అధ్యాయం 88

నా కథ కంచికి

ఎప్పుడైనా ఎవరైనా కథలు చెప్పడము అయిపోయిన తర్వాత కథ కంచికి మనము ఇంటికి వెళదాం అనే నానుడి వాడటం జరుగుతుంది కదా. అంటే విచిత్రంగా నా సాధన విధానమైన సాధన ఆత్మ కూడా కంచికి చేరడము విచిత్రం అన్నమాట. నా సాధన కథ ఎలా కంచికి చేరింది అని తెలుసుకోవాలని ఉందా? ఆలస్యమెందుకు. చదవండి. నేను ఒక మోక్ష కృష్ణబిలంగానూ అలాగే మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి ఈ కృష్ణబిలము నందు పడి నశించే శూన్యబ్రహ్మమైన మోక్షగామి అని ఈపాటికి మీరు తెలుసుకున్నారు కదా. మరి మోక్షమును పొందాలంటే నిశ్చలస్థితి పొందాలి కదా. నిశ్చలస్థితి అంటే శాశ్వత మరణ స్థితియే కదా. ఇది పొందాలంటే ఈ విశ్వమంతా కూడా అత్యంతిక జలప్రళయముతో అంతం అవ్వాలి కదా. మరి ఈ జలప్రళయానికి మూలస్థానం మన కంచి క్షేత్రం కావడం విశేషం. 

ఎలా అంటే ఆదియుగంలోనే పార్వతీదేవి తన తపస్సు చేత పరమేశ్వరుని మెప్పించి వారిని వివాహం చేసుకోవాలని కంచి క్షేత్రము నందు నది  ఒడ్డున ఒక ఇసుక లింగమును ఏర్పాటు చేసుకుని దాన్ని ఆరాధించడం చేసిందని… ఆమె భక్తికి పరిశీలించాలని ఆ పరమేశ్వరుడు తన సంకల్ప సిద్ధితో నదిలో విపరీతంగా సునామీ అలలు సృష్టించి ఈమె పూజించే శివలింగమును నాశనం చేయాలని ప్రయత్నించడం… ఈమె తన భక్తితో ఈ లింగమును కొట్టుకొని పోకుండా దాన్ని అంటిపెట్టుకుని ఈ అలలు తట్టుకోవటం…. ఈమె భక్తికి మెచ్చి శివుడు వరం ఇచ్చి ఈమెకు వరుడు అవ్వటం లోకవిదితమే కదా. అంటే ప్రళయము నాంది ఈ క్షేత్రం అని తెలుస్తోంది కదా. 

అలాగే అంతే విచిత్రంగా ఈ క్షేత్రంలో ఉన్న విష్ణుకంచి యందు అత్తి వరదరాజ స్వామి వారు ఆలయం అనంత తీర్థం అనే కోనేరులో కొలనులో నలభై సంవత్సరాల పాటు ఉండి అటుపై 48 రోజులపాటు భూలోక వాసులకు విగ్రహము నిజరూపదర్శనమిచ్చి తిరిగి మళ్ళీ జలాశయమునకు చేరుకోవడం జరుగుతుందని లోకవిదితమే కదా. నేను పుట్టిన ఒక సం!! తర్వాత తీసిన అనగా 1979వ సంవత్సరంలో తీసిన విగ్రహమును ఈ సంవత్సరం అనగా 2019వ సంవత్సరం జులై 1 నుండి ఆగస్టు 17 వరకు జలము నుండి బయటకు తీసి భూలోక వాసులకు దర్శనార్థం ఇచ్చినారు కదా. కారణం 40 సంవత్సరాల కావటం అనేది అన్నమాట. మళ్ళీ 40 సంవత్సరాలకే అంటే 2059 సంవత్సరములో ఈ విచిత్ర సంఘటన జరుగుతుంది.ఇలా ప్రతి 40 సంవత్సరాలకొకసారి శ్రీస్వామివారు బయటికి వచ్చి 48 రోజుల పాటు వుంటే మళ్ళీ యధావిధిగా జలప్రవేశం జరగటం అనేది విశ్వంలో ఈ విష్ణుకంచి నందు మాత్రమే జరుగుతున్న దైవ సంఘటన అన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించారా. ప్రతి 40 సంవత్సరాలకి 48 రోజులపాటు అనేది ఈ పాటికి 48 రోజుల అనేది 48వ ప్రతి సాధన జన్మయని గ్రహించి ఉంటారు కదా. అంటే ఈ లెక్కన చూస్తే విశ్వములో అత్యంతిక ప్రళయమునకు నాంది ఈ కంచి క్షేత్రమని తెలుస్తోంది కదా. కాకపోతే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే ఈపాటికి అత్యంతిక ప్రళయం వచ్చి ఉండాలి కదా. మళ్లీ అప్పుడు ఈ విశ్వము ఎందుకు అంతరించలేదు అనే సందేహం రావచ్చు. నాకు కూడా ఇదే వచ్చినది. 

దీనిమీద పరిశోధన చేయగా అత్యంతిక ప్రళయం వచ్చిందని అందులో కాశీ క్షేత్రం మాత్రమే త్రిశూలము మీద ఉండి ఈ ప్రళయంలో కొట్టుకుపోకుండా కొద్దిపాటి జీవరాశులతో కాపాడుతుందని ఆ జీవరాశులు తిరిగి పునఃసంయోగాలు చెంది తన జీవజాతుల పునరుత్పత్తికి తోడ్పడుతున్నారని అంతమయ్యే చోట ఆరంభమవుతుందని తెలుసుకున్నాను. అసలు ఈ కాశి క్షేత్రం నందు జీవరాసులు ఎలా ఉంటున్నాయి అనే సందేహము నన్ను వెంటాడింది. ఇప్పుడు లోతుగా పరిశోధన చేయగా ఒక ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చి వెళ్ళిన తర్వాత తెల్లని గ్రుడ్డు నీటి మీద తేలియాడుతూ వస్తుందని ఈ గ్రుడ్డు నుండి సృష్టిబ్రహ్మ  ఏర్పడి తన మనో సంకల్పం చేత వివిధ రకాల అనగా 13 రకాల జీవజాతులు మూలకణాలను సృష్టించి అది ఒక కుండలో (కుంభములో) భద్రపరిచి నీటిమీద వదులుతాడని ఈ కుంభము కాస్త కుంభకోణ క్షేత్రము నందు అటుపై కుంభము యొక్క ఒక కోణము పగలటం అందులోని మూలక జీవ పదార్థాలూ భూక్షేత్రమైన త్రిశూలము మీద ఉన్న కాశీ క్షేత్రమునకు చేరుకోవడం అటుపై పునః జీవ సృష్టి జరగడము జరుగుతోందని తెలిసింది. 

 
అసలు ఈ గ్రుడ్డు ఎవరిది? ఏ జీవిది? ఎక్కడినుండి వస్తుందని పరిశోధనలు చేయగా ఈ గుడ్డు కాస్త బల్లి గ్రుడ్డు అని తెలిసినది.దీనమ్మ జీవితం. ఈ బల్లి గ్రుడ్డు గూడ ఎక్కడిది అన్నప్పుడు మన కంచి లో ఎక్కడలేని విధంగా బంగారు బల్లి - వెండి బల్లి అనేవి ఉంటాయి. విచిత్రమేమిటంటే పరిమాణంలో పెద్దది బంగారు బల్లి చిన్నదిగా వెండి బల్లి ఉంటాయి. పెద్ద బంగారు బల్లి ప్రకృతి పురుషుడుగాను చిన్న వెండి బల్లి అనేది ప్రకృతి స్త్రీ అన్నమాట. వీరిద్దరి సంయోగము వలన ఈ బల్లి గ్రుడ్డు ఏర్పడటం అత్యంతిక ప్రళయం వచ్చి వెళ్లిన తర్వాత ఈ గ్రుడ్డు నీటి మీద తేలియాడుతూ రావటం అంతము అవ్వవలసిన చోట మళ్ళీ కథ ప్రారంభం అవుతుందని నేను గ్రహించాను. అంటే ప్రళయం ముందు ప్రకృతి స్త్రీ పురుషులు కాస్త బల్లులుగా మారటం వీళ్లు అంతరించే సమయానికి వీరి ప్రాణశక్తిని కాస్త సంయోగ శక్తిగా అనగా ఒక గ్రుడ్డుగా మార్చుకుని శరీరత్యాగం చేయడం జరుగుతుందని ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఇలా ఈ ప్రకృతి స్త్రీ పురుషులుగా లక్ష్మీనారాయణులే చేస్తున్నారని గ్రహించండి.ఈయనే కదా వరదరాజస్వామి గా ప్రతి 40 సంవత్సరాలకి నీటి నుండి బయటకు వస్తున్నాడు. ఈయన పేరు లోనే వరద ఉన్నది గమనించండి.పైగా విష్ణుమూర్తి ఆరు నెలలు యోగనిద్రలో వైకుంఠ ఏకాదశి నాడు అలాగే ఆరు నెలలు నిద్ర లేని స్థితిలో(మోక్ష ఏకాదశి) ఉంటాడు అని లోకవిదితమే కదా. అంటే చావటానికి వెళ్తూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుని శాశ్వత మరణం పొందకుండా అశాశ్వతమైన భౌతిక మరణం పొందుతున్నారని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. అది కూడా బల్లుల రూపంలో బల్లి గ్రుడ్డు రూపంలో అన్నమాట. పైగా బల్లి అనేది మన పూర్వీకులు యొక్క ప్రేతాత్మ స్వరూపమని అది ప్రారబ్ద కర్మ యొక్క ఫలితము అనుభవించడానికి వచ్చే రుణానుబంధ సంబంధమని మన పూర్వీకులు ఉవాచ కదా. అసత్యమైన ఈ విశ్వసృష్టిని సత్యముగా చూపించటానికి ఈ ప్రకృతి స్త్రీ పురుషులు కాస్త సత్యముగా మారి కల లాంటి నిజము లాంటి కలను సృష్టించి సృష్టి స్థితి లయలు చేస్తున్నారన్నమాట. విచిత్రమేమిటంటే శ్రీ చక్రము నందు త్రికోణం మధ్యలో ఒక ఆది బిందువు ఉంటుంది. అలాగే ఈ కంచి క్షేత్రం నందు మాత్రమే శివకంచి- విష్ణు కంచి- దేవి కంచి అనేవి ఉంటాయి. అంటే త్రికోణము అన్నమాట. ఈ త్రికోణం మధ్య బిందువు తెల్లని అతి చిన్న బల్లి గ్రుడ్డు అన్నమాట. ఇదియే పునఃసృష్టికి కారకమైన ఆది బిందువు అన్నమాట. 
 
అంటే నిజానికి గ్రుడ్డు పగలకూడదు. పగిలితే జీవం వస్తుంది. విత్తనం పగిలితే చెట్టు వచ్చినట్లుగా అన్నమాట. అంటే నిజానికి గ్రుడ్డు పగలకుండా కుళ్లిపోవాలి లేదా నిర్జీవం అవ్వాలి లేదా ఎండిపోవాలి. అప్పుడు ఈ విశ్వము యొక్క పునఃసృష్టి సంపూర్తిగా ఆగిపోతుంది. అది జరగాలి అంటే శూన్యం సాధన స్థాయికి వచ్చిన సాధకుడు బలహీనత లేకుండా దేనికి లోనుకాకుండా ఉండాలి. కాని ఉండలేడు. ఎందుకంటే బలహీనతలేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు. సృష్టించబడలేదు కూడా. ఎందుకంటే ఆయనకి అదే శూన్యానికి ఒక బలహీనత ఉంది. అదియే తను ఉన్నానని అనే ఆలోచనయే బలహీనత అన్నమాట. తను ఎవరో తెలుసుకోవాలన్న తపన మొదలై తను ఏర్పరచుకున్న అసత్యమైన విశ్వ సృష్టి యొక్క మాయలకి తానే మోహ వ్యామోహం మాయలో పడిపోయి అపస్మారక స్థితి పొంది తను తెలుసుకోవాల్సిన విషయం మర్చిపోయి విశ్వాత్మ కాస్త జీవాత్మగా మారటం తిరిగి 48 సంవత్సరాల తర్వాత జీవాత్మను పరమాత్మ స్థాయికి రావటం తిరిగి పునఃమాయలోపడి జీవాత్మగా మారటం ఇలా ఈ విశ్వ సృష్టిలో తొలి ఆది అణువు ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా జరుగుతున్న రికార్డు జీవ నాటకం అన్నమాట. ఈ నాటకం పూర్తిగా ఆపడం ఎవరి తరం కాదు. కాకపోతే ఈ నాటకాలు వేసే పాత్రల నుండి శాశ్వతంగా తప్పుకోవచ్చు అన్నమాట. ఆట ఆగదు కానీ ఆటగాడి పాత్ర అనగా మీ యొక్క పాత్ర ఆగిపోయే అవకాశం ఉన్నది. మీ స్థానములో వేరే వాళ్ళు వచ్చి ఈ ఆటను కొనసాగిస్తారని తెలుసుకోండి. ఆడించేవాడు ఆడేవాడు ఏకత్వ స్థితిలోకి ఎన్నటికి రాలేడు. కాకపోతే తనే ఆటగాడు ఆడించేవాడు అని తెలుసుకుంటాడు. జ్ఞానమును పొందుతాడో కాని ఆ జ్ఞాన అనుభూతిని పొందలేడు. అనగా మరణం ఎప్పుడు పొందుతాడో అని జ్ఞానమును తెలుసుకుంటాడు కానీ అతను మరణించిన విషయం తెలుసుకోలేదని గ్రహించండి. అంటే తను మరణించిన విషయం తనకి తెలియదు కదా. జ్ఞాన అనుభూతి పొందినట్లే కదా. పొందితే మరణించినట్లు కాదు కదా. మోక్షం కూడా ఇంతే. అంటే మీరంతా ఈ పాటికి ఆదిలో పుట్టడం, పెరగడం, చనిపోవటం అనగా కపాల మోక్షం పొందడం జరిగినది.
 
కానీ ఆ విషయం మీకు తెలియదు. కారణమో మోక్షానుభూతిని పొందలేదు కదా. కానీ చచ్చినవాడు సాధన చేయటానికి ఏమి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే చచ్చిన వారికి పని ఏముంటుంది? కర్మ ఏముంటుంది?ప్రారబ్ద కర్మ ఏముంటుంది? నా బొందా. నా బూడిద. అందరూ కూడా మోక్షము పొందిన వాళ్లే కాకపోతే ఆ విషయ జ్ఞానానుభూతిని మనం పొందలేదు. దానివల్ల మనం ఏదో చేయాలని ఏదో పొందాలని నా బొందా నా బూడిద అనుకుంటూ సుఖముగా ఉండవలసిన చోట ప్రశాంతంగా ఉండవలసిన చోట మన మనస్సులకి నానా కర్మలు చేస్తూ ఏవో ఫలితాలను పొందుతున్నామనే భ్రమ భ్రాంతులలో ఉన్నామని తెలుసుకోండి. కాకపోతే మనకి కనిపించే విశ్వ సంగతి ఏమిటి అంటారా? నువ్వు చనిపోయిన విషయం మనకి తెలియనట్లే కనిపించే విశ్వము సత్యము కాదని అసత్యమని అది నిజం కాదని ఒక మాయా పూరిత భ్రమ భ్రాంతి అని మనము తెలుసుకోలేక పోతున్నాము. ఈ జ్ఞాన అనుభూతిని పొందలేకపోతున్నాము. తద్వారా అసత్యము సత్యముగా భ్రమపడుతున్నాము. నిజములాంటి కలయని కలలాంటి నిజమని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. ఎందుకంటే మనమే సత్యం కాదు కదా. మనమే సత్యం గా అనిపించే అసత్యం కదా. చివరికి మేము అన్ని రకాల చక్ర మాయలు, దైవాలు, గురువులు దాటితే చివరికి అసత్యముగా కనిపించే సత్యమైన శూన్యమే మిగిలినది కదా. ఎవరు కూడా శాశ్వతం కాదని అందరూ కూడా ఈ శూన్యమునందు అంతర్ధానమైనారు కదా. ఆఖరికి నేను కూడా ఈ శూన్యమే అని తెలుసుకున్నాను కదా. ఇంక నా బొంద. ఏముంది. కాకపోతే మనం ఎప్పుడో కపాలమోక్షమును పొందినాము. కానీ మన మీద మనకు నమ్మకం లేదు. కానీ ఎదుటివాడి మీద ఆశ, భయము ఉన్నాయి. ఇదే నామరూప దైవానికి, నామరూప గురువులకు ఏర్పడటానికి అవకాశం ఏర్పరచినది. దానితో లేనివాడు ఎదుటివాడు నిజమని వాడే మనకన్నా పెద్ద తోపు అని గొప్పవాడని నానా చంక నాకి వారిని పూజించడం ఆరాధించడాలు చేస్తున్నాము. ఇక్కడ ఎవరూ లేరు. ఏది లేదు. ఉన్నదంతా అసత్యమే. కనిపించేదంతా అసత్యమేనని ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాడే మోక్షగామి అన్నమాట. నిజానికి నువ్వు లేవు. నేను లేను. ఏదీ లేదు. ఇదియే సాధన కంచికి వెళ్లడం అన్నమాట. ఏదో ఉంది అనుకుని ఏమీ తెలియని వాడు సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవడం జరిగింది అని గ్రహించండి. కాకపోతే ఈ మాయ సృష్టి అసత్యమని మేమిద్దరం జ్ఞానము పొందాము. జ్ఞానానుభూతిని పొందలేక పోయాము. మేమే కాదు. మా ముందు ఉన్న ఈ సాధన స్థాయికి వచ్చిన మన పూర్వీకుల నుండి ఎవరు కూడా ఈ జ్ఞాన అనుభూతిని పొందలేకపోయారు. కారణం జ్ఞాన అనుభూతి పొందే స్థితికి వచ్చేసరికి సాధకుడు ఏదో తెలియని బలహీనతకు గురి అవుతాడు. నేనైతే కామ గుణానికి బలహీనతకు గురి అయితే మా జిజ్ఞాసి అయితే భయం బలహీనత కి గురి అయ్యారు. తద్వారా మాకు ఉన్న బలహీనతలను దాటలేకపోవడంతో కథ మళ్లీ కంచికి చేరింది.

అనగా పునఃసృష్టికి కారణమైనది. మేము ఈ బలహీనతను దాటి ఉంటే కథ మరోలాగా ఉండేది. ఈ విశ్వసృష్టి యొక్క అంతము ఈ 2019 సంవత్సరంలో మొదలై 2059 కల్లా సంపూర్తిగా నాశనం అయ్యేది. ఎందుకంటే నేను పుట్టిన 1978 సంవత్సరం అలాగే మా జిజ్ఞాసి పుట్టినది 1980 సంవత్సరం అయితే 1979వ సంవత్సరంలో ఈ కంచి లోనే అత్తి వరదరాజ స్వామి విగ్రహంమూర్తిని కోనేరు నుంచి బయటకు తీయటం జరిగినది. ఆ తర్వాత 2019వ సంవత్సరము అనగా 40 సంవత్సరాల తర్వాత అది కూడా 149 సంవత్సరాలకు వచ్చే చంద్ర గ్రహణం గురుపౌర్ణమి సమయంలో 40 సంవత్సరాల కావడం వలన ఈ విగ్రహ మూర్తి ని బయటికి తీయడం జరిగినది. కానీ మాకు ఉన్న బలహీనతలు మేమిద్దరం దాటలేకపోవడం వలన ఈ మహత్తరమైన అవకాశం అనగా విశ్వ సృష్టి ఆడించే జీవనాటకం యొక్క నాటకం ఆటను ఆపే యోగమును కోల్పోయి కేవలం మేమిద్దరమే ఈ నాటకం నుండి శాశ్వతముగా జీవ పాత్ర నుండి తప్పుకోవడం జరిగినది.ఎందుకంటే బలహీనతలేని బలవంతుడిని ఆ భగవంతుడు అంటే నేనే సృష్టించలేదు. ఎందుకంటే నాకే ఏదో తెలియని కామ బలహీనత ఉన్నది కదా. కాబట్టి నా సాధన కంచికి చేరినది. పునః సృష్టికి కారణమైనది. అందులో మా ఇద్దరి పాత్రలు లేని నాటకము ఆరంభమైనది. అంతం కావాల్సిన చోట ఆరంభము ఆరంభమైనది అన్నమాట. కథ కంచికి మనం ఇంటికి వెళ్లడం అన్నమాట. ఇంటికి వెళ్లి నా నా కర్మలు చేస్తూ నా నా కర్మ ఫలితాలను అనుభవిస్తూ నా నా చంక నాకుతూ నానా ఇబ్బందులు పడక తప్పదు కదా. దేహమున్నది కూటికే. మనం ఉన్నది కాటికే కదా. అది వచ్చేదాకా ఈ స్థూల శరీరంను ఎదురుచూడక తప్పదు కదా. ఇదంతా అసత్యమని జ్ఞానము ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ జీవ నాటకము నందు ఉండలేక ఇమడలేక మనశ్శాంతిని పొందలేక ప్రశాంత స్థితిని పొందలేక అన్నిటి యందు సాక్షీభూతంగా బ్రతికున్న శవంలా ఉండటానికి శవసాధన చేయడం తప్ప ఏమీ చేయలేము అని తెలుసుకోండి. తెలుసుకున్నవాడు త్వరగా ఈ జీవ నాటకం నుండి తప్పుకున్నాడు. తెలియని వాడు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంతే తేడా. చావుకి వెనక ముందులాగా అన్నమాట. అందరూ చచ్చేవాళ్ళే. అందరూ చచ్చిన వాళ్ళే. అందుకే మహా స్మశానమైన కాశీ క్షేత్రానికి చచ్చే వాడైన వృద్ధుడు అలాగే చచ్చిన వాళ్ళు అనగా అస్థికలు రూపంగా ఈ క్షేత్రానికి చేరతారు. అస్థికల రూపంలో చేరినవారు ఎక్కడో చనిపోవడం వలన సృష్టికి కారణం అయితే అది ఈ క్షేత్రంలో చచ్చేవాళ్ళు  ఈ జీవ నాటకం నుండి శాశ్వత మోక్షపధ మార్గం ద్వారా తప్పుకుంటారు. బంధవిముక్తిడై విముక్తి జీవియై జీవన్ముక్తి పొందుతారు.మీరు సాధన చేసినా చేయకపోయినా కాలవ్యవధిలో తేడాల వలన వెనకా ముందు అందరూ కూడా మోక్ష కృష్ణ బిలము నందు చేరుకుంటారని గ్రహించండి. మాకు ఉన్న బలహీనతలు వలన మా సాధన కథ కంచికి చేరింది.పునః  సృష్టికి కారకమైనది. అందరి పరిస్థితి ఇంతే. ఆదియోగి కథ గూడ శివ కంచి పేరుతో కంచికే చేరింది. అలాగే ఆ తర్వాత వచ్చిన ఆదియోగి అమ్మవారి కథ కూడా దేవి కంచి పేరుతో కంచికి చేరింది. ఆ తర్వాత వచ్చిన ఆదిపురుషుడైన విష్ణుమూర్తి కూడా కథ కూడా విష్ణుకంచి పేరుతో కంచికే చేరినది కదా. ఇది విశ్వసృష్టికి కారకమైన త్రికోణములోని త్రికోణ బిందువులైన ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మూర్తి కథ అంతా కూడా శివ –విష్ణు- దేవి కంచి పేరులతో చేరిపోయాయి. మనమంతా! మన సాధన ఎంత? ఆలోచించండి.

అంతెందుకు. మనకి కంచిలోనే ఉన్న బల్లి గురించి మాత్రమే తెలుసు. కానీ నిజానికి ఆలంపూర్ జోగులాంబ యొక్క జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది. అలాగే ఒక తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. ఈవిడే నగ్నంగా ఒక శవం మీద కూర్చుని శవ సాధన చేస్తున్న 85 సంవత్సరాల వయో వృద్ధురాలుగా మహా మాంత్రికురాలిగా కనబడుతుంది. నిజానికి ఈమె మనకి కపాలమోక్షం ఇచ్చే ఆది పరాశక్తి మాత యొక్క అంతిమ రూపం అన్నమాట. ఈ లెక్కన చూస్తే కపాలము ప్రేత శరీరము చేతపట్టుకొని ఆదిపరాశక్తి రూపం లో బ్రహ్మరంధ్ర దేవత అయితే దీని లోపల ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు అధిదేవతగా జోగులాంబ దేవి మాతగా ఉంటుంది. నిజానికి ఈమె జోగులాంబ కాదు. యోగులాంబ. కాలక్రమేణా యోగులాంబ కాస్త జోగులాంబ అయినదని గ్రహించండి. విచిత్రమేమిటంటే కంచి క్షేత్రములో రెండు బల్లులు ఉంటే ఈమె జుట్టులో ఒక బల్లి ఉంటుంది. నిజానికి ఈ అమ్మవారిని గృహ చండీమాతగా పిలవడం జరుగుతుంది. పైగా ఈవిడ ఆగ్నేయ దిశలో ఉండి ఎల్లప్పుడు వేడి ఆవిర్లుతో తన శక్తితో చాలా ఉగ్రస్వరూపంగా కోర పళ్ళతో ఉంటుంది. ఆదిలో అమ్మవారి పన్ను పడిన చోట ఈమె ఉన్నదని గ్రహించండి. ఇక ఈమె రూపం విషయానికి వస్తే ఈ విశ్వ సృష్టి అంతరించే సమయములో బల్లులు యొక్క సంయోగము వలన ఏర్పడిన బల్లి గ్రుడ్డు వలన ఈ విశ్వ సృష్టి జరుగుతుంది అని మనము తెలుసుకున్నాము కదా. కంచి లో ఈ రెండు బల్లులు బతికే ఉండటానికి ఆధారమైన శక్తి మన జోగులాంబ ఇస్తోంది అన్నమాట. ఎందుకంటే ఈమెకున్న దహనశక్తి వలన అత్యంతిక ప్రళయంలో నీరు ఆవిరిగా మారి పోవడం వలన బల్లి, తేలు, గబ్బిలం అనే మూడు జీవులు బ్రతికి పోతున్నాయి. బ్రహ్మకపాలం కూడా ప్రాణశక్తితో మిగిలిపోతోంది. బల్లి కాస్త విష్ణు రూపం అన్నమాట. ఎందుకంటే బల్లి తాకటం అనేది మనం విష్ణుకంచిలోనే చూస్తాము. అలాగే తేలు అనేది శివ రూపము అన్నమాట. ఎందుకంటే ఈయన కంఠమునందు విషమును ఉంచుకున్నాడు కదా. తేలులో విషం ఉంటుందని లోకవిదితమే కదా.గబ్బిలం అనేది రక్తం త్రాగే క్షీరదమని లోకవిదితమే కదా. మరి అమ్మ వారు కూడా రక్త బీజధారియే కదా. గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట. ఇక కపాలం అనేది బ్రహ్మదేవుడికి సంకేతము కదా. వీరభద్రుడు యొక్క కోపాగ్ని వలన తన పంచ ముఖాలలో ఒక ముఖము ఖండించడము అది కాస్తా బ్రహ్మకపాలంగా మారి ఆయన చేతికి అంటుకోవడం లోకవిదితమే కదా. అంటే బల్లి, తేలు, గబ్బిలం, కపాలం అనేవి విష్ణువు శివశక్తి బ్రహ్మ స్వరూపం అని తెలుస్తోంది కదా. అంటే జోగులాంబ అమ్మవారి ఈ నాలుగు శక్తి స్వరూప దేవతలను తన జటాధారి యందు ఈ జీవ రూపాలలో ఉంచి పునఃసృష్టికి కారకము అవుతుందని తెలుస్తోంది కదా. ఈ జీవులు కాస్త అర్ధ భాగాలుగా విభజన చెంది పునఃసృష్టిస్తున్నాయి.ఈ విశ్వమునందు సృష్టి స్థితి లయము లాస్యము చేస్తున్నామని అన్నమాట. కారణం వీరికి ఉన్న బలహీనతలను దాటలేక పోవడమే అని గ్రహించండి. ఈ జీవులకు ఈ బలహీనత లేకపోతే జోగులాంబ చేతులలో వీటికి కపాలమోక్షం కలిగేది. కారణం ఈవిడ మాత్రమే శరీరములో జీవ కళను అనగా ప్రాణశక్తిని తగ్గించగలదు. తన దహన శక్తితో ప్రాణశక్తి కాస్త నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది అన్నమాట. కాకపోతే ఈ దహన శక్తికి ఈ జీవుల రూపంలో ఉన్న దైవ శక్తి స్వరూపాలు తట్టుకోలేక రక్షించమని అమ్మవారిని వేడుకొనేసరికి వీరికి ఉపశమనం కోసము విష్ణుమూర్తికి మేడి ఆకులు, శివుడికి బిల్వపత్రాలు, అమ్మవారికి సువాసన పువ్వులు, బ్రహ్మదేవుడికి నాదముతో ఉపశమనము ఇచ్చి వారిని తిరిగి పునర్జీవనం చేసి విశ్వ సృష్టిలో తిరిగి సృష్టి, స్థితి, లయ, లాస్యము ప్రక్రియలు చేసుకోమని అనుఙ్ఞ ఇవ్వడం జరుగుతోంది. మేము ఎలాగైతే కామ గుణానికి, భయపడడానికి బలహీనపడితే ఈ త్రిమూర్తులు కాస్త సృష్టి యొక్క త్రికార్యాల బలహీనతకి గురి అయ్యారు. దానితో వీరందరు కూడా మా కథ లాగానే కంచికి చేరుకుని దేవికంచి, శివకంచి, విష్ణు కంచి ఏర్పరుచుకున్నారు. బ్రహ్మయ్య కు పూజించే అధికారం ఉంటే ఈ పాటికి ఎప్పుడో బ్రహ్మకు కూడా కంచి ఏర్పడేది. ఆయనకు అవకాశం లేదు. దానితో అది కాస్త బ్రహ్మరంధ్రముగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడినది. 

ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. ఎక్కడో ఉండే కంచి మరెక్కడో ఆలంపురమునకు ఎలా సంబంధం కుదురుతుంది.ఆలంపురములోని బల్లి కాస్త ఎక్కడో ఉన్న కంచికి ఎలా చేరుతుంది అంటే మీరు యోగసాధనకి పనికి రానట్లే. ఎందుకంటే గయుడు కథ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈయన తీవ్ర తపస్సు చేసి నన్ను తాకిన వారికి అలాగే నన్ను చూసిన వారికి అలాగే నేను ఉన్న ప్రాంతాలు యందు పిండ ప్రధాన కార్యక్రమాలు చేసే వారికి మోక్షము కలగాలని వరము పొందడం జరిగినది. దీనికోసం ఆయన కాస్త తన తల విష్ణుగయ యందు పెట్టుకుని పడుకుంటే పాదాలు కాస్త పిఠాపురంలోని పాదగయ వరకు చేరాయి. అంటే ఈయన తల కాస్త ఉత్తరప్రదేశ్లో ఉంటే పాదాలు మాత్రం ఆంధ్ర రాష్ట్రమునకు విస్తరించినాయి అన్నమాట. అంటే ఈ లెక్కన చూస్తే దేహమే దేవాలయం అయినప్పుడు ఇందులో సర్వాంతర్యామి కాస్త అంతర్యామిగా ఉన్నప్పుడు ఈ విశ్వసృష్టి అంతము కూడా మనలోనే ఉంటుంది కదా. ఇది తెలియాలంటే మీరు యోగ సాధన చేయాలి. దాని కోసం యోగ నిద్ర పోవాలి. అప్పుడే మీకు మీ సాధన కల ప్రపంచము కనపడుతుంది. గత జన్మలో మీరు ఎక్కడ ఏ విధంగా ఏ రూపాలలో సాధన చేసిన విషయాలు మీ సూక్ష్మ శరీరం యానముతో తెలుసుకోవాల్సి ఉంటుంది. 

నాకు విచిత్ర కీ చైన్లు రావడం
 
నా యోగమిత్రులు ఈ క్షేత్రాలకి వెళ్ళినపుడు వాళ్ళకి నచ్చిన కొన్ని రకాల కీచైన్లు నాకోసం తీసుకొని రావడము జరిగినది. అవి ఏమిటంటే రబ్బర్ బల్లులు,ఒక లోహ నాగపాము,ఒక హంసలు,ఒక పగిలిన గ్రుడ్డు, లోహ అష్టాంగచక్రము  కీ చైన్లు తీసుకొని రావడము జరిగినది.వీటి సంకేతాలు ఏమిటో మీరు గ్రహించే ఉంటారు కదా. అదేనండి.బల్లి అనేది విష్ణుకంచి, నాగపాము అనేది శివకంచి అయితే హంస అనేది బ్రహ్మంశ అయితే గ్రుడ్డు అనేది ఆది బ్రహ్మబిందువు అయితే అష్టాంగ చక్రము అనేది అమ్మవారి అష్టాంగ ప్రకృతికి సంకేతమని తెలుస్తోంది గదా!అంటే ఈ అధ్యాయ జ్ఞానస్ఫురణ సత్యమేనని ఈ వస్తువులు ప్రకృతిమాత మాకు పంపించి నిరూపణ చేసినదని ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది కదా!ఇక ఆలస్యమెందుకు! గాకపోతే మాకు వచ్చిన ఊదే దక్షిణావృంత శంఖము అలాగే సుదర్శనచక్రము ఆరాధన కాస్త మా సాధన స్ధాయిని అనగా శూన్యబ్రహ్మ సాధన స్ధితి నుండి శూన్యబిందువు స్ధితికి అలాగే అక్కడ వచ్చే బ్రహ్మముడిని ఎలా వీడతీసినాయో లేదో మీకు తెలియాలంటే దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా.

శుభం భూయాత్

పరమహంస పవనానంద
****************************************

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి