అధ్యాయం 38


మట్టి మోక్ష లింగం వచ్చింది!


నిజ గురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునేసరికి మేమిద్దరం గతుక్కుమన్నాము! ఎందుకంటే మానవ మాత్రుడికి ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉండవని, ఉండలేరని నాకు తెలుసు! దానితో గురువులను మేము వెతకడం కంటే మనకి యోగముంటే వారే మన దగ్గరకు వస్తారని లేదంటే వారికి దగ్గరికి మనల్ని రప్పించుకుంటారని…. మాకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర ద్వారా తన ప్రథమ శిష్యుడు అయిన సిద్ధయ్యను ఎలా తన దగ్గరికి రప్పించుకున్నాడో తెలుసుకున్నాము అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర లో ఆయనికి ఆయనే నిజ గురువు ని వెతుక్కుంటూ ఎలా వెళ్లారో తెలుసుకున్నాము! అలాగే వివేకానందుడు అప్పటికి 48 గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని వారి అనుగ్రహం ఎలా పొందుతాడో తెలుసుకున్నాము! దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహమును నిచ్చే మంత్ర ధ్యానం చేయడం అలాగే గురువు దర్శనం కోసం గురుచరిత్ర పారాయణం చేయడం ప్రారంభించినాము! కానీ ఒక సంవత్సరకాలంలో గురుచరిత్ర పారాయణము తొమ్మిది సార్లు పారాయణము పూర్తి చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం కనిపించలేదు! గురువు యొక్క దర్శనము మాకు లభించలేదు అన్నమాట! 


దానితో అన్ని సమస్యలు పరిష్కరించే తిరుపతి వెంకటేశ్వర స్వామికి మాకు నిజ గురువు దర్శనము కలిగించమని మాకు మోక్షప్రాప్తి కలిగించమని వేడుకోవటం జరిగింది! దానితో మేమిద్దరమూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లడం జరిగింది! మేము దర్శనానికి వెండి వాకిలి దగ్గర దర్శనానికి ఎదురుచూస్తున్నాము! ఇంతలో ఎవరో ఉన్నట్టుండి 3 సార్లు “ఓం నమశ్శివాయ”  అన్నారు! నేను యధాలాపముగా… నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నేను కూడా ఈ శివ నామమును మూడు సార్లు ఉచ్ఛారించాను! కానీ అదే నా సాధన దీక్ష మంత్రమని నాకు అప్పుడు తెలియదు! ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది! నిలువు నామాలు దేవాలయంలో ఉన్న వాడి ఉన్నచోట అడ్డనామాలున్న వాడి పేరు ఎందుకు ఎవరు ఉచ్ఛారించారో నాకు అర్థం కాలేదు! చుట్టూ చూస్తే నిలువు నామాలు ఉన్నవారు తప్ప అడ్డనామాలున్నవారు ఎవరు కనబడలేదు! దానితో తిరుపతి వెంకన్న స్వామి యే ఈ అడ్డ నామాల స్వామి నామమును ఉచ్ఛారించేటట్లుగా చేసినాడని … ఆనాటి నుండి శివపంచాక్షరీ మంత్రమును నా సాధన దీక్ష మంత్రముగా చేయడం ఆరంభించినాను! అలాగే విచిత్రముగా కొద్దిసేపటి తర్వాత రామనామ స్మరణం రామనామము మూడుసార్లు వినపడింది! నాతో పాటు ఉన్న  జిజ్ఞాసి గూడ ఆ నామమును మూడుసార్లు ఉచ్చరించాడు! దానితో అతను తారకరామా మంత్రమును దీక్షా మంత్రము గా తీసుకుని చేయడం ఆరంభించారు! ఒకరకంగా చెప్పాలంటే మా దీక్షా గురువు తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న మాట ! ఆయన ఇచ్చిన రెండు నామాలను అనగా నాకు  శివ పంచాక్షరీ మంత్రము అలాగే తారకరామా మంత్రమును శ్రద్ధగా చేయడం ఆరంభించినాము! తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన శివపంచాక్షరి మంత్రం తో పాటు నాకు గురుమంత్రముగా ఇచ్చిన గాయత్రీ మంత్రము శ్రద్ధగా చేయడం ఆరంభించినాను! అనగా శివ గాయత్రి మంత్రమును గురు మంత్రముగా ఆరాధన చేయడం ఆరంభించినాను! 

నా  మట్టి లింగము


ఈ మంత్రసిద్ధి జరుగుతున్న సమయంలో మా అమ్మగారు తన అర్చన చేసే పానమట్టం లేని ఒక మట్టి కుండతో చేసిన లింగమును నా చేతిలో పెట్టింది! ఎప్పుడూ ఇది అమ్మ పూజామందిరములో ఉండేది! కానీ దానిని నేను ఎప్పుడూ తాకలేదు! ఇంట్లో ఉన్న మట్టిలింగం నాకు ఇవ్వటం అర్థం ఏమిటి? ఇంటిలోని దైవిక వస్తువులు చేతిలో ఇస్తేనే దేవుడు ఉన్నాడని నమ్మే సత్తెకాలపు సత్తయ్య నేను కాదు అని అనుకుని ఈ మట్టి లింగమును పక్కన పెడు తూండగా …అక్కడే ఉన్న అమ్మ వెంటనే ఈ విషయం గమనించి “ఓరేయి!పవనా! ఈ లింగారాధన చేసుకోరా! నీకున్న గ్రహపీడలు తొలగిపోతాయి! ఇంకో వారం లో మహాశివరాత్రి రాబోతుంది! అప్పుడు దీనికి పంచామృత ఏకాదశరుద్రుల బిల్వార్చన చేసుకోరా! గ్రహ దోషాలు తొలగిపోతాయి! నీకున్న సందేహాలు తీరతాయి!” అని చెప్పి వెళ్ళిపోయింది! ఏంది! గుడిలో ఉన్న అతిపెద్ద ప్రాణప్రతిష్ఠ లింగమూర్తి ఇంతవరకు అగుపించలేదు! నీవు ఇచ్చిన ఈ చిన్నపాటి లింగమును పూజిస్తే అగుపడతాడా? ఎక్కడ ఉన్నాడో లేడో తెలియని శివయ్యని నాకు చూపించే గురువును చూపించలేక చస్తుంటే… మహా శివరాత్రి నాడు పైగా లింగమూర్తి ప్రత్యేక అర్చనలు, పూజలు అవసరమా? మెడకి డోలు కట్టుకోవడం అవసరమా? ఇక్కడ గురువుకి దిక్కు లేదు! కానీ శివయ్యకి పాల పాయసం కావాలా? నేను పూజలు చెయ్యను! ఏం చేసుకుంటావో చేసుకో” అని “యధావిధిగా ఈ మట్టిలింగం నీవే పూజించుకో! ఉన్న వాటిని ఎలా వదిలించుకోవాలా అర్థం కాక ఛస్తున్నాను!” అంటూ ఈ మట్టి లింగమును యధావిధిగా అమ్మ పూజామందిరంలో తిరిగి ఉంచడం జరిగినది! ఆ క్షణం నుండి నా మనస్సులో ఏదో తెలియని ఆరాటం మొదలైంది! ఏదో దానిని వదిలిపెడుతూ వెళ్తున్నానని… మనస్సుకు నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో… ఆ అనుభూతి కొన్ని క్షణాలపాటు ఈ మట్టి లింగము అక్కడ పెట్టి వెళ్తున్నప్పుడు కలిగినది! వామ్మో! ఇదేమిటి కొత్త గోల… వింత లీల అనుకుంటూ యధావిధిగా గుడికి వెళ్లి పూజాది కార్యక్రమాలు చేస్తున్నానే కానీ నా మనస్సు ఎందుకో అమ్మ ఇచ్చిన లింగమూర్తి మీద లగ్నం అయింది అని తెలుస్తోంది! కళ్ళు మూస్తే చాలు ఆ శివ లింగ మూర్తి రూపమే కనపడుతోంది! ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి! అప్పుడప్పుడు కూడా గుడిలో ఉన్న రాతి లింగమూర్తి కలలో కనిపించేవాడు కాని ఇంత ఆవేదన ఉండేది కాదు! పోయి పోయి ఎవడో సప్తసముద్రాలు దాటి ఇంటి పక్కనే ఉన్న మురికి కాలవలో చచ్చినట్లుగా… నేను కూడా ఈ మట్టి లింగానికి దాసోహమవు తానా? ఇలా జరగకూడదు! ఒక మట్టి లింగం నన్ను శాసించడమా? వీలు లేదు! అనుకుంటూ రోజులు గడుపుతున్నాను! ఇక్కడ ప్రతిష్ట లింగయ్య ఏం మాట్లాడట్లేదు! ఇంతలో మహాశివరాత్రి రానే వచ్చింది! నేను మాత్రం అమ్మ ఇచ్చిన మట్టి లింగమూర్తి కి పూజ చేయలేదు! అమ్మ చేస్తుంది! నేను యదావిధిగా గుడిలోని లింగమూర్తికి అభిషేకానికి వెళ్లిపోవడం జరిగింది! ఆ రోజంతా శివయ్యకి ఉపవాసం మాకు ఉపవాసం! రాత్రి మహా నైవేద్యం పెడతారు! రాత్రి పది గంటలకి మహా నైవేద్యం పెట్టి బయటకు వచ్చేసరికి జిజ్ఞాసి కనపడ్డాడు! అప్పుడు వాడికి అమ్మ ఇచ్చిన మట్టిలింగం విషయం గురించి చెప్పినాను! దానికి వాడు విని మౌనంగా ఊరుకున్నాడు! అమ్మకి ఈ మట్టిలింగం ఎలా, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? 

అరచేతిలో శివలింగం ప్రత్యక్షం


మా నాన్నగారికి వచ్చిన స్వయంభూ బంగారు శివలింగమును వద్దు అన్నందుకు ఏం జరిగిందో ఎలా జరిగిందో అమ్మ మాటలలో మీకు చెప్తున్నాను! మా నాన్నగారు మంచి శివభక్తుడైన కానీ అమ్మవారంటే శక్తి మాత రూపం అంటే అమిత ఇష్టం. అమ్మవారి విగ్రహానికి ఈయన వస్త్రం కడితే విగ్రహాన్ని కట్టినట్లుగా ఉండదు. స్వయంగా అమ్మవారికి కట్టినట్లుగా ఉంటుంది. ఏవైనా సమస్యలు వస్తే మొదట అమ్మవారికి చెప్పుకుని ఆ తర్వాత అయ్యవారికి చెప్పుకునేవారట. ఇలాంటి స్ధితిలో ఆయన ఉండగా ఒకరోజు కర్ణాటక ప్రాంతం నుండి సంచార సన్యాసినుల సిద్ధుడు మా గుడి కి వచ్చినాడు. వారి గురువు ఆజ్ఞ ప్రకారం ఇతను ఏ ఊరిలో మూడు రోజులపాటు ఉండకుండా ఊరిని వదిలి పెడుతూ దొరికినది తింటూ ఆ ఊరిని వదిలిపెడుతూ సంచారము చేస్తున్నారని మన నాన్నగారు తెలుసుకున్నారట. దానితో ఈయనికి కావలసిన భోజన ఏర్పాట్లు మా నాన్నగారి చేయడం జరిగినది. గుడిలో ఉన్న మంత్ర ఉచ్ఛారణ దైవ శక్తి ప్రభావానికి ఈ సిద్ధుడు కొంతసేపు వశము అయ్యి శివ లింగ మూర్తి ని చూస్తూ ఆనంద స్థితిని పొందినాడు. ఇలాంటి ఆనంద స్థితి కోసమే నేను క్షేత్ర సంచార చేస్తున్నాను అని మా నాన్నతో చెప్పి భోజనానికి మా ఇంటికి వచ్చినారు. భోజనాలు సత్కార్యాలు సంతోషపడుతూ… మా నాన్నగారికి ఉన్న నిజమైన శివ శక్తి భక్తికి ఆనందపడుతూ… మా నాన్న ను చూస్తూ…ఆ సిద్ధుడు ఏవో మంత్రాలు చదువుతూ …తన అరచేతిని తెరవగానే ఒక అంగుళం ఉన్న బంగారు శివలింగం ప్రత్యక్షము అయినది. ఈ శివలింగం చూసినవారంతా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూండగానే …. మా నాన్నగారు వెంటనే వారితో “స్వామి! ఈ శివలింగమును నేను భరించలేను! నాకు అంత సాధనశక్తి గాని అలాగే మంత్రశక్తి గాని నాకు ఉంది అని నేను అనుకోను. ఎక్కడ నుండి ఎలా తెప్పించినారో అలాగే మళ్లీ వెనక్కి నాకోసం పంపించండి” అనగానే మౌనంగానే ఆ సిద్ధుడు వచ్చిన ఈ స్వయంభు బంగారు లింగమును తనకు ఇష్టం లేకపోయినా శివభక్తుడు బాధపడకూడదని ఒక కారణంతో ఆ కారణముగా అయిష్టంగా వెనక్కి పంపించి వేసినారట. 

ఆ తర్వాత కొద్ది సేపటికి మా అమ్మమ్మగారికి ఈ బంగారు శివలింగం మీద ఆసక్తి కలిగి వెంటనే ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్లి “స్వామి! నేను కూడా శివ భక్తురాలినే కానీ నా దగ్గర పూజ చేసుకోవటానికి శివలింగం లేదు! మీరు ప్రసాదిస్తే దానిని పూజించుకుంటాను!” అనగానే వెంటనే “అమ్మాయి! పై వాడి నిర్ణయము ఎలాంటిదో నాకు తెలియదు. వాడు ఏమి ఇచ్చినా కూడా నువ్వు తీసుకోక తప్పదు. మళ్ళీ వెనక్కి పంపించే స్ధితి రానీయకు!” అంటూ ఏవో మంత్రాలు చదువుతూ తన అరచేతిని చాచగానే కుండపెంకుతో నిర్మితమైన పానమట్టము లేని మట్టి శివలింగము వచ్చినది! దానిని మా అమ్మమ్మ చేతిలో పెడుతూ “ఇదిగో నీకు శివ అనుగ్రహ ప్రసాద మని” చెప్పి ఇచ్చినాడు! వెనక్కి తిరిగి బంగారు శివలింగం వస్తుందని ఆశించిన మా అమ్మమ్మ వచ్చిన ఈ మట్టి లింగమును అయిష్టంగానే తీసుకుని వారికి నమస్కారం చేసి వంటింట్లోకి వెళ్లి అమ్మ పూజ మందిరంలో ఈ మహత్తర మట్టి శివలింగమును ఉంచినది! తర్వాత కొద్ది సేపటికి వచ్చిన సిద్ధుడు ఊరు వెళ్లిపోయినాడు !ఆయన ఎవరో ఏమిటో వివరాలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. స్వయంగా శివయ్య అనే సందేహం కూడా ఎవరికి కూడా రాలేదు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ కూడా వెళ్ళి పోతూ ఈ మట్టి లింగమును అమ్మకే ఇచ్చి తీసుకోమని చెప్పి…. బంగారు శివలింగం ఇస్తాడని అనుకుంటే… నా చేతికి ఈ మట్టి లింగమును ఇచ్చి వెళ్ళినాడు. వాడు నిజమైన సిద్ధుడైనా లేక కనికట్టు నకిలిస్వామి అయ్యిండాలని అని చెపుతూ అమ్మ చేతిలో ఈ మట్టి శివలింగం పెట్టి తన ఊరు వెళ్లి పోయింది.శివలింగారాధన తెలియని అమ్మ ఈ లింగమును తీసుకుని తన పూజా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్ళుతోపాటుగా పాటు ఈ శివలింగం మూర్తిని కూడా ఉంచినది! దాని మహత్తర విలువ తెలుసుకుని జ్ఞానశక్తి ఆమెకు తెలియదు. వచ్చిన వాళ్ళకి అంత సాధన శక్తి లేదు. కేవలం ఈ రెండు శివలింగాలు ప్రసాదించిన సిద్ధుడుకి మాత్రమే ఆ శివలింగం యొక్క విలువ తెలుసు! ఎందుకంటే తన లింగమూర్తి యొక్క విలువ తనకంటే ఈ లోకంలో ఎవరికి తెలుసు ఆ సిద్ధుడు ఎవరో కాదు స్వయంగా మహాశివుడు అయి ఉండాలి. ఎందుకంటే మా నాన్నగారి లింగారాధన 12 సంవత్సరాలు పూర్తి అయినాయి కాబట్టి స్వయంగా మహా శివుడు సిద్ధుడు రూపంలో ప్రసాదించాడని విషయం ఎవరికీ తెలియలేదు. ఈ విధంగా మట్టి మోక్షలింగ ఉద్బవము జరిగినది!చివరికి అమ్మద్వారా ఈ శివలింగమూర్తి నాదరికి చేరినది! ఇలా దేవుడు ప్రసాదించిన బంగారు శివలింగం కాదన్నందుకు మా నాన్నగారు అర్థ సాధకుడుగా ఎలా మిగిలిపోయా రో తెలుసుకోవాలి అంటే.....

అర్థ సాధకుడి కథ
(మా తల్లిదండ్రుల సాధన కథ)


ఈ అధ్యాయంలో మా అయ్య సాధన ఎలా పరిసమాప్తి అయినదో… ఆయన ఏ విధంగా మాయలో పడ్డాడో… ఆయన ఏ విధంగా త్రిపుర కామ మాయను దాటలేకపోయినారో తెలుసుకుందాం! ఇంతకు ముందు అధ్యాయములో మా నాన్నగారికి స్వయంభూ బంగారు శివలింగమూర్తిని ఒక సిద్ధుడు ప్రసాదించడము అలాగే దీనిని ఈయన కాదనటం చదివినారు గదా! ఆపై ఏమి జరిగినదో మీరే చదవండి! ఇలా కొన్ని నెలలు గడిచి పోయినాయి. ఎవరికి వారే తమ పనుల్లో మునిగిపోయారు. శివ సిద్ధుడు ఇచ్చిన లింగమూర్తి విషయమే మరిచిపోయారు. మా నాన్నగారికి ఇచ్చిన ప్రసాదించిన స్వయంభూ బంగారు శివలింగం తీసుకోలేదని మీకు తెలుసు కదా. అప్పుడే అసలు ఆట మొదలైంది. మా నాన్న సాధన స్థాయి బాలా-త్రిపుర-సుందరి- దేవి స్థాయిలో త్రిపుర స్థాయికి చేరుకున్నారు. త్రిపుర దేవి అంటే మూడు పదుల వయసు ఉన్న స్త్రీ మూర్తి అన్న మాట. బాల అంటే ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్ల అన్నమాట. ఇక సుందరి అంటే 65 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ మూర్తి అన్న మాట. ఇక దేవి స్వరూపము అంటే 85 సం!!రాలు వృద్ధమూర్తి అన్నమాట! సాధకులు వారి సాధన స్థాయి ఏ స్థాయిలో ఉందో ఈ బాలాత్రిపురసుందరిదేవి అవతారం వస్తాయని ఈపాటికే తెలుసుకున్నారు కదా. వారి స్థాయిని బట్టి అమ్మవారు ఈ నాలుగు రూపాల్లో ఆయా రూపం ధరించి అన్ని రకాల యోగమాయ పరీక్షలు పెడుతుంది! సాక్షాత్తు ఆదియోగి శివయ్యకి ఈ యోగపరీక్షలు తప్పలేదు!అందులో మనమెంత! వాటిని తట్టుకుని నిలబడిన వారికి వారి తమ సాధన స్థాయిని పెంచుతుంది. ఇలా ప్రతి సాధకుడికి ఈ త్రిపురసుందరిదేవి మాయ పరిస్థితి గురి కావాల్సిందే. అలా మా నాన్న కూడా తన సాధన స్థాయిలో రెండో దశకు చేరుకున్నప్పుడు పరీక్షించటానికి కామరూపము త్రిపుర దేవి కామ రూపములో వచ్చి ఉన్నది. ఈ విషయాలు ఏవీ తెలియని పట్టించుకునే స్థితిలో మా అయ్య సాధన స్థాయి ఉన్నది. అర్ధరాత్రులు మూసివున్న గుడిలోకి వెళ్లి తలుపులు తెరిచి అమ్మవారి గుడిలో అమ్మవారి తో ఏవో సంగతులు మాట్లాడుతూ ఉండటం మా అమ్మ గమనించినది! నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్లకి, గుడిలో వాళ్లకి ఈ విషయం తెలిసినది. మా అయ్య నిజ భక్తి కి అందరూ సంతోష పడుతున్న సమయంలో… రానే వచ్చింది… కామరూపములో యోగమాయ పరీక్షా కాలం! భర్తను వదిలేసి ఒక స్త్రీ మూర్తి రూపంలో… గుడిలోనూ, ఇంటిలోని పని చేయడానికి పని మనిషి రూపంలో కామరూపీ దేవి అనగా త్రిపుర దేవి తన మాయని చూపించడం మొదలు పెట్టింది. ఈయనికి సాధన స్థాయికి తీవ్రమవుతున్న కొద్ది సమయంలో దాన్ని తట్టుకోలేని తీవ్రమైన కామమాయకి గురి అవుతున్నాడు! ఇలాంటి సమయంలో మా అమ్మమ్మ ఇచ్చిన నాటి మట్టి శివలింగం మూర్తిని అమ్మ ఆరాధించటం మొదలైంది. అక్కడేమో మా నాన్నకి తీవ్రమైన కామవాంఛ మొదలయితే ఇక్కడేమో అమ్మ కి కామవాంఛ మీద తీవ్రమైన వైరాగ్యం మొదలైనది. ఎవరు కూడా అర్థం చేసుకోలేని అర్థం కాని మహామాయ పరీక్షకాలములో ఉన్నారని వీరిద్దరూ తెలుసుకోలేకపోయారు. మా నాన్నకి ఉన్న తీవ్ర కామ స్థాయికి ఒకేసారి వెయ్యి మందిని సంతృప్తిపరిచే స్థాయిలో ఉంటే మా అమ్మ కి ఏమో కామం అంటే పూర్తిగా వాంఛ లేని స్మశాన వైరాగ్యం స్థాయికి వెళ్లి పోయింది.

ఇలాంటి సమయములో మా నాన్న మీద త్రిపుర దేవి తన కామమాయ చూపించడం మొదలు పెట్టినది అనగా మా ఇంటికి పనిమనిషి తో మాటలు, చూపులు కలిశాయి! అప్పుడు మా అమ్మ దృష్టికి ఈ విషయం వచ్చినది కానీ అప్పటిదాకా మా నాన్న ఎలాంటి తప్పూ చేయలేదు. ఏకపత్నీ ధర్మమును పాటిస్తూనే ఉన్నాడు కానీ మా అమ్మకి అనుమానాలు మొదలై అది చిలికిచిలికి గాలివానైంది. ఇది చిలికి గాలివాన సంసారసుఖమును దూరం చేశాయి. ఇదే గదా త్రిపురమాయకి గావాలసినది! మాయ దానికి కావాల్సిన పరిస్థితులు వీరిద్దరి మధ్య ఏర్పరచింది! మా నాన్న ఎంత మొత్తుకున్నా మా అమ్మ పట్టించుకునే స్థితిలో లేదు! మా అయ్యను అనుమానించే సరికి ఈయన చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా…. ఇంకా కామవాంఛ తట్టుకోలేని స్థితికి ఆయన పూర్తిగా చేరుకునే సరికి… ఆ పనిమనిషి మా నాన్న కి దగ్గర అయింది. దానితో ఎన్నో సంవత్సరాల పాటు పాటిస్తూ వస్తున్న ఏకపత్నీ ధర్మమునకు తిలోదకాలు ఇచ్చి… ఆమెతో సహజీవనం చేస్తూ … మగ పిల్లవాడిని కనే స్థాయికి వెళ్లిపోయినాడు! మా అమ్మను వంట మనిషిని చేసినాడు! ఆమెను లోకానికి భయపడి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తు ఇంటి మనిషి చేసుకున్నాడు! రెండు సంసారాల మధ్య, బంధుమిత్రుల అవమానాల మధ్య నలిగిపోతూ మంత్రసాధనకి తనకి తెలియకుండానే దూరమవుతూ…. అన్నీ చేసేవాడు పై వాడే… నేను చేయటంలేదు… చేసేది వాడే ,చేయించేది వాడే, అనుభవింప చేసేది వాడే ,ఆనంద పడేది వాడే, బాధపడేది వాడే, వేధించేది వాడే అనుకుంటూ శబ్ధపాండిత్యము నుండి మెట్టవేదాంతం వైపు అడుగులు వేస్తున్నాడు! అన్ని వాడే చేస్తే మరి నిన్ను ఎందుకు సృష్టించాడు? మరి ఎందుకు ఈ రెండు సంసారాల మాయను ఆయన కల్పించాడు అని మనోవిశ్లేషణ చేసుకుని వుంటే కథ మరోలా ఉండేది! అంత సమయము మా అయ్యకి ఎక్కడ ఉంది! ఆమె ఒక క్షణం కనిపించకపోతే...ప్రాణము పోయేటట్లుగా విలవిలాడి పోయేవాడు!విపరీతమైన కోపావేశాలు కలిగి కానిదానికి అందరిని ఎదో రకముగా తిడుతూ ఆమె మీద కోపమును అందరి మీద చూపిస్తూ తన మాటలతో...తన చేష్టలతో నరకము చూపించేవాడు!ఆమె కనపడిన మరుక్షణము మాములుగా ప్రేమికుడిగా మారిపోయేవాడు! మునిమనవళ్ళున్న గూడ మా ముసలాడికి ఆమె మీద కామపిచ్చి ఇంకా తీరలేదంటే...ఎంత దిగజారుడి స్ధితికి తను ఉన్నాడో తెలుసుకోలేని స్ధాయిలో ఉన్నాడు! ఆమె మీద చూపించే  ప్రేమను అమ్మవారి మీద చూపించి ఉంటే... ఖచ్చితముగా ఈయన సాధన స్ధాయికి అమ్మవారు సాక్షాత్కరమై రామకృష్ణ పరమహంస స్ధాయికి ఈపాటికి వెళ్ళేపోయేవారు! ఇక్కడ త్రిపుర మాయ వలన అమ్మవారు కాస్తా అమ్మాయి అయినది!దానితో మోక్షగామి కాస్తా కామిగామి అయినాడు!ఎవరికి నష్టము జరిగినది...ఈయనకా...అమ్మవారికా...శివయ్యకా...కామమాయ అంటే తను చేసిన తప్పు తన భక్తుడు చేయకూడదని శివయ్య సంకల్పించాడు. తనకు లాగానే రెండు సంసారాల మాయలో పడవద్దని… సాధన స్థాయిలో వచ్చే ఏకపత్నీ ధర్మమును నాశనం చేసే పర స్త్రీ కామ మాయను దాటించాలని పరితపించాడు! కానీ ఈ శివ భక్తుడు చేసేది శివయ్య గదా అని పరస్రీ కామమాయలో పడిపోయి పున:జన్మలకి కారణము పొందినాడు! తీరని కోరిక మాయలో పడి మోక్షగామి కాస్త కామిగామి గా మారినాడు! శివయ్య ఏమో కామము దాటితేగాని మోక్షగామి కాలేవురా అని చెబితే… దానిని మా అయ్య వద్దని కామిగానే ఉండి రాబోవు కాలంలో ఇలాంటి పున:జన్మలతో తియ్యనిదురద లాంటి సంసారాలమాయలో పడతానని  అని చెప్పేసరికి చివరికి శివయ్య మౌనం వహించక తప్పలేదు! దురద ఎన్నటికీ తగ్గదు! అలాగని గోకుంటే మంట పుడుతుంది. గోకపోతే జిల పుడుతుంది! అందుకే పరస్రీ/పరపురుషలను గోకరాదని...గోకితే అది మూడునాళ్ళు ముచ్చట అని...అది చివరిదాకా నయము కాని తియ్యని దురదయని మా అయ్య అమ్మ సాధనానుభవము చెపుతుంది!మీరు కూడా ఇలాంటి సాధన స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము దాటితేగాని నాలుగో పురుషార్ధమైన మోక్షం రాదు అని తెలుసుకోండి. జాగ్రత్త పడండి. చూడటానికి పైన చెప్పిన నాలుగు పురుషార్థాలు బాగానే ఉంటాయి. ఆచరించే సమయానికి సాధనలో ఎవరు ఎంత మంది నిలబడతారో అని సృష్టించిన శివయ్యకే తెలియదు.

ఇలా అమ్మానాన్నకి జరగటానికి కారణం ఈపాటికే గ్రహించే ఉంటారు. అనగా సిద్ధుడు ప్రసాదించిన బంగారపు శివలింగమును వద్ధని చెప్పడమే ఇంతటి నాటకానికి కారణమైంది. కారణ లింగం అయినది ఎలా అంటే బంగారు లోహము లేదా పాదరసము మనలో తట్టుకోలేని మంత్ర శక్తి తరంగాలు ఉంటే ఇది తనలో ఇముడ్చుకుంటుంది. అలాగే వీటికి పూజలు, అభిషేకాలు చేసినప్పుడు మనలో ఎప్పుడైనా సాధన శక్తి తగ్గినప్పుడు ఈ లోహము తిరిగి ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ విషయమును గ్రహించి పంచలోహాలతో అనగా బంగారం, వెండి, రాగి, కంచు, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఉత్సవమూర్తులను పూజకి ఏర్పాటు చేసినారు. అలాగే ఇళ్లలలో పూజలలో ఇలాంటి పంచలోహ మూర్తులను ఏర్పరచడం… వాటిని పూజించడం ఆనవాయితీగా పెట్టడం జరిగినది! తెలిసో తెలియకో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసిన పాపాలు చేసినా మనలో ప్రాణ శక్తి తగ్గిపోతుంది. తద్వారా యోగ చక్రాలు బలహీనమై వ్యాధులకు గురి అవుతాయి.  మానసిక సంఘర్షణ మొదలవుతాయి. ఆ మానసిక శారీరక ఆందోళనలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇలా ఉన్నప్పుడు మన యోగ చక్రాలు బలహీనమవుతాయి. వీటికి తిరిగి శక్తిని కలిగించటానికి ఇలాంటి పంచలోహ మూర్తులను ఆశ్రయించక తప్పదు అలాగే పూజించక తప్పదు. మా అయ్యకి వచ్చిన బంగారపు లింగ మూర్తి ని తీసుకోక పోవడంతో…. తన స్థాయిని అదుపులో ఉంచే స్వయంభు మహా శివలింగం కోల్పోవటంతో… తనలో ఏర్పడిన అమోఘమైన కామశక్తిని తట్టుకోలేక సంయోగము నుండి సమాధి కి వెళ్లాలని తపనతో…. ఏకపత్నీ ధర్మమును తప్పి….  పరస్త్రీ వ్యామోహం లో పడిపోయి మోక్షగామి కాస్త కామిగామి గా మిగిలిపోయి తన సాధన చక్రమును తన చేతులతో అపసవ్య దిశ మార్చుకుని మిగిలిపోయాడు! అర్థ సాధకుడిగా మిగిలి పోయినాడు!

అంటే శివయ్య ఒకటి తలిస్తే మా అయ్య మరొకటి చేస్తున్నాడన్నమాట! శివయ్య మాత్రం ఏం చేస్తాడు? తనకి దగ్గర ఇవ్వటానికి అన్ని ఉంటాయి కానీ శివాని మాత్రమే వీటిని వాళ్ళు తీసుకునే అర్హత ఉందో లేదో పరిశీలించి పరిశోధించి శోధించి కానీ ఇవ్వరు! ఇక మా అమ్మ విషయానికి వస్తే తన పిల్లల జీవితాభివృద్ధికి అలాగే గ్రహపీడదోషాల నివారణకోసము ఇత్తడి లేదా స్పటిక శివలింగం ఆరాధన చేయమని ఎవరో చెబితే… దానిని పట్టించుకోకుండా ఏదైనా శివలింగమే కదా అన్ని శివలింగాలు ఒకటే కదా అని…  మహత్తర మట్టి లింగమును అనగా అమ్మమ్మ ఇచ్చిన దానిని పూజించడము ఆరంభమైనది! పైగా ఇది భోగ లింగమూర్తి కాదు.. యోగ లింగమూర్తి! దానితో ఈ మనిషి భక్తికి దాసోహమై…ఆ శివయ్య కాస్తా ఈమెకి స్మశాన వైరాగ్యం స్థితి ఇవ్వడం ప్రారంభించాడు! తన లో వచ్చే కొత్తగా వచ్చే మహా యోగశక్తిని తట్టుకోలేక పైగా సంసారతాప దూరం అయినది! దానితో అనుమానాలు, భ్రమలు, భ్రాంతులకు లోనై పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు … ఆదిలో మా అయ్య కాస్తా పనిమనిషితో చేసిన చిలిపి చేష్టలు చూసి అపార్థం చేసుకుని అనుమానించి, అవమానించి సంసార సుఖానికి దూరంగా ఉంచినది! దానితో చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా అని అప్పటి దాకా తెలియని వాడు మా అయ్య కాస్త పర స్త్రీతో తప్పు చేయడం ఆరంభించాడు! మా బంధువులకి, ఊర్లో వాళ్లకి దొరికిపోయాడు! గొడవలు కాపురం ఆరంభమైనది! మానసిక విడాకులు తీసుకున్న దంపతులుగా విడిపోయి విడిపోకుండా అలాగని కలిసి ఉండకుండా ఒకరునొకరు మాట్లాడుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు! అంటే ఉన్నామని తమని తాము మోసం చేసుకుంటూ మేడిపండు లాగా ఉన్నారు! ఇలా ఎందరో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు… పిల్లలని అనాధలు చేస్తున్నారు… పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి దూరం చేస్తున్నారు… ఇది ఒక అర్ధసాధకుడి ఆత్మకథ అన్నమాట! సాధన లో వచ్చే పాతివ్రత్య ధర్మపరీక్షకి అడ్డముగా దొరకిపోతే ఎలా సాధన అర్ధాంతరముగా ఆగిపోతుందో ఈ సాధకుడు సాధన అనుభవం ద్వారా తెలుసుకోండి అలాగే మనకి సాధనలో వచ్చే ఆఙ్ఞాచక్రము నందు వచ్చే ఈ విచిత్ర కామమాయను దాటండి! లేదంటే మీ సాధన కూడా అర్ధాంతరముగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా పునర్జన్మ పొందే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి! మా అమ్మమాత్రము అన్నింటిని స్శశానవైరాగ్యముతో...సాక్షిభూతముగా ఉంటూ...కేవలము ప్రారబ్ధకర్మ చేస్తూ...ఓంకారముతో...అమ్మవారిని కొలుస్తూ...ఆవిడిలో ఐక్యమవ్వాలని యోగసాధన చేస్తున్నది! ఇంతటితో నాకున్న మంత్రగురువుకి అనుబంధము పరిసమాప్తి అయినది!ఇలా నా మంత్రగురువు చేసిన తప్పు అదే త్రిపుర కామమాయలో పడకూడదని కృతనిశ్చయముగా ఉన్నాను! రాబోవు మా దైవిక అనుభవాలు ఎలా ఉంటాయో చూడటానికి మాతోపాటుగా మీరుగూడ ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

                               ******************************                           
గమనిక: అమ్మకి వారసత్వంగా వచ్చిన స్వయంభూ మట్టి లింగము నా దగ్గరికి వచ్చింది! కానీ కొన్ని సంవత్సరాల దాకా దీని విలువ నాకు తెలియ రాలేదు! ఈ మట్టిలింగం కాదని మోక్ష లింగమని ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే ఈ లింగమునకు పానమట్టం ఉండదు. చిత్రంగా చిదంబర క్షేత్రంలో ఉండే మోక్ష స్పటిక లింగమునకు పానమట్టం ఉండదు అలాగే శ్రీశైల క్షేత్రంలో గుడి పరిసరాలలో పంచపాండవులు ప్రతిష్టించిన నవబ్రహ్మ లింగాలలో ఉన్న మోక్ష శివలింగాన్ని కూడా పానమట్టం ఉండదు! అమ్మ కు వచ్చిన ఈ మట్టి లింగానికి కూడా పానమట్టం ఉండదు! ఆదిశంకరాచార్యుడుకి స్పటిక మోక్ష లింగము వస్తే అమ్మకి మట్టి మోక్ష లింగమూర్తి గా వచ్చినాడని నాకు కొన్ని సంవత్సరాల దాకా తెలియదు. అందుకే మళ్లీ మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే మీ దగ్గరికి ఎవరైనా, ఏమైనా, దైవిక వస్తువులు ఇస్తే లేదా వస్తే కాదనకుండా తీసుకోండి. వాటిని ఇచ్చిన పూజించక పోయినా పర్వాలేదు. జాగ్రత్తగా భద్రంగా మీ పూజా మందిరంలో ఏదో ఒక మూల ఇలాగే యంత్రాలు వచ్చినా కూడా జాగ్రత్త గా ఉంచండి!దయచేసి ఎవరికి ఇవ్వకండి! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక! ఇలాంటి స్థితి మనకి ఆజ్ఞాచక్రము శుద్ధి అవుతున్నపుడు సమయంలో మనకు బంగారం సంబంధించిన శివలింగము లేదా అమ్మవారి యంత్రము వస్తుంది!ఇవి త్రిపురమాయకి సంకేతాలు!ఎపుడైతే మీరు ఈ మాయను దాటినారో...ఆనాడు మీకు పాదరస సంబంధిత దైవిక వస్తువులు వస్తాయి! అవి మనకి వారసత్వంగా రావచ్చు లేదా యోగులు, సాధువులు,గురు వులు, సిద్ధులు ఇవ్వవచ్చును! ఎందుకంటే ఆజ్ఞా చక్రానికి అధిదైవముగా అర్ధనారీతత్వముతో శివ శక్తి ఉంటుంది! మాకు కూడా ఈ చక్ర సిద్ధ సమయములో బంగారపు బాల దుర్గాదేవి యంత్రము వచ్చింది !ఇది మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఆరాధించిన మహిమాన్వితమైన యంత్రం అన్నమాట !ఈ యంత్రము ఎవరైతే మూడున్నర సంవత్సరాల పాటు బీజాక్షర సహితముగా అర్చన చేస్తారో వారికి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న దుర్గాదేవి అలాగే మూడు సంవత్సరాల వయస్సు ఉన్న బాల దేవి దర్శనం అవుతుందని నా స్వానుభవం అనుభూతిని పొందడం జరిగినది! ఈ యంత్రము గూర్చిన వివరాలు మీరు ఈపాటికే ఇంతకు ముందు వచ్చిన "భుజం ఇచ్చిన దుర్గమ్మ" అనే అధ్యాయములో చదివినారు గదా! అలాగే మా నాన్నగారి ద్వారా కాశీ క్షేత్రము నుండి పాదరస లింగము రావడము జరిగినది! అలాగే ఈ చక్రశుద్ధి సమయములో త్రిపుర చూపించే కామమాయను గూడ మేము దాటడము జరిగినది!అది ఎలాంటే మా ఇంటికి నాకు పెళ్ళీయిన కొత్తలో నాకు తెలిసిన 24సం!!రాల అమ్మాయి వచ్చినది! ఆమె నన్ను అన్నయ్య అని ఎపుడు పిలుస్తూండేది!మూడు రోజులుంది!కాని ఒక పూట నాతో అసభ్యకరముగా మాట్లాడటము అలాగే నన్ను అదోలా కవ్వించడము చేసినది! నాకు తెలియని భయము మొదలైంది!నాకు ఇదింతా త్రిపురమాయని అర్ధమైనది! ఆమెకి ఒక శృంగార వీడియో చూపించడము జరిగినది! అది చూసి “నాకు ఏ రెండు అంగాలున్నాయో ఆమెకి అవేఉన్నాయి గదా” అంది! నేను వెంటనే “మరి మా ఆవిడికి ఏమి ఉన్నాయో నీకు అవే ఉన్నాయి గదా” అన్నాను! అలాంటపుడు మా ఆవిడిని మోసము చేస్తూ నీతో శృంగారము చేయడము తప్పే గదా” అన్నాను! దానితో ఆమెకి తన తప్పు తెలిసినది!తల వంచుకొని క్షమించమని అడిగి ఆరోజే రాత్రికల్లా ఆమె ఇంటికి వెళ్ళిపోయినది! మా ఆవిడికి జరిగిన విషయము మొత్తము చెప్పినాను!తను గూడ సాధనలో ఉన్నది కాబట్టి “మీకు పరస్రీ మాయ జరిగినట్లుగా నాకు కూడ పరపురుష మాయ జరుగుతుంది గదా!కాబట్టి మాయలో పడితే వాడి సాధన ఆగిపోతుందని ఇంతముందే నాకు చెప్పినారు గదా” అన్నది! ఇలా నాకు సహస్రచక్రము వద్ద సుందరి కామమాయగా 52సం!!రాల స్త్రీమూర్తి,అలాగే హృదయచక్రము వద్ధ దేవి మాయగా 65సం!!రాల స్త్రీమూర్తిని దాటడము జరిగినది! అంతెందుకు రామాయణ గాథనే తీసుకొండి!అందులో అద్వితీయ బ్రహ్మజ్ఞాని అయిన రావణబ్రహ్మ పరస్త్రీ వ్యామోహ మాయలో అనగా సీతాదేవి వలన రాక్షసుడిగా గుర్తింపు వస్తే...అదే శ్రీరాముడు తనకి పరస్త్రీ వ్యామోహ మాయగా శూర్పణక వస్తే ఆయన ఈమెను దాటడము వలన దేవుడైనాడు!


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. matti lingam mee ammagaaru ichina enduku theesukoledu? evaraina edaina matladite ne devudu palikinchadu annattu namme meeru enduku theesukoledu...
    ardhasaadhakudi kadha cheppatam mee thandri gaaru ayna ela jarigindi ani cheppatam chuse vidhaanam yogaparam aythe edi jarigina emi undadani...tripura maaya vivarana, siddhudi anugraham...bagundi.

    రిప్లయితొలగించండి