అధ్యాయం 83


మోక్షం – మోసం

ఇదేమిటి కొత్తగా అంటారా? నాకు కడుపు మండి వ్రాస్తున్న అధ్యాయం అన్నమాట. నా నా చంకలు నాకి అన్ని రకాల మాయను దాటి సాధన చేస్తే ప్రస్తుతం ఈ సాధన కేవలం స్థూల కర్మలు మాత్రమే కర్మశేషము లేకుండా సంపూర్తి అయ్యాయని ఇంకా నాలుగు కర్మలు అనగా సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ ప్రారబ్ద కర్మలను  నివారణ చేసుకోవాల్సి ఉంటుందని అప్పుడే నీకు మనో నిశ్చల స్థితి కలిగి పరమ ప్రశాంతత పొందుతారు అని దీనినే మోక్షపధం అని దానితో నీ సాధన సంపూర్ణంగా పరిసమాప్తి అయినట్లుగా అని చెప్తే ఎవరికైనా కాలుతుందా లేదా?కాలుతుంది కదా. అలాగే నాకు కాలింది. దీనెమ్మ జీవితం. 27 సంవత్సరాల పాటు ఈ జన్మ సాధన అంతా కేవలం స్థూల కర్మల నివారణకు అని తెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక మిల్లీ సెకండ్ తేడా లో గోల్డ్ మెడల్ పోతే అలాగే లూయిస్ డక్ వర్త్ పద్ధతిలో వరల్డ్ కప్ కోల్పోతే ఎలా ఉంటుందో అలా నా పరిస్థితి తయారైంది. ఏమి చేయాలో తెలియదు. ఎవర్ని అడగాలో తెలియదు. దేనిననాలో తెలియదు. ఎందుకనాలో తెలియదు. కాకపోతే ఏమిటి నా బొందా. నా బూడిద. మోక్షమును అదే నిశ్చల స్థితిని పొందడానికి పంచ శరీరాలతో పంచకర్మలు అది కూడా కర్మ శేషము లేకుండా నాశనం చేసుకోవాలా? అప్పటికే మనకి పరమశాంతి వస్తుందా? లేదంటే రాదా? ఒక స్థూల శరీర స్థూల కర్మలను అనగా 48 లక్షల కర్మలను కర్మశేషము లేకుండా నివారణ చేసుకోవటానికి గత జన్మల సాధన శక్తితో ఈ జన్మలో 30 సంవత్సరాలపాటు అన్నిటిని వదిలిపెట్టి ఆధ్యాత్మిక సాధన పిచ్చివాడిగా మారి ఏదో మోక్షమును సాధించాలని నా నా చంకలు నాకి తే నువ్వు కేవలం మోక్ష సాధన లో 0.1% శాతం మాత్రమే చేసినావు అంటే ఏమనాలి? ఇంకా నీకు కర్మలే మిగిలి ఉన్నాయి అంటే ఏమి చేయాలి? వీటి కోసం మళ్లీ అనగా సూక్ష్మ కర్మల కోసము సూక్ష్మ శరీరంతో గ్రహ లోకాల యందు జన్మించి సాధన చేయాలి అదే కారణ కర్మల నివారణ కోసం కారణ  శరీరముతో సప్త దైవ లో కాలు యందు జన్మించి సాధన చేయాలి. అదే సంకల్ప కర్మల నివారణ కోసం సంకల్ప శరీరముతో అష్ట ఇష్టలోకాల యందు జన్మించి సాధన చెయ్యాలా? చిట్టి చివరిదైన ఐదవది అయిన ఆకాశ కర్మలు నివారణ కోసం ఆకాశ శరీరంతో సాధన చేసి నాశనము అయితే గానీ మోక్షము పొందినట్లు కాదా? దీనికి ఏమైనా అర్థం ఉందా? పరమార్ధము ఉందా? ఇలా చేస్తే గాని మోక్షం అదే పరమ ప్రశాంతత స్థితి లేదా నిశ్చలస్థితి రాకుండా ఆదియుగములో ఎవరో ఏర్పాటు చేసి ఉండాలి కదా. ఆ నాయాల ఎవడో గాని బాగా అతి తెలివితేటలు ఉపయోగించి ప్రశాంతత స్థితిని ఇలా పంచకర్మ నివారణ పేరుతో పంచ శరీరాలతో పంచ లోకాల యందు చాలా గుప్తంగా ఉంచినాడు. ఆ నాయాల కనపడాలి. అడ్డంగా నిలువుగా ఒకటే వేటు అన్నమాట. 
 
శబ్ద పాండిత్య మహా పండితులు మాత్రం తమకున్న అర్థ జ్ఞానముతో మోక్షం అంటే బంధాలు విడిపోవడమే ధర్మ- అర్ధ- కామ- పురుషార్థాలను చేస్తే సహజసిద్ధంగా మోక్షం దానంతట అదే వస్తుందని నేనెవర్ని అని తెలుసుకుంటే మోక్షం వస్తుందని… కామ కర్మలు చేస్తే మోక్షం వస్తుందని… అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుంటే మోక్షం వస్తుందని… మాయా రహితంగా ఉంటే మోక్షం వస్తుందని… బ్రహ్మజ్ఞానము పొందితే మోక్షం వస్తుందని… శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము పొందితే మోక్షం వస్తుందని …పేదలకు సహాయం చేస్తే అనగా మానవ సేవయే మాధవ సేవ చేస్తే మోక్షం వస్తుందని… కాశీ క్షేత్రంలో మరణం పొందితే మోక్షం వస్తుందని… సప్త మోక్ష పురాల యందు మరణం పొందితే మోక్షం వస్తుందని… అష్టాంగ యోగ సాధన చేస్తే మోక్షం వస్తుందని… విగ్రహారాధన చేస్తే మోక్షం వస్తుందని… విశ్వఆరాధన చేస్తే మోక్షం వస్తుందని …కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గాలలో సాధన చేస్తే మోక్షం వస్తుందని ఇలా పలు మార్గాలలో జనాలను మోక్షం పేరుతో ఎలా మోసం చేయవచ్చో అలా అన్ని విధాలుగా మన పూర్వీకుల మహర్షులు చేసి పెట్టినారు. వీటిని శబ్ద పాండిత్య పండితులు తమకున్న మిడి మిడి జ్ఞానంతో వెలికితీసి మోక్షం మోసం కొనసాగించారు. అదేమిటి అలా అంటారు ఏమిటి? అంటే అంటే పైన చెప్పిన మార్గాలన్ని కూడా నేను ఈ జన్మ యందు తూచా తప్పకుండా చేస్తే నాకు మాత్రం కలిగిందా? లేదు కదా. కేవలము స్థూల శరీర కర్మల నివారణ అయ్యి స్థూల శరీర కపాలమోక్షం మాత్రమే కలుగుతుందట. 

క్రిందటి గ్రహాంతరయానము అనే అధ్యాయంలో నా ధ్యాన అనుభవాలు చెబుతున్నాయి కదా. నా భవిష్యత్ జన్మగా సూక్ష్మ శరీరంతో గురుగ్రహ వాసిగా జన్మించి అక్కడ నుండి సూక్ష్మ కర్మలు అటువైపు కారణ కర్మల నివారణ కోసం ఊర్ధ్వ సప్త దైవ లోకాలలో ఏదో లోకం లో జన్మించి నివారణ చేసుకోవాలి కదా. అటుపై సంకల్ప కర్మలు ఆపై ఆకాశ కర్మలు నివారణ అయితే కానీ మన శబ్ద పాండిత్య పండితులు చెప్పిన మోక్షం గానీ అలాగే అనుభవ పాండిత్య గురువులు చెప్పిన పరమ ప్రశాంత స్థితి మోక్షం కలగదని తెలుస్తోంది కదా. నేను అనేది ఏంటంటే భూలోకము నందు సాధన జన్మ ద్వారా సాధన చేస్తే కేవలం స్థూల కర్మలే నివారణ అవుతాయని మిగిలిన కర్మల కోసం ఆయా లోకాలలో యందు ఆయా శరీర జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని ముందుగానే మాలాంటి సాధకునికి నిజం చెప్పి ఉంటే సాధన చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుని తనకి భూలోకము నుండి విముక్తి పొందాలని అనుకునే వాడు మాత్రమే యోగ సాధన చేస్తాడు కదా.అదే నాలాంటి వాడు ఏమి అనుకుంటాడు. ఈసాధన జన్మ యందు సాధన చేస్తే సంపూర్ణ మోక్ష స్థితి కలిగి పునర్జన్మ లేని కర్మ లేని స్థితిని అదే కర్మ రహిత స్థితి పొందటం ద్వారా జన్మరాహిత్యం కలిగి ఎక్కడ ఏ లోకాలు యందు జన్మలు ఉండవని శూన్యమునందు లీనము అవుతావు అని అనుకుని యోగ సాధన చేయడం జరుగుతుంది. నేను ఒకటి తలిస్తే మరొకటి అయినది. నిజానికి మన పూర్వీకులు చెప్పినది ఒకటి. ఆ తర్వాత వచ్చిన మిడిమిడి జ్ఞానం పండితులు ఏదో అర్థం చేసుకుని ఏదో భావించి ఏదో ప్రచారం చేశారని నాకు ఇప్పుడే అర్థం అవుతోంది.
 
ఉదాహరణకి మన పూర్వీకులు మహర్షులు సాధన యందు గోమాంస భక్షణ చేయాలని చెబితే వాళ్ల దృష్టిలో ఇది అంటే ఖేచరీ ముద్ర సాధన అన్నమాట. కొండనాలిక వద్ద స్రవించే అమృతధారను ఖేచరీ ముద్ర ద్వారా సేవనం చేయడమే గోమాంస భక్షణం అవుతుందని చెపితే ఆ తర్వాత వచ్చిన అజ్ఞాన పండితులు కాస్త ఆవు మాంసం తినాలని అర్ధ జ్ఞాన ప్రచారం చేసి కొత్త మత విధానమును ఏర్పరచుకున్నారు. అంతెందుకు సాధనలో వచ్చే పంచ మకారాలు అనగా మద్యపానము, మాంస భక్షణ,మత్స్యము, ముద్ర, మైధునం అంటే పాత పూర్విక మహర్షుల దృష్టిలో మద్యపానము అంటే అమృతధార సేవనం అనగా కొండ నాలుక చివర కింద జాలువారే రసమును ఖేచరీ ముద్రతో నిత్యము సేవనం చేస్తే అదియే అమృతధారగా మారి యోగ మత్తును ఇస్తూ ఉండటం వలన దానిని మన పూర్వీకులు మహర్షులు మద్యపానం అని సంబోధించడం జరిగితే ఆ తర్వాత వచ్చిన మిడిమిడి జ్ఞానం పండితులు కాస్త దీని అర్థము మార్చివేసి ఏకంగా నిజమైన మద్యం సేవించే తాంత్రిక విధానాలు ఏర్పరిచి తాంత్రిక యోగులను తయారు చేసినారు. నిజ మద్యపానం అలవాటు పడిన వాడు తాగుబోతు కాక మరేమిటి? ఇది తాగిన వాడికి మోక్షము వస్తే ఈపాటికి నూటికి 95 శాతం మందికి మోక్షము రావాలి కదా. ఇంకా సాధనలు ఎందుకు? ఎంచక్కా ప్రతిరోజు ప్రతిక్షణం మనకు కావాల్సిన బ్రాండ్ బాటిల్స్ సేవనం చేస్తే సరిపోయేది కదా. నా బొంద. అర్ధ జ్ఞాన పండితులు వలన అసలు నిజ జ్ఞానమంతా గంగపాలు అయింది. అర్ధం లేని పనికిమాలిన జ్ఞానమే నిజంగా రాజ్యమేలుతోంది. నిజమని నాలాంటి సాధకులు మోసపోవడం పరిపాటి అయినది. నిజ జ్ఞానం ఏమిటో మన పూర్వికులు ఋషులు చెప్పిన పదాలకి నిజమైన అర్థం ఏమిటో లాహిరి మహాశయులులాంటి మహాత్ములు కొంతమంది లోకానికి తెలియజేయడం జరిగినది. కాని వీరు ఇలాంటి నిజమైన జ్ఞానం ప్రచారంలోనికి రాకపోవడం విచారించదగ్గ విషయం. ఇప్పుడు కేవలం అసంపూర్తిగా అసందర్భ అర్ధ రహిత జ్ఞానమే రాజ్యమేలుతోందని నాకు అర్థం అయినది. వీరంతా కూడా మోక్షము పేరుతో మోసం చేస్తున్నారని గ్రహించండి. తెలుసుకోండి. 
 
నిజానికి మోక్షము అనేది పంచ శరీరాల సాధన అన్నమాట. పంచకర్మల నివారణ అన్నమాట. లోకాల జన్మల సాధన అన్నమాట. ఇలాంటి సాధన వలన సాధకుడు పంచ శరీరాలకు కపాల మోక్షమును మొట్టమొదటి పొందితే గాని సాధకుడికి ఎలాంటి రూపం నామము లేని నిరాకార బ్రహ్మ స్థితిని పొంది శూన్యం అవుతాడని గ్రహించండి. దీనికి ఖచ్చితంగా ఎన్నో జన్మలు పడతాయి. అంతెందుకు. స్థూల శరీర కర్మల నివారణ కోసం అది కూడా మొదట భూలోకమందు జన్మించి 48వ జన్మలో తనకున్న 48 లక్షల ప్రారబ్ద కర్మలు కొంత కొంత నివారణ చేస్తే మూడు కోట్ల జన్మలు పడుతుంది. అదే మిగిలిన నాలుగు శరీరాలకి నాలుగు కర్మలు నివారణకోసం ఎన్ని జన్మలెత్తాలో ఆ శూన్యానికే తెలియాలి. కాబట్టి మోక్షము అంటే ఇది ఒక జన్మలో రాదు అని గ్రహించండి. ఎంతటి జితేంద్రియుడు అయినా కూడా రాదు అని గ్రహించండి. కేవలం ఆ శరీర కపాల మోక్షం కలుగుతుందని తెలుసుకోండి. మిగిలిన వాటి కోసం ఆయా లోకాలలో ఆయా శరీరాలతో జన్మలెత్తి సాధన చేసుకుని ఆ కర్మలు నివారణ చేసుకుని ఆయా కపాలమోక్షం పొందవలసి ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు తన పంచ శరీర పంచ కర్మలు కర్మశేషము లేకుండా నివారణ అవుతుందో అప్పుడే అతనికి సంపూర్ణ పంచ కపాలమోక్షం స్థితి కలిగి సంపూర్ణ మోక్షం స్థితిని పొందడం జరుగుతుంది.కాకపోతే ఒకే జన్మలో ఒకే శరీరంతో ఈ పంచ కపాలమోక్షం స్థితిని ఏ భగవంతుడు, ఏ దేవుడు, ఏ యోగి, ఏ గురువు, ఏ సాధకుడు సాధించలేడు. బలహీనత లేని బలవంతుడే లేడు కదా. అందరికీ ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది కదా. తొక్క లోనిది 48 లక్షలు స్థూల శరీరము కర్మల నివారణకోసం మూడు కోట్ల జన్మలు ఎత్తడం జరిగినది. ఇంకా మిగిలిన వాటికి ఇంకా ఎన్ని కోట్లు జన్మలెత్తాలో ఎవరికి ఎరుక. 

కాశీక్షేత్రంలో సంపూర్ణ మోక్షం స్థితి కలగదా?

అది ఏమిటి? కాశీక్షేత్రంలో మనము మరణం పొందిన కూడా సంపూర్ణ మోక్షం కూడా అదే పంచ కపాలమోక్షం స్థితి కలగదా? అంటే కలగదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. కేవలం అక్కడ స్థూలశరీరం కర్మలు నివారణ అయ్యి స్థూల శరీర కపాల మోక్షం కలుగుతుందని నా పరిశోధనలో తేలింది. అది ఎలా అంటారా చెబుతాను వినండి. ఈ క్షేత్రం అనేది మన యోగ చక్రాలలో ఆజ్ఞాచక్రమునకు సంబంధించిన క్షేత్రం అని అందరికీ తెలుసు కదా.అలాగే ఈ క్షేత్రమందు విశ్వనాథుడు కాస్త మణికర్ణికా ఘాట్ యందు తారకరామ మంత్రోపదేశం చేస్తాడని దానివల్ల కర్మ నివారణ జరిగి కర్మ విముక్తుడై జీవుడు అవిముక్తమైన మోక్షం పొందుతాడు అని శాస్త్రవచనం కదా. అన్నిరకాల పురాణాలు ఇతిహాసాలు యోగుల అనుభవాలు అలాగే నా స్వానుభవం కూడా ఇదే నిజమని చెబుతున్నాయి. నిజమే కానీ ఇందులో అసలు సిసలు తిరకాసు ఉంది. ఏమిటంటే తారక రామ మంత్రము అంటే 'రా' అలాగే 'మ' అనే అక్షరాల కలయకే కదా.యోగశాస్త్రం ప్రకారం 'మ' అనే అక్షరము మణిపూరక చక్రము నందు బీజాక్షరము గా ఉంటే అదే 'రా' అనే అక్షరము కాస్త ఆజ్ఞా చక్రము నందు బీజాక్షరము గా ఉంటుందని చెప్పింది కదా. అంటే మణిపూరక చక్రము అనేది బ్రహ్మ గ్రంధి పైన ఉంటుందని ఆజ్ఞాచక్రము అనేది రుద్రగ్రంధి లోపల ఉంటుంది అని అందరికీ తెలుసు కదా. అంటే బ్రహ్మ గ్రంధి అంటే భూలోక కర్మలు అలాగే రుద్రగ్రంధి అంటే సూక్ష్మ లోక కర్మలు అని గ్రహించండి. ఎందుకంటే బ్రహ్మ గ్రంధి క్రిందనే స్వాధిష్టాన మూలాధార చక్రాలు ఉంటాయి. ఇందులో మూలాధార చక్రం అయితే కామానికి ప్రతీక అయితే స్వాధిష్ఠాన చక్రము అనేది ధనానికి ప్రతీక అని తెలుసు కదా. ఈ రెండే ప్రారంభ మాయలుగా వస్తాయి అని తెలుసు కదా. కామానికి గురి అయితే జన్మ వచ్చేది. వచ్చిన ఈ జన్మ బతకడానికి ధనం కావాలి కదా. ఈ రెండు చక్రాలు భూలోక సంబంధ స్థూల శరీర కర్మలను ఏర్పరుస్తాయి అని తెలుస్తోంది కదా. ఎప్పుడైతే ఎవరైతే తమ బ్రహ్మ గ్రంధిని దాటుతారో వారికి ఈ స్థూల కర్మలు ఉండవని మనకు అర్థమవుతుంది కదా. ఇక ఆజ్ఞాచక్రం  విషయానికి వద్దాము. ఇది కాస్త రుద్రగ్రంధి కిందనే ఉంది. దీని ఆధీనములో మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాలు ఉన్నాయన్నమాట. రుద్రగ్రంధి దాటితేగాని సాధకుడుకి ఈ కారణ కర్మలు  కారణ లోకాలు రావు అన్నమాట. ఇది మహా విష్ణువు అధీనంలో ఉంటుంది. అనగా సహస్రార చక్రంలో సహస్ర కారణ లోకాలలో సహస్ర కారణ శరీరాలతో సహస్రకోటి కారణ కర్మలు నివారణ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే రుద్రగ్రంధి లోపల అయితే సూక్ష్మ లోక కర్మలు ఉంటాయని దానికి తగ్గ నవగ్రహ లోకాలు ఉంటాయని దానికి తగ్గ శరీరాలతో దానికి తగ్గ లక్షా ఇరవై వేల సూక్ష్మ కర్మలు  కాస్త కోటి 20 లక్షల కర్మలు గా మారి ఉంటాయని మనకు తెలుస్తోంది కదా. ఇప్పుడు కాశీ క్షేత్రానికి వద్దాము. ఇక్కడున్న విశ్వనాధుడు మనకి తారక రామ మంత్రము ఉపదేశం చేస్తాడు. మంత్రోపదేశం చేస్తున్నాడు కదా. అంటే రామ మంత్రమే కదా. అనగా యోగశాస్త్రం ప్రకారం మణిపూరక చక్రము అలాగే ఆజ్ఞాచక్రము అనుసంధానం చేస్తున్నట్లే కదా. అంటే ఈ మంత్రోపదేశం వలన స్థూల కర్మలు  కర్మశేషము లేకుండా సూక్ష్మ లోకాలు యందు సూక్ష్మ శరీరంతో సూక్ష్మ కర్మలు నివారణ చేసుకునే అవకాశం కలిగిస్తున్నాడని అని ఎవరైనా ఊహించగలరా? అంటే ఈయన కూడా అన్ని రకాల కర్మలు  నివారణ చేయడం లేదు. అలాగే పంచ శరీర కపాలమోక్షం ఇవ్వటంలేదు. కేవలము స్థూల శరీర కర్మ నివారణ చేసి స్థూల శరీర కపాలమోక్షం మాత్రమే ఇస్తున్నాడని ఎవరైనా ఊహించగలరా? ఎందుకంటే ఈయన రుద్రగ్రంధి దాటడం లేదు. ఎలా అంటే ఈ క్షేత్రం కేవలం ఆజ్ఞా చక్రానికి మాత్రమే సంబంధించినది కదా. అదే కారణ లోకమైన సహస్రార చక్రము అనేది ద్వారకా క్షేత్రమును సంబంధించినది అని శాస్త్ర వచనము కదా. ఈ లెక్కన చూస్తే కాశీ విశ్వనాథుడు మనకి కేవలం స్థూల శరీరం కర్మలు  మాత్రమే నివారణ చేస్తున్నాడు. ఈ జన్మలో కర్మలు లేకుండా విముక్తి కలిగించి అవి కొద్దిగా మార్చి సూక్ష్మ కర్మల నివారణకోసం సప్త ఊర్ధ్వలోకాలు యందు జన్మించే టట్లుగా చేస్తున్నాడని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. ఇంకొక విచిత్రం చెప్పనా? కాశీ క్షేత్రంలో మరణించిన అందరికీ స్థూల శరీరంలో కర్మలు నివారణ కావు. కర్మ శేషం మిగులుస్తాడు. ఎలా అంటే పంచకోశ ప్రాంతములో విశ్వనాథుడు గుడి పరిసరాలలో చనిపోయినవారికి వాటికి మాత్రమే ఇలాంటి తారకరామ మంత్రోపదేశము జరిగి స్థూల కర్మలు  పూర్తిగా నివారణ చేసి ఆయా సూక్ష్మ  శరీరాలను తన ఆధీనంలో ఉన్న సూక్ష్మ లోకాలకి సూక్ష్మకర్మలు   నివారణ చేసుకోవాల్సి ఉంటుందని పంపించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో మిగిలిన ప్రాంతాల్లో మరణించిన వారికి స్థూల శరీర కర్మ శేషమును ఉంచుతాడు. అధిపతిగా కాలభైరవుడుని ఉంచి వారికి భైరవ యాతన ద్వారా ఈ కర్మశేషము నివారణ చేస్తాడు. దాని కోసం ఈ క్షేత్రంలో ఆ జీవుడు కొన్ని రోజుల నుండి కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఇలా అందరూ కూడా ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతే భూలోకము ఖాళీ అయిపోతే మరి నామరూప దైవాలను పూజించేవారు ఎవరు?సేవలు చేసేది ఎవరు? వాళ్లకి కావలసిన భోజనాలు శయనాలు పెళ్లిళ్లు చేసేది ఎవరు? వేళకి భోజనాలు అదే నైవేద్యాలు పెట్టేది ఎవరు? నిద్ర లేపేది ఎవరు?  పడుకో పెట్టేది ఎవరు? మంత్రాల పేరుతో ప్రార్థన పేరుతో వారిని పొగడ్తలతో ముంచెత్తేదెవరు? అందుకని కాశీక్షేత్రంలో చనిపోయే 100 మందిలో ఒకరికి మాత్రమే పంచక్రోశ ప్రాంతంలో చనిపోయేటట్లుగా అనుగ్రహించి వారిని లోకాలకి పంపిస్తున్నారు అన్నమాట. మిగిలిన 99 శాతం మంది కాశీక్షేత్రంలో పుడుతూ జన్మిస్తూ చస్తూ కర్మ శేషము నివారణ కోసం భైరవ యాతన పడుతున్నారు.నా నా చంకలు నాకుతున్నారన్నమాట. మరి శివయ్య పిలుపు వచ్చేదాకా ఈ తిప్పలు తప్పవు కదా. అదేమిటి మీ ప్రాబ్లం? మీ పాపపుణ్యాల యొక్క ప్రారబ్ద కర్మ ఫలితాలను బట్టి జరుగుతుందని తప్పుకుంటారా? నా బొందా. నా బూడిద. మనకున్న పాపకార్యములు ఆయన కూడా నివారించ లేకపోతే ఇంకెందుకు వాళ్ళని పూజించడం, భజించడం.నా బొంద. కాకపోతే అసలు ఆదిలో మనకి ఈ కర్మలు ఇచ్చింది ఆయనే కదా. కష్టాలు మనకి సుఖాలు వాళ్ళకా? ఆలోచించండి. కర్మలు జన్మలు మనకి దైవారాధన వాళ్లకి. అందరూ ఒకటే కదా. కానీ ఏ ఒక్కరూ ఆలోచించరు. మనకి ఆశ, భయము, ఆనందము అనే వరాల మాయలో ఉంచి ముంచి వాళ్లకి కావాల్సిన సేవలు దొబ్బి మరీ చేయించు కుంటున్నారు.పోనీ వీళ్ళైన సుఖ పడుతున్నారా అంటే అదీ లేదు. వీళ్ళు కాస్త కారణ లోకవాసులకు సేవలు చేస్తారు. వాళ్ళయినా సుఖ పడుతున్నారా అంటే అదీ లేదు. వాళ్లు కాస్త సంకల్ప శరీర వాసులకి సేవలు చేస్తారు. వాళ్ళయినా సుఖ పడుతున్నారంటే వాళ్లు కూడా ఆకాశ శరీరధారులకు సేవలు చేస్తూ ఉంటారు. వీళ్లు యుగానికి ఒక్కడు కల్పానికి ఒక్కడు అన్నమాట. శూన్య బ్రహ్మానికని అందరి చేత వీళ్ళ సేవలు, పూజలు, వ్రతాలు, నోములు చేయించుకుంటారు అన్నమాట. 

ఇదంతా చూస్తుంటే చైనీస్ పెట్టె లాగా ఉంటుంది. అడుగు పెట్టెలో తొమ్మిది రకాల పెట్టెలు అనగా 0.5mm దాకా ఉంటాయి. అంటే పెట్టె తీస్తున్న కొద్దీ మరొక పెట్టె వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒక పెట్టెతో మొదలై తొమ్మిది రకాల పెట్టెలు తెరవవలసి ఉంటుంది. స్థూల శరీరంతో మొదలై ఆకాశ శరీరం దాకా అన్ని రకాల కర్మ జన్మలు నివారణ పేరుతో వాటికున్న బ్రహ్మరంధ్రం తెరుచుకొని అక్కడ ఉన్న బ్రహ్మాండ చక్రము అనే కృష్ణబిలము నందు ఆయా జన్మల కర్మ శేషం లేకుండా నివారణ చర్యలు తీసుకుంటే కాని పంచ శరీరకపాలమోక్ష స్థితి అదియే సంపూర్ణ కపాలమోక్ష స్థితి పొందలేము అని గ్రహించండి.అంతేగాని కాశీలో మరణం పొందితే సంపూర్ణ కపాల మోక్షం జరగక కేవలం స్థూల కర్మలు నివారణ జరిగి స్థూల శరీర కపాల మోక్షం పొందడం జరుగుతుందని గ్రహించండి. ఈ క్షేత్రము నందున కాలభైరవుడి చేతి నుండి అంటుకున్న బ్రహ్మకపాలం వీడినది. దీనిని కపాలమోక్షం అనే తీర్ధమునందు పూడ్చిపెట్టినాడని కాశీ పురాణంలో ఇతిహాసం ఉన్నది కదా. నిజానికి ఈ క్షేత్రంలో కేవలం స్థూల శరీర కపాల మోక్షం మాత్రమే ఇచ్చారు అన్నమాట. కానీ అర్ధ జ్ఞాన పండితులు ప్రచారం వలన ఏకంగా సంపూర్ణ కపాల మోక్షం కలిగే అవిముక్తముగా మార్చే అవిముక్త క్షేత్రమని గగ్గోలు పెట్టినారు. నాలాంటి సాధకులు ఇది నమ్మి అక్కడికి వెళ్లి నా నా చంకలు నాకుతూ బాధలు పడుతూ సాధన చేస్తున్న వారిని నేను నా కళ్ళారా చూశాను.అంతెందుకు. 

మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి అలాగే మా తృతీయ శిష్యుడైన కాకాజీ కూడా ఎవరికీ చెప్పకుండా ఈ క్షేత్రంమునకి వెళ్ళి తిరిగి నానా కష్టాలు పడి అక్కడ ఉండలేక ఇమడలేక వెనక్కి తిరిగి వచ్చినారు. ఇలా ఎంతో మంది సాధకులు కాశీక్షేత్రంలో ఏదో జరుగుతుందని ఏదో పొందవచ్చని వెళుతున్నారు. మోసపోతున్నారు. మరి ఈ కాశీ క్షేత్రమును గురించి అంతగా ఎందుకు ఎక్కువగా ప్రచారం చేసినారు అంటే స్థూల కర్మలు నివారణ అయ్యేది ఈ ఒక్క క్షేత్రము అని గ్రహించండి. ఇప్పటిదాకా భోగ ప్రపంచంలో సర్వసుఖాలు అనుభవించి అంతే కాలములో కర్మలు నివారణ కోసం ఆ విశ్వనాథుడు సంకల్పించి ఈ క్షేత్రమును ఏర్పరుచుకున్నాడు. కేవలము స్థూల శరీర కర్మలు నివారణ కోసం ఈ శరీర కపాల మోక్షం స్థితి కోసమే ఆయన ఏర్పాటు చేస్తే దానిని అర్ధ జ్ఞాన పండితులు మాత్రం సంపూర్ణ కపాలమోక్షం స్థితిని ఇచ్చే ప్రాంతమని తమ అభిమతాలను కాస్తా మతాలుగా శాఖలుగా విభజించి పాలించి ప్రచారము అదే అబద్ధ ప్రచారం చేసినారు. నా బాధ నా వేదన అదే అన్నమాట. ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేస్తే తప్పు లేదు. లేనిది మరికొంత కలిపి దానికి కాకమ్మ కథలు చెబుతూ మరికొంత మసాలా కలిపి పెద్ద పెద్ద గ్రంథాలు రాసి అందరినీ మోసం చేసినారు. మోసం చేస్తున్నారు. కేవలం తమ స్వార్థం కోసం తమ పేరు ప్రఖ్యాతుల కోసం కాసులకు కక్కుర్తిపడి చేసినారని అందరూ ఒప్పుకోక తప్పదు.అదే కాశీక్షేత్రంలో మనకి కేవలం స్థూల కర్మలు మాత్రమే నివారణ స్థూల శరీర కపాలమోక్షం స్థితి మాత్రమే కలుగుతుందని పూర్వీకులు చెప్పిన యదార్థగాథ జ్ఞానమును  ప్రచారం చేసి ఉంటే నాలాంటి సాధకులు తమ సాధన కోసం ముందుగానే కాశీక్షేత్రంకి వెళ్లి అభాసుపాలు అవ్వరు కదా. అవమానాలు పొందడు కదా. ఈతిబాధలు పడరు కదా. కావాలంటే అసలు విషయం తెలుసుకుని వెళ్తే వెళతారు. లేదంటే మానుకుంటారు. భూలోకములో పునర్జన్మ ఉండదు కానీ ఇతర గ్రహాలలో ఇతర దైవ లోకాలకు జన్మనిచ్చే క్షేత్రం కాశీ క్షేత్రం అని ఎవరికి ఎంతమందికి తెలుసో చెప్పండి. అందుకే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తోతాపురి, అవతార్ బాబాజీ మున్నగు మహాత్ములు ఈ క్షేత్రం గురించి నాకు లాగానే జ్ఞాన అనుభవాన్ని పొంది మౌనం వహించి లోకానికి తెలియ చేయకుండా ఆశతో అయినా కాశీ క్షేత్రానికి వెళ్లి స్థూలశరీర కర్మలు నివారణ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో గుప్తముగా ఉన్న వాళ్ళు మాత్రం వారి వారి ప్రాంతాల్లో జీవసమాధి చెందడం జరిగింది. అంతెందుకు. 

కాశీ క్షేత్రంలో మరణం పొందితే సంపూర్ణ కపాలమోక్షం వస్తుందని తమ సద్గురువు ఆదేశించాడని అమాయకుడైన నా సద్గురువు అయిన శ్రీత్రైలింగ స్వామి వారు ఏకంగా ఈ క్షేత్రము నందు రెండు వందల ఎనభై సంవత్సరాల ఆయుస్సు తో కాశీ వాసము చేసి పంచగంగా ఘాట్ యందు జీవ సమాధి చెందిన కూడా ఆయనకు సూక్ష్మ శరీరము మిగిలింది కదా. కేవలం స్థూల శరీరం త్యాగం అయినది. దానితో ఈయన కాస్త నడయాడే కాశీవిశ్వనాథుడిగా సూక్ష్మ శరీరంతో ఇక్కడ ఆవాసం చేస్తూ హిమాలయాలలో ఉన్న తన తోటి సహాధ్యాయులతో దశాశ్వమేధ ఘాట్ లో పాతాళ గది యందు ఇప్పటికే అక్కడ మాట్లాడుతూ నిజమైన సాధకుడికి సూక్ష్మ శరీరధారిగా కనపడుతున్నారు. ఒక ప్రక్క సుఖభోగాల మాయలో పడలేక అక్కడి లోకాలకు వెళ్లలేక ఆయా శరీర జన్మలు ఎత్తలేక సూక్ష్మ కర్మ నివారణ కోసం ఈ కాశీ క్షేత్రము నందు ఆవాసం చేస్తున్నారని అందరికీ తెలుసు. ఒక గురువు చెప్పిన అర్థ జ్ఞానం వలన ఉవాచ వలన ఆ సద్గురువు ఇలా మిగిలి పోవలసి వచ్చింది. చచ్చినట్లు అందరూ కూడా పంచ శరీరాలను ఆయా లోకాలలో జన్మించి పంచకర్మల కర్మశేషము లేకుండా నివారణ చేసుకోక తప్పదు అని గ్రహించండి. 

అంతెందుకు ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా పంచ కర్మల నివారణ కోసం పంచ శరీరాల యోగసాధన చేస్తున్నాడని ఎవరికైనా తెలుసా? అనగా ఉజ్జయిని క్షేత్రము నందు మహాకాలుడు రూపంలో నిజ రూప స్థూల శరీరంతో అదే కాశీ క్షేత్రము నందు కాశీ విశ్వనాథుడు గా నిజరూప సూక్ష్మశరీరముతో అదే మురుడేశ్వర్ క్షేత్రము నందు కారణ శరీరముతో ఆత్మలింగ రూపుడిగా సాధన చేస్తూ అదే అరుణాచల క్షేత్రము నందు చీకటి గుహ యందు మేధాదక్షిణామూర్తిగా నిజరూప సంకల్ప శరీరముతో సంకల్ప కర్మల నివారణ కోసం సాధన చేస్తూ అదే కైలాస పర్వతము నందు ఆకాశ శరీరముతో 36 కపాలధారిగా సదాశివమూర్తి గా ఆకాశ కర్మలు అనగా మూల ప్రారబ్ద కర్మల నివారణకోసం దానికి 1988 యుగాలనుండి యోగసాధన చేస్తున్నారని ఎవరైనా ఊహించగలరా?మరి ఈయనకెందుకు సాధన పరిసమాప్తి కావటం లేదు అంటారా? వారి సాధన శరీరాల సాధన స్థాయి శూన్య బ్రహ్మగా మారి పోయినప్పుడు అక్కడ వచ్చే బలహీనతకు గురి అయి భక్తులు లేక దీన జనోద్ధరణ కోసం మన కోసం మిగిలిపోవడం జరుగుతోంది. అనగా వీరి ప్రారబ్ద కర్మల నివారణ కోసం అనగా పంచ శరీరాల పంచకర్మల నివారణ కోసం ఈ పంచ క్షేత్రాలలో పంచ శరీరాలతో సజీవ మూర్తి గా ఉండి యోగ సాధన చేస్తూ మనకి కావాల్సిన జ్ఞాన శక్తిని కర్మ నివారణా శక్తిని ఆత్మశక్తిని యోగశక్తిని ఇస్తూ ఇస్తున్న అది యోగి అని ఇప్పటికైనా గ్రహించండి. ఇదంతా నిజమని మేము ఎలా నమ్మేది అంటారా అయితే సాధన చెయ్యండి. శూన్య బ్రహ్మ సాధన స్థాయికి రండి. అనగా మీరే శివోహం అన్నమాట. మీరే శివుడు అవ్వండి. అప్పుడు మీ అపస్మారక స్థితి వలన మీరు మర్చిపోయిన జ్ఞాపకాలు సాధన పరంపర జ్ఞప్తికి రావడం జరుగుతుంది. ధ్యాన అనుభవాలు జ్ఞాన స్పురణ నాకు లాగా పొందటం జరుగుతుంది. చేసి చూడండి. మీకే తెలుస్తుంది. కపాల మోక్షము గ్రంథములోని ప్రతి పేజీ ప్రతి వాక్యము ప్రతి మాట కూడా ఇలా నిజ బ్రహ్మజ్ఞానం నుండి వచ్చింది అని గ్రహిస్తారు. అంటే నేను తెలుసుకున్న సత్యాలు తిరిగి అవే జ్ఞాన సత్యాలని తెలుసుకుంటారు. అదేవిధంగా నిరూపణ అవుతుంది. అలాగే మా జిజ్ఞాసి కూడా తన ఆదిలో పొందిన ఈ జ్ఞాన సత్యాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి తీర్చుకోవాలని ప్రస్తుతానికి స్థూల కర్మల నివారణకోసం 36 కోట్ల జన్మలు ఎత్తి తను పొందిన జ్ఞాపకాల జ్ఞానమును ఈ జన్మలో యోగనిద్ర సాధన ద్వారా జ్ఞప్తికి తెచ్చుకుని చేసిన పని చేస్తున్నానని తెలుసుకుని ఏడవలేక ఆనందపడే స్థాయికి వచ్చినాడు. అంటే నిజ యోగసాధన అంటే 

ఏమీ తెలియని వాడు
ఏదో ఉందని సాధన చేస్తే
ఏమీ లేదని తెలుసుకోవడమే
నిజ యోగసాధన స్థితి.
 
శాస్త్రాలు గ్రంథాలు ఇతిహాసాలు పండితులు ప్రసంగాలు సత్యమని అదే శాశ్వతం అని అనుకోకండి. ఏదైనా నిజ జ్ఞానము మీకు కలగాలి అంటే మీకు మీరే సాధనచేసి నిర్ధారణ చేసుకోండి. జ్ఞాన అనుభవాల ద్వారా స్వప్న అనుభవాల ద్వారా జ్ఞాన సంపాదన పొందండి. అందుకే మన బుద్ధుడు కూడా నిజ జ్ఞానము కోసం ఎవరికి వారే సాధన చేయాలని చెప్పడం జరిగినది. అది ఎంతో సత్యమని నా సాధన పరిసమాప్తి లో తెలుసుకోవడం జరిగినది. ఇలా మేమిద్దరం కూడా ఈ మా సాధనలో తెలుసుకున్న  జ్ఞానాన్ని యథాతథంగా ఈ కపాలమోక్షం గ్రంథమునందు చెప్పడం జరిగినది. ఇది యథార్థ అనుభవాలసారమని గ్రహించండి. నిజానికి మాకు సాధన కాస్త హృదయ చక్రము నందు ఇష్టలింగ ఆరాధన చేస్తున్న సమయంలో గ్రంధ రచన మొదలైనది. అప్పటిదాకా జరిగిన మూలాధార చక్రము నుండి హృదయ చక్రం అనుభవాలు వరకే స్వానుభవాలు వ్రాయాలని అనుకున్నాము. ఎందుకంటే ఈ చక్రములోనే సాధన పరిసమాప్తి అవుతుంది అని భ్రమ భ్రాంతిలో అప్పుడు మేము ఉన్నాము. ఈ గ్రంథము రాసి యోగసాధకులకు అంకితము చేసి ఉచితంగా మా స్థోమతను బట్టి ఈ గ్రంధాలను ముద్రించి అందరికీ పంచి కాశీ క్షేత్రమునకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము. అప్పుడే విచిత్రము జరిగినది. అది ఏమిటంటే మా సాధన అనుభవాలు కాస్త హృదయ చక్రం అనుభవాల దాకా వివిధ నోటు పుస్తకాల్లో వ్రాయడము జరిగినది. మేము అనుకున్న పని అయినది అని అనుకునే లోపల నిజానికి హృదయ చక్రం వద్ద సాధన ఆగిపోదని ఇంకా సాధన ఉన్నదని అది బ్రహ్మరంధ్రము దాక వెళ్ళవలసి ఉంటుంది అని మాకు జ్ఞాన స్పురణ కలిగే సరికి అవాక్కవడం మా వంతు అయినది. దీనెమ్మ జీవితం. ఇంకా సాధన ఉందే అనుకుని అక్కడ నుండి అనగా హృదయ చక్రం నుండి మళ్లీ సాధన మొదలు పెట్టాము. అప్పుడు నుండి ఈ గ్రంథం మా చేతిలో లేదు. మా ధ్యాన అనుభవాలు మా చేతుల్లో లేవు. విచిత్ర సచిత్ర ధ్యాన అనుభవాలు కాస్త అనగా ఆధ్యాత్మిక తుఫాను దృశ్యాలు మా ఇద్దరికీ యోగనిద్ర యందు కలగడం మొదలు పెట్టినాయి అవి నిజాలు అనటానికి సాక్ష్యాధారముగా ఆయా క్షేత్రాలలో నుండి దైవిక వస్తువులు రావటం మొదలుపెట్టాయి.పోనీ బ్రహ్మరంధ్రం వద్ద దాకా వచ్చిన తర్వాత ఆగిందా? లేదు. అక్కడ నుండి  బ్రహ్మాండకరమైన కృష్ణబిలం లోనికి తీసుకు వెళ్ళాయి. పోనీ అక్కడైనా ఆగిందా? ఈ కృష్ణబిలం లోని అంతర్భాగాలలోనికి ఒక్కొక్క భాగమునకు రకరకాల అనుభవాలు రకరకాల దైవిక వస్తువులు వచ్చినప్పుడు మాకైతే నమ్మాలో ఏడవాలో అర్థం కాని స్థితి లోనికి వెళ్లి పోయినాము. కాకపోతే ఏమిటి? బల్లి –గబ్బిలం- తేలు- కపాలము కీ చైన్ లు కాస్త అలంపురం జోగులాంబ అమ్మవారి చిహ్నాలు అని ఎవరైనా గుర్తించగలరా? రిషికేశ్ నుండి వచ్చిన సుదర్శన చక్రాల సాలగ్రామము మన బ్రహ్మరంధ్రం లోని బ్రహ్మాండ కృష్ణ బిలమని గమనించగలరా?సహజ సిద్ధమైన గణపతి శంఖం ఓంకార శంఖమని ఊహించగలరా? ఇలా పలు దైవిక వస్తువులు ఆయా క్షేత్రాలలో నుండి రావడం జరిగినది.విచిత్రం ఏమిటంటే ఇవి మా దగ్గరికి వచ్చే ముందు మూడు రోజులు ముందు మాకు ధ్యానాల యందు ఈ దైవిక వస్తువులు అదే ఆకారాల రంగులతో ఆయా క్షేత్రాల్లో నుండి వస్తున్నట్లు కనిపించడం విచిత్రమే కదా. అవి ఎందుకు వస్తున్నాయో అది భ్రమ భ్రాంతి అని అనుకునే సమయంలో మా బంధుమిత్రుల ద్వారా ఈ వస్తువులు రావడంతో నమ్మక తప్పలేదు. ఇలాంటి నిజరూప సాధన అనుభవాలతో అప్పటిదాకా మేము పొందిన వాటికి భిన్నంగా  హృదయ చక్రము నుండి బ్రహ్మాండ చక్రము దాకా మా ధ్యాన అనుభవాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క ఈ అనుభవాలును కొత్త పుస్తకాలు ఎక్కిస్తూ మరోపక్క పూర్తి చేసుకున్న పాత అనుభవాలను తెలుగులో టైపింగ్ చేస్తూ మేమిద్దరం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇలా ఇంతా కష్టపడి నాకు కూడా మన సాధన అంతా కేవలం స్థూల శరీర కర్మ నివారణ కోసమే అది స్థూల శరీర కపాల మోక్ష స్థితిని పొందడానికి మాత్రమే అని తెలిసేసరికి అలాగే రాబోవు భవిష్యత్ జన్మలుగా మా ఇద్దరికీ బుధ గురు గ్రహాల జన్మలని తెలుసుకునేసరికి మౌనం వహించాను. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకోవాలని శబ్ద పాండిత్యముతో  పాటు అనుభవ పాండిత్యముతో పరిశోధన చేస్తే ఈ అధ్యాయం ఏర్పడినది. దానితో మోక్షము పేరుతో ఇన్నాళ్లు మేమిద్దరం మోసపోయామని గ్రహించాము. ఏ లోక వాసులుగా ఆ లోక శరీరాలతో ఆ లోకకర్మలు మాత్రమే నివారణ చేసుకుంటారని కేవలం భూలోక సాధన అనేది స్థూల శరీర కర్మల నివారణకు ఉపయోగపడుతుందని దీని భవిష్య జన్మలుగా గ్రహ లోకాలు ఉంటాయని వీటి భవిష్య జన్మలుగా సప్త దైవ లోకాలు ఉంటాయని వీటి భవిష్య జన్మలుగా కారణ లోకాలు ఉంటాయని వీటి భవిష్య జన్మలుగా ఇష్ట లోకాలు ఉంటాయని వీటి భవిష్య జన్మగా ఏకైక ఆకాశ శరీరముతో 11 మూల ప్రారబ్ద కర్మల నివారణ కోసం ఒక సాధన స్థాయికి రావాల్సి ఉంటుందని విచిత్రం ఏమిటంటే ఏ లోకమునందు ఆ లోక శరీరము కర్మల నివారణ అంతిమ స్థితి కూడా ఆ లోక శూన్య బ్రహ్మ సాధన స్థాయికి సాధకుడు రావలసి ఉంటుంది. అంటే పంచ లోక కర్మ నివారణ కోసం పంచ శూన్య బ్రహ్మలుగా సాధన స్థాయికి చేరుకోవాలని మేము గ్రహించి మీకు చెప్పడం జరిగినది. అందుకే పంచముఖ బ్రహ్మలు ఉంటారని గ్రహించండి. కాబట్టి మోక్షము పేరుతో మోసపోకండి. ఎవరి కర్మను వారే నివారణ చేసుకోవాలి. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఎలాంటి సహాయము చెయ్యడని కేవలం మార్గదర్శిగా ఉంటారని సాధన చేయవలసింది మనమేనని క్షణాలలో రోజులలో నెలలలో మోక్షము రాదని దానికి పంచ కర్మ నివారణ స్థాయిని బట్టి ఆధారపడుతుందని అంతిమంగా అన్ని రకాల కర్మలయందు అనగా శూన్య బ్రహ్మ స్థితి యందు బలహీనత అనే స్థితి వస్తుందని ఇది కూడా 0.01% శాతం మాత్రమే ఉంటుందని అయినా కూడా సాధకుడు అప్పటికే 100% లో 99.99% నివారణ చేసుకుంటాడు. కర్మశేషముగా మిగిలి పోయే 0.01% యొక్క బలహీనత ఇప్పటివరకు ఎవరూ కూడా దాటలేదని గ్రహించండి. దాటి ఉంటే మన ఆదియోగి ఎప్పుడో దాటి ఉండేవాడు కదా. ఆయనెందుకు పంచ శరీరాలతో పంచ క్షేత్రాలు యందు పంచ సాధన నివారణ చేసుకుంటాడు. అదేమిటి మన కోసమే కాదా? నా బొంద. ఇంకా కథ మీకు అర్థం కాలేదా? ఆయనే లేకపోతే మనం అందరం ఎక్కడ ఉంటాము. ఆయన కాస్త ఈ కర్మల యొక్క అంతిమములో వచ్చే బలహీనతకు గురి కావడం వలన ఆయన మిగిలిపోతున్నాడు. తద్వారా మనం ఉన్నట్లుగా కనపడుతున్నాము. నిజానికి అందరూ కూడా ఈ శూన్య బ్రహ్మ స్థాయికి వచ్చే అక్కడున్న బలహీనతకు గురై శూన్య బ్రహ్మగా మారి భవిష్య బ్రహ్మలు గా మారి విశ్వసృష్టి సృష్టించడం జరుగుతోంది.ఎపుటిదాకా అంటే బలహీనతను దాటే వరకు అన్నమాట. అంటే బలహీనత లేని బలవంతుడు మీరే కావచ్చును. ఏమో ప్రయత్నించి చూడండి. పంచ కపాలమోక్షం స్థితిని పొంది సంపూర్ణ కపాల మోక్షం పొందండి. కాని నిజానికి మీకు ఇట్టి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఈ గ్రంథము చదువుతున్నారు అంటే మీ సూక్ష్మ శరీరం ఉన్నట్లే కదా. తద్వారా మీకు స్థూల శరీరంలో కర్మలు నివారణ ఉన్నట్లే కదా. అంటే ఈ స్థూల శరీరములో మీరు సాధన చేస్తే మహా అయితే స్థూల కర్మలు నివారణ అయ్యి ఈ స్థూల శరీర కపాలమోక్షం మాత్రమే పొందడం జరుగుతుందని మర్చిపోకండి. నాయనలారా! అమ్మల్లారా! అంటే సాధన ఆరంభం మాత్రమే మీరు చేస్తారు. ఇంకా సాధన అంతము ఇంకా ఎప్పుడు చేస్తారో చేస్తారో లేదో మీకే కాదు మిమ్మల్ని పుట్టించిన శూన్య బ్రహ్మకే తెలియదు పాపం.

 
ఎందుకంటే ఆది బ్రహ్మ కాస్త ఈ బ్రహ్మ రహస్యాలను ఒక బ్రహ్మ ముడి రూపంలో భద్రపరచడం జరిగినది. కాకపోతే బుద్ధుడు తన సాధన ఈ స్థాయికి వచ్చినప్పుడు తను ప్రతిపాదించిన అష్టవస్తువులలో బ్రహ్మ ముడి ఒకటి అని చెప్పడం జరిగినది. ఈయన దాన్ని విప్పలేదు. ఈ ముడిని కాస్త చిక్కుముడిగా ఉంచడం జరిగినది. కానీ ఏమి చేయగలము. ఆయా లోక కర్మలు ఆయా లోకాలలో జన్మించి కర్మ నివారణ చేసుకోవాలి. అంటే పది లక్షల నుండి 1080 కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద ఆయా లోకాలలో జన్మించకుండా మాయలో పడకుండా ఉండాలి. అంటే జీవసమాధి చెందాలి. అప్పుడే స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరమునకు వస్తాడు. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరములో సూక్ష్మ కర్మలు నివారణ అవుతాయో అప్పుడు ఈ సూక్ష్మ శరీరధారి కారణ శరీరధారిగా మారతాడు.అపుడు కారణ శరీరధారి విగ్రహరూపంలో పరమాత్ముడిగా లోక పూజ్యుడిగా మారి భూలోక వాసులతో పూజలు చేయించుకుంటూ కారణ కర్మలు నివారణ చేసుకుంటాడు. ఆ తర్వాత తిరిగి ఈ విగ్రహం నుండి ఆత్మ శక్తి రూపంలో అంగుళము అంత పరిమాణములో మారి ఇష్ట లోకాల యందు ఇష్ట లోకవాసుడిగా అక్కడికి వెళ్లి భవిష్య బ్రహ్మగా జన్మించక తప్పదు. అంటే జీవ సమాధి చెందిన 10 కోట్ల సంవత్సరాల వరకు కేవలం సాధకుడు సూక్ష్మ కారణ కర్మలు మాత్రమే నివారణ చేసుకుని సంకల్ప కర్మ నివారణ కోసం భవిష్యత్ బ్రహ్మగా ఇష్ట లోక ప్రవేశం చేయక తప్పదని భూలోకమందు శ్రీరామ భక్తుడిగా హనుమంతుడు సూక్ష్మధారిగా ఈయన కాస్తా భజరంగబలి హనుమాన్ గా ఉంటే కారణ శరీరంతో హిమాలయాల యందు కాశీ క్షేత్రము యందు యతీశ్వరుడిగా స్థూల సూక్ష్మ కారణ కర్మలు ప్రస్తుతానికి నివారణ చేసుకుని భవిష్యత్ బ్రహ్మగా రాబోవు కాలంలో మనల్ని పరిపాలిస్తున్నారు. అంటే సంకల్ప శరీరముతో సంకల్ప కారణం కర్మ నివారణ కోసం తొమ్మిదవ భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు. ఇంకేముంది. అటుపైన ఈయన ఆకాశ శరీరముతో అంత్య శూన్య బ్రహ్మగా మారి ఆకాశ కర్మ నివారణ చేసుకుంటే చాలు కదా. సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందుతాడు కదా. పొందితే అందరూ పొందినట్లే కదా అనుకుంటున్నారా? అపుడే పప్పులో కాలు వేస్తున్నారు. ఇప్పటికి ఈయన 1980 ఎనిమిది సార్లు భవిష్యత్తులో బ్రహ్మ సాధన స్థాయికి వచ్చారు అని తెలుసుకోండి. ఎందుకంటే అన్ని యుగాలు పూర్తి అయినాయి కదా. ప్రతి సారి కూడా ఈయన సంకల్ప బ్రహ్మ సాధన స్థాయికి వచ్చేసరికి బలహీనతకి గురి అయి మళ్లీ వెనుతిరిగి కారణ బ్రహ్మ,సూక్ష్మ  బ్రహ్మ భూబ్రహ్మ గా మారుతున్నారు అని గ్రహించండి. అంటే 36 కపాలాలలో 35 కపాలాలు మాత్రమే నిశ్చలస్థితి అదే శరీర కపాల మోక్ష స్థితిని పొందుతున్నాయి కాని ముప్పై ఆరవ ఆది ఏక మూల బ్రహ్మ కపాలము మాత్రము ఇప్పటివరకు ఏకత్వ స్థితిని ఇంతవరకు పొందలేదు. ఈ కపాల బ్రహ్మయ్య బలహీనత దాటలేక పోతున్నాడు. తద్వారా తిరిగి అంతరించే విశ్వ సృష్టి ఆరంభం చేస్తున్నారు. అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందుతున్నాడు. అంతము ఆరంభం కావాల్సిన చోట అంతము కాకుండా ఆరంభమవుతుంది. బలహీనతను దాటే బలమైన సాధకుడి కోసం ఎవరికి వారే ఎదురు చూస్తున్నారు. ఎవరు దాటడం లేదు. ఎందుకంటే బలహీనత అందరిలోనూ అంతర్గతంగా ఉంటుంది కదా. బలహీనతే ప్రారబ్ధకర్మ. ఈ కర్మయే మాయ.మాయే అరిషడ్వర్గాలు. ఇవియే దశేంద్రియాలు. ఇవియే మనస్సు కోరిక ఆశ భయము ఆనందము ఆలోచన స్పందన సంకల్పము శరీరము కర్మ జన్మ పునర్జన్మలకు కారణమవుతున్నాయి. మళ్ళీ వైరాగ్య భావాలు పెంచుకుని తిరిగి ఆఖరిదైన బలహీనతకు వచ్చి దానికి గురై ఇప్పటిదాకా చూసిన జీవనాటకము చూస్తున్నారు. చేస్తున్నారు. బాధపడుతున్నారు. ఆనందపడుతున్నారు. నా నా చంకలు నాకుతున్నారు. ఇదే అందరూ చేస్తున్నారు. మోక్షం అనేది మోసం కాబట్టి అది ఏదో భూలోకంలోని కాశీ క్షేత్రము నందు సర్వ కర్మలు నివారణ చేస్తే ఈ కర్మలు జన్మలు ఉండవు కదా. ఈ విశ్వసృష్టి ఏర్పడి ఉండేది కాదు కదా. తొక్క లోనిది ఈ విశ్వ సృష్టిలోని జీవ నాటకం కొనసాగించటానికి ప్రళయకాలంలో విశ్వమంతా నీటిలో కలిసి పోయి అంతరించిపోయిన కూడా కాశీ క్షేత్రం మాత్రమే అంతరించిపోకుండా త్రిశూలం మీద ఉంచి కాపాడుకుంటే ఎవరు చావడానికి సిద్ధం లేరని చావటానికి వెళుతూ బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఏర్పాట్లకు బలహీనత అని పేరు పెట్టుకుని దాని మాయలో పడింది కాబట్టి వెనుతిరిగి వస్తున్నామని మనకి మనమే చెప్పుకుంటున్నాము చేస్తున్నామని ఎందరికి తెలుసు. చెప్పండి. మనకి మనమే బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకుని శాశ్వత మరణమైన మోక్షమును పొందాలంటే సాధన పేరుతో మనకు మనమే మోసం చేసుకుంటున్నామని నా ప్రగాఢ విశ్వాసం. నిజానికి అదే కారణం. 

ఎలా అంటారా? సంసారికి సంతాన మాయలు ఉంటాయి. వీడు సాధన చేసి శాశ్వత మరణావస్థ స్థితికి చేరుకునే సమయానికి తన సంతాన విషయాలు గుర్తుకు రావటం అర్ధాంతరముగా నేను చనిపోతే ఎలా? నా సంతానం ఏమైపోతుందో అని వెనుతిరిగి వస్తున్నాడు. కేవలం స్త్రీ పురుష శరీరాల కలయిక వల్ల ఏర్పడిన స్వప్న శరీరం సంతానము నిజం కాదని భ్రమ భ్రాంతి అని తెలిసినా కూడా వీటి సాధన పరిసమాప్తి లో వీళ్ళ కోసం వెనుతిరిగి వస్తాడు. చావటానికి వెళుతూ బ్రతకడానికి మార్గాలు చూసుకునే వెళ్లినాడు కాదు కదా. కొండ చివర కొన అంత్యము చావటానికి వెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత చావకుండా నేను చనిపోతే ఎలా? నా వాళ్ళు ఎలా బతుకుతారు అనుకుని వెనక్కి తిరిగి రావడం ఎందుకు? అసలు చావాలని అనుకోవడం ఎందుకు? మోక్షం పొందాలని అనుకోవటం ఎందుకు? దానిని పొందకుండా ఏదో ఒక బలహీనత అడ్డుపెట్టుకుని వెనుతిరిగి రావడం ఎందుకు? నా బొందా. నా బూడిద కదా. సంసారి చేస్తున్నాడు. అలాగే పరమాచార్య చేస్తున్నాడు. యోగి చేస్తున్నాడు. భోగి చేస్తున్నాడు. సాధకుడు చేస్తున్నాడు. సాధించేవాడు చేస్తున్నాడు. ఎవరి తగ్గ బలహీనతలను ఏర్పరచుకొని కావాలని వాటిని దాటకుండా చావటానికి వెళుతూ బ్రతకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరే కాదు. మేము కూడా అలాగే చేసుకున్నామని మా సాధన పరిసమాప్తి సమయంలో ఈ పుస్తక రూపంలో తెలిసింది. అందరికీ విషయం తెలుసు. తెలుసుకున్న వాడు చెప్పడు. తెలియనివాడు తెలుసుకోలేడు. భోగంలో ఉన్న యోగంలో ఉన్న పేర్లు మాత్రం మార్పు. అందరూ కూడా కర్మ నివారణ జన్మలేనని గ్రహించండి. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. అందరూ సమానమే. అందరు కూడా సాధకులే. సాధించే వాళ్లే. మార్గాలు మాత్రమే వేరు. చేరేది ఏక మూల బ్రహ్మకపాలం స్థితికి మాత్రమేనని గ్రహించండి. కాబట్టి మోక్షము పేరుతో భోగములో ఉండి ఉపవాసాలు సాధనలు అన్నీ అందరినీ వదిలి పెట్టి చేయవలసిన అవసరం గాని అఘాయిత్యం గాని ఏమీ లేదు. ఎల్లప్పుడూ నీ శరీరము భోగత్వములో ఉండి మీ మనస్సు  యోగత్వములో ఉండేట్లుగా చూసుకోండి. ఏమి ఉన్నా లేకున్నా బాధపడకండి. అవి లేకపోతే స్పందించకండి. ఉన్నంత కాలం వాడుకోండి. ఆనందించండి. అనుభవించండి. ఆనందాలు పొందండి. అవి లేకపోతే మీ జీవితం ఆగిపోదని గ్రహించండి.అవి ప్రాణాలు ఉన్న వ్యక్తి లైన వస్తువులైన సమదృష్టితో సమభావంతో స్థితప్రజ్ఞతగా ఉండండి. తల్లిదండ్రులు ఉన్నంతవరకు మీ బాధ్యతలు ఆనందంగా నిర్వహించండి. సంతానము ఉంటే వారి బాధ్యతలను నిర్వహించండి. ఒకవేళ తల్లిదండ్రులు లేదా సంతానం పోయినా అతిగా బాధపడి లేదా ఈ జీవితాలను అంతం చేసుకోండి. వారి కర్మ పరిసమాప్తి అయినందుకు ఆనందపడి మీ జీవితం కొనసాగించుటయే సాక్షీభూత స్థితి ఇదియే అసలు సిసలైన శూన్యబ్రహ్మ స్థితి అన్నమాట. కర్మలు చేయండి. కర్మ ఫలితాలు ఆశించకండి. ప్రేమలు అందించండి. ప్రేమలు ఆశించకండి. మీ బాధ్యతను సాక్షీభూతంగా చేస్తూ ఉండండి.అంతేగాని మోక్షం పొందాలని వెర్రి తపనతో చేస్తున్న సంసారాలు వదిలిపెట్టి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను సంతానాన్ని వదిలిపెట్టి ఏదో ఒక క్షేత్రంలో చేరి కష్టాలు పడకండి. లేకపోయినా సుఖాలు వదులుకొని కష్టాలు కొని తెచ్చుకోకండి. మాయలోపడి తే మరికొంత కాలము ఈ నాటకం కొనసాగుతుంది. అంతే తేడా. ఏమి చెప్పదలుచుకున్నాను అంటే సాధన కోసం మీరు ఏమి త్యాగము చేయనక్కర్లేదు. ప్రకృతియే మనకి ఏది ఎప్పుడు కావాలో అది అపుడు ఇస్తుంది. ఏది ఎప్పుడు మన నుండి దూరం చేయాలో అది అపుడు దూరం చేస్తుంది. దానిని దాటి మనం ఏమి చేయలేం అని గ్రహించండి. అవి ఇచ్చేదాకా అన్నింటిని ఉపయోగించండి. భోగ ఆనందము ఇచ్చినట్లుగానే మోక్ష ఆనందము కూడా ప్రకృతి మాత ఇస్తుందని గ్రహించండి. భోగంలో ఉన్న యోగములో ఉన్న కర్మ నివారణ స్థితి కోసమేనని గ్రహించండి.

ప్రతివాడు యోగ సాధకుడే. ప్రతి వాడు మోక్షగామియే. వాడు తనకున్న బలహీనతలను దాటడానికి పుట్టిన వాడే జన్మించిన వాడేనని గ్రహించండి. అంతేగాని యోగమంటే భోగం లేకుండా చేయాలని భోగం అంటే యోగం లేకుండా ఉండాలని వేరువేరుగా అనుకోవద్దు. ఇద్దరూ కూడా యోగులే. ఇద్దరు కూడా భోగులే. ఎలా అంటారా? యోగికి తన మనస్సు భోగి అయితే భోగికి తన మనస్సు యోగం అవుతుంది. అలాగే యోగికి శరీరం యోగం అయితే అదే భోగికి తన శరీరం భోగి అవుతుంది. అంటే నా దృష్టిలో యోగి అలాగే వ్యభిచారి ఒకటే అన్నమాట. యోగి తన మనస్సుతో సంసార భావాలు చేస్తే ఆనంద పడితే భోగి తన శరీరంతో సుఖభోగాలు అందిస్తూ ఆనందపడతాడు. అంతే తేడా. ఇద్దరూ కూడా యోగులే. ఇద్దరూ కూడా భోగులే. ఒకరు మనస్సుతో చేస్తే మరొకరు శరీరంతో చేస్తారని గ్రహించండి. వెనుకా ముందు చావు లాగా మోక్ష స్థితిని పొందుతారు.ఏదో పొందాలని ఉన్నవాటిని అనుభవించకుండా ఉండవద్దని నా మనవి. అన్నిటిని అనుభవిస్తూ పరిపూర్ణ వైరాగ్య స్థితిని పొందుతూ ఉంటే మీకు ఏది కావాలో అది ప్రకృతి అందిస్తుంది. ఏది వద్దో అది దూరం చేస్తుంది. సన్యాసి అయిన సంసారి కాక తప్పదు. సంసారి అయిన సన్యాసి కాకతప్పదని గ్రహించండి. అంటే మనలోని బలహీనతలను పెట్టుకొని మాత్రం రాలేదు అని అనుకోవడం తప్పు చేసేవాడు లేడు. పొందే వాడు లేడు. వాడు ఉన్నాడనే విశ్వాసమే ఈ విశ్వమును నడిపిస్తోంది. మోక్షం ఉన్నది. అది ఒకటి ఉన్నదని దాన్ని పొందాలని దానికి భయపడకుండా ఉండాలని దానికి సాధన చేయాలని కష్టపడాలి అని అనుకోవడం మన భ్రమ భ్రాంతి. నిజానికి మనం అంతా ఎప్పుడో మోక్షము పొందిన జీవులమే. కాకపోతే భూలోకము నందు స్థూల కపాల మోక్షము స్థితిని పొందితే వివిధ లోకాలలో మన ఆయా శరీరాలు ఆయా కపాల మోక్షము స్థితిని పొందినాయని గ్రహించండి. కాకపోతే అవి పొందలేదని ఇంకా జన్మలు ఉన్నాయి అనే భ్రమ భ్రాంతి మనకు ఉండుటవలన నిశ్చల మనస్సు కాస్త చంచలమై నా నా అగచాట్లు పడుతోంది. సహజ స్థితి నుండి తప్పుకోవడం జరుగుతుంది. అంతెందుకు. భూలోక స్థూల కర్మలు కర్మ శేషం లేకుండా సంపూర్ణంగా నివారణ అయినట్లుగా మీకు 120 సంవత్సరాల నుండి 1,20,000 లేదా కోటి 20 లక్షల సంవత్సరాలకైనా మీకు తెలుస్తుంది కదా. ఒకడు వెయ్యి అడుగుల పరుగు పందెంలో సెకండ్స్ లో పూర్తిచేస్తే మరొకడు నిమిషాలలో మరొకడు గంటల్లో ఎలాగైతే పూర్తి చేస్తాడో అలాగే కర్మ నివారణ విధానం కూడా అంతే. మీకు ఎప్పుడు ఎలా జరగాలో ముందే నిర్ణయించబడినది. జరిగేది జరుగుతుంది. జరగనిది ఎప్పటికి జరగదు అని గ్రహించండి.మీ చేతుల్లో నా చేతుల్లో ఆ భగవంతుడి చేతిలో ఏమీ లేదు. కేవలము శూన్యము చేతుల్లోనే మీ శ్వాసక్రియ పక్రియ చేతిలో మీ చేతల్లో బయటపడుతుంది. మనకి తెలుస్తుంది. శూన్యము అంటే ఏమీ లేనిది కాదు. అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నదని అర్థం. అనగా మన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమే అంతమునకు ఆరంభమునకు కారకమని గ్రహించండి. అ ఆ ఇ ఈ అనగా అంతము నుండి ఆరంభము వరకు ఇహము నుండి ఈశ్వరుడు దాకా. మన ఏక మూల బ్రహ్మకపాలంలోని బ్రహ్మ రంధ్రము యొక్క బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందే ఇదంతా ఉంది. నడుస్తోంది. నడిపిస్తోంది. దానికి మాత్రమే తెలుసు. మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో. ఏది కావాలో. ఏది ఇస్తే మంచిదో కాదో దానికి తెలిసినంతగా ఆఖరికి ఆ భగవంతుడుకి కూడా తెలియదు. కారణం భగవంతుడుకి కావలసింది కూడా ఇదే ఇస్తుంది కదా. అంటే ఆ కృష్ణబిలం ముందు మనము జీవ బిచ్చగాడు అయితే ఆ భగవంతుడు దైవ బిచ్చగాడు అన్నమాట. బట్టలు వేసుకుని అడుక్కుంటే లేదా బట్టలు లేకుండా అడుక్కుంటే ఏమైనా తేడా ఉంటుందా? అందరూ అడుక్కునే వాళ్ళే. కర్మ నివారణ బిక్షకోసం పనిచేసే వాళ్ళమే. ఒకడు జీవుడిగా మారితే మరొకరు దైవాలుగా మారి కర్మ నివారణ చేసుకుంటున్నారు. అంతే తేడా. ఎవరి కర్మలు వాడికి ఉన్నాయి. ఎవరి బాధలు వారికి ఉన్నాయి. అందరూ కూడా కర్మ జీవులే. కర్మ నివారణ జీవులే. కర్మ ప్రదాత జీవులే.  కర్మ బంధ జీవులే.  యద్భావం తత్భవతి.
 
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలా జరుగుతున్నప్పుడు అన్ని తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియని వాడిలాగా సాధకుడు ఉండవలసి వస్తుంది. ఎపుడైతే సాధకుడు కాస్త సత్యాన్వేషణ పేరుతో గాని మోక్షమును పొందాలనే తపనతో యోగసాధన ఆరంభిస్తాడో వారికి తప్పకుండా అన్నిటి యందు జ్ఞాన వైరాగ్యాలు ఉండాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే సాధనలో తన గత జన్మలలో అలాగే భవిష్య జన్మలు అదేవిధంగా మరణ రహస్యాలు తెలుస్తాయి. వాటిని చూసి తట్టుకునే శక్తి అందరికీ ఉండాలని లేదు. తట్టుకోలేని వారికి ఐదు సంవత్సరాల లోపల మరణం తధ్యమని యోగ శాస్త్ర వచనము. అందుకే ఈ యోగ సాధన అనేది కత్తిమీద సాములాంటిది అని పులి మీద స్వారీ లాంటిది అని కింద పడితే అది మనల్ని తినేస్తుంది. స్వారీ చేయకపోయినా అది తిని వేస్తుంది. జ్ఞాన వైరాగ్యాల తో సాధన చేస్తే గాని ఆ సాధనలో వచ్చే భయంకర అనుభవాలను సాధారణ మెదడు తట్టుకోలేదు. లేదంటే మీ మరణంను మీరు ముందుగానే పిలుచుకున్న వారు అవుతారు. మాయను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి కానీ మాయను దాటరాదు. దాటలేము అని గ్రహించండి. ఒత్తిడిని తట్టుకోలేని వారు యోగ సాధనకు పనికిరారని నా వ్యక్తిగత అభిప్రాయము. స్థిర మనస్సు వివేక బుద్ధి సాక్షీభూతంగా ఉండుట స్మశాన వైరాగ్యం కలిగి ఉండటం దేనియందు వేటియందు మోహ వ్యామోహాలు లేకుండా ఉండుట అచంచల భక్తి విశ్వాసాలు శరణాగతి అహం లేకుండా త్యాగబుద్ధి క్షమ గుణము ఇలా మున్నగు దైవిక లక్షణాలు ఉన్నవారు మాత్రమే యోగసాధన చేసి యోగసిద్ధి పొందగలరు. అర్హత యోగ్యత లేని వాడు యోగ సాధన చేస్తే మతిభ్రమించి పిచ్చివాడు అవటం లేదా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందని గ్రహించండి. అలాగే యోగ సాధన అనేది పంచ గురువుల సమక్షంలో కనీసం ఒక నిజ భౌతిక గురువు సమక్షంలో చేస్తేనే మంచిది. మనలో కలిగే ఆవేశాలకు విపరీత భావాల బుద్ధికి అనర్థాలకు మానసిక ఒత్తిడి కలిగినప్పుడు ఆయన మాటల వలన చూపులు వలన చేతలు వలన పరిశీలనలో అశాంతి తొలగి ప్రశాంత స్థితి పొందటం పొందే అవకాశాలు ఉంటాయి. లేదంటే మతి భ్రమణం చెందే అవకాశాలు చాలా ఉన్నాయని ఉంటాయని గ్రహించండి. ఇది నా స్వానుభవంలో నాకు ఉన్న ఇరవై ఏడు మంది శిష్యులలో 22 మంది తట్టుకోలేని స్థితికి చేరుకుంటే వారి సాధన స్థితిని ఆపివేయడం జరిగినది. ఇంకా మిగిలిన పంచ శిష్యులలో  కూడా చిట్టచివర సాధన స్థాయికి అనగా బ్రహ్మతదాకార స్థితికి ఒక్కరు మాత్రమే రావడం జరిగినది. నలుగురు కూడా తట్టుకోలేని స్థితికి ఉన్మాద స్థితికి ఏదో తెలియని ఆవేశానికి గురి అవుతూనే ఉన్నారు.మళ్ళీ వాళ్ళని యధాస్థితికి తీసుకొని వచ్చి వారి భోగ జీవితంలో వారు అనుభవించే స్థితికి అనగా మామూలు స్థితికి రావడానికి ఐదు సంవత్సరాలు పైనే పట్టింది. యోగం ఉంటే యోగి కాక తప్పదు. ఎప్పుడు యోగి కావాలో ఎలా అవ్వాలో ఏ విధంగా అవ్వాలో దీనికి సహాయంగా పంచ గురువులు ఎవరో వాళ్ళు ఆ సమయానికి వచ్చేటట్లు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనము తట్టుకోలేని స్థితిని ఎప్పుడు ఇవ్వదని గ్రహించండి. మనము ఎంత తట్టుకోగలమో అది మాత్రమే ఇస్తుంది.కాని సాధకుడు తనకున్న మిడిమిడి జ్ఞానంతో అన్ని అన్నప్రాసన నాడే ఆవకాయ తినాలని విపరీతమైన ధోరణిలో పడుతున్నారని నాకు అర్థమైనది. దాంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. సాధన చెయ్యండి. నెమ్మదిగా చేయండి. మాయను అదుపులో ఉంచుకోండి. ఆపై మాయని జయించండి. అంతేగాని మాయను దాటకండి. గీత దాటితే సీత పరిస్థితి ఏమైందో అలాగే మాయను దాటితే మరణమేనని గ్రహించండి. పూర్ణాయుష్షు కాస్త అర్థఆయుష్షు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇదంతా ఎందుకు అంటారా? హాయిగా కాశీక్షేత్రంలో సహజ మరణం పొందే దాకా అక్కడే ఉండి కదలకుండా కాశీవాసము చేయండి. దానితో ఖచ్చితంగా మీ స్థూల కర్మలు కర్మశేషము లేకుండా  నివారణ అయ్యి మీకు స్థూల శరీర కపాలమోక్షం కలిగి భూలోకము నుండి విముక్తి కలిగి ఇతర గ్రహాల లోకాలకి వెళ్ళటానికి అర్హత యోగ్యత కాశీ విశ్వనాథ్ ఏర్పాటు చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇలాంటి మరణము పొందాలంటే మనకి గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ జన్మలో అర్హత యోగ్యత లభించదు అని గ్రహించండి. కాశీలో నివసించేవారికి అలాగే కాశీ వాసము చేసేవారికి అక్కడ మరణం రావాలని పొందాలని ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నా పరిశోధన ప్రకారంగా చూస్తే నిత్యము కాశీ విశ్వనాథుడు పూజాదికాలు నిర్వహించే పూజారికి ఒకసారి తన తల్లికి వంట్లో బాగుండకపోతే కలకత్తా వెళ్లడం జరిగింది. తల్లిని చూడటానికి వెళ్లి అక్కడ ఇతను కాస్తా హార్ట్ ఎటాక్ తో చనిపోయినాడు. కర్మ కాకపోతే ఏమిటి? నా బొంద. 36 సంవత్సరాల పాటు కాశీ విశ్వనాథునికే సేవ చేసిన వాడికి అక్కడ మరణం రాలేదు అంటే ఎంతటి అర్హత యోగ్యత ఉండాలో చూడండి. అంతెందుకు. కాశీ యాత్రకు ఒక పుణ్య దంపతులు వెళ్ళినారు. విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. ఇంతలో తన కుమారుడు కాస్త కులాంతర వివాహం చేసుకున్నాడు అనే వార్త వారికి చేరింది. పుణ్య దంపతులు తట్టుకోలేకపోయారు. మణికర్ణిక ఘాట్ కు వచ్చేసరికి వారి గుండెలు ఏకకాలంలో ఆగిపోయినాయి. ప్రాణాలు అనంత లోకాలకు ప్రయాణం అయినాయి. కేవలం వీళ్లు కాశీక్షేత్రంలో తొమ్మిది గంటలు మాత్రమే ఉన్నారు. ఎంతటి యోగమో కదా. కాశీని చూసి వస్తానని చెప్పి కాశీనాథుడులోనే కలిసిపోవడం నిజమైన యోగం అంటే ఇదే కదా. అదేవిధంగా ఒక ఆవిడ అనుకోకుండా కాశీ యాత్ర దర్శనంలో చనిపోతే కాశీలో దహనము చేయకుండా ఈమె పుత్రసంతానం ఈమె శవం కాశీ నుండి తమ ఇంటికి తెప్పించుకొని ఈమె శవం అక్కడ బంధుమిత్రుల మధ్య దహనం చేసినారని తెలిసి బాధపడటం తప్ప నేను ఏమీ చేయలేక పోయాను. కాకపోతే ఏమిటి. ఎంత యోగం ఉంటే కాశీ క్షేత్రంలో మరణం వస్తుంది. అలాంటిది అక్కడ మరణించిన ఆమెకు ఇక్కడ ఇంటి దగ్గర దహనసంస్కారాలు చేయడం ఏంటి. నా బొంద. నా బూడిద. ఇలాంటివి చిత్రవిచిత్ర మరణాలు ఎన్నో కాశీ క్షేత్రంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. అక్కడ ప్రతి 20 నిమిషాలకు ఒక దహన కార్యక్రమం నిరంతరం అవిచ్ఛిన్నంగా అవి శ్రాంతిగా మన విశ్వ సృష్టికి జీవ నాటకంలాగా జరుగుతూనే ఉంటుంది.ఒకటి గుర్తుంచుకోండి. ఇలాంటి కాశీక్షేత్రంలో మనము మరణము పొందినా కేవలం స్థూల శరీర కపాలమోక్షం పొందుతాము. అది కూడా ఆ విశ్వనాథుడు తారకరామ మంత్రోపదేశం ద్వారానే మనం ఎలాంటి సాధన చేయకపోయిన స్థూల కర్మ కర్మశేషం లేకుండా ఈయన చేస్తాడని తెలుసుకోండి. అంతేగాని కాశీలో మరణం పొందితే సంపూర్ణ కపాల మోక్షం వస్తుందని గుడ్డిగా నమ్మకండి. కేవలం భూలోకము నుండి విముక్తి కలిగి భవిష్య జన్మలు నవగ్రహాల లోకాలలో జన్మించడానికి అర్హత యోగ్యత లభిస్తాయి అని తెలుసుకోండి. మోక్షము పేరుతో మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త. 
 
యోగ సాధన కి ఆరోగ్యమైన మనస్సు అలాగే ఆరోగ్యమైన శరీరం ఉంటే గాని అన్ని తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం ఉంటే గాని యోగ సాధన చేయండి. యోగ శక్తుల కోసం ప్రకృతి వశము కోసం దైవ ఆత్మ సాక్షాత్కారం కోసం ఆశించి దానికి సాధన చేయకండి. అర్ధాంతర చావును కొనితెచ్చుకోకండి. భూలోక యోగ సాధన వలన కేవలం భూలోక కర్మలు నివారణ అవుతాయి అనగా 48 లక్షల కర్మలు మాత్రమే నివారణ అవుతాయి అన్నమాట. మిగిలిన నాలుగు రకాల కర్మలు అయిన ఈ రెండు లక్షల కర్మలు నివారణ కోసం సాధకుడు ఆయా లోకాలయందు ఆయా శరీరాలతో సాధన చేసి నివారణ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నిజానికి సర్వకర్మ నివారణ కోసం సాధకుడు 11 జన్మల నుండి 11 కోట్ల జన్మలు అది కూడా 48వ సాధన జన్మ ఎత్తవలసి ఉంటుంది. కర్మలు పెంచుకుంటూ పోతే దానికి తగ్గట్లుగా జన్మలు కూడా పెరుగుతాయని గ్రహించండి. భూలోకమందు సాధన జన్మలుగా ఒక స్త్రీ ఒక పురుష జన్మ ఇలా సూక్ష్మ కారణ సంకల్ప లోకాల యందు జన్మలు అనగా పది జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అంటే రావణబ్రహ్మ కూడా ఇలాగే పది జన్మలు ఎత్తి వాడి పది శిరస్సులు పొందాడు అని గ్రహించండి. చివరి జన్మ ఏక జన్మ అన్నమాట. దీనితో ఈ 11 జన్మలు ఎత్తినట్లుఅవుతుంది. ఎలా చెబుతున్నాము అంటే 36 కపాలములలో మనకి 25 పాత కపాలములు కొత్తవి 11 కపాలములు ఏర్పడుతున్నాయని మీకు తెలుసు కదా. ఆ కొత్త 11 కపాలములే సాధకుడు సాధన జన్మలు అన్నమాట. నిజానికి మానవ మెదడు తన ధ్యాన స్థితిని 48 నిమిషాల నుంచి తట్టుకోలేదు. ఈ సమయం దాటితే ఏకాగ్రతను కోల్పోయి మానసిక సంఘర్షణకు గురి అయి సున్నితమైన మనస్సు గా మారి చిన్న విషయం కూడా తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. దానితో నెమ్మదినెమ్మదిగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై మతి భ్రమణం పొందే అవకాశాలు ఉంటాయి. శివ పురాణమందు మహా శివుడు కూడా తన తుంకార సాధనను నలభై ఎనిమిది నిమిషాలకు రెండు విఘడియలు మాత్రమే చేయమని చెప్పడం జరిగినది. 48 నిమిషాల సాధన అంటే భూలోక కాలమాన ప్రకారం పది లక్షల సంవత్సరాలు అన్నమాట. 48 నిమిషాల పాటు జపము లేదా ధ్యానము చేయడం కాదు. స్థిర మనస్సుతో ఏకాగ్రతతో ఏమీ ఆలోచించని స్థితిలో దేని గురించి పట్టించుకోని స్థితిలో 48 నిమిషాల పాటు ఉండాలి అన్నమాట. భూమి మీద 18 సెకన్లు మించి జీవుడు ఆలోచనలు లేని స్థితిలో ఉండలేడు. అలాంటిది 48 నిమిషాల పాటు ఉండాలి.ఇలాంటి సాధన సమయం పది లక్షల సంవత్సరాలు అన్నమాట. 

ఇట్టి సాధన స్థితికి సాధకుడు ఎప్పుడైతే చేరుకుంటాడో వాళ్ళు ఎక్కడ ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న ఎలాంటి సాధన ప్రక్రియ చేస్తున్న ఎలాంటి స్థితిలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా తమ మనస్సును స్థిరముగా 48 నిమిషాల పాటు నిశ్చల స్థితిలో ఉంచగలిగితే వారికి ఖచ్చితంగా స్థూలశరీరం కర్మలు సంపూర్తిగా కర్మశేషము కూడా లేకుండా నివారణ అవుతాయి. అప్పుడే వారి సాధన శక్తి ఆఙ్ఞా చక్రమునకు చేరుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న సూక్ష్మ కర్మలు నివారణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇట్టి సాధన స్థితియే కాశీ క్షేత్రములోని పంచక్రోశ ప్రాంత పరిధిలోని మరణంతో సమానం అని తెలుసుకోండి.ఈ  క్షేత్ర మరణం కూడా భూలోక కర్మల నుండి విముక్తి కలిగించి మన సాధన శక్తిని విశ్వనాథుని యొక్క తారకరామ ఉపదేశంతో మన ఆజ్ఞా చక్రము నందు చేరుస్తాడు కదా. అంటే ఈ లెక్కన చూస్తే ఎవరికి అయితే స్థూల కర్మలు నివారణ పూర్తి అయిన వాళ్లు కాశీలో మరణమును పొందవలసిన అవసరం లేదని తెలుస్తోంది కదా.
 
అలాగే మన శరీరంలోని పంచ చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి అలాగే బ్రహ్మ- విష్ణు- గ్రంధులు భూలోక స్థూల శరీర కర్మలకు సంబంధించినవి అన్నమాట. భూలోకమంతా అందుకే విష్ణుమాయతో ప్రకృతి మాయ ఉంటుంది అన్నమాట. చాలామందికి చిన్న సందేహం వస్తుంది. అది ఏమిటంటే మనలోని సహస్రార చక్రంలో సహస్ర కారణాలు ఉంటాయని సహస్ర క్షేత్రం గా ద్వారక ఉన్నదని చెబుతారు కదా. ఏకముగా ద్వారకలో మరణము పొందితే కారణ కర్మలే నివారణ అవుతాయి కదా అంటే అలా వీలు పడదు. ఎందుకంటే సప్త మోక్ష క్షేత్రాలలో కాశీ క్షేత్రం కర్మ నివారణ చేస్తుంది. మిగిలిన క్షేత్రాలలో ఆయా భవిష్యత్ జన్మలు ఏమిటో మాత్రమే చూపుతాయి. ఒక కాశీ క్షేత్రములోనే నిత్య దహనాగ్ని చితాగ్ని ఉంది. మన కర్మల నివారణలు ఈ విధంగా దహించ బడతాయి. పైగా ఈ క్షేత్రము నందు ఆదియోగి మనకు ఆది గురువుగా ఉండి తారకరామ మంత్రోపదేశం చేస్తాడు. ఇలా మిగిలిన మోక్ష క్షేత్రాలలో జరగదు. ఆలోచించండి. మర్మం ఏమిటో మీకే అర్థం అవుతుంది. కాశీయాంతు మరణం అని శాస్త్ర వచనం. ఇంతటి మహిమాన్విత కాశీ క్షేత్రంలో కూడా సర్వ కర్మలు నివారణ గావని తెలియడమే ఈ అధ్యాయం రచనకు నాంది అయినది. కేవలం స్థూల శరీరము కర్మలు నివారణ అవుతాయని మిగిలిన కర్మలు నివారణ కోసం ఆయా లోకాలయందు ఆయా శరీరాలతో సాధన జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని తెలిసిన దగ్గర్నుంచి నా మనస్సు నాలో లేదు. ఏదో తెలియని తీవ్ర సంఘర్షణకు గురి అవుతోంది. శాంతి పడితే పర్వాలేదు. లేదంటే రాబోయే ఐదు సంవత్సరాలలో మరణం తధ్యమని ధ్యాన అనుభవాలు సూచనలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే నా సాధన శక్తి 48 నిమిషాలకి అనగా పది లక్షల సంవత్సరాల స్థాయికి చేరుకుంది. ఇక అటుపై నా మెదడు పరిణితి చెందుతూ తట్టుకోలేదు. పగిలిపోవడం ఖాయము అన్నమాట. అదియే స్థూల శరీర కపాలమోక్షం అవుతుంది. ఎందుకంటే మన మెదడు తట్టుకోలేని స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో అనగా 48 నిమిషాల పాటు నిశ్చల స్థితిలోకి మన మనస్సు వెళుతుందో ఆనాటి నుండి మన మానవ కపాలం కాస్త మెత్తబడటం ఆరంభమై ఇక కపాల బ్రహ్మరంధ్రము వద్ద బాగా మెత్తబడి ద్వారబంధం అయిన బ్రహ్మరంధ్రము అప్పటిదాకా మూసుకుని ఉన్నది కాస్తా తెరుచుకోవడం మొదలవుతుంది. దానితో కపాల విభేదనము ఆరంభమవుతుంది. కపాల మోక్షము మొదలవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి మేమిద్దరం ఇదే స్థితిలో ఉన్నాము. రాబోవు ఐదు సంవత్సరాలలో మా స్థూల శరీరాల కర్మలు కర్మశేషము కూడా సంతృప్తి గా అవటం వలన మా స్థూల శరీర కపాల మోక్షం కలుగుతుందని తెలిసిన దగ్గరనుంచి అన్నిటి యందు అందరియందు స్మశాన వైరాగ్యం స్థితిలో సాక్షీభూతంగా బ్రహ్మతదాకార స్థితిలో తారకరామ ఆరాధనలో మౌనముగా మౌనబ్రహ్మ స్థితిని పొందుతూ ప్రశాంతత పొందుతూ మనో నిశ్చల స్థితి పొందుతూ మేధా దక్షిణామూర్తి లాగా మారిపోయినాము. కాని సర్వకర్మనివారణ చేసిన ఆదిబ్రహ్మ వేసిన బ్రహ్మముడిని మేము విడతీసినామో లేదో తెలియాలంటే మీరు ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

శుభం భూయాత్

పరమహంస పవనానంద
*************************************
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి