అధ్యాయం 37


సాధన కి గురువు అవసరమా….

ఇలా మేము ఎంచుకున్న వివిధ సాధన మార్గాలలో మాకు కలిగిన అనుభవాల రీత్యా ఏవీ కూడా మాకు సరిగ్గా సరిపోకపోయేసరికి మా తల తిరగటం మొదలైంది! ఏమి చేయాలో….  ఎలా చేయాలో…. ఏవిధంగా సిద్ధి పొందాలో మాకు అర్థం కాని స్థితి! అందరికీ వారికి తగ్గట్టుగా మేము చేసిన విధానాలలో ఏదో ఒక విధానం సరిపోతే… మా ఇద్దరికీ మాకు ఎందుకు సరిపోవటం లేదో మాకు అర్థం కావటం లేదు! చాలా రోజులు దీనికోసం మధనపడ్డాను! ఫలితము శూన్యం… శ్రమ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు! ఇలా కాదనుకుని మేము మాత్రం మొదటి నుంచి మరొకసారి చేసిన విధివిధానాలు మళ్లీ చేసుకుంటూ వచ్చినాను! ఫలితాల్లో ఎలాంటి మార్పు రాలేదు! అవే మాయలు తిరిగి మిమ్మల్ని వెంటాడినాయి! వాటిని ఎలా వదిల్చించుకోవాలో తెలిసేది కాదు! మనస్సుని ఎలా ఆధీనము చేసుకోవాలో అర్ధమై చచ్చేది గాదు! నిద్రలేని రాత్రులు తో కూడిన రోజులు గడిచిపోతున్నాయి! అప్పుడు ఇలా కాదనుకుని ఆధ్యాత్మిక గ్రంథాలు తిరగవేయడం మొదలు పెట్టాను! అన్ని చోట్ల తప్పనిసరిగా గురువు ఉండాలని… వారు ఇచ్చే గురుమంత్రము వలన మనకి శక్తిపాతము కల్గి… మనలో కుండలినిశక్తిని జాగృతి చేసి… మనలో మాయ నశించడము జరుగుతుందని చెప్పడం జరిగింది! మాకైతే అర్థం కాలేదు!

కొత్తగా ఈ గురువు అంటే ఎవరు? ఈయన మన సాధనకు ఎలా సహాయపడతాడో నాకు అర్థం కాలేదు! ఇంతలో కొన్నిరోజులకి మేమిద్దరం కబీరుదాసు అనే భక్తి రస చిత్రం చూడటం జరిగింది! ఇందులో ఆయన గురువు కోసము అలాగే గురుమంత్రం కోసం ఎంత తపన పడతాడు తెలుసుకున్నాము! ఇందులో రామానుజాచార్యుడు నుండి మంత్రోపదేశం పొందటానికి ఆయన నడిచి వెళ్లే మెట్ల కింద ఒక మెట్టు గా ఈ కబీరుదాసు పడుకుని ఉండగా…. ఈ విషయం తెలియని రామానుజాచార్యుడు ఆయన నిత్యమూ రామనామస్మరణ మంత్రముతో మననం చేస్తూ ఉండగా… ఈయన తొక్కడము… వారు మూడు సార్లు రామా రామా రామా అనుకుని బాధపడటం… రామనామమే  గురుమంత్రముగా భావించి…. కబీరుదాసు తీసుకున్నాడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను! దానితో యోగసాధనకి తప్పనిసరిగా గురువు అనుగ్రహం పొందవలసి ఉంటుంది అని గ్రహించాను! ఇంతవరకు బాగానే ఉంది! అసలు సాధనకి అలాగే గురువుకి గల సంబంధం ఏమిటన్నది నాకైతే అర్థం కాలేదు! గురువులు కోసం ఎందుకు సాధకుడు తపన పడాలో అర్థం కాలేదు! గురువు లేకపోతే సాధన లేదా? అనే ధర్మ సందేహం వచ్చినది! అప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే ఏ విద్య అయినా గురువు తప్పనిసరిగా ఉండాలని… అదే ఆధ్యాత్మిక విద్య కోసం అయితే ఆత్మ సాక్షాత్కారమును పొందిన పరిపూర్ణ గురువు అనుగ్రహం పొందితే కాని…  సాధకుడికి తన ఆత్మ జ్యోతి వెలగదని… ఆత్మజ్ఞానము పొందలేడని… గురువు యొక్క సాధన స్థాయిని బట్టి… సాధకుడి సాధనస్థాయి ఉంటుందని… ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకి మాత్రమే తను పొందిన విధానాలు, మాయలు, మర్మాలు, ఆటంకాలు, అవాంతరాలు తెలుసు ….కాబట్టి తను ప్రయాణించే మార్గంలో సాధకుడిని ప్రయాణింప చేసి తను పొందిన స్థితికి తన సాధకుడిని కూడా తీసుకు వెళతారని మేము గ్రహించాము!

సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీ రాముడికి- వసిష్ఠమహాముని, శ్రీకృష్ణుడికి- సాందీపుడు, రామకృష్ణ పరమహంస- తోతాపురి, నామ దేవుడికి- విఠోబా ,శిరిడి సాయిబాబా- వెంకూసా ,రమణ మహర్షి- అరుణాచలేశ్వరుడు మహా గురువులుగా ఉండి వారి సాధన పరిసమాప్తి చేసినారు అని తెలియగానే మా ఇద్దరికి నోట మాట రాలేదు! ఇంతవరకు బాగానే ఉంది! సాధనకి గురువు అవసరమని తెలిసినది! కానీ గురువు వలన సాధకుడి సాధన ఎలా పరిసమాప్తి అవుతుందో మాకు అర్ధము కాలేదు! అప్పుడు దీనిమీద పరిశోధన చేయగా… ఆదిలో తొలి మానవుడికి కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రము వద్ద ఉండేది! దానితో ఆయన కాస్త ఆదియోగి గా ఆదిదేవుడిగా … కొన్నాళ్లు బాగానే సాగింది! కానీ ఆలోచన, సంకల్పము, స్పందన అనే భావాలు కలిగినప్పుడు… ఇంతటి లోకోత్తరమైన ప్రకృతి దృశ్యాలకు…. ఆయన మరచిపోయి ఆనందం పొందుతూ… ఒంటరిగా ఒంటరితనాన్ని భరించలేక…. తనతోపాటు ఎవరైనా తనలాంటి మరొకరు తోడు ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చేసినాడు! ఎందుకంటే తమ బ్రహ్మరంధ్రము వద్ద సహనశక్తి అనే మాయ ఉంటుంది! ఇది ఎప్పుడైతే కోల్పోవడం మొదలవుతుందో అప్పుడు జీవుడికి ఆలోచన మొదలైంది! అపుడు వీరి కుండలీనిశక్తి బ్రహ్మరంధ్రము నుండి హృదయచక్రమునకు చేరుకుంది! ఎప్పుడైతే తను కావాలని స్పందించాడో దానితో కాస్త రెండు సమాన భాగాలుగా అనగా అర్ధనారీశ్వర తత్వం గా విడిపోయి ఇష్టకామేశ్వరుడిగా...ఇష్టకామేశ్వరీ అనగా ఆదిదేవుడిగా- ఆదిపరాశక్తిగా ఏర్పడి నారు! ఎందుకంటే ఈ హృదయచక్రము వద్ద ఇష్టకోరిక మాయ ఉంటుంది గదా! ఆ తర్వాత వీరిద్దరికి సత్వ ,రజో, తమో గుణాల వలన వీరు తనతో పాటుగా అనేక మందిని సృష్టించాలి అని చెప్పి… అండపిండ బ్రహ్మాండాలను కలిగిన లోకమును సృష్టించడం జరిగినది! అనగా ఇష్టకామేశ్వరి కామేశ్వరి గా రూపాంతరం చెందినది అన్నమాట!

ఇంతవరకు బాగానే ఉంది!దానితో, దైవ కోటిని సృష్టించడానికి కోసం… వీరు సంకల్పము చేయగానే…. వీరి కుండలినీశక్తి హృదయ చక్రం నుండి సహస్రార చక్రమునకు చేరుకున్నది! దానితో వీరు 36 కోట్ల దైవ స్వరూపాలుగా! కోటి మంది పరమాత్మలుగా విడిపోయారు! ఆ తర్వాత జీవకోటి సృష్టించడానికి కోసం… వీరు సంకల్పము చేయగానే వీరి కుండలినీశక్తి సహస్రార చక్రము నుండి ఆజ్ఞాచక్రమునకు నకు చేరుకున్నది! ఆ తర్వాత84 లక్షల జీవజాతులుగా మంది విడిపోయారు! ఈ మూల ప్రకృతి యొక్క స్థితిగతుల ఆశపడటముతో …. వీరికి కుండలిని శక్తి కాస్త విశుద్ధి చక్రము నకు చేరుకున్నది!  ఆ తర్వాత ఆదిదేవుడు కోపావేశాలకి ఈ సృష్టి వారికి తెలియకుండానే నాశనం అవ్వడం…. ఎందుకు నాశనం అవుతుంది తెలియక భయానికి గురి అవ్వడం జరగడంతో… వీరికి కుండలిని శక్తి కాస్త అనాహత చక్రమందు చేరుకోవడం జరిగింది! ఇలా కాదనుకుని సృష్టికి ఆది దేవతలను, అధిష్టాన దైవాలు, వారిగా విభజన చెందుతూ త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ ఏర్పరచుకుని జరగడంతో…. వీరి కుండలినీశక్తి కాస్త మణిపూరక చక్రానికి చేరుకున్నది!ఇవి సృష్టి యొక్క స్థితి కోసం పరిరక్షణ కోసం ఆదిదేవుడు ఆదిశక్తి ఉండాలని అనుకోవడం వీరు స్వాధిష్టాన చక్రానికి చేరుకున్నది! ఆపై మూల ప్రకృతికి మూలముగా తామే వుండాలని అనుకోవడం… వీరి కుండలినీశక్తి మూలాధారచక్రంలో చేరుకున్నది! అంటే కుండలినీ శక్తి యొక్క ప్రయాణం మొట్టమొదట బ్రహ్మరంధ్రము వద్ద మొదలై చివరికి మూలధార చక్రమునకు చేరుకోవడంతో కాస్త వీరు మహామాయలలో పడిపోవడంతో….  తాము పరమాత్మ అనే అపస్మారక స్థితి వలన మర్చిపోయి… జీవమాయ వల్ల జీవాత్మగా మారి పోయి… మూలాధారచక్రము చేరుకుని…. కుండలినీశక్తి నిద్రపోసాగింది! అంటే విశ్వాత్మ కాస్త జీవాత్మగా… ఆదిదేవుడు కాస్త ఆది మానవుడు గా...ఆదిపరాశక్తి కాస్తా ఆదిమానవురాలిగా మారినారని గ్రహించి ఉంటారు!ఇలా వీరిద్దరు కూడా తమకు అపస్మారక మాయ వలన తెలిసిన జ్ఞానం మర్చి పోవడం వలన మహామాయ కి ఆధీనమైనారు! అంటే యజమాని కాస్త పని వాడిగా సేవలు చేయడం ఆరంభించారు! వీరిద్ధరే ఆదిదైవాలని అనే విషయాన్ని మర్చిపోయి… మాయస్వరూపమే ఆదిదైవముగా వీరిద్దరూ పూజించే అధమ స్థాయికి చేరుకోవడం జరిగినది! దానితో ఈ మాయ కాస్త భయము, ఆనందము, కామము, క్రోధము, లోభము, మదము , మోహ , మాత్సర్యము అనే వ్యసనాలు గా విడిపోయి వీరిని… వీరు సృష్టించిన మూల ప్రకృతి ని స్వాధీనం చేసుకుని ఆడించటం మొదలు పెట్టింది !దానితో ఈ మాయ చెప్పినట్లుగా మూల ప్రకృతి నడుచుకోవడం ఆరంభమైనది! కొన్నేళ్ళు బాగానే సాగింది! ఈ మాయ పెట్టే బాధలు తట్టుకోలేక ఆదిదైవాలకి నెమ్మది నెమ్మదిగా తను సృష్టించిన విశ్వసృష్టి మీద విరక్తి తో కూడిన వైరాగ్య భావాలు కలిగి నాయి! దాంతో వీరికి తెలియకుండానే మళ్లీ బ్రహ్మ జ్ఞానం వైపు అడుగులు వేయడం ప్రారంభించారు! అనగా తాను దిగివచ్చిన మెట్లు పైకి ఎక్కడము అన్నమాట! ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వైపు వెళ్లడం ప్రారంభం అయినది! దానితో మాయను వదిలించుకోవటానికి వీరిద్దరూ నానా కష్టాలు పడ్డారు! నేను అంటే ఏమిటో ఎరుక పరుచుకోవడానికి ఎన్నో యోగ విధివిధానాలు ఏర్పరచుకున్నారు!అందులో ధర్మార్థకామమోక్షాలు, కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన,కుండలీని మార్గాలలో… మూలాధార చక్రము నుండి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చక్రమును దాటుకుంటూ ముందుకు వచ్చే సరికి…. తిరిగి బ్రహ్మరంధ్రమునకు వచ్చేసరికి…. తనతో ఇన్నాళ్లు ఆడుకున్న మహామాయ కాస్త వీరికి ఆధీనమైంది! దానితో యజమాని కాస్త యజమాని గానే ఉన్నాడు! పని వాడు కాస్త పని వాడి గానే ఉన్నాడు! జ్ఞానం పొందితే మాయ కాస్త మాయమవుతుందని వీరిద్దరూ స్వానుభవ జ్ఞానము పొందటంతో బ్రహ్మ జ్ఞాన ప్రదాతగా ఆదిదక్షిణామూర్తిగా ఆదిదేవుడు అలాగే జ్ఞాన ప్రదాతగా ఆదిశక్తి కాస్త వేదమాతగా అవతరించినారు! మళ్ళీ వీరిద్దరూ కలిసి విశ్వ గురువుగా శ్రీ దత్తాత్రేయ రూపంలో అవతరించి లోకా నికి ఉన్నారు! దానితో మాయ నుండి విముక్తి చెంది మోక్షం కోరుకునే వారి కోసం కాస్త ఆది గురువు గా అలాగే ఆదిగురువు కాస్త… దైవాలుగా మారుతూ… సాధకుడికి వారి సాధన స్థితిని బట్టి వారి యోగ చక్రాల యందు కుండలీని శక్తిని ఉంచుతున్నారని అని తెలిసింది! అంటే నిజ గురువు వలన మనం మర్చిపోయిన బ్రహ్మజ్ఞానం జ్ఞప్తికి తెస్తారని అలాగే నిద్రపోతున్న కుండలినీ శక్తిని శక్తిపాతసిద్ధి ద్వారా జాగృతం చేసి యోగ చక్రాలు యందు ప్రయాణింప చేస్తారని  తెలుసుకుని ఆశ్చర్యం చెంది నాము! మాకు ఇలా ఎన్నాళ్లు ఇలాంటి నిజ గురువు దొరకక పోవడం వల్లనే మేము పూర్తిగా గ్రంథాల ద్వారా చేసిన కర్మ, భక్తి ,జ్ఞాన, ధ్యాన,కుండలినీ మార్గంలో ఎన్నో అవాంతరాలు వచ్చినాయని తెలుసుకుని నేను గతుక్కుమన్నాను! ఇన్నాళ్లు నిజ గురువు లేకుండా సాధన చేయడం ఎంతో తప్పు అని తెలుసుకుని బాధపడి నాము! దానితో అసలు గురువంటేఎవరు? గురువులు ఎంతమంది ఉంటారు? శక్తిపాతసిద్ధి అంటే ఏమిటి? దానితో మనకు ఎలా జాగృతి అవుతుందో? గురువు అనుగ్రహం ఎలా పొందాలి అనే ప్రశ్నలు మా మదిలో కి వచ్చి నాయి! దానితో మళ్ళీ సద్గురువులు చరిత్రలు అనగా విశ్వ గురువులు దత్తాత్రేయస్వామి వారి దత్త గురు చరిత్ర పారాయణం చేయడం ఆరంభించినాము!

గురువు అంటే ఎవరు?
“గురువు...గురూపదేశం...గురుత్వాకర్షణ శక్తి”

గురు లేదా గురువు (సంస్కృతం: गुरु) విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి (Mother) తొలి గురువు. గురుకుల విద్యా విధానంలో   గురువు పాత్ర అత్యంత కీలకమైనది. 
ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు (Teachers) మరియు ఉపన్యాసకులు (Lecturers) వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.
శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ 
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్థనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం. గురువులేనివాడు అంధుడితో సమానం అనే నానుడి ఉంది. వ్యక్తికి తొలి గురువు అమ్మే, కానీ గురువు మాత్రం రెండో తల్లి. మనిషి రెండు సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తల్లిదండ్రుల కలయికతో తొలిసారి... విశ్వసనీయమైన గురువును అంగీకరించడం ద్వారా రెండోసారి జన్మిస్తాడు. గాయత్రి మాత సహకారంతో వేద విజ్ఞానం, వ్యక్తిత్వం అలవరుచుకోవడంలో గురువు తండ్రి పాత్రను పోషిస్తాడు. జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి గురువు బోధనలు ఉపయోగపడతాయి. గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలోనే మనిషి కూరుకుపోతాడు. ఆచార్యుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడే వ్యక్తి కూడా. 

ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. గురు బ్రహ్మ, గురూర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీయుల విశ్వాసం! గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అఙ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు. మనస్సు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనస్సు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనస్సు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు...ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనస్సు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకూ ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి, లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్నీ, మోహాన్నీ తుంచివేసే శక్తి సంపన్నుడు. గు కారో అంధకారస్య, రు కారో తన్నిరోధకః అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు. గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్సమానుడు. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజీవులైనారు. దత్తాత్రేయుడిని, షిర్డీ సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.

ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది. శంకరాచార్యులు భాష్యం రాసిన పది ఉపనిషత్తులతో ఇది కూడా ఒకటి. వ్యక్తి తనకు తోచిన విధంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన అనుభవం పొందుతాడు. మార్గంలో సూచనలు లేకపోతే ప్రయాణం దారి తప్పే అవకాశాలు ఎక్కువ. జ్ఞాన బోధ వల్ల జీవితానికి మార్గనిర్దేశం కలుగుతుంది. అది గురువు వల్లే సాధ్యం. అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణం, అంధుడి ప్రయాణం లాంటిది. గురువు సమాచారం అందించి, మద్దతు ఇచ్చి సహాయం చేస్తాడు. మానవజాతి మొదలైనప్పటి నుంచి గురుశిష్య పరంపర ఆరంభమైంది. యోగశాస్త్రం ప్రకారం ‘సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే గురువులందరికీ గురువు. సమస్త జ్ఞానానికి, పరిపూర్ణతకు అతడే బీజం’. గురువు అనే తత్త్వం లేక సిద్ధాంతం గురువు రూపం ద్వారా పనిచేస్తుంది. పూర్వ కాలంలో శిష్యులకు గురువు బాధ్యతలను అప్పగించేవాడు. ఇక్కడ గురువు చెప్పిన పనిని, ప్రశ్నించకుండా శిష్యుడు చేయాలి. కాని నేటి తరంలో శిష్యులకు స్వతంత్రం ఎక్కువైంది. వేదకాలంలో గురువులను శిష్యులు నిత్యం ప్రసన్నం చేసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంత వరకూ శిష్యుడు గురువు సంరక్షణలో ఉండేవాడు. గురువులను గౌరవించి, ఆరాధించే నిజమైన శిష్యుడు విద్యలో పురోగమించేవాడు.

విద్య బోధించేవారూ గురువులే. అయితే వారు జీవితానికి ఒక భాగాన్ని మాత్రమే అందించగలుగుతారు. జీవితానికి పరిపూర్ణత లభించేది మాత్రం పూర్ణ గురువు దగ్గరే. సంపూర్ణ జ్ఞానం పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలు, మానసిక ఒత్తిడులు, టెన్షన్లతో సమాజం స్పీడుగా వెళ్లిపోతూ ఉంటుంది. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతూ ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. రెండవది ఆధ్యాత్మిక జీవితం. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండి మనం గుర్తించక వదిలివేయబడిన చిన్న అణువు లాంటిది. అణువే అయినా దాన్ని చూడటం అంత తేలిక కాదు. దీన్ని కనుక్కోలేకపోతే, భౌతిక, ఆధ్యాత్మికాలు రెండూ ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవటం? పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపటం? భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మేరకు పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పి నిజమైన జ్ఞానాన్ని అందించేవారే నిజగురువు. అలాంటి గురువు లభించిన వారి జీవితం ధన్యం.

శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా వ్రాశాడు.

"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు
5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -

(1)  స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.

గురువును ఎందుకు స్మరించాలి? ఎందుకు దర్శించాలి? కృతఙ్ఞతలు ఎందుకు తెలపాలి? అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై, సమాజానికి ఉపయోగపడతారు. అలా గురువు సమాజ సేవచేస్తున్నాడు. స్వర్ణకారుడు బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణం ధరించేవారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేలను చక్కగా చదునుచేసి మొక్కలు నాటి ఎరువువేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలనూ, పుష్పాలనూ ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు. గురువు మార్గదర్శకుడు, తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలడు.ఎన్నో జన్మల పుణ్యం వలన మానవజన్మ వస్తుంది. ఈ మానవజీవితం సార్ధకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి. గురువే తల్లి, తండ్రి, దైవం. గురువును మించిన దైవం లేదు. గురువు వాక్కే వేదవాక్కు. గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు.

బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది. యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు.తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మెుదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణానెక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించినాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యెుక్క ఆజ్ఞను పాలించాడు. మార్గ దర్శనము! ప్రజలు వారికి తోచిన విధముగా ప్రయాణము చేయుచూ దానికి సంబంధించిన అనుభవములను పొందుదురు. మార్గసూచనలు లేనిచో ప్రయాణమున దారి తప్పుటకు అవకాశములు ఎక్కువ కలవు. జ్ఞాన బోధల వలన జీవితమునకు మార్గనిర్దేశము కలుగును. అస్పష్టమైన ఆలోచనలు కలవాడు, పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణము, గుడ్డివాని ప్రయాణము వంటిది. గురువు సమాచారము అందించి, మద్దతు ఇచ్చి సహాయము చేయును. మార్గము తెలిసి, ఇతరులకు తెలియచేయగలవానిని “గురువు” అని పిలుతురు. ప్రస్తుతకాలములో ఈ పదము పూర్తిగా వక్రీకరింపబడినది. మనకు గురువు అనగా మోసగాడు, లేక దొంగ గురువు. కనుకనే చాలామంది ఎవరినీ కూడా గురువుగా అంగీకరింపక, అజ్ఞానముతో దారి తప్పుచుందురు. ఏ ఒకరిని గురువుగా అంగీకరించలేక ఒకరి తరువాత ఒకరిని మార్చుతూ తిరుగుచుందురు. ఎవరైతే పదార్థమునందు ఆసక్తి, భావోద్వేగమైన మానసిక ప్రవృత్తి కలిగినవారు ఎంత తెలిసిననూ గురువు దగ్గరకు చేరలేరు. గురువులు, పరమగురువులు లేరని కొందరు కపట వాదనలు చేయుదురు. తనను గురించి తెలుసుకొనవలెని తపించువారికి గురువు దర్శనమిచ్చును. ఎవరి సాన్నిధ్యములో మనలో సరియైన మార్పు కలుగుచున్నదో, ఎవరు నిరాడంబరమైన, ఆదర్శమైన జీవితమును జీవించుచున్నారో, ఎవరిని అనుసరించినచో శాంతి లభించునో వారిని సరియైన గురువుగా తెలుసుకొనవచ్చును. నిస్వార్థమైన సేవాతత్వము, పరిపూర్ణత చెందినవానికి గీటురాయి. నిరాడంబరత లోపించినచో ప్రచారము, స్వీయ-ఉన్నతిని కోరుట, డంభము, ధనార్జన మొదలగు వాటియందు బంధింపబడును. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యము కలిగి ఉంటారు. తన చుట్టు చేరిన జీవులకు వారి నిజ స్వరూపమును గుర్తుచేసి, వారు అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవముద్వారా తెలుసుకొనునట్లు వారికి మార్గదర్శకత్వము వహించుటయే వారి లక్ష్యము.నిపుణత కలిగిన మార్గదర్శి పర్వతారోహణమునకు వలెనే, అంతరంగ ప్రయాణమునకు కూడా సరియైన సాధనములు, నిపుణత కలిగిన మార్గనిర్దేశకుడు ఎంతో అవసరము. గురువు కొరకు చూడవలసిన పనిలేదు, ఆయన గురించి మనకు తెలిసిన దానికంటే మనగురించి ఆయనకు ఎక్కువ తెలుసు. మనము గురువును గుర్తించగలిగినచో, మనము ఆయనంత గొప్పవారమే. గురువుయొక్క సాన్నిధ్యము సాధకుడు లేక శిష్యునిలో మార్పు కలిగించును, అది అయస్కాంతము వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పువంటిది. ధ్యానమునకు లేక అధ్యయనమునకు ముందు గురువును గురించిన ఆలోచన, ఆయన సాన్నిధ్యములో చేసిన ధ్యానము వంటిది. గురువుని గురించిన ఆలోచన ఆయన సాన్నిధ్యమును కలిగించును. ఆయన సాన్నిధ్యము మన ప్రజ్ఞను ఊర్ధ్వముఖము కలిగించి మనము చేయు పనిలో నాణ్యతను మెరుగుపరచును. గురువులకే గురువు! మానవజాతి మొదలైనప్పటినుండి జ్ఞానముకూడా ఉన్నట్లుగా, ప్రాచీన శాస్త్రముల ద్వారా తెలియవచ్చుచున్నది. అలాగే గురుశిష్య సాంప్రదాయము. జీవులు ఆవిర్భవించినప్పటినుండి ఇది ఉన్నది. యోగశాస్త్రం ప్రకారం “సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే సమస్త గురువులకు గురువు. సమస్త జ్ఞానమునకు, పరిపూర్ణతకు అతడే బీజము.” సంస్కృతమున అతనిని “గురు” వందురు. అదే జీవులయందలి దైవ-ప్రజ్ఞ. అదిఒక తత్త్వము, మనిషి కాదు. మానవుల కంటే ముందే ఈ అంతరంగ గురువు ఉండి ఉన్నాడు. మనకన్నా ముందుగా వచ్చినవారిచే అతడు గురువుగా సేవింపబడినాడు.

గురువు-తత్త్వము(సిద్ధాంతము)

గురువు అనే తత్త్వము లేక సిద్ధాంతము గురువు యొక్క రూపము ద్వారా పనిచేయును. చాలా మందికి గురువుద్వారా పనిచేయుచున్న గురుతత్వము కంటే గురు రూపమే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అటువంటి వారు ఆ గురువు యొక్క వ్యక్తిత్వము చుట్టూ ఒక విధమైన ఆరాధనా విధానాన్ని, మతాన్ని తయారుచేసి ఇతరుల ఎడల అసూయ కలిగి ఉంటారు. కానీ నిజమునకు ప్రతి గురువు, జగద్గురు తత్వమునకు ప్రతినిధియై ఉండును. ఒకే ఒక గురుతత్త్వము అనేక మంది గురువుల ద్వారా పనిచేయును. ఆ గురుతత్త్వమునే జగద్గురువు అందురు. గురువు మరియు అతని బోధలు: శాశ్వతమైన జ్ఞానమును అందించు గురువులు, ఆదర్శవంతమైన సాధారణ జీవితము కలిగిఉంటూనే అంతరంగ సాధన ఎలా చేయవచ్చునో ఆచరించి చూపించగలరు. ఆధ్యాత్మిక పురోగతి ఆధారముగా, వారు ధ్యానము, ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనము, జీవుల సేవ మొదలైనవి మౌనముగా ఎటువంటి సంచలనము లేకుండా ఆచరించుటను ఉద్ఘాటించెదరు. ఆయా కాలమునకు సరిపోయేటట్లుగా వారు సత్యమును దాని జిజ్ఞాసులకు వారి బోధనల ద్వారా ఆవిష్కరించెదరు. వారి బోధనలు ద్వారా మానవజాతి యందలి ఏకత్వమును, దాని ఉనికికిని ఉన్న సమన్వయమును తెలియచెప్పుదురు. వారు మన జీవితములకు ఆదర్శప్రాయులగుదురు. మనము తరువాతి తరములకు ఆదర్శముగా ఉండుటకు ప్రయత్నించవలెను. ఆధ్యాత్మిక గురు పరంపర: ఆధ్యాత్మిక జ్ఞానము కాలానుగుణముగా తనంతట తాను బహిర్గతమవుతూ ఉంటుంది. కొన్నిసమయాలలో మరుగున ఉండి, కొన్నిసమయాలలో బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ జ్ఞానమును ప్రసారము చేయు సద్గురువులు ఆధ్యాత్మిక గురుపరంపర అని పిలువబడతారు. ప్రాచీన కాలమునుండి వీరు మానవజాతికి వెలుగు మార్గములోనికి మార్గదర్శనము చేయుచున్నారు. 
జ్ఞాన జీవనము:
సద్గురుపరంపర పైననూ, వారి బోధనల మీదను అనేక రకములైన స్పందనలు ఉంటూ ఉంటాయి, ఎలాఅంటే తిరస్కరణలు, పక్షపాతములు, ఊహాజనితములు అని, కొందరు అల్లరిచిల్లరిగా తమకు వారితో పరిచయాలు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారము చేస్తూఉంటారు. చాలా మంది ఈ గురు పరంపర కోసము వెతుకుతూ ఉంటారు, కానీ కనుగొనలేరు, ఎందుకంటే వారు కనీసము ఒక చిన్న సాధనను కూడా అనుసరించకుండుటచేత. సద్గురు పరంపరను అనుసరించువారు సాధారణముగా ఉండి, సామాన్య జీవులలో ఒకడిగా ఉండి, ప్రేమతో, మౌనముగా తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శప్రాయుడై, వారికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు. తెలిసిన జ్ఞానమును ఎక్కువ మాట్లాడేవాని కంటే, దానిని జీవితమున ఆచరించి చూపించినవాడు ఆదర్శప్రాయుడవుతాడు. సద్గురువు ఆత్మకు అద్దము: సద్గురువు మనకు ఎవరో కాదు, మన ఆత్మకు అద్దము వంటివాడు. మార్గదర్శనము కోసము మనము మన వెలుపల వెతుకుచుండుటచేత, మనల్ని మనము తెలుసుకోవటము కోసం ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించి గురుపరంపర మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. గురువు ప్రతిపాదనలు చేయును, మనము వాటిని అందుకొని ఆచరించట కాని, ఆచరించకపోవుట కానీ చేయుదుము. గురువు కేవలము మార్గనిర్దేశము చేయును, ఇతరుల కోసము నిర్ణయములు తీసుకోడు. సాధకుని సమస్యలకు కావలసిన జ్ఞానమును అందించి, అతడే ఆలోచించి తగిన నిర్ణయములు తీసుకొనమని తెలియచేయును. సాధకుడు సూక్ష్మ బుద్ధి కలిగి, నిర్ణయ స్వేచ్ఛ కలిగి, దైవీ సంకల్పముతో ఏకత్వము కలిగి ఉండవలెనని సద్గురువు కోరుకొనును. స్వయం-బాధ్యత: పూర్వపు రోజులలో గురువు, శిష్యునకు బాధ్యతలను అప్పగించేవాడు, నిబంధన ఏమనగా గురువు చెప్పినదానిని ఏదైనా, ప్రశ్నించకుండా శిష్యుడు చేయవలెను. ప్రస్తుతము, శిష్యులు ఇంతకు ముందు కంటే ఎక్కువ స్వతంత్రులైనారు. ఆత్మ యెడల సరియైన బాధ్యతతో ప్రవర్తించేలా నేర్చుకొనవలెను. గురువు ఆత్మతో, ఆత్మ ద్వారా పనిచేయును. జ్ఞాన మార్గమును తెలుసుకొనుటకు కావలసిన స్వేఛ్ఛాయుత నిర్ణయములు తీసుకొనుటను మనము నేర్చుకొనవలెను. మనము చేస్తున్న అన్ని బాధ్యతలను అంగీకరించాల్సి ఉంటుంది. గురువు తన సాన్నిధ్యాన్ని తనకు తానుగా ఇవ్వడు, శిష్యుడు అంతరంగములో గురువుని ప్రార్థించవలెను. గురువుయొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి పొంది పనిచేసుకొనవలెను. అంతరంగము నుండి మార్గనిర్దేశము:గురువు సాధకుని అంతరంగము నుండి మార్గనిర్దేశము చేయును. కొన్ని ప్రాంతములకు వెళ్ళుటకును, కొన్ని నేర్చుకొనుటకును మనకు స్ఫూర్తి కలుగును - జ్యోతిషము, ఛందస్సు లేక హోమియోపతి. మనము ఇది మనకు కలిగిన స్ఫూర్తి అనుకొందుము, కానీ అది అంతరంగము నుండి గురువుచే నిర్దేశించబడినది. వేల సంవత్సరములనుండి ఉన్న పుస్తకము - అకస్మాత్తుగా దానికి ఒకరోజు ఆకర్షితులమవుతాము. ఏదైనా మనము మన అంతర్దృష్టితో ప్రయత్నించినచో దాని హృదయాన్ని అందుకొనగలము. ఈ విధముగా ఎన్నో విషయములు అవగాహన కాగలవు. పదిమంది కొరకు నిస్వార్థముగా పనిచేయగలిగేంతవరకు గురువు మనకు లోపలి నుండి కావలసిన ప్రేరణను అందించుచునే ఉండును.సాన్నిధ్యమును అనుభూతి పొందుట సద్గురువుద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యము జిజ్ఞాసువులో కావలసిన మార్పులను కలిగించును. అయస్కాంత సమక్షములో ఇనుపరజను ఎలా అయితే ఒకరకమైన ఆకారమును పొందునో, ఆవిధముగా సద్గురు సాన్నిధ్యమున జీవితము, జీవిత సన్నివేశముల యందు చక్కని అనుకూలత కలిగి ఆనందభరితమగును. విద్యుత్తు కాంతిగా ఎలా గోచరమగునో, ఆవిధముగా సద్గురువు ద్వారా జ్ఞానము గోచరమగును. ఈ సాన్నిధ్యము వలన మనలో ప్రజ్ఞా వికాసము కలుగును. ఇది గురువు యొక్క భౌతికమైన సాన్నిధ్యము లేక ఆయన వ్యక్తిత్వము వలననో కాదు, గురువుయొక్క సాన్నిధ్యమును అనుభూతి పొందుటచేత.సద్గురు సాన్నిధ్యమును ప్రార్థించుటచేత, మనలను అయస్కాంతీకరించుకొనుటకు వీలగును. గురువుని ధ్యానములో ఊహించి దర్శించుట అనగా అయస్కాంతమును ప్రార్థించుటయే. గురుదర్శనము, ఆయన సాన్నిధ్యము వలన ధ్యానము కుదురును. గురు సాన్నిధ్యము వలన మనంతట మనము అందుకోలేని మూలము నుండి కావలసిన సహాయము అందును. ఇది కేవలము అనుభూతియే కాదు, ఆత్మానుభవమును పొందుట.మార్పులు లేక రూపాంతరము:దీర్ఘకాలము క్రమము తప్పకుండా ధ్యానము చేసినచో, అది మన జీవితములోని పూర్వపు అలవాట్లను తొలగించి, కొత్త తరంగములను స్థిరపరచి జీవితము నందు కావలసిన మార్పుల నిచ్చును. ప్రాథమిక సూత్రము ఏమనగా ప్రపంచమునందు ఎవరిని కలిసినా వారిని ఆత్మ స్వరూపులుగా దర్శించుట. ఏ సంఘటనను కాని, ఏ రూపము యొక్క ప్రవర్తనను కాని తిరస్కరించరాదు. భౌతిక, సూక్ష్మ లోకములందు సమర్థత కలిగి ఉండవలెను: “నేను ప్రపంచములో ఉన్నాను, కాని ప్రపంచము నుండి కాదు”. సద్గురు పరంపర మనకు ఒక ఉదాహరణ, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్లు మనల్ని మనము మార్పుచేసుకొనవచ్చును.ప్రయాణము:ఈ ప్రయాణము సుదీర్ఘము, అనేక జన్మలు పట్టును. ఒక జన్మలోనే ఇది పూర్తి అగునని అనుకొనరాదు. సరిగా కాల పరిమాణమును అవగతము చేసుకొన్నట్లయితే మన పురోగతి నెమ్మదిగా తప్పక జరుగును. గమ్యమును అర్థముచేసుకొని, మార్గము తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకొంటూ ముందుకు సాగవలెను.“ప్రయాణము యొక్క గమ్యము అవగతమైనచో, మానవుడు ఎన్ని అవాంతరాలనైనా దాటగలడు. దూరముగా నున్న వెలుగును దర్శించినచో ప్రయాణమున ఉన్న కష్టాలను లెక్కచేయక ముందుకు సాగును. ఆ వెలుగు ఎన్ని అడుగుల దూరమున్నదో కూడా లెక్కించడు, అతని హృదయము నందు వెలుగుతున్న వెలుగు కోసం!

గురువులు, పరమ గురువులు లేరని కొందరు వాదిస్తారు. తన గురించి తెలుసుకోవాలనే తపించువారికి గురువు దర్శనమిస్తాడు. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజ స్వరూపాన్ని గుర్తుచేసి, అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకొనేటట్టు మార్గదర్శకత్వం చేస్తాడు. గురువు తన సాన్నిధ్యం శిష్యుడిలో మార్పునకు శ్రీకారం చుడుతుంది. అది అయస్కాంతం వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పు లాంటిది. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి ఆయన జన్మ తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం భారతీయ సంప్రదాయం. మామూలు రోజులలో కన్నా గురు పూర్ణిమ నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా లభిస్తాయి. అందుకే ఈ రోజు గురుపూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు. ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనస్సునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనస్సులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి. గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు. గురువులను అత్యంత భక్తి భావంతో పూజించేరోజు. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. వ్యాసమహర్షి మానవజాతి అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవతత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలను, శాస్రాలను అందించిన గురువు. వశిష్టుని మనుమడు, పరాశరమహర్షి కుమారుడు, శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు. గురు పూర్ణిమకు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. గురువు ఒక శిల్పి వంటి వాడు. బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. మంచి గురువు చేతిలోమలచబడేవారుఉత్తమమానవులై, సంస్కారవంతులై, సమాజానికి ఉపయోగపడతారు. ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేథస్సు, తెలివి, నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే పూర్ణ గురువులు. 

మన సాధనలో మంత్రగురువు, దీక్ష గురువు, సద్గురువు, పరమగురువు, ఆది గురువు అనే పంచ గురువులు వస్తారు అని తెలుసుకున్నాము! అనగా మంత్ర గురువు ఇచ్చిన తన గురూపదేశ మంత్రము ద్వారా దైవానుగ్రహము కలిగి దీక్ష గురువు దర్శనం కలుగుతుంది అని నేను గ్రహించాను! నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తి ఈ గురూపదేశము వలన జాగృతి అవుతుందని గ్రహించాను! ఇలా జాగృతి అయిన కుండలినీశక్తిని మన యోగ చక్రాలు యందు ప్రవేశపెట్టడానికి దీక్ష గురువు వస్తారని గ్రహించాను! అలాగే ఆజ్ఞాచక్రము వద్ద ప్రకృతి మాత మాయను దాటించటానికి ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువు వస్తారని అలాగే సహస్రారచక్రము వద్ద మూలప్రకృతి మాయను దాటించటానికి ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలిగే పరమ గురువు వస్తారని అలాగే హృదయ చక్రం వద్ద ఉండే ఇష్టకోరిక మాయను తొలగించడానికి ఆదిగురువు వస్తారని నేను గ్రహించాను! కాకపోతే ఇలాంటి పంచ గురువుల దర్శనం కోసం మనం మన ఇష్టదైవాల అనుగ్రహం తప్పక పొందవలసి ఉంటుంది అని…అలాగే జగత్ గురువులైన జగన్మాత లేదా విశ్వగురువైన దత్తాత్రేయస్వామి లేదా శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహమును… నేను మీకు యోగసాధన అంటే...అనే అధ్యాయములో చెప్పిన రాజు గారు ఏడు చేపల కథ ద్వారా తెలుసుకున్నారు కదా! అదేనండి గురువు అనుగ్రహం పొందాలి అంటే జగన్మాత అనుగ్రహం ఉండాలని…. గొల్ల వాడు అంటే గురువు అని ఆ కథలో చెప్పినాను కదా! గుర్తుకు రాలేదా! గుర్తుకు తెచ్చుకోండి! వస్తుంది! ఇలాంటి గురువు అనుగ్రహం కోసం వారి ఇష్ట దైవాలు వారి వద్దకు పంపించినారు అని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర లో కాళీ మాత అనుగ్రహంతో సద్గురువు అనుగ్రహం  పొందడం జరిగింది! అలాగే భక్త నామదేవుడు జీవిత చరిత్ర లో కూడా పాండురంగడు అనుగ్రహం వలన ఈయనికి ఒక సద్గురువు అనుగ్రహం  పొందడం జరిగింది అని నేను తెలుసుకున్నాను! దానితో గురువు అనుగ్రహం కోసం తప్పనిసరిగా దైవానుగ్రహం కోసం మళ్ళీ దైవారాధన చెయ్యవలసి ఉంటుంది అనే నేను గ్రహించాను! దానితో మేము ఏ దైవారాధన చెయ్యాలో దానికి ఏమి చెయ్యలో అర్థం అవ్వలేదు! 
                                     “గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి”

“గురువు” అంటే బరువైనవాడు” అని అర్థం
“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం ...” లఘువు”
“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం
అధికమైన జ్ఞానం ఉంటే గురువు ... స్వల్పమైన జ్ఞానం ఉంటే లఘువు
లఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరి
క్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం చేసుకుంటూ గురుత్వాన్ని సాధించుకోవాలి
“కఠిన సాధన” ఉన్నప్పుడే గురుత్వం .. కఠిన సాధన లేనప్పుడు లఘుత్వం
“కఠిన సాధన” అంటే ప్రతి దిన, రోజువారీ సాధన
గురువులు ఎప్పుడూ లఘువులకు ఉదాహరణలుగా ఉంటారు
“ఒక వ్యక్తి సాధించింది ఏదైనా .. మరొక వ్యక్తి కూడా సాధించగలడు”
అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవాడే గురువు
“ప్రతి ఒక్కరిలోనూ ‘క్షమత’ ఉన్నది” అని నొక్కి చెప్పేవాడే గురువు
“ఎప్పుడూ సాధనకు తహతహలాడాలి” అని నొక్కి చెప్పేవాడే గురువు
“గురువుగా తయారు కా” అని చెప్పేవాడే .. గురువు
సకల విద్యల్లో, కళల్లో, ఆటలో, పాటల్లో గురువులు ఎప్పుడూ వుంటారు
గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు
గురువు యొక్క సాన్నిధ్యమే “గురుకటాక్షం”  .. గురువు యొక్క చిరునవ్వే “గురుకృప”
గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే గురువు దగ్గర కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది
భూ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి
భూమి యొక్క ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ..
సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి
భూగ్రహం, మరి ఇతర గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు ..
గురువులుగా కావాలని నిశ్చయించుకున్న లఘువులు ..
గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తిక్షేత్రంలో సదా తిరుగుతూ ఉంటారు
గురువులు కావడానికి సంకల్పించిన వారికే గురువులు కనబడతారు కానీ..
గురువులు కావడానికి సంకల్పించని వారికి గురువులు ససేమిరా కనబడరు
చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది
దృష్టిని బట్టే దృశ్యం సాకారాం అవుతుంది
“యతో దృష్టిః .. తథా దృశ్యం”
గురువులుగా కాదలచుకున్న లఘువులకే గురువులు కావాలి
గురువులుగా కాదలచుకున్న లఘువులు చుట్టూ లేకపోయినా .. గురువులకు ఏమీ కొరత లేదు
గురువులుగా కాదలచుకున్న లఘువులు చుట్టూ ఉంటే .. గురువులకు సంతోషం మాత్రం ఉంటుంది
నిన్నటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. నేటి గురువు
నేటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. రేపటి గురువు
ఇదీ గురువుల, లఘువుల కథ ..
“గురుపౌర్ణమి” సందర్భంగా శ్రీగురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు
“వ్యాసపౌర్ణమి” సందర్భంగా ఆదిగురువులైన
శ్రీ వేదవ్యాసుల వారికిసాష్టాంగ ప్రణామాలు

*******************************************
గమనిక: అలాగే యోగ సాధనలో మనలోని కుండలినీశక్తిని జాగృతం ఎవరికివారే స్వయంగా జాగృతి చేసుకోలేరు! ఆత్మసాక్షాత్కారం పొందిన నిజ గురువు మాత్రమే మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేయగలరు! ధర్మము, అర్థము, కామము ఎవరికి వారే స్వయంగా ఒంటరిగా పొందగలరు కానీ మోక్షం పురుషార్ధం పొందాలి అంటే మనకి పంచ గురువులు అనుగ్రహమును పొందవలసి ఉంటుంది! ఒకటి గుర్తుంచుకోండి! దీపము ఎవరి సహాయం లేకుండా ఎలా వెలగదో అదే విధంగా సాధకుడు లో జ్ఞాన జ్యోతి వెలగాలి అంటే గురువు అనుగ్రహము అవసరం తప్పనిసరిగా ఉంటుంది! ఎవరి ఆ స్పర్శ మాత్రం చేస్తే తన శిష్యుడు ఈ మాయా ప్రపంచమంతాపరబ్రహ్మముగా దర్శనమిచ్చిన ఆ వ్యక్తి యే మన నిజ గురువని మనకి చెప్పడం జరిగినది! ఈయనే నిజ గురు బ్రహ్మ అని స్వయంగా గురు గీత ద్వారా సాక్షాత్తూ ఆదియోగి అయిన పరమశివుడు మనకి ఆది గురువు గురించి చెప్పడం జరిగినది! మనిషి జన్మ లభించడం ఎంతో కష్టం… అది పొందాక ముక్తి పొందాలని కోరిక కలగడం చాలా కష్టం…. అది వచ్చాక సద్గురువు అనుగ్రహం  లభించాలని…. ఈ మూడు ప్రక్రియలు కూడా దైవానుగ్రహం వలన మాత్రమే లభ్యం అవుతాయి! అలాగే గురువు సేవకి, గురువు అనుగ్రహనికి దూరమైన వారు గంధర్వులైనను, పితృదేవతలైనను,ఋషులైనను,సిద్ధులైనను, దేవతలైనను,సాధకులైనను మోక్షమును పొందజాలరని మనకి గురుగీత చెప్పడము జరిగినది!

ఇక మా గురువుల విషయానికి వస్తే... అనగా తొలి గురువుగా శిరిడి సాయిబాబా , తొలి మంత్రగురువుగా మా తండ్రిగారు, తొలి భౌతిక దీక్ష గురువుగా శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహముతో... గాయత్రి మంత్రదీక్షతో...స్ధూలశరీరానికి ... పవన్ బాబా దీక్షనామముతో...విశుద్ధచక్రము వద్ధ ప్రారంభ సమాధి స్ధితి పొంది … ఆనంద స్ధితి పొందడము జరిగినది! అలాగే తొలి భౌతిక శబ్ధపాండిత్య గురువుగా విచిత్ర వేదాంతిగారి అనుగ్రహము వలన, విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శ్రీ పవనానంద సరస్వతి దీక్షనామముతో… సూక్ష్మ శరీరంతో ఆజ్ఞా చక్రము వద్ధ యోగ సాధన చేసి సవికల్ప సమాధి స్థితి పొంది… దైవ సాక్షాత్కారం స్థితి పొందడం జరిగింది! అలాగే అనుభవ పాండిత్య గురువుగా శ్రీ సద్గురు శ్రీ త్రైలింగ స్వామి వారి అనుగ్రహము వలన శ్రీ పరమహంస పవనానంద దీక్షనామముతో కారణ శరీరంతో సహస్రార చక్రము వద్ద నిర్వికల్ప సమాధి స్థితిని పొంది… ఆత్మసాక్షాత్కారం స్థితి పొంది … తన సద్గురువు తన ఆదిజన్మ శ్రీ భీష్మాచార్యుడని ఎలా అయితే తెలుసుకొన్నారో అలా తన ఆదిజన్మ శ్రీ వేదవ్యాస అంశయని జ్ఞానానుభూతి పొందడము జరిగినది! తద్వారా ఆత్మానంద స్ధితి పొందడము జరిగినది! అలాగే హృదయ చక్రం వద్ద ఆది గురువు అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహమును పొంది ఇష్ట పవనానంద దీక్షనామముతో సంకల్ప శరీరముతో సాధన చేసి ఆనంద సమాధి స్థితిని పొందడం జరిగినది! అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఆదిపరాశక్తి అనుగ్రహాముతో...ఆకాశ శరీరముతో అనగా స్వప్న శరీరముతో...ఆనంద రహిత సమాధి స్ధితి కోసము సాధన చేస్తూ...తమ పంచ స్వప్నశరీరాలు అన్నియుగూడ ఇక్కడ ఉన్న చితాగ్ని యందు సంపూర్తిగా దహనమవుతూ...తన కన్నతల్లి ప్రేమ మాయను దాటడలేకపోవడముతో...స్ధూల శరీరము స్వప్న శరీరముగా మిగిలిపోయి...ఆపై మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరములు విభూధిగా మారడముతో... స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా మిగిలి పోవడముతో…. బాబా విభూతినాథ్ గా నామముతో మారడము జరిగినదని…. ఈ విధంగా తమ యోగసాధన పరిసమాప్తి చేసుకున్నారని గ్రహించండి! అలాగే వీరు చేసే హోమములందు ఆయా హోమ దేవతలు కాస్తా హోమాగ్నిలో హోమాగ్ని రూపములతో కనిపిస్తారని సర్వసాధారణంగా జరిగే విషయమని భక్త, శిష్యులు గ్రహించడం జరిగినది! సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నిరూపించిన మౌన: బ్రహ్మ జ్ఞాన యోగి అని… ఎవరికీ తెలియకుండా… మంది గురించి ఆలోచించకుండా… మది గురించి ఆలోచన చేస్తున్న గుప్తయోగి అని ఎవరికీ తెలియదు! తను 27 సంవత్సరాలపాటు యోగ సాధన చేసి ఆత్మ పరిశోధకుడిగా మారి సత్యాన్వేషిగా తను తెలుసుకున్న సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవములను అందించడానికి సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్త గా మారి లోకానికి అందించడం జరిగింది!

గురువులను వెతకడానికి వెళితే

గురువు కోసం మేము కాస్తా దైవానుగ్రహం తప్పక పొందాలని తెలుసుకోవడంతో… ఏ దేవుడిని తిరిగి భక్తిగా పూజించాలో మాకు అర్థం కాలేదు! ఎందుకంటే అప్పటికే మాకు విగ్రహారాధన మీద వైరాగ్యం కలిగి ఉన్నది! విగ్రహారాధన అంటే ఒక విధమైన భయం మొదలయింది! మా విగ్రహారాధన బాధల గూర్చి ఇంతకు ముందు మీకు " ఎవరిని పూజించాలి" అనే అధ్యాయములో చెప్పడము జరిగినది గదా! దానితో దైవానుగ్రహము లేకుండా గురువు ను వెతకాలి అని మాకు మేమే ప్రయత్నించాము! మాకు మేమే గురువులను స్వయంగా వెతకటానికి నేను శ్రీశైల క్షేత్రం చేరుకోవడం జరిగినది! మా జిజ్ఞాసి మాత్రం యాత్రానుభవం కోసం గురువులను వెతకడానికి దేశ యాత్ర చేయడానికి బయలుదేరినాడు! నేను శ్రీశైలం చేరుకోవడం జరిగితే వాడేమో భద్రాచలం చేరుకోవడం జరిగినది! ఆపై కొన్నాళ్లపాటు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు !ఎవరికి వారే యమునా తీరే అన్న మాట! ఎవరి గురువును వారే స్వయంగా వెతుకోవడము ఆరంభించినాము! అదే మేము చేసిన అతి పెద్ద తప్పు అని మా ఇద్దరికి తెలియని స్థితి! అంటే గురువులో నిజ గురువులు అలాగే నకిలి గురువులు ఉంటారని మా ఇద్దరికీ అప్పటి దాకా తెలియదు! 

నేను శ్రీశైల క్షేత్రానికి వెళ్లి… యధావిధిగా దైవ దర్శనం చేసుకుని…. అక్కడ కనిపించిన వాడిని ఇక్కడ ఎవరైనా సిద్ధగురువులు ఉన్నారా అని బిచ్చగాడి దగ్గరనుండి సాధువుల దాకా అడగటం ఆరంభించి నాను! కొంతమంది గురువు అంటే ఎవరో మాకు తెలియదు అని… గురువు అనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని… నాకు సమాధానాలు ఎదురయ్యాయి! ఏమిచేయాలో అర్థంకాని స్థితి! గురువు లేకపోతే సాధన ముందుకు వెళ్ళలేని స్ధితి! ఇక్కడేమో ఎంతటి మహత్తర క్షేత్రంలో కనీసం గురువైన కనిపించడం లేదు !గురువును వెతకడం చాలా కష్టమని రాను రాను నాకు బాగా అనిపించసాగింది! దానితో పంచమఠాల నుండి భీముని కొలను దాకా గురువు కోసం వెతకడం ప్రారంభించాను! ఒక చోట ఒక సాధువు వలన దట్టమైన అడవి లోపలకి వెళ్ళగలిగితే గాలిలో తేలే గురువు దొరుకుతాడని...వారి ఆశ్రమవివరాలు …. నాకు అందించే సరికి నా ప్రాణం లేచి వచ్చింది! దానితో నేను ఒక్కడినే ఒంటరిగా ఆశ్రమం వైపు బయలుదేరినాను!ఆ సాధువు చెప్పిన ఆ గురువు యొక్క ఆశ్రమానికి చేరుకోవడం జరిగినది! ఆశ్రమంలో నాలాంటి వాళ్లు చాలా మంది ఇలాంటి గురువు అనుగ్రహం కోసం అక్కడ అప్పటికే ఉన్నారని తెలిసి నేను ఆశ్చర్యమును పొందినాను! ఒకవేళ నేను కూడా గురువు అయితే నాకు కూడా ఇలాంటి గురు సేవలు చేసే శిష్యులను పెట్టుకోవాలని ఆశ కలిగింది! కొద్దిసేపటికి అసలు విషయం తెలిసినది! ఏమిటంటే గురువు దగ్గరికి వెళ్లాలంటే వారి దగ్గర ఉండే ప్రధమశిష్యుల వారికి కావాల్సిన సేవలు చేయాలని ….అప్పుడే అసలు గురువు దగ్గరికి తీసుకు వెళతారని ….అది వారి అనుగ్రహమును బట్టి ఉంటుందని…. సుమారుగా దీని కోసము 3, 5, 7, 9, 12 సంవత్సరాల పాటు వీరికి సేవలు చేస్తే….. అప్పుడు వారికి బుద్ధి కలిగితే…. అసలు గురువు దగ్గరికి తీసుకుని వెళ్ళతారని తెలుసుకుని గతుక్కుమన్నాను! అయినా తప్పదు కదా! గురువు లేకపోతే సాధన ఉండదు! సాధన లేకపోతే మాయ మాయం అవ్వదు! మాయ అవ్వకపోతే జ్ఞానం రాదు! జ్ఞానము రాకపోతే కర్మ క్షయం అవ్వదు! ఇది కాకపోతే పునర్జన్మ ఎత్తి జానెడు పొట్ట కోసం… బెత్తడు సుఖము కోసం…ఉండేది కూటికి పోయేది కాటికి లాంటి జీవితాలు… అనుభవించాలనే భయం మొదలైంది! దానితో ఎలాగైనా ఈ గురువు అనుగ్రహం పొందాలని ఆరు నెలల పాటు గురు సేవ చేయటం ఆరంభించాను! ఈ లోపల అసలు గురువు కోసం ఎంతోమంది ధనవంతులు రావటం…. విలువైన వస్తువులు ఇవ్వటం… ఈయన వారి కోసమే యాగాలు, హోమాలు చేయడం జరుగుతూ ఉండేది! కానీ ఎప్పుడూ కూడా అసలు గురువుని కళ్ళతో చూడడం తప్ప… ఎప్పుడు ప్రధాన శిష్యులు వారితో మాట్లాడనిచ్చేవారు గాదు! కానీ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు సుమారు 11 వేల మంది శిష్యులు సమక్షంలో కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరడం అలాగే నోటి నుండి ఆత్మలింగం తీయ్యడము చూసేసరికి… ఇలాంటి గురువు అనుగ్రహం కోసం ఎన్ని అవమానాలు, వేధింపులు కలిగిన కూడా వాటిని దాటుకుని వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకునేవాడిని!

నేను ఒకటి తలిస్తే… దైవమొకటి తలచినట్లుగా… వారి ప్రధాన శిష్యులలో అకారణంగా మనస్పర్ధలు రావటం మొదలయింది! అపుడు అసలు విషయము బయటపడినది! అది ఏమిటంటే అసలు గురువు తన సాధన శక్తితో గాలిలో లేవటం లేదు అని… ఒక త్రాసు మీద కూర్చుని… అది కనిపించకుండా నల్లటి బట్ట వేసి … ఆయన వెనక వైపు కూడా నల్లని తెర ఉంచడము వలన ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా, ఎవరికీ కనిపించకుండా అసలు గురువు త్రాసులో కూర్చోగానే… నెమ్మదిగా రెండో దాని వైపు దాని దగ్గ బరువులు పెడుతూ  …. సుమారుగా మూడు అడుగులు పైకి లేచే దాకా… రెండో వైపు తన ప్రధాన శిష్యులు పట్టుకుంటారు అని తెలుసుకునే సరికి నాకు ముచ్చెమటలు పట్టడం మొదలైంది! నా స్వామిరంగా! ఈ ముసలాడికి ఏమి తెలివి! ముండాకొడుకు… గురువు పేరుతో వ్యాపారం చేస్తాడా? వామ్మో! అవును కానీ మరి ఈయన ఎలా గాలి నుండి వస్తువులు లేదా నోట్లో నుంచి వస్తువులు సృష్టించి ఇచ్చాడో నాకు అర్థమవ్వలేదు! అప్పుడు గొడవ పడిన ప్రధాని శిష్యుడు దగ్గరికి వెళ్లి నాకున్న ధర్మ సందేహం వాడికి చెప్పే సరికి… వాడు నవ్వుతూ “తమ్ముడు! అదేమీ బ్రహ్మ విద్య కాదు కనికట్టు మాత్రమే! అది ఎలా అంటే మనలో కొంతమంది ఆయన భక్తులలో కలిసి పోతాము! అప్పుడు భక్తులు కోరికలు తీర్చాలని వినతి పత్రాలు ఇస్తున్నట్లుగా… వాడితో పాటు మీకు తెలియకుండా… బంగారపు ఉంగరాలు, గొలుసులు, శివలింగాలు, కుంకుమ ఉండలు,విభూది ఉండలు అప్పుడప్పుడు ఆయనకి మేమే లేచి అందిస్తాం! వీటిని ఆయన లాఘవముగా...చాకచక్యముగా ఎవరికి అనుమానము లేకుండా...ఏవరికి తెలియకుండా …మా దగ్గర నుండి తీసుకుని వాటిని వ్రేళ్ళమధ్య ఇరికించుకుని ఎవరికీ కనిపించకుండా ,ఎవరికి తెలియకుండా చేతులు గాలిలో ఊపుతూ వ్రేళ్ళ మధ్య నుంచి వీటిని తీసి… వారికి బాగా విరాళాలు ఇచ్చిన అమాయక భక్తుల చేతిలో పెడతాడు ! ఇక్కడ వీరికి విభూది… అక్కడేమో ఈయన కోట్లు పొందుతాడు! అంతెందుకు శివరాత్రి నాడు …నోటిలోనుండి ఆత్మలింగం పేరుతో బాణలింగం ఎలా తీస్తారో తెలుసా …. ముందుగానే నోటిలో ఈ బాణలింగ పెట్టుకుని… ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు! ఆ తర్వాత నీళ్లు తాగుతూ తన బుగ్గలు మధ్యనున్న లింగమును నోట్లోంచి బయటకి తీసి ఆత్మలింగాన్ని అందరికీ చూపిస్తూ… దాని రహస్యంగా శిష్యుల మధ్య పోటీ పెట్టి కోట్ల రూపాయలు పొందుతాడు! నిజానికి దాని ఖరీదు 40 రూపాయలు కానీ ఈయన నోటి నుండి రావడం వలన అదే 40 కోట్లు అవుతుంది! ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అని జనాలున్నంత వరకు ఇలాంటి స్వాములు బతికే ఉంటారని….. వాడు ఒక్కొక్క రహస్యం బయట పెడుతూ ఉంటే నాకు చుక్కలు కనపడుతున్నాయి! ఇంతలో అసలు గురువు నుండి నన్ను తీస్కురమ్మని సందేశమును శిష్యుడు వచ్చి నాతో చెప్పే సరికి…వీడి బొంద! ముసలాడికి! నా సేవలు చేయటమే దండగా! పైగా ఇప్పుడు ప్రత్యేక సేవలకోసం రావాలా! వీడియమ్మ...దొరికితే నరకాలని అనిపించి …అక్కడ ఉన్న అమాయక భక్తులు నా మీదకి దండెత్తి వస్తారని అనుమానభయంతో, ఆవేదనతో, వాడికి, వాడి ఆశ్రమానికి, నమస్కారం చేసి గురువు విషయంలో మోసపోయినందుకు బాధపడుతూ దిగులుతో ఇంటిదారి పట్టాను! 

నా పరిస్థితి ఇలా ఉంటే గురువులు కోసం వెళ్లిన జిజ్ఞాసి ఈ నకిలీ గురువులు దెబ్బకి అప్పుడే ఇంటికి చేరుకున్నాడు అని తెలిసి వారి అనుభవాలు తెలుసుకోవడం ఆరంభించాను! వాడు గురువు కోసం దేశ యాత్ర చేశాడని ఈపాటికి తెలుసు కదా! వాడు అనుభవాలేమిటో వారి మాటల ద్వారానే తెలుసుకుందాం! మనవాడు భద్రాచలము నుండి బయలుదేరి ఆపై హరిద్వార్ క్షేత్రమునకు చేరుకున్నాడు! అక్కడ కనిపించిన ఆశ్రమగురువులను సంప్రదించి “నేను ఎవర్ని” అని ప్రశ్నించేసరికి …వాళ్లు బిక్కమొహం వేసి మతి భ్రమణం చెందిన వ్యక్తి అనుకొని “మాకేమి తెలుసు! మరి నువ్వు ఎవరో… ఎవరి అబ్బాయో ఎలా నాకు తెలుస్తుంది” అని చెప్పి తప్పుకున్నారు! మనవాడి ఉద్ధేశ్యము ఏమిటంటే... అరుణాచల మౌనయోగి శ్రీ రమణ మహర్షి వారు చెప్పిన “నేను ఎవరిని” అని ప్రశ్నించుకోండి! తెలుసుకోండి! జ్ఞానం పొందితే… నీవెవరో తెలుసుకుంటే… భగవంతుని తెలుసుకున్నట్లు అవుతుంది… అని తెలుసుకుని… తను ఎవరో తెలిసిన వ్యక్తిని… తన గురువుగా భావించుకుని సాధన చేయాలని తపన తాపత్రయం అన్నమాట! అందుకే కనిపించే ప్రతి వారిని నేను ఎవర్ని అని ప్రశ్నించడము ఆరంభించాడు! అక్కడ కూడా ఎవరూ సమాధానం చెప్పకపోతే…. హిమాలయాల్లో ఉండే గురువుల దగ్గరికి వెళ్ళినాడు! అక్కడ అగుపించిన కొంతమంది అని అడిగితే… “నువ్వు ఎవరో మాకేం తెలుసు ….నువ్వే చెప్పాలి” అన్నారట! మరి కొంతమంది అయితే నేను అంటే ఏమిటి అని వీడు అడిగితే … దానికి వారు “నేను అంటే నేనే” అని సమాధానం చెప్పే సరికి మన వాడికి తల తిరిగింది! కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతి వాడు గురువు కాదని తెలుసుకున్నాడు! దానితో హిమాలయ ప్రాంతాల నుండి ఉజ్జయిని క్షేత్రమునకు వెళ్ళితే... అక్కడ ఉన్న కొంతమంది సాధువులు, సన్యాసులు అడిగితే … వారు కాస్త ఒక ఆశ్రమ గురువు గూర్చి చెప్పి వారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చినారు! ఈయన కాస్త ఆనందభైరవి సాధనలో ఉన్నాడు! సంయోగము నుండి సమాధి పొందవచ్చునని ఈ సిద్ధాంతం! అందుకే ఈయన ఆశ్రమంలో చేరిన ప్రతి స్త్రీ , పురుషులు సంయోగ ప్రక్రియను అదేపనిగా రోజుకి రెండు వేల మందితో సంయోగ ప్రక్రియలు పాల్గొంటూ ఉంటారట! ఇలాంటి ఆశ్రమంలో మా జిజ్ఞాసి తెలియకుండా చేరినాడు! ఇక్కడ జరిగే తంతు విషయము మన వాడికి తెలుసుకునేసరికి… ఇది కాదు అనుకుని ఆశ్రమాన్ని వదిలి పెట్టి …కాశీ క్షేత్రమునకు చేరుకున్నాడు!అక్కడ ఒక ఆశ్రమంలో చేరటానికి వెళ్ళేసరికి…. అక్కడ జ్ఞానవల్లీ  పేరుతో మత్తు పదార్థాలు అనగా గంజాయి సేవించే విధంగా ఉంటాయని తెలుసుకునేసరికి మనవాడు గతుక్కుమన్నాడు! గురువు కోసం దాదాపు 48 విధివిధానాల సంప్రదాయాలను ఆశ్రమాలు చూడడం జరిగినది! నిజానికి వారంతా ఏదో మాయ లో ఉండి ధనము, కీర్తి, స్త్రీ వాంఛ, పేరు ప్రఖ్యాతలు, విలాస జీవితాన్ని అనుభవించే గురువులు గా ఉన్నారని తెలుసుకున్నాడు! గురువుల పేరుతో వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగి వచ్చినాడు! గురువు వచ్చే యోగం ఉంటే… తనకోసం ఎక్కడో ఒకచోట తారసపడతాడు అనుకుని వెనక్కి తిరిగి వచ్చినాడు! ఆ తర్వాత ఈ విధంగా తన అనుభవాలను పంచుకోవడం జరిగినది! పాపం వీడు గురువు కోసం వెతికితే వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పిచ్చివాడిలాగా జమ కట్టినారు! నిజ గురువులు అనుకుంటే నకిలీ గురువులు తారసపడ్డారు! మా ఇద్దరికీ కలిగిన నకిలీ గురువుల అనుభవాల రీత్యా… అసలు నిజ గురువులను గుర్తించడానికి ఏమన్నా సూచనలు ఉంటాయేమోనని వివిధ పుస్తక గ్రంధాలు చదవడం మొదలు పెట్టాను! 

నిజ గురువును గుర్తించడం ఎలా?

సాధకుడికి తన సాధన పరిసమాప్తి చేసుకోవటానికి గురువు తప్పనిసరిగా ఉండాలని గురువు అవసరం ఏర్పడుతుంది అని తెలుసుకున్నారు కదా! ఎందుకంటే కుండలిని జాగృతికి, కుండలినీశక్తిని అదుపులో ఉంచడానికి, షట్చక్రాలు, వివిధ గ్రంధులు జాగృతి, శక్తి ప్రవహించడానికి, ఈ సమయాల్లో వచ్చే యోగశక్తులను గుర్తించటానికి, వాటిని అధీనములో ఉంచుకోవటానికి గురువు ఖచ్చితంగా అవసరం అవుతాడు! గురువు లేకపోతే  కుండలిని శక్తి జాగృతి వలన దీనిని తట్టుకోలేకపోతే... సాధకుడు రోగాలకు గురి కావడమో లేదా నయంకాని రోగాలకు గురి కావడమో లేదా పిచ్చివాడు కావటం లేదా ఉన్మాది కావడం కావచ్చు లేదా ఒకసారి ప్రాణాలే పోవచ్చును! కానీ ప్రతి మోక్షగామికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే పరిపూర్ణమైన యోగ్యుడైన ఆత్మసాక్షాత్కారం పొందిన నిజగురువును పొందటం ఎలా అనేది…. వారిని గుర్తుపట్టడం ఎలా అనేది… మనము గురువుగా స్వీకరించి వ్యక్తి నిజంగానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవడం ఎలా అనే ధర్మ సందేహాలు వస్తాయి! దీనికి సమాధానంగా నేను వివిధ పుస్తక శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుసుకున్న విషయాలను యధావిధిగా మీ ముందు పెడుతున్నాను! జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి! మీ నిజగురువు ఎవరో తెలుసుకోండి! వారిని గుర్తు పట్టండి! వారికి గురు సేవ చేసి వారి అనుగ్రహము పొందండి! మీ కర్మలను క్షయం చేసుకొని పునర్జన్మ లేని స్థితిని పొందండి! 

లక్షణాలు:

1.               ఎవరి సమక్షంలో అయితే మనకి అకారణంగా ప్రశాంతత కలుగుతుందో ఉంటుందో…
2.                ఎవరిని విడిచి దూరంగా వెళ్లలేని ఉండాలని అనిపించదో… 
3.               ఎవరిని చూస్తే ఎవరి మాటలు వింటే అకారణంగా కంటి వెంట నీళ్లు ధారాపాతంగా వస్తాయో …
4.               ఎవరి దగ్గర నుండి దూరంగా వెళ్ళవలసి వస్తే మన గుండె విపరీతంగా నరకయాతన పడుతుందో…
5.                ఎవరినైతే మళ్లీ మళ్లీ చూడాలని మనస్సు పరిపరివిధాలుగా తపన పడుతూ ఉంటుందో…
6.                ఎవరైతే దేనికి అవమానంగా భావించరో…
7.                ఎవరి మరణం కూడా తన దుఃఖాన్ని కలిగించదో…
8.                ప్రాపంచిక భోగాలు యందు కోరిక లేనివారై కలిగి ఉంటారో!
9.                ధనం మీద కీర్తిప్రతిష్టల మీద మమకారం వ్యామోహాలు ఎవరికైతే ఉండవో!
10.         మీ మనస్సు ఎవరితో మాట్లాడాలని చూడాలని విపరీతంగా తపన తాపత్రయం పడుతుందో…
11.         మీ మనస్సు ఎవరి వద్ద ప్రశాంతంగా, సంతోషంగా, ఏదో తెలియని ఉత్తేజ ఆనందమును పొందుతుందో…
12.         ఈ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో…
13.         ఎవరి వద్ద అయితే మన బాధలు చెప్పుకోవాలని అమితమైన భావోద్రేకాలు కలుగుతాయో…
14.         ఎవరి దగ్గర అయితే అన్ని సహాయాలు కూడా ఆగకుండా చెపుతామో...
15.         ఎవరి దగ్గర అయితే జీవిత రహస్యాలు ఇతరులకు తెలియని జీవిత రహస్యాలు కూడా ధైర్యము గా చెపుతామో... 
16.        ఎవరి దగ్గర అయితే ఆగకుండా ఏడుపు వస్తుందో…
17.         ఎవరి యందు మనకి అమితమైన భక్తి విశ్వాసాలు కలుగుతాయో…
18.        తన మాటలతో తన చూపులతో తన చేతుల తో తన చేష్టలతో ఓదార్పు కలిగిస్తాడో
19.         ఇతరులను ఆకర్షించే పసిపాప మనస్సు ఎవరికి ఉంటుందో…
20.         ఎవరి దగ్గర అయితే మన మనస్సు పనిచేయదో…
21.         ఎవరు దగ్గర అయితే మన మనస్సు ఏకాగ్రత కలిగి ఉంటుందో…
22.         ఎవరి పట్ల అమితమైన భయముతో కూడిన ప్రేమ గౌరవ మర్యాదలు కలుగుతాయో…
23.         ఎవరి సమక్షంలో కాలము గంటలు కాస్త నిమిషాలుగా గడిచిపోతాయో…
24.         ఎవరు సమక్షంలో నీ మనస్సు అమితమైన సంతోషము లేదా మనశ్శాంతి కలుగుతుందో…
25.         ఎవరి సమక్షంలో అప్రయత్నంగా నీ మనస్సు నిశ్చలమై ప్రశాంతమై కలుగుతుందో….
26.         ఎలాంటి ధర్మ సందేహం అయినా కూడా అనర్గళంగా చాలా తేలికైన పద్ధతిలో మనకు అర్థమయ్యే విధానంలో  సమస్య పరిష్కారము చెబుతారో… 
27.        ఎవరి వద్ద అయితే మనలో అరిషడ్వర్గాలని అణిచి వెయ్యబడతాయో …
28.        ఎవరి దగ్గర మనకి మనో ఇంద్రియనిగ్రహం కలుగుతుందో…
29.         ఎవరి దగ్గర మన అస్థిర మనస్సు కాస్త స్థిర మనస్సుగా మారి పొందుతుందో….
30.         ఎవరి దగ్గర అయితే మన మాట బయటకు రాకుండా మౌన స్థితి కలుగుతుందో…
31.         ఎవరిని ఒకసారి దర్శించిన మీ మనస్సు పలుమార్లు ఆయనను దర్శించాలని తపన పడుతుందో...
32.        ఎవరి దృష్టి యందు ధనము, మానము, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, విలువ ఉండదో…
33.         సుఖదుఃఖాలు యందు సమదృష్టి, బేధభావం లేనివాడు ఎవరైతే ఉన్నారో…
34.         ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఎవరైతే ఉన్నారో…
35.         ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుతారో…. ఇలాంటి వారిని మంత్ర గురువులుగా భావించడం జరుగుతుంది!

 ఇంకా దీక్షగురువుకి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చూద్దాం!

1.                సమాధి స్థితికి వెళ్లిన ఖచ్చితమైన దాఖలాలు అనగా ధ్యాన అనుభవాలు పొందిన వ్యక్తి అయి ఉండాలి!
2.                పంచభూతాల మీద ఆధిపత్యం కలిగి ఉండాలి!
3.                ఖండ యోగసిద్ధి చెంది ఉండాలి!
4.                నిజ అవధూత లక్షణాలు కలిగి ఉండాలి!
5.                తినడానికి కొంచెమే లేకుండా దానికి చేతులు ఉపయోగించే వాడై ఉండాలి!
6.                మంది గురించి ఆలోచించకుండా కేవలం మది గురించి ఆలోచించిన వాడై ఉండాలి!
7.                ఒంటి మీద ధోవతి, చేతిలో తంబూర లేదా కమండలం, పంచముఖ రుద్రాక్ష మాలలు కలిగిన వాడై ఉండాలి!
8.                తన దగ్గరికి వచ్చే వారిలో స్త్రీ, పురుష భేదం జ్ఞానం లేని వాడై ఉండాలి!
9.                దానధర్మాల సేకరించి ఇతరులకు ఇచ్చిన వాడై ఉండాలి!
10.         దాన భేద భావం లేనివాడై ఉండాలి!
11.         శిష్యుల యొక్క ధన, మానాల మీద ఆధారపడని వాడై ఉండాలి!
12.         మహత్తులు కలిగి ఉండాలి అనగా వీరి ఆశీర్వచనము వలన వివాహం కావడం, సంతానం కలగటం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి!
13.         ప్రతి కర్మను ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభాపేక్ష లేకుండా చేసిన వాడై ఉండాలి!
14.         చేసే ప్రతి కర్మలను దైవార్పణము చేస్తూ… చేసేది ఇచ్చేది పైవాడు…. ఫలితం పొందేది మీరే అనే వాడై ఉండాలి!
15.         శబ్ధపాండిత్యము కన్నా అనుభవపాండిత్యము ఎక్కువ కలిగి ఉండాలి! 
16.        మౌనమే తన భాష గా ఉండాలి!

ఇక మంత్ర గురువుకు ఉండవలసిన రూపగుణ లక్షణాలు ఏమిటో చూద్దాం:

1.                పొట్టి వాడు, పొట్ట ఉన్నవాడు, తిండిపోతు కాకూడదు!
2.                చెవిటివాడు , కుంటివాడు కాకూడదు!
3.                స్త్రీలోలుడు కాకూడదు!
4.                అంగ లోపం ఉన్న వాడు లేదా అధికంగా అంగాలు కలిగి ఉన్నవాడు కాకూడదు!
5.                ఎవరి వలన ఎలాంటి శాపము లేనివాడై ఉండాలి !
6.                ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే తన సంతతి లో మగ పిల్లవాడు కలిగి ఉండాలి లేదా సంతానమే లేనివాడై ఉండాలి!
7.                దినచర్యను సరిగ్గా పాటించి నిత్య పూజాదికాలు, ఆచారవ్యవహారాల పాటించే వాడై ఉండాలి!
8.                స్త్రీ నింద, గురునింద, బ్రాహ్మణ నింద, దైవనింద చేయకుండా ఉండే వాడై ఉండాలి!
9.                దుష్ట ప్రవర్తన లేనివాడై ఉండాలి!
10.         ఎక్కువ కోపతాపాలు లేనివాడై ఉండాలి!
11.         పరస్త్రీలయందు మోహ లేనివాడై ఉండాలి!
12.         ఇతరులను మాటలతో, చేతలతో, బాధపెట్టకుండా ఉండాలి!
13.         తృప్తి కలిగి ఉండాలి! 
14.        పండితుల యందు, విద్యావేత్తలు యందు, శత్రుత్వం లేకుండానే మిత్రతత్వం కలిగి ఉండాలి!
15.         తనను తాను గొప్ప వాడు అనుకుని భావించకుండా ఉండాలి!
16.         అనవసరపు మాటలు, ప్రసంగాలు, ప్రలాపనాలు చేయకుండా ఉండాలి!
17.         గర్వము, అసూయ, ద్వేషము, ఈర్ష్య లేనివాడై ఉండాలి!
18.         సత్ప్రవర్తన కలిగి మంచి పేరు కలిగి ఉన్నవాడై ఉండాలి!
19.         దరిద్రుడు, లోభి, దయ లేని వాడు, దుష్ట ప్రవర్తన, సోమరితనము, పిరికితనము లేనివాడై ఉండాలి!
20.         మంత్రమును అపవిత్రము చేయువాడు లేదా మంత్రం ఉద్దేశించి వాడై ఉండకూడదు!
21.         కుష్ఠురోగము లేదా నయం కాని రోగాలతో బాధ పడని వాడై ఉండాలి!
22.         పరిశుభ్రమైన వస్త్రధారణ కలిగి ఉండాలి!
23.         వినయం కలిగి బ్రాహ్మణుడై ఉండాలి!
24.         సత్యవాది గా ఉండాలి!
25.         ఇంద్రియాలను జయించిన వాడై ఉండాలి!
26.         ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వారికి సేవ చేస్తున్న వాడై ఉండాలి!
27.         శాంత స్వభావం కలిగి నిత్య కర్మలను ఆచరిస్తూ ధార్మిక జీవితమును అనుభవించి వాడై ఉండాలి!
28.         పళ్ళు, గోర్లు పరిశుభ్రంగా ఉంచుకొని వాడై ఉండాలి!
29.         సంసారిక సుఖాలను యందు అనాసక్తి కలిగి ఉండి ఉండాలి!
30.         పొగడ్తలకు లొంగకుండా వారికి దూరంగా ఉండగలిగితే ఉండాలి!
 ఇలాంటి దైవిక లక్షణాలు వ్యక్తిని మంత్ర గురువుగా భావించుకుని… వారి నుండి గురుమంత్రమును గురూపదేశముగా పొంది మంత్రదీక్ష చేపడితే… అట్టి వారికి జీవన్ముక్తి కలుగుతుందని…. విశ్వసార తంత్ర  రెండో భాగంలో మంత్రగురువుకి ఉండవలసిన లక్షణాలు పైన చెప్పినట్లుగా ఉంటే జరుగుతుంది అని చెప్పడం జరిగినది!

ఇప్పుడు ఇదే శిష్యుడికి లేదా సాధకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఏమిటో చూద్దాం:

1.                మంచి నడవడిక కలిగి ఉండాలి అనగా సత్ ప్రవర్తన కలిగి ఉండాలి!
2.                అన్నిటి యందు నిశ్చల మనస్సు కలిగి ఉండాలి!
3.                అన్నిటి యందు శ్రద్దాభక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి! 
4.               సంతృప్తి జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి!
5.                మంచి ప్రవర్తన కలిగి ఇంద్రియాల జయించుటకు ప్రయత్నించిన వాడై ఉండాలి!
6.                అన్ని పనులు చేతియందు నేర్పరి, పట్టుదల, ఓపిక, సహనం కలిగిన వాడై ఉండాలి!
7.                శాంత స్వభావి, మృదుస్వభావి, క్షమాగుణము, దయ, ప్రశాంతత చిత్తము కలిగి ఉండాలి!
8.                మంచి వంశంలో పుట్టిన వాడై ఉండాలి!
9.                దైవము నందు, గురువుయందు అమిత శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి!
10.         నిర్మల మనస్సును కలిగి ఉండాలి!
11.         మంత్రమును ద్వేషించకుండా, అపవిత్రము చేయకుండా ఉండాలి!
12.         రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు లేని వాడై ఉండాలి!
13.         సోమరితనము, పిరికి తనము లేనివాడై ఉండాలి!
14.         అన్నిటి యందు సంతృప్తి  కలిగి ఉండాలి!
15.         విచారణ శక్తి, వివేక జ్ఞాన బుద్ధి కలిగి ఉండాలి!
16.         స్త్రీ ,పురుష కామ వాంఛలకు దూరంగా ఉండాలి! గృహస్థుడు అయితే పాతివ్రత్య ధర్మంతో ఉండాలి!
17.         దొంగతనం, దొంగ బుద్ధి ఉండరాదు!
18.         సాధ్యమైనంతవరకు అబద్దాలు చెప్పరాదు!
19.         వివాహేతర సంబంధాలు ఉండరాదు!
20.         కోపతాపాలకు రాగద్వేషాలకు దూరంగా ఉండాలి!
21.         సప్త వ్యసనాలకి, అరిష్వర్గాలకి దూరంగా ఉండాలి!
22.         బాహ్య,అంతర శుద్ధి కలిగి ఉండాలి!
23.         సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ధర్మ యుతమైన జీవితమును కలిగి ఉండాలి!
24.         ధర్మ పరమైన కోరికలు, ధర్మ సంపాదన కలిగి ఉండాలి!
25.         ఇతరుల నుండి ధనముగాని, వస్తువులు గాని, ఉచితంగా గాని పొందకూడదు!
26.         ఉచితంగా ఏవి ఇతరుల నుండి తీసుకోకూడదు!
27.         మూఢ భక్తి కలిగి ఉండరాదు! కోరిక లేని మధుర భక్తి కలిగి ఉండాలి!
28.         నిత్య దైవ నామస్మరణ కలిగి ఉండాలి!
29.         బద్ధకము, సోమరితనము, వాయిదా పద్ధతి, అమిత నిద్ర, అతి అనేది ఉండకూడదు!
30.         ప్రతి కర్మఫలితమును తన ఇష్ట దైవానికి అర్పణము చేస్తూ ఉండాలి! 
31.        పాపము చేస్తే పశ్చాతాపం చెందాలి! 
32.        అన్ని కర్మలయందు, అన్ని విషయాలుయందు మనం కేవలం నిమిత్తమాత్రులం అనే భావం కలిగి ఉండాలి!
33.         ఎవర్ని ఎప్పుడూ మాటలతో కానీ చేతులతో గాని మానసికముగా లేదా శారీకముగా భాదించకూడదు!
34.        ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి!
35.         అన్ని జీవులపట్ల భూత దయ కలిగి ఉండాలి!
36.         తెలిసి తెలిసి అన్యాయపు పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు, ఇతరులకు బాధ కలిగించే పనులు, అలాగే పాపపు పనులు చేయరాదు!
37.         అతి గాను మాట్లాడకుండా ఉండాలి!
38.         కోరికలను తగ్గించుకోవాలి ! కోరికలు మితముగా ఉండాలి!
39.         ధర్మం పట్ల అశ్రద్ధ చూపరాదు! 
40.        సజ్జనులతో సహవాసము చేస్తూ ఉండాలి! దుష్టులకు దూరంగా ఉండాలి! 
41.        ఎవరితో కటినంగా ఉండరాదు, మాట్లాడరాదు!
42.         అసహనము, అస్థిర బుద్ధి లేకుండా చూసుకోవాలి!
43.         శరీర ఆరోగ్యం కలిగి ఉండాలి!
44.         మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి!
45.         భ్రాంతి దర్శనాలకు దూరంగా ఉండాలి!
46.         అన్ని రకాల భయాలను జయించగలగాలి! 
47.        అన్నిటి యందు ఆసక్తి, ఉత్సాహం, సాహసము, ధైర్యము, తత్వజ్ఞానము, స్థిరబుద్ధి కలిగి ఉండాలి!
48.         అన్ని విషయాలు యందు వివేక జ్ఞానవైరాగ్య భక్తి భావాలు కలిగి ఉండాలి!
49.         అసలైన భక్తి విశ్వాసాలు, సత్తా, ఓపిక, సహనం, సమబుద్ధి, సమదృష్టి, వివేక జ్ఞానము కలిగి ఉండాలి!
50.         సిగ్గు వలన ,భయము వలన, లాభం వలన, ఆశించటము వలన, అనుచిత కార్యాలు చేయకుండా ఉండాలి!
51.         అవసరానికి మించి వేటినీ స్వీకరించకుండా ఉండాలి!
52.         అహంకారము లేనివాడై ఉండాలి! అహంకారానికి విరుగుడు శరణాగతి కలిగివుండాలి!
53.         పాపకార్యానికి తప్ప దేనికి భయపడకుండా ఉండాలి!
54.        వ్యవహారాలు యందు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి!
55.         క్షమాగుణము, సహనము, ఓర్పు, నమ్మకం కలిగి ఉండాలి!
56.         వేటి యందు కూడా నేనే గొప్ప అనే అహంకార అహం ఉండకూడదు!
57.         మాన అవమానాలకు దూరంగా ఉండాలి!
58.         ధన యందు, స్త్రీ యందు, మమకారం రహితుడిగా ఉండాలి!
59.         చెడు కోరికలు, చెడు కర్మలు, చెడు ఆలోచనలు, చెడు భావాల, చెడు గుణాలు యందు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి!

అలాగే యోగసాధకులు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం :

1.        ఇతరులను పరిహాసం ఉండకూడదు! మాటలతో చేతలతో, చేతులతో బాధ పెట్టకూడదు!
2.                ఇతరుల వస్తువులను దొంగలించకూడదు! 
3.               వస్తువులయందు కోరికలు, అభిమానం, ఆప్యాయత ఉండకూడదు!
4.                వివాహేతర సంబంధాలు లేకుండా ఉండాలి!
5.                ప్రతి పనియందు సంతోషము, తృప్తి, సంతృప్తి కలిగి ఉండాలి!
6.                దైవము నందు గురువులు నందు సత్యమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి!
7.                మానసిక, శారీరక సత్ ప్రవర్తన కలిగి ఉండాలి!
8.                దైవ సంబంధిత విషయాలు యందు, సత్య గ్రంథాల పఠనము యందు అమిత శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి!
9.                మంత్ర జపము నిరంతరంగా అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా, మానసిక జపం చేస్తూ ఉండాలి!
10.         ఎల్లప్పుడూ ధర్మమును పాటిస్తూ ఉండాలి అలాగే ఆచరిస్తూ ఉండాలి!
11.         ఏది జరిగినా మన మంచికే అని దైవ నిర్ణయానికే వదిలేసి గుణము కలిగి ఉండాలి!
12.         ఫలితాన్ని దైవానికి వదిలేయాలి!
13.         అన్నిటి యందు స్థిరమైన మనస్సు స్థితితో, వివేక గుణముతో, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగి ఉండాలి!
14.         వేటియందు సోమరితనము, స్తబ్ధత లేకుండా ఉండాలి!
15.         అవసరం లేకుండా శరీరానికి, మనస్సుకు విశ్రాంతి ఇవ్వకూడదు!
16.         మాయా మనో భ్రాంతులకు మనస్సును దూరంగా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి!
17.         ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలో, మనస్సు అచంచలము కాకుండా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి!
18.         దు:ఖహితమైన వాటికి మనస్సును దూరంగా ఉంచాలి!
19.         ఒకసారి గురువుని స్వీకరించిన తరువాత జీవితాంతం మన ప్రాణం పోయేంతవరకు ఆయనే గురువుగా ఆరాధించాలి! అనుసరించాలి! పూజించాలి!
20.         ఒకసారి గురువుగా ఒక వ్యక్తిని స్వీకరించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో గురువుని మార్చకూడదు!
21.         ఇతరుల నుంచి ధనమును గాని వస్తువులు గాని సేవలు గాని ఉచితముగా,దానముగా తీసుకోవద్దు! పొందకూడదు!
22.         మనలో కలిగే ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మనలోనే గుప్తంగా, గోప్యంగా ఉంచుకోవాలి! ఎందుకంటే మన దైవ అనుభవాలు వేరే వారికి చెబితే అవి వారికి అర్థం కాక పిచ్చివాడిగా జమక ట్టే అవకాశం ఉంది లేదా అసూయ పడే అవకాశం ఉంది లేదా పొగడ్తలలో ముంచే అవకాశమున్నది! తద్వారా మీలో మీకే తెలియని అహం పెరిగే అవకాశమున్నది! 

ఇలాంటి నిజ యోగ సాధక శిష్యుల కోసం గురువు ఎప్పుడూ అర్హతలు కలిగిన వారి కోసం తహతహలాడుతున్న ఎదురుచూస్తూ ఉంటారట! మన సాధన సమయానికి గురువే స్వయంగా వచ్చి మన సాధన జరిగేటట్లుగా చేయవచ్చును! లేదా ఆయన ఉన్న చోటుకు శిష్యుల వచ్చేటట్లుగా చేయవచ్చును! రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపూరి గురువే వచ్చి నట్లు గాను లేదా లాహిరి మహాశయులు తన గురువైన మహావతార్ బాబాజీ హిమాలయాలకి పిలిపించుకున్నట్లుగా పిలిపించుకోవచ్చును! మీకు నిజగురు దర్శనం అనుగ్రహం కలగాలి అంటే మీరు నిజ శిష్య పరమాణువు గా ఉండాలి! మీ ఇష్టదైవాన్ని నమ్మాలి! మీ దైవానుగ్రహాము కలిగేవరకు వదలకుండా చేసుకుంటూ పోవాలి! మీ దైవమే గురువు వెతికి… మీ దగ్గరికి ఆయన వచ్చేటట్లుగా చేయటం లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా చేయటం చేస్తుందని ఖచ్చితంగా నమ్మండి! గురువే దైవము మారుతుంది!


అలాగే సాధకుడు తన సాధనలో అవసరమైతే తప్పని పరిస్థితుల్లో కొన్ని పరిత్యాగము చేయవలసి వస్తోంది అనగా వదిలి పెట్ట వలసి పరిస్థితులు వస్తాయి! అది మానసికంగా గాని లేదా శారీరకంగా కాని చేయవలసి ఉంటుందని కొన్ని గ్రంథాలు చదివితే నాకు అర్థమైంది! ఏమిటంటే 

1.               ఈ సాధన అడ్డంగా నీ తండ్రి అడ్డువస్తే ప్రహ్లాదుడు లాగా అతని వదిలిపెట్టాలి !
2.               నీ తల్లి అడ్డుగా నిలిస్తే భరతుని లాగ వదిలి పెట్టాలి!
3.                నీ అన్న అడ్డగా వస్తే విభీషణుడి లాగా వదిలి పెట్టాలి!
4.                నీ భార్య అడ్డంగా వస్తే భర్తృహరిలాగా వదిలి పెట్టాలి!
5.                నీ భర్త అడ్డంగా వస్తే మీరాబాయిలాగా వదిలి పెట్టాలి!
6.               నీ సంతానమే అడ్డంగా వస్తే గౌతమ బుద్ధుడు లాగే వదిలి పెట్టాలి!
7.                నీ గురువు అడ్డంగా వస్తే భీష్ముని లాగా వదిలి పెట్టాలి!
8.                నీ శిష్యుడు అడ్డంగా వస్తే ద్రోణాచార్యుడి లాగా వదిలి పెట్టాలి!
9.                నీ దేవుడు అడ్డంగా వస్తే  కబీర్దాస్ వదిలి పెట్టాలి!
10.         తన సంపాదన అడ్డంగా వస్తే షిరిడి సాయిబాబా లాగే వదిలి పెట్టాలి!
11.         నీకు భోగభాగ్యాలు అడ్డంగా వస్తే త్యాగయ్యలాగా వదిలి పెట్టాలి!
12.         నీకు భయమే అడ్డంగా వస్తే హనుమంతుడిలాగ వదిలి పెట్టాలి!
13.         నీకు చావే భయంగా వస్తే పరమశివుడు లాగే వదిలి పెట్టాలి!
14.         నీకు మాయ లో అడ్డంగా వస్తే దత్త స్వామి లాగే వదిలి పెట్టాలి!
15.         పరస్త్రీ వ్యామోహం అడ్డంగా వస్తే శ్రీరాముడి లాగా వదిలి పెట్టాలి!
16.         స్త్రీ వ్యామోహం వస్తే యోగివేమన లాగా వదిలి పెట్టాలి!
17.         నీకు అహం అడ్డం వస్తే నామదేవుడు లాగే వదిలి పెట్టాలి!
18.         మరణ భయం అడ్డంగా వస్తే మార్కండేయ లాగా వదిలి పెట్టాలి!
19.         నీకు జ్ఞానమే అడ్డంగా వస్తే శుకమహర్షి లాగా వదిలి పెట్టాలి!
20.        నీకు మాటలే అడ్డముగా వస్తే దక్షిణామూర్తిలాగా మౌనముగా మారాలి!
21.         నీకు కోరికల అడ్డంగా వస్తే శంకరాచార్యుడు లాగా వదిలి పెట్టాలి!
22.        నీకు అతి అన్నిటియందు అడ్డంగా వస్తే కర్ణుడు లాగా వదిలి పెట్టాలి!
23.         నీకు అతినిద్ర అడ్డంగా వస్తే భీముడు లాగా వదిలి పెట్టాలి!
24.         నీకు బంధమే అడ్డంగా వస్తే ఘోర భక్తుడు లాగా వదిలి పెట్టాలి!
25.         నీకు సిద్ధులు  అడ్డంగా వస్తే రామకృష్ణ పరమహంస లాగా వదిలి పెట్టాలి!
26.         నీ మాట అడ్డంగా వస్తే రమణమహర్షిగా లాగా వదిలి పెట్టాలి!
27.         నీకు నేను అనే అహం అడ్డంగా వస్తే సదాశివమూర్తి లాగా వదిలి పెట్టాలి!

శుభం భూయాత్

పరమహంస పవనానంద


3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. saadhanaki guruvu entha avasaram asal aa guruvu pramukhyatha annitikante main okka chakraniki digajaari ela maayalo padi malli vellaru ane vivarana bagundi, Dr.krovi cheppina vakhyalu bagunnayi... guruvuni roju meppinchali ani, andaru guruvulu ye ye chakram lo ostharu ani cheppatam....
    guruvu lakshanalu cheppatam baagundi kaani 20,21 lo oka confusion manasu pani cheyadu ani cheppi 21 lo manassu ekagratha kaligi untundi ani annaru pani cheyani manassuku ekagratha ela osthundi? eeni addankulu osthe em cheyyali chepparu kaani thanaki thaane addanga osthe em cheyyali?

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు. సహజమైన సందేహాలకు మీరు ఇచ్చిన వివరణ వల్ల సరిఅయిన సమాధానం దొరుకుతూ వుంది.

    రిప్లయితొలగించండి