అధ్యాయం 41


సాధన స్థాయిలు చెప్పే అమ్మవారు

మా   బాల త్రిపుర సుందరి

అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన పనిలేదు అని, మనము ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది. ఆ స్థాయిలో మన సాధన శక్తి ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఆ స్థాయికి మన సాధన శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని నేను మధనపడుతుండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్ర లేచి "నాయనలారా! ఏమీ లేదు.  మీ సాధన స్థాయి గూర్చి బాల త్రిపుర సుందరి అంశ అయిన బాలాదేవి మీకు కనపడి చెబుతుంది. మీరు ఆమెను పూజించిన పూజించక పోయినా లేదా మీ దేవత శక్తి అయిన పూజించినను లేదా మీ యోగ ప్రక్రియ ద్వారా మీ సాధన శక్తి పెంచుకున్న లేదా మీరు యంత్రాల ద్వారా యంత్రసిద్ది పెంచుకున్న జప సిద్ధి, ప్రాణాయామం సిద్ధి లేదా ఉపాసన సిద్ది పొందితే ఆమె మూడు రూపాల్లో ఖచ్చితంగా మీకు కనబడుతుంది. ఆమె కనపడాలంటే మీరు పైన చెప్పిన విధి విధానాలలో ఏదో ఒకదానిలో సిద్ధి పొంది ఉండాలి. అంటే పైన చెప్పిన వాటిని క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, వాయిదా వేయకుండా, ఆత్మ నిష్ఠతో, కర్మిష్టి గా, నిష్కామ భక్తితో, అచంచల భక్తివిశ్వాసాలతో, శ్రద్ధతో , ఓపికగా, సహన శక్తి తో 12 సంవత్సరాలపాటు సాధన చేస్తే అప్పుడు మీరు ఎంచుకున్న విధానానికి మంత్ర సిద్ధి లభించినట్లే. అక్కడి నుండి మీరు వాక్సుద్ధి మాయలో, కామమాయలో పడకుండా మూడున్నర సంవత్సరాల పాటు ఉండగలిగితే మీ సాధన శక్తిని పరీక్షించడానికి బాల అమ్మవారే స్వయంగా మీ ఇంటికి వస్తుంది. మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. కానీ ఇతరులకు నేను ఉన్నానని మీ ఇంట్లో తిరుగుతున్నానని మాత్రమే సంకేతాలు ఇస్తోంది. ఆవిడ వచ్చే రూపం మీ సాధన స్థాయి ఏమిటో చెబుతుంది. 

                      అంటే మీ సాధన స్థాయి  బాల స్థాయిలోనే ఉంటే ఆవిడ 3-5-8 సంవత్సరముల వయస్సులో ఉన్న చిన్న ఆడపిల్లలాగా నిన్ను మీ ఇంటిలో నాన్న నాన్న అంటూ తిరుగుతూ ఆమెకు కావలసిన పదార్థాలు, సేవలు చేయించుకుంటుంది. సాక్షాత్తు పరాశక్తి ఈ బాలరూపంలో మీ కన్న కూతురు లాగా మెలుగుతుంది. తిరుగుతుంది. వెళ్లిపోతుంది. మళ్లీ వస్తూ ఉంటుంది. ఇక నీ సాధనా స్థాయి మధ్యమ స్థాయిలో ఉంటే అమ్మవారు కాస్త మధ్య వయస్సున్న స్త్రీ మూర్తి లాగా అంటే సుమారు 18-35 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ మూర్తిగా మీ ఇంటికి వచ్చి మీ పూజకు కావాల్సిన సేవలు చేస్తుంది. మీకు కావలసిన పూజా వస్తువులు, మహా నైవేద్యం అందిస్తుంది. ఇక మూడవ స్థితిలో అనగా మీ సాధన స్థాయి చివరి స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 45-65 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తిగా  మీ దగ్గరకు వస్తూ మీకు కావలసిన సలహాలు, సహకారాలు అందిస్తూ బయటకు వెళుతూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక నాలుగవ స్థితిలో అనగా మీ సాధన స్థాయి అంతిమ స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 85 సంవత్సరాల వయోవృద్ధ స్త్రీ మూర్తిగా ఆలంపుర జోగులాంబ లాగా ఒక మంత్రగత్తెలాగా దర్శనమిస్తుంది! ఈ మూడు స్థాయిలు ఏకకాలంలో జరగవు. అలాగే బాలాదేవి కూడా ఏకకాలంలో బాలా, త్రిపుర, సుందరి,గా ఏకకాలంలో కనపడదని తెలుసుకో. ఆవిడ మీ సాధన స్థాయికి  12 సంవత్సరాల మధ్యకాలం తీసుకుంటుంది. అంటే ఈసాధన బాల స్థాయి ఉంటే ఐదు సంవత్సరాలు గా కనపడుతూ వెళుతూ మూడున్నర సంవత్సరాలు ఉంటుంది.  ఆ తర్వాత మళ్లీ మీ సాధన స్థాయి పెరిగితే త్రిపుర గాను, తర్వాత మీ సాధన స్థాయి పెరిగితే  సుందరిగాను కనబడుతూ ఈ మధ్యకాలంలో సాధన స్థాయిలలో అన్ని రకాల యోగ మాయలలో  నువ్వు పడనంతవరకు  ఆమె  మీ సాధన స్థాయి ఏమిటో ఆయా రూపమును బట్టి చెప్తుంది.  అంటే మీ సాధన స్థాయి బాల నుండి చివరి స్థాయికి వచ్చేసరికి 12+12+12=36 సంవత్సరాలు పడుతుంది అది కూడా నువ్వు ఎలాంటి యోగ మాయలలో పడకపోతే! పడితే అంతే సంగతులు. చిత్తగించవలెను. అంతటితో ఈ జన్మకి ఈ సాధన ఆగిపోతుందని భావించుకోవచ్చు.అప్పుడు మీ గురువులే వచ్చిన, సద్గురువువే వచ్చిన, నీ పరమ గురువు వచ్చిన, మీ ఇష్ట దైవాలు వచ్చిన, మీయోగసాధన మాత్రం ముందుకు వెళ్ళదు. అంతటితో స్వస్తి పలకడం జరుగుతుంది. అందుకే యోగ సాధన అనేది కత్తి మీద సాము లాంటిది. దీనికి రెండువైపులా పదును ఉంటుంది. ఒకవైపు పైకి లేపుతూనే మరోవైపు మాయలో పడవేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ రెండింటినీ సమన్వయం పరచుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మాయ మాయం అవుతుంది. అప్పుడే మన త్రినేత్రం సంపూర్తిగా తెరుచుకుని స్థాయికి వస్తుంది. అంటే బాల గా వచ్చి పసిపిల్లల వ్యామోహంలో పడేలా చేస్తుంది! అదే త్రిపుర రూపంలో వచ్చి యవ్వనవతి గా ఉండిమనలో తీవ్రమైన కామోద్రేక శక్తిని పరీక్షించును. ఇక సుందరి రూపంలో వృద్ధ స్త్రీ మూర్తి రూపంలో మన ఇష్టకోరిక శక్తిని పరీక్షిస్తుంది. ఇక దేవి రూపంలో ముసలి వృద్ధ స్త్రీ మూర్తి రూపంలో మన సహనశక్తిని ఓపికను పరీక్షిస్తుంది. వీటిలో నువ్వు పరిపూర్ణ సంపూర్ణ స్థాయిలో మీ ఈ సాధన స్థాయి ఉందని ఆమెకు అనిపిస్తే అప్పుడు నీకు నీ సాధనకి తగ్గట్లుగా మంత్రగురువు, సద్గురువు, పరమగురువు, ఆదిగురువు ప్రసాదించును. నీవే ఆయన దగ్గరికి వెళ్లడం గాని లేదా నీ దగ్గరికి ఆయనే వచ్చేటట్లుగా చేయడం జరుగుతుంది.ఈ వచ్చే సద్గురువువులు మీకు తెలిసిన వారు లేదా తెలియని వారు కావచ్చు. వారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉంటారో నీకు చూపించి ఆమె నీ దగ్గర నుండి అంతర్ధానమవుతుంది. బాలాదేవి యొక్క ఆఖరి నాలుగవ రూపమైన దేవిరూపముగా ఆదిపరాశక్తిగా కనపడితే...నీకు కపాలమోక్షమే! అంతటితో నీ సాధన సంపూర్ణముగా ద్విగిజయముగా పూర్తి అయినట్లే! ఇక ఎప్పటికీ మనకు కనపడదు. కానీ నా అనుభవం ప్రకారము సాధకుడు తన జన్మలో ఈ అమ్మవారిని ఒకటి లేదా రెండు రూపాలు మాత్రమే తన జీవిత కాలంలో చూడగలుగుతాడు అని వివిధ చరిత్రల ద్వారా నాకు అవగతమైనది. అంటే బాల గాను లేదా బాలా త్రిపురగాను లేదా  త్రిపుర సుందరిగాను లేదా త్రిపుర లేదా సుందరి గాను చూడవచ్చును. ఆమె పెట్టే అన్ని రకాల యోగమాయ పరీక్షలు తట్టుకుంటే తమ స్థాయికి తీసుకొని వెళ్లే సద్గురువును చూస్తుంది. అంటే బాలాదేవి సాధకుడికి అవసరమయ్యే సద్గురువును ఆ సాధకునికి కలపడం అనుసంధానకర్త గా పనిచేస్తుంది.

కంచి పీఠాధిపతి అయిన చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారికి అమ్మవారు బాలగాను, త్రిపురగాను కనిపించిందని వారు చెప్పడం జరిగినది. అలాగే వేద వ్యాసుల వారికి అమ్మవారు సుందరిగా అనగా కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఒక వృద్ధ స్త్రీ గా కనపడివారి సహనశక్తిని పరిశీలించి ఆ పరీక్షకు వేదవ్యాసుడు తట్టుకోలేకపోతే అంటే 13 రోజులకు ఆయన అలాగే ఆయన శిష్య బృందం భక్తులకు ఆహారం దొరకక పొయేసరికి ఆయన కాశీక్షేత్రంను శపించ పోతుంటే ఈ బాలాదేవి స్వయంగా ఆయనకి వృద్ధ అన్నపూర్ణగా కనపడి అన్నపూర్ణ క్షేత్రమైన కాశీలో అన్నంకు కొరత ఉండదని తెలిసిన మహా జ్ఞానివి కొన్ని రోజులకే ఆకలి బాధ తట్టుకోలేక మహా పవిత్రమైన కాశి క్షేత్రంను శపించే స్థాయికి వచ్చావా? తక్షణం నువ్వు ఈ కాశి క్షేత్రంను వదలి వెళ్ళమని హుంకారం చేస్తుంది. దాంతో ఆయనకు తను చేసిన ఘోర తప్పిదం తెలిసి ఎంత బ్రతిమాలినా ఆమె కరుణించదు. అలాగే ఆయన శివుడిని, విష్ణువుని, బ్రహ్మ దేవుడిని స్తుతించిన వారి నుండి మౌనమే సమాధానం వచ్చేసరికి చేసేదేమీ లేక కాశి క్షేత్రం వదిలి దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం చేరుకున్నారని వారి చరిత్రలో తెలుస్తుంది. ఒక ఆకలి బాధ వారి జీవితం ఎలా మార్చిందో ఒకసారి ఆలోచించండి. అమ్మవారు పెట్టే యోగమాయ పరీక్షలు వాటి ఫలితాలు ఇంకా ఎలా ఉంటాయో ఆలోచించండి. ఊహించుకుంటే దడ రావడం ఖాయం.

అంతెందుకు తపోనిధి బాబాజీ అను హిమాలయ యోగి “మహా మృత్యువు అంటే ఏమిటి? దానిని దగ్గరగా చూసి అనుభూతిని పొందాలని”  తీవ్రమైన మనో వాంఛ కలిగినది. వెంటనే ఆయన నగ్నంగా అగ్ని సాధన చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక వృద్ధురాలు వచ్చి ఈయనకు సహాయపడుతూ ఆకలి వేసినప్పుడు ఈయనకు అన్నం పెడుతుండేది. కానీ బాబా వారు ఈమె గురించి పట్టించుకునేవారు కాదు. ఈమెకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.  వీలున్నప్పుడల్లా చెట్టు కింద ఏర్పాటు చేసుకున్న ధుని వద్ద ఏకాంతం లో కూర్చొని అగ్ని సాధన చేస్తూ మహా మృత్యుదేవత కోసం ఎదురు చూస్తుండేవారు. ఆమె ఈ వృద్ధురాలు రూపంలో వచ్చి తనకు సహాయపడుతుందని ఆయన గమనించని స్థాయిలో  యోగంలో  అగ్ని సాధన ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. ఒక రోజు అనుకోకుండా ఈయన తీవ్రమైన ధ్యాన సమాధిలో ఉండగా ఒక  అనన్య సౌందర్యవతి దర్శనం అయినది. నేను పిలుస్తున్న నీవు రాలేదు అంది. ఈయనకు అర్థం కాలేదు. ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి ఆవిడ ఏమని మనకు సందేశం ఇస్తుంది అర్థం కాక చండి స్తోత్రం చేసుకోగానే తనకు సేవలు చేయడానికి అలాగే తనకి ధ్యానంలో కనిపించిన దేవతా స్త్రీ మూర్తులు ఒక్కరేనని వారే మహా మృత్యువును ఇచ్చే బ్రహ్మ రంధ్రం లో ఉండే చితాగ్ని స్వరూపమైన దేవి రూపమైన ఆదిపరాశక్తియని గ్రహించి మౌనం వహించారు. బాలాదేవి ఈయనకి సుందరి గాను, దేవి గాను అగుపించింది. అమ్మ పిలిచినప్పుడు ప్రశ్నించకుండా వెళ్లి ఉంటే ఈయన యోగ జీవితం మహా మృత్యువు వలన పరిసమాప్తి అయ్యేది. మోక్ష ప్రాప్తి పొందేవాడు. కానీ అమ్మ నే ప్రశ్నించడం  వలన మోక్షగామి గా మిగిలి పోవలసి వచ్చింది” అంటూ చెప్పడం ఆపినారు.

నేను వెంటనే అప్పుడు “స్వామి! మీరు చెప్పిన బాలాత్రిపురసుందరి లీలలు అన్ని కూడా దాదాపుగా పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి బాలాదేవి అనుభవం పొందినారా? ఎవరైనా పొందిన వారిని చూశారా?” అని అడిగాను. దానికి వెంటనే “నాయనా! నేను అయితే కనీసం నా సాధన స్థాయి బాల స్థాయి కూడా చేరుకోలేదని అని తెలుస్తోంది. ఇప్పుడు నా వయస్సు సుమారు 65 సంవత్సరాలు. ఇక రాబోయే కాలంలో కూడా బాలమ్మ నన్ను కరుణిస్తుందని నాకైతే నమ్మకం లేదు. కానీ మా గురువుగారికి మాత్రమే బాల అమ్మవారు చిన్నపిల్ల గానూ, త్రిపుర అంటే యవ్వనవతి గా దర్శించుకోవడం జరిగినది. పైగా ఆయన చితిమంటలలో యవ్వన సౌందర్యవతి త్రిపురదేవి దేవత సాక్షాత్కారం జరగడం మరో విశేషం. ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రిక విలేఖరి ఫొటోస్ తీయటం జరిగినది. కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారే. రేపొద్దున ఈయన గురించి అన్ని వివరంగా చెబుతాను” అని సాయంత్రం  అనుష్టానం వేళ అవుతుందని ఆయన వెళ్లి పోవడం జరిగినది. దాంతో మాకు ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్లిపోవడం మాలో అసహనం, విసుగు, కోపం వచ్చినాయి కాని ఏమి చేయగలం అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురుచూడక తప్పదు. అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి. ఉంటాను. 

**************************
 గమనిక: ఇలా అమ్మవారు వివిధ రూపాలలో వచ్చి మన సాధన గూర్చి చెప్పడము అనేది నేను మొదట నమ్మలేదు! ఇవన్నీ గూడ మనో భ్రాంతులేనని కొట్టిపారేశాను! నా సాధన విశుద్ధి చక్ర స్ధితికి- ఆజ్ఞా చక్ర స్ధితికి వచ్చినపుడు మా ఇంటిలో చిన్న పాప తిరగడము అందరికి కనిపించినది! నాకు మాత్రము కలలో చిన్నపాప లంగా,జాకెట్ వేసుకొని ఇల్లు అంతా తిరుగుతున్నట్లుగా కనిపించేది!అయినా నేను నమ్మలేదు! నా సాధన ఆజ్ఞా చక్ర స్ధితికి- సహస్ర చక్ర స్ధితికి వచ్చినపుడు నేను పూజించిన బాలదుర్గ యంత్రరాధన వలన దుర్గాదేవి కాస్తా త్రిపురదేవిగా నన్ను ఒక ఆట ఆడుకున్నది! నా సాధన సహస్ర చక్ర స్ధితికి- హృదయ చక్ర స్ధితికి వచ్చినపుడు మా గుడి అమ్మవారు సుందరిగా మారి నాతో ధ్యానములో మాట్లడము మొదలు పెట్టేసరికి కధ నాకు అర్ధమైనది! నా సాధన హృదయ చక్ర స్ధితికి - బ్రహ్మచక్ర చక్ర స్ధితికి వచ్చినపుడు దేవి కాస్తా ఆదిపరాశక్తి రూపమైన దీపదుర్గగా దర్శనమిచ్చి నన్ను  ఒక ఆట ఆడుకున్నది! అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవి గూడ మా మూలధారచక్ర శుద్ధి సమయములో పరిచయము అయ్యినది.ఈమె కూడ త్రిపురమాయ అంశయే... అనగా మూలాధారచక్రానికి అనుసంధానముగా ఆజ్ఞాచక్రము ఉంటుంది గదా! దానితో ఈ త్రిపుర మాయ దాటలేక వివాహమును చేసుకున్న 12 సం!!రాలకి కాని దాటలేకపోయినాను! ఇవి అన్నియు గూడ ఎవరికి వారికి స్వానుభవము అయ్యేదాకా ఎవరు నమ్మరు!ఎందుకంటే నేను గూడ మొదటిలో అలాంటివాడినే గదా నమ్మ లేదు!నాకు కలిగిన ధ్యానానుభవాల వలన నమ్మక తప్పడము లేదు! నేనేమి మాయలో పడలేదు అనడము లేదు! నేను అందరికి లాగానే తెలిసి మరియు తెలియకుండా మాయలలో పడినాను!కాని నాకు వచ్చిన బాలదుర్గ బంగారపు యంత్రము వలన నాలో మాయ ఉద్రిత్తలు చాలా తగ్గించివేసింది! అలాగే నాకు వచ్చిన పాదరసలింగము వలన నేను మాయలయందు ఆశ,భయం,ప్రేమ, మోహ,వ్యామోహ, ఆలోచన,సంకల్పాలు,స్పందనలు లేకుండా చేసినది!అంటే పాదరసము అనేది మహశివుడి యొక్క వీర్యమని శాస్త్రవచనము కదా! పాదరస లింగారాధన వలన నాలో వీర్యస్తంభన కల్గి అన్ని మాయలు నా అదుపు ఆజ్ఞలలోనికి నేను తెచ్చుకోవడము అయినది! దానితో నాకు మాయ మాయం అవ్వడము ఆరంభమైనది!    

అంత్యక్రియల్లో అద్బుతం


చందోలు శాస్త్రిగారు

బ్రహ్మ సిద్ధాంతి తన  గురువు గారు గూర్చి చెపుతున్నారని క్రిందటి అధ్యాయములో తెలుసుకున్నారు!వీరి మాటలలోనే వారి గురువుగారి పూర్తిగా తెలుసుకుందాం! కానీ మా గురువుగారికి మాత్రమే బాల అమ్మవారు చిన్నపిల్ల గానూ, త్రిపుర అంటే యవ్వనవతి గా దర్శించుకోవడం జరిగినది. స్వయంగా నేను అనుభవాలు ప్రత్యక్షంగా అంటే బాల అమ్మవారి బాల రూపము, అలాగే త్రిపుర రూపము చూడడం జరిగినది. ఆయన పూజ చేసుకునే సమయంలో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ నాన్న నాన్న అంటూ ఆయన ఒడిలో కూర్చోవటం నేను చాలా సార్లు చూసాను! ఎన్నోసార్లు ఫోటోలు తీస్తే ఒక్కసారి కూడా సరిగ్గా వచ్చేవి కావు. చివరకు ఒక ఫోటో మాత్రం సంపాదించగలిగాను అలాగే ఆయన తన వాలుకుర్చీలో గాని, ఉయ్యాల మంచం పైన పడుకున్నప్పుడు కానీ లేదా ఆయన వెనుక వైపు తిరిగి ఉన్న అప్పుడు నాకు చాలా సార్లు సౌందర్య యవ్వనవతి స్త్రీ వెనుక భాగం కనపడేది! గురువుగారా? అమ్మవారా అని నాకే కాదు అక్కడున్న నాతోటి శిష్యులకు సందేహం కలిగేది. ఆయన అంతటి బాల ఉపాసకుడు. 16 సంవత్సరాల పాటు ఏకధాటిగా అదేపనిగా బాల మహా మంత్రం అక్షర లక్షలు చేసి ఆమె పెట్టిన అన్ని రకాల యోగ మాయలు అనగా ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేకపోవడం, మానసిక సమస్యలు ఇలా ఎన్నో ఆయన జీవితంలో నేను దగ్గరగా ఉండి చూశాను. పైగా ఆయన చితిమంటలలో యవ్వన సౌందర్యవతి త్రిపురాదేవి  దేవత సాక్షాత్కారం జరగడం మరో విశేషం. ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రిక విలేఖరి ఫొటోస్ తీయటం జరిగినది. కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారే. రేపొద్దున ఈయన గురించి అన్ని వివరంగా చెబుతాను” అని గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న చందోలు గ్రామంలో చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి శ్రీ రాఘవ నారాయణ శాస్త్రిగారనే మహాత్ములు ఉండేవారు.ఆయన్ని అందరూ "చందోలు శాస్త్రిగారు" అని పిలిచేవారు.ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట.

జననం, బాల్యం:
గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896, ఆగష్టు 5 న జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించాడు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించాడు.

విద్యాభ్యాసం:
రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు. వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవ నారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. ఆయన బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి వెంకటప్పయ్యశాస్త్రి అనుమతితో కేదారలింగం "బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని" ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రం నేర్చారు. 

సన్యసించేందుకు ప్రయత్నాలు, వివాహం:

రాఘవ నారాయణశాస్త్రికి యవ్వనం లోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవనారాయణశాస్త్రి సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్ళకు వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. వాళ్ళని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

పాండిత్యం:

శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికాకు రమ్మన్నారు. వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావధానానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.

అమ్మ వారి సాక్షాత్కారం:

దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అంగ వస్త్రము నేల మీద పరచి నిద్ర పోయారు .8 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఓయి ! ముష్టి పెడతాను .కొంగు పట్టు ‘’అన్నది. దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది. తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే . ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట.అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు . ప్రాణాయామం తపస్సు కొనసాగించారు .ఇంట్లో వేరుసెనగనూనె, వేరు సెనగ వాడ లేదు . దొండకాయ , టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి క్యాబేజీ నిషిద్ధం. కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు! కూతురు లక్ష్మి ని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు .ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవసం:

శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు. 

ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ’వశ్యంకర ఔషధి ‘’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు. శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నేలకు తగిలే సమయాన ఆ యోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు .

తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కధామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తి చేస్తున్నారు.అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బడ్డావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది.తాడి కొండ వేద పాఠశాలలో దెయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు.ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటే సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతి కనిపించి ,నమస్కరించి లోపలికి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ , తిడుతూ ఉండేది . అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు ’’అని అడిగారు . ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది . శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు . ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది . అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయ బూనితే‘’గరుడ మంత్రం ‘’జపించారు . సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు . నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది . వెళ్లి పొండి ‘’ అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గరుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు .

శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది . శాస్త్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కనిపించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉపయోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది. అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .

ఒకసారి శాస్త్రి గారికి చిన్న ధర్మసందేహము వచ్చినది!ఆ ప్రక్కనే ఉన్న గుమ్మం మీద కూర్చుని ఉన్న అమ్మవారిని చూస్తూ..."అమ్మా! నాకు చిన్న ధర్మసందేహము...నీకు పెళ్ళికి ముందు సంతానము కల్గినదా.. లేక పెళ్ళి అయిన తర్వాత సంతానము కల్గినదా? ఎందుకంటే నీ పార్వతీదేవి కళ్యాణములో వినాయకుడి పూజ చేసినారు గదా!అంటే నీపెళ్ళికి ముందే నీ కొడుకు గణపతి ఉన్నట్లే గదా!నీకు పెళ్ళి అయిన తర్వాత నలుగు పిండితో గణపతిని నీ సంతానముగా సృష్టించినావు!మరిఎలా సాధ్యము? అనగానే అమ్మవారు వెంటనే “అయితే నీవే దీనికి సరియైన సమాధానము చెప్పు” అనగానే “అమ్మా!ఆదిలో పరమేశ్వరుడితోపాటుగా మహాగణపతి కూడా ఉన్నాడు!ఎందుకంటే పరమేశ్వరుడి మూలాధారచక్ర అధిపతిగా మహాగణపతి  ఉన్నాడు! ఆతర్వాత ఈ గణపతి లోకకళ్యాణార్ధముగా వివిధ అవతారమూర్తులుగా ఆవిర్భవించినాడు!ఈ రూపమూర్తులే ఒక రూపమే నీ పెళ్ళి తర్వాత సంతానముగా ఏర్ఫడినది అని చెప్పినారట!
ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో , పేరు పెట్టమనో అడిగే వారు . కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసేవారు . అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి .

                                                   
                                         చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం (in red circle)


10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు . ఆయన తనువు చాలించినప్పుడు, దహన సంస్కారాలకి స్మశానానికి తీసుకెళుతూ ఉండగా, ఎంతోమంది భక్తులూ , శిష్యులూ గ్రామస్తులూ కూడా స్మశానానికి వెళ్ళారట. వారితోపాటే న్యూస్ కవరేజ్ కోసం, ఆంధ్రభూమి, ఈనాడు మొదలైన పత్రికా విలేఖరులు కూడా వెళ్ళారు.వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు తీరా దహనం మొదలు పెట్టిన కొంతసేపటికి, అన్ని వేలమందీ కళ్ళారా చూస్తూ ఉండగా,చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం బయటకి వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. (ఆయన ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్ఛారని జనాలు అనుకున్నారు)సరిగ్గా అదే సమయం లో అక్కడున్న పత్రికలవాళ్ళు ఆ దృశ్యాన్ని 'క్లిక్' మనిపించడం మన అదృష్టం.అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు . అంత్యక్రియలు జరిగినపుడు ఆ చితి పై శ్రీ బాలా త్రిపుర సుందరి అందరికీ కనిపించుట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.



ఆ తరువాత, 6th Oct 1991 ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్ లోనూ, ఇంకొన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది. ఆ పేపర్ కటింగుని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను. శాస్త్రి గారు కారణ జన్ములు . వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి .

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*************************
గమనిక:నాకు ఈయన గూర్చి తెలిసిన తర్వాత సజీవమూర్తిగా చూడలేకపోయినాననే బాధవేసినది!దానితో ఈయనని ఎలాగైన చూడాలనే తపన మొదలైంది! దానితో ఈయన గూర్చి తీవ్ర ధ్యానతపస్సు మూడురోజులుపాటు చెయ్యగా అపుడు వీరు ధ్యానము నందు కనిపించినారు!గాకపోతే విచిత్రంగా ముందు వైపు ఆయన పురుషరూపము...వెనుక వైపు సుమారుగా 45 సం!!రాల ముదురు ఆకుపచ్చరంగు చీరె ధరించిన ఒక స్త్రీమూర్తి వెనుక భాగము కనపడినది!అంటే ఒకరకముగా చెప్పాలంటే జగన్మోహిని రూపములో కొన్ని క్షణాలు కనిపించి..ఏవో మాట్లాడాలని ప్రయత్నము చేస్తున్నారని అనిపించగానే నా ధ్యానభంగమైనది! దానితో నాకు ఈయన ఆత్మదర్శనము ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ నడిచే దేవుడైన సిద్ధపురుషుని గూర్చి నా సాధన అనుభవ అధ్యాయములో రాయడము జరిగినది! 

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ammavaaru baalaga , tripura ga ala naalugu rupallo eppudu enduku osthundi ani cheppatam... aa vivarana antha baane undi kaani nak aithe emi thelidu ante nen em thelsukolenu anniti kante mukhyam naka kaneesam bala ga kuda darshanam isthundo ledo thelidu... meeru yantram, lingamu valla maayalu thattukogaligaru annaru ga...lucky meeru...
    shastry gaari gurinchi cheppatam, ayna nadiche daivamani, moolika kosam velite datta darshanam avvatam... maatatho shadows ni tharmatam, garuda mantram chadavatam...

    రిప్లయితొలగించండి