అధ్యాయం 35


నేను చూసిన సచిత్ర-విచిత్రాలు

నేను చూసిన విచిత్ర చిత్రాలు నాకు శ్రీశైలక్షేత్ర పరిధిలో జరిగిన వివిధ రకాల అనుభవాలు నాకు మాత్రమే ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాని విషయాలు! అలాగే మంగళగిరి అనే ప్రాంతంలో వెలసిన పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి నోట్లో పోసిన పానకము ఎంతపోస్తే అంతకు తగ్గట్లుగా సగము పానకము మాత్రమే అదేదో ఖచ్చితంగా ఎలా వెనక్కి తిరిగి వస్తుందో నాకు అర్థం కాని విషయం! అసలు ఇక్కడ ఎందుకు ఆయనకు పానకం పోస్తారో అర్థం కాని విషయం! పైగా ఇక్కడ ఎందుకు పానకాలు పోసినా కూడా ఆ పరిసరాలలో ఈగలు కాని దోమలు కాని ముసురులు కాని మనకి కనిపించకపోవడం మరి విచిత్రమే కదా!


అలాగే కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ అనే క్షేత్రంలో ఉన్న వడకనాధ్ పరమ శివలింగానికి పైపూతగా పేరు ఆవునెయ్యి పూస్తారు! ఏ కాలంలో అయినా ఈ నెయ్యి కరగకుండా అలాగే విగ్రహానికి ఉంటుంది! కానీ ఇక్కడ కూడా ఆ పరిసరాలలో ఈగలు కాని దోమలు కాని ముసురులు కాని మనకి కనిపించకపోవడం మరి విచిత్రమే కదా!

అలాగే తమిళనాడు రాష్ట్రములోని పళని క్షేత్రం లో వెలిసిన నవ పాషాణ నిర్మిత సుబ్రమణ్యస్వామి ఒక బాలుడు విగ్రహ రూపంలో మనకు అగుపిస్తాడు! నవపాషాణాలు అంటే తొమ్మిది రకాల విషాలు! వీటితో గూడిన విగ్రహమును భోగర్ అనే రససిద్ధపురుషుడు తయారు చేసినాడు! ఇలాంటి విగ్రహం మూర్తికి చేసిన అభిషేక జలాలను స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందటం ఇప్పటికి విచిత్రంగా జరుగుతోంది! ఎక్కడైనా విషాలు ఆరోగ్యాన్ని హరిస్తాయి కానీ ఇక్కడ మాత్రం విషాలు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి! అదే విచిత్రం!

అలాగే కేదారనాథ్, బదరీనాథ్ ఆలయాలలో మూసేటప్పుడు అఖండ జ్యోతి వెలిగించి ఉంచుతారు! ఆరు నెలల తర్వాత ఈ దేవాలయాలు తెరిచి చూస్తే ఈ అఖండ జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలుగు తున్నట్లుగా ఉండటం విచిత్రమే కదా! ఎందుకంటే రెండు దేవాలయాలు కూడా విపరీతమైన మంచు తో కప్పబడి ఉంటాయి! గాలి కూడా ఉండదు!పైగా మంచు యొక్క చల్లదనానికి ఈ అఖండ జ్యోతి కొండెక్కాలి!కాని అలా జరుగదు!కారణము తెలియదు! అదే విచిత్రం!

                                                                                                 
అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం దగ్గర్లో ఉన్న చెంగనూరు భగవతి దేవాలయం ఉన్నది! ఈ అమ్మవారికి విచిత్రముగా మానవ స్త్రీ మూర్తులకు వచ్చే నెలసరి అనగా బహిష్టు ఈ విగ్రహ మూర్తి కి ప్రతి నెల ఎలా వస్తుందో అర్థం కాని విచిత్రం! అలాగే అస్సాం రాష్ట్రములో గౌహతిలోని శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్యదేవి అమ్మవారికి యోనిభాగము నుండి నెలసరి రావడం నాకు అర్థం కాని విచిత్రమే! అంటే ఒక విగ్రహమూర్తి నుండి రక్తము ఎలా వస్తుందో ఇప్పటికీ అర్థం కాని చిత్రమే!

అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలి అనే క్షేత్రంలో ఉన్న జగన్మోహిని స్వామి వారి కాలి పాదము నుండి ఎలా నీరు వస్తుందో అర్థం కాని చిత్రం అలాగే ఘంటసాల క్షేత్రంలో ఉన్న జలపర్వతేశ్వరుడు శివలింగ నుండి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని విచిత్రం! అలాగే తిరుపతి వెంకన్న పాదాల చెంతన అలాగే విగ్రహమూర్తి వెనక వైపు నుండి ఎక్కడి నుండో నీళ్ళ శబ్ధాలు వినపడుతున్నాయి! ఎవరికీ అర్థం కాని విచిత్రం!

అలాగే యాగంటి క్షేత్రంలో మనకి ఒక కాకి కూడా కనిపించదు! ఇది కాకులు దూరని కారడవి అన్నమాట! ఇది ఒక విచిత్రమైతే అదే అన్నవర క్షేత్రములో మనకి ప్రతి క్షణము కాకుల గోల వినపడుతూనే ఉంటుంది! కనపడుతూనే ఉంటాయి! ఇది కాకుల క్షేత్రముగా ఉండటం మరీ విచిత్రం!


అలాగే యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు పెరుగుతూ ఉంటే ఏలూరు క్షేత్రంలో జలపహరేశ్వర స్వామి గుడిలో ఒక ఎద్ధు కాస్త సజీవమూర్తిగా జీవ సమాధి చెంది పూజలందుకుంటుంది! ఈ ఊరిలో మోక్షప్రదాత ఇచ్చే యోగం ఉన్న ఒక ఆంబోతును…. ఒకసారి ఒక సాధువు ఒక చేతి కడియం తో దీనిని బంధించి… ఆ ఊరిలోని జలాపహరేశ్వర స్వామి శివాలయం యొక్క  శివ లింగ మూర్తి ముందు సజీవ సమాధి చెందేటట్లుగా చేసినారు! వంద సంవత్సరాల తర్వాత ఈ నందికి అమర్చిన కడియంకి మహత్తులు ఉంటాయని ఎవరో కొంతమంది దుండగులు…. ఈ మధ్యకాలంలో ఈ నంది విగ్రహం ఉన్న కడియము ని తీసుకోవడానికి దాని కాళ్లను కొయ్యగా… విచిత్రంగా ఆ విగ్రహ మూర్తి నుండి రక్త చారికలు, రక్తమాంస ముద్దలు కూడా ఆనవాళ్లు కనిపించినాయి! విచిత్రమేమిటంటే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలలో ఆ ఊరిలో దాదాపుగా మూడు ఆంబోతులు ఆకారణంగా మరణించినాయి!  ఒక సజీవ ఎద్దు ఎలా జీవసమాధి చెంది సజీవ విగ్రహమూర్తి గా మారినదో… నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రంగానే ఉంది!


అలాగే నైమిశారణ్యంలో రుద్రవరం అనే చోట ఉంది! ఇక్కడ నీళ్లలో శివలింగాల కుండము ఒకటి ఉన్నది! శివలింగాలు నీటి అడుగున ఉంటాయి! విచిత్రమేమిటంటే ఈ నీటి మీద బరువైన జామకాయలు వేస్తే తేలతాయి! అదే తేలికైన బిల్వపత్రాలు వేస్తే మాత్రం విచిత్రంగా మునిగి పోతూ అడుగున ఉన్న శివలింగాల మీదకి చేరతాయి! ఇది ఎలా జరుగుతుందో అర్థం కాని విషయమే కదా! అలాగే నైమిశారణ్యములో అనేక వెదురు చెట్లు ఉంటాయి! ఈ వెదురు చెట్టు నుంచి ఏదో ఒక చెట్టు నుంచి ఇప్పటికి కూడా వేణునాదం వినపడటం జరుగుతుంది! అది చిత్రమే కదా! అలాగే బృందావన క్షేత్రములో రాత్రిపూట ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అలాగే గోపికల కలిసి చేసిన నృత్యగానము వినపడుతూ ఉండటం విచిత్రమే కదా!

ఇక అమ్మవార్లు విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ కామాక్షి దేవికి స్వప్నదేవత అని పేరుంది! అనగా మనకి ఏదైన సమస్య వచ్చినపుడు ఈ గుడికి వెళ్ళి అక్కడ నిద్రపోతే... ఇప్పటికి ఆవిడ మన స్వప్నములోనికి  వచ్చి మనకి పరిష్కార మార్గము చూపుతుంది! విచిత్రమైన కదా! అలాగే కంచి యందు కామాక్షిదేవి ప్రతి శుక్రవారము దేవిపూజానంతరము నిజ భక్తునికి నిజరూపదర్శనం ఇవ్వడము ఇప్పటికి జరుగుతోంది!

నా దగ్గర ఉన్న ఏకముఖి రుద్రచిహ్నాలు

అలాగే ఎక్కడైనా పుచ్చిపోయిన విత్తనాలు నీటి మీద తేలతాయి కాని మంచి ఆరోగ్య విత్తనాలు నీటిమీద తేలడటం మీరు ఎక్కడైనా చూసారా? అదేనండి! నిజమైన రుద్రాక్షల విషయంలో ఈ విషయం కనపడుతుంది! నిజమైన రుద్రాక్షలు నీటి మీద ఎలా తేలుతాయి? అదే భద్రాక్షలు అయితే నీటిలోనూ లేదా పాలలోను మునిగిపోతాయి! మంచి విత్తనాలు అయినా రుద్రాక్షలు నీటి మీద తేలే గుణము పైగా వీటికి అయస్కాంత, విద్యుత్తుశక్తులు ఉంటాయని గమనించి వీటిని యోగసాధనలో  జపమాలగా ధరించాలని మన పూర్వీకులు పెట్టినారు! కానీ ప్రస్తుత కాలంలో నిజమైన రుద్రాక్షలు అరుదుగా దొరుగుతూ ఉండే సరికి భద్రాక్షలు కాస్తా రుద్రాక్షలుగా చలామణి అవుతున్నాయి అని అందరికీ తెలియదు!

నాగలింగ పువ్వులు
ఇలా ప్రకృతి విచిత్రాలలో నాకు అర్థం కాని విషయం రుద్రాక్ష అయితే మరొకటి శివలింగ పువ్వులు! వీటినే నాగలింగ పువ్వులు అని కూడా అంటారు! ఈ పువ్వులు చూడటానికి సహస్ర తలలో నాగాభరణం మధ్యలో ఒక లింగము ఉండి నాగాభరణం పెట్టుకున్న శివ లింగం పువ్వుల నిర్మాణం లాగా అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే!

తెల్ల జిల్లేడు-గణపతి ఆకృతి
అలాగే 35 సంవత్సరాలు వయస్సు ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు యొక్క తల్లి వేరు కాస్త గణపతి ఆకృతి గాను లేదా హనుమంతుడి ముఖాకృతి గాను ఎవరో           చెక్కినట్లుగా అది ఎలా ఏర్పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రమే! ఈ చెట్టు వేరుతో ఏర్పడిన స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాలయం వరంగల్ జిల్లాలోని కాజీపేట లో ఉన్నది మీరు చూడవచ్చును!

సమీర పత్రాలు -  సింధూర వర్ణములో ఆంజనేయ స్వామి
అలాగే మరి విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో ను అలాగే నైమిశారణ్యములో మనకి చాలా అరుదుగా సమీర పత్రాలు కనపడతాయి! ఈ పత్రాల మీద సింధూర వర్ణములో ఆంజనేయ స్వామి మూర్తి పైగా ఇందులో ఎవరు వేసినట్లుగా కనపడుతుంది ! ఇవి అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే!

లింగ దొండకాయలు - పానుమట్ట లింగమున్నట్లుగా ఆకృతి
ఇక లింగ దొండకాయలు! వీటి గురించి ఎప్పుడైనా విన్నారా లేదా వీటిని చూసారా? సహజంగా ఈ చెట్లు పొలాల వెంట, గట్ల వెంట కనపడతాయి! ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా..పండుతున్నపుడు మంచి ఎరుపురంగులో ఉంటాయి! ఇవి చూడటానికి గుండ్రంగా తెల్లని గీతలతో ఉంటాయి! ఇవి రుచికి దొండకాయ లాగా ఉంటాయి! వీటిని పగలగొడితే వీటి లోపల విత్తనాలు ఉంటాయి! విచిత్రంగా ఏమిటంటే వీటి గింజలు పానుమట్టము ఉన్న లింగమున్నట్లుగా కలిగి ఉన్నట్లుగా ఆకృతిని కనపడతాయి! ఈ గింజల కి రెండువైపులా ఇలాగే ఉంటుంది! అందుకే ఈ కాయలను శివలింగ దొండకాయలు అని కూడా అంటారు! ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును!


అలాగే తమిళనాడు రాష్ట్రములోని తిరుకజికుండ్రం క్షేత్రములో పక్షితీర్ధం అనే నీటికొలను ఒకటి ఉన్నది!విచిత్రంగా ఇపుడికి ప్రతి 12సం!!రాలకి ఒకసారి ఈ కొలను అడుగునుండి ఒక అద్భుతమైన దక్షిణావృత మహా శంఖము కొలను ఒడ్డుకి కొట్టుకు వస్తుంది!ఆతర్వాత ఇది కొలనులో ఎక్కడ ఉన్నదో...ఆ ఆలయపూజారికి కలలో కనిపిస్తుంది!ఈయన తన కలలో కనిపించిన ప్రదేశములో వెతికితే ఈ శంఖము కనపడుతుంది!ఇలా వచ్చిన ఎన్నో శంఖాలు ఈ ఆలయములో భద్రపరిచినవాటిని మనము చూడవచ్చును!ఇలా ఒక శంఖము తయారు అవ్వడము ....పైగా అది ఎక్కడ ఉన్నదో స్వప్నము ద్వారా చెప్పడము… ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును!



నాకు జాతకాలు చెప్పిన జ్యోతిష్య వేదాంతి… నా భౌతిక గురుదేవుడైన బ్రహ్మశ్రీ ఘంటసాల సాయిబాబా గారు ఎప్పుడూ గ్రహ హోమాలు చేసి వాటి ద్వారా జాతక సమస్యలు పరిష్కరించే వారు! చిత్రమేమిటంటే ఈయన చేసిన హోమాలలో ఆయా హోమదేవతలు గాని హోమాలు చేయించుకొనేవారి కులదైవాలు కాని వారి ఇష్టదైవాలు కాని వారు చేయించే హోమాలయందు హోమాగ్ని కాస్తా హోమాదేవతలుగా చాలా సర్వసాధారణంగా కనిపించే విషయమని అని నేను తెలుసుకుని కావాలని వారు చేస్తున్న సమయంలో నేనే స్వయంగా ఫోటోలు తీస్తే అలాగే హోమకర్తల బంధుమిత్రులు తీసిన …. ఆయా హోమాదేవతలు అగుపించటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది! కావాలంటే వారు చేసిన హోమాల ఫోటోలు పెడుతున్నాను! వీటిని చూసి అవునో కాదో మీరే నిర్ధారణ చేసుకోండి!

అలాగే కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతములో ఎక్కడా కూడా గ్రద్ధ గాలిలో ఎగరదు! బల్లి అరవదు!  సువాసనాలు వచ్చే పూల చెట్లు బ్రతకవు! చనిపోయే ప్రతి జీవి కూడా కుడిచెవి ఆకాశంకేసి పెట్టి చనిపోవడం విచిత్రంగా ఉంటుంది! అలాగే మణికర్ణికా ఘాట్ లోని శవ దహన సమయములో ఎక్కడా కూడా శవ వాసన గాని కాలుతున్న జుట్టు వాసన గాని రాకపోవటం విచిత్రము! అలాగే విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గర్లో ఉన్న మృత్యు బావిలో నీడ కనిపించకపోతే ఆరు నెలలో ముక్తి పొందటం ఎలా జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం!


….ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతీయ దేవాలయాలలో ఉన్న అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి! ఇంతటి పుణ్యభూమిలో భారతీయులుగా పుట్టినందుకు భారతదేశములో భారతీయుడుగా జీవిస్తోన్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని నా ప్రగాఢ విశ్వాసం! మీరు భారతీయులు అయితే అది మీకు పూర్వజన్మలో చేసిన అపార పుణ్యం వలన లభించిన మహోన్నత అపూర్వ అవకాశం జన్మ ఇది అని తెలుసుకోండి! ఈ జన్మను సార్ధకత చేసుకోండి! ఎందుకంటే ప్రపంచమనేది దేవాలయం అయితే అందులో భారతదేశము అనేది విగ్రహమూర్తి ఉన్న గర్భాలయము అని గ్రహించండి! అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచము ఇల్లు అయితే భారతదేశము పూజగది వంటిది అన్నమాట! భారత దేశం గొప్పతనం తెలుసుకోండి! లోకానికి చాటండి! మనము భారతీయులమని గర్వంగా బతకండి!

ఇక నేను చూసిన నిజ సిద్ధపురుషులు చూపిన చిత్ర విచిత్ర సిద్ధలీలలు గూర్చి తెలుసుకోవాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

శుభం భూయాత్

పరమహంస పవనానంద

***************************

గమనిక: మన భారతీయ పూర్విక మహర్షులు మహోన్నత నిగూఢ రహస్యాలు ఈ దేవాలయాల్లో అంతర్గతముగా గుప్తంగా ఉంచినారని కొన్ని సంవత్సరాల సాధన శక్తి వలన తెలుసుకున్నాను! అంతెందుకు ఉదాహరణకి పానకాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయము ఉన్నచోటనే అగ్నిపర్వతం ఉన్నదనీ… దానిని చల్లబరచటానికి నిత్యం పానకము పోసే విధానమును పెట్టారని… ఈ పానకాలు ఎక్కువైనా కూడా ప్రమాదమే…. కాబట్టి సగము మాత్రమే లోపలికి వెళ్లే టట్లుగా మిగతా సగం బయటకు వచ్చేటట్లు గా ఈ విగ్రహ మూర్తి యొక్క నోటి నిర్మాణం చేసినారు! అలాగే ఇక్కడున్న అగ్నిపర్వత వేడిమి వల్లనే ఈ గుడి లోపల గాని బయట గాని ఈగలు కాని దోమల గాని కనిపించడం లేదని నేను తెలుసుకున్న జ్ఞానమును మీకు చెబితే… మీకు విగ్రహారాధన మీద భక్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కదా !అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్పడం లేదు! విచిత్రముగా అనిపించిన ప్రతి చోట మనకి తెలియని ఏదో నిగూఢ రహస్యాలు కూడా ఉన్నాయని నాకు తెలిసినది! కాకపోతే వాటినన్నిటిని నేను తెలుసుకునే సరికి నాకు విగ్రహారాధన మీద భక్తి పూర్తిగా దొబ్బింది! జ్ఞానం తెలిస్తే మర్మం ఉండదు కదా! అలాగే నాకు శ్రీశైల క్షేత్రం ప్రసిద్ధి లో జరిగిన అన్ని రకాల విచిత్ర అనుభవాలకు కారణం ఇవన్నీ కూడా నా గత జన్మ సాధన అనుభవాలని… నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకోవడం జరిగినది! గత జన్మలో నాకు అర్థం కాని విషయాలు విచిత్రాలు ఈ జన్మలో శ్రీశైల క్షేత్రములో అవి దృశ్య రూపాలుగా సాక్షీభూతంగా అనుభవ అనుభూతులుగా వచ్చినాయి అని తెలుసుకున్నాను! దానితో నాకు ఉన్న మాయ కాస్త మాయం అయింది!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. sachitra vichitralu lo cheppinavi chaala bagunnayi chaala vishyaalu naku thelidu paanakala lakshmi narasimha swamy gudi nirmaana rahasyam cheppinattu annitiki chepthe baagundedi kaneesam kaashi kshetram gurinchi cheppina bagundedi... undevaariki untundi dobbe vaariki dobbuthundi cheppalsindi poorthiga... nak ala anipinchindi...

    రిప్లయితొలగించండి