అధ్యాయం 85

 
కృష్ణ మాయ- కృష్ణ బిలము

మా అంతిమ సాధన అంతా బ్రహ్మరంధ్రము వద్ద అంతిమంగా దర్శనమిచ్చే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము వైపు సాగుతోందని దీనికోసం ముందుగా వచ్చిన మూడు బ్రహ్మ పదవులు అనగా కాంతి బ్రహ్మ- శబ్దబ్రహ్మ- శూన్యబ్రహ్మ- పదవులు ఈపాటికే దాటినామని కిందటి అధ్యాయము ద్వారా మీరు తెలుసుకుని ఉంటారు కదా. అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు చుట్టూ ఉండే ఈ మూడు పదవులు కాంతి శబ్ద బ్రహ్మ వెలుగులు మేము దాటి లోపలికి ప్రవేశించే అర్హత యోగ్యత సంపాదించినామని ఈపాటికే మీరు గ్రహించే ఉంటారు. ఆపై ఏమి జరిగిందో ఏమి ఉన్నదో మాకే తెలియదు. అంతా కారు చీకటి దట్టమైన గాఢాంధకారం. అప్పటిదాకా దట్టమైన వెలుగులు శబ్దాలతో ఉన్న దృశ్య ప్రపంచం కాస్త మా మనోనేత్రం ముందు దట్టమైన చీకటి నిశ్శబ్ద నాదముతో కనిపించడం ఆరంభమైనది. అంటే మేము బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములోని వెలుగు భాగమును దాటి చీకటి ప్రపంచంలో అడుగు పెట్టామని అవతల ప్రపంచంలోకి వచ్చినామని గ్రహించినాము. అసలు ఈ చీకటి ప్రపంచం రూపురేఖలు ఎలా ఉంటాయో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది. దానితో నాకు ధ్యాన భంగం అయినది. అప్పుడు ధ్యానము నుండి లేచి అస్థితిమితముగా ఉన్నాను. ఇలా వారంరోజులు గడిచిపోయాయి. ఒకరోజు నాకు ధ్యానము నందు సుడులు తిరుగుతున్న ఆవృతాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి సుదర్శన చక్ర సాలిగ్రామం మీదుగా మారిపోయే ఒక వృతం గా మారి బిందువుగా మారిపోయేది. 

ఇది ఇలా ఉండగా ఒకరోజు నా పాత పుస్తకాలను చదువుతుండగా ఒక పుస్తకము నుండి ఏదో ఒక మ్యాజిక్ షో వాడి దగ్గర కొన్న గుండ్రాలు గీసి ఉన్న కాగితము దొరికినది. దీనిని తదేకంగా చూస్తే మనకు ఈ గుండ్రాలు మధ్య ఏదో ఒకటి మాత్రం గుండ్రంగా తిరుగుతూ ఉన్న అనుభవం అనుభూతి కలుగుతుంది. అప్పట్లో దీనిని ఏకాగ్రత పెంచడానికి నేను కొనడం జరిగినదని లీలగా గుర్తుకు వచ్చినది. మరి ఈనాళ్ళు ఇది బయటకు రాకుండా ఇప్పుడు ఎందుకు కనపడింది. ఇందులో ఏదైనా మర్మం ఉన్నదా అనే సందేహం వచ్చింది. 

అనుకోకుండా ఇదే రోజున జిల్లెళ్ళమూడి అమ్మ వారి సంబంధించిన “అమ్మతో సంభాషణలు” అనే పుస్తకం చూడటం జరిగింది. విచిత్రంగా ఈ అట్ట చివరి పైన అట్టపైన అమ్మవారి చేతిలో ఒంపు పైకి ఉన్న ఓంకారం ముద్రను చూడడం జరిగినది. అంటే ఈమె కూడా తన సాధనతో ఓంకార శబ్ద బ్రహ్మము దాటినదని నాకు అర్థం అయింది. ఈ లెక్కన చూస్తే ఈమెకు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము దర్శనం అయి ఉండాలి కదా అనుకుని ఆమె అనుభవాలు లో ఎక్కడైనా దీనికి సంబంధించిన అనుభవం ఉన్నదా అని ఈ పుస్తకం చదవడం ప్రారంభించాను. ఎక్కడా కనిపించలేదు. ఆమెను ఆరాధించే వారి సాధక అనుభవాలు కనబడుతున్నాయి.కానీ దీనికి సంబంధించిన అనుభవం నాకు కనిపించలేదు. దానితో ఈ పుస్తకమును మధ్యలోనే చదవడం ఆపేసి నిరుత్సాహంతో పుస్తకం మూసివేస్తూ ఉండగా అట్ట ఆఖరి వైపున బ్రహ్మాండ చక్రము బొమ్మ ఒకటి గీసి దాని పైన నేను నేనైన నేను మాతృశ్రీ అనే సూక్తి కనపడింది. దానితో నాకు అమిత ఆనందం వేసింది. అంటే ఈవిడికి కూడా ఈ అనుభవం అయినది అని గ్రహించాను. 

కానీ నాకు కలిగిన అనుభవం లో బ్రహ్మాండ చక్ర సుదర్శన సాలిగ్రామం లోని ఆవృతాలు కనబడితే అదే ఈవిడకి అన్ని కూడా ఆవృతాలు విడిపోయినట్లుగా ఈ చిత్రము చూపిస్తోంది. నాకు అంతా కూడా ఏక వృత్తముగా కనపడితే ఈవిడకి ఎందుకు విడివిడిగా ఆవృతాలు కనబడినాయో నాకైతే మొదట అర్థం కాలేదు. ఈ చిత్రం పైన ఉన్న ఆమె చెప్పిన విషయం చదవగానే ఈమె తన భక్తుల యొక్క ప్రేమాభిమాన మహామాయను కావాలని దాటలేదని కేవలం బ్రహ్మాండ చక్రము అంధకార చీకటి ప్రాంతం వరకు చేరుకుని కళ్లుమూస్తే కనిపించే చీకటి ప్రపంచంలో ఉండటం కన్నా కళ్ళు తెరిస్తే కనిపించే వెలుగు ప్రపంచంలో ఉండి దీనజనోర్ధణ చేయాలని ప్రేమ, శాంతిని నెలకొల్పాలని వారు భావించారు అని నాకు అర్థం అయింది. దానితో ఈ చీకటి కృష్ణ బిలములోని తరంగాలు ఆవృత్తాలుగా అష్ట ఆవృత్తాలుగా మారి దానిలోపల పరమ శూన్య బిందువు స్థానమును ఏర్పరచినాయని 

ఈమె గాని ఈ భక్తుల ప్రేమతరంగాలు దాటి ఉంటే విష్ణు సాలగ్రామం మీద కనిపించే ఏకవృత ఆవృతాలుగా మారి శూన్య బిందువు నందు చేరే వారని గ్రహించినాను.అంటే ఈ లెక్కన చూస్తే మరి విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల ప్రేమ తరంగాలు మాయను దాట లేకపోవడంతో మరుజన్మలో బుద్ధుడి అవతారమెత్తినాడా? ఎత్తి అష్టాంగ యోగ మార్గమును చూపినాడా? అష్టాంగమార్గం .అంటే అష్ట సతులా లేదా అష్టలక్ష్ములా లేదా అష్టాంగ మార్గాలా దేనికి ఈ ఎనిమిది సంకేతం పైగా పూరి జగన్నాథ్ యొక్క గాలిగోపురం మీద ఉన్న గుడి శిఖరం కూడా అష్ట భాగాలున్న చక్రములాగా సుదర్శన చక్రంలాగా కనపడుతుంది. అంటే దీని మూల అర్థం ఏమిటి? ఏకీకృత గురుత్వాకర్షణ శక్తి ఉండాలని ప్రకృతి నిర్దేశించినదా? అందుకే నా మనకి విష్ణు సాలగ్రామాల మీద, దక్షిణావృత శంఖాల మీద, గవ్వల మీద, బాణ లింగాల మీద ఏకీకృత సుదర్శనచక్రం కనపడుతుంది. 

విష్ణుమూర్తి సుదర్శన చక్రం

కాని దీనికి వ్యతిరేకంగా మనకి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలో భిన్న ఆవృతములతో విడిపోయి కనిపించే విధంగా వుంటుంది. అంటే ఏకీకృత ఆవృతములోనికి మనం ప్రవేశించాలంటే శ్రీ కృష్ణుడు మాయ అయిన ప్రేమ మాయను దాటాలి. అప్పుడే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములోని ఆవృతాల ఏకీకృతమైన సుదర్శన చక్రం మీదలాగా కాకుండా సుదర్శన సాలిగ్రామం మీదలాగా ఏకీకృతంగా మారి మనల్ని ఏక బిందువైన మూల మధ్య స్థాన బిందువైన అంతిమ శూన్య బిందువు దగ్గరికి తీసుకుని వెళ్తాయని నాకు అర్థం అయింది. మరి వీరి మాయను ఎలా దాటాలి. దీనికి ఏమి చేయాలో అర్థం కాని అయోమయ స్థితి. ఎవరూ ఊహించని స్థితి. ఎవరికీ అర్థం కాని స్థితి. ఎందుకంటే నాకు ఎవరి మీద ప్రేమ ఉందో నాకైతే అర్థం అవ్వలేదు. నామరూపా దైవాలు లేరు. నాకు గురువులు లేరు, భవ బంధనాలు లేవు. ప్రారబ్ద కర్మలు లేవు. మరి నాకు ఎవరి మీద ప్రేమ ఉందో నాకు అర్థం కాలేదు. నామీద నాకే ప్రేమ లేదు. నేనే లేను కాబట్టి. నేను గాని దాని మీద నాకు ఎక్కడ నుండి ప్రేమ కలుగుతుందో దేని మీద ఉందో నాకైతే అర్థం అవ్వలేదు. ఇది ఏదో చిక్కుముడి లాగా ఉందని గ్రహించాను. ఇది అర్థం కాకపోతే ఇది ఇలా ఉండగా మరి అష్టాంగయోగంలోని అష్టం అనేది దేనిని సూచన చేస్తుందో అర్థమై చావలేదు. పతంజలికి ఈ అష్టాంగ యోగము కాస్తా అష్ట యోగ సాధన మార్గాలుగా కనపడితే అదే మహా బుద్ధుడికి అష్టాంగమార్గం కాస్తా ఎనిమిది రకాల వస్తువులు అనగా గొడుగు, చేపలు, గుప్తనిధి, అర్థంకాని ముడి, శంఖము, పద్మము, ధర్మచక్రము ,ధ్వజపటం లాగా ఎందుకు కనిపించాయో అర్థమై చావలేదు. 

విచిత్రం ఏమిటంటే విష్ణుమూర్తి పాదుకల మీద అనగా విష్ణుగయలోని విష్ణు పాద ముద్ర యందు మనకి ఇలాంటి చిహ్నాలే అనగా చేప, పద్మము, ధనస్సు, సుదర్శన చక్రము, శంఖము, ధ్వజపటం, పూర్ణ కలశము, సూర్యచంద్రులు ఉన్న గుర్తులు కనిపిస్తాయి. పైగా ఇక్కడ అంతిమ పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. అనగా శాశ్వత మరణం ఇచ్చే శూన్య బిందువు స్థానం వరకు తీసుకుని వెళ్ళే మార్గము తన పాదముద్రలు ఈ విచిత్ర చిహ్నాలతో లోకానికి చెప్పటానికి మర్మ రహస్యంగా ఉంచినారా? తెలియదు.పైగా మోక్ష స్థానమైన చిదంబర క్షేత్రంలో మహా శివుడు కూడా ఏక పాదం మీద నిలబడి ఏకపాదుడు అవతారం ఎత్తినాడు. అంటే బుద్ధుడు పాదములో విష్ణుమూర్తి పాదములో ఏదో తెలియని మర్మ రహస్యం ఉన్నదని నాకు స్పురణ కలిగినది. అది ఏమిటో తెలియాలంటే నాకున్న శ్రీకృష్ణుడు అడ్డుగా చూపించే శ్రీకృష్ణ ప్రేమ మాయ దాటాలి అనుకునేసరికి ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. 

ఇది ఇలా ఉండగా ఓంకారము శంఖ సాధనతో చేస్తున్నాను కాని సంతృప్తి నివ్వడం లేదు. నేను శంఖం ఊదుతుంటే కుక్క అరుపు లాగా వినపడుతోంది అని మా ఇంట్లో వాళ్ళు అన్నారు. శంఖం ఊదాలంటే దమ్ము నేర్పు ఒడుపు ఉండాలని మన పెద్దలు అన్నారు కదా. ఎలాగైనా శంఖం నుండి లోకానికి ఓంకారం అనుభవించాలన్న తపన నాలో మొదలైంది. అభ్యాసం ఆరంభమైనది. మొదటి రోజే ఒకడు మా వీధిలో చనిపోయాడు. దానితో నా శంఖం సాధన శవాల ముందు ఊదే శంఖం ధ్వనిలాగా మారుతుందా అనే సందేహం రాక తప్పలేదు. అయినా మంచిదే కదా. ఎందుకంటే నేను కూడా శాశ్వతమరణం ఇచ్చే శూన్యబిందువు దగ్గరకు వెళ్లాలని ఓంకార శంఖనాదం అభ్యాసం చేస్తున్నాను కదా అని నా మనస్సుకు సమాధానం చెప్పుకున్నాను. ఇలా ఈ సాధన అభ్యాసంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఇంటర్నెట్లో శంఖాల గురించి వెతుకుతుండగా ఎందుకు అంటే బుద్ధుడుకి అలాగే విష్ణువు పాదముద్రలులో తప్పనిసరిగా మహా శంఖం ఉన్నట్లుగా కనిపించడం తో ఈ శంఖం గురించి ఇంటర్నెట్ లో వెతకడం ఆరంభించాను. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసింది. అది ఏమిటంటే సహజముగా మనం ఊదే శంఖంలను కూడా కుడిచేతితో పట్టుకొని ఊదటం జరుగుతుంది. కానీ ఎడమచేతితో ఊదే మహా శంఖం అనేది ఒకటి ఉంటుందని గ్రహించాను. కానీ విచిత్రం ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకుని ఉండే శంఖాలు వామాపురి శంఖాలు అని వీటిని ఊదటానికి రంధ్రము ఉండదని కేవలం ఎడమ వైపు పట్టుకునే వీలు ఉంటుందని వీటిని పూజ శంఖాలు అంటారు అని తెలుసుకుని నిరుత్సాహపడ్డాను. కాని పాదముద్రలలో కనిపించే ఎడమచేతివాటం శంఖం ఉన్నట్లుగా సూచన కనబడుతోంది. కానీ నాకు ఎడమ వైపు ఉన్న శంఖాలు ఉన్న అవి ఊదటానికి రంధ్రము లేదు. 

చచ్చింది గొర్రె అనుకుని అన్ని విషయాలు మా యోగ మిత్రుడైన జిజ్ఞాసికి చెప్పితే వాడు వెంటనే “స్వామి! అలా అంటారు ఏమిటి. నేను సన్యాసదీక్ష ప్రారంభ సమయంలో ఎడమ వైపు పట్టుకుని ఊదటానికి వీలుగా ఉండే శంఖం మీ దగ్గరికి తీసుకుని వస్తే దానిని భరించడం నా వల్ల కాదు అని చెప్పటంతో మీరే భరించలేం అన్నప్పుడు  ఇంకా నా వల్ల ఏమవుతుంది అని భయపడి మా ఊరి అమ్మవారైన భ్రమరీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పెద్దదైన మహా శంఖమును కానుకగా ఇవ్వడం జరిగినది. వాడు అటుంటే నాకు ఎక్కడో ఏదో కాలినట్లు అనిపించింది. అంటే ప్రకృతి మాత నాకు ముందుగానే ఇలాంటి మహా శంఖమును వీడి ద్వారా నాకు పంపిస్తే దానిని అర్థం చేసుకోకుండా అవివేక బుద్ధి వలన దానిని కోల్పోయాను అనిపించగానే ఏదో తెలియని ఆవేదన బాధ నన్ను ఆవరించాయి. కొన్ని రోజులుగా నేను కోలుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఇట్లాంటి శంఖం గురించి మళ్ళీ ఇంటర్నెట్లో వెతకగా ఒక చోట ఉన్నట్లుగా కనిపించడం దానిని కొని తెప్పించడం జరిగినది. విచిత్రమేమిటంటే ఈ శంఖం మీద ఏకీకృత సుదర్శన చక్రం ఉంటుంది. దీని మధ్య బిందువులో రంద్రం చేసి మనకు వీళ్ళు పంపించారని అన్ని శంఖాలకు కూడా రంధ్రము ఉండదని ఊదటానికి వీలుగా రంధ్రమును చేసి అమ్ముతారని అమ్ముతారు అని గ్రహించాను. ఇక దీనిని ఊదుతుంటే నా సామిరంగా దీనినుండి శంఖనాదం చాలా స్పష్టంగా వినిపించేది. ఏదో తెలియని ఆనందం వేసింది. దీనితో కొన్ని రోజులు గడిచిపోయినాయి. 
 
నాకు అర్థంకాని అష్టాంగములోని పాదముద్ర అష్ట చిహ్నాలు అర్థంకాని చిక్కుముడిలాగా ఉండిపోయినాయి అనే బాధాపూరిత ఆలోచన నాలో మొదలైంది. ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యం ఉందని ఖచ్చితంగా అర్థమవుతోంది. లేకపోతే విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, పతంజలి, బుద్ధుడు పిచ్చివాళ్ళా? వాళ్లు తెలుసుకున్న అష్ట చిహ్నాలు మర్మమును ఇలా ఈ పాదముద్ర చిహ్నాలులో ఉంచినారని నాకు అర్థం అవుతోంది. కాకపోతే వచ్చిన సమస్యల్లా ఉన్న అష్ట చిహ్నాలు అందరికీ వేరువేరుగా ఎందుకు ప్రతిపాదించినారో అర్థం కావటం లేదు. ఇది నాకు తెలియాలి అంటే శ్రీకృష్ణ మాయ దాటాలి. ఎలా దాటాలని ఎవరికి తెలియదు. దాదాపుగా 99.99% సాధకులు ఈ మాయను దాటలేకపోయినారని నేను గ్రహించాను. నేను దాటుతానో లేదో నాకే తెలియదు. 

విచిత్రమేమిటంటే ఉజ్జయిని క్షేత్రంలో మహాకాలుడు లింగము క్రింద శంఖు యంత్రము ఉంటుందని ఈ మధ్యనే తెలుసుకోవడం జరిగినది. అంటేశంఖనాదం లోనే అంతా ఉంటుందని నాకు స్పురణ అయినది. లయ కర్తను తన అదుపులో శంఖు యంత్రము ఉంచడం జరుగుతుందని అర్థమైంది. శాశ్వత మరణం ఇచ్చే శూన్య బిందువు దగ్గరికి వెళ్ళాలి అంటే అలాగే శ్రీకృష్ణ మాయ లీలా విన్యాసము దాటాలి అంటే ఎందుకంటే శ్రీ కృష్ణుడి చేతిలో పాంచజన్య శంఖం ఉంటుంది కదా. అంటే శంఖములోనే అంతా ఉందని నాకు అర్థమైనది.శంఖ నాద అభ్యాసం కొనసాగుతుండగా ఒకరోజు నాకు ఇంటర్నెట్ లో సుదర్శన చక్రమును గురించి వివరించిన చిత్రం ఒకటి బాగా ఆకర్షించింది. 

దీని ప్రకారంగా చూస్తే సుదర్శన చక్రము నందు చుట్టూ వెయ్యి త్రికోణాలు ఉంటాయని ఆపై లోపల అష్టదళపద్మం ఒకటి ఉన్నట్లుగా దీనిలోపల 6 సుదర్శన చక్రాలున్న షట్ కోణ యంత్రము ఉన్నట్లుగా ఈ ఆరు త్రికోణాల లోపల ఆరు త్రినేత్రాలు ఉన్నట్లుగా మళ్ళీ ఈ షట్ కోణము లోపల అష్టాంగ భాగాలు ఉన్న ధర్మ చక్రం ఉన్నట్లుగా దీనిలోపల గాఢ అంధకారమైన శూన్య బిందువు ఉన్నట్లుగా గీసి ఉన్నది. అంటే నా సామిరంగా! బయటికి కనిపించే ఏకీకృత సుదర్శన చక్రము అంతర్గతంగా ఇన్ని ఉపభాగాలు ఉన్నాయా? అనుకోగానే నా గుండె కాయ ఒక లిప్త కాలం పని చేయలేదు. వామ్మో! ఇదంతా చిన్న చక్రములో ఎంత మర్మ రహస్య భాగాలున్నాయో గదా అనిపించింది. దానితో నా జ్ఞాన స్పురణతో ఈ పటమును విశ్లేషించడం ఆరంభించాను. అనగా 1000 త్రికోణాలు అంటే ప్రారబ్ద కర్మ బంధనాలు వీటినుండి సంపూర్తిగా కర్మబంధ విముక్తుడైన విముక్తి  దేహి జీవుడే ఈ చక్రము నందు ప్రవేశించే అర్హత యోగ్యత సంపాదించాలని నేను గ్రహించాను. ఇక అష్టదళ పద్మము అంటే అష్ట పాశాలు లేదా అష్ట ప్రేమలు లేదా అష్టలక్ష్ములు లేదా లేదా అష్ట సతులు లేదా అష్ట మాయలు కావచ్చును.ఇక ఆరు సుదర్శన చక్రాలు అంటే అరిషడ్వర్గాలు కావచ్చును. 

ఇక షట్ కోణము మహాగణపతి కావాలి. ఎందుకంటే శ్రీ చక్రంలోని షట్కోణమును మహాగణపతి అంటారు కదా. అలాగే ఈ షట్ కోణములోని త్రినేత్రాలు పంచభూతాలు మరియు కాలమునకు సంకేతాలు కావాలి.  ఇక అష్టాంగ భాగమున్న చక్రమునందు ఏమీ లేవు అంటే శూన్యం అయ్యుండాలి. అనగా మూల ప్రకృతి కావాలి. ప్రకృతి ఏర్పడాలంటే అష్ట భాగాలు అనగా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము వలన ఈ మూలప్రకృతి ఏర్పడుతుందని శాస్త్రవచనం కదా. అంటే ఈ మూల ప్రకృతికి ఆధారమైన గాఢాంధకారములో పరమ శూన్య బిందువు మధ్య బిందువు అని నేను గ్రహించాను. ఈ మధ్య బిందువు దగ్గరికి అనగా శూన్య బిందువు దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వారే శూన్య బ్రహ్మ అవుతారని వీరి స్పందన, సంకల్పము, ఆలోచన, ఆశ, భయమును బట్టి అష్టాంగ భాగాలున్న మూలప్రకృతి ఉంటుందని అందుకే ఈ భాగాలందు ఏమీ లేవని ఎవరి ఆలోచన తగ్గట్లుగా అవి ఉన్నట్లు భ్రమలు కలిగిస్తుందని అందువలన పతంజలి, బుద్ధుడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తికి వేర్వేరు భావ ఆలోచనలు కలిగి ఉండటంతో వారికి తగ్గట్టుగా ఈ అష్టాంగ భాగాలలో చిహ్నాలతో మార్పులు ఏర్పడినాయని గ్రహించడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. 

అంటే బుద్ధుడు చెప్పిన అష్టాంగ వస్తువులు మధ్యలో శూన్యం స్థానంలో ఈయన ఉండటం దాని బట్టి చూస్తే తన హృదయ చక్రం లో కనిపించే అష్టదళపద్మం ఇష్ట కోరిక వద్ద ఆగిపోలేదని బ్రహ్మరంధ్రము వరకు దర్శనమిచ్చే అంతిమ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములోని అష్టదళ పద్మం వరకు వచ్చినాడు అని శూన్య బిందువు వద్దకు చేరి శూన్యబ్రహ్మగా మారి కోరికలు లేని సమాజం చూడాలని సంకల్పం చేసినారని యదార్ధ ప్రకృతి దృశ్యముగా మారడానికి 10 లక్షల బిలియన్ బిలియన్ బిలియన్ ఇలా 11 సార్లు బిలియన్ సంవత్సరాలు పడుతుందని…. ఇది ఆయన గ్రహించలేక పోయినారని అనుకున్న వెంటనే ఈ ప్రకృతిలో మార్పు వస్తుందని అనుకున్నారని ఇది త్వరగా జరగకపోయేసరికి ఆవేదనతో మహా నిర్యాణం చెందినారని కాని ఆనాడే శూన్యబిందువు నుండి ఇలలో క్షణమే తను అనుకున్న మార్పు కనిపించదని ఇది కాస్త ఇలలో మారడానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ప్రకృతిలో తన సంకల్పం కనపడుతుందని ఆ మహానుభావుడు గ్రహించలేక పోయినాడు. అనగా దేవతలకు ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం తో సమానం కదా. అదే శూన్యబ్రహ్మకు ఒక క్షణం అంటే మనకి 10 మహా కల్పాలతో సమానం కదా.ఒక యుగము అంటే లక్షల సంవత్సరాలు.అదే మహా కల్పం అంటే కోట్ల కోట్ల సంవత్సరాలు ఉంటుంది కదా. కాకపోతే వీరి సంకల్పం మనకు విధి వ్రాతగా ప్రకృతి ఏర్పరచునని గ్రహించండి.

ఎవరైతే శూన్య బ్రహ్మ అవతారో వారే సృష్టి స్థితి లయ కర్త గా త్రిముఖ ఈశ్వరుడు అయిన త్రిముఖ దత్త అవతారుడిగా మారతారని గ్రహించండి. వీరే విశ్వసృష్టికి విధాతగా విశ్వాత్మగా ఉంటారు. మీరు కూడా నేను కూడా విధాత గా విశ్వ బ్రహ్మదత్తుడు గా మారవచ్చును అన్నమాట.షట్ కోణములోని ఆరు త్రినేత్రాలు కలవాడు దత్తుడు అన్నమాట. ఈయనకు మూడు ముఖాలు ఆరు కళ్ళు ఆరు చేతులు ఉంటాయి కదా. 

అంటే పూరి జగన్నాథ్ గుడి గోపురం మీద ఉన్న సుదర్శన చక్రమును బట్టి చూస్తే శ్రీకృష్ణుడు కూడా శూన్య బ్రహ్మ గా మారినాడని అర్థమవుతుంది కదా. అందుకే భగవద్గీతయందు నేను కానిది నేను లేనిది ఏమీ లేదని అంతా నేనే ఉన్నానని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా మనకి అది అర్థం అవ్వలేదు.శూన్య బ్రహ్మ అయినప్పుడు అన్నిటి యందు మీలో నాలోని ఈ విశ్వములోను కనిపించే ఈ ప్రకృతిలోను అంతర్గతంగా శూన్యం ఉంటుంది గదా. ఇప్పుడు ఆయన లేనిది కానిది ఏమీ ఉండదు కదా. అన్నీ ఆయనే ఉంటాడు కదా. ఇదే విషయం మనకి ఆనాడే జగద్గురువుగా శ్రీకృష్ణుడు చెబితే ఆనాడు నాకు అర్థం అవ్వలేదు.ఇక్కడిదాకా వచ్చేదాకా నాకు తెలియరాలేదు. కాకపోతే ఈ మహానుభావుడు ఎవరు పడితే వారు శూన్యబిందువు దగ్గరికి వెళ్లకుండా నానా విధాలైన అష్టాంగ మాయలు పెట్టి వాటిని దాటిన వారికి అర్హత యోగ్యత కలిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారని ఆదిలో వచ్చే తొలి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అదే అమ్మవారు జగన్మోహిని రూపంలో చేసిందని నాకు జ్ఞాన స్పురణ కలిగినది. యుగానికి ఒక్కడు మాత్రమే శూన్యబ్రహ్మగా మారతాడని వీరి సంకల్పమే ఆ తర్వాత యుగంలోని వారికి విధిరాతగా మారి దానికి అనుగుణంగానే ప్రకృతి ఉంటుందని నేను గ్రహించాను. హమ్మయ్య. ఇక దీనితో సుదర్శన చక్రం గురించి తెలిసినది. 

ఇక శ్రీచక్ర బిందువు లోనికి ప్రవేశించే టప్పుడు శ్రీకృష్ణ మాయ తట్టుకోవాలి అని గ్రహించాను. కథ మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీకృష్ణ ప్రేమ మాయ దాటితేగాని లోపలికి అదే కృష్ణ బిలములోనికి అనగా శూన్యమునందు ప్రవేశించటానికి అర్హత రాదు. ఇది ఎలా వస్తుందో తెలియదు.

ఇది ఇలా ఉండగా ఒకరోజు అప్పటికే నా దగ్గరికి చేరి ఉన్న పాతకాలపు శంఖాలు అలాగే సుదర్శన చక్రాలు అన్నింటిని ఒక చోట చేర్చి వాటి గురించి తెలుసుకోవడం ఆరంభించాను. నా బొంద. నా బూడిద. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం చూశానో ఆనాటి నుండి నా బ్రతుకంతా సుదర్శన చక్రాలు అలాగే శంఖాలు వెతకడంలోనే సరిపోతుంది. నిజమైన వాటిని ఇంటర్నెట్లో వెతికి వాటిని కొని తెప్పించుకొని వాటిమీద పరిశోధనలు చేయడమే ఈ చక్ర ధ్యానముగా మారినది. శంఖాలు ,సుదర్శన చక్రాల గోల ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. దానితో నాకు వచ్చిన సుదర్శన సాలగ్రామాలు శంఖాల గురించి ఇంటర్నెట్లో పరిశోధన చేస్తుండగా అప్పటికే నా దగ్గరికి వచ్చిన ఓ మహా శంఖము గురించి ఒక విషయం తెలిసింది. 

అది ఏమిటంటే ఈ శంఖం మహాగణపతి శంఖమని దీనిని ఊదితే ఓంకారనాదం వస్తుందని ఎందుకంటే గణపతి ఓంకార స్వరూపుడు కావడం వలన ఈ శంఖం ధ్వని ఓంకార నాదం ఇస్తుందని గ్రహించి ఆనందపడి ఈ శంఖం ఊదటము ప్రారంభించాను. ఇది ఊదటం అంత తేలిక కాదని దీనికి బాగా సాధన అభ్యాసం ఉండాలని గ్రహించాను. ఈ శంఖము మన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములో ఉన్న షట్ కోణ (గణపతి రూపము)యంత్రము దగ్గరికి తీసుకు వెళుతుందని నాకు జ్ఞాన స్పురణ అయినది. ఇక దానితో ఈ గణపతి శంఖనాదం అభ్యాసం చేయటం ఆరంభించాను. 

ఆ తర్వాత నాకు వచ్చిన సాలగ్రామాలు చూస్తే అప్పటికే రెండు పెద్ద సాలిగ్రామాలు రెండు చిన్న సాలగ్రామాలు అలాగే రెండు శంఖాల మీద సుదర్శనచక్రం చిహ్నాలు ఉండటంతో మొత్తం ఆరు సుదర్శన చక్ర చిహ్నాలు నా దగ్గరికి చేరినాయని ఇవి బ్రహ్మాండ చక్రములోని కృష్ణ బిలములో లో కనిపించే ఆరు సుదర్శన చక్రాలతో సమానం అని గ్రహించాను. అలాగే ఈ కృష్ణబిలం నందు కనిపించే అష్ట దళపద్మమును మనం ఇష్టపడ్డ ఇష్ట కోరిక మాయలు హృదయ చక్రంలో దాటడంతో అక్కడ ఉన్న అష్ట దళ పద్మమే ఈ బిలము నందు అష్టదళపద్మం అని గ్రహించాను. అంటే నాకు ఈ కృష్ణ బిలము నందు శూన్యబ్రహ్మగా మారే యోగ్యత ఉన్నదని నాకు వచ్చిన దైవిక వస్తువులు చెప్పకనే చెబుతున్నాయి. 

పైగా విచిత్రమేమిటంటే చాలా అరుదైన ఆరు చిల్లులు ఉన్న సాలగ్రామము అదే దత్త సాలగ్రామము కూడా నాకు దొరికింది. ఇదియే ఈ బిలములో ఆరుత్రినేత్రాలు ఉన్న భాగం అని గ్రహించాను. ఇది చాలా మందికి ఈ సాలగ్రామము ఉంటుందని తెలియదని దీనిని కొంతమంది సీతారాములు సాలగ్రామమని మరి కొంతమంది లక్ష్మీనారాయణ సాలగ్రామమని అంటారని ఇది దొరికిన వారు మాత్రమే శూన్యబ్రహ్మగా అయ్యే యోగ్యత లభిస్తుందని నాకు ధ్యాన స్పురణ అయినది. నా సామిరంగా. అరుదైనది ఎవరికీ దొరకని ఈ దత్త సాలగ్రామము కూడా నా దగ్గరికి చేరినది కానీ ఈ చక్ర బిలములోనికి ప్రవేశించే అర్హత లభించకపోవడం విచిత్రంగా ఉందే?... సప్త సముద్రాలూ ఈది ఇంటి వెనక ఉన్న చెరువులో చచ్చినట్లు ఈ బిలములోనికి  ప్రవేశించి బ్రహ్మ గా మారే యోగ్యత ఉన్నప్పటికీ ఇంకా దీని లోపలికి ప్రవేశించే అర్హత అదే శ్రీకృష్ణ మాయ ఎలా తట్టుకోవాలో తెలియకపోవడంతో విచిత్రమైన చిక్కుముడి సమస్యగా మారిందని గ్రహించాను. ఏమి చేద్దాం… అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా పొందటానికి యోగ్యత ఉంది. వెళ్లడానికి అర్హత లేదంటే ఏమనాలి. ఐఏఎస్ పాస్ అయ్యాను కానీ దీనికి అర్హతైనా డిగ్రీ తప్పినట్లుగా ఉంది నా పరిస్థితి. దీనెమ్మ జీవితం. మాయలో పడి సాధన ఆగిపోతే పర్వాలేదు. ఇక్కడ మాయ లేదు మర్మము లేదు. కాని సాధన ముందుకు వెళ్ళటం లేదు. నా బొంద. నా బూడిద.నా  బ్రతుకును ఏమనాలి. ఏమనుకోవాలి. అందుకే దీనిని విష్ణుమాయ కృష్ణమాయ అన్నారు. ఈ కృష్ణమాయను దాటితేగాని కృష్ణబిలం లోనికి ప్రవేశించలేము. మరి నేను ఈ మాయను దాటినానో లేదో తెలియాలంటే మీరు ఏమి చేయాలో తెలుసు కదా. 

శుభం భూయాత్
పరమహంస పవనానంద
*********************************************
గమనిక: ఇక్కడ ఈ అధ్యాయములో చాలామందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే నేను ఇంటర్నెట్లో వెతికి ఈ కృష్ణబిల వస్తువులు తెప్పించుకొన్నానని మరి అవి దైవిక వస్తువులు ఎలా అవుతాయి అని సందేహం రావచ్చు. నిజానికి నా దగ్గరికి అప్పటికే వీటికి సంబంధించిన దైవిక వస్తువులు చేరినాయి. ఉదాహరణకి ఎడమ చేతితో ఊదే దక్షిణావృత శంఖము నా దగ్గరికి వస్తే దానిని నేను భరించడం నా వల్ల కాదని జిఙ్ఞాసికి తిరిగి ఇచ్చే వేయటం వాడు దానిని అమ్మవారి గుడిలో కానుకగా ఇవ్వడం జరిగింది అని తెలుసుకున్నారు కదా. అంటే మొదట ప్రకృతి మాత నాకు ఈ దైవిక వస్తువులు స్వయంగా పంపించినది. కానీ నా అవివేక బుద్ధి వలన వాటిని కోల్పోయాను. ఎప్పుడైతే దీని గురించి తెలిసిన వెంటనే ఇంటర్నెట్లో వీటికి సంబంధించిన వాటిని వెతికి పోయిన శంఖంలాంటి శంఖమును తిరిగి పొందడం జరిగినది. అంటే మొదట ప్రకృతి నాకు ప్రసాదించినది అనివార్య కారణాల వల్ల దానిని కోల్పోయాను.విషయం తెలిసిన తర్వాత వాటిని నా పరిశోధనల ఫలితంగా వెతికి పట్టుకుని తిరిగి పొందడం జరిగినది అని గ్రహించండి. అంతేగానీ నేను ప్రకృతిమాత ప్రసాదించకుండా ఏ వస్తువులు వెతికి తెప్పించుకోలేదు అని గ్రహించండి. ఇలా అయితే ఇంటర్నెట్ లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.రుద్రాక్షల దగ్గర నుండి కపాలమాలల వరకు సాలగ్రామాలు నుండి మహా శంఖాలు వరకు అన్నీ దొరుకుతాయి. కానీ వీటిలో ఏది మనకు అవసరం పడుతుందో ఏది మనకు ఉపయోగపడుతుందో ఏది మనకు సరిపోతుందో మనకే తెలియదు. కావున మొదట మనకు ఉపయోగపడే సరిపడే సరియైన దైవిక వస్తువులు ప్రకృతి మొదట మొదట మనకు ప్రసాదించాలి. ఒకవేళ వీటిని కోల్పోయిన లేదా పగిలిపోయిన లేదా దొంగిలించబడిన కూడా ఇలాంటి రూపురేఖలు ఉన్న నిజమైనవి ఇంటర్నెట్లో వెతికి పట్టుకుని తెప్పించుకుని వాడుకోవచ్చును. ఇంటర్నెట్ లో 80% నిజమైన వాటికి నకిలీలు ఉంటాయని గ్రహించండి. తస్మాత్ జాగ్రత్త. అసలు మొట్టమొదట మీకు ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన ఇలాంటి అనేక వస్తువులను ఫోటోలు తీసి దాచి పెట్టుకోండి. ఒకవేళ వీటికి ఏమైనా జరిగితే అప్పుడు ఈ ఫొటోల ఆధారంగా మీరు ఇంటర్నెట్లో వెతికి అలాంటి వాటిని కొని తెప్పించుకోవచ్చు. అందరికీ అన్ని వస్తువులు సరిపడవని గ్రహించండి.

ఇక కృష్ణబిలం యందు కనిపించే షట్ కోణము స్త్రీ పురుష సంయోగం అని గ్రహించండి. అలాగే చిన్న అలాగే పెద్ద సాలగ్రామాలు వస్తాయని అనగా 3 చిన్నవి మీకు వస్తే మీరు అమ్మవారి శక్తిగానూ అదే ఒకవేళ మీకు మూడు పెద్ద వస్తువులు వస్తే పురుషశక్తి గా భావించుకోవాలి.విచిత్రం ఏమిటంటే నాకు మూడు రకాల పెద్ద వస్తువులు అందితే అనగా శివస్వరూపము అదే మన జిజ్ఞాసికి మూడు చిన్న వస్తువులు అనగా శక్తి స్వరూపంగాను మారడం జరిగినది. దానితో మాకు ఆరు రంధ్రాలు ఉన్న మూడు జతలు ఉన్న దత్త సాలగ్రామం దొరకడం జరిగినది. అంటే ఈ బిలము నందు దేవుడు భక్తుడు లేదా గురువు శిష్యుడు అనే స్థితిలో సాధన చేస్తే ఇద్దరు కలిసి రావడం జరుగుతుంది అని గ్రహించండి. కాబట్టి అంతిమయాత్ర సాధన పరిసమాప్తి లో గురువు శిష్యుడు కలవక తప్పదని నాకు అర్థమైనది. అప్పటిదాకా మీకు గురువుగా ఉన్నవాడు తప్పుకున్న లేదా శిష్యుడిగా ఉన్నవాడు తప్పుకున్న మీరు శూన్యబ్రహ్మగా మారే అర్హత యోగ్యత లేదని గ్రహించండి. అంతటితో మీ సాధన పరిసమాప్తి అయినట్లే అని గ్రహించండి.ఒక నిజ గురువుకి ఒక నిజ శిష్యుడు మాత్రమే ఉంటాడు అని గ్రహించండి.
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి