అధ్యాయం 24

శుభవార్త:

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....

ఆత్మ అంటే…..

అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది? ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు. దాదాపు చాలా మందికి ఆత్మ అంటే తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు! కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక… సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక … దానికి నానార్ధాలు చెబుతూ…. చాలామంది వారు అయోమయం అవడమే కాక ….అందరిని అయోమయంలో నెట్టేస్తున్నారు! దానితో అసలు ఆత్మ అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవాలని ఆలోచన మా ఇద్దరిలోనూ మిగిలింది! దీనిని గురించి శాస్త్ర, పురాణ, ఇతిహాసాలే కాకుండా సైన్సు, విజ్ఞానశాస్త్రాల్లో ఏమైనా చెప్పినారో అని పరిశోధన చేయడం ఆరంభించాము! వివిధ రకాల పుస్తక, గ్రంధాలు చదవడం ప్రారంభించినాము! ఆత్మ మీద పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయాను! ఆత్మకి సంబంధించి నేను రాసుకున్న నోట్స్ నీకేమైనా ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగినది! ఎందుకంటే యోగ సాధనలో కూడా ఆత్మ జ్ఞానము, ఆత్మ నివేదన భక్తి, ఆత్మ దర్శనం, ఆత్మ జ్యోతి, ఆత్మసాక్షాత్కారం లాంటి మాటలు వినబడతాయి! ఇది తెలియాలంటే అసలు ఆత్మ అంటే ఏమిటో మీకు తెలియాలి కదా! కానీ ఆత్మ పరిశోధన అనేది ఒక అంతులేని, కనిపెట్టలేని, పరిధిలో అవధులు లేనిదని నాకర్థమైంది!

ఆత్మవాదుల దృష్టిలో ఆత్మ అనేది....

ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.
ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే "అంతరాత్మ" అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిష్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక. ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. మరి మానవుల ఆలోచనావిధానం లోనూ, ఆచరణావిధానం లోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? సాధారణంగా మానవులు రూపంలోకానీ, చేష్టలలో కానీ, ఆలోచనా విధానంలోకానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా, అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగ, ఒకే పోలికతో ఉంటారు. తేడా అల్లా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు? అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం "మనస్సు". ఇది కూడా మనలో ఆత్మచేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది. ఈ మార్గం సమయాను సారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు, ఎంత శాతం వరకూ అనుసరిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంది. మరి, ఆత్మ, దేనికి లోబడక, ఏ పరిస్థితులకూ, సమయానికీ కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషులలో తేడాలు, ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువనిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంటాయి. వివిధ గ్రంథాలలో ఆత్మగురించి మరియు పరమాత్మ  గురిమ్ఛి !
మనలోభావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనస్సు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.
ఆ మహావాక్యాలు :-
ప్రజ్ఞానం బ్రహ్మ-  ఐతరీయోపనిషత్తు - ఋగ్వేదము
అహం బ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదము
తత్ త్వమసి – ఛాందోగ్యోపనిషత్తు - సామవేదము
అయమాత్మా బ్రహ్మ - ముండకోపనిషత్తు - అధర్వణవేదము
ఈ మహావాక్యాలు ఆత్మ తత్వాన్ని సూచిస్తున్నాయి.
అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయే బ్రహ్మము)
ఇక్కడ ఆత్మ, బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది. ఇందుకు సముద్రము, అందులోని కెరటము దృష్టాంతముగా తీసికొన్నారు. ఒకో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది. కాని ఆకెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి, సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది.
ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము. ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండివిముక్తి) సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి!
ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు పరమేశ్వరుడు.  కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం   ఉంటుంది.   సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్ట మైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.
హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం (ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.
అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మార్గాన పయనించేవారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.


భగవద్గీత :

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి 'పరమాత్మ'అని, జీవులలో ఉండే తన అంశను 'జీవాత్మ'అని వివరించాడు. ఈ జీవాత్మే 'ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక "అహం బ్రహ్మస్మి" అయమాత్మ బహ్మ" అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.
ఆయుధాలు, అగ్ని, వాయువు, నీరు మొదలైనవి ఏవీ ఆత్మను సంహరించలేవు. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు మొదలైన పంచ భూతాలతో చేసి ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటితో పాటు ఆధునిక యుగంలో అగ్నిని కూడా జోడించి తయారు చేస్తున్నారు. అణ్వాయుధాలు ఈ కోవకు చెందినవే. అయితే గతంలో భౌతిక పదార్థాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు. పూర్వం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని జ్వలింపజేస్తే దానికి బదులుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించి జలధారలతో వాటిని ఆర్పివేసేవారు. ఆధునిక సైన్సులో దీనికి సంబంధించిన ఙ్ఞానం కనిపించదు. తుఫాను లాంటి ఆయుధాల గురించి శాస్త్రవేత్తలకు అవగాహన కూడా ఉండదు.

ఆత్మను నశింపజేయడం అసాధ్యం. మాయాశక్తికి లోబడి ఉండటం వల్ల అఙ్ఞానంతో కూడుకున్న ఆత్మ ఏ విధంగా విడదీయబడుతుందో మాయావాదులు వివరించలేరు. ఎందుకంటే జీవులందరూ అణుమాత్ర రూపులైన సనాతన ఆత్మలు అయినప్పటికీ మాయా ప్రభావితులై భగవంతుని సాహచర్యం నుంచి విడిపోయారు. నిప్పు కణికలు ఏవిధంగా అయితే పైకి లేచినప్పుడు, దానికి దూరం కాగానే ఆరిపోయినట్టు, భగవంతునిలోని సనాతన అంశాలైన జీవులు వాస్తవానికి తమ ఉనికిని కోల్పోయిన జీవాత్మలు. వరాహ పురాణంలో జీవులను భగవంతుని నుంచి విడిపోయిన అంశలుగా వర్ణించారు. భగవద్గీత ప్రకారం కూడా ఆత్మ నిత్యం, శాశ్వతం. కాబట్టి అఙ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందినప్పటికీ ‘జీవులు తమ ప్రత్యేకమైన ఉనికిని పోగొట్టుకోవు’అనడానికి గీతోపదేశం చక్కటి తార్కాణం. కృష్ణుడి ద్వారా పొందిన ఙ్ఞానంతో అర్జునుడు ఙ్ఞానవంతుడయ్యాడే గాని భగవానుడిలో ఐక్యం మాత్రం కాలేదు. 

ఇదే విషయాన్ని పార్థుడుకి పరమాత్ముడు బోధించారు. ‘ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడూ ఇద్దరును అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యం, శాశ్వతం, పురాతనం, శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితం, నిత్యమనియు జననమరణములు లేనిది, మార్పులేనిది, శాశ్వతమైంది, సర్వవ్యాప్తిచెందింది, చలింపనిది, స్థిరమైంది, సనాతనమైనది. ఇంద్రియాలకు కనిపించనిది... మనస్సునకు అందనిది. వికారములు లేనిది’ అని భగవానుడు తెలిపాడు.
భగవద్గీత ప్రకారము చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.

ఖురాన్ :
·         రాత్రివేళ మీఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు, పగటివేళ మీరుచేసే పనులు గమనించేవాడు దేవుడే. (6:60)
·         మరణ సమయంలో ఆత్మలు స్వాధీనం చేసుకునేవాడు దేవుడే (39:41)


ఆత్మ మీద వివిధ అభిప్రాయాలు:

మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం - నరకం లాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరినీ ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది. అయితే, అది ఇప్పటికీ ఓ రహస్యంలానే ఉండిపోయింది. జీవి మరణానంతరం ఆత్మ కొంతసేపు విశ్రాంతి స్థితిలో ఉంటుందట. ఆ తర్వాత మరో కొత్త జన్మ ఎత్తుతుందట.

-       ప్రాచీన బాబిలోనియా, ఈజిప్టుల్లో మరణానంతరం శవాలకు లేపనాలు పూసి, శవపేటికల్లో దాచిపెట్టేవారు. ఆత్మ మళ్లీ వెనక్కి వస్తుందని, అదే శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు.

-       పరమహంస యోగానంద ఆత్మకథ ‘యోగి కథామృతం’లో కూడా ఈ ఆత్మ గురించి ప్రస్తావన ఉంది. దానిప్రకారం మరణం తర్వాత అన్ని ఆత్మలు సూక్ష్మలోకానికి చేరతాయి. అక్కడ ఆధ్మాత్మిక దృష్టి, పుణ్యమూర్తులను హిరణ్యలోకానికి పంపుతారు. అక్కడకు వెళ్లిన వారు పుణ్యజన్మలు ఎత్తి ముక్తి పొందుతారు.

-       ఆత్మల గురించిన చర్చ ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఆత్మలు ఉన్నాయంటారు. మరికొందరు శరీరం ఉన్నంత వరకే ఆత్మ ఉంటుందంటారు. కానీ, ఆత్మ అనంతమైనది, అమరమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రార్థనల్లో ఆత్మ నిక్షిప్తమై ఉంటుందని రుగ్వేదంలో రాసి ఉంది.

-       ప్రాచీన కాలం నుంచి ఆర్యులు కూడా స్వర్గం - నరకం అనే భావనలను నమ్మేవారు. బ్రహ్మలోకం ఉంటుందని విశ్వసిస్తారు. ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వారు అన్వయించుకుంటారు. కానీ, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఎక్కడా ఆధారాలు లేవు.

ఇది అజ్ఞానపు ఆలోచన! ఎవరో ఒకరు తెలిసితెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనస్సులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనస్సులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..? మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు "ఎవరో ఒక మహా పురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవారిలో చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు.

ఎవరికీ తెలియదు. ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్ళకు  కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు! గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని, చాలా శాస్త్రాలఅధ్యయనం చేయడం వలనగాని, ఎన్నో గూడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని, ఆత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

భగవద్గీతలో ఇలా.. ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు. ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే.

నాశనం లేనిది.. ఏలాగంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పులేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది.

( 2:19-25) ఉపనిషత్తులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.ఆత్మ ప్రకాశం జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మంను ప్రకాశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం అది ఈ శరీరములోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు (చుక్కలు) వెలుగు నీయవు. మెరుపులు కూడ కాంతి నీయవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ ఉన్నది.

స్వయం ప్రకాశితం స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మనః శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు. ఆత్మ అంటే ఒక శక్తి. మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది. సంపూర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని, నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం.


****************
కాని తత్వవేత్తల దృష్టిలో ఆత్మ ఉందా?

పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు! కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మేవాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. ఆత్మ ఉందా? ఉంటే శాస్త్రీయంగా నిరూపితమయిందా? పునర్జన్మ వుందా? పరకాయ ప్రవేశం సాధ్యమా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరినీ ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది. 

అయితే ఉన్నదాన్నే ఉన్నదన్నట్లు శాస్త్రీయంగా ఋజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషిస్తారు. ఉన్నదనుకొన్నది ఏ విధమైన పరిశోధనల ద్వారానూ ఋజువు కానప్పుడు ఆ ఉన్నదనుకొన్నది కేవలం అబద్దమని శాస్త్రం చెబుతుంది. దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది. ఉన్నదనుకొన్నదేదీ? దాని లక్షణాలు ఏ విధంగా వున్నాయనుకొంటున్నారు? వంటి ప్రశ్నలకు వచ్చే జవాబుల ఆధారంగానే ఉన్నదనుకొంటున్నది ఉందా లేదా అని ప్రయోగాలు చేస్తారు. అదే శాస్త్రీయ పద్దతి. ఆత్మ కూడా ఈ కోవలోకే చెందింది.

'ఆత్మ' అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ వుందాలేదా అన్న విషయం విదితం అవుతుంది. మనం విన్న కథలు, పురాణాలు, ఉపదేశాలు, విశ్వాసాలు ప్రకారం 'ఆత్మ' అనేది ప్రతి జీవిలోనూ ఉన్న జీవానికి ప్రతినిధి. 'ఆత్మ' అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే. పని చేస్తున్న సెల్‌ఫోన్‌లోని పనితనానికి, జీవంతో వున్న మీరు, నేను మనలోని జీవన కార్యకలాపాలకి కాసేపు సంధాని ద్దాం. బాగా చార్జింగ్‌ అయిన సెల్‌ఫోన్‌ ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్నో కార్యకలా పాల్ని అది చేస్తుంది. అది నిర్వర్తించే కార్యకలాపాలు, పనులు, అనువర్తనాలు అన్నింటిని కలగలిపి 'పనిచేస్తున్న' సెల్‌ఫోన్‌ అంటాము. ఎవరయినా 'నీ సెల్‌ఫోన్‌ పనిచేస్తోందా? పాడయ్యిం దా? అంటే మనం ఏమంటాము?' 'పని చేస్తోంది' అంటాము. లేదా 'పనిచేయడంలేదు పాడయ్యింది' అంటాము. ఓవరాల్‌గా ఫోన్‌ పని చేయడాన్ని 'ప్రాణి జీవం'గాను ఏ పని చేయని స్థితిని 'మరణం'గాను భావిద్దాం. మొబైల్‌ ఫోన్‌లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది. నడుస్తుంది, మాట్లాడుతుంది, ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఆలోచిస్తుంది, పడుకొని మళ్లీ లేస్తుంది, కోపిస్తుంది, నవ్వుతుంది. ఇవన్నీ చేసే ప్రాణిలో ఓవరాల్‌గా 'జీవం వుంది'అంటాము. 

సెల్‌ఫోన్‌లోని పదార్థాల, నిర్మాణాల, అమరికల, సర్క్యూట్ల, విద్యుత్ప్రవాహక, కాంతి విద్యుద్ధర్మాల, యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్‌ఫోన్‌ అన్ని విధాలయిన సంక్లిష్ట కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. అందుకే సెల్‌ఫోన్‌ 'పనిచేస్తోంది' అంటాము. మరి ఆ పని దేనివల్ల వీలయ్యింది. కేవలం బ్యాటరీల వల్లనా? అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెల్  ఫోన్ లాగా పని చేయదు కదా! మరి సెల్‌ఫోన్‌ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ సెల్‌ఫోన్‌లోని తెర మాత్రమే కారణమా? మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే? మరి తెర, బ్యాటరీలు రెండూ వుంటే సెల్‌ఫోన్‌ పనిచేస్తుందా? లోపలున్న ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు మాత్రమే సెల్‌ఫోన్‌ను పనిచేయిస్తున్నదా? ఆ ఐసిబిని తీసుకెళ్లి జామెట్రీ బాక్సులో పెడితే ఆ జామెట్రీ బాక్సు సెల్‌ఫోన్‌ లాగా పనిచేస్తుందా? పోనీ ఆ జామెట్రీ బాక్సుపైన సెల్‌ఫోన్‌ తెరను, మరో పక్క బ్యాటరీలను పెడితే అపుడయినా అది సెల్‌ఫోన్‌ అవుతుందా? అలాగే తల మాత్రమే జీవం కాదు, గుండె మాత్రమే జీవం కాదు. కానీ గుండె లేకుండా జీవంలేదు. తెరలేకుండా సెల్‌ఫోన్‌ లేదు. కానీ తెర మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. బ్యాటరీ లేకుండా సెల్‌ఫోన్‌ పనిచేయదు. కానీ బ్యాటరీ మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. అలాగే తల లేకుండా మనిషి లేకున్నా తల మాత్రమే మనిషి కాదు. ఊపిరితిత్తులు లేకుండా మనిషి జీవంతో వుండడు. కానీ ఊపిరితిత్తులు మాత్రమే జీవంతో ఉన్నాయని కాదు. 

కాబట్టి ఎన్నో కణ జాలాల, శరీరభాగాల, అవయవాల, జీవ రసాయనాల, జీవ భౌతిక వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి. ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి జీవంతో వుండడు. లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో వుండడు. అంటే 'జీవం' అనే పదం ఏక వచనమే అయినా జీవం ఒక వస్తువో, ఒక నిర్థిష్ట పరికరమో హద్దులు, పరిమాణాలు వున్న శిల్పం కాదు. 'దేశం' అన్న పదము ఏకవచనమే. కానీ దేశమంటే ఒక వస్తువా? 'ప్రభుత్వం' అన్న పదమూ ఏకవచనమే. కానీ 'ప్రభుత్వం' అంటే ఒక కంప్యూటరా? అలాగే జీవం అనేది కూడా సంక్లిష్ట పదార్థిక, వివిధ శక్తి వినిమయాల, భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ. అయితే 'ఆత్మ' వాదులు మనిషి లేదా జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఆ వస్తువుకు రూపం వుండదు. 'జీవం' వున్న స్థితికి కూడా రూపం వుండదు. 'ఆత్మ'కు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు. జీవం అన్న స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు వుండవు. 'ఆత్మ'కు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదంటారు. 'జీవం' అనే స్థితికి కూడా నిర్ధిష్ట ద్రవ్యరాశి వుండదు. ఇలా సంక్లిష్ట ధర్మాల, నిర్మాణాల, వ్యవస్థల, రసాయనాల, యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా 'జీవం' అన్న పదాన్ని పరిగణిస్తాము. అదే 'జీవం' అన్న పదానికి 'ఆత్మ' అన్న పదాన్ని పర్యాయ పదంగా వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. వచ్చిన గొడవల్లా అక్కడ కాదు. కానీ 'ఆత్మ'వాదుల ప్రకారం 'ఆత్మ' బరువు, హద్దులు, రూపంలేని ఓ నిర్దిష్ట పరికరం. అది చెంబులో నీళ్లున్నట్లు (ఆ నీళ్లకు బరువు ఉండదనే విధంగా, ఆ నీళ్లకు ఘన పరిమాణం వుండదనే విధంగా, ఆ నీళ్లు మంటలో పోసినా ఆవిరి కావన్న విధంగా) వుంటుంది. ఆ చెంబులో నీళ్లను మరో చెంబులోనో, బకెట్లోనో, తొట్టిలోనో పోసే విధంగా 'ఆత్మ' ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకొంటుంది. ద్రవ్యరాశి, కాలం, రూపం (స్థల విస్తారం) అన్న రాశులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం (ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి గానీ, రూపంగానీ, కాలానుగుణ వ్యక్తీకరణ గానీ, విద్యుదావేశం గానీ ఉండితీరాలి. లేదా కొన్ని గానీ, అన్నీ గానీ వుండాలి) ఈ నిర్వచనానికి 'ఆత్మ' వాదుల 'ఆత్మ' పొసగదు. 'కుక్క' అంటే ఫలానిది అన్న తర్వాత ఓ రూపానికి తోక వుండకుండా, శరీరం వుండకుండా, కాళ్లు ఉండకుండా, నోరు ఉండకుండా, మొరగకుండా, చెవులు లేకుండా ఉంటే ఆ రూపాన్ని 'కుక్క' అనలేము. అలాగే ఓ 'వ్యవస్థ'కు రూపం, స్థలం కాలానుగుణ పదార్థిక పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థే లేదన్నది శాస్త్రం. కాబట్టి 'ఆత్మ' అనేది కూడా లేదు. ఎందుకంటే 'ఆత్మ' వాదులు ఆపాదించిన ధర్మాలున్న వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు. ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకొంటుందన్నది వారి వాదన. 'ఎ' అనే జీవిలో 'ఆత్మ' వుంది. అది బయటపడితే 'ఎ' మరణించినట్లు అర్థం. అది 'బి' అనే పదార్థంలోకి వెళితే 'బి'లో జీవం వున్నట్లు అర్థం. 'బి' అనే రూపం సిద్ధంగా లేకుంటే 'ఎ' నుంచి బయటపడ్డ 'ఆత్మ' కొంతకాలం 'దయ్యంగా' వుంటుంది. లేదా మరో కుక్క కడుపులోనో, స్త్రీ గర్భంలోనో ఉన్న 'బి' పిండంలోకో వెళ్లి 'బి' అనే జీవిగా జన్మిస్తుంది. ఇదే 'ఎ' జన్మ 'బి' జన్మగా పునర్జన్మించినట్లు వారివాదన. 

ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక (ద్రవ్యరాశి, స్థలం, కాలానుగుణ పదార్థిక రూపం, విద్యుదావేశాల ప్రోదిక్త రూపం DNA (Deoxy Ribonucleic Acid). లేదా కనీసంలో కనీసం RNA (Ribo Nucleic Acid) అయినా వుండాలి. DNA లేదా RNA లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు. నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు లేవు. ఉన్నట్లుండి ఓ శిల్పంలోకి ఆత్మ వెళ్లడం వల్ల శిల్పం జీవంతో వున్న శిల్పంగా మారడంలేదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు వున్నాడు. ఎన్నడయినా మట్టిరాయి మాట్లాడిందా? కానీ మట్టి రాయి రూపంలో వున్న జీవులు వున్నాయి గానీ అందులో మట్టి రాయిలాగా ముద్దగా లేదే. అందులో కణాలు, కణాల్లో కణాంగాలు, కణాంగాల్లో ధర్మాలు, రసాయనాలు, ద్రవాలు, అణువులు, అణువులలో పరమాణు పొందికలు, పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకు ఉండాలి? ఆ నిర్మాణాల్ని అటూ యిటూ కదిపితే ఆ 'ఆత్మ' (జీవం) ఎందుకు పారిపోవాలి? (జీవి మరణించాలి?) మంటలో మండనిది, నీళ్లలో తడవనిది లేశ మాత్రం పొటాషియం సైనైడు పడగానే పారిపోయే పిరికిపందగా ఎందుకుంది? 'ఆత్మ'కు మార్పు లేనట్లయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు వస్తున్నాయి? బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది. తోక తెంచుకున్న బల్లి కదులుతుంది. బల్లి తోకలోని కదలికలకు కారణమైన ఆత్మ ఎవరిది? తోక తెంచుకున్న బల్లి కదలికలోని ఆత్మ ఎవరిది? ఆత్మను కత్తితో కోయలే మన్నారు కదా! అది ఎలా విభజించబడింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు రవంతయినా ఆమోద యోగ్యమై న సమాధానం ఆత్మవాదులు యివ్వరు. 'ఆత్మ' అన్న ఆలోచనకు, నిర్వచనానికే అస్తిత్వంలేనపుడు, ఆత్మల బదలాయింపు తో జరుగుతాయన్న 'పునర్జన్మ' అన్న భావన పూర్తి అసంబద్ద ఆలోచన. పరకా య ప్రవేశం అన్న దానికీ అర్థం పర్థం లేదు.

**********

ఆత్మను చూడగలమా?

శాస్త్ర వచనము అలాగే సాక్షాత్కారవాదము ప్రకారము ఆత్మాన్వేషణ ద్వారా ఆత్మను చూడవచ్చును! మరి ఆత్మాన్వేషణ అంటే ఏమిటి? అనగా గురుదేవులు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారంటే… వ్యక్తి సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలంటే లోపలికి దూకాలి, ఈదాలి, వెదకాలి, ఆల్చిప్పలను పట్టాలి. అప్పుడే కొన్నైన ముత్యాలు లభిస్తాయి.

అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి అంటే భగవద్గీత ప్రకారము:
" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.

బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః
బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. 

ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం. అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. ఈ దు:ఖము పోవాలంటే పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.అనగా ఆత్మ సాక్షాత్కారము, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము", అద్వైతుల ప్రకారము " చక్కెర గా మారిపోవడము" అని అర్థము.

దీనికి అసలు మనకు లోచూపుకావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి చూచి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు. తెలియదంటున్నవాడు, తెలిసి తెలియనట్లు ఉన్నదన్నవాడు, తెలుసుకుంటున్నానన్న వాడు ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనటం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్నా తనతో తాను ఉంటున్నాడు.

కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు. సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటిబొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు.

వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని దర్శిస్తున్నాడు. ఆ కారణంగా పైపైన జరుగుతున్న విషయాలను అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభవమే, ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన మానవతావాదం, శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.


ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే! ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వల్ల సాధ్యమయ్యేదే. సర్వత్రా ఆత్మనీ దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగుణాలు లేవు. అనేకం లేవు. ఏమీ లేవు. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది. ఆనందం స్వభావమవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు.
ఎన్ని అలలు పుట్టనీ, ఎన్ని కెరటాలు ఎగిసిపడనీ, ఎన్ని తుంపరులు తాకనీ, తాను మాత్రం అచలుడై ఉంటాడు. కేనోపనిషత్ ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది. సాధ్యమైతే, నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది. ఆత్మను ఎరిగినవాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడు అవుతాడు. ఆత్మను ఎరుక అవుట సాధనతోనే సాధ్యమౌతుంది.

ఆత్మనే సర్వాంతర్యామి అనే విషయం తెలుసుకున్నవారు, ఆత్మ రూపంలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంత శక్తిలో నుండే పరిణమిస్తూ ఉద్భవించాయని తెలిసినవారు నిజ జీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు.

ఈశా వాస్యోపనిషత్తులో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా అది నిరంతర చింతన, తపన వలననే సాధ్యం.ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే ఒక కాటి కాపరి ఎదురైనప్పుడు పక్కకు తప్పుకో అని అనడం విచిత్రం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు అత్యంత మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చే సరికి భంగ పడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. ఆత్మ స్వరూపుడై ఉన్నవాడని తెలిసినా అంగీకరించినా అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు 'మనీషా పంచకం' ప్రవచించి బ్రహ్మ జ్ఞాని ఎవరైననేమి అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు.
ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే చాలు కదా… ఎందుకు అనుభవించడం? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనస్సులోని మాలిన్యాలు తొలగేందుకు శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు సనాతన ధర్మ జీవితం జీవించేందుకు సుఖ దుఃఖాలను నిర్మూలించేందుకు ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా 'అహం బ్రహ్మాస్మి'కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరి దశలో 'అంతర్యామి'గా ప్రసన్నమయ్యాడు.

భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు మొదట ఆత్మను జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన ఆలోచనలలో నుండి తీసివేయగలం.
'మహోపనిషత్‌' భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది.

దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్‌ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చును. భూమి మీద భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం 'గతి తప్పదు'. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు. ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణ సాధ్యం.

జిజ్ఞాసులకు మనస్సు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించి వేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనస్సు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే 'అహం బ్రహ్మాస్మి' అప్పుడే భేద భావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి ఆనంద మయ జగత్తు సాక్షాత్కారమౌతుంది. ఇది సాధన చేసిన వారికి అనుభవంలోకి వస్తుంది.

అసలు ఇంతకి ఆత్మ ఉందా? ఉంటే దానికి శాశ్వత మరణముందా? భగవద్గీత ప్రకారము చూస్తే ఆత్మ ఉంది! కాని ఋభుగీత ప్రకారము చూస్తే ఆత్మ లేదు! బ్రహ్మము లేదు! అలాగే భగవద్గీత ప్రకారము చూస్తే ఆత్మకి మరణము లేదు! కాని తత్వవేత్తల అభిప్రాయప్రకారము చూస్తే ఆత్మను ముక్కలుగా చేయవచ్చునని వాదన వుంది! వీటిలో ఏది నిజము...ఏది వాదన సత్యం...నాకు అయితే అర్ధమవ్వలేదు! ఇలా పలుసందేహలు నన్ను వేధించినాయి! దీనికోసము భగవద్గీత చెప్పిన కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలని యోగసాధన మార్గాలలో మేము ప్రయాణించడము జరిగినది! ఏడు చేపల కధను యోగార్ధముగా వినాలని వుందా? అలాగే ఒక నగ్నసాధువు నుండి ఈ విశ్వము ఎలా ఏర్పడినదో తెలుసుకోవాలని వుందా? ఇంక ఆలస్యమెందుకు! ఆయా సాధన అనుభవాలు తెలియలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

******************************************

గమనిక: కొన్ని సంవత్సరాల తర్వాత నా సాధన స్థాయి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు… నాకు ఆత్మకు సంబంధించిన ధర్మ సందేహాలు తగ్గ సమాధానాలుగా స్ఫురణ స్వానుభవాలు కలిగినాయి!

అందులో ఆత్మ అనేది దైవమా లేదా దెయ్యమా అన్నప్పుడు… ఆత్మకి ఒక శక్తి ఉంటుంది! దానిని ఆత్మశక్తి అంటారు! ఈ శక్తి రెండు విధాలుగా ఉంటుంది! ఒకటి ధనాత్మక శక్తిగానూ అనగా పాజిటివ్ శక్తిగా అలాగే మరొకటి రుణాత్మక శక్తిగాను అనగా నెగెటివ్ శక్తి గా ఉంటుంది! పాజిటివ్ శక్తి ఉన్న ఆత్మలను దైవాలుగా… సప్త ఊర్ధ్వ లోకాలలో… కాషాయ రంగులో గాని లేదా తెల్లని శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి! అలాగే నెగిటివ్ శక్తి ఉన్న ఆత్మలను ప్రేతాత్మగా పిలవబడుతూ … సప్త అధోలోకములలో… నల్లటి శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి! అంటే దైవాత్మలకి ఇష్ట కోరికలు ఉంటే… ప్రేతాత్మలకి తీరని కోరికలు ఉంటాయి! ఇష్ట కోరిక అంటే  ప్రేమ మాత్రమే ఉంటుంది! అదే తీరని కోరికలు అంటే మాయ, మోహా, వ్యామోహాలు ఉంటాయి! అందువలన ఆత్మశక్తికి దైవశక్తి కాస్తా ప్రేతశక్తిగా అలాగే  ప్రేతశక్తి కాస్తా దైవశక్తి గా మారే అవకాశాలు ఉన్నాయి! దీనిని బట్టి చూస్తే ఆత్మ అనేది మన కోరికను బట్టి దైవాత్మగాను లేదా ప్రేతాత్మగాను మారుతుందని నేను తెలుసుకోవడం జరిగినది! అదే పరిశుద్ధ ఆత్మకి యెట్టి స్ధితి ఉండదని గ్రహించాను!

ఇక ఆత్మను నాశనం చెయ్యవచ్చునా? లేదా అన్నప్పుడు ఆత్మ యొక్క రకాల గురించి ముందుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది! ఆత్మ అనేది సూక్ష్మాంశ పంచభూతాలతో ను పంచ శరీరాలతో ఆత్మ యొక్క ఆత్మ స్థాయి ఉంటుంది! అనగా మూలాధార చక్రము నందు స్థూల శరీరంతో 84 అంగుళాలతో జీవాత్మగా భూతత్వ శక్తితో ఉంటే….  అదే ఆజ్ఞా చక్రము నందు 83 అంగుళాలతో సూక్ష్మ శరీరముతో అంతరాత్మగా జల తత్వం తో ఉంటే .. ఇక సహస్ర చక్రమునందు బొటనవేలు పరిమాణముతో కారణ శరీరంతో పరమాత్మగా అగ్ని తత్వములో ఉంటే…. ఇక హృదయ చక్రమునందు అంగుళం పరిమాణంతో సంకల్ప శరీరముతో పూర్ణాత్మగా వాయుతత్వము తో ఉంటే… అదే బ్రహ్మరంధ్రము నందు రేణువంత పరిమాణములో ఆకాశ శరీరముతో విశ్వాత్మగా ఆకాశతత్వము తో ఉంటాయని నేను గ్రహించాను! అలాగే జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, పూర్ణాత్మకి ఆయుష్ ప్రమాణాలు ఉన్నాయి! వాటి వాటి ఆయుష్ పూర్తవ్వగానే అశాశ్వత మరణము పొందుతాయి! కానీ విశ్వాత్మ కి ఎట్టి మరణము లేదు! ఇది నాశనము కానిది! నాశనం చేయలేనిది! ఎందుకంటే అన్నీ కూడా దీని నుండి ఉద్భవించి… దీనిలోనే నశించిపోతాయి! అందుకే భగవద్గీతలో చెప్పిన ఆత్మ అనేది ఈ ఆకాశ శరీరంలో ఉన్న ఆకాశతత్వము తో ఉన్న విశ్వాత్మ గురించి అన్నమాట! దీనిని అగ్ని నాశనము చేయలేదు! నీరు తడుపజాలదు! వాయువు ఎండనీయదు! కారణము పంచ భూతాలలో ఆకాశము కిందనే మిగిలిన నాలుగు భూతాలు ఉంటాయి కదా! కాబట్టి మరణము లేనిది… ఏమీ లేనిది విశ్వాత్మ అని మాత్రమే అన్నమాట! మిగిలిన నాలుగు ఆత్మలకు మాత్రమే ఆయా కాలానుగుణంగా అంతరించి పోతాయని నేను తెలుసుకున్నాను! బల్లి నుండి తోక వేరే చేసినా కూడా బల్లి అలాగే తోక ప్రాణముతో ఉండటానికి కారణం ఈ ఆత్మ రకాల స్థాయిలను బట్టి జరుగుతుంటాయని గ్రహించే ఉంటారు!

అలాగే ఆత్మ అనేది ఒక శరీరం నుండి మరొక శరీరంలోనికి ప్రవేశించవచ్చును! దీనినే పరకాయప్రవేశ విద్య అంటారు! అనగా ఒక శరీరములోని జీవాత్మ తప్పుకుంటే మరొక శరీరంలోని సూక్ష్మ శరీరము ఈ శరీరం లోనికి రావచ్చును! దీనికి పరిపూర్ణ యోగ నిద్ర సిద్ధుడై ఉండాలి! యోగ నిద్ర లోనే మన ఆత్మలను సూక్మ యానం ద్వారా ప్రయాణింప చేయవచ్చును! అలాగే మరొకరి శరీరంలోనికి ప్రవేశించి వచ్చును! ఇందులకు ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం మంచి ఉదాహరణగా చెప్పవచ్చు! ఇదంతా మనకి స్వానుభవం అయ్యేదాకా నమ్మలేము! నమ్మకం రాదు!

ఇక భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉన్నది అది శాశ్వత మని చెబితే… ఋభుగీత ప్రకారంగా చూస్తే ఆత్మ లేదు… అది అశాశ్వత మని అన్నప్పుడు ఇందులో ఏది సత్యం అనుకున్నప్పుడు….. ఈ రెండూ కూడా సత్యాలే! ఎందుకంటే ఈ రెండూ కూడా ఆఖరిదైన విశ్వాత్మ గురించి చెప్పడం జరిగినది! విశ్వాత్మ అంటే ఆకాశ శరీరముతో ఆకాశ తత్వంతో ఉన్నదని తెలుసు కదా! ఆకాశమంటే శూన్యమే కదా! ఆకాశము మన కంటికి కనపడుతుంది అంటే ఆత్మ ఉన్నట్లే కదా! ఇది భగవద్గీత చెప్పినది ! కానీ అదే ఆకాశము అనగా శూన్యం! శూన్యం అంటే ఏమీ లేనిది… ఖాళీ అని అర్థం కదా! అంటే ఆత్మ లేనట్లే కదా! ఇదియే ఋభుగీత గీత చెప్పింది! ఆకాశము ఉంటే ఆత్మ ఉన్నట్లే! ఆకాశము లేదు అంటే ఆత్మ లేనట్లే అన్నమాట! నిజానికి ఆకాశము కంటికి కనిపించి ఉన్నట్లుగా అనిపిస్తున్నది ! కిందనుంచి చూస్తే ఆకాశం మన పైన ఉన్నట్లుగా కనపడితే… అదే మనము ఆకాశం లోనికి వెళితే మనకి ఆకాశం కనపడుతుందా … కనపడదు కదా! అంటే ఈ రెండు గీత లు చెప్పినవి సత్యానుభవాలే గదా! ఏమంటారు! జాగ్రత్తగా ఆలోచించండి! మీకే తెలుస్తుంది!

అంతెందుకు మోక్షప్రదాయిని అయిన ఆకాశ తత్వ చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ దర్శనం అయితే మోక్షమని స్వయంగా ఆదియోగి పరమేశ్వరుడు మనకి మహా శివపురాణము నందు బోధించి నాడు కదా! మరి ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగమును చూడటం లేక ఆకాశమే లింగంగా భావించడమా… ఆలోచించండి! నిజానికి ఆకాశంలో లింగము కనిపించదు! ఆకాశమే లింగము అని అనుభవ అనుభూతి పొందితే… ఆకాశము, లింగము అనేవి లేవని… ఏమీ లేవని… సర్వం శూన్యమని ఎవరైతే అనుభూతి పొందుతారో వారే మోక్షగామి అని భూతనాధుడు అయిన పరమేశ్వరుడు స్వయంగా చెప్పడం జరిగిందని నేను గ్రహించాను! అంటే ఈ విశ్వంలో ఏమీ లేదు….  సర్వం శూన్యం అని అనుభవ జ్ఞాన అనుభూతి కల్గుటయే యోగసాధన పరిసమాప్తి అన్నమాట! ఈ లెక్కన చూస్తే ఆకాశములో లింగమును చూస్తే విశ్వాత్మ ఉన్నట్లుగానే… అదే ఆకాశమే లింగం అయితే విశ్వాత్మ లేనట్లుగానే… యత్ భావం తత్ భవతి అన్నమాట!

అలాగే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం - నరకం లాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. వీటికి సమాధానాలు నాకు అనాహతచక్రస్ధితి యందు మరణభయములో స్వానుభవాలు అయినాయి! అన్ని ఉన్నాయని తెలుసుకున్నాను! ఆ వివరాలు మీకు ఈ చక్ర సాధనానుభవములో చెప్పడము జరిగినది!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ika aatmalu enni rakaalu ela naashanam avuthay,evi avvavu, atma ki aayush pramaanaluntayani adi purthi avvagaane ashaashvatha maranamu ponduthayani...aakashame lingamu, aakasham paina unte kanipinchadu ani anni vidhaalugaa cheppatam bagundi...

    రిప్లయితొలగించండి