అధ్యాయం 15

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
మంత్రాలకి మహత్తుందా?

భోగజీవితములో ఎదురైనా అమ్మాయిల ప్రేమ చేదు అనుభవాల కన్నా యోగ జీవితములో ఎదురైన అమ్మవారి మాయలు మిన్నయని గ్రహించి తిరిగి యోగ జీవితములోనికి ప్రవేశించాను!అపుడు అసలు నిజంగానే మంత్రాలకు మహత్తుందా? అనే ధర్మ సందేహం నాకు ఎప్పుడు నన్ను వెంటాడేది! ఎందుకంటే ప్రతి నిత్యం ఈ మంత్రాలు చదవలేక… ఒత్తులు సరిగా పలకలేక….ఇబ్బందులు పడేవాడిని! పైగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్ర విధి విధానాలు ఉంటాయి! శివయ్య, బాలమ్మ, గణపతి, కుమారస్వామి, వీరభద్ర, హనుమాన్, సుబ్రహ్మణ్య ,నవగ్రహాలు ఇలా ప్రతి విగ్రహమూర్తికి మంత్రాలతో అభిషేకాలు, మంత్రాలతో పూజలు చేసే సరికి నాకు నిజంగానే ఈ మంత్రాల మీద సందేహాలు వచ్చేవి! విసుగు, చికాకు వచ్చి ఈ మంత్రాలు కనిపెట్టిన వారిని…. ఈ పూజా విధానాలు కనిపెట్టిన వారిని …ఈ విగ్రహారాధన కనిపెట్టిన వారిని… ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుతూ చేసేవాడిని! అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు! ఇన్ని విధాలుగా, ఎన్ని సార్లు పూజలు చేస్తున్న, విగ్రహాలు మాట్లాడక పోయేసరికి నాకు విసుగు, చికాకు బాగా పెరుగుతూ వచ్చింది! మహా నైవేద్యమును చెప్పి విగ్రహమూర్తికి అన్నం తినిపించాలని… ఆయనే స్వయంగా వచ్చి అన్నం తింటాడు అని… ఆలోచనలో ఉండేవాడిని! కానీ ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా, పూజించిన ఏ విగ్రహమూర్తి వచ్చి నేను పెట్టిన మహా నైవేద్యాలు, ప్రసాదాలు తిన్నట్లుగా ఎక్కడ కనిపించలేదు …అనిపించలేదు! అనగా అనుభవం గాని, అనుభూతి కాని కలగలేదు! దాంతో రాను రాను నాకు విగ్రహం భక్తి మీద, మంత్రాల మీద వైరాగ్య భావాలు కలగటం మొదలైనాయి! పనికిరాని వాటిని కనిపెట్టి సమయము, డబ్బులు దండగ చేస్తున్నారని ఆలోచనలు విపరీతంగా వచ్చేవి! 

మహాశివరాత్రి నాడు రుద్ర నమకాలతో 11సార్లు ఏకాదశ రుద్రాభిషేకము మూడు గంటలపాటు జరిగేది! ఇలా చెప్పిన మంత్రం 11 సార్లు చెప్పటం ఎందుకో అర్థం అయ్యేది కాదు! పైగా ఈ మంత్రం ఉఛ్చారణ జరుగుతున్నంతసేపు ….శివ లింగ మూర్తి  మీద పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి! పైగా ఏమీ తినకుండా, ఉపవాస దీక్షతో శ్రద్ధగా, ఓపికగా చేయాలి ! నా సామిరంగా ఇక చూడండి ! ఒక పక్క ఆకలి… మరొక పక్క పంచామృతాలతో అభిషేకం పని… మరోపక్క మంత్రం ఉఛ్చారణ… కదలకుండా, మెదలకుండా శివాభిషేకం చేయాలి! మూత్రమునకు వెళ్ళవలసి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి! అదే మలమునకు వెళ్ళవలసి వస్తే ఏకంగా స్నానం చేసి రావాలి! దాంతో ఇవి వచ్చేటట్లు ఉన్నా కూడా ఈ పనులు చేసే ఓపిక లేక బలవంతంగా ఆపుకొని రుద్రాభిషేకము చేసే వాడిని! దాంతో నాకు విసుగు వచ్చేది! ఇదిలా ఉంటే… దేవీ నవరాత్రులను చేసే దసరా పండుగ వచ్చేది! ఇక చూడండి నా సామిరంగా! అమ్మవారికి ప్రతిరోజు అలంకారాలు మార్చాలి! సాయంత్రం లలితా సహస్రనామాలతో శ్రీ చక్రార్చన! వచ్చిన వారందరికీ ప్రసాదాలు పంచేసరికి నా ప్రాణం తోకకి వచ్చేది! దీనమ్మ! అసలు మంత్రాలలో మహత్తుందా అనేది ఉందా… ఇంతమంది ఇన్ని సార్లు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు…. ఒక్కనాడు ఒక్కసారైనా పూజ చేయించుకున్న అమ్మవారు నాకే కాదు …చేసినవారికి ఎవరికి కూడా కనిపించకపోయేసరికి విసుగు, చికాకు వచ్చేది! నా భక్తిలో లోపం ఉంటే ….మిగతా వారి అందరి భక్తుల భక్తిలో లోపాలు ఉంటాయా లేక అసలు మంత్రాలలో లోపాలు ఉన్నాయా నాకైతే అర్థం అయ్యేది కాదు! అర్థమై, అర్థంలేని, అర్థంకాని మంత్రాలతో అర్థం - పర్థం లేని పూజలతో కాలం గడుపుతున్నాని నాకు తీవ్రంగా అనిపించే సమయంలో …. ఒక మహత్తర సంఘటన జరిగినది! 

మా ఊరిలో ఒక ఆయనకి ఒకసారి పాము కరిచింది! అది పైగా విషసర్పం! మా ఊరి వైద్యులు ఇతను బతకడం చాలా కష్టమని చేతులెత్తేశారు! దాంతో వాళ్లు గుడి దగ్గరికి వచ్చి ….ఉన్నాడో లేడో తెలియని శివ లింగ మూర్తి దగ్గరికి వచ్చి ….”మా వాడిని ఎలాగైనా బతికించు స్వామి! ఈ జాతరలో వాడి పేరు మీద ఒక ప్రభ కట్టి ఊరేగింపు చేస్తాము! మాకు వాడు ఒక్కడే కొడుకు! రక్షించు దేవా”! రక్షించమని వేడుకున్నారు! నాకైతే అతను చనిపోవడం ఖాయమని అనిపించినది! ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక పెద్దాయన వెంటనే “రేయ్! మనము పాము మంత్రం వేస్తే పాములస్వామి దగ్గరికి తీసుకుని వెళ్లి మన వాడి బతికిద్దాం! వాడు ఖచ్చితంగా బతుకుతాడు! పదండి” అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది! ఏమిటి ఇక్కడ ప్రతిరోజూ క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, నిత్యము చేస్తున్న ఈ ఒక్క దేవుడు మహత్తు చూపలేదు! అలాంటిది ఎవరో స్వామి… పైగా ఆయన పాము మంత్రం వేస్తే… పాముకాటుకు గురైన వ్యక్తి బతుకుతాడుట! పైగా వైద్యులు బ్రతికించలేమని చెప్పి చేతులెత్తేస్తే…  పాము మంత్రం వేసే వాడు ఎలా బతికిస్తాడు? వీరి పిచ్చి గాని అనుకుని… అసలు ఏమి జరుగుతుందో ఒకసారి వీరి వెంట వెళితే పోలా అనిపించడంతో …. ఈ గుంపు వెంట… పాములు స్వామి దగ్గరికి వెళ్లాను! 

ఆయన చూస్తే 80 సంవత్సరాల వయస్సున్న వాడి లాగా ఉన్నాడు! బయటకు వచ్చి.. పాము కరిచిన వాడి దగ్గరికి వచ్చి… పాము కాటు వేసిన చోట చూసి… చిరునవ్వు నవ్వి “కంగారుపడకండి! తగ్గిపోతుందిలే ! ఎలా ఎక్కినదో....అలా కిందకి దిగిపోతుందిలే! తగ్గిపోతుందిలే” అంటూ లోపలికి వెళ్లి… ఏదో వేరు లాంటిది తెచ్చి… ఈ పాము కాటు వేసిన చోట దీనిని పెట్టి… ఏదో మంత్రం చదువుతుండగానే … సృహ కోల్పోయిన వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి… నేను గతుక్కుమన్నాను! వామ్మో! ఇది విచిత్రంగా ఉందే! ఎవరో చెప్పినట్లుగా.. నిద్రలో లేచినట్లుగా లేస్తున్నాడు! ఆయన ఏదో మంత్రం చదువుతూంటే పాము కాటు వ్యక్తి శరీరం నీలం రంగు నుండి మామూలు స్థితికి రావడం చూసేసరికి… నాకు నోట మాట రాలేదు! పాము కాటు వ్యక్తికి ప్రాణాలు తిరిగివచ్చి… లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసి అందరితో మనిషిలాగే వెళుతున్న వాడికేసి చూసి నమ్మాలా వద్దా అనే సందేహం కలిగింది! కళ్ళు ముందు జరిగిన ఈ యదార్ధ సంఘటన కి నాకు బుర్ర తిరిగింది! 

ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపించి ఆ తాత దగ్గరికి వెళ్లి “నిజంగానే మంత్రాలకు మహత్తులు ఉందా” అని అడిగినప్పుడు…. ఆయన నాకేసి అదోలా చూసి … “ఎందుకు లేవు నాయనా.. ఉంటాయి! ఈ విశ్వములో మంత్రము, తంత్రము, యంత్రము అనేవి ఉన్నాయి! ప్రతి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి! వీటికి మన శరీరంలోని నాడీ ఉత్తేజం కలిగించే శక్తిని కలిగి ఉంటాయి ! వీటికి ఆ శక్తిని ఆయా మంత్ర దేవతలు ఇస్తారు! వీరికి మన విశ్వంలో ఉన్న దైవ శక్తి వారికి ఇస్తుంది! ఈ దైవ శక్తికి మనం నిత్యం చేసే హోమాలు, యజ్ఞాలు, యాగాల వలన వాటిలో వేసే ప్రతి పదార్థం వలన అనగా ఆవు నెయ్యి, ఆవు పిడకలు, ఆవు పాలు, కొబ్బరికాయలు, నవధాన్యాలు, నవగ్రహ సమిధులు, పట్టువస్త్రాలు సుగంధ ద్రవ్యాలు… ఇలా వాడే ప్రతి పదార్థం వలన హోమ దేవతలకు దైవ శక్తి వస్తుంది! ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ ను తీసుకొని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇచ్చే మహత్తర శక్తి ఉన్న ఒక్క గోమాతకే ఉంది !అనగా ఆవు జాతికే ఇట్టి అవకాశం ఉన్నది! నువ్వు నిత్యం చేసే పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె పంచదార వాడుతున్నావు కదా! అంటే మన శరీరంలోని మనకు తెలియకుండా ప్రాణ శక్తి స్థాయిలు తగ్గినప్పుడు… మనలో ఉన్న వివిధ రకాల చక్రాలు బలహీనపడతాయి! దాని వలన వీటికి సంబంధించిన అంగాలు దెబ్బతినటం మొదలై… వ్యాధుల రూపంలో బయటికి తెలుస్తాయి! ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి… మనం మనకి పున:ప్రాణశక్తి ఇచ్చే పదార్థాలను, వస్తువులను ఏర్పరచడం జరిగింది! ఇలాంటి శక్తిని ఇవ్వటంలో ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవుపేడ కి ప్రథమ స్థానం ఉన్నదని మన పూర్వీకులు గ్రహించి… వాటిని నిత్య పూజా విధానాలలో ఉండేటట్లుగా ఏర్పాటు చేసినారు! అందుకే ఆవు పేడ నుండి విభూధిని తయారుచేస్తారు! ఆవునెయ్యి ని నిత్య దీపారాధనలో వాడేటట్లుగా చేసినారు! ఆవుపాలు, ఆవు పెరుగును నిత్యాభిషేకాలకు వాడేటట్లు ఏర్పాటు చేసినారు! గో మూత్రం త్రాగే విధానం ఏర్పాటు చేసినారు! ఆవుపేడను గొబ్బెమ్మల రూపంలో పండగల సమయంలో వాడేటట్లు ఏర్పాటు చేసినారు! ఎందుకంటే మనిషికి ప్రాణ శక్తి కోసం ఒక పూజలో కాకపోయినా మరో పూజలో అందుకునే ఉద్దేశంతో ఇన్ని రకాల పూజా విధానాలు ఏర్పరచినారు! పైగా ఇలా వచ్చిన ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 72వేల నాడులకు వెళ్ళటానికి మంత్రాలను ఏర్పరచినారు! ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నాడులు స్పందించి… ఆయా ప్రాణశక్తిని తీసుకుని… ఆయా చక్రాలు ఆయా భావాలు కలిగిస్తాయి! ఉదాహరణకి శివ పంచాక్షరి మంత్రం చదివితే… ఆవు పాల అభిషేకం వలన మనకి జ్ఞానము ఏర్పడి వైరాగ్య భావాలు కలుగుతాయి! అనగా ఆజ్ఞాచక్రము శుద్ధి అవ్వటం మొదలవుతుందన్నమాట! అలాగే శివ పంచాయతన పూజ వలన… మనలోని పంచ చక్రాలు శుద్ధి… వీటికి ఆయా పదార్థాల వలన… అలాగే నివేదన వలన మనకి తిరిగి ప్రాణ శక్తి కలుగుతుంది! ఏ చక్రానికి ఏ దేవత ఉండాలో దానికి సంబంధించిన నిత్య పూజా విధానాలు ఏవిధంగా ఉండాలో…. దానికి తగ్గట్లుగా నాడులు ఎలా స్పందిస్తాయో…. గమనించి …. ఏ పదార్థాలు తింటే అది బలంగా ఉందో తెలుసుకుని ఆ విగ్రహ పూజా విధానాలు ఏర్పాటు చేశారు! 

ఇలాగే పాము మంత్రం, తేలు మంత్రాలు కూడా వచ్చినాయి! వీటికి వీటి విషానికి విరుగుడుగా సంజీవిని వేరు మొక్క అలాగే పాము కోరల్లో ఉండే నల్ల రాళ్లు అన్నమాట! వీటిని ఉపయోగించి ఎంతటి విషమునైనా హరించి వెయ్యవచ్చును! కాకపోతే వీటిని ఉపయోగించేటప్పుడు… కాటు తిన్న వ్యక్తి నుండి…. వైద్యం చేసే వ్యక్తికి ఈ విషము వచ్చే అవకాశం ఉండటం వలన… దీని నిరోధించుటకు పాము అలాగే తేలు మంత్రాలను కనిపెట్టారు! వీటిని నిష్టతో 12 సంవత్సరాల పాటు ఈ మంత్రాలను ఆరాధన చేసిన వారికి… ఈ మంత్ర సిద్ధి కలిగి… ఎలాంటి విషము వీరిని ఏమీ చేయదు! పాములు లేదా తేలు కాటు వేస్తే అవి చనిపోతాయి కానీ ఈ మంత్ర సిద్ధి పొందిన వారికి ఏమీ కాదు” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు! నా కళ్ళు తెరిపించి నాడు! 

అంటే మనము నిత్యం చేసే పూజలలో చదివే మంత్రాలలో, దైవిక పదార్థాలలో, ఎంతో మహత్తు ఉన్నదని గ్రహించి…. వాటిని ఒక వరుస క్రమంలో… ఒక పూజా విధి విధానాలతో… మనకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేసిన మన భారతీయ ఆగమశాస్త్ర విధి విధానాలకి నమస్కారం చేసినాను! ఈ పూజావిధానాలలో ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి మూలికా వైద్యము, రేకి వైద్య విధానం… మనకి అలాగే రాబోవు మానసిక, శారీరిక మనోవ్యాధులు తొలగించారని…. అందుకే కాబోలు 24 బీజాక్షరాలను తీసుకుని… 24 దేవతశక్తులను అమర్చి… వారికి 24 గురువులను అనుసంధానం చేసి… 24చేతిముద్రాలను ఏర్పరిచి… దానిని గాయత్రి మహా మంత్రం గా రూపు దాల్చి….సర్వదేవతలకి అనుసంధానము చేసి… త్రికాలాల్లో (మూడు కాలాలలోనూ) ఆరోగ్య ప్రదాత అయిన సూర్య దేవుని… నిత్యారాధన చేసే గాయత్రి మహా మంత్రం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలిసింది అని అనుకుంటూ…. ఇక నుంచి ప్రతి నిత్యం మనస్ఫూర్తిగా, ఆర్తిగా, సహనముతో, భక్తివిశ్వాసాలతో, శ్రద్ధగా మంత్రోఛ్ఛారణ చేయాలని… నిర్ణయించుకుని ఆనందంగా గుడికి బయలుదేరాను! నిత్య గాయత్రి మంత్రాష్టానము వలన నా జీవితములో జరిగిన మార్పులు ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఏమి చెయ్యాలో మీకు తెలుసు గదా!

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*****************************

గమనిక: పాము మరియు తేలు మంత్రాలను అలాగే ఈ మంత్రవాదులను ప్రోత్సహించాలని నా ఉద్దేశ్యము గాదని గ్రహించండి! ఎందుకంటే ఇలాంటి నిజ మంత్రవాదులను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చును! భారతీయ మంత్రశాస్త్రము యొక్క గొప్పతనము నేను తెలుసుకున్నదానిని లోకానికి తెలియచెయ్యాలని చెప్పడము జరిగినది!చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాము మంత్రముకి ఆరాధ్యుడిగా… “పాముల నరసయ్య” అనే సిద్ధపురుషుడు ఉన్నారని… చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి కాశీక్షేత్రంలో వీరిని ఆనాటి కంచి పీఠాధిపతి అయిన చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారు చూసి… ఇతని చేతిలో గరుడ రేఖ ఉండటం చూసి …ఇతని వలన లోకోద్ధరణ జరగాలని భావించి… వీరికి పాము మంత్రోపదేశం చేసినారు! అలా పాముల నరసయ్య 12 సం!!రాలు పాటు బ్రహ్మచర్య దీక్షతో...అత్యంత కఠిన నియమాలు పాటించి..ఆపై మంత్ర సిద్ధి పొందిన తర్వాత ఉచితంగా అందరికీ పాముకాటు పడిన వారిని లక్షలాది మందిని రక్షించినారని… అందుబాటులో లేని సమయంలో ఫోను ద్వారా ఈ మంత్రోచ్చారణ చేస్తూ… ఎక్కడో దూరాన ఉన్న పాము కాటు వ్యక్తిని… తిరిగి ఆరోగ్యవంతులు చేసే వారని… వారి చరిత్ర చదివితే నాకు తెలిసింది! మంత్రమును మనసుపెట్టి చేస్తే… ఆ మంత్ర సిద్ధి కలిగితే… నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలతాయని... చింతకాయలేం ఖర్మ చింతమణులే రాలతాయని నేను గ్రహించాను! అంతెందుకు ఆదిశంకరాచార్యుడు ఒకసారి చేసిన కనకధార స్తోత్రం వలన బంగారు ఉసిరికాయలు రాలినాయి గదా! ఆలోచించండి! కాకపోతే ఆయా మంత్రాలను, ఆయా మంత్ర విధానాలను, శ్రద్ధాసక్తులతో, భక్తివిశ్వాసాలతో, నియమనిష్టలతో, చేస్తే… ఆ మంత్ర దేవతలు వారికి ప్రత్యక్షమై వారికి కావలసినవి ఇచ్చి వెళతాయని నా స్వానుభవములో చాలాసార్లు రుజువైంది! నామీద నమ్మకం లేదా… అయితే మీకు నచ్చిన మంత్రమును ఎంచుకుని ఆరాధన చేయండి! విషయం మీకే తెలుస్తుంది! లోపం మనలో ఉంటుంది గానీ మంత్రంలో ఉండదని గ్రహిస్తారు !


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. hahaha.... shivaratri roju 11times rudra abhishekam ki bathroom ki vellakunda aapukoni kurchoni chesa anaaru kada adi maatram correct ga open ga chepparu nak okka daanike ala anukunna.... manthralaki chinthakayalu kaadu chinthamanulu raalathayani anubhavapurvakamuga cheppina vishayam bagundi...manthram yokka vishishtatha chepparu...

    రిప్లయితొలగించండి