విశ్వ మోక్షం
(The dark of endless)
( ఒక స్త్రీ మూర్తి సాధకురాలైతే)
నాంది:-
నేను కాస్త పరమహంస పవనానందగా విశ్వానికి విశ్వమోక్షం ఇవ్వాలని శత విధాలుగా ప్రయత్నించినప్పటికీ…. అది కాస్త వ్యక్తిగత మోక్షం అయినదని మీరందరికి తెలిసిన విషయమే కదా! ఎందుకంటే ప్రకృతి అనేది పురుష మరియు స్త్రీ మూర్తి అని రెండు ప్రకృతులుగా ఉంటుందని….. ఇందులో మళ్లీ పురుష మరియు స్త్రీ మూర్తిగా పురుష ప్రకృతిలో దక్షిణామూర్తి మరియు లలితాదేవిగా…ఉంటే, అదే స్త్రీ మరియు పురుష మూర్తిగా స్త్రీ ప్రకృతిలో రాజరాజేశ్వరి మరియు నటరాజ దక్షిణామూర్తి ఉంటారని తెలుసుకోండి. ఇందులో నా సాధనాపరంగా పురుష ప్రకృతి మోక్షం పొందినదని…. కానీ ఇందులో పురుషుడైన దక్షిణామూర్తి మోక్షం పొందితే ,లలితా అంశఅయిన ఆదిపరాశక్తి మోక్షం పొందలేదని…. నా సాధనా ధ్యానా అనుభవాలు చెప్పడం జరిగింది కదా! తద్వారా విశ్వ మోక్షం కాస్త పురుష వ్యక్తిగత మోక్షం అయింది అన్నమాట!
దీనికి కారణం నా కంఠంలోని స్పటిక లింగమును ఆదిపరాశక్తి కాస్త పెకలించడంతో నా ఆకాశ శరీరం మోక్షం పొందకుండా ఆగిపోయింది. పైగా ఈ శరీరానికి కారణా కారక జన్మాంతర రుణాను బంధముగా ధర్మపత్ని రుణం పెట్టడం జరిగిందని మీరందరికి తెలుసు కదా! ఈమె మహాదేవి అని…. ఈమె తాంత్రిక ఆనంద భైరవి సాధకురాలని…ఏమి కాస్త తను ఉన్న శ్రీశైల క్షేత్రమును నా ఆకాశ శరీర అంశయన నీలిరంగు ఆదియోగి శివ మూర్తిని అలాగే తన మనో శరీర అంశయన నీలి అయ్యవారి విగ్రహ మూర్తిని పొందటం జరిగితే ఈ రెండింటిని నా దగ్గరికి తీసుకుని రావడంతో….. నాకు లాగా ఈమె కూడా విశ్వమోక్ష ప్రయత్నం స్త్రీ ప్రకృతి పరంగా చేస్తుందని గ్రహించాను. ఆమెకి అరుణాచల శివుడు కాస్త ఒక సంవత్సరం పాటు వివిధ రకాలుగా….. మానసిక , యోగ, భోగ, పరీక్షలు పెట్టి తరువాత ఈమెకి విశ్వమోక్ష సాధనకి అర్హత ,యోగ్యత ,యోగము ఉన్నదని తేల్చి సాధనకి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఇప్పటిదాకా మీరంతా కూడా ఈ కపాల మోక్ష గ్రంథం ద్వారా ఒక పురుషుడు సాధకుడు అయితే ఎలాంటి మాయలు , మర్మాలు, దైవిక వస్తువులు, దైవిక లింగాలు పొంది ఎలాంటి సాధన ధ్యాన అనుభవాలు పొందాడో… నా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇకనుంచి ఒక స్త్రీ మూర్తి కాస్త యోగ మోక్ష సాధకురాలు అయితే…. ఈమె ఎలాంటి ధ్యాన అనుభవాలు పొందుతుందో…. ఎలాంటి మర్మ రహస్యాలు చేధిస్తుందో…. ఎలాంటి దైవిక వస్తువులు మరియు దైవీక లింగాలు పొందుతుందో…మనమంతా కూడా ఈమెతో ఆధ్యాత్మిక ప్రయాణం చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఈమె మోక్ష సాధన అనేది పరిసమాప్తి అయితే…. అదే విశ్వమోక్షం అవుతుంది. లేదు ఏదైనా తప్పు చేసినా…లేదా పొరపాటు చేసినా…మాయలో పడినా…లేదా మర్మ రహస్య చేధనలో అవకతవకలు చేసినా…ఈ మోక్షం కాస్త శరీరం మోక్షము…లేదా స్త్రీ వ్యక్తిగత మోక్షము మాత్రమే అవుతుందన్నమాట! నిజానికి ఈ స్త్రీ ఎవరో కాదు! ఆదిలో నా ఆకాశ శరీర ధర్మపత్ని అన్నమాట! ఈమెకి నా ధర్మపత్ని రుణం ఉంటే…. నాకు ఈమె ధర్మపత్ని రుణ పాశం ఉంది. ఒకవేళ ఈమె ఈ మోక్ష సాధనలో జయం పొందితే…స్త్రీ ప్రకృతిలో మోక్షం పొందినప్పుడు, నా ఆకాశ రూప ధారి మరియు ఈమె మనో శరీర రూప ధారి కలిసి మిళితమై అర్ధనారీశ్వర తత్వమును పొంది ఆపై ఏక లింగ దేహమై…దహనం అయితే అప్పుడు కాస్తా వచ్చే ఆఖరి శివలింగమైన కారుంగళి శివలింగం కూడా దహనమై విశ్వశూన్యం లో శూన్యం అయితే అదే విశ్వమోక్షం అవుతుంది. కాకపోతే నా సాధన పరిసమాప్తి అయి పురుష అర్థనారీశ్వర తత్వం పొందటానికి కావలసిన మిగిలిపోయిన ఆదిపరాశక్తి అంశ అయిన కంచి కామాక్షి మూర్తి నా దగ్గరికి వచ్చింది! అదే ఈమె సాధన కూడా పరిసమాప్తి స్థితికి వస్తే , అప్పుడు ఈమె కాస్త స్త్రీ అర్ధనారీశ్వర తత్వ స్థితికి వస్తే ఈమెకి ఈ తత్వంలో మిగిలిపోయిన ఆది ధ్యాన శివ మూర్తిని పొందాల్సి ఉంటుంది. ఈ రెండు విగ్రహమూర్తులు కలిస్తే…స్త్రీ , పురుష భేదం లేని ,నామరూపాలు లేని ,సాధనా మూర్తిగా అంతిమ లింగ దేహమై, ఇది దహనమైతే, ఏక కరుంగళీ లింగం ఏర్పడి, ఇది కాస్త దహనమై…విశ్వ శూన్యంలో శూన్యమైతే… అదియే విశ్వమోక్షం అవుతుంది. ఇదంతా రాసినంత తేలిక కాదు. నా పురుష తత్వ సాధనకు 48 సంవత్సరాలు పడితే…ఇలాంటి సాధన స్త్రీ తత్వానికి 48 రోజులు లేదా 48 నెలలు లేదా 48 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఈ సాధన అంతా కూడా చేతలు , చేతులను బట్టి ఆధారపడి ఉంటుంది. నా పురుష మోక్ష సాధనలో వచ్చిన అనుభవాలే…దైవిక మాయలే, మర్మ రహస్య చేధనలే ఇంచుమించుగా 80% వస్తాయి. నా కపాల మోక్ష గ్రంథం ద్వారా ఈమెకి సాధనలో 80% పరిసమాప్తి చేసుకుంటుంది. కానీ మిగిలిన 20 శాతం సాధన ఏం చేస్తుందో…. అనివార్య కారణాల వలన మాయలో పడి ఆపివేస్తుందా అని నాకే అర్థం కాని మీ మాంస ప్రశ్న అయ్యింది! కాకపోతే ఈమెకి నేను కాస్త పరోక్షంగా ఉండి ఈ చక్రాల జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అలాగే… దేహాల జాగృతి ,దహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఈమెకి అర్థమయ్యే విధంగా ఒక సాధన విగ్రహ మూర్తిగా చూపించడం జరిగింది! ఈ ఆదిదంపతులు ఆడే విశ్వ జగన్నాటకమును ఈ విగ్రహ మూర్తిలో మర్మ రహస్య ఆధారాలుగా భద్రపరచడం జరిగింది. అంటే ఈమె సాధన అనేది కుండలిని శక్తి ఎక్కడ జాగృతి అవ్వాలో…అక్కడ పొందవలసిన దైవిక వస్తువు అలాగే దైవిక శివలింగం ఏమిటో అనేది ఒక రహస్య భాషలో అర్థమయ్యి అర్థం కాని విధంగా…. ఒక ఆధారంతో చెప్పడం జరుగుతుంది. ఈమె కాస్త ఈ ఆధార రహస్యమును చేధిస్తే.. ఆయా దైవీక వస్తువు మరియు ఆయా దైవిక శివలింగమును పొందడం జరుగుతుంది. తద్వారా చక్రాల జాగృతి కోసం ఎక్కడికి వెళ్లాలి…. అక్కడ పొందవలసిన దైవీక వస్తువు మరియు శివలింగం ఏమిటో…ఈమె దగ్గర ఉన్న …. నా అంశ అయిన సాధన మూర్తి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈమె మూలాధార చక్రంతో మొదలై బ్రహ్మ రంధ్రం దాకా కొనసాగుతుంది. ఈ ఆధారాలు రహస్యమును చేధిస్తే… ఈమె సాధన పురోగభివృద్ధి చెంది , ముందుకు వెళ్లి సాధన పరిసమాప్తి చేసుకుంటుంది. అంటే ఈమె ఈ విశ్వంలో ఉన్న అతి ముఖ్యమైన విశ్వకేంద్ర ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న దైవిక శక్తిని మట్టి రూపంతో సేకరించి చక్రాలు మరియు దేహాల సాధన పరిసమాప్తి అయిన తర్వాత ఈ మట్టితో దైవీక శక్తిని తన సాధనా శక్తిని మిళితం చేస్తే గాని ఈమె అంతిమ దైవిక వస్తువైన ధ్యాన శివమూర్తి రాడు! ఈయన వస్తే కానీ నా దగ్గర ఉన్న అంతిమ దైవీక వస్తువైన కామాక్షి మూర్తి రూపంతో ఇయన్నీ అనుసంధానం చేసి మిళితం చేస్తే కానీ ఈ విశ్వానికి విశ్వమోక్షం రాదని గ్రహించండి. నాకైతే పురుష ప్రకృతిలో ఉన్న విశ్వ కేంద్ర ప్రాంతాలకి…నా సహాయకుడైన జిజ్ఞాసి వెళ్లి ఆయా దైవీక వస్తువులు…దైవిక శివలింగాలు తీసుకువచ్చి అందించడంతో నా పురుష ప్రకృతి సాధన పరిసమాప్తి అయింది. విశ్వ మోక్షానికి అవసరమైన కామాక్షి అమ్మవారి విగ్రహ మూర్తిని పొందటము జరిగింది. ఇక ఈమె సాధనాపరంగా సహాయకుడిగా సాధనా మూర్తి సహాయ సహకారాలు పొంది, ఆయా ప్రాంతాలు ఏమిటో అర్థం చేసుకొని, అక్కడకు వెళ్లి అక్కడ ఉన్న దైవిక వస్తువులు అలాగే దైవీక శివలింగాలు పొందగలిగితే అప్పుడు ఈమె దగ్గరికి ధ్యాన శివమూర్తి రావడం జరుగుతుందన్న మాట! ఇదంతా కథ కాదు! అలాగే ఊహించి రాసేది కాదు! ఒక స్త్రీ మూర్తి సాధనా అనుభవ సారమే ఈ విశ్వ మోక్ష గ్రంధం అన్నమాట.! ఈ విశ్వంలో ప్రతి దానిలో ప్రతి చోట అర్ధనారీశ్వర తత్వమే మిళితమై ఉంటుంది. ఇందులో నా సాధనాపరంగా పురుషుడు మోక్షం పొంది ఆదిపరాశక్తి మిగిలిపోయి అమోక్షం పొందినదని గ్రహించాను. ఇక స్త్రీ ప్రకృతిలో ఏం జరుగుతుందో…. ఈమె ఏమి పొందాల్సి ఉంటుందో…. ఎలా పొందుతుందో…. ఎలా ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఇతిమితంగా…. నాకు తెలియదు! కానీ తెలుసుకోవాలని ఉంది. ఈమె దగ్గర ఉండే సాధనామూర్తి విగ్రహం ద్వారా ఈమె పొందే ధ్యాన అనుభవాలు అలాగే….. జ్ఞాన స్పురణలు ఎప్పటికప్పుడు నాకు ధ్యానంలో అందుతాయి! తద్వారా.. ఏ మార్చకుండా, ఏమీ మార్చకుండా ఈ విశ్వ మోక్ష గ్రంధంలో పొందుపరిచి రాయాలని…ఒక స్త్రీమూర్తి కూడా సాధనకి పనికి వస్తుందని.. ఈమె సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని…ఈమె కూడా మోక్షం పొందుతుందని…స్త్రీమూర్తి అనేది అబల కాదు సబల అని…. ఈ స్త్రీమూర్తి చేసే సాధన అంతా కూడా.. యధాతధంగా లోకానికి తెలియజేయడానికి ఈ గ్రంథకర్తగా నేను రాయడం జరుగుతుంది. ఇది నా ధ్యాన అనుభవాలు కావని…నా అంశ అయిన ఆకాశ శరీర ధారి ధర్మపత్ని అయిన “శివనందిని” అనే స్త్రీ మూర్తి ధ్యాన అనుభవాలు అని గ్రహించండి. రాసే చేతులు నావి…. సాధన చేసే చేతలు ఆమెవి అన్నమాట! నా ఆకాశ శరీరధారి అయిన శివానంద కూడా…. ఈమెకి పరిచయమై సాధన పరిసమాప్తి అయ్యేదాకా తన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అంటే నా ఆకాశ శరీర దారి అయిన “శివానంద”... ఈమె మనో శరీరధారియైన “శివనందిని” సాధన అనుభవాల మిళితమే ఈ గ్రంథ సారం అన్నమాట.! ఇందులో శివానంద ఎలాంటి సాధనా చేయడు. ఎందుకంటే ఇతగాడి స్థూల శరీర అంశ అయిన పరమహంస పవనానంద ద్వారా కపాలమోక్షం గ్రంథంలో…తన సాధన అనుభవాలు లోకానికి పంచుకోవడం…జరిగింది కదా! అదే ఇప్పుడు ఈ “విశ్వ మోక్ష” గ్రంథము… ఈయన ధర్మపత్ని శివ నందిని సాధన అనుభవాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈమె సాధన పరిసమాప్తి అయ్యి…. ఈమె దగ్గరికి ధ్యాన శివమూర్తి వస్తాడో, అప్పుడు శివానంద కాస్త తన దగ్గర ఉన్న కామాక్షి మూర్తితో అనుసంధానం చేస్తే…. ఏం జరుగుతుందో, ఏమి జరిగిందో అప్పుడు వీరిద్దరి సాధన అనుభవాలు కలిసి పొందడం జరుగుతుంది. అయితే విశ్వమోక్షం! లేదంటే ఎవరికి వారే పురుష మరియు స్త్రీ వ్యక్తిగత మోక్షాలు పొందడం జరుగుతుంది. ఏం జరుగుతుందో…. ఎవరికి ఎరుక!
అలాగే నా సాధన ఆరంభం అనేది…. ఏడుపుతో మొదలు పెడితే, శివనందిని సాధన అనేది ఆత్మహత్య ప్రయత్నం కాశి క్షేత్రంలో చేయడంతో ఆరంభం అవుతుంది. కాబట్టి ఈ సాధన గ్రంధం కూడా ఈమె ఆత్మకథ అని ….అది కూడా ఒక స్త్రీ మూర్తి సాధన గ్రంథం అని గ్రహించండి. ఈమె సాధన అనుభవాలతో 80% ప్రతి స్త్రీ మూర్తి సాధనలో వస్తాయని…. అలాగే ఆమెకి వచ్చే దైవిక వస్తువులు, దైవిక శివలింగాలు కూడా మోక్ష సాధన చేసే ప్రతి స్త్రీ మూర్తికి వస్తాయని గ్రహించండి. అలాగే మోక్ష సాధన కాకుండా అవసర భక్తితో, కోరిక భక్తితో ,అలాగే ప్రసాద భక్తితో సాధన చేసే స్త్రీ మూర్తి కి ఈమె సాధన అనుభవాలు ఏమాత్రం సరిపోవని గ్రహించండి. ఎందుకంటే…. ఈమె సాధన ఆరంభమే కోరికలు తొలగించుకొని …అన్ని బంధాలు ,బంధనాలు ,వదిలించుకుని పరిత్యాగి చేసి మోక్ష సన్యాసిని దీక్ష తీసుకుని…. సాధన ఆరంభం చేస్తుంది . గృహస్థ ఆశ్రమం నుంచి బయటపడి , సన్యాస ఆశ్రమ దీక్ష పొంది… ఈమె సాధన ఆరంభమైంది . అదే నా పరంగా గృహస్థ ఆశ్రమంలో నేను ఉండి 80%తో సాధన పూర్తి చేసి 20 శాతం కోసం అరుణాచల క్షేత్రంలో మోక్ష సన్యాస దీక్ష తీసుకుని….. నా సాధన పరిసమాప్తి చేసుకుంటే…. ఈమె మాత్రం 20% గృహస్థ ఆశ్రమంలో సాధన చేసుకొని మిగిలిన 80% సాధనను పరిసమాప్తి కోసం కాశీ క్షేత్రంలో మోక్ష సన్యాసిని దీక్ష తీసుకొని సాధన ఆరంభిస్తోందని నాకు జ్ఞాన స్ఫురణలు అందాయి. అలాగే ఈమెకి సాధనా రహస్యాలు ఇచ్చే సాధనా మూర్తి వచ్చిందని, అలాగే కాశీ క్షేత్రంలో ఉన్న విశాలాక్షి దేవి విగ్రహ మూర్తి యొక్క రహస్యమును ఎలా చేధించిందో …..ఏమీ పొందినదో నాకు ధ్యాన అనుభవాలు మరియు జ్ఞాన స్పురణలు అందడంతో…. ఈమె సాధన కథ కాదని….. నిజ అనుభవాలని గ్రహించి, అర్థమై ఒక స్త్రీ మూర్తి సాధన అనుభవాలు యథాతథంగా లోకానికి అందించాలని నాకు బలంగా అనిపించి…. ఈ గ్రంథకర్తగా రాయడం జరుగుతుంది. నేను ఏదీ కూడా కారణం లేకుండా చేయనని, ఏది కూడా అకారణంగా నమ్మనని ….మీ అందరికీ తెలుసు కదా! నాకే ఆశ్చర్యం అనిపించే విధంగా….. నాకే తెలియని మర్మ రహస్యాలు…ఈమె సాధన అనుభవాలలో తెలుసుకోవచ్చు అని నాకు బలంగా అనిపించడంతో ఈ గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది . ఈ సాధన ఎక్కడిదాకా వెళ్తే అక్కడదాకా ఈ గ్రంథంలో అధ్యాయాలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ సాధన పరిసమాప్తి కాకుండా మధ్యలో ఆగిపోతే ….అక్కడితో ఈ గ్రంథం రాయడం కూడా ఆగిపోతుంది. అంతే కానీ ఈమె సాధన పరిసమాప్తి చేయకుండా….. సాధన పరిసమాప్తి చేసిందని…. అదేదో నేను ఊహించి రాసి ఈ గ్రంథమును ఎన్నటికీ పూర్తి చేయను. చేయలేను . అది నా మనః సాక్షికి విరుద్ధం అన్నమాట ! నాకు గ్రంధం రాయడం లేదా పూర్తి చేయడం నా లక్ష్యం కాదు . ఒక స్త్రీ మూర్తి సాధకురాలు అయితే …..ఆమె ఎక్కడిదాకా వెళ్తుంది? ఎలాంటి సాధన అనుభవాలు పొందుతుంది? ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు మాయలు దాటిందో తెలుసుకోవాలని ఉత్సుకతతో, ఉత్సాహంతో ఈ గ్రంథ రచనకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను. మీరంతా కూడా ఈమె మోక్ష సాధన ఆధ్యాత్మిక యాత్రకు ఈమెతో కలిసి ప్రయాణం చేస్తారని ఆశిస్తూ…..
ఇట్లు
పరమహంస పవనానంద
(పరమహంస శివానంద)
పరమహంస శివ నందిని
(అరుణగిరి యోగిని
అపీతకుచాంబిక దేవి)
పవన నందా పరమహంస గారికి మనస్పూర్తిగా నమస్కారం...ఈ గ్రంథం చదవడం నా అదృష్టం గా భావిస్తున్నాను..మీ సాధన అనుభవాలు నాకు చాలా శాంతి మరియు సాధన వైపుగా తీసుకెళ్లినాయి.. ఎప్పుడు అమ్మ సాధన అనుభవాల కోసం ఎదురూ చూస్తాను.. ఈ మెసేజ్ మీకు చేరిందని ఈశ్వరుడు అమ్మ సాక్షిగా నమ్ముతున్నాను.. మనస్పూర్తిగా నమస్కారం
రిప్లయితొలగించండి