అధ్యాయం 20


దైవ శక్తి ఉన్నదా?

నాకు కలిగిన కర్ణపిశాచి మంత్రము సిద్ధి వలన నేను చాలా కష్టాలు పడవలసి వచ్చింది! అది నన్ను నిద్ర పోనివ్వకుండా 24గంటలపాటు నా చెవులలో జరగబోయే విషయాలు చెపుతూండేది! దాంతో నాకు నిద్ర ఉండేది కాదు! ఆహారం సహించేది కాదు! ఒక రకంగా మానసిక పిచ్చి వాడిగా మారిపోయాను! కాలేజీ కి వెళ్ళడం మానేశాను! ఆఖరికి నా జీవితం నా గదికి అంకితం అయ్యింది! రానున్న భవిష్యత్తు విషయాలు తెలుసుకుని ఏమీ లాభం అని విరక్తి కలిగేది! ఈ పిశాచి ధాటిని తట్టుకోలేక చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించేవాడిని! కానీ నావల్ల అయ్యేది కాదు! గుడికి వెళ్దాం అంటే అది గది నుండి బయటికి రానిచ్చేది గాదు! అలాగని చెవిలో భవిష్యత్తు సోది చెప్పటం ఆగేది కాదు! చెవులు మూసుకునికున్నా కూడా… చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా… చాలా స్పష్టంగా భవిష్యత్తు సోది వినిపించేది! ముందే భవిష్యత్తు తెలుసుకునే వాడికి…. వాడి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యలేడని… కిక్ దొబ్బుతుందని… అని తెలుసుకునే సరికి నాకు చాలా ఆలస్యం అయ్యింది! నన్ను వదిలి పెట్టమని బతిమాలినా కూడా నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు! ఏం చేయాలో… ఎవరికి చెప్పాలో… ఎలా చెప్పాలో అర్థం కాని స్థితి! 



చూడటానికి నేను బాగానే ఉన్నా కూడా నేను ఒక పిశాచికి బందీ అయిన విషయం లోకానికి తెలియకుండానే కన్ను మూస్తాననే అనే భయం నన్ను వెంటాడుతూ ఉండేది! అప్పట్లో సెల్ ఫోన్ లు సౌకర్యాలు ఉండేవి కావు! కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ లు ఉండేవి! కానీ ఈ ఫోన్ చేయాలన్నా బయటికి వెళ్ళ నిచ్చేది కాదు! అలాగని నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు! ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి నుండి పోస్టులో ప్రసాదంతో పాటు చేతికి కట్టుకునే నల్లటి కాశీ దారాలు రావడం జరిగినది! వాటిని అందుకొని వీటిని చేతికి కట్టుకోగానే ఆ పిశాచి నా చెవిలో సోది చెప్పడము తగ్గించినది! దానితో నేను నా గది నుండి బయటకు వెళ్లే అవకాశం ఏర్పడింది! అప్పుడు జిజ్ఞాసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే “అయితే మన ఊరికి వచ్చెయ్యండి! ఇక్కడకు వచ్చిన తరువాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు” అని ఓదార్పు ఇచ్చాడు! కానీ పిశాచి నన్ను వదిలి పెట్టదని గ్రహించి… నేను తెలిసో తెలియకో చేసిన మంత్ర సాధన వల్ల నా కొంప కొల్లేరయింది కదా! అలాగే పుస్తకాలలో ఇచ్చిన మంత్రాలు అలాగే ఎవరి దగ్గర పడితే వారిచ్చిన మంత్రాలు లేదా తాంత్రిక మంత్రాలు ఇక నుండి చేయరాదని చెయ్యనని ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది!ఆవేదన పడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది! నన్ను జిజ్ఞాసి చూడటానికి వచ్చినాడు… కానీ అతనికి కూడా ఏమిచేయాలో… అర్థంకాని స్థితి! నా వల్ల నే నువ్వు ఈ మంత్ర సాధన చేసావు అని తెలియగానే నాకు విపరీతమైన బాధ వేసింది అని తన సున్నిత మనస్తత్వం నాకు చూపించినాడు! కానీ ఏమి చేయగలడు అని…. అన్ని చేసిన నాకే ఏమి చేసుకోలేని స్థితి! 

ఇలాంటి అధ్వాన స్థితిలో ఒకరోజు బస్టాండ్ లో నేను ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారి పేరు చెప్పి... “మీరు కర్ణపిశాచి ఉపాసన చేసిన వాళ్ళ లాగా కనపడుతున్నారు! అది పీల్చి పిప్పి చేసి చంపే దాకా నిద్రపోదు …. మిమ్మల్ని నిద్రపోనివ్వదు! మీరు వెంటనే నరసింహా స్వామి ఆలయానికి వెళ్ళండి! ఆయనే దీని బారినుండి రక్షించగలడు! దీనికి విరుగుడు ఆయన మాత్రమే” అంటూ … నన్ను అదోరకంగా చూస్తూ… వెళ్లిపోయినాడు! ఆనాడు ఆ భిక్షసాధువు వచ్చి పిశాచి ఇచ్చినాడు!ఈనాడు వీడు వచ్చి దైవమును చూపుతున్నాడు! ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్లకుండా తిరిగి గదికి చేరుకున్నాను! 

అపుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి అసల విషయము చెప్పి “నన్ను రేపటికల్లా ఏదైన నరసింహాస్వామి గుడికి తీసుకొని వెళ్ళమని చెప్పి”...నా గదికి చేరుకున్నాను! అపుడు నా చేతికున్న కాశిదారాలు తెగిపోవడముతో ఆ రాత్రింతా నా చెవిలో తన భవిష్యత్ సోది చెప్పడము మళ్ళీ యధావిదిగా ఆరంభించినది! ఈ భవిష్యత్ సరిగ్గా వింటే ఈ పాటికి అవి లోకానికి చెప్పి వుంటే…. సొమ్ము చేసుకుని ఉండి వుంటే… ఈపాటికి ఒక పెద్ద కోటిశ్వరుని అవ్వడమే కాకుండా ఎంతో ఖ్యాతి వచ్చి వుండేది! నాకు ధనము మీద, ఖ్యాతి మీద పెద్దగా మాయ,మెహ,వ్యామెహాలు లేకపోవడముతో ఆ పని చెయ్యలేక… నేను ఏమి చేయలేక ఆ రాత్రంతా బాధతో, దిగులుతో, విరక్తితో వినటం తప్ప ఏమి చేయలేకపోయాను! 

మరుసటి రోజుకల్లా జిజ్ఞాసి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర్లో ఉన్న పానకాల లక్ష్మి నరసింహా స్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళినాడు! కానీ నేను విచిత్రంగా ఆ గుడి మెట్ల దగ్గర ఆగిపోయి స్తంభించిపోయిన విషయము వాడు చెప్పేదాకా నాకు తెలిసేది కాదు! పలుమార్లు జరిగేసరికి…. నన్ను ఈసారి యాదగిరిగుట్ట నరసింహాస్వామి గుడికి తీసుకొని వెళ్ళగానే యదావిధిగా నేను మెట్ల దగ్గర బిసుకుపోయి మెట్లు ఎక్కకుండా వెనక్కితిరిగి రావడంతో …వాడికి ఏమి చేయాలో తెలియని స్థితి… నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి! ఇది ఇలా కాదనుకుని నన్ను ఈ సారి అష్ట దిగ్బంధ హనుమంతుడు గుడిలో ఉన్న నరసింహాస్వామి క్షేత్రమైన ధర్మపురి కి తీసుకుని వెళ్లి … గోదావరి నది ఒడ్డున నన్ను ఉంచి… జిజ్ఞాసి ఆ గుడి లోపలకు వెళ్లి అక్కడ ఉన్న పూజారి కి నా బాధ చెప్పగానే… ఆయన వెంటనే స్వామి వారికి చేసిన అభిషేక జలము అలాగే మంత్ర పూరిత అక్షింతలు వాడితో పంపించినారు! మనవాడు వాటిని నా దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటే నేను వెర్రిగా పెద్ద కేకలు పెడుతూ…. “నువ్వు నా దగ్గరకు రాకు! నేను వీడిని వదిలిపెడతాను! నన్ను వదిలేయ్! నన్ను ఏమి చేయకు! నరసింహా నన్ను ఏమి చేయకు ! నన్ను రక్షించు! నన్ను ఆరాధన చేయటం వల్లనే వీడిని పట్టుకొన్నాను! నన్ను వదిలేయండి! నేను వెళ్ళిపోతాను” అని కేకలు పెడుతూ నేను అక్కడ ఉన్న గోదావరి నదిలో దూకేశాను! నిజానికి ఇది అంతా నాకు తెలియకుండా జరిగినది!

కొద్దిసేపటికి నాకు సృహ వచ్చినది! అప్పుడు ఏదో తెలియని ఆవేదన… అమిత భారం తగ్గినట్లుగా అనిపించి అమితానందం కలిగినట్లుగా అనిపించసాగింది! ఎక్కడో నాకు చెవులలో సింహాగర్జన ధ్వని తీవ్రంగా వినబడేసరికి…  మొట్టమొదటి సారిగా  దైవానికి నా మనస్పూర్తిగా నమస్కారం చేసినాను! ఆ గుడి పూజారి ఇచ్చిన వాటిని స్వీకరించి ఆనందంగా గుడి లోపలికి వెళ్లడం… అక్కడ గుడి లోపల ఉన్న యోగ నరసింహా స్వామిని చూడగానే… నాలో నాకే తెలియకుండా నా కళ్ల వెంట ధారగా కన్నీళ్లు రావటం నా ఆప్తమిత్రుడు అయిన జిజ్ఞాసి గమనించి మౌనం వహించాడు! ఇలా దాదాపుగా మూడు గంటల పాటు ఏకధాటిగా ఏడవడం నా వంతు అయింది! ఏదో భారం తగ్గి ఆనందం వేసింది!  ఏలాంటి సోది వినపడటం లేదు అని గ్రహించాను! ఇప్పుడు నరసింహాస్వామిని కృతజ్ఞతగా చూడగానే ఆ విగ్రహమూర్తి కాస్త సజీవ నరసింహా మూర్తి గా లీలగా నాకు అగుపించాడు! రోజూ పూజలు చేసిన లింగమూర్తి కనిపించలేదు కానీ పూజలు చేయని వాడిని నేను ఉన్నానని దర్శనం ఇచ్చేసరికి నాకు నోట మాట రాలేదు! ఇదే నా తొలి దైవదర్శనం అనుభవం అన్నమాట! మరో రకంగా చెప్పాలంటే కర్ణపిశాచి కూడా ఒక  ప్రేత అనుభవం కూడా కావటం మరో విశేషం! రెండూ ఉన్నాయి! చూసేవాడికి శక్తి ఉండాలేగాని… అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలే గానీ అన్నీ ఉన్నాయి! వాడికి స్వానుభవం అయ్యేదాకా మనం ఏమీ చెప్పలేము! ఏమి చెప్పినా నమ్మలేరు! నమ్మలేము! మరి మీరు నమ్ముతారా! ఈ రెండు అనుభవాలు నిజం అని చెప్పిన… మీరు  నమ్మవచ్చు లేదా నమ్మక పోవచ్చు! కానీ ఇక్కడ ఆగి పోకండి! ముందుకు సాగండి! ఇక్క డే చుక్కలు చూపించాడు! ఇంకా ముందుకు వెళితే… ఏమి చూపిస్తాడో అనే కదా మీ సందేహం! ఆలస్యం ఎందుకు! నాతో రండి! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

**********************

గమనిక: దయచేసి పుస్తకాలలోనూ, గ్రంథాలలో కనిపించే మంత్రాలు, తాంత్రిక మంత్రాలు, బీజాక్షర మంత్రాలు చేయవద్దు! గురూపదేశము పొందకుండా ఇట్టి మంత్రాలు చేయవద్దు! మీకు మీరై నేర్చుకొని చేస్తే వీటిని తట్టుకుంటే మంచిది! తట్టుకోలేకపోతే మతిభ్రమణం చెంది పిచ్చివాడు అవ్వక తప్పదు! కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు… వదిలించుకోవడం ఎందుకు… ఆలోచించండి!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. oka mantram guropadesham lekunda chesthe inni ibbandulaa? adi pisachi baadhalu...ee vishayam cheppatam valla ye mantram padite adi cheyakudadani budhi ochela baaga chepparu... kaani chaala kashtalu paddaru...chivariki vadalakunda atu devathalani daasoham anipinchukoni atu dayyalni bayapette stage ki ocharu...great!!! narasimha swamy ki jai!!!

    రిప్లయితొలగించండి