అధ్యాయం 14


నా జాతక ఫలితాలు

కాలేజీ పరీక్షలు దగ్గరకు వస్తూ ఉండటంతో శ్రద్ధగా చదవడం ఆరంభించాను! జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు నా స్నేహితులకు చెప్పగానే “స్టేట్ ర్యాంకు వచ్చే వాడికి పాస్ మార్కులు రాకపోవడమేమిటిరా? ఆయన చెప్పినవి తప్పు అని నిరూపించడానికైనా చదువు” అన్నారు! అధ్యాపకులతో నా జాతక విషయాలు చర్చించే సరికి వారు కూడా ఫక్కున నవ్వి “మా కాలేజీకి నీవలన ఒక ర్యాంకు వస్తుందని సంబరాలు చేసుకుంటుంటే… నువ్వేంటి స్వామి.. ఇలాంటి తప్పుడు జాతకాలు నమ్ముతున్నావు? వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి బుద్ధిగాచదువుకో… ర్యాంక్ నీ లక్ష్యం అని గ్రహించు”! అని హితబోధ చేసినారు! దాంతో నాలో ఉన్న అన్ని రకాల అపోహలు, భయాలు తొలగినాయి! యధావిధిగా నా చదువు కొనసాగిస్తుండగా… నాలో మన్మధుడు నిద్రలేచాడు!

అప్పటిదాకా రాధాదేవితో  స్నేహ భావం కాస్తా  ప్రేమ భావముగా మారే అవకాశాలు ఏర్పడ్డాయి! దాంతో నాకు తెలియకుండానే నా చదువు ధ్యాస తగ్గి ఆమె ధ్యాస పెరగటం నేను గమనించే స్థితిలో ఉన్నా…. ఏమీ చేయలేని గందరగోళ స్థితిలో ఉండే వాడిని! చదువుకోవాలని అనుకుని పుస్తకాల తీయగానే ఆమె తలంపులు వచ్చేవి! పుస్తకం తెరిచే ఉంటుంది కానీ మనస్సు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లుగా తెరిచే ఉండేది! ఆమె కూడా ఇలాంటి స్థితిలో ఉన్నదని తెలియగానే నా మనస్సు ఆనంద పడినది! ఏదో తెలియని వయస్సులో… అనుభవం లేని మనస్సు… కాస్తా … హీరో అనుభవాలు పొందాలని చదువు పాఠాలు కోసం తపన పడటం పోయి ప్రేమ పాటల కోసం తపన మొదలైంది! దాంతో గుళ్లో పూజారిని కాస్తా  ప్రేమపూజారిగా మారిపోయాను ! పుస్తక పఠనం కాస్త కామశాస్త్ర పఠనం గా మారింది! ప్రణవ మంత్రము కాస్తా ప్రణయ మంత్రముగా మారింది! ఇంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి! మొక్కుబడిగా పరీక్షలు వ్రాస్తున్నానని  నాకు తెలుసు… కానీ ఏమీ చేయలేను ! అప్పుడు ఆమె నుండి నాకు తొలి ప్రేమ ఉత్తరం అందినది! రేపటి పరీక్షకు ప్రిపేర్ అవ్వకుండానే ఈ ప్రేమ పరీక్ష కి సన్నిహితుడిగా మారినాను! నేను కూడా ప్రేమ లేఖలు రాయడం ఆరంభించాను! లేఖలు మారినాయి ! పరీక్ష ఫలితాలు వచ్చినాయి! నా రాత మారినది ! నేను అందుకున్న తొలి ప్రేమ లేఖ సమయములో నేను రాసిన పరీక్ష తప్పడం జరిగినది! కానీ విచిత్రం ఏమిటంటే ఆమెకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు వచ్చినది! నాకేమో పరీక్ష తప్పిన మెమో వచ్చినది! నాకు ఆశ్చర్యం వేసింది!మేమిద్దరం ప్రేమలో ఉంటే ఆమె కూడా పరీక్షలో తప్పాలి కదా! మరి ఎలా పాస్ అయినదని  విచారించగా… తనకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు వస్తే ఉన్నత చదువులు చదివిస్తాం అని….  డాక్టర్ చేయిస్తాడని వాళ్ళ నాన్న మాట ఇచ్చాడట! ఎక్కడ తనకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు నావల్ల రాదేమో అని భయమేసి… ప్రేమ పేరుతో వంచించి … నన్ను తన ప్రేమ మాయ లో ఉంచి…. తను కష్టపడి చదివి ర్యాంకు సంపాదించుకున్నది అని తెలియగానే నా గుండె బ్రద్ధలయినట్లుగా అనిపించింది!


 అభినందన సినిమాలోని ప్రేమ మధురం… ప్రియురాలు మనస్సు కఠినం అనే పాట లీలగా నా చెవిలో వినబడసాగినది! ఇంతకి జ్యోతిష్కుడు చెప్పినట్లుగా జరిగినదా లేక ఈ తొలిప్రేమ వల్ల నా చదువు అటకెక్కిందా?  నాకే తెలియని అయోమయ స్థితిలో…. ఇంటిదారి పట్టి బాత్రూంలో ఏడవడం తప్ప ఏమి చేయలేకపోయాను! 

ఇంత చేసిన ఆమె మీద కోపం రాలేదు! ఎందుకంటే తను ఇష్ట పడిన చదువు కోసం ఆమె చేసిన మంచి ప్రయత్నమే కదా! ఆడ పిల్లలు ఉన్నత చదువులు చదివించకూడదని అనుకొనే తల్లిదండ్రులు ఉన్నంతవరకు పాపం ఇలాంటి సరస్వతీ పుత్రికలకు ఇబ్బందులు పడవలసిందేనని నాకు అనిపించినది! ఆమె వెళ్ళిన విధానం మంచిది కాకపోవచ్చు కానీ ఆమె దేని కోసమో ఇదంతా చేసిన ఉద్దేశం మంచిదే కదా అని మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రేమ దెబ్బ నుండి కోలుకొని తెలుసుకున్నాను! తను ఇప్పుడు అమెరికాలో ఒక గొప్ప సర్జన్ గా మారినది! నేను జాతకాలు చెప్పే జ్యోతిష్యుడు గా మారినాను! అది ఎలా జరిగింది అనే కదా మీ సందేహం? ఇంకెందుకు ఆలస్యం… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే….. మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

********************************

గమనిక: నిజప్రేమతో కాకుండా కామప్రేమతో  ప్రేమ పేరుతో ఈనాడు అబ్బాయిలు, అమ్మాయిలు మోసం చేసుకుంటున్నారు! పెళ్లి అయిన వారు అక్రమ సంబంధాలు పెట్టుకుని వివాహ దాంపత్య జీవితమును నాశనం చేసుకుంటున్నారు! మోసము చేసుకొని జీవిస్తున్నారు! కొందరు దొరలుగా ఈ తప్పు చేస్తూంటే...మరికొందరు చాటుమాటుగా చేస్తున్నారు! పిల్లల్ని అనాధలు చేస్తున్నారు! ఇది మంచి పద్ధతి కాదు! 

విచిత్రం ఏమిటంటే నేను ప్రేమించానని అనుకునే వాళ్ళ పెళ్ళి శుభలేఖలు నాకు వచ్చేవి! దాంతో మా స్నేహితులంతా నేను  ప్రేమ పూజారిని కాదని… పెళ్లిళ్లు పూజారిని అనేవారు! నన్ను ప్రేమించే అమ్మాయిలను నేను కాదనుకుంటే… వాళ్ళు నా కళ్ళముందు వివాహం చేసుకుని…  “ఏమండీ! ఏమండీ” అని వేరే వ్యక్తిని భర్తగా పిలుస్తూ ఉంటే… నా స్వామి రంగా…ఉంటుంది.. ఏదో తెలియని నరకయాతన! ఇది ఇలా ఉంటే నేను ప్రేమించిన అమ్మాయిలు నన్ను కాదనుకుని వేరే వ్యక్తిని భర్తగా ఏమండీ ఏమండీ అని నా కళ్ళముందు పిలుస్తుంటే ఇదో రకమైన మరణయాతన! నేను ప్రేమించిన అమ్మాయిలు ప్రేమను పొందలేక… అటు నన్ను ప్రేమించిన అమ్మాయిల ప్రేమను పొందలేక… నానా అగచాట్లు పడి ఈ రెండు రకాల ప్రేమ అనుభవాల వల్ల నా మనస్సు నాకు తెలియకుండానే వివేక వైరాగ్య భావాలు వైపు దారితీసింది! 

ఇష్టము లేని ప్రేమగా… ప్రేమలో  ప్రే అంటే ప్రేమించడమే … మ అంటే మరిచిపోవడం అని అనుకునే సమయంలో… ఎలాగైనా ఎప్పటికైనా  ప్రేమ వివాహమే చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాను! ఇష్టం లేని ప్రేమతో ఎదురు చూశాను! నాకు లాగనే  ప్రేమ మీద విరక్తి చెందిన ఒక స్త్రీమూర్తిని చూడటం… ఆమెకి ప్రేమ ప్రతిపాదన చెప్పడం కన్నా వివాహ ప్రతిపాదన పెట్టడం… ఆమె దానికి సరే అనడం.. వివాహం జరిగి పోయిన తర్వాత ప్రేమించుకోవడం ఆరంభించినాము! పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి అని… పెళ్లయిన తర్వాత ఒకరి వలన మరొకరికి పిచ్చికెక్కుతుందని అనుభవసారం ద్వారా తెలుసుకున్నాము!

 ఇక జ్యోతిష్యశాస్త్రము వలన రాబోవు విపరీత సమస్యలకి పరిహారాలు అలాగే రాబోవు పరిస్ధితులకి మనల్ని సిద్ధపడేటట్లుగా చేస్తుందని నా జ్యోతిష్య అనుభవము ద్వారా తెలుసుకోవడమైనది!



2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeku makki ki makki jaragadam great... meeru kuda chaala mandi ke chepparu... kaani pattu vadalani vikramarkudilaaga prema vivahame chesukunnaru... ante jaathakam thappadu annamaata...

    రిప్లయితొలగించండి