అధ్యాయం 66

ఒక కపాలములో 36 కపాలాలు

(నా బ్రహ్మరంధ్రము సాధన అనుభవాలు )




బ్రహ్మరంధ్రము సాధన అనుభవాలు( నా డైరీలో): 

జనవరి 9: ఈ రోజు నాకు ధ్యానంలో సాధన హృదయ చక్రం దగ్గర ఆగిపోదని ఇక్కడున్న హృదయ గ్రంధి విభేదనము ద్వారా బ్రహ్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకుంటే కాని సాధన సంపూర్తి కాదని నాకు స్పురణ అయినది. 
జనవరి 13: ఈ రోజు నాకు ధ్యానంలో బ్రహ్మనాడి మార్గము దర్శనం అయినది. దీనికి అధిపతిగా నరసింహస్వామి అలాగే ప్రత్యంగిరా మాత ఉన్నట్లుగా లీలగా కనిపించారు. 
జనవరి 15: ఈ రోజు నాకు ధ్యానము నందు సహస్రార చక్రము శూన్యముగాను హృదయ చక్రం పరమ శూన్యముగా  బ్రహ్మరంధ్రము మూల శూన్యముగా స్పురణ భావాలు కలిగినాయి. 
జనవరి 18: ఈ రోజు నాకు ధ్యానంనందు  అంగుళ పరిమాణం ఉన్న నా సంకల్ప శరీరము కాస్త బ్రహ్మరంధ్రము వైపుకి ప్రయాణము చేస్తున్నట్లుగా అనుభవం అయినది. అది కూడా బ్రహ్మనాడి మార్గము ద్వారా జ్వాలాముఖి ఉగ్ర నరసింహ స్వామిని చూస్తూ దాటుకున్నది.
P2:
జనవరి 21: వెలుతురు అంతగా లేని సాయం సంధ్యా కాలం లాంటి వాతావరణ స్థితి ఉన్న దానికి నా సంకల్ప శరీరము చేరుకున్నదని ఈరోజు నాకు అనుభవం అయినది. 

జనవరి 22: ఈ రోజు నాకు ధ్యానము నందు విచిత్రముగా అంగుళ పరిమాణం ఉన్న మూల కపాలము బ్రహ్మ రంధ్రము ప్రాంతమునకు లోపలివైపు అతుక్కుని ఉన్నట్లుగా కనపడినది. అలాగే దీని నోటి నుండి ఎరుపు రంగు మాంసపు ముద్దలు పడుతూ సహస్రార చక్రము మధ్య బిందువు చేరుకున్నట్లుగా కనిపించింది. భయము లేదు. ఏదో చెప్పాలని ప్రయత్నం జరుగుతుందని నాకు అర్థమైనది. 
జనవరి 25: ఈ రోజు విచిత్రముగా ధ్యానము నందు నా అంగుళ పరిమాణం సంకల్ప శరీరము నాకు దర్శనమిచ్చిన అంగుళ మూల కపాలము నోటి ద్వారా లోపలికి ప్రవేశించినట్లుగా ధ్యాన అనుభవము అయినది. 

జనవరి 28: ఈ రోజు నాకు ధ్యానము నందు ఏదో దహనం అవుతున్న చితాగ్ని దర్శనం అయినది. దీనినే పరంజ్యోతి దర్శనంగా దివ్య జ్యోతి దర్శనంగా యోగులు అనుభవం పొందినారు అని నాకు స్పురణ అయినది.
P3:

ఫిబ్రవరి 2: ఈ చితాగ్నికి దగ్గరికి వెళితే అక్కడ ఎనభై ఐదు సంవత్సరముల వయో వృద్ధురాలు కాపలా ఉన్నట్లుగా నా ధ్యాన అనుభవం అయినది.  
ఫిబ్రవరి 5: ఈరోజు ఈ వయో వృద్ధురాలు కాస్త ఒక చేతిలో కపాలము అలాగే మరొక చేతిలో ప్రేత శరీరమును ధరించిన ఆదిపరాశక్తి గా నాకు ధ్యాన అనుభవము అయినది.ఈమె చూడటానికి అచ్చంగా పాత సినిమాలలో కనిపించే ఆడ మాంత్రికురాలుగా అనగా వంకరలు తిరిగిన గోర్లు విరబోసిన తెల్లని జుట్టు గ్రద్ద ముక్కుతో అచ్చంగా ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఈమెకి లాగా మంత్రగత్తెలాగా కనపడినది. భయము అనిపించలేదు. 

ఫిబ్రవరి 6: ఈ పరాశక్తిని కాస్త త్రిమాతలుగా దీప దుర్గగా దీప కాళికగా దీప చండీ మాతగా చితాగ్ని యందు దర్శనం అయినారు. నా సంకల్ప శరీరము ఈ చితాగ్ని వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్లుగా నా స్థూల శరీర వేడి ఆవిర్లు చెబుతున్నాయి. 
ఫిబ్రవరి 7: ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల లేపనాలు పూసినా శరీర అధికవేడిమి తగ్గటం లేదు. వైద్యులు ఇలాగే కొనసాగితే ఎక్కువకాలము బ్రతకలేరు అని చెప్పినారు. బాధ లేదు. భయము లేదు.
P4:

ఫిబ్రవరి 10: అధిక వేడిమికి కారణాలు వెతికితే వివిధ గ్రంథాలు పుస్తకాల ద్వారా తెలిసినది ఏమిటంటే చితాగ్ని దహన శక్తి 9,1000, పది వేలు, లక్ష, 10 లక్షలు స్థాయిలలో దహన శక్తి ఉంటుందని మానవశరీరము వెయ్యికి శక్తికి మించి తట్టుకోలేదని సంకల్ప శరీరం అయితే లక్షకు మించి తట్టుకోలేదని నేను తెలుసుకోవటం జరిగింది. అంటే నా శరీరం దహనం శక్తి లక్ష దాకా వచ్చి ఉండాలని అనిపించింది. 

ఫిబ్రవరి 11: ఈ రోజు నా ధ్యానము నందు చితాగ్ని యందు ఒక బ్రహ్మకపాలం దహనం అవుతున్నట్లుగా అగుపించినది. పైగా దీని చుట్టూ వివిధ రకాలుగా అగ్ని నాగుపాములు సంచారము చేస్తున్నట్లుగా లీలగా కనిపించసాగింది. ఈ కపాలానికి ఇవి కాపలా కాస్తున్నాయి అని అనుకోగానే నాకు ధ్యాన భంగం అయినది. 
ఫిబ్రవరి 12: ఈ చితాగ్ని బ్రహ్మ కపాలము నందు నా సంకల్ప శరీరము ఈ కపాలము ముక్కు ద్వారము ద్వారా లోపలికి ప్రవేశించినట్లుగా లీలగా ధ్యానము అనుభవం అయినది. ఇది అంతా చూస్తుంటే మహా మాంత్రికుడి ప్రాణం గుట్టు రహస్యమును చేధించే విఠలాచార్యుని సినిమాలాగా ఉన్నట్లుగా అనిపించింది. ఈ భయంకర ఆధ్యాత్మిక దృశ్యాలు చూస్తున్న కూడా నా మనస్సుకి అలాగేనా శరీరమునకు పిచ్చి ఎక్కక పోవటం నాకు ఆశ్చర్య ఆనందాలు వేసినది.
P5:

ఫిబ్రవరి 15: ఈ రోజు ధ్యానమునందు నాకు మూల కపాలము నందు 36 కపాలాలతో ధ్యానం చేస్తున్న ఒక అస్థిపంజరం లీలగా కనిపించినది. ఈ కపాలాలు కూడా 1, 3, 5, 7, 9, 11 లాగా ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవము అయినది. ఈ కపాలధారి ఎవరో అనుకోగానే నాకు ధ్యానము భంగమైనది. 
ఫిబ్రవరి 18: ఈరోజు నా దగ్గరకి 36 తలలు ఉన్న సదాశివమూర్తి ఫోటో వచ్చినది. అంటే నాకు ధ్యానములో కనిపించిన 36 కపాలధారి  ఈయనని నాకు అర్థమైనది. ఆశ్చర్య ఆనందాల కి గురి అయినాను. 
ఫిబ్రవరి 20: నాకు ధ్యానము నందు 11 వరుసలో కపాలాలు ఏకాదశరుద్రులు గాను, తొమ్మిదవ వరుసలో కపాలాలు నవ నారాయణులుగాను, ఏడవ వరుస కపాలాలు సప్తమాతృకలుగాను, ఐదవ వరుస కపాలాలు పంచముఖ బ్రహ్మలుగాను, మూడవ వరుస కపాలాలు త్రిముఖ ఈశ్వరుడిగా త్రిముఖ ఈశ్వరిగా త్రిముఖ దత్తస్వామిగా ఏకముఖ కపాలము నా ముఖము కపాలముగా దర్శనం ఇచ్చాయి. అంటే చివరికి నేను మాత్రమే ఉన్నాను. వేరేగా దేవుడు లేడు. నామరూప దేవుళ్ళు లేరు అంటే ఇదే అహంబ్రహ్మాస్మి ఇదియే శివోహము ఇదియే తత్వమసి అనే అనుభవం లోనికి రాగానే నాకు ధ్యానము భంగం అయినది. 
 
 అసలు ఎందుకు ఇంత వరకు కపాలమోక్షం పొందలేదు పొంది ఉంటే మనము ఉండే వాళ్ళం కాదు కదా. కేవలము జీవన్ముక్తి దాకా వస్తున్నారు కానీ కపాలమోక్షం ప్రాప్తి ఎందుకు పొందటం లేదు. ఇలాంటి ధర్మసందేహాలు వచ్చినప్పుడు మేము ఎక్కువగా పుస్తకాలు గ్రంధ పఠనం ద్వారా తీర్చుకునే వాళ్ళం కానీ ఇలాంటి నాకు నా సందేహానికి శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము మిన్న అని నా ప్రగాఢ విశ్వాసము. దానితో మేము మా ప్రారబ్ధకర్మ నివారణ చేసుకుంటూ ఇష్ట లింగేశ్వరుడు యొక్క ఇష్ట కోరిక మాయను దాటుకుంటూ  బ్రహ్మ తదాకార స్థితిలో మేము వుండగా….. 

నా మనో ధ్యానము నందు ఏక మూల బ్రహ్మకపాల దర్శనం:


ఒక రోజు అర్ధరాత్రి మేము తీవ్రమైన ధ్యానంలో ఉండగా మా మనోనేత్రము నందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. శూన్య స్థితి దాకా యధావిధిగా అన్నిరకాల దృశ్యాలు అవే కనబడుతూ మమ్మల్ని దాటుకుంటూ ముందుకు వెళ్లి శూన్య స్థితి కనిపించినది. ఇక్కడ నా అనే వాళ్ళు ఎవరూ లేరు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాను. అర్ధరాత్రి పూట థార్ ఎడారి చూస్తున్నట్లుగా ఉందని గతములో అయితే కనీసం మా రూప శరీరాలు కానీ లేదా దైవ స్వరూపాలు అయినా కనిపించేవి. ప్రస్తుతము ఇక్కడ అలాంటి వారు ఎవరు లేనట్లుగా లేదే అనుకుంటున్న మాకు ఎక్కడో దూరాన ఒక చిన్న జ్యోతి కనపడసాగినది. దాని దగ్గరికి వెళ్లడానికి ఒక సన్నని కాంతి మార్గము లాంటిది కనపడినది. కొన్ని క్షణాలకి అది కాస్త పెద్దది అవుతూ కనిపించసాగింది. అంటే దాని దగ్గరకి మేము మనోవేగంతో ఈ కాంతి మార్గము ద్వారా వెళ్లినామని అర్థం అయ్యే లోపల అది ఒక చితాగ్ని స్వరూపంలాగా కనపడినది. ఎందుకంటే అందులో మధ్యలో ఎవరిదో ఒక మానవ కపాలం మాత్రమే మండుతూ కనబడసాగింది. ఈ కపాలమును ఎక్కడో చూసినట్లుగా అనిపించగానే ఇది ప్రత్యంగరామాత పాదము క్రింద ఉండే కపాలముగా గుర్తుకు వచ్చినది. ఈ కపాలము చుట్టూ ఎంతో తీవ్రమైన అగ్నిజ్వాలలు దహించి వేస్తున్న దానికి ఏమీ కాకపోవటం అనగా బూడిద కాకపోవటం ఆశ్చర్యము అనిపించింది. ఎందుకంటే విపరీతమైన అధిక వేడిమి కలిగిస్తే ఎముకలు కూడా బూడిద అవ్వక తప్పదు. మరి ఈ కపాలము అలా ఎందుకు ఉంది. 






 
                    మేము చేసిన హోమాల యందు కనిపించిన వివిధ దైవస్వరూపాలు

అసలు అది ఎవరిది అనుకుంటూ ఉండగా వివిధ దైవ స్వరూపాలుగా కనపడ సాగింది. ఈ చితాగ్నిలోనే ఈ బ్రహ్మకపాలము చుట్టూ అమ్మవారి దశమహా విద్యదేవతలు కాస్త దశదిక్కులకి కాపలకాస్తున్నట్లుగా అగ్నితేజస్సుతో కనిపించినారు. ఆతరువాత ఈ చితాగ్ని మొదట శివ లింగ మూర్తి గాను, తర్వాత శ్రీచక్రముగాను, చిదంబర నటరాజ స్వామిగా, ఆ తర్వాత దీపదుర్గ గాను, హయగ్రీవుడు గాను, నరసింహుడిగాను, గణపతిగాను, హనుమంతుడి గాను, కాళిక గాను, నాగేంద్రుడి గాను, కాలభైరవుడు గాను ఇలా పలు దైవ స్వరూపాలుగా పలు జీవజాతులుగా అనగా గరుడ, కాకి, పావురము, చిలుక, పాము ,పలు వృక్షజాతులుగా శ్వేతార్క చెట్టుగా ఇలా ఈ చితాగ్ని పలు రూపాలు గా కనబడుతోంది. చితాగ్నియే ఇలాంటి పలు రూపాలు ధరిస్తుంది అంటే ఈ లెక్కన అందులో కనిపించే కపాలము చితాగ్నిగా మారుతుందా లేదా చితాగ్నియే కపాలముగా ఉందా అనే సందేహం వచ్చేసరికి నాకు ధ్యానము భంగము అయినది. బయటికి వచ్చిన తర్వాత చూస్తే చితాగ్నిలో చూసిన అన్ని రకాల స్వరూపాలు ఎక్కువగా మేము జాతక సమస్యలకు చేసిన వివిధ రకాల హోమాలలో ఆయా దైవ జీవ స్వరూపాలు కనిపించడం జరిగినది.  అంటే ఈ లెక్కన చితాగ్ని నుండే సకల సృష్టి స్థితి లయము జరుగుతున్నాయి. 

కాబట్టి మన స్థూల శరీరము చుట్టూ 'ఆరా' అనే కాంతి వలయం ఉండటం అలాగే మిగిలిన సూక్ష్మ- కారణ- సంకల్ప- ఆకాశ శరీరములు కాంతివంతంగా ఉండటానికి కారణం చితాగ్ని అని నమ్మకం గా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే చితాగ్ని కాస్త కపాలముగా మారలేదు. ఎందుకంటే ఇన్ని స్వరూపాలు చితాగ్నిలో కనిపిస్తున్న కూడా ఆ కపాలము అలాగే మండుతూ కనబడినది. అనగా నిజముగా నేను ఎవరో మానవ కపాలం దహనము అవుతున్నది కానీ దహనం కావడం లేదు. కపాలము కపాలము గానే ఉండి పోతుంది. ఎందుకు? ఎలా? ఎవరిది? అనే సందేహాలు వచ్చేసరికి వీటికి సమాధానాలు కనుగొనే శక్తి లేకపోయేసరికి నీరసం వచ్చి ఓపిక తగ్గి భోజన పదార్థాలకేసి నా మనస్సు వెళ్ళినది. ఇలా కొన్ని వారాలు గడిచి పోయినాయి. 

ఒక రోజు మేము తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మా మనోనేత్రము నందు ఒక విచిత్రమైన దృశ్యము కనిపించినది. అది ఏమిటంటే మాడు క్రింద భాగాన అనగా బ్రహ్మరంధ్రము ఉండేచోటులో ఒక అంగుళం పరిమాణములో ఒక కపాలము ఉన్నట్లుగా బ్రహ్మ రంధ్రానికి అడుగుభాగంలో అతికించినట్లుగా సహస్రార చక్రమునకు మధ్యలో పైభాగమున ఉన్నట్లుగా కనపడినది. విచిత్రముగా దీని నోటి నుండి రక్తపు ముద్ధలు బయటికి వస్తూ సహస్రార చక్రము మధ్యభాగంలో పడుతున్నట్లుగా కనిపించేసరికి కడుపులో ఎవరో దేనితో దేవితున్నట్లుగా అనిపించేసరికి మాకు ధ్యాన భంగము అయినది. కొంప తీసి ఈ కపాలము కాస్త ఆ చితాగ్నిలో కనిపించే కపాలము కాదు కదా లేదా చితాగ్నిలో కనిపించే కపాలము అయితే చితాగ్ని కనిపించాలి కదా. కనిపించటం లేదు కదా. అనుకుంటుండగా ఒక వేళ చితాగ్నిలో కనిపించే కపాలములోనికి మేము వెళ్ళలేదు కదా. ఒకవేళ వెళ్లి ఉంటే ఈ రక్తము కార్చే అంగుళం కపాలము కనిపించినదా? దీనమ్మ జీవితం. అంతా గందరగోళంగా ఉన్నది. అర్థమయి చావటం లేదు. సమయానికి ఏ దేవుడు లేడు. గురువు లేడు. ఉన్నది మేమే కదా. చెప్పడానికి ఎవరూ లేరు. దీనమ్మ బ్రతుకు. అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది. మనకి రెండు కపాలాలు కనిపించాయా అనగా ఒక కపాలంలో మరొక కపాలము కనిపించినదా? ఎందుకంటే ఒక స్థూల శరీరంలో 6 శరీరాలు ఉన్నట్లుగా కొంపదీసి ఒక పెద్ద కపాలంలో చిన్నకపాలం ఉందా? ఏమో ఎవరికి తెలుసు. ఈ బ్రహ్మ దేవుడి తో ఏది ముడిపడి ఉన్న అది చివరికి కపాలాలే దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆనాడు బ్రహ్మ చక్రము దగ్గర బ్రహ్మకపాలం దర్శనం అయినది. ఈనాడు బ్రహ్మరంధ్రము దగ్గర మళ్లీ కపాల దర్శనం అయినది. నా స్వామిరంగా! బ్రహ్మయ్యని పూజిస్తే మనకి వచ్చేది కపాలాలు. అదే శివుడిని పూజిస్తే మనకు వచ్చేది బూడిదే. అదే విష్ణువును పూజిస్తే ఇష్ట కోరిక అదే అమ్మవారిని పూజిస్తే జన్మ శరీరాలే. అదే మిగిలిన దైవాలను పూజిస్తే వారి కర్మలు కర్మ ఫలాలే. దీనమ్మ జీవితం. అందుకే కాబోలు సకల దైవ జీవ గురువు పరమాత్మ అనే వారంతా కూడా హృదయ చక్రము నుండి మూలాధార చక్రము దాకా ఉండి పోయినారు. ఏమి లీల? ఎవరికి వారే ఈ జగన్నాటకం నందు భలేగా నటిస్తున్నారు. జీవిస్తున్నారు. ఎటు చచ్చి ఏడ్చేది మాలాంటి యోగులే అన్నమాట. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. మనము నిజ ఙ్ఞానము పొందాలని తీవ్రమైన కోరిక పెట్టుకోవటం ఎందుకు? ఆ కోరిక తీరే సమయములో వచ్చే సమస్యలకు బెంబేలు పడటం ఎందుకు? మనము చేసుకున్నదే కదా. మనమే అనుభవించాలి కదా అనుకుంటూ మా నిత్యకర్మ అనుష్టానం చేసుకోవడానికి వెళ్ళిపోయాను.  

అసలు నాకు బ్రహ్మకపాలదర్శానుభవము నిజమేనా అని సందేహము వచ్చినపుడు ఒకరోజు మేము చేసిన హోమము నందు అగ్నియందు ఒక కపాలమున్నట్లుగా మేము తీసిన ఫోటోలలో కనిపించేసరికి మాకు నోటమాట రాలేదు.గావాలంటే ఈ హోమాగ్ని ఫోటోను జాగ్రత్తగా చూస్తే అగ్నిజ్వాల మధ్యలో ఒక అగ్నికపాలమున్నట్లుగా కనిపిస్తుంది.చూడండి.
 


                                                                      అగ్నికపాల దర్శనము


ఆ తర్వాత పుస్తక గ్రంథాలు చదివితే పతంజలి "యోగ దర్శనము" అను గ్రంథములో బ్రహ్మరంధ్రము వద్ద అంగుళ పరిమాణం మూల కపాలం ఉంటుంది. దీనిపైన చితాగ్ని ఉంటుంది. దీని దర్శనమే కపాలమోక్షం అని చెప్పటం చూసేసరికి మనకేమో చితాగ్నిలో కపాలం దర్శనం అయినది.ఈయనేమో కపాలము పైన చితాగ్ని దర్శనం ఉంటుందని అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది నిజమో మా అనుభవ అనుభూతా లేదా పతంజలి మహర్షి అనుభవమా ఎవరికి తెలుసు. చెప్పే నాథుడు లేడు. ఇంతవరకు ఇలాంటి కపాల దర్శన అనుభవాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ పుస్తకాలు  గ్రంధాలు మీద పరిశోధనలు చెయ్యడం ప్రారంభించాము. ఎందుకంటే దేనికైనా ప్రత్యక్ష అనుభవాలు సాక్ష్యం గా ఉంటే మంచిది కదా. నా పరోక్ష జ్ఞాన అనుభూతి వలన మీకు లేనిపోని సందేహాలు పెరుగుతాయి కాని తగ్గవు. 

అందుకే ప్రత్యక్షముగా ఇలాంటి కపాల దర్శన అనుభవాలు పొందిన యోగుల చరిత్రలు చూస్తుంటే శ్రీలాహిరి మహాశయుడికి దశమహావిద్య దేవతలు అలాగే సూర్యుడి నందు ఏకమూల బ్రహ్మకపాలదర్శనం అయినట్లుగా వారి సాధనానుభవాలలో చెప్పడము జరిగినది.అంటే నాకు బ్రహ్మకపాలదర్శనం అలాగే దశమహావిద్య దేవతల దర్శనం నిజమేనని నేను గ్రహించాను. ఆ తర్వాత ఈ మధ్యనే మఠం అధిపతి ఒకరు సమాధి చెందిన మూడు నెలల తరువాత వారి పార్థివదేహం బయటికి తీయడం లైవ్ గా టీవీలో చూడటము జరిగినది. మాకు ఆసక్తి పెరిగినది. కొద్దిసేపటికి సమాధి పలకలు తీసి చూడగా అందులో జీవ సమాధి చేసి ఉన్న ఆ మఠాధిపతి పార్థివదేహం సజీవ మూర్తిగానే జీవకళతో ఉంది. నాకే ఆశ్చర్యం వేసింది. అలాగే విచిత్రముగా ఈయన మాడు భాగము పైభాగంలో బ్రహ్మరంధ్రం వుండే చోట (చిన్న పిల్ల కాయల కి చూస్తే మాడు ఒకచోట చిన్న గుంట మాదిరిగా కనబడుతుంది అదియే బ్రహ్మరంధ్రము కేంద్ర స్థానము) ఒక తెల్లని జిగురు వంటి పదార్థము బయటకు వచ్చినట్లుగా అగుపించినది. దానితో అక్కడున్న వారు దానిని చూసి స్వామివారు కపాలమోక్షం పొందినారు కపాలమోక్షం పొందినారు అంటూ ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా అరుస్తూ ఉండగా ఎవరో ఒకాయన కాషాయ వస్త్రధారి వచ్చి ఈయన శిరస్సు మీద ఒక బాణ లింగము వంటి లింగమూర్తి ని ఉంచడం జరిగినది. అనగా పాండురంగడి తల మీద ఉన్న లింగములాగా అన్నమాట. దానితో ఈయన పార్థివ దేహ మును యధావిధిగా పూజించి మూసి వేయడం జరిగింది. శాశ్వత సమాధి కావించడం జరిగినది. ఇక దానితో జీవసమాధి ప్రక్రియ సంపూర్తి అయినదని ఇక ఎప్పుడూ కూడా బయటకు తీయకుండా సమాధి చేసినారని అనగా కపాలమోక్షం అయిందో లేదో చూసుకొని దాని మీద ఒక శివలింగమును ఉంచిన తర్వాత శాశ్వత సమాధి చేస్తారని మాకు అర్థం అయినది. 

అలాగే షిరిడి సాయిబాబా వారు కూడా తమ గురువైన వెంకుసా కూడా మహాసమాధి చెందితే పన్నెండు సంవత్సరముల తర్వాత వచ్చి సమాధి త్రవ్వి అందులో ఏది కనిపెడితే దానిని పునః ప్రతిష్ట చేయమని బాబా వారి దగ్గర మాట తీసుకొని సమాధి చెందటం జరిగినది. వీరు శిరిడి గ్రామానికి వెళ్లి సాధన చేసుకుంటూ మళ్లీ 12 సంవత్సరముల తరువాత గురువు సమాధి దగ్గరికి వెళ్లి ఆ సమాధి త్రవ్వి తీయగా అందులో వెంకుసా భస్మమునకు బదులుగా తిరుపతి వెంకన్న విగ్రహమూర్తి (మూడు అడుగులు )కనిపించటంతో దానిని బయటకు తీసుకొని వచ్చి అక్కడే ప్రాణప్రతిష్ట చేయడం జరిగినది. అది ఎక్కడ అంటే సేలూ గ్రామములో ఈనాటికీ గోపాల్ రావు దేశ్ ముఖ్ అనే వెంకుసా గారి సమాధి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ మూర్తిని దర్శనం చేసుకోవచ్చును. 

అలాగే మా సద్గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారు కూడా జీవ సమాధి చెందిన తర్వాత చూస్తే ఆ శవపేటికలో మల్లె పువ్వులు కనిపించినాయి. వాటిని భద్రముగా ఒక పెట్టేలాంటి సమాధి నిర్మాణంలో ఆయన నివసించే ఉన్న గదిలో పెట్టడం జరిగినది. అది ఇప్పటికీ శ్రీ కాశీ క్షేత్రములో శ్రీత్రైలింగ స్వామి మఠంలో ఈ సమాధి నిర్మాణం ఉన్న గదిని చూడవచ్చును. అలాగే ఎవరికైతే మూడవ నేత్రం అయిన త్రినేత్రము తెరచుకుంటుందో వారు శ్రీ కాశీ క్షేత్రము నందు ఈయనగారి సూక్ష్మ శరీర దర్శనమును చూడవచ్చును. వివిధ రకాల అనుభవాలు పొందవచ్చును. ఎందుకంటే మా ఆజ్ఞ చక్రం సాధన స్థితిలో ఉన్నప్పుడు ఈయన గారి ఆత్మ దర్శనం నాకు అయినదని మీరు మా ఆజ్ఞా చక్రానుభవాల  యందు ఈపాటికే మీరు తెలుసుకున్నారు కదా!. కాశి క్షేత్రమే ఆజ్ఞాచక్రం జాగృతి కేంద్రము. ఇదియే త్రినేత్రమునకు దివ్యదృష్టి కేంద్రము. 

అలాగే దత్త అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కూడా శ్రీశైల క్షేత్రములో పాతాళగంగ లో కదళీవనం వద్ద అంతర్ధానమైనారని పడవలో పువ్వులు పంపించటం జరిగినది. అంటే వీళ్ళు అంతా కూడా తమ రూపాలను అంతము చేసుకోకుండా రూపాంతరము చెందినారు అని మాకు అర్థం అయినది.

అలాగే అరవింద యోగి రచించిన మంత్ర అనుభవ గ్రంథమైన "సావిత్రి "గ్రంథ పఠనము చేస్తుంటే ఈయనకి తమ కపాలము నుండి రక్తం బయటకు వచ్చినట్లుగా అనుభూతి పొందడం జరిగినది. ఇదియే కపాలమోక్షం అనుభవము అని చెప్పటం జరిగినది. వారు మహాసమాధి చెందినప్పుడు ఇలాగే జరగడం విచిత్రము. 

అలాగే అరుణాచల ప్రాంత మౌన బ్రహ్మ అయిన రమణ మహర్షి ప్రియ శిష్యుడైన శ్రీ కావ్యకంఠ మహామునికి అప్పుడప్పుడూ తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కపాలము నుండి అగ్ని బయటకి చాలా సహజసిద్ధంగా వచ్చి అందరికీ గ్యాస్ పొయ్యి లాంటి మంటలాగా నీలి వర్ణముతో తరచుగా కనబడుతూ ఉండేది. ఇది ఎందుకు కనబడుతుందో అర్థం అవ్వక దీనితో చాలా ఇబ్బందులు పడిన తరువాత మౌన బ్రహ్మ చెప్పిన విధి విధానాలతో ఈ మంట పైకి రాకుండా చేసుకోవడం జరిగిందని వారి చరిత్రలో చదవటము జరిగినది. 

నా స్వామిరంగా! ఒక కపాలంలో ఇన్ని రకాల కపాలమోక్షములు ఏమిటో?ఒకరికి తెల్లని పదార్థం రావటము (రాఘవేంద్ర స్వామి మఠం అధిపతి) మరొకరికి ఎర్రని రక్తము రావటము ఏమిటి( అరవింద యోగి) మరొకరికి అగ్ని  రావటం ఏమిటి (కావ్యకంఠ మహాముని) వామ్మో! వాయ్యో! దీనెమ్మ జీవితం. కపాల మోక్షం అంటే కపాలము పగలటం అనుకున్నాను. కానీ వీటిని చూస్తే అలా అనిపించడం లేదు. వీటి వెనుక ఇలా పలు విధాలుగా కపాలమోక్షం ఉంది అంటే ఏదో తెలియని విషయమే ఉండాలి. అది ఏమిటో కనిపెట్టాలి. వామ్మో! ఇంతకీ కపాలమోక్షం విధానాలే ఇన్ని ఉంటే మరి కపాలము ఒక్కటేనా లేదా ఏమైనా కపాలాలు ఉన్నాయా? ఎవరికి తెలుసు. అనుకుంటూ నిత్యకర్మ అనుష్టానము చేసుకోవటానికి వెళ్ళిపోయాను. ఇలా కొన్ని వారాలు గడిచినాయి.

నా మనో ధ్యానము నందు 36 కపాలధారి దర్శనం:

ఒకరోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు మా మనోనేత్రంనందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. అతి చిన్న కపాల దర్శనము దాకా ఉన్న అన్ని దృశ్యాలు ఇవ్వటం దాటుకోవటం జరిగినది. అప్పుడు మాకు బ్రహ్మరంధ్రము పై నుండి చూడటము జరిగినది. పైనుంచి చూస్తే అచ్చంగా పీఠము లేని పానవట్టం లేని శివ లింగ మూర్తి లాగా కనపడ సాగింది. గుండ్రని పానమట్టం లో చిన్న గుండ్రని లింగము ఉంటే ఎలా ఉంటుందో అలా మా మాడు పైభాగంలోని బ్రహ్మరంధ్రము కనబడినది. ఈ రంధ్రము ద్వారా లోపలికి వెళ్ళినట్లుగా అనుభూతి కలగ సాగింది. 

                                          నాకు ధ్యానమునందు కనిపించిన 36 కపాలధారి 

అప్పుడు మాకు ఒక ఏకైక అస్థిపంజరం ధ్యానముద్రలో ఉన్నట్లుగా కనబడినది. వామ్మో ఈయన ధ్యానం చేస్తూనే సమాధి చెందినారే అనుకుంటూ ఉండగా ఈయన కపాలానికి మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించసాగింది. అంటే త్రి కపాలధారి అన్నమాట. కొంపదీసి ఈ అస్థిపంజరం దత్తస్వామిది కాదు కదా అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించినాయి. అంటే పంచ కపాలధారి అన్నమాట. అంటే ఈ అస్థిపంజరం పంచముఖ ఆంజనేయుడుదా లేదా పంచముఖ గణపతిదా లేదా పంచముఖ గాయత్రిదా అనుకుంటూ ఉండగా దీనికి మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించసాగింది. అంటే ఈసారి సప్త కపాలధారి అన్నమాట. మరి ఈ అస్థిపంజరం ఎవరిది సప్తమాతృకలదా ఏమో అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించినది. అనగా నవ కపాలధారి అన్నమాట. మరి ఈ అస్థిపంజరం నవనాథులుదా లేదా నవనాగులదా అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించినది. అనగా ఈసారి ఏకాదశి కపాలధారి అస్థిపంజరం కనపడినది అంటే ఈ అస్థిపంజరం కొంపదీసి ఏకాదశ రుద్రులుదా అనుకుంటుండగా మాకు ధ్యాన భంగము అయినది. నిజానికి మాకు ధ్యానములో ఒకేసారిగా కపాలాల దర్శనం కాలేదు. మొదట ఏక కపాలధారి దర్శనము అయినా కొన్ని వారాల కి త్రికపాలధారి దర్శనం అయినది.ఇలా మాకు మొత్తం 1, 3, 5, 7, 9, 11 కపాల దర్శనాలు అవటానికి ఒక సంవత్సరం పైగా పట్టినది. కాకపోతే మా అనుభవాలను ఏర్చి కూర్చి ఒకే ధ్యాన అనుభవముగా చెప్పటం జరిగినది. 

 



అయితే ఈ ధ్యాన అనుభవము నిజమో కాదో అన్నప్పుడు నాకు ఒక సదాశివమూర్తి ఫోటోని పంపించటం జరిగినది. ఆయనకి 25 తలలు 50 చేతులు ఉన్నాయి. తలలు కూడా మొదట ఒక తల ఆ తర్వాత మూడు తలలు ఆ పై ఐదు ,ఏడు, తొమ్మిది తలలు ఉన్నాయి. అంటే 1+3+5+7+9=25 తలలు ఉన్నాయి. మరి నాకు అయితే 1+3+ 5+ 7+ 9+ 11= 36 తలలు వరుసగా కనిపించినాయి. 



కానీ సదాశివమూర్తి కి ఇరవై ఐదు తలలు ఉన్నట్లుగా ఈ విగ్రహమూర్తి కూడా మధుర మీనాక్షి దేవాలయం లోని తూర్పు గోపురం గోడపైన ఉన్నదని తెలిసింది. అంటే తలకాయల స్థానంలో నిజానికి కపాలాలు ఉండాలి. కానీ కపాలాలు పెడితే భయపడతారని శిరస్సులు ఉంచినారు అని నాకు అర్థం అయింది. మాకు ధ్యానములో 36 కపాలాలు కనబడితే ఇక్కడేమో 25 తలలు మాత్రమే కనబడుతున్నాయి. అప్పుడు ఇంటర్నెట్ లో మళ్లీ ఇలాంటివే అప్డేట్ అయిన ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో అని వెతకడం ఆరంభించాను. ఎందుకంటే మొదట నరముఖ గణపతి అన్నారు. ఆ తర్వాత కాలంలో గజ ముఖ గణపతి అన్నారు. ఆ తర్వాత ద్వి ముఖ,త్రి ముఖ, చతుర్ముఖ,పంచముఖ, సప్తముఖ, అష్టముఖ, నవముఖ అంటూ 32 గణపతి రూపాలు ప్రస్తుతానికి ఉన్నాయి. 
                                                     

అలాగే సదాశివమూర్తి కూడా ఏమైనా తన ఇరవై ఐదు తలల విషయంలో ఏమైనా అప్డేట్ చెందినాడా అనే సందేహము వచ్చినది. అప్పుడు మాకు 34 తలలు ఉన్న సదాశివమూర్తి ఫోటో కనపడినది. దానిని చూస్తే 1+ 3+ 5+ 7+ 9+ 9=34 తలలు ఉన్నాయి. కానీ ఇందులో చివరి వరుసలో ఉన్న తొమ్మిది శిరస్సుల మధ్య సదాశివమూర్తి శరీరముతో ఉన్నందువలన ఈ శిరస్సును ఒక కపాలముగా కాకపోవటం జరగటంతో మొత్తం 33 కపాలాలు ఉన్నాయి. అంటే ఇంకా మూడు కపాలాలు మిగిలిపోయినాయి. అవి శ్రీ దక్షిణామూర్తి కపాలము, సదాశివమూర్తి కపాలము, సాంబ శివ కపాలము అని మాకు స్పురణకు వచ్చినాయి. 





ఇప్పడికి ఈ ముగ్గురు గూడ అనగా సదాశివమూర్తి కాస్త కైలాష్ పర్వతమునందు అలాగే దక్షిణామూర్తి కాస్త అరుణాచలము నందు అలాగే సాంబ శివమూర్తి కాస్త మురుడేశ్వర క్షేత్రము నందు సజీవమూర్తులుగా ధ్యాననిష్టలో ఉన్నట్లుగా మన మనోదృష్టికి కనపడతారు.అంటే ఈయన 33 కపాలాలు విభేదనము చేసి సశరీరములతో 3 రూపాలతో ఉండిపోయారని మేము గ్రహించినాము. కాకపోతే ఎందుకు ఉండి పోయినారో కారణము అర్థం కాలేదు. 




కావాలంటే మేధా దక్షిణామూర్తి ఫోటోను ఒకసారి గమనించండి. అప్పుడు ఆయన చేతులలో ఒక తాళపత్ర గ్రంథం, ఒక జ్ఞానముద్ర, ఢమరుకం, చితాగ్ని ఉంటాయి. కుడి పాదము క్రింద పామును పట్టుకుని అపస్మారక రాక్షసుడు ఉంటాడు. ఈయనను విశ్లేషణ చేస్తే పాము వంటి కుండలినీ శక్తిని జాగృతం చేస్తే ప్రాచీన తాళపత్ర గ్రంధం ద్వారా వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల యొక్క శబ్ద పాండిత్యము పొందితే జ్ఞాన ముద్ర ద్వారా అనుభవ పాండిత్యము కలిగితే డమరుకము నుండి వచ్చే శబ్ద నాదముతో సాధనచేస్తే చితాగ్ని చేరుకోవచ్చని చితాగ్ని చూపిస్తూ మౌన భాషలో తమ శరీర భంగిమలో A-Z యోగసాధన చెబుతున్నారని ఎందరికి తెలుసో చెప్పండి. ఇది తెలిసిన వారే నిజమైన పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానులు అవుతారు. ఇలా నిజమైన బ్రహ్మ జ్ఞానమును అందించుటకు మౌన భాషతో జ్ఞాన బ్రహ్మ గా మిగిలిపోయారు అన్నమాట. అలాగే మిగిలిన కపాలాల విభేదనము కోసం సదాశివమూర్తి రూపంలో కైలాస పర్వతం లోపల ధ్యానముద్రలో సాధన చేస్తూ ఉన్నారని మాకు అర్థం అయినది. ఇలా ఎందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు. కానీ మాకు అర్థం కాని విషయము ఏమిటంటే 10 లక్షల కి ఒక కపాలము చొప్పున విభేదనము చేసుకుంటూ పోతే  36 కపాలాలకి 36x10 లక్షలు = 360000000 అనగా 3 కోట్ల 60 లక్షల కాలము పడుతుంది. కానీ మనకు 11 కోట్ల 66 లక్షల 40 వేల సంవత్సరములు (27 మహాయుగాలు) అయ్యాయని తెలుస్తోంది. మరి ఈపాటికే 36 కపాలాల విభేదనము అనగా కపాల మోక్షము పొంది ఉండాలి కదా. మరి ఎందుకు జరగలేదు. కేవలం 33  కపాలాలే విభేదనము జరిగినాయి. దీనమ్మ జీవితం. ఈ లెక్కలు నేర్చుకొని లెక్కలు పంతులుగా జీవితంలో స్థిరపడి పోవచ్చును. అసలు నిజంగానే మూల కపాలంలో 36 కపాలాలు ఉన్నాయా లేక అది నా ధ్యాన అనుమానమా ఎందుకంటే సదాశివమూర్తి ప్రకారం చూస్తే 1+ 3+ 5+ 7+ 9+ 9= 34 కపాలాలు ఉన్నాయని తెలిస్తే మా అనుభవం ప్రకారము 1+ 3+5+ 7+ 9+ 11= 36 అని వస్తుంది. మరి ఏది నిజమో అనే సందేహం వచ్చింది. దీనికి సమాధానముగా క్రీస్తుశకము 848 సంవత్సరంలో తను రచించిన “స్పందనకారిక” అనే గ్రంథంలో మూల ప్రకృతిలో 36 తత్వాలు ఉంటాయని వీటితోనే ప్రకృతి నిర్మించబడినదని చెప్పటం జరిగినది.

36 తత్వాలు

1. జ్ఞాన శక్తి - మేధా దక్షిణామూర్తి జ్ఞాన రూపంగా ఉండేవారు 
2.విశ్వ శక్తి - ఆదిపరాశక్తి తన శక్తితో శివుడిని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. 
3.సదాశివుడు - నేను ఉన్నాను అను అనుభూతిని ఇస్తుంది 
4.ఈశ్వర - అంతటా ఉన్నానని అనుభూతిని ఇస్తుంది 
5.మాయ -నేను జగత్తు రెండిటినీ వేరు చేసేది 
6.కళ -జీవుడి లోని శక్తిని కార్యోన్ముఖము చేస్తుంది 
7.విద్య - వ్యక్తిగత విద్యా జ్ఞానము 
8.రాగము - ప్రాపంచిక లేదా ఐహిక వస్తువుల యందు ఆసక్తి 
9.కాలము - త్రికాలాలు నడిపించే కాలచక్రము 
10.నియతి- బ్రహ్మాండ చక్రమును నడిపించేది 
11.శుద్ధ విద్య - పరిపూర్ణ నిజ బ్రహ్మవిద్య అయిన బ్రహ్మ జ్ఞానము 
12.పురుషుడు - ప్రకృతికి పురుష శక్తి 
13.ప్రకృతి- జీవ ప్రకృతికి స్త్రీ మూర్తి శక్తి 
14.బుద్ధి- ద్వైత భావము అద్వైత భావం స్థితి కలిగేది 
15.అహంకారము -18 రకాల అహంకారానికి మూలశక్తి 
16.మనస్సు- స్త్రీ పురుష శక్తులను కలిపేది. స్థిరమైతే యోగి అస్థిరమైతే భోగి
17 నుండి 21 జ్ఞానేంద్రియాలు – రుచి, వాసన, వినుట, స్పర్శ, చూచుట 
22 నుండి 26 కర్మేంద్రియాలు – నాలుక, ముక్కు, కన్ను, చెవి, చర్మము 
27 నుండి 31 వరకు శబ్ద, స్పర్శ, రూప, రస ,గంధములు 
32 నుండి 36 వరకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 

ఈ 36 తత్వాలకే ఉన్నట్లుగా 36 దేవతలుగా ఉన్న వారే 36 కోట్ల దైవాలలో పూజలు అందుకుంటున్నారు. ఇలా ఈ 36 తత్వాలు 36 కపాలముల సంకేతములు గా అవుతాయి. ఎందుకంటే వీటిలో దక్షిణామూర్తి, సదాశివుడు, రూపాలు ఉన్నాయి. మిగిలినవి అన్నియు కూడా క్రియలకి సంకేతాలుగా ఉన్నాయి. అంటే ఈ తత్వాలను బట్టి చూస్తే అంగుళ పరిమాణంలో ఉన్న మూల కపాలంలో 36 కపాలాలు ఉండటం నిజమే అని తెలుస్తోంది. నా స్వానుభవం నిజమేనని తెలుస్తుంది. మరి సదాశివమూర్తి యొక్క విగ్రహ మూర్తి ని చూస్తే 1+ 3+ 5+ 7+ 9+ 9=34 లో ఆరవ వరసలో 11 కపాలములకి 9 కపాలాలు విభేదనము జరగటం వలన రెండు కపాలాలు మిగిలిపోయినాయి.కాబట్టి ఆరవ వరసలో 11 కి బదులుగా తొమ్మిది కపాలములు ఉంచడము జరిగినదని దీనిని బట్టి చూస్తే ఆయన విగ్రహమూర్తి రూపము అలాగే నా స్వానుభవం నిజమేనని మాకు స్పురణ అయినది. 



ఒకరోజు నాకు అసలు ఈ కపాలములో ఉన్నది ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. దానితో తీవ్ర ధ్యానం చెయ్యటం ఆరంభించాను. ఇలా ముప్పై ఆరు రోజుల తరువాత నాకు ఒక రోజు ధ్యానములో మూల కపాలము పైన చితాగ్ని కనపడినది.ఇందులో ఆదిపరాశక్తి ఉంది. ఆవిడ యొక్క ఒక చేతిలో బ్రహ్మకపాలం మరొక చేతిలో ప్రేత శరీరముతో మిగిలిన ఆయుధాలతో విచిత్ర స్వరూపముగా కనబడినది. 



ఆపై మూడు కపాలధారిలో ఒక కపాలము నందు దీపదుర్గ దర్శనము మధ్యకపాలములో ప్రత్యంగిరా స్వరూప దర్శనము చివరి కపాలములో చండిక మాత దర్శనం ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత పంచక పాలధారి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా నాకు ధ్యానములో మా సాధన శక్తి తట్టుకోలేక పోవటంతో ఎగశ్వాస తన్నుకొని రావటంతో ధ్యాన భంగము అయినది. అదే సమయములో టీవీలో జగన్మాత వైభవం గూర్చి  ఉపన్యాసం నడుస్తోంది. 

అది ఏమిటంటే చితాగ్ని నుండి ఆదిపరాశక్తి ఉద్భవించినదని ఈమె కాస్త మహా దుర్గ, మహా కాళిక, మహా చండిగా త్రి రూప మాతలుగా విడిపోయినదని…. ఆ తర్వాత తన బిడ్డలుగా త్రిమూర్తులను అనగా బ్రహ్మ- విష్ణు- మహేశ్వరులను సృష్టించినదని అలాగే తన పదహారు కళల నుండి త్రి శక్తి మాతలుగా పార్వతి- లక్ష్మి- సరస్వతులను సృష్టించినది అంటూ చెబుతున్నది నాకు వినబడుతుంటే నాకు యోగ నిద్ర మత్తు ఆవరించడం జరిగినది. ఆ తర్వాత ఏమి జరిగినదో తెలుసుకోవాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!మౌనముగా నాతో ఆధ్యాత్మిక యాత్ర చెయ్యండి.

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*********************************
నా సాధన పరిసమాప్తి సమయములో నిజానికి మన బ్రహ్మరంధ్రగుహ యందు 36 కపాలధారి కాదు 64 కపాలధారి ఉంటాడని నాకు అంతిమములో అనుభవమైంది.ఇది మీకు "ముగింపు" అధ్యాయములో చెప్పడము జరిగింది.అలా ఈ భూమ్మీద నిజముగా 64 కపాలధారి ఉన్నారా ? అనుకున్నపుడు మాకు ధ్యానమునందు హిమాలయలలో ఉన్న కైలాష్ పర్వతమునందు నీలిశరీరముతో అజ్ఞాచక్ర ముద్రతో 36 తలలుతో ఉన్న సదాశివమూర్తి నిజరూపదర్శనము అలాగే అరుణాచల క్షేత్రములో ఉన్న అరుణాగిరి యందు తెల్లని శరీరముతో 28 తలాలతో పద్మాసనములో ధ్యాననిష్టలో ఉన్న తెల్లశివుడి దర్శనమవ్వడముతో...అనగా 36 + 28 తలాలు కలిపి సాంబ శివమూర్తి 64 కపాలాధారిగా మారినారని నాకర్ధమైంది.విచిత్రము ఏమిటంటే ఈ సాంబశివమూర్తి ఉన్న మురుడేశ్వర క్షేత్రము నందు కైలాసనాధుడి ఆత్మలింగము విభేధన చెందినపుడు ఇక్కడ ఒక ముక్క పడినదని స్ధలపురాణము మనకి చెపుతోంది.అంటే దీనిని బట్టి చూస్తే సాంబశివమూర్తి కాస్త కపాలధారి అని రుజువైంది గదా.ఈ లెక్కన చూస్తే శివం కాస్త శవం అనే నానుడి నిజమని గ్రహించాను.శివాత్మలలో శాశ్వత మరణమును పొందవలసిన వారు ఆ సదాశివమూర్తి అలాగే దక్షిణామూర్తి అని తెలిసింది.ఈ 64 కపాలాలు గూడ మన విశ్వచక్రములో ఉన్న 64 డైమర్ష్స్ కి సంకేతమని తెలుసుకున్నాను.

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ekamula brahma kapaala darshanam idi dahanam kaakapovatam, chithagni nundi sakala srushti, layamu jaruguthunnayani, brahmarandraniki athikinchinatlu oka angula parimaanam kapaalamu unnatlu deeni paina agni darshaname kapaalamokshamani... kapaalamoksham moodu vidhalugaa untundani thellani padaardham, raktham, agni ani, 36 kapaaladhaari darshanam vivarana, mee vishleshana bagundi. medha dakshinamurti gaarini vivarinchina vidhaanamlo motham saadhana modata kundalini nunchi chivara agni varaki oka photolo ardham cheppatam baaga nachindi. 36 thathvalu alage meeku jarigina dhyaana anubhavam correct ane vishleshana bagundi, nijangaane anni lekkalu osthe lekkala panthulu avvochu anipinchindi...

    రిప్లయితొలగించండి