నిజ వెంకన్న భక్తుడి దర్శనం
కర్ణపిశాచి దెబ్బకి నా చదువు అటకెక్కింది! చదువులో విఘ్నాలు ఏర్పడినాయి! ఇంటిలో అనుమానాలు అవమానాలు పెరిగినాయి! నేను ఏదో చేస్తున్నాను అని ఏదో దాస్తున్నానని సందేహాలు నా తల్లిదండ్రులను వెంటాడిన కానీ నన్ను అడగలేదు! అలాగని నన్ను తిట్టకుండా ఉండలేరు! వయస్సుకి వచ్చిన ప్రతి వారికి ఎదురైన అనుమానపు అనుభవాలే అని నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది! ఇంతలో నా చదువుకు విఘ్నాలు రావడంతో తిరిగి నేను గుడిలో పూజాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది! దాంతో ప్రతి రోజు జిజ్ఞాసి నన్ను కలవడానికి గుడికి వచ్చేవాడు! రెండు లేదా మూడు గంటల పాటు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ గడిపేవాడిని! మాకు ఆ ధ్యాస తప్ప వేరే విషయం ఉండేది కాదు! అమ్మాయిలను చూసి చొంగ కార్చుకొనే వయసులో ఉన్న మేము… వారి మీద వైరాగ్య భావాలు ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచనలు చేసేవాళ్లం! ఒకరోజు అనుకోకుండా జిజ్ఞాసికి నా శ్రీశైల క్షేత్రం లో జరిగిన అన్ని రకాల దైవధ్యాన అనుభవాలు చెప్పి …. “నాలాంటి నిజ భక్తుడిని నువ్వు ఇంత వరకు ఎవరిని చూసి ఉండవు”… అని చెప్పి వాడి వైపు గర్వంగా చూస్తూ చూశాను! వాడు నన్ను చూసి “అవునా? నిజమా! ఈ మాత్రానికే నువ్వు నిజ భక్తుడివి అనుకుంటే సరిపోతుందా! మాకు తెలియాలి కదా! మాకు అనిపించాలి కదా! నిన్ను చూస్తుంటే పుస్తక వాక్యాలు చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగి లాగానే కనబడుతున్నావ్! నువ్వు ఇంకా భక్తి మార్గం లోనికి ప్రవేశించలేదు లేదా జ్ఞానమార్గంలో ను ప్రవేశించలేదు! అలాగే ధ్యాన మార్గంలోను కూడా ప్రవేశించలేదు! ఏ మార్గంలో నువ్వు ఎక్కడా ప్రవేశించినట్లుగా నాకు అనిపించడం లేదు! ఏ సాధనామార్గంలో లేనివాడివి! నీకు నువ్వే నిజ భక్తుడు అనుకుంటే సరిపోతుందా… కేవలం నువ్వు ప్రసాదాలు పంచే ప్రసాదభక్తుడివేనని తెలుసుకో ! అంతెందుకు నీకు నిజభక్తులను చూడాలంటే చెప్పు! మా ఇంటి దగ్గరలో ఉన్న రమణ అనే తిరుపతి వెంకన్న నిజ భక్తుడిని తీసుకుని వస్తాను! ఆయనను చూసి నీవే తెల్చుకో! నువ్వు నిజభక్తుడివో...ఆయనో తెల్చుకో!” అని చెప్పి వెళ్ళిపోయాడు! దీని యమ్మ! ఏమిటి? నా ఊరిలో నాకు తెలియకుండానే వెంకన్న భక్తుడు ఉన్నాడా! వామ్మో! వాడు నన్ను మించిన భక్తుడా? నామ దేవుడికి.. ఘోరా భక్తుడి చేతిలో జరిగిన అవమానం…. రేపు నా జీవితంలో జరగదు కదా! వామ్మో! ఈ జిజ్ఞాసి ఏదో ఒక మాట అనేసి నన్ను రెచ్చగొట్టి వెళ్లిపోతాడు! ఆ తర్వాత నేను జుట్టు పీక్కుకోవడమే తప్ప ఏమీ చేయలేను! సరే రేపు ఏం జరుగుతుందో చూద్దాం…. అనుకుని ఆ రాత్రి నిద్ర పట్టని రాత్రి అయినది!
మరుసటి రోజు సాయంత్రానికి గుడికి జిజ్ఞాసి ఒక మధ్య వయస్సుఉన్న వ్యక్తిని చేతబట్టుకుని వచ్చినాడు! వెంకన్న స్వామి లాగానే నామాలు పెట్టుకున్నాడు! వెంకన్న ఎత్తు లాగానే ఆరడుగులు ఉన్నాడు! చేతిలో ఏకతార ఉన్నది! బాగా జుట్టున్న కూడ ముడి వేసుకున్నాడు! చూడగానే ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ, తేజస్సు కొట్టుకువచ్చినట్లుగా కనబడసాగింది! సాక్షాత్తు తిరుపతి వెంకన్నను చూసినట్లుగా… ఇతనిని చూడగానే అనిపించినది! వామ్మో! ఏమి మంత్రోపాసన! సాక్షాత్తు వెంకన్నను తనలో ఇముడ్చుకున్నాడు! అతడు నవ్వుతుంటే ఏదో మోహన శక్తి నాకు ఆ నవ్వులో కనపడింది! అదే ముఖం చూడకుండా ఉండలేని స్థితి! అదే ఆయన ఆడపిల్లయితే ముద్దుపెట్టుకోకుండా ఉండలేని స్థితి! ఖచ్చితంగా ఎంతటి బ్రహ్మచారి కూడా ఇతను ఆడపిల్ల అయితే సంసారి కావాల్సిందేనని నాలో నేను అనుకున్నాను! నా దీనావస్థను గమనించిన జిజ్ఞాసి చిరునవ్వు నవ్వే సరికి నేను ఈ లోకమునకు రావడం జరిగినది! ఆయన అమాయకముగా తన పేరు రమణ అని… తన సాధన భక్తి వివరాలు నాతో చెప్పడం చూస్తుంటే… అతని నిశ్చల భక్తికి నేనే దాసోహం అవుతానేమో అని నాకు అనిపించింది! అతడు అన్నమయ్య రాగాలు ఆలపించే సరికి కళ్ళముందు లీలామాత్రంగా తిరుపతి వెంకన్న స్వామి సజీవమూర్తిగా కనిపిస్తాడని… ఆ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో గుర్తు పెట్టుకుని…. ఆయన రూపమును ఒక తెల్లని దుప్పటి మీద ఆయన మనో రూపమును గీసినాడని నాతో చెప్పడం జరిగింది! దాంతో ఆయన గీసిన వస్త్రమును… రేపు మర్చిపోకుండా తీసుకుని రమ్మని చెప్పి… ప్రతిరోజు గుడికి రమ్మని చెప్పి… నా జిజ్ఞాసి వైపు తిరిగి చిరునవ్వు నవ్వి ఆ రోజు మాత్రం మా సత్సాంగానికి స్వస్తి పలికినాము!
రమణ గీసిన వెంకన్న బొమ్మ
మరుసటి రోజు జిజ్ఞాసి మరియు రమణ ఇద్దరూ కలిసి గుడికి రావటం… నేను కోరినట్లుగానే రమణ గీసిన వెంకన్న బొమ్మ ఉన్న దుప్పటి చూపించేసరికి నా మతి పోయింది! గావాలంటే పైన పెట్టిన ఫోటో నిజమైన తిరుపతి వెంకన్న ఫోటో(1978)...అలాగే క్రింద పెట్టిన ఫోటో ఈయన గీసిన బొమ్మ...ఈ రెండింటికి మీకు ఏమైనా తేడా కనపడుతోందా...లేదు కదా! ఇంత దగ్గరగా తిరుపతి వెంకన్నను చూస్తున్నానని నాకు కొన్ని క్షణాలపాటు అనిపించింది! అంతవరకు ఈ గీసిన వెంకన్న దుప్పటి ని చూడని జిజ్ఞాసిగూడ అదే పరిస్థితిలో ఉన్నారని… నేను తెలుసుకునే సరికి నాకు నవ్వు వచ్చింది! ఆనందమేసింది! ఇలాంటి నిష్కామ భక్తునిని కలిసినందుకు… ఏదో తెలియని ఆనందానుభూతి కొన్ని క్షణాల పాటు ఉన్నది! మాటల మధ్యలో నేను జాతకాలు చెపుతానని తెలుసుకుని… అతడు సాధనా జీవిత విషయాలను చెప్పమని ఒత్తిడి చేయడంతో…. అతడి జాతకము లో జరిగిన విషయాలు ….జరగబోయే విషయాలను చూడటం జరిగింది! గతజన్మలో యోగి అని… కానీ ఒక యోగినిని వివాహమాడతానని ఆమెకు మాట ఇచ్చి… ఆ జన్మలో ఆమెను వివాహాము చేసుకోకుండా తనువు చాలించారని… ప్రస్తుత జన్మలో ఆ యోగిని ఒక స్త్రీ మూర్తిగా జన్మించి… ఇతడు యోగసాధనకు మాయగా మారుతుందని…. రాబోవు కాలంలో ఏ స్త్రీ మూర్తిని వివాహమును చేసుకోకపోతే యోగ సాధన పరిసమాప్తి చెందుతుందని లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని నా వాక్కు ద్వారా చెప్పడం జరిగినది!
నేను ఉన్నది ఉన్నట్లుగా ఏమి దాచకుండా చెప్పినందుకు ఆయన సంతోషించి నన్ను పూర్తిగా నమ్మటం ఆరంభించాడు! నన్ను ఒక యోగసాధన గురువుగా భావించుకుని అతను సాధన ధర్మసందేహాలు తీర్చుకునే వారు! కాని నాకు మాత్రం ఏమాత్రం తెలిసేది కాదు !కానీ నన్ను జిజ్ఞాసి అలాగే యోగి రమణ ఎన్నో ఆధ్యాత్మిక ధర్మసందేహాలు తీర్చుకునేవారు! ఎన్నో సాధన సందేహాలు తీర్చుకునేవారు! నాకున్న వాక్సిద్ధి వలన నాకే తెలియని ఎన్నో విషయాలు నా వాక్ నుండి అనర్గళంగా వచ్చేవి! ఏమి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు! అలాగని గుర్తుపెట్టుకుని స్థితి ఉండేది కాదు! వారి అడిగినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఉత్తేజము కలిగి నా వాక్ ద్వారా వారికి కావాల్సిన విషయాలు బయటికి వచ్చేవి! ఒకవేళ తెలియకపోతే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయా పుస్తకాలు నా దగ్గర రావటం…. వాటిని చదవటం…. వారికి తెలియని విషయాలను తెలుసుకుని… ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రతి రోజు ముగ్గురం చర్చించుకునేవాళ్ళం! వాదించుకునే వాళ్ళు ! ఒక సమాధానం కట్టుబడి ఉండే వాళ్ళం! ఇలా మా ముగ్గురు స్నేహం జరుగుతున్న సమయంలో ఊర్లో వాళ్ళ దృష్టి అలాగే ఇంట్లో వాళ్ళ దృష్టికి మా ఆధ్యాత్మిక ప్రసంగాలు విషయాలు తెలిసినాయి! దాంతో వీళ్లంతా సన్యాసులుగా కాకుండా సన్నాసులు గా మారతారు! పుట్టుక లేని దేవుడి గురించి వివరించే స్థాయిలో మీరు ఉన్నారా అంటూ మా ముందే ఎగతాళి చేయడం ఆరంభించారు! మా మీద జోకులు వేసుకుని వాళ్లు! అయినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు! మాకు ఆధ్యాత్మిక విషయం తప్ప మరే ఏ విషయం మా చర్చకి వచ్చేది కాదు! మేము ముగ్గురము కలిస్తే కనిపించని దైవమును ఎలా కనిపిస్తాడని ఆలోచనలు చేసేవాళ్లం! పుస్తకాల్లో చెప్పిన సంప్రదాయాలు…. గ్రంథ పారాయణాలు చేసేవాళ్లం! కానీ ఎలాంటి అనుభవాలు కలిగేవి కావు! సంతృప్తినిచ్చేది కావు! ఇలాంటి స్థితిలో మేము ఉండగానే మేం ముగ్గురం కలుసుకో కూడదని…. ఎక్కడా కూడా మాట్లాడకూడదని నా మీద ఆంక్షలు పెట్టేవారు! మమ్మల్ని కలవనీయకుండా బంధించేవారు! తిట్టేవారు! రానురాను మా మీద బాగా తీవ్రమైన ఒత్తిడి పెంచారు! ఎక్కడ మేము సన్యాసులు అవుతామని వీళ్ళ భయం అని మాకు తెలిసింది! యోగ ముంటే యోగి కాకుండా ఎవరు ఆపలేరని నాకు ఒక్కడికే తెలుసు! కానీ ప్రకృతి కూడా నాతో ఆడుకోవడం ఆరంభించినది!మేము మాట్లాడుకునే సమయానికి అకాల వర్షాలు లేదా అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కలిగి విఘ్నాలు ఉండేవి! దాంతో మాకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి సమయం రానురాను తగ్గిపోతూ వచ్చింది! ఉన్నత చదువుల నిమిత్తం జిజ్ఞాసి వేరే ఊరికి వెళ్ళి పోవడం అలాగే ఉన్నత ఉద్యోగం కోసం యోగి రమణ వేరే ఊరికి పోయే సరికి మా ఆధ్యాత్మికత పాండిత్యమునకు ఆటంకం ఏర్పడింది! వీరు లేకపోయేసరికి నన్ను పట్టించుకునే వాడు… నన్ను గుర్తించేవాడు లేకపోయే సరికి.. నేను నా చదువు మీద ఏకాగ్రత పెట్టటం ఆరంభించాను!
కొన్ని నెలల తర్వాత యోగి రమణకి తల్లిదండ్రుల ఒత్తిడి మేర…. ఒక స్త్రీమూర్తిని ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపించినారని … శోభనం గదిలో అమ్మాయిని చూసి…. అమ్మవారి లాగా భావించి స్తోత్రము చేయగానే…. ఆమె భయపడి అతడిని వదిలి పెట్టి వెళ్ళిపోయింది అని తెలిసినది! దాంతో అతను వైరాగ్యం చెంది… మిడిమిడి జ్ఞానంతో పుస్తకములో ఉన్న అన్ని రకాల యోగ సాధనలు చేసి …ఉన్న దంతాలు కూడా… ఊడి పోయేటట్లుగా సాధన చేసి…. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో…. తెలియని సాధన స్థితిలో ఉండి…. అయోమయానికి గురవుతున్నారు అని తెలిసింది! ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో… ఎలా ఉన్నాడో కూడా తెలియని స్థితి! నాకు అందనంత దూరంలో ఉన్నాడు అని అనుకున్నాను! ఏమి చేయగలం! విధిరాతను ఎవరూ మార్చలేరని… ఉన్నది తెలుసుకుని ఆచరించడం తప్ప….. ఏమీ చేయలేమని తెలిసిన…. జరిగే దానిని జరగకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరని ఆయన జీవితమే అందుకు ఉదాహరణ గా నిలిచిపోయింది! వివాహ ప్రక్రియ వలన తన యోగ సాధన ఆగిపోతుందని…. ఎన్నో సంవత్సరాలు ముందుగా తెలుసుకున్న కూడా ఏమీ లాభం? కనిపించని దేవుడు …. అతనికి ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఎంతకూ కనిపించకపోయేసరికి ఆస్తికుడు కాస్తా నాస్తికుడిగా మారిపోయినాడని తెలిసి… ఏమీ చేయలేని స్థితిలో మేమిద్దరం ఉండిపోయాము! అప్పుడు యోగి రమణ జీవితం లాగా మా యోగసాధన జీవితం స్రీమూర్తుల మహా మాయ దగ్గర ఆగిపోకూడదని మేము నిర్ణయించుకున్నాము! ఇలా అసలు మనము ఈయనకిలాగా నిజముగానే దైవ చింతన దేనికి? అసలు అవసరమా? అనే సాధన సందేహము మా మదిలో వచ్చినది! దీనికోసము మేము పుస్తక-గ్రంధాలు చదవడము ఆరంభించినాము! అంటే నేను ఆధ్యాత్మిక శబ్ధపాండిత్యములోనికి అడుగుపెట్టడము జరిగినది! నాకు వచ్చిన సాధన ధర్మసందేహలకి శబ్ధపాండిత్యము వలన సమాధానాలు దొరికినాయి! నాకు వచ్చిన ధర్మసందేహలు ఏమిటో...వాటికి నేను తెలుసుకున్న సమాధానాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా... మీకు తెలియాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!
శుభంభూయాత్
పరమహంస పవనానంద
************************************
గమనిక:యోగసాధన చెయ్యాలని అనుకునేవారు ఎన్నటికి వివాహాము చేసుకోవద్దు! ఒకవేళ చేసుకొనే పరిస్ధితి వస్తే మాత్రము యోగసాధన చేసేవారిని లేదా ఆధ్యాతిక విషయాలయందు అమితాసక్తి ఉన్న వారిని మాత్రమే వివాహాము చేసుకొండి!లేదంటే మీ జీవితము ఇటు భోగ జీవితానికి లేదా యోగ జీవితానికి పనికి రాకుండా పోతుంది!అలాగే బ్రహ్మచారి పేరుతో లేదా గృహస్ధ ధర్మము పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు! పెట్టుకొని మీరు నాశనమవ్వడమే గాకుండా కుటుంబ వ్యవస్ధను అలాగే సమాజ వ్యవస్ధను నాశనము చేసినవారు అవుతారని గ్రహించండి! ఇలా తమ జీవితాలను నాశనము చేసుకున్న తల్లిదండ్రులను, బ్రహ్మచారులను, యోగసాధకులను, పీఠాధిపతులను,మంత్రోపసాకులను నా స్వానుభవములో చాలామందిని చూడటము జరిగినది!తస్మాత్ జాగ్రత్త!
ఇక యోగిరమణ విషయానికి వస్తే...జిజ్ఞాసి నేను ఉన్నచోట తను ఉంటే నన్ను చూడటానికి మాత్రము వచ్చేవాడు! కాని యోగి రమణ మాత్రము నేను ఎక్కడ ఉన్న అనగా ఊళ్ళో ఉన్న లేదా లేకపోయిన నేను ఉన్నచోటు తెలుసుకొని అక్కడకి ప్రతివారము నాకోసము వచ్చేవాడు! కొన్ని సం!!రాల తర్వాత నాకు వచ్చిన జన్మాంతర జ్ఞాన సిద్ధి వలన ఇతను నా పంచశిష్యులలో మూడోవాడని...ఇతనికి యోగి రమణ దీక్షనామముతో సాధన చేయించి మోక్షప్రాప్తిని మేము కలిగించాలని తెలుసుకున్నాము!ఇది కాస్తా నాకు ప్రారబ్ధ కర్మగా మారడముతో… మాతోపాటుగా ఇతనికి కాశివాసము చేయించి...అక్కడే కపాలమోక్షప్రాప్తి కలిగించాలని...ఇతనికి మాయందు చూపిన భక్తివిశ్వాసమునకు సంతసించి పరమగురువుగా మేము అనుగ్రహించిన వరము! ఇక అతనికి ఈ యోగమున్నదో లేదో అతనికే తెలియాలి! కాలమే సమాధానమివ్వాలి! అందాకా ఈ నిజ శిష్యుడికోసము ఒక యోగగురువుగా మేము ఎదురుచూడక తప్పదుగదా! ఇతనికున్న తిరుపతి వెంకన్న నిజభక్తి వలన అది కాస్తా గురుభక్తిగా మారి ఒక గురువే ఈ శిష్యుడి కోసము ఎదురుచూస్తూన్నాడు అంటే...నిజభక్తి యెట్టిదో ఆలోచించండి!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిnija venkanna bhakthudu, yogi ramana thanu venkanna ni geeyatam, jathakam chaduvukovatanike thappa andulo edi maarchalemu ani, vivaaham chesukovalanukunte yoga saadhana gurinchi ishtamaina, thelisina vallane chesukiovalani...ramana gaari nija bhakthiki oka guruvu wait cheyatam ante entha nija bhakti yo theliyajesinanduku dhanyavaadalu
రిప్లయితొలగించండి