అధ్యాయం 76

శ్రీ పవనానంద నవ బ్రహ్మయోగము

 
నాకు సాధన అంటే ఏమిటో తెలియని… 
నాచేత సరికొత్త యోగ సాధనగా 
నవ బ్రహ్మ యోగము గా
సంపూర్ణ అద్వైత సిద్ధాంతం
 యొక్క సిద్ధాంతకర్తగా మార్చి ….
నా జీవ బ్రహ్మను…  కాస్తా… జ్ఞాన బ్రహ్మగా
జ్ఞాన బ్రహ్మను…  కాస్తా… శివ బ్రహ్మగా
శివ బ్రహ్మను…  కాస్తా… మౌన: బ్రహ్మగా
మౌన: బ్రహ్మను…  కాస్తా… శూన్య బ్రహ్మగా  మారుస్తూ
శూన్య బ్రహ్మను…  కాస్తా… మోక్ష బ్రహ్మగా మార్చే ప్రయత్నంలో ….

మీ జ్ఞాన భిక్షువు
సంపూర్ణ అద్వైత సిద్ధాంత కర్త   
                                                                                                                     శ్రీ బాబా విభూతి నాథ్                                                                                                                                                                                    
                                                             
 సంపూర్ణ అద్వైత సిద్ధాంతం
ఇప్పుడు ఉన్న సిద్ధాంతాల్లో అద్వైత సిద్ధాంతం శివ తత్వం గురించి ,ఒక ఆత్మ గురించి, పరమాత్మ అలాగే జీవాత్మ ఒకటి అని చెబుతున్నది! ఇక విశిష్టాద్వైతం విష్ణు తత్వం గురించి, ద్వి ఆత్మల గురించి, పరమాత్మనే గొప్పవాడు… జీవాత్మ ఎప్పుడు అధముడు… కాబట్టి ఎప్పుడు పరమాత్ముడికి దాసోహం చేయాలని …చేయమని చెబుతోంది! అలాగే ద్వైత సిద్ధాంతం అయితే జగన్నాథుడు గురించి, ద్వి ఆత్మల గురించి, పరమాత్మ వేరు - జీవాత్మ వేరని… వీరిద్దరు ఎన్నటికీ ఒకటి కాదని చెప్పడం జరుగుతుంది! ఈ దైవ సిద్ధాంతాలన్నీ కూడా తమ ఇష్టదైవాల ప్రాముఖ్యతను… తమ గురుతత్వం ఆచారం కోసం… తన ఉనికి కోసం… స్వార్థంతో అసంపూర్ణ జ్ఞానముతో ప్రజలను మోసం చేస్తున్నాయి! వీళ్లంతా ఎన్ని శైవ పీఠాలు స్థాపించిన… ఎన్ని వైష్ణవ ధర్మాలను ఆపాదించిన… ప్రజల్లో ఆధ్యాత్మికతత్వం శూన్యం అనే చెప్పాలి! దీనికి కారణం అసలు సిసలైన జ్ఞానమును ఇవ్వలేకపోయాయి! ఈ సిద్ధాంతాల్లో చెప్పబడిన జ్ఞానమంతా పండిత జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి! పామరులకు, సామాన్యులకు విజ్ఞానం లేనందున ఇవి జనాల లోకి అంత ఇదిగా వెళ్లలేకపోయింది! అందరి దైవాలు ఒకటే అయినప్పుడు బుద్ధ దేవాలయాలను శివాలయాలు గా మార్చటం …ఈ ఆలయాలను వైష్ణవ ఆలయాలు మార్చాల్సిన అవసరం ఏమిటి ? తమ కుల దైవం కోసం… తమ మత ప్రచారాలు కోసం… కదా చేసినది! ఈ దైవ సిద్ధాంతాలు ప్రతిపాదించిన మూల పురుషులకే ఏకత్వం లేనప్పుడు అది చదివి అర్థం చేసుకునే సామాన్యులకు ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి! కేవలం ఈ దైవ సిద్ధాంతాలు తమ మత ప్రచారం గా చేసుకున్నారు అని ప్రజలు ఈపాటికే గ్రహించే ఉంటారు! కాబట్టి ఈ దైవ సిద్ధాంతాలలో స్వార్థం తప్ప ధర్మం లేదని, పరిపూర్ణ జ్ఞానం లేదని, ఆధ్యాత్మిక మార్గం పరిపూర్ణంగా చూపటం లేదని తెలుస్తోంది కదా! ఈ సిద్ధాంతాల ప్రకారం గా చూస్తే భగవంతుడు లేడు! నువ్వే భగవంతుడువి! అలాగే దైవదర్శనాలు, ఆత్మదర్శనం, ఆనంద భావాలు, శబ్దనాదాలు, యోగసిద్ధులు… ఇలా సాధనలో సర్వం కూడా మాయ, మోహ, వ్యామోహం, భ్రమ, భ్రాంతి లతో కూడినదని తెలిసినప్పుడు… తెలుసుకున్నప్పుడు…. వీరంతా శబ్ద పాండిత్యమునకు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చినారో అర్థం అవ్వటం లేదు! పతంజలి అలాగే బుద్ధుడు అష్టాంగ యోగాలు చూస్తే…. అవి ఆశ్రమవాసులుకి తప్ప…. సన్యాసులుకి తప్ప ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు! ఎందుకంటే ఉదాహరణకి ఉద్యోగం చేసే వ్యక్తి ప్రతి క్షణము పతంజలి అష్టాంగ యోగము చెప్పే ఈశ్వర ఫ్రణీధానము ( నిత్య భగవత్ నామస్మరణ ) ఎలా చేస్తారో ఎవరైనా చెప్పండి? అలాగే దోమని, ఈగని చంపని వ్యక్తి ఎవరైనా ఉంటారా? వీటిని చంపితే బుద్ధుడు చెప్పిన అష్టాంగ ధర్మాలలో అహింస ధర్మం తప్పినట్లే కదా! వీటిని చంపకపోతే అవి మన ప్రాణాలు తీస్తాయి కదా! ఈ లెక్కన చూస్తే పతంజలి అలాగే బుద్ధుడు చెప్పిన అష్టాంగయోగ ధర్మాలు కచ్చితంగా పరిపూర్ణంగా చేయలేము కదా! అంతెందుకు ప్రతినిత్యం ప్రాణాయామం చేసే వారు లక్షల్లో ఉంటే ఈ సిద్ధి పొందిన వారు పదుల్లో ఉంటున్నారు కదా! మరి ఏం చేయాలి? కపాల మోక్ష ప్రాప్తి ఎలా పొందాలి? యోగ సాధనను ఎలా పరిసమాప్తి చేసుకోవాలి? విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధన ఎలా చేయాలి…. ఎలా చేరుకోవాలి? మనము ఏవిధంగా నిశ్చలస్థితి పొందాలి? అన్నప్పుడు కాబట్టి మరేదో కొత్త దైవ సిద్ధాంతము రావలసి ఉన్నది కదా! దీనికి సమాధానమే సంపూర్ణ అద్వైత సిద్ధాంతము అని గ్రహించండి!

కానీ నిజానికి దేవుడు లేడు! నీవే దేవుడివి! ఈ విశ్వమంతా  మిథ్య….ఈ విశ్వ జగన్నాటకం అంతా మాయ, మోహ, వ్యామోహం, భ్రమ, భ్రాంతి లతో కూడిన నిజము లాంటి కల అని ….నిరాకార పరబ్రహ్మంగా పరమ శూన్యము గాను…. ఆకార పరబ్రహ్మంగా బ్రహ్మకపాల దర్శనము… సాకార పరబ్రహ్మస్వరూపంగా చితాగ్ని జ్యోతి స్వరూప దర్శన అనుభూతులు…. అలాగే దేనికి స్పందించకుండా… దేని గురించి ఆలోచించకుండా …  దేనిని సంకల్పించకుండా… నిశ్చల స్థితిలో ఉంటే… అదే మోక్ష సాధన స్థితి అని మాలాంటి 477 మంది యోగులకి ఈ అనుభవ అనుభూతులు మిగిల్చిన సంపూర్ణ అద్వైత సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం !
నేను అనేది ఆత్మ అని తెలుసు కుంటే జ్ఞానప్రాప్తి… అయితే నేను అనేది ఆత్మ అని మరచుట శాశ్వత మరణమైనా మోక్షప్రాప్తి అవుతుందని ఈ సిద్ధాంతం చెబుతోంది! ఇట్టి జ్ఞాన అనుభూతి స్థితి పొందుటకు ఈ సిద్ధాంతంలో నవబ్రహ్మ సాధన స్థితులు ఉన్నాయి! అవి

1. ధర్మగుణ బ్రహ్మ  
2. భక్తి బ్రహ్మ 
3. ఆరోగ్య బ్రహ్మ 
4. ధ్యాన బ్రహ్మ 
5. మౌనఃబ్రహ్మ 
6. శబ్దబ్రహ్మ 
7. ఆనందబ్రహ్మ 
8. శూన్య బ్రహ్మ  
9. మోక్ష బ్రహ్మ
 

ఇందులో ధర్మ గుణ బ్రహ్మ అనే సాధన స్థితిలో మనసుకి అలాగే శరీరమునకు సంబంధించి 72 రకాల ధర్మాలు గుణాలు ఉంటాయి! వీటిలో ఏదో ఒకటి ప్రతి రోజూ ఒక దానిని అమలు చేసుకుంటూ పోవడమే ఈ సాధన అభ్యాసం అవుతుంది! దీనివలన మనస్సు శుద్ధి, శరీరం శుద్ధి, ఆత్మశుద్ధి కలుగుతాయి! పాపపు ఆలోచనలు, పాప కర్మఫలితాలు, పాపకర్మలు చేయాలనే తలంపు తగ్గుతాయి! ఒకవేళ వీటిని ఆ రోజు అమలు చేయకపోతే పశ్చాతాపం కలిగి ఉండటం చేయాలి! ఈ ధర్మ గుణాలు వారి వ్యక్తిగత మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి! ఉదాహరణకు దొంగతనం చేయకుండా ఉండటం, వ్యభిచారం చేయకుండా ఉండటం, సాధ్యమైనంతవరకు అబద్ధాలు చెప్పకుండా ఉండటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, మంచి మనసు కలిగి ఉండటం, భూత దయ కలిగి ఉండటం, క్షమా గుణం కలిగి ఉండటం, క్షమించమని అడగటం, ఇతరుల తప్పులు చెప్పకుండా ఉండటం, గ్రంథ పఠనం చేయడం, ఇంద్రియ విషయాల పట్ల వికారంగా ఉండటం, ఇంద్రియ మనో నిగ్రహం ఉండటం, మౌనంగా ఉండటం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అరిషడ్వర్గాలకు దూరంగా ఉండటం, తాగుడు.. క్రోధము కి దూరంగా ఉండటం, పశ్చాతాపం కలిగి ఉండటం, వాదనలకు దూరంగా ఉండటం, మాటలతో …చేతలతో ఇతరులను హింసించకుండా ఉండటం, భయానికి దూరంగా ఉండటం, ఆశ కి దూరంగా ఉండటం, వైరాగ్యబుద్ధి కలిగి ఉండటం, సిగ్గు వలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, సహన శక్తి కలిగి ఉండటం, ధర్మనిష్ట కలిగి ఉండటం, అహం లేకుండా ఉండటం, పొగడ్త లకు దూరంగా ఉండటం, పాతివ్రత్య ధర్మం కలిగి ఉండటం, ఏకాదశి ఉపవాస వ్రతం కలిగి ఉండటం, ధర్మ జీవితం అనుభవించటం, ధర్మ కోరికలు తీర్చుకోవడం, ధర్మ సంపాదన సంపాదించడం, రాగద్వేషాలు లేకుండా ఉండటం, అసూయకి దూరంగా ఉండటం, కోపానికి దూరంగా ఉండటం, మంచి మాట కలిగి ఉండటం, మంచి దృష్టి కలిగి ఉండటం ,మృదు స్వభావం కలిగి ఉండటం, గర్వం లేకుండా ఉండటం, మంచి బుద్ధి కలిగి ఉండటం, త్యాగము కలిగి ఉండటం,  మత్తు పదార్థాల కి మత్తు పానీయాలకు దూరంగా ఉండటం, మంచి సంకల్పం కలిగి ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, శరణాగతి భావం కలిగి ఉండటం, పొగడ్త లకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ జీవితం కలిగి ఉండటం, సాధ్యమైనంతవరకు మంచి పనులు చేయటం, దానాలు ఇవ్వటం, ఉచితంగా ఇతరుల సేవలు పొంద కుండా ఉండటం, మంచి జ్ఞానం కలిగి ఉండటం, వివేక బుద్ధి కలిగి ఉండటం, దొంగ బుద్ధి లేకుండా ఉండటం, బ్రహ్మచర్యమును పాటించటం, నిష్కామ కర్మ చేయడం, ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయడం, అత్యాశలకు దూరంగా ఉండటం ఇలా ఉన్నాయి! ఈ ధర్మాలను… గుణాలను ఏదో ఒకటి మీకు నచ్చిన దానిని ప్రతిరోజు చేసుకుంటూ పోవడం చేస్తే ఈ సాధన అభ్యాసం సంపూర్ణం అవుతుంది!
 
 
భక్తి బ్రహ్మ సాధన స్థితికి వస్తే ఇందులో కర్ణాటక రాష్ట్రంలోని లింగాయతులు ధరించే ఇష్టలింగమును మనము కూడా ధరించవలసి ఉంటుంది! ఈ లింగము తొమ్మిది రకాల పదార్థాలతో నిర్మితమైన నవ లింగం అని గ్రహించండి! ఈ లింగం లో విశ్వకాంతి కలిగి ఉంటుంది! ఈ లింగమును ప్రతినిత్యం మెడలో ఉంచుకోవాలి! అలాగే ప్రతిరోజు ఈ లింగమును ఎడమ చేతిలో ఉంచుకొని ఒక యోగ ప్రార్థన చేయవలసి ఉంటుంది! అది ఏమిటంటే

ఓ సర్వాంతర్యా మి
సర్వకాల సర్వావస్థలయందు నా మనసు ప్రాపంచిక విషయాల నుంచి మరలించి నీ మీద లగ్నం అయ్యేలాగా చెయ్యి స్వామి…..
నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే లాగా స్వార్థం తో కూడిన చర్యలు మాటలు ఆలోచనలు నాలో రాకుండా కాపాడు పరమాత్మ…..
ఈరోజు అలా వచ్చిన వాటికి నాలో ప్రతాపం వచ్చిన వాటికి నాలో పశ్చాతాపం కలిగించి 
ఇక మీద దుష్ట సంకల్పాలు నాలో కలగకుండా చూడు స్వామి…..
 
నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకి…. చీకటి నుంచి వెలుగులోకి
 మృత్యువు నుంచి అమరత్వం వైపుకి… ప్రయాణింప చెయ్యి స్వామి…..
నాలోని చెడువాసనలను… సంస్కారాలను ప్రక్షాళన చేసి మాయ నుంచి 
నన్ను విడుదల చేసి నీ దరి చేర్చుకో స్వామి….
 
నేను అనేక జన్మల గా చేస్తున్న అన్ని పాపపు కర్మలకి నాలో పశ్చాతాపం కలిగించి 
వాటి ఫలితాలను అనుభవించే సమయంలో వాటిని సహనముతో, ధైర్యంతో 
అనుభవించే శారీరక మానసిక స్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని ఇవ్వు స్వామి….
 
నాలోని కామపూరిత కోరికలని.. ద్వేషాన్ని, అసూయని, పగని, అహంకారాన్ని, అరిషడ్వర్గాలను ,సప్త వ్యసనాలను, ఇతర వ్యతిరేక భావాలను 
దహించివేసే స్వచ్ఛమైన వివేక జ్ఞాన బుద్ధిని నాకు ప్రసాదించి 
నాకు ఆధ్యాత్మిక మార్గమును చూపించే పంచ గురువులను నాకు పంపు దేవా….
 
నా వలన ఎవరికీ అపకారం కలగని బుద్ధిని… ఇతరులకి ఇతర ప్రాణులకీ ప్రతిఫలం ఆశించకుండా 
ఉపకారం చేసే మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి…
నాలో కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్య బీజాలు అంకురించి జ్ఞాన యానము వేగంగా పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించు స్వామి……
స్వచ్ఛము, సత్యము, ధర్మము, కరుణ, ప్రేమ ల నుంచి వేరు చేయకు దేవా ….
నువ్వు ఎల్లప్పుడు నాతో ఉండు… నాలో ఉండు.. నేను సదా నీతో ఉండేలా అనుగ్రహించు దేవా ….
ప్రతినిత్యం నీ నామస్మరణ చేసే విధంగా అనుగ్రహించు….
పాహిమాం పాహిమాం పాహిమాం
ఓం సర్వేజన సుఖినోభవంతు
ఓం శాంతి
సర్వం శ్రీ బ్రహ్మార్పణ మస్తు
    ======================================================================================                                                         
గమనిక: కర్ణాటక రాష్ట్రంలోని లింగాయతులు ధరించే నిజమైన  ఇష్ట లింగమును కావాలనుకున్న వారు ….అవి దొరికే నిజమైన ఇష్టలింగాల యొక్క అడ్రస్ ఇవ్వటం జరుగుతుంది!
 
Sri D.P. Shiva swamy (Kanthi Kayaka)
Cell: 9448613441
Sri Sarprabhushana Mutt, Kempegowda circle,
Bangalore – 560 009
 
దీని ఖరీదు సుమారుగా 500 రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది! ఒక అంగుళం పరిమాణంలో ఉన్న దానిని మాత్రమే తీసుకోండి ! దానిని ఒక వెండి బాక్సులో ఉంచి  మెడలో ధరించండి! ఇలా మెడలో ధరించడం వలన మనలోని 72వేల యోగ నాడులు, 13 యోగ చక్రాలు, 112 సూక్ష్మ యోగ చక్రాలకి విశ్వములోని విశ్వ చైతన్య శక్తి అలాగే విశ్వ కాంతి శక్తి మన భృకుటి స్థానము ద్వారా హృదయ చక్రమునకు చేరి రక్తంలో కలిసిపోయి ఈ చక్రాలకు ఉత్తేజం వచ్చి నిశ్చల స్థితికి చేరుతాయి! కావాలంటే ఆ లింగం ఎలా ఉంటుందో మీకు ఈ ఫోటోల ద్వారా చూపిస్తాను చూడండి! మేము 14 సంవత్సరాలు పాటు వెతికితే కానీ మాకు నిజమైన నవపాషాణ ఇష్ట లింగాలు దొరకలేదు! అందుకే అవి దొరికే నిజమైన లింగాల యొక్క అడ్రస్ ఇవ్వటం జరుగుతుంది! ఇందులో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేదు!ఈ లింగాలను ధరించినప్పుడు విశ్వశక్తి అలాగే విశ్వ కాంతి ఇందులో ఉన్నట్లుగా మాకు ధ్యాన అనుభవాలు కలిగాయి ! ఈ లింగాలను ఎవరైనా అనగా స్త్రీ, పురుషులు, చిన్నపిల్లలు ధరించవచ్చును! కాకపోతే ఎవరి లింగాలు వారే ధరించవలెను! ఈ లింగాలు మన శరీరంలో ఒక అంగము లాగా ఉండాలి! మనతో పాటు ఉండాలి! మనము పోయిన తర్వాత మనతోపాటే చితాగ్ని లో దహనం అవ్వాలి!   వీటి సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతాయి!               
                                                                                                      
 
ఆరోగ్య బ్రహ్మ:  ఈ సాధన స్థితిలో  8 (ఎనిమిది) రకాల యోగాసనాలుతో పాటుగా 12 రకాల స్థితులు ఉన్న సూర్య నమస్కారాలు అలాగే 12 రకాల చేతి ముద్రలు ఉంటాయి! వీటిని ప్రతి రోజూ 20 నిమిషాల పాటు అభ్యాసం చేస్తే ఈ సాధన అభ్యాసం వలన మన శరీరంలోని 72 వేల నాడులను ,24 యోగ నాడులను, 13 యోగ చక్రాలు జాగృతి అవుతాయి! శుద్ధి అవుతాయి ! బలహీనంగా ఉన్నవి బలంగానూ, ఆరోగ్యంగానూ తయారవుతాయి! విశ్వ శక్తిని తిరిగి తీసుకుని శక్తివంతముగా తయారవుతాయి! అనారోగ్య సమస్యలు తగ్గుతాయి! వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ! 
ఎనిమిది రకాల యోగాసనాలు అంటే 
1.               గోముఖ 
2.               వీర 
3.               సింహ 
4.               భద్ర 
5.               స్వస్తికాసనం 
6.               పద్మాసనం 
7.               ముక్త 
8.               మయూరాసనం !
ఇక చేతి ముద్రలు అనగా షట్చక్రాల ముద్రలు ఏమిటంటే     
1. మూలాధార చక్రానికి పృద్వీముద్ర లేదా అశ్విని ముద్ర లేదా మహా వేద ముద్ర ఉంటాయి! 
2. ఇంకా స్వాధిష్ఠాన చక్రాని కైతే జల ముద్ర ఉంటుంది! 
3. ఇంకా మణిపూరక చక్రానికి అయితే సూర్య ముద్ర లేదా అగ్నిసార ముద్ర లేదా అపానముద్ర ఉంటాయి! 
4. ఇక అనాహత చక్రానికి అయితే వాయుముద్ర లేదా అపానవాయు ముద్ర ఉంటుంది! 
5. ఇంకా విశుద్ధ చక్రానికి అయితే ఆకాశ ముద్ర లేదా ఉదాన ముద్ర ఉంటుంది! 
6. ఇంకా ఆజ్ఞా చక్రానికి అయితే జ్ఞానముద్ర లేదా ప్రాణముద్ర లేదా అంజలి ముద్ర లేదా ఆగోచరి ముద్రలు ఉంటాయి ! 
7. ఇక సహస్ర చక్రానికి అయితే శూన్య ముద్ర ఉంటుంది! ఇలా చేతి ముద్రలతో ప్రతి రోజూ 20 నిమిషాల పాటు సాధన చేస్తే మనలో ఉన్న యోగ చక్రాలు జాగృతి, శుద్ధి అవుతాయి!
 
  
ధ్యాన బ్రహ్మ: ఈసాధన స్థితిలో 12 రకాల చక్ర ధ్యానాలు ఉంటాయి! ప్రతి రోజు మీకు నచ్చిన చక్ర తత్వమును బట్టి మీరు ఏదో ఒక చక్ర ధ్యానమును ఎంచుకుని ప్రతి రోజు దానిని చేస్తే ఇలా ఆరు నెలల పాటు అదే చక్ర ధ్యానం చేసుకుంటూ పోతే ఆ చక్రం శుద్ధి అవుతుంది! ఆ చక్రం జాగృతి శుద్ధి అవుతుంది! తద్వారా గత జన్మలో… రాబోవు జన్మలో.. చేసిన ..చేయబోయే.. పాప కర్మల నుండి, గత కర్మల నుండి, ఈ కర్మ ఫలితాల నుండి విముక్తి కలుగుతుంది! ఈ సాధన అభ్యాసం వలన యోగ చక్రాలు శుద్ధి అవ్వటము అవుతుందని గ్రహించండి! ఈ చక్ర ధ్యానాలను చేస్తున్నప్పుడు ఆయా దేవతల దైవిక వస్తువులు రావాల్సి ఉంటుంది! తప్పకుండా వస్తాయి! వచ్చిన వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి! అలాగే ఈ చక్ర ధ్యాన జ్ఞానము వలన యోగసిద్ధులు, యోగ శక్తులు వస్తాయి! వీటి మాయ యందు పడకుండా జాగ్రత్తగా ఉండాలి! ఏ సిద్ది మాయ దగ్గర ఆగిపోయినారో ఆ చక్ర స్థితి వద్దనే ఈ చక్ర సాధన పరిసమాప్తి అవుతుందని గ్రహించండి!
 ఈ చక్ర సాధనలో ఒక్కొక్క చక్రమును ఆరు నెలల పాటు చేయవలసి ఉంటుంది అని గ్రహించండి! ఒక చక్ర ధ్యానమును ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించిన దైవిక వస్తువులు వచ్చిన తర్వాత రెండవ చక్ర ధ్యానమును చేసుకోవాలి! ఇలా 12 చక్రాల కి 6 నెలల చొప్పున 72 నెలలు పడుతుందని అనగా ఆరు సంవత్సరాలు పడుతుందని గ్రహించండి! మీ చక్ర సాధన స్థితిని బట్టి ఈ చక్ర ధ్యాన స్థితి.. సమయ స్థితి ఆధారపడి ఉంటుందని గ్రహించండి! 
1. మూలాధార చక్ర సాధన స్థితి కోసం ఏదైనా పూలవాసన జ్ఞాపకం ఉంచుకుని చక్ర ధ్యానము చేస్తూ ఉండాలి!
 2. అదే స్వాధిష్ఠాన చక్రమునకు అయితే వివిధ రకాల పదార్థాలను జ్ఞాపకం తెచ్చుకుని ఆ రుచులను అనుభవిస్తున్నట్లుగా భావించుకుంటూ చక్ర ధ్యానము చేయవలసి ఉంటుంది!
3. ఇంకా మణిపూరక చక్రానికి అయితే జీవితం లో జరిగిన సంతోషకరమైన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ చక్ర ధ్యానము చేయవలసి ఉంటుంది!
4. ఇక అనాహత చక్రము కోసం అయితే వివిధ రకాలైన స్పర్శలు అనుభవిస్తున్నట్లుగా భావన చేసుకుంటూ చక్ర ధ్యానము చేయవలసి ఉంటుంది!
5. విశుద్ధ చక్రమును అయితే వివిధ రకాల శబ్దాలను జ్ఞాపకం తెచ్చుకుని ధ్యానం చేయవలసి ఉంటుంది!
6. ఇక ఆజ్ఞా చక్రమునకు అయితే మనసులో నుంచి వచ్చే ఓంకార నాదమును వింటూ ధ్యానం చేయవలసి ఉంటుంది!
7. సహస్ర చక్రమునకు అయితే ఆలోచనలు లేని స్థితిని కలిగి ఉండాలి.. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయే స్థితి కలిగి ఉండాలి.. స్థిర మనసుతో ఏకాగ్రతతో కూడిన ధ్యానం లో ఉండాలి !
8. ఇక హృదయ చక్రమునకు అయితే తుంకారనాదము వినే స్థితిలో ధ్యానములో ఉండాలి!
 ఇలా ప్రతి రోజు మీకు నచ్చిన ఏదో ఒక చక్ర ధ్యానమును అరగంట సేపు చేయాలి! ఆరు నెలలు పాటు అదే చక్రధ్యానమును చేయాలి! అప్పుడే జాగృతి, శుద్ధి అవుతుంది! ఈ చక్రము జాగృతి, శుద్ధి అయినట్లుగా దానికి సంబంధించిన దైవిక వస్తువులు రావాల్సి ఉంటుంది! ఇలా వచ్చిన ఈ వస్తువులను దాచుకుని మరో చక్ర ధ్యానమును చెయ్యాలి!
 
  
మౌన బ్రహ్మ: ఈసాధన స్థితిలో ప్రతిరోజు 60 నుండి 90 నిమిషాల పాటు ఏదో ఒక సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి! రానురాను ఎవరితోనూ మాట్లాడాలని అనిపించని స్థితి అయిన మౌన బ్రహ్మ స్థితి అనగా మేధా దక్షిణామూర్తి లాగా, రమణ మహర్షి లాగా, త్రైలింగస్వామి లాగా.. మౌని బ్రహ్మగా మారిపోతారు! ఒకవేళ మౌనంగా ఉంటే సమయములో మాట్లాడే పరిస్థితి వస్తే కాగితం మీద జవాబులు రాయండి! అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అని గ్రహించండి! ప్రతిరోజు మౌనవ్రతం వల్లనే ఎన్నో లాభాలు కలుగుతాయి! దీనివలన మనలో కుండలిని శక్తి వలన నాడులు,యోగచక్రాలు జాగృతి, శుద్ధి అయ్యే క్రమంలో మనలో ఎన్నో రకాల ఒత్తిడులు, ఆందోళనలు, ఆవేదనలు, ఆనందాలు, అనుభవాలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయి! ఆవేశాలు, అత్యాశలు, భయాలు, సంతోషాలు కలుగుతూ ఉంటాయి! ఇవి అన్నీ కూడా గత జన్మలో చేసిన కర్మ ఫలితాల వలన జరుగుతుంది! ఈ ప్రాణశక్తి అలాగే కుండలినీ శక్తి వృధా కాకుండా ఉండాలి! అంటే మౌనంగా ఉండాలి! తద్వారా మీ శక్తి వెయ్యి రెట్లు పెరుగుతుంది! లేదంటే అనవసరపు మాటల వలన, గొడవల వలన, సలహాలు వలన, కలహాల వల్లన ఈ శక్తి వృధా అయ్యే అవకాశాలు ఉంది! నాడులు, యోగ చక్రాలు బలహీనపడి తీవ్రమైన అనర్ధాలకు అలాగే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి! తప్పనిసరిగా ప్రతి రోజు మౌనంగా ఉండటం అభ్యాసం చేయాలి! ప్రతిరోజు మౌనవ్రతం వల్లనే ఎన్నో లాభాలు కలుగుతాయి !
1.               మీ అస్థిర మనసు స్థిరంగా మారుతుంది.
2.                మీ అవివేక బుద్ధి కా స్తా వివేక బుద్ధిగా మారుతుంది.
3.                మీకు నేను అనే అజ్ఞానం పోయి నిజమైన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
4.                వాదనలు గొడవలు తగ్గుతాయి.
5.                మానసిక శారీరక ఆందోళనలు తగ్గుతాయి.
6.                కోపతాపాలు ఆవేశాలు తగ్గుతాయి.
7.                నిదానంగా అన్నింటిని ఆలోచించే స్థితి కలుగుతుంది.
8.                అశాంతి నుండి మనశ్శాంతి వైపు కి వెళతారు.
9.                మానసిక శారీరక ఆరోగ్యం పెరుగుతుంది.
10.         అనుకున్న కోరికలు సిద్ధింప చేసుకోవటానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
11.         అద్భుతమైన వివేక జ్ఞాన శక్తి కలుగుతుంది.
12.         వృధా కాలయాపన తగ్గుతుంది. 
13.        క్షమ, క్షమించే గుణం పెరుగుతుంది.
14.         అహంకారం తరుగుతుంది.
15.         మాయా మర్మాలు తెలుస్తాయి.
16.         స్పందనలు తగ్గుతాయి… స్పందించడం తగ్గుతుంది.
17.         తపన తాపత్రయం తగ్గుతాయి.
18.         మీ మాట కాస్త దైవవాక్కు గా మారుతుంది.
19.         ఆలోచనలు తగ్గుతాయి.
20.         మీరు చెప్పినది వేదవాక్కు అవుతుంది.
21.         మీరు చెప్పినదే శాసనము అవుతుంది. 
22.        అన్ని రకాల భయాలు నుండి విముక్తి కలుగుతుంది.
23.         కోరికలు తగ్గుతాయి.
24.         శరణాగతి భావం పెరుగుతుంది.
25.         ఇంద్రియ మనోనిగ్రహం పెరుగుతుంది. 
 
 
శబ్ద బ్రహ్మ : ఈ సాధన స్థితిలో అత్యంత ఏకాగ్రత మనసుతో మనలో వచ్చే వివిధ రకాల శబ్దాలు వినటం అభ్యాసం చేసుకోవాలి! అంత తేలిగ్గా వచ్చే స్థితి కాదని గ్రహించండి! మన శరీరంలో వచ్చే శబ్దం… అది వినటానికి చాలా కష్టపడవలసి వస్తుంది! ఒకటి గుర్తుంచుకోండి! ఈ శబ్దాలు మనము సాధారణంగా చెవులతో వినలేము! వినటానికి బలవంతంగా ప్రయత్నాలు చేస్తే చెముడు వచ్చే అవకాశాలు ఉన్నాయి! సంపూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది! కాబట్టి ఈ నాదాలు వినాలి అంటే మన మనసు స్థిరమై ఏకాగ్రత స్థితి పొందినప్పుడు నిశ్చల స్థితి వల్లన మన శరీరం లోపల నుండి వాటంతట అవే నాదాలు చాలా సహజ సిద్ధంగా మనకి వినపడతాయి! అంతేకాని బలవంతంగా మన చెవులతో నాదాలు వినడానికి ప్రయత్నం చేయరాదని మనవి! స్థిరంగా కూర్చుని లేదా శవాసనంలో పడుకుని రెండు చూపుడు వ్రేలును మన చెవులలో పెట్టుకుని అనగా బయట శబ్ధాలు మనకి వినపడకుండా చూసుకోవాలి అన్నమాట!లేదా శబ్ధాలు వినిపించకుండా ఉండటానికి ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చును! నాదాలను వినవచ్చును! ఎప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఈ సాధన ప్రక్రియను చేసుకోవాలి ! ప్రతి రోజూ 20,48,60,96 నిమిషాల పాటు ఈ నాదములు వినటానికి అభ్యాసం చేసుకోవాలి! మొదట మన బొడ్డు నుండి గుయ్యి.. గుయ్యి.. వినపడుతుంది! ఆపై తుమ్మెదల నాదము, సముద్రపు ఘోష, వాయు ఘోష, ఘంటానాదము, వేణునాదము, వీణానాదం, ఓంకార నాదం, శంఖధ్వని, ఢమరుక నాదము, తుంకారనాదము వినపడుతుంది! ఈ నాదాలు వినడం ద్వారా సాధకుడికి యోగ చక్రాలు ఆధీనమై యోగసిద్ధులు, యోగ శక్తులు వస్తాయి! కాబట్టి వీటిలో మాయలో పడకుండా సాధకుడు జాగ్రత్తగా ఉండి తమ యోగసాధనను ముందుకి కొనసాగించాలి! 
 
 
ఆనంద బ్రహ్మ: యోగసాధన చేయటం వలన మన శరీరము అలాగే మన మనసు విపరీతంగా మానసికంగాను, శారీరకంగాను బాగా అలిసి పోవడం జరుగుతుంది! శరీర భాగాలు, నాడులు,యోగచక్రాలు, కండరాలు అలిసి పోతాయి! వీటికి విశ్రాంతి ఇవ్వటం వలన మనలో విశ్వ శక్తి చేరి ఆయా చక్రాలు లోనికి ప్రవేశించి మనలని ఉత్తేజితం చేస్తాయి! ఆనంద స్థితిలో ప్రశాంతంగా ఉంచుతాయి! సాధన కోసం సాధకుడు శవాసనంలో ప్రతి రోజూ 20 నిమిషాల పాటు ఎలాంటి ఆలోచన లేకుండా నిద్ర - మెలుకువ కాని స్థితి కలిగి ఉండి సాధన అభ్యాసం చేస్తూ ఉంటే అది యోగనిద్ర అవుతుంది! ఈ యోగ నిద్ర లోనే మనకి విశ్రాంతి కలుగుతుంది! మనకి మన శరీరానికి, ఆత్మకి ,మనసుకి మనశ్శాంతి కలుగుతుంది! ఆనందం కలుగుతుంది! భోగనిద్ర లో కలలు, ఆవేదనలు, ఆలోచనలు, ఆవేశపూరిత, సంతోషము కలిసిన కలత నిద్ర ఉంటే …. అదే యోగనిద్రలో మీకు బయట వ్యక్తులు, బయట శబ్దాలు లీలగా వినపడినప్పటికీ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటికి స్పందించకుండా సాక్షిభూతంగా అలా గమనిస్తూ ఉంటాయి! శరీరానికి, మనసుకి శాంతి కలుగుతుంది! అంటే విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది! ఈ నిద్ర వలన బ్రహ్మ రంధ్రము ద్వారా విశ్వములోని విశ్వ చైతన్య శక్తి అలాగే విశ్వ కాంతి శక్తి తీసుకుని యోగ చక్రాలు శక్తివంతముగా తయారవుతాయి! ఈ నిద్ర సాధన కోసం సాధకుడు ప్రతిరోజూ నీ మనసుతో అన్ని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ క్షమించుకుంటూ… క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలి! మీ మనసే మీకు గురువు గాను, స్నేహితుడు గాను, బంధువు గాను, దైవం గాను ఉంటుందని గ్రహించండి! మనసుతో మౌన భాషలో మౌనంగా మాట్లాడుకుంటూ ఉండాలి అన్న మాట! ఇలా చేసుకుంటూ పోతే మనకు తెలియకుండానే యోగ నిద్ర వస్తుంది! యోగ నిద్ర అరగంటసేపు నుండి నాలుగు గంటల సేపు వరకు పడుతుంది ! ఇలాంటి నిద్ర వలన ఆరునెలలపాటు భోగ నిద్ర అవసరం ఉండదు!
 

 శూన్య బ్రహ్మ:  ఈసాధన స్థితిలో ప్రతి సాధకుడు ప్రతి రోజూ సుఖాసనములో లేదా శవాసనంలో స్థిర మనసుతో , స్థిర బుద్ధితో ఉండి 20 నిమిషాల నుండి 90 నిమిషాల పాటు దేని గురించి ఆలోచించకుండా… దేనికి స్పందించకుండా… దేని గురించి సంకల్పించకుండా అలవాటు చేసుకుంటూ పోతే ప్రారంభ సమాధి పొందడం జరుగుతుంది! ఇది కూడా అంత తేలికైన స్థితి కాదని గ్రహించండి! ఈ స్థితిలో మీరు 48 నిమిషాలపాటు ఉంటే మీ సాధన స్థితి సవికల్ప సమాధి స్థితి గాను ఆపై 48 నుండి 96 నిమిషాల పాటు ఈ సాధన స్థితి ఉంటే నిర్వికల్ప సమాధి స్థితి గాను ఆపై 96 నుండి 672 నిమిషాల పాటు ఈ సాధన స్థితి ఉంటే తురీయా సమాధి స్థితి గాను ఆపై 672 నిమిషాల దాటితే తురీయాతీత సమాధి స్థితి అని చెప్పడం జరుగుతుంది! ఇలాంటి బ్రహ్మ స్థితిని పొందిన వారిని శూన్య బ్రహ్మ అంటారు! ఈసాధన స్థితిలో 96 నిమిషాలపాటు ఎవరైతే ఈ స్థితిలో ఉండగలిగితే వారికి ఒక మన్వంతరం లో జరిగిన సంఘటనలు, విషయాలు సమస్తము తెలుస్తాయి! వారి మనో దృష్టికి అనగా త్రినేత్రం ముందు వాటి దృశ్యాలు కనపడతాయి! ప్రస్తుతానికి మనకి 14 మన్వంతరాలు జరిగినాయి! ఈ మన్వంతరాలు దృశ్యాలు చూడాలి అంటే సాధకుడు 96 x 14 = 672 నిమిషాలపాటు(భూలోక మనుష్య కాలమాన ప్రకారం) ఈ స్థితిలో ఉంటే అన్ని మన్వంతరాలు దృశ్యాలు కనపడతాయి! 
 
 
మోక్ష బ్రహ్మ: ఈసాధన స్థితిలో సాధకుడు తన బ్రహ్మరంధ్రము వద్ద ఆకాశ శరీరముతో దైవ కాలమాన ప్రకారం 96 నిమిషాల పాటు దేని గురించి ఆలోచించకుండా… దేనికి స్పందించకుండా… దేనిని సంకల్పించకుండా అక్కడ ఉండే మూల కపాలము లోని చితాగ్ని తన ఆకాశ శరీరమును సంపూర్తిగా దహనం చేసుకోగలిగితే వారికి మూల కపాల మోక్షం కలుగుతుంది! శాశ్వత మరణం ఇచ్చే కపాలమోక్షం అవుతుంది! కానీ ఇంతవరకు ఈ స్థితిని ఎవరూ పొందలేదు! ఈసాధన స్థితిని ఆదియోగి అయిన పరమేశ్వరుడు 48 నిమిషాల పాటు మాత్రమే చితాగ్ని  దహన శక్తిని తట్టుకోగలిగి ఆపై తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు! భూలోక మనుష్య కాలమాన ప్రకారం 96 నిమిషాల అంటే 30,67,20000 కోట్ల సంవత్సరాలు (ఒక మన్వంతరం) అన్నమాట! ఈ దహన శక్తికి అధిదేవతగా ఆదిపరాశక్తి ఉంటుంది! ఈమె దీప దుర్గ గా … దీప కాళికామాత గా… దీప చండీమాత గా మూడు రూపాలతో ఉంటుంది! సాధకుడు తన మూల కపాలము లోని మొత్తం 36 బ్రహ్మకపాలాలకి కపాలమోక్షం జరగవలసి ఉంటుంది! దీని కోసము చితాగ్ని దహన స్థితి యొక్క 10 లక్షల దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి! కానీ ఆదియోగి అయిన పరమేశ్వరుడు లక్ష దహన శక్తి కి వచ్చేసరికి దానిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు! అప్పుడు ఆదిపరాశక్తి తారాదేవి గా వచ్చి చను పాలు ఇచ్చి దహన శక్తి నుండి విముక్తి కలిగించింది! అలాగే బ్రహ్మ దేవుడికి ఈ స్థితికి వచ్చేసరికి తట్టుకోలేకపోతే జమ్మి ఆకుల ద్వారా శాంతి పొందినాడు! అలాగే మహాగణపతి ఈ స్థితికి వచ్చేసరికి తట్టుకోలేకపోతే గరిక ద్వారా మనశ్శాంతి పొందాడు! అదే నరసింహస్వామి అయితే మేడి ఆకుల ద్వారా… దత్తాత్రేయుడు అయితే మేడి ఆకుల ద్వారా… విష్ణుమూర్తి అయితే తులసి ఆకుల ద్వారా…. హనుమంతుడు అయితే తమలపాకులు ద్వారా శాంతిని పొందడం జరిగింది! దానితో ఇంతవరకు ఎవరూ కూడా మోక్ష బ్రహ్మ కాలేకపోయారు! మూల కపాల మోక్షం సిద్ది పొందలేకపోయారు!

ఇలా ధర్మ గుణ బ్రహ్మ సాధన స్థితి వలన బాహ్య ,అంతర శుద్ధి పొందడం ….భక్తి బ్రహ్మ సాధన స్థితి వలన స్థిరమనసు, స్థిర బుద్ధి వివేక వైరాగ్యం పొందడం …ఆరోగ్య బ్రహ్మ సాధన స్థితి వలన నాడులు, యోగచక్రాలు, కుండలినీ శక్తి లో కదలికల ఏర్పడి జాగృతి అయ్యి… ధ్యానబ్రహ్మ సాధన స్థితి వలన యోగ చక్రాలు శుద్ధ స్థితిని పొంది… మౌన బ్రహ్మ సాధన స్థితి వలన కుండలినీశక్తిని తట్టుకునే స్థితిని పొంది… శబ్ద బ్రహ్మ సాధన స్థితి వలన యోగ చక్రాలు ఆధీన స్థితి పొంది… ఆనందబ్రహ్మ సాధన స్థితి వలన యోగ నిద్ర స్థితి పొంది… శూన్య బ్రహ్మ సాధన స్థితి వలన అనితర సాధ్యమైన సమాధుల స్థితి పొంది… మోక్ష బ్రహ్మ సాధన స్థితి వలన మూల కపాల మోక్షం పొందడం జరుగుతుంది! తద్వారా ఈ నవబ్రహ్మ సాధన వలన కర్మ, జన్మ, పునర్జన్మ రాహిత్యాలు పొంది అద్వితీయమైన ఆత్మ శాంతి కలిగించే ప్రశాంత స్థితిని పొందడం జరుగుతుంది! జీవన్ముక్తి పొందండి! ఇలాంటి యోగసాధనలో జయం పొందండి! 

పైన చెప్పిన నవబ్రహ్మ స్థితిలో మీకు బాగా నచ్చి… మీరు చేయగలిగిన దానిలో ఒక దానిని ఒక బ్రహ్మ స్థితి తీసుకుని ప్రతి రోజు క్రమం తప్పకుండా… వేళ తప్పకుండా… వాయిదాలు వెయ్యకుండా 20 నిమిషాల నుండి 48 నిమిషాల దాకా చేయండి! ఇలా పన్నెండు సంవత్సరాల పాటు సాధన చేయవలసి ఉంటుంది! మీరు ఎంచుకున్న సాధన స్థితిని మార్చకూడదు! ఇప్పుడే మీరు మూల కపాల మోక్ష సాధన స్థితికి కచ్చితంగా చేరుకోగలరు! మీరు ఎంచుకున్న ఏ బ్రహ్మ సాధన స్థితి అయినా కూడా మీలోని యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదనము చేస్తాయని గుర్తించండి ! అలాగే ఈ సాధన స్థాయిని సాధన పరిసమాప్తి అయ్యే హృదయ చక్రములోని ఇష్ట లింగేశ్వరుడు దాకా తీసుకుని వెళతాయి! ఆపై సాధన చేయటానికి ఏమీ ఉండదు! కానీ ఈ చక్రము వద్ద మీ సంకల్ప శరీరము …దేని గురించి ఆలోచించకుండా… దేనికి స్పందించకుండా… దేని గురించి సంకల్పించకుండా ఉండగలిగితే అనగా శూన్య  బ్రహ్మ  స్థితిని మీరు పొందగలిగితే అప్పుడు ఈ శరీరం కాస్త ఆకాశ శరీరంగా మారి బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న చితాగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోగలిగితే మోక్ష బ్రహ్మగా మూల కపాల మోక్షం కలుగుతుంది! లేదంటే శూన్య బ్రహ్మగా మిగిలిపోతారు! హృదయచక్రము వద్ద మీరే భగవంతుడు అనగా అహంబ్రహ్మాస్మి స్థితిని పొందుతారు! కాబట్టి మీకు మీరే స్వయంగా బ్రహ్మరంధ్రం వద్ద మీ ఆకాశ శరీర సాధన స్థాయిని పరీక్ష చేసుకోవలసి ఉంటుంది! చితాగ్ని యొక్క దహన శక్తిని మీ ఆకాశ శరీరము తట్టుకోవలసి ఉంటుంది! మీ శరీరము పూర్తిగా దహనం అవ్వాలి! అప్పుడే మీకు మూల కపాల   మోక్ష ప్రాప్తి కలుగుతుంది ! ఈ స్థితిని ఇంతవరకు ఎవరూ కూడా పొందలేదని గ్రహించండి! ఈ స్థితిని పొందటానికి మన సాధన శరీరము ఏర్పడిందని.. ఈ విశ్వ సృష్టి జరిగింది అని తెలుసుకోండి!  సాధన సాధ్యతే సర్వం సాధ్యం! జయం పొందండి! 

అంతెందుకు ఆదియోగి అయిన మహాశివుడు కేవలం ఒక శబ్ద బ్రహ్మ సాధన స్థితి ద్వారా మూల కపాల మోక్షం వరకు వచ్చాడని శివపురాణం చెబుతోంది! అలాగే నా గురుదేవుడు అయినా శ్రీ త్రైలింగస్వామి కూడా ధర్మగుణ బ్రహ్మ  అను ఒక బ్రహ్మ స్థితిని ఎంచుకుని ప్రస్తుతానికి మౌనంగా మౌన బ్రహ్మగా కారణ శరీరంతో కాశీ క్షేత్రము నందు సంచారం చేస్తున్నారు! కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఈ సాధన స్థితిలో భక్తి బ్రహ్మ స్థితి ని ఎంచుకుని కంచి కామాక్షి దేవి నిత్యారాధన చేసి మౌన బ్రహ్మగా మారి నారని  వారి  జీవిత చరిత్ర ద్వారా తెలిసినది! 
అలాగే మేము కూడా శబ్దబ్రహ్మ సాధన స్థితిని ఎంచుకుని 27 సంవత్సరాల పాటు సాధన చేస్తే ప్రస్తుతానికి మేము మౌనఃబ్రహ్మగా మారి … మా యోగసాధన అనుభవ అనుభూతి సారాంశమే కపాల మోక్షం  గ్రంథం అని తెలుసుకోండి! అలాగే సంపూర్ణ అద్వైత సిద్ధాంతం నిజమైన సాధన విధి విధానం అని గ్రహించండి! మూల గణపతి నుండి మూల కపాలం ద్వారా నిర్విఘ్నంగా సాధన పరిపూర్ణంగా చేస్తుందని గ్రహించండి! పరమ శూన్యస్థితి అనుభవ అనుభూతినిచ్చే శూన్య బ్రహ్మగా మరిచిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తీసుకువస్తుందని గ్రహించండి! కానీ నిజానికి దేవుడు లేడు! నీవే దేవుడివి! ఈ విశ్వమంతా  మిథ్య అని ….ఈ విశ్వ జగన్నాటకం అంతా మాయ, మోహ, వ్యామోహం, భ్రమ, భ్రాంతి లతో కూడిన నిజము లాంటి కల అని ….నిరాకార పరబ్రహ్మంగా పరమ శూన్యము గాను…. ఆకార పరబ్రహ్మంగా బ్రహ్మకపాల దర్శనము… సాకార పరబ్రహ్మస్వరూపంగా చితాగ్ని జ్యోతి స్వరూప దర్శన అనుభూతులు…. అలాగే దేనికి స్పందించకుండా… దేని గురించి ఆలోచించకుండా … దేనిని సంకల్పించకుండా… నిశ్చల స్థితిలో ఉంటే… అదే మోక్ష సాధన స్థితి అని…. 
నేను అనేది ఆత్మ అని తెలుసు కుంటే జ్ఞానప్రాప్తి… 
అయితే నేను అనేది ఆత్మ అని మరచుట 
శాశ్వత మరణమైన మోక్షప్రాప్తి అవుతుందని……
ఇదే సత్య బ్రహ్మజ్ఞానము… ఇదే సత్య జ్ఞానఅనుభవ అనుభూతి… 
ఇదే పూర్ణ సాధన బ్రహ్మస్థితి… ఇదే పరిపూర్ణ అనుభవ బ్రహ్మస్థితి…
 ఇదే సంపూర్ణ నిశ్చల స్థితి …
ఇదే ప్రశాంత ఆత్మ శాంతి స్థితి

 

ఈ యోగ సిద్ధాంతమును ఆమోదించిన ఆధ్యాత్మిక గురువులు 

1.   శ్రీ త్రైలింగస్వామి - వారణాసి 
2.   శ్రీ శ్యామాచరణ లాహిరి - వారణాసి 
3.   షిరిడి సాయిబాబా - షిరిడి 
4.   రామకృష్ణ పరమహంస - కలకత్తా 
5.  శ్రీ శారదా దేవి - కలకత్తా 
6.  శ్రీ రమణ మహర్షి - అరుణాచలం 
7.  బుద్ధ భగవాన్ - బుద్ధగయ 
8.  రుషి అరవింద - బెంగాలీ 
9.  సంత్ కబీర్ దాస్ - కాశి 
10.              తాడేపల్లి రాఘవ శాస్త్రి - చందోలు 
11.              పీతాంబర్ యోగి - హరిద్వార్ 
12.              విచిత్ర వేదాంతి - ఉజ్జయిని
13.             స్వామి రామతీర్థ - హిమాలయాలు 
14.             శ్రీ పూర్ణనంద స్వామి- శ్రీశైలం
15.             శ్రీపాద శ్రీవల్లభ - పిఠాపురం 
16.             లక్ష్మీ నరసింహ సరస్వతి - గానుగాపురం 
17.             గోరఖ్ నాథ్ - హిమాలయాలు 
18.             శ్రీ ప్రణవానంద - కలకత్తా 
19.             మాస్టర్ సి.వి.వి - కుంభకోణం 
20.             థునివాలా బాబా  - సాయిఖండ 
21.              అక్కమహాదేవి -  శ్రీశైలం 
22.              అక్కలకోట స్వామి - అక్కలకోట 
23.              తాజుద్దీన్ బాబా - నాగపూర్ 
24.              సినారే స్వామి - శ్రీశైలం 
25.              శ్రీ అరవింద అఘోరీబాబా - హరిద్వార్
26.             కవి రాజు గోపీనాథ్ - కాశి 
27.             మిలారేపా  లామా- టిబెట్ 
28.              శ్రీ బసవేశ్వర యోగి -  కర్ణాటక 
29.              కళ్యాణ్ దాసు బాబా - హిమాలయాలు 
30.              మాణిక్య ప్రభు - హూన్నాబాద్ 
31.              శ్రీ వేదవ్యాసుడు - హిమాలయాలు 
32.              శ్రీ వాసుదేవానంద సరస్వతి - గుజరాత్ 
33.              శ్రీ పవనానంద సరస్వతి -  కాశి 
34.              విద్యాప్రకాశానందగిరి - శ్రీకాళహస్తి 
35.              శ్రీ చంద్రశేఖర సరస్వతి - కంచి                                                                                              36.             శ్రీ బాబా విభూతి నాథ్ – కాశి

గమనిక :-  వీళ్ళందరూ నా ధ్యానస్థితిలో ఆత్మ అనుసంధానమై వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది! అంటే వారి సూక్ష్మ శరీర దర్శనాలు పొందడం జరిగినది! 
  
 
ఈ యోగ సిద్ధాంతంలోని శబ్ద బ్రహ్మ సాధన స్థితిని సాధన చేయటం వలన మా యొక్క యోగ చక్రాల యందు అగుపించిన  నామ రూప దైవాలు 

1.  సర్వేశ్వరుడు - పరమ శూన్యం 
2.  ఆదిపరాశక్తి  - చితాగ్ని - బ్రహ్మ రంధ్రం 
3.  దీప చండీమాత - చితాగ్ని - బ్రహ్మ రంధ్రం
4.  దీప కాళికామాత - చితాగ్ని - బ్రహ్మ రంధ్రం
5.  దీప దుర్గా మాత - చితాగ్ని - బ్రహ్మ రంధ్రం
6.  సదాశివమూర్తి - బ్రహ్మ రంద్రం-  మూల కపాలం 
7.  ప్రత్యంగిరా మాత, ఉగ్రనరసింహ స్వామి – బ్రహ్మనాడి  
8.  ఇష్ట లింగేశ్వరుడు - హృదయ గ్రంధి 
9.  ఇష్టకామేశ్వరి, ఇష్టకామేశ్వరుడు - హృదయ చక్రం
10.             ఆది అనంతపద్మనాభుడు - హృదయ చక్రం 
11.             పంచముఖ హనుమంతుడు - జీవనాడి 
12.             శ్రీ చిదంబర దక్షిణామూర్తి - సహస్ర చక్రము 
13.             కుమారస్వామి , అయ్యప్ప స్వామి - సహస్ర చక్రము - పరంజ్యోతి స్వరూపం 
14.             చిన్నమస్తా దేవి - సహస్ర చక్రం 
15.             వటపత్ర సాయి - సహస్ర చక్రం
16.             శ్రీ రాధ కృష్ణుడు - సహస్ర చక్రం 
17.             శ్రీ ఆది మహా విష్ణువు - సహస్ర చక్రం 
18.             శ్రీ ఆది బ్రహ్మదేవుడు - బ్రహ్మ చక్రం 
19.             చిదంబర నటరాజ (ఏకపాదుడు) - బ్రహ్మ చక్రం 
20.             మహా కాలభైరవుడు, మహా కాల భైరవి - కాలచక్రం 
21.             శ్రీ సీతా రాముడు - కర్మ చక్రం 
22.             శ్రీ అనఘా దత్త స్వామి - సురభి గోమాత - గుణ చక్రము 
23.             అర్ధనారీశ్వరుడు (కాశి విశ్వనాధ్ విశాలాక్షి) - ఆజ్ఞాచక్రము 
24.              త్రిమూర్తి బ్రహ్మదేవుడు- సరస్వతి - ఆజ్ఞాచక్రము 
25.             త్రిమూర్తి విష్ణుమూర్తి-లక్ష్మీ - ఆజ్ఞాచక్రం 
26.             త్రిమూర్తి మహేశ్వరుడు-మహేశ్వరీ - ఆజ్ఞాచక్రము 
27.             మహా సరస్వతి - విశుద్ధి చక్రము 
28.             మహా గాయత్రీ - విశుద్ధి చక్రము 
29.             హయగ్రీవుడు - విశుద్ధి చక్రము
30.             మహాకాలుడు, మహా కాళిక - అనాహత చక్రం
31.             పూరీ జగన్నాథుడు - అనాహత చక్రం (కల్ప వృక్ష చక్రం) 
32.             రుక్మిణి పాండురంగడు - మణిపూరక చక్రం 
33.             నారాయణ మహాలక్ష్మీదేవి - స్వాధిష్టాన చక్రం 
34.             మహాగణపతి - మూలాధార చక్రం 
35.             నాగేంద్ర స్వామి – కుండలినీ- అజ్ఞాన గ్రంథి
36.             బాలా త్రిపుర సుందరి - త్రీ గ్రంధులు 
 
గమనిక :- ఇక ఈ సిద్ధాంతం లోని నవబ్రహ్మ స్థితుల్లో శబ్ద బ్రహ్మ సాధన చేస్తున్న సమయంలో మా యొక్క యోగ చక్రాల యందు దర్శించిన దైవ స్వరూప దర్శనాలు అగుపించాయి! మాకు వీరి నుండి వారి దైవిక వస్తువులు, దైవ ప్రసాదాలు రావడం జరిగినది!
 

ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతము చెప్పిన నవబ్రహ్మ యోగ విధివిధానాలతో యోగసాధన చేసి అందులో జయం పొంది కపాల మోక్షప్రాప్తి పొందుతారని ఆశిస్తూ.......మా ఆశీస్సులు …………

ఓం సర్వేజన సుఖినోభవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:!
సర్వం శ్రీ బ్రహ్మార్పణ మస్తు!
*****
తద్వారా నిజ సాధకుడికి ఈ నవ యోగ విధివిధానము వలన నేను లేను...సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అనే అనుభవానుభూతులు కల్గడము మొదలు అవుతాయి.దానితో మేము కాస్త ఇట్టి స్ధితిలో సమాధిగీత రచించడము జరిగినది.ఇంకా ఆలస్యమెందుకు...ముందుకి వెళ్ళి ఈ గీతను చదవడము ఆరంభించండి.

శుభంభూయాత్

పరమహంస పవనానంద

********************************
 


1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి