అధ్యాయం 12

తొలి ప్రేమలు

 నా అనుకునే వాళ్లంతా… ఒక్కొక్కరుగా… నా నుండి దూరంగా అవ్వడం మొదలయ్యే సరికి… నేను ఒంటరిగా మిగిలి పోయే సమయంలో… తోడుగా తొలిప్రేమలు మొదలైనాయి! నేను ఒక విషయం నిజం చెబుతున్నాను! ఒక పక్కన యోగసాధన మీద ఎన్నో రకాల పరిశోధన చేస్తూనే… మరోపక్క చదువులూ… ఉద్యోగాలూ… వ్యాపారాలూ… పెళ్లి సంసార బాధ్యతలు అనుభవిస్తూనే యోగసాధనను పరిసమాప్తి చేసుకున్నాను! అన్ని రకాల సుఖ భోగాలు అనుభవిస్తూ…. శివారాధన చేసే వాడిని! మనస్సుకి యోగమును… శరీరానికి భోగమును ఇచ్చాను… అనగా దత్తాత్రేయస్వామి లాగా ఉండే వాడిని! మనస్సుకి ధర్మం తప్పకుండా, అన్నివిధాలుగానూ, ఇష్టమైన కోరికలు తీర్చే వాడిని! ఆనందపడే వాడిని! ఆ తర్వాత బాధపడే వాడిని! ఇబ్బందులు పడే వాడిని! అనుభవ పాఠాలు నేర్చుకునే వాడిని! ఆపై వాటికి స్వస్తి చెప్పే వాడిని! అది ఎందుకు చేయకూడదు? ఎందుకు ఇలా చేయాలి? అలా ఎందుకు చేయకూడదు? ఇలా నాకు నేనే ప్రశ్నలు వేసుకుని నానా తంటాలు పడే వాడిని! పరిశోధన చేసే వాడిని! ఫలితాలను రాసుకునే వాడిని! నమ్మినవారికి చెప్పేవాడిని! నమ్మిన వారి వద్దనుండి వారి కొత్త కోణాలను తెలుసుకుని ఆ విధంగా కూడా ఎందుకు పరిశోధించ కూడదని మళ్లీ పరిశోధన చేసే వాడిని! తిరిగి ఫలితాలు మార్చి రాసుకునే వాడిని! ఎవరికీ అర్థం కాని వాటిని ఎవరితోనూ చర్చించేవాడిని కాదు! నాలో నేను ప్రయత్నించేవాడిని! అమ్మ ప్రేమ నుండి అమ్మను చేసే ప్రేమ (భార్య ప్రేమ) దాకా అన్ని రకాల ప్రేమ భావాలు అనుభూతి పొందాను! ఇన్ని రకాల ప్రేమ లో నాకు బాగా నచ్చిన ప్రేమ మాత్రం ప్రేమికుల మధ్య నుండే  ప్రేమ భావానికి ప్రథమ స్థానం ఇస్తాను! వారి కోసం ఎదురు చూ సే ఎదురుచూపులు ,తీయని బాధలు, విరహవేదనను,అలకలు,కవ్వింపు చూపులు,కవ్వింపు చర్యలు,కవ్వింపు మాటలు,బుంగమూతులు,వెటకారపు మాటలు, ఇలా ఎన్నో భావాలు నాకు ఈ ప్రేమభావములో కనిపించినాయి! మిగిలిన ప్రేమభావములో అవసర ప్రేమలు, ఆర్థిక ప్రేమలు మాత్రమే కనిపించాయి!

నేను ఎనిమిదో తరగతిలో ఉండగా మా ఇంగ్లీష్ మాస్టర్ గారి కూతురుతో నాకు మొట్టమొదటి బాలా స్త్రీ మూర్తి పరిచయం అయింది! పేరు తారావళి! అందంగా, సన్నగా, నాజూగ్గా ఉండేది! ఎందుకో తెలియదు గాని… నాకు చిన్నప్పటినుండి చదివే ఆడపిల్లలన్నా, తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంటే ఆడపిల్లల న్నా ,సంగీతం నేర్చుకునే వారు ,లలిత కళలు అనగా కూచిపూడి, నాట్య కళలు నేర్చుకునే వారంటే నాకు ఇష్టంగా ఉండేది! వారితో మాటలు కలపాలని… వారితో స్నేహం చేయాలని ఉండేది! కానీ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు! అలాంటి వారు చాలా అరుదుగా నాకు అగుపించేవారు! ఇలాంటి కోవకి ఈ అమ్మాయి చెందినది! ఎందుకో తెలియదు! ఈమెతో  స్నేహం చేయాలని బాగా అనిపించింది! ఆమెకు తెలుగు రాదు! నాకు హిందీ రాదు! మా ఇద్దరి మధ్య వచ్చీ రాని భాష ఆధారమైనది! ఎక్కువగా సైగ భాష నడిచేది! ఆమెకు కూడా తెలివైన బాగా చదివేవారు అంటే విపరీతమైన ఇష్టం అని గ్రహించాను! ప్రేమ అంటే ఏమిటో… తెలియని నూనుగు మీసాలు వయస్సులో… మీసాల రాయుడు లాగా ప్రవర్తించేవాడిని! ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా… శివ పూజారిని కాస్త  ప్రేమ పూజారి గా మారి నాను! 
ఒకరోజు లెక్కల క్లాసు జరుగుతోంది! మాస్టర్ గారు ఒక లెక్కకి జవాబు చెప్పమని అందరిని అడగటం మొదలుపెట్టారు! నాకు దీనికి జవాబు రావడం లేదు! ఇంతలో నేను తారావళి కేసి చూస్తే … అది చేతి మీద వన్ ఫోర్ త్రీ…143… అని రాసి చూపించినది! అదే జవాబు అనుకుని నేను మా మాస్టర్ గారికి చెప్పటం… ఆపై తన్నులు తినడం జరిగినది! వన్ ఫోర్ త్రీ అనేది లెక్క జవాబు కాదని తెలిసి గతుక్కుమన్నాను! అప్పుడు ఆమెను అడిగితే …మొద్దు! అది జవాబు కాదు! 

143 అంటే ఐ లైక్ యు అన్నది! అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనేసరికి… ఇది నీకు ఎలా తెలుసు అంటే… దానికి ఆమె వెంటనే “ మా బావ నాకు చెప్పినాడు! అదే నేను నీకు చెప్తున్నాను! మీకు ఇష్టమేనా వన్ ఫోర్ త్రీ “ అన్నది! దీనమ్మ … దీని బావ దీనికి చెప్తే… అది వాడికి చెప్పకుండా నాకు చెప్పినది! నాలో ఏదో తెలియనితనం బాగా నచ్చి ఉంటుంది అనుకున్నాను! ఇలా ప్రతి రోజు బడికి రావడం…  ప్రతి పిరియడ్ ఖాళీ సమయాలలో… ఎవరూ చూడని సమయాలలో…  మా పుస్తకాలలో వన్ ఫోర్ త్రీ పేజిని తీసి ఒకరినొకరు చూపించుకొనేవాళ్ళం! దేవుడు ఆనందంగా ఉంటే ఊరుకోడు కదా! మా స్నేహం..  ఇష్టముగా మారి…  అది కాస్తా ఏదో తెలియని ప్రేమగా మారే లోపల…. మా మాస్టర్ గారికి ఆ ఊరు నుండి బదిలీ అయి వెళ్లిపోయారని…. వేసవి సెలవులు పూర్తి అయిన తర్వాత నాకు తెలిసినది! మళ్లీ మరో రెండు సంవత్సరాల దాకా నాలో మన్మధుడు నిద్రలేవలేదు! 

నేను పదవ తరగతి చదివే సమయంలో మా స్నేహితుడు దూరపు బంధువైన జ్యోతిర్మయి అని నాకు పరిచయం అయింది! ఇది విచిత్రమైన స్నేహం! ఈమె సంవత్సరంలో మా ఊరి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చి అయిదు గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది! మళ్లీ సంవత్సరానికి జరిగే జాతర సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించేది కాదు! అంటే ఇది జాతర స్నేహం! మొదట్లో మాట్లాడేది కాదు! వాళ్ల ఇంటి బయటకు వచ్చి… మా ఇంటి కేసి చూస్తూ… నేను ఎప్పుడు బయటకు వస్తానని గంటల కొద్ది ఎదురుచూపులు ఎదురు చూస్తూ ఉండేది! నేను కనబడితే అదోలా చూస్తూ… కనుసైగలతో అన్నీ మాట్లాడేది! కవ్వింపు చర్యలు… కవ్వింపు చూపులు ఉండేవి! గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి నాకు టాటా చెప్పి వెళ్లి పోయేది! అదియే ఆ సంవత్సరానికి ఆఖరి చూపు!! అంటే మళ్ళీ ఈమె కోసం సంవత్సరమంతా ఎదురుచూసే వాడిని! మళ్లీ యధావిధి అంతే! మాటలు ఉండవు! కనపడితే నవ్వటం! కవ్వింపు కళ్లతో ఎదురు చూపులు ఉండేవి! నేను మాట్లాడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఉపయోగం ఉండేది కాదు! అలాంటి సమయంలో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒకరోజు ఈమె నుండి ఒక ప్రేమ లేఖ అందుకోవడం జరిగినది! అదే నా జీవితంలో తొలి ప్రేమ లేఖ! అయితే ఆమె రాసిన భాష విధానం నాకు అర్థం కాలేదు! నా స్నేహితులు చాలా కష్టపడి చదివి నాకు వినిపించారు! అది తెలుగే కానీ తెగులు పట్టినది! తొలిప్రేమ సినిమాలో తమ్ముడు తన అన్న ప్రేమ కోసం రాసిన ఉత్తరం లాగా అర్ధమై అర్ధముగానట్లుగా వున్నది! నేను వెంటనే “ఏదైనా ఉంటే మాటల్లో చెప్పు… కానీ మళ్లీ ఎన్నటికి ఉత్తరం రాసి మమ్మల్ని చంపవద్దని… ఆమెకి తిరిగి ఉత్తరం రాసి ఇచ్చినాను! మాటలు కలిసినాయి! పరీక్ష ఫలితాలు వచ్చాయి! స్కూల్ ర్యాంకు రావాల్సిన చోట… ఫస్ట్ క్లాస్ మాత్రమే వచ్చింది! ఇంట్లో తిట్లు! మనస్సులో తీయని దురద! మరుసటి సంవత్సరం ఆమె నుండి ఉత్తరం రావాల్సిన చోట… శుభలేఖ వచ్చింది! నేను గతుక్కుమన్నాను! ఆమె మరో ఇంటిది అయినది! అయినా నాకు ఆనాడు బాగా బాధ అనిపించలేదు! ప్రేమంటే ఏమిటో తెలిసే వయస్సులు కాదని నాకు తెలుసు! కానీ ఏదో తెలియని బాధ అనిపించింది! మళ్లీ ఒంటరి వాడిని అయ్యాను! 

కాలేజీ చదువులకు వచ్చినాను! నూనుగు మీసాలు కాస్తా నల్ల మీసాలు అయినాయి!  ఏదో తెలుసుకోవాలని వయస్సులో… ఏవో అనుభవ అనుభూతులు పొందాలనే… తపన తాపత్రయాలు నా మనస్సుకి వచ్చేవి! రాత్రివేళలో మన మన్మధుడి ప్రభావం వల్ల… నాకు తెలియకుండానే అర్ధరాత్రిపూట గాఢనిద్రలో జరిగే ఒక విధమైన చర్య వలన నిద్ర పట్టేది కాదు! మనస్సు, వయస్సు ఉరకలు వే సే స్థితి! జీవితం ఉన్నత స్థితికి… అలాగే అధమ స్థితికి మధ్య వయస్సులో ఉన్నామని తెలుసుకోలేని స్థితి! ఏదో కావాలని… ఏదో ఒకటి పొందాలని… ఏవో అనుభవాల పొందాలని… స్నేహం కావాలని… ఓదార్పు మాటలు కావాలని… సానుభూతి కావాలని… మనస్సు మధన పడుతున్న సమయంలో… నా చదువు కొనసాగుతుండగా …
ఒకరోజు నాకు లాగానే ర్యాంకు కోసం తపనపడే నా సహచర విద్యార్థి అయిన రాధాదేవి నా దగ్గరకు వచ్చి నోట్ పుస్తకాలు కావాలని అడిగి తీసుకుంది! మాటలు కలిశాయి! స్నేహం పెరిగింది! ఆమె చెప్పే తీయని తీపి మాటలు వినాలని మనస్సు ఆరాటపడటం జరిగింది! ఆమెకి,నాకు  ప్రేమ గురించి ఎంతో కొంత జ్ఞానము కలిగి ఉండేది! సినిమాల ప్రభావం వలన నాకు ప్రేమ మీద, శృంగార సాహిత్య పుస్తకాలు చదవడం వలన వీటి మీద అవగాహన సహజసిద్ధంగానే ఏర్పడినది! అలాంటి సమయంలో… ఏదో తెలీదు… ఆమెను చూడాలని… ఆమెతో మాట్లాడాలని… నాలో తపన మొదలైంది! ఒక రోజు ఆమెకి జ్వరము వచ్చినదని అని తెలిసి నా మనస్సు విలవిలలాడింది! ఆమె కాలేజీకి రానిరోజులు నాకు మరణయాతన లాగా ఉండేది! ఒక రకంగా చెప్పాలంటే తియ్యని దురదలాగా ఉండేది! ఉంటే వెళ్ళిపోతుందని… వెళ్ళిపోతే అపుడే రాదని… ఇలా పలు రకాల నా మనస్సు ఆరాటపడేది! ఇలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది! అది ఏమిటో తెలుసుకోవాలంటే… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే….. మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

********************************


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి

  2. mee manassu sangarshana, ontarithanam, vairagyam kotha konam lo ela aalochinchalo theliyajesaru.. mee theeyani duradalu meeku migilchina debbalu kuda share chesukovatam bagundi.

    రిప్లయితొలగించండి