అధ్యాయం 50


పాము నీళ్ళలో దూకటం:
(కుండలిని శక్తి జాగృతి)



కుండలినీ శక్తి జాగృతి అనుభవాలు నా డైరీలో:

నా కుండలీని శక్తి జాగృతి సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.

 జనవరి 1: ఈరోజు నాకు బాగా ధ్యానం కుదిరినది అలాగే ఈ రోజు ఒక పాము తల మాత్రమే ధ్యానంలో కనిపించినది ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుంటే పాము తల ఎలా కనబడుతుందో అర్థం కావడం లేదు.

జనవరి 2: ఈరోజు ధ్యానంను ఎక్కువసేపు చేయలేక పోయాను కారణం నా వీపు వెనుక వెన్నుముక అడుగుభాగంలో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఒకవేళ బాక్ ఎక్ అదే వెన్నుపూస నొప్పి అని జబ్బు గాని వచ్చిందా? ఏమో ఎవరికి తెలుసు.

 జనవరి 10: గత వారం రోజుల నుండి నేను ధ్యానంను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. వెన్ను నొప్పి తీవ్రంగా ఉంది. దానితో నాకు ఎలాంటి ధ్యాన అనుభవాలు కలగడం లేదు.

జనవరి 12:ఈ రోజు వెన్నునొప్పి నన్ను అంతగా బాధించలేదు కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు లేవు.

 జనవరి 15: అసలు ధ్యానం చేసేది ఎందుకు? ధ్యాన అనుభవాల కోసమా లేక మరేదైనా దానికోసమా ఏమో నాకు ఏమీ తెలియడం లేదు.

P2:


జనవరి 22:ఈ రోజు మళ్ళీ నాకు  ధ్యానంలో ఒక నాగు పాము తల మాత్రమే కనపడసాగింది. ఒకవేళ నాకు సర్ప దోషాలు ఉన్నాయో ఏమో 

 జనవరి 25: ఈ రోజు ధ్యానంలో పాము తల అటూ ఇటూ ఊగుతుంటే నాకు వెన్నుపాము క్రింద ఏదో కదులుతున్న అనుభూతి కలగ సాగింది. పాము తల కి వెన్నుపాముకి గల సంబంధం ఏమిటో మొదట తెలుసుకోవాలి.

జనవరి 27: వామ్మో!దీనెమ్మ! ధ్యానంలో ఈ పాము తల తప్ప నాకు ఏమీ కనిపించడం లేదు. అసలు నాకు ఏమి జరుగుతోంది.


ఫిబ్రవరి 4: వామ్మో! ఈ రోజు ఈ నాగుపాము నన్ను కాటు వేయాలి అని చూస్తోంది. బుసలు కొడుతూ కనిపించినది. వామ్మో! దీని కాటు వలన నేను చనిపోతే.. ఈరోజు విచిత్రంగా ఏక తల ఉన్న నాగేంద్రుని విగ్రహమూర్తి వచ్చినది.

ఫిబ్రవరి 6: ఈరోజు నాకు ధ్యానం చేయాలని అనిపించడం లేదు. బోర్ గా ఉంది. ఏదైనా సినిమాకి వెళ్ళాలి. అంతే.

ఫిబ్రవరి 10: ఈ మధ్య నా మనస్సు ధ్యానం నందు ఉండటం లేదు. పాము తల  కనిపించేసరికి ధ్యాన భంగం అవుతుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో పుస్తకాలు చదివి తెలుసుకోవాలి.

P3:


ఫిబ్రవరి 13:నా స్వామిరంగా! ఈరోజు నాకు ధ్యానంలో ఒక అడుగు ఉన్న నల్లని తెల్లని మచ్చలు పాము కనిపించసాగింది.  ఇన్నాళ్ళు పాము తల కనిపిస్తే ఈ రోజు ఏకంగా పామే కనపడ సాగింది. ఈ పాముల గోల ఏమిటో అర్థం అయ్యి చావటం లేదు.

ఫిబ్రవరి 22: వామ్మో! ఈ రోజు ధ్యానంలో నా చిటికెన వేలు మీద పాము కాటు వేసినట్లుగా కనిపించినది కదా. మరి నాకు ఏమీ కాలేదు. నేను చనిపోలేదు కదా. కళ్ళు మూసుకుంటే పాము ఎందుకు ఇలా కనబడుతోంది.

నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి


ఫిబ్రవరి 28: ఈ పాము కాటు దగ్గర నుండీ నాకు ధ్యానంలో బాగా కుదురుతుంది.ఏదో తెలియని ఆనంద క్షణాల స్థితి కలుగుతుంది. చెప్పలేని స్థితి. రాసుకోలేని స్థితి. ఇది భలే మజా ఇస్తోంది. ఈరోజు నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి వచ్చినది.

మార్చి 3: ఈరోజు నాకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు కలగలేదు కానీ నా వెన్నుపాము క్రింద విపరీతంగా ఏదో కదులుతున్న పైకి లేస్తున్న అనుభవ అనుభూతి కలగ సాగింది.

P4:
మార్చి 4: ఈరోజు వెన్ను నొప్పి ఉన్న బాధ గా అనిపించడం లేదు. ఉన్నదని చెప్పలేను. లేదని చెప్పలేను. ఏదో తీయని దురదగా ఉంది.

మార్చి 6: ఈరోజు నాకు ధ్యానంలో ఆలోచనలు తగ్గటం నాకే తెలుస్తుంది. పాము కాటు అయిన దగ్గర నుండి నా ధ్యానం లో విపరీతమైన మంచి స్థితి కలుగుతుంది. ఇదేమి చిత్రమో నాకు అర్థం అవడం లేదు.

మార్చి 13: ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి. బాగా అలసిపోయినట్లుగా బాగా నీరసంగా ఉంది. ఎందుకో తెలియదు.

మార్చి 27: ఈ రోజు నా పుట్టినరోజు. కానీ సంబరాలు చేసుకోవాలని లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలనిపిస్తుంది. అలా వీలు పడుతుందా..

మార్చి 31: ఈ రోజు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ధ్యానం చేయాలని లేదు. పడుకోవాలి అని అనిపిస్తోంది. గుడి కి వెళ్లాలి కదా!

P5:
ఏప్రిల్ 2: ఈ రోజు ఏదో తెలియని విషయాన్ని బాగా ఆలోచిస్తున్నట్లుగా మధన పడుతున్నట్లు ఉన్నానని నా స్నేహితులు చెబుతున్నారు, కానీ నిజానికి నేను ఏమీ ఆలోచించడం లేదు.

ఏప్రిల్ 5: ఈరోజు ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా ఉండాలని బాగా అనిపిస్తోంది. ఒకవేళ నాకు మానసిక వ్యాధి కానీ రాలేదు కదా. ఏమో ఎవరికి తెలుసు. 

ఏప్రిల్ 8: ఈ రోజు అసలు ఏమి చేస్తున్నానో నాకేమీ తెలియటం లేదు. పాముకాటు పడిన దగ్గర నుండి నేను స్తబ్దతగా ఉండిపోతున్నానని నాకు తెలుస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎదురు చూడాలి.

ఏప్రిల్ 15: ఈ రోజు నిద్ర రావటం లేదు. ఆకలి అనిపించడం లేదు.రోగం లేదు. మరి నాకెందుకు ఈ సమస్యలు...

ఏప్రిల్ 20: ఈరోజు నేను శివలింగారాధన బాగా చేసినానని అలంకారాలు బాగా చేసినానని అందరు చెబుతున్నారు. నాకేమీ అలా అనిపించడం లేదు.  రోజు లాగానే చేశాను కదా ఈ రోజు కూడా! మరి వీళ్ళకి ఎందుకు ఈ తేడా కనిపించినదో ఎవరికి తెలుసు.

P6:
ఏప్రిల్ 22: ఈ రోజు నిద్ర పోకుండా వీధుల వెంట తిరగాలని బలంగా అనిపిస్తోంది. తిరిగితే పోలా. 

ఏప్రిల్ 25: ఈ మధ్య చీకటి అంటే భయం దొబ్బినట్లుగా ఉంది. రాత్రిపూట ఉచ్ఛ పోయాలంటే విపరీతంగా భయపడే నాకు రాత్రిళ్లు నిద్ర పట్టకుండా నగర సంచారాలు ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు.

ఏప్రిల్ 27: ఒకవేళ నాకు ధ్యానంలో పాము కాటు వేయటం వలన నాకు పాము లక్షణాలు రావటం లేదు గదా. ఏమో ఎవరికి ఎరుక.

ఏప్రిల్ 28: ఈ మధ్య నేను బాగా పూజలు చేస్తున్నాను అని అందరూ అంటున్నారు. ఎందుకో ఏమో.

ఏప్రిల్ 30: ఈ రోజు ధ్యానంలో నాకు చిన్న బిందువు వంటి తేజస్సు ఉన్న జ్యోతి మినుకుమినుకు మంటూ కనపడసాగింది.

P7:
మే 1: ఈ మధ్య నాకు భోజనం చేయాలనే తపన ఉండటం లేదు. అజీర్తి చేసిందా లేదా ఏదైనా కారణమా ఎవరికి ఎరుక.

మే 3: ఈ రోజు అసలు స్నానమే చేయలేదు. స్నానం చేయాలని అనిపించడం లేదు. కానీ ధ్యానం బాగా కుదురుతుంది. స్నానం చెయ్యకుండా ధ్యానం చెయ్యవచ్చా తప్పు గదా!

మే 6: ఈమధ్య నాకు ఏ విషయాల యందు ఆసక్తి దొబ్బింది. సినిమాలు చూడటం దొబ్బినది. కూల్ డ్రింక్స్ త్రాగడం దొబ్బింది. ఎందుకో నాకు ఇష్టమైన పనులు ఒక్కోక్కటి నాకు దూరం అవుతున్నాయి. ఎవరైనా దూరం చేస్తున్నారా.

మే 8: ఈరోజు నాకు అన్నిటియందు అన్ని విషయాలలో విపరీతమైన కోపావేశాలు కలుగుతున్నాయి.క్రొత్త రోగమా? ఇదేమీ అర్థం కావటం లేదు.

మే 15: ఈరోజు నేను దేని యందు స్థిరముగా లేను. స్థిరమైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాను. నాకు అసలు ఏమవుతుంది. ఇది ఏమైనా మెదడుకు సంబంధించిన జబ్బా! ఎవరికి ఎరుక.

P8:
మే 18: ఈ మధ్య నాలో నేను మాట్లాడుకోవడం ఎక్కువైంది. నా ఎదురుగా ఎవరూ లేరు. కానీ ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. వామ్మో! నాకు ఏదో అయినది.

మే 20: ఈరోజు నా ధ్యానం దొబ్బింది. మిరపకాయ బజ్జీలు తినాలి అప్పుడే కానీ నా మనస్సు శాంతిపడదు.

మే 22: ఈరోజు ఏమిటో ధ్యానం చేస్తున్నంత సేపు నాకు తెలియకుండానే విపరీతంగా ఊగి పోతున్నాను. వామ్మో రోగం కాదు కదా. ఒకవేళ మూర్ఛ వ్యాధి లేదా పూనకపు వ్యాధి కానీ రాలేదు కదా.

మే 25: ఈరోజు కూడా నేను ధ్యానం లో భాగంగా ఊగి పోతున్నాను నా శరీరము దేనివో కదలికలకు తట్టుకోవడం లేదని నాకు అర్థమైనది.

మే 28: వామ్మో! ఈ రోజు మరీను. శరీరం ఉల్టా పల్టా అవుతుందేమోనని భయం వేసింది. వామ్మో! ఏదో వెన్నుపాము క్రింద కదలికల వలన నా శరీరం తట్టుకోలేక పోతుంది. దీనిని ఎలా తట్టుకోవాలి. పుస్తకాలు చదివి తెలుసుకోవాలి.

P9:
జూన్ 1: ఈరోజు నాకు ధ్యానంలో కాళ్లు చేతులు బాగా లాగి వేయబడినట్లుగా లోపలికి ఏదో ప్రవహిస్తున్నట్టుగా లాగుతున్నట్టుగా ఏదో తెలియని భయం తో కూడిన అనుభవం కలిగినది. ప్రాణ భయం మొదలైంది. దానితో నాకు ధ్యానం భంగమైనది.

జూన్ 2: ఈరోజు కూడా ప్రాణభయం మొదలైనది. ఏది జరిగితే అది జరుగుతుందని ధ్యానము ఆపకుండా చేసినాను. భయము నెమ్మదించింది.

జూన్ :3 ఈరోజు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అంతర ప్రపంచం లోకి వెళుతున్న అనుభవ అనుభూతి కలగ సాగింది. అసలు ఏమి జరుగుతోంది.

జూన్ 4: శరీరము ఊగటం లేదు. వెన్నునొప్పి లేదు. ప్రాణభయం లేదు. ఏదో తెలియని ప్రశాంతత స్థితి కలిగినది.

జూన్ 5: ఈ రోజు నా శరీరం విపరీతమైన వేడిని చూపించినది. ఒకవేళ డెంగ్యూ మలేరియా గాని చికెన్ గున్యా జ్వరాలు రాలేదు కదా. జ్వరాలుగా అనిపించటంలేదు. కాని వేడిమి తగ్గటం లేదు.

జూన్ 6: ఈరోజు నేను ధ్యానంలో ఎంతసేపు ఉన్నానో సమయం తెలియరాలేదు.ధ్యానం చేస్తున్నాను అని ఆలోచన లేదు. విచిత్రంగా ఉంది.

P10:
జూన్ 10: ఈరోజు విచిత్రంగా నా వెన్నుపాము వెనుక నుండి క్రింద నుండి పైకి అనగా తల భాగం వరకు ఏదో శక్తి ప్రవహించినట్లుగా ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలగ సాగింది. ఇదియే కుండలిని శక్తి ప్రవాహం కాదు గదా.

జూన్ 12: ఈరోజు నా వీపు వెనుక ఏదో పాము పాకుతున్నట్లుగా నా లోని శక్తి క్రింద నుండి పైకి ప్రవహించినట్లు గా అనుభవ అనుభూతి కలగ సాగింది. ఇది భలేగా ఉంది.

 జూన్ 15: ఈరోజు విచిత్రంగా ఏదో కప్ప గంతులు వేస్తున్నట్లుగా ఏదో శక్తి నా వీపు వెనక నుండి క్రింద నుండి పైకి ప్రవహిస్తోంది. ఇది కూడా భలేగా ఉంది.అచ్చంగా భూమి మీద  గంతులు వేస్తున్నట్లుగా ఉంది.

జూన్ 16: ఈరోజు శక్తి  ప్రవాహము క్రింద నుండి పైకి ఏదో చీమలు పాకుతున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా ప్రవహించసాగింది. ఇది కూడా భలేగా ఉంది. వంటి మీద చీమ పాకితే ఎలా జిలగా ఉంటుందో అలా ఉంది.

జూన్ 18: ఈరోజు పుస్తకాలు చదివితే ఇదంతా కూడా నాకు కలిగిన ఈ అనుభవాలు అన్నీ కూడా కుండలిని శక్తి జాగృతి అనుభవాలు అని తెలిసినది. అంటే నాకు తెలియకుండానే నాకు కుండలినీశక్తి జాగృతి అయినది అన్న మాట. అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ శక్తి ప్రవాహం తట్టుకుంటే పర్వాలేదు లేదంటే మూర్చ లేదా పూనకము లేదా మెదడు వాపు వ్యాధి వస్తాయి అని తెలుసుకున్నాను.

P11:
జూన్ 20: నాకు ధ్యానం చేస్తున్నంతసేపు విపరీతమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు కల్గినాయి.

జూన్ 23: ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన వేడి ఆవిర్లు నా శరీరము నుండి బయటకి వెళుతున్న అనుభవం కలిగినది.

జూన్ 24: ఈరోజు మా భౌతిక గురువుని కలిశాను. ఆయనకి నా ధ్యానం అనుభవ బాధలు చెబితే వెంటనేనా తల మీద చెయ్యి పెట్టి ఏదో శక్తిని నా లోనికి పంపించినట్లుగా నాలోని శక్తిని జాగృతి చేసినారు.విషయము అడిగితే శక్తి పాతము ద్వారా నాలో ఉన్న నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్న కుండలినీశక్తిని జాగృతి చేసినారట. విచిత్రంగా ఉందే.

 జూన్ 25: ఈరోజు నాకు ధ్యానంలో ఏదో ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పొగ వంటిది నా వెన్నుపాము నుండి మెదడులోని నరాల లోనికి ఒక పాము పాకుతూ వెళుతున్నట్లుగా ప్రవేశించడం నాకు అనిపించినది. అసలు భౌతిక కళ్ళు చూడకుండా నాలో ఉన్న దృశ్యాలు నాకు ఎలా కనబడుతున్నాయి. వీటిని గురించి గురుదేవుని అడగాలి.

P12:
జూన్ 26: గురుదేవుణ్ణి అడిగితే ఆయన నాతో “నాయనా! మనలో సప్త యోగ చక్రాలుంటాయి. అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతము నువ్వు మొదటి చక్రం అయిన మూలాధార చక్ర జాగృతి లో ఉన్నావు. దీనికి అనుసంధానమై ఆరవది అయిన ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ చక్రము నందు త్రినేత్రం ఉంటుంది. దీనినే మన సైన్స్ వాళ్లు పీనియల్ గ్రంథి అంటారు. త్రినేత్రం నిలువుగా ఉంటుంది. ఇది తెరచుకొనే ప్రారంభ సమయమున ఒక చిన్న బిందువు వంటి జ్యోతి దర్శనం అవుతుంది.ఎప్పుడైతే నీకు ఉపనయన ప్రక్రియ జరిగినదో ఆనాటి నుండి త్రినేత్రం నెమ్మది నెమ్మదిగా తెరచుకోవడం ఆరంభమైనది. ఎప్పుడైతే నీ సాధన ఆజ్ఞా చక్రము నందు చేరుకుంటుందో అప్పుడూ త్రినేత్రం సంపూర్తిగా తెరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నీవు చూసే దృశ్యాలు అన్నియు కూడా వెలుతురికి అవతల అన్నమాట. వీటిని చూడటానికి భౌతిక నేత్రాలు సరిపోవు. అందుకే నీవు ఎప్పుడైతే ఈ నేత్రాలు మూసుకుంటావో అప్పుడు త్రినేత్రం ద్వారా నీకు ధ్యాన అనుభవ దృశ్యాలు కనపడతాయి. అని అన్నారు.

P13:
జూన్ 27: అంటే నాకు త్రినేత్రం తెరుచుకోవడము ప్రారంభమైందని నాలో కుండలినీ శక్తి జాగృతి అయినదని మా గురు దేవుడు చెప్పిన దగ్గరనుండి నాలో నాకే తెలియని ఆనందం వేస్తుంది. ఈరోజు ఎలాగైనా మిరపకాయ బజ్జీలు, కూల్ డ్రింక్ తాగాల్సిందే. వామ్మో! ఈ ఆనంద క్షణాలు తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి దీని కోసమే ఎదురు చూస్తున్నానని ఆనంద అనుభూతి కలగ సాగింది.

ఇంతటితో నా కుండలీని శక్తి జాగృతి అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!

****************
కుండలిని జాగృతి - మా సాధనానుభవాలు

ఒకరోజు నేను రాత్రి పూట తీవ్ర ధ్యానంలో ఉండగా నా జ్ఞాన దీక్ష గురువు యొక్క తెల్లని శరీర కాంతి పుంజము నాకు ధ్యానములో నెమ్మది నెమ్మదిగా అగుపించసాగినది. అప్పుడు వామ్మో! ఈయన మళ్లీ ఎందుకు అగుపించారు.అరటిపండు సగభాగము పెట్టి శక్తి పాతం చేశారని చెప్పి వెళ్లిపోయారు. ఒకవేళ ఆయన చనిపోయారా? అందుకేనా ఆయన ఆత్మ అనగా సూక్ష్మ శరీరం నాకు కనపడుతుందా? అలా జరిగి ఉండదు.ఏమి జరిగినదో తెలుసుకునే లోపల వారి సూక్ష్మశరీరము అంతర్ధానమై ఒక నల్లటి నాగు పాము తల సజీవంగా కనబడసాగింది. అంతా సజీవమూర్తిగా కనబడుతోంది. వామ్మో! ఏమిటి ఇది క్రొత్తగా. అది కదలదు. కాటు వేయడానికి కానీ వచ్చిందా లేక పగ తీర్చుకోవటానికి ఏమైనా వచ్చిందా? ఈ జన్మలో ఎప్పుడుపామును చంప లేదు. ఎప్పుడు నాకు పాముల పుట్టలో అమ్మ నా చేత నాగులచవితికి పుట్టలో ఆవుపాలు చలిమిడి పెట్టించి పుట్టలో పోయించేది. మరి ఈ పాముల గోల ఏమిటి?ఒకవేళ గత జన్మలో ఏమైనా పామును చంపినానా? అది గాని సర్ప శాపంగా నన్ను చంపటానికి వచ్చిందా? వామ్మో ఈ దిక్కుమాలిన యోగసాధన కాదు గాని ఈ పాముల గొడవ ఏమిటి? మనకిఎవరు కూడా సలహాలు కూడా ఇవ్వలేదు. ఇది మాత్రం పోవటం లేదు అనుకుంటూ కళ్ళు తెరిచి చూసిన ఎదురుగా పాము తల మాత్రమే కనబడుతుంది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా పాము తల మాత్రమే కనబడుతుంది.అది ఫోటోలో లాగా కానీ విగ్రహంలా గాని లేదు. నిజమైన పాముతలగా కనబడుతోంది. దీని దెబ్బకి నా కళ్ళు దొబ్బినాయా?భ్రమ భ్రాంతులకు వెళ్ళిపోయానా? ఏమి చేయాలిరా దేవుడా అంటూ నిద్రకు ఉపక్రమించే సరికి అక్కడ కలలో కూడా కేవలం పాము తల మాత్రమే కనపడేది. ఇలా ఒక మూడు నెలల పాటు కనపడినది. ఒకరోజు ఉన్నట్టుండి నా వెన్నుపాము క్రింద కదలికలు ప్రారంభమైనాయి. ఏదో తెలియని చిన్నపాటి ఆనంద క్షణాలు కలుగుతుండేది. ఈ పాము తలకి అలాగే ఈ కదలికలకి గల సంబంధం ఏమిటో అర్థం అయ్యేది కాదు.ఇదివరకు ఇలాంటి కదలికల అనుభూతి ఒకటి రెండుసార్లు మాత్రమే కలిగితే ఇప్పుడు తరచుగా అదే పనిగా కదులుతున్న కదలికలు అనుభూతి వెన్నుపూస అడుగు భాగంలో గుద స్థానము క్రింద భాగము అంటే మన యోగ పరిభాషలో చెప్పాలంటే మూలాధార చక్రము క్రిందభాగంలో అన్నమాట.ఈ మధ్య తరచుగా పాము తల కనిపించటం కదలికలు ఏర్పడటం జరుగుతుండేది కానీ ఎలాంటి బాధ గాని నొప్పి గాని అనిపించేది కాదు.

ఆనందం వేసేది ఏదో భారము తొలగినట్లు అనిపించసాగింది. ఇది ఇలా ఉండగా ఒక రోజు ఇదే పాము తల కాస్త ధ్యానంలో ప్రాణము వచ్చినట్లుగా అటు ఇటు తల ఊపుతూ ఉండేది. దానితో నాలో కదలికలు కూడా వేగంగా కదిలేవి. ఈ బాధంతా దేనికి. అసలు తనకి ఏమి జరుగుతుందో అర్థమయ్యే స్థితి లేదు. ఎవరిని అడిగినా నాకు ఏమైనా సర్ప దోషాలు ఉంటే ఇలా కనపడుతున్నాయని అవి చేయించుకోకపోతే సర్ప కోపానికి గురై అవి కాటు వేసి చంపివేస్తాయి అని చెప్పేసరికి ప్రాణ భయంతో ఈ పాముల గోడు అంతా మా అమ్మ చెవిలో ఊదేసరికి ఆవిడ వెళ్లి మా అయ్య చెవిలో ఊదటం వెంటనే ఎవరైనా ఒక జ్యోతిష్య పండితుల సలహా తీసుకొని ఏదైనా పరిహారాలు చెప్పితే చేద్దాం అని అనడం నా చెవిలో పడినవి.హమ్మయ్య! ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గము దొరికినది. దానితో ఈ పాము గోల తగ్గిపోతుంది అనుకొని యధావిధిగా ధ్యానములో కూర్చునే సరికి కదులుతున్న పాముతల కనిపించే సరికి….. కళ్ళు తెరుచుకుని లేచి వెళ్లి నా పనులు చేసుకోవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.



ఒకరోజు ధ్యానంలో ఉండగా కదులుతున్న పాము కాస్త ఏదో దేవాలయంలోని పుట్టలోనికి వెళ్ళినట్లుగా కనిపించింది. కానీ ఆ గుడి గాలి గోపురం చాలా ఖచ్చితంగా కనబడి మనస్సులో దాని ముద్ర పడినట్లుగా అయినది.ఇలా వరసగా ఇదే దృశ్యం కనపడ సాగింది. వామ్మో! ఇది ఏమిటి కొత్తగా. ఒకవేళ నాకు కనిపించిన పాము యొక్క గుడి కాబోలు. ఒకవేళ అక్కడికి వెళితే నన్ను కాటు వేయడానికి సిద్ధంగా ఉంటే నేను ఏమి చేయాలి. గుడి ఎక్కడ ఉంది? ఎవరికి తెలుసు? అనుకుంటూ ఇంటికి వచ్చి యధావిధిగా ఎందుకో టివి పెట్టేసరికి నాకు కలలో కనిపించిన గుడి వివరాలు ఉన్న యాత్ర ప్రోగ్రామ్ నడుస్తోంది. నాకు మూడు రోజులుగా కనబడుతున్న గుడి వివరాలు ఈ గుడి వివరాలతో సరి పోయేసరికి మా అయ్యతో  ఈ వివరాలు చెప్పగానే “మంచిది! ఇక ఆలస్యం ఎందుకు? ఆ పుట్టలో వెండితో చేసిన పాము కళ్లు, చెవులు, పాము తోక వేసి వస్తే ఏమైనా సర్పదోషాలు ఉంటే మన కాళ్ళకి చేతులకి చర్మమునకు రోగాలు రావు అంటూ మర్నాడు మా ఊరిలో దగ్గరలో ఉన్న ఆ గుడి వైపు కి వెళ్లడం జరిగింది. యధావిధిగా గుడిలోనికి వెళ్ళి గాలి గోపురము ను చూసి ఇదే నాకు కలలో కనిపించినదని నిర్ధారణ చేసుకొని చెప్పినట్లుగా అక్కడ వెండితో చేసిన పాము చెవులు కళ్ళు తోక తీసుకొని ఆవుపాలతో  చలిమిడితో కలిపి పుట్ట కళ్ళాలలో వేసి దండం పెట్టి ఓ నాగ దేవా! నువ్వు ఎందుకు కనబడినావో తెలియదు.ఎందుకు ఈ దేవాలయము చూపించినావో తెలియదు. ఏవో సర్పదోషాలు ఉంటే ఈ పరిహారాలు చేశాను కానీ నువ్వు ఎందుకు ఇలా నాకు చేసావో తెలియదు. ఎందుకు వచ్చినావో చెప్పుము అనుకుంటూ విగ్రహమూర్తికి నాగ పూజ చేసి బయటకి వచ్చేసరికి ఆ గుడి పూజారి ఎంతో కంగారుపడుతూ అయ్యో! ఏదో అపచారం జరిగిపోయినట్లు ఉంది.ఎవరో మైల దోషం ఉన్నవారు ఈ గుడికి వచ్చారు.దాంతో నాగేంద్ర స్వామి వారికి ఉగ్రావేశము కలిగింది.స్వామి వారు కోపముతో బయటికి వెళ్ళిపొతున్నారు. అందరూ రండిరండి అంటూ కేకలు పెద్దగా వేసేసరికి అయ్యో! స్వామి మమ్మల్ని క్షమించు.మాలో ఎవరు ఈ తప్పు చేశారో మాకు తెలియదు.మమ్మల్ని వదలిపెట్టి వెళ్ళవద్దు. తగిన ప్రాయశ్చితము చేసుకుంటాము అని అక్కడున్న భక్తులు వేడుకొనేసరికి అక్కడున్న దేవాలయం బావిలో ఎదో పెద్ద బండరాయి పడితే వచ్చే శబ్ధముతో నీళ్ళు పైకి వచ్చినాయి. వెంటనే పూజారి ఒరేయ్! పెద్ద బుట్టలు తీసుకొని రండిరా! దానికి పసుపు కుంకుమలు పెట్టండిరా! నా స్వామికి కోపం వచ్చి బావిలోనికి దూకేశారురా! రండిరా! రండి అంటూ వచ్చిన బుట్టలను నీటిలో దింపినారు. దింపేటపుడు అవి చాలా తేలికగా ఉన్నాయి.ఎవరో కిందకి లాగి వేసినట్లుగా ఏమీ లేని ఖాళీ బుట్టలు నీటిలో మునిగిపోవడం సుమారు 80 మంది భక్తులు కలిసి ఎంతో అతి బరువు గా మారిన ఈ ఖాళీ బుట్టలను పైకి చాలా బలముగా లాగుతూ ఉండే సరికి అసలు అక్కడ ఏమీ జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. ఒకవేళ నేను చేసిన పూజ వెంటనే ఈ గందరగోళం జరిగినది అంటే నా వలన ఏమైనా తప్పులు జరిగినాయా? వామ్మో క్రొత్తగా ఇదేమీ సమస్య. ఉన్న సమస్యలు చాలవు అన్నట్లుగా ఇలా విచిత్ర సంఘటన జరగటం ఏమిటి అనుకుంటుండగా ఈ ఖాళీ బుట్టలు ముందుగా పుట్ట ఉన్న గుడి లోనికి తీసుకొని వెళ్ళి పూజలు చేసి కొద్దిసేపటి తర్వాత నాగేంద్ర స్వామి విగ్రహమూర్తి ఉన్నమరో పుట్టలాంటి గుడిలోనికి తీసుకొని వెళ్లటం నా ఓరకంట చూసాను. అప్పుడు నా విచిత్రమైన భావాలు చూసి మా అయ్య ఏమీ లేదురా! ఈ గుడిలో బంగారు వన్నెతో మెరిసిపోయే దైవిక జాతి నాగుపాము సజీవంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఎవరైనా మైలతో నెలసరి రోజులతో వస్తే వెంటనే ఈ పాముకు వీర ఆవేశం వచ్చి దాని కనిపించని సూక్ష్మ శరీరంతో బావిలో దూకుతుంది.వెంటనే ఈ పూజారి ఖాళీ బుట్టలను నీటిలోనికి దిగి రాగానే అవి చాలా బరువుగా మారి అందులోకి ఈ నాగేంద్రుడు చేరటంతో పైకి తీసి యధావిధిగా పుట్టలోనికి తిరిగి ప్రవేశింప చేస్తారు.ఇది ప్రతి నిత్యము ఏదో ఒక సమయంలో ఇలా జరుగుతుంది. ఇది నీకు ఆశ్చర్యం కలిగించవచ్చును. కానీ ఇక్కడున్న వారికి ఇది షరా మామూలే అంటూ గుడి బయటకి వచ్చినాము అది ఏమిటి ఒక పాముకు ఇంతగా పూజ చేస్తారా.నాకు కనిపించే నాగు పాము తల ఈ పాము యొక్క సూక్ష్మ శరీరం కాదు కదా అదే నిజమైతే అనుకుంటుండగా అది నిజమని ఆ గుడి గంటలు మ్రోగేసరికి ఇది నిజమని నాగేంద్ర స్వామి వారు చెబుతున్నారు అని అనిపించి ఇలాంటి ప్రత్యక్ష దైవ అనుభవము ఇచ్చినందుకు  కృతజ్ఞత భక్తితో నమస్కరించి నాకు కలలో వచ్చిన ఆయనే ఖచ్చితంగా ఏదో సందేశం ఇస్తారని అమిత నమ్మకము నాలో కలిగే సరికి మా ఊరు వెళ్లే బస్సు ఎక్కిన విషయమే నేను గమనించలేదు.

ఇది జరిగిన మూడు రోజుల తర్వాత నేను గాఢ నిద్రలో ఉండగా ఒక అడుగున్నర నల్లటి కృష్ణసర్పం ఎదురుగా ఉన్నది.నిజమో లేదా అబద్ధమో తెలియని స్థితి. తెల్లని శరీర కాంతి వెలుగులతో మెరుస్తూ కనబడుతూ వేగంగా నా వైపు కి కాటు వేయడానికి  చరచర పాకుతూ కనబడసాగింది.కొంపదీసి ఈ పాము నేను పూజ చేసిన దేవాలయం పాము కాదు గదా. అక్కడే ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని అడిగి వచ్చాను కదా. మరి ఎందుకు ఇంత పిచ్చి వీరావేశంతో కాటువేయడానికి వస్తోంది. వామ్మో! దీని కాటు పడితే కొన్ని సెకన్లలో నా ప్రాణం పోవడం ఖాయం.ఎవరికి ఏమీ చెప్పకుండానే ఎవరికి కారణం తెలియకుండానే ఒక సర్పం చేత అర్ధాంతరంగా చావాలని విధి వ్రాత గాబోలు.ఏమో ఎవరికి తెలుసు. మా అయ్య తెలియక పొరపాటున మైల వచ్చిన రోజులలో నన్ను గాని గుడికి గాని తీసుకొని వెళ్ళ లేదు గా.వామ్మో! వాయ్యో! ఆ చిన్న తప్పు కి ఇంత శిక్షా? శక్తిపాతము చేసిన దీక్ష గురువు ఏమైనాడో తెలియదు. నిత్య పూజలు అందుకునే దేవతలు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. అవసరానికి మనుషులే ఉపయోగపడరని అనుకున్నాను. చివరికి దేవతలు కూడా ఉపయోగపడరా. ఈ పాము దెబ్బకి వాళ్ళు ఎప్పుడో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటూ ఉండగానే నా దగ్గరికి వచ్చి కుడి చెయ్యి మొదట్లో కాటేసి వెళ్ళిపోయింది.అపుడు చావు భయము అలాగే ప్రాణభయము ఏమిటో ఆ క్షణం ప్రత్యక్షానుభూతి పొందినాను. ఈ రెండు యోగ సాధనలో ఎందుకు మాయగా అడ్డు వస్తాయో అర్థమయ్యేసరికి మెలుకువ వచ్చి కూర్చున్నాను.అది నిజం లాంటి కల అని నాకు తెలిసేసరికి వామ్మో! నిజంగానే పాము కాటు వేసినదేమోనని భయపడి చచ్చాను.భయముతో నిజముగా చచ్చేవాడిని అనుకుంటూ నిద్రపోదామని అనుకున్నా గాని నిద్ర పట్టలేదు.

దానితో ఏమీ చేయలేక నాకు కలిగిన ఈ విచిత్ర సాధన అనుభవాలు శ్రీశైల క్షేత్రం లో ఉన్న యోగ మిత్రుడైన జిఙ్ఞాసికి టెలిపతి ద్వారా ఈ వివరాలు అన్నీ మననము చేస్తూ వాడికి చేరవేయ సాగాను. ఒక అరగంట తర్వాత వాడి నుండి సూచనలు రావడం ప్రారంభమయ్యాయి. “భయ్యా! నీకు వచ్చిన అనుభవాల లాంటివే నాకు కొంత కాలంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకు దేనికోసం జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. నా అనుభవాలు నీకు వివరిస్తాను” అంటూ “భయ్యా!నేను చెంబు అలాగే కుటుంబ సభ్యులు గూర్చి తీవ్రంగా ఆలోచించి నెమ్మది నెమ్మదిగా వారిని మర్చిపోవటం జరిగినది. వారిని పూర్తిగా మర్చిపోయిన సమయానికి నాకు ధ్యానంలో తీవ్రమైన ఏకాగ్రత నా మనస్సు స్థిరంగా మారి ధ్యానంవైపు మళ్లుతుంది.ఇలాంటి తీవ్ర ధ్యాన సమయంలో నేనుండగా ఒకరోజు నాకు సిద్ధ దీక్ష గురువు యొక్క నాకు ధ్యానంలో సూక్ష్మ శరీర కాంతి కనిపించి “నాయనా! నేను నీలో ప్రవేశపెట్టిన శక్తిపాత సిద్ధి వలన నీలో కుండలినీ శక్తి జాగృతమై చక్రాలను జాగృతిని త్వరగా చేస్తుంది. కంగారుపడకు. భయపడకు.శక్తిపాత సిద్ది వలన అంతదాకా నువ్వు చేసిన రామ మంత్రము శక్తి కాస్త లక్షల కోట్లు శక్తి పెరిగి నీలోని కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ఇది ఆరంభం అవుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో. నీ ఈ శరీరముతోనే ఈ శరీర దేవాలయంలో ఉన్న ఆత్మారాముని వెతుకు. ఎన్నో లక్షల కోట్ల జన్మల పుణ్య ఫలం వలన ఇలాంటి యోగ జన్మము మనకి లభిస్తుంది.దీనిని శ్రద్ధగా సంరక్షించుకో లేకపోయినా అలాగే నీ మోక్షప్రాప్తి పొందాలనే లక్ష్య సాధన పూర్తిగాకుండా నీవు శరీర త్యాగం చేస్తే మళ్ళి జన్మించవలసి ఉంటుందని గ్రహించు.తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని యోగ మాయలు  అలాగే యోగసిద్ధులుశక్తుల మాయలు దాటుకో. నీ ఈ జన్మను వృధా చేసుకోకుండా తరించు అని చెప్పి అదృశ్యమయ్యారు.ఎక్కడో కాశీ క్షేత్రములో ఉన్న ఈయనకు ఇక్కడ శ్రీశైలంలో నేను ఉన్నానని ఎలా తెలుసు.ఇక్కడికి ఎలా రాగలిగినారో నాకు అర్థం కాలేదు. నిద్ర వస్తే నిద్ర పోయాను.ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాకు ధ్యానంలో నాగు పాము తల కనిపించసాగింది. అలాగే మరి కొన్ని రోజుల తర్వాత ఈ పాము తన తలను అటు ఇటు ఊపుతూ కనిపించసాగింది.ఇది ఎందుకు అని విచారించగా కుండలినీశక్తికి నాగుపాము సంకేతమని కుండలిని శక్తి జాగృతి సమయంలో ఇలా దేవత నాగుపాము దృశ్యాలు కనపడతాయి అని ఎక్కడో యోగ శాస్త్రాలు చదివిన విషయాలు లీలగా గుర్తుకు వచ్చే సరికి నాకు తెలియని ఆనందం కలగసాగింది.

ఇది జరిగిన వారం పది రోజుల తర్వాత అనుకుంటా తినడానికి ఏమీ దొరకకపోతే ఆకలి బాధను తట్టుకోలేక కోనేరులోని నీళ్లు కడుపునిండా త్రాగి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండగా మూడున్నర అడుగుల పొడవుతో తెల్లని శరీర కాంతి వెలుగులతో శ్వేత సర్పము నాకు ధ్యానం లో కనిపించి నన్ను కాటు వేయడానికి వేగముగా నా వైపు వస్తుంటే “స్వామి! నాకున్న బాధని తీర్చడానికి నీకున్న ఆకలిని తీర్చుకోడానికి నన్ను ఆహారం గా మార్చుకోవటానికి వస్తున్నావా స్వామి ధన్యుడను. ఇలాంటి వారి ఆకలి తీర్చడం కోసం నా శరీరము ఉపయోగపడుతుంది అంటే నేను మనస్ఫూర్తిగా నా ప్రాణాలు ఇస్తాను. స్వామి! నాకు ఎలాంటి చావు భయముగాని ప్రాణ భయముగాని మరణ భయం గాని లేవు. నా అంతట నేనే మీకు సమర్పించుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాంటి దోషం అంటదు. నన్ను స్వీకరించి నాకోసం నా ఆకలి తీరకపోయినా మీ ఆకలి తీర్చుకో” అని అనుకుంటూ ఉన్న సమయంలో అది దగ్గరికి వచ్చి చటుక్కున కుడి చేతి నా చిటికెన వేలు మీద కాటువేసి పోయినది. నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను. తెల్లవారేసరికి ఎవరో నన్ను తట్టి లేపుతున్నారని అనిపించి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఒక భక్తుడు కనిపించి మీరు చూస్తే బాగా ఆకలిగా ఉన్నట్టు గా ఉన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదం నా దగ్గర మిగిలిపోయింది. ఏమీ అనుకోకపోతే మీరు తీసుకుంటారా దానిని చూస్తూ వదిలిపెట్టి వెళ్ళలేక పోతున్నాను అంటూ వారు మాట్లాడకుండా నా చేతిలో అమ్మ ప్రసాదం పెట్టి వెళ్లిపోయాడు. అప్పుడు నాకు వెంటనే “అమ్మా! ఏమి లీల. నేను నువ్వు పెట్టిన ఆకలి పరీక్షలో విజయం పొందినాను కదా. నిన్న ఏమి పెట్టలేదు. బాగా ఆకలి ఇచ్చావు.ఈరోజు నాకు ఏమి ఆకలి అనేది లేకుండా చేసి ఆహారము ఇస్తున్నావు కదా. ఏమి నీ లీల తల్లి. నువ్వు నిజంగానే కన్న తల్లివి. నా ఆకలి తీర్చడానికి నువ్వు ఇంతగా కష్టపడి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.నా కోసం నువ్వు నీ కొండ దిగి వచ్చేటట్లుగా చేసినందుకు నన్ను క్షమించు తల్లీ. ఆకలి మాయ ఎంతటి మాయ శరీరానికి కారణం అవుతుంది కదా. శరీరం ఉన్నంతవరకు దైవానికి కూడా ఆకలి బాధలు తప్పవు కదా. అలాంటి ఆకలి బాధ నీకు తెలుసు కాబట్టి నా ఆకలి  తీరుస్తున్నావు” అనుకుంటూ ముఖము చేతులు కడుగుకోవడానికి దగ్గరలో ఉన్న కోనేరు వైపు వెళ్ళినాను.అక్కడ ముఖ ప్రక్షాళనం చేసుకుని నీరు తాగుతున్న సమయంలో ….

ఎన్నడూ లేనిది ఆ కోనేరు ఒడ్డున ఉన్న చిన్న పొదలు వంటి చెట్ల మధ్యలో చాలా అరుదుగా కనిపించే తెల్లటి శ్వేతనాగు కుబుసం విడుస్తూ కనిపించిం.ది దాని మీద కృష్ణ పాదాలు కనిపించినాయి. దాంతో నాలో తెలియని ఆనందం వేసింది. ఎందుకంటే నా సిద్ధ గురువు చెప్పినట్లుగా నాలో పాము కాటు లాంటి నిజము లాంటి కలలో నాలో  ఉన్న కుండలినీశక్తిని జాగృతం చేయడం జరిగినది. అది నిజమని తన రూపము సాదృశ్యముగా నాకు అగుపించినది. నేను ఎన్నో నెలలు నుండి ఈ ప్రాంతంలో ఉన్న కూడా నాకెప్పుడూ ఈ పాము కనిపించలేదు. అప్పుడప్పుడు తరచుగా నీటి పాములు బురద పాములు మాత్రమే కనిపించేవి. చాలా చాలా అరుదుగా కనిపించే శ్వేత నాగుపాము కనిపించేసరికి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆది నాగ శేషువు ఈ రూపంలో వచ్చినాడు అన్నమాట. నన్ను కాటువేసి నాలో కుండలినీ శక్తిని జాగృతం చేసినారు అన్నమాట. కుండలినీ శక్తి జాగృతి ఆరంభమైనది ఇకమీదట నాలో పన్నెండు చక్రాలు కూడా జాగృతి ప్రారంభమవుతుందని నా విశ్లేషణ బుద్ధికి తోచింది.మీకు కూడా ఇలాంటి అనుభవాలే కలిగి ఉన్నాయి కాబట్టి మీలో కూడా శక్తి జాగృతి అయినదని శుభ సూచన అన్నమాట. నాకు ఈ కోనేరులో శ్వేతనాగు కనబడితే అదే మీకు గుడిలో కనపడినది. నాకు కుడిచేతి చిటికెన వేలు మీద కాటువేస్తే మీకు కుడి చెయ్యి మధ్య వేలు మీద కాటు వేసింది.కాబట్టి మన ఇద్దరి లోని కుండలినీశక్తి జాగృతి అయినది. కంగారుపడకు. ఇది సాధన ఆరంభానికి శుభ సూచన అని మా సిద్ధగురు మాకు సూచన సూచించారు. అది నిజం అని నాకు అర్థం అయింది అనుకుంటుండగా అతడి నుండి నాకు ఇంకా ఎలాంటి సూచనలు అంద లేదు.

ఇంతలో తెల్లవారు అయినట్లుగా అనిపించినట్లుగా సూచనగా గడియారం అలారం మ్రోగింది కానీ విచిత్రంగా నిద్ర లేవ లేక పోతున్నాను.ఒళ్లంతా నొప్పులు. శరీరమంతా సూదులతో ఆక్యుపంచర్ చేస్తున్నట్లుగా అనిపించసాగింది. మనసంతా అశాంతిగా మారింది. శరీరమంతా ఏదో తెలియని బాధ. చాలా బద్దకంగా ఉంది. ఇక ఈ రోజు ఆఫీసుకు ఎగనామం అని బలపడగా లేచి వెళ్లి ఫోన్ చేసి సెలవు కావాలని చెప్పి ఎన్నడూ లేనిది బారెడు ప్రొద్దేక్కే దాకా లేవబుద్ధి కాలేదు. లేచినా బద్ధకంగా అనిపించి పడుకోవడం మళ్ళీ లేవటం మళ్లీ పడుకోవడం ఇలా వరుసగా మూడు రోజుల సెలవు మీద పడుకున్నాను.నాకు ఏదో తెలియని అనారోగ్య సమస్య వచ్చిందని మా ఆవిడ ఆందోళన చెందుతుంటే అప్పుడు నాకు టెలిపతితో చెప్పిన జిఙ్ఞాసి విషయాలు ఆమెకి చెప్పగానే అయితే మీరిద్దరికి యోగశాస్త్రంలో చెప్పినట్లుగా కుండలిని శక్తి జాగృతి అయినది అన్నమాట. అంటే ఒక రకంగా మీరిద్దరికి యోగ జీవితానికి నాంది ఆరంభమైనది.యోగ ప్రస్థానము మొదలైనది అన్నమాట. అయితే నేను కంగారు పడను. మీరు కూడా కంగారు పడవద్దు అంటూ నాకు ఎప్పుడూ ఇలాంటి పాము వచ్చి నన్ను ఎప్పుడు కాటు వేస్తుందో తద్వారా నాకు కుండలినీశక్తి జాగృతి ఎప్పుడు అవుతుందో అనుకుంటూ అంతా బాబా వారి దయ అనుకుంటూ వంట చేయటానికి వంట ఇంటిలోనికి వెళ్ళిపోయినది. 

ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది. మన జిఙ్ఞాసికి తన సిద్ధగురువు కనబడి కుండలిని శక్తి జాగృతి అవుతుందని వాడికి చెప్పగానే వాడు అర్థం చేసుకొని జరిగిన సాధన అనుభవాలు బేరీజు వేసుకుని ఒక అంచనాకి వచ్చినాడు. మరి నాకేమో జ్ఞాన దీక్ష గురువు వచ్చి ఇలాంటి సందేశం ఏమి ఇవ్వలేదు. అంటే నాకు కుండలిని శక్తి జాగృతి అయినదా లేదా ఎలా తెలుస్తుంది.ఎందుకంటే అనుభూతులు అనేది అందరికీ ఒక్కటే ఉండవచ్చును కానీ అనుభవాలు ఒక్కటే అవ్వాలని లేదు. నా అనుభవాలు సరిగ్గా జిఙ్ఞాసితోపోలి ఉన్నాయి అని అనుకొని ఊరుకోలేదు. లేదు! వాడికి వచ్చినట్లుగా నాకు ఏదైనా అది ఈ అనుభవాలు కుండలిని శక్తి జాగృతివే అని నమ్మకం వచ్చే సంఘటనలు జరిగే దాకా నేను ఈ విషయాన్ని నమ్మటానికి వీలులేదని అనుకొని యధావిధిగా నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాను.ఇలా రెండు వారాలు గడిచిన తర్వాత నాకు స్వయంభూ కుమారస్వామి క్షేత్రమైన పళని నుండి ఒక అంగుళం పరిమాణం ఉన్న కుమార మంగళ స్వామి విగ్రహం అక్కడ నుండి నా కోసం కొని నాకు తెచ్చి ఇచ్చినారు. నాకు అప్పుడు 50 శాతం మాత్రమే నమ్మకం వచ్చినది.మరి ఇలాంటి అనుభవాలు ఈపాటికే సిద్ది పొందిన మహాయోగులకు వారి జీవితంలో ఇది నిజమైతే జరిగి ఉండాలి కదా అనుకొని ఈ సత్యమును నిరూపించే సంఘటన కోసం ఎదురుచూస్తూ నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తుండగా ఒక వారం రోజుల తర్వాత మహారాష్ట్రలోని గణేష్ పురి ప్రాంత వాసి అయిన సద్గురువు నిత్యానంద బాబా గారి జీవితచరిత్ర గ్రంథము మా అన్నయ గారు నా చేతిలో పెట్టారు.
ఇది ఎందుకు వచ్చినదని గ్రంథ ప్రశ్న వేసినాను. అంటే మన మనస్సులో ఒక ప్రశ్న అనుకొని కళ్ళు మూసుకుని పుస్తకంలో ఒక పేజీ తెరచి కుడివైపున పేజీలో ఉన్న విషయం చదివితే మనము అనుకున్న ప్రశ్న కి సమాధానం వస్తుంది. ఇది 80% సరిగ్గా సరిపోతుందని ఇలా ఎన్నో రకాల స్వానుభవాల ద్వారా తెలుసుకున్నాను.ఇలాంటి సమయాలలో నేను ఎక్కువగా భగవద్గీత గ్రంథమును దగ్గరగా పెట్టుకొని ప్రశ్న అడిగి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరచి కుడివైపు ఉన్న శ్లోకమును చదువు కొని దానిని నాకు ఎలా అన్వయం చేసుకోవాలో అర్థం చేసుకునే వాడిని.ఇప్పుడు కూడా ఈ యోగి గూర్చి పుస్తకములో నాకు కలిగిన పాము తల పాముకాటు ధ్యాన అనుభవాలు దేనికి సంకేతము అని ప్రశ్నించగా ఆయన తన ప్రారంభ సాధనలో కృష్ణ పాదాలున్న నల్లటి కృష్ణ సర్పం కనబడిందని ఆ తర్వాత తన కుడి చేతి మధ్య వేలు మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవం కలిగిందని ఒక చిన్న శ్వేతనాగు దర్శనం దాని తర్వాత కుండలిని శక్తి జాగృతి అయినట్లుగా వారి సిద్ధ గురువు ధ్రువీకరించారని ఆ పేజీ సారాంశము. దీనిని చదవగానే నా మనస్సు గాలిలో తేలిపోయింది అని అనిపించసాగింది. వంటింట్లో నుంచి భోజనానికి రండి అని పిలుపు వచ్చే సరికి నేను వెళ్ళినాను.

 మరి మీరు కూడా వంట చేసుకోవడానికి లేదా భోజనం చేయటానికి వెళ్ళండి. భోజన కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత అందరూ కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం.

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*************************

గమనిక: చూశారు గదా. మనలో కుండలినీ శక్తి కదలికలు ఏర్పడినప్పుడు ఒక నాగుపాము తల కనబడుతుంది. అలాగే మన కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు అది వచ్చి కాటు వేసి వెళ్లిపోయినట్లు కనబడుతుంది. అది నిజముగా కాదు. కాని నిజం లాంటి కల వంటి ధ్యాన అనుభవము మనకి తప్పనిసరిగా కలుగుతుంది! తద్వారా శరీరమంతా మొద్దు బారిపోయి బద్ధకము ఆవరించును. కంగారు పడకండి. లేనిపోని మందులు వేసుకొని తీవ్ర అనారోగ్య సమస్యలు తెప్పించుకోకండి.అలాగే ఆరోగ్య చిట్కాలతో శరీరములో వాతమును పెంచుకుని అనారోగ్యం తెచ్చుకోకండి. 
యోగ సాధన అనేది కత్తిమీద సాము లాంటిది. దీనికి ఇరు వైపులా పదును ఉంటుంది. ఒకవైపు యోగ శక్తుల పదును మరోవైపు యోగమాయల పదును ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా నెట్టుకొని రావాల్సి ఉంటుంది. మనకి గురువులు సహాయ సహకారాలు కావలసి ఉంటుంది. వారి అనుగ్రహమును పొందవలసి ఉంటుంది.అది కూడా నిజ గురువుల సహాయం అని గ్రహించండి. నకిలీ గురువుల సేవలు చేసినంత మాత్రమున ఎలాంటి ఉపయోగం లేక పోగా యోగము కాస్త నిరుపయోగంగా మారుతుంది. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి అయిన దీక్షాదేవి కూడా ఇలాగే తనకి వచ్చిన గురు మంత్రమును సాధన చేస్తే పాముతల రావటం అలాగే పాము వచ్చి కాటు వేయటం అది కూడా ధ్యానం లో జరిగిపోయాయి. తద్వారా జాగృతి అయిన కుండలినీశక్తికి తట్టుకోలేక వారం, పది రోజుల పాటు మంచంకు అంకితమైనది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని యధావిధిగా సంసార బాధ్యతలు చేయటం ఆరంభించినది.కాలాలు,పాము జాతులలో తేడాలు ఉన్నప్పటికీ మా ముగ్గురికి కుండలిని జాగృతి అనుభవాలు దాదాపుగా ఒకే విధంగా కలిగి ఉన్నాయి. అనగా నాగు పాము తల అలాగే పాము కాటు వేయటం అలాగే నిజరూప దర్శనం కలగటం జరిగితే మీలో శక్తి కదలికలు ఏర్పడి జాగృతి అయినట్లుగా ఎలాంటి సందేహం లేకుండా గ్రహించండి. ఎవరి కోసం మీరు ఎదురు చూడనక్కరలేదు. మీ అనుభవాలు దీనితో సరిపోలితే అదే నాగుపాము నిజరూప దర్శనం ఇస్తే ఈ స్తోత్రమును పట్టించండి. 

శ్లో||నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర ఆదిశేష నమోస్తుతే!!

కుండలిని జాగృతి గురించి 

               మనలో కుండలినీ శక్తి జాగృతి ఎలా జరుగుతుందో ఎలా చేసుకోవాలని దీనికి ఏమి చేయాలని తికమక పడుతూ ఉంటారు. నిజానికి కుండలిని శక్తి జాగృతి అనేది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏ పని చేస్తే మన మనస్సు ఎందులోనికి లయం చెంది విపరీత ఆనందమును పొందుతుందో దాని వలన కుండలినీ శక్తి జాగృతి అవుతుంది అని గ్రహించండి.అంటే సినిమా పాటలు వింటుంటే మీ మనస్సు బాగా ఆసక్తి చూపే వాటి పాటలలో నీ మనస్సు లీనం అయితే ఇలా ఏ పాట అయితే మీ మనస్సు లీనం అవుతుందో అదే పాటను ప్రతి రోజు క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు వినండి. నెమ్మది నెమ్మదిగా మీ మనస్సు ఆ పాటయందు తన్మయత్వంలోకి వెళుతుంది. అప్పుడు ఏదో తెలియని ఆనంద స్థితి కలుగుతుంది.నెమ్మది నెమ్మదిగా మనశ్శాంతి పొందటం ప్రారంభమవుతుంది. అప్పుడు మీ వెన్నుపాము నాడుల కింద ఏదో కదులుతూ పైకి ఎగబాకుతున్న అనుభూతి మీకే తెలుస్తుంది.అంటే మీ వీపు వెనక వైపు క్రింద నుండి పైకి వెన్నుపూస నాడి లో ఏదో కదిలి నెమ్మది నెమ్మదిగా పైకి ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు ఒక పాము తల అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. అంటే మీకు కుండలినీ శక్తి జాగృతి అయినట్లే అన్న మాట. కొన్ని నెలల పాటు మీరు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా కనీసం 20 నిమిషాల నుండి 48 నిమిషాల వరకు ఒకే సిద్ధాసనంలో కూర్చుని చేసుకునే స్థాయికి వస్తే అప్పుడు వీపు వెనక క్రింద నుండి పైకి ఏదో శక్తి నెమ్మదినెమ్మదిగా ప్రవహిస్తున్నట్లుగా అనుభవ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీకు ధ్యానంలో నలుపు తెలుపు కృష్ణసర్పము కాటు వేసినట్లుగా  అనుభవం కలుగుతుంది. అంటే మీ కుండలిని కదలికలు ఏర్పడినట్లుగా ప్రకృతి మనకి అనుభవం ద్వారా తెలియజేస్తుంది అని గ్రహించండి.ఈ విధముగా ఈ రెండు రకాల ధ్యాన అనుభవాలు అనగా పాముతల కనిపించడం వలన కుండలినీ శక్తి కదలికలు అలాగే పాము కాటు వేయటం కనబడితే కుండలిని శక్తి  ప్రవాహము జరుగుతోందని అర్థం అని గ్రహించండి. ఈ విధముగా ఈ రెండు అనుభవాలు కలిగితే మీకు ఎటువంటి అనుమానమూ సందేహం లేకుండా కుండలినీశక్తి జాగృతి అలాగే ప్రవాహం మొదలైనదని గుర్తు .ఈ ధ్యాన అనుభవాలు ప్రతి యోగ సాధకులకు తప్పనిసరిగా కలగాలి. కలిగి తీరుతుంది.ఈ అనుభవాలు మీకు కలగనంత వరకు మీ కుండలినీశక్తి జాగృతి అవ్వలేదని గ్రహించండి. 

ఇక మీ మనస్సు దేనియందు తన్మయత్వం పొందుతుందో మీరు మొదట తెలుసుకోవాలి. చాలా మందికి అనగా సంగీతము దగ్గరే అనగా భక్తి పాటలు, మంత్రాలు, యుగళ గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాలు, ఓంకారము ఇలా వీటిని వింటూ ఉండటం వలన వారి మనస్సు తన్మయత్వంలో కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొంతమందికి సమాజ సేవ చేస్తున్నప్పుడు, మరికొంతమందికి విగ్రహారాధన చేస్తున్నప్పుడు, మరికొంతమందికి ఇతరులకు సహాయ సహకారాలు చేస్తున్నప్పుడు, మరికొంతమంది వారి ఇష్టదేవత మంత్రారాధన చేస్తున్నప్పుడు, మరికొంతమందికి జపతపాలు, ఉపాసనలు, హోమాలు చేస్తున్నప్పుడు, మరికొంతమందికి పాటలు వింటూ గెంతులు వేస్తున్నప్పుడు, మరికొంతమందికి నాట్యం చేస్తున్నప్పుడు, మరికొంతమందికి ఆసనాలు వేస్తున్నప్పుడు, కొంతమందికి స్థిర ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా వారి మనస్సు తన్మయత్వం స్థితిని బట్టి వారి కుండలినీ శక్తిని జాగృతం అవుతుంది. మీకు తన్మయత్వం  తెలియని పక్షంలో ఒక నిజ భౌతిక గురువును పట్టుకొని వారి నుండి మీ ఇష్ట దైవం యొక్క మూల మంత్రమును గురు మంత్రముగా పొంది దానిని మంత్ర సిద్ధి పొందేదాకా చేయండి.అంటే మీ మనస్సు ఈ మంత్రము నందు తన్మయత్వం చెందడం అన్నమాట. అంతెందుకు రామకృష్ణ పరమహంస ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తున్నప్పుడు ఆయన మనస్సు తన్మయత్వంలోకి వెళ్ళినది. అప్పుడు ఆయనకి ఆనాటి నుండి కుండలిని శక్తి జాగృతి అయినది.ఏ విషయం దేని దగ్గర మీ మనస్సు తన్మయత్వం పొందుతుందో మీకే తెలియాలి. కొంతమందికి బొమ్మలు గీస్తే, మరికొంతమందికి కవితలు రాస్తే, మరికొంతమంది పాటలు పాడితే, మరికొంతమందికి పాటలు వింటే ఇలా మీ మనస్సు తన్మయత్వ స్థితి పొందటానికి 84 లక్షల మార్గాలున్నాయని గ్రహించండి. అందులో మీ మనస్సు దేనికి తన్మయత్వం పొందుతుందో మీరు తెలుసుకుంటే సగం యోగసాధన ప్రారంభమైనట్లే అని గ్రహించండి.అలాగే మాకు మొదట్లో మంత్రాలు వింటుంటే చిన్నపాటి తన్మయత్వం కలిగేది. అటుపైన సినిమా పాటలు, విరహ గీతాలు, ప్రేమ పాటలు ఇలా వీటిని వింటుంటే తన్మయత్వంలోనికి వెళ్ళేది.

అటుపై షిరిడి సాయి బాబా వారి మధ్యాహ్న హారతి వింటుంటే నా మనస్సు తన్మయత్వంలో కి వెళ్ళేది.అప్పుడు వెన్నుపాము వెనుక ఏదో శక్తి కదులుతున్న అనుభవం అయినది. ఆ తర్వాత వెంటనే శవాసనంలో పడుకొని శివపంచాక్షరీ మంత్రమును 48 నిమిషాల పాటు కదలకుండా వదలకుండా చేయటం చేసేవాడిని.అటుపై శబ్దనాదం వినటం ప్రారంభించే వాడిని అనగా నాలో వచ్చే వివిధ రకాల నాదములను నెమ్మది నెమ్మది గా వినటం అభ్యాసం చేసుకుంటూ వస్తున్న సమయంలో క్రింద నుండి పైకి ఏదో శక్తి ప్రవాహం ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి పొందటం తరచుగా జరిగేది. ఆ తర్వాత పాము తల కనిపించడము కొన్ని నెలలకి ఒక నల్లని కృష్ణసర్పం నా మధ్యవేలు మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవాలు కలగటం నాలో కుండలిని శక్తి జాగృతి అయినది అని నాకు అర్థమైనది. ఇలా నా సాధన ప్రారంభ స్థితి జరిగినది. ఇలా అందరికీ జరగాలని లేదు.ఎందుకంటే నాకు తీపి అంటే ఇష్టం మరి మీకు కారం లేదా మసాలాలు ఇష్టం ఉండవచ్చు కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మీ సాధనలో ఎవరిని అనుసరించవద్దు. అనుకరణ చేయవద్దు. మీ మనస్సుకి బాగా ఇష్టమైన దానిని మాత్రమే చేయండి.అది మీ మాట విని మీకు ఆధీనం అవుతుంది. ప్రక్కవాడికి అలా చేస్తే కుండలినీశక్తిని జాగృతం అయ్యింది అని అది మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ మనస్సు చేత చేయించిన ఎన్ని సంవత్సరాలు గడిచిన మీరు మీ సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది అని గ్రహించండి.కాబట్టి ఙ్ఞానిని అనుకరణ చేయవద్దు. అఙ్ఞానిని అనుసరణ చేయవద్దు.

ఇలా చేస్తే ఈ రెండూ కూడా చాలా ప్రమాదం అని గ్రహించండి. ఎందుకంటే ఙ్ఞానికి కనిపించే విశ్వమంతా అసత్యమని జ్ఞాన అనుభూతిని పొందటం వలన ఆయన ఆచారవ్యవహారాలు పాటించడు.ఎందుకంటే వీరికి సర్వమూ బ్రహ్మమయంగా కనబడుతోంది. అదే అజ్ఞానికి తనకున్న బద్దకము వలన, సోమరితనం వలన, అనుమానం వలన, సందేహం వలన దేవుడిని నమ్మడు.దేవుడు లేడు అనే నాస్తిక వాదంలో ఉంటాడు. అందువలన ఇతనిని అనుసరిస్తే మనకి లేనిపోని ప్రమాదం అనగా మెట్టవేదాంతము అబ్బే అవకాశాలున్నాయని గ్రహించండి.అందువలన సాధనామార్గం ఎవరి దారి వారిది గా ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండాలి. ఒకరిని అనుసరించటం లేదా అనుకరణ చేయటం మంచి పద్దతి కాదని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.ఆ తర్వాత మీ ఇష్టం. నీ మనస్సు దేనియందు తన్మయత్వం పొందుతుందో దానిని ప్రతి రోజు మీకు వీలు ఉన్న సమయం లో చేసుకోగలిగితే ఖచ్చితంగా నమ్మకంగా మీ శక్తి జాగృతి అవుతుంది అని నేను ఘంటాపధంగా చెబుతున్నాను.తన్మయత్వం  అంటే అదేదో అనుకోకండి. మీరు పాట వింటున్నప్పుడు ఆ పాటయందే నీ మనస్సు లగ్నం అవ్వటం అన్నమాట. లగ్నము అనగా స్థిరమైన ఏకాగ్రత పొందటం.ఏకాగ్రత అంటే వేరే ఆలోచనలు లేకుండా అదే పాట మీద మీ మనస్సు ఉండటం అన్న మాట. మనస్సు వినే స్థితిలో ఉన్నప్పుడు ఏదో తెలియని ప్రారంభ సంతోషం స్థితి పొందటమే తన్మయత్వం అంటారని తెలుసుకోండి.మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే మీ పాట వింటున్నప్పుడు మీకు తెలియకుండా కాళ్లు, చేతులు, నడుము ఊగడం చేస్తుంటే అది ఆ పాటయందే తన్మయత్వం  పొందటం అంటారు.ఇలా ఈ తన్మయత్వం మీకు తారాస్థాయికి చేరుకునే స్థితి ఉంటే అంటే పాటలో మీరు పూర్తిగా లీనమైతే మీకు బయట వారి మాటలు వినిపించవు.బయట శబ్దాలు వినిపించకపోవటం పరిసరాలలో ఏమి జరుగుతుందో గమనించని స్థితిలో మీరుంటే అదే తన్మయత్వం తారాస్థాయికి చేరుకోవడం అవుతుంది. అంటే మీ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళటం అన్నమాట. అప్పుడే మీ కుండలిని శక్తి లో కదలికలు అటుపై జాగృతి ప్రారంభమవుతాయని తెలుసుకోండి.తద్వారా మీ మనస్సు దేనియందు వేటి యందు ఏ పని యందు ఏ సాధన మార్గమునందు లీనం అవుతుందో తన్మయత్వం పొందుతుందో స్థిరమైన ఏకాగ్రత పొందుతుందో అటుపై మనోనిశ్చలత స్థితి పొంది పరమ ప్రశాంతంగా ఉండటమే సంపూర్ణ మోక్ష స్థితి అవుతుంది. ఇదియే సాధన మార్గం విధి విధానం అని తెలుసుకోండి.

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. kundalini shakti jagruthi ela avthundi, ayyindani ela thelsukovali ane vivarana
    bagundi meeru jan nunchi June varaku prathi roju meeku em em anubhavalu kaligayani vaati valla
    meeku kaligina aalochanalu, bhayalu.... ela adigamincharo cheppatam bagundi. Kundalini jagruthi
    aythe mundu guru mantra japam valla avvatam leda guru brukti sthaanam nandu cheyi petti
    cheyatam leda kalla tho chudatam ela ayna avvochu ani guruvu maatram raavalani thelipatam,
    meeku dhyaanam lo paamu kanipinchatam.. adi kanipinchatam tho bhayam modalavvatam alage aa
    paamu eppudaithe kaatu vesthundo appudu kundalini jagruthi ayyindi ani thelusthundi ani dhaaniki
    konni rojulu emi cheyavudhi kakunda badha manga untundani, jignyasi gaariki kuda alane
    swethanagu kanipinchatam okariki chitikena velu marokariki madhya velu kaatuveyatam eddari
    vishayam lo ilage jaragatam, ika mee yogadarshanam book lo vivarana valla praanashakti enti,
    shatchakralu ekkada untayai grandhulu alage guruvu ochinapudu maatrame sushumnanaadi yandu
    praanashakti pravahisthu ee chakralanu shudhi, vibedhana, aadeheenamu, swadheenamu, jagruthi,
    kundalini jagruthi aa samayallo sadhakudiki em em sthithulu kaluguthayo shatchakrala mayalu, avvi
    ela daatukovalo ani thelupatam, saadhakudu chakralu balaheenapadithe anarogyalu em
    kaluguthayi, Aa samayamlo elaanti jagarthalu theesukovalani chaala vivaranga theliparu.... Mirror
    dwara ye chakramulo unnado thelusukovatam ika aa chakralu aadenam avvataniki okko chakraniki
    enni janmalu padthundani...... Chakrala shudhi, aadheenam, jagruthi ante vivaranga cheppatam
    bagundi....

    రిప్లయితొలగించండి