సూక్ష్మంలో మోక్షం
ఒక రోజు నాకు ధ్యానంలో ఒక వింత అనుభవం దృశ్యం కనిపించింది. అది ఏమిటంటే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము యానము అన్నమాట. ఎందుకో ఈరోజు ఉదయం 10:30 కి ధ్యాన సమాధిలోనికి వెళ్ళిపోయాను. అప్పుడు ధ్యానములో నా హృదయ చక్రం దర్శనం అయినది. అక్కడ ఒక అంగుళం పరిమాణంలో ఉన్న చిన్నపాటి నీలివర్ణ దీపకాంతి ఏదో చీకటి మార్గం గుండా ప్రవేశిస్తున్నట్లుగా నా త్రినేత్రం ముందు కనపడినది. అంతే నా సంకల్ప శరీరము ఎటో బయలుదేరుతున్నట్లుగా నా స్థూల శరీరము గ్రహించినది. ఇంతలో ఉగ్రస్వరూపంలో జ్వాలానరసింహ స్వామి సజీవ మూర్తిగా ఉన్నట్టుగా దర్శనం అయినది. ఆ ప్రక్కనే ప్రత్యంగిరా మాత కూడా దర్శనమైనది. వీరిద్దరు పాదాల మధ్య ఉన్న చిన్నపాటి సందులోంచి లోపలకి నా దీపకాంతి వెళుతున్నట్లుగా కనిపించినది.ఇంతలో కోటానుకోట్ల వెలుగుతున్న నక్షత్రాలు గ్రహాలు గ్రహశకలాలు కనబడినది.
అందులో ఒకచోట విపరీతముగా ఒక భూచక్రం వెలిగిస్తే ఎలాంటి నిప్పులు విరజిమ్ముతూ తిరుగుతుందో అలా తనలో కలుపుకుంటూ సుడులు తిరుగుతున్న ఒక బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దర్శనమైంది. కాకపోతే దీని చుట్టూ ఏదో ఒకటి వలయాకారంలో మందంగా ఉండి బ్రహ్మతేజో వలయంగా ఉంది. దీన్ని దాటి లోపలికి వెళ్లినవి మాత్రమే ఈ బ్రహ్మాండం చక్రము తనలోనికి తీసుకుంటుందని నాకు స్పురణ అయినది. అప్పుడు ఈ వలయమునకు దగ్గరగా సజీవమూర్తిగా హనుమంతుధారి శరీరంతో దర్శనం అయినది. వీరి పాదాల గుండా దీపకాంతి లోపలికి బయలుదేరినది. అంటే భయమును చేధించి బ్రహ్మాండ చక్రము కృష్ణబిలం దగ్గరికి నా దీపకాంతి చేరినదని నాకు అర్థం అయింది. అప్పుడు ఉగ్రరూపం హయగ్రీవుడు సజీవ మూర్తిగా దర్శనం అయినది. వీరిని చూస్తూ వారి పాదాల చెంత నుండి దీపకాంతి కృష్ణబిలము నందు ప్రవేశించినది. దాని లోపల చూస్తుంటే ఏదో సముద్రంలో సుడిగుండం ఏర్పడితే లేదా గాలిలో ఏర్పడితే ఎలా ఉంటాయో అలా ఉంది. అనగా పైభాగం బాగా విస్తరించి ఉంటే అడుగు భాగం ఏదో సన్నని గొట్టం ద్వారముగా ఉంది. దీని మధ్య భాగములో ఎన్నో పొరలు పొరలుగా ఉన్నట్లుగా పైనుండి చాలా స్పష్టం గా కనబడుతోంది. అంటే ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంది అన్నమాట. కోన్ ఈ వేగంగా తిరిగితే ఎలా ఉంటుందో అలా ఈ కృష్ణబిలం ఉన్నట్లుగా నాకు అర్థమైనది. నా దీపకాంతి కూడా ఇందులో పడి సుడులు తిరగడం ఆరంభమైనది. అప్పుడు నాకు అందులో నా సద్గురువైన శ్రీ త్రైలింగస్వామి వారు అలాగే వీరి గురువుగారితో ఉన్నట్లుగా వారి శరీరాలు కనిపించాయి. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వీరు గురువైన బ్రాహ్మణి బైరవి తోతాపురి శరీరాలు కనిపించాయి. ఆ తర్వాత దత్త అవతారమైన శ్రీ అక్కల్కోట్ స్వామి సమర్థ స్వామి వారి శరీరం కనిపించింది. ఆ తర్వాత శ్రీ వాల్మీకి మహర్షి వారి శరీరం కనిపించింది. ఆ తర్వాత ప్లాస్మా అంటే తెల్లని పొరలో ఉన్న అస్థిపంజరం రూపంలో ఉన్న వేదవ్యాసుడు వారు కనిపించారు. ఆ తర్వాతి కాళీమాత అటుపై జొన్నవాడ కామాక్షి కనిపించారు. ఆ తర్వాత నా మనో నేత్రమునకు ఏ దృశ్యము అందలేదు. అంటే అక్కడికి వచ్చేసరికి దహన శక్తి సుమారుగా పదివేలు ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఇకపై ఏమి జరిగినదో నాకైతే తెలియలేదు. అయినా సంకల్ప శరీర దీపకాంతి సుడులు తిరుగుతూ కిందకి చేరుకుంటుందని ఇది ఇలా ఒక్కొక్క పొరకు చేరుకున్నప్పుడు నాతో భూలోకంలో అనుబంధం పెట్టుకున్న గురువులు వారి గురువులు మహర్షులు దేవతలు కనిపిస్తున్నారని నాకు అర్ధం అయ్యే లోపల నాకు ధ్యానభంగము అయినది. సాయంత్రము 4:00 అయినది. ధ్యానము నుండి బయటకు వచ్చిన తర్వాత విశ్లేషణ చేసుకుంటే ఈ పొరలో వారి శరీరాలు ఇంకా ఇప్పటికి విచ్చిన్నము కాలేదని అందువలన భూమి మీద వీరు ఇంక ఇపుడికి ఆత్మ రూపంలో విగ్రహ రూపంలో ఆత్మ శక్తి రూపంలో సజీవముగా ఉన్నారని నేను గ్రహించాను. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండ చక్రములో వారి శరీరాల విచ్ఛిన్నమవుతాయో. ఈ చక్ర బ్రహ్మ తేజస్సు యొక్క చితాగ్ని లక్షకు చేరుకుంటుంది. వారి శరీరాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని దానితో వీరికి భూలోకముతో అనుసంధానం ఉండదని గ్రహించాను. ఈ లెక్కన చూస్తే నా సంకల్ప శరీరము విచ్చిన్నము అయ్యి రేణువు వంటి ఆకాశ శరీరము గా మారటానికి అనగా చితాగ్ని దహన శక్తి లక్ష చేరుకోవడానికి ఇంకా ఇప్పటినుండి 2019 నుండి సుమారుగా 12 సంవత్సరాలు అనగా 2032 దాకా పడుతుందని అదే నాకు భూమి మీద ఆఖరి శ్వాస అవుతుందని అదే జీవ సమాధి సిద్ధి అని నాకు అర్థం అయింది. అంటే ఈ రోజు నుండి నా శరీరము పతనం కావటం ఆరంభమైనది. అదే 2032 సంవత్సరానికి సంపూర్తిగా నాశనమవుతాయన్నమాట.
అంతెందుకు మాకు ఇన్ని తెలిసిన గూడ బాల రూపమును దాటినాము గాని కామరూపిణి అయిన త్రిపుర మాయ దాటలేకపోయినాము! ఆ పై త్రిపురదేవి వలన మాకు కలిగిన కామమాయను దాటుకోవటానికి మేము దీక్షాదేవిని వివాహము చేసుకొని…. త్రిపురదేవి కామమాయను దాటడము జరిగినది! ఆతర్వాత సుందరి, దేవి రూపములను దాటి...మహ మృత్యువైనా కపాలమోక్షస్ధితి ఈ సం!! అనగా 2019 మార్చి 11 మహశివరాత్రి పర్వదినమున ఉదయం 10:05 లకి మా సూక్ష్మ,కారణ, సంకల్ప, మా మూలకపాలము యొక్క చితాగ్ని బ్రహ్మాండచక్రములో ఈ మూడు శరీరాలు దహనమై...విభూదిగా మారడముగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందడము జరిగిన ట్లుగా మాకు ఆ రోజు ధ్యానానుభవమైనది! ఇదే ధ్యానములో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాధ్ కి జై...అంటూ...స్వయంగా గోమయ విభూది చేసుకొని వాడుకో అని ఆదేశము రావడముతో....
ఇదే రోజు బాగా ఎండిన ఆవుపేడను సేకరించి...దానికి ఆవునెయ్యి,కర్పూరం వేసి కాల్చడము...ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాముపొడిని ఆవుపాలతో కలిపి ఎండిపెట్టి...దీనినే విభూతిగా వాడటము జరుగుతోంది! దీనిని స్నానము చేసే నీళ్ళలలో చిటికెడు కలుపుకొని విభూధి స్నామము చెయ్యడము అలాగే ఈ విభూధితో ధారణ చేసుకోవడము చేస్తున్నాను! అలాగే ప్రతి సం!! వచ్చే మహాశివరాత్రినాడు ఈ విధంగా విభూధిని తయారు చేసుకోవాలని...వీలు అయితే అందరికి ఈ నిజమైన గోమయ విభూధిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడము జరిగినది! దానితో మా దీక్ష నామము అయిన శ్రీ పవనానంద సరస్వతి నామము కాస్తా బాబా విభూతినాధ్ గా మారడము జరిగినది! దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్దాంతము అలాగే సమాధి గీత రచించడము జరిగినది! కాని మా స్ధూల శరీరానికి నా చిట్టచివరి ప్రారబ్ధకర్మగా మా అమ్మగారి అంతిమ యాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్ధూల దేహవిముక్తి కల్గదని… అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారము మా చేతులలో జరగాలని ఆమె కోరడముతో...నాకు ఇంతటి సంపూర్ణ సాధన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా...ఆమె అడిగిన కోరికను తీర్చడము కోసము మా స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా ఆగిపోవడము జరిగినది! ఆమె మరణము తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్ధూల శరీరము…. ఆపై ఇది గూడ కాశీక్షేత్రములో మా అస్ధిక చితాభస్మము ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే...ఈ శరీరమునకు బంధవిముక్తి కల్గి మనోనిశ్చలస్ధితి పొంది స్ధూల కపాలమోక్షస్ధితి పొందడము జరుగుతుంది! అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! అంటే దీనితో స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి వచ్చినట్లే అవుతుంది!కాని ఆకాశ శరీర కపాలమోక్షస్ధితి అర్హతకోసము కాశీక్షేత్రములో పంచకోశ ప్రాంతములో ఆకాశకోశములో జీవసమాధి స్ధితి పొంది...ఆపై మణికర్ణిక ఘాట్ యందు దహనము లేదా సమాధి చేయబడితే...అటుపై ఆదిగురువు విశ్వనాధుడి తారకరామబ్రహ్మ మంత్రమును గురూపదేశముగా పొందితే… రేణువు పరిమాణములో ఆకాశ శరీరముతో...మన మూలకపాలములోని చితాగ్ని యొక్క 10లక్షల దహనశక్తి తట్టుకోగలిగితే ...అపుడు మనకి ఆనందరహిత సమాధి స్ధితి కలిగి… అటుపై పరమప్రశాంత స్ధితి అనగా సంపూర్ణ మూలకపాల మోక్షస్ధితి పొందడము జరుగుతుంది!కాని ఇట్టి కపాలస్ధితిని ఇంతవరకు ఎవరుగూడ పొందలేదు!కేవలము ఇట్టి కపాలస్ధితిని పొందుటకు అర్హత మాత్రమే సంపాదించడము జరిగినది!
సాధకుడు విభూది రేణువుగా మారినంత మాత్రాన సాధన పరిసమాప్తి అవ్వదని ఈరోజు నాకు స్పురణ అయినది. ఎందుకంటే విభూది రేణువు నుండి పునర్జన్మగా భస్మాసురుడు అనే రాక్షసుడు జన్మించినట్లుగా మనకి గణేశ పురాణము నందు కనపడుతోంది. అంటే ఈ లెక్కన చూస్తే విభూది రేణువు అంతిమ స్థితి కాదు అని అర్థమైంది కదా. అనగా బ్రహ్మ పదార్ధం నుండి విభూది రేణువుగా తప్పనిసరిగా మారాలి. ఈ విభూది రేణువునే మన సైన్స్ సిద్ధాంతాలు ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్లు న్యూట్రాన్లు గా పిలవడం జరుగుతోంది. ఈ రేణువు నుండి త్రస్యరేణువుగా అనగా దైవకణముగా సాధకుడు మారాలి. అనగా విభూది రేణువు స్థితి అనేది శివలింగము అదే శ్రీచక్ర బిందువు అదే సాలగ్రామం అయ్యుండాలి. అంటే బిందువు స్థితియే విభూది స్థితి అన్నమాట. ఇందులో సూక్ష్మాతి సూక్ష్మ పంచభూత అంశాలు ఉంటాయి అని గ్రహించండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ విభూది రేణువు అనేది ఒక విత్తనం లాంటిది. ఒక కోడిగుడ్డు లాంటిది అన్నమాట. ఈ విత్తనం నుండి తిరిగి మాయలో పడితే అనగా సహన శక్తిని సాధకుడు కోల్పోతే చెట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కోడిగుడ్డు నుండి జీవపదార్థంగా కోడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సాధకుడు ఈ విభూది రేణువు స్థితి అనగా బిందువు స్థితి వచ్చినప్పుడు ఈ రేణువు పగిలిపోవాలి. అది ఎండిపోయి పగిలిపోవాలి. అనగా చితాగ్ని యొక్క దహన శక్తి అయిన 10 లక్షల శక్తిని సాధకుడు తట్టుకుంటే అప్పుడే తన అంగుళ పరిమాణం అయిన సంకల్ప శరీర విభూది రేణువువిభేదనము చెంది ఎందుకు పనికి రాని కర్మ జన్మ స్పందన రహితమైన పరమ నిశ్చల స్థితి అయిన త్రస్యరేణువు స్థితిగా అనగా ఆకాశం శరీర స్థితిగా మారి పోవడం జరుగుతుంది. అనగా మన సైన్స్ వాళ్లు చెప్పే దైవకణ స్థితికి మారిపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు వడ్ల గింజలు వేయిస్తే అది తిరిగి మొలకెత్తడానికి పనికిరాదు. ఒకవేళ వడ్లగింజ పగిలితే బియ్యపు గింజ వస్తుంది. ఇది కాస్త అన్నముగా మారే అవకాశం ఉన్నది. అనగా ముక్తి స్థితి అన్నమాట.ఈ స్థితిలో సాధకుడికి తప్పనిసరిగా ఒక యోగజన్మ ఉంటుంది. ఈ జన్మలో సాధకుడు మాయలో పడితే అది కాస్త పునర్జన్మలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అదే వడ్లగింజ పచ్చిగా ఉంటే దానికి పంచభూతాలు కలిస్తే అది పగిలి చెట్టుగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది కదా. అంటే విభూది రేణువుగా మారినవాడు 36 కపాలాలలో పంచ కపాల స్థితిని పొందినవాడు అవుతాడు. వడ్ల గింజ వేయించడం అంటే చితాగ్ని దహన శక్తిని పదిలక్షల శక్తిని తట్టుకోవటానికి సాధకుడు ఓంకార నాదం చెయ్యాలి. ఈ నాదము చేస్తూ చేస్తూ చివరికి తన ప్రమేయం లేకుండా తను చేయకపోయిన సహజసిద్ధంగా తన నుండి ఓంకార నాదం వినే స్థితికి సాధకుడు రావాలి. ఇదియే 36 కపాలాలలో త్రికపాల స్థితి చేరడము అన్నమాట. త్రి కపాలము అనగా ఓంకార నాదం యొక్క మూడు భాగాలుగాను ఒక అర్థ భాగము ఉంటాయి అని లోకవిదితమే కదా .ఎప్పుడైతే తనలో వచ్చే ఓంకారనాదం ఇతరులు వినే స్థితికి సాధకుడు చేరతాడో వాడు తుంకార స్థితికి చేరతాడు అన్నమాట.అనగా ఓంకారం కన్నా తుంకారనాదమునకు సాధకుడు చేరుకోవాలి. అనగా వడ్లగింజ కాస్త ఎండిపోయినట్లుగా అవుతుంది. ఒకవేళ సాధకుడు తుంకారనాద స్థితికి చేరకపోతే అనగా చితాగ్ని పది లక్షల స్థితికి చేరకపోతే ఈ విభూతి రేణువు కాస్త త్రస్యరేణువుగా మారదని గ్రహించండి. అనగా విత్తనం ఎండిపోయి పగలదని గ్రహించండి. పచ్చిగా ఉండి పగులుతుందని గ్రహించండి. వడ్లగింజ పచ్చిగా ఉండి పొట్టు పోతే బియ్యపుగింజగా మారవచ్చును లేదా ఈ వడ్ల గింజ నుండి చెట్టు ఏర్పడవచ్చును. అదే తుంకారనాద స్థితికి వస్తే ఈ వడ్లగింజ బాగా వేయించినట్లు అవుతుంది. కాని విత్తనము కాస్త వేయించిన విత్తనముగా ఉంటుందని గ్రహించండి. ఎప్పుడైతే మళ్లీ సాధకుడు ఈ తుంకారనాద స్థితి నుంచి తిరిగి నిశ్శబ్ద నాద స్థితికి సాధకుడు చేరితే అనగా త్రస్యరేణువు నుండి దైవకణము స్థితికి వస్తే ఎండిపోయిన లేదా బాగా వేయించిన వడ్లగింజ కాస్త బూడిదగా మారుతుంది.దానితో వాడి సాధన పరిసమాప్తి అవుతుంది. అంటే చాలా మంది సాధకులు ఈ వడ్లగింజ స్థితి దగ్గర అనగా విభూది రేణువుగా మారినారు కానీ ఇక్కడ ఉన్న దహన శక్తి యొక్క పది లక్షల శక్తిని తట్టుకోలేక లిప్త కాలం పాటు సహన శక్తిని కోల్పోవడం జరిగినది. అనగా వడ్లగింజ కాస్త వేయించేటప్పుడు సహన శక్తిని కోల్పోవడంతో ఈ గింజ కాస్త బియ్యపుగింజగానే మారే అవకాశాలు ఏర్పడినాయి లేదా ప్రారంభంలోనే దహన శక్తి యొక్క జ్ఞానము ఉండుటవలన సాధకుడు కాస్త మహామృత్యువు భయానికి గురి అయినప్పుడు సహన శక్తిని కోల్పోయి ఉంటే వడ్లగింజ కాస్త పగిలిపోయి దానిలోంచి మొక్క వచ్చినట్లుగా మాయలో పడే అవకాశాలు ఉన్నాయి. అంటే సాధకుడు దహన శక్తిని 10 లక్షల స్థితికి తట్టుకునే స్థితికి ఎపుడు వస్తాడో అప్పుడు వాడు తుంకారనాద స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఈ స్థితి సాధన కోసం మన సదాశివమూర్తి తన 36 కపాలాలతో మన బ్రహ్మరంధ్రము నందు ఆవాసము ఉండి ఓంకార నాదం సాధన చేస్తూ తుంకారనాద స్థితికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు. అనగా దహన శక్తి యొక్క పది లక్షల శక్తిని తట్టుకోలేక ఎక్కడో ఒకచోట సహన శక్తిని కోల్పోయి వెనుతిరగటం జరుగుతోంది. పునర్జన్మలను పొందటం జరుగుతోంది. అంటే ఈ లెక్కన చూస్తే సాధకుడు విత్తనంగా మారినంత మాత్రాన అదే విభూది రేణువుగా మారినంత మాత్రాన సాధన పరిసమాప్తి కాదని ఈ విత్తనము కాస్త ఎండిపోయిన లేదా వేయించబడిన వడ్లగింజగా మారి ఆపై పూర్తిగా నాశనం అవ్వాలి అని తెలుస్తోంది కదా.
సాధకుడు ఎప్పుడైతే విభూది రేణువు స్థితికి వస్తాడో అప్పుడు వారికి రిషికేష్ క్షేత్రము నుండి ఒక అంగుళం స్పటిక లింగము అలాగే ఒక డొప్ప వున్న విష్ణు సాలిగ్రామము అలాగే నిజ ఓంకార చిహ్నము వస్తాయని గ్రహించండి. ఈ స్థితిలో నాకు ఈ 3 వస్తువులు రావడం జరిగినది. సుమారుగా మూడు వందల సంవత్సరాల పైన ఉన్న విష్ణు సాలగ్రామం ఈ క్షేత్రం నుండి రావడం జరిగినది. ఆపై ఒక అంగుళం పరిమాణంలో ఉన్న ఒక్క స్పటిక లింగం అలాగే నవరత్న నిర్మిత ఓంకార చిహ్నము రావడం జరిగినది. అనగా ఓంకారనాదం సాధనచేస్తే ఈ స్పటిక లింగము వంటి కాస్త సాలిగ్రామంలోని త్రస్య రేణువుగా మారిపోతానని గ్రహించండి. అంటే ఓంకార నాదం చేసే స్థితి నుండి తన నుండి సహజసిద్ధంగా ఓంకారనాదం బయటకు వినిపించే స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఓంకార శంఖము ఊదితే వచ్చే ఓంకారనాదం నుండి సహజంగా శంఖం లోనికి వెళ్లే గాలి వలన వచ్చే పాంచజన్య శంఖం వచ్చే సహజసిద్ధ ఓంకారనాదం స్థితికి సాధకుడు పోవటం అన్నమాట. ఓంకారం నుండి తుంకారనాద స్థితికి చేరడం అన్నమాట. ఇట్టి సాధకుడు తురీయాతీత స్థితి అదే ఆనందమయ స్థితిని పొంది విశ్రాంతి ఆలోచన స్థితికి చేరుకుని పరమ ప్రశాంత స్థితిని పొందుతాడు. అనగా ఇది వడ్లగింజ కాస్త బాగా వేయించబడిన స్థితి అన్నమాట. ఆపై ఈ ప్రశాంత స్థితిలో సాధకుడు మనో నిశ్చల స్థితిని పొందుతాడు. ఇంకా దేనికి స్పందించని స్థితి ఆలోచనా రహిత స్థితి సంకల్పము లేని స్థితి స్పందన లేని స్థితి మనస్సే లేని స్థితి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మన బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు ధ్రువ తారగా మారిపోయి అందులో పడి తనకున్న పంచ శరీరాలను నాశనం చేసుకుని విభూది రేణువుగా మారి ఈ రేణువు కాస్త త్రస్య రేణువుగా మారిపోయి శరీరాలు లేని స్థితి మనస్సులేని స్థితిని పొంది మనో నిశ్చల స్థితిని పొందడం జరుగుతుంది అన్నమాట.ఎప్పుడైతే సాధకుడు విభూది రేణువు స్థితికి వస్తాడో మొదట గోమయం విభూది తయారు చేస్తాడు. ఆపై వీరికి రుషికేశ్ క్షేత్రము నుండి అంగుళం పరిమాణంతో లింగము అలాగే సుదర్శన చక్ర విష్ణు సాలగ్రామము నవరత్న ఓంకార చిహ్నము వస్తాయి. ఆనాటి నుండే సాధకుడు విభూది రేణువు నుండి త్రస్య రేణువుగా మారటానికి యోగ్యత అర్హత సంపాదించినాడని గ్రహించండి. అంగుళ సంకల్ప శరీరమునుండి రేణువు వంటి ఆకాశ శరీరముగా మారటానికి ఓంకారం నుండి తుంకారనాద స్థితికి చేరడానికి సాధకుడు సాధన చేసే అర్హత పొందడం జరుగుతుంది. అందరూ అనుకున్నట్లుగా హృదయ చక్రము వద్ద తన సాధన పరిసమాప్తి కాదని బ్రహ్మరంధ్రము వద్ద ఆనంద రహిత సమాధి స్థితిని అదే ఓంకారనాదం నుండి తుంకారనాద స్థితికి రావటానికి సాధన చేయవలసి ఉంటుందని నాకు రిషికేశ్ క్షేత్రం నుండి ఒక అంగుళ పరిమాణం స్పటిక లింగం వచ్చే దాకా తెలియలేదు.ఆపై కొన్ని రోజులకి ఇదే క్షేత్రం నుండి డొప్ప ఉన్న విష్ణు సాలగ్రామము అలాగే నవరత్న ఓంకార చిహ్నము వచ్చేదాకా ఈ సాధన విధానము తెలియరాలేదు. అంటే విభూది రేణువు నుండి రేణువుగా అనగా ఓంకారనాదం నుండి తుంకార నాదంతో సాధన చెయ్యాలి అని తెలిసినది.
ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఒకటి ఉంది. చాలామంది విభూది రేణువుగా మారితే చాలు అని అనుకున్నారు. నిజానికి ఈ రేణువు నుండి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన త్రస్య రేణువుగా మారాలని ఎవరికీ తెలియదు. కారణము ఓంకార చిహ్నము అర్థం చేసుకోకపోవడం వలన జరిగినదని నాకు స్పురణ అయినది. నిజానికి ఓంకార చిహ్నము రెండు విధాలుగా ఉంటాయి. ఒక ఓంకార గుర్తు వంపు కిందకి ఉంటే మరో ఓంకారం గుర్తు వంపు పైకి ఉంటుంది. ఎవరి దగ్గరికి వంపు పైన ఉన్న ఓంకారం గుర్తు వస్తుందో వారు మాత్రమే ఓంకారనాదం చేసే అర్హత యోగ్యత ఉన్నట్లు నాకు తెలియవచ్చినది. ఒంపు లోనే ఈ మాయ ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేకపోయారు. నూటికి 99 శాతం మంది ఈ ఓంకార గుర్తు ఉన్న ఓంకార సాధన చేయటంతో రిషికేశ్ నుండి హరిద్వార్ చేరుకోవడం జరిగినది. అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలం నుండి హరిద్వార్ క్షేత్రమైన మూలధార చక్రమునకు చేరుకున్నారని సాక్షాత్తు పరమ గురువులు, పరమ యోగులు, పరమ హంసలు ఓంకార విషయం తెలియక మాయలో పడిపోయినారని నాకు అర్థం అయింది. నిజానికి నాకు మొదట రుషికేశ్ క్షేత్రము నుండి ఓంకార చిహ్నము రాలేదు.
నాకు వచ్చిన నవరత్న ఓంకారము
కేవలం వంపు పైన ఉన్న ఓంకార చిహ్నము బ్యాగు నవరత్నాల మాల వచ్చినది. కొన్ని గంటలపాటు విశ్లేషణ చేస్తే గాని నాకు ఈ ఓంకారం చిహ్నము మాయ విషయము తెలియ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ నాకు ఈ క్షేత్రము నుండి నవరత్న నిజ ఓంకారం చిహ్నము రావడం జరిగినది. ఇది పట్టుకున్న వెంటనే నాలో నుండి సహజ సిద్ధంగా ఎవరో ఓంకారనాదం చేస్తున్నట్లుగా శబ్దం వినపడింది. అప్పటికే విష్ణు సాలగ్రామ సుదర్శన పూజ అలాగే అంగుళ పరిమాణం ఉన్న స్పటిక లింగము ఈ క్షేత్రము నుండి రావడం జరగటంతో ఆఖరిగా నవరత్నాల నిజ ఓంకార గుర్తు కూడా చేరటంతో నేను కాస్త ఓంకారనాదం సాధన నుండి తుంకార నాద స్థితిని పొందటానికి అర్హత యోగ్యత లభించినట్లుగా తెలిసినది. అనగా మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి ఈ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నుండి మూడు వందల సంవత్సరాల క్రితం నాటి విష్ణు సాలగ్రామము వారి మంత్ర గురువు నుండి పొందటము ఆపై నవరత్న ఓంకార గుర్తును పొందటము నాకోసం మరో రెండింటిని తీసుకొని రావటం వీటికి ముందు మాశ్రీమతి దీక్షాదేవి నాకోసం ఒక ఈ క్షేత్రం నుండి ఒక అంగుళం స్పటిక లింగం తేవడం జరిగినది. దానితో మా ఇద్దరికీ ఈ క్షేత్రం నుండి ఈ 3 వస్తువులు పొందటంతో సూక్ష్మమైన మోక్షము అయిన ఓంకారనాదం నుండి తుంకార నాద స్థితి సాధన ప్రారంభమైనదని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు కదా. ఈపాటికి మేమిద్దరం కూడా విభూది రేణువుగా మారి నేనేమో బాబా విభూతినాథ్ గాను మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి కాశీ విభూతినాథ్ గాను దీక్ష నామములు పొందినామని ఇంతకు ముందు చదివినారు కదా.
నాకు వచ్చిన పరమహంస రాగి కడియం
విచిత్రమేమిటంటే మా ఇద్దరికీ రిషికేష్ క్షేత్రముందుండి రాజహంసలు ఉన్న రాగి కడియాలు దొరికినాయి. దానితో మేము పరమహంస సాధన స్థాయికి చేరుకున్నామని అర్థం అయినది. అనగా ఓంకారనాదం నుండి తుంకార నాద స్థితి అర్హత యోగ్యత మాకు లభించటంతో మాకున్న సిద్ధ గురువుల నుండి మా ఇద్దరికీ నాకు పరమహంస పవనానంద అనే నామమును అలాగే మా జిజ్ఞాసి పరమహంస శ్రీనివాసునంద అని దీక్ష నామమును పొందడం జరిగినది. సాధన పరిసమాప్తికి అంగుళ పరిమాణం నుండి రేణువు పరిమాణంగా సంకల్ప శరీరము నుండి ఆకాశం శరీరముగా మారటానికి ఓంకార నాద స్థితి నుండి తుంకార నాద స్థితికి మారటానికి సూక్ష్మంలో మోక్షంగా అనగా వడ్లగింజ కాస్త మనకున్న బ్రహ్మరంధ్రం దహనశక్తిని 10 లక్షల స్థితికి చేరుకోవడానికి సాధన ఆరంభమైనది అని గ్రహించండి. దానితో ఓంకారసాధన కన్నా తుంకారసాధన మిన్న ఎలా తెలుసుకోవాలని ఉందా? మరి దీని గూర్చి తెలుసుకోవాలంటే.... మీరు ఏమి చేయాలో మీకు తెలుసు కదా.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
***********************************************
గమనిక: ఈ రిషికేశ్ క్షేత్రము నుండి మనకు వంపు పైకి ఉన్న నవరత్న ఓంకారం గుర్తు ఒక అంగుళం పరిమాణంలో అదికూడా ఒక టాబ్లెట్ ఆకారంలో ఉన్న స్పటిక లింగం అలాగే రెండు సుదర్శన చక్రాలు కలిగి ఉన్న ఒక విష్ణు సాలగ్రామము రావాలని గ్రహించండి. ఈ వస్తువుల్లో ఏవైనా మార్పులు ఉన్నవి వచ్చిన మీ సాధన పరిసమాప్తి కాదని గ్రహించండి. మీకు తుంకార నాద స్థితిని పొందడానికి యోగ్యత లేదని గ్రహించండి.
విష్ణు సాలగ్రామాలలో డొప్ప ఉన్న లోపలికి ఆవృతాలు ఉన్న సాలగ్రామము అలాగే బయటి వైపు ఆవృతాలు ఉన్న సాలగ్రామములు దొరుకుతాయి అని గ్రహించండి. నూటికి 90 శాతం బయటివైపు ఉన్న ఆవృతాలు ఉన్న విష్ణు సాలగ్రామాలే పైగా ఇవి సహజ సిద్ధమైనవి కాకుండా తయారుచేసే సాలగ్రామాలు దొరుకుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇక్కడ చాలా మందికి సందేహం రావచ్చును. అది ఏమిటంటే సాలగ్రామాలలో ఈ తేడా దేనికి సంకేతం అన్నప్పుడు ఒంపులు లోపలికి ఉన్న సాలగ్రామం అనేది బ్రహ్మరంధ్రము లోని బ్రహ్మాండ కృష్ణబిలం అయితే ఒంపులు బయటికి వైపు ఉన్న సాలగ్రామము సుదర్శన చక్ర సాలగ్రామము అవుతుంది. దీనిని పూజించటం వలన సాధకుడు భోగ మాయలో పడతాడు. ఇలా పడాలి అనేది విష్ణు లీల మాయా విన్యాసము అన్నమాట. అదే ఓంకారం విషయంలో వంపు పైకి ఉంటే అది కాస్త బ్రహ్మరంధ్రము చితాగ్ని స్థితికి చేరుస్తుంది. అదే వంపు కిందకీ ఉంటే అది కాస్త బ్రహ్మరంధ్రము చితాగ్ని స్థితికి దూరం చేస్తుంది. ఇది ఓంకార మాయ అన్నమాట. అలాగే అంగుళ పరిమాణం లో కోడిగుడ్డు ఆకారంలో ఉన్న స్పటిక లింగం ఆరాధన చేస్తే ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది బ్రహ్మపదార్థం లింగం అవుతుంది. మనకి కావాల్సింది బ్రహ్మాండ చక్రములోని కృష్ణబిలము లోని నల్లటి ప్రాంతం అయిన టాబ్లెట్ ఆకారం స్పటిక లింగం అని గ్రహించండి. ఇది లింగాల మాయ అన్నమాట. ఈ మూడు రకాల మాయలు అనగా ఆలోచన సంకల్ప స్పందన మాయలు ఎవరు దాటుతారో వారికి నిజమైన ఈ 3 వస్తువులు అందుతాయి. లేదు అంటే ఈ మూడు నకిలీ వస్తువులతో చేస్తే ఈ మాయలో పడి పోయే అవకాశం ఉన్నది. ఈ మాయను దాటే శక్తి కేవలం 10 లక్షల మందిలో తొమ్మిది మందికి మాత్రమే ఉందని గ్రహించండి. వారే నవబ్రహ్మలు అవుతారు అన్నమాట.
కాబట్టి మీరు కూడా ఈ వస్తువులు యందు బహు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే అడుగు దూరంలో నుండి కొండపై నుండి కొండ క్రిందకి పడతారు అని గ్రహించండి. నిజమైన ఈ 3 వస్తువులు ఈ క్షేత్రము నుండి ఎవరికి వస్తాయో వారు మాత్రమే సాధన పరిసమాప్తి చేసుకోవడానికి అడుగు దూరంలో ఉన్నట్లే అన్నమాట. అదే ఈ క్షేత్రము నుండి ఈ 3 వస్తువులు పోలిన నకిలీ వస్తువులు వస్తే అనగా కింద ఒంపు ఉన్న ఓంకారం ముద్ర అలాగే బయటివైపు ఆవృతాలు ఉన్న విష్ణు సాలగ్రామము అలాగే టాబ్లెట్ ఆకారంలో కాకుండా ఒక అంగుళం కోడిగుడ్డు ఆకారంలో ఉన్న స్పటిక లింగాలు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని మరిమరి హెచ్చరిస్తున్నాను. ఇక్కడ వీటి విషయంలో పరమ గురువులు పరమ యోగులు పరమహంస సిద్ది పొందిన మహాత్ములు సిద్ధపురుషులు బోల్తాపడినారు అని గ్రహించి తగిన జాగ్రత్తలతో వస్తువులను పొందండి. ఈ సాధనను పరిసమాప్తి చేసుకోండి.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండి