అధ్యాయం 6


నా శవదర్శనము

నేను చూసిన పాములు చేసిన లింగార్చన దెబ్బకి ఆ రాత్రి ఘంఠా మఠములో గాఢనిద్రలో ఉండిపోయాను! ఆ నిద్రలో నిజముగా జరిగిన అనుభవం లాంటి కల ఒకటి వచ్చింది! అది ఏమిటంటే నేను నిద్రలో ఉండగానే సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు ఒక శవమును భుజం మీద పెట్టుకుని స్మశానానికి వెళ్లడం జరిగింది! అక్కడ ఉన్న అనేక పుర్రెలు, ఎముకలు, వింత శబ్దాలు చేస్తున్న జంతువుల అరుపులు దాటుకుంటూ ,చితి మంటల్లో కాలుతున్న శవాలను దాటుకుంటూ… చితికి సిద్ధంగా ఉన్న కట్టెపుల్లలు మీద ఆ యువకుడు తాను తీసుకువచ్చిన శవమును పెట్టి … ఆ యువకుడు నిప్పు కోసం వెళ్లటం జరిగింది! విచిత్రంగా నాకు కలలో కూడా వెంట్రుకలు కాలుతున్న వాసన… శవాలు తగలబడుతున్న వాసనలు… జంతువుల అరుపుల శబ్దాలు వినబడటం వింతగాను...ఆశ్చర్యముగాను ఉంది! ఇంతలో ఆ యువకుడు మండే కట్టెను ఈ చనిపోయిన శవం వద్దకు తీసుకుని రావడం జరుగుతుంది! నేను ఇదంతా ఒక స్మశానంలో చాటుగా ఉండి నిజం చూస్తున్నట్లుగా అనిపిస్తోంది! ఇంతకీ ఆ శవము ఎవరిది అనుకుని ఆ శవం కేసి చూడగానే అది నా శవమని తెలుసుకుని గతుక్కుమన్నాను!

అంటే నాగ పాములు చేసిన లింగార్చన చూడటం వలన లేదా వెళుతున్న పాములు కాటు వేయటం వల్ల నేను చనిపోయానా? ఎవరు లేకుండా… ప్రేత శవము లాగా చనిపోయానా? అయ్యో ? నా ముసలి వాళ్లకి… నా బంధువులకు…  ఈ విషయం అనగా నేను చచ్చిపోయిన విషయం తెలుసా? తెలియదా? నేను చచ్చిపోయాను! వామ్మో ! ఈ అబ్బాయి నన్ను కాల్చడానికి వస్తున్నాడు! ఇప్పుడు ఏం చేయాలి? నేను అనాథ శవంలాగా దహనం కాకూడదు! నేను వెళ్లి మా వాళ్ళకి చెప్పాలి! నేను చనిపోయానని మనవాళ్ళకి చెప్పి…  నా దహనం కార్యక్రమాలు చేయించుకోవాలి! వామ్మో! నువ్వు నన్ను దహనం చేయకు! మా వాళ్ళు వస్తారు ! నేను అనాథ కాను ! నన్ను దహనం చేయకు! చేయకు! “ ఏరా వెధవా బడుద్దాయి ! నిన్ను ఎవరు దహనం చేయడం లేదు రా ! పిచ్చి తిరుగుళ్ళు తిరగటం… పిచ్చి కలలు కనటం… పిచ్చి మాలోకం లాగా మాట్లాడటం… అంటూ ఎవరో తిడుతూ నామీద చన్నీళ్లు చల్లటం జరిగినది! నేను కళ్ళు తెరిచి చూస్తే నా సత్రంలో నేను ఉన్నాను! నాకు నిజం లాంటి కల వచ్చిందా? నేను చనిపోలేదా? మరి నేను ఘంఠా మఠములో నాగుల లింగార్చన చూశాను కదా! మరి నేను ఈ మఠములో ఉండాలి కదా! మరి నేను ఎప్పుడు ఈ సత్రానికి వచ్చి నాను అనుకుంటూ ఉండేసరికి…. నిన్న రాత్రి తమరు ఎంత సేపటికి సత్రానికి రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ పంచమఠాల వైపు వెళ్ళినపుడు తమరు ఘంఠా మఠములో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళితే ఈ మఠములో ఒళ్లు తెలియని నిద్ర మత్తులో ఉంటే భుజాన వేసుకుని శవము లాగా సత్రానికి తీసుకురావడం జరిగిందని మా మావయ్య చెప్పడంతో అసలు విషయం అర్థం అయింది!
నాలో తెలియని చావు భయం మొదలయింది! అర్ధరాత్రి వచ్చిన కలలు నిజమవుతాయని కలల శాస్త్రం చెప్పిన విషయములు గుర్తుకు రావడంతో ఏదో తెలియని భయం తో కూడిన మగత నిద్ర నన్ను తిరిగి ఆవహించిందని నేను తెలుసుకునే లోపల నిద్ర దేవత నన్ను తిరిగి తన ఒడిలో చేర్చుకున్నది! ఆ తర్వాత మరుసటి ఉదయం నేను అక్కడే ఉన్న పంచ మఠములో ఒక్కటి అయిన విభూతి మఠంలో ఒక సాధువుని ఇదే ప్రశ్న వేశాను! అది ఏమిటంటే నిజంగానే దైవశక్తి అలాగే  ప్రేత శక్తి ఉన్నదా? అని దానికి ఆయన చిరునవ్వు నవ్వుతూ” నువ్వు ఎలా ఉంటావో? అవి కూడా అలాగే ఉంటాయి! ఈ సృష్టిలో దైవ శక్తి అలాగే  ప్రేత శక్తి ఈ రెండు కూడా ఆయా సూక్ష్మ శరీరాలను ధరించి ఉంటాయి ! అవి మన కంటికి కనిపించవు! ఎవరికైతే త్రినేత్రం అనగా మూడో కన్ను తెరుచుకుంటుందో వారికి మాత్రమే ఈ శరీరాలు దర్శనం అవుతాయి! నా తపోశక్తి వల్ల నీకు కొన్ని క్షణాలపాటు త్రినేత్రం తెరుచుకునేటట్లు చేస్తాను చూడు.. అంటూ నా మీద విభూది చల్లి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకో మన్నాడు! అప్పుడు నాకు కోడిగుడ్డు ఆకారంలో ఎవరో పండుముసలి 85 సంవత్సరాల ఆవిడ కనపడింది! నెమలి కంఠం రంగు చీరతో… ఎరుపు పూలతో… నల్లని జాకెట్టు… ఎరుపు రంగు జరీతో… ముడతలు ఉన్న శరీరంతో ….  రూపాయి బిళ్ళ ఉన్న ఎరుపు బొట్టు తో నవ్వుతూ… నా మీద కూర్చున్నట్లుగా కనపడింది! దాంతో నాకు కొన్ని క్షణాలపాటు నాలో తెలియని భయం వేసింది! ఆ తర్వాత మరికొన్ని క్షణాలకి తెల్లని శరీరం తో ఉగ్రమైన చూపులతో నన్ను తినేసేటట్లుగా చూస్తూ నా మీదకు ఇంకో స్త్రీ మూర్తి రావడం జరిగింది! దానితో ఏవో రెండు రకాల శక్తులు ఉన్నాయి అని నాకు అర్థం అయింది! ఆ తర్వాత ఆ సాధువు కి నమస్కారం చేసి నేను మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను!

ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద
                            ----------------------------------------------------------------------------
గమనిక: కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజముగా జరిగిన అనుభవం లాంటి కల అనుభవం గురించి విచారిస్తే… నాకు కలలో కనిపించిన నగ్న యువకుడు కాపాలిక శివుడని… ఆయన చేతులలో నా దహనం జరిగి ఉంటే శవంగా మళ్ళీ జన్మించే వాడిని కానని తెలిసినది! ఇది తెలుసుకుని యథావిధిగా బాధపడటం జరిగినది! ఎందుకంటే వయోవృద్ధులు అనుభవం…. ఈ కాపాలిక అనుభవం నాకు జీవితంలో ఎనలేని బాధను మాత్రం మిగిల్చినాయి! ఆనాడే ఈ రెండు సంఘటనలు ఏదో ఒకటి జరిగి ఉంటే నా అనుభవాలు మీతో పంచుకునే అవసరం ఉండేది కాదు కదా! ఏమంటారు… నిజమే కదా! అలాగే విభూది మఠంలో సాధువు నాకు చూపించిన అనుభవాలు ఏమిటంటే నెమలి కంఠం చీర కట్టుకున్న ఆవిడను దైవశక్తి అయిన అమ్మవారు అని, తెల్లని శరీరము అనేది కోరికలతో ఉన్న ప్రేతశక్తి అని నాకు అర్ధమయినది! 


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించు
  2. meeku chaala dhairyam ekkuva bhayam bhayam ani cheppinaare kaani bhayapadinatlu anipinchale...mee shava darshanam meeku avvatam... meeru daiva shakti, preta shakti gurinchi difference baaga chepparu

    రిప్లయితొలగించు