అధ్యాయం 84



మూడు బ్రహ్మ పదవులు ఇచ్చారు
( కాంతి బ్రహ్మ… శబ్దబ్రహ్మ… నిశ్శబ్ద బ్రహ్మ )
 

కిందటి అధ్యాయములో ఎవరైతే అస్కలిత బ్రహ్మచారిగా ఉంటారో వారు పరిపూర్ణ యోగసిద్ధి పొందే అర్హత యోగ్యత ఉన్నాయని తెలుసుకున్నారు కదా.అది సాధనలో ఎలా సాధ్యపడుతుందో నాకైతే అర్థం కాలేదు. దానితో వివిధ గ్రంథాలు పుస్తకాలు చదివాను. అయినా కూడా సరైన సమాధానం ఇవ్వలేక పోయాయి. దానితో నేను అనుభవ పాండిత్యము కోసం అనగా ఙ్ఞాన స్పురణ కోసం ధ్యానం చేయడం ప్రారంభించాను. అలాగే మేము సర్వకర్మ నివారణ చేసుకొనేటపుడు మాకు పరమశూన్యము కాస్త బ్రహ్మమాయగా మూడు బ్రహ్మపదవులు ఆశ చూపించడము మొదలు పెట్టినది. అంటే ఆదిలో పరమ శూన్యము నందు మొదట శబ్దబ్రహ్మ గాను(నాద బ్రహ్మ) ఓంకార నాదం ఉంటే అలాగే కాంతి బ్రహ్మంగా దివ్య పరంజ్యోతి స్వరూపం వచ్చినట్లుగా లోకవిదితమే కదా. 

కాంతి స్వరూపం సంకేతంగా మన హృదయ చక్రమునందు వచ్చే ఇష్టలింగము అన్నమాట. ఈ లింగము నందు దివ్య కాంతి శక్తిని పెంపొందించే విధంగా నవపాషాణం ధాతువులతో బసవేశ్వర రస సిద్ధుడు ఆదిలో ఇష్ట లింగమును తయారుచేసి లింగాయతులు అనే శాఖను ప్రారంభించి లింగ వ్యాప్తికి దోహదపడినారు. కాంతిని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొని కాంతి యోగిగా ఖ్యాతి చెందినారు.ఇలాంటి యోగులను కాంతి బ్రహ్మలు అందురు. ఎవరైతే ఇష్టలింగమును పొందుతారో(యోగ్యత) దానిని 12 సంవత్సరాల పాటు లేదా జీవితకాలం మెడలో ధరిస్తూ నిత్య శివ దీక్షలో ఉండుతారో(అర్హత ) ఇలాంటివారిని కాంతి యోగులు అందురు. ఎప్పుడైతే తమ ఇష్టలింగము నందు స్వయంభూ దివ్య కాంతి శక్తి ధ్యానము నందు దర్శించ గలుగుతారో అలాగే తమ మనోనేత్రం అంతరిక్షంలో ఉన్న మూల కాంతి శక్తి  దర్శించ గలుగుతారో వారిని కాంతి బ్రహ్మలు అందురు. మేము మా హృదయ చక్రం నందు ఇష్టలింగమును పొందటము అలాగే దివ్యకాంతి దర్శనానుభూతి పొందడం జరిగినదని మీరు ఈ పాటికే నా హృదయ చక్రం అనుభవాలలో తెలుసుకున్నారు.అంటే మేము కాంతి యోగిగా మారినాము అన్న మాట. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే మేము మా బ్రహ్మనాడి మార్గము ద్వారా బ్రహ్మరంధ్రము దాక చేరుకుని అక్కడ ఉన్న మూల కపాలంలో చితాగ్ని దర్శన ధ్యాన అనుభూతి పొందినామో ఆనాడే మేము కాంతి బ్రహ్మ గా రూపాంతరం చెందినాము. ఎప్పుడైతే ఇష్టలింగ మాయలు అనగా ఇష్ట పదార్థాల మాయను అలాగే ఇష్టకోరిక మాయను దాటినామో ఆనాడే మేము ఈ కాంతి స్వరూపము నుండి బయటపడటం జరిగినది. ఆపై మా సాధన అడుగులు పరమ శూన్యము వైపుకి బయలుదేరినాయి. 

ఎప్పుడైతే మాకు జైపూర్ క్షేత్రం నుండి నవరత్న ఓంకారం రావడం జరిగినదో ఆనాటినుండి మా సాధన అడుగులు ఆదిలో పరమ శూన్యము నుండి వచ్చిన ఆది నాదమైన ఓంకారనాదం సాధన అభ్యాసం చేయడం ఆరంభించినాము. కేవలం ఓమ్ నాదముతోనే మాకు వచ్చిన విష్ణు సాలగ్రామము అలాగే మా దగ్గరికి చేరిన వివిధ రకాల బాణ లింగాలు,స్పటిక లింగాలు, శివ పంచాయతనం,శంఖాలు, యంత్రాలు వీటిని  ఓమ్ నాదముతో 36 సార్లు పాటు చేస్తూ జలముతో అభిషేకం చేయడం ఆరంభించినాము. అంటే మా దగ్గరికి చేరిన వస్తువులు అన్నిటికి జలము ఆహారంగా, ప్రాణ శక్తిగా విభూతిని, ఆత్మశక్తిగా ఓంకారనాదం సాధన చేయడం ఆరంభించినాము. 

ఇలా ఆరు నెలలపాటు జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం మా మాస్టర్ గారు పవన్ బాబాకి(అదే నా సజీవ బాబామూర్తికి) హారతి కోసం ఐపాడ్ కొని ఇవ్వడం జరిగినది. బాబా హారతులు సమయంలో మాత్రమే దీనిని ఉపయోగించి దానిని బాబా సమక్షంలోనే ఉంచడం జరిగేది. కొన్ని నెలల తర్వాత మేము విశ్వగురుచరిత్ర రచన చేయడం జరిగినది. మాకున్న ఆర్థిక పరిస్థితి వలన ఈ గ్రంథమును విడుదల చేయలేక పోవడం జరిగినది. అప్పుడు బాబా వారి సమాధానం పుస్తకంలో వచ్చిన ఆయన పేర మాస్టర్ గారు ఇచ్చిన ఐప్యాడ్ ను ఉపయోగించి ఏకధాటిగా పదిమంది తత్వ గురువుల మహత్యాలతో కూడిన 54 అధ్యాయాలు ఉండి సుమారు 48 గంటల పాటు ఏకధాటిగా వచ్చే ఆడియోసీడీని తయారు చేయడం జరిగినది.దానితో ఈ దెబ్బకి ఈ ఐపాడ్ పని చేయడం మాని వేసింది. దానిని ఎవరు రిపేరింగ్ చేయలేమని కొత్త దానిని కొనుక్కోవలసిందని చెప్పడంతో నాకు అంత స్థోమత లేకపోవడం అలాగే బాబా వారి పూజలు ఆగిపోవడంతో దీని గురించి పెద్దగా పట్టించుకోవటం మానేశాను. దాదాపుగా ఇది బాబా సమక్షంలో అలాగే సుమారు నాలుగు సంవత్సరాలు ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడైతే ఓంకారనాదంను పట్టుకున్ననాటి నుండి మాకు ధ్యానము నందు బాబా వారికి ఇచ్చిన ఐప్యాడ్ కనిపించటం ఆరంభమైనది. కారణం తెలియరాలేదు. సరే కదా అని దానిని రిపేరింగ్ చేద్దామనిపించి చేయించడం జరిగినది. మళ్లీ తిరిగి అందులో వివిధ రకాల స్తోత్రాలు, భక్తి పాటలు, మంత్రాలు ,పూజావిధానాలు, వాయిద్య సంగీతాలు, భగవద్గీత ఇలాంటి వాటిని ఉపయోగించటం ఆరంభించాను. కొన్నాళ్ళు బాగానే సాగింది. ఉన్నట్టుండి ఒక రోజు ఈ ఐప్యాడ్ మీద అనుమాన సందేహం రావడం మొదలైంది. నేను చేస్తున్న ఓంకారనాదంకి ఈఐప్యాడ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకంటే ఇందులో కూడా నాద సంబంధమైన పాటలే ఉన్నాయి. దీని మాయలో పడితే ఈ పాటలు మాయలో పడితే నేను నెమ్మదిగా ఓంకార సాధన చేసే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒకే ఒక ఓంకారనాదం వినటం జరిగితే … ఐప్యాడ్ లో ఎన్నో రకాల శబ్దాలు సంగీతాలు వినవచ్చును. వీటిని వాడటం వలన ఏకనాద మైన ఓంకారనాదం మీద విసుగు ,చికాకు, అసహనం, ఆసక్తి లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, ఏకాగ్రత లోపించడం లాంటివి జరిగే ప్రమాదాలు ఉన్నాయని బాగా అనిపించింది.మధ్య రాత్రి మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసికి ఈ విషయాలు చెప్పడం జరిగినది. దాంతో వాడు కాస్త “మిత్రమా! ఒకే ఒక ఏక నాదమైన  ఓంకారనాదం ఉండగా భిన్నత్వంలోని సంగీతం మనకు అవసరమా? ఆలోచించు!” అన్నాడు. దాంతో నేను తిరిగి ఐప్యాడ్ ను బాబా సమక్షంలో ఉంచిన మరుసటి రోజు ఉదయం కల్లా ధ్యానములో అంతరిక్షము కనపడింది. ఆ తర్వాత బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము కనిపించింది. ఆపై ఈ బిలము యొక్క చీకటి బిందువైన మధ్య ప్రాంతం నుండి ఒక దివ్యమైన శబ్ద తరంగాలు రావటం నేను గమనించాను. ఈ తరంగాలు నా మనోనేత్రం ముందుకు వచ్చి నీళ్లు కదిలితే ఎలా ఉంటుందో అలా ఈ తరంగాలు అన్నీ కూడా దివ్యతేజస్సుతో ఉన్నా వంపు పైకి ఉన్న ఓంకారం చిహ్నమును కొన్ని క్షణాల పాటు కనపడి లీనమైనది. దానితో నా కుడి చెవి నుండి అప్రయత్నంగా సహజసిద్ధంగా ఓంకారనాదం వినబడటం ఆరంభమైనది. ధ్యానము నుండి బయటకు వచ్చినా కూడా లీలా మాత్రంగా బావిలో నీళ్ళు శబ్దం లాగా లీలగా స్పష్టంగా ఎవరో ఓంకారనాదం చేస్తున్నట్లుగా నా కుడి చెవి నందు ప్రతిధ్వనించడం ఆరంభమైనది. చివరికి ఐప్యాడ్ కూడా ఒక మాయ అన్నమాట. ఇందులో భిన్నత్వం అందుకు సంబంధించిన వివిధ రకాల శబ్దాలు, నాదాలు ఉన్నాయి. ఓంకారమును మర్చిపోయే శబ్ద నాదాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. నేను మాత్రం ఈ భిన్నత్వం నాదాలను వదిలిపెట్టి ఏకత్వ ఏక నాదమైన  ఓంకారనాదం బలంగా భక్తిగా ఏకాగ్రతగా సంకల్పంతో పట్టుకుని ఉండటం వలన నాకు తుంకార నాదం ప్రాప్తి అయినది. అనగా సహజసిద్ధంగా నా కుడి చెవి నుంచి పాంచజన్య శంఖం లోని ఓంకారనాదంలాగా వినపడటం ఆరంభమైంది. సాధకుడు ఎంత జాగ్రత్తగా ఏమరుపాటు లేకుండా ఉండాలో ఈ ధ్యాన అనుభవం నాకు నేర్పించినది. లేకపోతే అందరూ ఆగిపోయినట్లు గా విభిన్న నాదబ్రహ్మల మాయల దగ్గర ఆగి పోయేవాడిని. కొన్ని సంవత్సరాలు అనగా దాదాపు 1,3,5,7,9,11, 12 సంవత్సరాల తర్వాత ఈ సహజ ఓంకార నాదమైన తుంకార నాదం వినిపించడం ఆగిపోయి పరమశూన్యము నాదమైన నిశ్శబ్ద నాదం వినపడుతోంది.అనగా మేము శూన్యబ్రహ్మ స్థితి పొందినట్లు అవుతుంది. అంటే తుంకార నాదము అంటే హృదయస్పందన అని తెలుసుకోండి. నిశ్శబ్ద నాదం అంటే శాశ్వత మరణావస్థ అన్నమాట. ఎప్పుడైతే ఈ నాదం వినపడటం ఆగిపోతుందో నా హృదయం నా హృదయస్పందన ఆగిపోవటం ఏకకాలంలో జరుగుతాయి. ఈ సిద్ధి పొందితే సంపూర్ణ కపాలమోక్షం అనగా నా పంచ శరీరాలకు మోక్ష ప్రాప్తి కలిగి అవి కాస్త నిశ్చల స్థితిని పొంది నాకు మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి అని నాకు జ్ఞానోదయం అయింది. 
 
తుంకార నాదము వినే సాధన స్థితికి అనగా 36 కపాలధారి సదాశివమూర్తి చేసే తుంకార నాదము స్థితికి సాధకుడు చేరుకుంటే అదే అంతిమ సాధన పరిసమాప్తి. నిజానికి సాధకుడు ఇక్కడ ఏమీ సాధన చెయ్యడు. కేవలం విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉంటూ సహజసిద్ధంగా వినిపించే ఓంకార నాదమైన తుంకార నాదమును వింటూ మనస్సును పరమ ప్రశాంతత స్థితికి తీసుకుని వెళతాడు అన్నమాట. ఇట్టి సాధకుడుని శూన్య బ్రహ్మ అందురు. ఇట్టి సాధకుడు ఈ నాద సాధన చేయకపోతే నిద్రపట్టదు. ఏమి తినాలని అనిపించదు. ఏమి చూడాలి అనిపించదు .ఏమి చేయాలని అనిపించదు. ఏమి తిన్నా ఏమి చూసినా ఏమి చేసినా తృప్తి కలగదు. ఇంకా ఏదో కావాలనే తపన ఉంటుంది. అంటే ఒక రకంగా గంజాయి అలవాటు పడినవాడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో అలా ఈ నాద ఉపాసన ఉంటుందని సమయానికి గంజాయి అందకపోతే దానికోసం అలవాటు పడిన వాడు అన్నీ ఉన్న ఏమి లేనట్లుగా, అందరూ ఉన్నా కూడా ఏమీ ఎవరు లేనట్లుగా, అసహనము, కోప ఆవేశాలు పొందుతాడని నా స్వానుభవం సాధనలో తెలుసుకోవడం జరిగింది.అందుకే పరమశివుడు తన అఘోర మూర్తి అవతారంలో జ్ఞాన వల్లి పేరుతో గంజాయిని సేవిస్తూ ఈ తుంకార నాదమును వింటూ మనస్సుని లయం చేస్తూ అమిత ఆనందం పొందడం జరిగింది. గంజాయి వలన తుంకార నాదమును ఎంజాయ్ చేసేవాడిని. నేను ఈ సాధన స్థితికి అనగా శూన్య బ్రహ్మ స్థితికి వచ్చే దాకా నాకు తెలియలేదు. ఆదిలో నా మొదటి అధ్యాయములో అనుకుంటా పరమేశ్వరుని గంజాయితో ఎంజాయ్ చేసే వాడివి అని తిట్టినట్లు లీలగా గుర్తుకు రావడం మొదలైంది. నాదములలో కెల్లా ఓంకారనాదమే అంతిమ ఆది నాదమని గుర్తించండి. మనము వినే సప్తస్వరాలు అన్నీ కూడా ఈ ఓంకారనాదం నుండే వచ్చినాయని గ్రహించండి. కాబట్టి ఏకనాదమైన ఓంకారనాదం పట్టుకొని సాధన చేయండి. 

అంతేగాని సప్తస్వరాల భిన్నత్వం ప్రపంచంలోకి అడుగు పెడితే మీరు ఆ సంగీత లోకానికి మహా సరస్వతి గాన నారదమునిలాగా, తుంబురుడులాగా మిగిలిపోవడం ఖాయం. అలాగే ఓంకారం చిహ్నములో ఒంపు పైకి ఉండేది ఏక నాద ఓంకారం స్వరూపమని ఓంకారంలో ఒంపు కింద ఉంటే అది సప్త స్వరూపాలు చిహ్నమని ప్రతీక అని తెలుసుకోండి. అలాగే కాంతి రూపంలో కూడా ఏక కాంతి శక్తిని ఇచ్చే ఇష్టలింగ సాధన చెయ్యండి. దీనినుండి సప్తవర్ణాల లింగాల ఆరాధనగా నవరత్న నవబ్రహ్మలు వలన మీరు కాస్త ఏకత్వము నుండి తిరిగి భిన్నత్వంలోని కి వెళ్లి పోయే ప్రమాదం ఉందని గ్రహించండి. మొదట ఏకత్వ కాంతిశక్తి ఇష్టలింగ ఆరాధన చేసి దానిని దాటండి. ఆ తర్వాత ఏకనాదమైన ఓంకారనాదం చేసి దానిని దాటి తుంకార నాదములోనికి ప్రవేశించండి. ఆపై పరమ శూన్యమైన నిశ్శబ్ద నాదమునకు ప్రవేశించండి. అంటే ఎట్టి శబ్ద నాదాలు వినని స్థితి ఎలాంటి కాంతి వెలుగులు కనిపించని స్థితికి వెళ్ళండి.అదియే పరమ శూన్య స్థితి.అది ఉందో లేదో తెలియని స్థితి. ఇక్కడ మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ ఉండదు. ఏమీ లేని స్థితి. ఏమీ చూడని స్థితి. ఏమీ కనిపించని స్థితి. ఏదో ఉన్నది అనిపించే స్థితి. అది ఉందో లేదో తెలియని స్థితి. ఇదే అంతిమ స్థితి. మన జన్మ పరిసమాప్తి స్థితి.
 
ఈ స్థితిలో సాధకుడు మనో నిశ్చల స్థితిని పొందిన పరమ ప్రశాంతత వదనముతో భౌతిక మరణానికి శాశ్వత మరణమును పొందే మోక్ష స్థితి. అది పొందినామో లేదో తెలియని విచిత్ర అనుభూతి. ఇదే అసలు సిసలైన స్థితి. మనము పరమ శూన్యములోనికి వెళ్లి అంతరించే సమయంలో సాధకుడికి కాంతి బ్రహ్మ- శబ్ద బ్రహ్మ- నిశ్శబ్ద బ్రహ్మ అనే పదవుల ఆశ పెట్టడం జరుగుతుంది. దీనిని దాటాలంటే సాధకుడికి నవపాషాణ ఇష్టలింగ కాంతి బ్రహ్మ అలాగే రిషికేశ్ నుండి వంపు పైకి ఉన్న నవరత్న ఓంకారం వస్తే శబ్ద బ్రహ్మను అదే నేపాల్ నుండి గండకీ నది నుండి విష్ణు సాలగ్రామం అయిన సుదర్శన చక్రం వస్తే బ్రహ్మ పదవులను దాటే యోగ్యత అర్హత మనకి ఉంటాయి. అనగా కాంతి బ్రహ్మ యందు సప్తవర్ణాలుతో అనగా నాకు తెలిసి తెలుపు- నలుపు- ఎరుపు- నీలం- ఆకుపచ్చ- పసుపు- కాషాయ రంగులు వస్తాయి. ఇవి దీక్షలుగా రావచ్చును. అనగా వీటి రంగు వస్త్రాలు ధరించి శివ దీక్ష తీసుకుని ఇష్ట లింగారాధన చేయవలసి ఉంటుంది. ఇదియే శాశ్వతం కాదని సాధకుడు కూడా తెలుసుకోవాలి. లేదంటే కాంతి యోగిగా అనగా బసవేశ్వరుడు లాగా ఉండిపోవాల్సి ఉంటుంది. ఈ లింగము మీద అనేక రంగుల దీక్షలు మీద మోహం వ్యామోహం పెంచుకోకూడదు. నాకైతే లేత నీలిరంగు వస్త్రముతో దీక్షతో ఇష్టలింగ ఆరాధన చేయవలసి వచ్చినది. చేశాను. కానీ దాని మీద నేను మోహ, వ్యామోహాలు పెంచుకోలేదు. ఇష్ట లింగము ఉన్నా లేకపోయినా అలాగే శివ దీక్ష వస్త్రాలు విషయంలో మేము పెద్దగా స్పందించలేదు. అలాగే ఇదే స్థితిలో మా జిఙ్ఞాసి ఐతే తెల్లని వస్త్రాలతో శివదీక్ష ఇష్టలింగ ఆరాధన చేయమని చెప్పడం జరిగినది. వారు కూడా నాకు లాగానే దీనియందు మోహ వ్యామోహాలు పెంచుకోలేదు. దానితో మేమిద్దరము కాంతి బ్రహ్మ పదవి స్థితి నుండి దాటటం జరిగినది. 

అప్పుడు మాకు ప్రకృతిసిద్ధ లింగాలైన శివలింగ దొండకాయ విత్తనాలు వచ్చినాయి. వీటి ప్రత్యకత ఏమిటంటే ఇవి చూడటానికి అచ్చంగా పానపట్టము ఉన్న శివలింగాలు లాగా ఉంటాయి.గాకపోతే ఇవి చాల చిన్నవిగా ఉంటాయి.శివలింగపువ్వులు లాగానే ఈ శివలింగ దొండకాయలులలో శివతత్త్వమును కలిగిఉండటము మనకి ఆశ్చర్యం కల్గించక మానదు. ఆ తర్వాత పరమశూన్యము నుండి మాకు లీలగా ఓంకార నాదం వినపడింది. దానితో మేమిద్దరము ఓంకారనాదం చేయడం ఆరంభించినాము. ఇలా కొన్నాళ్ళకి మాకు రిషికేశ్ నుండి రావలసిన చోటునుండి అనివార్య కారణాల వలన జైపూర్ నవరత్న ఓంకారము రావడం జరిగినది. అప్పుడు మేము ఓంకారనాదం చేయగా సప్తస్వరాలతో కూడిన వివిధ రకాల వాయిద్య సంగీతం భక్తి గీతాలు భక్తి పాటలు గీతాలు ప్రేమ గీతాలు విరహ గీతాలు మంత్రాలు పూజావిధానాలు రావటం మొదలయ్యాయి. వీటిమీద నేను మోహ వ్యామోహాలు పెంచుకోలేదు. విని ఆనందపడే వాడిని. లేకపోతే ఏదో తెలియని అసంతృప్తి కలిగేది. దీని కోసం వీటిని వినటం అలవాటు చేసుకోవడం జరిగింది. రానురాను ఓంకార నాదం వినిపించే స్వర ఆడియో మాత్రమే వినే స్థితికి నేను చేరుకున్నాను. దానితో మిగిలిన సప్తస్వరాల గీతాలు మా మీద ప్రభావం చూపడం ఆపివేసినాము. మేము గాని ఓంకారనాదం పట్టుకోకబోతే సప్తస్వర జ్ఞానము వలన మేము పాటలు పాడడం లేదా పాటలు రాయడం లేదా గాన గంధర్వుడులా పేరు ప్రఖ్యాతులు ఈ పాటికే పొంది ఉండేవాళ్ళం. కాకపోతే నేను ఏక నాదమైన ఓంకారనాదం మాత్రమే ఈ స్థితిలో అనగా శబ్దబ్రహ్మ పదవిలో విన్నప్పుడు దానితో ఈ పదవుల మీద మాకు మోహ వ్యామోహాలు దొబ్బినాయి. అంటే ఈ పదవిని నేను దాటిపోవడం జరిగినది. కానీ నాకు తెలిసినంత వరకు ఈ పదవి దగ్గర హనుమంతుడు, హయగ్రీవుడు, గాయత్రీమాత ,శిరిడి సాయిబాబా, దత్తాత్రేయుడు ఆగిపోయినారని తెలిసినది. ఆ తర్వాత మాకు రుషికేశ్ నుండి చిన్నగా ఉన్న రుద్రాక్షమాల అలాగే చిన్నగా ఉన్న స్పటిక మాల వచ్చినది. ఆ తర్వాత మరికొన్ని రోజులకు నా ప్రమేయం లేకుండా నా కుడి చెవిలో ఓంకారనాదం చాలా సహజసిద్ధంగా వినిపించేది. మొదట్లో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత ఈ నాదమును నా బ్రహ్మరంధ్రము మూల కపాలములో ఉన్న 36 కపాలాల అస్థిపంజర సదాశివమూర్తి చేస్తున్నాడని అర్థం అయినది. అంటే మూడు లక్షల కోట్ల జన్మల తరువాత ఈ జన్మలో నాకు ఈయన నుండి వినవచ్చే సహజ ఓంకారమైన తుంకార నాదము వినే యోగ్యత లభించినది. అంటే శూన్య బ్రహ్మ పదవి స్థాయిని మేము చేరుకున్నాము అని అర్థం అయినది. దీనికి సాక్ష్యంగా పరమశూన్యము కాస్త ఆది శూన్యబ్రహ్మ అయిన చిలుక తలయున్న శుకమహర్షి వారి సంకేతమైన జ్ఞానపక్షి అయిన రామచిలుక కీచైన్ నాకు పంపించడము జరిగినది. 
  
ఎపుడైతే మాకు ఈ నాదం వినిపించదో అదియే నిశ్శబ్ద నాదము అవుతుంది.అంటే మా హృదయం ఆగిపోతుంది. అనగా హృదయ స్పందనే తుంకార నాదము అన్నమాట. హృదయ స్పందన ఆగిపోతే నిశ్శబ్ద నాదము అని మాకు అర్థం అయినది. అప్పుడు మాకు గండకీ నది నుండి సుదర్శన చక్రాలుగా ఉన్న విష్ణు సాల గ్రామం ఒక అంగుళం మేర పరిమాణంలో ఉన్నది మాకు వచ్చినది. దీనిని పూజలో ఉంచి దానిని మెడలో వేసుకోగానే ఓంకారనాదం నెమ్మదినెమ్మదిగా ఆగిపోతూ పరమ ప్రశాంత స్థితిని నెమ్మదినెమ్మదిగా పొందటం జరుగుతోందని ఇది పూజ లో ఉంటే తుంకార నాదము ఇంకా చాలా స్పష్టంగా మా కుడి చెవి నుండి వినపడేది. ఎపుడైతే దీనిని ధరించినామో లీలగా వినిపించి వినిపించని స్థితిలో నిశ్శబ్ద నాదము ఉండేది. అంటే దీనిని ధరించడం వలన శూన్యబ్రహ్మ పదవి మాయా మోహ వ్యామోహాలు దాటినామని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. కాకపోతే ఈ పదవి దగ్గరకి నాకు తెలిసి సదాశివమూర్తి, మహావతార్ బాబాజీ, శ్యామలాహిరి శ్రీ మహావిష్ణువు ఆది పరాశక్తి ఆగిపోయినారు. ఇప్పుడు మా సాధన అంతా ఎప్పుడైతే లీలా మాత్రంగా వినిపించే తుంకార నాదము అదే మా హృదయ స్పందన ఆగిపోతుందో అదే మా జీవసమాధి అవుతుంది. అనగా మా పంచ శరీరాలు మా మెడలో ఉన్న అంగుళం మేర బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన సాలగ్రామమునందు అనగా మా బ్రహ్మరంధ్రములో సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలముగా ఈ డొప్ప ఉన్న సాలగ్రామం ఉన్నదని దానితో మాకు ఒక రోజు ధ్యాన స్పురణగా మేము నిత్యం పూజించే ఇష్టలింగము వివిధ సాలగ్రామాలు శివ పంచాయతనం వివిధ రకాల దైవిక వస్తువులు ఇలా అన్నీ కూడా ఈ చక్రము నందు ఒక్కొక్కటిగా అందులో పడిపోతూ అంతర్ధానమయ్యే విధానం కనిపించేసరికి నన్ను కూడా ఇలా పరమ శూన్యమునందు లీనము చేసుకోవడానికి ఈ మహత్తర సాలిగ్రామము వచ్చినదని ఇదియే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము అని నాకు అర్థం అయింది. దీనిని ధరించడం ఆరంభించాను. ఒక రోజు మాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే కాంతి బ్రహ్మ పదవి దాటినందుకు నాకు లింగదొండ కాయలు వచ్చినాయి.అదే ఇష్ట లింగము ఆరాధన చేస్తూంటే కాంతి బ్రహ్మగా మిగిలిపోయేవాడిని అని గ్రహించండి. అదే ఓంకార బ్రహ్మ పదవి అనగా శబ్దబ్రహ్మ  లేదా నాద బ్రహ్మ పదవిని దాటేందుకు రిషికేష్ నుండి అతి చిన్న నల్లని రుద్రాక్షమాల అలాగే అతి చిన్న స్పటిక మాల వచ్చినాయి. ఓంకార నాదం లో ప్రకృతి స్త్రీ ఉంటారు కదా. దీనికి సంకేతంగా రుద్రాక్షలు స్పటికాలు వచ్చినాయి. ఆ తర్వాత శూన్య బ్రహ్మ పదవి దాటినందుకు  నాకు కాశీ క్షేత్రము నుండి అతి చిన్న రాతితో చేసిన 36 కపాలమాల వచ్చినది. ఈ మూడు పదవుల మీద ఆశ మోహం వ్యామోహంలో లేనందువలన ఎలాంటి మాయలు ఙ్ఞాన మాయలు నన్ను ఏమీ చెయ్యలేకపోవడముతో ఎలాంటి ప్రయోజనం ఏమీ లేకపోవడంతో విశ్వము కాస్త అదే మూల ప్రకృతి అయిన జగత్ కాస్తా చచ్చినట్లుగా నాకు పరమ శూన్యమునందు నామము రూపము లేని స్థితిని కలిగించేందుకు సిద్ధపడింది.అంటే నా జీవాత్మ కాస్త విశ్వాత్మ అయినది. ఎపుడైతే ఈ మూడు రకాల బ్రహ్మ పదవులు దాటినానో దానికి ప్రతిఫలంగా నాకు గంగానది నుండి గండకీ నది నుండి రెండు సుదర్శన చక్రాలు కలిగి ఉన్న డొప్ప ఉన్న విష్ణు సాలగ్రామం రావడం జరిగినది.
 

సాలగ్రామం పూజించటానికి అలాగే ధరించడానికి అందరికీ అర్హత యోగ్యత ఉండదని మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి అనుభవం చెబుతోంది. ఇతను కాంతి బ్రహ్మ పదవి దాటినాడు గాని ఓంకారనాదం పదవి దగ్గర అతని ప్రమేయం లేకుండా అమ్మ వారు ఆపేసినది. ఇతనికి సహజ సిద్ధంగా ఓంకారనాదం వినిపించలేదు. ఇతనికి వచ్చిన నవరత్న ఓంకార చిహ్నములో అమ్మవారి సంకేతమైన వజ్రము లేకుండా వచ్చినది. తద్వారా ఇతను బ్రహ్మాండం చక్ర కృష్ణ బిలమైన సాలగ్రామాన్ని పొందకుండా జరిగినది.కారణము ఇతనికి బాల రూపము అమిత ఇష్టం. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిలో అన్ని రూపాలు దాటిన గాని బాల మాయ అనగా అతి చిన్న సూక్ష్మ రూపమును దాటలేక పోయినాడు. కానీ శూన్య బ్రహ్మ పదవిని పొందే యోగ్యత ఉండటం వలన ఇతనికి లింగదొండ కాయలు రావడం జరిగినది. కానీ ఓంకార నాదం వినిపించకపోవడంవలన ప్రస్తుతానికి బాలాదేవి మాయ దాటడానికి సహజసిద్ధంగా వినిపించే తుంకార నాదం వినిపించడానికి  వినే స్థితికి ఇతను వెళ్ళటానికి నెలల పాటు సాధన చేయవలసి ఉంటుంది. వీరికి సహజంగా ఓంకారనాదం తన కుడి చెవి నుండి వినపడితే శూన్యబ్రహ్మ స్థితికి వచ్చినట్లు అవుతుంది. ఆపై ఈ నాదము పోయి పరమ శూన్యనాదమైన నిశ్శబ్ద నాదము వినిపించే స్థితికి వస్తే పరమ శూన్యముందు అంతర్ధానమయ్యే అర్హత యోగ్యత లభిస్తుంది. అప్పుడు వీరికి బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమైన సాలగ్రామములు పొందవలసి ఉంటుంది. దానితో మన వాడికి అడుగు దూరంలో ఉన్నది. దానితో నేను కాస్త బాగా విశ్లేషణ చేస్తూ ఉండటముతో విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉండి పోయాను. ఈ మూడు బ్రహ్మ పదవులను దాటితే ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఉందా? దానికి ఏమి చేయాలో మీకు తెలుసు కదా.

శుభం భూయాత్
పరమహంస పవనానంద
*****************************************
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి