కామాక్షి మూర్తి రావడం(102)

 కామాక్షి మూర్తి రావడం


నాకు వచ్చిన కంచి కామాక్షిమూర్తి


నా దగ్గరికి కంచి కామాక్షి మూర్తి వచ్చినట్లుగా మీరు ఎక్కడా చెప్పలేదు కదా!  అని మీరంతా అనవచ్చును.  నిజమే….. చెప్పలేదు!  ఎందుకంటే నా సాధన పరిసమాప్తిలో “నేను చచ్చాను” అని తెలుసుకున్న తర్వాత,  చావని ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు.  అయినా పట్టించుకోలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉన్నట్టుండి నాకు ధ్యానంలో ఒక స్త్రీ మూర్తి సన్యాసిని దీక్ష తీసుకొని సాధన చేస్తున్న ధ్యాన దృశ్యాలు పదేపదే కనిపించాయి.  ఈవిడ ఎవరో నాకు తెలియదు. ఎక్కడా కూడా చూసినట్లుగా గుర్తులేదు. అందునా కాశీ క్షేత్రంలో ధ్యాన తపస్సు చేస్తున్నట్లుగా… ఆ పరిసరాలను బట్టి నాకు అర్థం అయింది. కాకపోతే నేను ఎలా అయితే… పురుష ప్రకృతి మోక్షం పొందిన విషయం ఎలా అయితే అనుభవం అనుభూతి ద్వారా తెలుసుకున్నానో….అలా ఈమె కూడా తన సాధన ద్వారా స్త్రీ ప్రకృతి మోక్షం పొందిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని గ్రహించాను.  ఈ విషయం తెలిసి వదిలేశాను.  ఇలా ఎంతో మంది యోగులు, యోగినీలు, సన్యాసులు, సన్యాసినిలు దీక్షలు తీసుకొని సాధన చేస్తూ… ఎక్కడో ఒకచోట, ఏదో ఒక మాయలో కావాలని లేదా తెలిసిపడి కావాలని తమ సాధనలో పరిసమాప్తి చేసుకోకుండా లోక కళ్యాణార్థం కోసం ఆగిపోయారని ఎంతోమంది చెప్పడం….. నా స్వానుభవంలో ఎందరినో ప్రత్యక్షంగా, పరోక్షంగా ధ్యానంలో అలాగే స్వప్నంలో చూడడం జరిగింది…అందుకే ఈ యోగినీ సాధనను అంతగా నేను పట్టించుకోలేదు.  నేను పట్టించుకోవడం లేదని  అర్థమై…. నా సాధనా శక్తిని నా మీద ప్రయోగం చేసి బోల్తా పడింది .హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా?  అనుకొని ఈమెను .,పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని వదిలేశాను . నేను వదిలేసినా ఈమె నన్ను ధ్యానంలో పదేపదే దర్శనాలు ఇచ్చి ఇబ్బంది పెట్టేది . కారణం లేనిదే కార్యం ఉండదు కదా!  అనుకుని ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలని నా దగ్గరికి వచ్చిన కామాక్షి మాతను అడగటం ఆరంభించాను . అమ్మా! తల్లి… నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ? ఎవరి కొంపని నీ మోహ మాయలో ముంచాలనుకుంటున్నావో చెప్పు…. అని పదేపదే ఇలా ఈవిడని వేధించేవాడిని.  ఒకరోజు ఆవిడ నాకు ధ్యానంలో రాజరాజేశ్వరిగాను ….మరొక రోజు లలితా దేవి గాను ….మరొక రోజు మధుర మీనాక్షి గాను …..మరొకరోజు కాశీ విశాలాక్షిగా కనబడి ….ఉన్నట్టుండి ఈ ఒక్కొక్క రూపం చివరికి కామాక్షిమాతగా కనపడేది.  మరొక రోజు లలితాదేవి మరియు రాజరాజేశ్వరి ఇలా వీరిద్దరూ ఒకేసారి కనిపించి మిళితమై కామాక్షి దేవిగా కనిపించేది. మరి కొన్ని రోజులకి మధురై మీనాక్షి దేవి మరియు కాశీ విశాలాక్షి ఒకేసారి వీరు ఇద్దరు కనిపించిన కొన్ని క్షణాలకి వీళ్ళు మిళితమై కామాక్షి దేవిగా కనిపించేది. నాకు అర్థం కాకపోతే ధ్యాన భంగం అయ్యేది.  అప్పుడు శబ్ద పాండిత్య గ్రంధాలు తిరగవేస్తే ….కామాక్షి , లలితా మరియు రాజేశ్వరి శక్తులు కలయిక ఉంటుందని….. అలాగే కాశీ విశాలాక్షి ,కంచి కామాక్షి ,మదురై మీనాక్షి ఒకే శక్తి స్వరూపాలని….. ఈ ముగ్గురిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ….ఇవి చెప్పడం నాకు కొంతవరకు కథ అర్థం అయింది . అంటే కామాక్షిమాతలో ఏ శక్తులు ఉంటాయో అర్థమైంది.  ఎవరు ఉంటారో  గ్రహించాను.  ఇదంతా బాగానే ఉంది. 


కానీ అరుణాచల క్షేత్రంలో మనం చూస్తే రాజరాజేశ్వరి గుడి ఉంటుంది . అలాగే పెద్ద గుడిలో రెండవ ప్రాంగణంలో సుందరేశ్వరుడు మరియు మీనాక్షి ఉండటం గమనించాను.  ఇది ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు . ఎందుకంటే లలితాదేవి మరియు రాజేశ్వరి ఉండాలి లేదా విశాలాక్షి మరియు మీనాక్షి ఉండాలి. కానీ రాజేశ్వరి,  మీనాక్షి ఉండటం ఏమీ అర్థం ఉందో నాకైతే అర్థం కాలేదు.  అసలు ఏదో తెలియని మర్మం ఉన్నదని నాకు అర్థమైంది.  అదేమిటో చేధించాలని ప్రయత్నం ఆరంభించాను. అప్పుడు పచ్చయ్యమ్మన్ గుడికి వెళ్తే …ఆమె కాస్త కామాక్షి దేవి కూర్చునే భంగిమలో ఉంది.  పైగా ఈవిడే కామాక్షి అని తెలిసింది . కంచి కామాక్షి అరుణాచలంలో పచ్చయాన్ అమ్మగా కొలవబడుతున్నారని ….“అరుణాచలం మహత్యం”  గ్రంథంలో ఉంది.  కాకపోతే దక్షిణామూర్తి మరియు రాజేశ్వరి కలిస్తే పచ్చయమ్మ అయిందని స్థల పురాణం చెప్పడం జరిగింది. ఇందులోనే ఏదో ఉంది .అదేమిటో నాకైతే అర్థం కావడం లేదని నాకు అర్థమైంది . ఎందుకంటే ఈ అమ్మవార్ల భంగిమలు తేడాలు ఉన్నాయని…. అంతగా ఎవరికి తెలియదు.  ఎందుకంటే రాజేశ్వరి అలాగే లలితాదేవి ఒకే రూపంతో ఉంటారు.  లలితా కాస్త పరివారంతో ఉంటే…. రాజేశ్వరి కాస్త ఒంటరిగా ఉంటుందని…. ఇదే తేడా అని చెబుతారు.  




లలితా కాస్త కూర్చునే భంగిమ


రాజేశ్వరి కాస్త కూర్చునే భంగిమ



కామాక్షి దేవి కూర్చునే భంగిమ


కానీ నిజానికి లలితా కాస్త కూర్చునే భంగిమ అనేది ఎడమ కాలు కింద పెట్టి , కుడికాలు మడత పెడితే….. అదే రాజేశ్వరి కాస్త కుడికాలు కింద పెట్టి ఎడమ కాలు మడత పెడుతుంది.  అనగా దక్షిణామూర్తి కూర్చునే భంగిమ కూడా ఇదే అన్నమాట!  ఇకపోతే మీనాక్షి దేవి కాస్త నిలుచుకొని ఉంటే….. కాశీ విశాలాక్షి దేవి కూడా రాజేశ్వరి భంగిమలో ఉంటుంది. అదే కామాక్షి దేవి అయితే రెండు కాళ్లు మడత పెట్టి పద్మాసనంలో కూర్చుంటుంది.  ఈ తేడాలు ఎవరు అంతగా గమనించరు.  గమనిస్తే విషయం అర్థమై ఉండేది.


ఇక్కడ ప్రకృతిలో మనకి పురుష ప్రకృతి ….అలాగే స్త్రీ ప్రకృతిగా రెండు రకాలుగా ఉన్నదని తెలుసు కదా! ఇందులో పురుష ప్రకృతి అనేది కదలని ప్రకృతి అయితే…. స్త్రీ ప్రకృతి అనేది కదిలే ప్రకృతి అవుతుంది. అలాగే పురుష ప్రకృతిలో పురుషుడు కదలని స్థితి అయితే స్త్రీ మూర్తి అనేది కదిలే స్థితి అవుతుంది . అలాగే స్త్రీ ప్రకృతిలో పురుషుడు కదిలే స్థితి అయితే …..స్త్రీ మూర్తి అనేది కదలని స్థితి అవుతుంది. ఇది ఎలా అంటారా!  ఆది రుద్రుడు కాస్త కూర్చొని ఉంటే…. కదలని అరుణాచల దక్షిణామూర్తి అయితే…. అదే ఈయన నిలుచుని ఉంటే కదిలే చిదంబర నటరాజ దక్షిణామూర్తి అవుతాడు. అదే ఆదిపరాశక్తి కాస్త కూర్చుని ఉంటే కదలని రాజేశ్వరి అయితే , అదే నిలుచుని ఉంటే కదిలే మీనాక్షి అవుతుంది అన్నమాట!  మరోరకంగా చూస్తే రాజేశ్వరి కదలని స్థితి అయితే ….లలితాదేవి కదిలే స్థితి అవుతుంది. అలాగే కాశీ విశాలాక్షి కదలని స్థితి అయితే ….మీనాక్షి దేవి కాస్త కదిలేస్థితి అవుతుంది.  పురుష ప్రకృతిలో పురుషుడిగా కదలని దక్షిణామూర్తి ఉంటే …. కదలని రాజేశ్వరి ఉండటంతో….. ఒకరు మాత్రమే వారు కూడా పురుషుడు మాత్రమే మోక్షం పొందుతున్నాడు.  ఎందుకంటే ఒకే విధమైన కూర్చునే భంగిమలు కావడంతో దక్షిణామూర్తిలో రాజేశ్వరి కాస్త శివైక్యం చెందిందన్నమాట!  కానీ అమ్మవారు కాస్త మోక్షం పొందకుండా కైవల్య ముక్తిని పొంది శివుడిలో ఐక్యమైంది. మోక్షం అంటే శూన్యంలో ఐక్యం అవడం అని.. అదే ముక్తి అంటే శివుడిలో శివైక్యం చెందడం అని మీ అందరికీ ఈపాటికే తెలుసు కదా! అంటే పురుష ప్రకృతిలో ఈ తప్పు జరగటం వలన అయ్యవారు కాస్త మోక్షం పొందితే అమ్మవారు కాస్త ముక్తి పొందింది అన్నమాట! మోక్షం పొందని అమ్మవారు కాస్త కారణ లేదా అకారణజన్మలు ఎత్తుతూ…. పునః సృష్టి చేస్తోందని.. నా సాధన అనుభవాల ద్వారా నాకు అర్థమైంది. అదే స్త్రీ ప్రకృతిలో చూస్తే స్త్రీ మూర్తి అలాగే పురుష మూర్తి కాస్త ఒకే విధమైన భంగిమలో ఉంటే అనగా నిల్చుని నటరాజ్ దక్షిణామూర్తికి నిల్చుని ఉన్న మీనాక్షి దేవి అనుసంధానం అవ్వడంతో…. మీనాక్షి దేవితో నటరాజు లయం చెందితే అమ్మవారు కాస్త మోక్షం పొందుతూ…. అయ్యవారు కాస్త ముక్తి పొందడం జరుగుతోందని నేను గ్రహించాను.  అంటే పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందితే, అదే స్త్రీ ప్రకృతిలో స్త్రీ మూర్తి మోక్షం పొందితే, అదే పురుష ప్రకృతిలో స్త్రీ మూర్తి…. అలాగే స్త్రీ ప్రకృతిలో పురుష మూర్తి కాస్త ముక్తిని పొంది… అమోక్షం పొందుతున్నారని…. ఎందుకంటే వీళ్లు కూర్చున్న భంగిమ అలాగే నిలుచుని ఉన్న భంగిమ కాస్త పురుష , స్త్రీలకు ఒకే విధంగా ఉండటంతో…. బలమైన శక్తితో బలహీన శక్తి కాస్త విలీనమవుతుందని అర్థం అవుతోంది అన్నమాట! అంటే ఒకే విధమైన భంగిమ ఉండటం వలన ఒకరు మోక్షం పొందితే… మరొకరు ముక్తిని పొందుతున్నారని నాకు బలంగా అనిపించింది. ఒకవేళ వీళ్ళు వ్యతిరేక భంగిమలో ఉంటే ఖచ్చితంగా వీరిద్దరూ కూడా మోక్షం పొందే అవకాశం ఉన్నదని అనిపిస్తుంది! ఎందుకంటే సోమ స్కంధ మూర్తి విగ్రహాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే,  అయ్యవారు కాస్త దక్షిణామూర్తి భంగిమలో కూర్చుని ఉంటే… దీనికి వ్యతిరేక భంగిమలో లలితాదేవి భంగిమలో అమ్మవారు ఉంటుందని…. మధ్యలో బాలుడి రూపంలో బాల కుమారస్వామి ఉంటాడు!  ఇలా ఈ వ్యతిరేక భంగిమలో కూర్చోవాలని ….కూర్చో పెట్టాలని ఈ స్కంద మూర్తి చెప్పకనే చెప్తుంది కదా!  అలాగే లెక్కల్లో కూడా ఒక సూత్రం ఉన్నది అదేమిటంటే…



+   ×   +   =   +

    +     ×   -   =   -

    -   ×  +   =   -

     -   ×   -   =  +



“+”అనేది కదలనిది అంటే – (మైనస్) అనేది కదిలేది అనుకుంటే..


కదలనిది మరియు  కదలనిది కలిస్తే కదలదు.


కదలనిది మరియు కదిలేది కలిస్తే కదిలేది. 


కదిలేది మరియు కదలనిది కలిస్తే కదిలేది. 


కదిలేది మరియు కదిలేది కలిస్తే కదలనిది. 



ఇందులో కదలనిది మోక్షం పొందితే… కదిలేది అమోక్షం అనగా ముక్తి పొందుతుంది అన్నమాట! ఈ లెక్కల సూత్రం ప్రకారం చూస్తే మొదటి వరుసలో ఎటు చూసినా కదలదు. అంటే పూర్ణ మోక్షం అవుతుంది. అదే రెండవ వరుస ప్రకారం చూస్తే కదిలేది అమోక్షం పొందితే…. మూడవ వరస ప్రకారం చూస్తే కదిలేది అమోక్షం పొందితే…. నాలుగవ వరస ప్రకారం చూస్తే రెండు కదిలేవి అనగా అమోక్షం పొందేది కలిస్తే మోక్షం అవుతుందన్నమాట! ఈ సూత్రము మీకు బాగా అర్థం అవ్వాలి అంటే…. కదలని దానికి దక్షిణామూర్తి రాజేశ్వరి అనుకుంటే…దానికి నటరాజు లలిత అనుకుంటే, రెండో ప్రకారం చూస్తే దక్షిణామూర్తితో లలితా కలిస్తే…లలితా మిగిలిపోయి దక్షిణామూర్తి మోక్షం పొందుతాడు! మూడో వరుస ప్రకారం చూస్తే…. కదిలే నటరాజ్ కదలని రాజేశ్వరి కలిస్తే కదిలే నటరాజు మిగిలిపోతాడు! ఆఖరికి నాలుగవ వరుస ప్రకారం కదిలే నటరాజ్ మరియు కదిలే లలితాదేవి కలిస్తే కదలని మోక్షం పొందడం జరుగుతుందన్న మాట! అంటే ఒకటవ వరుస ప్రకారం కదలనిది మరియు కదలనిది కలిసిన లేదా నాలుగవ వరస ప్రకారం కదిలేది మరియు కదిలేది కలిసినా మోక్షం వస్తుందన్నమాట! పురుష ప్రకృతిలో అయ్యవారు కదలక పోతే.. అమ్మవారు కదులుతుంది. అదే స్త్రీ ప్రకృతిలో అమ్మవారు కదలక పోతే అయ్యవారు కదులుతున్నారు. ఇలా కదిలే వాళ్లు అమోక్షం పొంది కదలని వాళ్ళు మోక్షం పొందుతున్నారు అన్నమాట! దీనికి నిదర్శనమే…శ్రీ శంకరాచార్యుడు చెప్పిన భజగోవిందం లోని తొమ్మిదవ శ్లోకాన్ని ఒకసారి చూస్తూ…..


సత్సంగత్వే నిస్సంగత్వం 

 నిస్సంగత్వే నిర్మోహత్వం 

నిర్మోహత్వే నిశ్చలతత్వం

 నిశ్చలతత్వే జీవన్ముక్తి:

భజగోవిందం భజగోవిందం…..



ఈ శ్లోకంలో నిశ్చల స్థితియే మోక్షమని చెప్పడం జరిగింది కదా! దీని ప్రకారం ఎవరైతే నిశ్చల స్థితి పొందుతారో….. వారే మోక్షం పొందుతారని చెప్పకనే చెప్పారు కదా! ఇందులో పురుష ప్రకృతిలో నిశ్చల స్థితి పురుషుడు అలాగే స్త్రీ ప్రకృతిలో స్త్రీ కాస్త నిశ్చల స్థితి పొంది….. మోక్షం పొందడం జరుగుతుందని…. అలాగే కదిలే వాళ్ళు మరియు కదిలే వాళ్ళు కలిస్తే కూడా నిశ్చలమై మోక్షం పొందవచ్చునని…ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని నాకు అర్థం అయింది. దీన్ని బట్టి నా సాధన కాస్త పురుష ప్రకృతి ప్రకారం జరగడంతో దక్షిణామూర్తి కాస్తా నిశ్చలమై మోక్షం పొందితే….కదిలే అమ్మవారు కాస్త అనిశ్చలమై అమోక్షం పొంది…. కామాక్షి దేవి విగ్రహ మూర్తిగా నా దగ్గరికి రావడం జరిగింది! ఈమె మోక్షం పొందాలంటే….. ఈమెని కదిలించేవాడు నిశ్చలమవ్వాలి. అది స్త్రీ ప్రకృతిలో కదిలించే పురుషుడు ఎవరో మనం తెలుసుకోవాలి! అందుకే నా ధ్యానంలో పదేపదే కనిపించే సన్యాసయోగిని ఎవరో కాదని…. నా ఆకాశ శరీర ధర్మపత్ని అయిన శివ నందిని అని గ్రహించాను. తెలుసుకున్నాను. ఈమె ఇప్పుడు తన సాధన ద్వారా…స్త్రీ ప్రకృతిలో మిగిలిపోయే.. పురుషుడు ఎవరో తెలుసుకొని ఆ పురుష విగ్రహ  మూర్తి తను పొందాల్సి ఉంటుంది! నాకు మిగిలిన ఆదిపరాశక్తి అంశ అయిన కామాక్షి దేవి వచ్చేనట్లుగానే… ఈమెకి కూడా మిగిలిపోయిన పురుష అంశ అయిన విగ్రహ మూర్తి రావాల్సి ఉంటుంది. కదిలే  స్త్రీ మూర్తి ….అలాగే కదిలే పురుష మూర్తి కాస్త ఏకమై ఏకరూపమై నామరూపాలు లేని నపుంసక స్థితిని పొంది లింగ దేహమై కారుంగలి శివలింగమై దహనమైతే…. అది ఏ విశ్వ మోక్షం అవుతుందన్నమాట! ఈ స్థితికి ఈమె సాధన స్థితి వస్తే కానీ స్త్రీ ప్రకృతికి మోక్షం రాదు! ఈ రెండు ప్రకృతులలో మిగిలిపోయిన స్త్రీ పురుష మూర్తులు కలిస్తే కానీ విశ్వ మోక్షం రాదని నాకు అర్థం అయింది అని మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి స్త్రీ ప్రకృతి మోక్షసాధనకి…… ఒక స్త్రీ మూర్తి చేసిన సాధన అనుభవాలు నేను ధ్యానంలో పొంది ఏ రోజుకి ఆరోజుగా ఈ అనుభవాలు…యధాతధంగా ఈ “విశ్వ మోక్ష గ్రంథం” లో రాయడం జరుగుతుంది…కాబట్టి ఈమె ఆధ్యాత్మిక యాత్రలో మనమంతా కూడా ప్రయాణం చేస్తూ…ఈమె ఎక్కడి దాకా తీసుకువెళ్తే…అక్కడిదాకా ప్రయాణించి ముందుకు సాగుదాం…



శుభం భూయాత్



 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి