అధ్యాయం 30


మాయ అంటే…
(నా జ్ఞానమార్గం)

మా ఇద్దరికీ కూడా కర్మ ,భక్తి మార్గాలు కూడా మా సాధనా మార్గాలు గాదని తెలుసుకోవడంతో మూడవదైన జ్ఞానమార్గం వైపు ప్రయాణించాము! దీనికోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆరంభించాము! యోగుల చరిత్రలు చూస్తే సాధనలో ధన, స్త్రీ, పరస్త్రీ/ పరపురుష వ్యామోహాలు దాటాలని చెప్పడం జరిగినది! రామాయణము చూస్తే బ్రహ్మజ్ఞాని అయిన రావణబ్రహ్మ పరస్త్రీ అనగా సీతాదేవి వ్యామోహం వలన నశించినాడని తెలిసింది! ఇక మహాభారతానికి వస్తే సప్త వ్యసనాలు వలన ధర్మరాజు కాస్తా జూదవ్యసనము వలన అలాగే దుర్యోధనుడు అహంకారము వలన యుద్ధాలు వచ్చి వంశాలే నాశనం చేసుకున్నారని తెలిసింది! ఇలా ప్రతిదానిలోనూ, ప్రతిచోటా “మాయ” అనే పదము బాగా వినబడటం మా ఇద్దరికి ఆశ్చర్యం కలిగించింది! అసలు మాయ అంటే ఏమిటి? అనే ధర్మ సందేహం కలిగింది! కొంతమంది మాయ అంటే ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లుగానే చూపించేది అని, మరి కొంత మంది అయితే ఒక భ్రమ- భ్రాంతి అని, మరి కొంతమంది అయితే నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండేదని… ఇలా పలు రకాలుగా పలు అభిప్రాయాలు చెప్పడం జరిగినది! కాకపోతే అది మాకు అర్థం అయ్యేది కాదు! అర్థమై అర్థం కానట్లుగా ఉండేది! దానితో ఇది తెలియాలి అంటే జ్ఞాన మార్గం లోనికి వెళితే తప్ప మాయ అంటే ఏమిటో తెలియదని మేమిద్దరం జ్ఞాన మార్గమును ఎంచుకోవడం జరిగింది! నా స్వామిరంగా… అక్కడనుండే ఆట మొదలైంది! మాయ అంటే జ్ఞానము తెలుసుకోవటం అని… అది పొందితే మాయ కాస్త మాయం అవుతుందని నేను చదివిన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్పేసరికి…. ఓస్ ఇంతే గదా… ఏముంది… మాయ తెలుసుకోవటం చాలా తేలికైన మాట అని… మాయ అని తెలుసుకుంటే మనకు మాయ ఉండదని… మేము భ్రమపడి… మాయలో పడినాము! దానితో మా కష్టాలు ఆరంభమయ్యాయి! అదేదో సినిమాలో బ్రహ్మానందం మనకు ఎదుటివారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి అనే వరమును పొందుతాడు! దానితో చీమల దగ్గర నుండి మనుషుల దాకా వారి మనస్సులోని భావాలు తెలియడంతో ఆనందమును కోల్పోయి నానా ఇబ్బందులు ఎలా పడతాడో… అలా మేమిద్దరం కూడా పడినాము! 

ఒకరోజు నేను గుడికి వెళుతుంటే…. గుడి మెట్లు ఎక్కుతూ …ఒక అందమైన అమ్మాయి కనబడినది! ఇది మాయ అనుకుని భ్రమ, భ్రాంతి అనుకుంటూ… నేను గుడి లోపలకి వెళ్ళినాను! మనస్సు దైవం మీద లేదు! కానీ అమ్మాయి మీద ఉంది! ఈ అమ్మాయి ఎవరు? ఇంతవరకు చూడలేదు? ఊరికి కొత్త? ఫిగర్ బాగుంది! వామ్మో… ఇంతటి అందమా! నడుస్తూ వుంటే… ఆ కవ్వింపు చూపులు… నా సామి రంగా… మళ్లీ ఎలాగైనా మరొకసారి చూడాలి అని అంటూ… ఇవే ఆలోచనలు! అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే… మనస్సు దైవం మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా ఉంది! ఉండలేకపోయాను! ఓ పక్క అది మాయ అని తెలుసు… మరి ఎందుకు నాకు ఆమె గురించిన ఆలోచన పోవటం లేదు! నాకు అర్థమయ్యేది కాదు! అప్పటికే అమ్మాయి వెళ్ళిపోయినది! ఆమె వెళ్ళిపోయిన నా మనస్సు నుండి ఆమె గూర్చే … ఆమెకి సంబంధించిన ఆలోచనలు పోలేదంటే… నా బొంద… ఇదే మాయ అనుకుంటూ తిట్టుకుంటూ ఊరుకున్నాను!

 ఇది ఇలా ఉంటే నా ఖర్మ కాలి ఇదే సమయంలో మా స్నేహితులు ఒక్కొక్కరిగా కొత్త కొత్త విలువైన వస్తువులు కొనటం, వేసుకోవడం, పెట్టుకోవడం ఆరంభించారు! వాటిని కొనే ఆర్థిక పరిస్థితి నాకు అప్పట్లో లేదు! వాటిని చూసి ఆనందించడం తప్ప! అలాగని నా మనస్సుకి అవి అన్నియు మాయ, భ్రమ, భ్రాంతిలే అని చెప్పినప్పటికీ …. అది ఒక పట్టాన వినేది కాదు! ఎలాగైనా వాటిని పొందాలని, అనుభవించాలని పిచ్చి ఆలోచనలు విపరీతంగా వచ్చేవి! ఆ వయస్సు అటువంటిది! నిజానికి అనుభవించే సమయములో అనుభవించే వాటిని అనుభవించకపోతే… ఆ తర్వాత అవి వచ్చిన ఎలాంటి ఉపయోగం ఉండదని నా ప్రగాఢ విశ్వాసము! తీపి పదార్థాలు తినవలసిన సమయములో డబ్బులు ఉండేవి కావు! డబ్బులు వచ్చేసరికి ఒంటిలో షుగరు వస్తుంది! ఇప్పుడు డబ్బులున్న తీపి పదార్థాలు కొనే స్థోమత ఉన్నా కూడా తినలేను కదా! వాడి పరిస్థితికి ఏమనాలి! అదే నా పరిస్థితి కూడా! విలువైన వస్తువులు ఎంతకాదన్నా మాయలే అనుకున్న నా మనస్సుకు అర్థమయ్యేది కాదు! దానిని నా దారికి తెచ్చుకోవాలి అంటే కొన్ని నెలల పైనే పట్టేది! ఆ వస్తువుల గురించి మర్చిపోవడానికి నాకు కొన్ని నెలల పైగా సమయం పట్టేది! రూపం లేని మనస్సు… రూపం ఉన్న వస్తువులు కావాలని అనుకోవటమే నిజమైన మాయ కాబోలు అని నాకు అప్పుడప్పుడూ అనిపించేది! 

నా పరిస్థితి ఇలా ఉంటే నా యోగ మిత్రుడైన మన జిజ్ఞాసి పరిస్థితి వేరేగా ఉంది! ఇతను కూడా జ్ఞాన మార్గం లోనే ఉన్నాడని తెలుసు కదా! వాడు తనకున్న మాయ తెలుసుకోవడానికి… తొలగించుకోవటానికి…. వాడు కాస్త నేను జీవుడిని కాదు… దేవుడిని అనుకుంటూ ఉండేవాడు! అనగా శివోహం అంటే అహంబ్రహ్మాస్మి అన్నమాట !నేనే దేవుడిని… నేనే శివుడిని అని నిరంతరం అనుకుంటూ ఉంటే …. మాయ వాడిని ఏమీ చేయదని వారి ప్రగాఢ విశ్వాసం! ఒక రోజు మన వాడు ఇంటికి రాత్రిపూట వెళుతున్నాడు! దారిలో ఒక పిచ్చి కుక్క ఎదురయింది! దానికున్న పిచ్చి వల్లనే అది వీడి వెంట పడింది! వెంటనే వీడికున్న కుక్క భయము వలన దానికి అందకుండా పరిగెత్తుతూ….  “ఒసేయ్ .. నేను దేవుడిని… నేను శివుడిని… నేను కాలభైరవుడిని… నన్ను నువ్వు కరవకూడదు! నువ్వు ఒక మాయ అని నాకు తెలుసు! నువ్వు లేవు… నువ్వు ఉన్నావని నాకు భ్రమ, భ్రాంతి కలిగిస్తున్నావు ! నాకు నీ మాయ తెలిసిపోయింది అనుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు! వాడి ఉద్దేశం ఏమిటంటే వాడికి ఇది మాయ అని తెలుసుకుంటే….  అది వీడిని కరవదని...వెంటపడదని వీడి నమ్మకం అన్నమాట! నా బొంద! వీడు దేవుడని వీడికి తెలుసు! పాపం ఆ కుక్క కి ఏమి తెలుసు! బాగా కరిచిపెట్టినది! కొన్నిరోజులు మంచం ఎక్కినాడు! తర్వాత నా దగ్గరికి వచ్చి … “స్వామి! కుక్క నాకు మాయ అని తెలిసినా కూడా అది నన్ను ఎందుకు కరిచినదని” అన్నాడు! దానికి నేను వెంటనే అతనితో “మిత్రమా! నువ్వు దానికి మాయ అని తెలియదు కదా! నువ్వు నిజమని అనుకొని అది నిన్ను కరిచినదని” అన్నాను! అవును కదా! ఇద్దరికీ ఇద్దరూ మాయలే కదా! ఇద్దరికీ మాయ జ్ఞానం తెలిసి ఉండాలి! ఒకరికి మాయ అని తెలిసి… మరొకరికి అది మాయ కాదని తెలియకపోయినా అది ప్రమాదమని మేమిద్దరం గ్రహించాము! ఇక దానితో మాయ అనుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని… మాయ అని మనకి కాదు…. మన మనస్సుకి అనుభవ అనుభూతి కలగాలని… అప్పుడే మనకున్న మాయ మాయం అవుతుంది తప్ప… అనుకోవడం వలన ఇది జరగదని గ్రహించటానికి మా ఇద్దరికీ చాలా నెలలు పట్టింది! ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి పొందుతారో… అప్పుడు ఎదుటివారికి వీళ్ళు కూడా మాయ స్వరూపమే అనే జ్ఞానం కలుగుతుందని మేము గ్రహించాము!  జ్ఞాన మార్గము అంటే అన్నప్రాశము రోజున ఆవకాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని…  నేనే దేవుడిని అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదని… అందరికీ మేము చెప్పకుండానే దైవ స్వరూపమని వారికి వారే మా గురించి అనుభవ అనుభూతి పొందితే గాని మాయ తొలగదని గ్రహించి… ఇలాంటి అనుభవ అనుభూతి కావాలి అంటే…. ధ్యాన మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! ధ్యానము చేస్తే గాని  మాకు ధ్యాన అనుభవానుభూతులు కల్గి మనస్సుకున్న మాయ మాయం అవ్వదని అని మేము గ్రహించి నాము! ఇకపై ఏమి జరిగిందో చూడాలి అంటే ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*******************************

గమనిక: జ్ఞాన మార్గము లో ఉన్నవారికి ఏది మాయ, ఏది అజ్ఞానము, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది కర్మ బంధం, ఏది కర్మవిముక్తి  అనేది తప్పకుండా తెలుస్తుంది! మనస్సుకి ఈ జ్ఞాన అనుభూతి లేనంత వరకు మనం ఎంత తెలుసుకున్న కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని మేము తెలుసుకున్నాము! కొన్ని సంవత్సరాల తర్వాత నిజానికి మాయ అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండకపోవడమేనని అని గ్రహించినాము! దీనికి కారణము ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు భావాలు వల్ల మనస్సు నిశ్చలముగా ఉండదని గ్రహించాము! ఎప్పుడైతే వాడి మనస్సు నిశ్చలస్థితి పొందుతుందో… అదే వాడికి మోక్ష ప్రాప్తి అని గ్రహించాము! ఇంతవరకు విశ్వంలో ఏ జీవికి కూడా ఇలాంటి పరిస్థితి లేదని గ్రహించాము! రాయి పైకి కనిపించడానికి నిశ్చలస్థితి ఉన్నా కూడా దానికి లోపల అది లోలోపల స్పందనకి స్పందిస్తూనే ఉంటుందని… 


పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పటికీ… పైకి స్పందించకపోయిన … ఆయన లోలోపల స్పందిస్తూనే ఉంటాడని… తమిళనాడు రాష్ట్రములోని శుచీంద్ర క్షేత్రములోని స్థానేశ్వర స్వామి ఆలయము ద్వారా తెలుసుకోవడం జరిగినది! ఈ విశ్వములో బలహీనత లేని బలవంతుడు ఇంతవరకు పుట్టలేదని గ్రహించినాము! ఇదియే సంపూర్ణ బ్రహ్మజ్ఞాన సాధన పరిసమాప్తి స్థితి అని గ్రహించినాము!

నిజానికి జీవన్ముక్తికి అతి తేలికైన మార్గం అలాగే అతి కష్టమైన మార్గము కూడా జ్ఞాన మార్గం అని కొన్ని సంవత్సరాల తర్వాత నేను గ్రహించాను! అనగా కనిపించేది అసత్యమని… కనిపించనిది సత్యమని ఆత్మవిచారణతో తెలుసుకోవడమే అసలైన జ్ఞాన మార్గం అర్థమవుతుందని గ్రహించాను! అనగా మనము నిద్రపోతున్నా కూడా మన పంచేంద్రియాలు నడిపించే శక్తి మనలో అంతర్యామిగా ఆత్మగా ఉన్నదని… అదే సర్వాంతర్యామిగా ఈ విశ్వశక్తితో విశ్వాత్మగా ఈ విశ్వమును నడిపిస్తోందని ఎవరైతే అనుభవపూర్వక జ్ఞాన అనుభవ అనుభూతి పొందుతారో వారికి ఈ సాధన మార్గ పరిసమాప్తి స్ధితియని అని గ్రహించాను! ఈ దివ్య జ్ఞాన అనుభూతి అనుభవానికి రాగానే మనలోని అన్ని రకాల కర్మలు, కర్మవాసనలు, సంస్కారాలు కర్మశేషం లేకుండా నాశనం అవుతాయని గ్రహించాను! దానితో పునర్జన్మ కి కారకమైన కర్మశేషము అనేది లేకుండా భస్మం అవటం వలన మనము జీవన్ముక్తి పొందుతామని గ్రహించాను! అంటే నేను ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చాను?, నేను మరణించాక ఏమవుతానో?, అసలు దేని కోసం ఈ ప్రపంచం ఉంది? ఏది నాది? ఏది నీది? నేను ఎందుకు పుట్టాను? నేను ఏమి చేయాలి? నేను ఎందుకు మరణిస్తున్నాను అనే జ్ఞాన ప్రశ్నలకి… వివేక జ్ఞాన బుద్ధితో సంతృప్తి సమాధానాలు వెతకడమే జ్ఞాన మార్గం అవుతుందని రమణ మహర్షి యోగి జీవిత అనుభవం ద్వారా నేను తెలుసుకోవడం జరిగినది! అలాగే కర్మ, భక్తి మార్గాలు బాహ్యశుద్ధికి ఉపయోగపడితే… అంతర శుద్ధికి ఈ జ్ఞానమార్గము ఉపయోగపడుతుందని గ్రహించాను! అనగా నేను అనేది శరీరము కాదని ఈ శరీరమును అంటిపెట్టుకుని అంతర్యామిగా ఉన్న ఆత్మ అనేది అసలైన నేను అని ఎవరైతే అనుభూతి పొందుతారో వారికి ఆత్మ సాక్షాత్కరము కలిగి… అన్ని రకాల కర్మలు భస్మమై…. ఆత్మానంద స్థితి పొంది… మరు జన్మ లేకుండా ప్రశాంత స్థితిని పొంది…జీవన్ముక్తి పొందుతారు అని గ్రహించాను! అంటే జ్ఞాన మార్గం వలన మనలోని పాపకర్మలు క్షయంపొంది… మాయ పొరలు తొలుగుతూ… వివేక జ్ఞాన బుద్ధి పెరుగుతున్నకొద్దీ… మనలో జ్ఞానోదయం కలుగుతుందని గ్రహించాను! అనగా స్వార్థం, లోభం ,మోహం, వ్యామోహం, భయం, ఆశ, ఆవేశం, కోపం, అసూయ, కామం ఇలాంటి చెడు భావాలుతో మన జ్ఞానం కప్పబడి ఉంటుంది! ఎప్పుడైతే మనలో “నేనెవరిని” అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఆరంభిస్తారో …ఆ క్షణము నుండి ఈ మాయపొరలు తొలగి… కర్మ నాశనం అవ్వడం మొదలవుతుంది! తద్వారా మనస్సు శుద్ధి అవ్వటం ప్రారంభమై… అది కాస్త స్థిరమై… ఏకాగ్రతను పొంది… లోపల జ్ఞానము స్ఫురణ ద్వారా బయటకు వస్తుంది! అనగా ఎన్నో కోట్లాను కోట్ల జన్మల నుండి అంతర్గతంగా ఉన్న జ్ఞానము అనగా అపస్మారక స్థితి వలన మర్చిపోయిన జ్ఞానము… స్ఫురణ వలన జ్ఞాపకము రావటం జరుగుతుంది! తద్వారా జీవుడు కాస్త శివుడు అవుతాడు! జీవాత్మ కాస్త పరమాత్మ అవుతుంది! గాకపోతే చాలామంది “నేను ఎవరిని” అనుకోవడము చేస్తున్నారు కాని ఎవరుగూడ ఆత్మవిచారణతో తెలుసుకోవడము చెయ్యడము లేదని నేను గ్రహించినాను! చివరికి మేమిద్దరం ఆఖరికి ఇదే మార్గము ద్వారా యోగసిద్ధి పొందటము జరిగినది! అది ఎలాగో రాబోవు అనుభవ అధ్యాయముల ద్వారా మీరు తెలుసుకుంటారు!

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. gnyna maargamlo meeru elanti vishyaalatho ibbandulu paddaro mainga jignyasi gaaru kukka debba ki gurikaavadam funny ga undi... kaani nenu oka time lo nenu kuda devudni aypoya anukunna... meeru nenu anukuntunna ani chepparu same alage anipinchindi...gnanamu valana jeevana mukthi osthundani..gnynam entha important ani..nenu evarani aatma vichaarana chesukovatamledani...manassu lopala spandisthune untundani cheppatam..

    రిప్లయితొలగించండి