సూక్ష్మ శరీరం
సాధన కుటుంబం అంతా కూడా సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి బస్సులో బయలుదేరడం జరిగింది. ఇంతలో పిల్లలు కాస్త అమ్మ! సోమనాథ్ ఆలయ విశేషాలు చెప్పవా? అని అడిగేసరికి అప్పటికే శివనందిని ఇంటర్నెట్లో ఈ ఆలయ విశేషాలు చదివి ఉండటం వలన….వాటన్నింటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ… ఇక్కడ ఈ స్థల పురాణం ప్రకారం, దక్షుని 27 మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకోవడం జరిగింది. అందులో రోహిణి అనే అమ్మాయి మీద చంద్రుడు ఎక్కువగా ప్రేమ, మమకారాలు చూపించటం….. మిగతా వాళ్ల మీద ప్రేమ చూపించకపోవడంతో మిగతా 26 మంది ఆడపిల్లలు కాస్త తన తండ్రి అయిన దక్షుని దగ్గరికి వెళ్లి…. ప్రేమలో పక్షపాతం చూపిస్తున్నాడు అని చెప్పేసరికి…. దక్షుడు కాస్త కోపోద్రిక్తుడై చంద్రుడిని శాశ్వత క్షయవ్యాధితో బాధపడమని శాపం ఇవ్వటంతో…. చంద్రుడు కాస్త బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఆ దోష పరిహారం కోసం ఏమి చేయాలి అని అడగగానే…. భూలోకంలో ప్రభాసతీర్థం దగ్గర ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసి దానికి పూజాదికాలు చేసుకోమని చెప్పటం జరిగింది. దానితో చంద్రుడు కాస్త సోమనాథ్ శివలింగమును ప్రతిష్ట చేసి దానికి నిత్యాదికాలు, పూజలు చేయడం జరిగింది. సోమనాథుడు అంటే చంద్రుడు అన్నమాట! చంద్రుడు చేత ప్రతిష్టించబడిన శివలింగం కాబట్టి ఇది సోమనాథ శివలింగం. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా…. నాకున్న ఈ క్షయ వ్యాధిని పూర్తిగా నివారణ చేయమని అడుగగా…. అది పూర్తిగా నివారణ అవటం జరగదు. 15 రోజులు తగ్గుముఖం పడుతుంది. 15 రోజులు హెచ్చు అవుతుంది. ఎందుకంటే స్త్రీమూర్తుల మనోవేదనకి కారణం అయ్యావు కాబట్టి…. దానిని నేను ఏమీ చేయలేను. అందరూ భార్యలను కూడా సమానంగా చూడు. అప్పుడు 15 రోజుల పాటు తగ్గుతుంది…. మళ్ళీ దక్షుడు ఇచ్చిన ఈ శాపం కారణంగా వాళ్ళ మనోవేదన కారణంగా మళ్ళీ 15 రోజులపాటు నీకు రోగమును హెచ్చు అవుతుంది. అలా చేస్తే కానీ నీకు రోగ నివారణ అవదు అని చెప్పడంతో…. సరే స్వామి! అలాగే నా కోరికమేర మీరు శివలింగంగా ఈ ప్రదేశంలో శాశ్వతంగా ఉండాలి అనేసరికి…. నువ్వు ప్రతిష్టించిన శివలింగం కాబట్టి ఈ క్షేత్రం నీ పేరు మీదగా సోమనాధ లింగంగా నేను శాశ్వతంగా ఉండిపోతాను. అలాగే ఎవరైతే నన్ను ఇక్కడ ఆరాధన చేస్తారో….వారికి ఉన్న దోషాలు, పరిహారాలు అన్ని తీసేసి వారికి స్వర్గలోక ప్రాప్తి కూడా అనుగ్రహిస్తానని…. శివుడు వరాలు ఇవ్వటంతో… చంద్రుడు సంతోషించాడు. శివుడు అంతర్దానం అయిపోయాడు. అప్పటి నుండి చంద్రుడు ఈ శివలింగం ఆరాధన చేస్తున్నప్పటికీ ….15 రోజులు క్షయం అయిపోవడం… మళ్ళీ 15 రోజులు పూర్ణం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే మనకి అమావాస్య, పౌర్ణమి 15 చంద్రకళలు అన్నమాట! అమావాస్య రోజుకు 15 రోజులు చంద్రుడు క్షీణం అవుతాడు. అంటే క్షయ వ్యాధి రోగంతో క్షయమవడం ఆ తర్వాత 15 రోజులకు పౌర్ణమి కాలంలో క్షయ వ్యాధి తగ్గి పూర్ణచంద్రుడిగా మారటం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఆలయాన్ని చంద్రుడు మొదట బంగారంతో నిర్మిస్తే….ఆ తరువాత రావణాసురుడు వెండితో పునః నిర్మాణం చేయడం జరిగింది అని….. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కలతో పునర్నిర్మానం చేశాడని….ఆ తరువాత భీముడు రాతితో ఆ ఆలయ నిర్మాణం చేశాడని…. స్థల పురాణం చెబుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం రాతితో నిర్మితమై ఉంది కానీ, మనకి ఈ క్షేత్రంలో రెండు రకాల సోమనాథ్ ఆలయాలు కనపడతాయి. ఒక సోమనాథ్ ఆలయం 1950లో సర్దార్ వల్లభాయి ప్రతిష్ట చేసిన సోమనాథ్ శివలింగం కనపడితే …….రెండోది అహల్యబాయి ప్రతిష్ట చేసిన పురాతన సోమనాథ్ ఆలయం మనకి రెండో ఆలయంగా కనబడుతుంది.
ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం అహల్యా బాయి ప్రతిష్ట చేసిన శివలింగమే నిజమైన సోమనాథ శివలింగం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సోమనాధ శివలింగం అనేది ఒక శమంతక మణి అని చెబుతారు. ఇది బంగారం పూర్వకాలంలో ఇచ్చేది అని…. బంగారంతోనే ఈ దేవాలయాన్ని చంద్రుడు నిర్మితం చేశాడని చెప్పేసి స్థలపురాణం చెబుతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుని నిర్యాణం అంతా కూడా ఈ సోమనాథ్ ఆలయ పరిసరాలలోనే జరిగింది. గాంధారి శాపం వలన శ్రీకృష్ణుడు తన యాదవ వంశమును, తన ద్వారకానగరం మునిగిపోతుంది అని తెలుసుకొని…. దానిని చూడలేక ఇక్కడ సోమనాథ్ ఆలయ పరిసరాలలోకి వచ్చినట్టుగా…..అక్కడ ఉన్న అడవులలో ఆయన సేదతీరుతూ ఉండగా….. ఒక విలుకాడు ఈయన కాలి బొటనవేలిని చూసి ఏదో జంతువు అనుకొని విషం పూసిన బాణం కాలి బొటనవేలుకు తగలడంతో….విషం నెమ్మదిగా తన శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ….. ఆయన కొంత దూరం ప్రయాణం చేసి ప్రాణం విడిచినట్టుగా….. ఇంకొంత దూరంలో అర్జునుడు ఆయన శరీరాన్ని పూడ్చిపెట్టినట్లుగా స్థల పురాణం చెబుతుంది. మనకి ఈ ఆలయ పరిసరాలలోనికి వెళితే ఎక్కడ శ్రీకృష్ణునికి బాణం తగిలిందో…… ఆ బాణం తగిలిన ప్రాంతం నుంచి ఎంత దూరం వెళ్ళాడో….. ఆయన శరీరం ఎక్కడ సమాధి చేశారో మనం చూడవచ్చును అని చెప్పి పిల్లలకి చెబుతూ ఉండేసరికి….అయితే ఆ ప్రాంతాలన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని చెప్పమ్మా! మేము కూడా అవన్నీ చూస్తాము అని చెప్పేసరికి….. అలాగే ఈ ఆలయంలో ఒక బాణస్తంభం ఉంటుంది. ఈ బాణ స్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటంటే….. 1000 సంవత్సరాల క్రితమే దక్షిణ ధ్రువం వరకు అనగా అంటార్కిటికా ప్రాంతం వరకు మనం సముద్రయానం చేస్తే భూభాగం కనిపించదు అని ఈ స్తంభం ద్వారా మన పూర్విక మహర్షులు తెలియజేయడం జరిగింది. ఎలాంటి యంత్ర సహాయం లేకుండానే మనవాళ్లు వాళ్ళకి ఉన్న పరిజ్ఞానంతో ఖగోళ, భౌగోళిక, గణిత శాస్త్రాలలో ఉన్న పరిజ్ఞానం చెప్పకనే చెబుతుంది. ఋగ్వేదంలో ఉన్న సంస్కృత శ్లోకమును అనగా దక్షిణ ధ్రువం వైపుకు మనం ప్రయాణిస్తే అంటార్కిటికా ప్రాంతం వరకు భూభాగం ఉండదు అని వాళ్ళు ఒక సంస్కృత శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ బాణ స్తంభం కింద ఆ శ్లోకం ఇప్పటికీ చెక్కబడి ఉన్నది అంటే….. మన పూర్వీకుల జ్ఞానం ఎంత అమోఘమైనదో చెప్పకనే చెప్పడం జరిగింది అనేసరికి…..ఆ బాణ స్తంభం కూడా చూపించాలమ్మ! మర్చిపోకుండా అని పిల్లలు అనేసరికి ఖచ్చితంగా చూపిస్తాను. మన పూర్వీకుల జ్ఞానం ఏంటి అనేది లోకానికి తెలియాలి కదా! అనేసరికి…..అలాగే ఇక్కడ పరశురాముడు కాస్త తను 21 మార్లు భూమి మీద ఉన్న క్షత్రియులను చంపడంతో ఆ దోషపరిహారార్థం ఇక్కడ ఒక శివలింగమును ప్రతిష్ట చేసి, ఆయన ధ్యానం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాడు అని….. ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ పరశురాముని దేవాలయం కూడా చూడవచ్చు. ఇక్కడ మనకి ఈ ఆలయ పరిసరాలలో… దాదాపుగా 10 ప్రదేశాలు చూసే అవకాశాలు ఉంటాయి అనేసరికి….అయితే మనం గుడికి వెళ్ళిన తరువాత యధావిధిగా అన్ని ఆలయాలను ఖచ్చితంగా చూడాలి. అలాగే ఆ బాణలింగ స్తంభం కూడా చూడాలి అని పిల్లలు అనేసరికి….. సరే చూద్దాం ఈలోగా మీరు విశ్రాంతి తీసుకోండి అనేసరికి….. పిల్లలు కూడా విశ్రాంతిలో ఉన్నారు. అప్పటికే రుద్రస్వామి, మహాదేవి కూడా నిద్రలోకి జారుకున్నారు అని చెప్పేసి…. శివ నందిని కూడా నిద్రలోకి జారుకోవడం మొదలుపెట్టింది.
సాధనా కుటుంబం సోమనాథ్ క్షేత్రానికి చేరుకోవడానికి మూడు రోజులు బస్సుయాత్ర చేయాల్సి వచ్చింది. ఆ తరువాత సోమనాథ్ క్షేత్రానికి చేరుకొని…. దగ్గరలో ఉన్న హోటల్లో స్నానాదికాలు చేసుకొని…. టిఫిన్లు కానించుకొని….సోమనాథ్ ఆలయ దర్శనానికి అందరూ బయలుదేరడం జరిగింది. అక్కడే ఉన్న ప్రభాసతీర్థంలో స్నానాధికాలు చేసుకొని తిరిగి సోమనాథ దేవాలయానికి వెళ్లేసరికి అనగా సర్దార్ వల్లభాయి ప్రతిష్ట చేసిన సోమనాథ్ గుడికి వీళ్ళు వెళ్లడం జరిగింది. పెద్దగా కనిపిస్తున్న సోమనాథ శివలింగాన్ని దర్శనం చేసుకుని గంగా నీళ్ళతో అభిషేకాలు పూజాదికాలు వీళ్ళందరూ ఒక్కొక్కరిగా చేసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ ఆలయ పరిసరాల్లోనే ఎవరికి వారు కూర్చొని ధ్యానం చేసుకున్నారు. శివ నందిని కూడా జలముద్రతో స్వాధీష్ఠాన చక్ర ధ్యానంలో అలాగే ధ్యానం చేస్తూ ఉండిపోయింది. కానీ, ధ్యానంలో ఎలాంటి ధ్యాన దృశ్యము…. ధ్యానానుభవాలు కానీ కలగలేదు. సరే అని అలాగే రెండు మూడు గంటలసేపు ధ్యానంలో ఉండిపోయింది. ఇలా ఒక వారం రోజులు ఇదే ధ్యానస్థితిలో శివనందిని ఉండిపోయింది. కానీ ఎలాంటి ధ్యానానుభవాలు కనిపించకపోయేసరికి ……ఏదో తెలియని ఆవేదన …తను తప్పు చేస్తుందా! ధ్యానంలో తెలియకుండా తప్పు జరుగుతుందా! లేదా ధ్యానం మీద మనసు పెట్టలేక పోతుందా! అని ఎక్కడో తప్పు జరుగుతుందని…. మనోవేదనకి గురి అవ్వడం జరిగింది. కానీ ఎలాంటి తప్పు జరగలేదు…. మనసు ఏకాగ్రతతో ధ్యానం మీద ధ్యాసతోనే ఉంది అని అనుకోసాగింది. కానీ తనకి ఎలాంటి స్థితిగతులు కానీ…. మార్పులు కానీ రాకపోయేసరికి…. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. సరేలే కాలానికే వదిలేద్దాం అనుకొని ఇంకొక వారం రోజుల పాటు తను ధ్యానం ఇలాగే చేస్తున్నప్పటికీ…. ఫలితాలు కనిపించలేదు. రాను రాను ధ్యానంలో తనకి తెలియని ఆవేదన,ఆవేశము, కోపము… ఎవరికి ఏమీ చెప్పుకోలేము….ఒంటరితనంగా ఉన్నానని…..ఏకాంతంగా ఉన్నానని….తనని ఎవరూ పట్టించుకోవడంలేదని…. ఏవేవో రకరకాలుగా మనసు ఆవేదనకి గురి అవ్వడంతో…. కొత్తగా మర్మాంగముల వెనుక వైపు విపరీతమైన నొప్పి రావడం….. సరే వాతావరణ పరిస్థితుల వలన వేడి చేయడం వలన…. తనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సర్ది చెప్పుకునేది. మహాదేవికి గాని, రుద్ర స్వామికి కానీ ఏది చెప్పేదికాదు. దాదాపు ఈ క్షేత్రానికి వచ్చి 15 రోజులు అయినప్పటికీ… ఎటువంటి ఫలితము కనిపించలేదు. ఎటువంటి ధ్యాన దృశ్యము, ధ్యాన అనుభవాలు కలగలేదు. సరేలే అని …శివుడి మీద భారం వేసి తన ధ్యానం తాను కొనసాగిస్తూ వచ్చింది. ఒకపక్క తెలియని ఆవేదన, మరొకపక్క ఏదో తెలుసుకోవాలనే తపన తాపత్రయం…. ఏదైనా కనపడుతుందేమో అని ఆశ, ఇలా అర్థం అయ్యి అర్థం కాని అయోమయ స్థితిలో తన సాధన కొనసాగుతూనే ఉన్నది. ఇలా ఉండగా ఒక రోజు ఆమెకి ధ్యానదృశ్యంగా పంచలోహ శివలింగం స్వాదిష్టాన చక్రం మధ్య భాగంలో ఉన్నట్టుగా పదే పదే కనిపించేది. ఈ శివలింగం ఇప్పుడు ఇక్కడి నుండి తీసుకోవాలా! ఇప్పుడు అది ఎక్కడ ఉందో? అనుకునేసరికి… ధ్యాన భంగం అయ్యేది. శివలింగం కనపడేది కానీ, ఆ శివలింగం ఏ ప్రాంతంలో ఉన్నదో కనబడేది కాదు. పోనీ తనకు వచ్చిన ప్రాప్తిసిద్ధి ఉపయోగించి తనకి కనిపించే శివలింగమును సంపాదించుకోవచ్చు అని ఆలోచన వచ్చింది. కానీ, సిద్దులను ఉపయోగించుకోవడానికి అలవాటు పడితే అవసరంగా మారతాయి. ఆ తర్వాత స్వార్థానికి వాడుకోవడం జరుగుతుంది. దీని వలన సిద్దుల మాయలో పడే ప్రమాదం ఉంది అని రుద్ర స్వామి ముందే హెచ్చరించడంతో…. దానికి ఎప్పుడు రావాలో…. ఎలా రావాలో… అలా దైవీక వస్తువు వస్తుంది. అంతవరకు మనం ఓపిగ్గా, సహనంగా ఎదురు చూడక తప్పదు. ఈ క్షేత్రంలో పంచలోహ శివలింగం రావాలి అని జ్ఞాన స్ఫురణ అయినది కదా! దానికోసం ఎదురు చూడక తప్పదు. మూలధార చక్రం శరీర శుద్ధిలో ఉన్నప్పుడు ఘృష్ణేశ్వర క్షేత్రం నుంచి నల్లమట్టి శివలింగం ఎలా అయితే వచ్చిందో…. ఈ క్షేత్రం నుంచి పంచలోహ శివలింగం రావాలి కాబోలు అని అనుకొని…. ఈ లింగం గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి అవునమ్మా! సూక్ష్మ శరీరం జాగృతి, శుద్ధి , ఆధీనం అయినప్పుడే…. ఈ పంచలోహ శివలింగం ఎక్కడ ఉంది… అనేది తెలుస్తుంది. దానికి కాలమే సమాధానం చెప్పాలి. నువ్వు ధ్యాననిష్ఠలో ఉండు. జలముద్రతో దీనిని జాగృతి చేసుకో! అనేసరికి… ఇలా మళ్లీ ఒక 15 రోజులు గడిచిపోయినాయి. అప్పుడు పిల్లలు కాస్త అమ్మ! మనం వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవి చూడలేదు. కనీసం ఈ చుట్టుపక్కల ప్రాంతాలైనా చూసి వద్దాం అనేసరికి…. పిల్లల ముచ్చట ఎందుకు కాదనాలి అని ఇక ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి వెళ్లడం జరిగింది. మొదట బాలక్ తీర్థమునకు వెళ్లడం జరిగింది. ఈ తీర్థం వద్ద ఒక శివాలయం చూడటం జరిగింది. ఈ తీర్థం ఒడ్డున అనేక శివలింగాలు ప్రతిష్ట జరిగి ఉండటం గమనించింది. పూర్వకాలంలో ఇక్కడ అడవులు ఉండేవని…. ఈ అడవులలోనే శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో ఇక్కడికి వచ్చి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విలుకాడి బాణం ఆయన కాలి బొటనవేలికి తగలడం జరిగింది అని చెప్పేసి… ఇక్కడ ఉన్న స్థల పురాణం చెప్పేసరికి పిల్లలు అవునా? అని అక్కడ ఉన్న శివలింగములు అవన్నీ తాకుతూ… ఆనందపడుతూ…. సముద్రపు అలలను చూస్తూ…. ఒక రకమైన తన్మయత్వంలోనికి అందరూ వెళ్లిపోవడం జరిగింది. తర్వాత ఈ ఆలయం లోపల శివనందిని చెప్పిన కథలోని దృశ్యాలు…. ప్రతిమలు ఉండటం గమనించి, అమ్మ ! నువ్వు చెప్పింది నిజమే చూసావా! ఇక్కడ కూడా నువ్వు చెప్పిన కథకి తగ్గట్టుగానే ప్రతిమలలో చెప్పడం జరిగింది. అదిగో…. శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నప్పుడు ఆయనకి బాణం తగిలినట్టుగా….. విలుకాడు బాణం వేస్తున్నట్టుగా…. తర్వాత ఆయన కొంత దూరం వెళ్లినట్టుగా…. బాణం తీసి ఆయన మరణించినట్టుగా…. చూడు ఎంత చక్కగా విగ్రహమూర్తుల ద్వారా చెప్పడం జరిగింది అనేసరికి …..అందరూ చూసుకుంటూ ఆనంద పడుతూ వచ్చారు. లోపలికి వెళ్ళిన తరువాత ఒక ప్రాంతంలో శ్రీకృష్ణుడు బాణం తగిలిన ప్రాంతం నుంచి ఇక్కడిదాకా రావడం జరిగింది. ఇక్కడ శరీరం విడవటం జరిగింది. దీనినే గోలక్ తీర్థం అని అంటారు అని చూపించేసరికి…అవునా! అని అక్కడ ఉన్న శ్రీకృష్ణుని శరీరం యొక్క సమాధిని పిల్లలు, పెద్దవాళ్లు అందరూ నమస్కారాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న గుహను చూపించి…. ఇది బలరాముడి గుహ, శ్రీకృష్ణుడు నిర్యాణానికి ముందే బలరాముడు ఈ గుహలోకి వెళ్లి జీవ సమాధి చెందడం జరిగింది. ఆయన ఆదిశేషుడు అంశ కావటంతో…. ఏడు తలల సర్పంగా మారి…. అంతర్గత గుహ ద్వారా పాతాళానికి వెళ్లిపోయారని స్థలపురాణం చెప్పడం జరిగింది. ఆ పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని పాదాలు ఉన్న మందిరం చూడటం జరిగింది. అక్కడ ఉన్న ఒక పెద్ద శివాలయం దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత త్రివేణి సంగమానికి వెళ్లడం జరిగింది. ఈ త్రివేణి సంగమంలో హిరాణ్, కపిల ,సరస్వతి అనే మూడు నదుల కలయిక వల్ల ఏర్పడింది అని చెప్పేసి… ఆ సంగమం నుంచి గుడిని చూస్తున్నప్పుడు వాళ్ళకి బాణ స్తంభం కనబడటం జరిగింది. సరే బాణ స్తంభం దగ్గరికి తర్వాత వెళదాం అని చెప్పేసి అనేసరికి అక్కడే ఉన్న పరశురాముని ఆలయము, రామాలయము దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత కామనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయానికి దగ్గరలో శంకరాచార్యుల వారు తపస్సు చేసిన గుహ ఉంటే ఆ గుహకి వెళ్లి శంకరాచార్యులు తపస్సు చేస్తున్నట్టుగా ఉన్న విగ్రహ మూర్తిని వీళ్ళందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు సోమనాథ్ బీచ్ కి వెళ్లి అక్కడ నుంచి ఆలయ దృశ్యాలను, సముద్రమును, సముద్రం ఒడ్డున ఆలయం కనపడే విధానం చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. ఆ తర్వాత సాయంకాలంలో కనిపించే సూర్యాస్తమయమును చూసి ఆనందపడ్డారు. ఉత్సాహపడ్డారు. ఆ తర్వాత బాణ స్తంభం దగ్గరికి వెళ్లి ఆ బాణ స్తంభం నిర్మాణమును చూసి బాలగణపతి కాస్త
బాల గణపతి:- అమ్మ! చూశావా..! పైన పెద్ద భూగోళం బొమ్మను చెక్కారు. ఆ భూగోళం లోపలి నుంచి ఒక బాణం వేశారు. ఇదేనా బాణ స్తంభం అంటే..?
బాల కుమారస్వామి:- ఇదిగో ఋగ్వేదంలో నువ్వు చెప్పిన సంస్కృత శ్లోకం ఉంది.
అని చెప్పేసి ఆ శ్లోకమును పెద్దగా చదవటం ప్రారంభించాడు. ఆ తర్వాత దాని అర్థం ఏమిటి? అన్నప్పుడు భూగోళం యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు సోమనాథ్ ఆలయం నుంచి దక్షిణ ధ్రువం వైపుకి అంటార్కిటికా ప్రాంతం వరకు బాణం కలుపుతున్నట్లుగా కనపడుతుంది అని బాలగణపతి అనేసరికి…. అదే ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. అంతవరకు సముద్రయాణంలో భూభాగం అడ్డం రాదు. నీళ్లు మాత్రమే కనపడతాయని….. ఆనాడు కొన్ని వందల సంవత్సరాలక్రితమే పూర్విక మహర్షులు చెప్పడం జరిగింది అనేసరికి….పిల్లలు ఇద్దరు కూడా ఉత్సాహ సంతోషంతో ఇంతటి జ్ఞానమును ఎలా పొందారో…. ఆనాటి మహర్షులు! అనుకుంటూ వీళ్ళ జ్ఞానానికి దాసోహం అని చెప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత సోమనాథ్ బీచ్ అలాగే మహాదేవపూర్ బీచ్ అక్కడ ఉన్న ఇతర ప్రదేశాలను, కోటలను దర్శనం చేసుకుని యధావిధిగా వీళ్ళందరూ కలిసి హోటల్ గదికి రావటం జరిగింది. ఆ రోజంతా ఇక విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అని తెలుసుకొని హృదయము మీద చేయి పెట్టుకొని స్వామి! స్వామి! అని పిలిచేసరికి విభూతి మఠంలో ధ్యాననిష్ఠలో ఉన్న శివ స్వామి కాస్త…
శివస్వామి:- ఏమిటి దేవి?
అని పలకరించేసరికి…..
శివ నందిని:- మిమ్మల్ని చూడాలనిపిస్తుంది… మీతో మాట్లాడాలని ఉంది. మీరు ఒక్కసారి రాగలరా?
(అనగానే…. సశరీరంతో క్షణకాలంలో తన పక్కన శివ స్వామి కనిపించేసరికి ….మొదట్లో ఆశ్చర్యం వేసేది. కానీ రాను రాను ఆశ్చర్యపోవటం మానేసి ఇదేదో సాధారణ విషయం లాగానే శివ నందిని తీసుకునేది. )
స్వామి నాకు అర్థం కాలేదు…. గొడలో నుంచి వాటిని మీరు దాటి రాగలుగుతున్నారు… ఇది ఎలా జరుగుతుంది ?
శివస్వామి:-సిద్ధి అంటేనే మన శరీరాన్ని అణువులు, పరమాణువులు, రేణువులు గానూ, దైవకణంగాను విభజన చేసే శక్తిని పొందడం. ఇప్పుడు ఉదాహరణకి గోడకి మధ్యలో అణువులు రేణువులు, పరమాణువులు ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనికి నా శరీరాన్ని పంపించటం జరుగుతుంది. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా నా శరీరాన్ని కూడా నేను విభజన చేసుకుంటూ మళ్లీ గోడని దాటి పదార్ధంగా మారడం జరుగుతుంది. (అని ఒక గోడలోనికి తన చేతిని పంపించడం మళ్ళీ తీయడం ప్రత్యక్షంగా చూపించేసరికి…)
శివ నందిని:- ఓహో! సిద్ధి అంటే ఇది అన్నమాట! శరీరాన్ని ఎంత తక్కువగా విభజన చేసుకోగలిగితే అంత సిద్ధిమంతుడు అవుతారు అన్నమాట! తద్వారా అంత సిద్ధ పురుషుడు అవుతారన్నమాట! ఇందులో విభజన చేయడమే మూలం అన్నమాట ! ఓహో ! సిద్ధి అంటే ఇది అని అర్థం అయింది స్వామి..
శివ స్వామి:-సరే దేవి..! నన్ను ఎందుకు చూడాలనుకున్నావు? ఎందుకు పిలవాలి అనుకున్నావు?
శివ నందిని:- మీరు ఘృశ్నేశ్వర క్షేత్రం తర్వాత కొల్హాపూర్ క్షేత్రంలో మిమ్మల్ని పలకరించడం, మాట్లాడడం జరగలేదు కదా! అందుకోసమే చూడాలనిపించింది…. అందుకే రమ్మన్నాను… ఏమనుకోవద్దు స్వామి! నేను మీ భుజం మీద తలపెట్టి పడుకుంటాను…మీసాలు గడ్డాలు పీకుతాను.
శివస్వామి:- సరే తల్లి నీ ఇష్టం
శివ నందిని:- మీరు ధ్యానంలోకి వెళ్లిపోవటానికి లేదు. మీరు కూడా నాకు సహకరించాలి… ఏదో శరీరం ఇచ్చేసాను! ఏదో చిన్న పిల్లల చేష్టల్లాగా చేసుకోవాలి అని మీరు అనకూడదు.
శివస్వామి:- ఇప్పుడు నీతో సరసాలాడాలి… అప్పుడు నీకు ధైర్యం వస్తుంది… నా వాడు, నా మనిషి నా పక్కనే ఉన్నాడు అని మనోధైర్యం వస్తుంది. అందులో తప్పేముంది?
అనేసరికి ఇక వీళ్లిద్దరూ అలా కబుర్లు చెప్పుకోవడం జరిగింది. ప్రేమే ఉంది….ప్రేమ, ఆప్యాయత ఉంది కానీ, వీళ్ళకి శరీర వాంఛ ,కామ భావం కానీ ఆ ఆలోచన గాని… ఆ స్పృహ గాని వీళ్ళకి లేదు అని వీళ్ళ యొక్క స్థితిగతులు గమనించిన మహాదేవి, రుద్రస్వామి గమనించి….. గ్రహించి….. మినుకుండిపోయారు.ఎప్పుడైనా వీళ్ళకి కామ వాంఛలు కలిగినప్పుడు…. వాటిని అదుపు చేయాలి… అణిచివేయాలి అనుకున్నారే కానీ వీళ్ళిద్దరికీ అలాంటి ఆలోచన లేదు. కేవలం ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే పంచుకుంటున్నారు. మోహ వ్యామోహాలలోకి వెళ్ళటం లేదు అని గ్రహించి…. ప్రశాంతంగా వీరిద్దరూ నిద్రపోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మాటల సరసాలలో పడి మానసిక ఆనందం పొందుతున్నారు.
ఈ మానసిక ఆనంద స్థితిలో ఉన్న శివ నందిని కాస్త శివ స్వామితో…
శివ నందిని:- స్వామి! నాకు సోమనాథ్ ఆలయం స్థలపురాణం ప్రకారంగా చూస్తే, ఇక్కడ ఉన్న సోమనాథ్ ఆలయంలోని శివలింగంలో…. పూర్వకాలంలో శమంతక మణి ఉండేదంట. నిజమేనా?
శివస్వామి:- అది నిజమో… అవునో కాదో నేను చెప్పలేను గాని, శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగింది ఈ ప్రాంతంలోనే. ఆయన నిర్యాణం చెందుతున్నప్పుడు…. అతి విలువైన శమంతక మణి ఈ శివలింగంలో పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే చంద్రుడి కాలంలో ఈ శివాలయం అంతా బంగారుమయంగా ఉండేది. రససిద్ది విద్యతో శమంతక మణి ప్రతిరోజు 8 మడుగుల బంగారం ఇచ్చేది కదా! ఆ బంగారంతో ఈయన చేసి ఉండవచ్చు. పైగా ముష్కరులు కొంతమంది ఏడు సార్లు దాడి చేశారని…. 17 సార్లు గజినీ మహమ్మద్ దాడి చేసి కొన్ని వేల మడుగులలో కొన్ని నెలల పాటు బంగారం తీసుకువెళ్లాడని చరిత్ర చెబుతుంది. ఇందులో సత్యాసత్యాలు ఎవరికీ తెలియదు. పైగా ఈ శమంతక మణి ఉన్న శివలింగం కూడా పూర్వం చంద్రుని కాలంలో భూమికి, ఆకాశానికి మధ్యలో నిలబడి ఉండేది. అది అయస్కాంత ఆకర్షణ శక్తి అని కొంతమంది…..గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఇది సాధారణమైన శివలింగం మాత్రం కాదు. అసాధారణమైన శివలింగం అని చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో తన దగ్గర ఉన్న శమంతక మణిని ఈ శివలింగంలో నిక్షిప్తం చేసి ఉండవచ్చు…. ఉండకపోవచ్చు… అంతెందుకు పరశురామ దేవాలయం కూడా ఈ ఆలయ పరిసరాలలోనే ఉంది. మీరు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు కదా! పరశురాముని దగ్గర కూడా పరుసవేది మణి ఉండేది. ఆ పరుసవేది మణిని ఉపయోగించి పాదరసం నుంచి బంగారంగా మార్చడం కూడా జరిగేది. కావాలంటే పూర్వకాలం ఇక్కడ ఉన్న స్తంభాలలో రెండు స్తంభాలు పాదరస స్తంభాలు ఉండేవని….. ఆ తర్వాత అన్నీ కూడా బంగారం స్తంభాలు ఉండేవని… చరిత్రకారులు గుర్తించడం జరిగింది. ఆ పాదరస స్తంభాలను బంగారపు స్తంభాలుగా మార్చడం జరిగింది.ఇక్కడ పరుసవేది మణి కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. శమంతక మణి లేదా పరుస వేది మణి ఏదో ఒక మణి మాత్రం ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ మణి ఎక్కడ ఉంది? ఏంటి? అనేది తెలుసుకునే కొద్దీ… ఆ మణి మాయలో పడిపోవడం జరుగుతుంది.
శివ నందిని:- ఇప్పుడు మనం ఆ మణి మీద ఆశలు పెట్టుకోవడం లేదు కదా స్వామి ! ఆ మణి ఉందా లేదా అనేది మనం ధ్యానంలో చూస్తే సరిపోతుంది కదా!
శివ స్వామి:- దేవి! నీ సాధన శక్తి సరిపోదు.
శివ నందిని:- మీ సాధన శక్తి సరిపోతుంది కదా! మీ సాధన శక్తిని నాకు అనుసంధానం చేయండి. అప్పుడు ఆ మణి ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు.
శివ స్వామి:- ఆ మణి గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత…..అది ఇచ్చే బంగారం మీద ఆశపడితే…. అది నీకు మణి బంధనం అవుతుంది. అంతెందుకు …..శివుడు కూడా రుద్రమణితో మణిబంధనం అయ్యాడు కదా! అది మనకి కైలాసంలో మణికైలాస పర్వతం మీద రుద్రమణి కనపడుతుంది. ఇప్పుడు అవసరమా మనకి…. కష్టాలు కొనితెచ్చుకోవడం?
శివ నందిని:- ఏమో! శివుడు మణి బంధనం అయ్యాడు కదా! ఆ మణితో బంధ విముక్తి పొందుతాడేమో! ఏ ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా మనకి సంబంధించిన చరిత్ర లేదు. ఈ ఒక సోమనాథ శివలింగంలోనే మనకి మణి కి సంబంధించిన ప్రస్తావన వస్తుంది. ఆ మణి ఏదో తెలుసుకొని మనం ఆయన్ని బంధ విముక్తి చేయచ్చు కదా!
శివస్వామి:- అంటే ఇప్పుడు సోమనాథ్ ఆలయంలో ఏ మణి ఉందో మనం తెలుసుకోవాలా? ఆ శివలింగంలో ఏ మణి ఉందో తెలుసుకోవాలా?
శివ నందిని:- అవును.
శివ స్వామి:- ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఏనాటి సోమనాథ్ శివలింగమో తెలియదు. చంద్రుడు ప్రతిష్టించిన సోమనాధ లింగం ఏనాడో భూస్థాపితం అయి ఉంటుంది. దాదాపు 7, 8 సార్లు పైన గుడి కట్టడం జరిగింది. చంద్రుడు ప్రతిష్టించిన సోమనాథ్ గుడిలోనే మణి ఉంటుంది.
శివ నందిని:- అది ఉందా లేదా అనేది కాల నిర్ణయం అండి …ప్రస్తుతం ఆ మణి ఎక్కడ ఉంది! ఎవరి ఆధీనంలో ఉంది! అసలు ఉందా లేదా? అనేది ధ్యానానుభవాల ద్వారా తెలుసుకుంటే సరిపోతుంది కదా!
శివస్వామి:- నువ్వు సోమనాథ్ దేవాలయానికి వెళ్లి ధ్యానంలో కూర్చో… విషయం మీకే అర్థమవుతుంది.ఇప్పుడు నేను చెప్పడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అనుభవం అయితే గాని నీకు తెలియదు.
శివ నందిని:- సరే స్వామి! నాకు పంచలోహ శివలింగం ఈ క్షేత్రంలో కనపడుతుంది.
శివస్వామి:- అది ఎక్కడ ఉంది… ఏంటి?. అనేది తెలుసుకో! ఈ క్షేత్ర పరిసరాలలోనే ఉన్నావు కదా! నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండు. కాలమే నీకు నిర్ణయం చేస్తుంది. నువ్వు అన్నట్లుగానే మణి బంధం నుంచి శివునికి విముక్తి కలిగించే యోగం ఉందేమోలే!
(అని చెప్పి అనేసరికి…. రుద్రస్వామి కదులుతున్నట్టుగా అనిపించేసరికి ….శివ నందిని కాస్త కంగారు పడిపోతూ….)
శివ నందిని:- రుద్రయ్య నిద్రలేస్తున్నట్టుగా ఉన్నాడు స్వామి! నేను భయపడాల్సిన పని లేదు కదా! నేనేమీ తప్పు చేయట్లేదు కదా!
శివ స్వామి:- ఆయనకి తెలియకుండా ఏమీ ఉండదు. నేను వచ్చిన విషయం…. నేను వెళ్లే విషయం…. మొత్తం ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మన గురించి తప్పుగా ఆలోచనలు ఎవరూ చేయరు…. ఒకవేళ మనం తప్పుడు ఆలోచనలు చేస్తున్నామంటే వాళ్ళు అదుపులో పెట్టే వాళ్లే గాని ….ఆపే వాళ్ళు కాదు.
శివ నందిని:- సరే మంచిది స్వామి! నన్ను ఎవరు అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు.
శివ స్వామి:- నిన్ను ఎవరు అనుమానించరు. అపార్థం చేసుకోరు….అవమానించరు. ఈ విషయంలో కంగారు ఏం లేదు. కానీ ఈ మణి బంధనం విషయంలో జాగ్రత్తగా ఉండు. అది నీకు బంధం అయితే బంధ విముక్తి చేసే శక్తి ఎవరికీ లేదు. శివుడు అంతటివాడే ఆ మణిబంధనానికి బందీ అయ్యాడు. జాగ్రత్త… సరే! కాలమే నిర్ణయం చేస్తుంది…మీ నా చేతుల్లో ఏముంది !
(అనుకుంటూ ఆయన క్షణకాలంలో అదృశ్యం అయ్యాడు. ఆ తర్వాత రుద్రస్వామి పూర్తిగా నిద్రలేచి….నిద్ర నుంచి మేలుకొని….)
రుద్రస్వామి:- అమ్మ! శివ స్వామి వెళ్ళిపోయారా !
శివ నందిని:- ఆయన వచ్చిన విషయం మీకు తెలుసా?
రుద్ర స్వామి:- వచ్చిన విషయం తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి చెడు ఆలోచనలు కానీ…. చెడు వాంఛలు కానీ లేవు కదా! మీ ఇద్దరూ యోగ మిత్రులు గానే ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు, సలహాలు తీసుకుంటూ…. మీ ఇద్దరూ మీ హద్దుల్లో ఉన్నారని తెలుసు. మీ ఇద్దరు తప్పుడు పనులు చేస్తారు. తప్పుడు ఆలోచనలు చేస్తారు అని చెప్పి మాకు భయం లేదు . కానీ మాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా! అది ఎప్పుడైనా ఏ విధంగా అయినా తప్పు చేయించచ్చు. తద్వారా కాలానుకూలంగా… పరిస్థితులకు అనుగుణంగా మీరు తప్పుడు మార్గంలో పడతారేమోనని ఆలోచన తప్ప మాకు ఇంకేమీ లేదు.
శివ నందిని:- ఆ…. ఆయన రావటము అయ్యింది. వెళ్ళటం అయింది.
రుద్రస్వామి:- ఏమైనా చెప్పారా?
(అంటే వాళ్ల మధ్య జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా రుద్ర స్వామికి చెప్పేసరికి)
మంచిది! ఒకవేళ ఇప్పుడు మణి బంధం ఉంది అనేది శమంతకమణి లేదా పరుసవేది మణి అనే వాటి గురించి నువ్వు ప్రయత్నాలు చెయ్యకు. ఇది నీకు సూక్ష్మ శరీర జాగృతి కోసం ఏర్పడింది. అమ్మవారి క్షేత్రాలలోనే మనకి శివుడి యొక్క బంధనాల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఆయనకి ఆయన మణిబంధంలో ఇరుక్కోలేడు కదా! అమ్మవారే మణిబంధం చేసింది. ఆ మణి బంధనంలో లలితాదేవి మణి బంధనం చేసింది అని జ్ఞానస్పురణ అందింది. కాబట్టి లలితాదేవి క్షేత్రంలోనో …..ఎక్కడో ఒకచోట మనకి మణి బంధనం అనేది వస్తుంది. ఈ క్షేత్రంలో సోమనాధ శివలింగంలో ఏదో ఒక మణి మాత్రం ఉన్నది. అది ఖచ్చితంగా ఇది అని చెప్పలేము. అది పూర్వకాలంలో చంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగంలో ఉండేది. శ్రీకృష్ణుడు నిర్యాణం ఇక్కడే జరిగింది. అలాగే పరశురాముడు కూడా తన నిర్యాణ సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి చంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగంలో శమంతక మణి ఉండవచ్చు. పరుసవేది మణి ఉండవచ్చు. ఏదైనా ఒక మణి మాత్రం ఉన్నది. ఆ మణి మాత్రం బంగారం తయారు చేస్తూ ఉండేది. ఆ బంగారంతోనే ఈ దేవాలయం పూర్తి చేయడం జరిగింది. బంగారపు ఆలయంగా అయితే మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆ మణి ఉన్న శివలింగం కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నర్మదా నది బాణ లింగాలను మాత్రమే
ప్రతిష్ట చేసుకుంటూ రావడం జరిగింది. నాకు తెలిసి సోమనాధ శివలింగాలలో ఇది ఏడవ శివలింగం అయ్యుండాలి…. మణి కోసం నువ్వు ప్రయత్నం చేయకు . ఈ చక్రంలో ఉండే శరీరం అయిన సూక్ష్మ శరీర జాగృతి కోసం నువ్వు ఆలోచన చెయ్యి. దాని గురించి ధ్యాన తపస్సులో ఉండు. ఇప్పటికే మనం వచ్చి 20 రోజుల అయినా గాని ఎలాంటి ఫలితం కనిపించలేదు. కేవలం పంచలోహ శివలింగం మాత్రమే మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ధ్యానం మీద ధ్యాస పెట్టు. మణి మీద దృష్టి పెట్టకు. మణి మీద ఆ ఆలోచనలు చేశావు అంటే…. ఆ మణి ఉన్నట్లుగా చూపిస్తుంది. ఆ తర్వాత నువు మణి బంధనం అయిపోయి…. ఈ సోమనాథ్ శివలింగం దగ్గర బంధి అయిపోయి…. స్వర్గం లోకం పొందడం జరుగుతుంది. నువ్వే ఆలోచించుకో తల్లి! నేను ఇది అని చెప్పను. నేను ముందే చెప్పాను…. వచ్చే మాయలు, మర్మాలు చెప్పగలం కానీ…. వాటిని దాటుకునేది నువ్వే..
శివ నందిని:- పోయి పోయి…. నేనెందుకు మణి బంధనంలో మాయలో పడతాను. ఏదో నా ఉత్సుకతతో ఈ శివలింగంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాను. నువ్వు చెప్పినట్లు కాలమే నిర్ణయం చేస్తుందిలే అయ్యా! మనకెందుకు…
అని అనుకుని సరే అని సుప్రభాత సేవకు సమయం అవుతుంది అని…. సోమనాథ్ ఆలయంలో సుప్రభాత సేవకు అందుకోవాలి అని…. నిద్రలో ఉన్న పిల్లల్ని, అందరినీ లేపి అందరూ కూడా స్నానాదికాలు చేసుకొని…. సుప్రభాత సేవకు చేరుకోవడం జరిగింది. అక్కడ సుప్రభాతం సేవ అంతా పూర్తయిన తర్వాత… 7 గంటలకి ఎవరికి కావాల్సిన ప్రాంతంలో… ఆ పరిసరాల్లో…. ధ్యానంలో కూర్చున్నారు. అలాగే శివ నందిని కూడా జలముద్ర అభ్యాసం చేస్తూ … తీవ్ర ధ్యాననిష్టలోకి వెళ్లిపోవడం జరిగింది. ఉన్నట్టుండి ధ్యానంలో చంద్రుడు అంశలా ఉన్న ఒక ఆయన, మేలిమి బంగారు రంగు ఛాయతో ఒక శివలింగం ప్రతిష్ట చేస్తున్నట్టుగా…. ధ్యాన తపస్సు చేస్తూ ఉండేసరికి ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఈ శివలింగం దగ్గరికి వచ్చినట్టుగాను…. శివలింగం మధ్యభాగంలో ఒక మణిని లోపలికి పెట్టినట్లుగాను…. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ శివలింగం కాలగర్భంలో కలిసిపోవటం….ఆ తర్వాత ఇంకో శివలింగం ప్రతిష్ట చేయడం…. ఆ శివలింగంలోకి గొడ్డలితో ఉన్న ఒక వ్యక్తి వచ్చి తన చేతిలో నుంచి ఒక మణిని లోపలికి పెట్టినట్లుగాను.. ఆ మణి పరుసవేది మణిగా ఉండటం….ఈ రెండు లింగాల నుంచి బంగారం వస్తున్నట్లుగాను…. అంతా లీలగా కనిపిస్తూ ఉండేసరికి…. అంటే, రెండు శివలింగాలలో రెండు మణులు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి అన్నమాట! అది ఆయా లోకాలకి చేరిపోయి ఉంటాయి. నాకు తెలిసినంతవరకు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తరువాత గోకులంలోకి ఆయన వెళ్లిపోవడంతో ఆ మణిని కూడా అదృశ్య శక్తితో తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి. అలాగే పరశురాముడు కూడా తన నిర్యాణ సమయంలో తనకి వచ్చిన పరుసవేది మణి ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ప్రస్తుతానికి ఇక్కడ మణులు లేని సోమనాథ్ ఆలయం మాత్రమే ఉన్నది అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. సరే అని ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి…. మళ్ళీ యధావిధిగా పంచలోహ శివలింగం కనబడుతూ ఉండేది. కానీ అది ఎక్కడ ఉంది… ఏంటి… అనేది తెలిసేది కాదు. ఇలా కొన్నాళ్ళు ధ్యాన తపస్సు చేసుకుంటూ ఉండేది. ఒక రోజు అనుకోకుండా ధ్యానంలో తనలాంటి శరీరం బయటకు రావడం లీలగా కనిపించింది. తన పోలికలు ఉన్న ఈ శరీరం బహుశా సూక్ష్మ శరీరం అని చెప్పేసి అనుకున్నది. కానీ స్థూల శరీరం రక్త మాంసాలతో ఉంటే… ఈ సూక్ష్మ శరీరం కాస్త జలంతో ఉన్నట్లుగా కనిపించింది. శరీరం అంతా జలముతో ఉండేసరికి ఓహో! ఇది జల పదార్థ నిర్మాణ శరీరం అయి ఉంటుంది అని అనుకునేసరికి….. ఆ సూక్ష్మ శరీరం కూడా ఎక్కడికో వెళ్తున్నట్టుగా అనిపించేసరికి…. ధ్యానం ఎక్కడా భంగం అవ్వకుండా కళ్ళు తెరవకుండానే ధ్యానం సాగిస్తూ….ఈ శరీరం ఎక్కడికి వెళుతుందో చూద్దాం అనుకునేసరికి…. ఆ శరీరం కాస్త కొండలను దాటుకుంటూ…. అడవులను దాటుకుంటూ….. ఎక్కడికో వెళ్తున్నట్టుగా లీలగా కనిపిస్తూ ఉండేసరికి ఏదో ఒక టెంపుల్ రన్ నడుస్తున్నట్లుగా ఉండేసరికి ఆ ధ్యాన దృశ్యం అలా చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి ఆ సూక్ష్మ శరీరం ఒకచోట ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి అక్కడి నుంచి తన ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నుంచి మూడు అడుగులు ఉన్న పంచలోహ శివలింగం బయటకు వచ్చినట్టుగా లీలగా కనిపించేసరికి….. అక్కడ ఉన్న చెట్టు, ఆ రాతి ప్రాంతం లీలగా కనిపించేసరికి…. ఇప్పుడు అది ఎక్కడ ఉందో….. ఆ కాలంలో తను సూక్ష్మ శరీర జన్మ ఎత్తినప్పుడు ఆరాధన చేసిన శివలింగం అయి ఉండాలి. ఇప్పుడు అది తీసుకురావాలి అనుకునేసరికి….. ఆ శివలింగంలో నుంచి శివుడు ప్రత్యక్షం అయ్యి, సూక్ష్మ శరీరంతో ఏదో మాట్లాడుతున్నట్టు…. ఏదో సంభాషిస్తున్నట్టు అనిపించేసరికి…. శివుడికి తన ఆది సూక్ష్మ జన్మలో తను శివారాధన చేయటం వలన ఏవో వరాలు ఇచ్చినట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉండేసరికి శివుడి చేతుల మీదుగా ఏదో మణి తన చేతుల మీదుగా తీసుకుంటున్నట్టు అనిపించేసరికి…. ఓహో! ఇది శమంతక మణి అయి ఉండవచ్చు ….లేదా పరుసవేది మణి అయి ఉండవచ్చు. ఆ కాలంలో మణుల కోసం ధ్యాన తపస్సు చేసినట్టు ఉంది. అప్పుడు మణిబంధనం అయ్యి ఉండవచ్చు. ఆ జన్మకి ఆ మణిబంధనం వలన పునః జన్మకి వెళ్లి ఉండవచ్చు అని చెప్పి గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. తర్వాత ధ్యాన భంగం అయ్యి కళ్ళు తెరిచేసరికి అప్పటికే రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా కళ్ళు తెరుచుకొని ఈమెకేసి చూస్తూ విషయం ఏమిటి? అని అడిగేసరికి ….ఉన్నది ఉన్నట్లుగా యధావిధిగా చెప్పేసరికి….. సరే నీకు ఆ కాలంలో మణికి సంబంధించిన కోరిక మాయ , విషయ జ్ఞానం ఉండి ఉంటుంది. అది ఇవాల్టితో తీరిపోయింది. ఇప్పుడు ఆ పంచలోహ శివలింగం ఎక్కడ ఉంది అనేది నీకు నువ్వే గుర్తుపట్టాలి. అప్పుడు మీ శరీరం జాగృతి, శుద్ధి, అ అధీనం అవ్వడం జరుగుతుందనేసరికి …..సరే దానికి నేనేం చెప్పగలను…. కాలమే నిర్ణయించాలి అని చెప్పి అనుకుని ఇక ఆకలి వేస్తుందని, అక్కడ నుంచి భోజనాలు చేసుకొని హోటల్ గదికి వెళ్ళటం జరిగింది. అందరూ విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకోవడం జరిగింది.
సాధన కుటుంబం అంతా నిద్రలో నుంచి లేచేసరికి సాయంత్రం ఐదు గంటలు అవ్వడంతో… ప్రభాస తీర్థంలో స్నానాధికాలు చేసుకొని, సోమనాథ్ గుడిలో ధ్యానానికి వెళ్లడం జరిగింది. ఎవరికి వారే ధ్యానంలో, జపంలో మునిగిపోయారు. శివ నందిని యధావిధిగా జలముద్రతో అభ్యాసం చేస్తూ ఉండగా…. ఈసారి ఏకంగా సరాసరి సూక్ష్మ శరీరం కనిపించడం జరిగింది. సరే, ఇది ఏం చేస్తుందా? అనుకునేసరికి ఆ సూక్ష్మ శరీరం కూడా ఏదో ధ్యానంలో కూర్చొని ధ్యాన తపస్సు చేస్తున్నట్లుగా లీలా మూర్తిగా కనబడింది. ఎప్పుడు ఏం చేస్తుందో అని ధ్యాన దృశ్యాన్ని కల్లార్పకుండా, ధ్యానభంగం కాకుండా శివనందిని అలాగే చూస్తూ ఉండేసరికి …..తనకి వచ్చిన మణితో ఆ సూక్ష్మ శరీరం బంగారమును సృష్టించి పేదలకు, అవసరమైన వాళ్లకి సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా లీలామూర్తిగా కనిపించింది. ఎవరో ఒక దుష్టుడు ఈవిడని బంధించి…. చెట్టుకి కట్టేసి…. ఈవిడని చంపేసి….. ఈవిడ దగ్గర ఉన్న మణి ని ఎత్తుకుపోయినట్టుగా కనిపించింది. తనకి మణి మీద ఉన్న మమకారంతో…. తన ఆత్మఘోషతో…. ఈ ప్రాంతంలోనే తిరుగుతుంది. సూక్ష్మ శరీరం గా సంచారం చేస్తుంది అని చెప్పేసి ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆమె దేహం దహన సంస్కారాలు చేయకపోవడంతో…. ఆ చెట్టుకి అస్థిపంజరం లాగా అలాగే ఉండిపోవడంతో…. తన ఆత్మఘోష మిగిలిపోయింది అని…ఊర్ధ్వ లోకానికి వెళ్లలేక పోతుంది అని…. అలాగే భూలోకంలో పునః జన్మ ఎత్తలేక పోతుంది అని చెప్పి… తన సూక్ష్మ శరీరానికి విముక్తి కలిగిస్తేనే కానీ, తను సూక్ష్మ శరీరం ఊర్ధ్వ లోకానికి వెళ్ళదు అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. సరే ఇప్పుడు ఆ చెట్టు ఉన్న ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటి అని ఆలోచన చేస్తూ ఉండగా…. ధ్యాన భంగం అయ్యింది. అప్పుడే ధ్యానం నుంచి బయటకు వస్తున్న రుద్రస్వామితో… మహాదేవితో తనకి కలిగిన ధ్యానం అనుభవం గురించి చెప్పేసరికి… అంటే నీ సూక్ష్మ శరీరం ఆత్మఘోష ఇక్కడే ఉందన్నమాట! ఇప్పుడు దానికి విముక్తి కలిగించాలి అంటే ముందు మనకి పంచలోహ శివలింగం కనిపించాలి.ఎందుకు అంటే ఆ పంచలోహ శివలింగంలోనే తనకి వచ్చిన మణిని ఆమె నిక్షిప్తం చేసి ఉండచ్చు. ఇప్పుడు ఆ మణి ఉన్న శివలింగమును బయటకు తీయాల్సి ఉంటుంది అని చెప్పి అనేసరికి… యోగమత్తు ఆవరిస్తూ ఉండేసరికి….శివ నందిని ధ్యానంలోకి వెళ్లడం జరిగింది. ఈసారి ధ్యాన దృశ్యంగా పంచలోహ శివలింగం సరస్సులో ఉన్నట్టుగాను…. అస్థిపంజరం కూడా దాని పక్కనే ఉన్నట్టుగాను…. కనిపించింది. ఆ పంచలోహ శివలింగంలో ఎలాంటి మణి ఉన్నట్లుగా కనిపించకపోయేసరికి…. ఏం జరిగిందో అని అనుకుంటూ ఉండేసరికి…. ఆ అస్థిపంజరం కాస్త ప్రాణం ఉన్న, శరీరం ఉన్న స్త్రీ మూర్తిగా కనపడుతూ….. తన అంత్య కాలంలో తన దగ్గరి నుంచి ఎవరో తీసుకువెళ్లిపోయిన మణి విషయం గుర్తుకు రావటంతో ….అతనిని చంపి అతని వంశాలని నాశనం చేసి…. ఈవిడ ఆ మణి ని చేజెక్కించుకొని ,తిరిగి యధావిధిగా తపస్సు చేసి శివుడు ద్వారా తనకి వచ్చిన మణిని యధావిధిగా ఆయనకే ఇచ్చేసినట్టుగా లీలా దృశ్యంగా కనిపించేసరికి… ఇంక తను బంధ విముక్తి అవ్వచ్చు కదా! తను తిరిగి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోవచ్చు కదా! అనుకున్నప్పుడు శవ దహనం కాకపోవటంతో అస్థిపంజరం మిగిలిపోవడంతో….తను అస్థిపంజరం అలాగే మిగిలిపోవాల్సి వస్తుందని… అనాధ శవానికి దహన సంస్కారాలు జరగకపోతే ఆత్మగా మారిపోయి…. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆత్మఘోషతో ఉండిపోతుంది అని…. గరుడ పురాణంలో ఉన్న విషయం జ్ఞాన స్ఫురణ కావడంతో…. ఇప్పుడు ఆ అస్థిపంజరానికి దహన సంస్కారాలు చేస్తే కానీ…. ఆ సూక్ష్మ శరీరానికి విముక్తి కలగదు అని చెప్పేసి గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. సరే అని అనుకోగా జ్ఞాన స్ఫురణగా అది ప్రభాసతీర్థంలో ఉంది అని….. పూర్వకాలంలో అది అడవి ప్రాంతం అని…. ప్రస్తుత కాలంలో ప్రభాస తీర్ధంగా పిలవబడుతుంది అని….శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.ఈ విషయాన్ని రుద్రస్వామికి చెప్పేసరికి సరే…నేను ఆ ప్రభాస తీర్థానికి వెళ్లి నువ్వు చెప్పిన ఆ అడుగునకు చేరుకొని… నువ్వు చెప్పినట్లుగా అక్కడ ఉన్నాయో లేదో చూస్తాను. ఒకవేళ అస్థిపంజరం, శివలింగం ఉంటే తీసుకు వస్తాను అనుకునేసరికి…. అయ్యా! అది మూడు అడుగుల శివలింగం, మోయడం కష్టం కదా! అనేసరికి మూడు అడుగుల శివలింగాన్ని మూడు అంగుళాలుగా మార్చే సిద్ధి నాకు ఉంది. అది పెద్ద సమస్య కాదు అని చెప్పి ఆయన ప్రభాస తీర్థంలోకి దూకటం…..ఆ తర్వాత అక్కడ ఉన్న అడుగుకి వెళ్లేసరికి అడుగుభాగంలో పంచలోహ శివలింగం మీద ఒక అస్థిపంజరం తలవాల్చుకొని పడుకున్నట్లుగా కనిపించేసరికి…. విషయం గ్రహించి శివనందినికి కలిగిన ధ్యాన అనుభవం సత్యమే అని గ్రహించి… తనకి ఉన్న సిద్ధితో ఈ అస్థిపంజరం శివలింగమును మూడు అంగుళాలుగా మార్చేసుకుని…. తన చేతి సంచిలో పెట్టుకొని…. ఏమీ తెలియనట్టుగా… యధావిధిగా నీటిపైకి తేలుతూ బయటికి రావటం జరిగింది. ఆ తర్వాత ఒక నిర్మానుష ప్రదేశానికి వెళ్లి ఆ అస్థిపంజరం ఆరడుగుల ఉన్న అస్థిపంజరంగా మార్చడం…. ఆ తర్వాత ఆ అస్థి పంజరానికి దహన సంస్కారాలు చేయడంతో …..ఆ అస్థిపంజరానికి ఆవరించి ఉన్న శివ నందిని సూక్ష్మ శరీరం కాస్త బయటకు వచ్చి తనకి ఆత్మఘోష నుంచి విముక్తి కలిగించినందుకు అలాగే తనకి మోక్షం కలిగించే విధంగా తన సాధన పరిసమాప్తికి సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పేసి శివ నందిని యొక్క బ్రహ్మ రంధ్రం ద్వారా శివలింగం స్వాధిష్ఠాన చక్రం లోనికి ఆత్మ శక్తిగా ప్రవేశించడంతో…. దీనికి అస్థిపంజరం కాస్త కపాల మోక్షం పొందడం జరిగింది. అంటే కపాలం యొక్క బ్రహ్మ రంధ్రం వద్ద ఒక విస్ఫోటనం జరగడంతో….. కపాలంలో ఉన్న అస్థిపంజరం కూడా దహనం అయిపోయి చూర్ణం అయిపోయి…. బూడిదగా మారడం క్షణకాలంలో జరిగింది.ఆ తర్వాత ఈవిడ ఆరాధించిన పంచలోహ శివలింగమును యధావిధిగా మూడు అంగుళాల శివలింగమును తన శరీరంలో నిక్షిప్తం చేసుకోవటం జరిగింది. ఇక దానితో సూక్ష్మ శరీరం చక్ర జాగృతి ,శుద్ధి ,ఆధీనం అయ్యాయని అర్థం అయింది. ఇక వీళ్ళందరూ గదికి చేరుకోవడం జరిగింది. తనకి వచ్చిన పంచలోహ శివలింగమును చూపించమని పిల్లల కోరడంతో తన శరీరం నుంచి శివలింగం బయటకు తీసి చూపించింది. అమ్మ! మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయినది కదా! దాదాపు మనం ఇక్కడికి వచ్చి మూడు నెలలు అవుతుంది. మనం తర్వాత ఏ క్షేత్రానికి వెళ్లాలి అంటే ఏంటి? అనేది మనకి ఎలా తెలుస్తుంది? అనగానే ఇప్పుడు వచ్చిన ఈ శివలింగమును సాధనా విగ్రహ మూర్తి శరీరానికి కుడివైపున ఉన్న కుడి చేతి.పద్మంలో పెట్టు అప్పుడు విషయం మీకే అర్థమవుతుంది… అనేసరికి సరే! అని చెప్పి ఈసారి బాల కుమారస్వామి కాస్త ఈ శివలింగం తీసుకొని కుడివైపు చేతిలో ఉన్న పద్మములో పెట్టేసరికి మూలాధార చక్రం,స్వాధిష్టాన చక్రం పైన బ్రహ్మగ్రంధిలోనికి ఏదో పాము ప్రవేశించి చుట్టుకుని ఉండేసరికి…. బ్రహ్మ గ్రంధి కాస్త సుడులు తిరుగుతూ….. దివ్య తేజస్సుతో, దివ్య కాంతితో ఉండేసరికి…. అమ్మ! ఇదేదో చిన్న బొట్టు లాగా ఉంది. పై చక్రాలకు వెళ్ళటం లేదు, అలాగని కింద చక్రాలకి వెళ్ళటం లేదు. ఈ బొట్టు ప్రాంతంలో ఏదో ఉంది అనేసరికి…. అది బొట్టు కాదు నాయన!బ్రహ్మ గ్రంథి అంటారు. ఇందులో బ్రహ్మదేవుడు ఆవాసమై ఉంటాడు. ఈయన బ్రహ్మ మాయ దాటి మనం ముందుకు వెళితే.. మణిపుర చక్రం వస్తుంది. ఆ తర్వాత అనాహత చక్రం వస్తుంది. ఆపైన మళ్లీ విష్ణు గ్రంధి వస్తుంది అని అంటూ ఉండేసరికి…. ఆ బ్రహ్మ గ్రంధి నుంచి ఒక రాగి రేకు బయటకు వచ్చి… దానిని బాల కుమారస్వామి అందుకుని చదవడం ఆరంభించాడు. అంటే తదుపరి ఏ క్షేత్రానికి వెళ్ళాలో ఇందులో ఉన్న ఆధార శ్లోకమును చదవడం ఆరంభించాడు.
బాల కుమారస్వామి కాస్త ఆధారాలు చదవడం ప్రారంభించాడు.
పది తలల వాడి భక్తికి మెచ్చి ఉన్నాను ….
త్రిభుజాకార కొండపైన నా ఆవాసం…
1000 స్తంభాలలో ఒక స్తంభమే ఉంది…
మూడు వైపులా నీరు ఉన్న చోటులో ఉన్నాను…
కాలి గజ్జెలు పడి ఉన్న చోటు అది ….
తల్లి శ్రాద్ధ కర్మలు జరిగిన చోటు….
7 వేడి నీటి బావులు ఉన్న చోటు….
దేశం కానీ దేశంలో ఉన్న చోటు …..
నా శక్తి ఉనికిని తెలిపిన మొట్టమొదటి చోటు….
మా ఆయన నా కోసం ఆరు బయట కూర్చున్న చోటు…
అని ఆధారాలు చదువుతూ ఉండేసరికి…. ఎవరికి వారే ఆలోచనలో పడ్డారు. శివ నందినికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చి నా శక్తి ఉనికిని తెలిపిన మొట్టమొదటి చోటు అని అంటే అమ్మవారి శక్తి పీఠాలలో మొట్టమొదటి శక్తి పీఠం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేయగానే…. మహాదేవి ఉన్నట్టుండి అది శాంకరీ దేవి శక్తిపీఠం. శ్రీలంకలో ఉంటుంది. అక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని కొంతమంది అంటారు…. మొలభాగం పడిందని కొంతమంది అంటారు అనేసరికి…. అంటే ఈ ఆధారాలు అన్నీ కూడా కొంపదీసి శాంకరీ దేవికి సరిపోతాయా అని రుద్ర స్వామి అనేసరికి….. సరే! అని శివ నందిని కాస్త ఇంటర్నెట్లో ఈ శాంకరి శక్తిపీఠం వివరాలు అన్నీ కూడా అందరికీ వినిపించేటట్టుగా పెట్టగానే స్థల పురాణ విశేషాలు అన్నీ కూడా ఈ ఆధారాలతో సరాసరి సరిపోవటం మొదలయ్యింది. అనగా 10 తలల వాడి భక్తికి మెచ్చి ఉన్నాను అంటే….. పది తలల వాడు రావణాసురుడు. రావణాసురుడి అఖండ భక్తికి అమ్మవారు ఇక్కడ శాంకరీ దేవిగా వెలిసింది అని చెప్పేసి స్థలపురాణం చెబుతుంది. అలాగే ఈవిడ ఉన్న కొండపైన త్రిభుజాకారంలో ఉంటుంది అని చెప్పేసి త్రికోణేశ్వర అని చెప్పడం బట్టి ….ఈ కొండ చుట్టూ మూడు వైపులా నీరు ఉంటుంది అని ఒక వైపు భూభాగం ఉంటుందని స్థలపురాణం చెప్పడం…. దేవాలయం మొదట్లో వెయ్యి స్తంభాలతో ఉండేదని…. పోర్చుగీసు వారు దేవాలయాన్ని పడగొట్టడంతో ఒక దీప స్తంభం మాత్రమే ఆనవాళ్లుగా ఉన్నదని చెప్పేసి ఉండటంతో…. వేయి స్తంభాలలో ఒక స్తంభం మాత్రమే మిగిలింది అనేది దీనికి సరిపోతుందని…. అలాగే రావణబ్రహ్మ తన తల్లి శ్రాద్ధ కర్మలు చేశాడని స్థల పురాణం చెప్పడం…. అలాగే రావణబ్రహ్మ నీటి కోసం ఏడు సార్లు ఖడ్గంతో కొట్టిన చోటులోనే ఏడు నీటి బావులు ఉన్నాయని స్థల పురాణం చెప్పడం ……అలాగే దేశం కానీ దేశం అంటే, దేశం అంటే భారతదేశము అనుకుంటే….దేశం కానీ దేశం శ్రీలంక అవుతుంది కదా! అని అవగాహన రావటం, అలాగే మా ఆయన ఆరుబయట నాకోసం కూర్చున్న చోటు అంటే అమ్మవారి ఆలయం బయట వైపు కూర్చున్న భంగిమలో సుమారు 40 అడుగుల ఎత్తు శివుని విగ్రహం ఉన్నదాన్ని బట్టి చూస్తే….. ఈ విధంగా ఈ ఆధారం సరిపోతుంది అని వీళ్ళందరికీ ఒక అవగాహన వచ్చింది. అంటే ఈ ఆధారం అంతా అమ్మవారి మొట్టమొదటి శక్తిపీఠం అయిన శాంకరీ శక్తిపీఠం గురించి చెబుతుంది అని అర్థమయింది. అంటే ఇప్పుడు మనం బ్రహ్మ గ్రంధి జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం ఈ శక్తి పీఠానికి వెళ్ళాలి అని రుద్రస్వామి చెప్పేసరికి….. సరే ఇక్కడి నుంచి శ్రీలంకకి బయలుదేరాలి అని ఇక అందరూ అనుకున్నారు. ఆ తర్వాత శివనందినికి ఒక ధర్మ సందేహం వచ్చి రుద్ర స్వామితో
రుద్రస్వామి:- అయ్యా ! ఇప్పుడు నాకు సూక్ష్మ శరీర జాగృతి అయ్యింది కదా! మరి నాకు ఇక్కడ అష్టసిద్ధులలో ఏదో ఒక సిద్ధి రావాలి కదా! ఏ సిద్ది వచ్చినట్లు నాకు ఏమీ అనిపించడం లేదు, కనిపించడం లేదు.
రుద్రస్వామి:- ఒక వారం పది రోజులపాటు ధ్యానస్థితిలో ఉండు… నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మనం శాంకరీ శక్తి పీఠానికి వెళదాము. ఒకవేళ సూక్ష్మ శరీరం అంశలు ఏమైనా ఉన్నాయేమో….. దోషాలు ఏమైనా మిగిలిపోయినాయేమో….. ఒకవేళ వాటిని కూడా పరిశుద్ధం చేసుకో!
అని చెప్పేసి అనేసరికి ఇక ఎవరికి వారే విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు. ఇలా కొన్నాళ్లు ఈ క్షేత్రంలోనే ఆవాసం ఉన్నారు. ఒక రోజు ఎందుకో శివనందినికి తన శరీరం గాల్లో తేలుతున్నట్టుగాను భూమికి అతుక్కుపోయినట్టుగాను బరువుగా అనిపించడం ఇలా అనిపిస్తూ ఉండేసరికి అర్థం కాక రుద్రస్వామిని అడిగేసరికి….
రుద్రస్వామి:- అమ్మ! శరీరం గాల్లో తేలుతుంది అంటే…సూక్ష్మ శరీరం వలన జరుగుతుంది. దానికి భూ ఆకర్షణ వ్యతిరేక శక్తి ఉండటం వలన స్థూల శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభవ అనుభూతి కలుగుతుంది. అలాగే నాకు తెలిసినంతవరకు నీకు అష్టసిద్ధులలో ఒకటైన గరిమా సిద్ధి వచ్చి ఉండాలి. ఇది మనం శరీరానికి ఎంత బరువు కావాలంటే అంత బరువులోకి ఉంచుకోవచ్చు. నువ్వు 100 కేజీల బరువుగా మారచ్చు….. 1000 కేజీల బరువుగాను మారచ్చు. ఈ బరువు వలన నీకు తేలిక పడుతున్న శరీరము ఆకర్షణకు లోనవుతుంది. లేదు అంటే నువ్వు గాల్లో తిరుగుతూ ఉంటావు. ఈ సిద్ధి నీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది.
అవునా! కాదా? అని బరువు తూకం చూసుకునేసరికి….. 48 కేజీలు ఉండవలసిన ఆవిడ కాస్త 120 కేజీల బరువు ఉండేసరికి ఓహో! ఈ సిద్ది వలన అధిక బరువు వచ్చినట్లుగా ఉంది. కానీ బరువు ఉండటం వలన తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు గానీ ఏమీ లేవు గాని, శరీరం తేలికపడడం వలన గాలిలో ఉండవలసిన తను భూమి మీద ఉండగలుగుతుంది అని శివనందినికి అవగాహన వచ్చింది. అలా అని కొన్ని రోజులు ఈ క్షేత్రంలో ఉండి, ఆ తర్వాత శాంకరీ శక్తి పీఠానికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకునే పనిలో సాధన కుటుంబం ఉన్నది.
శుభం భూయాత్


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి