పతంజలి యోగం చేస్తే…
వివిధ రకాలుగా వచ్చే ఆలోచనలు దెబ్బకి మాకు ధ్యాన మార్గం మార్గం సరిపడదని గ్రహించినాము! అసలు యోగసాధనకు సులువైన మార్గాలు ఇంకా ఏమైనా ఉంటాయేమోనని పరిశోధన చేయాలని నేను వివిధ రకాల యోగ గ్రంధాలు పుస్తకాలు చదవడం ఆరంభించాము! అందులో ఎక్కువగా బాగా ప్రచారంగా పతంజలి అష్టాంగ యోగ విధివిధానాలు బాగా కనిపించాయి! ఇదియే కుండలిని యోగ మార్గమని గ్రహించాము! ఈ విధానంలో కేవలం ఏనిమిది రకాల స్థితులు ఉపయోగించి దేవుడిని చూడవచ్చని, సమాధి స్థితి పొందవచ్చునని, ఆత్మ సాక్షాత్కారమును పొంది వివిధ రకాల యోగ స్థితులు, అష్టసిద్ధులు పొందవచ్చని గ్రహించినాము! దానితో కుండలిని యోగ మార్గమని చేయడానికి పూనుకున్నాను! వీరు చెప్పిన అష్టాంగాలు ఏమిటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అని ఏనిమిది రకాల స్థితులు అంగములు అన్నమాట! వీటిని పతంజలి అష్టాంగ విధివిధానము అంటారు! ఇందులో మొదటిది యమము అనే అంగములో అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఐదు అంశాలు ఉంటాయి! ఇక నియమము అనే అంగములో శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము,ఈశ్వర ప్రణీధానం అనే అంశాలు ఉన్నాయి! ఇక ఆసనం అనే అంగంలో గోముఖ, వీర, సింహ, భద్ర, ముక్త, స్వస్తిక, పద్మ, మయూర అని ఎనిమిది రకాల ఆసనాలు ఉంటాయి! ఇక ప్రాణామాయ అంగములో మూడు రకాల ప్రాణాయామం విధి విధానాలు ఉన్నాయి! ఇక ప్రత్యాహారం అనే అంగంలో అయితే అరిషడ్వర్గాలను జయించాలని ఉంది! ఇక ధారణ అంగములో అయితే పంచభూతాలు ధారణ చేయాలని ఉంది! ఇక ధ్యానమనే అంగంలో అయితే మూడు రకాల ధ్యానాలు అనగా స్థూల,సూక్ష్మ ,జ్యోతి దర్శన స్థానాలు ఉన్నాయి! ఇక ఆఖరిదైన సమాధి అని అంగములో అయితే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే రెండు రకాల సమాధిల అంశాలు ఉన్నాయని మేమిద్దరము ద్వారా వివిధ గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగినది!
ఉన్న మాట నిజం చెప్పాలి కదా! నాకు ఊహ తెలిసినప్పటి నుండి చిలిపి దొంగతనాలు చేయడం అలవాటు! ఒకటో తరగతి నుండి పదో తరగతి స్థాయి వరకు నాకు ఈ అలవాటు ఉంది! నాకు నచ్చిన చిన్న వస్తువు నా కంట పడితే ఎదుటి వాడికి తెలియకుండా, ఆ వస్తువున్న వాడికి కూడా తెలియకుండా చాలా చాకచక్యంగా చిలిపి దొంగతనం చేసే వాడిని! ఈ విషయం మా అమ్మ కి మాత్రమే తెలుసు! నానా తిట్లు తిట్టేది! నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావని నేను కలలు కంటూ ఉంటే నువ్వు కన్నయ్య లాగా వెన్నదొంగ అవుతావా ఏమిటి? అనేది! మనకి పట్టేది కాదు! రోజూ చేయను! మనస్సుకు నచ్చిన వస్తువులు దొరికితే మాత్రం అది వాడి చేతిలో ఉండదు! నా చేతిలో ఉంటుంది! బలపాల దగ్గర నుండి గడియారాలు దాకా ఇలా ఎన్నో వస్తువులు నా ఖాతాలో ఉన్నాయి! అంత ఎందుకు తూనిక రాళ్ళు ఉన్నాయి కదా! అంటే ఒక గ్రామం, 5 గ్రాములు, పాతిక గ్రాములు,50 గ్రాములు, 100 గ్రాములు తూనికరాళ్ళు ఆ కాలంలో ఇత్తడితో తయారు చేసేవి ఉండేవి! బుజ్జి ముండలు! వాటిని చూస్తే నా మనస్సు ఆగేది కాదు! కావాలని చిల్లర కొట్టుకు ఈ తూనిక రాళ్ళ కోసం వెళ్లి… ఆ కొట్టు వాడికి లోపల ఉన్న వస్తువు పేరు చెప్పి… వాడు లోపలికి వెళ్ళగానే… వాడి గల్లాపెట్టి మీద ఉన్న ఈ చిన్న బుజ్జి ముండలను ఒక్కొక్కటిగా దొంగతనం చేసి తెచ్చుకునే వాడిని! చాలా గొప్పగా మా స్నేహితులకి ఆత్రంగా చూపించే వాడిని!
వాడిలో ఏవరో మా అమ్మకి ఈ విషయం చేరవేసే వాడు! ఆ తర్వాత ఆమె చేతిలో తిట్లపురాణం ఉండేది! పాపం మహాతల్లి కొట్టేది కాదు! కేవలం ఉగ్రంగా తిట్టేది! బాగా తిట్టి అలిసిపోయి నాకు కావాల్సినవి తినటానికి ఇచ్చి వెళ్ళిపోయేది! అందుకే అమ్మంటే నాకు అంత ఇష్టం! మళ్లీ మా అయ్యకి ఏనాడు నా మీద చెప్పేదికాదు! చెప్పి ఉంటే కథ మరోలాగా ఉండేది! చిన్న పిల్లవాడు ఎప్పటికైనా మారక పోతాడా అని పాపం చాలా ఓపిగ్గా ఎదురు చూసేది! చిలిపి దొంగతనం చేసినప్పుడల్లా ఏదో శాపము లాగా ఆమెకు ఎలా తెలిసేది నాకైతే అర్థం అయ్యేది కాదు! వస్తువులు పోగొట్టుకున్నాడికి మాత్రమే తెలియకుండా చేస్తున్నాను కానీ అమ్మ నుండి తప్పించుకోవటం నా వల్ల అయ్యేది కాదు! మా స్నేహితులు చెబుతున్నారని అనుమానంతో వాళ్ళకి చెప్పటం కూడా మానేశాను! అయినా కూడా మా అమ్మకి తెలిసిపోయేది! ఎలా తెలు స్తోందో నాకు అర్థమయ్యేది కాదు! కొన్ని సంవత్సరాలు అయిన తరువాత విషయం ఏమిటో తెలిసింది! దొంగతనం చేసి వచ్చినప్పుడు నా కళ్ళల్లో ఏదో తెలియని అనుమానము, భయము కనపడేది! దానితో నా మీద అనుమానం వచ్చి నన్ను తిట్టేది అని తెలుసుకున్నాను! ఇలాంటి చిలిపి దొంగ బుద్ధి ఉన్నవారికి ఈ పతంజలి యోగ మార్గం లో చెప్పిన మొదటిది యమము అనే అంగములో అస్తేయము అనగా దొంగ బుద్ధి లేకుండా ఉండటం అని తెలిసింది! మరి నాకు ఉన్నదే అది… చిన్నపాటి దొంగతనాలు చేయకపోతే ఎలా? వామ్మో నావల్ల కాదు అని అనుకున్నాను! పైగా ఇదే అంగము లో ఉన్న బ్రహ్మ చర్యము అనే అంశం అనగా శరీర వాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్పడం జరిగినది! ఆవేశం వచ్చినప్పుడు నిద్రలో కూడా ఆ ప్రక్రియలు జరక్కుండా ఎలా ఆపటం నా వల్ల కాదని గ్రహించాను! పైగా అమ్మాయిలను చూడకుండా ఉండాలి అంటే మన వల్ల కాదని తెలుసుకున్నాను! ఇది కాకుండా ప్రతి రోజు ఆసనాలు వేయాలి అని ఆసన నియమము ఉన్నది! వామ్మో! అసలే తెల్లవారుజామున లేవాలంటే నాకు విపరీతమైన బద్ధకము! పైగా చన్నీటి స్నానము! చలిలో దుప్పటి మీద కూర్చుని ఆసనాలు వేయాలి! వామ్మో! ఇది కూడా నా వల్ల కాదని అర్థమైంది! దానితో కుండలిని యోగ మార్గమైన పతంజలి అష్టాంగ యోగము కూడా నా వంటికి సరిపడదని గ్రహించాను!
ఇక మా జిజ్ఞాసి విషయానికి వస్తే వాడికి నాకు ఉన్న లోపాలు ఏమీ లేవు! అన్నీ కూడా యధావిధిగా చక్కగా అష్టాంగాలు చేసుకుంటూ పోతున్నాడు! ముఖంలో తేజస్సు పెరుగుతుంది! మాటల్లో వాక్సుద్ధి కలుగుతుంది! పాపం వాడికి వచ్చిన సమస్యల్లా యమము అనే అంగములో సత్యము , అహింస అంశము అలాగే నియమము చెప్పిన తపస్సు మరియు ఈశ్వర ప్రణీధానం అనే అంశాలు బాగా ఇబ్బంది పెట్టాయి! ఎల్లప్పుడూ కూడా సత్యం పలకాలంటే మనం సత్య హరిశ్చంద్రుడు కాదు కదా! ఎప్పుడో ఒకప్పుడు మన కోసం కాకపోయినా పరుల కోసమైనా కనీసం చిన్నపాటి అబద్ధం చెప్పదు కదా! అనగా ధర్మరాజు లాగా… ఎప్పటికైనా చిన్నపాటి అబద్ధాలు చెప్పే పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి! అబద్ధం చెప్పకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి! ఇది కాకుండా వాడి దృష్టిలో ఈగలు, దోమలు చంపడం కూడా అహింస కిందకే వస్తుందని…. అవి కుడుతున్న వాటిని చంపకుండా, పట్టించుకోకుండా బాధ భరించడము అలవాటు చేసుకున్నాడు! తర్వాత వాటి వలన వచ్చే వివిధ రకాల జ్వరాలకి, రోగాలకి ఆసుపత్రులు బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాడు! అలాగే కాలేజీలు చదివే సమయంలోనే మరియు ఉద్యోగాలు చేసే సమయాలలో మర్చిపోకుండా ప్రతినిత్యం ఈశ్వర ప్రధానము అనగా నిత్య భగవంతుని నామస్మరణ చేయడం అతనికి కుదిరేది కాదు! సాధ్యమైనంత వరకు అసలు చేసేవాడే కానీ మన వాడికి తెలియకుండానే కొన్ని క్షణాల పాటు ఆగిపోయేది! పైగా ఇందులో చెప్పిన ప్రాణాయామ విధి విధానం వలన వీడికి చెవుడు రావడం, మాట తడబడటం మొదలైనాయి! కారణం ఏమిటంటే ఈ విధానములో గాలిని ఎంతసేపు తనలో ఉంచుకోవాలో అలాగే గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండాలో తెలియక పోవడం వలన నరాలు నెమ్మది నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభించే సరికి మన వాడికి చెవుడు వచ్చే ప్రమాదంలో పడిన కొన్ని నెలలకు గాని తెలియలేదు! ఈ విధానమును పరిపూర్ణుడైన యోగాచార్యుడు సమక్షంలో నేర్చుకుని అప్పుడే అభ్యాసం చేయాలని లేదంటే ప్రయోజనాల కన్నా ఎక్కువగా ప్రమాదాలు కలుగుతాయని ఆ తర్వాత మా ఇద్దరికీ తెలిసినది! మా ఊరికి సరిగ్గా బడిపంతులు లేడు! అలాంటిది ఇంకా యోగాసనాలు, ప్రాణాయామాలు నేర్పించే వాడు మనకి ఎక్కడ దొరుకుతారు అని అనిపించింది! దానితో మా ఇద్దరి ఒంటికి పతంజలి అష్టాంగ యోగము కూడా సరిపడదని గ్రహించి నాము!
ఇక నా చిలిపి దొంగతనాలు విషయానికి వస్తే ఒక రోజు నేను, అమ్మ కలిసి పక్క ఊరిలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లినాము! 60 సంవత్సరాల వయస్సు! ఈ వైద్యం మీద మంచి అపారజ్ఞానం ఉన్న వ్యక్తి! అమ్మకి అంటే విపరీతమైన గౌరవ మర్యాదలు ఉండేవి! ఆయనకి కూడా అమ్మ అంటే సొంత కూతురు లాగా నన్ను మనవడి లాగానే చూసుకునేవాడు! తాతా… తాత… అంటూ ఆయన దగ్గర నాకు చనువుండేది! నాకు చిన్నప్పటి నుండి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆయన దగ్గరికి అమ్మ తీసుకుని వెళ్ళేది! తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో… ఒకసారి నాకు విపరీతమైన కడుపునొప్పి వస్తే… ఈయన దగ్గరికి తీసుకుని వెళ్ళింది! అప్పుడు ఈయన టేబుల్ మీద తారీఖులు మార్చుకునే వీలున్న ప్లాస్టిక్ క్యాలెండర్ కనిపించింది! బుజ్జి ముండ! చాలా చిన్నదిగా ఉంది! అందంగా ఉంది! పైగా చేతిలో ఇమిడిపోయే టట్లుగా ఉంది! ఇంకేముంది! అది కాస్త ఆయన టేబుల్ నుండి నాకు తెలియకుండానే, ఆయనకు తెలియకుండానే, ఎవరికీ తెలియకుండానే, నా లాగు జేబులోనికి చేరిపోయింది! అక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయన కనిపెడతారేమోన నే అనుమానం నాలో, నా కళ్ళలోనూ మొదలైంది! మా అమ్మకి నా ప్రవర్తనలో మార్పు రావడం చూసి విషయం అర్థమై మౌనం వహించింది! ఆయనకి నమస్కారం చేసి మేమిద్దరం బస్సు ఎక్కి వచ్చినాము! ఆ తర్వాత చూడాలి! నా సామి రంగా! ఇంట్లోనికి రాగానే…. ఒక్క సారిగా పూనకం వచ్చిన దానిలాగా మారిపోయి… నా చేతిని పట్టుకుని ఆమె పూజ చేసుకునే మందిరం దగ్గరికి తీసుకుని వెళ్లి…. “ఏరా వెధవ! తింగరి! మళ్లీ ఏ వెధవ పని చేశావురా! ఏ దొంగతనము చేశావురా! నువ్వు మారతావు అని ఇన్నాళ్ళుగా తెలిసి ఎదురుచూశాను! నువ్వు మారలేదు! దేవుడులాంటి ఆయన దగ్గర దొంగతనం చేస్తావురా? ఇంత వయస్సు వచ్చింది! బుద్ధి లేదా? ఈ చిలిపి దొంగతనాలు చేయడం ఏమిటి రా? కొంపతీసి నిజంగానే దొంగ అవుతావా ఏమిటి? ఆయన దగ్గర ఏమి దొంగతనం చేశా వో చెప్పు… అంటూ నన్ను గట్టిగా చెంప దెబ్బ కొట్టినది! అదే నా జీవితంలో తొలి - ఆఖరి అమ్మ చేతి దెబ్బతినటం! బుగ్గ బాగా వాచి పోయినది! దొంగతనం చేసిన వస్తువును చూపించాను! అది నా దగ్గర నుండి లాక్కుని “మళ్లీ ఎప్పుడైనా దొంగతనం చేశావని తెలిస్తే… మీ అమ్మ చనిపోయిందని అనుకో! ఇంకెప్పటికీ దొంగతనం చేయనని మాట ఇవ్వు” అని నా దగ్గర నుండి మాట తీసుకుంది! లేని దేవుడు ముందు ఎన్నటికీ దొంగతనం చేయనని ప్రమాణం ఆవిడ మీద ఒట్టు వేయించుకుంది! ఒట్టు చెప్పితే ఎవరి మీద ఒట్టు వేస్తామో వారి ప్రాణాలు పోతాయని నానుడి ఉంది గదా! దానితో నాకు ఉన్న అమ్మ బలహీనత వలన ఆ క్షణము నుండి దొంగతనాలు చేయడం పూర్తిగా మానివేశాను! నేను చివరిసారిగా దొంగతనం చేసిన ఆ వస్తువును అదేరోజు సాయంత్రం కల్లా మళ్ళీ మేము ఇద్దరం వెళ్లి ఆ వైద్యుడు తాతకి అమ్మ ఇచ్చింది! నా చిలిపి దొంగతనం విషయము అప్పుడు పూర్తిగా ఆయనకి చెబితే… అప్పుడు ఆయన “అమ్మాయి! అది వాడి తప్పు కాదు! వాడికి తెలియకుండానే జరుగుతోంది! ఇది ఒక రకమైన మనోవ్యాధి! కంగారు పడకు! మందులతో నయమవుతుంది! నీమీద, నీ మాట మీద నమ్మకం వాడికుంటే చెప్పినట్లుగా వాడు నడుచుకుంటాడు! ఇదిగో ఈ మందులు వాడు! తాగే నీటిలో కలిపి ఇవ్వు! అన్నీ ఆరు నెలల్లో అన్నీ సర్దుకుంటాయి! వారికి ఇతరుల వస్తువులు తీసుకోవాలనే ఆలోచనలను, దొంగతనం చేయాలనే ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయని” ధైర్యం చెప్పి పంపించారు! ఆ విషయం అప్పుడు నాకు తెలియదు! కానీ కొన్నాళ్ళకి తెలిసింది! కానీ నాకు మాత్రం అమ్మ మీద ఒట్టు ప్రమాణము వలన ఆమె మీద ఉన్న ప్రేమ, అభిమానం వలన నాలో ఈ మార్పు వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం! కానీ ఆనాడు అమ్మ మీద ప్రమాణం చేయకపోతే ఈ పాటికి ఈ దొంగతనాల వల్ల నేను శ్రీకృష్ణ జన్మస్థానం లో ఉండే వాడినేమో! ఎవరికి తెలుసు! అలవాట్లు కాస్త అవసరాలుగా మారుతాయి కదా! చిలిపి దొంగతనాలు కాస్త పెద్ద దొంగతనాలకి దారి తీస్తే ఏమి జరిగేదో కదా! చిన్నగా ఉన్నప్పుడే దొంగ తలంపులు మొలకెత్తుతున్నప్పుడే అణిచి వేయటం వలన జైల్లో ఉండవలసిన వాడిని కాస్త జనంలో ఉన్నాను!
ఇక మా ఇద్దరికీ పతంజలి అష్టాంగ యోగ విధానము చేయలేమని అర్థమయింది! అమ్మ కోసం నేను నాకున్న దొంగ బుద్ధి వదిలించుకున్నాను కదా! అలాగే మనస్సును యోగ సాధన వైపు మార్చే సరళ విధానం ఏదైనా ఉందేమోనని వివిధ గ్రంథాలు చదవడం ఆరంభించాము! అందుకు బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ విధానము కనబడింది ! దానిని చేస్తే ఎలా ఉంటుందో అని మేమిద్దరం నిర్ణయించుకున్నాము! దీనినే సరళ లేదా సహజ యోగం అంటారు! ఆ తరువాత ఏమి జరిగిందో మీకు తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా!
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*************************
గమనిక: మేము పతంజలి అష్టాంగ యోగ విద్య విధానం చేయవద్దని చెప్పటం లేదు! కాకపోతే అది మన వంటికి సరిపడదని… దానికి మేము ఖచ్చితమైన న్యాయం చేయలేదని నాకు అర్థమైనది! దానితో యోగము మనస్ఫూర్తిగా మేము చేయలేదని గ్రహించడం జరిగినది! అందరికీ మాకు లాగానే జరగాలని లేదు కదా! ఎవరికి ఎరుక! ఏ పుట్టలో ఏ పాముందో! ఎవరికి ఏ సాధన సరిపోతుందో… ఎవరికి తెలుసు! మీకు నచ్చింది నాకు నచ్చదు! నాకు నచ్చినది మీకు నచ్చాలనే నియమం లేదు కదా! ఏమంటారు నిజమే కదా! మాకు ఒంటికి సరిపడే మాకు నచ్చే సాధన కోసం వెతుకులాట అన్నమాట! అందువలన అందరికీ అందుబాటులో ఉండాలని పతంజలి అష్టాంగ యోగం గురించి గ్రంధాలలోనూ, పుస్తకాలను సేకరించి పెట్టుకున్న విషయ సమాచారమును మీ ముందు ఉంచుతున్నాను! ఇది మీరు మనస్పూర్తిగా చేయగలరని నమ్మకం కలిగితే ఈ సాధనా మార్గంలో ప్రయాణించి ఈ సాధన చేసుకోవచ్చు! ఆలోచన మీదే… ఆచరణ మీదే… నిర్ణయం కూడా మీదే! ఏమంటారు నిజమే కదా! ఇంకెందుకు ఆలస్యం! దీనిని చదవటం ఆరంభించండి!
పతంజలి యోగ శాస్త్రం: యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనస్సు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు.. క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.
యోగ సూత్రములు:
పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి. అవి క్రమముగ: సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు. కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట. కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటుల కనబడదు.
ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.
సమాధి పాదము:
సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.
మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.
అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.
సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసట, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకు వంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవసరమైన ప్రశాంతత పొందవచ్చు.
చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.
వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.
సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.
ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునినియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతునిని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.
పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.
తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.
సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.
సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.
ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.
ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించేరు.
సాధన పాదము:
ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.
ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.
ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలు, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.
సత్వ తమో రజోగుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.
ధారణ, ధ్యానం, సమాధి – అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.
విభూతి పాదము:
సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.
కైవల్య పాదము:
ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో ఈ పాదము ముగుస్తుంది.
పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)
1. యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
2. నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
3. ఆసనం: ఆసనం అంటే యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ ఆసనాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు, అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
5. ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
6. ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింతన . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి). గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.
7. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనస్సును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనస్సుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతనలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైకించుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
8. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.
భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిpatanjali yogam goorchi cheppatam bagundi kaani chaala in-depth subject, mee chilipi dongathanalu adi ela daataru ane vivarana bagundi.
రిప్లయితొలగించండి