అధ్యాయం 40

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham


విగ్రహారాధన - విశ్వారాధన:

 మాకు మొదటిలో విగ్రహారాధన మీద ఎలాంటి వైరాగ్య భావాలు కలిగినాయో  “ఎవరిని పూజించాలి( నా భక్తి మార్గం)” అనే అధ్యాయములో ఈ పాటికి చదివి ఉన్నారు కదా. అప్పుడు“దైవవిగ్రహాలకి శక్తి ఉందా?” అనే అధ్యాయము లో విగ్రహాలను విగ్రహాలుగా చూడకూడదని సజీవమూర్తులుగా భావించుకొని ఆరాధన చేయాలని ఒక పిల్లవాడి భక్తి అనుభవం వలన మేము తెలుసుకున్నామని మీరు తెలుసుకున్నారు కదా. దాంతో గురువులకి ఉండవలసిన దైవిక లక్షణాలు మేము చదివేసరికి మాకు ఇలాంటి దర్శన అనుగ్రహ ప్రాప్తి కలగాలంటే తప్పనిసరిగా ఇష్ట దైవానుగ్రహము పొందాలి లేదంటే నకిలీ గురువులు ప్రాప్తి కలుగుతుంది అని మేము గ్రహించడం జరిగినది. దానితో యద్భావం తద్భవతి అనే భావం లో విగ్రహారాధన అనగా సజీవమూర్తిగా ఆరాధన చేయటం ప్రారంభించాము. అప్పుడు కలిగిన అనుభవాలు కష్టాలు ఏమిటో తెలుసుకోండి.

నాకు మొదట్లో 84 సజీవ విగ్రహాల ఆరాధనను బాగానే ఉత్సాహంగా ఆనందంగా చేసేవాడిని. అంటే మొదట ఒక మట్టి లింగమూర్తి తో మొదలై ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సుమారు 21 సంవత్సరాల పాటు ఆ విగ్రహ సేకరణ 108 కి చేరుకుంది. చివరి స్థాయికి వచ్చేసరికి ఇన్ని విగ్రహాలకు అభిషేకాలు, పూలు, బొట్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మంత్ర అర్చన,నైవేద్యాలు పెట్టుకుంటూ వచ్చేసరికి ఆఫీసుకి లేటుగా వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఆఫీస్ నుండి రాత్రి 10 గంటలకు వచ్చి మళ్లీ రెండు గంటలకు నిద్రలేచి ఈ విగ్రహారాధన పూర్తయ్యేసరికి ఉదయం 9:30 దాకా పట్టేది. దాంతో బస్సులు పట్టుకుని ఆఫీస్కి వెళ్ళే సరికి తిట్లు సిద్ధముగా ఉండేవి. నా పరిస్థితి ఇలా ఉంటే నా జిఙ్ఞాసి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పెద్ద ఉద్యోగం కదా. శని ఆది పండుగ రోజుల్లో కూడా తొక్కిపెట్టి చాకిరి చేయించుకునేవారు. నాకు ఈ విషయంలో వెసులుబాటు ఉండేది. మేమిద్దరం మా ఇద్దరికీ సుమారుగా ఈ విగ్రహారాధన మీద మాకే తెలియకుండానే విసుగు వచ్చేది (ఎలా ఉండేది అంటే స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు శ్రీ లక్ష్మి కలిసి ఫోటోలకు పూజ,హారతులు చేసేవారు. వాటిని అంతగా గుర్తుపట్టలేనంతగా హారతి మసి ఉండేది. ఒక దేవుడి పేరు చెప్పి మరొక దేవుడికి పూజ చేసేవారు. మా ఇద్దరి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది) ఏ దేవుడి మంత్రం చదువుతూ మా పువ్వులు ఏ దేవుడి మీద వేస్తున్నామో అర్థం అయి చచ్చేది కాదు. అలాగని పూజలు ఆపలేము.ఎందుకంటే దేవతా విగ్రహాలుకి కోపం వస్తే మా ఉద్యోగాలు పోతే బ్రతుకు మాటేమిటి? వేరే ఉద్యోగాలు వెతుక్కున్న అవి కూడా పోతే వామ్మో! అది తలచుకుంటేనే భయం వేసి బాధతో ఇష్టం లేని పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒప్పుకున్నాక వాయించక తప్పదు కదా అదే  మేళం. మా పరిస్థితి అంతే. ఏవో నిగ్రహాలు కలుగుతాయని ఈ విగ్రహాలు తీసుకుని వస్తే విసుగు శక్తి పెంచడం ఆరంభించాయి! దాంతో విగ్రహారాధన మీద మాకే తెలియని వైరాగ్యం ఏర్పడినది.  

మా ఊరి గుడిలో తిరునాళ్లు చేయడానికి ఒక వేద పండితుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. వారి ముందు మా విగ్రహారాధన సమస్య చెప్పితే ఆయన నవ్వుతూ “అయితే వీటిలో మీకు బాగా నమ్మకం, శ్రద్ధ, భక్తి కలిగించే ఏకైక ఒక దేవుడిని నమ్ముకోండి.ఆయనకి పూజలు చేయండి.ఆయననే ఆరాధించండి”  అన్నారు. దానికి మేము “అయ్యా! నేను అన్నం తింటే మీరు తిన్నట్లు కాదు కదా! అలాగే ఇన్ని విగ్రహాలు ఉండగా ఒక విగ్రహానికి పూజలు చేస్తే నైవేద్యాలు పెడితే మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?” అనగానే ఆయన మా వైపు తిరిగి “నాయనలారా! మీరు విగ్రహాలను సజీవమూర్తులుగా భావించి విగ్రహారాధన చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తున్నది. అదేమిటంటే ఒక పూజారి ఏదో ఒక కోరిక కోసం శివుడి విగ్రహం తెచ్చి పూజలు చేసినాడు. ఆ కోరిక తీర్చక పోయేసరికి  ఈ విగ్రహాన్ని బీరువాలో పెట్టి ఈసారి విష్ణుమూర్తి విగ్రహాన్ని పూజించటం అది కూడా తీర్చక పోయే సరికి శ్రీరాముని విగ్రహం  అది కూడా తీర్చక పోయేసరికి ఈసారికి హనుమాన్ విగ్రహం అది కూడా తీర్చక పోయే సరికి ఈసారి అమ్మవారి విగ్రహం పూజించడం ప్రారంభించారు.ఇలా ఎంతకు తన కోరిక తీర్చని విగ్రహాలు అన్ని కూడా బీరువాలో దాచి ఉంచినాడు. వాటికి పూజలు చేసేవాడు కాదు!. నైవేద్యం పెట్టేవాడు కాదు!. కానీ అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తుండగా వాడు అనుకున్న కోరిక తీరింది. దాంతో అమ్మవారి విగ్రహం మీద నమ్మకం, శ్రద్ధ పెరిగినాయి. ఒకరోజు వీడు అమ్మవారి పూజ చేస్తుండగా అగరొత్తు పొగ బీరువాలోని విగ్రహాలు వైపుకి వెళుతుండటం గమనించే సరికి వీడికి కోపం వచ్చి “నాకు కోరికలు  తీర్చరు గాని నా పూజ అగరవత్తుల వాసన మీకు కావాలా? ఉండండి! మీ పని చెబుతాను” అని ఆ విగ్రహాలు ఈ అగరబత్తి వాసన పీల్చకుండా వాటి ముక్కులకు గుడ్డలు అడ్డంగా పెట్టేసరికి… ఈ విగ్రహాలు సజీవమూర్తులుగా మారి “ఇప్పుడు నీకు కావలసినవి చెప్పు. అన్ని రకాల కోరికలు తీరుస్తామని” మాట్లాడేసరికి ఆ పూజారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కొంతసేపటికి తేరుకొని “అయ్యా! ఇంతకుముందు మిమ్మల్నందరినీ పూజలు చేశాను కదా! అప్పుడు తీర్చలేదు. ఇప్పుడు ఎందుకు తీరుస్తారు” అన్నాడు. దానికి వారంతా “అయ్యా! అప్పుడు మమ్మల్ని నువ్వు కేవలం ప్రాణం లేని విగ్రహాలుగానే చూసావు.ఇప్పుడు మాకు అగర్బత్తి వాసన పీల్చకూడదని మా ముక్కులకు  గుడ్డలు ఎప్పుడైతే కట్టినావో ఆ క్షణమే మేము సజీవ మూర్తులు అయినాము. ఎవరైతే దేవుడిని మానవ మూర్తిగా కాకుండా మానవుడిలో దేవుడిని చూస్తారో…. దేవుడిని విగ్రహంగా కాకుండా సజీవమూర్తిగా ఆరాధిస్తారో… వారే నిజ భక్తులు అవుతారు.ఈ స్థితి పొందని వారు మా దృష్టిలో ప్రసాద భక్తులుగాను, ఆడంబరభక్తులుగాను ఉండిపోతారు” అని చెప్పి అంతర్ధానం అవుతారు. 

ఇది కథ కాదు. యదార్ధంగా తమిళనాడులో ఒక పూజారికి జరిగిన యదార్థ సంఘటన. ఈయన ఎవరో కాదు మా పూర్వీకులలో ఒకరు” అని చెప్పి ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే “మీ ఇష్ట దైవము కూడా మీతో మాట్లాడే స్థాయికి మీరు రావాలి” అన్నారు. దానికి మేము వెంటనే “అయ్యా నా ఇష్టదైవం కూడా పుస్తక రూపంలో మా సమస్యలకు సమాధానాలు చెబుతున్నారు కదా! ఇంకేం కావాలి” అన్నాము. దానికి ఆయన పెద్దగా నవ్వుతూ “మీరిద్దరూ ఇంత అమాయకులు కాబట్టే ఆ విగ్రహాలు మిమ్మల్ని ఆడుకుంటున్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి మీరే పరిష్కారం నెంబర్ ఎంచుకొని చెబుతున్నారు! కానీ మీ దేవుడు నువ్వు ఆ నెంబర్ అలానే చూడమని నీకు చెప్పినాడా? ఎవరో వ్రాసిన పుస్తకంలోని సమాధానాలను మీ మనస్సు ముందే గ్రహించి మీ సమస్యకు ఆ పరిష్కారం నెంబర్ మీ నోటి ద్వారా నీ మనస్సే బయటకు తెప్పిస్తుంది! ఇందులో మీరు పూజించే దేవుళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారో చెప్పండి.  మీ మంత్రం ఉపాసన సిద్ధి వలన మీ మనస్సుకి కొద్దిపాటి ఏకాగ్రత అలవాటు వలన ఆ సమయంలో మీరు ప్రశ్న అడిగితే అది ఉత్తేజం చెంది ఏకాగ్రత స్థితి వచ్చేసరికి మీ మనస్సు అప్పటిదాకా చలన స్థితి నుండి నిశ్చల స్థితికి వెళుతుంది.మీరు అడిగిన ప్రశ్నలు మనస్సు విని మీకున్న మనోనేత్రం ద్వారా ఆ పుస్తకంలో మీ సమస్యకు పరిష్కార సమాధానం ఏది అవుతుందో గ్రహించి ఆ నెంబర్ మీ మెదడుకు ఇవ్వటం అది మీ నోటి నుండి రావడం అది నిజమని భ్రమ పడటం మీ దేవుళ్ళు చెబుతున్నారని భ్రాంతి చెందటం అంతా కూడా కొన్ని మిల్లీ సెకనులలో మీ కంటికి కనిపించని విధంగా ఇది అంతా జరిగి పోతుంది! నిజానికి ఇంత వరకు మీకే తెలియకుండా జరిగిన విధి విధానం” అని చెప్పగానే ఇది నమ్మాలో నమ్మకూడదో అర్థంకాని అయోమయానికి వెళ్లి వెనక్కి వచ్చి ఉండగా ఆయన వెంటనే మళ్ళీ “నాయనలారా! విగ్రహశక్తి మాట్లాడటం అంటే  ఇలా పుస్తకాల ద్వారా సమాధానం చెప్పడం కాదు. రామకృష్ణ పరమహంసకి కాళీ మాత స్వయంగా మాట్లాడినట్టుగా అలాగే నామ దేవుడికి పాండురంగడు మాట్లాడినట్లుగా మీ ఇష్టదైవాలు స్వయంగా వచ్చి మాట్లాడే స్థాయికి మీ సాధన స్థాయి పెరగాలి” అనగానే మా మతిపోయింది! మేము చూసిన కోణం ఎంత తప్పో మాకు అర్థమైనది.  మేము చూడవలసిన కోణం ఏమిటో అర్థమైనది! అంటే మాకు ఇష్టదైవానికి మధ్య మా మనస్సు అనుసంధానంగా  ఉండాలి గానీ మరే ఇతర వస్తువులు అవసరమే ఉండదని మాకు అర్థం అయినది! ఇది మాకు అర్థం అయినది అని ఆయనకి అర్థమయ్యి “నాయనలారా! ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. విగ్రహంలోని దైవిక శక్తి( ప్రాణశక్తి) మీ ముందుకు వచ్చి మాట్లాడే స్థాయికి రావాలంటే మీరు మీ విగ్రహారాధన నుండి  విశ్వ ఆరాధనకు రావాలి.ఇప్పుడు నేను శివుడు ఎక్కడ అంటే నువ్వు పూజించే నీ శివుని గూర్చి చెబుతావు. అదే అనుభవపాండిత్య యోగులను అడిగితే ఆయన లేని చోటు ఎక్కడో చెప్పండి అని అడుగుతారు. వారికి బీరువాలో,పుట్టలో, గుడిలో,స్శశానములో, బల్లెములో,భామలో, అమ్మాయిలో, అబ్బాయిలో, గుడిలో, బడిలో, నీళ్లలో, నిప్పులో మీలో నాలో వారికి శివుడే కనబడతాడు. అంతా వారికి ఈ బ్రహ్మాండం శివలింగంగా… విశ్వం శివమయంగా  కనబడుతుంది. విశ్వ ఆరాధన అదే.  అప్పుడు విగ్రహంలోనే దేవుడు మాట్లాడుతాడు.రాయిలోనూ కనపడి మాట్లాడుతాడు. మీలో నాలో కనపడి మాట్లాడుతారు అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే మా నోళ్ళు వెళ్ళబెట్టుకుంటూ చూడటం తప్ప ఏమీ చేయలేక పోయాను. 

అందుకే సాధకులు అంతా కలిసి సత్సంగం ఏర్పాటు చేసుకోవాలని అన్ని రకాల అనుభవాలు చర్చించుకోవాలని అప్పుడే ఎవరికి వారు ఎలాంటి సాధన స్థాయిలో ఉన్నారు ఎలాంటి లోపాలు అలాగే తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. వాటికి తగ్గ పరిహారాలు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుసుకునే వీలు ఉంటుందని వారు చెప్పి మా తెల్లముఖాలు వైపు చూస్తూ “ఇప్పుడు నాకు పని ఉంది! మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తర్వాత మీకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే చర్చించుకుందాము. నాకు కూడా ఇలాంటివి చాలా ఆసక్తి”  అని చెప్పి ఏదో పని చేయడానికి వెళ్లిపోయారు. అప్పుడు నా మనస్సులో ఇప్పటిదాకా నాకు అన్ని తెలుసు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నాకు ఏమీ తెలియదు. ఏం చేద్దాం. ఇలాంటి మహాత్ములు మాలాంటి వారికి ఏదో ఆధారం దొరికినట్లే కదా అని సంతృప్తి చెందుతూ మా పనులవైపు మేము వెళ్లి పోయాము. జిఙ్ఞాసి ఇంటికి వెళ్లిపోయాడు.

హనుమాన్ దేవుని గుండె స్పందించడం

ప్రొద్దున బ్రహ్మ సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు దగ్గర నా మనస్సు ఆగిపోయింది. నేను ఒక విషయంలో రాతి విగ్రహాలకు దైవిక శక్తి అదే ప్రాణశక్తి ఉంటుంది అని చెప్పినారు కదా! పైగా అది మన ముందుకు వచ్చి మాట్లాడుతుంది అని చెప్పినారు! పైగా మనిషిలాగా మాట్లాడుతుంది! ఇది ఎలా సాధ్యం? ఒక్క రాతిలో మాట్లాడే శక్తి ఎలా ఉంటుంది! పైగా గుడిలోని రాతి విగ్రహమూర్తులు ఎలా మాట్లాడుతాయి? అదే రాతికి ప్రాణ శక్తి ఉంటే…  రోడ్డుమీద, కొండల మీద ఉన్న రాళ్ళల్లో ప్రాణ శక్తి ఉండి మాట్లాడాలి కదా! అవి ఎందుకు మాట్లాడవు! ఇవి ఎందుకు మాట్లాడుతాయి. వీటికి ఆ శక్తి  ఎలా వస్తుంది? అసలు రాతిలో ప్రాణ శక్తి ఉందా? అని దీర్ఘాలోచనలో నేనుండగా జిఙ్ఞాసి భోజనం చేసుకొని గుడి లోనికి రావడం కనిపించింది. వాడు వచ్చిన తర్వాత వాడితో పై విషయాలు చర్చించాను. “భయ్యా! ఇంకా ఎందుకు ఆలస్యం. మన మెదడుకు కావలసిన మేతలా ఇలాంటి సమస్య దొరికినది కదా! మనం అడిగే ఈ ప్రశ్నకి పూజలు చేయడానికి వచ్చిన పూజారి బుర్ర తిరిగి పోవాలి” అని వాడు అంటుండగా బ్రహ్మ సిద్ధాంతి గారు రానే వచ్చారు. ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నారని అంటూ పొద్దున మన చర్చ ఎంత వరకు వచ్చి ఆగిపోయినది అనుకుంటూ “విగ్రహాలకు ప్రాణ శక్తి ఉంటే అవి మాట్లాడతాయని అనుకున్నాము కదా” మేము మా ప్రశ్న అడగకముందే ఆయనే దానికి సమాధానం చెప్పటానికి సిద్ధమయ్యేసరికి ఆశ్చర్యపోవడం మా వంతు అయినది. నవ్వుతూ చెప్పటం ఆయన వంతు అయినది. దేవాలయంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట , వాయు ప్రతిష్ట, మంత్ర, తంత్ర ప్రతిష్ట లాంటి పదాలు మీరు వినే ఉంటారు కదా! ప్రతిష్ట అంటే నిలబెట్టడం అన్నమాట. ఏదైనా దేవాలయంలో విగ్రహం ప్రతిష్టించి పూజ చేయడం మన హిందూ ధర్మ సంప్రదాయం లో ఉన్నది. సుమారుగా 40 మంది ఋత్విక్కులు, వేద పండితులు, మంత్రసిద్ది పరులు, ఉపాసన సిద్దిపరులు ఇలా వారి వారి మంత్ర, తంత్ర, యంత్ర సాధన స్థాయిలను బట్టి విగ్రహ ప్రతిష్ట సమయంలో బ్రహ్మ పదవి నుండి పరిచారిక పదవుల దాకా కొన్ని రోజులపాటు జపాలు, హొమాలు చేసి తెచ్చిన విగ్రహాన్ని జల వాసం, ధాన్య వాసం ఇలా మున్నగు వాసాలు విధానాలలో దానిని శుద్ధి చేసి దానికి తగ్గ యంత్రమునకు వివిధ రకాల పూజాదికాలు చేసి సమర్పించి…అనగా ఈ యంత్రములో 21 అంగాలుంటాయి! అవి 1. జీవం,2. ప్రాణం, 3. జీవమంత్రం, 4. ఆత్మమంత్రం, 5. శక్తి నేత్రములు, 6. శ్రోత్రములు,7. జిహ్వ,8. కర్త,9. కర్మ,10. క్రియ,11. మంత్రగాయత్రి,12.  ప్రాణప్రతిష్ట మంత్రము, 13. సూర్యబీజము, 14. యంత్రగాయత్రి ,15. రక్తావర్ణము, 16. మాతృకావర్ణములు,17. పంచభూత బీజములు,18. దిక్పాలిక బీజములు,19.మాయాపాశ బీజములు, 20. అంకుశ బీజములు,21. దైవ మూలమంత్రము ...ఇలా 21 అంగాలుంటాయి! ఇలా చేసిన జపం, హోమం ఫల భాగము  విగ్రహానికి అలాగే యంత్రానికి సమర్పిస్తూ విగ్రహానికి కళ్ళకి తేనె మైనం పూసి దేవాలయానికి విగ్రహమును తెచ్చి సమయానికి ఎక్కడైతే ప్రతిష్టించాలని అనుకున్నారో దాని పీఠ భాగంలో పూజ యంత్రం ప్రతిష్టించి ఈ తేనె మైనం ఉన్న విగ్రహాలను పెట్టి ఆ విగ్రహం చుట్టూ సిమెంట్ వేసి దానిని విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగిన తర్వాత క్షుద్ర దేవతల ఉపాసకుడు (భద్రకాళి, వీరభద్రుడు) ప్రతిష్టించి విగ్రహానికి ఆలయ శిఖరం నుండి ఒక సన్నటి ఎర్రని పట్టు దారం కడుతూ…దానికి బీజాక్షర విశ్వశక్తిని అనుసంధానము చేస్తూ... దానిని ధ్వజస్తంభం శిఖరానికి అనుసంధానం చేసి… దాని నుండి ప్రతిష్టించిన విగ్రహానికి నడుముకు దారం కట్టి… ఉపాసకుడు ఆ సమయంలో అతను ఒక్కడే ఉండి ప్రతిష్టించిన విగ్రహం యంత్ర భాగమునకు మంత్ర శక్తి ఈ ఆలయ శిఖరం నుండి అనగా విశ్వంలో ఉన్న విశ్వశక్తిని సంగ్రహించి ఈ రెండింటినీ మిళితం చేసి తీరని కోరికతో ఉన్న దేవత ఉపాసకుడు లేదా ఉపాసకురాలి ఆత్మను బీజాక్షర ఆత్మమంత్రంతో అందులో బంధించి దానిని ఆత్మశక్తిగా ఈ విగ్రహం నందు ప్రతిష్టించి  యంత్ర భాగానికి మంత్ర, తంత్ర, యంత్రాలకు ఈ విశ్వశక్తి ఆపాదించి విగ్రహం బంధించిన ఆత్మశక్తి బయటకు రాకుండా దానిని యంత్రంలో అష్టదిగ్బంధనం చేసి వంద సంవత్సరాలు యంత్రానికి అలాగే విగ్రహానికి అనుసంధాన శక్తిని ఇస్తూ విశ్వ శక్తి అలాగే మంత్ర శక్తి అలాగే ఆత్మశక్తితో ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది! ఆ తర్వాత ఈయన విగ్రహం వెనక్కి వెళ్లి తలుపు తీసి తీయించి ఉంచి  విగ్రహం యొక్క మొట్టమొదటి కళ్ళ దృష్టి  ఒక ముదుసలి ఆవు మీద పడేటట్లుగా అక్కడ విగ్రహానికి ఎదురు సజీవ ఆవును నిలబెట్టిన తరువాత ఉపాసకుడు విగ్రహ కళ్ళకి ఉన్న తేనె మైనము తీయగానే ఎవరో తనను గట్టిగా చావగొట్టినట్లుగా బంధించిన ఆవు కాస్త వెర్రి ఆవేశంతో బంధనాలు తెంచుకొని పారిపోవటం ఏకకాలంలో జరుగుతాయి! వీరావేశంతో ఎందుకంటే ఆవుకు ప్రేత శక్తి , అలాగే దైవశక్తిని ఏకకాలంలో చూడగలిగిన శక్తి అలాగే వాటిని భరించే శక్తి ఈ సృష్టిలో దానికిమాత్రమే ఉంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. ఇలాంటిది ఉన్నదని మన మహర్షులు తెలుసుకోవటం గొప్పతనం. విగ్రహానికి కళ్లకున్న తేనె మైనము తీసే సమయంలో ఎవరైనా విగ్రహానికి ఎదురు పడితే రక్తం కక్కుకుని చావటం నేను రెండు సార్లు పైగా చూశాను. 

నేను ఒకప్పుడు భౌతిక రసాయన శాస్త్రాలలో Ph.d చేసిన వ్యక్తిని. లేని దేవుడిని ఉన్నట్లుగా చూపించే వేదాలు కన్నా లేని దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించే సైన్స్ ను ఒకప్పుడు పిచ్చిగా నమ్మిన శాస్త్రవేత్తను. కానీ ఇప్పుడు శాస్త్రవేత్త కాస్తా అది కూడా నేనే వేదాంతిగా మారినాను. రెండూ ఉన్నాయి. కాకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తేడాలు.. ప్రస్తుతం సైన్స్ అనేది ఏమి తెలుసో తెలుసుకుని పరీక్షించే  స్థాయిలో ఉన్నది. తెలుసుకున్న వేదాలు మనకి అది ఎందుకు ఎలా ఎప్పుడు ఏమిటి అంటూ అన్ని సవివరంగా చెప్పేసింది. కానీ సైన్స్ మాత్రం అది ఎందుకు ఉన్నదో ఎలా ఉందో ఉందో లేదో అని ప్రతి విషయమునందు అయోమయ స్థితిలో ఉండి దానికి ప్రత్యక్ష అనుభవం కంటికి అయ్యేదాకా నమ్మి చావదు.అంతెందుకు ఉదాహరణకి మన పూర్వీకులు పసుపు ఉపయోగాలు తమ మనోనేత్రం ముందు తెలుసుకొని దానిని వంటల్లో వాడే విధానం ఆయుర్వేద శాస్త్రం గాను,  గుమ్మాల మీద వ్రాసే విధానం వాస్తు శాస్త్రం గానూ, పూజలో వాడే విధానం మంత్ర శాస్త్రం, వేదాలలో చెబితే సైన్స్ మొదట దీనిని నమ్మలేదు. ఎవడో తెల్లవాడు దీని మీద వంద సంవత్సరాలు పరిశోధనలు చేసి భారతీయ మహర్షులు చెప్పిన పసుపు ఉపయోగాలు నిజమని వాడు సర్టిఫికేషన్ ఇస్తే అప్పుడు మన వాళ్లు ఉపయోగించడం జరిగింది. ఇదే విషయాన్ని వంద సంవత్సరాల క్రితం అక్షర సత్యంగా మనవాళ్లు వేదాలలో పొందుపరిస్తే దానిని మనమే ఆచరించని దుస్థితి లో ఉన్నాము. కానీ తెల్లవారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనవాళ్లు ఆచరించడం మన దౌర్భాగ్యం. వాళ్లు చెప్పినది నమ్మరు. వీళ్ళు తెలుసుకునేసరికి మన జీవితకాలం కొంత భాగం పూర్తయిపోతుంది. అలాగే మన సైన్స్ వాళ్లు ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాలపాటు ప్రయోగాలు చేసిన తర్వాత విమానాలు కనుక్కున్నారు. రామాయణ కాలంలోనే కుబేరుడు ఆధీనంలో  మాయాసురుడు అనే రాక్షస శిల్పి చేత నిర్మించబడిన  పుష్పక విమానం ఉండేదని ఆనాడే రామాయణంలో వాల్మీకి రాశాడు .అలాగే వేదాలలో గ్రహదేవతలను లేదా ఇష్టదైవాలు తమ వాహనాలుగా జంతువులను ఉపయోగించేవారని ఉన్నది కదా. అలాగే కొన్ని సీసపు రేకుల గరుడ పక్షి యంత్రం గీసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తే ఇంటికి నలువైపులా భూమిలో వీటిని పాతిపెడితే కనుచూపుమేరలో ఆ ఇంటికి చుట్టూసర్పాలు ఉండని స్థితిని  నేను స్వయంగా కళ్ళారా చూశాను. నేను పాములు తీసుకుని వెళ్లి ఆ యంత్రాలు పాతి పెట్టిన చోట వాటిని వదిలితే అవి ఏదో చూసి భయపడినట్లుగా ప్రాణభయంతో పారిపోయినవి.  నా శాస్త్రవేత్త పరిశోధనలు గమనించే సరికి ఇప్పుడు సైన్స్ ఎప్పుడో పూర్వం చెప్పిన వేదాల కన్నా చాలా వెనుకబడి ఉందని  దీనిని నమ్మకుంటే నేను ఇంకా వెనకబడి పోతాయేమోనని భయంతో వేదాలలో ఉన్న శాస్త్ర విషయాలను అర్థం చేసుకుంటూ వేదాంతిగా మారాను. మనకి అర్థమైనది సిద్ధాంతము. మనకు అర్థం కానిది వేదాంతం. అర్థం అయ్యి అర్థం కానిది రాద్దాంతం అవుతుందని నా జీవిత అనుభవాలే అందుకు ఉదాహరణగా ఎన్నో విచిత్ర సచిత్ర సంఘటనలు నిలుస్తాయి. మీరు కూడా నాలాగే మీ యవ్వన వయస్సు  వృధా చేసుకుంటారు ఏమో అని భయంతో నా అనుభవంలో తెలుసుకున్న గోరంత విషయాలు పిసరంత జ్ఞానముతో  మీకు చెప్తున్నాను. తెలుసుకోవలసినది కొండంత… తెలుసుకున్నది గోరంత… అందులో మనం అనుభవించేది పిసరంత... వేదాలు ఆలోచనలు కలిగిస్తే భౌతిక శాస్త్రాలు దానిని అనుభవం క్రియారూపం ఇచ్చేందుకు ప్రయత్నించాయి. 

ఈ రెండూ తప్పు కాదు. కాకపోతే ఈ వేదాలు మరియు సైన్స్ మధ్య సరిగా అనుసంధానం జరిగితే అనుకున్న సత్య ఫలితాలు మన కళ్లముందు ఆవిష్కరిస్తాయి. అంటే మన సైన్సు వాళ్ళు కష్టపడి విమానాలు నిర్మాణం చేస్తే దానిని వేదాంతులు పూర్వం మన మహర్షులు వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో విమానం వంటి వాహనాలను ముందుగానే ఉపయోగించే వారిని చెప్పేవారే ఎక్కువ ఉన్నారు గానీ ఆ పూర్వ మహర్షుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం జరుగుతాయి మాత్రం ఈ వేదాంతులు చెప్పలేరు. అదే పెద్ద సమస్య. చిక్కు సమస్యగా మారినది. పైగా సైన్స్ కనిపెట్టిన తరువాత ఈ విషయం ఫలానా చోట వేదంలో ఉంది అంటారు గానీ వేదాల్లో ఉన్న అసాధ్యమైన సాధ్యమైన విషయ పరిజ్ఞానం  ముందుగానే సైన్స్ వాళ్ళకి ఒక ఆలోచన విధానం కలిగిస్తే మనము ఎప్పుడో స్వయంగా విమానాలు కనుక్కొని నడిపే స్థాయికి వచ్చేవాళ్ళం. మన వేద విజ్ఞానం పరాయి దేశాల వాళ్లు చదివి  పూర్వీకుల వారి ఆలోచనలను ఆకళింపు చేసుకుని ప్రయోగాలు చేస్తూ ఈ కాలానికి తగ్గట్లుగా వాటి నిర్మాణం లో మార్పులు చేస్తూ అనుభవం తెస్తున్నారు. దాన్ని మనం చూసి ఆనంద పడుతున్నాము. పేరు వాడికి దిబ్బ మనకి.  పూర్వం వేదాల కాలంలో వాహనాలు  ప్రాణ ప్రతిష్ట చేసిన మంత్ర శక్తి ఉన్న యంత్రాలతో నడిచేవని పరాయి దేశపు వాళ్ళు తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టి ఇప్పటి కాలానికి తగ్గట్టుగా వాహన నిర్మాణాలు చేసి వాటికి యంత్ర పరికరాలు తయారు చేసి మంత్ర శక్తి బదులుగా దహన శక్తి అనగా పెట్రోల్, డీజిల్, బొగ్గు మండించి వచ్చే శక్తితో  నడుపుతున్నారు. మరి వీరికి ఆలోచన ఇచ్చినది వేదాలే కదా! కానీ ఆచరణ వచ్చేసరికి ఈ కాలానికి తగ్గ వస్తువులతో పదార్ధాలతో క్రియ రూపంగా మార్చినది ఎవరు మన శాస్త్రవేత్తలే కదా! నిజానికి వేదాలలో సైన్సు ఉంది. అది అందరికీ అర్థమయ్యే సరికి వాటిని అందరికీ అందుబాటులో తెచ్చేసరికి మన జీవిత కాలాలు కరిగిపోతాయి. సరే రేపు వచ్చే మంగళవారం మీ ఊరికి దగ్గరలో గుడిలో హనుమాన్ విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది. దాని నిర్వహణ బాధ్యత నేనే తీసుకున్నాను. సుమారుగా నూట ఎనిమిది  రుత్వికులు చేసే మహత్తరమైన ఈ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మీరు చూడండి. నేను చెప్పినది నిజమా అబద్దమా మీకే తెలుస్తుంది. ప్రత్యక్ష అనుభవం పొందండి. రాతి విగ్రహం కాస్త ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత అది ఎలా సజీవమూర్తిగా మారుతుందో మీరే ప్రత్యక్షానుభూతి పొందండి. నమ్మండి వేదాలను అందులో చెప్పిన అక్షరసత్యాలని. మన సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా లేదా అందుబాటులోకి వచ్చే విధంగా మీ వంతు సహాయం చేయండి. వేద జ్ఞానంను పండితజ్ఞానం నుండి   పామరజ్ఞానంగా మార్చే స్థాయికి  మీరు తీసుకురండి. మీరు తప్పకుండా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కి రండి” అంటూ ఆనాటి తో మా ఊరి తిరునాళ్లు పరిసమాప్తి అవడంతో శాస్త్రవేత్త అయిన సిద్ధాంతి గారు వెళ్లిపోయారు. మేము ఈ వారం రోజులు ఎప్పుడు గడుస్తాయో అని  ఎదురు చూస్తూ కాలం గడిపినాము.

బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన  ముహూర్తపు రోజు గానే వచ్చినది. నేను అలాగే జిజ్ఞాసి ఆఫీసులకి డుమ్మా కొట్టి ఆయన చెప్పిన ఊరికి వెళ్లి ప్రతిష్ట జరగటానికి సిద్ధముగా ఉన్న దేవాలయానికి వెళ్ళినాము. అక్కడకు వెళ్లి అక్కడ ఉన్న మాకు తెలిసిన బ్రహ్మ సిద్ధాంతిని కలిసి మా అవతారాలు మార్చుకొని పూజారులుగా అవతరించాము. మేము ఈ ప్రతిష్ట భాగంలో దేనికి పనికి రాము. దేనికి ఉపయోగపడము. కేవలం మా అనుభవాలు కోసం మాత్రమే ఈ విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చినాము. పూజారిగా అయితే మరింత దగ్గరగా బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన విషయాలు నిజమో కాదో చూడవచ్చును కదా. ఏమో ఎవరికి తెలుసు. ఏది సత్యం ఏది అసత్యము. ఐదురోజుల ప్రతిష్ట సమయంలో మేము చివరి అంకముకు వచ్చినాము. బ్రహ్మ సిద్ధాంతి చెప్పినట్లుగా విగ్రహానికి అలాగే యంత్రానికి జపాలు, హోమాలు ఈ నాలుగు రోజులు జరిగినది. ఇక అసలైన ప్రక్రియ నిజంగా జరుగుతుందో లేదో తెలియని ఒక రాతి విగ్రహానికి ప్రాణం పోయడం అదే ప్రాణ ప్రతిష్ట విధానం మొదలైనది.ఆలయ శిఖరం కు ఏదో ఎరుపు పట్టు తాడు కట్టి దానిని గుడి ధ్వజస్తంభ శిఖరానికి కట్టి  యంత్రము ఉన్న పళ్ళెమునకు చుట్టి పడుకొని బెట్టిన హనుమాన్ విగ్రహానికి కట్టడం మేము చూశాము. నేను మా వాడు మాకున్న ఉత్సాహం ఆపుకోలేక ఆ పట్టు త్రాడును పట్టుకొని లాగి చూశాము. ఏమీ అనిపించలేదు. మామూలు గానే ఉంది. వామ్మో! మనకి బ్రహ్మ సిద్ధాంతి  లేనిపోని కథనాలు చెప్పారా? అనవసరంగా వారం రోజులు పైగా సెలవులు పెట్టి వచ్చాము .ఎంత జీతం పోతుందో! వామ్మో !అనుకుంటున్న మా యొక్క కుక్క బుద్ధి అనగా అనుమానం బుద్ధి పోనించుకోలేదు. ఇది ఏమీ పట్టనట్లుగా బ్రహ్మ సిద్ధాంతి తో పాటు పూజాదికాలు చేసిన ఇది 108 ఋత్విక్కులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారని నా కనుదృష్టికి  కనబడినది. ఇంతలో ఎంతో ఆర్భాటంగా భారీ దేహంగా గంభీర వదనంతో పెద్ద పెద్ద రుద్రాక్ష, స్పటిక, తాయెత్తులు ,చిన్నపాటి యంత్రాలు తగిలించుకున్న ఒక తాంత్రిక ఉపాసకుడు కారు దిగి రావడం… ఆయనకి వీరంతా పూర్ణకుంభంతో స్వాగతం పలకడం… వీరిని తీసుకుని వెళుతూ బ్రహ్మ సిద్ధాంతి మా ఇద్దరి వైపు తిరిగి ఈయనే ఆయన నేను చెప్పిన తాంత్రిక ఉపాసకుడు అని లో గొంతులో చెప్పి వెళ్లి పోవడం జరిగినది. నిజానికి ఆయనను చూస్తుంటే రామాయణం సీరియల్ లోని రావణబ్రహ్మ లాగా కనిపించాడు.గంభీర వదనం,  భారీ దేహంను ఎవరైనా చిన్న పిల్లలు చూస్తే “వామ్మో! నిజంగానే అమ్మ చెప్పిన బూచోడు వచ్చాడేమో” అని మరి లేని ఏడుపు తెచ్చుకుని వెక్కివెక్కి ఏడవటం ఖాయమని అనిపించినది. మాకే కొద్ది క్షణాలుపాటు ఎదో తెలియని తత్తరపాటు మొదలైనది! కానీ ఈ విషయాన్ని మాకు మేమే మాకే తెలియనంతగా కనిపించనంతగా జాగ్రత్తలు తీసుకొని ఆయన వెళ్లిన వైపుకు మేము కూడా ఏమి జరుగుతుందో చూద్దామని క్రొత్త విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త లాగా వెళ్ళినాము. 

ఆయన గుడి పరిసరాలు అంతా తిరుగుతూ అక్కడే ఉన్న ఆలయ పూజారి తో “ఇక్కడ స్మశానం ఏ దిక్కులో ఉన్నది? ఎటు వైపు ఉన్నది? అని పెద్దగా గంభీరంగా అడిగేసరికి ఆ పూజారి ఎంతో వినయంగా “స్వామి! ఉత్తర దిక్కులో ఫలానా ప్రాంతంలో ఉన్నది” అని చెప్పడం మేమిద్దరం విన్నాము. వామ్మో! ఏమిటి ఈయన రాగానే స్మశానం గురించి అడిగాడు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తాడా లేదా పూజలు చేసుకోవటానికి అడిగాడా? చూస్తుంటే అన్ని రకాల పూజలు చేసుకుని వచ్చే వాడిలాగానే ఉన్నాడే అంటుండగా ఆయన హోమాలు చేసిన యాగశాల లోనికి వెళ్లడం జరిగింది. లోపల ఏం జరుగుతుందో మేము చూసే అవకాశం లేకుండా ఆ యాగ శాలకు ద్వారబంధాలు వేసినారు. లోపలికి వెళ్లి ఏదైనా టిఫిన్ తింటున్నారు ఏమో అని మేము అనుకొని బయట వేచి గంట దాకా ఉన్నాము. కానీ మాలో ఏదో తెలియని ఆత్రుత కంగారు మొదలైంది. టిఫిన్ తినేవారైతే లోపల ఇంత సేపు ఉంటారా? కొంపదీసి నేను చూడకుండానే అంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట విధానం జరుగుతుందా? విగ్రహాన్ని ప్రతిష్టించేది! యాగశాలలో కాదు కదా! గుడిలో కదా! పైగా ప్రతిష్ట విగ్రహం గుడి ద్వారం బయట పడుకొని ఉన్నది” అనుకుంటూ లోపల తాంత్రికుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని ఉత్సుకతతో ఎవరికీ కనిపించకుండా మేమిద్దరం యాగశాల వెనుకవైపు వెళ్లి చుట్టూ బంధనం వేసి ఉన్న వస్త్రాలలో ఒక వస్త్రానికి గంత చేసి లోపల ఏమి జరుగుతుందో చూద్దామని ఒక కన్నుతో లోపల చూసేసరికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనిపించేంతగా ఒక భయంకరమైన నమ్మలేని దృశ్యం కనబడింది. అదేమిటో నేను చెప్పే లోపలే మాజిఙ్ఞాసి కూడా ఆత్రం ఆపుకోలేక వాడు కూడా నేను చూసిన గంతలోనే ఆ దృశ్యం చూసి గతుక్కుమన్నాడు. అదేమిటంటే యాగశాలలో మధ్యలో అతి పెద్ద హోమగుండం దగ్గర బ్రహ్మ కర్త కూర్చునే స్థానంలో ఈయన కూర్చొని ఎరుపు అన్నం ముద్దలు గాలిలో ఈ హోమ కుండానికి నలువైపులా అష్ట దిక్కులలో ఏవో మంత్రాలు చదువుతూ ఎవర్నో రమ్మని పిలుస్తున్నారు. అప్పుడు మరింత బిగ్గరగా మంత్రాలు చదువుతూ వచ్చావా… వచ్చావా అంటూ ఏవో ముద్దలు తెల్లవి, ఎర్రవి, నల్లవి, అంటూ కాంతిపుంజము వైపు వేస్తూ ఉండగా అది మేము గమనించే లోపల దానిని ఒక కలశం లోకి ఆవాహన చేయడం లిప్తకాలంలో జరిగినది. అసలు ఏమి జరిగిందో మేము తెలుసుకునే లోపల ఆయన ప్రతిష్ట మందిరానికి చేరుకోవడం జరిగినది. మేము ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ బ్రహ్మ సిద్ధాంతి మేము ఉన్న చోటికి వచ్చి మేం చేస్తున్న పని చూసి నానా తిట్లు తిట్టి “నేను మిమ్మల్ని ఆయన చేసే పూజా విధానం చూడమని చెప్పలేదని పూజ అయిన అదే ప్రాణ ప్రతిష్ట మైన తర్వాత విగ్రహాన్ని పరీక్షించమని చెప్పినాను” అని చెప్పటం జరిగింది. మమ్మల్ని ఎవరు గమనించలేదు అని తెలుసుకొని స్థిమితపడి మమ్మల్ని గుడివైపు తీసుకుని వెళ్లారు. 

అక్కడ ఇంతలో తాంత్రిక ఉపాసకుడు ప్రతిష్ట చేయవలసిన యంత్రానికి కి ఏవో వేలిముద్రలతో ఏవో మంత్రాలు చదువుతూ మా కంట ఓర కంటితో చూసి కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో ధ్యానంలోనికి వెళ్లి పోవడం జరిగినది. ఈలోపల అక్కడికి ఒక వైద్యుడు తన స్టెతస్కోప్ తీసుకుని రావడం జరిగింది. మేము ఆయన్ని గమనించి ఈయన ఎవరికోసం వచ్చినాడు? అని భయపడుతూ మేము ఉండగా బ్రహ్మ సిద్ధాంతి వారిని కలిసి మా వైపు తిరిగి మమ్మల్ని పిలిచి వారిని విగ్రహం ఉన్న వైపు తీసుకొని వెళ్ళినారు. మాకు ఏం జరుగుతుందో అర్థం కాక మేము కూడా వాళ్లు ఉన్న వైపు వెళ్ళినాము. అప్పుడు డాక్టర్ కి ఈయనకి ఏదో వాదనలు జరుగుతున్నాయి. 


డాక్టర్ ఏమో” స్వామి! చెప్పమంటారా! ఈ రాతి విగ్రహానికి మనిషిలాగా ఈ విగ్రహానికి హృదయ స్పందన చూడమంటున్నారు? ఇది ఎలా సాధ్యం. ఒక రాయికి ఎక్కడైనా గుండె ఉంటుందా? దానికి స్పందించే గుణం ఉంటుందా? అంటే నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను? అంటూ వాదనకు దిగాడు. వెంటనే బ్రహ్మ సిద్ధాంతి “నేను ఎవరో మీకు తెలుసా” అంటూ అసలు తన నిజమైన శాస్త్రవేత్త పేరు చెప్పగానే డాక్టర్ ఎంతో ఆశ్చర్యంగా వారి వైపు తిరిగి “సార్! నన్ను క్షమించండి! మీరు ఉన్న ఈ అవతారంలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీరు ఇలాంటి వేదాంత విషయాలు మీద పరిశోధన చేస్తున్నారని ఏదో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ నేను చాలా చదివాను. ఇప్పుడు నాకు అర్థమైంది. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయకముందు అలాగే చేసిన తర్వాత వచ్చే తేడాలు గమనించాలి అని మీరు అనుకుంటున్నారు కదా! అది ఏమంత పని కాదు అంటూ ఒక మనిషి హృదయస్పందన చూసినట్లు స్టెతస్కోప్ తో చూసి “సార్! నాకు ఎలాంటి నాడి కొట్టుకోవడం వినిపించడం లేదు” అన్నారు. మా వైపు తిరిగి “మీరు కూడా డాక్టర్ లాగా స్టెతస్కోప్ తో పరీక్షించండి” అన్నారు. వెంటనే మేము కూడా ఇద్దరం ఆ స్టెతస్కోపు తీసుకుని ఒకటికి పదిసార్లు ఆ రాతి విగ్రహానికి నాడి కొట్టుకోవడం లేదని హృదయ పల్స్ రేటు లేనేలేదని రూఢీ చేసుకున్నాము. దాంతో బ్రహ్మ సిద్ధాంతి చిరునవ్వు నవ్వుతూ మా ముగ్గురిని ఆ విగ్రహానికి దూరంగా వెళ్ళమని చెబుతూ ఆ కట్టిన ఎర్రని పట్టుదారము ఎట్టి పరిస్థితుల్లో తాక వద్దని హెచ్చరిక చేస్తూ యంత్రపూజ చేస్తున్న తాంత్రిక ఉపాసకుడి వైపు వెళ్లడం జరిగింది. అప్పుడు డాక్టర్ మాతో “మీకు ఈయన ఎలా తెలుసు?” అంటూ అన్ని వివరాలు అడిగి తెలుసుకుని “అయితే ఈ విగ్రహానికి యంత్రమును పెట్టి ప్రాణ ప్రతిష్ట చేస్తే మనిషి గుండె స్పందనలు ఉన్నట్టుగా విగ్రహం ఉంటాయా? అయితే అదేదో వింత నేను మళ్లీ చెకప్ చేసి చూస్తాను.  విగ్రహాలకు ఎలా ప్రాణం అదే జీవము వస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తాను” అని మాకు దూరంగా సత్యానికి దగ్గరగా కూర్చున్నాడు. ఇంతలో తాంత్రిక ఉపాసకుడు తను చేసిన యంత్రంతో విగ్రహ ప్రతిష్ట కోసం గుడిలోకి వెళ్లడం జరిగింది. తర్వాత బయట ఉన్న రాతి విగ్రహం లోపలకి తీసుకుని వెళ్లడం జరిగింది. దానితో పాటుగా సిద్ధాంతి ఒక నలుగురు ఋత్విక పరిచారికలు ఆయనతోపాటు లోపల ఉండిపోయారు. వెనువెంటనే ఆ గుడి ద్వార బంధనాలు మూసివేయడం జరిగినది. సరిగ్గా నలభై నిమిషాల తర్వాత ఆ గుడి తలుపులు తెరిచారు. యంత్ర ప్రతిష్ఠ అలాగే విగ్రహం నిలబెట్టి దానికి పెట్టినారు. గంతలు కట్టినారు. విగ్రహానికి అడుగుభాగంలో సిమెంట్ వేసిన గుర్తులు కనబడినాయి.ఇంతలో ఒక ఆవుని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పటం ఆ తర్వాత కూడా ఒక ఎర్ర దారం విగ్రహం నుండి దీనికి అనుసంధానం చేస్తూ ఎవరిని ఆ కట్టిన తాడును అనగా ధ్వజానికి గోవు కి కలశానికి కట్టిన త్రాడును తాకవద్దని దూరంగా జరగమంటూ ఏదో కలశం లో ఉన్న పసుపు నీళ్లు చల్లుతూ ఏవో మంత్రాలు చదువుతూ తాంత్రిక స్వామి గుడిలోనికి వెళ్ళి విగ్రహం వెనక్కి వెళ్లి తన రెండు చేతులు విగ్రహం కళ్ళ మీద వేసి  కళ్ళు ఎవరు దయచేసి చూడవద్దని కళ్ళు మూసుకుని ఆజ్ఞ చేస్తూ తను కూడా కళ్ళు మూసుకుని ఆ నలుపు గుడ్డ తీయడం అలాగే ఆ కళ్లకు పెట్టి ఉన్న తేనే మైనపు ముద్దలు తీయటం ఏదో ఆవేశం వచ్చినదాని లాగా  ఆవు భయపడి పారిపోవటం నా అర్థం నేత్రాలతో ఓరకంట చూస్తూ ఉండిపోయాను. అప్పుడు అచ్చం మన బ్రహ్మ సిద్ధాంతి చెప్పినట్లుగా జరుగుతోంది అంటే ఇంతవరకు ఆయన చెప్పినది నిజమే కాకపోతే ఎప్పుడూ కలలో కూడా ఊహించని విచిత్ర దైవ అనుభవం మేము కళ్లారా చూస్తామని అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు. 

అదేమిటంటే ప్రాణ ప్రతిష్ట, పూజాదికాలు పూర్తయిన తర్వాత రెండు గంటల తర్వాత మా ముగ్గురినీ బ్రహ్మ సిద్ధాంతి గారు గుడిలోకి తీసుకుని వెళ్లి ఈ సారి మళ్ళీ స్టెతస్కోప్ తో ఆ విగ్రహానికి ఎడమవైపు ఉండే ప్రాంతంలో గుండె హృదయ స్పందన పరీక్షించమని డాక్టర్ ని అడిగితే ఆయన వెంటనే ఉత్సాహంతో స్టెతస్కోప్ తో చెకప్ చేసినాడు. ఏదో అనుమాన ఆశ్చర్యానికి గురి అవుతూ అనుమానం వచ్చిన వాడిలా పరిశోధించే వారిలాగా ఒకటికి పదిసార్లు చేస్తూ "వామ్మో! ఏంటి లీల! చాలా చిత్రంగా ఉంది! మొదట వినిపించి వినిపించనంత శబ్దంతో స్పందన లాగా వినిపించింది. అది నిజం కాదని నిజము ఒకటికి పదిసార్లు పరీక్షిస్తే అది ఇప్పుడు మనిషి గుండె స్పందన లాగా చాలా చక్కగా వినబడుతోంది. వామ్మో ఎవరైనా ప్రాణం ఉన్న మనిషి దూరారా? అబ్బాయిలు మీరు కూడా పరీక్షలు చేయండి మీకు గుండె స్పందన ఆగకపోతే నేను నా చెప్పుతో కొట్టుకుంటాను” అంటూ మాకు ఆయన స్టెతస్కోప్ ఇచ్చి పక్కకు తప్పుకొని మా ఇద్దరి హృదయ స్పందన భావాలు ఎలా ఉంటాయో చూడటం జరుగుతోంది. ఏముంది షరా మామూలే. మళ్లీ మా లిస్టులో కొత్తగా మరో కొత్త నమ్మలేని ప్రత్యక్ష అనుభవం చేరినది. మా హృదయ స్పందనలు తగ్గిపోవటం ఆ రాతి విగ్రహానికి… సారీ ఆ సజీవ విగ్రహమూర్తి హృదయ స్పందనలు పెరగడం…. మా ఇద్దరికి వినిపించేసరికి ఏదో తెలియని ప్రేమపూరితమైన ఆర్ద్రత తో కూడిన భావనలు మాకు తెలియకుండా కళ్ళవెంట నీళ్ళు రావడం జరిగినది. 

మేము పక్కకు తప్పుకునే సరికి బ్రహ్మ సిద్ధాంతి ఆ విగ్రహానికి కలశంలోని పసుపు నీళ్ళతో విగ్రహమూర్తికి అభిషేకం చేసి ఆ సజీవ విగ్రహం మూర్తికి బంగారపు కళ్ళు అమర్చే మధుర సంఘటన చూస్తూ నిజమూర్తి దైవానికి నమస్కారం చెప్పాము. ఇలాంటి అనుభూతి కలిగించిన బ్రహ్మ సిద్ధాంతి పాదాలను తాకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వద్ద సెలవు తీసుకుని ఉద్యోగాల కోసం బస్సులు వైపు కి వెళ్ళటం జరిగినది. 

గమనిక: దేవాలయంలోని విగ్రహాలు, విగ్రహ యంత్రాలు ఎంతో పరిశుద్ధమైన మహత్తరమైన దివ్యశక్తితో కూడి ఉండుట చేత మైల ఉన్నవారిని, నెలసరి ఉన్నవారిని గుడికి దూరంగా రావద్దని చెప్పడం జరిగినది. ఎందుకంటేమైల ఉన్నవారికి వారి చనిపోయిన వారి ప్రేతశక్తి సుమారు 11 రోజులపాటు వారి వంశస్థులుకు ఉంటుంది. అలాగే నెలసరి వారికి వారి శరీర ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో శరీరమంతా వేడి ఆవిరిలతో, చెడు రక్తం తో కూడిన రుణాత్మక శక్తితో వారు ఉంటారు. ఈ రెండు శక్తులు కూడా ప్రాణ ప్రతిష్ట యంత్రాలకు ఉన్న పరిశుద్ధ మంత్ర శక్తిని దెబ్బ తీయడం జరుగుతుంది. ఈ ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కాని కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే జరిగితే తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఉన్న శక్తి దెబ్బతింటుందో ఆనాటి నుండి ఆ విగ్రహం లో ఉన్న దైవ శక్తి ఆత్మ శక్తి గాను అటు పిమ్మట ప్రేతశక్తి గా అనగా సత్వ, రజో, తమో గుణాలలో సత్వము నుండి తమోగుణాన్కి చేరుకుంటుంది. అప్పుడు ఆ విగ్రహం ఉగ్రశక్తి లో నరబలులు, జంతుబలులు తీసుకోవడం జరుగుతుంది. ఊళ్లో అకాల మరణాలు, అనుకోని అగ్ని ప్రమాదాలు, యువకుల ఆత్మహత్యలు, అకాల జంతు మరణాలు విరివిగా జరుగుతాయి. కష్టనష్టాలకు నాంది పలుకుతుంది. తెలిసో తెలియకో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే ఆ దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు చేయటం అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి అష్టదిగ్బంధనం మహా సంప్రోక్షణ పూజలు పదిహేను రోజులపాటు చేయటం తిరుపతి వెంకన్న దేవాలయంలో, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయంలో, అమ్మవారి స్వయంభూ శక్తిపీఠాలలో అలాగే శివయ్య స్వయంభూ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ శుద్ధి పూజలు జరుగుతుంటాయి.  ఇవి ఎలాను జరుగుతున్నాయి కదా అని తెలిసి కూడా తప్పులు చేస్తే మీ వంశమే నాశనమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త! ఎంతో స్వానుభవం మీద చెబుతున్నాను. నెలసరి 5 రోజుల వరకు అలాగే మైలపూర్తి అయిన తర్వాత వరకు మీ ఇంటిలోని దైవిక వస్తువులు, విగ్రహాలు, యంత్రాలు తాక వద్దు.అలాగే పరిసర దేవాలయంలోకి వెళ్ళవద్దు. ఆయా దేవతల ఆగ్రహానికి గురి కావద్దు. మీ జీవితాలు చేతులారా నాశనం చేసుకోవద్దు. ఈ రెండు రకాల ఇబ్బందులు లేని రోజుల్లో ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఆడ లేక మగ అయినా దేవాలయ దర్శనంకు వెళ్ళవచ్చు. తాకవచ్చు. స్పర్శ  ఆనందం పొందవచ్చు.

విగ్రహాలు నైవేద్యాలు తింటాయా?

మేము మా ఉద్యోగ విధుల లో బిజీగా ఉంటూ విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధన ఎలా చేయాలో వివిధ రకాల పుస్తకాలు చదువుతూ అవి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో ఉంటూ మాతో మా ఇష్టదైవాలు స్వయంగా ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాక మధనపడుతూ వాదనలు చేసుకుంటూ  దానికి తగ్గ ఆలోచనలు చేస్తూ ఒక సంవత్సర కాలం మాకు తెలియకుండానే జరిగిపోయింది. దాంతో మళ్ళీ గుడికి తిరునాళ్లు ఉత్సవాలు రావటం, దీనికోసం వచ్చే బ్రహ్మ సిద్ధాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం ఆయన దగ్గరకు వెళ్లి పాద నమస్కారాలు చేసి క్షేమ సమాచారాలు కనుక్కొని మా ఆధ్యాత్మిక చింతన సభ చర్చ మొదలైంది. పూజకి గుడిలో ఇంకా బాగా ఆలస్యం ఉండేసరికి ఆయన కూడా మాతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి ఆసక్తి చూపడంతో మా లో మాకే తెలియని ఏదో ఆనందం ఉత్సాహభరితంతో  మా జిఙ్ఞాసికి వచ్చిన  ఒక ధర్మ సందేహం ఆయన ముందు ఉంచారు. “స్వామి! రాతి విగ్రహాలు  కాస్త సజీవ విగ్రహంలా ఎలా మారుస్తారు దాని విధి విధానాలు క్రిందటి సంవత్సరం చెప్పినారు. ఆ ప్రత్యక్ష దైవ అనుభూతి అందించారు. అది అక్షర సత్యమే కాని నాకు ఒక సందేహం వచ్చింది. ఈ సజీవ విగ్రహం మూర్తులకు పెట్టే నైవేద్యాలు అవి తీసుకోవు గదా.   తినలేవు కదా. మరి వాటికి పెడుతున్నామని మనం తింటున్నాము కదా. అది తప్పే కదా. ఈ విగ్రహమూర్తులు నైవేద్యాలు తినని కాడికి వాటికి పెట్టడం ఎందుకు ప్రసాదాలు? వాటిని వెనక్కి తిరిగి మనము ఎందుకు తీసుకోవడం?” అని అన్నాడు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి “నాయనలారా! విగ్రహాలు మీరు పెట్టిన నైవేద్యాలు తీసుకోవని ఎలా అనుకొన్నారు? మీ దృష్టిలో తినటం అంటే అవి మనిషి తిన్నట్లుగా తినాలి కదా అని అనుకుంటున్నారా? చాలా తప్పు. అలాగే ఇలా యంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేయబడిన విగ్రహాలకు దైవిక శక్తి ఏర్పడుతుంది అని మీకు తెలుసు కదా. ఈ దైవిక శక్తికి కూడా మనిషి లాగానే వాటికి కూడా ఆకలి నిద్రలు వస్తాయి. ఉంటాయి .కానీ మనము వాటిని గమనించే స్థితిలో ఉండము ఎందుకంటే మన దృష్టిలో అవి ప్రాణములేని విగ్రహ మూర్తులు కానీ నిజానికి అవి సజీవ మూర్తులే. మీరు పెట్టిన నైవేద్యాలు ఎలా తీసుకుంటాయో మీకు చూపిస్తాను రండి” అంటూ ఆయన                                                   
నిత్యపూజ  చేసుకునే శివ పంచాయతమును బయటికి తీసినారు!అందులో మధ్యభాగములో ఉన్న అమ్మవారి విగ్రహం బయటికి తీసి బ్రహ్మ సిద్ధాంతి మా ఇద్దరిని కూడా లోపల గదికి తీసుకుని వెళ్లి గది తలుపులు మూసి వేసి ఏవో మంత్రాలు చదువుతూ మహా నైవేద్యానికి పెట్టడానికి ఉపక్రమిస్తూ మా కళ్ళ మధ్య మేము బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని  తన బొటన వేలుతో వ్రేలు మా ఇద్దరినీ తాకీ తాకగానే నాకు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లు మాలో ఏదో శక్తి  ప్రవేశించినట్లుగా అనిపించినది. . మేము నిద్రమత్తులో జోగడం మొదలైంది.  ఆయన మంత్రాలు చదువుతూ మహా నైవేద్యం అమ్మవారికి నివేదన చేస్తుంటే అక్కడ ఉన్న ఆహారపళ్లెం లో ఉన్న అన్ని రకాల పదార్థాలు వాటి ఆకారాలతో కూడిన సూక్ష్మ పదార్థాలు గాల్లోకి లేసి అమ్మవారి నోట్లోకి వెళ్ళటం కొంతసేపటి తర్వాత అమ్మవారి నోట్లోనుండి ఆ పదార్థాలు ఎంతో దివ్యకాంతులతో మళ్లీ తిరిగి అక్కడ ఉన్న ఆహారపళ్లెము లోనికి వెళ్లి పోవడం చూసేసరికి అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో అంటే మనం పూజించే మన ఇష్టదైవాలు మనం పెట్టే ఆహార పదార్థాల యొక్క సూక్ష్మరూపాలను అనగా  వాటి పదార్థ ప్రాణ శక్తిని ఆహారముగా తీసుకుని తిరిగి వాటిని తమ ఎంగిలి ద్వారా వాటికి దైవ శక్తిని ఆపాదించి ఈ ఆహార పదార్థాలు దైవ ప్రసాదాలు గా మారుస్తాయి. దైవ ప్రసాదం అంటే దైవం ఎంగిలి చేసిన పదార్ధం అని  నాకు లీలగా గుర్తుకు వచ్చే సరికి గది తలుపులు తెరిచేసరికి అప్పటిదాకా మమ్మల్ని ఆవరించిన యోగ నిద్ర లాంటి మత్తు వదిలి పోయింది. దాంతో మాకు విపరీతమైన ఆకలి వేస్తుండటంతో ఇంటి నుండి మహానైవేద్యం పెట్టడము పూర్తి అయినదని భోజనం కు రమ్మని పిలుపు రావడంతో మేమంతా ఇంటిలోనికి భోజనం చేయటానికి వెళ్ళాము. భోజనం పూర్తయిన తర్వాత కాసేపు నడుంవాల్సి తిరిగి మళ్ళీ గుడిలోకి వెళ్లాం. నాకు ఒక సందేహం వచ్చింది. మరి ఇన్నాళ్లు నేను అమ్మవారికి ఎన్నో రకాల నిత్య మహా నైవేద్యం పెట్టినాను.  కానీ నాకు ఎప్పుడు ఇలాంటి ప్రత్యక్ష దృశ్య అనుభూతి  కలగలేదు. ఈయన ఏమైనా కనికట్టు చేశాడా? ఏదో బొట్టు స్థానంలో బొటనవేలు పెట్టినాడు కదా! ఏమో చెప్పలేము! ఏదైనా జరగొచ్చు కానీ అలా చేసే మనిషి కాదు. మరి ఇన్నాళ్లు  కనిపించనిది ఇవాళ ఎలా కనబడిందని నాకు వచ్చిన సందేహం ఆ బ్రహ్మ సిద్ధాంతికి చెప్పడం జరిగినది.

దానికి ఆయన పెద్దగా నవ్వుతూ  “కనికట్టా పాడా! మీకున్నఉన్న మనోనేత్రం అదే (third eye) కొన్ని క్షణాలపాటు నా మంత్ర శక్తి ద్వారా బొటనవేలు పెట్టి  తెరిపించాను. అంటే నా లెక్క ప్రకారము సైన్స్ చెప్పే పీనియల్ గ్రంథి తెరిపించడం అన్నమాట. ఎవరికైతే శాశ్వతంగా తమ మనో నేత్ర మైన త్రినేత్రం అదే పీనియల్ గ్రంథి సంపూర్తిగా తెరుచుకొని ఉంటే వారికి ఈ లోకంలో కనిపించని అదృశ్య శక్తి తో తిరిగే అన్ని రకాల వస్తువులు, జీవ జాతులు వాటిని ఆవరించి ఉన్న అరాశక్తి అలాగే వాటి ఆత్మ శక్తి అయిన సూక్ష్మ శరీర రూపాలు మనకి అగుపిస్తాయి. అలాగే భూత వర్తమాన భవిష్యత్తు లో జరగబోయే అన్ని రకాల సంఘటనలు అలాగే మీకు కావలసిన సంఘటనలు సుస్పష్టంగా మీరు సంకల్పించుకోకున్నా సంకల్పం ఉన్నా కూడా ఒక వీడియోలో దృశ్యం లాగా కనబడతాయి. అంటే టీవీలో సినిమా చూసినట్లుగా  ఈ పీనియల్ గ్రంథి తెరుచుకుంటే అలాగే చూడవచ్చును అన్నమాట. తలచుకుంటే వామ్మో! ఇనాళ్ళు కేవలము కలలో లేదా ధ్యానములో ఏవో దృశాలు చూడటము జరిగినది!కాని ఇవి ఏమియు లేకుండా మనకు తెలియని విషయాలు, ఆత్మ శక్తులు సూక్ష్మ శరీరధారులను చూడవచ్చును. అలాగే భూత వర్తమాన భవిష్యత్తులో జరగబోయే అన్ని రకాల సంఘటనలు చూడవచ్చును. వామ్మో! ఇదేదో చాలా బాగుంది. అదేదో నాకు తెలిస్తే ఈ లోకాన్ని ఒక ఆట ఆడిపించవచ్చు కదా మరి ఉందని తెరుచుకొని ఇందాకటి నైవేద్యం సంఘటన ద్వారా తెలిసినది. మరి అది శాశ్వతంగా  తెరుచుకోవాలంటే ఏమి చేయాలి? అలాగే తెరుచుకుని ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది అని నాకే వచ్చిన అన్ని సందేహాలు ఆయన ముందు పెట్టాను.

అప్పుడు ఆయన మాతో వెంటనే “నాయనలారా! రామకృష్ణ పరమహంస, నామదేవుడు మీరాబాయి సక్కుబాయి, అక్కమహాదేవి ఇలా ఎందరో యోగిని యోగులు తమ సాధన శక్తి స్థాయిలను పెంచుకుని వారి త్రినేత్రాలను వారి సద్గురువు ద్వారా, దీక్ష గురువుల చేత శాశ్వతంగా తెరిపించి కొనే స్థాయికి చేరుకున్నారు. శ్రీ కృష్ణునికి సాందీపముని, శ్రీరాముడికి వశిష్ఠుడు, షిరిడి సాయి బాబా వారికి వెంకుసా ,నామ దేవుడికి విఠోబా సద్గురువుగా వచ్చి వారి శక్తి పాత సిద్ది ద్వారా వీరి మనోనేత్రమైన త్రినేత్రం తెరిపించడం జరిగినది. దాంతో వాళ్లు తమ ఇష్టదైవాలను సజీవమూర్తిగా, వారి ఆత్మ శక్తి  స్వరూపాలను చూడటం, మాట్లాడటం వారికి తినిపించడం వారు ఆనందపడటం ఇలాంటివి అతి స్పష్టంగా అతి దగ్గరగా చూడడం జరిగినది.  ఒక విషయం గమనించారా! క్రిందటి సంవత్సరం మీరిద్దరూ సజీవ హనుమాన్ విగ్రహమూర్తి యొక్క  హృదయ స్పందన, నాడి కొట్టుకోవడమే గమనించారు కానీ ఆయన ఆత్మ శక్తి  సూక్ష్మ శరీరమును చూడలేకపోయారు. ఆ విగ్రహంలో తాంత్రిక సాధకుడు యాగశాల లో చేసిన హోమాలు క్రతువుల ద్వారా వచ్చిన హోమ శక్తిని పిండ బలిహరణ ప్రక్రియ ద్వారా ఆత్మశక్తిగా మార్చడం జరిగినది. దానిని ఒక పూర్ణ కలశం లోనికి తీసుకుని రాతి విగ్రహం పెట్టి దానిని సజీవమూర్తిగా జీవకళ తెప్పించటం జరిగింది. కానీ మీరు ఆ విగ్రహంయొక్క నాడి కొట్టుకోవడమే గమనించారు గాని ఆనాటికి గల కారణమైన సూక్ష్మశరీరమును చూడలేకపోయారు చూసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. మీరు తిరిగి ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు కారు. సన్యాసులుగా మారి దివ్య క్షేత్రం వెళ్లి యోగ సాధన చేసుకునేవారు అని చెప్పి ఈ విషయాలు మాకు అర్థమయ్యే దాక ఆయన మాట్లాడటం ఆపివేసి కొంతసేపు కళ్లుమూసుకుని నడుం వాల్చినారు. 

ఇంతలో మాకు మరికొన్ని సందేహాలు కలిగాయి.అంటే ఇప్పటి దాకా మాకు వచ్చిన తొలి గురువులు కేవలం మంత్ర గురువులు అన్నమాట.  మంత్ర సిద్ధి కలిగించడానికి ఆయా దైవ మంత్రములను ఉపదేశం చేసినారు. ఇప్పుడు ఈ త్రినేత్రం తెరవాలంటే దీక్ష గురువు అంటే సద్గురువు కావాలి. అసలు మంత్ర గురువు వెతకడానికి నానా తిప్పలు పడ్డాము. మరి కొత్తగా దీక్ష గురువు రావాలి అంటారు. ఆయనకి ఆయన మన సాధన స్థాయి  అంత స్థితికి వచ్చేసరికి వారు ఎక్కడ ఉన్నారో తెలియటం జరుగుతుంది లేదా వారే మన దగ్గరికి రావడం జరుగుతుంది లేదా వారే మనల్ని తమ దగ్గరికి రప్పించుకునే అవకాశం ఉండొచ్చు.ఎలా అంటే శ్రీకృష్ణుడు ,శ్రీరాముడు వారి సద్గురువులను ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి వారికి గురు సేవ చేసి తమ త్రినేత్రం తెరిపించుకోవడం జరిగింది. ఇక రామకృష్ణ పరమహంస వారి సద్గురువులు వారి దగ్గరికి రావడం జరిగినది. ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రియ శిష్యుని కోసం ఎదురు చూస్తూ సిద్దయ్యకి తన ఆత్మజ్యోతి చూపించి తన దగ్గరికి స్వయంగా రప్పించుకోవడం జరిగినది. అన్నమయ్యకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సద్గురువుగా వచ్చినాడు. అలాగే భక్త పోతనకు త్యాగయ్యకు వారి ఇష్టదైవాలు మారువేషంలో స్వయంగా వచ్చి వారే శక్తి పాతం చేసినట్లుగా వారి వారి  చరిత్రలలో సూక్ష్మంగా మనకు కనబడుతుంది. అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన పనిలేదు అని, మనము ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది. ఆ స్థాయిలో మన సాధన శక్తి ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఆ స్థాయికి మన సాధన శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని నేను మధనపడుతుండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్ర లేచి “నాయనలారా ఏమీ లేదు.  మీ సాధన స్థాయి గూర్చి బాల త్రిపుర సుందరి అంశ అయిన బాలాదేవి మీకు కనపడి చెబుతుంది”. అన్ని వివరంగా చెబుతాను అని సాయంత్రం  అనుష్టానం వేళ అవుతుందని ఆయన వెళ్లి పోవడం జరిగినది. దాంతో మాకు ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్లిపోవడం మాలో అసహనం, విసుగు, కోపం వచ్చినాయి! కాని ఏమి చేయగలం! అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురుచూడక తప్పదు. అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి. ఉంటాను. మాతో ముందుకు ప్రయాణించండి.

శుభం భూయాత్

పరమహంస పవనానంద

************************


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. vigrahaaradhaana, vishwaaraadhana chaala bagundi, vammo!!! 108vigrahaala ? 2:30 ki lesthe 9:30 aa nenithe madhyalo kunukulu theesedaanni... ennitlo edi unchi edi theeyalo ela decide chesaru andi...ika vigrhalu nivaedyam ela sweekaristhayi ani chaala clear ga chupincharu

    రిప్లయితొలగించండి