అధ్యాయం 90

నేను లేను
(సంపూర్ణ మోక్షమును పొందలేమా?)
 
 సర్వ కర్మలు అనగా పంచ శరీరాలలో పంచకర్మలు కర్మ శేషము లేకుండా నివారణ చేసుకోగలిగితే పొందే పంచ శరీర కపాలమోక్షం స్థితిని పూర్ణ మోక్షం అని మీరు తెలుసుకున్నారు కదా. అలాగే భూలోకము నందు స్థూల కర్మలు సూక్ష్మ లోకాలు అయిన గ్రహ లోకాల యందు సూక్ష్మ కర్మలు అలాగే సహస్ర కారణ లోకాలు అయిన సప్త ఊర్ధ్వలోకాలు యందు కారణ కర్మలు అలాగే అష్ట ఇష్ట లోకాల యందు ఉన్న సంకల్ప కర్మలు అలాగే శూన్యలోకమైన మూల ఏక బ్రహ్మకపాలం యందు ఉన్న కర్మ శేషమైన 11 మూల కర్మలు ప్రారబ్ద కర్మలు సంపూర్తిగా నివారణ చేసుకుంటే కానీ సంపూర్ణ మోక్షమును పొందినట్లు కాదు కదా. కానీ ఈ కర్మ నివారణ చేసుకోవటానికి ఆయా లోకాల యందు జన్మించి నివారణ చేసుకోవాలా లేదా ఈ భూలోకము నందు ఉండి అన్ని రకాల కర్మలు నివారణ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు? అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది. దానితో దీనిమీద పరిశోధన చేయడం ప్రారంభించాను. నాకు తెలిసినది ఏమిటంటే ఒకవేళ మనకి గ్రహ దోషాలు ఉంటే పరిహారాలు ఆయా గ్రహ జపాలు గ్రహ పూజలు గ్రహ దానాలు ఇతరులకు ఇచ్చి నివారణ చేసుకుంటున్నాము కదా. అలాగే ఈ నవగ్రహ లోకాలలో ఉన్న లక్షా ఇరవై వేలు సూక్ష్మ కర్మలు నివారణ చేసుకోవటానికి ఏమైనా మార్గం ఉన్నదా? ఉంటే అది ఏమిటి? ఇది కాకుండా హోమాల ద్వారా యజ్ఞాల ద్వారా దైవాలను ప్రసన్నం చేసుకుని వారి అనుగ్రహము వలన మన ఇష్టకామ్యార్థములు తీర్చుకుంటున్నాము కదా. అనగా ఉదాహరణకి వరుణయాగం చేసి వర్షం కురిసేటట్లుగా చేస్తున్నాము కదా.అలా సప్త ఊర్ధ్వలోకాలు యందు ఉన్న 36 వేల కారణ కర్మలు నివారణ చేసుకోవచ్చా? అంటే సాధకుడు ఈ భూమి మీద ఉండే సమస్త కర్మలు నివారణ చేసుకోవచ్చా లేదా అనేది నా సందేహం అన్నమాట. 

దీని కోసం వివిధ గ్రంథాలు పుస్తకాలు చదువుతుండగా దత్త గురువులలో ఒకరైన శ్రీ తాజుద్దీన్ బాబా గారి జీవిత చరిత్ర యందు…. “నా సమాధినుండి లక్షా పాతిక వేల కర్మలను నివారణ చేసుకోవాలని అంత మంది శిష్యులు నా సమాధిని దర్శించుకునేందుకు వస్తారని” ఉంది. అంటే ఈ కర్మలు కాస్త సూక్ష్మకర్మలు  అన్నమాట. వీటి నివారణ కోసం ఆయన జీవ సమాధి చెంది ఏర్పడిన సూక్ష్మ శరీరంతో ఈ సర్వ కర్మలు నివారణ చేసుకుంటున్నారని చెప్పకనే చెప్పినారు కదా. అంటే ఎవరికైతే స్థూల కర్మలు నివారణ అవుతాయో వారికి మాత్రమే కాశీ క్షేత్రము నందు మరణము పొందే అర్హత లేదా జీవ సమాధి చెందుటకు యోగ్యత లభిస్తుందని నాకు అర్థమైనది. అనగా జీవ సమాధి చెందిన తర్వాత ఏర్పడే సూక్ష్మ శరీరముతో ఆయా గ్రహ లోకాలకి వెళ్ళి అక్కడున్న సూక్ష్మ కర్మలు నివారణ చేసుకుని సూక్ష్మ శరీరమునకు కపాలమోక్షం చెందించి అటుపై కారణ శరీరంతో కారణ లోకాలలో ఉన్న కారణ కర్మలు అటుపై సంకల్ప లోకాల యందు ఉన్న సంకల్ప కర్మలను సంకల్ప శరీరంతో నాశనం చేసుకుని ఆఖరికి ఈ నాలుగు కర్మలు యొక్క కర్మశేషమైన 11  ప్రారబ్ద కర్మలను శూన్య లోకమునందు ఆకాశ శరీరముతో శూన్య బ్రహ్మగా మారి మూల ఏక బ్రహ్మకపాలం యందు సంపూర్ణ కపాల మోక్షం పొందే వీలు ఉన్నదని అర్థం అయినది. యోగులు కాస్త జీవసమాధి చెంది కర్మలు నివారణ చేసుకుంటే… దైవాలు కాస్త దైవత్వమును పొంది ఆయా సూక్ష్మ లోకాలు యందు సూక్ష్మ కర్మలు చేస్తూ క్రింద పైన పడుతూ సూక్ష్మ కర్మల నివారణ చేసుకుంటున్నారని… పరమాత్మ అయితే కారణం లోకాల యందు కారణ కర్మలు చేసుకుంటూ క్రింద పైన కొడుతూ ఈ కర్మ నివారణ చేసుకుంటున్నారని… యుగానికి ఒక్కడు మాత్రమే శూన్య లోకమునకు శూన్య బ్రహ్మయై తనకున్న కర్మ శేష 11 మూల ప్రారబ్ద కర్మల యొక్క బలహీనతకు గురై రూపము అంతము కావలసినవాడు కాస్తా రూపాంతరము చెందుతూ ఈ విశ్వసృష్టిని పునఃసృష్టి చేస్తూ కర్మ నివారణ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విశ్వనాథుడిగా ఉండి పోతున్నాడని నాకు అర్థమైనది. అంటే సమస్త కర్మల నివారణ కోసం సాధకుడు కాస్త జీవసమాధి చెందాలి లేదా ఆయా లోకాలకి ఆయా శరీరాలతో జన్మించి ఆయా కర్మల నివారణ చేసుకోవాలి. అప్పుడే సమస్త కర్మ నివారణ అయ్యి మనకి సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందడం జరుగుతుంది. 

సూక్ష్మ కర్మ నివారణ :

దీనికి ఏమి చేయాలని తీవ్ర మధన పడుతుంటే ఎవరైతే తమ గత భవిష్యత్ జన్మలు తెలుసుకుంటారో వారు ఐదు సంవత్సరాలకు మించి బతకలేరని… ఎందుకు అంటే మానవ మెదడు 48 నిముషాలు మించి ధ్యాన స్థితిని అనగా 10 లక్షల సంవత్సరాల స్థితిని తట్టుకోలేదు అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏదో తెలియని మాయ మర్మం ఉన్నది అని నాకు అనిపించింది. ఎలాగైనా 48 నిమిషాల దాటి ఏకాగ్రతతో కూడిన ధ్యానస్థితిలో ఉండాలని కృతనిశ్చయంతో ధ్యానము చేసుకోవడం ఆరంభించాను. ఇలా దాదాపుగా ఏకధాటిగా మూడు నెలల పైనే ఈ ప్రయత్నం సాధన చేస్తూ ఉండగా ఒకరోజు నా ధ్యానము స్థితి తీవ్రస్థాయిలోకి వెళుతుందని నాకు అనిపిస్తుండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. ఏవో దృశ్యాలు శరవేగంతో కదులుతూ వెళ్లిపోతున్నాయి. వాటిని ప్రేక్షక పాత్ర వహిస్తూ కళ్ళు అప్పగించి చూస్తున్నాను. ఆ దృశ్యాలలో కొన్ని నాకు తెలిసిన వ్యక్తులతో ఉంటే మరికొన్ని దృశ్యాలు నాకు తెలియని వ్యక్తులతో ఉన్నాయి. ఏమి జరిగితే అది జరుగుతుంది. చావాలి అనుకున్న వాడికి చావు భయం ఎందుకు అనే మొండి ధైర్యంతో ఏమి జరిగితే అది జరుగుతుందని ఈ దృశ్యము చూడలేని స్థితి లోనికి అది కూడా తట్టుకోలేని స్థితి లోనికి వెళితే మహా అయితే నా మెదడు పిచ్చెక్కుతుంది. పిచ్చి వాడిని అవుతాను.ఇప్పటికే నా అవతారం చూసి మనో పిచ్చివాడు, ఆధ్యాత్మిక పిచ్చివాడు అని అన్నారు కదా అనుకుని ధ్యాన భంగం కాకుండా ఏకాగ్రతగా ధ్యానస్థితిని కొనసాగిస్తుండగా ఒక భయంకరమైన అనుభవ దృశ్యం కళ్ల ముందు కనపడ సాగింది. యథాతథంగా మీకు చెపుతాను.తప్పుగా అనుకోవద్దు. ఎలా ఉంటాయో మీకు ఒక అవగాహన కల్పించడానికి చెప్పడం జరుగుతోంది. ఇది నా తొలి సూక్ష్మ కర్మ నివారణ గ్రహ అనుభవ దృశ్యం కదా అనుకుని యధావిధిగా ఒక గుర్రపు బండి వాడు రావటం నన్ను ఎవరో ఎక్కడికో తీసుకుని అనగా గురు గ్రహ యానము చేస్తున్నానని నాకు అర్థమయ్యే లోపల నేను ఆ లోక గదిలో నగ్నముగా ఉన్నట్లుగా కనిపించినది. ఇంతలో మా అమ్మమ్మ గారు ఆ గదిలోనికి నగ్నముగా వస్తూ … “వచ్చారా? మీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్లు అయినది మిమ్మల్ని చూసి”… అని నన్ను వాటేసుకుంది. నాతో సరసాలు, రతిభంగిమలు ఇలా ఎన్నో చేస్తోంది. అలాగే ఈ సారి మనకి ఆడపిల్ల పుడుతుంది అంటుంటే ఆ దృశ్యాలు చూస్తున్న నా శరీరం కాస్త నెమ్మది నెమ్మదిగా కంపించడం మొదలైంది. ఏమిటి? ఈ లోకంలో అమ్మమ్మ ఆ లోకంలో నాకు భార్య ఎలా సాధ్యం? ఆవిడితో నేను శృంగారం చేయుట ఏమిటి? పిల్లల్ని కనటం ఏమిటి? వరుసలే మారిపోతున్నాయి. బంధాలే ఎగిరిపోతున్నాయి. ఏవో అర్థం పర్థం లేని ధ్యాన దృశ్యాలు కనపడుతున్నాయి. ఏమిటి మనవడితో అమ్మమ్మ శృంగారమా? అది కూడా పిల్లల్ని కనడం. వామ్మో! ఇంకేమైనా ఉందా? మనకి కామ పిచ్చి గాని లేదు కదా. చిత్త కార్తె కుక్క కాని కరచినదా? వావివరసలు లేని ఈ భయంకర దృశ్యాలు చూడటం అవసరమా అనుకుంటూ మధన పడుతూ ఉంటే… అమ్మమ్మ మాటలు అనుకుంటా “ఏమండీ! ఈ సారి మనకి ఆడపిల్ల పుడుతుంది. దానికి గాయత్రీ అని పేరు పెట్టాలని” చెబుతుండగా నా స్థూల శరీరం తీవ్రమైన కంపన స్థితికి వెళ్ళటంతో నాకు ధ్యాన భంగం అయినది. సమయం చూస్తే 50 నిమిషాల పాటు ధ్యానస్థితిలో ఉన్నానని నాకు అర్థమైనది. అంటే ప్రారంభించిన దృశ్యంనకే మన బుర్ర తిరిగితే లోపలికి అనగా తీవ్ర ధ్యాన స్థితికి వెళితే మన పరిస్థితి ఏమిటి? ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ఖచ్చితముగా పిచ్చెక్కుతుంది. ఎవరు కూడా తట్టుకోలేరు కదా. చనిపోయిన అమ్మమ్మ తో మనవడు శృంగారం ఏమిటి? పిల్లల్ని కనటం ఏమిటి? నా బూడిద అని అనుకుని కొన్ని వారాల పాటు ధ్యానం వైపుకి వెళ్ళలేకపోయాను. ధ్యానం అంటే ఒక రకమైన భయం, జుగుప్స, ఆవేశము, కోపము ఇలా నవరసాలు కలిగి ఉన్నాయి. కాకపోతే ఏమిటి? రెండు నిముషాలు మించి ధ్యానం చేసినందుకే వావి వరుసలు లేని సంబంధ దృశ్యాలు  చూపిస్తే ఎక్కువ సమయం తీసుకుని ఉంటే ఇంకా ఎలాంటి ధ్యాన అనుభవాలు చూడాలో కదా. 
నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే ప్రకృతి ఎప్పుడు కూడా తప్పు చెయ్యదు. కారణం లేనిదే కార్యము ఉండదు కదా. పైగా మనం ఏది తట్టుకోగలమో అది ఇస్తుంది. చూపిస్తుంది. మనకి ఎప్పుడు ఏది కావాలో ఇవ్వాలో ఏది ఇస్తే మనకి మంచిదో ఈ ప్రకృతి మాతకు తెలిసినట్లుగా మనకే తెలియదు. ఈ దృశ్యం వెనుక ఏదో తెలియని మర్మం ఉన్నదని నాకు అనిపించసాగినది. దానితో ఈ దృశ్యము విశ్లేషణ చేసుకుంటూ రావడం జరిగినది. అంటే భూలోకంలో మా అమ్మ గారి పేరు గాయత్రి అయితే ఆ లోకంలో నా కూతురు పేరు గాయత్రి అంటే నా తల్లి ఆ లోకంలో కూతురు అన్నమాట.కొడుకు కాస్త తండ్రి అన్నమాట. ఈ లెక్కన చూస్తే మనవడు కాస్త తాత అన్నమాట. అమ్మమ్మ దృష్టిలో నేను కాస్త ఆయన భర్తని అంటే (తాతని అన్నమాట) మనవడి లోనే తాతగారి వారసత్వం ఉంటుందని శాస్త్రాలు వచనము కదా. పైగా తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా వారందరినీ పితృదేవతల కింద పూజలు చేస్తాము కదా. అనగా సూక్ష్మ కర్మలు అనేవి తాతలు అమ్మమ్మలు నాయనమ్మలుకు సంబంధించినవే అయి ఉండాలి. అంటే అమ్మమ్మకు ఈ భూలోకంలో నేను కాస్త మనవడు అయితే గ్రహ లోకమందు భర్తను( (తాతని) అయ్యి ఉండాలి. నాకు మా తాతగారి లక్షణాలు వచ్చినాయి అని అప్పుడప్పుడు మా అయ్య అలాగే మా అమ్మమ్మ మా అమ్మతో చెబుతున్న మాటలు లీలగా గుర్తుకు రావడం జరిగినది. అంటే ఈ లెక్కన చూస్తే ధ్యాన దృశ్యము నిజమే కదా. నిజానికి అది మా తాత అమ్మమ్మ గారి శృంగార దృశ్యం. కానీ ఆ లోకంలో నేను కాస్త తాతని కావడం వలన నాకు చూపించడం జరిగింది.దానిని చూసి నేను కాస్త బెంబేలు పడటం, భయపడటం, బాధపడటం, ఆవేదన చెందడం జరిగింది. ఎందుకంటే ధ్యాన స్థితి నుండి మన మనస్సుని వెనక్కి లాగాలని ఈ దృశ్యములు ఉన్నాయి. వీటికి భయపడకుండా, బాధపడకుండా, స్పందించకుండా, ఆశించకుండా, ఆశ పడకుండా, ఆలోచించకుండా, సంకల్పించకుండా కనబడే ధ్యాన దృశ్యాలను లక్షా ఇరవై వేల దృశ్యాలను మౌనంగా సాక్షీభూతంగా బ్రహ్మ తదాకార స్థితిలో చూడగలిగితే ఆ సూక్ష్మ కర్మలు సహజసిద్ధంగానే కర్మ నివారణ అవుతాయి. ఈ కర్మలన్నీ కూడా తాతా- అమ్మమ్మలు,  తాతా- నాయనమ్మలకు సంబంధించి వారి జీవిత దృశ్యాలే ఉంటాయని… ఎవరు అయితే వీరి అంశలతో జన్మిస్తారో వారి సంబంధ దృశ్యాలే కనబడతాయని నేను కాస్త మా అమ్మ వారి వారసత్వ లక్షణాలు ఉండటం వలన తాత అమ్మమ్మ ధ్యాన దృశ్యాలు కనపడితే ఈ స్థితి యందు మా జిఙ్ఞాసికి మాత్రం తాతా నాయనమ్మ శృంగార దృశ్యాలు కనిపించాయి. అందులో మన వాడు కూడా ఆ లోకంలో భూలోక తండ్రికి తండ్రి అన్నమాట. ఇంకా దానిపై ఎవరైతే తమ స్థాయిని 48 నిమిషాల నుండి 96 నిమిషాల దాకా తీసుకుని వెళితే వారికి ఇలా 48 తరాలపాటు తాత –అమ్మమ్మ- నాయనమ్మ జీవిత దృశ్యాలు కనపడతాయి. అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ కర్మలు అవుతాయి. వావి వరసలు మారిపోతాయి. బంధాలు మారిపోతాయి. ఏ లోక వాసి దృశ్యాలు ఆ లోకవాసిగా రికార్డు దృశ్యాలు కనబడతాయి. వాటిని చూసి మనము తట్టుకోవాలి. దానితో మనకున్న సూక్ష్మ కర్మలు నివారణ అవుతాయని గ్రహించాను. దానితో ఇంకా నాకు మనోధైర్యము కలిగి నా ధ్యాన స్థితిని పెంచుకుంటూ వెళ్లాలని ధ్యాన అనుభవాలు విషయాలకి భయపడకుండా, బెదరకుండా, బాధపడకుండా, వాటి గురించి పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, స్పందించకుండా, ఆవేశపడకుండా, ఆశించకుండా, సంకల్పించకుండా, గుండె నిబ్బరంతో, ధైర్యముతో, స్మశాన వైరాగ్యంతో, సాక్షిభూతముగా మేమిద్దరం కూడా తాత- మనమడు అనే అంశతో ఈ ధ్యాన దృశ్యాలు చూడటం ప్రారంభించాము. ధ్యాన స్థితిని 48 నిమిషాల నుండి తొంభై ఆరు నిమిషాల దాకా స్థాయికి చేర్చాము. అంటే సూక్ష్మ కర్మలు నివారణ చేసుకుని అక్కడ కనిపించిన బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ కృష్ణ బిలము నందు మేము మా సూక్ష్మ శరీరముతో ప్రవేశించడం జరిగినది. నేను అయితే అక్కడ 0.1% బలహీనతకి అనగా భయం గుణ బలహీనతకి గురి అయితే మన జిఙ్ఞాసి మాత్రము జ్ఞాన గుణ బలహీనతకి గురికావడంతో మా సూక్ష్మ శరీరములు ఆగిపోతే మా కారణ సంకల్ప ఆకాశ శరీరాలతో కూడిన కారణ శరీరము ఆ కృష్ణబిలం గుండా వేరే లోక ప్రవేశద్వారం లోనికి ప్రవేశించినట్లుగా లీలగా అనిపిస్తుండగా ధ్యాన భంగం అయినది. ఎప్పుడైతే మాకు ధ్యానం నందు మరొకసారి కృష్ణబిలం  కనిపించినదో అప్పుడే మా సూక్ష్మ కర్మలు కూడా నివారణ  అయ్యాయని గాకపోతే కర్మశేషముగా స్థూల సూక్ష్మ కర్మలు లేశమాత్రముగా మిగిలిపోయాయని మా మనో దృష్టికి వచ్చింది. ఏమి జరిగితే అది జరుగుతుందని ఎలాంటి ధ్యాన దృశ్యాలు కనిపించినా చలించకూడదని మేము నిశ్చయము చేసుకొని మా ధ్యాన స్థితిని ఈసారి 96 నిమిషాల నుండి 144 నిమిషాల దాకా తీసుకుని వెళ్తే కానీ మా కారణ కర్మలు అనివార్యముగా నివారణ  అవ్వవని మాకిద్దరికీ అర్థమైనది. 

ధ్యాన విధానంలో కర్మలను నివారణ చేసుకోవచ్చా?

ఇది ఇలా ఉండగా అసలు నిజంగానే మిగిలిన నాలుగు రకాల కర్మలను ఇలా ధ్యాన విధానంలో నివారణ చేసుకోవచ్చా? అనే సందేహం వచ్చింది. దీనికి సమాధానంగా మాకు శివ సహస్ర నామాలు సమాధానం ఇచ్చినాయి. ఇందులో 470 వ నామము అనగా దుస్స్వప్న నాశనం - ధ్యాన అనుభవాలతో అలాగే స్వప్నాల ద్వారా చెడు కర్మలు నివారణ అవుతాయని భావము. అంటే ఈ లెక్కన చూస్తే యోగనిద్ర సాధన ద్వారా వచ్చే ధ్యాన అనుభవాలతో అలాగే స్వప్నాల ద్వారా కూడా మనకున్న అన్ని రకాల కర్మలు నివారణ చేసుకోవచ్చు అని నాకు జ్ఞాన స్పురణ కలిగినది. దానితో మా సాధన మీద అమిత అపారమైన ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ తర్వాత మాకు భవిష్యత్ జన్మలకు ఇతర గ్రహాలు అనగా నాకేమో గురు గ్రహ వాసిగాను మా జిఙ్ఞాసికి బుధగ్రహ వాసిగాను జన్మలు ఉన్నట్లుగా ఎవరైనా ఇలాంటి అనుభవాలు పొందినారా? అన్నప్పుడు మళ్లీ శివ సహస్ర నామాలే సమాధానం ఇచ్చి నాయి.ఇందులో275, 276, 277, 278 నామాలు వరుసగా నవగ్రహలలో కేవలము నాలుగు గ్రహలు గూర్చి అనగా చంద్ర, సూర్య, శని, కేతు గ్రహాల గురించి చెప్పడం జరిగినది. ఆదియోగి యొక్క భవిష్యత్ జన్మలు ఈ గ్రహాలకి సంబంధించినవి అని తెలుస్తోంది కదా. అలాగే 477 నామమును చూస్తే అదే భూర్భువోలక్ష్మి- భూలోక భువర్లోక 825,826  నామాలు అనగా త్రిలోకపః త్రిలోకేశః వంటి నామాలు చూస్తే త్రిలోకాధిపతిగా…. త్రిభువన అధిపతిగా చెప్పడం చూస్తుంటే ఈయనకి కూడా సప్త ఊర్ధ్వ దైవ లోకాల కారణ లోకవాసుడిగా భవిష్య జన్మలు ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. ఇక దానితో మా ధ్యాన స్థితిని ఈసారి 96 నిమిషాల నుండి పైకి తీసుకు వెళ్ళటానికి సాధన చేస్తున్నాము. 

కారణ కర్మల నివారణ:

ఇది ఇలా ఉండగా కొన్ని వారాల తరువాత నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. ఏవో దృశ్యాలు చరా చరా వేగంతో కదులుతూ దాటుతూ వెళ్లిపోతున్నాయి. దానిని నా కన్నులు అందుకోలేనంతగా ఉంది. అయినా కంగారు పడలేదు. బెదరలేదు. ఏమి జరిగితే అది జరుగుతుంది. ఉన్నచోటనే సమాధి అవుతామని అంతే కదా అనుకుంటూ మనో తీక్షణముగా ఆ దృశ్యాలను తదేకంగా చూస్తున్నాను. ఇంతలో ఏదో లోకానికి ప్రవేశించినట్లుగా లీలగా కనిపించసాగినది. బంగారు ఆభరణాలతో లేత నీలి శరీరాలతో కాంతి ఉన్న శరీరాలతో స్త్రీలు పురుషులు రూపాలతో లీలగా అగుపించినారు. ఏదో సభ జరుగుతున్న దృశ్యం లీలగా అగుపించినది. నాలాంటి రూపధారి అక్కడ కనిపించాడు. ఇక్కడ వీడికి పని ఏమిటి అనుకున్నాను. ఏవో పాత్రలు పోస్తూ కనిపించాడు. ఇంతలో ఏదో రణ గొణ ధ్వనులు వినిపించాయి. కొంతసేపయిన తర్వాత నాలాంటి రూపధారితో ఒక స్త్రీ మూర్తి మాట్లాడుతూ కవ్విస్తూ నా నా చిలిపి పనులు చేస్తూ లీలగా కనబడింది. దీనమ్మ జీవితం. ఈ లోకంలో కూడా కామ మాయ వదల లేదా అయినా ఇది ఎవరు? నా వెంట పడుతోంది. అయినా అమ్మాయి బాగానే ఉంది. అరేబియన్ గజ్జల గుర్రం లాగా ఉంది. ఇంతలో ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి నాలాంటి రూపధారిని అలాగే ఆ స్త్రీ మూర్తిని సభ జరిగే ప్రాంతమునకు తీసుకుని వెళ్లే దృశ్యాలు లీలగా కనిపించినది. అక్కడ ఒక మహారాజు లాంటి వ్యక్తి ఒక పెద్ద సింహాసనము మీద కూర్చుని ఉండగా ఇరువైపుల చిన్నచిన్న సింహాసనముల మీద ఎవరో పెద్దలు కూర్చున్నట్లుగా లీలగా కనపడ సాగింది.మా ఇద్దరిని విచారణ చేస్తున్నట్లు వాదనలు అలాగే ప్రతి వాదనలు జరుగుతున్నట్లుగా లీలగా కనిపించటం జరుగుతుండగా ఆమె కోరిక తీరిస్తే తప్పేమిటి? ఎన్నో సంవత్సరాల నుండి ఈమె నీ వెంట పడుతోంది కదా అంటుంటే రాజా! నాకు ఇదివరకే వివాహమైనది. నేను కాస్త ప్రాతివత్య ధర్మంను పాటిస్తున్నాను. నా భార్యను తప్ప మరొక స్త్రీ మూర్తిని నేను వివాహం చేసుకోను. ఉండను అని చెబుతూ ఉండగా వెంటపడుతున్న స్త్రీ మూర్తి ఎవరు అని పరిశీలించి చూడగా భూలోకంలో నాకు భార్యగా ఉన్న శ్రీమతి దీక్షాదేవి పోలికలు ఆమెలో లీలగా కనిపించేసరికి అది ఏమిటి? ఈమె నా భార్య కదా. వివాహం చేసుకున్నాను కదా. వీడు మరి ఎవర్ని వివాహం చేసుకున్నాడని చూడగా ఆ స్త్రీ మూర్తి కాస్త నా తొలి ప్రియురాలి పోలికలు కనిపించడంతో వామ్మో అంటే ఈ లోకంలో ఉన్న వాడు నా తొలి ప్రియురాలిని వివాహం చేసుకుంటే నేను కాస్త భూలోకములో ఈ లోకంలో వెంటపడే స్త్రీ మూర్తిని మలి ప్రియురాలిని వివాహం చేసుకున్నాను. వామ్మో! ఇంతకీ ఈ లోకం ఏమిటి అని అనుకుంటున్నాను. అదికాస్తా స్వర్గమైన ఇంద్ర సభయని లీలగా తెలిసేసరికి మన పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటే ఇదే కాబోలు అని ఆలోచన చేస్తుండగా ఆ ఇంద్ర సభలో ఇంద్రుడు కాస్త కోపావేశానికి గురై అయితే మీరు ఇద్దరూ కూడా భూలోకంలో జన్మించి మీ ప్రేమ విరహ వేదనలు తీరిన తర్వాత ఈ లోక ప్రవేశానికి అర్హత యోగ్యత లభిస్తుందని శాపము ఇచ్చినట్లుగా లీలగా తెలిసేసరికి అకారణముగా నాకు ఇంద్రుడు శాపం ఇచ్చాడు అని మధన పడుతూ ఉండగా స్థూల శరీరం కాస్త తీవ్రంగా కంపించే స్థాయికి చేరుకున్నదని అర్ధం అయ్యే లోపల నాకు ధ్యాన భంగం అయినది. ఇది ఇలా ఉండగా మా జిఙ్ఞాసికి తన ధ్యానములో వివిధ దేవతా స్త్రీ మూర్తులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షిణులు కనిపించాయి. అలాగే సూర్య ,చంద్ర, నక్షత్ర, గ్రహ మండలాలు కనిపించినాయని చెప్పడం జరిగినది. నాకేమో ఇంద్రలోకం కనపడితే వీడికేమో గంధర్వలోకము కనబడినట్లుగా చెబుతున్నాడు. ఏమిటి తేడా. ఎందుకు ఇద్దరికీ వేరు వేరుగా వేరు లోకాలు ధ్యానము నందు కనిపించాయని విచారణ చేస్తే వాడేమో బుధగ్రహ వాసి గదా. ఈ గ్రహానికి అనుసంధానంగా భువర్లోకము ఉంటుంది.ఈ లోకంలో గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, దేవతలకు సహాయపడే దేవతా స్త్రీ పురుషులు ఉన్నారు. అలాగే నేను కాస్త గురుగ్రహవాసి అవ్వటం వలన దీనికి అనుసంధానంగా సువర్లోకం ఉంటుంది. అంటే స్వర్గం ఉంటుంది. ఇందులో ఇంద్రాది దేవతలు, పంచభూత దేవతలు, గ్రహ దేవతలు, మహర్షులు, సాధువులు ఉంటారు. కామపూరిత భోగలాలసులు. అయోనిజులు. మరణం లేని వారు. వృద్ధాప్యం లేని వారు ఉంటారు. అంటే ఈ లెక్కన చూస్తే మన గ్రహాలను బట్టి ఊర్ధ్వలోకాలు అనుసంధానమై ఉంటాయి అని నాకు అర్థం అయింది. దానితో ఏ ఏ చక్రాలకు ఏ ఏ గ్రహాలు అలాగే ఏ ఏ లోకాలు అనుసంధానమై ఉంటాయని పరిశోధన చేయడం ఆరంభించాను. ఇప్పుడు 

మూలాధార చక్రము -కుజగ్రహము- భూలోకము 

స్వాధిష్ఠాన చక్రము -బుధ గ్రహము - భువర్లోకము 

మణిపూరక చక్రము- గురుగ్రహము- సువర్లోలోకం 

అనాహత చక్రము -శుక్ర గ్రహము -మహర్లోకం 

విశుద్ధి చక్రము -శనిగ్రహము -జనలోకం 

ఆజ్ఞా చక్రము -చంద్రగ్రహము- తపోలోకం 

సహస్రార చక్రము- సూర్యుడు- సత్యలోకము
 
అని తెలిసినది. ఈ లెక్కన చూస్తే నాది గురుగ్రహ వాసి అగుట వలన కారణ లోకము నాకు  సువర్లోకం ఏర్పడితే అదే మా జిఙ్ఞాసికి కాస్తా బుధగ్రహ వాసి అగుట వలన కారణం లోకంగా వారికి భువర్లోకము  ఏర్పడిందని మాకు ఇద్దరికీ అర్థమైనది.అంటే మాకు ఉన్న కారణ కర్మలు ఈ లోకాల యందు చూపించే ధ్యాన అనుభవాలు దృశ్యాలు చూసి బెదరకుండా భయపడకుండా బ్రహ్మ తదాకార స్థితిలో వీటిని చూడగలిగితే ఈ కారణ కర్మలు కూడా సంపూర్తిగా నివారణ అవుతాయని అర్థమైనది. దానితో ఆట మొదలైంది.మా ధ్యాన వేట మొదలైంది. నా ధ్యాన స్థితి కాస్త 96 నిమిషాలను దాటుకుంటూ నూట ఇరవై నిమిషాల స్థాయికి వచ్చేసరికి నా భూలోక గోత్రనామాలు ఋషి అయిన గౌతమ మహర్షి వారు లీలగా కనిపించారు. ఎవరో ఆయనను ఈ పేరుతో పిలవడంతో నాకు లీలగా వినపడటంతో ఈయన ఈ మహర్షియని నాకు అర్థమైనది. ఆ తర్వాత ఈ లోక జన్మలుగా ఆత్రేయ మహర్షి గాను, అత్రిముని గాను,అగస్త్య మునిగాను, పులస్త్యుడు ముని గాను, వశిష్ఠ మహర్షి గాను, మహర్షి కపిల ఆచార్యుడిగా నా జన్మలు ఉన్నట్లుగా లీలగా ఆ దృశ్యాలు ఆ ఆశ్రమ పరిసరాలు ప్రాంతాలు అలాగే సతులతో నివసించి ధ్యాన జపతపాలు చేస్తున్న దృశ్యాలు లీలగా కనిపించిన వాటికి మౌనంగా సాక్షీభూతముగా ఏదో సినిమా చూస్తున్నట్లుగా లీలగా చూస్తూ ఉండగా అంటే కారణ లోకానికి చివరిదైన తపో లోకమునకు నేను కాస్త చేరుకోవడం వలన ఈ మహర్షులు అగుపిస్తున్నారని కనిపిస్తుండగా నాలాంటి రూపముతో హనుమంతుడు ధ్యానము చేస్తున్నట్లుగా లీలగా అగుపించినది.ఈయన ఏమిటి? అచ్చుగుద్దినట్లుగా నా రూపముతో ఉన్నాడు నేను ఆయన రూపం లో ఉన్నానా లేక ఆయన నా రూపంలో ఉన్నాడా అనే సందేహంతో తికమక పడుతుండగా నా భూలోక స్థూల శరీరము తీవ్ర స్థాయిలో కంపిస్తూ ఉండేసరికి నాకు ధ్యాన భంగం అయినది. కారణ లోక కర్మలు కూడా సంపూర్తి అయినాయి. కానీ నాది కారణ లోక  భవిష్య జన్మగా హనుమంతుడు రూపమా? అని ఆలోచిస్తుండగా జిఙ్ఞాసి తనకు కలిగిన అనుభవాలు చెప్పడం ఆరంభించాడు. తన ధ్యానస్థితిలో తీవ్రస్థాయి ఉండగా ఎవరో ముని లీలగా అగుపించారు.ఆయన ఎవరో వీడికి తెలియరాలేదు. ఆ తర్వాత వివిధ ఆశ్రమాలు మునులు, మహర్షులు వాళ్ళ జపతపాలు చేస్తున్న దృశ్యాలు లీలగా అగుపించాయి.వాటిలో వీడికి బాగా గుర్తు పట్టిన మునులు పేర్లు వరుసగా అంగిరస మహర్షి, పులహనుడు ముని, కశ్యప మహర్షి, వాలఖిల్య మహర్షి, విశాఖ నామ మహర్షి, ఉగ్రరూపములో దుర్వాస మహర్షి వారిలాగా ఉన్నారట. వీరందరి ఫోటోలు చూడబట్టి వీరిని తను గుర్తు పట్టడం జరిగిందని చెప్పడం జరిగినది. అప్పుడే అతనికి ధ్యానముద్రలో ఇతని రూపంతో కుమారస్వామి ఉన్నట్లుగా లీలగా కనిపించినది. తనే కుమారస్వామియా అని అనుకుంటుండగా ధ్యానభంగం అయినది అని చెప్పడం జరిగినది. అంటే నాకేమో హనుమంతుడిగా కనపడితే మన వాడికి కుమారస్వామిగా లీలగా అగుపించినారని అర్థమైనది. అంటే మా ధ్యాన స్థితి కాస్త 144 నిమిషాలకు చేరుకున్నదని మాకు అర్థం అయినది. ఇప్పుడు 144 నిమిషాలు నుండి 192 నిమిషాలుకు తీసుకువెళితే గాని సంకల్ప కర్మలు నివారణ కాదని మాకు స్పురణ అయినది. ఎపుడైతే నాది హనుమంతుని రూపమని మన వాడిది కుమారస్వామి అంశ అని తెలిసిందో అంటే కారణ లోకవాసుడిగా ఈ రెండు రూపాలతో నామరూప దేవుళ్ళుగా ఈ జన్మలు ఉన్నాయనే మాకు అర్థం అయినది. అంటే మా సాకార పరబ్రహ్మ రూపాలు ఇవి అని గ్రహించాను. ఇంతకీ ఈ రూపాలకి కారకమైన ఆకార పరబ్రహ్మ స్వరూప అవాసాలైన అష్ట ఇష్ట లోకవాసులైన అష్టవసువులు ఉండే లోకాలకి మా ధ్యాన స్థితి చేరుకోవాలని ఇవియే సంకల్ప కర్మలేయని వీటిని నివారణ చేసుకోవాలని అప్పుడే ఏక మూల బ్రహ్మకపాలమునకు చేరుకోలేమని మాకు జ్ఞాన స్పురణ అయినది. నాకేమో రిషికేష్ క్షేత్రము నుండి హనుమంతుడి విగ్రహం వస్తే మనవాడికేమో పళని క్షేత్రము నుండి కుమారస్వామి విగ్రహమూర్తి రావటం మాకు కలిగిన అనుభవాలు సత్యమేనని ఇవి సాక్ష్యాలుగా నిలవడం జరిగినది. చచ్చే వాడికి సాక్ష్యాలు ఎందుకు? వాటితో పని ఎందుకు? నేను ఏ దేవుడు అయితే ఏముంది? ఏ మహర్షి అయితే ఏముంది? చచ్చే శరీరాలు గొప్పవి అయితే ఏమి లాభం? అన్ని కూడా నశించేవి కదా.ఆయా శరీరాలతో ఈ విశ్వంలో జరిగే జీవ నాటక పాత్రలు వేసాము. అంతే. ఎవరి పాత్రలు వారికి గొప్ప. పోయే వాడికి ఆశలు కలిగించాలని ఈ విశ్వము చేస్తున్న జగత్ మాయ అని మాకు అర్థమయింది. వీటి శరీరాల విషయంలో మౌనం గా సాక్షీభూతంగా స్మశాన వైరాగ్యంతో ఉన్నాము. 

సంకల్ప కర్మలు నివారణ:

కొన్ని వారాల తర్వాత నా ధ్యాన స్థితి అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. టెంపుల్ రన్ ఆట మొదలైంది. యధావిధిగా వివిధ రకాల దృశ్యాల కనబడుతూ నన్ను దాటుతూ శరవేగముతో ముందుకు కదులుతున్నాయి.ఇంతలో ఒక చీకటి గుహ యందు నా రూపధారిలో ఉన్న హనుమంతుడు ధ్యానముద్రలో ఉన్నట్లుగా మళ్ళీ క్లియర్ గా కనిపించింది. అయినా నేను ఏమీ స్పందించలేదు. ఏమి జరుగుతుందోనని నేను మౌనంగా ఆ దృశ్యము చూస్తున్నాను.ఇంతలో ఆయన కాస్త లీలా మాత్రుడిగా కనపడుతూ నీడగా మారిపోతూ నెమ్మది నెమ్మదిగా అంతర్థానం అయినట్లుగా కనబడసాగింది. ఆ తర్వాత ఒక కృష్ణబిలం లీలగా కనిపిస్తూ అది కాస్త స్పష్టంగా కనపడసాగినది. అంటే సత్యలోక మైన కారణ లోకమును నేను దాటడము జరిగింది. అందుకని ఈ కృష్ణబిలాలు దర్శనమైనదని నాకు అర్థమయ్యేలోపుల నా కారణ శరీరం కాస్త అందులోనికి ప్రవేశించటం ఏదో అడుగు భాగమున కోన్ వంటి ఆకారంలో చివరి భాగము ఉన్నట్లుగా మూడు అడుగుల నా కారణ శరీరము ఏదో కారణం వలన దీనికి స్పందించడం వలన ఆగిపోయినట్లుగా ఆ తర్వాత అంగుళ శరీరమున్న సంకల్ప శరీరము కాస్త అడుగు భాగమును చేరుకున్నట్లుగా ఏదో ఒక ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నట్లుగా లీలగా కనిపించింది. సంకల్ప కర్మ నివారణ కోసం నా సంకల్ప శరీరము కాస్త అష్ట ఇష్ట లోకాలలోనికి ప్రవేశించడం జరిగినదని నాకనిపిస్తుండగా స్థూల శరీరం కాస్త విపరీతంగా స్పందించడం చేస్తూ ఉండేసరికి ధ్యాన భంగమైనది. తీరా చూస్తే నా ధ్యాన స్థితి కాస్తా 172 నిమిషాలకు చేరుకున్నట్లుగా తెలిసినది. 

ఇదిలా ఉండగా కొన్ని వారాల తర్వాత నా ధ్యాన శక్తి కాస్త తీవ్రస్థాయిలో చేరుకొనియుండగా టెంపుల్రన్ ఆట మొదలైంది. దృశ్యాలు నన్ను దాటుతూ శరవేగంగా వెళ్లిపోతున్నాయి. గ్రహాలు దాటినాము. నక్షత్రాలు దాటినాము. సూర్యచంద్రులను దాటినాము. ముల్లోకాలను దాటి నాము. భువనాలు దాటినాము. ఏవో దాటుతూ ఉండగా కపిల వర్ణముతో ఆవు లీలగా కనబడింది. నా సామిరంగా! ఇది గాని గోకులం కాదు కదా అని అనుకుంటూ ఉండగా …ఇవన్నీ ఎనిమిది మహర్షులు లీలగా కనపడి ఆ తర్వాత వీరందరూ కాస్త మహారాజుల దుస్తులతో మారిపోయారు. ఆతర్వాత వశిష్ట మహాముని లీలామాత్రముగా కనిపించాడు. ఈయన అదృశ్యమై ఇష్టలింగము ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంతపద్మనాభుడు చతుర్ముఖ బ్రహ్మలు వరసగా ఐదుగురు లీలా మాత్రంగా కనిపించి అదృశ్యమయ్యారు. ధ్యాన భంగం అయింది. ఈ ధ్యాన అనుభవ దృశ్యము నాకేమీ అర్థం కాలేదు. ఆవు ఏమిటి? ఆ ఎనిమిదిమంది మహర్షులు కాస్త మహారాజులు కావటం ఏమిటి? ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి కనిపించడమేమిటి? ఇదేమి గోల రా బాబు అనుకుంటూ ఉండగా మన జిజ్ఞాసి కూడా తనకి కలిగిన అనుభవాలు కూడా చెప్పడము ఆరంభించాడు. నాకు కలిగిన ధ్యానానుభవమే దాదాపుగా వాడికి వచ్చినది. కానీ నాకు లీలామాత్రముగా వశిష్ఠమహర్షి కనబడితే వాడికి ఏమో భీష్మాచార్యుడు కనిపించాడు. అంతే తేడా. ఇందులో ఏదో మర్మమున్నదని మాకు కనిపించిన ఎనిమిదిమంది మహర్షులు ఎవరు? వాళ్ళు ఎందుకు మహారాజులుగా మారినారు? ఆవుకి అలాగే వశిష్ఠమహర్షికి ఏమైనా సంబంధం ఉందా? మన జిజ్ఞాసికి ఎందుకు భీష్మాచార్యుడు కనిపించాడు అని మధనపడుతూ వివిధ గ్రంథ పుస్తకాలు తిరగేస్తుండగా ఒక చోట మాకు అష్టవసువులు కథనం కనపడింది. అది ఏమిటంటే గంగాదేవికి శంతనుడికి ఎనిమిది మంది కుమారులుగా జన్మించిన అష్టవసువులు… పూర్వము వీరు కాస్త వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న నందిని అనే కామధేనువు తమకు కావాలని కోరడం… దానికి ఆ మహర్షి ఇవ్వనని చెప్పటము… ఈ కామధేనువు కోసం వీరు దీనిని దొంగలించుకోవాలని అనుకొని ప్రయత్నం చేయటం… ఆఖరి వాడైనా ప్రభాసుడు నాయకత్వంలో ఆ ఆవును అపహరించేందుకు ప్రయత్నించటం… విషయం కాస్త వశిష్ఠుడు తెలుసుకుని వీరిని భూలోకవాసులు గా జన్మించమని శాపాలు ఇవ్వడము …శాప విమోచనంగా వీరు అందరూ కోరటం వలన ఎక్కువ భాగం ప్రభాసుడు చేయడం వలన భూలోకమందు భీష్మాచార్యుడుగా జన్మించి ఎక్కువ కాలం జీవించి యదార్థ రూపానికి వస్తారని… మిగిలిన వారందరూ కూడా పుట్టిన వెంటనే చనిపోయి యదార్ధ రూపాలకు వస్తారని ఈయన వారందరికీ శాపవిమోచన ఇవ్వడం జరిగినది.ఇదే ఈ కథా సారాంశం అన్నమాట. మాకు కలిగిన ధ్యాన అనుభవాలు దృశ్యములకు ఈ కథకు సరిగ్గా సరిపోయేసరికి ఇష్ట లోకవాసులుగా అష్టవసువులు ఉంటే ఇష్ట లోక దైవాలుగా ఇష్ట లింగేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, కామేశ్వరి, అనంతపద్మనాభుడు, చతుర్ముఖ బ్రహ్మలు ఉంటారని మాకు జ్ఞాన స్పురణ అయినది. ఇష్ట లోకవాసులలో వశిష్ఠమహర్షి జన్మ నాది అయితే మన జిజ్ఞాసి కాస్త భీష్మాచార్యుడు అని నాకు అర్థమైనది. విచిత్రమేమిటంటే తన ఆది జన్మ భీష్మాచార్యుడు అని మా సద్గురువైన శ్రీ త్రైలింగస్వామి చెప్పడం జరిగింది కదా.ఈ రెండు జన్మలలో మేమే ఈ లోకమునందు నేనేమో ఇష్టకామేశ్వరుడిని ఆరాధన చేస్తుంటే మా వాడేమో అనంతపద్మనాభుడు ఆరాధన చేస్తూ సంకల్ప కర్మలు నివారణ చేస్తున్నామని మాకు జ్ఞాన స్పురణ అయినది.వీళ్ళు తీర్చే ఇష్ట కోరికల కోసం ఈ జన్మలు కోరికలు మాయలో పడి కొట్టుకుంటున్నామని అర్థమైనది. కాకపోతే ఏమిటి? ఆవును కాస్త కామధేనువుగా మార్చడానికి అతీంద్రియ శక్తులను కల్పించి మాయ చేసి వశిష్ఠమహర్షి కాస్త ఇతరుల కోసం సంకల్ప కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడు అంటే ఇష్ట కోరిక ఏంటో తెలుస్తుంది కదా. అలాగే ఈ మహత్తర శక్తి ఉన్న కామధేనువును మహామాయే అయితే అది కావాలని దాన్ని ఎలాగైనా పొందాలని ప్రభాసుడు దొంగతనం చేస్తూ భీష్మాచార్యుడుగా జన్మ పొందటంలో ఏమైనా అర్థం ఉందా? నా బొందా. నా బూడిద. మా ఇద్దరికీ అయితే ఇష్ట కోరికల మీద అలాగే ఇష్ట పదార్థాల మీద అప్పటికే స్మశాన వైరాగ్యం కలగటంతో మౌనంగా సాక్షీభూతంగా కనిపించే ఈ లోక దృశ్య అనుభవం విషయాలను చూస్తూ కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాము. ఎవరైతే ఏమిటి. చచ్చే వాడికి శవాలతోను శరీరాలతోను పని ఏమి ఉంటుంది దైవాలుతోను పని ఏమి ఉంటుంది. పనిలేని వాడికి కాసులతో ఏమి పని ఉంటుంది. అవసరాలు లేనివాడికి అతీంద్రియ శక్తులతో ఇంకేమీ పని ఉంటుంది. సంకల్పాలు లేనివాడికి సంకల్ప శరీరంతో ఏమి పని ఉంటుంది అనే ధ్యానస్థితిలో మా సాధన కొనసాగుతుండగా ఈ లోకంలోని సాధన శరీరం యొక్క బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ కృష్ణబిలం లీలగా కనబడసాగింది. ఏదో కారణం వలన మా సంకల్ప శరీరము ఆగిపోగానే అడుగుభాగాన మాకు 0.1mm పరిమాణములో ఉన్న మా ఆకాశ శరీరము చేరుకోవడం అది కాస్త ఏదో లోకానికి అనుసంధానమై  ప్రవేశించినట్లు నాకు లీలగా కనిపించేసరికి మా స్థూల శరీరం కాస్త అతి తీవ్రమైన ప్రమాదకరమైన స్థాయిలో కంపించేసరికి నా ధ్యానస్థితి 192 నిమిషాలకు చేరుకున్నదని మాకు అర్థం అవుతుండగా ధ్యాన భంగమైనది. 

మరునాడు పేపర్లో.. రాయల్ వశిష్ట పేరుతో ఉన్న ఒక పెద్ద బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు గోదావరిలో ముగినిపోయిన విషయం వచ్చినది. అనగా సుమారు 77 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో 26 మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి పలువురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఆకాశ కర్మలు నివారణ- కర్మశేషము నివారణ:

 అనగా ఇప్పటిదాకా మా సాధనలో 36 కపాలాలలో 35 కపాలాలకున్న 11 కపాలాల స్థూల కర్మలు అలాగే 9 కపాలాలకున్న సూక్ష్మకర్మలు  అలాగే 7కపాలాలకున్న కారణ  కర్మలు అలాగే 5 మరియు 3 కలిపి మొత్తం 8 కపాలాలకున్న సంకల్ప కర్మలు అనగా 11+ 9 +7+ 5+3= 35 కపాలాలకు ఉన్న సర్వ కర్మలు నివారణ చేసుకుని ఈ కర్మల యొక్క కర్మశేషములు అయిన ఈ ఐదు జతల కపాలాల యొక్క మొత్తము పది కపాలాల కర్మశేషముల ఫలమే పదకొండవ ఏకమూల బ్రహ్మకపాలమని మాకు స్పురణ అయింది. అంటే ముప్పై ఆరవ కపాలము అన్నమాట. ఈ కపాలములో ఉన్న ఈ పంచకర్మల కర్మశేషము లేకుండా నివారణ చేసుకోగలిగితే మా ఇద్దరికి కూడా సంపూర్ణ కపాల మోక్షం కలుగుతుంది. లేదు అంటే ఈ కర్మశేషములలో మేము దేనికైనా స్పందిస్తే అది కాస్త ఆయా లోకమునకు ఆయా శరీరముతో పునర్జన్మ ఎత్తి ఆ  కర్మ నివారణ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అంతిమ స్థితి. జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. తేడా వస్తే జన్మలు వస్తాయి. ఇక్కడదాక నాకు తెలిసి రావణబ్రహ్మ వచ్చినాడు. కాని స్త్రీ వ్యామోహంకు స్పందించడం వలన భూలోక రావణాసురుడిగా జన్మ ఎత్తి త్రేతా యుగము నందు రామాయణగాథ నడిపించవలసి వచ్చినది. పోనీ ఇక్కడితో ఆగిపోతే శూన్య బ్రహ్మగా మారి కర్మశేషములు నివారణ చేసుకోవలసి వస్తుంది.అంటే భవిష్యత్ బ్రహ్మ అవతారాలు అన్నమాట. ఇప్పటిదాకా ఎనిమిదిమంది భవిష్యత్ బ్రహ్మలు జన్మించి చనిపోవడం జరిగినది. నవ భవిష్యత్ బ్రహ్మగా రాబోవు కాలంలో హనుమంతుడు వస్తున్నారని శాస్త్రవచనం. ఇక్కడున్న కర్మ శేషము యొక్క బలహీనతకు గురి అయితే ఆయా లోకవాసుడిగా జన్మ ఎత్తాలి లేదా మౌనం వహిస్తే శూన్య బ్రహ్మగా ఈ విశ్వసృష్టిని అవతరణ చేయవలసి ఉంటుంది.  ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి. ఏమి చేయాలో అర్థం కాని స్థితి. పులి  మీద స్వారీ లాగా ఉంది. ఆగితే పులి తింటుంది.మాయలో పడితే పులి తింటుంది.ఎలాగైనా పులికి ఆహారం కావాల్సి వస్తోంది. ప్రకృతి ఆహారం మాయగా మారవలసి వస్తోంది. ఏమి జరిగితే అది జరుగుతుంది. చచ్చే వాడు కాస్త బతకడానికి ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకృతి ఏర్పాటు చేసిందని మాకు అర్థమైంది.వస్తే కొండ వస్తుంది. లేదంటే వెంట్రుక మిగులుతుంది.పోతే కపాలము అంతము అవుతుంది. లేదు అంటే లోకవాసుడిగా జన్మ ఏర్పడుతుంది. ఏమీ చేసిన ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి వస్తున్నప్పుడు అది ఏదో ప్రయత్నించి జయమో లేదా వీరస్వర్గమో తెల్చుకుంటే మంచిది గదాయని మాకు ఇద్దరికీ అనిపించినది. దానితో మా ధ్యాన స్థితి 192 నుండి240 నిమిషాల దాకా పెంచుకోవాలని స్పురణ పొంది ఆ దిశగా అడుగులు వేయడం ఆరంభించినాము. కర్మశేషాలైన స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప కర్మల 0.1శాతమైన బలహీతల కర్మ శేషమే ఈ ఆకాశ కర్మ శేషముగా మూలప్రారబ్ధ 11 కర్మశేషాలుగా ఉంటాయని నాకు జ్ఞానస్ఫురణ అయినది.

నా 36 కపాలాల యానం:

ఇది ఇలా ఉండగా కొన్ని వారాల తర్వాత ఒకరోజు నా ధ్యానము కాస్త అత్యంత తీవ్రమైన ధ్యానస్థితిలో వెళుతుండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది. ఏవో దృశ్యాలు కనిపిస్తూ అవి నన్ను దాటుతూ వెళుతున్నాయి. ఇంతలో ఒక బల్లి కనిపించింది.అటుపై ఒక చేప కనిపించినది. అటుపై పాము కనిపించింది. అటుపై  గుడ్లగూబ, హంస, తేలు, గబ్బిలం, కుక్క, గుఱ్ఱము, ఏనుగు, ఆవు కనిపించినాయి. అటుపై ఒక మనిషి కనిపించాడు. అంటే గుడ్లు పెట్టే జీవులు మొదలై పిల్లల్ని పెట్టే జంతువులు దాకా ఈ దృశ్యాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తుండగా ఒక మానవ కపాలం కనిపించినది. కపాలము నోటి నుండి ఎర్రటి మాంసపు ముద్దలు పడుతున్నట్లు క్లియర్ గా కనిపించింది. ఇది తెరిచి ఉన్న నోట్లోకి నేను పోతున్నట్లుగా ఆ నోరు నన్ను దాటి వెళుతున్న దృశ్యం కనిపించింది. ఈ లోపల మరొక మానవ కపాలం కనిపించినది. దీనిలో నోట్లో కి వెళ్లడం మరొక మానవ కపాలం కనపడటం జరిగినది. సుమారుగా 11 మానవ కపాలాలు దాటటము జరిగిందని నాకు అర్థమైనది.అంటే స్థూల శరీర కర్మలు దాటటము జరిగినదే అనుకునే లోపల మరో మానవ కపాలం దర్శనమిచ్చింది. విచిత్రమేమిటంటే ఈ కపాలమునకు కుడి చెవి రంధ్రము మాత్రమే తెరుసుకుని మిగిలిన కళ్ళు ముక్కు నోటి రంధ్రాలు ఎడమ చెవి రంధ్రం మూసుకుని ఉన్నాయి. ఈ కుడి చెవి రంద్రం లోనికి నేను ప్రవేశించడం జరిగినది. తర్వాత దీని లోపల మరో ఒక మానవ కపాలం కనిపించినది.దీనికి కూడా కుడి చెవి రంధ్రమే తెరుసుకుని మిగిలిన రంద్రాలు మూసుకుని ఉన్నట్లుగా కనిపించినది. ఇలా 9 కపాలాలు దాటుకోవడం జరిగినది. అంటే నవబ్రహ్మ కపాలాలు అయ్యి ఉండాలి. అనగా నవగ్రహ లోకాధిపతులు అయ్యి ఉండాలి. ఇవియే సూక్ష్మ కర్మలు అని నాకు అర్థం అయినది. అంటే కాశీక్షేత్రంలో కుడి చెవి పైకి పెట్టుకొని ఆకాశంకేసి చనిపోయే జీవులన్నీ కూడా ఈ కపాల లోకాలకి అనగా నవగ్రహ లోక వాసులుగా నామ రూప దైవాలుగా సూక్ష్మ కర్మలు చేస్తూ ఉంటారని నాకు స్పురణ కలుగుతుండగా మరో మానవ కపాలం లీలగా కనిపించినది. ఈసారి కపాలము అన్ని రంద్రాలు మూసుకుని ఉండగా త్రినేత్రం ఉన్న చోట ఒక చిన్న రంద్రం ఉన్నట్లుగా కనిపించసాగింది. అది కూడా అడ్డంగా ఈ రంధ్రం ఉన్నది.ఈ రంధ్రంలోనికి నేను ప్రవేశించడం జరిగింది. ఇలాంటివి సుమారుగా ఏడు కపాలాలలోనికి ప్రవేశించడం జరిగినది. అంటే ఇవి కారణ  బ్రహ్మ కపాలాలు అయ్యి ఉండాలి అనుకునే లోపల మరొక మానవ కపాలం కనిపించినది.ఈ కపాలమునకు బ్రహ్మరంధ్ర ప్రాంతమే తెరుసుకుని ఉండగా మిగిలిన అన్ని రంద్రాలు మూసుకుని ఉన్నట్లుగా లీలగా కనిపించసాగింది. నేను కాస్త తెరుచుకుని ఉన్న బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించిగానే అందులో ఇలాంటి మరొక బ్రహ్మ కపాలము కనిపించినది. ఇలా మరో ఎనిమిది బ్రహ్మకపాలాలు దాటుకోవడం జరిగినది. అంటే ఇవి సంకల్ప కర్మలు నిర్వహించే అష్ట బ్రహ్మ కపాలాలని నాకు అర్థం అయ్యే లోపల ఏమీ లేని ఎవరూ లేని వెలుతురు చీకటి మధ్యస్థంగా ఉన్న గాఢ అంధకార శూన్యము లాంటి వాతావరణ స్థితి లీలగా కనిపించసాగినది. చూస్తే ఏమీ లేదు. ఎవరు లేరు. ఏదో ఉన్నట్లుగా ఏదో తెలియనిది ఉన్నట్లుగా లీలగా నాద ప్రక్రియ లాంటి గుండెచప్పుడు లాంటి శబ్దం వినిపించసాగినది.శ్వాస యొక్క గమనము లాగ గుండె యొక్క శబ్దం లాగ నిశ్శబ్ద నాదములాగా లీలగా వినపడసాగినది.చుట్టూ చూస్తే ఏమీ లేదు. ఒక ఎడారిలో రాత్రిపూట ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఈ శబ్ద నాదము ఎక్కడనుండి లీలగా వినబడుతుందో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నా స్థూల శరీరము కాస్త చాలా చాలా చాలా చాలా తీవ్రమైన కంపనస్థితికి గురవుతోందని అర్థం అయినది. సాధన 242 నిమిషాలకు దగ్గరికి వస్తుంది అని నేను గ్రహించే లోపల కనిపించే శూన్యము కాస్త మధ్య భాగము లోనికి వచ్చినట్లుగా నాకు అనిపించసాగింది.అంటే పరమ శూన్యమునకు నేను చేరుకున్నానని గ్రహించే లోపల పిండి రేణువు లాంటి పరిమాణంలో ఉన్న ఒక మానవ కపాలం కనిపించినది. విచిత్రం ఏమిటంటే దీనికి అన్ని రంధ్రాలతో పాటు తెరిచి ఉన్న బ్రహ్మరంధ్రము కూడా మూసుకుని ఉన్నట్టుగా కనిపించసాగింది. 

కాకపోతే ఈ ఏక బ్రహ్మకపాలం చుట్టూ ఏవో రెండు భ్రమర కీటకాలు తిరుగుతున్నట్లుగా ఒక అణువు చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ప్రోటాన్ తిరుగుతున్నట్లుగా తిరుగుతూ రెండు బిందువులు ఆయా కక్ష్యలలో పరిభ్రమిస్తున్నట్లుగా చాలా స్పష్టం గా కనబడుతోంది. అనగా ఒకసారి ఈ రెండు కూడా అప్పుడప్పుడు ఈ ఏక మూల బ్రహ్మకపాలంలో క్రింద భాగములో ఢీ కొన్నపుడు విశ్వ సృష్టి జరుగుతున్నట్లుగా అదే ఈ కపాలం యొక్క తల భాగం పైన బ్రహ్మరంధ్రము పైభాగంలో ఢీ కొన్నపుడు నాశనం జరుగుతున్నట్లుగా లీలగా ఆ విషయాలు కనపడుతున్నాయి. అంటే ఈ రెండు బిందువులుల్లో ఒకటి ప్రకృతి పురుషుడిగా అలాగే మరొకటి ప్రకృతి స్త్రీ మూర్తి అయ్యి ఉండాలని అనుకుంటూండగా ఒక బిందువులో పురుషుడిగా నా ముఖం కనపడితే మరొక బిందువులో స్త్రీ మూర్తి రూపంలో నా జిఙ్ఞాసి ముఖము స్పష్టంగా కనిపించే సరికి అంటే ఇన్నాళ్లుగా మేమిద్దరమే ప్రకృతి పురుషుడు స్త్రీ మూర్తిగా ఉండి అసత్యమైన విశ్వమును సత్యముగా నిజమైనదని జీవనాటకము నడుపుతున్నామని తెలియగానే నిజానికి మూలప్రకృతి ఎప్పుడో నిశ్చల స్థితిలోనే అది కూడా ఏక మూల బ్రహ్మకపాలంగా సర్వ రంధ్రాలు మూసుకుని ఉన్నదని ఇప్పుడు కూడా కేవలం మౌనంగా సాక్షీభూతంగా సంపూర్ణ కపాలమోక్షం స్థితిలోనే సర్వకర్మ నివారణ స్థితిలో ఉన్నదని ఆలోచన భావననే గుణాల వలన ఈ రెండు బిందువులు ఏర్పడినట్లుగా అనగా నిరాకార ఆకార పరబ్రహ్మలుగా ఉన్నట్లుగా మనకి మనమే నిజమని సత్యమని నేను ఎవరిని అనే తెలుసుకోవాలన్న తపన తప్ప తాపత్రయాలు నేను ఆత్మనే నేను ఆత్మ కాదని తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నామని దానికోసం మనకి మనమే సాకార పరబ్రహ్మలుగా సంకల్ప లోకవాసులుగా నుండి మొదలై భూలోకవాసులుగా జన్మలెత్తినామని ఎప్పటికీ మన నిజ స్థితిలో ఉంటే ఏమీ లేదు సర్వము శూన్యము అనే నిశ్చల స్థితిలో మన మనస్సును ఉంచితే అప్పటిదాకా సత్యంగా కనిపించే విశ్వము కాస్త అసత్యంగా కనిపిస్తుంది. నిజానికి ఎవరైనా ఇట్టి సాధన స్థితికి వస్తే వారికి మాత్రమే ప్రకృతి పురుషుడు గాను లేదా ప్రకృతి స్త్రీ మూర్తిగా ఎవరికివారే కనపడతారు. అందరు కూడా శూన్య బ్రహ్మలే. అందరు సంపూర్ణ కపాలమోక్షధారులే.కానీ మనము చనిపోయిన విషయం ఎలాగైతే మనకి తెలియదో అలాగే మనకి సంపూర్ణ కపాల మోక్షం పొందిన విషయం అసలు మనకి కూడా ఎన్నటికీ ఎప్పటికి తెలియదు. తెలిస్తే మనకి మరణం వచ్చినట్లు కాదు కదా. మరణం పొందినట్లు కాదు కదా. 

మనకి ఆలోచన సంకల్పం ఎలా వస్తున్నాయి అనే సందేహం చాలామందికి వస్తుంది.శూన్యములో ఓంకార తుంకార నాదము వలన ఈ మూల ఏక బ్రహ్మకపాలమునకు ఉన్న ఆకర్షణ శక్తి వలన ఈ నాదాలు కలిసిపోయి నాద బిందువులుగా మారి ఈ కపాలము చుట్టూ తమ ప్రమేయం లేకుండా సాక్షీభూతంగా ఏమీ తెలియనివాటి లాగా పరిభ్రమిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇక్కడ నాశనం చేయటానికి ఏమీ లేదు. నాశనం అయ్యేది ఏమీ లేదు. నాశనం చేసేది ఏమీ లేదు. శబ్దమును ఏమి నాశనం చేయగలవు. ఎందుకంటే అది అనాహత నాదం. పుట్టుక లేనిది. కనిపించే కపాలము అది నిజము కాదు. అది ఎప్పుడో నాశనమయ్యే అత్యంత రూపానికి వచ్చింది. మన బుద్ధి వలన అది కనపడుతోంది. ఇది కాస్త బుద్ధి అతీత స్థితి లోనికి వెళితే ఈ కనిపించే పిండి రేణువు కపాలము కూడా కనబడదు. పిండి రేణువు బ్రహ్మకపాలం కూడా కనిపించదు. అంటే కనిపించే కపాలం అది ఎప్పుడో నాశనమయ్యే అంత్యంత రూపానికి వచ్చినది. అంటే ఆరడుగుల దేహమును కాలిస్తే ఎలాగైతే బూడిద వస్తుందో అలా అడుగు నుండి పిండి రేణువు కపాలము దాకా మారినది. అంటే జీవమైన బ్రహ్మ పదార్ధం నుండి నిర్జీవమైన త్రస్య రేణువుకి వచ్చినది. దానిని నాశనం చేయడానికి ఏమీ లేదు. ఈ శబ్ద నాద ప్రకంపనాలు వలన మన శూన్యమైన మనస్సు కాస్త చంచలమై ఏదో ఉందని ఏదో కావాలని ఏదో తెలుసుకోవాలని ఏదో పొందాలని అనేకమనేక ఆలోచనలు చేస్తోంది. తద్వారా మనకి స్పందనలు, ఆలోచనలు, సంకల్పాలు, ఆశలు, ఆశయాలు, భయాలు, ఆనందాలు, మాయలు ఇలా వివిధ రకాల శరీరాలు ధరిస్తూ నానా కష్టాలు పడుతున్నారు.నానా చంకలు నాకుతున్నాము. ఆనంద పడుతున్నామని బాధపడుతున్నాము.అపస్మారక స్థితిని పొంది మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉన్నాము. నిజానికి మనము లేము. మన జన్మలు లేవు. ఏమీ లేవు. ఏమీ లేదు. శూన్యమే ఉంది. కనిపించే విశ్వమంతా ఎప్పుడో శాశ్వతమైన శాశ్వత మరణ స్థితి ఆదిలోనే పొందినది. అంటే ఆదిలోనే ఏకకాలంలో పుట్టడం పెరగడం చనిపోవడం జరిగిపోయాయి. 36 కపాలాలు కాస్త రికార్డు దృశ్యంగా కాలచక్రం ద్వారా మనకు చూపిస్తున్నాయి .ఎవరు అయితే నేను లేను అని తెలుసుకుంటారో వారి రికార్డ్ దృశ్యాలు కాల చక్రము నుండి తొలగించబడతాయి. నాశనము చేయబడతాయి.అందుకే ఎవరికి వారే సాధన చేసి నిజ జ్ఞానమును పొందాలని చెప్పినది. ఎందుకంటే నువ్వు లేవు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. నమ్మ లేరు కదా. అది ఏమిటి? నాకు ఇల్లు ఇల్లాలు ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి. భార్య ఉన్నది. భర్త ఉన్నాడు. తల్లి దండ్రులు, అత్తమామలు ఉన్నారు. నా బొంద ఉంది. నా బూడిద ఉంది అంటారు కదా. ఎవరికి వారే మాకు లాగా ఈసాధన స్థితికి వస్తే గాని నమ్మక తప్పదు. ఎప్పుడో మనము చనిపోయిన వాళ్ళమని సంపూర్ణ కపాల మోక్షం పొందిన వాళ్ళమని తెలుసుకోక తప్పదు.అంటే నేను ఎపుడో చనిపోయాను. నేను లేను అని జ్ఞాన స్పురణ కలుగుతుండగా మూల బ్రహ్మకపాలం నుండి తిరిగి మూడు కపాలాలు అటుపై 5 కపాలాలు అటుపై 7 కపాలాలు అటుపై 9 కపాలాలు అటుపై  ఏకాదశి కపాలాలు కనబడుతూ మొత్తం 36  కపాలాలు  ధరించి ఉన్న ధ్యానముద్రలో ఉన్న ఒక అస్థి పంజరము లీలగా కనబడుతూ ….అంటే నా సాధన అంతా అనగా నా బ్రహ్మరంధ్రములో ఉన్న 36 కపాలాలు లోపల నేను కాస్త వివిధ రకాల శరీరాలతో 48 రోజులపాటు సంచారం చేసినానని చివరికి ఏకముగా బ్రహ్మకపాలం చేరుకుని నేను లేను అని తెలుసుకుని జ్ఞాన స్పురణ పొందినానని… తద్వారా ఈ 36 కపాలాలలో నిక్షిప్తమైన నాజ్ఞాపకాలు యొక్క పంచ కర్మల శరీరాల రికార్డ్ దృశ్యాలను చూస్తూ వాటిని నివారణ చేస్తూ నాశనం చేసుకున్నానని అందరు కూడా నాలాగానే ఎప్పుడో సంపూర్ణ కపాలమోక్షం  స్థితిని పొందినారని నాకు లాగానే అపనమ్మకం వలన సాధన చేసుకుంటున్నారని సాధన పరిసమాప్తి సమయంలో మన మెదడు తట్టుకోలేని స్థితికి వెళ్ళినప్పుడు బలహీనత మహామాయలో పడుతున్నారని… తద్వారా అప్పుడు దాకా తాము పొందిన జ్ఞానమును అపస్మారక స్థితి వలన మర్చిపోవడం జరుగుతోందని మళ్లీ కథ మొదటికి వస్తుందని సాధనను కూడా ఎక్కడ ఆపకూడదు అని నిరంతరం ఓంకారనాదం చేస్తూ ఉంటే ఆ నాదము ఉండే శూన్య స్థితికి మనల్ని తప్పకుండా తీసుకు వెళుతుందని తద్వారా నేను లేను అనే జ్ఞాపకమును జ్ఞాన స్పురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవడమే ఇదే సంపూర్ణ కపాలమోక్షం స్థితిని అనుకునే లోపల …. హిమాలయాలు దాటుతూ పైకి వెళుతూ గ్రహాలు గ్రహ మండలాలు లోకాలు భువనాలు దాటుకుంటూ పోతుంటే చిట్టచివరి శూన్య స్థితికి రాగానే… శూన్యమే ఒక మూల బ్రహ్మకపాలంగా… ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు శూన్య బ్రహ్మ బిందువులుగా మారి శూన్యము యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి తిరుగుతున్నాయని తద్వారా అసత్యంగా కనిపించేవి సత్యంగా ఉన్నాయని కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకోవటానికి యోగసాధన అలాగే ఆధ్యాత్మిక విద్య ఉన్నదని ఆకాశ లింగము అంటే ఆకాశంలో లింగమును చూడటానికి ప్రయత్నించానని నిజానికి ఆకాశమే లింగమని గ్రహించలేకపోయాను అని శాశ్వత మరణమైన కపాలమోక్షంని ఏనాడో పొందితే అది ఇంకా పొందలేదని పొందిన దాని కోసం ఇన్నాళ్లు సాధనను చేసినానని నాకు అర్థమయ్యేలా నా మెదడు కాస్త విపరీతమైన తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ యోగ నిద్రలోకి జారుకున్నది. 

లాహిరి చిట్టచివరి అనుభవం

మాకైతే మూలంలో ఏక బ్రహ్మకపాలం ఉండీ లేనట్లుగా అది ఉన్నట్లుగా భ్రమ భ్రాంతిలో కనబడినట్లుగా తెలుస్తోంది. ఇలా ఎవరికైనా కనబడిందా? అని మళ్ళీ పరమ యోగులు అనుభవాల పుస్తకాలు తిరగవేస్తే అందులో లాహిరి అనుభవం మా అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనబడింది. ఆయన కాస్త శూన్య బ్రహ్మ సాధన పరిసమాప్తికి వచ్చినప్పుడు మొదట పృద్వివి అణువు దర్శనమిచ్చింది. ఇది కాస్త జలఅణువుగా మారి జలములో కలిసి పోయింది. ఈ అణువు కాస్త తేజస్సు లోకి వెళ్లి తేజ అణువుగా మారిపోయినది. ఆ తర్వాత ఈ తేజ అణువు కాస్తా వాయువు లోనికి ప్రవేశించి వాయుఅణువుగా మారిపోయింది. ఆ తర్వాత ఈ వాయు అణువు కాస్త ఆకాశ అణువుగా మారి ఆకాశములో అంటే శూన్యములో లయము అయినది. ఈ ఆకాశ అణువు కాస్త శూన్య బిందువుగా అతి సూక్ష్మంగా మారినది. అంటే దీనిని బ్రహ్మాణువు అని అన్నారు. నిజానికి ఇది అతిసూక్ష్మాతి సూక్ష్మంగా కావటం వలన అనుభవములోనికి రాదని కానీ అది ఏదో ఉన్నట్లుగా అది ఏదో ఉందనే భ్రమ భ్రాంతి కలిగిస్తుందని అందరూ కూడా ఇందులో లయము కావాల్సి ఉంటుందని నిజానికి ఇది లేదని కేవలం ఇది ఉన్నట్లుగా మాత్రమే మనకి కనిపిస్తోందని దానిగా మనము మారితే ఇక శూన్యమే మిగులుతుందని ఇట్టి స్థితిలో మనమే బ్రహ్మ స్వరూపముతో లీనమైతే శూన్యబ్రహ్మ అయిపోతారు అని చూడటానికి చూసేది ఏమీ ఉండదని ఏమీ లేదని సర్వం శూన్యమే అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే మా ఇద్దరికీ అతి సూక్ష్మమైన ఏకమూల బ్రహ్మకపాలం కనపడితే ఈయనికి బ్రహ్మాణువుగా శూన్య బిందువుగా కనపడుతోందని యద్భావం తద్భవతిగా ఏ భావముతో ఆరాధన సాధన చేస్తారో అందరూ కూడా చిట్టచివరిది స్థితికి వచ్చేసరికి శూన్య రూపమైన శూన్య బిందువు కాస్త వారికి భావన సాధన స్థాయిని బట్టి అసత్యమైనది కాస్త సత్యముగా కనిపిస్తుందని మా ఇద్దరికీ అర్థమైనది. ఇలా మా ఇద్దరి యొక్క చిట్టచివరిది అయిన బ్రహ్మ సాధన అనుభవం సత్యమని నిదర్శనంగా …

మాకు గణపతి శివుడు రాముడు వారి నెస్టెడ్(nested) కొండపల్లి బొమ్మలు వచ్చినాయి. ఈ బొమ్మల ప్రత్యేకత ఏమిటంటే ఒకే బొమ్మ వివిధ పరిమాణాలుగా తగ్గుతూ చిన్నవిగా మారిపోతూ ఒకదానిలో ఒకటి ఇమిడిపోతాయి. వీటినే నెక్స్ట్ టాయ్స్(nested toys) అంటారు. ఇందులో మాకు వచ్చిన గణపతి బొమ్మలు కాస్త 9 రకాల పరిమాణాల్లో ఉంటే….శివుడు బొమ్మలు ఐదు రకాల పరిమాణాల్లో శివుడు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి, శివలింగము అనే అయిదు బొమ్మల వాటి పరిమాణాలు తగ్గుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా శివుడు విగ్రహంలో అమరి పోతాయి. 

అలాగే శ్రీరాముడు విగ్రహాలు కూడా శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సాలగ్రామము అనే ఐదు బొమ్మలు వాటి పరిమాణాలు తగ్గించుకుంటూ శ్రీరాముడి విగ్రహంలో ఇమిడిపోవడం జరిగినది. విచిత్రమేమిటంటే వారి సాధన దైవానికి తగ్గట్లుగా నాకైతే శివుడు బొమ్మలు అలాగే మాజిఙ్ఞాసికి శ్రీరాముడి బొమ్మలు అలా మా ఇద్దరికీ కలిపి అలాగే విశ్వసృష్టికి యొక్క ఆదిమూలం సాకార పరబ్రహ్మమైన మహాగణపతి ఒక నవ గణపతులు బొమ్మలు రావడం జరిగినది. నిజానికి మా ఇద్దరి సాధన కూడా …

ఈ 36 వ బ్రహ్మకపాలంలో 11 కపాలాలు అడుగు పరిమాణంలో ఉంటే మిగిలిన 9 కపాలాలు 83 అంగుళాలు ఉంటే ఆపై 7 కపాలాలు మూడు అంగుళాలు ఉంటే ఆపై 5,3 కలిపి ఎనిమిది కపాలాలు అంగుళ పరిమాణంలో ఉంటే ఆపై ఆఖరిదైన మూలమైన ఏక మూల బ్రహ్మ కపాలము కాస్తా పిండి రేణువు పరిమాణములో ఉన్నట్లుగా అంటే మాకు వచ్చిన మహాగణపతి (nested)బొమ్మల పరిమాణం లాగా కనబడినాయి. మా అనుభవాలు నిజమని ప్రకృతిమాత కాస్త ఈ దైవిక వస్తువులు రూపాలలో నిరూపించడం అది కూడా మా సాధన దైవానికి తగ్గట్లుగా నిరూపించటం పైగా శూన్య బిందువు యొక్క ఆది మూల ఆకార పరబ్రహ్మ రూపము మహాగణపతి రూపమే ఉంటుందని చెప్పిన వేద శాస్త్ర పురాణ ఉవాచ కూడా నిజమేనని నిర్ధారణ చేసే సరికి మాకే తెలియని చెప్పలేని అలవికాని సచ్చిదానంద స్థితిలోకి మేము వెళుతూ శూన్య బిందువు గా మారిపోయినాము. శూన్య బిందువు నందు శూన్య బిందువుగా లయం చెందినాము. ఇంకా దానితో శూన్య బిందువే ఉండి లేనట్లుగా పరమ శూన్య స్థితిలో శాశ్వత యధార్థ నిజ స్థితిలో, సహజ స్థితిలో, యధాతధంగా ఈ స్థితిలో నువ్వు అది ఉన్నట్లుగా అనుభూతి తగినట్లుగా సమాధి స్థితిలో అది ఉండీ లేనట్లుగా యద్భావం తద్భవతి సంకల్ప సిద్ధించాక శ్వాసతో శ్వాసించే శరీరంతో ఏమి పని? నేను లేను.

ఈ ధ్యాన అనుభవమునకు నిజంగానే నిదర్శనంగా మాకు టిబెట్ నుండి ఒక కపాలము ఉన్న నాగపాము లాకెట్ రావటంతో మా ఇద్దరికి ఆశ్చర్యం వేసింది. దీనిని చూస్తుంటే కైలాస పర్వతంలో ఉన్న 36 సదాశివమూర్తి యొక్క ఏక మూల బ్రహ్మకపాలం కాపాడే కింగ్ కోబ్రా నాగుపాము లాగా ఒక క్షణంపాటు సజీవమూర్తిగా కనిపించేసరికి సచ్చిదానందంవేసినది.నేను లేను అనే జ్ఞాపకమును మేమిద్ధరము జ్ఞాన స్పురణతో జ్ఞప్తికి తెచ్చుకునే సరికి మా సాధన సంపూర్ణమైనది అని చెబుతున్నట్లుగా అనిపించసాగింది.అలాగే చిట్ట చివరిగా సత్యంగా కనిపించే అసత్యమైన మూల బ్రహ్మకపాలంను చూసి మన పూర్విక మహర్షులు దీనికి త్రస్య రేణువు అంటే ఆధునిక శాస్త్రవేత్తలు కాస్త దీనిని దైవ కణంగా పేర్కొనడం జరిగింది. నిజానికి ఈ కపాలం యొక్క పరిమాణం ఎంతో తెలుసా? పిండి రేణువుని వెయ్యి భాగాలు చేస్తే వచ్చే వెయ్యో వంతు భాగాన్ని తిరిగి 100 భాగాలు చేస్తే వచ్చే వందో వంతు భాగమును తిరిగి 36 భాగాలు చేస్తే వచ్చే 36 వ భాగము మళ్లీ మూడు భాగాలు చేస్తే వచ్చే మూడో భాగం యొక్క ఒక భాగం చేస్తే వచ్చే పరిమాణము అన్నమాట. ఒక నల్ల చీమ మెదడు భాగమంతా ఉంటుందని ఆలోచించండి. నిజానికి అది ఏక మూల బ్రహ్మకపాలమునకు మన పూర్విక మహర్షులు శివ అని నామకరణం చేయడం జరిగినది. శివ అంటే లేని వాడు అని అర్ధం ఉన్నది.ఈ అర్థము కోసమే శివం - శవం అని సంబోధించే నానుడిని ప్రచారం చేసినారు. మనకి అనుభవ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మకపాలం కనపడుతుంది. కానీ మనం అనుభూతి స్థితిలో ఉన్నప్పుడు ఈ కపాలము కూడా ఉన్నట్లుగా కనపడదు. అంటే ఉండీ లేనట్లుగా అన్నమాట. ఉంది అన్న అనుభూతి ఉంటుంది కానీ అది ఉన్నది అని మనకి కనిపించదు. 

ఇక శివ అనే దానిని లేనివాడు అనేదానికి మధ్యలో వచ్చిన అర్ధ జ్ఞాన పండితులు కాస్త శివ అంటే ఉన్నవాడని శివం అంటే జీవమని నానార్ధాలు చేర్చి లేనివాడిని ఉన్నవాడిగా మార్చి కర్మశేషంగా మిగిలిన చిట్టచివరి 11 కపాలాలు కాస్త ఏకాదశరుద్రులుగా ఆది మూల బ్రహ్మకపాలం శివలింగంగా శివుడి తలగా అనగా జటాజూట తలగా మార్చి పూజాదికాలు ఏర్పరచి భక్తితో భుక్తిని ఏర్పరచుకున్నారు అని ఈపాటికే గ్రహించే ఉంటారు. నేను లేను అనే దానిని కాస్త నేను ఉన్నాను, నేనే ఉన్నాను, నేను కానిది లేదు, నేను లేనిది లేదు అని తప్పుడు ప్రచారాలకి నాంది పలికారు. ఆ తర్వాత మరికొంతమంది ప్రబుద్ధులు కాస్త దీనికి నేను ఆత్మ,నేనే నువ్వు- నువ్వే నేను అని తప్పుడు ప్రచారాలు కొనసాగించారు. తర్వాత మరికొంతమంది ప్రబుద్ధులు కాస్త నేనే దేవుడని, నేనే పరమాత్మ , నేనే భగవంతుడిని, నేనే దేవతని అంటూ నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తర్వాత మరికొంతమంది ప్రబుద్ధులు నేను వేరు- నువ్వు వేరు, సోహం- దాసోహం, నువ్వు లేనిదే నేను లేను, నువ్వే శాశ్వతము.నువ్వే సర్వం. నువ్వే సర్వస్వము. నువ్వే అంతర్యామి. నువ్వే సత్యం. నువ్వే నిత్యం అంటూ తప్పుడు కూతలతో కూడిన వారి అభిమతాలను కాస్త మతాలగా మార్చి ఏకత్వం కాస్త భిన్నత్వంలోనికి తెచ్చి లేని దేవుడిని అనేక నామరూప దేవుళ్ళుగా ఏమార్చి మార్చి తమ పేరు ప్రఖ్యాతులుతో పాటు భక్తితోను భక్తులతో వ్యాపారాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. కాలం చేసినారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. సత్యాన్వేషణ ద్వారా బ్రహ్మజ్ఞానం అనుభూతిని పొందండి .నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతో సాధన ఆరంభమై నేను లేను సమాధాన సాధనతో సాధన పరిసమాప్తి అవుతుంది అని గ్రహించండి. అలాగే ఎల్లప్పుడూ నేను ఎవరిని అనుకోవద్దని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కానీ మీకు మాకు లాగానే నేను లేను అని నిజ బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతిని జ్ఞాన స్పురణ ద్వారా మీరు కూడా మాకులాగా పొందడం జరుగుతుంది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే నేను లేను అనే సత్యం జ్ఞానాన్నిమన పూర్వ మహర్షులు కాస్త దేవి సూక్తంలో చెప్పడం జరిగినది. శూన్యమును వీరు కాస్త నిరాకార పరబ్రహ్మ గాను రెండు నాద బిందువులను ఆకార సాకార పరబ్రహ్మలుగా అంత్య ఏకాదశి బ్రహ్మకపాలం ఏకాదశరుద్రులుగాను అటుపై అష్టవసువులు అపై సప్త ఊర్ధ్వ లోకాలు లోకాధిపతులు త్రిశక్తులు నవగ్రహాలు అంటూ అంతట నేనే ఉన్నాను నేను కానిది లేదు నేను లేను అని చెప్పుకుని రావడం జరిగింది. ఇకపోతే వాళ్ళంతా లోపలనుండి బయటకి వస్తే మేమిద్దరమూ మా సాధన అంతా కూడా బయటి నుండి లోపలికి వెళ్లడం జరిగింది. అనగా వాడికి నేను ఉన్నాను అనే భావన అంత్యములో కలిగితే మా ఇద్దరికి నేను లేను అనే భావం ఆరంభములో కలిగింది. నిజానికి నిర్జీవ పదార్థం నుండి జీవ పదార్థ భావం పుట్టినది. అసత్యము కాస్తా సత్యమైనది.నిజములాంటి కల కల లాంటి నిజమైనది. ఇంతకి కలగన్నది ఎవరంటారా? ఇంకా అర్థం కాలేదా? శూన్యమే. పరమ శూన్యమే అన్ని తనలో ఇముడ్చుకున్న శూన్యమే అన్నీ తానై ఉన్నట్లుగా అన్నిటిలోను తాను లేనట్లుగా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గా మాయతో స్వప్నము కొనసాగిస్తోంది. ఈ స్వప్నములో తనే అనేక మాయ పాత్రలు వేస్తున్నట్లుగా పుడుతున్నట్లుగా బ్రతుకుతున్నట్లుగా  చస్తున్నట్లుగా పునర్జన్మలు ఎత్తినట్టుగా కలలు కంటోంది. ఈ స్వప్న భావాలను రూపాలను ఆలోచనలను సంకల్పాలను ఆశలను ఆశయాలను భయాలు ఆనందాలు స్పందనలు మాయలు మర్మాలు స్వప్న జీవన నాటక పాత్రలకి అర్ధ జ్ఞాన పండితులు నానారకాల నామాలు గోరంత కొండంత చేసి చూపించి గ్రంథాల ద్వారా ప్రచారాలు చేస్తూ భుక్తిని పొందుతున్నారు. కాలము చేసినారు. ఈ అర్ధ జ్ఞానమే నిజమని నమ్మి మనలాంటి సాధకులు ఏదో చెయ్యాలని ఏదో తెలుసుకోవాలని ఏదో పొందాలని మోక్షం కోసం ముక్తి కోసం యోగ సాధన పేరుతో స్థూల శరీరమునకు నానా కష్టాలు ఇచ్చి సర్వకర్మ నివారణ కోసం కర్మ రాహిత్యము కోసము జన్మరాహిత్యము కోసం స్పందనా రాహిత్యం కోసము అని అన్ని పొందిన కూడా ఏమీ పొందలేదని అపనమ్మకంతో అంధకార విశ్వాసములతో నానా రకాల యోగాలు చేస్తూ నానా రకాల యోగ సాధనలు చేస్తూ మాయలో ఉన్నామో లేదో తెలియని అయోమయ సాధనలకి గురి అవుతూ ఎక్కడ ఉన్నామో ఏమి చేస్తున్నామో తెలియని సాధన స్థితిలో సాధన చేస్తూ గురువుల కోసము దైవానుగ్రహాల కోసం దైవసాక్షాత్కారం కోసం ఆత్మ సాక్షాత్కారం కోసం యోగ శక్తుల కోసం ఇలా అనుకుని చేసిన పనిని చేస్తున్నామని పొందిన జ్ఞానాన్ని నిజమని నమ్మక అపనమ్మకంతో అపస్మారక స్థితి పొంది తెలిసిన జ్ఞానమును మర్చిపోతూ మళ్ళీ చేసిన పనిచేస్తూ వైరాగ్యంతో నా నా కర్మ జన్మలతో నా నా చంకలు నాకుతూ నానా కష్టాలు మనకి మనమే తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా తెలుసుకోండి. ఒకటి గ్రహించండి. అంతా మీలోనే ఉంది. అన్నియు నీలోనే ఉన్నాయి.మోక్షమైనా ముక్తి అయినా మాయ అయినా బలహీనత అయినా స్పందన ప్రతిస్పందన అస్థిరమైన మనస్సు అయినా స్థిరమైన మనస్సు అయినా సర్వము నీలోనే ఉన్నాయి. మిమ్మల్ని దాటి ఈ విశ్వములో ఏమీ లేదు. మీరే విశ్వము విశ్వమే మీరు అని గ్రహించండి. ఒక అడుగు పెట్టెకి ఎలాంటి రూపురేఖలు లక్షణాలు ఉంటాయో అంతే అరంగుళం పెట్టెకి కూడా ఇవే లక్షణాలు ఉంటాయని గ్రహించండి. మీరు తక్కువ గాదు. విశ్వము ఎక్కువగా గాదు. అదే విశ్వములో మీరే సర్వాంతర్యామిగా ఉంటే అదే విశ్వము నీలో అంతర్యామిగా ఉంటుందని గ్రహించండి. ఈ తేడాను గమనించకపోవటం వలన మాయ అవుతుంది. నేను వేరు ఈ విశ్వము వేరు అనే భావానికి నాంది ఈ మాయ వేరు చేస్తుంది. దానితో మనం ఏదో సాధించాలని ఏదో పొందాలనే తపన తాపత్రయం మొదలై స్మశాన వైరాగ్యం పెంచుకుని యోగసాధన పేరుతో మోక్షము లేదా ముక్తి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాము. మనమంతా లేము. పోయిన వాళ్ళమే.చచ్చిన వాళ్ళమే.శాశ్వత మరణం పొందిన వాళ్ళమే. సంపూర్ణ కపాల మోక్షం పొందిన వాళ్ళమే. కానీ ఈ విషయము జ్ఞానాన్ని అనుభూతిని మన శరీరము పొందలేక పోవడం వలన మనము మోక్షము పొందిన కూడా బ్రతికే ఉన్నాము అని అనుకుంటున్నాము. ఇదే నిజమని సత్యమని భ్రమ భ్రాంతితో బ్రతికి వేస్తున్నాము. యోగ సాధన పేరుతో తెలుసుకొన్న విజ్ఞానమును తిరిగి జ్ఞప్తికి తెచ్చుకున్నా కూడా అపనమ్మకమును పెంచుకునే స్థితిలో పరిస్థితిలో ఉన్నాము. ఉంటున్నాము. అదేమిటి అలా అంటారా. అయితే మీరు లేరు ఎప్పుడో సంపూర్ణ కపాల మోక్షం పొందినారు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఆ విషయం మేము స్వయంగా తెలుసుకోవాలని కపాలమోక్షం సాధన మొదలుపెడతారు. ఈ గ్రంథము చెప్పిన విషయాలు సత్యాలని తెలుసుకుంటారు. ఇలా 1988 యుగాల పాటు నేను కాస్త ఈ గ్రంధమును రాస్తూనే ఉన్నాను. మీరు దానిని చదువుతూనే ఉన్నారు. మా జిఙ్ఞాసి మాత్రము ఈ గ్రంథమును ప్రచారం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ సాధన జన్మల యందు మా ఇద్దరికీ కలిగిన అనుభూతిని నిజమేనని నిరూపణ కోసం ఆయా క్షేత్రాల్లో నుండి దైవిక వస్తువులు రావటం అలాగే నిజ దైవ అనుభవాలు కాస్త ఇలలో కనపడేసరికి నమ్మక తప్పలేదు. దానితో మాకున్న మాయ పొరలు తొలగిపోయి ఉల్లిపాయ పొరలు తొలగిపోతే ఉల్లిపాయ ఎలాగైతే కనిపించదో అలా మాలో ఉన్న మాయ పొరలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క అధ్యాయ జ్ఞాన సారముతో తొలగుతూ ఒక్కొక్క దైవ జ్ఞానమును పొందుతూ రావడంతో మాయ పొరలు  ఉన్న ఈ దేహము కాస్త ఉల్లిపాయ లాగా అదృశ్యమై నేనున్నాను అనే దేహము కాస్త నేనే లేను అని అంతిమ స్థితికి చేరుకోవడంతో మా సాధన పరిసమాప్తి అయినది. అంటే యదార్థ సహజస్థితికి మేము చేరుకున్నాము .కాదు. మేము అందులో ఆ విధంగానే ఉన్నామని జ్ఞాపకమును జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకున్నామని తెలుసుకోండి.దీని కోసం మీరు మళ్ళీ సాధన చేయవలసిన అవసరమే లేదు. నేను చస్తే మీరు చావకుండా ఉంటారా? నేనే లేనప్పుడు నువ్వు అనేది ఎక్కడ నుండి వస్తుంది. చెప్పండి. నేనే నువ్వు నువ్వే నేను అయినప్పుడు మళ్ళీ తిరిగి మీరు కాస్త నేనుగా మారి నేను ఎవరిని అనే ప్రశ్నలు సాధన చేయడం వల్ల ఏమైనా అర్థం ఉందా? ఒకవేళ సాధన చేసిన కూడా మీరు తెలుసుకునేది ఏమిటి? నేను లేను అనే కదా. మళ్లీ దానికోసం సాధనలు మోక్షాలు ముక్తులు అంటూ సాధన చేయడం అవసరమా ఆలోచించండి. మన పూర్వ మహర్షులు ఏనాడో పొందిన నేను లేని జ్ఞానం అనుభూతిని నేను తిరిగి 35 సంవత్సరాల సాధనతో తిరిగి తెలుసుకోవడం వలన ఏమైనా అర్థం ఉందా? అపనమ్మకం వలనే మళ్ళీ నేను కాస్త సాధన చేసి తెలుసుకున్న విషయం తెలుసుకోవడం జరిగినది. మళ్లీ మీరు కూడా నాకు లాగానే చేసిన తప్పు మళ్లీ చేస్తారని అంటే నేను చేసేది ఏమీ లేదు. కావాలని గోతిలో పడేవాడిని ఎవరు రక్షించగలరు? నిద్ర నటన చేసే వారిని ఎవరూ కూడా మేలుకొల్పలేరని గ్రహించండి. మరి మేము ఏమి చేయాలి అంటారా? స్థూల శరీర జీవ పాత్రను ధర్మ జీవితంతో ధర్మ సంపాదనతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ అతిగా స్పందించకుండా అతిగా ఆలోచించకుండా అతిగా మోహము చెందకుండా అతిగా ఆశ పడక అతిగా ఆశ మించకుండా అతిగా బాధపడకుండా అతిగా ఆనంద పడకుండా సాధారణ స్థాయిలో అన్ని రకాల సుఖభోగాలను అనుభవిస్తూ యోగ జీవితమైనా భోగ జీవితమైనా కూడా ఎవరు ఉన్నా లేకపోయినా సంతృప్తిగా ఆనందంగా జీవించండి. అనుభవించండి. మరణించండి. అంతే. మీరు మీకు కావలసిన మోక్ష స్థితిని మీరు పొందిన అనుభూతిని పొందుతారు. ఎలా అంటారా? నాలుగు అడుగుల కర్రను తీసుకుని నాలుగు ముక్కలు చేయాలి అంటే ఒక అడుగు ముక్క చేస్తే మూడడుగుల ముక్క మిగులుతుంది. ఆ తర్వాత మరో అడుగు ముక్క చేస్తే రెండు అడుగుల ముక్క మిగులుతుంది. ఆఖరిగా మరో అడుగు ముక్క చేస్తే ఒక్క అడుగు ముక్క ఎలాగైతే మిగులుతుందో నాలుగు అడుగు ముక్క ఎలాగైతే దానికి అంతట అదే ముక్క చేయకుండా ఏర్పడినదో అలాగే మీ స్థూల శరీర జీవ పాత్ర కూడా ఇకనుంచి ధర్మ అర్ధ కామ మోక్ష ధర్మ జీవితంలో కొనసాగిస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగవదైనా మోక్షము కూడా అంతే సహజంగా మీకు ఏనాడో పొందినారని జ్ఞాపకం జ్ఞాన స్ఫురణ ద్వారా జ్ఞప్తికి వస్తుంది. ఇదియే సత్యం.ఇదియే తధ్యం.ఇదియే జ్ఞాపకం. ఇదియే గమ్యం. ఇదియే జ్ఞాపకం .ఇదియే నిజ సత్యాన్వేషణ.ఇదియే నిజ బ్రహ్మ జ్ఞాన అనుభవ అనుభూతి స్థితి. సంకల్పము సాధించాక శ్వాసకి విలువ లేదు. నేను లేను.ఇన్నాళ్లుగా ఏక మూల బ్రహ్మకపాలం కాస్త నేను ఉన్నాను నేను బ్రతికి ఉన్నాను నేను నిత్యం నేను సత్యము అనే భావన చేసినది. కానీ నిజానికి అది లేదు. కారణం అది శాశ్వతమైన మరణమును అనగా సంపూర్ణ కపాలమోక్షం పొందిన బ్రహ్మకపాలం అన్నమాట. అందుకే దీనికి ఉన్న రెండు కళ్ళు రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు చెవుల రంధ్రాలు నోటి రంధ్రము  త్రినేత్ర రంధ్రము  బ్రహ్మరంధ్రము కాస్త శాశ్వతంగా మూసుకుని పోయినాయి. 

కానీ ఈ కపాలము లోపల ఉన్న పరమ శూన్యము నేనున్నానని భ్రమ భ్రాంతికి గురియై కలలు కనడం చేస్తోంది. మరణము పొందిన వారికి తాను మరణించిన విషయము ఎలాగైతే తెలియదో అలాగే ఈ బ్రహ్మకపాలం కూడా తాను శాశ్వతమైన నిర్మలమైన మోక్షపధమును చేరుకుందని నాడు గ్రహించలేకపోయినది. అందువల్లనే ఆకాశ, సంకల్ప, కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు దానికి తగ్గట్లు కర్మ జన్మలు లోకాలు తన స్వప్న నాటకములో ఊహించుకున్న ది. అసత్యమైన ఈ విశ్వసృష్టిని సత్యముగా నిజములాంటి కలగా కలలాంటి నిజముగా భ్రమ, భ్రాంతి, మాయ, మోహ, వ్యామోహాలు బంధనాలతో తనకి తానే జీవ పాత్రలు ఊహించుకుంటూ తనకి తానే ఆ పాత్రను పోషిస్తున్నట్లు లయం చెబుతున్నట్లుగా స్వప్న లోకంలో విహరించినది. ఈ లెక్కన చూస్తే నిజానికి నేను లేను కదా. ఎప్పుడైతే నేను ఎవరిని అనే స్మశాన వైరాగ్యం నేను అనే స్థూల శరీరానికి కలిగినదో అది కాస్తా స్వప్న సాధనలో యోగ సాధన చేసి అన్నిటినీ అన్ని శరీరాలను దాటుకుంటూ మూల యదార్ధ సహజస్థితికి నేనే లేను అనే అభేద జ్ఞానం సహజ స్థితికి చేరుకోవడం జరిగినది. అదియే నేను కానీ నేను అన్నమాట. ఈ యదార్థ అనుభవ జ్ఞానమే కపాలమోక్షం గ్రంథము అన్నమాట. నేనే లేను అని స్వానుభవం అనుభూతి పొందే యదార్థ సహజ స్థితి అని ఇదియే సాధన పరిసమాప్తి అంతిమ స్థితి అని అదియే  సంపూర్ణ కపాలమోక్షం స్థితి అవుతుందని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఎందుకంటే ….
 
మనం లేము …. నువ్వు లేవు… నేను లేను
ఆశయము సాధించాక శ్వాసకి విలువ లేదు కదా.
నేను లేను.
 
విశ్వము ఎప్పుడు నాశనం అవుతుంది అంటారా?

మరి కనిపించే విశ్వము ఎప్పుడు నాశనం అవుతుంది అంటారా? మళ్లీ మొదటికి వచ్చినట్లే. ఎందుకంటే మీరు ఒక కంప్యూటర్ ఆన్ చేసి వదిలేస్తే ఏమి జరుగుతుంది? ఆపరేటర్ చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు. సిస్టమ్ ఆఫ్ చేయలేదు. ఆన్ లో ఉన్న ఆ సిస్టం అలాగే పని చేస్తోంది. అంటే 18 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ కాస్త తాత్కాలికంగా ఆఫ్ అయ్యి స్క్రీన్ సేవర్ లోకి వెళుతుంది. విశ్వ సృష్టిలో తాత్కాలిక ప్రళయాలు జరిగే 80% నాశనమై 20% మిగిలిపోవడం అన్నమాట. అలాగే పంచభూతాలలో తీవ్రమైన గాలి వలన ఈ కంప్యూటర్లో ఉన్న వైర్లు కదలటం మొదలు స్క్రీన్ స్క్రీన్ సేవర్ నుండి బయటికి వచ్చి డెస్క్టాప్ చూపించినట్లుగా మిగిలిన 20 శాతం జీవుల నుండి తిరిగి విశ్వసృష్టి జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. నిజానికి కంప్యూటర్ ఎలాంటి అప్లికేషన్స్ ఉపయోగించడం లేదు .కేవలం అది ఆన్ అయ్యి మాత్రమే ఉన్నది. అలాగే ఈ మిగిలిన ఏక మూల బ్రహ్మకపాలం కూడా ఆన్ లో ఉన్న కంప్యూటర్ లాంటిదే అన్నమాట. ఇది కొత్తగా దేనిని సృష్టించదు నాశనము చేయదు అన్నమాట. దీనికున్న ఆకర్షణ శక్తి వలన శబ్ద నాద ప్రకంపనల వలన కంప్యూటర్ కున్న మౌస్ లాగా కీబోర్డు లాగా రెండు శబ్ద నాద బిందువులు ఒకదానికొకటి స్పందన ప్రతిస్పందన చేసుకుంటూ పోతున్న చిన్న పిల్లవాడిలాగా తన ప్రమేయం లేకుండా ఒకదానికొకటి  వ్యతిరేక కక్ష్యలో తిరుగుతూ అవి ఉన్నాయని అవి తిరుగుతున్నాయని తెలియని స్థితిలో అనగా సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తమ ప్రమేయం లేనట్లుగా గురుత్వాకర్షణ శక్తితో తిరుగుతున్నట్లుగా నిత్యము అవిచ్చిన్నంగా అవిశ్రాంతిగా తిరుగుతూనే ఉంటాయి. అనగా ఆఫ్ చేయని ఆన్ లో ఉన్న కంప్యూటర్ లాగా అన్నమాట. ఆన్  లో ఉన్న కంప్యూటర్ ఆఫ్ చేయాలంటే చచ్చిన ఆపరేటర్ ని తిరిగి బతికించాలి. బతికితే మళ్లీ కంప్యూటర్ మాయలోపడి నానారకాల వీడియోలు గేములు ఇంటర్నెట్లో అంటాడు. ఆ మాయలో పడి అపస్మారక స్థితి పొంది ఆపై జీవ సమాధి చెందుతూ మళ్ళీ తిరిగి కంప్యూటర్లను ఆఫ్ చేయడు. ఎందుకంటే ఇదంతా ఆదిలో ఏమి జరిగిందో అదియే చూపిస్తుంది కదా. అంటే ఆదియోగి కూడా తను రెండుగా విడిపోయిన పరమేశ్వరుడు పరమేశ్వరి అనే శూన్య బ్రహ్మలను ఏకంగా చేసుకోలేకపోయి ఉండాలి. 

ఒకవేళ చేసుకున్న అర్థనారీశ్వరుడుగా లేదా శివకేశవుడిగా మరొక రూపంతో మిగిలిపోయి ఉండాలి. అంటే రూపం అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందుతున్నారు అన్నమాట. చనిపోయినవాడు శాశ్వత మరణమును పొందినవాడు కపాలమోక్షం పొందిన వారు తిరిగి శాశ్వత మరణమును పొందాలని అనుకుంటున్నాడు అన్నమాట. చనిపోయిన వాడు చావటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు చనిపోయిన విషయం వాడికి తెలియదు. చనిపోయిన వారికి తాను చనిపోయాడని ఎలా తెలుస్తుందో ఒకసారి ఆలోచించండి. నిజానికి మన ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. మన కపాలమోక్షం సాధన కూడా ఇంతే. మనము ఎపుడో  కపాలమోక్షం  పొందినాము. కానీ దానిని మనము నమ్మలేకపోతున్నాము.ఎందుకంటే కపాలమోక్షం జ్ఞాన అనుభూతిని పొందలేదు కదా. పొంది ఉంటే మనము మోక్షం పొందినట్లే కాదు కదా. ఏమంటారు. నిజమే గదా! తీరికగా ఆలోచించుకోండి. ఇది అర్ధమైతే మీకు ఆధ్యాత్మికమే అర్ధమవుతుంది. వేదాంతము తెలిసిపోతుంది. వేదజ్ఞానము గ్రహించినవారు అవుతారు. బ్రహ్మజ్ఞానమును పొందినవారు అవుతారు.నిజజ్ఞానము జ్ఞానస్ఫురణ అవుతుంది. ఈ కపాలమోక్షం గ్రంథమే సంపూర్ణముగా అర్ధమయినట్లే అన్నమాట.

నాది అలాగే మా జిజ్ఞాసి దైవికవస్తువులకి తాళం వెయ్యడం

 ఎపుడైతే మాకు “నేను లేను” అని జ్ఞానస్ఫురణ కలిగినదో ఆనాటి నుండి మాకు వచ్చిన దైవికవస్తువులకు తాళం వేసినాము.అలాగే వివిధ చక్రసాధనాలయందు వచ్చిన వివిధ దేవతవిగ్రహాలకి,దైవిక వస్తువులకి పూజలు,అభిషేకాలు, శంఖనాదాలు అనగా స్ధూల,సూక్ష్మ,శారీరక,మానసిన పూజలు,జపతపాలు మాకు తెలియకుండానే శాశ్వతముగా ఆగిపోయినాయి. ఎందుకంటే మేము ఇన్నాళ్ళుగా ఆరాధించిన దైవవిగ్రహాలు అలాగే దైవిక వస్తువులు అన్నియుగూడ మా బ్రహ్మరంధ్రములో అత్యంతిక చక్రస్ధితి అయిన బ్రహ్మండచక్రము నందు పడి ఒక్కొక్కటి నాశనమయినట్లుగా మాకు చిట్టచివరి ధ్యానానుభవానుభూతి కల్గడము జరిగినది. దానితో వీటిన్నంటిని ఒకమూటకట్టి మా పూజ బీరువా యందు దాచడము జరిగినది.ఆతర్వాత వీటినిగూడ కాశీక్షేత్ర గంగానదిలో నిమర్జనము చెయ్యాలి గదా! ఆతర్వాత ఇన్నాళ్లుగా మాలగా ధరించిన ఇష్టలింగమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల, నవరత్నమాల,ఓంకారమాల,శాలిగ్రామమాల,కపాలమాల,మోక్షమాల..ఇలా వీటిన్నంటిని గూడ మా మెడలో నుండి శాశ్వతముగా తీసివేసి కాశీగంగా నిమర్జనం కోసం భద్రముగా దాచి ఉంచినాము. మరి చివరికి మిగిలేది ఏది  అని తెలుసుకోవాలని ఉందా?దానికి మీరు చెయ్యాలో మీకు తెలుసు గదా!

శుభంభూయాత్
పరమహంస పవనానంద
********************************

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి