అధ్యాయం 33


బుద్ధుడు యోగం చేస్తే



ఇక ఈ మనస్సుకి ఏమి చేయాలో…. ఏమి చేయకూడదో…. చెపితే అది ఆధీనమైతే ఇక మన సాధన పరిసమాప్తి చేసుకోవచ్చునని అమ్మకి నేను చేసిన ప్రమాణం అనగా చిలిపి దొంగతనాలు ఎన్నటికీ చెయ్యను అనేది దానిని బట్టి… నేను నిర్ధారణకు వచ్చాను! కాకపోతే మనస్సుని ఎలా ఆధీనం చేసుకోవాలో, దానికోసం ఏమి చేయాలో మా ఇద్దరికీ అనగా అదే నాకు మరియు యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఒక పట్టాన అర్థం అవ్వలేదు! దీని కోసం యోగ గ్రంథాలు,పుస్తకాలు చదువుతుంటే బుద్ధుడి జీవిత చరిత్ర పుస్తకం చదవడం జరిగింది! ఆయన కూడా స్త్రీ, ధన వ్యామోహాలు, కుటుంబ బంధనాలు, రాజభోగాలు వదిలిపెట్టి అడవుల వెంట తిరిగి… సిద్ధపురుషులు వెంట తిరిగి… యోగులు వెంట తిరిగి… వారు చెప్పిన సాధనలు చేసినా కూడా సంతృప్తికరమైన అనుభవ అనుభూతులు కలగకపోయేసరికి … స్మశాన వైరాగ్యం వచ్చింది! ఒక రావి చెట్టు కింద కూర్చుని తపస్సు లో జీవసమాధి చెందాలని మనో సంకల్పంతో తపస్సు చేయగా వారికి జ్ఞానోదయం అయిందని మేము తెలుసుకున్నాము! దానితో వారు ఒక కొత్త విధివిధానాలతో బుద్ధుడు అష్టాంగయోగము పేరుతో ఒక సాధన విధానమును భౌద్ధమతముగా ప్రచారంలో ఉన్నదని గ్రహించాము! ఎటూ పతంజలి అష్టాంగ యోగం చేయలేకపోయినా కనీసం ఈ బుద్ధుడు యోగమైన చేయాలని మేమిద్దరము నిర్ణయించుకున్నాము! ఇక ఈ విధివిధానాలకు వస్తే 1. మంచి దృష్టి, 2. మంచి సంకల్పం, 3. మంచి మాట 4. మంచి పని 5. మంచి జీవితం 6. మంచివ్యాయమం 7. మంచి జ్ఞానము 8. మంచి సమాధి…  ఈ 8 సూత్రాలనే బుద్ధుడు అష్టాంగ యోగ మార్గాలు గా చెప్పడం జరిగినది! వీటితోపాటు పాటుగా పంచశీల అనే పేరుతో మరో ఐదు సూత్రాలు చెప్పబడినాయి! అవి 1. అహింస, 2. దొంగతనము, 3. అసత్యము, 4. వ్యభిచారము, 5. మత్తు పదార్థాల సేవనం చేయరాదని చెప్పడం జరిగినది! ఇంతవరకు బాగానే ఉంది! మరి ఇన్ని చేసినా గౌతమ బుద్ధుడు ఎందుకు తన సాధనను పరిసమాప్తి చేసుకోలేదో మాకిద్దరికీ అర్థం కాలేదు!

 ఇక ఆయన చెప్పిన విధి విధానాలు నా జీవితంలో చేయటం మొదలు పెట్టినాను! నాకయితే మంచి దృష్టి, మంచి మాట, మంచి వ్యాయామం అనేది బాగా ఇబ్బంది పెట్టినాయి! … ఏ మాటకి ఆ మాట నిజం చెప్పు కోవాలి కదా…. మంచి దృష్టి విషయానికొస్తే … అందమైన అమ్మాయి కనపడితే కామదృష్టితో చూడకుండా ఆమె తన అందాలతో ఆస్వాదించకుండా ఎలా ఉండగలను! నిజం చెప్పండి! నామట్టుకైతే నేను ఉండలేక పోయాను! ఎందుకంటే నేను సౌందర్య ఉల్లాస ప్రియుడిని! అంటే ప్రకృతిలో అందమైన వాటిని చూసి మనము ఎలా ఆనందపడుతామో...అలా నేను గూడ అందమైన అమ్మాయిల అందమును చూసి ఆనందపడతాను! వయస్సు అటువంటిది! నా దృష్టిలో తప్పు అనేది శారీరకముగా చేసిన...మానసికంగా చేసిన తప్పుయని నా నమ్మకం! ఇక మంచి మాట… విషయానికొస్తే నాకు కోపావేశాలు చిన్నప్పటినుండి చాలా ఎక్కువ! అది నా తయారి తప్పు… నేనేమి చేయగలను! నా విషయంలో ఎవరైనా అనవసరంగా తల దూరిస్తే…. నా సామి రంగా! వాళ్ళు నా మాటల తూటాలకు బలి కావాల్సిందే! వాడికి చావు తప్ప మరో ఆలోచన రాదు ఉండదు! ఇక మంచి వ్యాయామం ఇది అంటే నాకు చాలా చిరాకు, విసుగు! చక్కగా నిద్రపోవాల్సిన సమయంలో ఆసనాలు, వ్యాయామాలు అంటూ శరీరాన్ని, మనస్సుని కష్టపెట్టడం అంటే నాకు మహా చికాకు! దానితో ఈ అష్టాంగయోగం కూడా నా వల్ల కాదని అర్థమైంది! నేను చేసే విధానము లోనే నాకున్న లోపాలు కనబడుతుంటే ఇంకా మంచి జ్ఞానము అలాగే మంచి సమాధి ఎలా కలుగుతుందో చెప్పండి! కలుగవు కదా! కాబట్టి నా మట్టుకు నాకు ఈ యోగం కూడా నా వంటికి సరిపడదని గ్రహించాను!

 ఇక మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి విషయానికి వస్తే… పతంజలి అష్టాంగ యోగంలో వీడికి వచ్చిన ఎల్లప్పుడు సత్యమునే పలకాలి అనే అంశమే తిరిగి వీడికి ఈ యోగంలో పంచశీల సూత్రాలు యందు మళ్లీ రావడంతో… వాడు కూడా అయోమయ స్థితిలో ఉన్నాడు! కాకపోతే అప్పటిదాకా మాంస ఆహారాలను కూడా భుజించేవాడు కాస్త ఇందులో చెప్పిన జీవహింస సూత్రమును పాటించడం కోసం మాసం తినటం వదిలేసినాడు! కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ చిన్నపాటి అబద్ధం కూడా ఆడకుండా ఉండలేము కదా! మనం ఉన్నది జనారణ్యంలో కదా! మన కోసం కాకపోయినా ఇతరుల కోసమైనా చెప్పక తప్పదు కదా! సత్యమునే పలకాలి ఈ అంశం సూత్రమును తప్పించి మిగతా వాటిని తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా చేసేవాడు! కానీ తన మనస్సులో ఈ సత్య అంశం సూత్రమును మనస్పూర్తిగా చెయ్యలేక పోతున్నానే బాధ అతని బాగా బాధించింది! అనగా సత్య అంశ విషయంలో అంటే సత్యహరిచంద్ర లాగా ఉండాలి కానీ భారతంలోని ధర్మరాజు లాగా ఉండకూడదని వీడి నమ్మకం! ఎందుకంటే మనలో ఆవగింజంతైనా దోషము ఉన్న ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మసాక్షాత్కారమును పొందలేదని యోగ శాస్త్ర వచనం! దానితో మనస్ఫూర్తిగా ఈ సత్య అంశాన్ని చేయలేని గ్రహించినాడు! అప్పుడు ఇతనికి ఈ యోగ విధానము సరిపడదని తెలుసుకుని తిలోదకాలిచ్చి నాడు! వాడి మనస్తత్వం ప్రకారం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనసా, వాచా, కర్మణ, మనస్ఫూర్తిగా, ఆసక్తిగా, భయం లేకుండా, ఆనందంగా, తృప్తిగా చేయాలని తపన పడతాడు! చేయాలని అనుకుంటే అది అయ్యేదాకా… దాని అంతు చూసే దాకా నిద్రపోడు! అలిసిపోడు! ఆగిపోడు! ఇలా మా ఇద్దరికీ ఈ యోగం కూడా సరిపడదని గ్రహించి … మరో యోగ విధి విధానం కోసం మళ్ళీ నేను యోగ గ్రంధాలు పుస్తకాలు చదవడం ఆరంభించినాము! ఇలా మాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఎదురయ్యాయి! అవి ఏమిటో తెలుసుకోవాలని ఉందా… ఇంకా ఎందుకు ఆలస్యం… ఏం చేయాలో మీకు తెలుసు కదా!

శుభం భూయాత్

పరమహంస పవనానంద

************************************

గమనిక: గౌతమ బుద్ధుడు తన యోగ సాధనను పరిసమాప్తి చేసుకునే సమయంలో సాధనా పరిసమాప్తి స్థానమైన తన హృదయ స్థానమును చూపించే ఇష్ట కోరిక మహామాయని దాటలేకపోయినారని మాకు కొన్ని సంవత్సరాల తర్వాత మా సాధనా స్థాయి ఈ చక్ర స్థితికి వచ్చిన తర్వాత మేము తెలుసుకోవడం జరిగినది! అది ఎలా అంటే బుద్ధుడు తను పొందిన జ్ఞానము వలన కోరికలే…. సకల కష్టసుఖాలకు కారణమని తెలుసుకొని…. మహామాయలే అని తెలుసుకుని… కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం జరిగింది! ఒక పక్క కోరికలే మహా మాయ అని తెలుసుకుని… మరోపక్క కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం అర్థం లేదు కదా! ఆయనకి తెలియకుండానే కలిగినది! 

నిజానికి ఈ చక్రము నందు ఇష్ట లింగారాధన వస్తుంది! దీనికి అధిష్టాన దైవంగా పరమ శూన్య ప్రతీక అయిన సర్వేశ్వరుడు ఉంటే…. అధిదేవతలుగా ఇష్టకామేశ్వరి కామేశ్వరుడు ఉంటారు! వీరి పనియల్లా సాధకునికి ఇష్ట కోరిక కలిగించడమే అన్నమాట! ఇక్కడ ఒక విషయము గమనించాలి! అది ఏమిటంటే...ఈ చక్రము వద్ధ మనకి రెండు రకాల మాయలు వస్తాయి! ఒకటి ఇష్టపదార్ధమాయ మరొకటి ఇష్టకోరిక మాయ అన్నమాట! ఇందులో ఇష్టపదార్ధ మాయను ఇష్టకామేశ్వరుడు కలిగిస్తే...ఇష్టకోరిక మాయను ఇష్టకామేశ్వరి కల్గిస్తోంది! ఇందులో ఇష్టపదార్ధ మాయను దాటగలిగేతే...ఇష్టకామేశ్వరుడిని దాటినట్లే! అదే ఇష్టకోరిక మాయను దాటకలిగితే...ఇష్టకామేశ్వరి మాయను దాటకలిగి...పరమశూన్య ప్రతీకయైన ఇష్టలింగమును చూడటం జరుగుతుంది! ఇక్కడ మనకి ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు రకాల మాయలుంటాయి! వీటిని దాటకలిగితే మనకి బ్రహ్మరంధ్రము వద్దకి వెళ్ళటానికి యోగ్యత లభిస్తుంది! ఇక్కడ ఉన్న సహనశక్తి మాయ దాటగలిగితే వారికి నామ రూప లేని పరమ శూన్య స్థితి వస్తుంది! పరమ శూన్యమని జ్ఞాన అనుభూతి పొందడం జరుగుతుంది! ఇది కలగాలి అంటే మొట్టమొదట ప్రతి సాధకుడు తన ఇష్ట పదార్థ మాయ దాటవలసి ఉంటుంది! ఈ ఇష్ట కోరిక మాయ అనేది ఎక్కువగా 90% ఇష్ట పదార్థాలే ఇష్ట కోరిక మాయగా మారతాయని నా స్వానుభవం తెలుసుకున్నాను! ఈ పదార్థ కోరిక, మన ఇష్ట కోరిక ఈ చక్రమునందు కనపడుతుందని మేము గ్రహించాము! మహాశివుడికి పాలన్నము, అమ్మవారికి పులిహోర, విష్ణువుకి చక్రపొంగలి, హనుమంతుడికి చిట్టి గారెలు…. ఇలా సకల దైవ స్వరూపాలు తమ ఇష్ట పదార్థాలను తీసుకోవడం జరిగింది! తమ ఇష్ట పదార్థ కోరికలను ఈ చక్రం వద్ద దాట లేక తమ సాధనను అర్ధాంతరముగా ఆపుకోవడం జరిగినది! దానితో వీరు ఇష్ట కోరిక మాయ వద్ద ఆగి పోవడం జరిగినది! ఈ పదార్థం దాటితేగాని యధార్థం తెలియదు కదా! దాని వల్ల వీరు ఈ పదార్థ మాయను దాటక లేకపోవటం వలన తాము ఇంకా బతికే ఉన్నామని… పరమ శూన్య స్థితికి వెళ్లలేకపోయారు! కానీ ఇది ఒక స్థితి ఉంది అని మాత్రమే తెలుసుకున్నారు అనగా జ్ఞానమును మాత్రమే పొందినారు కానీ జ్ఞాన అనుభూతి పొందలేకపోయారు! 

అలాగే బుద్ధుడు కూడా ఇష్ట పదార్థమును అనగా ఈ సమయములో సుజాత అనే ఆవిడ ఇచ్చిన పాలు, అన్నమును తినడమువలన అనగా ఇష్టపదార్ధ సేవన మాయ వలన వీరిలో ఇష్టకోరిక అనగా కోరికలు లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం… ఇష్టకోరిక మాయలో బోల్తా పడటం జరిగింది! అలాగే శిరిడిసాయిబాబా వారు ఇదే ఇష్టపదార్ధ స్ధితికి వచ్చినపుడు 12 సం!!రాలు పాటు వేపాకులు తిన్నారు! అదిగూడ మహా మాయ అయినది! దానితో వీరి ఇష్టకోరికగా దీనజనోద్ధారణ కోసము ఆగిపోవడము జరిగినది! మన అంతిమ సాధన స్థితిలో ఇష్టపదార్థములు వస్తాయని తెలుసుకుని అవి ఇష్టకోరిక పదార్థాలుగా మారతాయని మన పూర్వీకులు గ్రహించడం వలన మోక్ష ప్రదాయిని కాశీక్షేత్రంలో మనకి బాగా ఇష్టమైన వాటిని వదిలి పెట్టాలని నియమం పెట్టడం జరిగింది! ఎంతైనా మన భారతీయ పూర్వీక మహర్షిలకి… వాళ్ళు పెట్టిన ఆచార సంప్రదాయాలకు… చేతులెత్తి నమస్కారం పెట్టవలసిందే కదా! మాకు వచ్చిన ఇష్టపదార్ధ అలాగే ఇష్టకోరిక మాయలు అలాగే మా ఆలోచన, సంకల్ప, స్పందన, మాయలు గూర్చి మీకు తెలియాలంటే...మా హృదయచక్ర అనుభవాలు వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు! అందాకా మన జ్ఞానియోగి అయిన బుద్ధుడి సాధనానుభవాలు తెలుసుకుందాం!

 సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా, తన 29వ ఏట, ఒక రోజు సిద్దార్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి ఛన్న (చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.అప్పుడు సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్దార్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.తర్వాత సిద్ధార్దుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్దుడు, నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.

జ్ఞానోదయం:
తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు ఫాల్గుణమాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు.
జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.
ఆయాచన సూక్తిలో ఉన్న కొన్ని గాథల ప్రకారం, జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం, దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. 

బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి 
1. దుఃఖము
2. దుఃఖానికి కారణము
3. దుఃఖంనుండి విముక్తి
4. దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం
ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధుడి మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు.  థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు. మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు. 
అష్టాంగ మార్గం:

ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు! 
నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)
శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:
1. "సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
2. "సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
3. "సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనస్సును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.
4. "సమ్యక్ సాధన" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
5. "సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
6. "సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనస్సును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనస్సును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.
7. "సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
8. "సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు
ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన. నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి. బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం. గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది, సారనాధ్‌ చేరి, అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు మొదటి సారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం. 1. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి), 2. సమ్మా సంకప్ప (సమ్యక్‌ సంకల్పం), 3. సమ్మా వాచా (సమ్యక్‌ వాక్కు), 4. సమ్మా కమ్మంత (సమ్యక్‌ కర్మ), 5. సమ్మా ఆజీవ (సమ్యక్‌ ఆజీవిక), 6. సమ్మా వాయామ (సమ్యక్‌ కృషి), 7. సమ్మా సతి (సమ్యక్‌ స్మృతి), 8. సమ్మా సమాధి (సమ్యక్‌ సమాధి). ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని (నిర్వాణాన్ని) పొందడానికి ఉపయోగపడేది. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి). బాధలకు, వాటి నివారణకు సంబంధించిన పరమ సత్యాలను తెలుసు కొన లేకపోవడం అవిద్య. దానిని నిర్మూలించడం సమ్యక్‌ దృష్టి. మిచ్ఛా దిట్ఠి (మిధ్యా దృష్టి) కానిది సమ్మ దిట్ఠి. అంటే నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం సంపాదించి ఉండటం. సమ్యక్‌ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం, సదాలోచనలు చేయడం. వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల ఇంద్రియ సుఖాల పట్ల విముఖత, ఎవరికీ హాని చేయకూడదనే వైఖరి, ద్వేష భావాన్ని తొలగించుకోవడం మొదలైన మంచి ఆలోచనలు కలగడం. సమ్యక్‌ వాక్కు అంటే సత్యం పలకడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడక పోవడం, దయతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం. సమ్యక్‌ కర్మ అంటే సాటివారి మనోభావాల పట్ల, హక్కుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం. జీవ హింస చేయకపోవడం మొదలైనవి కూడా ఇందులో చేరతాయి. సమ్యక్‌ జీవనం అంటే ఏ జీవికీ హాని కలిగించని వృత్తిని ఏదైనా జీవిక కోసం చేయడం. సమ్యక్‌ కృషి అంటే అవిద్యను తొలగించడానికి తొలి అడుగులు వేయడం. సమ్యక్‌ కృషికి నాలుగు ప్రయోజనాలను బుద్ధుడు చెప్పాడు. అవి: అష్టాంగమార్గానికి విరుద్ధమైన మానసికి స్థితులు కలగకుండా చూసుకోవడం. అలాంటి మానసిక స్థితులు ఇదివరకే ఏర్పడి ఉంటే వాటిని తొలగించు కోవడం. అష్టాంగ మార్గానికి ఏవి అవసరమో అట్టి మానసిక స్థితులు కలిగేలా చూడటం. ఇప్పటికే అట్టి మానసిక స్థితులు కలగి ఉంటే అవి మరింత వృద్ధి పొందడానికి దోహదం చేయడం. చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనస్సును జాగరితం చేసి ఉంచడం సమ్యక్‌ స్మృతి. అంటే శరీరాన్నీ, మనస్సునూ నిరంతరం జాగ్రతగా గమనిస్తూ, దుఃఖం కలిగించే పరిస్థితులు రాకుండా చూడటం. సమ్యక్‌ సమాధి అంటే ఏకాగ్రతను మించిన సమాధి స్థితి. సమాధిలో కేవలం మనస్సు ఏకాగ్ర స్థితిని చేరడమే జరుగుతుంది. దురాశ, ద్వేషం, అచేతనంగా, మందంగా ఉండటం, సందేహించడం, ఎటూ తేల్చుకొనలేకపోవడం అనే ఐదు సంకెళ్లను తెంచుకొని సరైన మార్గంలో నడచుకోవడం సమ్యక్‌ సమాధి. ధ్యానం చేసే సమయంలో ఈ సంకెళ్లు బాధించకపోవచ్చునుగానీ, ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన తరువాత తిరిగి ఇవే మానసిక సంకెళ్లు పురోగమనానికి అడ్డం వస్తాయి. దుర్గుణాల నుంచి విముక్తుడు కావడం కూడా సమ్యక్‌ సమాధి సాధించే ఒక ప్రయోజనం.


బౌద్ధంలో ఎనిమిది శుభసూచకమైన చిహ్నాలున్నాయి.
1. ఛత్రము (గొడుగు గుర్తు)
2. బంగారు చేప
3. నిధి పాత్ర 
4. ధ్వజం
5. అంతులేని ముడి 
6. పద్మము
7. శంఖము
8. ధర్మ చక్రం

తాత్విక భావాలు:
పాళీ భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచం శాశ్వతమా, అశాశ్వతమా? ఆత్మ, శరీరం వేరు వేరా లేక ఒకటేనా? నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా? - ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికివచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన - అని ఒక అభిప్రాయం. అంతే కాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం, ఆత్మ, వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు.
పాళీ సూత్రాలలోనూ, చాలా మహాయాన, తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది - వాస్తవం (సత్యం) సామాన్యమైన మనస్సుకు, వాదానికి అతీతమైనది. ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. "ప్రజ్ఞా పారమిత" సూత్రాలలో ఇది ఒక ప్రాథమిక అంశం. పఠనం, సాధన, ధ్యానం, విశ్వాసం, సూత్రాలపట్ల గౌరవం వంటి సాధనాల ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమమౌతుంది. నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే. "మహాపరినిర్వాణ సూత్రం" లేదా "ఉత్తర తంత్రం" అనబడే మహాయానసూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవసరమే కాని వాదాలు, శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞానానికీ, వీటికీ సంబంధం లేదు. ఇదే భావం చాలా తంత్రాలలోను, సిద్ధాంతాలలోను చెప్పబడింది. మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు. వివిధ శాఖలలో భేదాలున్నాగాని అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం (నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి) అనేది మాటలకు అతీతమైనది అని.

బుద్ధుని నిర్యాణం:
మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు.) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది. తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”.  బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికి భద్రంగా ఉన్నాయంటారు!  (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినే టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). మరియు బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాల లో బంగారు డిబ్బీలో భద్రపరచబడి వున్నాయి! శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. 486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. 383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరు భావించడమే. బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను, ఏ నాయకున్నీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమే అనుసరించమని చెప్పాడు. కానీ మహా మొగ్గల్లన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.   

నిజమైన జ్ఞానం
స్వయంగా తెలిసికోవలసిందే!
                                                                                                                       - బుద్ధుడు  
                    

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeeru real ga chepparu kada andamaina ammayi kanipisthe aasvadistha ani..adi nijam chepparu.. evaraina thattukoleru..ishta padaardhamu, ishta korikala gurinchi ichina vivarana bagundi...nak oka doubt... sujatha ane aavida ichina paalu, food kaaranangaa fail ayyada budhudu...

    రిప్లయితొలగించండి