లక్ష్మీ మాయ చూపించినది.
(నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు)
స్వాధిష్టాన చక్రం అనుభవాలు నా డైరీలో:
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
P1:
జూన్ 1: ఈరోజు నాకెందుకో విపరీతంగా ధనమును సంపాదించాలనే కోరిక మొదలైంది. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.
జూన్ 10: ఈరోజు రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా చూశాను. బ్రతికితే కోటాను కోట్లు సంపాదించి వాటిని అనుభవించి ఇతరులకు పంచి చనిపోవాలని అనిపించసాగింది.
జూన్ 12: ఈరోజు నాకు ధ్యానము కన్నా ధనము మీద ఆలోచనలు ఎక్కువైనాయి.
జూన్ 15: ఈరోజు నాకు ఒక అంగుళం ఉన్న పంచలొహ మహాలక్ష్మి విగ్రహమూర్తి వచ్చింది. నన్ను కోటీశ్వరుడిని చేయటానికి కాబోలు.
జూన్ 18: ఈరోజు నాకు ధ్యానములో కొల్హాపూర్ మహాలక్ష్మి విగ్రహమూర్తి కనపడినది. చాలా సజీవ కళగా ఉంది.
జూన్ 25: ఈరోజు నాకు ధ్యానం చేయాలని అనిపించలేదు.ధనపు ఆలోచనలు ఎక్కువైనాయి.
జూన్ 26: నేను ఈరోజు ధ్యానములో ధనమును గూర్చిన ఆలోచనలు చేసినాను. ధ్యానమా ధనమా లేదా ధనమా ధ్యానమా అర్థం కావడం లేదు.
P2:
జూన్ 30: ఈరోజు నాకు అమెరికా డాలర్ వచ్చినది. దీని వెనుక వైపు చింతామణి శిల బొమ్మ ఉంది. దానికి త్రినేత్రం ఉంది. నాకున్న ధన చింత తీర్చడానికి ఇది వచ్చిందా ఏమో చూడాలి.
జూలై 5: ఈరోజు ధన వ్యామోహం ఆలోచనలు ఎక్కువైనాయి. ధ్యానము కుదరటంలేదు. కారణం తెలియడంలేదు.
జూలై 6: ఈరోజు నాకు ఉద్యోగం పోయినది.క్రొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. ఆర్ధిక సమస్యలు ప్రారంభమవుతున్నాయా? ఏమో చూడాలి.
జూలై 10: ఎక్కడా కూడా నాకు ఉద్యోగం దొరకడం లేదు. అదృష్టం కొద్దీ మా ఆవిడ ఉద్యోగం చేస్తోంది.
జూలై 15: ఉద్యోగం రాలేదు అనే బాధ వలన ఈ రోజు ధ్యానం సరిగ్గా చేయలేక పోతున్నాను.
P3:
జూలై 18: ఈ రోజు పదవతరగతి సీడీలు తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టినాను.ఏమి జరుగుతుందో చూడాలి.
జూలై 30: ఈ సీడీలు తయారుచేయటం అనుకున్నంత తేలిక కాదని తెలుస్తోంది. అయినా తప్పదు కదా.భుక్తి నడవాలి కదా. ధ్యానము అంతగా చేయలేకపోతున్నాను.
ఆగస్టు 10: సీడీలు తయారీ మీద ఎక్కువ ఏకాగ్రత అవటము వలన ధ్యానము మీద ధ్యాస తగ్గినది.
డిసెంబరు 15: ఈరోజు నా సీడీలు అమ్మకానికి వెళ్లినాయి. ఏమి జరుగుతుందో చూడాలి.
ఫిబ్రవరి 10:నా సీడీలకి 10,000/- వచ్చినాయి. అంతే.
మార్చి 18: సీడీలు అమ్మే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసింది. వాళ్లు ఎక్కువ సీడీలు అమ్ముకొని నాకు తక్కువ సీడీలు అమ్మినామని డబ్బులు రాలేదని చెప్పినారు. ధ్యానం నామమాత్రంగా సాగుతోంది.
మార్చి 27: ఈ రోజు నా పుట్టిన రోజు. జరుపుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు.
ఏప్రిల్ 10:నేను అప్పు పెట్టి తీసుకున్న ఫ్లాట్ కి EMI తీర్చాలని బ్యాంకు వారు ఫోన్ చేసినారు. తీర్చటానికి డబ్బులు లేవు. కట్టటానికి ఎక్కడ్నుంచి తేవాలి.
మే 14: ఈ రోజు నా భార్య నా దగ్గర చేసుకునే తొలి పుట్టిన రోజు. ఆమెకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు. వ్యాపారం లేదు. ఉద్యోగం లేదు. బాధగా ఉంది. ధ్యానము చెయ్యక తప్పదు కదా.
P4:
మే 20:ఈరోజు మా ఆవిడ తన ఉద్యోగానికి రాజీనామా చేసినది. అనుకోని అనారోగ్య సమస్యలు రావడం వలన. ఆమెని ఏమీ అనలేను.ఇక డబ్బులు నా దగ్గర లేవు. ఇప్పుడు భుక్తి నడపటానికి కూడా డబ్బులు లేనట్టే.
మే 25: తను ఎక్కడ కూడా క్రొత్త ఉద్యోగం చేయనని చెప్పినది. తనని ఇబ్బంది పెట్టకూడదు. ధన ఇబ్బందులు నేనే పడాలి. చేసినంత కాలము వరకు చేసినది కదా. ఏమి జరుగుతుందో చూద్దాం. ఇప్పుడున్న డబ్బులు మరో ఆరు నెలల వరకు సరిపోతాయి.
జూన్ 10: బ్యాంకు ఈఎంఐ కట్టి ఇప్పటికీ మూడు నెలలు అయినది. డబ్బులు లేవు. వ్యాపారం సాగటం లేదు.
జూన్ 18: 5 వేల పెట్టుబడితో గణపతి పూజకిట్ వ్యాపారం చేయడం ప్రారంభించాను. అందరూ ఉచితంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.కాని డబ్బులకు ఎవరు కొనటం లేదు. ఏమి జరుగుతుందో చూడాలి.
జూలై 8: పూజకిట్ వ్యాపారము కూడా సక్రమంగా సాగడం లేదు. cd లు అమ్మేవాడు మోసం చేస్తున్నాడు. అటూ ఉద్యోగాలు లేవు. వ్యాపారాలు లేవు. డబ్బులు లేవు.అప్పులు పెరుగుతున్నాయి. ఏమి చెయ్యాలిరా దేవుడా.
P5:
జూలై 10: ఈరోజు నేను విపరీతంగా కసితో, కోపంతో, బాధతో ఆవేశంగా 6 గంటలపాటు ధ్యానం చేశాను. ఎందుకంటే నేను అన్నం తిని మూడు రోజులైంది. నేను పస్తులుంటాను. ఏ పాపం చేసిందని నా భార్య పస్తులు ఉండాలి.
జూలై 18: ఈ రోజు రాఘవేంద్ర స్వామి మహత్యం సినిమా చూశాను. అందులో నాకు లాగానే రాఘవేంద్ర స్వామి వారు కూడా విపరీతమైన కష్టాలు పడినారని చూపించారు. ఆ సినిమా చూస్తే నాకు కాసింత మనోధైర్యం వచ్చింది. కానీ బ్రతుకు నడవాలి కదా. ఎలా అసలు ఈ కష్టాలకి కారణాలు ఏమిటో మా గురుదేవుడిని అడగాలి.
జూలై 20: మా గురు దేవుని కలిసి నా కష్టాలు చెప్పినాను. దానికి ఆయన “మంచిది. అదృష్టవంతుడివి. నీ సాధన స్వాధిష్ఠాన చక్రానికి చేరుకుంది.నీకు విపరీతమైన ధనకాంక్ష ధన లేమి సమస్యలకు సంకేతం స్వాధిష్ఠాన చక్ర దేవత అయిన మహాలక్ష్మి మహామాయలే అని గ్రహించు.ఇవి ఎక్కడి దాకా తీసుకొని వెళతాయో చూడు. అప్పటి దాకా సహనంగా ఓర్పుగా వుండు. ధన ఆశలో అసలు పడకు. ఇదంతా ధన మాయ లీల అని గ్రహించు.ధ్యానము వీడకు” అని చెప్పినారు. ఆకలితో ధ్యానం ఎలా చేయాలో నాకైతే అర్థం కాలేదు.
P6:
జూలై 25: పుండు మీద కారం చల్లినట్లుగా మా పెదనాన్న గారి అబ్బాయి నాకు తమ్ముడైన వాడు(అమాయకభక్తుడు అధ్యాయములోని వాడు) ఏదో కారణాల వలన నా దగ్గర ఒక ఆరు నెలలు ఉండటానికి వచ్చినాడు.నాకే గతి లేదు. మరొకరికి దిక్కా. నాకు ఏమీ అర్థం కావడం లేదు.
జూలై 30: అనుకోని కారణాల వలన ఈ రోజు ఇల్లు మారినాను. ఈ క్రొత్త ఇల్లు అయినా కలిసి వస్తోందా? ఏమో చూడాలి.
ఆగస్టు 10: నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. వ్యాపారాలు కలిసి రావటం లేదు. ఉద్యోగము లేదు. డబ్బులు వచ్చే మార్గాలు లేవు. ధ్యానం మ్రొక్కుబడిగా చేస్తున్నాను.ఈ రోజు మా నాన్న నుంచి తను పూజించే వెండితో చేసిన లక్ష్మీదేవి విగ్రహం వచ్చినది.
అక్టోబర్ 15: ఈరోజు నా తమ్ముడికి అసలు విషయం చెప్పేశాను. వాడు అది తెలుసుకుని వాడి ఇంటికి వెళ్లిపోయాడు.వెళ్ళుతూ 250/- ఇచ్చినాడు.ఇవే రాబోవు రోజులలో నాకు ఉపయోగపడాలి. నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే.
P7:
అక్టోబర్ 20: ఈరోజు నా దగ్గర ఉన్న 250/- కూడా అన్నయ్య దగ్గరికి వెళుతుంటే బస్సు లో దొంగతనం చేసినారు. వాడు దొంగతనం చేస్తున్నాడు అని తెలిసినా కూడా అరవలేకపోయాను. ఎందుకో తెలియదు. అన్నయ్య దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుదామని అడిగే లోపల వాడి టీవీలో త్యాగయ్య సినిమా వస్తోంది. అందులో ఈ రోజు ఎలాంటి బిక్ష కూడా దొరకలేదని తులసి తీర్థమే రామయ్య తండ్రికి మహా నైవేద్యం గా పెడదామని భార్యతో త్యాగయ్య అంటుంటే నా మనసు విలవిలలాడింది. అన్నయ్య ని డబ్బులు అడగాలని అనిపించలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు అడిగితే లక్షలు ఇస్తారు. మరి వాళ్ళకి ఎలా తిరిగి ఇవ్వాలి అనే సందేహం వచ్చింది. వెనుతిరిగి బస్టాండ్ కి వచ్చాను. ఇంతలో నా స్నేహితుని తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఏదో వాడి జాతక సమస్యను అడిగినాడు. వాడి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని జాతక పరిష్కారం చెప్పినాను. కారణం బస్సు టికెట్ కొనటానికి కూడా డబ్బులు లేవు. అప్పటిదాకా ఎన్నో వందల మందికి ఉచితంగా చిల్లిగవ్వ కూడా ఆశించకుండా ఉచితంగా జాతక పరిష్కారాలు చెప్పిన వాడిని, ఆరోజు నా జీవిత బండి నడవటానికి డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపుగా ఆ రోజు రాత్రంతా నాలో నేను మౌనంగా ఏడ్వడం చేశాను. కారణం సమస్యలతో వచ్చేవారికి డబ్బులు అడిగి వారిని సమస్యలకు గురి చేయాలా లేదా నా బ్రతుకు చూసుకోవాలా ఏమో కాలమే చెప్పాలి.
అక్టోబర్ 25: ఈరోజు వరుసగా ఐదు రోజుల నుంచి మంచి నీళ్ళతో కడుపునింపుకునే సరికి విపరీతంగా వాంతులు అయినాయి. మా ఆవిడని కొన్ని రోజులపాటు పుట్టింటికి పంపించి వేశాను. పాపము కొన్ని రోజులైనా దానికి ఆహారం దొరుకుతుంది కదా.
P8:
అక్టోబర్ 30: నా వలన నా భార్య కూడా పస్తులు ఉండకూడదు. ఏమి జరిగితే అది జరుగుతుంది. అన్ని మానవ ప్రయత్నాలు చేసినాను. ఉద్యోగ, వ్యాపారాలు చేసినాను. నాకు ఏమీ కలిసి రాలేదు. ఇకనుంచి నా దైవవాక్కుతో డబ్బులు సంపాదించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను.ధన మాయ ఇబ్బందులు భరించలేము. ధనము ఎక్కువైనా సమస్యలే. ధనము తక్కువైన సమస్యలే.
నవంబర్ 10: మా గురు దేవుడికి ఈ విషయం చెబితే “అయితే నీకు నేను సహాయం గా ఉంటాను. జాతక సమస్యలకు వాళ్లకి నీవే నీ వాక్ శుద్ధితో పరిష్కార మార్గాలు చెప్పు. వాటికి తగ్గ పరిహారాలు, హోమాలు ,గ్రహ దానాలు నేను చేస్తాను. కానీ ధనము ఎక్కువ ఆశించకు. ధన మాయలో పడకు. ధ్యానమును విడవకు” అని చెప్పినారు.
డిసెంబర్ 10: ఈ రోజు నేను డబ్బులు తీసుకొని (1116/-) జాతక చక్రం గీసి జాతకాలు చెప్పే జ్యోతిష్యుడు అవతారం ఎత్తాను. ఈరోజు నాకు ధ్యానములో లీలామాత్రంగా లక్ష్మీనారాయణ విగ్రహమూర్తి కనిపించింది.
డిసెంబరు 15: ఈ రోజు అనంత పద్మనాభ స్వామి విగ్రహమూర్తిని అనుకోకుండ కొనవలసి వచ్చింది. అది బాగా నచ్చి కొన్నాను.అనంతుడిగా నేను కూడా ధనవంతుడిని అవుతానని ఆనాడు అనుకోలేదు.
P9:
జనవరి 10: ఈరోజు నా పాత బాకీ బ్యాంకుల EMIలు కట్టినాను. నాకు నా ఇల్లు నిలబడుతుంది అనే ధైర్యం కలిగినది.
జనవరి 15: మా ఆవిడని ఇంటికి రమ్మన్నాను. రోజుకి రెండు వేల నుండి పదివేల దాకా నా సంపాదన స్థితి మారినది.
ఫిబ్రవరి 20: నాకు ఇంటి యొక్క బాకీ పూర్తిగా తీర్చడంతో ఇంటి కాగితాలు నాకు వచ్చినాయి. నేను సొంత ఇంటి దారుడిని అయినాను.
మార్చి 8: ఈరోజు మా పెళ్ళి రోజు. ఘనంగా ఆనందంగా చేసుకున్నాను. ఈరోజు ధ్యానము డుమ్మా. ఎందుకో తెలుసు కదా.
మార్చి 10: ఈరోజు దత్త దర్శనం సినిమా చూశాను. అందులో మహాలక్ష్మి నెత్తిన ఎక్కితే వచ్చే అనర్దాలు ఏమిటో దత్త స్వామి తన శిష్యుడైన ఇంద్రుడికి చెప్పే దృశ్యం నాకు నచ్చినది.
మార్చి 20: ధనమునకు లోటు లేదు. ధ్యానమునకు అడ్డులేదు. ఇవి రెండూ కూడా బాగానే సాగుతున్నాయి.
మార్చి 22: రానురాను జాతకాల సంపాదన మీద మోహ వ్యామోహాలు తగ్గుతున్నాయని నాకు ధ్యానములో అనిపించినది.
మార్చి 30: గత వారం రోజుల నుండి నాకు ధ్యానంలో నాకు ఇష్టమైన పదార్ధాల వాసన వస్తోంది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేవు. ఎవరు కూడా వండటం లేదు.
P10:
జులై 20: ఈ రోజు నాకు ధ్యానములో వేణువు నాదము లీలగా విన పడసాగింది.
జూలై 25: ఈ రోజు వేణునాదము బాగా స్పష్టంగా లీలగా వినబడింది. ఈరోజు వేణువు ఉన్న శ్రీకృష్ణుడి ఫోటో వచ్చింది. ఇది ఎందుకో తెలియ రాలేదు.
ఆగస్టు 1: ఈ రోజు వేణు నాద శబ్దము కాస్తా 'వం' అనే బీజాక్షర శబ్ద నాదము లాగా వినబడుతుంది అని గ్రహించాను.
ఆగస్టు 10: ఈ రోజు నాకు ధ్యానములో ఆరు దళాలు కలిగిన కాషాయం రంగు పద్మము కనబడినది.
ఆగస్టు 12: ఈ రోజు ధ్యానములో ఆరు దళాల పద్మం 'వం' అనే మధ్య బీజాక్షరము గా కనపడి అదృశ్యము అయినది. లీలా మాత్రంగా లక్ష్మి నారాయణ మూర్తి సజీవ స్వరూపముగా లీలగా కనబడింది.
ఏప్రిల్ 5: ఈ రోజు నుంచి డబ్బులు బాగా తీసుకొని జాతకాలు చెప్పటం ఆపివేయాలి. ఎందుకంటే వందల నుండి లక్షలు దాక నా సంపాదన వెళ్ళినది. ఒకవేళ కోట్లకి వెళితే నా పరిస్థితి ఏమిటి. నావల్ల కాదు.
ఏప్రిల్ 15: ఈ రోజు ఒకడికి జాతక పరిష్కారం చేస్తే 1 లక్ష ఇస్తాను అన్నాడు. నాకు ధనాశ పోయినది .వెయ్యి రూపాయలు తీసుకొని వాడికి పరిష్కారం చెప్పాను.
P11:
ఆగస్టు 18: ఈ రోజు ఒకడు 28 లక్షలు ఇస్తానని ఆశ చూపించాడు.ధనాశ లేదు. వాడికి జాతక పరిష్కారం చెప్పాలనిపించలేదు. చెప్పలేదు.
ఆగస్టు 30: ఈ రోజు ఒకడు ఎన్నారై వచ్చి కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చాడు. నాకు నవ్వు వచ్చింది. నాకు కావలసిన డబ్బులు ఇప్పటికే నా దగ్గరికి చేరినాయి. నాకు ఇంకా డబ్బులతో పనిలేదు. విచిత్రం ఏమిటంటే నేను జాతకాలు చెప్పడం ఆపి వేసుకుంటే డబ్బులు విలువ వేల నుండి కోట్లలోకి పెరగటం ఆరంభమైనదని నాకర్థమైంది. దీనిని గూర్చి నా గురుదేవుడుని అడగాలి.
మే 10: ఈరోజు మా గురుదేవుడిని అడిగితే దానికి ఆయన చిరునవ్వు నవ్వి “నాయనా! నీకు ధనము కావాలా సాధన కావాలో తేల్చుకో. ఎప్పుడైతే పది రూపాయలు నీవు ఆశించినావో ఆ క్షణమే ధనలక్ష్మి నీకు 10 కోట్లు సిద్ధం చేసింది. నీకు ఆ డబ్బులు కావాలా సాధన కావాలో తేల్చుకో” అనగానే స్వామి నా జీవితము నడపటానికి నెలకి పదివేలు వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేసుకున్నాను. ఇంకా ధనకాంక్ష వద్దు. నాకు సాధన కావాలి. నాకు ధన అత్యాశ లేదు. నన్ను ఏమి చెయ్యమంటారు” అని అడిగినప్పుడు ఆయన వెంటనే “అయితే నీవు ఖేచరి ముద్రను సాధన చేయమని” చెప్పి అది ఎలా చేయాలో నా చేత చేయించారు.
P12:
జూన్ 10: ఈరోజు ఖేచరి ముద్ర చేయటం కుదరలేదు. నాలుక వెనక్కి మడచి కొండ నాలుక అందుకోవటం ఈరోజు కష్టంగా అనిపించింది.
జూన్ 30: ఈ ముద్ర సమస్య గూర్చి మా గురుదేవునిని అడిగితే దానికి అయితే “ధ్యానములో ఆరు నెలల పాటు ఏదైనా పదార్థం వాసనను అనుభవిస్తున్నట్లు ధ్యానము చేసుకొమ్మని” చెప్పినారు.
జూలై 15: ధ్యానములో పదార్ధాల వాసన చేస్తున్నట్లుగా ధ్యానం చేస్తున్నాను. నెమ్మదిగా ఖేచరి ముద్రను నా నాలుక వేయటం ఆరంభమైనది.
జూలై 18: ఈరోజు నా ప్రమేయం లేకుండానే ఖేచరి ముద్రను నా నాలుక వేసినది.
P13:
ఆగస్టు 15: ఈరోజు నేను అనుకోకుండా సముద్ర స్నానం చేశాను. విచిత్రంగా ఈత లేకుండానే నీటిలో తేలుతున్న అనుభూతి కలగ సాగింది. అలాగే ఒడ్డుకు వస్తే కాలు మీద పీత పాకినది.అది నన్ను కరవకుండా నన్ను వదిలి పోయినది. విచిత్రంగా ఉంది. అదే పీత మా మిత్రుడుని బాగా కరిచింది. నన్ను కరవలేదు. కారణం తెలియటం లేదు. గురుదేవుడిని అడగాలి.
ఆగస్టు 18: మా గురు దేవుని అడిగితే “నాయనా! నీ స్వాధిష్టాన చక్రం శుద్ధి అయినది. జలము మీద ఆధిపత్యం అయినది. దాని వలన నీకు జలములో జీవించే జంతువుల వలన హాని ఉండదు. అలాగే నీటిమీద తేలియాడే శక్తి వస్తుంది. అలాగే ఆకలి, దప్పిక లేని,దుఃఖము రాని అనూర్మిత సిద్ధి కలిగినది. అరిషడ్వర్గాలు నీ ఆధీనమవుతాయని” చెప్పటం జరిగినది.
ఆగస్టు 20: ఈ రోజు నేను ధ్యానం చేస్తుండగా నాకు నిజంగానే జల సిద్ధి వచ్చినదా?పరీక్షలు చేసుకోవాలని ఆలోచనలతో చక్ర ధ్యానము నడిచినది.
ఆగస్టు 25: ఈరోజు కృష్ణా నది దగ్గర కి వెళ్ళినాను. చక్ర ధ్యానమును నదిలో కూర్చొని చేశాను. ఆశ్చర్యంగా నీటిలో మునిగి పోకుండా నీటిమీద తేలుతున్న అనుభవ అనుభూతి కలగ సాగింది. కళ్ళు తెరిచి చూస్తే నీటి మధ్యలో బురదలో ఉండవలసిన వాడిని నీటిమీద తేలుతున్నానే అని అనిపించింది.
P14:
ఆగస్టు 30: ఈ రోజు దైవ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. విచిత్రంగా నాకు విపరీతంగా నీళ్ల విరేచనాలు వచ్చినాయి. మందులు వేసుకున్నా తగ్గటం లేదు. విచిత్రంగా ఉన్నది.
సెప్టెంబరు 1:ఈ రోజు విచిత్రంగా అలవాటు లేని మత్తు పానీయాలు త్రాగాలని విపరీతంగా నా మనస్సు కోరుకుంటుంది.
సెప్టెంబరు 10: ఈ రోజు దుర్గాష్టమి.ఈ రోజు దుర్గాదేవి పూజ చేశాను. ఈరోజు విచిత్రంగా మా కుటుంబ బంధుమిత్రులు నా పక్క గదిలో విస్కీలు బీరులతో పండగ చేసుకుంటున్నారు. నాకు త్రాగటం అలవాటు లేదు. కూల్ డ్రింక్ తాగుతున్నాను.
సెప్టెంబరు 15: త్రాగుబోతు అవుతానేమో అని భయంతో నాకు ఈ రోజు ధ్యాన భంగం అయినది.
సెప్టెంబరు 18: ఈ రోజు మత్తు పదార్థాలు సేవించాలని తలంపులు బాగా రావడంతో ఈ రోజు ధ్యానము దొబ్బింది. ఈరోజు నాకు ఫ్రీగా మూత్రం రావటం లేదు. ఏదో అనారోగ్య సమస్యలాగా చుక్కలుగా వస్తుంది.
సెప్టెంబరు 22: ఈ రోజు నాకు అందరూ కూడా ఎక్కడ చూసిన తాగుబోతులు కనబడుతున్నారు. ఒకవేళ నేను నిజంగానే తాగుబోతు అవుతానా?
సెప్టెంబరు 25: ఈరోజు మత్తు పదార్థాలు సేవించే వారు నాకు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. నాకు భయం వేసింది .కానీ ఒకసారి తీసుకుంటే ఏమి అవుతుంది అని అనిపించింది.
P15:
సెప్టెంబరు 27: ఈరోజు ఎలాగైనా మందు పానీయాలు లేదా మత్తు పదార్థాలు తీసుకోవాలి అని నాకు బలంగా అనిపిస్తుంది. దానితో ధ్యానము చేయలేకపోతున్నాను.
అక్టోబరు 5: ఈరోజు మాతాత త్రాగే చుట్టను త్రాగాలని బలంగా అనిపించింది. ధ్యానం మీద ధ్యాస లేదు.
అక్టోబరు 8: ఈరోజు మా నాన్న త్రాగే సిగరెట్లు ఎలాగైనా దొంగతనం చేసైన త్రాగాలని బలంగా అనిపించింది. ధ్యానమే సిగరెట్లుగా ఈరోజు అయినది.
అక్టోబర్ 10: ఈ రోజు ఎందుకో అన్నిటియందు అన్నిటిమీద కోపంగా, విరక్తిగా ఉంది. కారణం సిగరెట్లు, మత్తు పదార్థాలు, మందు పానీయాలు త్రాగటం లేదనే బాధ అయ్యి ఉండాలి.ధ్యానము దొబ్బింది.
అక్టోబరు 12: ఈ రోజు ఎందుకో అన్నిటి యందు విరక్తి కలుగుతోంది. ధ్యానము చేయలేకపోతున్నాను.
అక్టోబర్ 13: శివుడే ఙ్ఞానవల్లి పేరుతో గంజాయితో ఎంజాయ్ చేస్తున్నాడు కదా. మరి నేను ఎందుకు త్రాగటం లేదు అనే బాధ విపరీత ఆలోచనల వలన నా ధ్యానము అంతగా చేయలేకపోతున్నాను.
అక్టోబరు 18: ఈరోజు నాకున్న సమస్యలతో పాటుగా జూదం ఆడాలనే విపరీతమైన ధోరణి మొదలైంది. నా ధ్యానం అంతగా సాగటం లేదు.
అక్టోబరు 20: ఈరోజు కంప్యూటర్ లో పేకాట ఆట ఆడినాను.అయినా తృప్తిగా అనిపించడం లేదు. ఎలాగైనా జూదం ఆడాలని విపరీతంగా అనిపిస్తుంది.
P16:
అక్టోబరు 22: ఈ రోజు విచిత్రంగా ఇతరులు కష్టాలు పడుతుంటే నాలో తెలియని వికృత ఆనందం కలుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో?
అక్టోబరు 25: ఈ రోజు నా వలన జీవహింస జరిగినది. బాధ కి బదులుగా ఆనందము వేస్తోంది. పావురాలు పట్టే వాడు పడుతున్న నేను కళ్ళార చూస్తూ అలా ఉండిపోయాను.అవి వాడికి దొరికి విలవిలలాడుతుంటే బాధ పడవలసిన చోట నాలో ఆనందం కలుగుతుంది.అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది. నేను నా గురుదేవుడిని అడగాలి.
అక్టోబర్ 28: మా గురుదేవులుని అడిగితే “నాయనా! నువ్వు ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం జల సిద్ధి వచ్చినదో లేదో పరీక్షించినావో ఆనాటి నుండి ఈ చక్రం నెమ్మదినెమ్మదిగా బలహీన పడుతూ వస్తోంది.అది ఎప్పుడైతే బలహీనమైనదో ఆనాటినుండి నీకు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, సైకో తరహా లక్షణాలు నీలో ఏర్పడినాయి. ఇంకా బలహీనపడి ఉంటే నయం కాని వ్యాధులు, మూత్ర వ్యాధులు,మర్మాంగ వ్యాధులు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి శలభాసనం, మార్జాలాసనం, మకరాసనం, భుజంగాసనం ఆసనాలు వేస్తూ ఆరునెలలపాటు పెరుగన్నం తింటే ఈ చక్రం బలపడుతుంది” అని చెప్పటం జరిగినది.దానితో మరో ఆరు నెలల పాటు ఆయన చెప్పినట్లుగా చేసాను. అప్పుడు నాకు ధ్యానంలో ధన సంబంధ ఆలోచనలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, మత్తు పానీయాలు సేవనం ఆలోచనలు తగ్గటం ఆరంభించి నాయి. ధ్యానం మీద తిరిగి ధ్యాస పెరిగినది.
P17:
జనవరి 10: ఈ రోజు నాకు హిమాలయాలలో దొరికే విష్ణు సాలగ్రామం దొరికినది. దానిని పూజలో ఉంచాను.
జనవరి 30: ఈ రోజు నాకు కాశీక్షేత్రము నుండి లక్ష్మి గవ్వలు వచ్చినాయి. వీటితో గవ్వల ప్రశ్నలు వేయటం ఆరంభించాను.
ఫిబ్రవరి 18: ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రములో నుండి లక్ష్మీ శంఖం వచ్చినది. పూజలో ఉంచినాను.
మార్చి 2:ఈ రోజు నా ఇంటికి వెంకన్న స్వామి సహిత మహాలక్ష్మి విగ్రహ మూర్తి వచ్చినది.నవరాత్రి పూజలో,శ్రావణ మాస పూజలో,దీపావళి పూజలో లక్ష్మిపూజ చెయ్యడం ఆనవాయితీగా అయినది.
నవంబరు 10:ఈ రోజు లక్ష్మి దీపావళి.లక్ష్మి పూజ అయినది.విచిత్రంగా నాకు ధ్యానములో వైకుంఠములో ఉన్న లక్ష్మి నారాయణ మూర్తి సజీవ మూర్తిగా నన్ను ఆశీర్వదించినట్లుగా లీలగా అనిపించినది. ఆపై శూన్యములో అదృశ్యమైనారు. అంటే లక్ష్మి నారాయణలు గూడ శాశ్వతము గాదని నాకు అర్ధమైనది.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
******************
నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు
మేమిద్దరము స్వాధిష్ఠాన చక్రము మీద దృష్టి పెట్టి దాన్ని జాగృతి చేసుకోవాలని ధ్యానం చేస్తున్న కూడా తిరిగి మహాగణపతి స్వరూపం ధ్యానమునందు తరచుగా ఇలా 41 రోజుల పాటు కనపడసాగింది.మా ఇద్దరికి కారణమేమిటో తెలియరాలేదు.అంటే మూలాధార చక్ర సాధన ఇంకా పూర్తి కాలేదా అనే సందేహంలో సతమతమవుతుండగా ఒక రోజు ధ్యానంలో ఒక తెల్లని దివ్య మణి కనిపించసాగినది.ఇది ఏమిటి క్రొత్తగా?ఈ మణిని ఎక్కడ ఎప్పుడు గూడ చూడలేదు అనుకుంటూ మా ధ్యానాలు వాడేమో శ్రీశైలంలో నేనేమో మా ఇంటిలో ధ్యానాలు చేస్తుంటే ఇలా మణి దర్శనాలు రావడము ఆరంభమైనది.దీని సంకేతము ఏమిటో మాకు అర్ధము కాలేదు.కొన్ని రోజుల తర్వాత ఈ మణి లోపల మాకు కనిపించే మహా గణపతి ఉన్నట్లుగా అగుపించడము ఆరంభమైనది.వామ్మో!ఇది ఏమిటి?మణి మరియు గణపతి కలిస్తే వచ్చేది గణపతిమణి అంటే మనకి గణపతిమణి గూర్చి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా?అసలు ఇంతవరకు శమంతక మణి,నాగ మణి,కౌస్తుభ మణి,రుద్ర మణి ఇలా వీటి గూర్చి పుస్తకాలలో చదివినట్లుగా గుర్తు. కాని ఎక్కడ గూడ ఈ గణపతిమణి గూర్చి చదివినట్లుగా లేదు అనుకుంటూ ధ్యానము చెయ్యడం ఈ గణపతిమణి రూపము కనపడటంతో దాని వెలుగులకి మా కళ్ళు మూసి ఉన్న గూడ తట్టుకోలేకపోవడముతో ధ్యాన భంగమై కళ్ళు తెరవడము ఈ మధ్య చాలా తరచుగా జరుగుతున్నది.ఇది ఇలా ఉండగా ఒక రోజు నా దగ్గరికి కాశీఖండము పుస్తకము నా దగ్గరికి వచ్చింది. దాని మొదటి పేజీ తీయగానే దానిపైన మహా చింతామణి గణపతి అని ఉంది. దాని ఫోటో కూడా ఉంది.దానిని చూడగానే నాకు వెంటనే స్ఫురణ వచ్చి అంటే ఇన్నాళ్లు మనకి ధ్యానములో కనిపించేది గణపతి మణి కాదని చింతామణి గణపతి అన్నమాట. ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల చింతలు తొలగిస్తాడు.అందుకే ఈ మణికి చింతామణి అనే పేరు వచ్చినట్లుగా మహాశివుడుకి ఉన్న అన్ని రకాల చింతలు డుండి గణపతి తీర్చటం వలన ఆయనకి చింతామణి గణపతిగా స్వయంగా మహా శివుడే నామకరణం చేసినట్లుగా ఈ పుస్తకములో చదవడము జరిగినది.అంటే మూలాధార చక్ర సాధన పరిసమాప్తి అయింది అనటానికి సూచనగా చింతామణి గణపతి వస్తాడని మాకు అర్థమయింది. కానీ ఎలా?ఈ కాలంలో అది ఎక్కడ ఉంది? అది మాకు ఎలా వస్తుంది? అది తీసుకుంటే మాయలో పడతామా లేదా మాయ దాటుతామా? ఏమీ అర్ధం కాని స్థితి అన్నమాట.అక్కడ ఇదే పరిస్థితిలో శ్రీశైలంలో మా జిజ్ఞాసి కూడా ఉన్నాడు. వాడికి అది చింతామణి గణపతి అని తెలిసినది.
వాడికి దాని మీద ఏదో తెలియని ఆసక్తి మొదలై దానిని ఎక్కడ ఉన్న ఎలాగైనా సంపాదించాలనే ఆశ పుట్టింది.ఆశ మాయ అంటే ఇదే కాబోలు. ఆశ, భయము, ధన, కాంత, స్పందన మహామాయలు వస్తాయని యోగులు తమ అనుభవాల ద్వారా లోకానికి తెలియ చేసినారు. ఇందులో మనవాడు అలాగే నేనుగూడ మాకు తెలియకుండా చింతామణి చూడాలని ఆశ నాకు ఉంటే దానిని ఎలాగైనా పొందాలని ఆశ వాడికి కలిగినది. మేము ఆశ మాయలో కూడా ఉన్నామని గ్రహించలేని స్థితి అన్నమాట.ఇలా కొన్ని రోజుల తర్వాత మా వాడికి ధ్యానంలో చింతామణి ఎక్కడ ఉందో ఏ రూపంలో ఉందో కనపడ సాగింది. వెంటనే వాడు తనకి ధ్యానములో కనిపించిన చోటుకి వెళితే అక్కడ నల్లటి, తెల్లని,జేగురు శిల ముక్క కనపడినది.దానిని చూస్తుంటే కూర్చుని ఉన్న గణపతి ఆకారంగా ఉంది కానీ అది మణి లాగా మెరవడం లేదని మణికాంతులు లేవని నాకు టెలిపతి ద్వారా తెలియజేసినాడు.నాకు దాంతో ఎలాగైనా దానిని ఒకసారైనా చూడాలని ఆశ కలిగినది.కానీ ఆ అవకాశమే లేదు. మేమిద్దరం కూడా మా సాధన పరిసమాప్తి అయ్యేదాకా ఒకరినొకరు ప్రత్యక్షంగా ఎదురు పడకూడదని అనుకున్నాము కదా. కానీ లే ఏమి చేద్దాం అనుకున్నాను.వాడికి దొరికిన శిలను వాడు పరీక్షలు చెయ్యటం మొదలు పెట్టినాడు. “నాకు ఆకలి వేస్తుంది నీవు నిజముగా చింతామణివి అయితే ఈ చింతను తొలగించు” అనగానే ఎవరో భక్తుడు ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చి వెళ్లినాడట. అయితే ఇప్పుడు “నాకు విపరీతమైన దాహం వేస్తోంది దాని చింత తీర్చు” అనుకోగానే “స్వామి! నా దగ్గర మంచినీళ్లు డబ్బాలు మూడు దాకా ఉన్నాయి. అవి నాకు అవసరం లేదు. బరువు తగ్గుతుంది కదా.ఈ బాటిల్స్ తీసుకోండి” అంటూ ఒక యువకుడు వచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చాడట. ఈసారి ఇలా కాదనుకొని దుఃఖ చింత లేకుండా చెయ్యి చూద్ధాం అనుకున్నాడట. కొన్ని నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్లు ఒక సాధువు తన దగ్గరికి వచ్చి “స్వామి! మీరు కూడా సన్యాస దీక్ష లో ఉన్నారా? మంచిది. ఇంత చిన్నవయసులోనే దీక్ష తీసుకున్నారా? మంచిది. ఆశ మోహాలు చేదించి పరమాత్మ వైపు నడవాలని అనుకుంటున్నారు. మీలాంటి వారికి మాలాంటి వారికి చింతలు తప్పడం లేదు. ఆకలి దప్పికలు బాధలు ఉండనే ఉంటాయి. కానీ దుఃఖ బాధ కూడా ఉంటుంది. ఏమీ లేదు స్వామి! కొన్ని సంవత్సరాల నుండి నేను ఒకరితో కలిసి సాధన చేస్తున్నాను. రాత్రి వాడికి ఉన్నట్టుండి విపరీతమైన ఆయాసం వచ్చి గుండెనొప్పి అంటూ గుండె పట్టుకొని చనిపోయాడు. వాడిని అలా చాలా దగ్గరగా చూసిన వాడిని, వాడి చావును కూడా చూసే సరికి ఆపుకోలేని దుఃఖం వస్తుంది. అన్నీ వదిలేసిన మనకి దుఃఖం దేనికి స్వామి. దానిని కూడా వదిలేయాలి. స్వామి! వదిలేయాలి అంటూ వీర్రావేశముతో అతనికి చెప్పి దుఃఖమును జయించాలి జయించాలి దానికి చింత తొలగించుకోవాలి” అంటూ వెళ్ళిపోయాడట. మన వాడికి నోట మాట రాలేదట. వామ్మో! దీనిని ఏమి అడిగితే అది తీరుస్తుందని మనకున్న చింతలు తొలగిస్తుందని గ్రహించి దానికి నమస్కారాలు చేస్తూ “చింతామణి గణపతి! నన్ను క్షమించు. నీవు నా దగ్గరికి వచ్చి గంట కూడా కాలేదు. అంతలోనే నా మనస్సుకి ఎన్నో కోరిక చింతలు కల్గించావు. వాటిని తీర్చావు. అదే నీవు నా దగ్గర ఉంటే నా బ్రతుకు లేని పోని కోరికలతో గడిచిపోతుంది. నన్ను క్షమించు.నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను కోరిక లేని వాడిలాగా మారాలని అనుకుంటున్నాను. నువ్వేమో కోరికలు తీర్చే వాడి లాగా ఉన్నావు. కోరిక లేని వాడికి కోరిక ఇచ్చే వాడితో ఏ పని ఉంటుంది. నువ్వు అవునా కాదా అని పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు ఎక్కడ దర్శనమిచ్చినావో నిన్ను అక్కడే ఉంచుతాను అని దానిని తీసుకొని ఏ మాత్రం ఆలోచించకుండా యధాస్థానంలో పెడుతుండగా ఆ రాతి నుండి కొన్ని రకాలైన మెరుపు కాంతులు రావటం గమనించాడట. దానిని దొరికిన చోట పెట్టి వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడని నాకు వివరాలు తెలియ చేసినాడు.
కనీసం వాడైనా ఈమణిని చూశాడు గదా అనుకుంటూ బాధతో ధ్యానంలో కూర్చోగానే ఏదో గుడి… దాని ఆవరణము 2 వెంకన్న శిలా మూర్తులు కనపడసాగాయి. ఇది ఎక్కడ ఉంది? ఇది ఏమి గుడి? ఇది ఎందుకు కనబడుతుందో అనుకొని ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగినది.ఇదే దృశ్యము కొన్ని రోజులపాటు నన్ను ధ్యానములో వెంటాడింది. అప్పుడు ఈ గుడి గూర్చి విచారించగా చిన్నతిరుపతి( ద్వారక తిరుమల) వెంకన్న స్వామి అని తెలిసినది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళమని చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు.కానీ విచిత్రంగా మా కుటుంబ సభ్యులు అంతా కలిసి దానిని అలాగే దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గుడులు కూడా చూడాలని అనుకుని ప్రయాణం కట్టారు. మేము బస్సెక్కాము.బస్సు ద్వారకా తిరుమల చేరుకుని దిగి దిగగానే పుస్తకాలు అమ్ముకొనే కుర్రాడు నా దగ్గరికి వచ్చి “అన్నా!అన్నా! ప్రొద్దుట నుండి ఒక పుస్తకం కూడా అమ్ముడుపోలేదు. కనీసం నువ్వైనా ఈ పుస్తకమును కొను” అంటూ వాడే ఒక పుస్తకం తీసి నా చేతిలో పెట్టాడు.వీడు ఏమిటి? నాకు కావలసిన పుస్తకాలు కొననియ్యకుండా వాడికి కావలసిన పుస్తకం అమ్ముతున్నాడు అనుకుని చూస్తే అది ఆ క్షేత్రమునకు సంబంధించిన పుస్తకము కావటంతో మారు మాట్లాడకుండా కొనటం జరిగినది. అందులో చూస్తే కపిలమహర్షి భక్తికి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వడం అది కూడా పాదాలు భూమిలోనే ఉండిపోవటంతో పాద మూర్తి కోసం మరొక వెంకన్న విగ్రహమూర్తి ఉంచినారని ఈ మహర్షి దగ్గర చింతామణి ఉండేదని దానిని ఆయన పాదాల క్రింద ఉంచడం జరిగిందని అందుకే మొదటి విగ్రహ మూర్తికి పాదాలు కనిపించకుండా ఏర్పాట్లు చేశారని రాత్రిపూట గుడి తలుపులు మూసివేసిన తర్వాత లైట్లు ఆరి పోయిన తర్వాత సుమారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత గాలి గోపురం శిఖరం నుండి కాంతులు ఈ మణి నుండి బయటకు వస్తాయని చదవగానే ఓహో! ఈ విధంగా మహాగణపతి తన చింతామణి మహత్యమును చూపబోతున్నాడా అనుకొని ఇక్కడ ఏమి కోరుకుంటారో వారి చింతలు బాధలు తొలగుతాయని కొస మెరుపుగా వ్రాయటం జరిగింది. ఇక్కడ కోరడానికి ఏముంది మోక్షప్రాప్తి తప్ప అనుకుని కాటేజికి చేరుకోవడము ఆయన దర్శనం చేసుకోవటం అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడటం జరిగింది.రెండు రోజుల వరకు నాకు ఏమీ కనిపించలేదు. పైగా గుడి లైట్లు వేసి ఉన్నాయి. కానీ వాటిని ఆపండి అని చెప్పలేము కదా అనుకుంటూ నిరాశగా ఎదురుచూశాను.
మరో రోజు అనుకోకుండా గుడి పరిసరాలు అంతా కరెంట్ పోవటం ,వాళ్లు జనరేటర్ కోసం వెళ్ళటం మిగిలిన ఈ కొద్ది సమయంలో చిమ్మ చీకటిలో గాలి గోపురం కలశం వైపు నేను అనుకోకుండా చూడటం… అతి సన్నని చిన్నకిరణము దాని మీద నుండి పైకి ఒకటి అడుగు మేర ప్రసరిస్తుందని తెలియగానే నాకే ఆశ్చర్యమేసి ఒకటికి మూడు సార్లు కళ్ళు నులుపుకొని తీక్షణంగా చూసే సరికి సరిగ్గా ఖచ్చితంగానే కనపడింది. కాకపోతే గుడి చుట్టూ బల్బుల వెలుగు వలన ఈ అతి సన్నని కాంతి పుంజము కనబడటం లేదని గ్రహించేసరికి అకస్మాత్తుగా మళ్లీ కరెంటు రావటము అది మళ్లీ బల్బుల వెలుగుల కాంతులలో ఈ మణి కాంతి కలసిపోవడముతో ఈ విధంగానైనా చింతామణి చూపినందుకు మహాగణపతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యాత్రను ముగించుకొని ఇంటికి వచ్చి యధావిధిగా ధ్యాన ప్రక్రియ సాధనలో మునిగిపోయాను. నాకు కలిగిన ఈ చింతామణి అనుభవము టెలిపతి ద్వారా మన జిఙ్ఞాసికి చెప్పడం జరిగినది. అలాగే అమెరికా డాలర్ నోటు వచ్చినట్లు అనగా చింతామణి శిల బొమ్మ దాని వెనుక ఉందని చెప్పటం జరిగినది.
స్వాధిష్టాన చక్రం జాగృతి:
ఇక నా ధ్యానం అంతా తిరిగి స్వాధిష్ఠాన చక్రము మీద పెట్టేసరికి లక్ష్మీనారాయణుడు కనిపించాడు. అది కూడా నీడలాంటి లీలారూపముతో కనిపించి కనిపించనట్లుగా కనిపించాడు.ఇలా కొన్ని రోజుల తర్వాత నాకున్న నా ఉద్యోగం పోయినది. చేస్తున్న ఉద్యోగం పోయేసరికి మనస్సు వికలమైంది. మరోచోట ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు రావటం లేదు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మాని వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగినది. ఇంతలో మా శ్రీమతి కూడా అప్పటి దాకా తను చేస్తున్న ఉద్యోగంలో మార్పులు వచ్చాయి. కొన్నాళ్లపాటు అన్ని భరించి చేసినది కానీ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి. నా ఉద్యోగం పోయిన మూడు సంవత్సరముల దాక చేస్తుండేది. కానీ అనుకోకుండా ఆమెకి కూడా ఉద్యోగ సమస్యలు వచ్చే సరికి తను కూడాఉద్యోగము వదిలే స్థితికి చేరుకుంది. అసలే స్వాధిష్టాన చక్రం సాధన చేస్తున్న సమయంలో మనని ఆర్థికంగా దెబ్బ తీసే విధంగా మా రెండు ఉద్యోగాలు పోయాయి. అప్పటిదాకా ఉద్యోగ ప్రయత్నాలులో ఉన్న నాకు తను పూర్తిగా మానివేసి తను పూర్తిగా సాధన కోసమే సమయం కేటాయిస్తానని ఖరాఖండిగాచెప్పేసింది. తనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని తను ఉద్యోగం సమయంలో తనకు వచ్చిన నాకు వచ్చిన జీతం కలిపి ప్లాట్ తీసుకోవటం జరిగినది.సుమారుగా 5 సంవత్సరముల పాటు EMI కట్టడం జరిగింది.అనుకోని అవాంతరాల వలన మా ఉద్యోగాలు పోవటంతో EMI కట్టలేని పరిస్థితి రావటం ఏకకాలంలో జరిగినాయి.ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత వివరంగా చెప్పటం జరుగుతుంది.అనగా స్వాధిష్ఠాన చక్రము రీత్యా ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడం అన్నమాట. విచిత్రం ఏమిటంటే ఆమె ఉద్యోగంను తీసినది గూడ నారాయణమూర్తి అనే వ్యక్తి అయితే నా ఉద్యోగంను తీసినది గూడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కావడం విశేషం.నా ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా విరమించి నానా రకాల వ్యాపార ప్రయత్నాలు చేసినా కూడా అవి కూడా కలిసి రాక పోవడం అది కూడా మానుకొని ధనమునకు ఇంత ఇబ్బందులు పడవలసినదేనా అనుకొని మంచినీళ్ళే ఆహారంగా అనుకునే స్థితికి చేరుకున్నాము.ఒకప్పుడు రాఘవేంద్రస్వామి అలాగే త్యాగయ్య కూడా అలాగే ఈ స్థితికి చేరుకున్నారని వారి ఇష్ట దైవ పూజలు ఆపలేదని మంచినీళ్ళే వారికి తీర్థప్రసాదములు ఇచ్చేవారని వారి సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది.
అప్పటికి మూడు నెలలుగా EMI బాకీలు ఉన్నాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. విసుగు చికాకులు వెంటాడుతున్నాయి. ఇంత స్థితిలో ఉన్నా కూడా ఇష్ట దైవ పూజలు అలాగే చక్ర ధ్యానం ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నాము.కాకపోతే ఎవరికీ ఏమీ అప్పులు లేవు. ఒక బ్యాంకు కి తప్ప. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నన్ను బస్టాండ్ లో బస్సు ఎక్కించడానికి మా స్నేహితుని తమ్ముడు వచ్చినాడు.గురూజీ గురూజీ అంటుంటాడు. వాడు మాటలలో “తను ఉన్న చేస్తున్న వృత్తిలో అనుకోని సమస్యలు వస్తున్నాయి వాటికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి” అన్నాడు. నేను వెంటనే యధాలాపముగా అయితే పది రూపాయిలు ఇవ్వు ప్రశ్న వేసి చెబుతాను అని అడిగి ఆ డబ్బులు తీసుకున్నాను.ఎందుకంటే బస్సు ఎక్కటానికి కూడా డబ్బులు లేవు. అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగలేని స్థితి. ఆత్మాభిమానం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకుని వాడు అడిగిన ప్రశ్నకి తగిన పరిష్కార మార్గం చూపించి బస్సు ఎక్కి వెళ్ళాను.కానీ ఈ బస్సు ప్రయాణంలో నాకు ఒక స్ఫురణ కలిగినది. అది ఏమిటంటే ఇలాంటి వారు ఎంతో మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు గదా.వారికి పరిష్కార మార్గాలు చూపించే విధానం అనగా జ్యోతిష్యవేత్తగా అవతారం ఎత్తితే మంచిదే గదా అనుకొని ఆ పది రూపాయలు పెట్టుబడి తో అంతవరకూ ఎంతో మందికి ఉచితంగా జాతకాలు చెప్పే వాడిని కాస్త నా కుటుంబ పోషణార్ధం డబ్బులు తీసుకోవడం ప్రారంభించాను.ఆనాటి నుండి నేను డబ్బుల కోసం ఇక వెనుతిరిగి చూసే అవకాశమే రాలేదు. ఏ బ్యాంకు వద్ద నేను అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకుకే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాను.అనగా F.D చేశాను.డబ్బులే డబ్బులు. ఎవరిని ముట్టుకున్న వద్దన్నా డబ్బులే డబ్బులు. పదులతో పోయి లక్షల దాకా వెళ్ళిపోయినది. ఎంత అడిగితే అంత వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళు. పూజలు చేయించుకునేవారు. వీళ్లు అనుకున్నట్టుగా ఫలితాలు పొందేవారు. మేము అంటే నేను అలాగే మా భౌతిక గురువైన విచిత్రవేదాంతి సహాయసహకారముతో కలిసి వారి కోసం హోమాలు చేస్తే వారి ఇష్టదైవాలను ఆ హోమ దేవతలుగా కనపడి అనుగ్రహించే వారు. వారి కోరికలు తీరేసరికి నాకు మించిన డబ్బులు చేరేసరికి నాలో ధన అహంకారం మొదలైంది. ధనం ఇదం జగత్ అన్నట్లుగా డబ్బులే నా జీవిత పరమావధి అనే స్థితికి వెళ్ళిపోయాను. నా చక్ర సాధన ఏదో మ్రొక్కుబడిగా జరిగితే పూజలు మాత్రం చాలా ఆర్భాటంగా జరిగేవి.దీనికి ఫలితము కొల్హాపూర్ నుండి మహాలక్ష్మి దేవి విగ్రహం వచ్చినది.
స్వాధిష్టాన చక్రం శుద్ధి:
ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను దత్త జయంతి రోజున దత్త దర్శనం సినిమా టీవీలో వస్తుంటే చూస్తున్నాను. ఇంద్రుని కోరిక మేరకు ఆయన ఒక రాక్షసుడిని చంపటానికి అనఘాదేవి శక్తిని ఉపయోగించడం ఆమె రాక్షసుడి నెత్తి ఎక్కేదాకా చాటుగా నిలబడమని ఇంద్రునికి చెప్పడము,కొద్దిసేపటి తర్వాత నెత్తికెక్కిన అనఘాదేవిని చూసి దత్తుడు ఈల వేయడం ఇంద్రుడు వచ్చి ఈ రాక్షసుణ్ణి సంహారము చేయటం జరిగినది. ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది.
ఆ తర్వాత ఆయన మహాలక్ష్మి ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో దత్తుడు స్వయంగా బోధ చేసిన దృశ్యం చూస్తుంటే స్వయంగా నాకే చేస్తున్నారేమోనని అనిపించసాగింది. మనసు వికలమైంది.దాంతో రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని ఏకధాటిగా త్రాగటం మొదలు పెట్టినాను. మందు తాగటం అలవాటు లేదు. కానీ మందుకు బదులుగా కూల్ డ్రింక్ నా దృష్టిలో అన్ని రకాల మందులతో సమానమే. బాగా తిక్క పెరిగినప్పుడు అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, విపరీతంగా తట్టుకోలేని ఆనందము వేసినప్పుడు ఈ కూల్ డ్రింక్ తాగటం నాకు అలవాటు.అప్పుడు గాని నా తిక్క తగ్గదు. ఈ విషయము మా శ్రీమతికి తెలుసు. మందు తాగే వారిని చూసాను. కూల్ డ్రింక్ మందుగా అనుకునేవారిని మిమ్మల్నే చూస్తున్నాను అని సన్నాయి నొక్కులు నొక్కటం నాకు అలవాటు అయిపోయింది.పాపము. మా తల్లి! నేను నిజముగా మందు త్రాగినా అది ఏమి అనుకోదు.నాతో కలిసి త్రాగుతుందేమోనని నా భయము. ఎందుకంటే ఎవరికి తెలుసు.ఏ చక్రము ఏ మాయ లో ఉందో! కలసి మాయలో పడదాము అన్నది అంటే స్వామిరంగా! అసలు తాగుబోతు లేని కొంప లో ఇద్దరం త్రాగుబోతులు తయారు అవుతారు. అంత అవసరమా. యద్భావం తద్భవతి అనేది ఉండనే ఉన్నది కదా. మనము ఏది త్రాగిన అది మందు అనుకుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. ఎందుకంటే ఈ స్వాధిష్ఠాన చక్రం బలహీన పడితే ధన మాయలో లేదా మందు మాయ(త్రాగుబోతు)గామారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరకే యోగ శాస్త్రాలు ద్వారా తెలుసు.
కానీ నాకున్న ధన అహంకార మాయ వలన నాకు ఈ విషయము గుర్తు లేదు. ఎప్పుడైతే దత్త దర్శనం సినిమా చూసానో అప్పుడు గుర్తుకు వచ్చాయి. అంటే మొదటిలో నేను ధనానికి విపరీతంగా ఇబ్బంది పడినానని తెలుసు గదా. అపుడే స్వాధిష్టాన చక్రం జాగృతి అయినది.ఎప్పుడైతే నాకు కావలసిన ధనప్రాప్తి కలిగినదో అప్పుడే ఈ చక్ర శుద్ధి మాయ ఆరంభమైనది. దానితో నా అవసరానికి మించి ధనము నా దగ్గర చేరుతుందని తెలుసుకొని నా జ్యోతిష్య అవతారం పరిసమాప్తి చేయాలని అనుకుంటుండగా నాకు ధ్యానములో స్వాధిష్ఠాన చక్రం బీజాక్షరమైన 'వం' అనే ఆరు దళాల పద్మము అగుపించినది.ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే నా నాలుక ఖేచరి ముద్ర వేయడం జరుగుతుంది. తద్వారా పదార్ధ రుచులు గుర్తుకు రావడం ప్రారంభమైంది.తిరుపతి లడ్డు దగ్గరనుండి మోతీ చూర్ లడ్డు దాక పదార్థ రుచులు గుర్తుకు రావటం మొదలైంది. ఎందుకంటే ఈ చక్ర గుణము రుచి చూడటము అన్నమాట. అందుకని పదార్థ రుచులు ఎప్పుడో తిన్నది గుర్తుకు వస్తున్నాయి.ఎందుకంటే ఈ పదార్ధాల రుచి మాయలో సాధకునిని పడవేయాలని ప్రయత్నాలు అన్నమాట. అంటే ధన మాయ, పదార్ధ రుచి మాయ,మందు అలవాటు మాయ ఈ చక్ర మాయలుగా నాకు అర్థం అయ్యాయి.దానితో నేను ధ్యానములో నాలికతో ఖేచరి ముద్ర అలాగే కావాలని వివిధ రకాల పదార్థాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు నాకు తెలిసిన మిత్రుడు ఒకడు హిమాలయాల నుండి దొరికే సుదర్శన చక్ర విష్ణు సాలగ్రామమును ఆ నదిలో దొరికితే తీసుకొని వచ్చాడు .దానిని ఇంట్లో పెట్టుకుని పూజ చేద్దామని అనుకుంటే దానిని భరించడం తనవల్ల కాదని దీనిని ప్రతిరోజు నిత్య నైవేద్య మహాపూజలు జరపాలని చాలా నియమ నిష్ఠ గా ఉండాలని రాత్రి అయ్యేసరికి మందు ముక్క లేనిదే నువ్వు ఉండలేవు కదా కాబట్టి మీ మిత్రుడు చాలా పూజలు చేస్తూ నిష్ఠ గానే ఉంటాడు కాబట్టి ఆయనకు ఇవ్వమని మా ఇంటికి పంపించినారట.అది నాకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా వారి ఇంట్లో ఉంటే ఏమీ అనర్ధాలు జరుగుతాయో అని భయంతో వాడు నా దగ్గరికి తీసుకొని వచ్చినాడని నాకు అర్థం అయింది. ఎప్పుడైతే నేను ఈ చక్ర మాయ గురించి తెలుసుకున్నానో దాని విజయ సంకేతంగా విష్ణు సాలగ్రామం వచ్చిందని తెలిసి దానిని పూజలో పెట్టినాను.నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. కనిపించలేదు. భయం కలగలేదు.
స్వాధిష్ఠాన చక్రం ఆధీనము:
ఇది ఇలా ఉండగా నేను పూజలు జాతకాలు చెప్పటం నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉండేసరికి ధన మాయ తన మాయా ప్రభావం చూపడము ప్రారంభమైనది. అప్పటిదాకా పూజ కి కావలసిన డబ్బులు నేను అడుగుతూ ఉండే వాడిని కదా. ఎప్పుడైతే నా స్వాధిష్ఠాన చక్రము జాగృతి,శుద్ధి పూర్తి అయ్యి ఆధీనము అయ్యే సమయానికి మహాలక్ష్మి యోగమాయ చూపడం ప్రారంభమైనది. అంటే నాకు రావలసిన 8 కోట్లు వచ్చేటట్లుగా చేస్తే10 లక్షలు దాకా డబ్బులు ఇస్తామని ఒకరు, మా ఇల్లు 5 కోట్లకు అమ్మి పెడితే 15 లక్షల దాకా ఇస్తామని మరొకరు,కబ్జా అయిన మా భూమి తిరిగి వస్తే దాని మార్కెట్ విలువలో 10% ఇస్తామని ఒకరు,I.Tలో ఇరుక్కోకుండా చేస్తే దాని పరిహారముగా డబ్బులు ఇస్తామని ఇంకొకరు ఇలా పలు రకాలుగా ఆఫర్ల మీద ఆఫర్లు తో సిద్ధముగా ఉన్నాయి.వాటిని చూసి లెక్కగడితే ఒక సంవత్సరంలో నా సంపాదన 5 కోట్ల దాకా చేరుతుందని అర్థమయ్యేసరికి “వామ్మో! ఇంత డబ్బులు మనకి అవసరమా? ఎక్కువ తిన్నా కూడా అరగదు. ఇన్నాళ్ళు గల్లా పెట్టె మనల్ని కాపు కాసింది. ఎప్పుడైతే మన అవసరానికి మించి డబ్బులు చేరతాయో ఏమో భవిష్యత్తులో ఏమి అవసరమో ఏమి వస్తుందో సంపాదించే వయసులో సంపాదించుకుంటే మంచిది అని మనల్ని ముంచే డబ్బును దాచిపెడితే గల్లా పెట్టెకి మనము కుక్కలాగా కాపలా కాయాలని నాకు అర్థమైనది.ఈ ఆఫర్ల మాయలో పడితే వారి నుండి వారి కర్మ నుండి వేయి జన్మల దాక కోలుకునే పరిస్థితి నాకు రాదు” అని అర్థమై ఒకరోజు ఎవరికీ చెప్పకుండా జాతకాలు చెప్పే జ్యోతిష అవతారమును సంతోషంగా మనఃస్ఫూర్తిగా పరిసమాప్తి చేశాను.మనకు కావలసిన డబ్బులు ఎలాగో F.D ద్వారా బ్యాంకుల ద్వారా వస్తూనే ఉన్నాయి. దాంతో నా జీవితం చక్కగా గడిచిపోతుందని ఎన్నో వ్యాపార ఆఫర్లు వచ్చినా కూడా తోసిబుచ్చి నాకు కావలసిన డబ్బులతో సుఖముగా జీవిస్తూ ఎలాంటి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా మా ఆవిడ చేయకుండా సాధనలతో కాలము వెళ్ళ బుచ్చాలని నిర్ణయించుకునేసరికి మహాలక్ష్మి ధన మాయను నా మీద నుండి సడలించే సరికి మూడు సంవత్సరములు పైగా పట్టింది.దీనికి గుర్తుగా కాశీ క్షేత్రంలో దీపావళి నాడు అన్నపూర్ణాదేవిని మహాలక్ష్మిగా బంగారు కాసులతో కొలిచి ఆ రోజు అందరికీ పంచుతారని అవి ఇంట్లో ఉంటే ఎలాంటి మాయలు కలగవని ఆ రోజు మేము కాశీ క్షేత్రములో దీపావళి రోజున అన్నపూర్ణాదేవి సన్నిధిలో బంగారు కాసులు అందుకున్న సమయంలో తెలిసినది. దాంతో నాకు ఆనందం వేసింది.ఎందుకంటే ఈ కాసు వచ్చిన లేదా లక్ష్మీ గవ్వలు వచ్చిన లేదా లక్ష్మీ శంఖం వచ్చిన ఈ చక్ర మాయ దాటి ఆధీనం అయ్యినట్లే అని స్ఫురణకు వచ్చినది. ఇలా కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు కాశీ నుండి లక్ష్మీ గవ్వలు, రామేశ్వరం నుండి లక్ష్మీ శంఖం వచ్చి చేరినాయి.
ఇవి వచ్చి చేరిన కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా నాకు ఆకలి, దాహము, కామము, దుఃఖం లాంటి భావాలు ఆరంభం అయినాయి.నాలో తెలియని భయం మొదలైంది. ఎందుకంటే ఏదైనా ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది ఏమో అని కంగారు పుట్టేది.మూలాధార చక్రము వలన కామము పూర్తిగా దొబ్బింది అనే భయం. ఒక పక్క నాకు ఇష్టమైన పదార్ధాలు ఎదురుగా ఉన్న తినాలని అనిపించకపోవటం, ఎవరైనా చనిపోయిన దుఃఖం రాకపోవటం ఇలాంటి లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ చక్ర సాధన నాకు పరిసమాప్తి అయినదని సూచనగా ఈ నల్ల శంఖము వచ్చినది. అప్పటిదాకా నాకు తెలుపు, లేత గోధుమ రంగు శంఖములే చూడటము జరిగింది.మొట్టమొదటిసారిగా ఈ నల్ల రంగు శంఖము చూడటం జరిగింది.
జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు
ఒక రోజు నా టెలిపతిలోనికి జిఙ్ఞాసి రావడము జరిగినది.మరి వాడి స్వాధిష్టాన చక్రం పరిస్థితి వాటి అనుభవాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందని చెప్పటంతో వాడు నాతో భయ్యా! నేను మూలాధార చక్ర సమయంలో వచ్చిన చింతామణి గణపతిని వదిలి పెట్టిన రెండు నెలల తర్వాత నాకు ధ్యానములో మహాలక్ష్మీదేవి అగుపించి “నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అందుకో” అని మాయమైందట.ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే ఏమి చేసుకోవాలి? అన్ని వదిలేసిన వాడికి ధనముతో ఏమి పని ఉంటుంది. మనకు కావలసిన అవసరాలు ఆ ప్రకృతియే చూసుకుంటుంది కదా అనుకొని ఇది అంతా స్వాధిష్టాన చక్రం జాగృతి సూచన అని అనుకొని సాధన కొనసాగిస్తూ ఉంటే వాడికి కృష్ణనదిలో అతి అరుదైన ఏడమచేతితో ఊదే దక్షిణావృంత శంఖము కనపడినది.(నిజానికి ఈ శంఖమును ఊదటానికి రంధ్రము ఉండదు ) దానిని తీసుకొని మూడుసార్లు శంఖనాదము చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చివేసి శ్రీశైలం నుండి కాశీ క్షేత్రమునకు చేరుకున్నాడు.ఇలా తీవ్ర ధ్యానంలో ఉండగా అతనికి వివిధ రకాల తన ఇష్ట పదార్థాల రుచులు గుర్తుకు రావటం దానితో ధ్యాన భంగం అవ్వటం జరిగింది. ఇక వాడికి ఈ చక్ర శుద్ధి ఆరంభమైనదని చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ తిరిగి మళ్లీ ధ్యానం చెయ్యటం ప్రారంభిస్తే వెంటనే తిరిగి ఆ పదార్ధాల రుచి వాసనలు తన ముక్కుకి వచ్చే విధంగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండేవి కాదని మళ్లీ ధ్యానములో కూర్చుంటే ఇవే పదార్థ ఆలోచనలు రావటంతో ధ్యానం వైపు మనస్సు వెళ్లేది గాదని అలాగని ఆ పదార్థాలు కొన్ని తెచ్చుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవు.ఇలాగాదని అనుకొని కాశీ గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ఎవరో తనకి డబ్బులు ఇస్తే మొహమాటం కొద్దీ ఆ డబ్బులు తీసుకొని కావలసిన పదార్థాలు తినటం ప్రారంభించేసరికి అది నీళ్ళ విరేచనాలకి దారి తీసిన కూడా భయపడకుండా మనస్సు తృప్తి పడే సరికి ధ్యానం చేసుకునేవాడట.ఆరోజు మళ్లీ ఎలాంటి పదార్థ రుచులు వాసన అగుపించలేదు. మరుసటి రోజు మళ్ళీ కథ మొదలు. మళ్ళీ ధ్యానానికి కూర్చోగానే పదార్థం రుచులు వాసన భావాలు కలగటం అతనికి ధ్యాన భంగం అవ్వటం జరిగినది. ఎలాగైనా ఈ రోజు వీటిని తినాలని మనస్సు గోలపెట్టేది.నిన్నంటే ఎవరో డబ్బులు ఇచ్చారు. ఈరోజు ఎవరు ఇస్తారు అని తన మనస్సు కి ఎంత సర్ది చెప్పుకున్నా వినేది కాదట. అంటే షుగరు వ్యాధి వచ్చిన వాడికి తీపి పదార్థాలు ఎలా అయితే తినాలని జిలగా ఉంటుందో అలా వీడి పరిస్థితి తయారైందట.ఎవరైనా తన మీద జాలి చూపి డబ్బులు ఇస్తారేమోనని ప్రయత్నించి చూడాలని విపరీతంగా అనిపించేసరికి తట్టుకోలేక ఘాట్ల వద్ద నిలబడి ఎవరైనా ధనమును వేస్తారేమోనని ఎదురుచూస్తే విచిత్రంగా డబ్బులకు బదులుగా ఏవో ప్రసాదాలు తినటానికి చేతిలో పెట్టేవారట. దాంతో వారి మీద విపరీతమైన కోపావేశాలు వచ్చేవట. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇస్తే డబ్బులు ఇవ్వండి లేదంటే ఇక్కడ నుండి వెళ్ళండి అని గదమాయించే స్థితికి చేరుకున్నాడట.ఒకవేళ డబ్బులు దొరకకపోతే తనకు కావలసినవి తినటానికి ఏదో ఒక పని చేయాలని విపరీతంగా అనిపించేదట. ఇది ఈ చక్ర మాయేనని తెలిసినా గూడ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలో అర్ధం అయ్యేది కాదట. పదార్థాల రుచులు కోసము మనస్సు కాస్తా బిక్షగా వచ్చే నాలుగు కాసుల కోసం పడే ఆరాటం చూసేసరికి అతనికి ఏడుపు వచ్చేదట.ఈ పదార్థాలు తినటం వలన నీళ్ల విరేచనాలు వస్తున్నా పట్టించుకునేది కాదట. ఇది ఇలా ఉండగా ఒకరోజు లలిత ఘాట్ మీద కూర్చుని ఉండగా ఒకాయన తన శిష్య పరివారంతో స్నానాలు చేయటానికి వచ్చి స్నానాది పూజా కార్యక్రమాలు చేస్తుండగా వీడి మనస్సు అలాగే వీడి చూపు వారి మీద పడినది.నాలుగు రోజులనుండి ఒక్క పైసా కూడా తనకి బిక్షగా లభించలేదు. వీళ్ళ దగ్గర చేయి చాచి అడిగితే ఎవరైనా నాలుగు కాసులు వేయక పోతారా అని మనస్సు విపరీతంగా గోల చేయటం ప్రారంభించింది. ఇంతలో అందరి స్నానాదికాలు పూర్తి అయినాయి. వీరిలో పెద్దవాడుగా ఉన్న ఒక వ్యక్తి తన వైపుకి రావటం గమనించిన వీడు మౌనముగా అతడికేసి చూస్తుంటే అపుడు వారి శరీరము మీద బంగారు రుద్రాక్ష, స్పటిక, తామర, తులసి మాలలు బంగారు కంకణాలు భుజాలకి బంగారు ఆభరణాలు కాళ్ళకు బంగారు కంకణాలు చూస్తుండేసరికి మన వాడికి మతిపోయిందట.మహాలక్ష్మి పుత్రుడిలాగా ఉన్న ఇతడి అవతారమును మన వాడు గమనించేసరికి ఆయన మన వాడికేసి చూస్తూ “ఏమిరా నీ చూపు నా మీద పడినది. చూపు మళ్ళించుకో. లేదంటే బందీ అవుతావు. బయటికి రాలేవు.బంగారముకు ఆశపడితే బంగారముగా మారవు” అంటూ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇచ్చేయ్యి” అన్నాడట. దానికి మనవాడు “అయ్యా! నా దగ్గర ఏమీ లేవు.అసలు నాలుగు పైసలే నేను భరించలేక చస్తుంటే మీరేమో ఏకంగా నాలుగు భోషాణాలలో పట్టే నగలతో ఉన్నారు. వీటిని ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాక ఆ విధంగా చూశాను” అని మా వాడు చెప్పే సరికి ఆయన వీడి పక్కన కూర్చుని “సరే నీ దగ్గర డబ్బులు ఉంటే నేను నిరుత్సాహ పడే వాడిని. నీ పరిస్థితి బాగుంది ధైర్యంగా సాధన చేసుకో” అన్నాడట.దానికి మన జిఙ్ఞాసి వెంటనే “స్వామి! నా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు. బ్రహ్మపదార్థము చూద్దామంటే భౌతిక పదార్థం రుచి దాటలేక పోతున్నాను. నా స్థితి బాగా లేదని నాకు అర్థం అవుతోంది స్వామి” అనగానే దానికి ఆయన నవ్వుతూ “నాయనా! నీ ముఖంలో విభూది ధారణ కనబడుతుంది. వైరాగ్యమే ఆలంబనగా ఉన్నావు.శివశక్తితో ఉన్నావు. నాలుగు పైసలు కూడా దాటలేని స్థితిలో నువ్వు ఉన్నావని నేను అనుకోను. నీ స్థితి అలాగే నీ పరిస్థితి నాకు తెలుసు. కర్మ ఉన్నంత వరకే రుచి ఉంటుంది.రుచి కోసమే ధనము సంపాదించాలి అని ఆరాటం ఎందుకు.ఆ రుచికి కారణమైన దాని మీద దృష్టిని నిలుపు. బ్రహ్మ పదార్థము గూర్చి ప్రస్తుతము నీవు ఆలోచనలు చేస్తున్నావు. ఈ పదార్థానికి కారణమైన బ్రహ్మము గుర్తించి వాడిని గురించి ఆలోచించు. అంతా అర్థమవుతుంది.పదార్థము దాటితేగాని యదార్థము గుర్తుకు రాదు.అంతదాకా ఈ పదార్థం మాయలో నాకు లాగా పడతావు. పడితే దాటవచ్చునని అనుకుని ఇన్ని రకాలుగా బ్రహ్మ పదార్థాలు సేకరించి ధరించి నేనే ఒక మాయా శక్తి పదార్థంగా మారినాను” అంటూ ఆయన వెళ్లిపోతుంటే లక్ష్మీనారాయణుడు వచ్చాడా అనుకునే లోపల “స్వామి! నారాయణ స్వామి! మీ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు” అనే మాటలు మా వాడికి వినబడేసరికి బుర్ర తిరిగినది. ఆయన చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చేసరికి గతుక్కుమన్నాడు. ఆయనే వచ్చాడా? ఈయన మీదకి ఆయన వచ్చాడా? అదే లక్ష్మీపతి నారాయణుడు అనుకుంటూ నమస్కారము చేయగానే గాలిలో తిరుపతి వెంకన్న వారి వరద ముద్ర కనపడగానే వామ్మో నిజంగానే లక్ష్మీపతియే అనుకోగానే నిద్ర మత్తు ఆవరించింది.తెలియకుండానే అక్కడ ఉన్న చోటే నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నానికి నిద్ర మెలుకువ వచ్చింది.వచ్చి రాగానే వాడికి అన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆకలి వేస్తుందని భోజనాలుపెట్టే మఠాలవైపుకి వెళ్ళి భోజనము చేసుకొని వస్తుండగా బంగారపు కాసు బిళ్ళ అతనికి కనపడినది. వెంటనే చేతిలోకి తీసుకుని అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూస్తే ఎవరూ లేరట. మనకి ఎందుకు అని దగ్గర్లో ఉన్న హుండిలో వేద్దామని అనుకునేసరికి మన వాడికి ఏదో స్ఫురణకు వచ్చిందట.అది ఏమిటంటే తను ఈ హుండీలో ఇది వేశాక దీనిని పోగొట్టుకున్న యజమాని పాపము వెనక్కి తిరిగి వస్తే ఎలా అనే ఆలోచనలు రాగానే దానిని ఎక్కడ దొరికినదో అక్కడే వదిలి పెడుతుండగా అసలు ఇది ధనమని ఇది బంగారమని గుర్తించడం కూడా దోషమే గదా.అది మట్టి గా లేదా చిల్ల పెంకుగా తను గుర్తించకుండా బంగారంగా గుర్తించటంలో తను చేస్తున్న తప్పు ఏమిటో అర్థం అయినది. ధనము అవసరము లేని వాడికి ధనముతో ఏమి పని? ఇలా దీనిని తాకితే లేదా తీసుకుంటే దానికి సంబంధించిన కర్మ తిరిగి బంధనము కాదా. నిజమే! సిరిని కాకుండా హరిని అలాగే లక్ష్మిని కాకుండా లక్ష్మీపతిని ఆరాధిస్తే తను ధనమును చూసినా కూడా బ్రహ్మ పదార్ధం గా కనబడుతుంది కదా!అలాగాకుండా చూస్తే బంధనమై భౌతిక పదార్థముగా మాయగా మారుతుంది కదా!ఆయన అన్నట్లుగా పదార్ధం మాయ దాటితే యదార్థము తనకి తెలుస్తుంది అనగానే తనలో ధనమాయ తొలగినట్లుగా అనుభూతి వస్తుండగా ఏదో తెలియని ఆనందం ఆవరించగా విపరీతంగా దాహం వేసింది.
దాంతో గంగానది దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగుతుండగా చేతికి వెండి తొడుగుతో ఉన్న మహాలక్ష్మి శంఖం పెద్దది పైకి కనిపించగానే నవ్వుకుంటూ అది శంఖం కాదని దాని మూలం మట్టి నుండి వచ్చింది కదా అని “అమ్మా! తల్లి!నీ శంఖంను ఉపయోగించుకొని విశ్వానికి లక్ష్మిపతిని గావచ్చును.కానీ నాకు కావలసినది సిరికి అధిపతి కాదు. మోక్షానికి అధిపతి. నువ్వు నాకు లక్ష్మి కాంతగా వద్దు. మోక్ష కాంతగానే కావాలి. నాకు పదార్థ భేదము లేదు. నాకు భౌతిక పదార్థము అంతా బ్రహ్మపదార్థం గానే కనిపించడానికి నువ్వు సహకరించు తల్లి. నేను ఈ మానసిక స్థాయికి ప్రస్తుతానికి ఇంకా చేరుకోలేదు. ఇకనుంచి దానికి కృషి చేసి సాధించి తీరుతాను” అనగానే గంగానదిలో ఈ లక్ష్మీ శంఖం తిరిగి వెనక్కి పోయేసరికి మన వాడి ముఖము మీద ఆనందం తాండవం చేసినది. ఆ నది ఓడ్డున మనవాడికి ఒక పెద్ద చాలా అరుదైన శాలిగ్రామము కనపడినది.దానిని చేతిలోనికి తీసుకోగానే అది రెండుభాగాలు విడిపోయి అందులో ఉన్న బంగారము కనిపించేసరికి...తను చదివిన విషయము అనగా నిజమైన విష్ణుశాలిగ్రామము లోపల బంగారముంటుందని ఆనాడు చదివినదానిని నమ్మలేదు.ఈనాడు నమ్మక తప్పడము లేదని దానికి ఒక నమస్కారము చేసి దానిని యధావిదిగా ఆ గంగానదిలో నిమర్జనము చేసినాడు. ఆనాటి నుండి మన వాడికి వివిధ రకాల పదార్థ రుచులు చూడాలనే ఆకలి,వివిధ రకాల ద్రవ పదార్థాలు త్రాగాలనే దాహము, కామము దొరకకపోతే వచ్చే దుఃఖం నానాటికీ తగ్గుతూ వచ్చేసరికి తను ఈ స్వాధిష్టాన చక్రం ఇచ్చే అనూర్మిమతత్వము సిద్ధికి దగ్గర ఉన్నాము అని తెలుసుకుని ఇక పంచభూతాలలో రెండవది అలాగే ఈ చక్ర ఆధీన శక్తి జలతత్వ ఆధిపత్య శక్తి ఆధీనము కోసము మన వాడు అరుణాచలం చేరుకోవటము అక్కడి గుహకి వెళ్ళి తనకి వచ్చిన ఖేచరి ముద్ర సాధన సిద్ధితో 18 నెలలు తర్వాత జలము మీద ఆధిపత్యం సంపాదించుకుని నీటిమీద పడవలాగా తేలియాడే శక్తిని పొందినాడని వాడు చెప్పే సరికి నాకు ఆనందం వేసింది.అంటే వీడు కూడా ధన మాయను దాటి స్వాధిష్టాన చక్రం శక్తి అయిన నీటి ఆధిపత్యమును పొందినందుకు నాకు ఆనందం వేసింది. వీడి మాటలను బట్టి చూస్తే నాకు ఆకలి, దాహము, దుఃఖము, కామము లేకపోవటం అనేది జబ్బు కాదని అది అనూర్మిమతత్వము సిద్ధి సూచన అని తెలియగానే నా మనస్సుకి ఆనందం వేసినది. లక్ష్మీపతికి వాడికి లాగానే నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నా పూజా మందిరం వైపు అడుగులు వేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా నాతో పాటు ముందుకు అడుగులు వేయండి.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*******************************************
గమనిక: ఈ చక్ర శుద్ధి సమయంలో మనకి విపరీతంగా నీళ్ళ విరేచనాలు మన ప్రమేయం లేకుండా అవుతాయి. కంగారు పడకండి. అలాగే ఈ చక్ర జాగృతిలో మహాలక్ష్మి దేవి విగ్రహం,శుద్ధిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి గండకి శిల సాలగ్రామము అలాగే ఆధీనమయ్యే సమయములో మహాలక్ష్మి శంఖము వస్తాయి. వీటిని జాగ్రత్త పరచుకోండి. ఎవరికీ ఇవ్వవద్దు. వీటిని జాఱ విడుచుకోవద్దు. అలాగని వీటిని మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల నుండి తెప్పించుకోవద్దు. మా శ్రీమతి తనకి ధ్యానములో పదార్ధాల రుచులు వాసనలు వస్తున్నాయి అంటే ఇక ఆలస్యం చేయకుండా నాకు ఈ చక్రం లో వచ్చిన అన్ని దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చి పూజించుకొమ్మని ఈ చక్రం మాయను దాటమని చెప్పటం జరిగినది. దాంతో నాకు నల్లటి చిన్న శంఖము వచ్చినది. అనగా ఈ చక్ర దైవిక వస్తువులు మాయను కూడా దాటేసరికి ఈ చక్ర సాధన నాకు పరిసమాప్తి అయినదని సూచనగా ఈ నల్ల శంఖము వచ్చినది. అప్పటిదాకా నాకు తెలుపు, లేత గోధుమ రంగు శంఖములే చూడటము జరిగింది.మొట్టమొదటిసారిగా ఈ నల్ల రంగు శంఖము చూడటం జరిగింది. మనకి తోడుగా గురువులు ఉంటే ఇదే ఉపయోగము. వారికి కావలసింది ఇస్తే మనకు కావలసినవి ఇస్తారు. వారు మాయలు తీసుకొని మన కర్మ మాయలు మాయం చేస్తారు. ఇంతకుముందు మూలాధార చక్రములో కూడా పరిసమాప్తి సూచనగా నల్లటి గణపతి విగ్రహం వస్తే ఈ చక్ర పరిసమాప్తి సూచనగా నల్లటి శంఖము వచ్చినది అన్నమాట.ఇలా నల్లగా వచ్చే వాటిని గూడ జాగ్రత్త పరచుకోండి. అసలు నాకులాగా ఈ చక్రము నందు లక్ష్మీనారాయణుడు దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలహిరీ ధ్యానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ
చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికిగూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను ఒకసారి మహలక్ష్మీ ఆవాసమైన కొల్హాపూర్ క్షేత్రమునకు వెళ్ళడము జరిగినది. అక్కడ నేను యధావిధిగా ధ్యానము పూర్తిచేసుకొని కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక కోటీశ్వరుడు కనిపించాడు.వాడు నేను కళ్ళు తెరవడము చూసి "స్వామి! మిమ్మల్ని చూస్తూంటే నాకున్న సమస్యను తీరుస్తారని అనిపిస్తోంది.నాకు ధనానికి లోటు లేదు.100 తరాలు కూర్చున్న తరగని ఐశ్వర్యమున్నది. అన్నీ ఉన్న ఏదో లేదనే అసంతృప్తి నన్ను వెంటాడుతోంది.లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించాను. గుడులకి దానాలు చేసినాను.పేదవారికి సహాయ సహకారాలు ఇచ్చాను.అయిన నాకు నాలో ఉన్న వెలితి పోవడము లేదు.దీనికోసమే భారతదేశ తీర్ధయాత్రలు చేస్తున్నాను.నాలో ఉన్న వెలితి ఏమిటో కనీసము మీరైన చెప్పగలరా?మీకు గావాలసిన ధనమును ఇస్తాను అనగానే నేను వాడివైపు ప్రశాంతత వదనముతో చూసి"నాయన!తమరు డబ్బుయే సర్వసమని అనుకున్నారు.మీరు చనిపోయినపుడు మీ ఐశ్వర్యములో ఒక నగ గాని నవరత్న ఉంగరముగాని ఇసుమంత బంగారముగాని లేదా ధనమును గాని లేదా ఒక నయాపైస అయిన మీతోపాటుగా పైకి తీసుకొని వెళ్ళతారా...ఆలోచించు..ధనము గావాలి..ఎంతవరకు మన అవసరము వరకు గావాలి. మీరు ఈ పాటికే మీ అవసరాలకి మించి సంపాదించి మీ మనస్సుకి మోయ్యలేని భారమును ఇచ్చారు.అది మోయ్యలేక నానా అవస్ధలు పడుతోంది. మీ ఐశ్వర్యానికి కుక్కకాపల కాయలేక ఛస్తోంది.తద్వారా ప్రశాంతత కోల్ఫోతోంది. ముందు మీరు మీ ధన సంబంధ వ్యహారాలనుండి బాధ్యతల నుండి ముందు విముక్తి పొందండి.దానాలు చేస్తున్నపుడు నేనేగదా చేస్తున్నాను అనే ధనాహంకారముతో ఇన్నాళ్ళు దానకార్యక్రమాలు చేసినారు. నిజానికి నీకు మరియు బిచ్చగాడికి నా దృష్టిలో తేడా లేదు.ఎందుకంటే బిచ్చగాడు మన దగ్గర అడుక్కొని ధన అవసరాలు తీర్చుకుంటే...నీవు పైవాడిని అడుక్కొని ఇంతవాడివి అయ్యినావు గదా! ఎవరి ధనమును ఎవరు దానము చేస్తున్నారో ఆలోచించు. ఎవరి ధనమును ఎవరు పొందుతున్నారో ఆలోచించు. ధనము లేనివాడికి ప్రశాంతత ఉన్న ధనదాహముంటుంది.ధనమున్నవాడికి ధనము ఉన్న ప్రశాంతత ఉండదు. సంపాదించేవాడి కన్నా దానిని అనుభవించేవాడు మిన్న యని గ్రహించు.పేదవాడు ప్రశాంతముగా ఏరోజు ధనమును ఆరోజే అనుభవిస్తాడు. కాని మీరు అనుభవించేటపుడు భయముతో, అనుమానముతో, అహంకారముతో, ఆశతో,ప్రశాంతము లేకుండా అనుభవిస్తారు.అదే మీరిద్ధరిలో ఉండే ఇదే తేడాయని గ్రహించు. మర్మము తెలుసుకో!మూలము తెలుస్తుంది.మాయ మాయం అవుతుంది.మీ మనస్సుకిప్రశాంతత కల్గుతుంది. ఈ విభూదియే నా అఖండ ఐశ్వర్యమని గ్రహించు అంటూ వాడి చేతిలో పెడుతూండగా "స్వామి!మహలక్ష్మీ చెంతలో ఆది భిక్షువు సంపాదించుకున్న అఖండ ఐశ్వర్యమైన విభూదిని నాకు ఇస్తున్నారు. తద్వారా నాలో ఉన్న అన్ని రకాల ధనాశలు గూడ సంపూర్తిగా బూడిదయై... విభూదిగా మారినది. మీరు చెప్పినవాటిని తు.చ.తప్పకుండా ఆచరిస్తూ...మా మనసుకున్న ధనభారమును తగ్గించుకుంటూ...విభూది ధారణ చేస్తూ ఆదిభిక్షువు లాగా ప్రశాంతత జీవితమును గడుపుతాను అంటూ పాదనమస్కారము చేసుకొని ప్రశాంతతవదనమును పొందుతూ వెళ్ళిపోయినాడు.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిee chakram lo Dhana maaya kaluguthundani... chethilo okka rupai kuda lekunda enni
రిప్లయితొలగించండిkashtalu padi.... jathakalu cheppatam modalu petti ekkada thaggalo kuda thelvatam anni dabbul
ochina kaavalsinanni samuparjinchi tharvata oorukovatam.... saadhakudu kachithanga Dhana maya
lo undakunda elanti jagarthalu theesukovalo thelpatam bagundi....