నేను ఎవరిని?
నా జీవితంలోనికి యోగ మిత్రుడైన జిజ్ఞాసి అనే వ్యక్తి ప్రవేశించినాడని మీకు తెలుసు కదా! వాడు అడిగిన క్షణాలలో జాతకం చెప్పేసరికి… నాలో ఏదో తెలియని మహత్తరమైన శక్తి ఉన్నదని గ్రహించి… చిరునవ్వుతో “స్వామి! నేను ఎవరిని?” అని ప్రశ్నించాడు! నేను వెంటనే యధాలాపంగా “నీవు ఎవరో నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది… మిత్రమా” అన్నాను! దానికి అతను వెంటనే “అలా కాదు స్వామి! ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే యోగ సాధన పరిసమాప్తి అవుతుంది” అన్నాడు! నాకు చాలా ఆశ్చర్యం వేసింది! ఏమిటి “నేను ఎవరిని” అని తెలుసుకుంటే యోగసాధన అయిపోతుందా! అదేమన్నా బ్రహ్మవిద్యా తెలుసుకోవడానికి! నా బొందా, నా బూడిద! ఇది ఒక ప్రశ్న… దానికి నేను సమాధానం చెప్పాలా అనుకుంటూ… నేను ఫలానా వ్యక్తిని అన్నాను! దానికి అతను వెంటనే “నువ్వు ఎవరు” అని అడగటము లేదు! నేను అనేది ఏమిటి అని అడుగుతున్నాను! వెంటనే నేను “ఫలానా తల్లిదండ్రులు పుట్టిన వాడిని” అన్నాను! దానికి అతను “నువ్వు ఎవరికి పుట్టినావు అని అడగటం లేదు” అన్నాడు! దీనమ్మ జీవితం అనుకుంటూ… “నేను ఫలానా చదువుకున్న వ్యక్తిని” అన్నాను! నువ్వు “చదువుతున్నావా లేదా ఏమి చదువుతున్నావు అడగటం లేదు” అన్నాడు! నేను ఎవరిని అని చెప్పకుండా… కేవలం నేను అనేది చేసే పనులు… నేను ఏర్పడిన వ్యక్తుల గురించి మాత్రమే చెబుతున్నానని నాకు అర్థం అయింది! వామ్మో ఇది చిన్న ప్రశ్న కాదు చిక్కు ప్రశ్న లాగా ఉంది! వెంటనే అతనితో “అయితే దీనికి ఎవరైనా సమాధానం చెప్పినారా?” అని అడిగాను!
దానికి అతను అరుణాచలక్షేత్ర వాసి మౌనయోగి అయిన రమణ మహర్షి వారి “నేను ఎవరిని” పుస్తకం చేతిలో ఉంచి ఆయన ఈ ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కు ని పునర్జన్మ రహితమైన ముక్తిపధమును చేరుకున్నాడు” అని చెప్పి వెళ్లిపోయాడు! ఇది యే నా తొలి ఆధ్యాత్మిక సాధన గ్రంథం! చదవడం ఆరంభించాను! అయితే ఇది ఒక పట్టాన అర్థం కాలేదు! అర్ధమై అర్థం కానట్లుగా అనిపించింది! ఆ తరువాత కొన్ని రోజులకు జిజ్ఞాసి మళ్లీ నా దగ్గరికి వచ్చి “స్వామి! ఇప్పటికైనా నేను ఎవరిని తెలుసుకున్నారా” అన్నాడు! నేను వెంటనే “ఏమిటి తెలుసుకునేది నా బొంద! చిన్న ప్రశ్న అని చెప్పి జీవితానికి కట్టిపడేసే ముడి ప్రశ్న వేసినావు! నువ్వు ఇచ్చిన గ్రంథము చదివితే… అది అర్థమై అర్థం కానట్లుగా ఉంది! ఆయనేమో నేను ఎవర్ని అనుకోవద్దని… నేను గురించి తెలుసుకోవాలని అంటున్నారు! ఎలా తెలుసుకోవాలో మరింత వివరంగా చెప్పలేదు! అతను వెంటనే “ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే… అదే తెలుస్తుంది కదా! నేను అనే ప్రశ్న ఎక్కడ ఉద్భవించినదో … అదే ఎక్కడ పుట్టినది…. అసలు ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారో… మూలం తెలుసుకుంటే సరిపోతుంది కదా”… అని జిజ్ఞాసి నాతో అన్నాడు! అవును కదా ఇది కూడా నిజమే అనిపించింది! దానితో కొన్ని నెలల పాటు నేను ఎవరిని అనుకుంటూ… మేమిద్దరం విచారణ చేసుకుంటూ…. ప్రశ్నలు వేసుకుంటే… అది కాదు ఇది…. ఇది కాదు అని అనుకుంటున్నాము! కానీ అది అంతుచిక్కలేదు! ఎక్కడా కూడా ప్రశ్నలు ఆగటంలేదు! సమాధానాలు ఆగటంలేదు! ప్రశ్న లేని సమాధానం… సమాధానం లేని ప్రశ్న కి వెళ్లాలని మా తాపత్రయం! అప్పుడే కదా ప్రశ్నించేది ఎవరు అనేది తెలుస్తుంది! అది తెలిస్తే నేను అనేది తెలుస్తుంది కదా! కానీ అది మేము అనుకున్న అంత తేలికైన విషయం కాదని మా ఇద్దరికీ కొన్ని నెలల తర్వాత అర్థమయింది! ఈ ప్రశ్నకి నిజమైన అర్థవంతమైన సంతృప్తికరమైన సమాధానం దొరికే సరికి… మా జీవితం అనంతలోకాలకు పరిప్రశ్న లాగా మిగిలిపోయి వెళ్లిపోతుందని గ్రహించి…. యోగ సాధన ఇలా కాదనుకుని నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ కర్మ- భక్తి- జ్ఞాన- ధ్యాన-కుండలిని మార్గంలో మొదటిది అయిన కర్మ మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! ఇకపై ఏమి జరిగిందో మీకు తెలియాలంటే … మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!
శుభం భూయాత్
పరమహంస పవనానంద
***********************
నేను అనేది తెలుసుకోవడం ఎలా అని భగవాన్ శ్రీ రమణ మహర్షి మాటల్లోనే విందాం! పరమాత్మ…. బింబం అయితే నువ్వు ఆయన ప్రతిబింబమని గుర్తుంచుకో! నువ్వు పక్కలకు చూడటం మాని… బ్రహ్మం అయిన పరమాత్మ వైపు చూస్తే…. నీ వైపు చూసినట్లు కదా! బ్రహ్మం వైపు చూస్తేనే తన్నుతాను చూసుకోవడం, చూడటం జరుగుతుంది కదా! అలా చూస్తే…. ఏం తెలుస్తుంది అనుకున్నప్పుడు…. బ్రహ్మమనగా పరమాత్మ ఎప్పుడు నీవైపే చూస్తున్నట్లుగా తెలిసి వస్తుంది! పరమాత్మ అనుగ్రహం నిరంతరం నీ మీద ప్రసరిస్తూనే ఉందని గ్రహింపు వస్తుంది! నువ్వు ఆయన ప్రతిరూపమని… ఆయన లేకపోతే నువ్వు ఉనికి లేదని తెలుసు కుంటావు! అంటే నేను అనేది లేదని గ్రహిస్తావు! అద్ధము ఉన్నంతసేపే కదా మనకి బింబము మరియు ప్రతిబింబం దర్శనాలు కనబడేది! అద్ధమే లేకపోతే ఈ రెండు దర్శనాలు ఉండవు కదా! అద్ధము అంటే మన మనస్సు! ఇదే మహామాయ అన్నమాట! మన అంత: కరణమైన మన మనస్సు మాయం అవితే మాయ మాయం అవుతుంది! తద్వారా బింబం బింబము గానే మిగిలిపోతుంది! బింబం … ప్రతిబింబం అనే భావం నాశనమవుతుంది! ప్రతిబింబం తన ఉనికి బింబం అని అనుకోవడం… తన చూపు బింబము అని అనుకోవడం అనేది ఉండదు! బింబము బింబముగానే ఉన్నప్పుడు ప్రతిబింబము మాట అనేది ఉండదు కదా! బింబము బింబముగానే ఉన్నది! కానీ మన మనస్సు చేసే మాయ వలన బింబము కాస్త ప్రతిబింబముగా ఉన్నదని భ్రమ, భ్రాంతి కలిగిస్తుంది! మన మనస్సుకున్న మాయ, మోహ, వ్యామోహలు తొలిగిపోతే బింబము బింబమే గదా! బింబము బింబముగా ఉండటమే స్వరూపస్థితి కదా! పరమాత్మ పరమాత్మ గా ఉండటమే స్వస్థితి! కానీ మనస్సుకున్న మాయ వలన పరమాత్మ కాస్త జీవాత్మగా కనబడుతున్నాడు! పరమాత్మ పరమాత్మగా ఎరుక అవుతుందో వారిని తెలుసుకోవడం అవుతుంది! నీవే పరమాత్మని ఎరిగినవాడు నీవే దేవుడు అని…. అహం బ్రహ్మస్మి స్థితి … ఇదియే మనో రహిత స్థితి! మనస్సు లేని స్థితి! శూన్యస్థితి! స్వస్థితి! నీ సహజ స్థితి అని గ్రహించు! సాధించు! మనస్సు అనే మాయ అద్ధమును తొలగించు! బింబము మరియు ప్రతిబింబము భావాలను తొలగించు! ఉన్నది ఒకటే బింబము! అగుపించేది బింబమేనని గ్రహించు! నీవే ఆ బింబమని తెలుసుకో! తెలుసుకో నువ్వే ప్రతిబింబం కాదని గ్రహించి… నేను అనేది పరమాత్మ అని గ్రహించు!
*********************
గమనిక: కొన్ని నెలల తర్వాత "నేను ఎవరిని?" అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపిస్తుందో సరిగ్గా దానిని తెలుసుకోకపోతే అంత కష్టమైనది మరొకటి ఉండదని నా అభిప్రాయం! కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు నాకు స్ఫురణ భావాలు కలిగి నాయి! మనలో రెండు నేను లు ఉంటాయి! ఒకటి నేను! రెండోది నేను కానీ నేను! ఇందులో మొదటి నేను అనేది అహంకారపూరితమైన నాది ,నీది, మనది అనే భావన కలిగించే మనస్సు అని… ఇది మిథ్యనేను అని గ్రహించాను! ఇక రెండవది అయిన నేను కానీ నేను అనేది ఆత్మ! ఇదియే అసలు నేను అని గ్రహించాను! మొదటిది అయిన మిథ్యనేను అనేది అంటే అసలు నేను విస్మరించి మోహ, వ్యామోహ, ఆశ,భయం,ఆనందం,ఆలోచన, సంకల్ప, స్పందన అనే నానా రకాల బంధనాల్లో చిక్కుకుంటుందని గ్రహించాను! అసలు ఈ మిథ్యనేను అయినా మనస్సు ఎక్కడ ఉన్నది? ఎక్కడ నుండి పుడుతుంది అని తెలుసుకోవడమే రమణ మహర్షి చెప్పిన “నేను ఎవరిని” అనే ప్రశ్నకు సమాధానం అని గ్రహించాను! నేనెవర్ని ప్రశ్నకు సమాధానం వెతకడం అని గ్రహించాను! అంటే ఎల్లప్పుడూ నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ… ఆత్మ విచారణ చేసుకుంటూ పోతే… ధ్యానములో ఎడతెరిపి లేకుండా ప్రశ్నించుకుంటూ పోతే…. దీనికి తగ్గ సమాధానం కోసం మన లోపల అన్వేషణ అనగా ఆత్మ విచారణ చేసుకుంటూ పోతే… నేను అనేది మనస్సు లోపలకు వెళుతూ…. క్రమేపీ లోపలకు వెళుతూ…. స్ధిరమై ఏకాగ్రత వస్తుంది! దాని పుట్టుక స్థానానికి చేరుతుందని…. అనగా మన సాధన పరిసమాప్తి స్ధానమైన హృదయచక్రానికి చేరుతుంది!అంటే నేను ప్రయాణము మూలాధార చక్రముతో బయలుదేరి హృదయచక్రము వద్ద ఆగిపోతుందని---అదియే మన ఆత్మ స్ధానమని … అప్పుడే నేను కానీ నేను అనేది ఎవరో సాధకుడికి అనుభవ అనుభూతి కలుగుతుందని…. దీనినే యోగ శాస్త్ర గ్రంథాలు బ్రహ్మ లేదా ఆత్మసాక్షాత్కార మని చెప్పినాయని అని నేను గ్రహించాను! అంటే మనస్సు లేని స్థితి పొందితే… నేను అనేది లేదని… ఇదంతా మిధ్య అని… ఉప్పు బొమ్మను నీటిలో వేస్తే ….అదే ఎలా అయితే నీటిలో కరిగి పోయి బొమ్మ అనేది ఉండదో… అలాగే నేనెవరు అని నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే…. మొదట ఫలానా ఆలోచన అనే సమాధానం వస్తుంది! ఈ ఆలోచన కలిగినది ఎవరికీ అని ప్రశ్నించుకుంటే… నాకు అనే సమాధానం వస్తుంది! ఇది ఎవరికి వచ్చింది అంటే…. నా మనస్సుకి అనే సమాధానం వస్తుంది! మరి మనస్సు అంటే ఏమిటి అని అడిగితే…. అంటే ఇలా ప్రతిసారి నేను ఎవరిని అని విచారణ చేస్తూ ఉంటే… ఏదో ఆలోచన సమాధానాలు వస్తాయి! వీటినన్నిటినీ మనము ఇది కాదు అనుకుంటూ ఖండించుకుంటూ పోతే… చివరికి మనకి ఆత్మ అనే సమాధానం వస్తుంది! అప్పుడు మనకి అలవికాని ప్రశాంతత ఆనంద స్థితి అనుభవించటం జరుగుతుంది! ఇక్కడ ఈ ఆత్మ మాయలో పడకుండ ఉండగలిగి… అప్పుడు ఆగకుండా… ఈ ఆనందం ఎవరికి కలిగింది అని ప్రశ్నించ గల్గితే… తనకి తన ఆత్మకి భిన్నమైనది ఏమీ లేదని…. స్వానుభవ అనుభూతి పొందే దాకా నేను ఎవరిని అనే ప్రశ్నను కొనసాగించవలసి ఉంటుంది! దీని గురించి బాగా తెలియాలి అంటే… రమణ మహర్షి రమణాశ్రమ ప్రచురణ గ్రంధమైన "నీ సహజ స్ధితి ఉండు" చదివితే నేను ఎవరిని అను ప్రశ్నసాధనలో వచ్చే అన్ని రకాల సాధన సందేహలకి శ్రీ రమణామహర్షి వారు ఇచ్చిన సమాధానాలుంటాయి! చదవండి! ఈ సాధన లో వచ్చే అన్ని రకాల ధర్మ సందేహాలకు సమాధానాలు అందులో దొరుకుతాయి!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండి'Nenu' anedi ela thelsukovali thelsina time lo manasu maayalo padakunda chusukovali ani cheppatam, aa nenu anedi ardhamayyini anipinchi anubhavam podite kaani meeru ichina vishleshana sampoornanga arthamkaadani andulo entho depth undi... baaga chepparu...
రిప్లయితొలగించండి