మంత్రం మీద ధ్యానం
(మా ధ్యాన మార్గము)
ఇక మా ఇద్దరి వంటికి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు సరిపడవని గ్రహించి నాలుగవది అయిన ధ్యాన మార్గం లోనికి అడుగు పెట్టడం జరిగింది! ధ్యానం అంటే ఆలోచనలు తగ్గించుకోవడమేనని వివిధ గ్రంథాలు పుస్తకాలు చదవటం వలన మేము తెలుసుకోవడం జరిగినది! దానితో మన ఆలోచనలు తగ్గించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా! నా సామీ రంగా! నాకున్న ఆలోచనలు తగ్గిస్తే చాలు! సాధన అయిపోయినట్లే అన్నమాట అనుకుని… ఒకరోజు గుడిలో పనులు ముగించుకుని గుడి బయట ప్రశాంతంగా దర్భ చాప వేసుకుని జపమాల చేతిలో పెట్టుకుని కళ్లుమూసుకుని జపం చేయడం మొదలు పెట్టినాను! కొద్దిసేపటికి వరకు బాగానే సాగింది!
ఇంతలో ఒక సుమధురమైన ఆడ గొంతు తో “స్వామి! బావిలో నీళ్లు తోడు కోవటానికి చేత బక్కెట్టు కావాలని” మాట విన పడింది! అంతే నా కళ్ళు ఆత్రంగా తెరుచుకున్నాయి! నా జపము చేసే నోరు ఆగిపోయినది! ఆమె వంక అదోలా చూస్తూ … “అదిగో లోపల ఉంది! తీసుకో! దీనిని బావి దగ్గర పెట్టకుండా మళ్ళీ తీసుకుని వచ్చి లోపల పెట్టు” అని చెప్పి కళ్ళు మూసుకున్నాను! “సరే! స్వామీ” అంటూ ఆమె లోపలికి వెళ్లి చిన్న బకెట్ తెచ్చుకుని మంచినీళ్ల కోసం అని బావి దగ్గరికి వెళ్ళింది! మళ్లీ నా జప ధ్యానం మొదలయింది! కళ్ళు మూసుకున్నాను! ఇంతలో ఆలోచనలు రావటం మొదలయ్యాయి! “ అబ్బా ! ఆమె అమాయక ముఖం చాలా బాగుంది కదూ! ఫలానా వారి అమ్మాయి లేక ఫలానా వాడి చెల్లి లేదా అక్క అయి ఉండాలి అని అనుకున్నాను!అసలు ఎవరు కూడా చెప్పలేదే! ఈమె చదువుకునే అమ్మాయా లేదా ఉద్యోగం అమ్మాయా… ఏమి చదువుతుంది ఏమి చదువుకుంది! ఎంత వరకు చదువుకుంది… ఎక్కడ చదువుకుంది! పోనీ ఉద్యోగం చేస్తే …ఏమి ఉద్యోగం చేస్తోంది… ఎక్కడ చేస్తోంది! అసలు ఈ పిల్ల తాలుకా మనుషులు ఎవరు? నాకు తెలిసిన వారా లేక తెలియని వారా? అవును బకెట్ తీసుకుని వెళ్లి చాలాసేపు అయింది !అంటే అప్పటికి సుమారు ఐదు నిమిషాలు కూడా కాలేదు! నాకు మాత్రం ఈమె విరహ వేదన ఆమె కోసం గంట సేపు అయినట్లుగా అనిపించింది! కొంపతీసి బకెట్ తో పాటు తన ఇంటికి వెళ్లి పోయిందా? అనవసరంగా కళ్ళుమూసుకున్నాను అనుకుంటూ… కళ్ళు తెరిచి… గోడ వారగా చాటుగా చూస్తే … ఆమె అమాయకంగా గుడి చేతబక్కెట్టుతో నీళ్ళు తోడుకుంటూ కనిపించేసరికి… హమ్మయ్య అనుకుని మళ్ళీ మంత్రజపం చేయటం మొదలు పెట్టినాను! అంతలో ఆమె మాయ, భ్రమ,భ్రాంతి అని నా అంతరాత్మ గోల చేయటం మొదలు పెట్టేసరికి… నిజమే కదా అని మంత్రజపం ఆపివేసిన విషయం గుర్తు తెచ్చుకుని… మళ్లీ మర్చిపోయిన మంత్రమును జపమాలతో త్రిప్పుతూ చేయడం ఆరంభించిన… కొంతసేపటికి ఆమె గుడి లోపల చేతబకెట్ పెడుతున్న శబ్దం వినిపించే సరికి… నా ప్రమేయము లేకుండా కళ్ళు తెరుచుకోవడం… నోరు మూసుకోవటం జరిగినది! ఏముంది! కొద్దిసేపే కదా! ఆమె వెళ్ళి పోయే దాకా ఆమెను చూస్తే తప్పేంటి? బోడి ధ్యానము!అప్పటిదాకా ఆగదా? ఆమెను చూస్తే అరిగిపోతుందా… అనుకుంటూ ఆమె వెళ్లేదాకా చూడాలని కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటే.. ఆమె నా చూపులు గమనించి… నా ఖర్మ కొద్ది… “స్వామి! మళ్లీ వస్తాను! మీరు కళ్ళు మూసుకుంటే చేతబకెట్ అడగటానికి ఉండదు కదా” అని చెప్పి వెళ్ళిపోయింది! ఏదో తెలియని బాధతో మంత్రజపం మొదలయినది! కళ్ళు మూసుకున్నాను! మంత్రం మీద ఉండవలసిన మనసు కాస్తా ఆమె మీదకి వెళ్ళినది! అమ్మవారిని ఊహించుకోవలసిన నా మనసు కాస్త అమ్మాయిని ఊహించుకోవడం మొదలు పెట్టింది! అమ్మ ధ్యానం చెయ్యవలసిన వాడిని కాస్త అమ్మాయి ధ్యానంగా మారిపోయింది! కానీ ఆ విషయం నేను గమనించే పరిస్థితిలో లేను! “అవునా! మళ్లీ నిజంగానే వస్తుందా? ఎప్పుడు వస్తుంది! అసలే నన్ను అడగకుండా బకెట్ తీసుకొని వెళితే… ఆమెను చూడలేనేమో? ఏం చేయాలి? ఇంకా రాలేదేమిటి? ఇంట్లోవాళ్లు వద్దన్నారా? ఆమె వెళ్లి కూడా రెండు నిముషాలు మించి అవ్వలేదు! బిందెడు నీళ్ళుపోసి రావడానికి ఇంత సమయం తీసుకోవాలా? నా బొంద? ఆడవాళ్ళకి మరీ ఇంత బద్దకమా? ఇంట్లో తొందరగా పోసి వస్తే… నాకు ఈ బాధ ఉండదు కదా! చక్కగా ధ్యానం చేసుకునే వాడిని కదా! ఇలా నా ప్రారంభ ధ్యాన మంత్ర ధ్యాన స్థితి ఉండేది! ఇలా రానురాను ఆమె వచ్చే సమయం కోసం ధ్యానం పేరుతో గుడి ఆరు బయట కూర్చుని ఎదురుచూసే రోజులు వచ్చినాయి! ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె రావడం మానేసింది! ఆరా తీస్తే ….సెలవుల కోసం చుట్టాల ఇంటికి వచ్చిందని… ఆమెకి అప్పటికే వివాహము నిశ్చయమైనదని తెలిసేసరికి…. నా కొంగ జపము గంగపాలైనదని గ్రహించాను! ఇలాంటి జపాలు వలన ఆలోచనలు తగ్గటం దేవుడెరుగు.. ఇంకా పెరుగుతాయని నేను గ్రహించాను! అసలు నేను ఇన్నాళ్లు చేసినది అమ్మవారి ధ్యానం కాదని కేవలం అమ్మాయి ధ్యానం అవుతుందని గ్రహించడానికి నాకు 6 నెలల సమయం పట్టింది!
ఇది ఇలా కాదనుకుని గుడి బయట కాకుండా గుడి లోపల శివలింగము దగ్గర కూర్చుని ధ్యానం చేయడం ఆరంభించి నాను! ధ్యానంలో కూర్చోగానే ఎవరో పిలిచినట్లుగా… భక్తులు వచ్చి పూజలు చేయాలని , పెద్దగా గంటలు కొట్టడం తరచుగా చేసే సరికి నా ధ్యానమునకు అంతరాయం వచ్చేది! మళ్లీ వాళ్ల పని చేసుకుని వచ్చేసరికి కొత్తవాళ్ళు వచ్చేవాళ్లు! ఇలా చేస్తూ ఉంటే అంతరాయాల ధ్యానముగా ఉండేది! ఆలోచనలు తగ్గేవి కాదు! ఇంతలో భక్తులందరినీ పంపించే సరికి నైవేద్యం సమయం రానే వచ్చేది! దాంతో గుడి మూయ్యడము జరిగేది! దాంతో ధ్యానము ఆపివేయడం జరిగేది! ఇలా కాదనుకుని బడి లేదా కాలేజీ కి వెళ్ళినప్పుడు పై అంతస్తులోకి వెళ్లి ధ్యానం చేసుకోవడం ఆరంభించాను! కానీ సూర్యుడు తాపానికి నా ధ్యానము లో ఏకాగ్రత ఉండేది కాదు! ఇలా కాదనుకుని ఇంటిలో ఒక గదిలో కూర్చుని ధ్యానం చేసుకునే సమయానికి…. ఇంటిలోని వాళ్లకి అదే సమయంలో వారికి కావాల్సిన టీవీ సీరియల్స్ వచ్చేవి! దాంతో టీవీ శబ్దాలతో నా ధ్యానము ఎగిరిపోయింది! లేదంటే గొడవల శబ్దాలు, మాటలు శబ్దాలు, వంటసామగ్రి శబ్దాలు, బట్టలుతికే శబ్దాలు ఇలా పలు రకాల శబ్దాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవి! దాంతో ఇలా కాదనుకుని మా ఇంటి పక్కనే ఉన్న తోటలోనికి వెళ్లి ధ్యానము చేసుకునే వాడిని! కానీ దీనిని మా ఊరి జనం కొంతమంది మలమును విసర్జించే ప్రాంతముగా(లెట్రిన్) ఉపయోగించుకొనేవారు!నాకు ఆ విషయము తెలిసిన అక్కడైన ధ్యానము చేసుకొనే అవకాశము కలుగుతుందనే ఆశతో ధ్యానము చెయ్యడము ఆరంభించాను! నా దృష్టిలో ధ్యానమునందు మనసు నిలపాలనే తపనతాపత్రయం ఉండేది గాని ప్రాంతానికి విలువ ఇచ్చేవాడిని కాను! నేను ధ్యానము చేసుకునే సరికి…. వాళ్ళు చెంబులతో కనపడేవారు! ఛ! నా బ్రతుకి ధ్యానము చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదా అని తిట్టుకుని… వారిని ఇబ్బంది పెట్టలేక తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయేవాడిని! ఇలా కాదనుకుని మా ఊరికి దగ్గర్లో ఉన్న అడవి ప్రాంతమునకు చేరుకుని ఒక చెట్టు ఎంచుకొని ధ్యానము చేసిన పదినిమిషాలకి కల్లా… ఎవరో పిలిచినట్లుగా పక్షులు లేదా కోతులు ఈ చెట్టు మీద వాలడం..ఇవి చేసే శబ్ధాలకి నా ధ్యానము ఎగిరిపోయేది! దానితో నాకు ధ్యానము కుదిరేది కాదు! ఆలోచన లేకుండా కొన్ని క్షణాలు అవుతుందో లేదో ఏదో ఒక ఆటంకం వచ్చేది! దానివలన నాకు ధ్యాన భంగమయ్యేది! ఇలా పలుమార్లు జరిగేసరికి ఆ ప్రాంతమును వదిలి వచ్చేది! అసలు నాకు ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశం అనగా ఆటంకాలు లేని ప్రాంతం ఎక్కడా దొరికేది కాదు! కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగినది! పది నిమిషాలు ధ్యానములో ఉండేసరికి అవాంతరాలు వస్తూ ఉండేవి! దానితో నాకు ధ్యాన భంగమయ్యేది!
ఇలా కాదనుకుని శబ్దాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన, అవాంతరాలు వచ్చినా పట్టించుకోకుండా మనసు వాటి మీదకి పోకుండా మంత్రం మీద ఉండేటట్లుగా ధ్యానము చేయటం ఆరంభించాను! కానీ మొదట్లో చాలా చుక్కలు చూపించింది! అంటే నాకు ఆవలింతలు రావడం మొదలైంది! రానురాను విపరీతంగా వచ్చేవి! తరవాత కునికిపాట్లు వచ్చేవి! ఇలా కాదనుకుని శవాసనంలో పడుకుని ధ్యానం చేయడం ఆరంభించాను! కొన్ని రోజులు బాగానే సాగింది! ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి! శవాసనంలో ధ్యానం చేస్తూ నాకు తెలియకుండానే మంచి గాఢ నిద్రలోకి జారుకునే వాడిని! సుమారుగా రెండు లేదా మూడు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోయేవాడిని! నిద్రపోతున్నాను అనే విషయమే నాకు తెలిసేది గాదు!అప్పటికి నాకు అంత జ్ఞానము లేదు గదా! హమ్మయ్య.. ఈ రోజు నాకు బాగా ధ్యానం కుదిరింది…. మూడు గంటలు చేసుకున్నానని ఆనందపడే వాడిని! అమాయకంగా ఆనందం పడేవాడిని!
ధ్యానములో నేను నిద్రపోవడము అమ్మ గమనించి నన్ను తిట్టేది! “ఒరేయ్ నాయనా! నువ్వు ధ్యానము చేయటం లేదురా! దున్నపోతా! ధ్యానము పేరుతో గురక పెట్టి నిద్ర పోతున్నావు రా! ఎక్కడ పడితే అక్కడ …ఎలా పడితే అలా” అని నన్ను తిట్టేది! నాకు ధ్యానములో ఎందుకు నిద్ర పడుతోందో అర్థమయ్యి చచ్చేది కాదు! నేను ధ్యానం చేస్తున్నానా లేక నిద్రపోతున్నానా… తెలియని అయోమయం.. ధ్యానం అంటే నిద్ర… ఏమో ఎవరికి తెలుసు అనుకుంటూ ఉండే వాడిని!నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఈ నా ధ్యానవిషయము తెలిసి… వాడికి తెలిసి తెలియని జ్ఞానముతో వాడికున్న వివిధ ఆధ్యాత్మిక పుస్తక జ్ఞానముతో... ఎంతో ఆశ్చర్యం చెంది “వామ్మో !నువ్వు ధ్యానంలో నిద్రపోయే స్థాయి కి వచ్చినావా? అది మామూలు నిద్రకాదు యోగ నిద్ర అంటారు! ఈ నిద్ర నాలుగు గంటలపాటు పోతే భోగ నిద్ర అనేది మూడు రోజులపాటు రాదని”… వాడు చదివిన ఒక సాధన గ్రంథంలో నిద్రకు సంబంధించిన విషయాలు నాకు చెప్పేసరికి నాలో తెలియని ఆనందం వేసింది! అంటే నాకు తెలియకుండానే నేను ధ్యానంలో యోగ నిద్ర పోతున్నానని వెర్రిమొర్రి అమాయక జ్ఞానంతో ఉన్నాను! కానీ కొన్నాళ్ళకి నేను ధ్యానములో నిజంగానే మామూలు నిద్రపోతున్నానని నేను తెలుసుకున్నాను! నిజానికి యోగ నిద్ర అనేది నిద్ర, మెలుకువ మధ్యభాగానికి బయట శబ్దాలు చాలా స్పష్టంగా వినబడుతూనే ఉంటాయి కానీ వాటికి మన మనసు అలాగే మన పంచేంద్రియాలు స్పందించకుండా ఉంటాయని ఆ తర్వాత తెలుసుకోవడం జరిగినది! నాకు ధ్యానములో గురక తో కూడిన గాఢ నిద్ర పట్టేది! దానితో నాకు బయట శబ్దాలు ఏవి వినిపించేది కాదు! కాబట్టి నాకు యోగ నిద్ర కాదని తెలుసుకుని చాలా బాధపడ్డాను! దానితో నేను నా వంటికి ధ్యాన మార్గము సరిపడదని తిలోదకాలు ఇచ్చాను!
ఇక మా జిజ్ఞాసి విషయానికొస్తే మంత్ర ధ్యానం చేసేటప్పుడు వాడికి నాలిక పిడచ కట్టుకొనిపోయి దాహం వేస్తోంది అని ….అందుకోసమే రాగి గోముఖ కమండలం తెచ్చుకున్నాడు! అందులో నీళ్లు పోసుకుని అవసరమైనప్పుడు లేవకుండా ఈ నీటిని తాగవచ్చని ఏర్పాటు చేసుకున్నాడు! దర్భ చాప వేసుకుని జపమాల చేతిలో పెట్టుకుని కళ్లుమూసుకుని జపం చేయడం మొదలు పెట్టినాడు! కొద్దిసేపటికి ఆలోచనలేని మంత్ర ధ్యానం బాగానే సాగింది! ఆ తర్వాతే కథ మొదలైంది! తను ఏకాగ్రతగా ధ్యానం చేసుకుంటూ ధ్యానము లోనికి వెళ్లి పోయినప్పటికీ… కళ్ళు మూసుకుని ఉండటం వల్లనే… ఎవరైనా ఇది గమనించి.. తన గోముఖ కమండలం ఎత్తుకుని వెళ్ళిపోతే…. అది లేకపోతే దాహం తీసుకోవడం చాలా కష్టం అవుతుందని… గోముఖ కమండలమునకు సంబంధించిన ఆలోచనలు… అతని వెంట
పడటం మొదలు పెట్టేది! దానితో స్థిర మనసు కాస్త ఈ చెంబు కోసం, దీని కాపలా కోసం, అస్థిరమై కళ్ళు తెరిచి ధ్యానము చేయడం ఆరంభించాడు! బయట కనిపించే దృశ్యాలు వలన, వివిధ రకాల శబ్దాల వలన, శరీరం జపం చేస్తోందని మనసు జపం చేయడం లేదని, ధ్యానము చేయడం లేదని అని తెలుసుకోలేక పోయినాడు! ఈ రాగి చెంబును ప్రతిరోజు చిలిమి పట్టకుండా ఉండటానికి చింతపండుతో తోమలేక నానా అవస్థలు పడేవాడు! దానితో వాడికి ధ్యానము అంటే విసుగు, చికాకు కలగటం ఆరంభించినది! నాకైతే అస్థిర ధ్యానము వలన మది ఆలోచన కాకుండా మంది ఆలోచనలు ఎక్కువవటం మొదలైనాయి! దానితో మేమిద్దరము మళ్లీ ధ్యాన మార్గానికి తిలోదకాలిచ్చి… ఇలా మా మనసులకు వచ్చే ఆలోచన తగ్గాలి అంటే మంత్ర ధ్యానము వలన ఉపయోగం ఉండదని గ్రహించి… దానికి మనసు స్ధిరమవ్వటానికి అందుకోసం వివిధ రకాల ప్రక్రియలు చేయవలసి ఉంటుందని… అదియే కుండలినీ యోగ మార్గము అని తెలుసుకున్నాము! ఈ మార్గానికి మూలపురుషుడు పతంజలి మహర్షి అని తెలుసుకుని…. ఆయన చెప్పిన పతంజలి అష్టాంగ యోగం చేయడానికి ఈ కుండలినీ యోగ మార్గము చేయాలని నిశ్చయించుకున్నాము! ఇక ఆలస్యం ఎందుకు! ఆ పై ఏం జరిగిందో తెలియాలంటే నాతో పాటు మీరు కూడాముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*******************************
గమనిక : నిజానికి ధ్యానమార్గమనేది ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే నిజధ్యానమని గ్రహించాను! ఇలాంటి ధ్యానస్ధితిని పొందాలంటే మనసు లేని స్ధితికి వెళ్ళాలని గ్రహించాను!ఇలా ఈ స్ధితికి వెళ్ళితే...మన కర్మలు కర్మశేషము లేకుండా నశించే విధంగా మన ధ్యానాగ్ని చేస్తుందని... తద్వారా పున:జన్మ లేని జీవన్ముక్తి కల్గుతుందని నేను గ్రహించాను!ఒకటి గుర్తుంచుకోండి! మానవ మెదడు 48 నిమిషాల మించి తన ధ్యానశక్తిని తట్టుకోలేదు! వెంటనే అంతరాయం కలుగుతుంది! ఆ తర్వాత రెండు గంటల విశ్రాంతి నిచ్చి మళ్లీ ధ్యానము చేసుకోవాలి! రానురాను నీ మనసు స్ధిరమైతే నాలుగు గంటల నుండి 16 గంటల దాకా ధ్యానములో మునిగి పోయిన మీరు ఆశ్చర్యము అక్కరలేదు! కాకపోతే మీరు ధ్యానం చేసుకునేటప్పుడు వచ్చే అవాంతరాలకి ధ్యానము వాయిదా వేయకుండా ప్రతి రోజూ 20 నిమిషాల నుండి 48 నిమిషాలపాటు చేయగలిగితే…. రానురాను నీ మనసుకు ధ్యానము లోనికి సహజసిద్ధంగా అలవాటు పడి…. మీరు చేయకపోయినా అది మీ మనస్సు ధ్యానము చేయాలని, చేసుకోవాలని గుర్తుకుతెస్తుంది! అంటే సిగరెట్లకే, కాఫీలకు, మందుకి ఎలా అలవాటుపడితే…. సమయానికి అది పడకపోతే… ఎలా గుర్తు చేస్తుందో… ఎలాగోల చేస్తుందో… అలా మీరు ధ్యానం చేయకపోతే అలాగే గోల చేస్తుంది! ఇలా మీకు గుర్తుకు రావటం లేదు అంటే…. నీ మనసు మీకు ధ్యానానికి ఇంకా అలవాటు పడలేదని తెలుసుకోండి! అది అలవాటు పడే దాకా ఆపకుండా, వాయిదా వేయకుండా, క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా చేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ పోండి! దీనెమ్మ! ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మీ మాట వినక తప్పదు! తప్పకుండా విని తీరుతుంది ! కాకపోతే మనసు మన దారికి వచ్చే దాకా అవాంతరాలు, ఆటంకాలు జాగ్రత్తగా ఓర్పుగా, సహనంగా దాటుకుంటూ రావాలి! భయపడిన, విసుగు చెందిన, విరక్తి చెందిన, కోపావేశాలు, చికాకులు పడిన, ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించండి! నీ మనసు నీకు ఆధీనమయింది అంటే ప్రకృతి మాత ఆధీనమై నట్లే! మరి ప్రకృతి మాత ఆధీనం అవటం అంటే ప్రకృతి ఆధీనం అవ్వాలి అంటే ఎన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలో ఆలోచించండి! కాకపోతే వీటిని భయపడకుండా, ఓర్పుగా, సహనంగా వాటిని దాటుకుంటూ… పాము చావకుండా… కర్ర విరగకుండా …. ఆటంకాలు కలిగితే నీ ధ్యానము ఆపకుండా మీకున్న ఆటంకాలు తొలగించుకోగలిగితే… మీ మనసు మీకు ఆధీనం అవటానికి అవకాశం ఏర్పడుతుంది! అంటే ఒక రోజు పది నిమిషాలు ధ్యానం లో కూర్చుంటే మరొక రోజు నాలుగు గంటలపాటు ధ్యానంలో కూర్చోవచ్చు! అంటే ప్రతి రోజు కనీసం పదినిమిషాల పాటైనా కూర్చోవాలి అన్నమాట! ఒక విషయం మనము ధ్యానము ఎక్కడ చేస్తున్నామని విషయమును పట్టించుకోవద్దు! మీ మనసు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి స్థితిలో ధ్యానములోకి వెళుతుందో ఎవరికి ఎరుక! బాత్ రూమ్ లో ఉన్న ,బెడ్ రూమ్ లో ఉన్న, చెత్త కుప్పల దగ్గర ఉన్న, పెంట కుప్పల దగ్గరున్న ,గుడి దగ్గర ఉన్న, అమ్మాయిల దగ్గర ఉన్న, అబ్బాయిల దగ్గర ఉన్న, ప్రయాణాల్లో ఉన్న, మనసు ఆధీనం అయితే నీకు ధ్యానం చేసే సమయానికి ధ్యానం చేయాలని గుర్తుకు చేస్తుంది! ధ్యానానికి మనసు, బుద్ధి ఉండాలి గానీ శరీర శుద్ధి తో అవసరం లేదని గ్రహించండి !మనసులో ఎలాంటి పాపపు ఆలోచనలు, పాపభయాలు, పాపకర్మలు లేకుండా చేసుకుంటే చాలు! గతం గత: అనగా గతములో చేసిన పాపాలు గూర్చి మీరు ఆలోచించవద్దు!భాదపడవద్దు!దానివలన ఎలాంటి ఉపయోగము లేదు!పైగా ధ్యానానికి అవాంతరాలుగా వచ్చే అవకాశాలున్నాయి!తప్పు.. పాపము చెయ్యకుండా ఆ భగవంతుని వల్లనే కాలేదు! ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడే ఇంతవరకు పుట్టించలేదు అని తెలుసుకొండి! ఒకవేళ కొత్తగా తెలిసి లేదా తెలియక చేసిన పాపపు ఆలోచనలు కాని పాపకర్మలు కాని చేస్తే వాటికి తగ్గ ప్రాయశ్చిత్త పశ్చాత్తాప పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది! అన్నదానము చేయడము, ఎక్కువసేపు ధ్యానం చేయటం, ఉపవాసము చేయటము, మౌనంగా ఉండటం, ఇతరులకు సేవ చేయడం లాంటి పనులను ప్రాయశ్చిత్త మార్గాలుగా ఎంచుకుని చేసుకోవచ్చును!
ఈ లోకంలో ఎవరు ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అమెరికా శాస్త్రవేత్తలకి సందేహము వచ్చి… వారు సుమారుగా 36 లక్షల మంది వ్యక్తులను వివిధ రకాల వృత్తుల్లో వున్నవారిని అనగా అపర కుబేరుడు దగ్గర నుండి అపర దరిద్రుడు వరకు అలాగే సెలబ్రెటీ దగ్గరనుంచి ఊరు పేరు లేని వ్యక్తి వరకు వారి మీద వివిధ పరిశోధన చేయగా…. ఎవరైతే కేవలము ఆధ్యాత్మిక రంగములో ఉంటారో వారు మాత్రమే ప్రశాంతంగా ఉంటున్నారని… ఎవరైతే ధ్యాన మార్గములో ఉండి మనసును ఆధీనము చేసుకుంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటున్నారని తెలుసుకోవడం జరిగినది! ఆధ్యాత్మిక మార్గము ఎంత గొప్పదో తెలుసుకోండి! ఆచరించండి!ఆనందమును పొందండి!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిdhyaanam goorchi cheppatam bagundi meerichina vivarana, ammayi kosamu chesina dhyaanam, ghomukha chembu tho dhyaaam... aalochanalu ela osthayi ane vivarana, america vallu chesina parishodhanalo aadhyathmika rangamlo unna vaaru maatrame prashanthamuga untunnarani edi chaala varaku aalochimpachesi drushti konam maarchagaladu anipinchindi, ekkadunna dhyaanam chesukovochu anedi, ika nidra ki yoganidra ki difference cheppatam....bagundi lot of information...
రిప్లయితొలగించండి