హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....
నిమర్జనము
(కాశీ యాత్ర కైవల్య సాధన)
పురాణాల ప్రకారం చూస్తే ఈ విశ్వ లోకాలలో అత్యంత మోక్ష ప్రధాన క్షేత్రంగా కాశీ క్షేత్రము చెప్పటం జరిగినది. అనగా సప్త మోక్ష పురాలలో అనగా హరిద్వార్ (మూలాధార చక్రం) మధుర (స్వాదిష్టాన చక్రం), అయోధ్య(మణిపూరక చక్రం), ఉజ్జయిని(అనాహత చక్రం), కాంచీపురము(విశుద్ధి చక్రం), వారణాసి(ఆజ్ఞా చక్రం), ద్వారక(సహస్ర చక్రం) లలో కాశీ క్షేత్రము ఉన్నది. అలాగే మహా పంచ పాతకాలు నివారించే పంచ క్షేత్రాలలో అనగా శ్రీశైలం, కేదారేశ్వరం, కాశీ, శ్రీకాళహస్తి, పట్టిసీమ అను పంచ కాశీ క్షేత్రములు అని పురాణాలు చెప్పటం జరిగినది. ఇది కాకుండా పంచ మోక్ష క్షేత్రాలు అనగా చిదంబర క్షేత్రంలో ఆకాశలింగం దర్శనము అయినను కేదారేశ్వర క్షేత్రములో నిత్యపానముగా తీర్ధం సేవించినా, అరుణాచల క్షేత్రం లో శాశ్వత నివాసం అయినను, కాశీ క్షేత్రములో మరణము పొందిననూ, తిరువనంతపురం నందు జన్మించినను మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.ఇలా ప్రతిచోట ప్రతిదానిలోనూ కాశీ క్షేత్ర ప్రస్తావన తప్పనిసరిగా ఉండే సరికి నాకు ఆశ్చర్యము వేసింది. ఇందులో ఉన్న మర్మమును తెలుసుకో వాలనే తపన తాపత్రయాలు నాలో మొదలైనది. దానితో ఈ క్షేత్రానికి సంబంధించిన అన్ని రకాల గ్రంథాలు పురాణాలు ఇతిహాసాల కథలు పుస్తకాలు చదవటం ప్రారంభించాను. దానితో ఉన్న సమస్యలకు అదనంగా మరికొన్ని ధర్మసందేహాలు ఈ గ్రంథ పాండిత్యము వలన వచ్చినాయి.
కాశీ విశ్వనాథ లింగము:
నిజానికి ప్రస్తుత కాశీ క్షేత్రములో ఆది విశ్వనాథ లింగము ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతము ఈ క్షేత్రములో మనము చూస్తున్న శివలింగము అహల్యాబాయి ప్రతిష్ట లింగం అని తెలిసినది. అలాగే విశ్వనాథ లింగము పేరుతో మూడు లింగాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. వాటిలో ఏది ఆది విశ్వనాథ లింగమో ఎవరికీ తెలియదు. అలాగే కాశీ క్షేత్రానికి మరియు రామేశ్వర క్షేత్రానికి ఎందుకు సంబంధము కలిపినారో నాకైతే అర్థం అవ్వలేదు.అనగా కాశీక్షేత్ర గంగను తీసుకొని వెళ్ళి రామేశ్వర క్షేత్రములో రామేశ్వర లింగమును అభిషేకము చేయమనడం అలాగే ఈ క్షేత్రములోని ఇసుకని తీసుకొని వచ్చి కాశీక్షేత్ర గంగలో ఎందుకు కలపాలో అర్థం అవ్వలేదు. ఇందులో మనకి తెలియని ఏదో మర్మము ఉందని అనిపించినది. అలాగే కాశీక్షేత్రంలో తురుష్కులు దాడి వలన ఆది విశ్వనాధ లింగమును కొంతమంది జ్ఞానవాపి బావిలో ఉంచినారని మరికొంత మంది దానిని అక్కడే ఉన్న మసీదులోనే ఉంచినారని మరి కొంత మంది దానిని మణికర్ణికా స్నాన ఘట్టము నందు ఉంచినారని …మరికొంతమంది త్రేతా యుగం హనుమంతుడు దానిని తీసుకొని వెళ్ళి రామేశ్వర క్షేత్రములో ప్రతిష్టించారని ఇలా విభిన్న అభిప్రాయాలు గ్రంథాలు చదవడం జరిగినది. ఇందులో మరి ఎవరి వాదన నిజమా అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రామేశ్వర క్షేత్రములో హనుమంతుడు తెచ్చిన మహా శివలింగానికి కాశీ విశ్వేశ్వర లింగం అని పేరు పెట్టడం జరిగినది. ఇలా ఈ పేరునే ఆ లింగానికి ఎందుకు పెట్టినారు అంటే కాశీ లింగము ఇక్కడికి చేరినదా తెలియదు.
కాశీక్షేత్రంలో చూస్తే అక్కడ ఉన్న పెద్ద నంది ప్రస్తుతం ఉన్న కాశీ విశ్వనాథ లింగము చూడకుండా మసీద్ వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది.పోనీ కాశీక్షేత్రంలో చూస్తే అక్కడ ఉన్న పెద్ద నంది ప్రస్తుతం ఉన్న అహల్యా బాయి లింగమును చూడకుండా మసీద్ వైపు ఎందుకు చూస్తున్నట్లుగా ఉన్నదో అర్థమవ్వలేదు. పైగా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి పూట ఈ మసీదుకు ఉన్న కిటికీలు తెరిచి ఎందుకు ఉంచుతారో నాకైతే అర్థం కాని విషయం. ఒకవేళ ఆది కాశీ లింగము మసీదులో ఉందా? తెలియదు. మణికర్ణికా స్నాన ఘాట్ లో ఉంచినదా. ఈ ఘాట్ లో మధ్యాహ్న స్నాన ప్రత్యేకత ఎందుకు ఉంచినారో తెలియదు.ఇక్కడే మహాదేవుడు తారక మంత్రమును ఉపదేశము చేస్తారని చెప్పడం జరుగుతుంది. అంటే ఆది లింగము ఇక్కడ ఏమైనా ఉందా తెలియదు. అలాగే ఈ ఘాట్ యందు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి వచ్చి ఎందుకు గంగాస్నానము చేస్తున్నారో తెలియదు. వీరికి గుర్తుగా అక్కడ దత్త పాదుకా మందిరం ఉంటుంది. అసలు నిజంగానే ఈ క్షేత్రంలో మరణిస్తే మోక్షం కలుగుతుందా? అలాగే నిజంగానే విశ్వనాధుడు తారక మంత్రమును ఉపదేశము చేస్తాడా? నిజంగానే దత్తస్వామి ప్రతినిత్యము గంగాస్నానము చేస్తాడా? తెలియదు. ఇది కేవలం కథలో లేదా నగ్నసత్యాలో తెలియదు. పంచ క్రోశ యాత్ర ఎందుకు కల్పించినారో ఏర్పరచుకున్నారో తెలియదు. కాశీక్షేత్రంలో ఎందుకు దేవతలు, పరమ యోగులు, యోగ భక్తులు మరణమును పొందాలని నిశ్చయించుకున్నారో తెలియదు. అందరికీ కాశీ క్షేత్రము నందు శాశ్వత నివాసము ఎందుకు కలగడం లేదో తెలియదు. ఎందుకు అందరికీ కాశీ క్షేత్రము నందు మరణము పొందలేకపోతున్నారో తెలియదు. ఎందుకు అక్కడ మరణించిన ప్రతి జీవి కూడా అంతిమ క్షణంలో కుడిచెవి పైన పెట్టుకొని చనిపోతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఇలా ఈ క్షేత్రం కాశీక్షేత్రం మీద విభిన్న ధర్మసందేహాలు నన్ను వెంటాడినాయి. దానితో వీటి సమాధానాల కోసం నేను నలభై ఒక్క రోజుల పాటు ఈ కాశీ క్షేత్రం లో ఉండి పరిశోధనలను చేయాలని భావించినాను. నేను పొందిన వివిధ రకాల ధ్యాన దైవ అనుభవాలు యధావిధిగా వ్రాయడము జరిగినది.ఇవి అన్నియు నా వ్యక్తిగత అభిప్రాయాలే అని గ్రహించండి. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.
మొదట అసలు కాశీ క్షేత్రము ఎందుకు ఎలా ఏర్పడిందో శ్రీ శివమహాపురాణము చెప్పిన విధానం ఏమిటో తెలుసుకుందాము. మొట్టమొదట విశ్వము లేనప్పుడు పరమ శూన్యము ఉండేది. ఈ శూన్యము నుండి ఒకానొక సమయంలో శూన్యబ్రహ్మగా పరమేశ్వరుడు స్వయంభువు లింగముగా ఉద్భవించినాడు. అటుపై ఈ లింగము నుండి పరమేశ్వరిగా శ్రీ చక్ర బిందువుగా ఆదిపరాశక్తి ఉద్భవించినది. వీరిద్దరే కామేశ్వరీ కామేశ్వరుడు హృదయాకాశంలో అధి దైవాలుగా ఉన్నారు. వీరి ఆరాధ్య దైవంగా పరమ శూన్యమునకి ప్రతీక అయిన ఇష్ట లింగేశ్వరుడు ఉన్నాడు. వీరి ఇష్ట కోరిక అనగా అండ,పిండ, బ్రహ్మాండాలతో కూడిన మూల ప్రకృతి ఏర్పడుటకు ప్రకృతి పురుషుడిగా మహావిష్ణువును ప్రకృతి స్త్రీగా మహాలక్ష్మీదేవిని సృష్టించడం జరిగినది. అప్పుడు వీరిద్దరికీ తమ తల్లిదండ్రులు అయిన పరమేశ్వరుడు పరమేశ్వరి కనిపించకపోయేసరికి వేదన పడుతుంటే వీరిద్దరూ కనిపించి అప్పుడు మీరు ఘోర తపస్సు గావించి మూల ప్రకృతిని సృష్టించమని అనుజ్ఞ ఇవ్వగానే అప్పుడు ఈ విశ్వంలో భూమి అనేది లేదు. పైగా అంతా కూడా జలములతో నిండి ఉండటంతో విష్ణు మూర్తి వెంటనే “తండ్రి! తపమొనరించుటకు మాకు ఎక్కడ కూడా స్థలము కనిపించడం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండి తపస్సు చేయవలెను” అనగానే అప్పుడు పరమేశ్వరుడు పంచభూతాలతో సహిత ఐదు క్రోసుల పొడవు వెడల్పు గల సుందర నగరం అనగా కాశీక్షేత్ర నగరమును నిర్మించి ఇచ్చినారు. అప్పుడు వీరిద్దరూ అనగా మహావిష్ణువు- మహాలక్ష్మి ఈ క్షేత్రమునకు చేరుకొని పంచక్రోశ ప్రాంతంలో ఒక చోటును ఏర్పరచుకొని అందులో తమ సుదర్శన చక్రముతో ఒక గొయ్యి తీసుకొని అందులో తీవ్రమైన తపస్సు చేయటం ఆరంభించారు. అనగా ఈ నగరము నందు సృష్టి చేయాలనే తలంపుతో వీరిద్దరూ అనేక సంవత్సరముల పాటు తీవ్ర తపస్సు చేసినారు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరము నుండి తెల్లని జలధారలుగా చెమట బిందువులు ఏర్పడి ఆ ప్రదేశమంతా ఆక్రమించుకున్న సమయమున పరమేశ్వరుడు తన కుమారుడి తీవ్ర తపస్సు శక్తికి ఆశ్చర్యమేసి ప్రసన్నం అయ్యేసరికి అది గమనించిన శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచి చూడగా ప్రసన్నవదనంతో పరమేశ్వరుడు ఆనంద పడుతున్న వేళ వీరి ఎడమ కర్ణిక నుండి మణి జారి తీర్ధము నందు పడిపోయినది. దానితో ఈ తీర్ధము పేరు ఆనాటినుండి మణికర్ణికా తీర్ధమని చెందినది. అలాగే ఈ జలధారలతో పంచక్రోశ ప్రాంతం అంతా నిండి పోతూ ఉండడంతో వెంటనే పరమేశ్వరుడు ఈ ప్రాంతమును తన త్రిశూలము పైన దానితో ఈ కాశీ ప్రాంతము జల ప్రళయం నుండి రక్షింపబడుతూ రావడం జరుగుతోంది. తదుపరి మహా విష్ణువు చేత ఈ విశ్వంలో సూక్ష్మ పంచభూత శక్తులు అండ,పిండ, బ్రహ్మాండ లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ మండలాలు, గ్రహ లోకాలు, నక్షత్ర లోకాలు ఇలా అన్ని రకాల ఈ మూల ప్రకృతి పురుష స్త్రీ అయిన మహావిష్ణువు మహాలక్ష్మిదేవి వలన జరిగినాయి. ఆపైన వీరిద్దరికీ విపరీతమైన యోగనిద్ర ఆవరించే సరికి త్రిశూలము మీద ఉన్న ఈ కాశీ క్షేత్రం నందు నిద్రలోనికి జారుకోవడం జరిగినది.
అప్పుడు వీరి నాభి నుండి బ్రహ్మ కమలంలో ఆది బ్రహ్మదేవుడు బ్రహ్మణి ఉద్భవించడం జరిగినది. అటుపై వీరిద్దరి వలన జీవప్రకృతి అనగా 84లక్షల జీవరాసులూ 36 కోట్ల దైవ స్వరూపాలు కోటికిపైగా యోగ భక్తులను సృష్టించడం జరిగినది. కానీ పంచక్రోశి ప్రాంతము దాటి మిగిలిన ప్రాంతంలో జీవించే వారికి అలాగే మరణించేవారికి కర్మ బంధనాలు మాయ మోహ వ్యామోహ బంధనాలు పునర్జన్మలు ఉండేటట్లుగా చేయడము జరిగినది. ఎవరైతే పంచకోశములో కాశీక్షేత్రంలో ఆవాసము చేస్తారో అలాగే మరణమును పొందుతారో వారికి ఆదిదేవుడైన పరమేశ్వరుడు పరమేశ్వరి స్వయముగా అన్నిరకాల కర్మ బంధాలనుండి విముక్తి కలిగించి తారక మంత్రమును ఉపదేశము కావించి మోక్ష ప్రాప్తి కలిగించేటట్లుగా ఏర్పాట్లు చేసి ఈ విశ్వ సృష్టి ఏర్పరచటం జరిగినది. అందుకే ఈ పంచక్రోశి కాశీ క్షేత్ర ప్రాంతమును తారక మంత్ర ఉపదేశము కారణంగా అవిముక్త క్షేత్రమని ఇందులో మణికర్ణిక దహన ప్రాంతము ఉండుట వలన దీనిని మహా స్మశాన క్షేత్రం అని నిరంతరం దహన శక్తి యొక్క చితాగ్ని ఎప్పుడూ కూడా అఖండ జ్యోతి స్వరూపంగా ఉండుటవలన పరం జ్యోతి క్షేత్రం అని పిలవటం జరుగుతుందని నాకు అర్థమైనది.
ఇక మూడు శివలింగ మూర్తులు విషయానికి వస్తే ప్రతి క్షేత్రము నందు శివలింగ రూపమును మూడు రూపాలలో పూజించాలని లింగ పురాణం చెబుతుంది. అనగా స్థూల లింగము, సూక్ష్మ లింగము, జ్ఞాన లింగం( దక్షిణామూర్తి )గా పూజించాలని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి అరుణాచల క్షేత్రం లో పర్వతమును స్థూల లింగముగా అరుణాచల గుడి యందు లింగము సూక్ష్మ లింగముగా ఈ పర్వతం లోపల ఉన్న అంతర్గత దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ధ్యానస్థితిలో జ్ఞాన లింగంగా ఉంటారని యోగుల ధ్యాన అనుభవాలు చెబుతున్నాయి. అలాగే నా అభిప్రాయము ప్రకారము ఈ మహా కాశీ క్షేత్రము నందు కూడా తప్పకుండా త్రి రూపాలలో మూడు విశ్వనాధ లింగాలు తప్పకుండా ఉండాలి. దీనికి నిదర్శనంగా వేద కాశీ ప్రాంతంలో ఉన్న కోట యందు వేద వ్యాసుడు ప్రతిష్ఠించిన త్రి లింగాలు ఉండటం చూడవచ్చును. అంటే ఈ లెక్కన చూస్తే తప్పనిసరిగా మూడు విశ్వనాథ లింగాల పేర్లతో లింగమూర్తులు ఉండటం నిజమే అని తెలుస్తోంది కదా. మరి ఆ లింగాలు ఎక్కడ ఉన్నాయో పరిశోధించాలి అని నేను తీవ్రమైన ధ్యానం చేయటం ఆరంభించినాను.
ఒకరోజు నాకు ధ్యానములో మణికర్ణికా స్నాన ఘాట్ నందు అనేకనేక తలలు ఉన్న నాగుపాము సమక్షంలో పరిరక్షణలో దాని తోక మూడు వరుసల మధ్యలో ఒక నల్లని శివ లింగ మూర్తి నీటిలో కదులుతూ మునుగుతూ తేలియాడుతున్న ట్లుగా ఉన్నట్లుగా అనిపించింది. దీని పరిమాణము చూస్తే ప్రస్తుతమున్న అహల్యాబాయి ప్రతిష్ఠిత లింగం అంత ఉంది. అంటే ఒక సూక్ష్మ శివ లింగ మూర్తి ఈ స్నాన ఘాట్ వద్ద ఉన్నదని ఇది ఇక్కడ ఉండటం వల్లనే దత్తస్వామి ప్రతినిత్యం ఇక్కడ గంగా స్నానానికి రావటం అలాగే ఈ ఘాట్ యందు దహన కార్యక్రమాలు పెట్టడము జరిగినదని తద్వారా మహాశివుడు తారక మంత్రమును ఉపదేశము చేయడం జరుగుతుందని అర్థం అయినది. ఇక్కడ శివుడు తారక మంత్రోపదేశము చేస్తున్నట్లుగా రామకృష్ణ పరమహంస తన ధ్యాన సమాధి అనుభవ అనుభూతి పొంది లోకానికి చెప్పటం జరిగినది కదా. పరమ యోగులు ఎన్నటికీ అబద్ధాలు చెప్పరు కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితముగా సత్యముగా రామతారక మంత్రోపదేశము మనకు కనిపించకుండా జరుగుతోంది.ఇక్కడ అది జరగటానికి బలమైన కారకమైన కారణ లింగం ఉండాలి. అదియే లింగము యొక్క రెండవ రూపమైన సూక్ష్మ లింగము ఇక్కడ ఉన్నదని నా ధ్యాన అనుభవము చెబుతుంది. అంటే ఈ లెక్కన లింగము యొక్క మూడు రూపాలలో ఒక లింగము రూపము ఎక్కడ ఉన్నదో తెలిసినది.
రామేశ్వర కాశీ విశ్వేశ్వర లింగం:
ఇక మిగిలిన రెండు రూపాలు అయిన స్థూల, జ్ఞాన లింగాలు ఎక్కడ ఉన్నాయో చూడాలని మళ్ళీ తిరిగి ధ్యానం తపస్సు చెయ్యటము ఆరంభించినాను. మరికొన్ని రోజులకు ధ్యానములో హనుమంతులవారు తన బలమైన తోకతో ఒక నలుచదరపు ప్రాంతం నుంచి ఒక పెద్ద లింగమును బయటకు తీసి తన కుడి చేతిలో పెట్టుకొని ఆకాశంకేసి ఎగురుతూ కనిపించాడు. అంటే ఆది శివలింగం అయినా అవిముక్తి లింగము అదే అయి ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ లింగము ఉన్నచోట తురుష్కులు మసీదు కట్టి ఉండాలి. అప్పటికే స్వయంభువు లింగము అయిన అవిముక్త లింగము హనుమంతుడి సహాయంతో త్రేతాయుగములో రామేశ్వర క్షేత్రానికి చేరినది. అందుకే ఈ క్షేత్రం లో హనుమ తెచ్చిన స్థూల లింగానికి కాశీ విశ్వేశ్వర లింగం అని నామకరణం చేసి ఈ లింగానికి కాశీ గంగా నీటితో అభిషేకము చేయాలని అలాగే అక్కడ ఉన్న మట్టిని కాశీక్షేత్ర గంగానదిలో కలపాలని చెప్పటం జరిగినది అని నాకు అర్థం అయింది. విచిత్రం ఏమిటంటే కొంతమంది మహాత్ముల, ప్రముఖుల, యోగుల రామేశ్వర క్షేత్రములో వారి చితాభస్మం బంగాళాఖాతం సముద్రం లో కలపటం జరిగినదని జరుగుతున్నదని వారి చరిత్రల ద్వారా తెలుసుకున్నాను. అందుకే ఈ సముద్రములో ఉండుట వలన ఇక్కడ మట్టి కాశీ క్షేత్రంలో కాశీ గంగలో కలపాలని నియమము పెట్టి ఉండాలి. అంటే స్థూల లింగ స్వరూపం సురక్షితంగా రామేశ్వర క్షేత్రము చేరినదని నాకు అర్థమైనది.
ఇక మూడవదైన మరి జ్ఞాన లింగము ఎక్కడ ఉందో పరిశోధన చేయాలనిపించి తిరిగి ధ్యానం తపస్సు చేసుకోవటం ఆరంభించినాను.ఒకసారి మసీదు ప్రాంతంలో ఉన్నట్లుగా మరొకసారి జ్ఞానవాపి బావిలో ఉన్నట్లుగా మరొక్కసారి తిరిగి మసీదులో ఉన్నట్లుగా ఇలా పలుమార్లు కనిపించసాగింది. నాకైతే అర్థం కాలేదు. విశ్లేషణ చేస్తే మొదట మసీదు కట్టని ప్రాంతం లో జ్ఞాన లింగం ఉండి ఉండాలి. ఆ తర్వాత ముష్కరుల దాడిలో రక్షణ కోసం ఈ లింగమును బావిలో దాచి ఉంచి ఉండాలి. దాడులు పూర్తి అయిన తరువాత యధావిధిగా ఈ లింగమును యధాస్థానంలో పునఃప్రతిష్ఠ కావించి ఉండి ఉంటారు. తిరిగి మళ్ళీ తురుష్కులు దాడులు చేయడంతో ఈ లింగమును సంరక్షించే అవకాశం కలగక పోవడంతో ఈ లింగము ఉన్న చోట ఉన్న గుడిని పగలగొట్టి మసీదు కట్టి ఉండాలి. ఆపై తురుష్కుల దాడుల వలన ఈ లింగము వారికి అధీనమై ఉండటం వలన ఈ లింగానికి బదులుగా అహల్యాబాయి చేత ప్రతిష్ఠిత లింగం ప్రతిష్టించి ఉండి ఉండాలి. ఎందుకంటే ఆది పెద్ద నందీశ్వరుడు ఇప్పటికీ కూడా మసీదు ప్రాంతము వైపు చూస్తూ ఉండటం మనం గమనించవచ్చును. అలాగే శ్రీ శంకరాచార్యులవారికి జ్ఞానవాపి బావిలో ఎంత వెతికినా శివ లింగ మూర్తి కనిపించలేదని వారి అనుభవ చరిత్ర చెబుతోంది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేని ప్రత్యేకత ఈ కాశీక్షేత్ర లింగము విచిత్రంగా దక్షిణ అభిముఖముగా ఉండటం జరిగినది. దక్షిణ ముఖము ఉండేది దక్షిణామూర్తి స్వరూపమే గదా. అలాగే దక్షిణ దిక్కుకు అధిపతి అగు యమధర్మరాజు కావటం విశేషం. అంటే ప్రస్తుతము కాశీ క్షేత్రములో మసీదులో తప్పనిసరిగా మూడవ లింగ రూపమైన జ్ఞాన లింగం ఉండి ఉండాలి. అలాగే మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు పన్నెండు గంటలకి మసీదుకు కిటికీ తెరవటం జరుగుతుంది. తద్వారా ఈ లింగానికి ఉన్న అత్యంత కాంతి శక్తి, జ్ఞాన శక్తి, పుణ్యశక్తి, దహన శక్తి, సంకల్ప శక్తి ఇలా ఈ పంచ శక్తులు కూడా ఈ లింగము ద్వారా విశ్వములో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలుకు వెళ్లేటట్లుగా ఏర్పాట్లు చేసినారని కాశీక్షేత్ర గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగినది. విచిత్రంగా ఈ మసీదు కిటికీ ని చూస్తూ ఆది పెద్ద నందీశ్వరుడు ఉండటం మనం గమనించవచ్చును. పరిశోధనలలో ఎంతవరకు సత్యమో అసత్యమో నాకే తెలియదు. నా వ్యక్తిగత అభిప్రాయాలే అని గ్రహించండి.
ఇది ఇలా ఉంటే నాకు కాశీ క్షేత్రము నందు సూక్ష్మశరీరధారిగా శ్రీ త్రైలింగస్వామి ఆత్మదర్శనం అవ్వటము జరిగినది. పైగా ఈ క్షేత్ర వాసులకి ఆయన ఏదో ఒక రూపంలో ప్రతి నిత్యము కనబడుతూ ఉంటాడని అక్కడ వాళ్ళు చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. మరి కాశీక్షేత్రంలో జీవ సమాధి చెందిన ఈయన ఈ పరిస్థితి ఇలా ఉంటే మోక్షము పొందకుండా అనగా ఎలా సూక్ష్మధారిగా సంచారము చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అలాగే కొంతమంది యోగులు ఆవులు, కుక్కలు, కోతులు జంతువుల రూపములలో తిరుగుతున్నట్లుగా నాకు దివ్య అనుభవాలు కలిగాయి. దానితో నిజంగానే కాశీక్షేత్రంలో ఒకవేళ మరణం పొందిన లేదా జీవ సమాధి చెందిన శరీరాలు లేని మోక్షప్రాప్తి కలగదా అనే ధర్మసందేహం రాసాగినది. ఈ సందేహ నివృత్తి కోసం ధ్యానం తపస్సు చేయసాగాను. అప్పుడు నాకు ఒక విధమైన స్పురణ భావాలు కలిగి ఉన్నాయి. అది ఏమిటంటే మానవ శరీరము పంచభూత నిర్మితం… పంచ శరీర నిర్మాణం అని ఇంతకు ముందే నా సాధన అనుభవాలు ద్వారా తెలుసుకోవడం జరిగినది కదా. అనగా స్థూల- సూక్ష్మ- కారణ- సంకల్ప- ఆకాశ శరీరాలతో మన సాధన శరీరము ఉంటుందని తెలుసు కదా. ఆకాశ శరీరముతో జీవన్ముక్తి చెందిన వారికి మాత్రమే నడయాడే కాశీ విశ్వనాథుడుగా మారి ఆత్మశాంతితో సంచారం చేస్తూ ఉంటారని గ్రహించాను.
దీనికిగాను వారికి మరణము పంచక్రోశి ప్రాంతంలో జరిగే మణికర్ణికా ఘాట్ దహనము లేదా జీవ సమాధి కార్యక్రమాలు జరిగి ఆపై వీరి చితాగ్ని భస్మము ఆరోజు కాశీ విశ్వనాథుడు భస్మాభిషేకం జరిగితే వారికి మాత్రమే ఆకాశ శరీర జీవన్ముక్తి కలుగుతుందని గ్రహించాను.అంటే ప్రతి 20 నిమిషాలకు ఈ ఘాటు యందు దహనము జరుగుతుంది. అంటే గంటకి 3 దహనాలు చొప్పున రోజులో 24x60=1440 నిమిషాలలో 480 శవాలు ప్రతిరోజు దహనము అయితే అందులో ఒకటి మాత్రమే చితాభస్మం ఆ జ్ఞాన లింగం విశ్వనాధుడిని చేరుతుంది. తద్వారా వీరికి మాత్రమే ఆకాశ శరీర జీవన్ముక్తి కలుగుతుంది. ఇలాంటి ముక్తి పొందిన వారు సాక్షాత్తుగా నడయాడే కాశీ విశ్వనాథుడుగా ఖ్యాతి చెందుతారు. పూజింపబడతారు. ఇలాంటి వారే నా సద్గురువు శ్రీ త్రైలింగ స్వామి వారని వీరు జీవ సమాధి చెందిన సమయంలో కొన్ని మల్లె పువ్వులుగా మారినారని అందులో ఒక మల్లెపువ్వు మణికర్ణికా ఘాట్ లో ఉన్న సూక్ష్మ లింగానికి చేరటంతో వారు ఆకాశ శరీరము జీవన్ముక్తి పొందుతారని నాకు అవగతమైనది. ఇంతటి మహత్తర శక్తి ఉండటం వలన ఈ ఘాట్ ఒడ్డున దహనం చేసిన వారి చితాభస్మం గంగ లో కలపటం ఆచారముగా పెట్టటం జరిగి ఉండి ఉండాలని గ్రహించాను. ఇక మిగిలిన ఆరోజు మణికర్ణికా ఘాట్ శరీర దహన కర్తలలో 480 కి గాను 479 మందితో సంకల్ప శరీరాలతో కైవల్య ముక్తి ఇవ్వటం జరుగుతుంది. అంటే వీరు సంకల్ప బ్రహ్మలు గా బ్రహ్మలోకానికి చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా లోకకల్యాణార్థం వీరు అవతారాలు ఎత్తే అవకాశము ఉంటుంది. ఆ తరువాత పంచ క్రోశ పరిధిలో మరణించేవారికి తారక మంత్రోపదేశము వలన మణికర్ణికా ఘాట్ తీర్థ స్నానం వలన వారికి కారణ శరీరములతో శివ లోకానికి లేదా విష్ణు లోకానికి వారి ఆచార భక్తిని బట్టి సాయుజ్య ముక్తి ద్వారా వెళతారు. లేదంటే ఆ లోకాలకి వెళ్ళటం ఇష్టం లేనివారు ఆవుల రూపంలో సంచారము చేస్తూ ధ్యాన తపస్సు చేసుకుంటూ ఈ క్షేత్రము నందు వారి కారణ శరీరాలతో సంచారం చేస్తూ ఉంటారు. ఇక పంచ క్రోశ ప్రాంతములలో కాకుండా ఇతర ప్రాంతాలలో చనిపోయేవారు మాత్రం కొన్ని క్షణాలు కాలము పాటు భైరవ యాతన పడుతూ సూక్ష్మ శరీరాలతో వారి ప్రారబ్ధ కర్మల నివారణ కోసం వివిధ జంతువుల రూపములలో, వివిధ చెట్ల రూపములలో ఈ క్షేత్రము నందు ఆవాసము చేస్తారు. తపస్సు చేసుకుంటూ వారి కర్మ ఫలాలను తగ్గించుకుంటారు. ఇక ఆఖరున ఘాట్ ల పరిధిలోకి రాని అలాగే కాశీక్షేత్ర పరిధి దాటకుండా చనిపోయే వారికి అలాగే చనిపోయే జంతువులకి కూడా రుద్రపిశాచతత్వమును ఆపాదించి వారిని పునీతులు చెయ్యటానికి వారికి తోడుగా భూత నాథుడిగా ఉంటారు. వారి కర్మానుసారం కాశీక్షేత్ర పరిధిలో మరణించి మరుజన్మలో తిరిగి కాశీ క్షేత్రములోని పంచక్రోశి పరిధి ప్రాంతంలో జన్మించి మరణము పొందేటట్లు గా అనుగ్రహము కలిగిస్తారని నాకు అనుభవ జ్ఞానము ద్వారా స్పురణ అయినది.
ఎటు చూసినా ఏ విధంగా చూసినా కాశీ క్షేత్రము పరిధిలో మరణించిన వారికి ఏదో ఒక శరీర విముక్తి ముక్తి పదము కలుగుతుందని నాకు అవగతమైనది. అందుకే ఇంతటి మహత్తర శక్తి ఏ క్షేత్రంలోనూ ఉండదు. పైగా ఇక్కడ ఈ క్షేత్రము విశ్వంలోని సకల దైవ స్వరూపాలు ఆవాసము చేస్తూ ఉండటం ఒక ఎత్తు అయితే స్వయంగా ఆదిదంపతులు మనకు జ్ఞానం ఉపదేశముగా తారక మంత్రోపదేశం చేసి మన కర్మలు సంపూర్తిగా నివారణము చెయ్యటం ఈ విశ్వంలో ఉన్న సకల క్షేత్రాలలో సర్వ తీర్థాలలో మరెక్కడ ఇలాంటి ప్రక్రియ ఆది దైవాలు స్వయముగా మనకి సేవలు చేయడం జరగదని ఖచ్చితముగా ఘంటాపధంగా చెప్పవచ్చు. అందుకే విశ్వంలో ఎన్నో కోట్ల శైవ, శక్తి, విష్ణువు వివిధ దైవ క్షేత్రాలు ఉన్నప్పటికీ అందరికీ కాశీ క్షేత్రం కావాలని స్వయంగా దైవ స్వరూపాలు కోరుకుంటున్నారు అంటే ఈ క్షేత్ర మహత్యము చెప్పటానికి నా వయస్సు నా అనుభవము ఏపాటిదో ఆలోచించండి. వేదాలు వల్లనే కాలేదు. వేదాలు రచన చేసిన వేదవ్యాసుడు వల్లనే కాలేదు. వేదాలు జ్ఞానము పొందిన విధాత వల్లనే కాలేదు. మనం ఎంత ఆలోచించండి. జీవితంలో ఒకసారైనా కాశీ క్షేత్ర దర్శనం పొందండి. అక్కడ తొమ్మిది రాత్రులు లేదా తొమ్మిది నెలల పాటు ఎటూ వెళ్ళకుండా కాశీ క్షేత్ర పరిధిలో ఉంటూ ప్రతి నిత్యము గంగాస్నానము, కాలభైరవ దర్శనం, డుండి గణపతి దర్శనం, విశ్వనాధుడి- విశాలాక్షి- అన్నపూర్ణ దర్శనం చేయండి. ఈ జన్మలో గత జన్మలలో రాబోవు జన్మలలో చేసిన చేయబోయే అన్నిరకాల ప్రారబ్ద కర్మలు నివారించబడి మళ్ళీ పునర్జన్మగా తిరిగి కాశీ క్షేత్ర పంచక్రోశి పరిధిలో జన్మించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. మాయా మోహిత గర్భవాసం జన్మలు ఉండవని గ్రహించండి. ఒకే ఒక యోగి జన్మ అది కూడా కాశీ క్షేత్రం నందే జరుగుతుంది. ఆపై మీ భక్తి విశ్వాసాల ఆరాధన సాధన శక్తిని బట్టి మీకు ఏ శరీర ముక్తి కలుగుతుందో నిశ్చయించబడుతుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి అనుమానమూ ధర్మ సందేహం లేదని గ్రహించండి. లేదా కాశీ క్షేత్ర దర్శన ప్రాప్తి లేనివారు కనీసము పంచ కాశీ క్షేత్రాలు అయినా శ్రీశైలములో శిఖరదర్శనము, కేదారేశ్వర క్షేత్రము తీర్ధ జల స్వీకరణ, శ్రీ కాళహస్తి సర్పదోష పూజ, పట్టిసీమ వీరభద్రుడు లింగార్చన చేసినను రాబోవు 48 జన్మలలో చివరి జన్మ యందు కాశీ క్షేత్రము నందు జన్మించి మీ సర్వ ప్రారబ్ద కర్మలు నివారించుకొంటారని గ్రహించండి. తద్వారా జీవన్ముక్తి పొందుతారని తెలుసుకోండి. అలాగే ఇంతటి మహిమాన్విత మహత్తరమైన కాశీ క్షేత్ర దర్శనానికి డుండి గణపతి అనుగ్రహం… కాశీ క్షేత్ర వాసము లేదా నివాసమునకు అన్నపూర్ణ అనుగ్రహమును… కాశీ క్షేత్ర ప్రవేశ అనుమతికి కాలభైరవ అనుగ్రహమును…. కాశీలో మరణమునకు విశ్వనాధుని అనుగ్రహము…. కాశీ క్షేత్ర దర్శన ఫలితం గవ్వలమ్మ అనుగ్రహమును… కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ దహనమునకు కాశీ విశాలాక్షి అనుగ్రహము…. కాశీ క్షేత్రం నింద దోషాల నివారణకు దుర్గా దేవి అనుగ్రహం…. ఈ క్షేత్ర సంకట నివారణకు సంకట విమోచన హనుమత్ వారి అనుగ్రహము…. పాపాలు లేదా శాపాలు వలన వచ్చే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ కోసం అనుగ్రహమును లలితా దేవి ఉపాసన సిద్ధి లేదా నామాల ఫలిత సిద్ధికోసం శ్రీ చక్ర లింగేశ్వరుని అనుగ్రహమును… గురువుల అనుగ్రహ ప్రాప్తి కోసము దత్త లింగము అనుగ్రహమును… మనము తెలిసిన లేదా తెలియక చేసిన సమస్త పాపాల దోషాల నివారణ కోసం గంగామాత అనుగ్రహమును…. గత జన్మలు లేదా పూర్వజన్మల ప్రారబ్ద కర్మ దోషాల నివారణ కోసం మధ్యాహ్నం మణికర్ణికా స్నాన అనుగ్రహమును పొందవలసి ఉంటుంది. ఇంతడితో నా భౌతిక స్వప్న సాధన పరిసమాప్తి అయినది.ఇక నా శబ్ధానుభవ పాండిత్య సాధన సందేహలు గూర్చి తెలుసుకోవాలని ఉందా?దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!
శుభంభూయాత్
పరమహంస పవనానంద
*************************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండికపాల మోక్షమ్ గ్రంథం మీ దగ్గ్గర అందుబటులో ఉందా ..
తొలగించండి