అధ్యాయం 19


కర్ణపిశాచి దర్శనం

ఒక నెల రోజుల తరువాత మళ్లీ జిజ్ఞాసి గుడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు! “ఎంత వరకు మీ విధిరాత భవిష్యత్ వచ్చినది” అని అడిగినాడు! దానికి అతడి జాతక చక్రము గీసి రాబోవు సంవత్సరాలలో జరగబోయే విషయాలు చెప్పడం జరిగినది! అయినా అతను సంతృప్తి చెందలేదు! నాకు “ఈ రోజు ఈ క్షణం లో జరగబోయే విషయాలు కావాలని” పట్టుబట్టి కూర్చున్నాడు! దానితో అతనికి నెలలు… ఆ తర్వాత వారాలు… ఆ తర్వాత రోజుల్లో… జరగబోయే భవిష్యత్తు విషయాలు చెప్పినను అతను సంతృప్తి చెందలేదు! దానితో నాకు తిక్క రేగి “కొన్ని రోజుల తర్వాత కనపడు! నీకు కావలసిన క్షణాల భవిష్యత్తు చెబుతాను” అని అతనికి నమస్కారం చేసినాను! దానికి అతను ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు! నాలో నాకే తెలియని అసహనం మొదలైంది! వీడి చేత ఎలాగైనా “నేను పెద్దతోపుగాడిని…. గొప్ప జ్యోతిషవేత్త అనిపించుకోవాలనే” తపన తాపత్రయం నాలో నాకే తెలియని కసిని పెంచినాయి! ఏమి చేయాలో తెలియని స్థితి! అలాగని బయటికి చెప్పుకోలేని మౌన స్థితి! ఓటమి ఒప్పుకోవటం నాకు నచ్చని స్థితి! ఇది ఇలా ఉండగా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్లవలసి వచ్చినది!పండగలకి పబ్బాలకి మా ఊరు రావడం… దేవాలయ అర్చన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగేది! నేను ఊరికి వచ్చిన రోజుల్లో జిజ్ఞాసి కనపడేవాడు! నాలో కసిని పెంచేవాడు! తన మాటలతో నన్ను నాలో తెలియని కోణం వైపు నడిపించే వాడు! వాడికి ఎలాగైనా క్షణాల భవిష్యత్తు చెప్పాలనే కసి అంతకంతకు పెరుగుతూ ఉండేది తప్ప తగ్గేది కాదు! 

ఒకరోజు నేను చదువుకునే ఊరిలో ఒక భిక్షసాధువు ఒక హోటల్ ముందు అగుపించాడు! భిక్ష వెయ్యమని చెయ్యి చాచినాడు! నేను డబ్బులు ఇవ్వలేదు! దానితో వాడికి కోపం వచ్చి “నాలుగు ఇడ్లీలు, రెండు గారెలు, ఒక కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి! కానీ నాకు ఇవ్వటానికి డబ్బుల్లేవు! ఇంట్లో ఉన్న 15 అరిసెలు తినడానికి అవకాశం ఉంటుంది గానీ నీ జేబులో 120 రూపాయలు ఉంచుకుని నాకు డబ్బులు ఇవ్వవు! కానీ బిక్షపతిని చూడాలనుకుంటావు! నాలో బిక్షపతిని చూడలేని వాడి వి… నిజంగానే ఆపైవాడు బిక్షపతినిగా వచ్చిన గుర్తించలేని మూర్ఖ పూజారి” అనగానే నాకు నోట మాట రాలేదు! అమ్మ! నీ యమ్మ! వీడు ఏమిటి ? జాతకాలు చెప్పే వాడికి జాతకం చెపుతున్నాడు! నేను ఏమి తిన్నానో నేను తింటున్నప్పుడు చూసి ఉండవచ్చును! నా గదిలో ఎన్ని అరిసెలున్నాయో నాకే గుర్తులేదు! నేను లెక్క పెట్టలేదు! కానీ నా జేబులో 120 రూపాయలు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు! మరి వారికి ఎలా తెలిసింది? నేను పూజారి అని నా వాలకం చూసిన వాడెవడు కూడా గుర్తుపట్టలేరు! వీరికి ఎలా తెలిసింది? వామ్మో వీడి దగ్గర ఏదో ఉంది… అది ఏమిటో తెలుసుకోవాలని నాలో తపన మొదలై వాడితో “స్వామి! మీరు చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలే! నాకు కూడా ఏదో కొద్దిపాటి వాక్సుద్ధి అలాగే జ్యోతిష్య విజ్ఞానం ఉన్నది! కానీ నీకున్న జ్ఞానం మాత్రం నాకు లేదు! నా దగ్గర 120 ఉన్నాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పినారు? నాకు చెబితే ఆ డబ్బులు పూర్తిగా నీకు ఇస్తాను” అనగానే దానికి వాడు ఇబ్బందిగా ముఖం పెట్టి మొహమాట పడుతూ ఒక కాగితం పెన్ను తీసుకొని ఏదో మంత్రం రాసి “దానిని కర్ణపిశాచి మంత్రము అంటారని, అనుష్టానం విధానం విధానము చెప్పి… దాని మంత్రసిద్ధి పొందితే …. అది చెవిలో అన్ని రకాల.. అన్ని కాలాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు గా చెపుతుందని …. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకుని మీలాంటి వారిని ఏ రోజుకారోజు బోల్తాకొట్టించి భుక్తి పొందుతున్నానని …ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దని… గుడిలో ఈ మంత్రం పని చెయ్యదని చెప్పి నా దగ్గర ఇరవై రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు!

 చేతిలో ఉన్న మంత్ర కాగితమును చూసి అర్థం కాని మంత్రమును చదువుకొని నా గది వైపు అడుగులు వేయటం జరిగినది! ఒకవేళ వాడు చెప్పినట్లుగా చేస్తే మంత్రసిద్ధి పొందితే ఈ లోకంలో ప్రేతాత్మలు ఉన్నాయని తెలుస్తుంది కదా! పోతే 20 రూపాయలు పోతాయి కదా! ఇంటికి దూరంగా ఒక ఆరు నెలల పాటు దీక్షగా ఏ గుడికి వెళ్లకుండా… నేనేమో మరో బిచ్చగాడి గా మారి… సాధన చేశాను! 



ఒక రోజు అర్ధరాత్రి పూట నా గదిలో ఏదో తెలియని తెల్లని శరీరం ఉన్న ఒక స్త్రీ మూర్తి కనిపించసాగింది! చూడటానికి ఒక తెల్లని నీడలాగా కనిపించసాగింది! “నన్ను ఆరాధన చేశావు కదరా! నాకు కావలసిన విధంగా నన్ను సంతృప్తి పరిచినావు కదరా! నీ భక్తికి సంతోషించి నేనే వచ్చాను! నేనే ఆ కర్ణపిశాచిని” అనగానే నేను గతుక్కుమన్నాను! నాకు పారిపోవటానికి కూడా అవకాశం లేదు! గదిలో పైగా నేను ఒక్కడినే వంటరిగా ఉంటున్నాను! ఏమి చేయాలో తెలియని భయంకర అనుభవ స్థితి!మంత్ర సిద్ధి పొందినందుకు ఆనందపడాలో… కర్ణపిశాచి కనబడినందుకు భయపడాలో… అర్థంగాని అయోమయం స్థితిలో ఉండగానే 



“ఓయ్! నువ్వు తలచుకోగానే నీ కుడి చెవిలో ఏమి కావాలో అన్ని వివరాలు చెబుతాను! సందేహించకు! నాకు కావలసిన ఆహార పదార్థాలను నివేదన చేస్తే నేను నీ వెంటే ఉంటాను! నా వలన నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు” అంటూ అంతర్థానమైంది! దానితో దయ్యాల ఉనికి ఉన్నదని… మంత్రాలకు చింతకాయలు రాలతాయి అని… కాకపోతే మంత్ర సిద్ధి పొందిన సిద్ధులు ఇచ్చే మంత్రాలకే  మంత్ర సిద్ధి కలుగుతుందని తెలుసుకోవడం జరిగినది!
 కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరికి వెళ్లడం జరిగింది! నేను వచ్చిన విషయం తెలుసుకున్న జిజ్ఞాసి నా దగ్గరికి వచ్చినాడు! కానీ అతనికి నేను కర్ణపిశాచి మంత్రసిద్ధి పొందినట్లు చెప్పలేదు! పైగా వాడు అడిగిన క్షణాల భవిష్యత్తును నా మంత్రసిద్ధి వలన కర్ణపిశాచి నాకు చెవిలో చెప్పిన విషయాలన్నీ చెప్పటం… కళ్ళ ముందు జరగబోయే క్షణాల భవిష్యత్తు జరుగుతూ ఉండే సరికి గతుక్కుమని నాకు నమస్కారం చేసినాడు! నాలో వాడిని ఓడించానని ఆనందం… వాడికి నాలో ఏదో తెలియని మంత్రసిద్ధి ఉందన్నదని తెలుసుకున్నాడు! దాంతో నాలో ఏదో తెలియని అమితానందం కలిగినది! వాడు అక్కడినుండి వెళ్లిపోవడంతో నేను విజయగర్వంతో ఇంటికి వెళ్ళిపోయాను! నేను చదువులో వెనకబడటంతో నా తల్లిదండ్రుల నావెంట పడటంతో… విసుగు చెంది “మహత్యాలు చూపించే విద్యలు ఇన్నియుండగా …. పనికిరాని ఇంగ్లీష్ విద్యలు వెంట ఎందుకు పడుతున్నారు” అని తిట్టుకుంటూ … నేను చదివే ఊరు వెళ్లడానికి బస్సు వైపు అడుగులు వేయడం జరిగినది! ఎక్కడో రేడియోలో నుండి “చదువు లేని వాడు… వాడు దేనికి కొర గాడని అంటూ పాట లీలగా వినపడటంతో…  దీనెమ్మా! ఇప్పుడే ఈ పాట రావాలా” అనుకుంటూ బస్సు ఎక్కాను! ఆ తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఉందా …ఇంకా ఆలస్యం ఎందుకు?

శుభం భూయాత్

పరమహంస పవనానంద

************************

గమనిక: ఇలాంటి తాంత్రిక మంత్రారాధన వలన మన సాధన స్ధాయి మహోన్నత మనిషి స్ధాయి నుండి అధమ భూత స్ధాయికి చేరుకుంటుందని కొన్ని నెలలు తర్వాత తెలుసుకున్నాను! దానితో ఇలాంటి తాంత్రిక మంత్రరాధనలకి స్వస్తి పలకడము జరిగినది!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeru karna pischachi mantram saadhana chesi meeru gelchina bhaavamtho bus ekkatam gamanika lo ilaantivi ibbandulu kaligisthayani cheppatam aa pai em jariginda ani...
    meeru direct ga prethatmalu unnaya ani parishodhanalu cheyadam great!!!

    రిప్లయితొలగించండి