అధ్యాయం 34


నాకు అర్ధము కాని విషయాలు…

నాకు ఇప్పటికీ విచిత్ర శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం! ఇది ఎలా మనిషి పుట్టుక, జీవన విధానము, వివాహము, సంతానము, ఆరోగ్యము, మన విషయాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది? నాకు అర్థమయ్యేది కాదు! కేవలము నవగ్రహాల ఆధారముగా జాతక చక్రం లో ఉండే గ్రహసంచార గ్రహస్థితుల ఆధారంగా ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరో చెప్పినట్లుగా అదే ఖచ్చితంగా జరగడం నాకు అర్థం కాని విషయం గా ఉండేది! 

మనం పుట్టకముందే మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మన రూపురేఖలు, మన లింగం ఏమిటో, మన పేర్లేమిటో, మన పూర్తి వివరాలు, మన జీవితాలు, ప్రమాదాలు దోషాలు ఇలా ఖచ్చితంగా...తు.చ.తప్పకుండా చెప్పే జ్యోతిష్యపండితులు ఒక్కపుడు ఉన్నారు! ఇప్పుడు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చును! కేవలం గ్రహాల ఆధారంగానే ప్రశ్న కాలము ద్వారా మన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఎలా చెప్పగలుగుతాం? నేను ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే నా జాతకం చూసి ఆ గ్రహ పరిహారాలు చేసుకునే సరికి…. ఎవరో చెప్పినట్లుగా నా ఆర్థిక సమస్యలు అంతవరకు దొరకని పరిష్కార మార్గాలు దొరకడం నాకు అర్థం కాని విషయం! ఒక కేజీ న్నర నువ్వులు లేదా గోధుమలు లేదా నవధాన్యాలు ఎవరికో దానము చేస్తే అప్పటిదాకా మనకున్న మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎలా తొలగుతున్నాయో ఇప్పటిదాకా నాకు అర్థం కాని విషయం! అంతెందుకు నా జాతకంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఫలాన నెలలో వస్తాయని జ్యోతిష్కుడు ద్వారా తెలుసుకుని పరిహారాలు చేయకుండా ఏమి జరుగుతుందో చూడాలనే ఆసక్తి కలిగినది! వారు చెప్పిన నెలకి నాలుగు నెలల పాటు తీవ్రమైన పంటి నొప్పితో బాధ పడాల్సి వచ్చింది! వీటిని తట్టుకోలేక పోయాను! మందులు వాడి నేను కొంతమేర ఉపశమనం ఇచ్చింది! కానీ పూర్తిగా పరిష్కార మార్గం చూపించలేక పోయినాయి! కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి గ్రహస్థితి నాకు ఉన్నదని తెలుసుకుని అప్పుడు ఆ జ్యోతిష్కుడు చెప్పిన పరిహారాలు చేసుకోగానే ఒక రోగికి నేను సేవ చేసే యోగం వచ్చినది! అంటే రోగి కావాల్సిన చోట ఆ రోగికి నేను సేవ చేశాను అన్న మాట! పరిహారాలు చేస్తే ఇలా మన గ్రహస్థితి ఎలా మారుతుందో నాకు అర్థం కాని విషయం గానే ఉండేది! అలాగే గ్రహ దానాలు ద్వారా గ్రహ ప్రభావం వలన మనకు ఉన్న చెడు గ్రహబాధలు ఎలా తొలగుతాయో ఇప్పటికీ అర్థం కాని విషయం గానే ఉండేది!


 అలాగే రాహుకాలము, నవమి ఘడియలు, అష్టమి తిథులు, మంగళవారం, శుక్ర, శని, వారాలలో చేయకూడని పనులు, ఇలాంటి విషయాలలో కావాలని నేను ఎన్నోసార్లు చేసి అవమానాలు పొందడం జరిగినది! ఉదాహరణకి నవమినాడు ప్రయాణం చేస్తే రెండు సార్లు అదే చోటికి ప్రయాణించ వలసి వస్తుంది అనేది నానుడి శాస్త్ర వచనం! ఇది నిజమా కాదా అనుకొని మా అక్క వాళ్ళ ఇంటికి కావాలని నేను నవమి వెళ్ళేవాడిని! ఏదో కారణాంతరం వలన మర్నాడు లేదా మూడు రోజుల తర్వాత మళ్లీ అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చేది! ఎన్నో సార్లు ఇది నవమి నాడు చేసిన ప్రయాణం తిరిగి రెండోసారి చేసేవాడిని! అంతెందుకు శనివారం నాడు నూనెలు కొనవద్దని శాస్త్రవచనం! కొంటే ఏం జరుగుతుందో చూద్దామని గావాలని ఇంటిలోనికి వంటకి కావలసిన నూనెలు కొనేవాడిని! అప్పటిదాకా బాగానే ఉండేది! వారానికల్లా టీవీ లేదా ఫోను లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరో చెప్పినట్లుగా రిపేరింగ్ కి వచ్చేవి లేకపోతే ఇనుప వస్తువులకు సంబంధించినవి  రిపేరింగ్ వచ్చేవి! ఇలా పలుమార్లు జరిగేసరికి దానితో శనివారం ఎట్టిపరిస్థితుల్లోనూ నూనెలు కొనకూడదని అలాగే ఇతరులు వాడిన ఇనుప వస్తువులు తీసుకోకూడదని నా జీవితంలో మనోబలంగా నిశ్చయించుకోవడము జరిగినది!

 అలాగే కొంతమేర వాస్తు శాస్త్ర విషయాలు నమ్మక తప్పలేదు! ఒక వాస్తు పండితుడు మా ఇంటి నుంచి ఆగ్నేయ మూల డబ్బులు ఉంటే ధన బీరువా ఉంచరాదని డబ్బులు కూడా అగ్ని లాగా ఆవిరై పోతాయని చెప్పడం జరిగింది! అప్పుడు నేను ఈ విషయం నమ్మలేదు పట్టించుకోలేదు! కావాలని ఆగ్నేయ మూలలో ధన బీరువా ఉంచిన ఆరు నెలలకి మా ఆవిడకి, నాకు ఉద్యోగాలు పోయినాయి! తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చినాయి! ఎక్కడికెళ్లినా అప్పుగా డబ్బులు దొరకలేదు! కనీసం కొత్త ఉద్యోగాలు దొరకలేదు! వ్యాపారాలు కలిసి రాలేదు! ఈ బీరువాని ఈసారి కుబేర స్థానం లో ఉంచి చూడమని చెప్పడముతో… దాంతో ఆ స్థానంలో పెట్టడం వలన అనుకోని విధంగా నాకు ధన యోగం కలిగింది! ఇది బీరువా వలన లేదా  నా స్వయంకృషి వలన అనుకుని మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆగ్నేయ మూలలో ఉంచడంతో అదే విచిత్రం గా మళ్లీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భయమేసి యధావిధిగా దానిని కుబేర స్థానం లో ఉండక తప్పలేదు! ఇది ఎలా జరుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు! అసలు ఆగ్నేయ మూలకి నా ధనసంపాదన కి గల సంబంధం ఏమిటో నాకైతే అర్థం కాని విషయం గానే ఉండిపోయింది! 

అలాగే విపరీత శబ్ద పాండిత్య గ్రంధాలు నేను బాగా చదవడం వలన అనేక ధర్మ సందేహాలు వచ్చేవి! ఉదాహరణకు విదురుడి నీతి శాస్త్రం తీసుకుంటే కోరి వచ్చిన ఆడదాని కోరిక తప్పకుండా తీర్చాలి లేదంటే అది మహాపాపం అవుతుంది అని చెప్పడం జరిగింది! అదే మనుధర్మశాస్త్రం తీసుకుంటే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం మహా పాపం అని చెప్పడం జరిగినది! మరి ఈ రెండు శాస్త్రాల్లో ఏది నిజం నాకు అర్థం కాని విషయం గానే ఉండిపోయింది! యోగ సాధనలో స్త్రీ,ధన వ్యామోహము సాధనకి అడ్డంకులని రామకృష్ణ పరమహంస చెప్పినారు! అదే రమణ మహర్షి అయితే సాధన లో ఉన్నా కూడా మనస్సు ఆధీనమైనవారికి మనస్సుకు నచ్చిన స్త్రీ తో సంయోగం చేయవచ్చు అని చెప్పడం జరిగినది! మరి ఈ రెండు భావాలలో ఏది నిజమో నాకు అర్థం కాలేదు! యోగివేమన మొదట స్త్రీలోలుడుకదా! మరి చివరికి ఆయన యోగసిద్ధి ఎలా పొందినాడో నాకు అర్థం కాలేదు! అలాగే తుకారాం భక్తుడికి పరస్త్రీ పరీక్షలు పెడితే వాటిని కాదని ఆమె తన శిష్యురాలిగా మారిందని వారి చరిత్ర ద్వారా తెలుస్తోంది! అంటే సాధనకి స్త్రీ/పురుష మాయవుతారా లేదా అనేది నాకు అర్ధముకానివిషయముగానే ఉంది! ఇంకా యోగసాధన విషయానికొస్తే కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలినీ మార్గాలు కూడా ఉన్నాయి! సాధనకు ఏదో ఒక మార్గం ఉంచకుండా ఇలా పలు మార్గాలు ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు అర్ధముకానివిషయముగానే ఉంది ! ఏదో ఒక దేవుడు ఏదో ఒక విధి విధానం ఉంటే చచ్చినట్లుగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ విధివిధానము చేసిన ఏకైక స్వరూపం నందు ఐక్యం చెందేవారు గదా! ఇలా పలు అవకాశాలు ఉండటం వలన మనస్సుకి నచ్చిన మార్గము అలాగే మనస్సుకి నచ్చిన దైవస్వరూపము తెలుసుకొని మనస్సు ఆధీనమైసరికి వాడి జన్మ అంతమవ్వడము లేదా మాయలో పడటము జరుగుతోంది గదా!అవకాశాలు, అదృష్టాలు అలాగే సుఖాలు లేదా కష్టాలు ఎక్కువైనా కూడా జీవుడు తట్టుకోలేడని నా ప్రగాఢ విశ్వాసం! కానీ కొన్ని మత విధానాలలో ఏకత్వం ఉన్నా కూడా వారు ఎందుకు మనస్సును స్థిరంగా నిలబెట్టలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు !ఇంకా శకున విషయాలకు వస్తే ఫలాన శకునము ఎదురైతే ఫలానా ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులు ఎలా అంత ఖచ్చితంగా తెలుసు కున్నారో నాకు అర్థం కాలేదు ! అలాగే బంధువులు వస్తున్నారని కాకులకి ఎలా తెలుస్తుంది? తెల్లవారుజాము కోడి ఎలా కూత పెడుతుంది! దేవాలయాలలో వెలిగించే అఖండ దీపారాధన ఒకవేళ పొరపాటున కొండెక్కితే ఆరునెలలలో దొంగలు పడతారు అని చెప్పిన విషయాలు అలాగే శాస్త్రం ద్వారా, కలల శాస్త్రం ద్వారా ఫలానా భవిష్యత్తు సంఘటనలు జరుగుతాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్పినారో నాకు అర్ధం కాని విషయాలు! ఇది ఇలాగే జరుగుతుందని మన పూర్వీకులు ఎలా తెలుసుకొని శాస్త్ర రచనలు చేసినారో నాకైతే అర్థం కాని విషయాలు! ఇవి ఇలా ఉంటే వివిధ క్షేత్రాలలో ఉన్న విచిత్ర విషయాలు అలాగే ఈ ప్రకృతిలో ఉన్న విచిత్రాలు తెలుసుకోవాలని ఉందా...అయితే దానికి మీరు ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

**************************************

గమనిక: భారతీయ శాస్త్ర విషయాలు నమ్మడం నమ్మకపోవడం మీ వంతు మీ ఇష్టం! కేవలం నా అనుభవాలు మీతో నేను పంచుకోవడం జరిగింది అని గ్రహించండి! నా దృష్టిలో భవిష్యత్తు పరిస్థితులకు ఎలా సిద్ధపడాలో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుంటే… మన ఇల్లు ఎలా ఉంటే మనకు సౌకర్యంగా ఎలా ఉంటుందో వాస్తు తెలిపితే … చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనులు తెలుసుకోవడం వలన మానసిక శారీరక సమస్యలు తగ్గుతాయి అని నాకు అర్థం అయింది! అలాగే యోగసాధనలో పాతివ్రత్య ధర్మమును తప్పకుండా పాటించాలి! ఎప్పుడైతే సాధకుడు ఇంద్రియనిగ్రహం కలిగి ఉంటాడో అప్పుడే వారికి ప్రకృతి వశం అవుతుంది! సాధకుడు జితేంద్రియుడు అయ్యాడో లేదో అని ప్రకృతిమాత ఇలా కామమాయ పరీక్షలు పెడుతుందని వాటిని దాటుకున్న వారికి మాత్రమే తను వశం అవుతుందని నేను తెలుసుకున్న సత్య జ్ఞానము! అలాగే ఎవరైతే ఇంద్రియనిగ్రహం శక్తిని కలిగి ఉంటారో అనగా రతి సమయంలో వీర్య స్కలనం కాకుండా నిలబడతారో వారికి స్త్రీ వ్యామోహం ఉండదు! ఇలాంటి వారు వివాహం చేసుకున్న పరస్త్రీ వ్యామోహం లో ఉన్న కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు! ఎందుకంటే వీరు మనస్సుతో సంయోగం చేయరు! శరీరముతోనే రాసక్రీడలు చేస్తారు! ఇలాంటి  ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండటం చాలా చాలా అతి క్లిష్టమైన ప్రక్రియ అవుతుంది! ఇలాంటి నిగ్రహశక్తి లేని వాడు పరస్త్రీ వ్యామోహం లో పడితే మాత్రం స్త్రీ లేదా పరపురుష వ్యామోహంలోపడితే ఒక్క నిమిషం ఇంద్రియనిగ్రహం కూలిపోతే వారి జన్మ వృధా అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును! తద్వారా పాప భారం పెరిగి పోయి సాధనా శక్తిని కోల్పోయి అధోగతి పాలైయినవారిని నేను చాలా మందిని చూడటం జరిగింది! కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి! కాకపోతే ఇలాంటి యోగసాధకులు గృహస్థాశ్రమము లోనికి అడుగు పెట్టినప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా యోగ సాధన యందు ఆసక్తి సాధన యందు సాధనాల ప్రాప్తి కలిగి ఉండాలి లేనిచో ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారి సంసారం అటు సంసార జీవితానికి పనికి రాకుండ ఇటు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రాకుండా పోతుందని గ్రహించండి! ఈ గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా యోగసాధకులు జీవితమును అనుభవించేవారిగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం లేదంటే నరకమే అవుతుంది లేదంటే ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారికి నరకప్రాయమే అవుతుంది ! ఇలాంటివారు బ్రహ్మచర్య దీక్షతో ఏకాంతంగా సాధన చేసుకోవటానికి కూడా వీలు ఉండదు! ఇక సాధన విధానం అనేది మన మనస్సు ఏ విధానంలో మన వశమై...స్ధిరమై...నిశ్చలమవుతుందో...తెలుసుకోవాలి! అందుకు తగ్గట్లుగా వాటిని అదుపులో ఉంచేందుకు వివిధ రకాల విధివిధానాలు నేర్పడం జరిగినది నాకు అర్థమైంది! ఉదాహరణకి ఒకరికి తీపి ఇష్టం ఉంటే మరొకరికి కారం వేరే వారికి పులుపు ఇష్టం ఉంటే ఎలా ఉన్నాయో… ఒక మనస్సులో సుమారుగా 84 లక్షల కోరికలు ఉన్నాయి! ఎందుకంటే రూపము లేని మనస్సు రూపం ఉన్న వస్తువుల మీద వ్యక్తుల మీద మమకారాల పెంచుకోవడంవలన 84 లక్షల జీవులను 36 కోట్ల మంది దైవాలుగా పున:జన్మలు ఎత్తుతోంది! ఇంతటి మహా మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలని మనకి అన్ని సాధనాలు ఉన్నాయి! ఒక్క మనస్సు స్థితికి ఒక సాధన విధానం ఉన్నది! దానిని మన పూర్వీకులు కుదించి  ఐదు మార్గాలలో అనగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన కుండలిని మార్గాలుగా ఏర్పరచినారు! వీటిలో ఏదో ఒక మార్గంలో మనం మనస్సు కాస్త మన మాయలో పడి మనకి వశము అవుతుందని నేను గ్రహించాను! ఇలా శాస్త్రాలను నమ్మండి! గుడ్డిగా నమ్మి మోసపోకండి! అవసరాలు తీర్చే వరకే నమ్మాలి! గుడ్డిగా నమ్మితే అవసరాలే అలవాటుగా మారితే శాస్త్ర పరిధులు దాటే ప్రమాదమున్నదని తెలుసుకోండి ! ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకోవడం అన్ని విధాల మనందరికీ మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeku artham kaani vishayaalu naaku kuda artham kaaledu kaani meeru cheppina konamlo chusthe ye ibbandi undadani anduke shasthrala gurinchi thelsukovalani arthamaindi..

    రిప్లయితొలగించండి