అధ్యాయం 17


జిజ్ఞాసి పరిచయం


జిజ్ఞాసి 

ఒకరోజు నేను గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకుని ….ఆరు బయట కూర్చుని ఉండగా… సాయంత్రం వేళ రాత్రి 7 గంటల సమయంలో… నా కన్నా రెండు సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ని తీసుకుని… నా కన్నా వయసులో పెద్దవాడైన నా మిత్రుడు ఇతనిని తీసుకుని వచ్చినాడు! మా మధ్య పరిచయాలు అయిపోయినాయి! మాటల మధ్యలో కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా దేవుడంటే ద్వేషి అని… దేవుడిని చూడాలనే తపన, కసితో ఉన్నాడని… కనపడితే చంపడానికి వెనుకంజ వేసే వాడు కాదని నేను గ్రహించాను! నేను అతనికి నా వాక్సిద్ధి ప్రతిభ ప్రదర్శించాలని నాలో ఆరాటం మొదలయింది! ఆట మొదలైంది! అతనికి నాలుగు వాక్యాలు జరిగినవి చెప్పాను! జరగబోయేది చెప్పాను! అతను పెద్దగా స్పందించలేదు! అవునా అన్నట్లుగా అమాయకత్వం మొహం పెట్టి నవ్వి ఊరుకున్నాడు! వీడేంటి చాలా తేడాగా ఉన్నాడు! వీటిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది! అనుకుంటున్న సమయములో అతను వెంటనే “స్వామి! ఒక రోజు, రెండురోజులు జరగబోయే విషయాలు చెప్పడం గొప్ప కాదు! జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను నిమిషాలలో..క్షణాలలో కూడా చెప్పగలరా? అంతా విధి ప్రకారం జరిగితే ఇంకా పూజలు ఎందుకు? ఈ దేవాలయాలు ఎందుకు? ఎందుకు ఈ దేవుడు? ఏవో గ్రహ సంచారమును బట్టి నాలుగు వాక్యాలు జరిగితే అది విధి వ్రాత తెలుసుకోవడమేనా?  నా భవిష్యత్తు ఏమిటో… రేపు ఏం జరుగుతుందో… అంతెందుకు రాబోయే నిమిషాలలో, క్షణాలలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి చూద్దాం? మనుషుల మనస్తత్వం ఆధారంగా చేసుకుని చెప్పే నాలుగు వాక్యాల జరిగినంత మాత్రాన భవిష్యత్తు చెప్పినట్లు కాదని ఘంటాపధంగా చెప్పగలను! ఈ క్షణంలో నేను ఏమి చేస్తానో చెప్పండి చూద్దాం! మీరు చెప్పినది ఖచ్చితంగా జరిగితే … మీరు విధాత అని నమ్మి… జ్ఞాన సిద్ధుడువని నమస్కారం చేసి వెళ్ళిపోతాను” అనగానే నేను అయోమయం పడిపోయాను! నన్నే ఈ స్థితిలో పడేశాడు అంటే వీడు సామాన్యుడు కాదని… ఏదో కార్యం మీద అకారణంగా నా దగ్గరకు వచ్చిన కారణజన్ములు అని నాకు అర్థమయింది! 

వాడికి భవిష్యత్తు చెప్పడం సమస్య కాదు! నేను చెప్పి నదానికి వాడు వ్యతిరేకంగా చేస్తే…  నేను చెప్పిన దానికి కావాలని వాడు వ్యతిరేకంగా చేస్తే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది! ఈ క్షణమే నువ్వు నుంచుని ఉంటావని నేను చెప్పితే…  వాడు కదలకుండా కూర్చుంటే… నా పరిస్థితి ఏమిటి? పోనీ కూర్చుని ఉంటావని నేను చెప్పితే…   వాడు నుంచుని ఉంటే నా స్థితి ఏమిటి? అప్పటిదాకా నా వాక్సిద్ధి వలన పెద్ద తోపు గాడిని అనే బిరుదు చంక నాకి పోతుంది కదా! వామ్మో అలా జరగడానికి వీలు లేదు! పరువు పోకూడదు! పాము చావకూడదు… కర్ర విరగ కూడదు అని అనుకుంటూ వాడితో “మిత్రమా! నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు! నీ భవిష్యత్తు క్షణాలలో ఏమి జరుగుతుందో నేను చెబుతాను! ప్రస్తుతం నా నాకున్న వాక్సిద్ధి ద్వారానే భవిష్యత్తు సూచనలు ఇంతవరకు చెప్పినాను! సంపూర్ణ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యజ్ఞానం నాకు లేదు అని చెప్పి ఊరుకున్నాను! నా నిజాయితీ మాటలకి అతను సంతృప్తి చెంది… నీతో స్నేహం చేయాలని ఉందని చెప్పి ఆప్తమిత్రుడుగా మారినాడు! ఆనాటి నుండి అతనిని జిజ్ఞాసి గా నేనే పిలవడం ఆరంభించాను! నాలో అంతవరకు ఉన్న భవిష్యత్తు చెప్పే జ్ఞాన అహంకారము… ఇతని మాటల వలన దొబ్బినది! నాలో ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆరంభమైనది! పొగడ్తలు మాయ నుండి బయట పడటం జరిగినది! ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యోతిష్య గ్రంథాల ద్వారా జాతక చక్రములో గ్రహస్థితుల ఆధారంగా జాతక ఫలితాలు చూడటం ఆరంభించాను! నాకు తెలియకుండానే జ్యోతిషం వైపు నా మనసు లాగడం ఆరంభమైనది! ఎక్కడో రేడియోలో అంతులేని కథ సినిమాలోని “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి… ఇంక ఊరేల … సొంత ఇల్లేల… ఓ చెల్లెలా… ఏది స్వార్ధం.. ఏది పరమార్ధం అనే పాట లీలగా వినబడసాగినది! మీరు కూడా ఆ పాటను గుర్తు చేసుకుని…. అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

********************************

గమనిక:- కొన్ని నెలలకు గాని ఇతనికున్న అపార శాస్త్ర విజ్ఞానము నాకు అర్థం కాలేదు! ఏవో అర్థంపర్థంలేని ధర్మసందేహాలు నన్ను అడిగి విసుగు తెప్పిస్తున్నాడని అనుకున్నాను! ఉదాహరణకు నేను అంటే ఎవరు? మాయ అంటే ఏమిటి? ఆత్మ ఒకటేనా … వేరు వేరా? దేవుడు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఏమి చేస్తూ ఉంటాడు? దేవుడిని చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీకు కనిపించాడా? కనపడితే ఎలా కనబడ్డాడు? ఏ విధంగా కనబడ్డాడు ?మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా భక్తి అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? అనేక ధర్మ సందేహాలు, సాధనా సందేహాలు నన్ను అడుగుతుండేవాడు! కానీ ఇతనికున్న శాస్త్రాల మీద, పురాణాల మీద, ఇతిహాసాల విషయాలు మీద ఉన్న జ్ఞానము, అంతటి జ్ఞానము సైన్సు విషయాలమీద కూడా ఉందని గ్రహించాను! అంటే ఒక రకంగా శబ్ధ పాండిత్యము ఉన్న అపార బ్రహ్మజ్ఞాని అన్నమాట! కానీ పురాణ ఇతిహాసాల విషయాలు చెప్పిన విషయాలను సైన్స్ విజ్ఞాన విషయాలు పోల్చుకుని సంతృప్తి పడే తత్వం ఉన్నాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను! నిజానికి ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి… చెప్పుకోవాలి! అది ఏమిటంటే నేను ఇలా అనుభవం పాండిత్య జ్ఞానము పొందటానికి అలాగే నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాయి ఇతను అని గర్వంగా చెప్పగలను! విచిత్రమేమిటంటే ఇతను ఏదో ఒక ఆధ్యాత్మిక ధర్మసందేహము నా దగ్గరికి తీసుకుని వచ్చేవాడు ! దీనికి సంబంధించిన గ్రంథాలలో చదివిన విషయం అతనికి ఒకే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నప్పటికీ… ఏది నిజమైన సమాధానము అతనికి అర్థం అయ్యేది కాదు! ఉదా: మాయ అంటే కొంతమంది భ్రమ భ్రాంతి అని, మరికొంతమంది మనో భ్రాంతి అని, కొంతమంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గానే చూచేది, మరికొంతమంది త్రాడు కాస్త పాముగా కనిపించేటట్లుగా చేస్తుందని చెప్పేది మాయ అని ఇలా ఒక మాయ మీదే అతనికి అనేక సమాధానాలు దొరికేవి! తెలుసుకోవటం జరిగేది! ఇందులో ఏది సత్యమో అతనికి అర్థమయ్యేది కాదు! నా దగ్గరకు వచ్చి ఈ సందేహ నివృత్తి చేసుకునే వాడు! నేను ఇతనికున్న శబ్ద పాండిత్య గ్రంథాలు విషయాలు తిరిగి తిరిగి చెప్పడం కన్నా… నేను అనుభవమును పొంది వాడికి చెప్పాలని… నేను సమాధానాల కోసం తీవ్రంగా మధనపడుతూ… జ్ఞాన తపస్సు చేసే వాడిని! దానితో నాకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు స్ఫురణ అనుభవాలు కలుగుతూండేవి! వెంటనే వాటిని పుస్తకాల్లో వ్రాసే దాకా నాకు నిద్ర పట్టేది కాదు! ఈలోగా అతనికి దీనికి సంబంధించిన విచిత్ర అనుభవాలు కలలోనూ లేదా ధ్యానములో కలిగేవి! వీటి గురించి నాకు అతను చెప్పే లోపల…. వీటిని నేనే విడమర్చి …. నాకు కలిగిన సమాధానాలు అతనికి చెప్పే సరికి…. అతను సంతృప్తి చెంది ఆనందంగా వెళ్ళిపోయేవాడు! మళ్లీ ఏదో ఒక ప్రశ్నతో నా వెంట పడే వాడు! దాని సమాధానం కోసం నేను ధ్యానం వెంట పడే వాడిని! దానితో నా జీవితం నాకు తెలియకుండానే అనుభవ పాండిత్యం వైపు దారితీసింది! దీనికి కారణం మన వాడికున్న తపన తాపత్రయమే! ఆ తర్వాత వీడికి వచ్చిన ప్రశ్నలకు దానికి నేను ధ్యాన అనుభూతి ద్వారా పొందిన మనో భావాలు సమాధానంగా 625 ప్రశ్నలతో “యోగ దర్శనం” గ్రంథమైనది! ఒకరకంగా ఇతను రమణ మహర్షికి కావ్యకంఠ గణపతి లాగా… షిరిడి సాయి బాబా కి నానావళిగా లాగా… శ్రీరాముడికి లక్ష్మణుడు లాగా… ఇలా నా వెంట ఉండేవాడు! తన జ్ఞాన సాధన ధర్మసందేహాలు తీర్చుకుంటూ… నన్ను నాలోని ఉన్న జ్ఞాన శక్తిని వెలికి తీసి నారని గ్రహించే ఉంటారు! ప్రస్తుతం ఇతను మౌనముని గా మారి కాశీ క్షేత్రము నందు మోక్ష ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ … ప్రస్తుతానికి తన యోగ సాధన ద్వారా ప్రారబ్ధ కర్మల నివారణ కోసం సాధన చేస్తూన్న…. జ్ఞాన యోగి అని లోకానికి తెలియకుండా ఉన్న గుప్త యోగిగా ఉన్నాడు! మేము పరమగురువుగా ఉన్నపుడు నా పంచ శిష్యులలో శ్రీ వాసుదేవానంద సరస్వతి దీక్షనామముతో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియై అంతర్యామిగా ప్రధమశిష్యుడిగా ఎదిగి ఒదిగి ఉన్నారు!





2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. jignasi parichayam meeru anubhavinchi thelusukoni cheppatam bagundi... mee vaaksiddhi ahankaaram ela poyindo cheppatam...ika mee pradhama shishyudigaa gaa maari edi odigi undatam...

    రిప్లయితొలగించండి