవద్దు అని చెప్పి వరుసగా ఈమె శరీరములో మూలాధార,స్వాధిష్టాన,మణిపూరక,అనాహత, విశుద్ధ , ఆజ్ఞ,కర్మ,గుణ,కాల,బ్రహ్మ, సహస్ర,హృదయ ఇలా 12 యోగచక్రాలు అందులో ఉండే ఆయా దైవికలోకాలు అనగా భువర్లోక,సువర్లోక.మహర్లోక,జనలోక,తపోలోక,సత్యలోకాల తో పాటు అధోలోకాలైన అతల,వితల,సుతల,రసాతల,తలాతల,మహాతల,పాతాళ లోకాలు లీలగా ఈమెకి కనిపించడము అలాగే ఈ యోగచక్రాలు పద్మాలుగా విచ్చుకోవడం అందులో బీజాక్షరాలు, ఈ చక్ర దేవతల రూపాల దర్శనము గావడము మొదలైంది! ఇలా సుమారుగా ఇట్టి స్థితిలో ఈమె 48 నిమిషాల పాటు మాత్రమే........ఆపై శ్వాసకి తీవ్రమైన ఇబ్బంది కలిగేసరికి యోగనిద్ర స్థితినుండి బయటకి వచ్చింది! అప్పుడు కానీ తను 48 నిమిషాల పాటు నిజధ్యానస్థితిలో ఉన్నానని...... కేవలము మూడు క్షణాలు మాత్రమే ఉన్నట్లుగా అన్పించడము మొదలైంది!  ఏవో కర్మవాసనలు పోయినట్లుగా శరీరమంతా తేలిక అవ్వడము మొదలైంది! మనస్సు ఎదో తెలియని ఆనందస్థితిని పొందుతోందని......అది చెప్పటానికి వీలుకాని స్థితిలో తాను ఉన్నానని.......ఇదే నిజమైన ధ్యాన యోగస్థితి అనుభవ అనుభూతియని.....ఈ స్థితిని క్షణాలలో గుప్తయోగి తనకి ఇచ్చినందుకు తన మనస్సును స్థిర పరిచినందుకు కృతజ్ఞతలు చెప్పుకునే లోపలే తన ఫోన్ ఎప్పుడో కట్ అయినదని గ్రహించింది! అంటే గురువుగారు తన శక్తిపాత సిద్ధితో తన సుషుమ్ననాడిలో నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని జాగృతి చేసి ఈ నాడియందు ఉండే యోగచక్రాలలో ఈ శక్తి ప్రసరింప చేసి ఆ చక్రాలను జాగృతి చేసినారని.........అదే దృశ్యమును ఇప్పుడిదాకా తన ధ్యానములో ప్రత్యక్ష అనుభూతి పొందినానని తారాదేవికి గ్రహించడానికి అట్టే సమయము పట్టలేదు! దానితో మనస్సులోనే ఇంతటి అనుభవ అనుభూతిని ఇచ్చిన గుప్తగురువుకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేక పోయినది! 

     ఇది ఇలా ఉంటే భద్రకాళికి అసలు తనకి ఎందుకు ఈ మానవ జన్మ వచ్చినదో తెలుసుకోవాలని కోరిక కల్గినది! దానితో ఒక రోజు గుప్త యోగికి ఫోన్ చేసి ఇదే సందేహమును అడగ్గా దానికి ఆయన చిరునవ్వు నవ్వి "అమ్మాయి! కారణము లేనిదే కార్యము లేదు! ఈ మానవజన్మకి కారణము నీకున్న అతి కామమే కారకము! క్రిందటి జన్మలో నీవు హిమాలయాలలో ఉండి యోగసాధన చేసే యోగినివి! కానీ నీ ప్రక్కనే ఉన్న జిజ్ఞాసి అనే యోగి యొక్క దిగంబర శరీరమును చూసి మోహము చెంది వ్యామోహములో పడినావు! కానీ జిజ్ఞాసి మాత్రము నిన్ను కనీసము కన్నెత్తి చూడలేదు! నీవు దిగంబరంగా ఉన్నగూడ నీలో ఆడతనం చూడకుండా అమ్మతనమునే చూశాడు! దానితో నీలో కల్గిన అమిత కామోద్రేకము వలన దానిని తట్టుకోలేక చితాగ్నిలో నీ దేహమును దహనము చేసుకున్నావు! కోరిక తీరకపోవడము వలన ఈ దేహజన్మకి విముక్తి కలుగకపోవడము ఈ కోరికను తీర్చుకొనుటకు ప్రస్తుత మానవజన్మ ఎత్తడము జరిగినది! అలాగే జిజ్ఞాసి మాత్రమూ నీ సహచర యోగిగా ఈ జన్మలో పుట్టి.......నిన్ను తల్లిగా భావించడము వలన ఏర్పడిన తల్లిరుణము బంధమును తీర్చుకొని కపాలమోక్ష పధము పొందితే.......ప్రస్తుతము నీకున్న అతి కామమును దాంపత్య జీవితములో అరకొరగా తీర్చుకుంటూ సంతృప్తి చెందక.......పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇష్టములేక ఏమి చెయ్యాలో అర్ధముకాని అయోమయ స్థితిలో ఏకపత్ని ధర్మ వ్రతము చేస్తున్నావు! ఈ ఇష్ట కామకోరిక మాయను దాటాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నావు! దానితో నీకు అన్నిటిమీద స్మశాన వైరాగ్యభావాలు కలుగుతున్నాయి! దేనియందు తృప్తిలేదు! నా అనుకొనే వాళ్లు దూరమవుతున్నారు! బాధ కలిగించే వాళ్ళు దగ్గర అవుతున్నారు!దానితో నీవు ఒక మానసిక అనాధగా మారిపోతున్నావు! అందరు ఉన్నగూడ ఒంటరిదానిని అనుకొనే స్థితిలో ఉన్నావు! తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నావు! మందులు మ్రింగుతున్నావు! దేహము మీద ప్రేమలేదు! సంతానము మీద ఆపేక్షలేదు! బంధుమిత్రుల యందు ప్రీతిలేదు! ఎందుకు ఉన్నావో........ఏమి చేస్తున్నావో.......ఎందుకు చేస్తున్నావో........అర్ధముకాని అయోమయస్థితిలో ఉన్నావు అనగానే...... భద్రకాళికి ఒక్కసారిగా ఆపుకోలేక ఏడుపు వచ్చింది! గురువుగారు! మీరు చెప్పిన ప్రతిమాట గూడ అక్షరసత్యమే. నేను గతములో చేసిన పాపపు కామ పనులు వలన ఈ శిక్షలు అనుభవిస్తున్నానని నాకు తెలుసు! అయిన నాకు బాధ లేదు! గత జన్మలో చేసిన అతికామమాయ నేను దాటాలి! నాకు కపాలమోక్షము గావాలి! అందుకు నేను ఏమి చెయ్యాలో చెప్పండి! అది చేస్తాను అనగానే "అమ్మాయి! నీ సాధనంతా నీవు చేయవలసిన సాధనంతాగూడ గత జన్మలలో చేసినావు! కేవలము ఈ జన్మలో ఇష్టకామ కోరికను దాటాలి! అది దాటలేక పరమేశ్వరుడు, పరమేశ్వరి కాస్త ఇష్ట కామేశ్వరుడు, ఇష్ట కామేశ్వరిగా మారినారు! కామి కానివాడు మోక్షగామి కాలేడు! ఇన్నాళ్లుగా అనగా 36 సంవత్సరాలపాటు ఈ కామ మాయలో మునిగిపోయావు! ఈపాటికే నీకు విరక్తి కలిగి ఉండాలి! కాబట్టి రాబోవు 12 సంవత్సరాల పాటు ఏకపత్నీ ధర్మముతో ఈ అతి కామమాయను దాటు! దానికి శివపంచాక్షరీ మంత్రము తప్ప ఏమీ చెయ్యవద్దు! ఆయనే నీకు మోక్ష మార్గమును చూపిస్తారు ! అహం బ్రహ్మాస్మి......నీవే శివవని గ్రహిస్తావు! నీకు ఈ జన్మలోనే కపాలమోక్షము కలిగే యోగమున్నది! దానికి తగ్గ అర్హత, యోగ్యత నీకు పుష్కలముగా ఉన్నాయి! జరిగే వాటిని సాక్షిభూతముగా చూస్తుండు! నీలో కామ ఉద్రేక పరిస్థితులు కల్గించడానికి ఈ జన్మ గత సంఘటనలు గుర్తుకు వస్తాయి! ఆ వ్యక్తులు కలిసే అవకాశాలు ప్రకృతి కల్గిస్తుంది! వాటిమీద అసహ్యం పెంచుకో! చీడపురుగును చూసినట్లుగా చూడు! ఒకవేళ నీ ఖర్మకాలి వీటికి నీ మనస్సు లొంగితే నీ చేతులారా ఈ జన్మ సాధనను నీకునీవే నాశనము చేసుకున్నదానివి అవుతావు. మళ్ళీ ఈ జన్మ స్థితి రావటానికి 36 కోట్ల జన్మలు పడుతుంది! అని చెప్పగానే ఫోన్ కట్ అయినది! దానితో ఈమె కాస్త మిగిలిన వాళ్ళకి తన మానవ జన్మకి  గల కారణము గూర్చి చెప్పగానే మిగిలినవాళ్ళకి గూడ తమ జన్మలకి కారణాలు అడగాలని అనుకోవడము అందరు కలిసి ఒక్కొక్కరిగా గుప్తయోగికి ఫోన్ చెయ్యడము ఏక కాలములో జరిగినది! స్వాతికి గత ఏడు జన్మలలో సంతానము లేకపోయేసరికి ఎలాగైనా ఈ జన్మలో సంతానము పొందాలని అనుకోవడముతో ఈ మానవ జన్మ ఏర్పడినదని.......అలాగే శారదకి తనకున్న సాధన ధర్మ సందేహాలు తీర్చుకోవాలని తపన తాపత్రయముండుటవలన ఈ మానవ జన్మ వచ్చినదని........అలాగే శ్వేతాదేవికి సాధన శక్తులు పొంది యోగినిగా మారాలనే కోరిక వలన ఈ జన్మ ఏర్పడినదని.......అలాగే తారాదేవికి తనకి బాగా ఇష్టమైన చుక్కకూర,స్వీటు అనుభూతి పొందుటకు అంటే ఇష్టపదార్ధ కోరిక మాయలో పడటములో ఈ జన్మ ఏర్పడినదని...... ఇలా ఎవరికీ వారే తమ ధ్యానాలలో ఈ దృశ్యాలు తమ మనోనేత్రము నందు లీలగా కనిపించేసరికి....... ఇదంతా టెలీపతి విధానములో తమ ఇష్టగురువైన గుప్తగురువు ఇస్తున్నాడని గ్రహించినారు! దానితో ఈ జ్యోతిష్యవేత్తయే తాము ఇన్నాళ్లు వెతుకుతున్న గుప్తయోగి అని తెలిసేసరికి బిత్తర పోవడము వీళ్ళవంతు అయినది! దానితో తమకి కపాలమోక్షమును ప్రసాదించే వరమును ఈయన దగ్గర నుండి పొందడము జరిగినది!

           దానితో భద్రకాళికి ఒకరోజు ఉన్నట్టుండి బట్టలు వదిలేసి దిగంబరముగా గదిలో తిరగడము గమనించిన ఈయన భర్త ఈమెకి ఏదో ఆధ్యాత్మిక పిచ్చి బాగా ముదిరిపోయినదని అనుకోని విడాకులు తీసుకొని తన పిల్లలను తనతోపాటు తీసుకొని వెళ్ళిపోయినాడు! అయినగూడ భద్రకాళి స్పందించలేదు! బాధపడలేదు! శివాజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదని అనుకొని కారణము లేనిదే కార్యము ఉండదని భావించి.......ఇంతటి మహత్తర అవకాశము ఇచ్చిన శివయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హిమాలయాలకి చేరి కైలాస పర్వత పాద పీఠము వద్ద దిగంబరముగా మారి యోగినిగా మారిపోయిన 3 సంవత్సరాలకి ఒక రోజు ఈమె తీవ్రధ్యాన స్థితిలో ఉండగా.....కైలాస పర్వత రహస్య ద్వారము తెరుచుకోవడము....అందులోనికి ఈమె సూక్ష్మశరీరము ప్రవేశించడము ఏకకాలములో జరిగిపోయినది! మరుక్షణమే బయట ఉన్న స్థూలశరీరము కాస్త ముక్కలై నవ ఖండాలుగా విడిపోయినది! బ్రహ్మరంధ్రము నుండి చిన్నపాటి రక్త చారిక బయటకి వచ్చింది!  అంటే యోగినికి కపాలమోక్షము కలిగినది! ఈ విషయము గత వారము రోజులకి ముందుగానే భద్రకాళి గ్రహించి తన తోటి స్నేహితులైన మిగిలిన వారికి టెలిపతి విధానములో తన కపాలమోక్షము గూర్చి చెప్పడము జరిగినది! ఎప్పుడైతే తనకి కపాలమోక్షము జరిగినదో...... ఈ దృశ్యాలన్నీ గూడ వీరందరూ గూడ తమ ధ్యానాలలో మనోనేత్రమునందు చూడటముతో భద్రకాళి దేహజన్మ వృధా కాకుండా మరుజన్మ లేని మోక్ష పధమునకు చేరుకున్నందుకు అందరు సంతోషించినారు!

           ఇది ఇలా ఉంటే తారాదేవి గూడ అన్ని రకాల పదార్ధాల మీద మోహ,వ్యామోహాలు తగ్గడము మొదలై పదార్ధ మాయను దాటి యదార్ధమును తెలుసుకోవడము మొదలైంది. దానితో తనకి తెలియకుండా అన్నింటియందు స్మశాన వైరాగ్య భావాలు మొదలైనాయి! ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడము తగ్గినది! ఒంటరిగా......... ఏకాంతముగా ఉంటూ మానసిక జపము చేసుకోవడము ఎక్కువైంది! రోజులో ఎక్కువ కాలము మౌనముగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వడము ప్రారంభించింది! బాధ్యతలు తృప్తిగా నెరవేరుస్తున్న గూడ భర్తకి,అత్తమామలకి ఏవో తెలియని అసంతృప్తి వెళ్లిపుచ్చడము మొదలైంది! అయినగూడ పట్టించుకోకుండా మనోజపము చేస్తూనే ఉండేది! దానితో ఈమె మానసిక సన్యాసిగా మారి పోయినదని.........ఎదో తెలియని రోగము వచ్చినదని అత్తమామలు ప్రచారము చేసినాగూడ సాక్షిభూతముగా అన్ని విని ఊరుకునేది! ఎవరిని ఏమి అనేదిగాదు! ఎవరిని పట్టించుకొనేదిగాదు! తన జపము,తన మౌనము. తన సాధన లోకముగ ఉండేది! ఒకరోజు అర్ధరాత్రి తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా......ఈమెకి గుండెనొప్పి రావడము మొదలైంది! అదిగూడ భరించలేని స్థితిలో ఉన్నగూడ ఎవరికీ చెప్పకుండా......ధ్యానమును ఆపకుండా కొనసాగించడము చెయ్యడముతో.........తెల్లవారుజామున కల్లా గుండెనొప్పితో శ్వాస ఆగిపోయినది! దశమరంధ్రమైన బ్రహ్మరంధ్రము నుండి ప్రాణవాయువు బయటకి పోయినదని అనుటకు నిదర్శనముగా ఈమె మాడు భాగము అంతా రక్తముతో నిండిపోవడముతో.......ఈ ఇంటి పూజారి కాస్త ఈమె పార్థివ దేహమును చూసి కాళ్ళకి దండముపెడుతూ మిగిలిన వారితో "ఈమె మానసిక సన్యాసదీక్ష శివయోగినిగా మారి 5 సంవత్సరాలు పాటు యోగ సాధనను కొనసాగించి కపాలమోక్షము పొందిన ధన్యజీవి! పునఃజన్మ లేని స్థితి పొందిన యోగిని! ఈ దేహము అందరికి పూజ నీయము చేయుటకు శాస్త్ర ప్రకారము అయితే ఈమె దేహమును దహనము చెయ్యాలి! కాని ఈమె మానసిక సన్యాసిని అవ్వడముతో ఈమె దేహము సమాధి చెయ్యడమే ఉత్త్తమమని ఆయన చెప్పడముతో........ అందరి సమక్షములో ఈమె దేహముకాస్త జీవనసమాధి చెయ్యబడి యోగిని దేవాలయముగా ప్రసిద్ధిచెందినది!

                  ఇది ఇలా ఉంటే ఇలాంటి మానసిక సన్యాసి శివదీక్ష తీసుకున్న శ్వేతాదేవికి ఒకరోజు ధ్యానమునందు తన ఆదిజన్మ ఒక శ్వేతనాగుపాము అని..........ఇది శివుడి మెడలో ఉన్న దేవతా పాము అని ఙ్ఞానస్పురణ కల్గినది! నిజానికి పాములకి ఎన్నో రకాల శక్తులుండుటవలన తనకి అవికాస్తా ప్రారబ్ధకర్మలుగా మారి యోగశక్తులు పొందాలనే తపన తాపత్రయాలు ఏర్పడడము వలన ఈ మానవజన్మ కలిగినదని జ్ఞాన స్ఫురణ కల్గినది! ఇలా ఏడు సంవత్సరాల తన సాధన వలన అనేక రకాల యోగసిద్ధులు, పంచభూతాల మీద ఆధిపత్యము నెలల పాటు స్నానాలు చెయ్యకపోయినా ఒంటి నుండి దుర్వాసన రాకుండా సువాసనలు రావడము అలాగే శరీరము నుండి విభూధి సహజసిద్ధముగా ఏర్పడడము చూసేసరికి ఈయన భర్త, పిల్లలు,అత్తమామలు ,తల్లితండ్రులు కాస్త ఈమెకి భక్తులుగా మారిపోయినారు. అమ్మ కాస్త అమ్మవారిగా మారిపోయినది! భార్య కాస్త యోగినిగా మారిపోవడము జరిగినది! దానితో ఈమెకి సంసార బాధ్యతలు తప్పినాయి! ఎక్కువ సమయము సాధన జీవితమునకే అంకితమవుతున్న సమయములో ఒకరోజు ఈమె తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా............ విపరీతముగా మెదడుపోటు రావడము జరిగినది! తలలో ఏవో ప్రేలుతున్న శబ్దాలు వినబడటము మొదలైనాయి! దానితో తనకి కపాలమోక్ష సమయము ఆసన్నమైనదని గ్రహించి మౌనము వహించింది! కొన్ని క్షణాలకి మెదడులోని పిట్యూటరీ గ్రంధి విబేధన దృశ్యము మనోనేత్రమునందు లీలగా కనిపిస్తుండేసరికి.........దశమ రంధ్రమైన బ్రహ్మరంధ్రము నుండి ప్రాణశక్తి బయటికి వెళ్లిపోగా..........రక్త చారిక బయటికి రావడముతో.......... శరీరము కాస్త ఒక ప్రక్కకి జరిగిపోయినది! మరుసటి ఉదయము ఇలా జరిగిన తన భార్య శరీరమును చూసి భర్త కాస్త కంగారుపడి మిగిలిన వారందరికీ చెప్పగా........వాళ్ళు వచ్చి చూసి తల నుండి రక్తము బయటికి రావడము గమనించి.....ఈమెకి కపాలమోక్షము కలిగినదని అందరికి తెలియడముతో..... ఈమె దేహమును ఊరంతా ఊరేగించి గంధపు చెక్కలతో దహనము చేసినారు! అంతే విచిత్రముగా ఈ మాడు ప్రాంతము నుండి తెల్లని కాంతి శరీరమున్న ఒక స్త్రీ మూర్తి స్వరూపము లీలగా.....పొగ రూపము కనిపించే సరికి ఈ మహత్తర దృశ్యమును అక్కడున్న అన్ని సెల్ ఫోన్ లు ఒక్కసారిగా క్లిక్ అన్నాయి! పత్రికలలో అంతక్రియలలో అద్భుతం అని పత్రిక శీర్షికలో మర్నాడు ఈమె గూర్చి రావడము జరిగినది!

         ఇది ఇలా ఉంటె మానసిక శివదీక్షలో ఉన్న శారదకి అన్ని రకాల సాధన సందేహాలు అరటిపండు వలిచి ఇచ్చినట్లుగా గుప్త యోగి చెప్తుండేసరికి రాను రాను ఈమెకి సందేహాలు తగ్గడము మొదలైంది! అసలు సందేహాలు ఎవరికీ వస్తున్నాయి! ఎక్కడ నుండి వస్తున్నాయి! ప్రశ్న లేని సమాధానము అలాగే సమాధానము లేని ప్రశ్న ఉండదని జ్ఞాన స్ఫూరణలు పొందడము మొదలైంది! దానితో ప్రశ్నలకు  సమాధానాలు వెతకడము మానివేసినది! కేవలము నామ మనోజపము చేసుకుంటూ సంసార బాధ్యతలు అలాగే నిత్యపూజలు చేసుకుంటూ తనలో కలిగే ధ్యాన అనుభవాలు ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సాధనను కొనసాగిస్తూ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది! పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యి పెళ్లిళ్లు గూడ పూర్తి అయినాయి! నెమ్మదిగా సంసార బాధ్యతల ఒత్తిడి తగ్గడము మొదలైయింది! అనుకోని పరిస్థితులలో ఒకరోజు అర్ధరాత్రి తన భర్తకి శ్వాసకి ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళేలోపుల ప్రాణాలు పోయినాయి! అయినగూడ ఈమె చింతించలేదు!బాధపడలేదు!ఆనందముగా ఈయనను స్మశానమునకు సాగనంపినది! మిగిలిన బంధు మిత్రులు అందరు ఈమె కంటి నుండి కన్నీరు రాకపోవడము కధలు కధలుగా ఏవో ఊహించుకొని ప్రచారాలు చేసినారని తెలిసినగూడ పెద్దగా పట్టించుకోలేదు! ఈయన పోయిన ఎనమిది నెలలకి అనుకోకుండా ఈమె గూడ నిద్రలోనే ప్రాణాలు వీడటము జరిగినది! మర్నాడు కొడుకు-కోడలు వచ్చి ఈమెను నిద్రలేపి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదామని ఈమె గదికి రావడము.......గదిలో ఈమె నిర్జీవముగా పడి ఉండటము గమనించి కొడుకు కాస్త ఈమె నాడిని పట్టుకోగానే..........నాడి కొట్టుకోవడము లేదని తెలిసి.........బాధపడినాడు! బంధు మిత్రులందరూ గుమిగూడినారు! శవమును స్మశానము వద్దకి తీసుకొని వెళ్ళినారు!చితిని ఏర్పర్చినారు! చితిమంట పెట్టె సమయానికి ఆశ్చర్యముగా......వింతగా........ననితి కట్టెకి ఉన్న నిప్పు ఆరిపోవడము జరిగినది! గాలి లేదు! అయిన నిప్పుకట్టె ఎందుకు ఆరిపోయినదో ఎవరికీ అర్ధముకాలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిప్పుకట్టె కుంట ఆరిపోవడముతో.......ఈ శ్రాద్ధ కర్మ చేయించే పూజారికి ఏదో సందేహము వచ్చి ఈ పార్థివ దేహము యొక్క మాడు భాగమున ఉండే బ్రహ్మ రంధ్ర ప్రాంతము తాకగానే అక్కడ వేడి అగ్నిగుండమున్నట్లుగా అనుభూతి కలిగేసరికి వెంటనే ఆయన అక్కడున్న మిగిలిన వారితో "నాయనా! ఈమె దేహము నిప్పుకట్టెతో దహనము అవ్వదు! కేవలము బ్రహ్మరంధ్రము వద్ద ఉండే యోగాగ్నితో మాత్రమే దహనము అవుతుంది అంటుండగా..... అందరు చూస్తుండగానే........ఈమె పార్థివ దేహ మాడు  భాగము నుండి చిన్నపాటి నిప్పు రవ్వలు రావడము........క్షణాలలో ఈ దేహము యోగాగ్నితో దహనమవ్వడముతో.........శారదాదేవికి యోగాగ్నితో చితి వెలిగినదని........కపాలమోక్షమును పొందిన ధన్యజీవియని అందరి నోళ్ళలో కొనియాడబడినది!

ఇది ఇలా ఉంటె తమ కళ్ళముందరే అందరు స్నేహితురాళ్లు ఒక్కొక్కరిగా కపాలమోక్షం పొందిన విషయాలు స్వాతికి తెలిసి బాధపడసాగినది! అందరు గూడ పునఃజన్మలేని మోక్ష పధమును చేరుకుంటే........ ఇంకా తనకి ఎందుకు మరణము రావడములేదో అర్ధముగావడము లేదు! ఈ దేహ జన్మ ఏర్పడటానికి కారకమైన సంతానము కల్గినారుగదా! అయినగూడ తనకి ఎందుకు కపాలమోక్షం కల్గడము లేదో అర్ధము గావడములేదు! ఇప్పుడికే ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని 24 సంవత్సరాలు కావస్తోంది! పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు! సంసార బాధ్యతలు పెరుగుతున్నాయి! దాంపత్య జీవితము బాగానే కొనసాగుతోంది! ఆధ్యాత్మిక జీవితము గూడ రహస్యముగానే ముందుకి కొనసాగుతోంది! ఇంకా ఇలా ఎన్నాళ్ళు చెయ్యాలి! తన స్నేహితురాళ్ళకి కలిగినట్లుగా తనకి కపాలమోక్షం కలుగుతుందా? లేదా అనే ధర్మసందేహాలు అలాగే తన సాధన మీద సందేహాలు రావడముతో ఒకరోజు ఈ వేదనను భరించలేక తనకి ఎప్పుడు మోక్షము కలుగుతుందో కనుక్కోవాలని గుప్త యోగికి ఫోన్ చెయ్యగానే "అమ్మాయి! మీ స్నేహితులకి గత జన్మలలోనే యోగ సాధన పూర్తి చేసుకున్నారని కేవలము ఈ జన్మలో ఒక ప్రారబ్ధకర్మ నివారణ కోసము వచ్చి.......అది తృప్తిగా పూర్తి చేసుకొని.....వారి బాధ్యతలు నెరవేర్చుకొని కపాలమోక్షం పొందినారు! నీ పరిస్థితి అలాంటిదిగాదు! నీకు ఇంకా 36 సంవత్సరాల యోగసాధన మిగిలిపోయినది! నీ సంతానము అభివృద్ధికి రావాలి! పెళ్లిళ్లు అవ్వాలి! మనవళ్లను చూడాలి! నీ భర్త యొక్క బాధ్యతలు నెరవేర్చాలి! అప్పడిదాకా ఇష్టలింగారాధన చేసుకుంటూ శివ పంచాక్షరీ మంత్రం జపము చేసుకుంటూ చావు వచ్చేదాకా చాకిరి చేసుకోక తప్పదు! ఎప్పుడైతే నీ సర్వ సంకల్పాలు తీరిపోయినాయో.......సంకల్పము సిద్ధించాక శ్వాసతో పని ఉండదు గదా! అప్పుడే నీకు కపాల మోక్షము కలుగుతుంది! అని చెప్పగానే......బాధ్యతలు తీరితేగాని సంకల్పాలు తీరవు! సంకల్పాలు తీరితేకాని కర్మలు తీరవు! కర్మలు తీరితే కానీ కోరికలు తీరవు! కోరికలు తీరితేకాని ఆలోచనలు తగ్గవు!ఆలోచనలు తగ్గితే కానీ ఆనందాలు తగ్గవు ! ఆనందాలు తగ్గితేకాని జ్ఞానము తగ్గదు! జ్ఞానము తగ్గితేకానీ స్పందనలు తగ్గవు! స్పందనలు తగ్గితేకాని కార్యాలు తగ్గవు! కార్యాలు తగ్గితే కానీ మౌనము రాదు!మౌనము వస్తే కానీ సాక్షిభూతముగా తను ఉండలేదు! ఇలా ఇవి అన్ని ఒక దానివెంట మరొకటి రావడము అంటే చావు వచ్చేదాకా చాకిరి తప్పదని......స్వాతి గ్రహించి మౌనము వహించినది!

                                                ----------------శుభం భూయాత్-------------------

                                                              పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

హనుమ దర్శనం-ఆత్మకథ :

పవన్ మరియు శ్రీనివాస చక్రవర్తి మంచి యోగమిత్రులు! ఎల్లప్పుడూ వీరిద్దరి మధ్య ఆధ్యాత్మిక విషయాలే చర్చకి వస్తుంటాయి! పైగా శ్రీనివాసమూర్తి హనుమంతుడికి మహాభక్తుడు! ఎంతటి భక్తుడు అంటే తన భార్యగూడ సువర్చల అనే పేరు ఉన్న అమ్మాయినే వివాహము చేసుకున్నాడు! గాకపోతే హనుమంతుడిలాగా బ్రహ్మచర్య దీక్షతో ఉండాలని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే సువర్చల అమ్మాయి పరిచయంతో కాస్త చేసే ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రమైంది! బ్రహ్మచర్యమును తన ఇష్టదైవమైన హనుమంతుడికి ఇచ్చి తాను సంసారి అయినాడు! అయినగూడ హనుమత్ భక్తి మారలేదు! ఎలాగైనా ఈ జన్మలో హనుమత్ సాక్షాత్కార అనుభవ అనుభూతి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు! దీని కోసము ఎంతోమంది గురువులను కలిసినాడు! ఎన్నో సత్  గ్రంధాలు చదివినాడు! ఎన్నో మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేసిన గూడ ఎట్టి ప్రయోజనము కనిపించలేదు.

ఇలా గాదనుకొని పవన్తో కలిసి ఏ కాశీ క్షేత్రములో తులసి రామాయణము రచించిన గోస్వామి తులసీదాస్ కి హనుమ కనిపించిన హనుమాన్ ఘాట్ కి వీరిద్దరూ చేరుకున్నారు! కొన్ని రోజులు గడిచినాయి! ఈ ఘాట్ యందు కాదు ఈ కాశీ క్షేత్రములో గూడ హనుమత్ జాడ ఉన్నట్లుగా వీళ్ళకి అగుపించలేదు! ఏమి చెయ్యాలో అర్ధము కాని అయోమయ పరిస్థితి!   ఇది ఇలా ఉంటే ఒక రోజు వీరిద్దరు ఈ ఘాట్ యందు అరటి పండ్లు తింటూ ఉండగా... ఒక పెద్ద ముదుసలి కోతి వీరి దగ్గరికి వచ్చింది! పైగా తెల్లని పండు కోతి! ఇలాంటి తెల్లని కోతి పైగా అయిదు అడుగుల కోతిని చూడటము వీరిద్దరికి ఇదే మొదటిసారి! భయము వేసింది! ఒకవేళ ఈ కోతియే హనుమంతుడు కాదు గదా అనే సందేహ అనుమాన భయము వీరిద్దరికి వచ్చింది! చేతిలో ఉన్న అరటిపండు కాస్త శ్రీనివాస మూర్తి దానికి ఇచ్చాడు! అది సగము తిని మిగిలిన సగము ఇతడి చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది! విచిత్రముగాసగము తిన్న అరటిపండు ఇచ్చేసరికి వీళ్ళు కాస్త భక్తిగా ఈ ఎంగిలి ప్రసాదము వీరిద్దరు ఆప్యాయముగా తిన్నారు! కొద్ది సేపటికి స్పృహ కోల్పోయారు! యోగమత్తులోనికి అదే నిద్ర మెలుకువ కానీ యోగ నిద్ర స్థితికి చేరుకున్నారు!

        అప్పుడు ఇదే కోతి వీరిద్దరి దగ్గరకి వచ్చి వారిని ఒక చోటుకి తనతో రమ్మని చెప్పి... త్రిలోచన ఘాట్ యందు ఉన్న నాగకన్యలు సంచరించే అంతర్గత గుహ వైపుకి తీసుకొని వెళ్ళింది! గుహ ద్వారము తెరుచుకొంది! లోపల అంత గాఢాంధకారముగా ఉంది! సుమారుగా వీళ్ళు 8 km  పైగా ఈ గుహ యందు నడవగా... అవతలి వైపుకి చేరుకోగానే.... హిమాలయ మంచు పర్వతాలు స్వాగతము పలికినాయి! అంటే తామిద్దరిని ఈ కోతి కాస్త హిమాలయాలకు చేర్చినదని వీరిద్దరు గ్రహించినారు! అప్పుడు ఈ కోతి ఎటు వెలితే వీళ్లు గూడ దానిని అనుసరించసాగినారు! ఇది కాస్త సెలయేరు లాగా ప్రవహించే గోముఖ ప్రవాహాన్ని దాటి సన్నని  రోడ్డు వంటి దారి వెంబడి ప్రయాణించారు! ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొండ చరియలలో చాలా ఏపుగా పెరిగిన ఆకుపచ్చని రంగుతో ఆకులు లేని దేవదారు వృక్షాలు వీళ్ళకి కనిపించాయి! వింత వింత పక్షులు వాటి వింత ధ్వనులు కనిపించాయి! ఉన్నట్టుండి ఇలాంటి వాతావరణ మధ్యలో ఒక చోట ఈ పండుకోతి ఆగిపోయింది! అప్పుడు వీళ్లకి ఒక సుగంధ పుష్పాల సువాసనలతో పాటుగా బాగా మగ్గిన అరటిపండ్ల పరిమళం గూడ సోకింది! ఎప్పుడైతే ఈ పుష్పాల సువాసన ముక్కుని తగలగానే పవన్ వెంటనే శ్రీనివాస్ చక్రవర్తిని "ఓయ్! మనము హనుమత్ నివసించే సౌగంధిక పర్వతము మీదకి వచ్చినాము! ఎందుకంటే ఈ పుష్పాల వాసన అదే! వీటిని బ్రహ్మకమలము లేదా సౌగంధిక పుష్పాలు అంటారు! ఇది ప్రతి 12  సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పూస్తుంది! ఈ పుష్పాలున్న చోటనే మన హనుమంతుడు ఉంటాడని మహాభారతము చెపుతోంది అనగానే.... 

వెంటనే శ్రీనివాసమూర్తి "అవును ఈ పుష్పాల గూర్చి, హనుమత్ దర్శనము గూర్చి మహాభారతములో విన్నాను! ఒకసారి ద్రౌపదీదేవి వన విహారం చేస్తున్నపుడు ఈ సుగంధ పుష్పము ఎగిరి వచ్చి పడినదని... తనకి ఇలాంటి పుష్పాలు గావాలని భీముడిని కోరడము... ఆయన ఈ పుష్పాల కోసము హిమాలయాలకి రావడము... ఈ పుష్పాల వనము నందు హనుమంతుడు ఒక ముదుసలి కోతి రూపములో భీముడికి అగుపించి... దారికి అడ్డముగా ఉంచిన తన తోకను ఎత్తమని చెప్పడము... దానిని ఎత్తలేక భీముడు నానా అవస్థలు పడి చివరికి ఇది హనుమంతుడి లీలా విన్యాసమని గ్రహించి ఆ ముదుసలి కోతి యొక్క పాదాల మీద పడగానే... ఆయన నిజరూప దర్శనమిచ్చాడని నేను విన్నానని చెప్పడము జరిగింది! కొంపతీసి మనతో వచ్చిన కోతి.... హనుమంతుడా అని అడిగేసరికి... పవన్ కాస్త స్థిమితపడి ఆయన హనుమంతుడే అయితే మనకి కాశీక్షేత్రములోనే దర్శనమిచ్చేవాడుగదా! ఇక్కడి దాకా రావడమెందుకు! అన్నాడు! ఇంతలో ఈ పండుకోతి.... ఏదో గుబురు పొదవైపు చూపించి గోలగోలగా అరవడము.... అలాగే ప్రశాంతముగా ఉన్న వాతావరణము కాస్త భయానకముగా మారడము అక్కడే హాయిగా తిరుగుతున్న జింకలు, దుప్పిలు, కస్తూరి మృగాలు, మంచుకోతులు, అడవి దున్నలు , మంచు పులులు దేనినో చూస్తూ భయపడుతూ శర వేగముతో పరుగులు తీయడము వీరిద్దరి దృష్టికి వచ్చింది! ఆ పొదల లోపల ఏముంది అని వీరిద్దరు అనుమాన భయముతో అక్కడికి వెళ్లితే.... అక్కడ ఏదో వింత వాసన గుప్పున వీరికి వచ్చింది! ఇరవై అడుగులు ఉన్న ఆ గుబురు పాదాలను ఎవరో బలముగా కదిలిస్తున్నట్లుగా.... విదిలిస్తున్నట్లుగా పెద్ద శబ్దముతో అలికిడి చెయ్యగా... వీరిద్దరిలో ఏదో తెలియని అనుమాన భయము వెంటాడింది!  ఇంతలో ఈ గుబురు పాదాలనుండి సుమారుగా ఇరవై అడుగుల ఎత్తు ఉంది దట్టమైన నలుపు తెలుపు బొచ్చుతో... అటు మనిషి గాకుండా... ఇటు వానరము గాకుండా... మనిషిలాంటి శరీరముతో వానర ముఖంతో 'v ' ఆకారమున్న బొట్టుతో ఉన్న నర వానరము ఒకటి వీళ్ల మీదకి దూకి... పెద్దగా అరుస్తూ... ఏటో వెళ్లిపోవడము క్షణాలలో జరిగింది! దీని దూకుడు వేగానికి వీరిద్దరు అదిరిపడి అక్కడే పడిపోయినారు! కొద్ది సేపటికి వాతావరణము ప్రశాంతస్థితికి వచ్చింది! జంతువులు, పక్షులు యధావిధిగా హాయిగా సంచారము చేస్తున్నాయి! వీరిద్దరు గూడ మామూలు స్థితికి వచ్చి... ఈ మానవ వానరము వెళ్లిన వైపు చూడగా...  వీళ్లకి మంచులో సుమారుగా మూడున్నర అడుగులున్న పాదముద్రలు పైగా వీటికి ఆరు వ్రేళ్లు ఉన్నట్లుగా గమనించి.... ఈ మానవ వానరమే... హనుమంతుడని గ్రహించి... ఈ పాదాలకి నమస్కరించారు! ఇంతలో తమతో వచ్చిన ముదుసలికోతి రెండు సౌగంధిక పుష్పాలను అలాగే అరటి పండ్లు తీసుకొని రావడముతో... వీటిని తింటూ ఉండగా... ఈ పుష్పాల ఘాటైన సువాసనకు వీళ్లు స్పృహ తప్పి పడి పోయినారు!

                         ఇంతలో మెలకువ వచ్చి చూస్తే వీరిద్దరు కాశీ క్షేత్రములో ఉన్నారు! అసలు ఏమి జరిగినదో శ్రీనివాసమూర్తికి అర్ధము కాలేదు! తమ చుట్టూ సుమారుగా 18 దాకా మామూలు కోతులున్నాయి! అవి పైగా వీళ్లకి సేవలు చేస్తున్నట్లుగా గమనించాడు! అప్పుడు పవన్ కాస్త ఇతనితో "మనము స్థూల శరీరాలతో హిమాలయాలకు వెళ్ళలేదు! సూక్ష్మ శరీరాలతో వెళ్లి హనుమాన్ దర్శనము చేసుకున్నాము! అప్పడిదాకా మన స్థూల శరీరాల దగ్గరికి ఎవరు రాకుండా ఈ కోతులే కాపాడినాయి! ఎందుకంటే సూక్ష్మ శరీరము లేని స్థూల శరీరము కాస్త శవముతో సమానము! ఎవరైనా మన శరీరాలు శవాలని గ్రహించి శవ సంస్కారాలు చేస్తే... మన సూక్ష్మ శరీరానికి ప్రమాదము అని గ్రహించి ఇవి ఇన్నాళ్లు కాపలా కాసినాయి! ఇలా ౧౨ రోజుల నుంచి ఇవి మనకి సేవలు చేస్తూ మన శరీరాలను కాపాడుతున్నాయి అని చెప్పగానే... శ్రీనివాస మూర్తికి వీటిమీద ఆ క్షణము నుండి ప్రేమ, ఆప్యాయత, మోహ, వ్యామోహాలు కల్గినాయి! ఇవే లేకపోతే తమ స్థూల శరీరాలు ఉండేవిగాదని గ్రహించి వీటి మీద కృతజ్ఞత భావము పెంచుకున్నాడు! అలాగే సూక్ష్మ శరీర యానము అంటే భయము, అనాసక్తిని , ఏదో తెలియని చెప్పలేని స్థితిని పెంచుకున్నాడు! ఆ తర్వాత వీరిద్దరు కాశీ క్షేత్రము నుండి ఇంటికి వచ్చినారు!కాని శ్రీనివాసమూర్తిలో సూక్ష్మశరీరయానముతో హిమాలయాలకి వెళ్లి హనుమత్ దర్శన అనుభవ అనుభూతి పొందిన విషయము జీర్ణించుకోలేకపోయినాడు! చచ్చినప్పుడు వెళ్ళవలసిన చోటుకి బ్రతికి ఉండగానే వెళ్ళడము లాంటి అనుభవమును పదే పదే గుర్తుకు రావడము జరుగుతోంది! దీనిని మర్చిపోలేకపోతున్నాడు! కాని పవన్ మాత్రము యధావిధిగా ఏమి తెలియని వాడిలాగా... ఏమి జరగని వాడిలాగా.. తన నిత్యకృత్య పనులలో బిజీగా అయిపోయినాడు. కాని శ్రీనివాస చక్రవర్తి అలా ఉండలేక పోయినాడు.

దానితో ఈయనకి తమకి నిజముగానే నిజరూప హనుమ దర్శనం అయిందా? అని పవన్ అడిగితే...
 
 అపుడు పవన్ వెంటనే "శ్రీనివాసా! ఎందుకు అవ్వలేదు! మనకి నిజముగానే ఆయన నిజరూప దర్శనం అయ్యింది! గాకపోతే స్థూల శరీరముతో గాకుండా సూక్ష్మ శరీరముతో అయింది! అంతే తేడా? దీనివలన నీవు నమ్మలేకపోతున్నావు! అంతెందుకు 1992  సంవత్సరములో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఒకటి చెపుతాను! విను! అది ఏమిటంటే కర్ణాటక వాసులు బద్రీనాధ్ క్షేత్రానికి వెళ్ళినారు! అప్పుడు ఒక పిల్లాడు ఈ గుడిలో ఉండిపోయినాడు! ఆరోజు ఆరు నెలల పాటు గుడిని మూసే రోజు గావడము విశేషము! అనుకోకుండా ఆలయ పూజారులు గుడిలోపుల ఉన్న పిల్లవాడిని గమనించకుండా గుడిలో అఖండ దీపారాధన చేసి అక్కడ బ్రహ్మకమలాలుంచి ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసి యధావిధిగా వెళ్ళిపోయినారు! లోపల పిల్లవాడు అలాగే గుడిలో ఉండిపోయినాడు! ఆరు నెలల తర్వాత గుడి పూజారులు ఈ ఆలయమును తెరిచి చూస్తే... లోపల ఈ పిల్లవాడు ఉన్నాడని గ్రహించి గమనించి ఆశ్చర్యము చెందినారు! ఎందుకంటే ఆ పిల్లవాడు ఆరు నెలల పాటు ఆహారము లేకపోయినా గూడ ఆరోగ్యముగా ఉండటము గమనించి ఆపిల్లవాడిని అడిగితే నా ఆకలి తీర్చటానికి హనుమంతు స్వామి వారు ఒక యతి రూపములో వచ్చి బద్రినారాయణుడిని పూజించి ఆయనకి పెట్టిన నైవేద్యమును నాకు ప్రసాదముగా పెట్టి ప్రతిరోజు ఇలా ఈ ఆరునెలలు చేసినారని ఆ పిల్లవాడు అమాయకముగా అమిత భక్తితో చెపుతూండేసరికి... అప్పుడు కాని ఈ లోకానికి ఆరు నెలల పాటు అఖండ దీపము ఆరిపోకుండా వెలగటానికి.... అలాగే అక్కడ పెట్టిన బ్రహ్మకమలాలు వాడిపోకుండా ఉండటానికి.... కారణము సజీవ హనుమంతుడని తెలిసింది! అంటే ఈయన సజీవముగా ఉన్నట్లేగదా! ఎందుకంటే బద్రీనాధ్ పర్వతమే-గంధమాదక పర్వతము అంటారు గదా! ఇలా ఆ పిల్లవాడికి ఆయనే స్వయంగా దర్శనము ఇచ్చినపుడు మనకి కల్గిన ఆయన దర్శనము నిజమే అవుతుంది గదా అనగానే.... శ్రీనివాస్ చక్రవర్తికి తమ అనుభవము గూడ నిజమేనని రూఢి అవ్వడముతో....

ఒక మంగళ వారము రోజు రాత్రి... తన ఇంటిలో నిత్యమూ పూజించే హనుమంతుడి విగ్రహమూర్తికి మోకరిల్లి.... "స్వామి! ఓ వీర హనుమంతా! నీ ముందు నేనెంత! ప్రభూ! నా అజ్ఞానమును మన్నించు! భీముడు అంతటివాడే నిన్ను గుర్తించలేదు! నేనెంత! నిన్ను గుర్తించనందుకు! నిన్ను గుర్తించే లోపల నీవు నన్ను వదిలి పెట్టినావు! అయిన బాధలేదు! హిమాలయాలలో చిరంజీవి తత్వముతో.... ఏడుగురు యతీశ్వరులు ఉంటారని వారే... వ్యాసమహర్షి, మార్కండేయుడు, అశ్వథ్దామ, సంజయుడు, శ్రీ దత్తాత్రేయుడు, బలిచక్రవర్తి నువ్వు ఉంటావని మా అమ్మ తాను చదివిన కధలలో చెప్పగా విన్నాను! మీరు ఉన్నగూడ మీలాంటి వాళ్లని చూసేదెలా? ఒకవేళ చూసినంత మాత్రమున గుర్తుపట్టేదెలా? మీ అనుగ్రహ బలముంటే తప్ప మిమ్మల్ని గుర్తించలేము గదా! స్వామి! నేను చేసిన పూజా ఫలముతో నీ సాక్షాత్కార అనుభవ అనుభూతిని మిగిల్చినావు! అందుకు చాలా కృతజ్ఞుడిని! అంటూ కన్నీరు కారుస్తూ ఆవేదన భక్తితో అమితమైన ఆవేదన పడుతుండగా.... గుండె వేగము అమాంతముగా పెరుగుతూండగా... తనకి సహాయము చేసిన కోతులకి ఎలాగైనా ఏదైనా సహాయ సహకారాలు అందించాలనే తుది కోరికతో తుదిశ్వాస విడిచాడు! 

కొన్ని సంవత్సరాల తర్వాత భద్రకాళి అమ్మవారు ఉన్న వరంగల్లు ప్రాంతమునందు గృహస్థ కర్మయోగిగా పునఃజన్మ ఎత్తి.... ఏ కోతులు అయితే సహాయ సహకారాలు ఇచ్చినాయో...ఆ కోతులకి ప్రతిరోజు ఒక డజన్ అరటిపండ్లు వాటికిస్తూ... వాటి ఆకలి కొంతమేర తీరుస్తూ... గాకపోతే సూక్ష్మ యానము చేసే యోగులన్నా... వారి జీవిత చరిత్ర కధలు విన్న గూడ ఏదో తెలియని వీర్రా వేశమునకి గురి అవుతూ... సత్యానికి... అసత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటలేక అయోమయము అర్ధముకాని భక్తికి... ముక్తికి మధ్య కొట్టు మిట్టాడుతూ కాలము వెళ్లదీస్తున్నాడు! పవన్ మాత్రము యోగమునందు పరిపూర్ణ సాధన స్థితికి రావటానికి పునః జన్మ ఎత్తి పరమహంస పవనానంద స్థాయికి చేరుకొని హనుమంతుడినే తన చుట్టూ రక్షణ కవచముగా ఏర్పర్చుకుంటే... పాపము శ్రీనివాస చక్రవర్తి పునః జన్మ అయిన కర్మయోగి మాత్రము ఆ హనుమంతుడిని కోతుల రూపములో నిత్యమూ ఆరాధించే స్థితిలో ఉండిపోయినాడు! కర్మ నివారణ చేసుకుంటూ ఉండిపోయినాడు! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

గురువు-గురుత్వాకర్షణశక్తి-ఆత్మకథ

జిజ్ఞాసి.......

ఆధ్యాత్మిక విషయాలయందు ఆసక్తి ఎక్కువ! 

మానవజన్మ అనేది పునః జన్మ లేకుండా చేసుకోవటానికి ఉన్నదని వివిధ పుస్తక- గ్రంధాలు చదివి తెలుసుకున్నాడు! అందుకు గురూపదేశ మంత్రమును పొందాలని...... ఇది పొంది ఆ మంత్రసాధన చేస్తే....వచ్చే మంత్ర సిద్ధి వలన తనలో కుండలిని శక్తి జాగృతి అయ్యి 13 యోగచక్రాలలో ఈ శక్తి ప్రవేశించి వాటిని జాగృతి చేస్తూ శుద్ధి చేస్తూ..... ఆధీనమవుతాయని తద్వారా అష్ట సిద్ధులు, పంచ భూతాలు ఆధీనం అవుతాయని..... వీటి మాయలో పడకుండా దేనికి స్పందించకుండా.......దేనికి ఆశపడకుండా......దేనికి భయపడకుండా.....దేనికి ఆలోచించకుండా... దేనికి సంకల్పించకుండా బ్రహ్మతదాకార స్థితిలో ఉంటే....మూలాధార చక్రము నుండి ఒక దివ్య దీపకాంతి వంటి ఆత్మ జ్యోతి బయలుదేరి యోగచక్రాలను దాటుకుంటూ .... బ్రహ్మరంధ్రము వద్దకి చేరుకొని....ఈ ఆత్మ జ్యోతి కాస్త ఈ రంధ్రము నుండి బయటికి వస్తూ విశ్వ శూన్యమైన నిరాకార పరబ్రహ్మముయందు ఐక్యము చేసుకోవడమే.....మోక్షప్రాప్తియని....... అప్పుడు తల యొక్క మాడు భాగములో ఉన్న సూది బెజ్జము వంటి బ్రహ్మరంధ్రము నుండి రక్తము బయటికి రావడమే- కపాల మోక్షమని... ఇట్టి స్థితి వలన కర్మరాహిత్యము, జన్మ రాహిత్యము, కోరిక రాహిత్యము, ఆలోచన రాహిత్యము,స్పందన రాహిత్యము కలిగి పునఃరపి జననము....పునఃరపి మరణము లేని శాశ్వత మరణస్థితి కలుగుతుందని.....ఇట్టి పరమ ఉన్నత స్థితిని పొందటయే మానవుడి లక్ష్యసాధనయని....ఇదియే మానవుడిని ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి.....బుద్ధిస్థితి నుండి బుద్ధం స్థితికి తీసుకొని వెళ్ళుతుందని బోధ గురువుల ద్వారా, యోగ గురువుల ద్వారా, యోగుల అనుభవాల ద్వారా, యోగ సాధకుల  ద్వారా.....వివిధ ఆధ్యాత్మిక పుస్తక గ్రంధాలు చదవడము ద్వారా తెలుసుకున్నాడు!

                అంటే తనకి మోక్షప్రాప్తి కావాలంటే గురు మంత్రోపదేశము జరగాలి! దీనికి ఒక గురువు గావాలి! అందుకే వేట మొదలు పెట్టాలి అని గ్రహించి గురువు కోసము తను ఉన్న ఊరి పరిసరాలలోఎవరైనా ఉన్నారేమోనని వెతకడము ప్రారంభించాడు! ఎక్కడా గురువు గూర్చిన సమాచారము కాని అలాగే మంత్రోపదేశము చేసే గురువు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతములో లేడని తెలుసుకొని విచారములో పడినాడు! గురువు లేకపోతే మంత్రోపదేశము జరుగదు! ఇది జరుగకపోతే తనలో కుండలినీశక్తి జాగృతి అవ్వదు! యోగచక్రాలు శుధ్ధిగావు! అంటే ఈ లెక్కన చూస్తే తనకి ఈ జన్మ అంతిమ జన్మ కాదు! మళ్ళీ పునః జన్మలు ఎత్తాలి! నానా కష్టాలు పడాలి! ఉండేది కూటికోసము పోయేది కాటికోసము అన్నట్లుగా ఈ జీవ జన్మలుంటాయి గదా! ఇప్పుడు ఏమి చెయ్యాలి! అనుకుంటూ తను చదివే డిగ్రీ చదువును అశ్రద్ధ చెయ్యడము ప్రారంభించాడు! తోటి స్నేహితులు ఇతగాడి బాధను తెలుసుకొని అందులో శ్రీను అనే వాడు వెంటనే "ఒరేయ్! జిజ్ఞాసి! నేను నీకు గావలసిన గురువును చూపించలేకపోవచ్చును! కాని నీ గురువును చూపించే వ్యక్తిని నీకు పరిచయము చేస్తాను రా! నా వెంట అంటూ.... ఇదే ఊరిలో ఉన్న శివాలయమునకు తీసుకొనివెళ్ళాడు! ఎందుకంటే ఈ ఆలయ ప్రధాన పూజారి కొడుకు పవన్ కు గూడ ఆధ్యాత్మిక సాధనయందు శ్రద్ధ ఎక్కువ! పైగా 24 లక్షల గాయత్రీ మహామంత్ర సాధన చేసి సిద్ధి పొందినాడు! ఇతడి నోటి వాక్కు దైవవాక్కు లాగా జరుగుతుంది! చెప్పింది చెప్పినది పొల్లు పోకుండా శ్రీను జీవితములో అక్షర సత్యంగా జరగడముతో..... జిజ్ఞాసి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారము చూపుతాడని గట్టి నమ్మకముతో ఆత్మ విశ్వాసముతో పవన్ ను పరిచయము చెయ్యడానికి జిజ్ఞాసిని తీసుకొనివచ్చాడు!

           పవన్ కాస్త వీరిద్దరిని చూసి....శ్రీనుని చూసి క్షేమ సమాచారాలు తెలుసుకొని క్రొత్తగా వచ్చిన జిజ్ఞాసి ముఖము వైపు ప్రసన్నముగా చూస్తూ  శ్రీను! ఇతను ఎవరు? నాతో ఏమైనా పని ఉందా? అడిగాడు ! వెంటనే శ్రీను "స్వామి! ఇతని పేరు జిజ్ఞాసి! చదువులో నీకు జూనియర్! మన కాలేజీలోనే చదువుతున్నాడు! ఇతనికి గూడ నీకు లాగానే ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువే! ఏవో మంత్రం పుస్తకాలలో ఉన్న మంత్రాలు అదే రామమంత్రము, రామాయణము,మహాభారతం, భగవద్గీత, గురుగీత, అష్టావక్ర గీత,యోగవాసిష్టం చదివేసి ఇప్పుడు గురువుకోసము షిరిడి సాయిబాబా చరిత్ర అలాగే గురుచరిత్ర పారాయణము చేస్తున్నాడు అని చెప్పగానే.....

పవన్ వెంటనే జిజ్ఞాసి వైపు తిరిగి "అవునా! మీరు సాయిబాబా చరిత్ర చదివినారా? అనగానే..... జిజ్ఞాసి కాస్త ఇబ్బంది పడుతూ అదోలా సిగ్గు పడుతూ అవునండి! అన్నాడు!

పవన్ వెంటనే " అవునుకాని మీరు మంత్రాలు ఎందుకు చదివినారు? అనగానే.....

జిజ్ఞాసి వెంటనే "అదిగాదు! అవి చదివితే చదువులో మంచి మార్కులు వస్తాయని సరస్వతి మంత్రము, దేవి సూక్తము,విష్ణు, లలితా సహస్రనామాలు చదవడము ప్రారంభించాను! ఆ తర్వాత నాకు చదువులో స్కూలు ర్యాంకులు రావడము జరిగేది! ఈ మంత్రాలు చదువుకొని వెళ్ళితే పరీక్షలు బాగా వ్రాసేవాడిని! లేకపోతే ఏవో తప్పుడు సమాధానాలతో పరీక్షలు రాసేవాడిని! అనగానే

పవన్ వెంటనే "అయితే మీరు చదువు కోసము, మార్కుల కోసము మంత్ర సాధన చేసినారని చెప్పినవిషయములోనే మీ నిజాయితీ కనబడుతోంది! మాటలలో, చూపులలో, చేష్టలలో తెలియని అమాయకత్వము గోచరిస్తోంది! ఇప్పుడు మిమ్మల్ని శ్రీను నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చాడో చెపుతారా?

   జిజ్ఞాసి కాస్త ఇబ్బంది పడుతూ అక్కడే ఉన్న శ్రీను వంక ఓరగా చూస్తూ ఆ తర్వాత పవన్ వైపు తిరిగి "ఏమి లేదండి! నాకు గురు మంత్రోపదేశము చేసే గురువు గావాలి! ఆయన ఎక్కడ ఉంటాడో మీ లాంటివారికి తెలిసే అవకాశముంటుందని శ్రీను చెప్పితే మీ దగ్గరికి వచ్చాను! దారి మధ్యలో మీరు బాగా జాతకాలు చెపుతారని తెలుసుకున్నాను! నాకు జాతకముతో పని లేదు! నా గురువు ఎవరో ఎక్కడ ఉన్నారో చెప్పితే అది చాలు! మీలాంటి వారికీ చెప్పే అంతటివాడిని కాను! గురువు లేకుండా యోగసాధన చెయ్యలేము గదా! సాధన చెయ్యకపోతే మోక్షము పొందలేము గదా! మోక్షప్రాప్తి కోసము నాకు గురువు గావాలి! ఈయనకోసము నేను మన ఊరి చుట్టూ ప్రక్కల ఉన్న గుడులు తిరిగాను! శ్రీశైలము,భద్రాచలం,అన్నవరం,మోపిదేవి, ఘంటసాల, మహాకంచి, అలంపురము, పానకాల స్వామి గుడి ఇలా అన్నింటికి వెళ్లిన గూడ నాకు ఒక సన్యాసి గూడ కనిపించలేదు! అదే నా బాధ! అని కళ్ళలో నీరు ఉబికివస్తూ.... మాటలలో తడబాటు.... ఏదీ తెలియని ఆవేధనతో శరీరకంపనాలు జిజ్ఞాసికి మొదలు అవ్వడము పవన్ కాస్త ఓరకంటతో లీలగా గమనించి....

"జిజ్ఞాసి! మీ గురువు కోసము మీ మానవ ప్రయత్నము మీరు చేసినారు! ఇంకా దైవ ప్రయత్నమే ఉంది! అందుకు మీరు చేస్తున్న గురుచరిత్ర పారాయణము తొమ్మిది సార్లు పూర్తి చేసి నా దగ్గరికి రండి! గురువులలోకెల్లా మహా గురువైన...... శ్రీ దత్తాత్రేయ స్వామియే మీ గురువుకి సంబంధించిన వివరాలు మీకు చెపుతాడు! కంగారుపడకండి! బాధపడకండి! ఆవేదన పెంచుకోండి! భక్తి విశ్వాసాలు పెంచుకోండి! కాలమే దీనికి సమాధానము చెపుతుంది అని చెప్పగానే..... పవన్ చెప్పిన ఓదార్పు మాటలకి జిజ్ఞాసిలో  ఏదో తెలియని మనోధైర్యము కలిగి సంతోషముగా వీరిద్దరు ఆరోజు అక్కడ నుండి ఇంటికి వెళ్ళినారు!

                కాలచక్రము తిరుగుతోంది! గురుచరిత్ర పారాయణము తొమ్మిది సార్లు పూర్తి చెయ్యడానికి 41 రోజులకి ఒక పారాయణము చొప్పున తొమ్మిది పారాయణాలకి ఒక సంవత్సరం కాలము పట్టినది! ఈ పారాయణ సమయములో పవన్ అలాగే జిజ్ఞాసి మధ్య మంచి స్నేహ సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయి! గాకపోతే ఎప్పుడుగూడ వీరిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలకి, ఆర్ధిక విషయాల గూర్చి సంభాషణ జరిగేవి గావు! కేవలము వీళ్ళు ఇద్దరు ఎప్పుడు కలిసిన తెలుసుకున్న క్రొత్త ఆధ్యాత్మిక విషయాలు, దైవిక వస్తువుల గూర్చి, యోగుల మహిమలు గూర్చి ఊళ్లల్లో జరిగే దైవిక సంఘటనాల గూర్చి ఇలా మున్నగు ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుకొనేవారు! ఇతర ఊళ్ళల్లో జరిగే జాతరలకి వీరిద్దరు కలిసి వెళ్లేవారు! ఆ తర్వాత ఎవరి చదువులు వారికి ఉండేవి!

           ఇలా జిజ్ఞాసి కాస్త గురుచరిత్ర పారాయణము పూర్తి చేసి నెలరోజులు గావస్తున్నా కొద్ది తన గురువు కోసము ఆవేదన పడటము పవన్ గమనించి ఏమి చెయ్యలేని స్థితికి తనుగూడ జిజ్ఞాసికి ఎలాగైనా గురువును చూపించాలని విశ్వగురువైన దత్తాత్రేయ స్వామి అలాగే పరమ గురువైన మేధాదక్షిణామూర్తి దైవరూపాలను మౌనముగా అడగడము తప్ప ఏమి చెయ్యలేకపోయినాడు!

                          ఒకనాడు జిజ్ఞాసి తెల్లవారుజామున పట్టే గాఢనిద్రలో యుండగా.....ఒక అశరీరవాణి గొంతు వినబడి "రా! నీకోసము ఎదురుచూస్తున్నాను. నా దగ్గరికి రా!" అంటూ ముమ్మార్లు పిలిచినట్లుగా అనిపించగానే ఉలిక్కి పడి నిద్ర లేచి చూసినాడు. ఎవరు లేరు! ఎవరు కనిపించలేదు! కాని చెవులలో వినిపించిన మాటలు మారు మ్రోగుతున్నాయి! మరుసటి రోజు ఉదయము పవన్ ని కలిసి రాత్రి తనకి జరిగిన సంఘటన గూర్చి జిజ్ఞాసి చెప్పగానే....

పవన్ ముఖములో ఆనందం తాండవిస్తూ "జిజ్ఞాసి! నీ గురువు దొరికినట్టే! ఎందుకంటే అశరీరవాణి ఎవరిదో గాదు! సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారిదే! ఆయనే నీ గురువు ఏర్పాటు చేసినాడు! నీ గురువు నీ కోసము ఎదురుచూసేటట్లుగా చేసినాడు! ఇంకా ఆలస్యమెందుకు! నీ గురువును వెతుకొనే ప్రయత్నము మొదలు పెట్టు! భారతదేశ తీర్ధయాత్ర చేసిరా! నీ గురువు ఎక్కడో ఒక చోట నీకు తారసపడతారు! అని చెప్పి చెప్పగానే.......

జిజ్ఞాసి వెంటనే "పవన్! బాగానే ఉంది! ఆయనే నా గురువు అని ఎలా గుర్తు పట్టాలి? ఈ తీర్థయాత్రలో నాకు ఎంతో మంది యాత్రికులు, సన్యాసులు, సాధువులు, బోధ గురువులు, దీక్ష గురువులు, యోగ గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, ఇలా ఎందరో ఎదురుపడే అవకాశమున్నది గదా! వీళ్లల్లో నా గురువును ఎలా గుర్తించాలి? పోనీ ఆయనే నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వస్తే....ఆయనే నా గురువని ఎలా తెలుసుకోవాలి? అనగానే......"

                 పవన్ ఒక క్షణము కళ్ళు మూసుకొని కళ్ళు తెరువకుండానే "జిజ్ఞాసి! నేను చెప్పేది జాగ్రత్తగా విను! మనస్సులో గుర్తు పెట్టుకో! ఊరికి దక్షిణ దిక్కులో వచ్చే క్షేత్రానికి వేళ్ళు! అక్కడ నుండి నీ గురువు కోసము యాత్ర మొదలుపెట్టు! నీ గురువు చూడటానికి నెరిసిన జుట్టుతో....నెరిసిన గడ్డముతో.....చింపిరి జుట్టుతో..... పొడి పొడిగా మాట్లాడటం, సన్నగా....పొడవుగా.....ఎముకల గూడు వంటి నల్లని శరీరముతో గంభీర ముఖంతో వశపరుచుకొనే కంటిచూపుతో..... మాటలలో సౌమ్యముగాను...కోపములో పరశురాముడిలాగా....మాట నిలబెట్టుకొనుటలో శ్రీరాముడిలాగా....పట్టు వదలని మార్కండేయుడిలాగా జ్ఞానము తెలిసిన అజ్ఞాని లాగా....... ప్రాపంచిక విషయాలు దాటిన అవధూతలాగా....మనస్సుకి ఉల్లాసము కలిగించే ఓదార్పు మాటలతో......ప్రశాంత చిరునవ్వుతో..... కల్మషము లేని మనస్సుతో....ధనము ఆశించనిస్థితిలో....నీ గురువు ఉంటాడు! కనబడతాడు అంటూ....పవన్ కళ్ళు తెరిచి "జిజ్ఞాసి! ఇప్పుడిదాకా నేను తన్మయ స్థితిలోకి వెళ్లి ఏమి అన్నానో.....ఏమి చెప్పినానో నాకు గుర్తులేదు! నేను చెప్పిన విషయాలు నీకు ఏమైనా ఉపయోగపడితే నీ గురువు నీకు దొరికినట్లే "గురువు అనుగ్రహ ప్రాప్తిరస్తు" అంటూ జిజ్ఞాసిని దీవించి పవన్ కాస్త గుడి లోపలకి ఎవరో భక్తులు పూజ కోసము వస్తే వాళ్ళకి పూజ చెయ్యడానికి వెళ్ళాడు! తీరా పూజ చేసి బయటికి వచ్చేసరికి అక్కడ పవన్ కి జిజ్ఞాసి కన్పించలేదు! అంటే గురువుకోసము ఈ రోజు నుండి వేట మొదలు పెట్టినాడని పవన్ గ్రహించి శివజపము చేసుకోవడము ప్రారంభించాడు.

పవన్ చెప్పిన దక్షిణ దిక్కులోని క్షేత్రముగా శ్రీశైలము రావడము అక్కడికి జిజ్ఞాసి చేరుకున్నాడు. అక్కడ పవన్ చెప్పిన గుర్తులతో ఏ వ్యక్తి కనిపించక పోయేసరికి ఆవేదనతో తన ఇష్టదైవము శ్రీరాముడు ఉన్న భద్రాచల క్షేత్రానికి చేరుకున్నాడు! అక్కడ గురువు కోసము వారము రోజులు వెతికిన పవన్ చెప్పిన వ్యక్తి పోలికలున్న వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు! దిక్కుతోచని పరిస్థితి! ఏమి చెయ్యాలో అర్ధముకాని అయోమయ పరిస్థితి! రాను రాను గురువుకి సంబంధించి ఆవేదన భక్తి పెరుగుతోంది తప్ప తగ్గడము లేదు! అక్కడ నుండి తిరుపతి ఏడుకొండల స్వామిని దర్శించిన లాభము లేకపోయింది! అటు కంచి క్షేత్రానికి చేరుకున్నగూడ కంచి కామాక్షి గూడ కరుణ చూపలేదు! ఆపై మౌన మహర్షి అయిన భగవాన్ రమణ మహర్షి ఆశ్రమమున్న అరుణాచలము చేరుకున్నగూడ గురువు గూర్చిన జాడ లభించలేదు! దానితో అవిముక్త క్షేత్రమైన మహా కాశీక్షేత్రమునకుచేరుకున్నాడు! అక్కడ ఆరునెలల పాటు ఉండి పవన్ చెప్పిన గుర్తులున్న గురువుకోసము రాత్రులు ఘాట్ ల వెంట తిరుగుతూ అఘోరాలను,కాపాలికులను సందర్శించి అక్కడ తన గురువు లేడని తెలుసుకొని ఆవేదన చెందుతూ బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లి అక్కడ గురువు కోసము మూడు నెలల పాటు వెతికినాడు. అలాగే ఛార్ ధామ్ యాత్రను కాలినడకతో చేసిన గూడ గురువు జాడ కనిపించలేదు! రాను రాను జిజ్ఞాసిలో తెలియని భయము మొదలైంది! గురువు దొరుకుతాడనే ఆశలు నెమ్మది నెమ్మదిగా సన్నగిల్లడము మొదలైంది! ఆవేదనతో హిమాలయాలకి ప్రయాణము కట్టినాడు! దారిలో వచ్చే అమరనాధ్ యాత్ర చేసినాడు! అయిన గూడ గురువు కనిపించలేదు! సరాసరి హిమాలయాలకి చేరుకొని అక్కడ ఉన్న వివిధ యోగుల ఆశ్రమాలకి వెళ్లి అక్కడ పవన్ చెప్పిన గుర్తులు ఉన్న మనిషి దొరుకుతాడేమోనని ఆశగా వెతకడము ప్రారంభించిన గూడ ఎలాంటి ఫలితము దొరకలేదు! 

దానితో దేవ ప్రయాగ యందు చచ్చిపోవాలని నిశ్చయించుకొనే సమయములో.... దగ్గరలోనే జ్ఞానగురువైన వేదవ్యాసుడి గుహ ఉన్నదని తెలుసుకొని ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు ! గుహ ఏకాంతముగా...నిశ్శబ్ద నాదముగా ఉంది! దానితో ఇంతటి ప్రశాంతస్థితిని చూడగానే జిజ్ఞాసిలో ఆవేదన భక్తి కాస్త కన్నీళ్ల రూపములో బయటికి వచ్చింది. "స్వామి!వేదవ్యాసా! నిన్ను జ్ఞాన గురువు అంటారు గదా! నేను నా గురువు కోసము వెతకటానికి వచ్చి 24 సంవత్సరాలు కావొస్తోంది! ఇంతవరకు గురువు జాడ తెలియరాలేదు. ఆయన ఉన్నాడో లేడో గూడ తెలియడము లేదు! గురువు గురుత్వాకర్షణ వంటివాడని అంటారుగదా! ఈ శక్తితో గురువు నన్ను ఆకర్షించుకోవచ్చుగదా! ఎందుకు చెయ్యడము లేదు? నా గురుభక్తిలో ఏమైనా లోపముందా? శిష్యుడు ఉంటే గురువు ఉండాలి గదా? ఒకవేళ నేను శిష్యుడిగా ఉండే అర్హత, యోగ్యత నాకు లేవా? నాకు గురువు దొరికే యోగమే లేదా? మీరైనా ఏదో ఒకటి చెప్పండి, లేదా ఏదో ఒకటి చెయ్యండి.లేదు అంటే ఇప్పుడే ఇక్కడే నేను ప్రాణత్యాగానికైనా వెనుకాడను. నాకు దేహ భ్రాంతి లేదు. నాకు శరీరము మీద ప్రేమ,మోహ,వ్యామోహాలు లేవు. నాకు బంధనాలు, బంధుత్వాలు లేవు! ఒంటరిగా పుట్టాను, ఒంటరిగా పోతాను. నాకు ఎలాంటి మృత్యు భయం లేదు అనుకున్న ఆశయము తీరకపోతే శ్వాసించే శరీరము ఉన్నా లేనట్లేగదా!" అంటూ బలవంతముగా శ్వాస పీల్చుకోవడము తగ్గిస్తుండేసరికి..... శ్వాస కోసము ఊపిరితిత్తులు ఎగశ్వాస  ప్రయత్నము చేస్తుండగా....అప్రయత్నముగా కళ్ళు మూతలు పడుతుండగా.... గుహలో కళ్ళ ముందర ఊరి శివాలయము జిజ్ఞాసికి లీలగా కనిపించేసరికి...... నొసలు ముడుస్తూ....శ్వాస పీల్చుకోవడము ప్రారంభిస్తూ కొంపతీసి తన గురువు తనని వెతుక్కుంటూ తన ఊరి శివాలయానికి వచ్చాడా? ఆయన అటువస్తే...నేను కాస్త ఆయన కోసము బయలు దేరినానా? వామ్మో!ఇప్పుడు ఏమి చెయ్యాలి! అంటే ఇంటికి వెళ్ళితే గురువు అక్కడ నాకోసము ఉన్నాడేమో.......లేదంటే ఎప్పుడు లేనిది ఈ శివాలయము ఇప్పుడు ఈ పాడుపడిన గుహలో ఎందుకు కనబడుతుంది! ఇందులో ఏదో తెలియని మర్మము ఉంది అనుకుంటూ... తన సొంత ఊరికి బయలుదేరినాడు!

                       ఊరి పొలిమేరల్లోకి చేరుకోగానే...బాగా మారిపోయిన...గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా...ఉన్న తన ఊరు ఉన్నదని జిజ్ఞాసి గ్రహించి....గుర్తుపట్టినవారిని పలకరిస్తూ...ఆ ఊరిలో ఉన్న శివాలయానికి వడివడిగా గురువు ఉన్నాడేమోనని మనో వేగముతో గుడికి చేరుకున్నాడు! ఇంకా గుడి తలుపులు తెరవకపోవడముతో.... గుడిలోపల ఎక్కడైనా గురువు ఉన్నాడేమోనని ఆశతో...ఆసక్తిగా...గురుభక్తిగా....గుడి పరిసరాలు వెతికినా, శోధించినా గురువు జాడ కనిపించలేదు. అంటే వ్యాస గుహలో కనిపించిన శివాలయ దృశ్యము నిజము కాదా? అది నిజము గానపుడు శివాలయమే ఎందుకు ఆ గుహలో కనబడినది అంటూ.... ఆవేదన చెందుతూ గుడి గంటలు మ్రోగిస్తుండగా...."ఆగు!నాయనా!ఆగు! నువ్వు ఎవరివో క్రొత్త వ్యక్తిలాగా ఉన్నావు! నైవేద్యము తీసుకొని రావటానికి గుడి తలుపులు మూసి వెళ్ళాను. ఇంతలో ఏమి కొంపలు మునిగిపోయాయని గుడిగంటలు కొట్టి శివయ్యను నిద్రలేపుతున్నావు అంటూ గంభీర గొంతు వెనుక నుండి వినబడేసరికి...ఈ గొంతు బాగా తెలిసిన వ్యక్తిదే! నాకు పరిచయమున్న వారిదే? ఎవరబ్బా అనుకుంటూ జిజ్ఞాసి కాస్త వెనుకకు  తిరిగి చూడగా.....అచ్చుగుద్దినట్లుగా పవన్ చెప్పిన గుర్తులతో ఉన్న పవన్ కనిపించగానే జిజ్ఞాసికి ఒక్క క్షణం బుర్ర పని చెయ్యలేదు! అంటే 24 సంవత్సరాలు పాటు తను ఎవరికోసము వెతుకుతున్న వ్యక్తి.....అంటే తన గురువు...సాక్షాత్తు తన ప్రాణ స్నేహితుడు...స్నేహితుడైన పవనా? ఇన్నాళ్లుగా గురువును చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగినానా? క్షేత్రాలు తిరిగానా? గురువును గుర్తించక ఊరులుపట్టి తిరిగిన తన అవివేక పనికి ఏమనాలి? అంటూ.... "పవన్ స్వామి! మీరే నా గురువని ఆనాడు నాకెందుకు చెప్పలేదు!నన్నెందుకు మోసము చేసారు? నా 24 సంవత్సరాల జీవితాన్ని గురువుకోసము నాశనము చేయించారు? మీరే గురువని ఆనాడే నాకు చెప్పి ఉంటే ఇలా జరిగేది గాదు గదా అంటూ జిజ్ఞాసి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఆవేదనగా అడిగేసరికి.... 

పవన్ వెంటనే "జిజ్ఞాసి! ఆవేశపడకు! నిదానముగా నేను చెప్పేది విను! నేను నీకన్నా ఒక సంవత్సరమే పెద్దవాడిని. అంటే రమామి మనిద్దరము ఒకే వయస్సులో ఉన్నవాళ్ళమే కదా! అంటే 24 సంవత్సరాల క్రితము ఉద్యోగము చేస్తున్న యువకుడివి. ఆవేశ వయస్సు! లోక జ్ఞానం తెలియని వయస్సు! ఏది మంచో, చెడో తెలుసుకోలేని వయస్సు! అన్ని అలవాట్లు అయ్యే వయస్సు! పెద్దలమాటలు పెడచెవిన పెట్టే వయస్సు! ఆ వయస్సులో నేనే నీ గురువని చెప్పి ఉంటే నువ్వు నమ్మకపోగా నవ్వేవాడివి! ఎగతాళి చేసేవాడివి! హేళన చేసేవాడివి! అయిన నా తప్పు లేకుండా నీ గురువు పోలికలతో నా పోలికలు గూర్చి నీకు వివరాలు అందించాను! అయిన గూడనువ్వు నన్ను గుర్తు పట్టలేదు! అప్పుడికి ఇప్పుడికి తెల్లగా మెరిసిన గడ్డము, జుట్టు తప్ప నాలో తేడా ఉందా? నీకు చెప్పిన లక్షణాలు,గుర్తులు ఆనాడే నాలో ఉన్నాయి! కానీ వాటిని నీవే గమనించలేదు! గుర్తించలేదు! తప్పు నీ దగ్గర పెట్టుకొని నన్ను అంటావు ఏమిటి? నా మీద నిందలు వేస్తున్నావ్? బాగుంది! మంచి చెయ్యాలని అనుకుంటే చెడు ఎదురు అయినట్టు ఉంది! నీకు మేలు చెయ్యాలని...నీ గురువు నేనేనని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అర్ధమై అర్ధముకాని విధముగా నీకు చెప్పిన నీవు అర్ధము చేసుకోకపోతే అది నా తప్పా? ఆలోచించు! అయిన నీ 24 సంవత్సరాలు ఏమి వృధాకాలేదు! నీ గురు అన్వేషణ వ్యర్థం కాలేదు! ఈ అన్వేషణలో నువ్వు పరిణితి చెందావు! లోక పోకడ తెలుసుకున్నావు. నాలుగు ప్రాంతాలు తిరిగి నాలుగు భాషలు నేర్చుకున్నావు! ఎవరితో ఎలా ఉండాలో...ఎలా మెలగాలో....ఎలా ప్రవర్తించాలో....స్వయంగా నేర్చుకున్నావు! నీలో పాలను తెలుసుకొని సర్దుకున్నావు! నీలో మంచిగుణాలు అభివృద్ధి చేసుకున్నావు! ఎంతో మంది యోగసాధకులను కలిసి వారి ధ్యాన అనుభవాలు పంచుకున్నావు! అన్నదాన ప్రసాదాలు తిన్నావు! ఘాట్ ల దగ్గర నిద్రించావు! చలికి, ఎండకి నానా అవస్థలు పడినావు! ఆకలికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పడినావు. కులగోత్రాలతో, మతాలతో  సంబంధములేకుండా అందరితో కలిసి సహభోజనాలు చేశావు! వంటలు చేశావు! గొడ్డు చాకిరీ చేశావు! నిద్రాహారాలు మానివేసి దొరికిన చోటల్లా ఏదో ఒక పని చేస్తూ భోజనము చేసి కడుపునింపుకున్నావు! రాగద్వేషాలు జయించినావు! అహము,మదము వదిలిపెట్టినావు! అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకున్నావు! ఎక్కడగూడ ఎప్పుడుగూడ ఎట్టి పరిస్థితులలో క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా నిత్యపూజలు,నీ నామ ధ్యానము, రామజపము చేసుకున్నావు! ఇంకా ఏమి గావాలి? నీ గురువు అన్వేషణ పేరుతో 80 % సాధన నీకు తెలియకుండానే పూర్తి చేసావు. ఇంకా మిగిలిన అతిక్లిష్టమైన 20 % అసలు సిసలైన యోగసాధనను రాబోవు 12 సంవత్సరాలు ఇదే విధముగా స్థిరత్వముగా...నిశ్చలముగా...ధర్మము తప్పకుండా...ఉంటే సాధన పూర్తి చేసుకొని ఇప్పుడు ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకుంటావు! దీనికోసమే...నీరాక కోసము....నీవు నన్ను గుర్తించి వచ్చే సమయము కొసము నీకులాగానే నేనుగూడ గత 24 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నానని గ్రహించు! నీకు చెప్పిన మాటల్లో అణువంతగూడ అసత్యము కాదని నా రూపురేఖలే నిదర్శనమని తెలుసుకో. ఇప్పుడు నీ గూర్చి చెప్పిన విషయాలు అన్నిగూడ సత్యాలేగదా అని అంటుండగా....ఇదే సత్యమని అన్నట్లుగా ఆ గుడి గంటలు గాలి వేగానికి మ్రోగడము గమనించిన జిజ్ఞాసి ఇంక ఏమాత్రము ఆలస్యము చెయ్యకుండా పవన్ బాబా కాళ్ళమీద పడి "గురువుగారు! నన్ను క్షమించండి! ఏదో తెలియని ఆవేశముతో...అమాయకత్వములో ఆవేదనలో ఏదో మాట్లాడినాను! అన్ని విషయాలు గూడ మీ కళ్ళతో చూసినట్లుగా చెప్పడములోనే మీ గొప్పతనం తెలుస్తుంది! నన్ను క్షమించి నాకు గురు మంత్రోపదేశము చేసి నాకు మోక్షప్రాప్తి అనుగ్రహించండి! మీ దర్శనం కోసము 24 సంవత్సరాల నుండి కళ్ళకి కాయలు కాసేలాగా ఎదురుచూశాను! ఇక నావల్లగాదు! మీరే అన్నింటికి నాకు రక్షగా ఉండాలి! అంతా నా చేతులలో ఏమిలేదు! మీ చేతులలోనే ఉంది! నన్ను అనుగ్రహించి... ఈ జన్మ వృధా కాకుండా చెయ్యండి. అని కాళ్ళ మీద పడి ప్రాధేయ పడేసరికి....

"జిజ్ఞాసి! లే ! నాయనా! ఈ రోజు మహాశివరాత్రి! ఈ రాత్రియే నీకు గురుమంత్రము ఇస్తాను! మూడున్నర సంవత్సరాలలో ఆ మంత్రసిద్ధి పొందు! ఆపై నేనే నీకు దీక్ష గురువై....శక్తిపాతశక్తితో నీలోని కుండలిని శక్తి జాగృతి చేసి యోగ చక్రాలు శుద్ధి చేసి వాటిని ఆధీనమయ్యేటట్లుగా చేసి....ఎలాంటి యోగమాయలలోను... యోగశక్తుల మాయలలో పడకుండా....జాగ్రత్తలు చెపుతూ రాబోవు 12 సంవత్సరాలలో నీ సాధన పరిసమాప్తి చేస్తాను! ఆపై నీ సమాధి స్థితి ఎప్పుడు ఎక్కడ ఎలా పొందుతావు అనేది పరమేశ్వరుడి ఆజ్ఞ సూచన బట్టి ఉంటుంది అని చెప్పినట్లుగానే.... 12 సంవత్సరాలలో జిజ్ఞాసి కాస్త సిద్ధ పురుషుడిగా రూపాంతరము చెందినాడు! అజ్ఞానము నుండి బ్రహ్మజ్ఞానిగా ధ్యాన అనుభవ అనుభూతులు పొందినాడు! మానవుడు నుండి పరిణితి చెంది మాధవుడైనాడు! అహం బ్రహ్మాస్మి స్థితి అద్వైత స్థితిని పొందినాడు!

                    దానితో మోక్షప్రాప్తి కోసము అవిముక్త క్షేత్రమైన మహా కాశీక్షేత్రమునకు చేరుకున్నాడు! అప్పుడికే అన్నింటి మీద స్మశాన జ్ఞాన వైరాగ్య అనుభూతి పొందడముతో ఒకరోజు కార్తీక పౌర్ణమినాడు ఈక్షేత్ర ఘాట్ లలో అమర్చిన దీపాలకాంతులను చూస్తూ అమితానందమును పొందుతూ...ఏదో తెలియని అలౌకిక స్థితికి చేరుకుంటూ తను ఉన్న మణికర్ణికా ఘాట్ యందు చేరుకుంటున్న భయపెట్టే భక్తులైన అఘోరాలను చూస్తూ....వారు చేసే శివ నామ జపము లీలామాత్రముగా వింటూండగా జిజ్ఞాసికి తన మనోనేత్రము ముందు ఆకాశములో నల్లటి జటాధారియైన విశ్వనాధుడి సజీవమూర్తి రూపము లీలగా కనబడుతూ.... అభయ ముద్రతో తనని దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్లుగా అన్పిస్తుండగా  క్షణములో ఆకాశములో ఒక దివ్యజ్యోతి ప్రకాశవంతముగా దివ్యకాంతితో.... దివ్య తేజస్సుతో కన్పిస్తుండగా...తన బ్రహ్మరంధ్రము నుండి రక్తము బయటికి  విరజిమ్ముతూ....ఆత్మజ్యోతి కాస్త ఆ పరంజ్యోతిలో లీనమవ్వడము.....ఇదంతా గమనిస్తూ జిజ్ఞాసి చుట్టూ అప్పుడికే చేరిన అఘోరాలు ముక్త కంఠముతో పెద్దగా "ఓం నమః శివాయ! హరిః ఓం! శంభో శంకర! హర హర మహాదేవ! అంటూ "కపాలమోక్ష ప్రాప్తి" అంటూ దీవిస్తుండగానే......జిజ్ఞాసి బ్రహ్మరంధ్రము నుండి కపాలాగ్ని బయలుదేరి....క్షణాలలో జిజ్ఞాసి సమాధి దేహమును దహనము చేసినది! మరుక్షణములోనే భస్మముగా మారింది! ఇదే సమయములో అక్కడున్న అఘోరులు అంతా కలిసి ఏక కాలములో శివ అనుగ్రహ ప్రసాదము అనుకుంటూ ఈ జిజ్ఞాసి చితా భస్మమును కాస్త విభూధిగా రాసుకోవడము ప్రారంభించారు! శివాంశ రూపులైన అఘోరుల మధ్యలో మరణము పొందడము అందులోను.... కపాల మోక్షము పొందడము....వెయ్యి కోట్ల మందిలో ఎవరికో ఒకడికి....అదే యుగానికి ఒక్కడికి మాత్రమే దక్కుతుందని....ఇలాంటి యోగి చితా భస్మము నిజముగానే....సాక్షాత్తు కైలాసములో నివసించే కైలాసనాధుడు ధరించే విభూధియని అక్కడున్న యాత్రీకులు తమ మనస్సులలో అనుకుంటూ....తమ వంతుగా ఈ విభూధి కోసము ఎదురు చూడసాగినారు.

                                --------------------------శుభం భూయాత్ -------------------

                                                             పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

అహం బ్రహ్మాస్మి-ఆత్మకథ

ఆమె పేరు శివాని......
అఖండ శివ భక్తురాలు.......
శివైక్యం చెందాలని సంకల్ప భక్తితో........
సంసార బాధ్యతలు గూడ చిరునవ్వుతో 
వదిలి పెట్టి మనస్సు చెప్పిన 
క్షేత్రాలకి......దేవాలయాలకి తిరుగుతూ 
ఆ కనిపించని శివదేవుడి కోసము 
ఊరూరా తిరుగుతూ .......
ముక్కంటి పుర గ్రామమునకు చేరుకుంది!

               ఆ గ్రామములో ఉన్న శివాలయమునకు వెళ్లి తనకి శివ నిజ స్వరూప సాక్షాత్కారము ఇవ్వమని నానావిధాలుగా ప్రాధేయపడినది! అడగ్గానే కనపడితే ఆయన దేవుడెందుకు అవుతాడు. దానితో ఈమెకి చాలా కోపము వచ్చింది. ఆ శివదేవుడిని నానా తిట్లు తిట్టింది! అయినా శివలింగమూర్తి గుండె కరుగలేదు. ఆవేదన భక్తితో అరిచింది! అయినా పలుకలేదు. ఏడ్చింది! కొట్టింది! తిట్టింది! అయినా ఆయన సాక్షిభూతముగా బండరాయిగా నిశ్చలస్థితిలోనే ఉన్నాడు! మనస్సులేని రాయితో ఇన్నాళ్లుగా ఉన్నానని ఈమె అనుకొని గుడి నుండి బయటకి వచ్చింది!

        ఎదురుగా జటాధారి వేషములో......ఒంటినిండా విభూధితో...........మెడలో రుద్రాక్ష, కపాల మాలలతో .....చేతిలో త్రిశూలముతో......ఒక వైపు ఢమరుకముతో........ సాక్షాత్తు శివస్వరూప అంశముగా నాగ సాధువైన పరమహంస ఈమెకి కన్పించి "శివాని! నీ శివుడు ఇలా పిలిస్తే పలుకడు! నీ మనస్సు స్థిరముచేసుకో! నీ చిత్తము శివయ్య మీద పెట్టు! ఈ విశ్వమంతా శివమయముగా కనబడుతుంది! శివుడు లేని చోటు అంటూ ఏది ఉండదు! శివస్వరూపము లేని రూపము నీకు అగుపించదు! అనగానే ......

శివాని వెంటనే "అయ్యా! ఈ మెట్ట వేదాంతాలు నాకు వద్దు. నాకు శివ సాక్షాత్కారమును మీరు ఇప్పించగలరా! అసలు దేవుడు ఉన్నాడా?......

పరమహంస వెంటనే "శివాని! నీవే దేవుడని విషయము మర్చిపోతున్నావు! మానవుడు పరిణితి చెందితే మాధవుడు. ఇంకా వేరే దేవుడు అంటూ లేరమ్మా! నరుడు మనస్సు అస్థిరమైతే వానరుడిగాను..... అదే మనస్సు స్థిరమైతే మాధవుడు అవుతాడు!

శివాని వెంటనే "స్వామి! మీరు చెప్పినట్లుగా నా మనస్సు స్థిరముగా మారినది! నాకు శివ దేవుడిని చూపించగలరా.....

పరమహంస వెంటనే "శివాని! ఇంకా నీ మనస్సు స్థిర మనస్సు కాలేదు! ఆలోచనలు,సంకల్పాలు,స్పందనలు చేస్తూనే ఉంది! నీ శివయ్యను నీ మనస్సు గుర్తించలేక పోతోంది! నీ ఎదురుగా ఉన్న నాలో ......ఆ బిచ్చగాడిలో......ఆ  చెట్టులో.....ఈ పుట్టలో.....ఆ జీవిలో.....శివయ్య ఉన్నాడు! నీ మనస్సు స్థిరమైతే ఇందరిలో నీకు ఎప్పుడో శివయ్య కనిపించేవాడు కదమ్మా......

శివాని వెంటనే "స్వామి! అంటే కనిపించేదంతా....కనిపించేవారంతా శివయ్యలే అంటారు ! మరి మీకు అలా కనిపించే శివయ్యలు......నాకెందుకు కనిపించడము లేదు! కారణము అడిగితే నీ మనస్సు స్థిరముగా లేదని తప్పించుకుంటారు! ఎందుకు లేదో చెప్పరు! ఎలా స్థిరపడుతుందో చెప్పరు! అనగానే 

పరమహంస వెంటనే "శివాని! నీ ప్రశ్నకి నీ దగ్గరే నీ సమాధానముంది! ముందు నీ శివ దేవుడిని ఏ రూపధారిగా చూస్తే.......వచ్చినవాడు శివుడని నమ్ముతావో తేల్చుకో! నాకు అందరిలో శివుడే ఉన్నాడు! శివుడే కనపడుతున్నాడు! మరి నీకు అలా కుదరడము లేదు! నీ దృష్టిలో శివుడంటే పురాణాలలో చెప్పినట్లుగా మెడలో పాములు, తలలో గంగ, నెత్తి మీద అర్ధ చంద్రుడు నంది వాహనము ఎక్కి వచ్చిన రూపమే శివదేవుడి రూపము అని అనుకుంటావు! అది తప్పు! అది ఆ రూపము మీద మన మనస్సు నిలపటానికి మన పెద్దలు ఏర్పరచిన రూపము! పోనీ ఈ రూపములోనే నీకు శివదేవుడు దర్శనమిస్తే.......పగటి వేషధారి అని.......నాటకాల వేషధారి అని అంటావు! పోనీ ఆయన వేరే రూపములో వస్తే గుర్తించవు! ఆయనను గుర్తించే నీ మనస్సు మాయలో ఉన్నట్లేగదా! మాయ అంటే అస్థిరముగా ఉండటమే! ఎప్పుడైతే నీ మనస్సు స్థిరముగా మారుతుందో......ఆనాడే విశ్వమంతా శివమయముగా కనబడుతుంది! ఎప్పుడైతే స్థిర మనస్సు అయినదో ఆనాడు నీవు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే నీకు కావాలసిన రూపములో నీ శివదేవుడు కనబడతాడు! ఎందుకంటే ఈ విశ్వమంతా గూడ విశ్వాసముతోనే నడుస్తోంది!

శివాని వెంటనే " స్వామి! ఇప్పుడు నా మనస్సు స్థిరపడినది! మీరు నాకు శివదర్శనం ఇప్పించండి!

పరమహంస నవ్వుతూ "శివాని! అనుకోగానే మనస్సు కాస్త స్థిరమైతే ఈ సాధనలెందుకు! ఈ కష్టాలెందుకు?మనస్సు చేసే మాయలోనే నీవు ఉండి  మాట్లాడుతున్నావు! స్థిరమైనవాడు దేనికి స్పందించడు! దేనికి సంకల్పించడు! దేనిని గూర్చి ఆలోచించడు! దేనికి ఆశపడడు! దేనికి భయపడడు! ఇదియే పంచభూతాలు ఆధీనము!ఎప్పుడైతే...ఈ అయిదు లక్షణాలు ఏ సాధకుడి యందు ఉంటాయో వాడే పంచభూత ఆధీనుడు! మనస్సు స్థిరమైనవాడు! జితేంద్రియుడు! దశేన్ద్రియాలు జయించినవాడవుతాడు! అంతెందుకు నీ మనస్సు స్థిరమైనదని చెపుతున్నావుగదా! అందుకు  నీకు ఒక పరీక్ష పెడతాను! నీవు ఈ అయిదు పనులు చెయ్యకుండా జరిగేదానిని ఒక నాటకములాగా....... ఒక దృశ్యములాగా... చూస్తూ సాక్షిభూతముగా కేవలము 48  నిమిషాలపాటు ఉండు! అప్పుడు నీ మనస్సు స్థిరమైనదో కాదో నీకే తెలుస్తుంది! అని చెప్పి ఆమెకి ఒక మంత్రోపదేశము చేసినాడు! దానితో ఈమె కాస్త ఈ మంత్రమును ఒక చెట్టు క్రింద కూర్చొని తదేక ధ్యానముతో చెయ్యడము ఆరంభించింది!

             అర్ధరాత్రి సమయము కావస్తోంది! తదేక దీక్షలో కళ్ళు మూసుకొని ధ్యానము చేస్తున్న శివానికి ఏదో అలికిడి అయినట్లుగా అనిపించి కళ్ళు తెరిచి చూడగా...... ఎదురుగా ఉన్న శివాలయము నుండి ఒక ఆడ,ఒక మగ మనిషి బయటికి రావడము గమనించినది! వీరిద్దరూ తాను ఉన్న చోటుకి రావడము గమనించి తత్తరపడి గుండె నిబ్బరము చేసుకొని మనోధైర్యముతో జపము చెయ్యడము చేస్తూనే ఉంది! జపమంత్రమును ఆపడములేదు ఆపితే మంత్రము ఫలించదని అనడముతో శ్రద్ధ భక్తితో మంత్రము కొనసాగుతోంది! 

ఇలా వీరిద్దరూ తన ముందుకి వచ్చిరాగానే మగ మనిషి వెంటనే "ఒసేయ్! ఇల్లాలా! నాకు బాగా ఆకలి వేస్తుంది! నీకు గూడ వేస్తుందిగదా! ఏదైనా వండుకొని ఆకలి తీర్చుకోవాలి! అందుకు వంటకి ఏర్పాట్లు చేస్తాను అంటూ కట్టెలు తేవటానికి వెళ్ళాడు! ఇంతలో ఈమె కాస్త పొయ్యికి రాళ్లు తెచ్చి.......నీళ్లు కాయడానికి గంగాళము ఎక్కడి నుండో తేవడము....... వీరిద్దరూ చేసే పనులు ఓరకంటతో శివాని గమనిస్తూనే ఉంది! మనస్సులో ఏదో తెలియని అనుమాన భయము ఈమెలో తెలియకుండానే మొదలైంది! దానితో అసలు వీళ్లిద్దరు ఎవరు? అనే ఆలోచన చెయ్యడము ప్రారంభించినది! చెయ్యగూడని అయిదు పనులలో ఆలోచన అనే పని చెయ్యడము మొదలు పెట్టినది! అంటే మొదటి తప్పు చేసినది!

                  ఆ తరువాత కట్టెలు తెచ్చిన పురుషుడు కాస్త అప్పుడికే సిద్దము చేసి పొయ్యిలో ఈ కట్టెలు పెట్టడము ప్రారంభించి కన్నులతో నిప్పును తెప్పించి పొయ్యి వెలిగించగానే ఇదంతా గమనిస్తున్న శివునిలో వీరిద్దరూ ఎవరో తెలుసుకోవాలనే సంకల్పము మొదలైంది! ఎందుకంటే కంటితో నిప్పు వెలిగించినారంటే వీరిద్దరూ సామాన్యముగా కనిపించే అసామాన్య యోగ సిద్ధ పురుషులుఅయ్యిఉంటారని..రెండవ తప్పు చేసినది! సంకల్పించడమే ఈ తప్పు అన్నమాట! 

                   ఇది ఇలా యుండగా ..........గంగాళములో నీళ్లు పోసి వీరిద్దరూ కలిసి నీటిని సెగలు వచ్చేదాకా కాస్తున్నారు! ఈమెకాస్త చేతి నుండి నానా రకాల పదార్ధాలు సృష్టించి అందులో వెయ్యడము. ఆ సువాసనలు శివాని ముక్కుకి అందడము ఏకకాలములో జరిగిపోయినాయి! ఇలాంటి వాసనలు గల పదార్ధాలు చూడటం తన జీవితములో ఇదే మొదటిసారి అనుకొని.....కేవలము ఈవిడ చేతినుండే ఇలాంటి పదార్ధాలు సృష్టించినది అంటే ఈమె దగ్గర ఎన్నో రకాల తాంత్రిక విద్యలు తెలిసి ఉండాలి. అవి తన దగ్గర ఉంటే ఆకలి,నిద్ర,సుఖము,బాధ ఇలాంటి ఈతి బాధలు ఉండవని.....ఎలాగైనా ఈమె దగ్గర ఈ విద్యలు నేర్చుకోవాలని శివాని ఆశపడటము జరిగినది! దానితో మూడవ తప్పు కూడా జరిగిపోయినది!

                 ఆ తరువాత వీరిద్దరూ కలిసి గంగాళములో ఉడికిన వివిధ రకాల పదార్ధాల కలిసిన పదార్థమును తినడానికి దీనిని గాడిపొయ్యి నుండి బయటకి తీసి.....తెచ్చిన అరటి ఆకులలో ఈ పదార్థమును వడ్డించుకొని తినడము ప్రారంభించినారు. ఈ పదార్ధ వాసనకి శివాని ముక్కు అలాగే మనస్సు తనకి తెలియకుండానే ఈ పదార్ధ రుచి చూడాలనే కోరికకి స్పందించడము మొదలైంది! దానితో తనకి తెలియకుండానే స్పందన అనే నాలుగవ తప్పు చేసినది! 

ఇలా వీరిద్దరూ భోజనము చేస్తున్న సమయములో అక్కడే చెట్టు క్రింద ఉన్న శివానిని గమనించిన వీరిద్దరూ వెంటనే మనము చేసుకున్న పదార్ధము కన్నా ఆ చెట్టు క్రింద ఉన్న బ్రహ్మపదార్ధము ఇంకా బాగా రుచిగా ఉంటుంది! మన ఆకలి తీరాలంటే ఆ చెట్టు క్రింద ఉన్న మనిషిని భుజిస్తే సరిపోతుంది అనుకొని శివాని వైపుకి రావడము........వీరి మాటలు విన్న శివాని కాస్త భయపడటం.........ఏక కాలములో జరిగిపోయినాయి! దానితో అయిదవ తప్పు అయిన భయానికి గురిగావడము జరగడముతో..........ఈమె మంత్రము ఆగిపోయినది! ఆ వచ్చిన స్త్రీ,పురుషుడు అదృశ్యమవ్వడము జరిగినది! తన తప్పు తెలుసుకొనేసరికి ఉదయకాల సూర్యుడు లీలగా ఆమెకి కనిపించడము జరిగినది!

               తెల్లారి పరమహంస ఈమె దగ్గరికి వచ్చి "శివాని! నేను చెయ్య వద్దని చెప్పిన పనులే చేసినట్లుగా ఉన్నావు! అదే మనస్సు స్థిరమైతే వాటిని నాకులాగా సాక్షిభూతముగా చూసేదానివి! నేను ఇచ్చిన మంత్రానికి ఉన్న మంత్రదేవతలకే నీవు భయపడితే...... ఆ విశ్వసృష్టి కారకమైన శివమూర్తి బీజమును చూస్తే నీవు తట్టుకోగలవా? అంతటి శక్తి నీకుందా? అంతెందుకు ఒక సూర్యకాంతినే నీ కళ్ళు భరించలేవు! అలాంటిది కొన్ని కోట్లానుకోట్ల సూర్య కాంతియున్న శివ దేవుడిని నీ భౌతిక నేత్రాలు చూసి తట్టుకొంటాయని ఎలా అనుకున్నావు. భక్తి ఉండాలి కానీ ఆశ,భయము,అపనమ్మకము,అహంకారము,డాంభికము ,ప్రసాద భక్తి ఉండకూడదు.మనలో 99 . 99 % మందికి దేవుడంటే భక్తి గాదు భయము! పూజించకపోతే ఏదో  చేస్తాడని.......మనకి ఏదో కీడు జరుగుతుందని భయము! అదే మరి కొందరిలో దేవుడంటే ఆశ! పది కొబ్బరికాయలు కొడితే కోరిన కోర్కెలు తీరుస్తాడని.......అదే జుట్టు ఇస్తే అడిగిన వరాలు తీరుస్తాడని.....ఆశ ఉంటుంది! ఈ రెండు రకాల భక్తిగూడ ప్రమాదకరమే! నిష్కామభక్తి గావాలి! ఏ కోరిక లేని భక్తి గావాలి! చివరికి మోక్షము గావాలనే కోరికగూడ ఉండదు! మోక్షమంటే అదేదో ఉందని.....దానిని సాధించాలనే కోరిక ఏర్పడుతుంది!దీని వలన కర్మ జన్మ ఏర్పడుతుంది!  మోక్షము అనేది లేదని మనస్సు తెల్సుకునేదాకా ఆ జీవుడు పునః జన్మలు ఎత్తుతూనే ఉంటాడు! మోక్షమంటే....... దేనికి స్పందించకుండా .......బ్రహ్మ తదాకార స్థితిలో.....సాక్షిభూతముగా.....ఒక రాయిలాగా ఉండటమే........! "నేను" అనేది ఉంటే కోరిక,ఆశ,భయము,స్పందన, ఆలోచన, సంకల్పము లాంటివి ఉంటాయి! అసలు "నేను" అనేది లేదు....."నేనులేను" అనుకుంటే ఇంకా దేనికి మోక్షము గావాలి! ఇక దేనికి శివసాక్షాత్కారము గావాలి! ఇక దేనికి ఏ కోరికలు గావాలో ఆలోచించు! ప్రశ్నించేవాడెవ్వడు?అడిగేవాడెవ్వడు? స్పందించేవాడెవ్వడు? ఆశపడేదెవ్వడు? భయపడేదెవ్వడు? ఆలోచనలు చేసే వాడెవ్వడు? సంకల్పాలు చేసేవాడెవ్వడు? ఒకసారి ఆలోచించు! "నేను" అనేది చేస్తుంది! ఈ "నేను" అనేది ఏమిటి అని ఆలోచించు! అసలు "నేను " ఎవరు? అన్నపుడు నేనుఅనేది ఉంది అంటే ఈ లోకము ఉన్నట్లుగా కనబడుతుంది! అన్ని ఉన్నట్లుగా, గావాలి అన్నట్లుగా కనబడతాయి! ఎప్పుడైతే "నేను" అనేది లేదు అనుకుంటే ఈ విశ్వమే నీకు కన్పించదు! ఏ కోరిక లేని స్థితికి చేరుకుంటావు! అదియే "అహం బ్రహ్మాస్మి" ఎప్పుడైతే "నేను" గూర్చి ఆలోచన చెయ్యదో....... ఆనాడే నీ మనస్సు స్థిరమవుతుంది! అప్పుడు దానికి ఎలాంటి ఆశలు,భయాలు,స్పందనలు ,ఆలోచనలు, సంకల్పాలుండవు! కోరిక లేని వాడికి వరాలతో పని ఏమిటి? ఆ వరాలు ఇచ్చే దేవతలతో ఏమిపని ఉంటుంది! నేను అనే దేహ పదార్ధ మాయను దాటు! యధార్ధము ఏమిటో నీకే తెలుస్తుంది అంటూ పరమహంస కాస్త శివాని నుదటి మీద బొటన వ్రేలు పెట్టగానే.....ఈమెలో శక్తిపాతము జరిగి........కుండలిని శక్తి జాగృతి అయినది! దానితో....ఈమె మనస్సు స్థిరపడినది! కుదుటపడినది! కోరికలేని స్థితికి చేరుకుంది! ఆనందాతీత స్థితికి చేరుకుంది!మౌనము వహించింది! అక్కడ నుండి తాను వచ్చిన పని అయినదని అన్నట్లుగా పరమహంస మౌనము వహిస్తూ వెళ్లిపోవడము జరిగినది! 

ఆ రాత్రి గడిచినది! యధావిధిగా నిన్నటిలాగానే ఆ స్త్రీ, పురుషులు గుడినుండి బయటికి రావడము, వంట సిద్ధము చెయ్యడము లాంటి పనులు అన్నిగూడ శివాని కాస్త సాక్షి భూతముగా మనస్సులేని స్థితిలో ఒక దృశ్యములాగా చూడటము జరుగుతోంది! దేనికి భయపడలేదు, దేనికి ఆశించలేదు! దేనికి సంకల్పించలేదు! దేనికి స్పందించలేదు! దేనిని గూర్చి ఆలోచన చెయ్యలేదు! ఇంతలో శివాని దగ్గరికి వీరిద్దరూ వచ్చి ఈమెను తినాలని అనేసరికి ఏమాత్రము చెలించకుండా వీళ్ళకి ఆహారం అవ్వటానికి తాను సిద్ధముగా ఉన్నానని అన్నట్లుగా శివాని లేచి నిలబడేసరికి....... ఆ స్త్రీ, పురుషులు కాస్త పరమేశ్వరుడు, పరమేశ్వరిగా సాక్షాత్కారము ఇచ్చినారు ! అప్పుడు శివాని ఈ సాక్షాత్కార దర్శనమును చూసి వీళ్ళకి నమస్కరించి చిరునవ్వేసరికి........ కోరికలేని దానికి వరాలతో ఏమిపని ఉంటుందని........ తను వరాలు తీసుకొనే స్థాయి నుండి వరాలు ఇచ్చే స్థాయికి వచ్చినదని వీరిద్దరూ గ్రహించి అంతర్ధానమైనారు! దానితో ఆనాటి నుండి శివానికి ఈ విశ్వమంతా శివమయముగా....తన మయముగా..... అహంబ్రహ్మాస్మిగా  కనబడసాగినది!

                                ------------------------శుభం భూయాత్-----------------------

                                                          పరమహంస పవనానంద

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

శివ యోగిని-ఆత్మకథ

శ్వేత....
అందరి లాంటి ఆడపిల్ల కాదు!
పురుషులకి స్త్రీలు అన్ని విషయాలలో 
సాటియేనని చెప్పాలనే ...
తపన తాపత్రయం మొండి పట్టుదల గల అమ్మాయి!

స్కూల్ చదువులలో......కాలేజీ చదువులలో ర్యాంకులు తెచ్చుకుంది.
ఆటలలో బహుమతులు పొందింది!

ఉద్యోగములో ఎన్నో రకాల అవార్డులు, రివార్డులు పొందినది!
అన్నిరంగాలలో తన స్త్రీ తత్వమును చాటి పురుషాధిక్యతను దాటినది!
అయినా సంతృప్తి కలుగడము లేదు!

ఇంకా ఎదో సాధించి......పురుష ప్రపంచమును  
శాసించాలని పురుషాహంకారమును అణగద్రొక్కాలనే తనలోని తపన తగ్గడము లేదు!

        ఇలాంటి ఆడపిల్ల ఒకసారి అనుకోకుండా ఆ ఊరి శివాలయములో జరిగే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడము జరిగినది! ఈ బోధ గురువు అక్కడున్న వారితో "స్త్రీలకి మోక్షము గావాలంటే పతిసేవ చేసుకుంటే చాలు! పతియే ప్రత్యక్ష దైవముగా భావించి ఆయనకి గావలసిన సేవలు చేస్తే మోక్షము దానికంతట అదే స్త్రీ మూర్తికి వస్తుంది! అని ఇంకా ఏదో చెపుతూండగా.......ఈ మాటలు విన్న శ్వేతకి ఎక్కడ కాలాలో అక్కడ కాలి.........ఈ బోధ గురువు కాస్త ఏకాంతముగా దొరికేదాకా ఎదురు చూసి.....

ఆయన కనపడగానే "స్వామి! ఇందాక స్త్రీలకి మోక్షము రావాలంటే పతిసేవ చేసుకోవాలని అన్నారు! మరి వివాహము కాని స్త్రీలకి మోక్షము రావాలంటే ఏమి చెయ్యాలి? 

ఆయన వెంటనే "ఏముంది! వివాహము చేసుకోవాలి! అప్పుడే వారికి మోక్షము వస్తుంది! వివాహము కాని వారికి మోక్షమురాదు! 

అప్పుడు శ్వేత వెంటనే "స్వామి! పురుషులు బ్రహ్మచారిగా ఉన్న లేదా సంసారిగా ఉన్న మోక్షము వచ్చినపుడు.......స్త్రీలకి ఎందుకు సంసారిగానే ఉంటే మోక్షము వస్తుంది! అంటే ఈ లెక్కన చూస్తే సంసారములో ఉండే  పురుషుడికి స్త్రీమూర్తి అవసరము ఉంది! వాడికి సంసార సుఖాలు ఇవ్వాలి!వంశ వారసులను ఇవ్వాలి! వాడికి సేవలు చెయ్యాలి! అత్తమామలు,ఆడపడుచులు, బావ మరుదులకి సేవల చేయాలి! ఇవి అన్ని చెయ్యటానికి స్త్రీ మూర్తి గావాలి~ ఇందుకు ఫలితము మోక్షము వస్తుందని ఆశ పెడతారు! భయపెడతారు! ఆభరణాలు ఇస్తారు! ఆశయాలు తీర్చుకుంటారు.అదే పెళ్ళాము ఛస్తే.......మరునిమిషములో అవసరాలు తీర్చుకోవటానికి ఇంకొక స్త్రీ మూర్తిని ఇదే వెధవ బలి పశువు చేస్తారు!ఒక ఇంటిలో పెళ్ళాము అనివార్య కారణాల వలన సంసార సుఖము ఇవ్వకపోతే అహంకారమునకు పోయి మరొక స్త్రీమూర్తితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తమ సుఖాలు తాము చూసుకొనే పురుషులను సేవిస్తే......నిజముగా మోక్షము వస్తుందా ........వాడు గూడ మనిషియే గదా! మాయలోనే ఉన్నాడు గదా! మరి వాడిని పూజిస్తే ఎలా మోక్షము వస్తుందో చెప్పండి! ఏక పతి ధర్మము స్త్రీ మూర్తి పాటించాలి కాని ఏకపత్నీధర్మము పురుషుడు పాటించాలని ఏ శాస్త్రము గూడ ఎక్కడ ఎందుకు చెప్పలేదు! స్త్రీ మూర్తినిమించాలని.... ఆరాధించాలని....సేవించాలని....... ఇవన్నీ చేస్తే ఏమి జరుగుతుందో ఎందుకు మన పురాణ, ఇతిహాస గ్రంధాలలో చెప్పలేదు. ఎందుకంటే ఇవి అన్ని పురుషుడే రచించాడు! తనకు అనుగుణముగా అన్ని ఉండేటట్లుగా శాస్త్ర రచనలు చేసినాడు! స్త్రీ ఆధిక్యతను అణగద్రొక్కాలని విశ్వప్రయత్నాలు చేసి జయము పొందినారు! అని అనర్గళముగా ఈమె చేస్తున్న స్త్రీ వాదనను చూసిన బోధ గురువు ఎదో  తెలియని ఆలోచనలోపడి......కొంతసేపు అయిన తర్వాత........

"అమ్మాయి! నువ్వు ఇంతవరకు చెప్పినది బాగానే ఉంది! కాని ఇప్పుడున్న స్త్రీమూర్తులు అందరుగూడ అన్ని రంగాలలో విజయము సాధించినను..........ఇంకా ఆధ్యాత్మిక సాధన యందు జయం పొందలేదు. ఇప్పుడి వరకు యోగులే ఉన్నారు కాని యోగినులు చెప్పుకునే స్థాయిలో .........గుర్తింపు పొందే స్థాయిలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో నీవే ఆలోచించు! ఎందుకంటే స్త్రీకి పురుషుడి తోడు గావాలి! అవసరాలకి, ఆర్ధిక విషయాలకి,సంతాన విషయానికి, సంసార సుఖాలకి పురుషుడు లేకపోతే స్త్రీ మూర్తి నిలువదు! నిలబడలేదు! సంసార బాధ్యతలున్న స్త్రీ మూర్తి ఎలా యోగినిగా మారుతుంది! పురుష సహాయము లేని స్త్రీ ఎలా ఆధ్యాత్మిక సాధన చేస్తుంది! నీకు వీలు అయితే యోగినిగా మారి ఆధ్యాత్మిక రంగమున నువ్వు సాధించు! అందుకు నా శక్తి సామర్ధ్యము సరిపోదు! ఆత్మ సాక్షాత్కారము పొంది శక్తిపాత సిద్ధియున్న సిద్ధగురువు అనుగ్రహమును పొందాలి! ఇలాంటి వారు వ్రేళ్ళ మీద ఈ ప్రపంచములో ఉన్నారు! ఇలాంటివారిని గుర్తుపట్టటానికి దైవాలకే సాధ్యపడదు! మానవ మేధస్సుకి అందరు! సిద్ధ గురువును మరొక సిద్ధగురువే గుర్తుపట్టగలడు! ఇక్కడ ఇలాంటి ఒక సిద్ధగురువే దొరకడము అసాధ్యమని సాక్షాత్తు మనకి గురుగీత చెపుతోంది! ముందు నీవు ఇలాంటి సిద్ధగురువును చూసే అర్హత సంపాదించుకో! అప్పుడు కాని నీకు యోగినిగా మారే యోగ్యత లభించదు! ఇలాంటి క్లిష్ట పరిస్థితులున్న ఆధ్యాత్మిక రంగము నందు నీవు ప్రవేశించి సంపూర్ణ యోగత్వమును పొంది యోగినిగా నా ముందు నిలబడు! అప్పుడు నీవు చెప్పిన పురుషాధిక్యతకి గండి పడినట్లేనని నేను నమ్ముతాను! అప్పడిదాకా నీ ఆలోచనలు,నీ తపన తాపత్రయాలు, నీ ఆవేశపు మాటలు అన్నిగూడ నీటిమీద వ్రాతలు లాంటివే! వయస్సు పొంగు లాంటివే! ఆవేశము తగ్గితే  ఆచరణ ఏమి ఉండదు గదా! ఏమంటావు ! అవుతావా యోగినివి?పైగా నిన్ను చూస్తుంటే సంసారిలాగా...... గృహస్థ ధర్మమును పాటిస్తున్నావు! సంసార బాధ్యతలను వదిలి సన్యాసినిగా ఎలా మారతావు? ఇక్కడే నీకు పెద్ద ఆటంకము వచ్చింది! నీ భర్త, నీ పిల్లలే నీకు అవాంతరాలుగా వచ్చినారు! దీనిని ఎలా దాటతావు.......

                     వెంటనే శ్వేత "స్వామి! త్రికరణశుద్ధిగా నేను ఈ క్షణమే యోగిని అయ్యాను! నా ఈ దేహమునకు సంసార బాధ్యతలు ఇచ్చిన శివ దేవుడే...... వాటిని చూసుకుంటాడు! నారు పోసినవాడు నీళ్లు పోస్తాడు గదా! నాకెందుకు దిగులు! ఇంకా సిద్ధగురువు అంటారా? నన్ను ఉద్ధరించటానికి...... నా సంకల్పమును నెరవేర్చుటకు అయనగూడ ఎక్కడో ఒక చోట నా కోసము ఎదురుచూస్తూ ఉంటాడు!శిష్యురాలున్నపుడు గురువు ఉండడా? ఖచ్చితముగా ఉంటాడు! ఎందుకంటే చర్యకి ప్రతిచర్య ఉంటుంది గదా! స్పందనకి ప్రతి స్పందన ఉంటుందిగదా! మీ వలన నేను సాధించవలసిన లక్ష్యము తెలిసినపుడు.....ఈ లక్ష్య సాధనకు సహాయ పడేవాడు ఉంటాడు గదా! అందుకు నేను నా సాధనతో అర్హత సంపాదించాలి! నా ఆవేశము, ఆక్రోశము, ఆవేదన,బాధ, ఆనంద స్పందనలకి నా సిద్ధగురువును చేరాలి! విశ్వములో ఆయన ఎక్కడ ఉన్నగూడ నా దగ్గరికి తప్పకుండా రావాలి! భూమి మీద ఉన్న గురువునే నా సాధనశక్తితో నా దగ్గరికి తెప్పించుకోలేకపోతే సర్వాంతర్యామి అయిన భగవంతుడు నా దగ్గరికి ఎలా వస్తాడు! చేసేది....... చేయించేది ఆయనే అన్నపుడు... ఈ దేహ భ్రాంతి ఎందుకు?

      వెంటనే సిద్ధగురువు "అమ్మాయి! నీ మెట్ట వేదాంతము బాగుంది! చివరికి నీవు చేరే భగవంతుడు పురుషుడేగదా! మరి నీవు ఆయనలో ఐక్యము అవ్వడము అంటే........ నీ సంకల్పము నెరవేరినట్లే కాదుగదా! ఎందుకంటే నీకు పురుషులన్నా...... పురుషదేవుళ్లన్న గూడ ద్వేషమేగదా.....

అప్పుడు శ్వేత "స్వామి! నాకు పురుషులంటే ద్వేషముగాదు! వాళ్లకున్న పురుషాహంకారము మీద ఆడవాళ్లంటే చులకన భావము మీద మాత్రమే నా ద్వేషము! ఆడవాళ్లు అన్ని రంగాలలో పురుషులతో పోటీ ......పడగలరని.........ఈ విశ్వసృష్టిలో భగవంతుడు స్త్రీ,పురుషులను సమశక్తితో సమభాగాలుగా చేసి సృష్టించినాడు కాని పురుషుడు అతి తెలివితేటలతో............. తనకున్న పురుషాహంకారముతో స్త్రీ మూర్తులను కాళ్ళ క్రింద చెప్పులాగా చేసినాడు! అదియే నా కోపము! పురుషుడిని దేవుడిగా భావించి ఆరాధన చేస్తే....... అదే స్త్రీ మూర్తిని ఎందుకు దేవతగా ఆరాధన చెయ్యడములేదు! ఆడదాని ఆడతనములో అమ్మ తనమును చూడకుండా కామతనము ఎందుకు చూస్తున్నారు! ఆడది భోగవిలాస వస్తువుగా ఎందుకు కనబడుతుంది! పురుషాధిక్యత వలనే గదా! నిజానికి భగవంతుడికి రూపం, స్వరూపములేదు! శివ అంటే లేని వాడేగదా , రూపములేనివాడేగదా! రూపము లేనివాడికి స్త్రీ, పురుష బేధ బుద్ధి మీకు రావడము వలనే మీరు ఇంకా బోధ గురువుగానే ఉన్నారు! పుస్తక,గ్రంధాలలో చెప్పబడే శబ్ద పాండిత్యమునే అందరికి చెపుతున్నారు. ముందు మీరు అనుభవ పాండిత్యమును పొంది బోధ గురువు నుండు జ్ఞాన గురువుగా మారండి! అంటూ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయినది! 

      తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత సంసార బాధ్యతలు నెరవేరుస్తూ.......గుడి పూజారి చెప్పిన "ఓం నమఃశివాయ, శివపంచాక్షరీ మంత్రమును" మనస్సులో నిత్యము చేస్తూనే ఉంది! అయిన గూడ తనలో తపన తాపత్రయాలు తగ్గడము లేదు! పెరుగుతూనే ఉన్నాయి! అసహనము వచ్చింది! ఓర్పు కోల్పోయినది ! గురువు కోసము ఎదురుచూసే ఓపిక తగ్గినది! దానితో కుటుంబముతో కలిసి కాశీక్షేత్ర దర్శనమునకు అనుకోకుండా వెళ్ళినది! 

మణికర్ణికా ఘాట్ యందు మధ్యాహ్న స్నానము చేసి బయటికి వస్తుండగా.....అక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వారు ఇప్పుడికి ఉదయకాల స్నానమును చెయ్యటానికి ఈ ఘాట్ కి వస్తున్నారని... సూచనగా ఏర్పరచిన శ్రీ దత్త పాదుకల మందిరము వద్ద దివ్య తేజస్సుతో ముగ్ధ మనోహర రూపముతో......నల్లటి వస్త్రధారి......మెడలో రుద్రాక్షమాలలతో........జడలను జటాధారిగా ముడి వేసుకొని, ముఖము మీద విబూది రేఖలతో......ధ్యాన స్థితిలో ఉన్న.... యోగిని....శ్వేతకి కనబడినది! దానితో ఈమెకి ఆనందము వేసి....తడిసిన బట్టలతో......తడిసిన జుట్టుతో......ఈమె అనుగ్రహము పొందాలని.......స్వాతి ఈ యోగిని ముందు....... మౌనముగా...... ఆవేదనగా.....శ్రద్ధ భక్తితో.....మూడు గంటలు పైగా నిలబడినది! ఎవరి స్పందనలు తన దగ్గరికి వస్తున్నాయని అనిపించి ఆ యోగిని అప్పుడు కళ్ళు తెరిచి! వచ్చినావా దీక్షాదేవి! ఆదేనమ్మా ప్రస్తుతము ఈ దేహ జన్మ స్వాతి గావచ్చును! కాని పూర్వజన్మలో నీవు ఒక శివయోగినివి! కాని సాధన సమయమున వచ్చే కామ మాయను దాటలేక.......మత్తు పదార్ధాలతో, మత్తు పానీయాలకి బానిసయై......ప్రస్తుత ఈ దేహజన్మ ఎత్తినావు! కర్మలు తీరినాయి! కర్మ వాసనలు తీర్చుకోవటానికి మళ్ళి ఈ క్షేత్రానికి వచ్చి నా దర్శన భాగ్యమును పొందినావు! నీరాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను! గత జన్మలో మనిద్దరి కర్మ వాసనను వదిలించుకోవాలి గదా! అప్పుడే మన సాధన ముందుకి వెళ్ళుతుంది! ఆ క్రితం జన్మలో నీవు నా గురువై మంత్రోపదేశము చేసినావు! ఈ కర్మ గురుఋణము తీర్చుకోవటానికి ఈ జన్మలో నేను నీకు గురువైనాను! రా! తల్లి నీకు అన్ని భవబంధనాల నుండి విముక్తి కలిగించే శివయోగము గూర్చి నీకు మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను! నీకు దానిని గూర్చి బోధ చేస్తాను! జాగ్రత్తగా విను! 

            మనకి అన్ని రకాల బంధనాలు నుండి...... కర్మలను నుండి విముక్తి కలిగించేవాడే మహాశివుడు! ఈయనే ఆదియోగి! ఎవరైతే ఈయన సాక్షాత్కారమును పొందుతారో.......వారే విముక్తి పొంది మోక్షప్రాప్తి పొందుతారు! ఇలా ఈయన తన దగ్గరికి వచ్చేవారికి అన్నింటిని విముక్తి కలిగించటానికి అవిముక్త క్షేత్రమైన ఈ కాశీయందు కాశీవిశ్వనాధుడిగా కొలువైయున్నాడు ! ఈయన మనకి ఇచ్చే యోగమే......శివ యోగము! ఈ యోగానికి సమయాచార పద్దతిలో ఆరు కాలాలలో ఇష్ట లింగారాధన చెయ్యాల్సి ఉంటుంది! ఇష్టలింగము అంటే తొమ్మిది రకాల విష పదార్ధాలతో తయారు చేసే శివలింగము అని తెలుసుకో! వైద్యములో గూడ విషమును ఒక ఔషధముగా వాడతారని లోక విధితమే గదా! అలాగే మనలో ఆశ,భయము,స్పందన,సంకల్పము,ఆలోచనలు తగ్గించటానికి.......వీటి వలన ఏర్పడే కర్మలు, కర్మవాసనలు, పాప,పుణ్యాలు, కర్మ ఫలితాలు, కర్మజన్మలు నశింపచెయ్యటానికి తొమ్మిది రకాల విష పదార్ధాలు గావలసి ఉన్నదని భోగార్ అనే రస సిద్ధుడు కనిపెట్టి ఇష్టలింగ నిర్మాణమునకు ఆదిలో పునాదిని వేసినాడు! అంతెందుకు. మహాశివుడికి కంఠము నందు విషముండుట వలన ఆయన నీల కంఠుడు అయినాడు గదా! ఆయనే తన విషముతో  తనకున్న విషయ వాంఛలు నివారణ చేసుకుంటే..... మనము చేసుకోపోతే ఎలా? శివలింగము అంటే న్యూ క్లియర్ శక్తి కేంద్రము!

ఈ శక్తి వలన మనలోని అన్ని రకాల చెడులు నశించిపోతాయి! అందుకే శివలింగాలను ప్రతినిత్యము నీటితో, బిల్వపత్రాలతోను పూజించాలని లింగ పురాణము చెప్పడము జరిగినది! ఎందుకంటే న్యూక్లియర్ శక్తిని తటస్థీకరించడానికి నీళ్లు, అలాగే బిల్వ పత్రాలు ఉపయోగపడతాయి! మన శరీరము ఎంత న్యూక్లియర్ శక్తిని తట్టుకుంటే అంత శక్తి మనలో ప్రవేశించడానికి ఈ రెండు పదార్ధాలు ఉపయోగపడతాయి! అలాగే మన శరీరములో ఎంతటి పరిమాణము విషశక్తి చేరాలో...... అంతే శక్తి మనలోకి ప్రవేశించడానికి ఇష్టలింగ పరిమాణము చెయ్యబడినది!దీనిని విభూధితో ఆరాధన చెయ్యాలి! ఇలా వచ్చిన విభూధిని మనమునిత్యము ధారణ చేసుకుంటే....... మనలో ఉన్న అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలుగుతుంది!

          అందుకు ముందు నీకు శివ పంచాక్షరీ మహా మంత్రమును ఉపదేశించాలి అనగానే....శ్వేత వెంటనే "అమ్మా! నేను మా ఊరి శివాలయములోని గుడి పూజారి ద్వారా ఈ మంత్రోపదేశమును పొందినాను! దీనినే నిత్యము చేస్తున్నాను అనగానే.........

యోగిని చిరునవ్వి "అయితే నీ పంచాక్షరీ మంత్రమునకు శక్తి ఉంటే నీ దగ్గరికి వస్తున్న కుక్కకి చెప్పు అనగానే.....శ్వేతకి మొదట ఏమి అర్ధము కాలేదు! అయిన తన దగ్గరికి వచ్చే కుక్కకి వినిపించేటట్లుగా ఓం నమః శివాయ అని మూడు సార్లు అంది! ఈ శబ్దానికి ఆ కుక్క బెదిరి పెద్దగా అరవడము మొదలు పెట్టినది! అప్పుడు ఆ యోగిని ఈ శ్వేతను తన దగ్గరికి పిలిచి చెవిలో శివపంచాక్షరీ మంత్రము మూడుసార్లు అని మంత్రోపదేశము చేసినది! ఆ క్షణమే శ్వేతకి దేహము చాలా తేలిక అయినట్లుగా....ఎదో శక్తి తన నరాలలో ప్రవేశిస్తున్నట్లుగా.....నరాలు అన్ని గూడ కాంతులు పొంది మెరుస్తున్నట్లుగా...... దేహము అంతా కాంతిమయము అవుతున్నట్లుగా.... మూలాధార చక్రము నుండి కుండలినీశక్తి ప్రవాహము మొదలై....బ్రహ్మరంధ్రము వద్ద ఉండే బ్రహ్మాండ చక్రము దాకా ప్రవహించినట్లుగా......ఎదో తెలియని యోగమత్తు తనని ఆవహిస్తున్నట్లుగా కొన్ని క్షణాలపాటు ఏదో తెలియని చెప్పటానికి వీలులేని ఆనందస్థితిని తాను పొందుతున్నట్లుగా అనిపించసాగినది! 

అప్పుడు యోగిని వెంటనే "అమ్మాయి! శ్వేత దీక్షాదేవి! ఈ క్షణమే .....నా శక్తి పాత సిద్ధి వలన నీకు శివపంచాక్షరి మంత్రోపదేశము జరిగినది! నీలో కుండలిని శక్తి జాగృతి అయినది! నీలో ఉన్న 13  యోగచక్రాలుఅనగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, కర్మ, గుణ, కాల,బ్రహ్మ,సహస్ర,హృదయ,బ్రహ్మాండ చక్రాలు జాగృతి చెందినాయి! ఈ మంత్రం సాధనతో శివయోగ సిద్ధి పొంది......శివయోగినివి కమ్ము! ఇప్పుడు నీవు ఆ కుక్క దగ్గరికి వెళ్లి తిరిగి దాని దగ్గర ఈ మంత్రమును చెప్పు అనగానే.....

            దీక్షాదేవి (శ్వేత) మారు మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉన్న కుక్క దగ్గర ఈ మంత్రోపదేశము చెయ్యగానే క్షణాలలో కుక్క చనిపోవడము ఈమెకి భయము వేసినది! ఇంతలో అటుగా వస్తున్న ఎద్దు కేసి ఆ యోగిని చెయ్యి చూపిస్తూ..... దాని దగ్గర ఈ శివ మంత్రమును చెప్పు అనగానే.....అది గూడ క్షణాలలో చనిపోయినది! ఆపై చెట్టు మీద ఉన్న రామచిలుకను ఆ యోగగురువుని చూపించగా..... దానిని చూస్తూ దీక్షాదేవి ఈ శివ మంత్రమును పఠించగానే అదిగూడ క్షణాలలో చనిపోయినది! ఆ చెట్టు క్రింద ఉన్న పుట్టలోంచి ఒక పాము బుసలు కొడుతూ బయటకి రాగానే.....దానిని ఈ యోగిని చూపించగానే.....దీక్షాదేవి అది గూడ చనిపోతుందని భయముతో......... నేను ఎవరికి ఈ శివ మంత్రమును చెప్పను! చెప్పితే అవి క్షణాలలో నా కళ్ళ ముందర బాధతో విలవిలలాడుతూ చనిపోతున్నాయి! ఇలా వాటిని చూసి నా వలన ఇవి చనిపోతున్నాయి అనే బాధ నన్ను దహించి వేస్తుంది! అది నావల్ల కాదు అనగానే...... ఆ యోగిని "ఏమిగాదు! శివాజ్ఞ లేనిదే ఏమి జరుగదు గదా! నీ వలన వాటి  ప్రాణాలు పోవడము లేదు! నే చెప్పినట్లుగా ఆ పుట్ట దగ్గరికి వెళ్లి ఆ పాము ముందు ఈ మంత్రము చదువు అని తన స్వరముతో ఆజ్ఞాపించగా ........చేసేది ఏమిలేక దీక్షాదేవి  తీవ్ర ఆవేదనతో మౌనః రోదనతో ఆ పుట్ట దగ్గరికి వెళ్లి మంత్రోపదేశము చెయ్యగానే అదిగూడ క్షణాలలో చనిపోవడముతో దీక్షాదేవికి ఆపుకోలేని ఏడుపు వచ్చింది!

తనవలనే కుక్క,ఎద్దు,రామచిలుక,పాము చనిపోయినాయని ఆవేదన పడుతుంటే........ఆ యోగిని ఈమెను తన దగ్గరికి పిలిచి "దీక్షాదేవి!కంగారుపడకు! ఇలా నీ చేతిలో చనిపోయిన ఈ జీవులు అన్నిగూడ నా భవిష్య జన్మలే! వాటి కర్మనివారణలు  నీ మంత్రము చేత నివారణ చేయించినాను. దానితో నాకు ఈ దేహ జన్మయే అంతిమ జన్మ అయినది! నీవు ఈ మంత్రసిద్ధితో శివయోగములోనికి ప్రవేశించు! దానికి ఆరురకాల అవాంతరాలు అడ్డుగా వస్తాయి! వాటిని నీ మనోధైర్యసంకల్ప బలముతో దాటాలి! అవి ఏమిటంటే ......

1 . నీ ఆత్మను మంత్రసాధనతో.......ఇష్టలింగారాధనతో ఆధీనము చేసుకొని దానిని ఆత్మ లింగముగా మార్చుకోవాలి! ఇందుకు కాంతికిరణాలు అవాంతరాలు కల్గిస్తుంది! దీనిని అధిగమించాలి!

2 . కామ క్రోధములను విడనాడాలి! ఈ ధ్యానస్థితిలో నీకు మంచు అవాంతరము కలిగిస్తుంది! దానిని అధిగమించాలి! 


3 . లోభ మదమత్సరాలను నశింపచేసుకోవాలి! ఈ ధ్యానమునకు సర్పాలు అడ్డుగా వస్తాయి! వీటిని అధిగమించాలి! 

4 . భవబంధాలను త్యజించాలి! అన్నింటిని త్యాగము చెయ్యాలి! ఈ ధ్యానములో నీ ఆత్మలింగము బయటికి వచ్చి ఇష్టలింగములో ప్రవేశించాలి! ఇందుకు ఢమరుక నాదమే అవాంతరముగా వస్తోంది! దీనిని అధిగమించాలి!

5 . నీ భౌతిక నేత్రాలతో గాకుండా నీ మనో నేత్రముతో శివలింగ క్షేత్రాలు దర్శనము అవ్వాలి! అన్నింటిని..... అన్ని గ్రహాలు,లోకాలు,సర్వదేవతల దర్శనాలు నీవు చూడగలిగాలి! ఇందుకు గాఢాంధకారభయము అవాంతరముగా వస్తోంది! మనో ధైర్యముతో అధిగమించాలి! 

6 . సర్వాంతర్యామి భగవంతుడు......అంతర్యామిగా....నీ ఆత్మస్వరూపముగా నీవు చూడగలగాలి ! నీవే దేవుడని....అహంబ్రహ్మాస్మి స్థితిని పొందాలి! ఇందుకు అవాంతరముగా వచ్చే భస్మమును దాటాలి! అప్పుడే నీ ఆత్మ ఆయనలో ఐక్యము చెంది సర్వకర్మల నుండి సర్వ బంధనాల నుండి విముక్తిని పొంది మోక్షప్రాప్తిని పొందుతావు 


ఇలా నీవు ఈ ఆరురకాల ధ్యానస్థితులను పొందాలి! వీటికున్న ఆరురకాల అవాంతరాలు దాటాలి! నువ్వు ఎప్పుడైతే నాలుగవ స్థితి అయిన భవబంధాలు త్యజిస్తున్నావో ఆనాడు నీవు ఈ కాక్షా క్షేత్రమునకు చేరుకుంటావు! నీవు మిగిలిన రెండు స్థితులు ఈ క్షేత్రము నందు దాటగలిగితే అవిముక్తి క్షేత్రమైన ఈ కాక్షా యందు నీవు విముక్తి పొంది మోక్షమును పొందుతావు అంటూ........నా చిట్టచివరి కర్మశేషము గూడ ఈ క్షణములో తీరిపోయినది అంటూ తన చేతిలో ఉన్న ఇష్టలింగమును ఈమెకి ఇస్తూ,దీక్షాదేవి ఒడిలో ఆ యోగిని తల వాల్చినది! ఈమె ఆత్మజ్యోతి కాస్త దీక్షాదేవిలోనికి ప్రవేశించినది! అంటే గురువు శక్తి కాస్త శిష్యురాలిలో ప్రవేశించినది  అన్నమాట! నిజగురువుకి ఎప్పుడు గూడ ఒక నిజ శిష్యుడే ఉంటాడు. ఇట్టి గురువు తన సాధన శక్తిని తన తర్వాత వచ్చే శిష్యుడిలోనికి ఆత్మశక్తిగా ప్రవేశించి తనువు చాలిస్తాడు! ఇలాంటి గురువులే సద్గురువు! సిద్ధగురువు అవుతారని అనుకుంటూ దీక్షాదేవి పైకి లేచి ఆ యోగిని పార్థివ దేహము కేసి ఒక్క క్షణ కాలము పాటు చూడగా.... ఆ యోగిని బ్రహ్మరంధ్రము నుండి యోగాగ్ని బయలుదేరి క్షణాలలో ఈ దేహమును దహింపచేసినది! ఈ భస్మమునే విభూదిగా దీక్షాదేవి ధరించడముతో.....ఈ భస్మము కాస్త అక్కడే ప్రవహిస్తున్న గంగానదిలోకి గాలిలో ప్రయాణించి నిమర్జనమవ్వడము దీక్షాదేవి ఓరకంటతో చూసి....తన గురుదేవుడైన ఈ యోగినికి మనః స్ఫూర్తిగా నమస్కరించి తన కోసము బసలో ఎదురుచూస్తున్న కుటుంబము దగ్గరికి దీక్షాదేవి చేరినది!

     యధావిధిగా ఇంటికి వచ్చి సంసార బాధ్యతలు నెరవేరుస్తూ......తన గురువు ప్రసాదించిన ఇష్టలింగమును శ్రద్ధ భక్తితో.......షట్ కాలాల యందు భస్మముతో పూజ చేస్తూ.......నిత్యము శివపంచాక్షరి మంత్రమును జపిస్తూ...............వీలుదొరికినప్పుడల్లా పద్మాసనము వేసుకొని శివ ధ్యానము చెయ్యటము ప్రారంభించినది!ఇలా 12 సంవత్సరాలు గడిచిపోయినాయి! ఒకరోజు ఇలాంటి తీవ్రమైన శివ ధ్యానస్థితిలో దీక్షాదేవి యుండగా....తన ఆత్మ కాస్త ఆత్మలింగము మారే దృశ్యము తన మనోనేత్రము నందు ఒక క్షణము పాటు మెరిసినది! అంటే తన ధ్యాన స్థితి 1 వ స్థితికి చేరుకుంటుందని.....దీనికి అవాంతరము వచ్చే కాంతిశక్తిని తను చాటుకోవాలని గ్రహించినది!


ఆనాటి నుండి భౌతిక నేత్రాలు బయటికి కనిపించే కాంతిశక్తిని తట్టుకోలేని స్థితికి చేరుకున్నాయి! టి.వి చూసిన, ఫోన్ వాడిన వీటికున్న కాంతిని కళ్ళు తట్టుకోలేకపోవటం దీక్షాదేవికి ఆశ్చర్యమన్పించినది! వైద్యుల దగ్గరికి వెళ్ళితే చత్వారము వచ్చినదని ఏవో మందులు,కళ్ళజోడు ఇచ్చినారు! అవి వేసుకుంటూ......కళ్ళజోడు పెట్టుకుంటూ తన ధ్యానమును కొనసాగించినది! రాను రాను ధ్యానములో వివిధ రంగులున్న కాంతులు కనిపించడము మొదలైంది! కళ్ళు మూసుకున్నగూడ ఈ వెలుగులు,కాంతులు ఎలా కనపడుతున్నాయో ఈమెకి మొదట అర్ధముకాలేదు! ఇలా వీటి గూర్చి ఆలోచనలు చేస్తుంటే ఇంకా తన ఆత్మ ఎప్పుడు ఆత్మలింగంగా మారుతుందని ఆలోచన వచ్చి.......ఈ కాంతి శక్తి తరంగాలు గూర్చి పట్టించుకోవడము మానివేసినది! ఆరు నెలలు అయ్యేసరికి వెలుగులు చిమ్ముతూ తన లాంటి రూపధారి అయిన సూక్ష్మశరీరమైన ఆత్మ దర్శనమై అదికాస్తా దివ్య తేజస్సుయున్న శివలింగముగా...........అదిగూడ స్పటిక కాంతులతో.....పరిశుద్ధ స్పటికలింగముగా మారినట్లుగా.....ఇదియే తన ఆత్మలింగము అని గ్రహించే లోపుల ఈమెకి ధ్యాన భంగమైంది! అంటే శివయోగములోని ఒకటవ ధ్యానస్థితి పూర్తి అయినదని దీక్షాదేవి గ్రహించినది!

     ఇక 2 వ ధ్యానస్థితియైన కామక్రోధాలు విడనాడాలని సంకల్పించుకొని శివధ్యానము చెయ్యడము ఆరంభించినది! అంతే విచిత్రముగా ఈమె భర్త ఈమె దగ్గరికి కామకోరికలు తీర్చమని వెంట పడటము మొదలుపెట్టినాడు! తీరకపోతే కోప తాపాలు మొదలుపెట్టి రోజుకి 10 లేదా 15 సార్లు కామకోరికలు రావడము దీక్షాదేవికి ఆశ్చర్యమనిపించినది! పైగా ఇంటి చుట్టూ ప్రక్కల అందమైన యువకులను ఈమె మనస్సు కోరుకోవడము మొదలు పెట్టినది! తన భర్తతో కోరికలు ఒక ప్రక్క తీరుతున్నగూడ క్రొత్త వాళ్ళతో ఈ కోరికలు తీర్చుకోవాలని మనస్సు ఎందుకు ఆరాట పడుతుందో ఈమెకి అర్ధము కాలేదు! ఏకపతి ధర్మముతో ఈ అతికామము జయించడము మొదలు పెట్టినది! ధ్యానము చేస్తున్నప్పుడు శరీరము కాస్త విపరీతమైన చల్లగా మారడము మొదలు పెట్టినది! అంటే మంచు అవాంతర స్థితి మొదలైనదని దీక్షాదేవి గ్రహించినది! ధ్యానములో ఉన్నపుడు విపరీతమైన కామవాంఛలు కల్గడము అలాగే తట్టుకోలేని చలి కల్గడము దీక్షాదేవి పరిపాటి అయినది! అయిన వీటి అన్నింటిని మౌనముగా భరిస్తూ.......శివధ్యానము ఆపకుండా వాయిదాలు వెయ్యకుండా కొనసాగిస్తూనే ఉంది! రాను రాను ఈమె భర్తలో కామ కోరికలు తగ్గడము......తనలో విపరీత కామవాంఛలు తగ్గడము.....చలిని,చల్లదనమును తట్టుకొనే స్థితిని శరీరము పొందడము దీక్షాదేవి గ్రహించినది! అంటే ఈ శివయోగములోని 2 వ స్థితిని దాటి, 3 వ స్థితిలోనికి తన ధ్యాన స్థితి ప్రవేశించినదని దీక్షాదేవి గ్రహించినది! 

    ఇక 3 వ ధ్యానస్థితియైన లోభ,మధ, మత్సరాలను దాటాలని సంకల్పించుకొని ధ్యానము చెయ్యడము ఆరంభించినది! ఆనాటి నుండి తనలో లోభ తనము మొదలైంది! దానము చెయ్యాలనే ఆలోచన లేకుండా పోయినది! ఇతరులకి ఉచితముగా ఏది ఇవ్వాలనిపించడము లేదు! పైగా తనలో మదము,ఈర్ష్య ద్వేషాలు పెరగడము గమనించినది! ఎవరైన తమకన్నా ఉన్నతస్థితిలో ఉంటే .....విలువైన వస్తువులు,ఆస్తులు కొనుక్కొని ఉంటే దీక్షాదేవి మనస్సు తట్టుకోలేని స్థితికి వెళ్ళడము తనకే ఆశ్చర్యమనిపించింది. అయినా గూడ తన ధ్యానస్థితిని కొనసాగిస్తూనే ఉంది! రాత్రిళ్ళు నిద్రపోకుండా తన భార్య కాస్త పద్మాసనము వేసుకొని సన్యాసిలాగా మారి ధ్యానాలు చెయ్యడము బొత్తిగా ఈమె భర్తకి, అత్తమామలకి, ఈమె తల్లిదండ్రులకి నచ్చడము లేదు! ఈ ధ్యానసమయాలలో గావాలనే ఏదో ఒక పనులు చెపుతూ......ఈమె ధ్యానము చేసుకొనే అవకాశము లేకుండా చేసేసరికి......చేసేది ఏమిలేక దీక్షాదేవి తన మనస్సులోనే శివధ్యానము చెయ్యడము ఆరంభించినది! ఇలా నిరంతరము అజపమంత్రముగా శివధ్యానము చేసేసరికి ఈమె శరీరము తాకినవారికి కరెంట్ షాకు  కొట్టినట్లుగా ఇతరులు అనుభవాలు పొందడము మొదలుపెట్టినారు! వీళ్ళు ఇది చెపుతున్న గూడ ఏమి పట్టించుకొనే స్థితిలో ఈమె ఉండేది గాదు! పట్టించుకుంటే తను గొప్పయోగిని అనే అహంకారము మొదలు అవుతుందని ఈమెకి తెలుసు! అందుకే తనకి తెలిసిన విషయాలు తెలియనట్లుగా ఉండేది! ఇలాంటి స్థితిలో యుండగా......ఒకరోజు ఈమెకి ధ్యానములో పాములు కన్పించడము మొదలు పెట్టినాయి! బుసలు కొడుతూ....కాటు వెయ్యటానికి ప్రయత్నిస్తూ విపరీతముగా భయపెట్టేవి! అయినగూడ ఈమె తన శివ ధ్యానమును ఆపేదిగాదు! అలాగే నిశ్చలస్థితిలో పద్మాసనము వేసుకొని అదే ధ్యానస్థితిని కొనసాగిస్తుండేది! ఇలా ఆరు  నెలలు గడిచిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి పూట ఈమె శివధ్యానములో ఉండగా....... ఇంటిలోనికి ఒక పెద్ద పాము దూరడము...... అది సరాసరిగా దీక్షాదేవి ధ్యాన గదిలోనికి వెళ్ళడము ఆ కుటుంబ సభ్యులు చూసినారు! విచిత్రముగా కాటు వెయ్యటానికి వచ్చిన ఈ పెద్ద పాము కాస్త ఈమె మెడకి చుట్టుకొని ఉండటము......పైగా ఈమె శరీరము నుండి దివ్యకాంతులు బయటికి రావడముతో.....ఇది చూసిన ఈమె కుటుంబ సభ్యులందరు  గూడ ఈమె దేవతయని అనుకొని  ఈమెకి భక్తులు అవ్వడము ఏకకాలములో జరిగిపోయినది! దానితో తన సాధన స్థితి 4 వ ధ్యాన స్థితికి చేరుకున్నదని ఈమె గ్రహించినది!

     ఇక 4 వ ధ్యానస్థితియైన భవ బంధాల మీద ప్రేమ,మోహ,వ్యామోహాలు పోవాలని......వాటిని త్యజించేస్థితికి తను చేరుకోవాలని సంకల్పించుకొని ధ్యానము చెయ్యడము ఆరంభించినది! కొన్ని రోజులకి అనుకోకుండా రోడ్డు ప్రమాదములో ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినాగూడ ఈమె చలించలేదు! ఈ విధంగా ఈ జీవికి అర్ధాంతరముగా తాత్కాలిక విముక్తి కలిగినదని..... శాశ్వత విముక్తి కోసము ఎక్కడో ఒకచోట పునఃజన్మ ఎత్తడానికి మరణమును తీసుకున్నాడనే స్మశాన వైరాగ్యము ఈమెకి కలిగినది! కొడుకు పోయినగూడ తన కంట నీళ్లు రాకపోయేసరికి భర్తకి విపరీతమైన కోపావేశాలు కలిగి ఈమెతో గొడవకి దిగినాడు! అత్త మామలు తెగ తెంపులు చేసుకున్నారు! దానితో తనకున్న భవబంధాలు తీరినాయని.... ఈమె గ్రహించి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని కాశీక్షేత్రమునకు దీక్షాదేవి వెళ్ళిపోయినది! ఈ క్షేత్రమునకు చేరుకొని యధావిధిగా మణికర్ణికా ఘాట్ యందు పద్మాసనము వేసుకొని తీవ్ర ధ్యాన స్థితిలో యుండగా......ఢమరుక నాదము వినబడటం లీలగా మొదలైంది! రాను రాను అది భరించలేని స్థాయికి వెళ్లినను చలించకుండా ధ్యానము నుండి కదలకుండా ఈ శబ్ద నాదమును పట్టించుకోకుండా శివధ్యానము చేస్తూనే ఉంది! ఇలా ఆరు నెలలు గడచిన తర్వాత ఈ శబ్ద నాదము నుండి ఓంకారనాదము వినబడటం మొదలైంది! ఎవరో తన లోపుల నుండి ఓంకార నాదము చేస్తున్నారని దీక్షాదేవికి అనుభవ అనుభూతులు కల్గడము మొదలైనాయి! ఇలా జరిగిన కొన్ని రోజులకి ఈ ఓంకార నాదము తన ఆత్మలింగము నుండి వస్తోందని గ్రహించి మౌనము వహించింది! మరి కొన్ని రోజులకి తను ధ్యానస్థితిలో యుండగా....తన నుండి ఒక దివ్య ఆత్మజ్యోతి ఒకటి బయటికి వచ్చి తను నిత్యము పూజించే ఇష్టలింగములోనికి ప్రవేశించడము దీక్షాదేవి మనోనేత్రమునందు  కనబడసాగినది! అయిన ఏ మాత్రము నిశ్చలస్థితిని కోల్పోకుండా జరిగేదానిని సాక్షిభూతముగా చూడటము మొదలుపెట్టినది! ఇదియే ఆత్మసాక్షాత్కార అనుభవ అనుభూతి స్థితియని ఈమె గ్రహించినది! అంటే తన ధ్యాన స్థితి 5 వ స్థితిలోనికి ప్రవేశించినదని గమనించినది. 
                               ఇక 5 వ స్థితియైన భయమును అధిగమించాలని సంకల్పించుకొని ధ్యానమును ఆరంభించినది! రాను రాను ధ్యానములో గ్రహాలు,గ్రహాలోకాలు,దైవలోకాలు ఈ లోకాల్లో ఉండే లోక వాసులు,దైవస్వరూపాలు తన మనోనేత్రమునందు లీలగా కనబడటము మొదలు పెట్టినారు! వాళ్ళు వరాలు ఇస్తామని వెంటపడటము మొదలుపెడితే... మరికొంతమంది తనని భయపెట్టడము మొదలుపెట్టినారు! అయిన గూడ ఈమె దేనికి చలించేదిగాదు! ఆశ పడేదిగాదు! భయపడేదిగాదు! అన్నింటిని సాక్షిభూతముగా.....ఒక సినిమాను చూస్తున్నట్లుగా తన ధ్యానములో ఒక దృశ్యములాగా చేస్తుండేది.రాను రాను వెలుగు ప్రపంచము పోయి చీకటి ప్రపంచము కనబడసాగేది!గాఢాంధకారము తప్ప ఏమి కనిపించేదిగాదు! కళ్ళు మూసినా.......కళ్ళు తెరిచిన సర్వము చీకటిమయము కనబడిన ఈమె బాధ పడేదిగాదు! చలించేదిగాదు!ఎందుకంటే ఇదంతా మనస్సు చేస్తున్న మాయ అని ఈమెకి తెలుసు! దానితో ధ్యానమును నిశ్చలముగా..... మనో నిబ్బరముగా......మనో ధైర్యముతో కొనసాగించడము మొదలు పెట్టినది! ఒకరోజు కాశీక్షేత్రములో కాశీవాసులకి బదులుగా రుద్రపిశాచాలు ,రుద్రగణాలు,రుద్రదేవతలు,వివిధ యోగులు, యోగసాధకులు, యోగగురువులు, వివిధ దైవ స్వరూపాలుగా కనబడటము మొదలైంది! అయినాగూడ సాక్షిభూతముగా ఉండేది! తన ధ్యానమును కొనసాగిస్తూనే ఉండేది! ఇలా ఆరునెలలు తర్వాత ఒక రోజు ఈమె దగ్గరికి పదులలో పాములు చేరినాయి! ఒంటి మీదకి ప్రాకినాయి! నానా రకాలుగా ఇబ్బందులు కలిగించినాయి!అయినా ఈమె భయపడలేదు! ధ్యానము నుండి లేవలేదు! దానితో ఈమెకి రక్షణ కవచముగా అయిదు తలల పాము ఉండటము మొదలు పెట్టినది! ఈ విషయము గ్రహించిన దీక్షాదేవి ఏ మాత్రము తనలో ఇసుమంత అహంకారమాయను గూడ ప్రదర్శించలేదు! అలాగే తనలో పంచభూత ఆధీన శక్తి అలాగే అష్ట సిద్ధులు వచ్చినాయని లోకానికి ప్రచారము చేసుకోలేదు! తన పంచశరీరాలుగా భద్రకాళి, తారాదేవి,శ్వేత, శారదా,స్వాతిగా గ్రహించి వారిని ఏకత్వ స్థితిలోనికి తెచ్చుకుంది! చిట్టచివరి స్థితియైన శివబ్రహ్మమునందు అనగా శూన్యమునందు ఐక్యమవ్వటానికి 6 వ స్థితి సాధనను చెయ్యడము ప్రారంభించినది!

        6 వ స్థితియైన కపాలమోక్షము పొందాలని....తన పంచశరీరాలకి పంచ కపాల మోక్షము పొందాలని...... విముక్తి పొందాలని నిశ్చయించుకొని దీనినే సంకల్పించుకొని తీవ్ర ధ్యానము చెయ్యడము మొదలు పెట్టినది! ఒకరోజు ఈ సంవత్సరంలో వచ్చే శివరాత్రినాడు కాశీక్షేత్రము నందు ఒక యోగిని తన సాధ శక్తితో ఆ కాశీ విశ్వనాధుడి సాక్షాత్కారమును పొంది ఆ శివలింగములో శివైక్యము చెందుతుందనే విషయము దేశమంతటా నోటితో ప్రచారము అయినది! ఈ వింతను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా ఈ క్షేత్రమునకు రావడము జరిగినది.ఆరోజు మహాశివరాత్రి!  అర్ధరాత్రి 12 గంటల సమయము. దీక్షాదేవి తన 6 వ స్థితిని పొందటానికి మణికర్ణికా ఘాట్ వద్దకి చేరుకుంది. ఈమెతో పాటుగా శివ సాక్షాత్కారము చూడటానికి ప్రజలు ఈమె వెంట ఉన్నారు. 

అందరు శ్రద్ధ, భక్తితో శివనామస్మరణ చేస్తున్నారు! ధ్యానములో కూర్చోటానికి దీక్షాదేవి సిద్ధపడుతుండగా....ఈమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి "అమ్మా! తల్లి! నీవు అనుకున్నది సాధించినావు గదా! శివ యోగినిగా మారిపోయినావు గదమ్మా! నాతో శపథము చేసి పురుషుడే యోగిగా మారడని స్త్రీ గూడ యోగినిగా మారుతుందని నిరూపించినావుగదా! నీ దయతో నాకు జ్ఞాన భిక్ష పెట్టు తల్లి! మీరు తప్ప నన్ను బోధ గురువు నుండి జ్ఞాన గురువుగా మార్చలేరు అంటూ ఈమె కాళ్ళమీద పడేసరికి ఈమె కాస్త ఈయనను లేపి "నాయనా! నీవు ఆరోజు నాకు ఆ విధంగా బోధ చేసినావు! నాకు మార్గము నిర్దేశించినావు! ప్రస్తుత నీ దేహ జన్మను వృధాగా ప్రసంగాలతో వ్యర్ధము చేసుకోకు! నీవు ఎవరో తెలుసుకో, ప్రయత్నము చెయ్యి! సాధనతో అనుభవ పాండిత్యమును పొందు! అంటూ ఈయన భ్రూమధ్యము మీద దీక్షాదేవి చూపుడు వ్రేలు పెట్టగానే ఈయనలో శక్తిపాతము జరిగి కుండలినీశక్తి జాగృతి అవ్వడము యోగచక్రాలు   జాగృతి అవ్వడము ఏకకాలములో జరిగిపోయినాయి! దానితో తన కర్మశేషము గూడ సంపూర్ణముగా తీరినదని దీక్షాదేవి గ్రహించి కోరికలేని స్థితిలోనికి.......ఆనందాతీతస్థితిలోనికి ధ్యానము నందు తన మనస్సు నిలిపినది! తీవ్రధ్యాన స్థితిలో యుండగా.....తన శరీరము నుండి విపరీతముగా విభూది రాలుతున్న సమయములో తన పంచశరీరాలైన ఆకాశశరీరముగా భద్రకాళి, సంకల్పశరీరముగా తారాదేవి, కారణ శరీరముగా శ్వేతాదేవి, సూక్ష్మశరీరముగా శారదాదేవి స్థూల శరీరముగా స్వాతి బయటికి వచ్చి శివతాండవము చెయ్యడము అక్కడున్న వారందరికీ ఆశ్చర్యమన్పించినది! ఒక దేహములో ఇలా పంచశరీరాలుంటాయని.....వీటికి పంచ కపాలమోక్ష  స్థితులు పొందవలసి ఉంటుందని అప్పుడికే వీళ్లందరికి తెలిసి అవాక్కు చెందినారు!

                ఇలా ఈ పంచశరీరాలు తీవ్ర స్థాయిలో శివతాండవము చేస్తుండగా ఆకాశము నుండి ఢమరుక నాదము వినబడేసరికి అందరిలోనూ భయభక్తులు మొదలైనాయి! శివనామస్మరణ మారుమ్రోగినది! దద్దరిల్లిపోయినది! అక్కడేమో కాశీ విశ్వ నాధుడి లింగము నుండి ఒక దివ్యజ్యోతి బయటికి రావడము అక్కడ పూజ చేస్తున్న పూజారులు చూసి భయభక్తితో దండాలు పెడుతుండగా.....గుడిలో గంటలు ఎవరి ప్రమేయము లేకుండా మ్రోగుతుండేసరికి ఆశ్చర్యము పొందుతుండగా.... ఈ శివజ్యోతి ఆకాశము వైపుకి ప్రయాణిస్తూ మణికర్ణికా ఘాట్ దగ్గరికి రావడముతో నిత్యము భయపెట్టే శివ భక్తులైన అఘోరాలు. ఈ శివజ్యోతిని వెంబడిస్తూ దీక్షాదేవి ధ్యానము చేస్తున్న ప్రదేశమునకు చేరుకొని తీవ్ర స్వరముతో హర హర మహాదేవ అంటూ ఢమరుక నాదాలతో, శంఖనాదాలతో ఈ ప్రాంతమంతా శివ శబ్ద నాదము చెయ్యడము ప్రారంభించినారు! ఈ శివజ్యోతి కాస్త ధ్యానములో ఉన్న మహాదేవుడిగా రూపాంతరం చెందేసరికి ఈ పంచ శరీరాలు కాస్త ఏక శరీరముగా..... పంచ కపాలమోక్షమును పొందుతూ ఆత్మజ్యోతిగా...మారి...ఆ మహాశివుడిలో శివైక్యము చెందడము ఆకాశమంతా  మెరుపులు రావడము ఏక కాలములో జరిగినది! దానితో మెరుపులాగా కనపడిన కాశీ విశ్వనాధుడి విశ్వరూపము మెరుపు కాంతిలాగా అదృశ్యమయినది! తనతోపాటు అక్కడున్న వారందరికి శివస్వరూప దర్శన భాగ్యమును కలిగించిన దీక్షాదేవికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈమె నిజముగానే శివయోగిని అనుకుంటూ... ఆకాశము కేసి నమస్కారాలు చెయ్యటము ప్రారంభించినారు! 
                                        --------------------శుభం భూయాత్---------------------

                                                               పరమహంస పవనానంద
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

కాశ్యాంతు మరణాన్ముక్తి-అనుభవ కథ

పవన్ కి...
కాశీ క్షేత్రములోనే మరణము పొందితే మోక్షప్రాప్తి ఎలా కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఈ క్షేత్రానికి కున్న ఆ ప్రత్యేకత ఎందుకు ఉంది? ఇలా మున్నగు ధర్మసందేహాలు వెంటాడినాయి! దానితో వీటి సమాధానాలు వెతకటానికి మహా స్మశాన క్షేత్రమైన కాశీ క్షేత్రమునందు 41 రోజులపాటు ఉండటానికి ఏర్పాట్లు చేసుకొని ఈ క్షేత్రానికి చేరుకున్నాడు!

       యధావిధిగా అక్కడున్న అందరి విగ్రహ దైవాల దర్శనాలు పూర్తి చేసుకొని నిత్య దహాగ్ని ఘాట్ అయిన మాణికర్ణికాఘాట్ కి చేరుకొని ప్రతి 20 నిమిషాలకి ఒకసారి క్రొత్తగా వచ్చే శవాల దహన కార్యక్రమమును తదేకముగా చూడటము ప్రారంభించాడు!

  
ఇంతలో అక్కడికి వంటి నిండా విభూధి ధారణతో.... జటాధారి... చేతిలో త్రిశూలముతో.... సాక్షాత్తు శివాంశతో ఒక అఘోరుడు వచ్చి.... ఒక శవదహన కార్యక్రమము జరుగుతున్న సమయములో ఏర్పడిన బూడిదను కాస్త విభూధిగా రాసుకుంటూ... విపరీతముగా ఆనందపడుతూ ఉండటము పవన్ గమనించాడు! ఉన్నట్టుండి అఘోరుడు దహనమవుతున్న శవము కేసి చూస్తూ "పశువా? నీకు కపాలా మోక్ష ప్రాప్తి ఇవ్వటానికి వచ్చానురా! కపాల మోక్ష ప్రాప్తిరస్తు" అని పెద్దగా అరిచేసరికి.... ఆ శవము యొక్క కపాలం కాస్త 'ఫట్ ' మని పగలడము పవన్ కళ్లారా చూసి ఆశ్చర్యము చెందినాడు! ఇప్పుడిదాకా ఎన్నో శవాల దహనము జరిగినాయి! కాని వేటికి ఇలా అఘోరులు వచ్చి దీవించడము తను ఇప్పుడిదాకా చూడలేదు! మరి ఈ శవ దహనానికి ఈయన ఎందుకు వచ్చి అలా దీవించినాడో తెలుసుకోవాలని అన్పించి... ఆ అఘోరమూర్తి దగ్గరికి పవన్ వెళ్లగానే...."ఓరి! మూర్ఖుడా! మానవ పశువా? అజ్ఞాన జీవివి! ఏమిరా? కాశ్యాంతు మరణాన్ముక్తి ఏమిటో ఎందుకో, ఎలా అని తెలుసుకోవాలని వచ్చావు గదరా! నాతో రా! నీకు అన్ని చూపిస్తాను! చెపుతాను- అంటూ ఒక వైపుకి వెళ్లుతుండేసరికి పవన్ ఆశ్చర్యము చెందుతూ తనకి ఉన్న అన్ని సందేహాలు ఈయనకి ఎలా తెలిసినాయో అనుకుంటూ... ఈయనను అనుసరించాడు!

                       ఈయన ఒక పూల దుకాణము నందు అక్కడి ఉన్న పూలవాసనను చూడమని అఘోరుడు చెప్పగా.... పవన్ అలాగే ఈ పూలవాసన చూస్తే ఎలాంటి వాసనలు రాకపోయేసరికి ఆశ్చర్యము చెందుతూ అక్కడున్న అన్ని రకాల పూలు గూడ వాసన రావడము లేదని తెలుసుకుంటుంటే... ఆ పూలను అమ్మేవాడు కాస్త పవన్ తో "స్వామి! ఈ క్షేత్రములో సువాసన ఇచ్చే పూలు కాని పూల చెట్లుకాని ఉండవు! బ్రతకవు! అందరుగూడ ఈ క్షేత్ర కాశీ విశ్వనాధ లింగము యొక్క రేడియేషన్ శక్తి అంటారు! అని చెపుతూంటే.... అఘోరుడు మౌనముగా మరొక వైపు వెళుతుండగా... పవన్ అనుసరించాడు!

             ఆ తర్వాత రోడ్ల మీద, వీధులలో, ఇండ్ల ముందు చనిపోయిన ఆవు,కుక్క,మేక,కోతిపిల్ల,ఎద్దు,పావురము,రామచిలుక,పిల్లి,ఎలుక... ఇలా చనిపోయిన జంతువులు ఉండటము గమనించాడు! విచిత్రము ఏమిటంటే ఇలా చనిపోయిన జీవులు అన్నిగూడ కుడిచెవి ఆకాశము కేసి చూడటము గమనించాడు! కారణము ఏమిటో పవన్ కి అర్ధము కాలేదు! అఘోరుడిని అనుసరిస్తూ.... పవన్ ముందుకి సాగిపోయినాడు! ఆ తర్వాత అఘోరుడు కాస్త తిరిగి మణికర్ణికా ఘాట్ కి చేరుకున్నాడు! ఆ తర్వాత ఈయన కాస్త పవన్ కేసి చూస్తూ "నాయనా! నీ ధర్మసందేహాలకి సమాధానాలు చెపుతాను! జాగ్రత్తగా విను! ఈ కాశీ క్షేత్రములో ఆది బ్రహ్మ దేవుడు పంచ శరీరాలతో ఈ విశ్వసృష్టి చేసినాడు! ఈ పంచ శరీరాలకి గుర్తుగా... ఈ క్షేత్రమునందు పంచక్రోశ యాత్ర విధి విధానము ఏర్పరచినారు! అంటే పంచ శరీరాలకి మోక్షప్రాప్తి ఈ క్షేత్రములోనే జరుగుతుంది అన్నమాట! మిగిలిన మోక్ష పురాలలో అనగా అయోధ్య,హరిద్వార్,ఉజ్జయిని,ద్వారక,కంచి....ఈ క్షేత్రాలలో ఎవరైనా మరణము పొందితే... కర్మ నివారణ పూర్తి చేసుకుంటారు! ఇలా వీరంతా మరు జన్మలో యోగజన్మను ఈ కాశీక్షేత్రములో ఎత్తి కర్మశేష నివారణ చేసుకొని ఈ క్షేత్రములో మోక్షము పొందుతారు! దీనికి కారణము ఈ క్షేత్ర దేవాదిదేవుడైన మహాశివుడే సాక్షాత్తుగా చనిపోయిన జీవుల కుడి చెవిలో రామ తారక మంత్రోపదేశము చెయ్యడముతో... కర్మశేషము గూడ నివారణ అయ్యి ఆ జీవులకి పునఃజన్మ... కర్మ జన్మలేని విదేహముక్తుడై కపాలమోక్షమును పొందుతాడు! అందుకే ఈ క్షత్రములో చనిపోయిన జీవులు తమ కుడి చెవిని ఈ మంత్రోపదేశము కోసము ఆకాశము వైపు పెట్టి చనిపోతారు! ఇలాంటి జీవులకే మేము స్వయంగా వచ్చి కపాల మోక్ష ప్రాప్తిరస్తు అని దీవిస్తాము! 

అంటే కాశీక్షేత్రములో చనిపోయే అందరికి ఇలాంటి యోగకారణము కలగదు! దానికి అర్హత, యోగ్యత ఉండాలి! అపారమైన పుణ్యఫలముండాలి! 48 తరాల పాటు యోగజన్మలుండాలి! అయిన శివ పురాణములో సాక్షాత్తు మహాశివుడే మోక్షము గూర్చి చెప్పినారు గదా! ఎవరైతే... చిదంబర క్షేత్రములో శివలింగమూర్తి దర్శనము పొందుతారో... లేదా తిరువనంత పురము నందు పుట్టుతారో... ఎవరైతే కాశీ క్షేత్రమునందు మరణము పొందుతారో... ఎవరైతే కేదారేశ్వరుడి తుంగభద్ర నీళ్లు నిత్యమూ స్నానము చేస్తారో... ఎవరైతే... అరుణాచల క్షేత్రము నందు ఆ జన్మాంత ఆవాసము చేస్తూ ఉంటారో.... పంచక్షేత్రాలలో ఇలా జరిగిన జీవులకి ఆయన స్వయముగా మోక్షప్రాప్తి ఇస్తారని చెప్పడమం జరిగింది గదా! కాని ఈ పైన చెప్పిన క్షేత్రాలలో కాశీక్షేత్ర మరణము అనేది మనము చేసుకొనే కర్మ పుణ్యఫలము బట్టి ఉంటే మిగిలిన నాలుగు క్షేత్రాలలో మరణము అనేది మన గత జన్మల కర్మల ఫలితాలను ఇచ్చి విధాత యొక్క విధి వ్రాత చేతిలో ఉంటుంది! ంటే ఈ లెక్కన చూస్తే కాశ్యాంతు మరణాన్ముక్తి అనేది మాత్రమే మన చేతులలో మన చేతలను బట్టి ఉంటుందని తెలుస్తోంది గదా! అంటూ.... పద! జీవుడికి మన శివదేవుడు రామ తారక బ్రహ్మ మంత్రోపదేశము చెయ్యటానికి వస్తున్నాడు అంటూ... మణికర్ణికా ఘాట్ వైపుకి బయలు దేరినాడు! అక్కడకి వెళ్లిన వీరిద్దరికి.... అఘోరమూర్తి వెంటనే పవన్ వైపు తిరిగి

 "ఓ పశువా! శివదేవుడు వచ్చాడు! చూశావా? అని అడిగితే పవన్ వెంటనే "స్వామి! నాకు ఎవరు ఏ దేవుడు కనిపించడము లేదు! ఒక శవ  దహనము తప్ప అనగానే... 

అఘోరుడు వెంటనే "అందుకేరా! మిమ్మల్ని మేము పశువు అని అనేది! భౌతిక నేత్రాలతో చూస్తే ఏమి కనబడుతుంది! మూడవ నేత్రమైన త్రినేత్రముతో చూస్తేనే ఆ త్రినేత్రుడు మనకి అగుపడతాడు" అంటూ పవన్ నుదుటి మీద తన బొటన వ్రేలు పెట్టి ఏదో మంత్రాలు చదివి చదవగానే... పవన్ కి ఆకాశములో... శవ దహనము జరుగుతున్న ప్రాంతములో... 70 mm ధియేటరులో ఒక దేవుడి సినిమా దృశ్యము చూస్తున్నట్లుగా ఒక వీడియో దృశ్యము లీలగా కనబడసాగింది! శవ దహనము పూర్తి అయిన జీవుడి యొక్క మూర్చబోయిన సూక్ష్మ శరీరము మహాశివుడి ఒడిలో ఉన్నట్లుగా కనిపించసాగింది! 

అప్పుడు శివుడు కాస్త కపాలధారిగా...తలపై చంద్రుడితో... మెదడులో నాగపాములతో... ఏనుగు చర్మము ధరించినవాడిలాగా కనబడుతున్నాడు! డుంఢి గణపతి కాస్త తన తొండముతో గంగా జలమును తీసుకొని ఈ జీవుడు పైన అభిషేకము చేస్తున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! ఆ తర్వాత దండపాణి ఈ జీవునికి భస్మధారణ చేసి రుద్రాక్ష ధారణా చేసే దృశ్యము లీలగా కనిపించసాగింది! అటుపై పార్వతీదేవి ఈ జీవి మరణ వేదన నుండి ఉపశమనము కలిగించుటకు కస్తూరి, గంధ లేపనం పుయ్యడముతో పాటుగా... తన చీరకొంగును ఒక విసన కర్రలాగా.... విసురుతున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు సాక్షి గణపతి ఈ జీవుడు చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్పే దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు కాల భైరవుడు కాస్త వాని పాప పుణ్యములను విచారించి ఆ సూక్ష్మ శరీరమును 7 క్షణాలు పాటు రుద్రపిశాచమువలె మార్చి అనేక విధాలుగా దండించి తదుపరి ఈ జీవుడికి తారక మంత్రోపదేశమునకు సిద్ధము చేస్తున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! ఆ తర్వాత ఇట్టి సూక్ష్మ దేహమును దండపాణి కాస్త మహాశివుడి ఒడికి చేర్చి అందరు కలిసి ఈ జీవుడికి తారక మంత్రోపదేశముగా చేయవలసినదిగా మహాశివుడిని ప్రార్ధించే దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు ఆ సూక్ష్మధారికి స్పృహ వచ్చి చూస్తే... ఆ మహాశివుడు కాస్త ముగ్ధ మనోహర రూపముతో... ఆ జీవుడి కుడి చెవిలో తారకమంత్రోపదేశము చేస్తున్న లీలా దృశ్యము కనిపించసాగింది! అటుపిమ్మట ఈ దేహము కాస్త ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణించే దృశ్యము కనబడి... ఈ దృశ్యము అంతాగూడ అదృశ్యమయినది! అంటే కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి, శ్రీ తాడేపల్లి రాఘవశాస్త్రిగారికి , శ్రీ రామకృష్ణ పరమహంసకి ఇలాంటి మనోహర దృశ్యము తాము అనుభవ అనుభూతిగా చూశామని వారి చరిత్రలలో చెప్పిన విషయమును నిజమేనని పవన్ గ్రహించే లోపుల.... అక్కడే ఉన్న అఘోరుడు కాస్త శివ అఘోర మూర్తిగా మారి అదృశ్యమయ్యేసరికి పవన్ కి నోటమాట రాలేదు! అంటే ఇంత సేపు తనతో కాశీ విశ్వేశ్వరుడే ఉన్నాడని తెలుసుకొనేసరికి ఆయన కాస్త అదృశ్య మయినాడు!

          కాని పవన్ కి ఒక సందేహము అలాగే ఉండిపోయింది! కాశీ క్షేత్రములో జీవించిన వారందరు ఎందుకు కాశీ క్షేత్రములో మరణము పొందడము లేదో తెలుసుకోవాలని అనిపించసాగింది! ఎందుకంటే తన కళ్ల ముందే ఒక సంఘటన జరిగింది! అది ఏమిటంటే కేదారేశ్వర ఘాట్ లోని కేదారేశ్వరుడి శివలింగమును నిత్యమూ అర్పించే ఆలయ పూజారికి కాశీ క్షేత్రములో మరణము పొందాలని చిన్నప్పుడే అక్కడికి వచ్చి కాశీ వాసము చేస్తున్నాడు! తండ్రి చనిపోయాడు! అన్న కాస్త లక్నోలో ఉంటున్నాడు! ఇతడి దగ్గరే తల్లి ఉంటుంది! ఒక మహాశివరాత్రికి ఈమె కాశీ క్షేత్రానికి వచ్చి ఆరోజు చిన్న కొడుకు దగ్గర ఉంది మర్నాడు కల్లా తన పెద్ద కొడుకు ఉండే లక్నోకి వెళ్లిపోయేది! ఈమెకి కాశీ వాసము అన్న అలాగే కాశీ క్షేత్రములో మరణము అన్న భయము! ఎందుకంటే నరమాంసము తినే అఘోరులు ఈ క్షేత్రమునందు ఆవాసము చెయ్యడమే అందుకు కారణమని తెలుసుకున్నాడు! కాలము గడుస్తోంది! ఒకసారి లక్నోలో ఉన్న కన్న తల్లికి ఆరోగ్యము బాగోలేదని ఆస్పత్రిలో చేర్చినారని అన్న ద్వారా తెలుసుకున్న తమ్ముడైన ఈ ఆలయ పూజారి అక్కడికి వెళ్లాడు! చావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లిని చూసి ఆయన తనువు దాల్చినాడు! ఆ తల్లి కాస్త చనిపోయిన తన చిన్న కొడుకు చితా భస్మమును తీసుకొని కాశీ గంగలో నిమర్జనము చేస్తూ ఆ తల్లి గూడ తనువు దాల్చిన దృశ్యమును పవన్ స్వయంగా తన కళ్లతో చూశాడు! అప్పుడు ఆవేదనలో అనర్గళంగా తన నోటి వెంట నుండి ఆశువుగా... అశ్రువులతో ...


కాశీ క్షేత్రములో మరణము పొందాలని 
ఈ క్షేత్ర దేవాలయ పూజారి ఆశయం.

వేరే ప్రాంతములో ఉన్న తన తల్లికి 
ఆరోగ్యం బాగులేదని కబురు వస్తే...
ఇతను అక్కడికి వెళ్ళి ఆస్పత్రిలో ఉన్న 
తల్లిని చూసి తల్లిడిపోయిన 
ఈ పూజారి గుండె ఆగిపోయింది.

కొడుకు చితాభస్మమును తీసుకొని 
కాశీగంగాలో కలుపుతుండగా 
ఆ తల్లి తట్టుకోలేక తనువు దాల్చింది.

అందుకే కాశీక్షేత్రానికి 
చచ్చేవాళ్ళు -వృద్ధుల రూపములో 
చచ్చినవాళ్ళు - అస్ధికల రూపములో 
వస్తారనే నానుడి నిజమైంది.

ఇంతలో అక్కడికి ఒక బైరాగి వచ్చి "నాయనా! కాశీ క్షేత్రములో ప్రస్తుత జన్మ ఉన్నత జన్మ అయ్యి ఉండవచ్చును! దానితో పెక్కు దాన ధర్మాలు చేసి పుణ్యాత్ముడిగా ఉంది ఉండవచ్చును! కాని గత జన్మలలో పుణ్యభారము కన్నా రెట్టింపు పాప భారము ఎక్కువగా ఉంటే వారికి కాశీ క్షేత్రములో నివసించే యోగము, అలాగే కాశీ మరణము ఉండదు. మరణ సమయానికి ఇలాగే ఏదో ఒక కారణముతో కాశీ క్షేత్రము నుండి బయటికి పంపించబడి అక్కడ మరణమును పొందుతాడు! మరు జన్మలో కాశీక్షేత్రములో రుద్రపిశాచులుగా జన్మించి వారి పాపకర్మ నివారణ చేసుకొని రుద్రగణాలుగా మారి శివలోకమునకు చేరుకుంటారు అని తెలుసుకో అన్నాడు! అప్పుడు పవన్ స్వామి! ఇంతకీ మీరెవరు? "అది తెలుసుకున్నవాడిని" అంటూ ఆయన గూడ అదృశ్యమయ్యేసరికి ఇలా నేను ఎప్పుడు అవుతానో గదా అనుకుంటూ పవన్ కాస్త ఇంటి దారి పట్టినాడు.

శుభంభూయాత్

పరమహంస పవనానంద


1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి