అధ్యాయం 77


సమాధి గీత
(మా వివిధ రకాల సమాధి స్ధితుల అనుభవసారము)

 
1.          విభూతి యోగము: బ్రహ్మము లేదు....బ్రహ్మపదార్ధము లేదు!         

బ్రహ్మము లేదు బ్రహ్మపదార్థం లేదు ఇది ఎలాగో విచారణ చేసుకొని తెలుసుకుందాము. మొదట మనకి ఆది పరబ్రహ్మగా నామరూపధారిగా మహాగణపతి చెప్పడం జరుగుతుంది. ఈయనే మన మూలాధార చక్రానికి అధిపతి అని అందరికీ తెలుసు కదా. ఎక్కడ నుండి వచ్చినాడు అంటే త్రిమూర్తులలో ఒకరైన పార్వతి మహేశ్వర దంపతుల నుండి ఉద్భవించినాడు వీళ్ళేమో ఆది బ్రహ్మము నుండి ఆయనేమో ఆది విష్ణువు నుండి ఈయనేమో రుద్రుడు నుండి ఈయన ఏమో ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి నుండి వీళ్ళేమో త్రిముఖ ఈశ్వరుడు ఈశ్వరి నుండి పరమ ఇష్టలింగము నుండి ఇది కాస్త పరమ శూన్యము నుండి ఉద్భవించినది అని శాస్త్ర వచనము. అంటే మనము మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకున్నాము. నిజానికి వీరంతా పరమ శూన్యము నుండి ఉద్భవించిన స్వప్న శరీరధారులే.ఎందుకంటే రూపంలేని పరమ శూన్యము రూపముగా ఎలా మారగలదు? మారలేదు కదా. కేవలం తను రూపము మారితే ఏ రూపాలలో ఎలా ఉంటుందో కల కంటుంది.అనగా నిజంలాంటి కల.కలలాంటి నిజం అన్నమాట.విత్తనమును పగలగొడితే మనకి చివరికి కనపడేది శూన్యమే కదా. ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే అప్పటిదాకా ఆకారముగా సత్యముగా తను ఉన్నట్లుగా కనిపించిన ఉల్లిపాయ కనబడుతుందా? కనబడదు కదా. అలాగే వీరంతా కూడా సత్యముగా కనిపించే అసత్యమే కదా. అందుకే బ్రహ్మము లేదు. అలాగే దీని నుండి వచ్చిన లేదా ఏర్పడిన బ్రహ్మ పదార్థాలు లేవు. కేవలం ఇవి ఉన్నాయనే భ్రమ భ్రాంతి మనకి కలిగిస్తున్నాయి. కారణము పరమ శూన్యము తో బాటు మాయా స్వరూపము కూడా ఉన్నది. అసలు పరమ శూన్యము ఉన్నదో లేదో తెలియని స్థితి. ఎందుకంటే శూన్యము అంటే ఏమీ లేదని ఖాళీ అని అర్థాలు ఉన్నాయి కదా.
 
2.          సాంఖ్య యోగము: ఆత్మలేదు...పరమాత్మ లేదు...జీవాత్మ లేదు!  

 ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు దీనిని గూర్చి విచారణ చేస్తే మానవ శరీరంతో పాటుగా ఆత్మ ఉన్నదని శాస్త్ర వచనము. అనగా స్థూల శరీరమునకు జీవాత్మ సూక్ష్మ శరీరమునకు అంతరాత్మ కారణ శరీరమునకు పరమాత్మ సంకల్పం శరీరమునకు పూర్ణాత్మ ఆకాశ శరీరమునకు విశ్వాత్మ చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ అనేది ఉందో లేదో చూద్దాం. మనస్సుస్థిరమైతే దానిని ఆత్మగా పరిగణించవచ్చును. మరొక వాదన ప్రకారం చూస్తే బ్రహ్మమునకు మరొక పేరుయే ఆత్మ అని చెప్పటం జరుగుతుంది. బ్రహ్మము ప్రకారము చూస్తే బ్రహ్మము లేదని మనకు తెలుసు కదా. ఈ లెక్కన చూస్తే ఆత్మ లేదు అని తెలుస్తుంది కదా. ఒక కోడిగుడ్డును తీసుకోండి. అందులో పెంకు దీనికున్న పలుచని తెల్లని పొర అలాగే తెల్లని సొన పదార్థం పసుపు పదార్థం ఒక బీజ కణము కనబడతాయి. దీనిని కూడా విడదీస్తే కోడి కనిపించదు. కానీ ఒక కోడి దీనిని పొదిగితే దాని నుండి ఒక కోడిపిల్ల వస్తుంది. గుడ్డును పగుల గొడితే కనిపించని కోడిపిల్ల సత్యమా అసత్యమా మీరే ఆలోచించండి. అంటే సత్యముగా కనిపించే అసత్యము కదా. కోడిగుడ్డు లో కనిపించే పొరలు కూడా అసత్యమే గదా. ఈ లెక్కన చూస్తే ఆత్మ అనేది కోడిగుడ్డు అనుకుంటే గుడ్డు ఉంటే పొరలు ఎలాగో మీ ఆత్మకి పొరలుగా ఆత్మ జీవాత్మ అంతరాత్మ పరమాత్మ పూర్ణాత్మ  విశ్వాత్మ అనేవి ఉన్నాయని తెలుస్తోంది కదా. ఇవి సత్యాలుగా కనిపించే అసత్యాలని తెలుస్తోంది కదా. మరి అలాంటప్పుడు ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు. ఏమీ లేవు కదా.
 
3.          భక్తియోగము: దేవుడు లేడు.... జీవుడు లేడు!  

మనకి కనిపించే నామరూప దేవుళ్ళు సుమారుగా 36 కోట్ల మంది అని వీరంతా అండపిండ బ్రహ్మాండ లోకాల యందు ఆవాసము చేస్తుంటారని మనకి శాస్త్ర వచనము. దీనిని గూర్చి విచారణ చేస్తే బ్రహ్మమునకు పర్యాయపదము ఆత్మ ఎలాగో అలాగే దేవుడు దేవత దైవము భగవంతుడు అని మనము పేర్లు పెట్టుకోవడం జరిగినది. ఈ బ్రహ్మము మూడు రకాలుగా అనగా నిరాకార పరబ్రహ్మ (ఆకారము లేనిది) ఆకార పరబ్రహ్మము (ఆకారము ఉన్నది) సాకార పరబ్రహ్మము (తను ఉన్నానని చెప్పేది)గా విభజింపబడినాయి.నిరాకార పరబ్రహ్మ శూన్యము అనుకుంటే ఆకార పరబ్రహ్మమును దేవుడు అనుకుంటే సాకార పరబ్రహ్మముగా జీవుడు అవుతారు. మీకు అర్థం అవ్వాలి అంటే ఆకాశము నిరాకార పరబ్రహ్మ గాను అగ్ని ఆకార పరబ్రహ్మము సాకార పరబ్రహ్మము భూమి అన్నమాట.నిరాకార పరబ్రహ్మమైన ఆకాశమైన శూన్యమే ఉంటుందని మిగిలిన రెండు పరబ్రహ్మ లు కూడా సత్యాలుగా కనిపించే అసత్యాలుగా ఎలాగో ఇప్పుడు చూద్దాం. అనగా దేవుడు లేడు జీవుడు లేడు. ఎలాగో చూద్దామా! నిజానికి దేవుడు అలాగే దేవుడు ప్రతిమలు మనుషులు సృష్టించినవే. అనగా మనుషులు చేసిన దేవుళ్ళు అన్నమాట. తన మనిషి జాతిలో ఉత్తమమైన గుణాలు ఉన్న మహాత్ములను గుర్తించి వారికి పూజలు ఆరాధనలు ప్రార్థనలు సేవలు చేస్తూ వారిని దైవాలుగా మార్చడం జరిగినది. అనగా ఆదిలో లేని దేవుడిని మనుష్య స్వరూపంగా పూజించడం ఆరంభమైనది. ఎందుకంటే తనకి ఏదైనా అవసరం వచ్చిన ఆపద వచ్చిన కష్టము వచ్చిన సుఖం వచ్చిన బాధ వచ్చిన తను ఉన్నానని తనకి తోడుగా ఒక రూపము దైవముగా మార్చుకొని పూజించటం ఆరంభమైనది. అంటే వీళ్ళ దృష్టిలో దైవము అనేది ఒక నమ్మకము ఒక ఆశ ఒక భయము ఒక ధైర్యము ఒక ఆత్మబంధువు ఒక సన్నిహితుడు అన్నమాట. ఇది ఇలా ఉంటే అది మనల్ని సృష్టించినది ఆదిదేవుడు అంటే మనము దేవుడు చేసిన మనుషులు అన్న మాట. ఇదే మనుషులు తన భావాలకి తగ్గట్లుగా దేవుడు చేసిన మనుషులు అయినారు అన్నమాట. ఆపదలలో వచ్చి రక్షించిన మనుష్య రూపం అయిన శ్రీకృష్ణుడు కాస్త పరమాత్మ గా కొనియాడబడిన అలాగే దుష్టబుద్ధి ఉన్న రావణాసురుడి సంహారము వలన మనుష్య రూపుడైన శ్రీ రాముడు కాస్త దేవుడిగా కొనియాడబడుతున్న అనగా మనుషులలో ఉత్తమ గుణాలున్న మహాత్ములు కాస్త దైవా లుగా దేవుళ్ళు గా గుర్తించబడుతుంది కదా. నిజానికి మనుషులంతా ఒక్కటే. కానీ వారికున్న గుణాల తేడాల వలన ఉన్నతుడు మధ్యముడు అధముడు అని వేరు చేయబడినారు. ఉన్నతుడిని దేవుడిగాఅధముడిని  జీవుడుగా మనకి మనమే వేరు చేసుకోవటం జరుగుతుంది. అంటే మనుష్యజాతి నుండి దైవ జాతి అలాగే దైవ జాతి నుండి మనుష్యజాతి అనగా దేవుడు అలాగే జీవుడుగా వేరుచేయబడినారు. నిజానికి వీరంతా ఒక్కటే అయినప్పుడు దేవుడు వేరు జీవుడు వేరు అనుకోవటంలో అర్థం లేదు కదా. పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మనకున్న కాలధర్మం బట్టి గుణాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడిగా ఉన్నవాడు రేపు జీవుడుగా మారవచ్చును. రేపు జీవుడుగా ఉన్నవాడు మరుసటి రోజు దేవుడిగా గుర్తించబడవచ్చును కదా. మరి అలాంటప్పుడు మనలో మనకు ఈ తారతమ్యాలు ఎందుకు? మన దేహమే దేవాలయమని మనమే దేవుళ్ళని ఎందుకు గుర్తించరు. మనమే దేవుళ్ళు అనుకుంటే మనలో దైవిక లక్షణాలను అలవర్చుకుంటే మన మనుష్యులు కాస్త మహాత్ములు అవుతారు కదా.ఇలా మనలో దైవిక లక్షణాలు ఉన్న వారిని మహాత్ములుగా దైవాలుగా గుర్తిస్తాము.ఇలా కొందరే ఎందుకు ఉండాలి అందరికీ దైవ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని అమలు పరచకుండా వాటికి గుర్తింపు చేయకుండా గుర్తించకుండా మనమే దైవాలు అయినా కూడా జీవులుగా అదే స్థాయిలో ఎందుకు బ్రతుకుతున్నాము. మాధవుడు గా ఉండవలసిన మనము మానవుడిగా ఎందుకు జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. పని చేస్తే మానవుడు కాస్త మాధవుడు అవుతున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. మనమే దేవుళ్ళము కదా. ఇదియే అహంబ్రహ్మాస్మి.నేను బ్రహ్మమై ఉన్నాను. నేనే దేవుడిని అని మర్చిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మానవుడు కాస్త మాధవుడు అవుతాడు. జీవుడు కాస్త దేవుడు అవుతాడు. దేవుడు అనేవాడు లేడు అని ఎందుకంటే ఈయన పరమ శూన్యము యొక్క కల అని అలాగే ఇలా వచ్చిన దైవము యొక్క కల యొక్క స్వప్న శరీరధారులు జీవులని మనము అలాగే దైవాలు కూడా పరమ శూన్యము యొక్క కల స్వరూపాలే కావటంతో మనము నిజం కాదని మనము అంతా సత్యాలుగా కనిపించే అసత్యము అని కాబట్టి జీవుడు లేడు అలాగే దేవుడు లేడు అని తెలుస్తోంది కదా.
 
4.          క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము : నేను లేను...నువ్వు లేవు!

నిజానికి నువ్వు మరియు నేను అలాగే కనిపించే విశ్వము అంతా అందులో జీవరాసులు దైవ రాశులు అన్నీ కూడా శూన్యము నుండి అనగా ఏకత్వం నుండి వచ్చినవే కదా. అనగా ఏకత్వము నుండి భిన్నత్వం గా మారిన ఒక్కటే కాస్త కోటి గా రూపాంతరం చెందినది. అది దైవాలు లేదా జీవాలు కావచ్చును. కానీ వీటితో పాటుగా మాయ కూడా అంతర్లీనంగా ఉండటంతో ఎవరికి వారే వేరు అనే భావము కలిగించటం జరుగుతుంది. అంటే అద్దములో మన ప్రతిబింబము చూసుకుంటే మనకి అలాగే ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. కానీ తేడా ఉన్నట్లుగా ఈ మాయా గుణము చూపించడం చేస్తోంది. అంటే మనమంతా ఒకే తాను బట్ట లోని గుడ్డ పీలికలు అయినా కూడా ఈ మాయ గుణమువలన వేరు వేరు అని తేడా చూపిస్తోంది. అలాగే మనమంతా ఒక్కటే ఒక కేకు నుండి విడిపోయిన కేకు ముక్కలు అయినా కూడా అలాగే ఈ కేకు ముక్కలు ఆకారంలో తేడాలు ఉంటాయని వేరు చేసినట్లుగా బ్రహ్మము నుండి విడిపోయిన బ్రహ్మ పదార్థాలు అయినా మనమంతా కూడా వేర్వేరు ఆకారాలు పరిమాణాలు పరిణామ క్రమములో తేడాలు ఉన్నాయని ఈ మాయా గుణము వేరు చేయటం వలన లేదా కలిగించడం వలన నువ్వు వేరు నేను వేరు అనే విభిన్న భావాలు కలుగుతున్నాయి. నిజానికి మనమంతా ఒక్కటే కదా. వివిధ రంగులలో ఆవులు ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు ఎలా అయితే ఒకటే అవుతాయో మన రూపురేఖల లో తేడాలు ఉన్నప్పటికీ మనలో ఉండే ఆత్మ పదార్థం ఒకటే కదా. అందరిలోనూ ఒకటే రక్తం ఉంటుంది కదా. అందరూ కూడా పంచభూత నిర్మితం శరీరముతో ఉన్నవారే కదా. అలాంటప్పుడు నేను వేరు నువ్వు వేరు అనేది ఉండదు కదా. అంటే అందరూ ఒక్కటే అని ఈపాటికే గ్రహించే ఉంటారు. కానీ నిజానికి మనమంతా పరమ శూన్యము యొక్క స్వప్న శరీరధారులమే కదా శూన్యము అంటే ఏమీ లేదు అనే అర్థము ఉన్నది కదా.అనగా ఇటువంటి ఉన్నదో లేదో తెలియని అంశము నుండి మనము అలాగే మన దైవాలంతా వచ్చినప్పుడు అది నిజం కాదు కదా. ఎందుకంటే మనమంతా స్వప్న శరీరంలో శూన్యము యొక్క స్వప్నమైన జీవ నాటకము జీవిస్తున్నట్లు గా నిజముగా ఉన్నట్లుగా భ్రమింప బడుతున్న స్వప్నమాయా జీవులేనని గ్రహించండి. నిజానికి శూన్యము లేదు.
 
5.          జ్ఞానవిజ్ఞాన యోగము: కనిపించేది అసత్యము....కనిపించనిది సత్యము!

ఇప్పుడు ఈ అధ్యాయము అంశ అయినా కనిపించేది అసత్యము అలాగే కనిపించనిది సత్యము ఎలాగో విచారణ చేద్దాము. దీనికి మంచి ఉదాహరణగా ఒక ఉల్లిపాయ తీసుకోండి. దీనిని పొరలు పొరలుగా విడదీస్తే మనకి ఉల్లిపాయ ఆకారం కనబడుతుందా? కనపడదు కదా. అలాగే ఒక విత్తనము లేదా ఒక గుడ్డును తీసుకున్నా దాని పొరలు లోపలికి వెళితే మనకి ఆకారము లేని నిరాకార స్థితిని పొందడం జరుగుతుంది కదా. దీనినే శూన్య స్థితి లేదా పరమ శూన్య స్థితి అంటారు.దీని ప్రకారము చూస్తే కనిపించే ఆకారాలు సత్యము కాదని కనిపించని నిరాకారమే సత్యమని తెలుస్తోంది. నిజానికి ఇది కూడా ఉందో లేదో తెలియని స్థితి. ఆకాశము చూడటానికి బాగానే కనబడుతుంది కానీ మనము ఆకాశము లోనికి వెళితే అది కనబడుతుందా? కనబడదు కదా. అలాగే శూన్య స్థితి అన్నమాట. నిజానికి మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా కూడా ఆకాశలింగం లాంటి వారే. కానీ మనము అంతా కూడా జ్ఞానమాయలో ఉండటం వలన ఆకాశములో లింగమును చూడాలని తపన తాపత్రయం పడుతున్నాము. ఆకాశమే లింగం అని మనము తెలుసుకోలేకపోతున్నాము. అందువలన మనకి కనిపించే విశ్వమంతా సత్యము లాగా కనిపించనిది అంతా అసత్యము లాగా కనబడుతుంది. పదార్థ మాయ దాటితేగాని యదార్థ జ్ఞానము మనకి అందదు. అందువలన ఎవరైతే కనిపించేది అసత్యము అని కనిపించనిది సత్యమని స్వానుభవ అనుభూతి పొందుతారో వారే నిజ సత్య బ్రహ్మజ్ఞానులు అని గ్రహించండి.
 
6.          పురుషోత్తమప్రాప్తి యోగము: కనిపించేది అంతా పరమశూన్యము యొక్క కల లాంటి నిజము...నిజము లాంటి కల!

ఈ అధ్యాయము నందు కనిపించేది అంతా కూడా పరమ శూన్యము కల అని ఎలాగో విచారణ చేద్దాము. దీనికోసం ఒక విత్తనము తీసుకోండి. దానిని పగలగొడితే మనకి ఈ విత్తనములో చెట్టు ఇందులో కనబడుతుందా? కనపడదు కదా. మరి ఇందులో చెట్టు లేదా అంటే ఈ విత్తనము మట్టిలో పాతిపెడితే మొక్కగా ఎలా రూపాంతరం చెందుతుంది. అప్పటిదాకా ఈ విత్తనములో కనిపించని చెట్టు ఇప్పుడు ఇలా ఎలా కనబడుతోందో ఆలోచించండి. అంటే చెట్టు అనేది సత్యము కాదని తెలుస్తోంది కదా. చెట్టు సత్యమైతే విత్తనము పగలగొట్టగానే మనకి కనబడాలి.కనబడటం లేదు కదా. అంటే చెట్టు అనేది తన విత్తనము శూన్యము యొక్క కల అని తెలుస్తుంది.ఎందుకంటే విత్తనము పొరలు తీసుకుంటా పోతే శూన్యమే కదా మనకి కనపడుతుంది. అదే ఈ విత్తనము పాతిపెడితే ఈ విత్తనము శూన్యము యొక్క ప్రతిరూపముగా చెట్టు కనబడుతుంది.ఈ లెక్కన చూస్తే చెట్టు అలాగే విత్తనము కూడా సత్యము కాదు. ఎందుకంటే విత్తనము యొక్కకల కాస్త చెట్టు అయితే విత్తనము అనేది శూన్యము యొక్క కల అన్నమాట. ఈ లెక్కన చూస్తే కనిపించే విశ్వం అంతా కూడా పరమ లింగ బీజం యొక్క కల అయితే ఈ బీజము యొక్క కల అనేది పరమ శూన్యము యొక్క కల అన్నమాట. అనగా పరమ శూన్యము నుండి పరమ లింగము ఒక కలలాగా ఏర్పడితే ఈ లింగము యొక్క కల ఈ కనిపించే విశ్వాండము అన్నమాట.ఈ లెక్కన చూస్తే మనకి కనిపించేదంతా కూడా మూలములో పరమ శూన్యము యొక్క కల అని తెలుస్తోంది కదా.
 
7.         రాజవిద్యారాజగుహ్య యోగము: మనమంతా...మనదైవాలంతా… పరమాత్మ అంతా కూడా పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులం! 

ఈ అధ్యాయము అంశముగా మనము అలాగే మన దైవాలు అంతా మన పరమాత్మ అంతా కూడా స్వప్నశరీరధారులే అని ఎలాగో విచారణ చేద్దాము.  నిజానికి మనమంతా మన శరీరధారులు అంతా కూడా అశాశ్వతములే కదా. మనకి జన్మలు ఉన్నట్లుగా మరణాలు ఉన్నాయి కదా. మనము ఎక్కడ నుండి వచ్చినాము మన స్థూలశరీరాలు  ఎక్కడ నుండి వచ్చినాయి అంటే మనమంతా మన శరీరాలు అంతా కూడా మన దైవాల నుండి.. వాళ్ల సూక్ష్మ శరీరాలు నుండి వచ్చినాయి. వీళ్లు కూడా శాశ్వతము కాదని తెలుసుకోండి. అంటే వీళ్లు కూడా సూక్ష్మ లోకాలలో 1000 నుండి 10 వేల సంవత్సరముల ఆయుష్షు తో ఉండి ఆ తర్వాత మరణావస్థను పొంది మరో రూపంగా రూపాంతరము చెందుతారు. మరి వీళ్ళు ఎక్కడ నుండి వచ్చినారు అంటే పరమాత్మల నుండి వస్తారు. వీళ్ళ సూక్ష్మ శరీరాలు కాస్త ఈ పరమాత్మ కారణ శరీరాలు నుండి ఏర్పడతాయి. ఈ పరమాత్మలు అంతా కూడా కారణ లోకములో కారణ లోక వాసులుగా పది వేల నుండి పది లక్షల ఆయుస్సు తో జీవించి ఆపై మరణావస్థను పొంది రూపాంతరము చెందుతారు అన్నమాట. ఈ పరమాత్మలు కాస్త అష్ట ఇష్ట లోక వాసుల యొక్క సంకల్ప శరీరాల నుండి ఉద్భవిస్తారు అన్నమాట. మరి వీళ్ళు అంతా కూడా బ్రహ్మరంధ్రము వద్ద ఉంటే ఆదిపరాశక్తి యొక్క ఆకాశ శరీరము నుండి ఉద్భవిస్తారు  అన్నమాట.ఈవిడ కాస్త పరమ శూన్యము నుండి ఉద్భవించిన శూన్యబ్రహ్మ నుండి ఉద్భవిస్తుంది. ఈ శూన్యబ్రహ్మ కాస్త పరమ శూన్యం నుండి ఉద్భవిస్తాడు. మళ్లీ చివరికి పరమ శూన్యమునకు చేరినది. ఇది కలలు కనడమే చేస్తోంది. ఈ కలలో తనే స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలు వేస్తున్న జీవ నాటకము కలను కంటూ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే మనము అలాగే మన దైవాలు అంతా మన పరమాత్మలు అంతా కూడా పరమ శూన్యము యొక్క స్వప్న శరీరధారులే అని తెలుస్తోంది కదా.
 
8.          విశ్వరూప దర్శన యోగము: ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యము!

 ఈ అధ్యాయము అంశము గా మనకి కనిపించే విశ్వము సత్యమా లేదా అసత్యమా ఏది నిజమో విచారణ చేద్దాము. ఒక కోడిగుడ్డును తీసుకుందాము. చూడటానికి ఇది సత్యము గా కనబడుతుంది కానీ పెంకును పగలగొడితే తెల్లని సొన కనబడుతుంది. దీనిని తీసివేస్తేపచ్చ సొన  కనబడుతోంది. దీని లోపల చూస్తే ఒక చిన్న బీజ కణము కనబడుతుంది. దీని లోపల చూస్తే ఏమీ కనిపించదు.శూన్యమే కనబడుతుంది. కానీ నిజానికి గుడ్డును పొదిగిస్తే కోడిగా రూపాంతరం చెందుతుంది. గుడ్డును పగలగొడితే కోడి కనిపించదు కదా. అలాగే మనకి కనిపించే విశ్వము అంతా కూడా సత్యము లాగా కనబడుతుంది. ఈ పదార్థ మాయ దాటితేగాని పరమ లింగ బీజము మనకి కనిపించదు. దీని యదార్ధ జ్ఞానము చూస్తే మనకి కనిపించని పరమ శూన్యము యొక్క మూలం అని ఈ కనిపించే విశ్వం అని తెలుస్తోంది. అంటే పరమ శూన్యము యొక్క కలకి ప్రతిరూపమే ఇది అన్నమాట. ఈ లెక్కన చూస్తే కనిపించే విశ్వము సత్యము కాదని తెలుస్తోంది కదా. కల కాస్త ఎలా సత్యము అవుతుందో మీరే గ్రహించండి.
 
9.          విషాద యోగము: జననము లేదు...మరణము లేదు! 

ఇందులో ద్వైత భావాల అంశాలు అయిన ఆనంద విషాదాలు సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ప్రేమ విరహాలు ఇలా మనకు గల కారణాలు ఏమిటో విచారణ చేద్దాము. మనము పుడితే ఆనందము మనము చనిపోతే విషాదం. నిజానికి మనము పుట్టటం లేదు అలాగే చనిపోవటం లేదు. అది ఎలాగో అంటే మనమంతా కూడా మన దైవాలు యొక్క స్వప్నంలో ఉన్నాము. అలాగే మన దైవాలు అంతా కూడా పరమాత్మ స్వప్నములో ఉన్నారు. ఇలా వీరంతా కూడా అష్ట ఇష్ట లోక వాసుల స్వప్నములో ఉన్నారు.వీరందరూ కూడా శూన్య బ్రహ్మయొక్క స్వప్నములో ఉన్నారు. చివరికి ఈయన కూడా పరమ శూన్యము స్వప్నములో ఉన్నారు. అంటే మనమంతా స్వప్న శరీరాలతో ఉన్నట్లే కదా. మరి స్వప్నములో జరిగేవి ఎన్నటికీ సత్యాలు కావు కదా. స్వప్నాలు నిజమేనని స్వప్న పాత్రలు నిజము కాదు అని తెలుసుకో. అదే ఉదాహరణకు నీవు స్వప్నములో బిర్యాని తిన్నట్లుగా కల వస్తే అది నిజమే కావచ్చు. అదే ఆకలితో ఉన్నప్పుడు నీవు అన్నము తిన్నట్లుగా కల వస్తే అది నిజముగా నీ ఆకలిని తీరుస్తుందా? తీర్చదు కదా. అలాగే సినిమాలో హీరో చనిపోయిన నిజానికి ఆ హీరో పాత్ర వేసినప్పుడు చనిపోతున్నారు కానీ నిజముగా చనిపోడు కదా.అలాగే మన జననాలు మన మరణాలు అన్నమాట. నిజానికి ఇవి లేవు. ఎందుకంటే మనమంతా కూడా పరమ శూన్యము యొక్క కలలోని పాత్రలు వేసినాముమరి స్వప్న పాత్రలు నిజము కాదు కదా. నిజమే మరి మన జనన మరణాలు ఎలా నిజం అవుతాయో ఆలోచించు. ఇది తెలుసుకున్న వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. అంటే వీరికి ఆనంద విషాదాలు అనే రెండు భావాలు ఉండవు. ఆనందమైన విషాదమైన మీరు ఎప్పుడూ నిశ్చల స్థితిలో స్థిర మనస్సుతో దేనికి స్పందించకుండా దేనినీ పట్టించుకోకుండా ఏక భావ స్థితిని సచ్చిదానంద స్థితిని పరమశాంతిని పొందుతూ ఉంటారు.
 
10.     కర్మ యోగము: కర్మ లేదు... జన్మ లేదు! 

ఈ అధ్యాయము అంశంగా కర్మ అలాగే జన్మ గూర్చి విచారణ చేద్దాము. మనము పుడుతుందే కర్మ కోసమే కర్మ పరిసమాప్తి చేసుకోవటానికి లేదా కర్మ శేషము లేకుండా చేసుకోవడానికి జన్మలు అవసరం పడుతున్నాయి. నిజానికి మనము సత్యము కానప్పుడు మనమే లేనప్పుడు మనమే స్వప్నము అయినప్పుడు మనకి కర్మలు జన్మలు ప్రసక్తి ఎక్కడ నుండి వస్తుందో ఆలోచించండి. కర్మ అలాగే జన్మ అనేది మన స్వప్న పాత్రల యొక్క రూపాంతరమే అని గ్రహించండి. తెలుసుకోండి. అంటే ఒక స్వప్నం నుండి మరొక స్వప్నము లోనికి ప్రవేశించినప్పుడు మనము స్వప్న పాత్రలు వేసి కాస్త రూపాంతరం చెందినట్లుగా కనబడుతున్నాయి. దానికి కర్మ జన్మ అని నామాలు పెట్టుకున్నాము. మన స్వప్న పాత్ర ఎలా ఉండాలో మనకి మనమే నిర్ధారణ చేసుకొని ఆ పాత్ర తీరు తెన్నులు కోసం కర్మ జన్మ అనే విధానమును ఏర్పాటు చేసుకున్నాము. నేను లేను అన్నప్పుడు ఇంకా కర్మ జన్మలు ఎక్కడ నుండి వస్తాయి. అంటే అలాగే స్వప్న పాత్రలుఎలా వస్తాయి.ఎక్కడ నుండి వస్తాయో ఆలోచించండి. నేను సత్యము కాదు.నీవు సత్యము కాదు. అలాగే నువ్వు నేను కూడా స్వప్నమే అయినప్పుడు ఇంకా కర్మలు జన్మలు కూడా స్వప్నమే కదా. స్వప్నములో చదువుతున్నట్లుగా ఉద్యోగాలు చేస్తున్నట్లుగా వెళ్లి చేసుకున్నట్లుగా సంతానము ఉన్నట్లుగా ఆస్తులు సంపాదిస్తున్నట్లుగా మరణాలు పొందుతున్నట్లు జననాలు పొందుతున్నట్లుగా ఇలా పలు రకాల భావాలతో మన స్వప్న పాత్రలు ఉన్నాయి. ఒక సినిమాలోని పాత్రలు వాళ్ళు వేసే సన్నివేశాలు చూపించే హావభావాలు అన్ని ఆ సినిమాకే సత్యము అన్నట్లుగా ఉంటాయి కానీ నిజానికి ఆ పాత్రధారికి ఈ సినిమాకి ఏమి సంబంధము ఉండదు కదా. సినిమాలో హీరో మందు కొట్టే పాత్ర ఉండవచ్చును. బయటకు హీరో నిజానికి ముందే త్రాగక పోవచ్చు కదా. అలాగే ఈ స్వప్న జీవ నాటకములో మనము వేసే స్వప్న పాత్రలు సన్నివేశాలు హావభావాలు ఏది కూడా సత్యము కాదని తెలుసుకోండి.
 
11.     గుణత్రయవిభాగ యోగము: మాయ లేదు! మర్మము లేదు!

 ఈ అధ్యాయము అంశము మాయ లేదు మర్మము లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాము. త్రిగుణాలు మాయ వలన మనకి ఆలోచన సంకల్పము స్పందన అనేవి కలుగుతాయని తద్వారా మనము కాస్తా మహా మాయలో పడి ప్రేమ మోహము వ్యామోహములతో కూడిన భోగ జీవితములో మిగిలి పోతున్నామని శాస్త్ర వచనము. ఇది సత్యము లాగా కనిపించే అసత్యము అన్నమాట. ఎలా అంటే నిజానికి మనమంతా మనకి కనిపించే వారంతా మనము పూజించే వారంతా మనకి కనిపించేది అంతా కూడా పరమ శూన్యము యొక్క స్వప్నము అయినప్పుడు ఇక మాయ మర్మమునకు స్థానము ఎక్కడ ఉంటుంది.అంటే మనము వేసే స్వప్న పాత్రలే మాయ అన్నపుడు మనమే లేనప్పుడు మనము సత్యము కానప్పుడు మాయ మర్మమునకు స్థానము ఏది ఆలోచించండి. మనకి మనమే మాయ మర్మము అయినప్పుడు వేరేగా మాయ ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? మాయ అనేది సూర్యుడికి సూర్యకాంతిలాగా పువ్వుల కి సువాసనలాగా మనలో మాయ ఉంటుంది. వేటి యందు మనకి ఆలోచన సంకల్పము స్పందన ఆశ భయము ప్రేమ మోహము వ్యామోహము కలుగుతుందో అదియే మాయ అవుతుంది. ఈ మాయ పాత్రలు వేయాలని మనకి మనమే కలలుకంటున్నామని ఎవరు కూడా ఊహించటం లేదు. ఒకరికి తీపి తింటే ఆనందము. మరొకరికి కారము తింటే ఆనందం. ఇది వేరే వారికి బాధగా ఉంటుంది. అంటే నువ్వు ఏ పాత్రలో వేయాలో కల కని ఉన్నప్పుడు అవే పాత్రలు వేస్తున్నప్పుడు ఇందులో మాయ కి ఏమి సంబంధం ఉంటుంది ఆలోచించండి. నువ్వు చూసే దృష్టిని బట్టి నువ్వు వేసే పాత్రను బట్టి అంతా కూడా మాయ సహితముగా లేదా మాయ రహితముగా కనబడుతుంది. యద్భావం తద్భవతి. చాలామందికి రావణాసురుడు కాస్త దుర్మార్గుడిగా కనపడితే మరికొంతమందికి అపార శాస్త్ర పండితుడు రావణబ్రహ్మగా కనబడుతున్నాడు. మరి ఇందులో ఏది సత్యమో ఆలోచించండి. మీరు చూసే కోణము ను బట్టి అది మీకు సత్యములాగాను అదే వేరే వారికి అసత్యము లాగా కావచ్చును. మాయ ఉంది అంటే ఉన్నట్లు లేదు అంటే లేనట్లే. నిజానికి మనమే లేనప్పుడు మనలో ఉండే మాయ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజము మీకే తెలుస్తుంది.
 
12.     జ్ఞాన విజ్ఞానయోగము: జ్ఞానము లేదు! అజ్ఞానము లేదు! 

ఈ అధ్యాయము అంశముగా అసలు జ్ఞానము ఉన్నదా లేదా అజ్ఞానము ఉన్నదా అన్నప్పుడు దీనిని గూర్చి విచారణ చేస్తే ఎవరైతే తను తెలుసుకున్న జ్ఞానమును మర్చిపోతాడో వాడు కాస్త అజ్ఞాన పాత్రలు వేస్తాడు. ఎవరు అయితే తన జ్ఞానమును మర్చిపోకుండా జ్ఞానస్పురణ కలిగి ఉంటాడో వాడు కాస్త జ్ఞాన పాత్రలు వేస్తూ ఉంటాడు. నిజానికి జ్ఞానము లేదు అలాగే అజ్ఞానము లేదు. ఎందుకంటే జ్ఞానము తెలిసినవాడు మాట్లాడలేడు తెలియనివాడు తెలుసుకునే దాకా ఎదురుచూడక తప్పదు. ఒకవేళ వీరు తెలుసుకుంటే మాట్లాడకుండా మౌనం వహిస్తారు. ఈ లెక్కన చూస్తే కాస్త జ్ఞానిగా మారి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటే ఇంకా తను తెలుసుకున్న జ్ఞానము తనకు తప్ప వేరే వారికి తెలియదు ఉపయోగపడదు కదా. అంటే ఒక రకంగా ఈయన కూడా అజ్ఞాన మాయలో ఉన్నట్లే. ఎందుకంటే తను తెలుసుకున్న జ్ఞానము ఇతరులకి చెబితే ఎక్కడ తనలో జ్ఞాన అహంకారము మొదలవుతుందో అనే జ్ఞాన భయంతో ఉంటాడు. తనే సత్యము కాదు అని తెలిసినప్పుడు అదే విషయము ఇతరులకు చెబితే తప్పు ఏమిటో ఆలోచించండి. మాయ కాస్త మాయం అవుతుంది కదా. తను కాక వేరే వాళ్ళు ఎవరో ఉన్నారో అనుకున్నప్పుడు అంటే బయటికి జ్ఞానిగా కనిపించే నిజ అజ్ఞాని ఇతనే అవుతాడు అన్నమాట. సన్యాసి కాస్త సన్నాసి అవుతాడు అన్నమాట. ఈ లెక్కన చూస్తే జ్ఞాని అనేవాడు కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు. అజ్ఞాని కాస్త కొత్తగా తెలుసుకోవలసినది ఏమీ లేనట్లే కదా. ఉన్నది ఎలాగో ఉంది అది ఏమిటో తెలుసుకున్న వాడు జ్ఞాని తెలుసుకోని వాడు అజ్ఞాని అన్నమాట. దాహానికి నీళ్లు అవసరమైతే దాహము తీర్చుకోవాలి కానీ ఈ నీళ్లు ఎక్కడి కి ఎందుకు ఎక్కడి నుండి ఎలా అని విచారణ చేస్తే ఏమి లాభము. ఇందులో విచారణ సిద్ధి పొందిన వాడు జ్ఞాని అయితే ఈ నీళ్లు గూర్చి ఎలాంటి ఆలోచన చేయని వాడు అజ్ఞాని అన్నమాట. చివరికి జ్ఞాని కూడా ఈ నీళ్ల మీద ప్రయోగ పరిశోధనలు చేసి చివరికి తన దాహం తీర్చుకోక తప్పదు కదా.తెలుసు కున్న వాడికి అలాగే తెలుసుకోని వాడికి ఈ నీళ్లు ఎలా అయితే దాహార్తిని తీర్చినాయో అలా జ్ఞానమునకు అజ్ఞానమునకు తేడా ఉండదు. ఎందుకంటే జ్ఞాని కాస్త అజ్ఞానిగా ఉండక తప్పదు కదా. అజ్ఞాని కాస్త జ్ఞానిగా మారక తప్పదు. కాబట్టి జ్ఞానము లేదు … అజ్ఞానము లేదు అని తెలుస్తోంది కదా.
 
13.     అక్షరపరబ్రహ్మ యోగము: సాధకుడు లేడు! సాధించటానికి ఏమిలేదు!

ఈ అధ్యాయము అంశంగా సాధకుడు లేడు అలాగే సాధించడానికి ఏమీ లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాము. నిజానికి నేను లేను అనే స్వానుభవ అనుభూతి పొందటానికి సాధన అలాగే సాధకుడు ఉంటాడు. తను చనిపోయాను అనుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అనుభూతి పొందినప్పుడు సాధకుడు సాధనతోను ఏమీ పని ఉండదు కదా. కానీ మనమంతా మన దైవాలు అంతా మన పరమాత్మలు అంతా మన విశ్వం అంతా ఎప్పుడో ఆదిలోనే శాశ్వత మరణావస్థ అయిన నిశ్చల స్థితిని అదే మోక్ష పధము పొందినప్పుడు కొత్తగా సాధకుడు తెలుసుకునేది ఏమిటి? వాడు సాధించేది ఏమిటి? వాడు పొందేది ఏమిటి ఆలోచించండి. అంటే ఇక్కడ సాధించటానికి సాధన అలాగే సాధకుడు అనేది ఏమీ లేదని తెలుస్తోంది కదా. ఆదిలోనే చనిపోయినవాడు తను చనిపోయాను తను లేను నేను లేను అని తెలుసుకోవటం ఏమైనా అర్థం ఉందా? ఆలోచించు. ఏమీ లేదు అన్నప్పుడు ఇక సాధనతో అలాగే సాధకుడు ఇక సాధించటానికి ఏమీ లేనట్లే కదా.
 
14.     ఆత్మసంయమ యోగము: సాధన లేదు...సాధించేది లేదు!

 ఈ అధ్యాయము అంశముగా సాధన లేదు సాధించటానికి ఏమీ లేదు అని అది ఎలాగో విచారణ చేద్దాము. నేను ఎవరిని నేను ఆత్మ నేనే దేముడిని అహంబ్రహ్మాస్మి. నేనే ఉన్నాను. నేను కానిది లేదు. నేను లేనిది లేదు. ఇలాంటి మహా వాక్యాలను సాధకుడు తన సాధన ద్వారా స్వానుభవ అనుభూతి పొందటానికి సాధన ఉన్నది. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడో ఆదిలోనే పుట్టి పెరిగి చచ్చిపోయిన వాడు తను ఉన్నానని తాను బతికే ఉన్నానని తనే విశ్వమని జ్ఞాన అనుభూతి పొందటానికి సాధన చేయటంలోనే ఏమైనా అర్థం ఉందా? చచ్చిపోయినవాడు తాను చచ్చిపోయిన విషయం ఎన్నటికీ తెలుసుకోలేడు. ఇది తెలుసుకోవడానికి చేయవలసిన సాధన విధి విధానాలు లేవు. అలాంటప్పుడు అసలు సిసలైన జ్ఞాన అనుభూతిని అనగా నేను లేను అనే జ్ఞానం ఇచ్చే సాధన లేనప్పుడు సాధన లేనట్లే కదా. సాధించటానికి ఏమీ లేనట్లే కదా. తను చనిపోయాను అని తెలుసుకోవటానికి సాధనతో ఏమీ పని ఉంటుంది. ఆలోచించండి.నేను అనేది సత్యము కాదు నేను అనేది నిత్యము కాదు నేను అనేది శాశ్వతం కాదు. నేను అనేది ఆత్మ కాదు. నేను అనేది ఆత్మ కాదని తెలుసుకోవటానికి అంటే నేను లేను అని సాధించటానికి సాధనతో ఏమి పని ఉంటుంది. నిజానికి చచ్చిపోయిన వాడు తాను చచ్చిపోయాను అని ఎలా తెలుసు కుంటాడు. తెలుసుకుంటే వాడు చచ్చినట్లు కాదు కదా. చచ్చినాను అని తెలుసుకోవడానికి తెలపడానికి సాధనలు లేనట్లే కదా. సాధన లేనప్పుడు సాధించటానికి ఏమీ లేనట్లే కదా. ఆలోచించు. మరణ రహస్యం నీకే తెలుస్తుంది.
 
15.     దైవాసురసంపద్విభాగ యోగము: అనుభవము లేదు...అనుభూతి లేదు!

ఈ అధ్యాయము అంశముగా అనుభవము లేదు అనుభూతి లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాము. చాలామంది నేనే దేవుడిని అనే అనుభవంగాను నేనే విశ్వరూపధారిగా ఉన్నాను అనే అనుభూతి కోసం సాధన చేస్తూ ఉంటారు. నిజానికి తనే లేనప్పుడు నేనే లేనప్పుడు నేనే సత్యము కానప్పుడు నేనే చనిపోయినప్పుడు వీడు తెలుసుకోవటానికి సాధించడానికి పొందటానికి ఏమీ లేనప్పుడు సాధన లేనప్పుడు ఇంకా అనుభవాల అనుభూతులు ఎక్కడ ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. లడ్డు తినాలి అనేది కోరిక. అది తింటున్నప్పుడు కలిగే ప్రత్యక్ష అనుభవం దాని రుచిని ఆస్వాదించినప్పుడు కలిగే అనుభూతి ఇంతవరకు బాగానే ఉంది. అసలు తినేవాడు అలాగే తినేది అనగా లడ్డు తినేవాడు అలాగే లడ్డు అనేది సత్యము కానప్పుడు అది అసత్యము అయినప్పుడు దాని రుచి తను దానిని తింటున్నాను అనే అనుభవం సత్యము కానట్లే కదా. అంటే ఇవి ఏమీ లేనట్లే కదా. ఆలోచించు. ఒక బ్రహ్మ పదార్ధము మరొక బ్రహ్మ పదార్థమును తింటోంది. అసలు ఇక్కడ బ్రహ్మ పదార్థమే సత్యము కానప్పుడు అది తింటుంది అనుకోవటంలో సత్యము కానట్లే కదా.
 
16.     శ్రద్దాత్రయవిభాగ యోగము: సమాధి స్ధితి లేదు....ఆనందస్ధితి లేదు!

ఈ అధ్యాయము అంశముగా సమాధి స్థితి లేదు ఆనంద స్థితి లేదు అనే దానిని విచారణ చేద్దాము. మన అస్థిర మనస్సు కాస్తా స్థిరమై ఏకాగ్రత పొంది నిశ్చల స్థితిని అది కూడా శాశ్వత ఆనంద స్థితిని పొందినప్పుడు మనకు కలిగే స్థితిని సమాధి స్థితి అంటారు. మనము పుట్టుకతోనే సచ్చిదానంద స్థితిలో పుట్టినప్పుడు సూర్యుడికి సూర్యకాంతి లాగా మనకి కూడా సచ్చిదానంద స్థితి మనతోనే ఉన్నప్పుడు అది వేరేగా ఉన్నదని సాధించటానికి సాధన చేయటం లో ఏమైనా అర్థం ఉందా?మనస్సు ఎల్లప్పుడు నిశ్చలస్థితిలోనే ఉన్నది. ఇది దాని సహజ స్థితి. ఆ విషయము మరిచిపోయి అది కాస్త అనిశ్చిత స్థితిలో లేదా అస్థిరముగా ఉన్నదని మనకి మనమే భావించుకొని నిశ్చలస్థితిలోకి దీనిని తీసుకొని రావాలని సాధన పేరుతో సమాధిస్థితి పొందాలని అందులో శాశ్వత ఆనంద స్థితి పొందాలని అనుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా అన్నీ కూడా నీ లోనే ఉంచుకొని అది లేదని అది కొత్తగా రావాలని దానికోసం సాధన చేయాలని అనుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? ఆలోచించు. అంటే ఈ లెక్కన చూస్తే సాధనతో అవసరమే లేనప్పుడు దానికోసం సమాధిస్థితి అలాగే ఆనంద స్థితి లేనట్లే కదా. అసలు నేనే లేనప్పుడు ఆనందముతో పని ఏమిటి? విషాదము వుంటే ఏమిటి? సచ్చిదానందము అది కూడా ఉంది అనుకోవటమే విచిత్రమే కదా. నువ్వే లేనప్పుడు ఏమీ లేనట్లే కదా. ఇంకా సమాధిస్థితి అలాగే అది ఇచ్చే ఆనంద స్థితి ఏమి ఉంటుంది. నువ్వు ఎలాగైతే ఈ విశ్వ జీవ నాటకములో సన్నాసిగా భోగ పాత్ర వేస్తున్నావు అలా నేను కూడా ఈ నాటకము యందు సన్యాసిగా యోగ పాత్ర వేస్తున్నాను. నేను ఏదో సాధించాలి అని అనుకుంటే నువ్వు ఏదో పొందాలని అనుకుంటున్నావు. చివరికి ఈ రెండు పొందిన మనము ఆనందములో ఉంటున్నాము. ఈ స్థితి కొనసాగించటానికి సమాధి స్థితి అని పేరు పెట్టుకున్నావు. ఇందులో ఏదో అనుభవ అనుభూతిని పొందుతుంది అని తృప్తి పడుతున్నారు. అసలు పాత్రే లేనప్పుడు ఈ స్థితులు ఉంటాయా అని ఆలోచించు. ఉండవు గదా.
 
17.     మోక్షసన్యాస యోగము: మోక్షము లేదు...ముక్తి లేదు!

ఈ అధ్యాయము అంశముగా మోక్షమూ లేదు ముక్తి లేదు అనే దానిని ఎలాగో విచారణ చేద్దాము. జననమరణాలు లేవు. పాత్రలు వేసేవాడు వేయవలసిన పాత్రలు లేనప్పుడు నేను లేను అన్నప్పుడు మోక్షాలు ముక్తులు అనేవి ఎక్కడ నుండి వస్తాయి. మోక్షం లేదా ముక్తి అనేది కొత్తగా బయట నుండి రావడం లేదు. ఉండదు. అన్నీ కూడా నీలోనే ఉంటాయి. నిన్ను దాటి కొత్తగా ఏమీ లేనప్పుడు మరీ కొత్తగా సాధించటానికి పొందటానికి ఏమీ లేనట్లే కదా. అంటే నీవు అనుకునే మోక్షము లేదా ముక్తి కూడా లేనట్లే కదా. నిశ్చలస్థితి పొందితే మోక్షము అని అనిశ్చలస్థితి పొందితే మాయ ఈ రెండిటి మధ్య స్థితిని కొంతసేపు స్థిర మనస్సు మరికొంతసేపు అస్థిర మనస్సు కలిగి ఉంటే అది ముక్తి స్థితి అని శాస్త్ర వచనం. అసలు నేనే లేనప్పుడు మనస్సు స్థిరాలు అస్థిరాలతో ఏమి పని ఉంటుంది. నేను ఉంటే మనస్సు ఉంటుంది. మనస్సు ఉంటే దానికి ద్వైత భావం స్థితి లాగా స్థిర లేదా అస్థిర స్థితులు ఉంటాయి. అసలు నేనే లేనప్పుడు ఇంకా వీటితో ఏమి పని ఉంటుంది. ఆలోచించు. ఈ లెక్కన చూస్తే మోక్షము అలాగే ముక్తి అనేది లేనట్లే కదా. మోక్ష స్థితిలో ఉన్న వాడు మోక్షము కోసం తపించడం లో ఏమైనా అర్థం ఉంటుందా? ఆలోచించండి.
 
18.     కర్మసన్యాస యోగము: సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అని నీ సహజ స్ధితిలో ఉండు! 

ఈ అధ్యాయము అంశంగా సర్వము ఏమీ లేదు సర్వము శూన్యము అనే దానిని విచారణ చేద్దాము.నాకు ఇది ఒక్కటి మాత్రమే సత్యముగా నిత్యముగా శాశ్వతముగా జ్ఞాన అనుభవ అనుభూతిగా కనబడుతుంది. నేను లేనప్పుడు ఈ కనిపించే విశ్వము నేనే వేసిన దైవ జీవ పాత్రలు అన్నీ కూడా అన్ని రకాల భావాలు ఆలోచనలు సంకల్పాలు ఆశలు భయాలు కోరికలు స్పందనలు ప్రేమలు మోహాలు వ్యామోహాలు ఈతిబాధలు సుఖదుఃఖాలు ఇలా మున్నగునవి ఏమీ కూడా లేనట్లే కదా. నేను ఉంటే అన్నీ ఉన్నట్లే. నేను లేకపోతే ఏమీ లేనట్లే కదా. నేను అనేది సత్యము కానప్పుడు ఇవి ఏమీ ఉన్నా లేనట్లే కదా. ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఆకార ఉల్లిపాయ ఎలా అయితే ఉండదో ఏవి అయితే నాలో సత్య భావాలుగా కనబడుతున్నాయో వాటిని పొరలుపొరలుగా తీసుకుంటూ పోతే నేను ఉంటానా? ఉండను కదా. నేను అనేది లేకపోతే మిగిలేది ఏమీ లేదు కదా. అంతా శూన్యమే కదా. ఇది కూడా ఉందో లేదో తెలియని అంశయే కదా. ఆలోచించు.
 
1. బ్రహ్మము లేదు....బ్రహ్మపదార్ధము లేదు!         (విభూతి యోగము)
2.  ఆత్మలేదు...పరమాత్మ లేదు...జీవాత్మ లేదు!  (సాంఖ్య యోగము)
3.  దేవుడు లేడు.... జీవుడు లేడు!  (భక్తి యోగము)
4.  నేను లేను...నువ్వు లేవు! (క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము)
5.  కనిపించేది అసత్యము....కనిపించనిది సత్యము! (జ్ఞానవిజ్ఞాన యోగము)
6.  కనిపించేది అంతా పరమశూన్యము యొక్క కల లాంటి నిజము...నిజము లాంటి కల! ( పురుషోత్తమప్రాప్తి యోగము)
7.  మనమంతా...మనదైవాలంతా… పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులం! ( రాజవిద్యారాజగుహ్య యోగము)
8.  ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యము! ( విశ్వరూపసందర్శన యోగము)
9.  జననము లేదు...మరణము లేదు!  (విషాద యోగము)
10.      కర్మ లేదు... జన్మ లేదు! (కర్మ యోగము)
11.      మాయ లేదు! మర్మము లేదు! (గుణత్రయవిభాగ యోగము)
12.      జ్ఞానము లేదు! అజ్ఞానము లేదు! (జ్ఞాన యోగము)
13.      సాధకుడు లేడు! సాధించటానికి ఏమిలేదు! (అక్షరపరబ్రహ్మ యోగము)
14.      సాధన లేదు...సాధించేది లేదు! (ఆత్మసంయమ యోగము) 
15.      అనుభవము లేదు...అనుభూతి లేదు! (దైవాసురసంపద్విభాగ యోగము)
16.      సమాధి స్ధితి లేదు....ఆనందస్ధితి లేదు! (శ్రద్దాత్రయవిభాగ యోగము)
17.      మోక్షము లేదు...ముక్తి లేదు!    (మోక్షసన్యాస యోగము)
18.      సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అని నీ సహజ స్ధితిలో ఉండు! (కర్మసన్యాస యోగము)
 
కారణము మన దశేంద్రియాలకి తెలిసేది అంతా పరమశూన్యము యొక్క స్వప్నం లాంటి నిజము! ఆది స్వప్నం అనగా ఆది ఆకార శూన్యబ్రహ్మగా ఈశ్వరుడు  స్వప్న శరీరధారిగా అగుపించడము! దీనితో ఈయన తన స్వప్నశరీరముతో విరాట్ స్వరూపము ఎత్తడముతో...అసత్యమైన బ్రహ్మ విశ్వమంతా సత్యముగా మాయస్వరూపముతో అగుపించడము జరుగుతోంది! కాని నిజానికి ఈ ఈశ్వరుడు అలాగే ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యమని…. సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అని సమాధి గీత తెలుసుకొని మనకి చెప్పడము జరిగినదని తెలుసుకొండి! ఈ గీతకు సంపూర్ణ గీత యని మరొక పేరు గూడ ఉంది!
 
ఇంతటితో పరమహంస పవనానంద చేత చెప్పబడిన 18 అధ్యాయాలతో కూడిన సమాధి గీత పూర్తి అయినది. ఇపుడిదాకా నా శబ్ధపాండిత్య అనుభవాలు పూర్తి అయినాయి.ఇపుడు నా అనుభవ పాండిత్య సాధనానుభవాలు తెలుసుకోవాలని ఉందా...దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసుగదా.

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*********************************************

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి