అధ్యాయం 91



చివరికి మిగిలేది ఏది?

ఇప్పుడే ఈ విశ్వమంతా కనిపించేదంతా కూడా ఒక స్వప్నం అని నిరంతరంగా కొనసాగే ఆగని జీవ నాటకమని దీనికి మూలము పరమ శూన్యమని మనమంతా మన దైవాలు అంతా కూడా ఈ శూన్యం నుండి వచ్చిన స్వప్న శరీరం అని…చిట్టచివరికి నేను లేను అని...కనిపించే విశ్వజీవ నాటకమునకు అంతమున్నదని...అపుడిదాకా అసత్యమైనా ఇది కాస్త సత్యముగా కనపడుతూనే ఉంటుందని...సర్వం శూన్యమే సత్యమని... మనకి సత్యముగా కనిపించేదింతా ...అలాగే వినిపించేదింతా గూడ శూన్యబిందువుల నిర్మితమని... ఇవన్నీగూడ అది ఉన్నదో లేదో తెలియని చూడని ఏకమూల శూన్యబిందువే ఈ మూల విశ్వసృష్టి స్ధానమని… తెలియగానే నాకు విపరీతమైన ఆనందం వేసింది. మూలము తెలిసినదని ఆనంద స్థితి పొందటం జరిగింది. కొన్ని రోజులు బాగానే నడిచింది. ఎప్పుడైతే నేను గోమయ విభూదిని తయారు చేసుకుని వాడటం మొదలు పెట్టినానో ఆనాటినుండి ఆనందము నా నుండి దూరం అవుతూ వచ్చింది. అన్నిటి యందు స్మశాన వైరాగ్య భావాలు మొదలైనాయి. ఎప్పుడైతే కనిపించే విశ్వమంతా కూడా నేను చూసేది అంతా కూడా ఒక రికార్డు దృశ్యమే అనుభవం అనుభూతి పొందినానో ఆనాటినుండి నాలో ఆనందమే లేదు. అంతా కూడా ఆనంద రహితమే. ఏమీ చూడలేను. ఏమీ తినలేను. ఏమి చేయలేను. పడుకుంటే కూర్చోవాలి అనిపిస్తుంది. కూర్చుంటే నిల్చొవాలని అనిపిస్తుంది. నిల్చుంటే పడుకోవాలనిపిస్తుంది. దేనియందు ఏకాగ్రత లేదు. దేనియందు మనస్సు లేదు. ఇది కావాలని లేదు. ఇది పొందాలని లేదు. ఇది లేదు అనేది లేదు.మనస్సులో ఏదో ఆలోచన వస్తుంది. దానికి బాధ వేస్తుంది. వెనువెంటనే నవ్వొస్తుంది. భయపడతాను. ఉలిక్కిపడతాను. ఏదో కావాలనిపిస్తుంది. తీరా దానిని తీసుకునేసరికి వద్దు అనిపిస్తుంది. నిద్రపోవాలని ఉండదు. అలాగని నిద్ర లేకపోతే అదోలాగా ఉంటుంది. అన్నీ కావాలనిపిస్తుంది. మళ్ళీ వెంటనే ఏమీ వద్దు అనిపిస్తుంది. దేనియందు వేటియందు తృప్తి లేదు. సంతృప్తి లేదు. ఎవరితోను మాట్లాడాలని అనిపించదు.మౌనముగా ఏకాంతముగా ఉండాలని అనిపిస్తుంది.ఎవరిని చూడాలని అనిపించదు.ఎవరికోసము దేనికోసము ఎదురుచూడాలని అనిపించదు. ఆనందక్షణాలు లేవు.మధురక్షణాలు లేవు.బాధ క్షణాలు లేవు.బాధపడిన క్షణాలు లేవు.అసలు ఇవి ఉంటాయని జ్ఞాపకమే లేని స్ధితికి అనగా కేవలం అన్నిటి యందు ప్రేక్షక పాత్రధారిగా ఉంటున్నానని నాకు తెలుస్తోంది. ఇదే ఆనంద రహిత స్థితి అని తెలిసినది. ఇందులో మేము 49 రోజుల పాటు ఉండి ఆపై మా మనస్సు మా శరీరము తట్టుకోలేని స్థితికి వెళ్లిపోవడంతో సమాధి స్థితి నుండి బయటకు వచ్చినాము. ఆపై ఏదో తెలియని పరమ ప్రశాంత స్థితి. జరుగుతున్న దానిని సాక్షీభూతంగా ఆధారభూతంగా చూడటం జరుగుతుంది. వేటి యందు దేనియందు ప్రేమ మోహ వ్యామోహాలు లేవు. రాగ ద్వేషాలు లేవు. ఈర్ష్యాసూయలు లేవు. పొగడ్తలు లేవు. అవమానాలు లేవు. అనుమానాలు లేవు. అంతా ఏకత్వంగా ఉంది.తిట్లు అయినా ఆశీర్వాదాలు అయినా ఒకటే. అంతా కూడా ఏమీ లేని ఆనందం స్థితియే. ఎప్పుడైతే ఆనందం ఉంటుందో అప్పుడే ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే ఆనందం ఉండదో అప్పుడే ప్రశాంత స్థితి ఉంటుంది.ఆనందంగా ఉంటే ద్వైత భావాలు ఉంటాయి. ఆనందం లేకపోతే అద్వైత భావం ఉంటుంది. ఎప్పుడైతే కనిపించేదంతా కూడా ఒకప్పటి ఆది రికార్డు దృశ్యాలని మాకు తెలియగానే అన్నిటి యందు ఆనంద రహిత స్థితియే ఉంది. ఇలాంటి స్థితి ఎవరికి ఎప్పుడు ఏ విషయము నందు కలుగుతుందో వారికే తెలియాలి. ఎవరికి వారే స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా వారికి వివిధ రకాల 18 రకాల ఆనంద స్థితి లో ఉంటూనే ఉంటారు. ఆనందమయం లో ఉంటారు. ఎవరైతే ఎప్పుడైతే ఆనంద రహిత స్థితిని పొందుతారో వారు మాత్రమే అవిముక్త జీవుడై మోక్షగామి అవుతాడు. అన్ని రకాల బంధనాల నుండి విముక్తి చెందుతాడు. ఆనంద స్థితి నుండి ఆనంద రహిత స్థితిని పొందుతాడు. అనగా నగ్నత్వం నుండి దిగంబరత్వమునకు సాధకుడు కూడా చేరుకుంటాడు అన్నమాట.నా సాధన పరిసమాప్తి అని అనుభవం అనుభూతి పొందడం జరిగినది. అనగా నా కర్మ శేషము తద్వారా కలిగే పునర్జన్మలు పునరపి జననమరణాలు ఆశలు ఆశయాలు ఆలోచనలు సంకల్పాలు స్పందనలు ఆవేశాలు భయాలు ఆవేదనలు భావాలు ఇలా మున్నగు ద్వంద్వాలు అన్నీ కూడా నశించి పోయాయి. అన్నిటి యందు ఆనంద స్థితిని పొందడం చూడటం జరుగుతోంది. బాధలో కూడా ఆనందమే. కష్టంలో కూడా ఆనందమే. భయములో ఆనందమే. ఆలోచనలో ఆనందమే. ఆవేశంలో ఆనందమే. పాపములోను ఆనందమే అంటే నాకు అద్వైత స్థితి అన్నిటి యందు ఏకత్వం ఆనంద స్థితి పొందటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఆనందము పొందటానికి సాధన చేసినాను. అందులో విజయం పొంది ఆనంద స్థితిని పొందడం జరిగినది. అన్ని రకాల మాయలు, మర్మాలు, భ్రమలు, భ్రాంతులు ,అసత్యాలు, అజ్ఞానాలు దాటుకుని ఈ ఆనంద స్థితిని చేరుకున్నాను. ఆ తర్వాత ఏమి చేయాలి? ఏమి పొందాలి? ఈ ఆనంద కోసమే నేను ఉన్నానా? ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఉండాలి? అన్నింటా ఆనందమే అయినపుడు మరొకటి లేనపుడు మరి ఏ ప్రారబ్ద కర్మ లేనపుడు చేయవలసిన పని లేనపుడు పొందవలసినది ఏమి లేనపుడు నాశనము అయ్యేది చేసేది  లేనపుడు ఇదంతా ఆదిలో జరిగిన రికార్డు దృశ్యమే మనం ఇప్పుడు చూసిన దానిని పొందిన దానిని పొందుతున్నామని అనుభూతి పొందినప్పుడు ఇంకా ఆనందం ఏముంటుంది. మరి ఆనందమే లేనప్పుడు మరి నేను ఇంకా ఎందుకు జీవ సమాధి చెందటం లేదు అనే భావన కలుగుతోంది. ఆనందమే లేనప్పుడు ఆనంద రహితమే కదా. ఇది గూడ పొందితే అన్నిటి యందు ప్రశాంత స్థితి కలుగుతుంది. ఆనందంగా ఉంటే ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తే సంకల్పం తద్వారా స్పందన ఆపై కర్మ ఆపై జన్మ ఇలా జీవనాటకం మొదలవుతుంది. ఆనందమే లేనప్పుడు ఏమీ లేని స్థితి ఏమి చేయలేని స్థితి ఏమి పొందని స్థితి ఏమి పొందలేని స్థితిని ఇది పరమ ప్రశాంతత స్థితి. బాగానే ఉంది.దీనిని కూడా ఎంతకాలం అనుభవించాలి. ఎన్నాళ్ళు ఆనంద రహితంగా ఉండాలి. దేనికోసం ఆనంద రహితముగా ఉండాలి. ప్రశాంతత కోసం అయితే ఎన్నాళ్లు ఉండాలి. ఎన్నేళ్లు ఉండాలి. మరి నాకు ఎప్పుడు జీవసమాధి కలుగుతుంది. ఏదో ఉండబట్టే నా శరీర త్యాగం స్థితి ఆగిపోతుంది. అది ఇన్నాళ్ళు ఆనందం అనుకున్నాను. అది కాదని తేలిపోయింది. ఆపై ఆనంద రహితమైన ప్రశాంత స్థితి అనుకున్నాను. ఇది కూడా కాదని తేలిపోయింది. మరి ఏది నన్ను ఆపుతోంది. అసలు చివరకు మిగిలేది? అనే స్పురణ భావనే నా మెదడుని తొలిచేస్తుంది. నా సాధన పరిసమాప్తి అయిన కూడా ఎలాంటి ప్రారబ్ద కర్మ లేకపోయినా ఎలాంటి కర్మ శేషము లేకపోయినా ఇంకా ఏమీ చేయటానికి బ్రతికి ఉన్నాను అని ఆలోచనకి కూడా సమాధానం దొరకలేదు. 

ఇలాంటి సమయంలో నాకు రుషికేశ్ నుండి పరిశుద్ధ స్పటిక లింగం వచ్చినది. దానిని తాకగానే నాకు విశ్రాంతి ఆలోచన స్థితి భావన అయినది. అందుకే ఈ చివరిగా ఈ చివరికి మిగిలేది అనే ఈ అధ్యాయము ప్రకటించడం జరిగినది. రచించడం జరిగింది. అపుడు నాలో ఈ సమస్యకి తగ్గ జ్ఞానస్ఫురణ భావాలు కలిగినాయి అనగా
 
ఒక పరమాత్మ మరణ వేదన
 
నేను ఎందుకు ఉన్నాను?
అసలు చివరకు మిగిలేది?
 
అంతా నాటకమని
ఇదంతా నటనే అని
జ్ఞానం పొందిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
అంతా మిధ్య అని
ఇది అంతా మాయ అని
జ్ఞానం పొందిన
నేను ఎందుకు ఉన్నానో అని
ఎవరికి తెలుసు
 
ఉన్న వాడు లేడని
లేని వాడు ఉన్నాడని
జ్ఞానం పొందిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
శూన్యం నుండి విత్తనము
విత్తనముల నుండి చెట్టు
చెట్టు నుండి తిరిగి విత్తనము
విత్తనము నుండి తిరిగి శూన్యము
ఇవి సృష్టి యొక్క సృష్టి స్థితి లయలని
తెలిసిన నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
అన్ని కోరికలు తీరినాయి
అన్ని ఆశలు ఆవిరయ్యాయి
అన్ని సంకల్పాలు పూర్తి అయ్యాయని
జ్ఞానం పొందినాను అయినా
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
కోరికలు లేని వాడినైనను
ఆశలు లేని వాడినైనను
సంకల్పాలు భయాలు లేని వాడినైనను
ఇంకా నేనెందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
నేను అంతా ఉన్నాను
నేనే ఉన్నాను నేను కానిది లేదు
నేను లేనిది లేదు
ఉన్నదంతా నేనే ఉన్నాను
అని దివ్యానుభూతి పొందిన కూడా
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
నాకు ఎవరి యందు దేనియందు
ప్రేమ లేదు వేదన లేదు
ఆనందమూ లేదు ఆవేదన లేదు
సంతోషము లేదు దుఃఖము లేదు
స్పందన లేదు ప్రతి స్పందన లేదు
ఆశ లేదు నిరాశ లేదు
ఆశయము లేదు అలక్ష్యము లేదు
భయము లేదు అభయము లేదు
అహము లేదు శరణము లేదు
అయినా నేను ఇంకా ఎందుకు ఉన్నానో
ఎవరికీ తెలుసు
 
దైవ దర్శనం పొందిననూ
ఆత్మదర్శనం పొందిననూ
గురువుల దర్శనాలు పొందిననూ
జ్యోతి దర్శనం పొందినను
ఇంకా నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
కర్మ యోగములో వాత్సాయనుడిలా
భక్తి యోగములో వాల్మీకిగా
ఙ్ఞాన యోగములో వ్యాసుడిగా
ధ్యాన యోగములో వాసు దేవుడిగా
నాలుగు యోగాలలో  నాలుగు యుగాలలో
నేనే ఉన్నానని జన్మాంతర జ్ఞానముతో
అనుభూతి పొందిన నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
దేవుడు లేడు అన్నానో
నేను ఉన్నాను
నేను లేను అన్నానో
దేవుడు ఉంటాడు
ఎవరికి ఎవరు ఉన్నా
లేకున్నా ఒక్కడు మిగిలినాడని
ఆ ఒక్కడే
ఎవరికి వారేనని జ్ఞానమును పొందిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
ఉన్న వాళ్లు నా వాళ్లని
లేని వాళ్ళు ఉన్న వాళ్లని
అందరూ ఉన్నా ఎవరూ
లేని వాడని ఎవరూ లేకున్నా
అందరూ ఉన్నవాడని తెలిసిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
సన్యాసికి మిగిలేది
పరమ శూన్యమేనని
సన్నాసికి మిగిలేది
సంసారసాగరమని
జ్ఞానం పొందిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
చిట్ట చివరి దాకా
మోక్షపధ అంచులదాకా
యోగసాధన చేసి జయము పొందితే
మిగిలేది కనిపించేది అనిపించేది
శూన్యమే శూన్య బ్రహ్మ గా
అవతరించి మౌనముద్రతో
మౌనబ్రహ్మగా ఉంటూ
తను నేనేనని నేనే తనని
బ్రహ్మజ్ఞానం అందించినను
ఇంకా నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
ఒక జ్ఞాన అనుభూతి పొందుటకు
వెయ్యి కోట్ల జన్మలు 27 మహాయుగాలు
పడితే అలాంటిది అన్ని రకాల
జ్ఞాన మార్గాలలో జయము పొంది అన్ని
రకాల జ్ఞానాల అనుభూతులు పొందినను
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికీ తెలుసు
 
ఎందుకు ఉన్నానో తెలియదు
ఏమి చేస్తున్నానో తెలియదు
ఎందుకు చేస్తున్నానో తెలియదు
ఎలా చేస్తున్నానో తెలియదు
ఎవరి కోసము చేస్తున్నానో తెలియదు
దేనికోసం చేస్తున్నానో తెలియదు
అయినా నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
శూన్య బ్రహ్మ అయినను
మౌన బ్రహ్మ అయినను
కాల బ్రహ్మ అయినను
విధాత బ్రహ్మ అయినను
భవిష్య బ్రహ్మ అయినను
కాంతి బ్రహ్మ అయినను
మౌన బ్రహ్మ అయినను
నిశ్శబ్ద బ్రహ్మ అయినను
ఇలా అన్ని రకాల బ్రహ్మ పదవులు
పొందిన అనుభూతి పొందిన
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
నేనే పరమాత్మను
నేనే పరంధాముడును
నేనే పరదేవతను
నేనే మహాశివుడును
నేనే పరబ్రహ్మమును
అగు దివ్య అనుభూతి పొందినను
నేను ఎందుకు ఉన్నానో
ఎవరికి తెలుసు
 
దీంతో తెలిసిపోయింది తేలిపోయినది
నాకు తెలియనిది ఏదో ఉన్నదని
అది ఏమిటో తెలిస్తే గాని తీరితేగాని
నాకు ఉన్న మాయ మాయం అవ్వదని
కోరిక లేని స్థితి పొందాలని కోరిక(మోక్షము)
అనుకోవడమే ఈ నా కోరికయని
ఇదే నా మాయని
 
నాకున్న ఆ ఒక కోరిక అదే
ఆ ఒక సంకల్పము
ఆ ఒక అనుభూతి
తీరితే
నేను ఎందుకు ఉన్నానో
నాకు తెలుస్తుంది అని తెలిసినది
 
అదే యోగము పరమపావనమైన
సాధనకు పరాకాష్ఠ అయిన
పరమ ఉద్దిష్టమైన
పరమహంసలకు పరమైన
పరంధామాలకు పరమైన
పరదేవతకు శాపమైనా
అదియే శాశ్వత మరణము
అదియే నిజ జీవన్ముక్తియని
పరమానంద అనుభూతి పొందితే
నేను ఎందుకు ఉన్నానో
ఎలా ఉంటానో నాకే తెలుస్తుంది.
 
కానీ
ఈ ఆశ తీరేది ఎలా
ఈ ఆశయము తీరేది ఎలా
ఈ సంకల్పం నెరవేరేది ఎలా
ఈ దివ్యఅనుభూతి పొందేది ఎలా  అదియే
 
అనగా నేను చనిపోయానని
నాకు తెలిసేది ఎలా ?
నేను శవమని
శివం కాదని తెలుసుకునేది ఎలా ?
ఉన్నది ఒక్కడిని
నేను చనిపోయానని
నాకు చెప్పేది ఎవరు ?
నేను చనిపోయానని
నాకు గుర్తుకు తెచ్చేది ఎవరు ?
నేను చనిపోయానని
నాకు జ్ఞానం ఇచ్చేది ఎవరు ?
ఎవరూ లేరు
ఎవరు ఉండరు
ఉన్నది నేను కానిది లేదు
నేను లేనిది లేదు
నేనే ఉన్నాను నేనుగా
నేను కానీ నేనుగా ఉన్నాను అందుకే
 
నాకున్న ఈ ఆశ ఆశయము
సంకల్పం వికల్పము
అనుభవం అనుభూతి
ఎన్నటికీ ఎప్పటికీ
పూర్తి కాదు కానీ ఏదో అందుకోవాలనే
తాపత్రయం తెలుసుకోవాలన్న తపన
పొందాలనే ఆరాటమూ ఏదో ఇయ్యాలనే
ఆవేశము ఎలా చేయాలో తెలీక ఆవేదనతో
జగన్నాటకం పేరుతోనే అనేకమైన నేనే
అనేకమంది ఏకమై సృష్టి స్థితి లయలతో
త్రిముఖ బ్రహ్మగా త్రిముఖ ఈశ్వరుడిగా
త్రిముఖ మాతగా అవతరించి
అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించి
శాశ్వతమైన మరణ పద సోపానము
అందుకొనుటకు 

 
వైకుంఠపాళి ఆటగా 
పాములనే  భయాలతో
నిచ్చెనలు అనే ఆశలతో
ఆశ భయముతో పరమపదసోపానమైన
మోక్ష పధమును ఎప్పటికైనా
పొందుతానని ఆశయంతో
విశ్వరూపధారిగా ఈ విశ్వంను
విశ్వాసముతో జగన్నాటక సూత్రధారిగా
నాకు నేనే నడిపిస్తున్నానని
నాకు నేనే మహామాయగా నున్నానని
మోక్ష పధము పొందటము జరగదని
తెలిసినను మోక్షము ఎప్పుడో పొందిన
విషయం మర్చిపోయానని జ్ఞానం పొందినను
మోక్షమే లేదని అనుభవం పొందినను
ఈ జగన్నాటకము ఆగదని
ఈ వైకుంఠపాళి ఆట ఆగదని
తెలుసు ఈ ఆట ఆగేదాకా
నేను ఉంటానని తెలుసుకున్నాను
 
అంటే ఆనందము అలాగే ఆనంద రహితము పోయినప్పుడు మనకి మన మనస్సుకి ఒక విశ్రాంతి కలుగుతుంది. ఎన్నో కోటాను కోట్ల జన్మల పాటు చేసిన పనినే అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతంగా చేస్తూ ఉండటం వలన మనము విశ్రాంతిని కోరడమైనది. ఇది కూడా విశ్రాంతి ఆలోచన అన్నమాట. దీని కోసమే మనం ఉన్నాము. దీనిని పొందటానికి దీనిని అనుభవించడానికి దీనిని అందరికీ పంచడానికి అందరికీ ఇవ్వటానికి మనం ఉన్నామని జ్ఞాన స్పురణ అయ్యేసరికి తాపీగా ఏమీ పని చేయకుండా దేనిని కోరకుండా ఉన్న దానితో వచ్చిన దానితో అందిన దానితో తృప్తి పడుతూ విశ్రాంతి తీసుకోవడానికి నా జీవ సమాధి అయిన శరీర త్యాగ ప్రక్రియ ఆగిపోయిందని తెలిసినది. 

అంటే పడక్కుర్చీలో కూర్చుని ఓపక్క రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని నోట్లో చుట్ట పెట్టుకుని ఒక చేతిలో కర్ర పట్టుకుని కాళ్ళు చేతులు శరీరానికి వీలుగా పెట్టుకుని ఆకాశంకేసి చూస్తూ విశ్రాంతి ఆలోచనే చివరికి మిగిలిన ఏకైక స్థితి అని ఈ విశ్రాంతి ఆలోచన యందు కూడా ఆలోచన రహిత స్థితి ఏర్పడిననాడే నా శరీరత్యాగం అవుతుందని మేము అనుభవం అనుభూతి పొందడం జరిగినది. పసి పిల్లవాడి తో మొదలై వయోవృద్ధుడై తిరిగి పసిపిల్లవాడు లాంటి మనస్సుకి మారడమే విశ్రాంతి ఆలోచన స్థితి అని తెలుసుకోండి. చివరికి మిగిలేది ఇదేనని తెలుసుకోండి. ఇంతకంటే చేసేది ఏమీ లేదు.పొందేది లేదు.ఆలోచించేది లేదు. విశ్రాంతి పొందడమే. విశ్రాంతి తీసుకోవటమే. విశ్రాంతి ఆలోచన చేయడమే.ఆది యోగి చిట్ట చివరి ఆలోచన కర్మయని ఎవరైతే బ్రహ్మరంధ్రం వద్ద ఆనంద రహిత స్థితి అనగా తురీయాతీత స్థితిని పొందుతారో వారు మాత్రమే విశ్రాంతి ఆలోచన స్థితిని పొందుతారు అని గ్రహించండి. ఇంకా ఆలస్యం ఎందుకు? విశ్రాంతి ఆలోచన చేయండి. విశ్రాంతి గా ఉండాలని విశ్రాంతి తీసుకోవాలని విశ్రాంతిని పొందాలని ఇదే సృష్టి స్థితి లయము అని ఇవే త్రిగుణాలు ఇవే త్రికర్మలు అని తెలుసుకోండి. అసలు విషయం తెలిసింది కదా. ఇంకెందుకు పాపం చాలా కష్టపడి ఇష్టపడి చదివినారు కదా. బాగా అలసిపోయినందుకు తాపీగా విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి ఆలోచన చేయండి. అది ఏమీ విశ్రాంతి ఆలోచన స్థితి వస్తుంది అనగా చిట్టచివరి మిగిలే స్థితి ఆది యోగి పరమేశ్వరుడి లాగా మీరు పొందిన వారు అవుతారు కదా. తద్వారా శవము నుండి శివము అవుతారు.జీవాత్మ నుండి విశ్వాత్మ అవుతారు. శుద్ధము నుండి పరిశుద్ధము అవుతారు. గాజు నుండి పరిశుద్ధ స్పటికం అవుతారు. పెద్దవాడి నుండి పసి పిల్లవాడి మనస్సు పొంది కల్మషాలు లేని మలినాలు లేని మాయలు లేని మర్మాలు లేని ఏమీ లేని పరిశుద్ధ ఆత్మ స్థితి పొందటమే అసలుసిసలైన ఆలోచన స్థితి అని గ్రహించండి. వృద్ధుడికి అన్నీ తెలుసు. సర్వం తెలుసు. అన్ని రకాల మాయలు తెలుసు. మర్మాలు తెలుసు. సమస్యలు తెలుసు. పరిష్కారాలు తెలుసు.ఙ్ఞానాలు తెలుసు. కానీ అన్నీ తెలిసినా ఏమీ చేయడు. చేయాలని ఉండదు. ఏదో పొందాలనే తపన తాపత్రయం ఉండదు. ఏదో కావాలనే ఆలోచన ఉండదు. ఆరాటాలు ఉండవు. పోరాటాలు ఉండవు. ఆవేశాలు ఉండవు. ఆవేదనలు ఉండవు. భయాలు ఉండవు.ఆశలు ఉండవు. స్పందనలు ఉండవు. కర్మలు ఉండవు. కేవలం అన్నిటి యందు విశ్రాంతి ఆలోచన వస్తుంది. ఉంటుంది. దేహం పోయే దాకా ఇదే ఉంటుంది. దేహము విశ్రాంతి తీసుకునే దాకా ఈ విశ్రాంతి ఆలోచన ఉంటుంది. ఇన్నాళ్ళు సాధన ద్వారా మనస్సు కాస్త విశ్రాంతి తీసుకుంటే మనస్సు వలన దేహము విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి ఆలోచన స్థితి పొందటం అసలు సిసలైన సాధన సంపూర్ణ పరిసమాప్తి. ఇదియే సంపూర్ణ అద్వైత స్థితి. చివరికి మిగిలేది స్థితి. సాధన చేసినా చేయకపోయినా అందరికీ అందుబాటులో అందే స్థితి. పొందే స్థితి. విశ్రాంతి స్థితి. మనస్సుకి దేహానికి అందించవలసిన స్థితి. అందుకునే స్థితి.అవసరమైన స్థితి. అలౌకిక స్థితి. అలివికాని స్థితి. ఇదియే అవిముక్త స్థితి. ఈ స్థితిని ఇచ్చేది మహాస్మశాన క్షేత్రమైన అవిముక్త క్షేత్రమైన కాశీ విశ్వనాథ అన్నపూర్ణ విశాలాక్షి ఆవాస క్షేత్రమైన మహా కాశీక్షేత్ర మందు మాత్రమే కలుగుతుంది. అందుతుంది. ఏకకాలంలో మనస్సు శరీరము కలిసి విశ్రాంతి పొందుతాయి. విదేహం అయితే విముక్తి కలుగుతుంది. అందుకే ఇట్టి విశ్రాంతి ఆలోచన మహోన్నత స్థితిని పొందేందుకు ఈ క్షేత్రానికి చచ్చే వాళ్ళు వృద్ధుల రూపంలోనూ చచ్చిన వాళ్ళు అస్థికల రూపంలో అనగా వృద్ధులు శరీరానికి విశ్రాంతి పొందితే అస్థికులు ఉన్నవాళ్లు మనస్సుకు విశ్రాంతి పొందటానికి ఈ అవిముక్త క్షేత్రానికి చేరుకుంటారు. తద్వారా విశ్రాంతి ఆలోచన స్థితిని పొందుతారు. అందుకే మన ఆధ్యాత్మిక పెద్దలు కాశ్యాంతు మరణం అని చెప్పినారు. ఈ విషయంలో ఈ క్షేత్రానికి మాత్రమే ఏకకాలంలో శరీరానికి అలాగే మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. మహాశివుడు తారక మంత్రోపదేశము వలన మనస్సుకి శాంతి కలిగితే మణికర్ణికా ఘాట్ యొక్క చితాగ్నిలో దేహానికి విశ్రాంతి కలుగుతుంది. మిగిలిన చోట్ల మనస్సుకు విశ్రాంతి కలిగితే శరీరానికి కలగదు. మరికొన్ని చోట్ల శరీరానికి విశ్రాంతి కలిగితే మనస్సుకి శాంతి కలగదు. కాకపోతే ఈ రెండూ కూడా కాశీక్షేత్రంయందు మనకు లభించే అవకాశం ఉన్నా కూడా ఆ పరమ పుణ్య ప్రశాంతత స్థితిని తట్టుకునే మానసిక శక్తి మనకి ఉండాలని గ్రహించండి.


ఆనందం ఎక్కువైనా సుఖం ఎక్కువైన జీవుడు తట్టుకోలేడు. పిచ్చివాడు అయిపోతాడు. పరమ ప్రశాంత స్థితిని సాధకుడు తట్టుకోలేక బాలోన్మత్త పిశాచ అవస్థలో ప్రాపంచిక విషయాలు దాటిన పరమహంస లేదా పరమ అవధూతగా మారిపోతాడు.ఇలా ఉన్నా కూడా మంచిదే. కాకపోతే తన దగ్గర ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని తెలుసుకున్న వారికి వీళ్లు పిచ్చివాడిగా ప్రవర్తిస్తారు. కోరికలు కోరని వాడికి కోరికలు లేని వాడి దగ్గర వీరు పసిపిల్లలు అవుతారు. గోప్యంగా వీళ్లు లోపల మనస్సుకి శరీరానికి విశ్రాంతి ఆలోచన అభ్యాసం చేస్తూనే ఉంటారు.ఇలాంటి వారికి మాత్రమే కాశీ క్షేత్రంలో ఆవాసము కాశీ మరణము లభించును. ఎక్కడ పుట్టినారో మళ్ళీ అక్కడికి చేరుకుంటారు. ఇలాంటి వాళ్లు కాశీలో ఉంటే వీళ్ళ నిద్రయే యోగనిద్ర అవుతుంది. వీళ్ళ భోగమే యోగం అవుతుంది. వీళ్ళ మాటయే శాసనం అవుతుంది. వీళ్ళ  చూపుయే శక్తిపాతం అవుతుంది. వీళ్ళు చేసే కర్మయే లోకకళ్యాణం అవుతుంది. వీళ్ల ఆరాధన విశ్వఆరాధన అవుతుంది. వీళ్ల రాబోవు కాలంలో సద్గురువుగా పరమ గురువు లేదా విశ్వ గురువుగా జగద్గురువుగా కొనియాడతారు. పూజింపబడతారు. ఇదంతా కూడా వీళ్ళ మనస్సుకి అలాగే శరీరానికి ఏకైక విశ్రాంతి ఆలోచన వల్ల సాధ్యపడిందని ఈపాటికి గ్రహించి ఉంటారు. ప్రస్తుతం మేము కూడా ఇదే స్థితిలో ఉన్నాము. ఈ విశ్రాంతి ఆలోచన సాధన అభ్యాస స్థితి కోసం పరమహంస పవనానంద అవతారమెత్తినాను సాధన చేసి చేసి మనస్సు విపరీతంగా అలసిపోవడం అలాగే నా సాధన అనుభవాలు వ్రాసి వ్రాసి నా శరీరం బాగా అలసిపోవడం జరగడంతో వీటికి విశ్రాంతి ఆలోచన ఇవ్వడం కోసం పరమగురువుగా (Parama Guruvu)  పవన్ గారు గా (Pavan Garu) అనగా PGగా కాశీ క్షేత్రానికి బయలుదేరుతున్నాను. కాకపోతే మీరు కూడా ఈ యాత్ర ప్రయాణం చేయడానికి మీకు యోగ్యత ఉండాలి. నీకు యోగ్యత ఉంటే నాతో బయలుదేరండి. లేకపోతే యోగ్యత సంపాదించుకుని కాశీకి చేరుకోండి. అక్కడ విశ్రాంతి ఆలోచన స్థితి పొందండి. ఇదే చిట్టచివరి మిగిలే అనుభవించే పొందవలసిన పొందే స్థితి అని గ్రహించండి. 
 
అంటే నా సాధన ఆరంభము కాస్త శివలింగమును తిట్టడంతో ఆరంభమై తిట్టే వాడిని అలాగే తిట్టుంచుకొనేవాడిని నేనే అనే అనుభూతి ఇవ్వటంతో అంతా నా శరీర మనస్సుకి శాంతి ప్రశాంతత ఇవ్వటానికి ఈ పరిశుద్ధ స్ఫటిక లింగం వచ్చినది. సప్త మోక్షపురులు అయినా హరిద్వార్- కంచి- అయోధ్య- మధుర- ఉజ్జయిని- కాశీ- ద్వారకా క్షేత్రాల నుండి పొందిన స్పటిక లింగాలలో ఏదో ఒక లింగమును పొందే యోగ్యత ఉంటుందో వారికి ఖచ్చితంగా మోక్షగామి అయ్యి మోక్ష ప్రాప్తి పొందుతారు. ఎందుకంటే నా సాధన పరిసమాప్తి లొ అంతంలో స్పటిక లింగం వచ్చినది కదా. అంతెందుకు నా సాధనలో నాకు మూలాధార చక్రము నందు రాతి లింగము స్వాధిష్ఠాన చక్రము నందు వెండి లింగము మణిపూరక చక్రము నందు శివశక్తి నల్ల లింగాలు అనాహత చక్రము నందు నల్ల లింగాలు విశుద్ధ చక్రమునందు బాణలింగం ఆజ్ఞా చక్రము నందు పాదరస లింగం సహస్రార చక్రము నందు సూర్య చంద్ర కాంత బాణలింగం హృదయ చక్రమునందు ఇష్ట లింగము బ్రహ్మాండ చక్రము నందు పరిశుద్ధ స్పటిక లింగము వచ్చినాయి. నా సాధన పరిసమాప్తి చేసినాయి. విశ్రాంతి స్థితి ఇచ్చిన ఈ లింగాలు పొందటానికి నా యోగసాధనలో అర్హత యోగ్యత పొందటానికి విశ్వప్రయత్నం చేసిన ఆత్మలింగంగా నేను చేస్తే చివరికి నేను ఆకాశం శరీరంతో ఆకాశలింగంగా మారితే విశ్రాంతి స్థితికి వెళ్లిపోవటం జరిగినది. కాకపోతే ఈ సప్త మోక్ష పురాణాల్లో హరిద్వార్ నుండి లింగము వస్తే అది మూలాధార చక్ర లింగమై మనస్సుకి విశ్రాంతినిస్తుంది. కంచి నుండి వస్తే స్వాధిష్టాన చక్రం లింగమై శరీరానికి విశ్రాంతినిస్తుంది. అదే అయోధ్య నుండి వస్తే అది మణిపూరక చక్రము లింగమై  మనస్సుకి విశ్రాంతినిస్తుంది. అదే ఉజ్జయిని నుండి వస్తే అది అనాహత చక్రము శరీరానికి విశ్రాంతినిస్తుంది. అదే మధుర నుండి వస్తే అది కాస్త విచిత్రంగా మనస్సుకి విశ్రాంతినిస్తుంది. అదే కాశి క్షేత్రం నుండి స్పటిక లింగము వస్తే అది శరీరానికి అలాగే మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది. అలాగే ద్వారక నుండి లింగము వస్తే ఇది సహస్రార చక్ర లింగమై  మనస్సుకి విశ్రాంతినిస్తుంది. అంటే ఉన్న క్షేత్ర లింగాలలో కాశీక్షేత్ర స్పటిక లింగం ఉత్తమమైనదని తెలుస్తోంది. ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం మనం గమనించాలి. అదేమిటంటే కాశీ స్పటిక లింగం అయిన కాశీక్షేత్ర ఆవాసమైన అందులోనే మనకు విశ్రాంతి ఆలోచన అనేది తప్పనిసరిగా ఉంటుందని గ్రహించండి. ఆలోచన నుండి మళ్లీ మహామాయ మొదలై సహన శక్తిని కోల్పోయి కాశీవాసం నుండి లేదా కాశీలో మనము మరణము పొందకుండా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాశీ వాసము చేసినంత మాత్రాన అక్కడే చనిపోతాడని నమ్మకం లేదు కదా. పోనీ కాశీలో ఉండనంత మాత్రాన కాశీక్షేత్రం దర్శనము చేస్తూ ఉంటే అక్కడే ప్రాణాలు వదలడని అనుకోవటానికి లేదు కదా. కాబట్టి ఈ క్షేత్రం లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది నామరూప విశ్వనాథుడి ఆఙ్ఙ ప్రకారమే అక్కడ అన్ని జరుగుతాయని లోకవిదితమే కదా. కాబట్టి కాశీ లింగం కూడా విశ్రాంతి ఆలోచన నుండి తప్పించుకోలేదు. కాకపోతే శరీరానికి మనస్సుకి విశ్రాంతినిస్తుంది. మరి ఏమిటి దారి అన్నప్పుడు విశ్రాంతి ఆలోచన లేని స్థితిని మనము పొందాలి అంటే చనిపోకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన నుండి మనం విముక్తి పొందాలి అన్నమాట. అంటే మనకి సప్త మోక్ష పురాల నుండి కాకుండా వీటిని నడిపించి నాశనము చేసే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం క్షేత్రమైన రుషీకేశ్ నుండి మనకి పరిశుద్ధ స్పటిక లింగం రావాలి. ఇదే మనకు విశ్రాంతి ఆలోచన రహిత స్థితి ఇస్తుందని ఇలా నాకు ఇలా వచ్చిన ఈ స్పటిక ఆరాధనవల్ల తెలిసినది. అంటే కాశీ వాసము చేస్తూ రుషికేశ్ స్పటిక లింగం ఆరాధన చేస్తే ఆదిలో మన జీవ పదార్ధం పంచ శరీరాలు పుట్టించిన కాశీ క్షేత్రం యొక్క చితాగ్నిలో బ్రహ్మరంధ్రము వద్ద తిరిగే బ్రహ్మాండ కృష్ణ బిల్వము నందు పడిపోయి తునాతునకలై విభూది రేణువులుగా మారటానికి రిషికేశ్ స్పటిక లింగ ఆరాధన ఉంటుందని అలాగే జీవసమాధి పొందడానికి వీలు కల్పిస్తుందని నేను గ్రహించాను. విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన లేని స్థితిని కలిగిస్తుంది. ఈ స్థితిని ఎప్పుడైతే సాధకుడు పొందుతాడో ఆ క్షణమే వాటి శరీరాలు అచేతనమై విచ్ఛిన్నమై సమాధి పొందటం జరుగుతుంది. తద్వారా చెప్పటానికి వ్రాయడానికి చదవడానికి వీలు లేని స్థితి. అది ఉందో లేదో తెలియని స్థితి. అది పొందామో లేదో తెలియని స్థితి పొందడం జరుగుతుంది. అనగా అన్ని రకాల బంధనాల నుండి విముక్తి పొంది అవిముక్తి చెంది జీవన్ముక్తి పొందడం జరుగుతుంది.ఇదియే సాధకుడు పొందవలసిన స్థితి అని నాకు అర్థం అయ్యే లోపల నేను అవిముక్తిని అవుతున్నాను అనుకునే లోపల మౌనం మౌనం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనగా సాధకుడు సంపూర్ణంగా ఆనంద రహిత సమాధి స్థితిని పొందడం జరుగుతుంది. తద్వారా తమ బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న చితాగ్ని దహన శక్తిని పది లక్షల దాకా పెంచుకునే స్థాయికి చేరుకోవాలి. నిజానికి నేను అలాగే మా జిజ్ఞాసి కూడా ఇదే పనిలో ఉన్నాము. ప్రస్తుతానికి విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే మానుండి ఈ ఆలోచన మాయం అవుతుందో ఆనాడే మాకు సంపూర్ణ కపాలమోక్షం స్థితి కలుగుతుంది అని గ్రహించండి. ప్రస్తుతానికి మా ఇద్దరి సాధన కూడా విశ్రాంతి ఆలోచన స్థితికి చేరింది.జాతకాలు రీత్యా మా సమాధి రికార్డు దృశ్యాలు మాకు రాబోవుకాలంలో రికార్డయినానని మా ఇద్దరికీ స్పురణ అయినది. మరి మా ఇద్దరి ఆఖరి మజిలి జీవసమాధి దృశ్యాలను మా మనో నేత్రము ద్వారా చూసుకోవడం జరిగినది. మరి మా జీవ సమాధి వివరాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకాలస్యం. మాతో ఈ చిట్టచివరి ఆఖరి సమాధి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. 

శుభం భూయాత్

పరమహంస పవనానంద
*****************************************

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి