స్థూల శరీర సాధన
సాధన కుటుంబం అంతా ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్లే యాత్ర బస్సు ఎక్కడం జరిగింది. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. పిల్లలేమో శివ నందిని పక్కన కూర్చుంటే….. రుద్ర స్వామి మరియు మహాదేవి ఒక సీట్లో కూర్చున్నారు. మహాదేవి ఉన్నట్టుండి శివ నందిని కేసి చూస్తూ…
మహాదేవి:- అమ్మ! రాత్రి మనకి అమ్మవారు విగ్రహమూర్తులు ఇచ్చింది కదా! అవి తప్పుగా ఇచ్చిందేమో అని ధర్మ సందేహం…
శివ నందిని:- ఎందుకొచ్చిందమ్మా! నీకు ఆ సందేహం
మహాదేవి:- నేను తంత్రంలో భైరవ ఆరాధన చేస్తాను కదా! భైరవుడు, భైరవిని ఆరాధన చేస్తాను కదా! నాకేమో వారాహి మూర్తిలో కామాక్షి ఉన్నట్టుగా విగ్రహం ఇచ్చింది. ఏనాడూ బైరవ ఆరాధన చేయని రుద్ర స్వామికేమో…. బైరవ రూపంలోనూ, మహిషాసుర మర్దిని రూపంలోనూ ఆరాధన ఇచ్చింది.
బాలగణపతి:- అవునమ్మా! అది నిజమే కావచ్చు… అమ్మవారు తప్పుగా ఇచ్చిందేమో!
శివ నందిని:- నీకెందుకు వచ్చింది రా! ఆ ధర్మ సందేహం…
బాలగణపతి:- ఇప్పుడు నేను కాశీ క్షేత్రంలో ఉండి వచ్చాను కదా! కాశీ క్షేత్రంలో ఉండేది కాశి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి కదా! మరి నాకు అన్నపూర్ణేశ్వరి విగ్రహం ఇవ్వాలి కదా! అదేమో అన్నయ్యకి ఇచ్చింది….నాకేమో నేను ఎప్పుడూ ఆరాధన చేయని మహాలక్ష్మి, సరస్వతి విగ్రహం మూర్తి ఇచ్చింది. నాకు అదే సందేహంగా ఉంది. అన్నపూర్ణ విగ్రహం ఉన్న కామాక్షి నాకు రావాలేమో కదా!
రుద్ర స్వామి:- అమ్మవారు తప్పు చేసింది అని అనుకుంటున్నారా! అమ్మవారు ఎప్పుడూ కూడా తప్పు చేయదు… మన తప్పులను సరిచేసేది ఆవిడ… ఆవిడకి తెలియకుండా ఉంటుందా! ఇప్పుడు నీ సాధన భైరవి సాధన పరిసమాప్తి అయిపోయింది. వారాహి సాధన లోకి వెళ్ళాలి అని చెప్పడానికి…. నీకు విగ్రహ మూర్తి రూపంలో ఇవ్వడం జరిగింది. వారాహి అంటే ఎవరు అనుకుంటున్నావు …..మోక్ష ద్వారాలలో మోక్షం ఇచ్చేది వారాహి , వరాహుడు అని పరమహంస గారు చెప్పకనే చెప్పారు కదా! ఆయనకి నాలుగు ద్వారాలలో వారాహి ఒక ద్వారంలో ఉన్నట్టుగా చెప్పారు కదా! ఆ వారాహినే నువ్వు మోక్షం పొందాలనుకుంటున్నావు కాబట్టి ఈ జన్మను అంతిమ జన్మ చేయాలని మోక్షజన్మ చేయాలని వరాహి రూపం ఇవ్వడం జరిగింది. నాకు మహిషాసుర మర్దిని ఆరాధన ఎందుకు వచ్చింది…. అంటే నాలో పశుపతి అనగా అహంకారం ఉంది. ఆ అహంకార రాహిత్య స్థితిని పొందాలని చెప్పేసి అప్పుడు కానీ నేను కాలాతీత స్థితికి వెళ్లను…. అంటే మోక్షస్థితిని పొందటానికి ఈ విగ్రహ మూర్తి ఇచ్చింది. అలాగే బాలగణపతి పదార్థ రుచిని దాటాడు కాబట్టి…. అన్నపూర్ణను దాటాడు కాబట్టి…. బ్రహ్మజ్ఞానం పొందాలి కాబట్టి…. వాడికి సరస్వతి అనుగ్రహం ఉన్న కామాక్షి విగ్రహ మూర్తిని ఇవ్వడం జరిగింది. ఇంకా కదిలే ప్రపంచం….కదలని ప్రకృతిగా ఉన్న విశాలాక్షి, మీనాక్షి దేవి విగ్రహ మూర్తులను శక్తితో ఉన్న కామాక్షి విగ్రహ మూర్తిని శివ నందినికి ఇవ్వటం జరిగింది. అంతేకానీ అమ్మవారు తప్పు చేయలేదు. మన సాధనను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి…. అంతిమస్థితి పొందటానికి ఇది ఇవ్వడం జరిగింది. అప్పుడు బాల కుమారస్వామికి ఏ విగ్రహ మూర్తి ఇచ్చింది…. బాలా మూర్తి మరియు అన్నపూర్ణ ఇచ్చింది. వాడు అమ్మతోడు లేదు అని వాడు బాధపడుతూ ఉంటాడు కాబట్టి…. వాడికి ఒకపక్క అన్నపూర్ణమ్మగా ఉంటూ…. సాధన పరిసమాప్తి చేయడానికి ఇచ్చింది. వచ్చిన విగ్రహమూర్తులను విశ్లేషణ చేసుకోవాలి కానీ… తప్పొప్పులు పట్టడం కాదు. మన సాధన అనుగుణంగా ఆవిడ ఇవ్వలేదు. మన సాధన అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి….. అంతము చేయడానికి అని చెప్పేసి శక్తులన్నీ చూపించింది. ఒక శక్తి మోక్షస్థితి ఇస్తే ఆ మోక్షానికి అడ్డుగా ఉండే మాయ కారకం ఏంటి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శివ నందిని విగ్రహ మూర్తి చూస్తే…. లక్ష్యం ఏమో మీనాక్షి దేవి స్థితికి వెళ్ళాలి. ఆ మీనాక్షిని విశాలాక్షి ఆపుతుందని చెప్పటం జరిగింది. విశాలాక్షి నుంచే కదా! సాధన మొదలయ్యింది. మీనాక్షి దాకా తన సాధన పరిసమాప్తి అవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే నీకు వచ్చేసరికి…. శ్యామలాదేవితో మొదలుపెట్టి వరాహి దేవితో ఈ సాధన పరిసమాప్తి చేసుకోవాలని మహాలక్ష్మి మాయలు దాటి సరస్వతి జ్ఞానమును పొందాలని గణపతికి…. అలాగే మహిషాసుర మర్దిని నుంచి భైరవమూర్తికి వెళ్లాలని నాకు….. బాల కుమారస్వామికి అన్నపూర్ణ స్థితి నుంచి బాలా రూపంలోకి వెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మూలాలకు వెళ్లాలని చెప్పింది. మన సాధనా కుటుంబం కాస్త మోక్ష కుటుంబంగా మార్చడానికి….. మారటానికి ఉన్న ఆటంకాలు అన్నీ కూడా మనకి విగ్రహా రూపంలో శక్తి స్వరూపాలుగా చెప్పి ఏ విగ్రహ మూర్తి దగ్గరికి మనం వెళ్లాలి…. ఏ విగ్రహ మూర్తిలో ఐక్యం అవ్వాలనేది… మనకి ఆవిడ దగ్గర ఉండి సాధన పరిసమాప్తి చేసుకోవాలని అభయం ఇస్తూ….. తమ అంశతో విగ్రహ మూర్తులను ఇవ్వడం జరిగింది..
అని వివరంగా చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు… ఈ విధంగా రుద్రస్వామిలో ఇంత విశ్లేషణ శక్తి ….జ్ఞానం ఉంటుందని మహాదేవి మరియు శివ నందిని కూడా అనుకోలేదు . తన్వయత్వం పొందారు. అమ్మవారి యొక్క విగ్రహ మూర్తిలో ఇంత అర్థం పరమార్థం ఉంటుందని… అది విడమర్చి చెప్పినందుకు అమ్మవారు తన సాధన అనుగుణంగా తమ లక్ష్యం మోక్షం అనే విగ్రహమూర్తులు ఇచ్చేసరికి…. మళ్ళీ ఇంకోక్కసారి కృతజ్ఞతలు అమ్మవారికి మనసులోనే చెబుతూ …..అప్పుడు బాలగణపతి కాస్త…
బాల గణపతి:- అమ్మ! ఇప్పుడు మనం ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళుతున్నాం కదా! ఇతిహాస పురాణాలలో స్థలం యొక్క విశేషత ఏమిటి? ఈ స్థలం యొక్క విశిష్టత ఏమిటి? ఆ చరిత్ర చెబుతావా…..?
అనేసరికి అప్పటికే రూమ్ బుక్ చేయడానికి అని ఘృష్ణేశ్వర్ క్షేత్రం గురించి వివరాలు…. చూడవలసిన ప్రదేశాలు…. అక్కడ స్థల పురాణంలో ఉన్న విశేషాలు అన్నీ కూడా విని ఉండడంతో …. అనర్గళంగా గుర్తుపెట్టుకున్న వాటిని పిల్లలకు చెప్పడం ఆరంభించింది. మహాదేవి మరియు రుద్రస్వామీ కూడా వినడం ఆరంభించారు.
ఘృష్ణేశ్వర్ క్షేత్రంలోని పరమశివుని ఔదార్యం వర్ణించడానికి వీలుకాని విధంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని …..ఈ స్థల పురాణ విశేషముగా చెప్పడం జరిగింది. ఈ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వది. అంతే కాకుండా ఇది భారతదేశంలోనే అతి చిన్న జ్యోతిర్లింగ ఆలయం.. ఇంతకుముందు మనం చెప్పుకున్న మహా శివ భక్తురాలు పేరు మీదుగా మహా శివుడు ఇక్కడ అవతరించాడు. ఇక్కడ ఏర్పడిన శివ కుండ్ అనే తీర్థమునకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు చదరంగం ఆడుతూ ఉండగా …ప్రతిసారి శివుడే గెలుస్తూ ఉండడం … యాదృచ్చికంగా అమ్మవారు ఒకసారి గెలవడంతో…..పరమ శివుడు దానికి కోపగించుకొని.. దానిని అవమానంగా భావించి… కామ్యక వనానికి వెళ్ళిపోయారు. ఆయన్ని వెతుకుతూ అమ్మవారు మారువేషంలో రావడం జరిగింది. అలా మారువేషంలో ఉన్న అమ్మవారి దాహం తీర్చడం కోసం శివుడు గంగను సృష్టించాడు.. అది ఒక సెలయేరుగా మారింది. దీనినే శివ కుండ్ గా పిలవడం జరుగుతుంది.
ఇలా స్థలపురాణ విశేషాలు తెలుసుకున్న తరువాత అక్కడ చూడవలసిన ప్రదేశాలు….. ఎల్లోరా గుహలు కూడా అక్కడే ఉన్నాయని తెలుసుకొని అమ్మ! మనం గుడికి వెళ్ళిన తర్వాత ఈ గుహల్లోకి వెళ్లి అక్కడ ఉన్న శిల్పకళలన్నీ కూడా చూద్దాము అనేసరికి….. సరే నాయన! అనేసరికి మాకు నిద్ర వస్తుంది…. రాత్రంతా మేలుకొని ఉన్నాం కదా! మేము నిద్రపోతాము అనేసరికి…. సరే నిద్రపోండి అనేసరికి…. అప్పటికే రుద్ర స్వామి మరియు మహాదేవి గాఢ నిద్రలో ఉన్నారని తెలుసుకునేసరికి చిలిపితనంతో…. కొంటె ఆలోచనతో…. శివ స్వామి గుర్తుకు వచ్చేసరికి హృదయం మీద చేయి పెట్టగానే చెప్పు దేవి! ఏంటి సంగతులు! అనేసరికి..
శివ నందిని:- ఏంటి? నేను ఎప్పుడు పిలుస్తానా అని ఎదురు చూస్తున్నారా? ధ్యానం ఆపేశారా! నా ధ్యాసే మీకు ధ్యానం అయ్యిందా ఏంటి?
శివస్వామి:- లేదు….. రాత్రంతా మీరు చేస్తున్న ధ్యాన దృశ్యాలన్నీ కూడా నేను ధ్యానంలో చూడడం జరిగింది. నువ్వు చెప్పావు కదా! మిగిలిన వాళ్ళకి కూడా అమ్మవారి సజీవ మూర్తి దర్శనం కావాలని చెప్పావు కదా!మరి ఏ విధంగా చేసుకుంటారు….. అయ్యిందా? అవ్వలేదా? అనేఉత్సుకతతో నేను నిద్రపోకుండా ధ్యానంలో అలాగే ఉండిపోయాను. మీ ధ్యాన దృశ్యాలన్నీ చూశాను. మీరు ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ యాత్రకు బయలుదేరారని తెలుసుకున్నాను. సరే ! ఇప్పుడే ధ్యానం నుండి బయటకు వస్తూ ఉండగానే….నీ ఆత్మ అనుసంధానం వచ్చింది…… వచ్చాను. ఇప్పుడేంటి రమ్మంటావా?
శివనందిని:- వద్దులే స్వామి! ఇప్పుడు ఉదయకాలం కదా! వద్దులే…
శివస్వామి:- ఎప్పుడు రమ్మంటారో? ఎప్పుడు వద్దంటారో ?తెలియదు… ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలియదు… సముద్రం లోతు ఆడదాని మనసులోతూ… ఒకటే! ఎప్పుడు అనుగ్రహిస్తారో….. ఎప్పుడు ఆగ్రహిస్తారో… సముద్రం లాంటి వాళ్లు మీరు…. ఎప్పుడూ నిర్మలంగా ఉంటారో……ఎప్పుడు ఉప్పెనలా ఉంటారో తెలియదు.
శివ నందిని:- ఇప్పుడు ఏమైంది? నేనేమైనా మాయ అయ్యానా! నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా?
శివస్వామి:- ఏం లేదు… నువ్వు మాయ అవ్వడం ఏమిటి?నేను నీకు మాయ అవ్వను… నువ్వు నాకు మాయ అవ్వవు… నేను సాధన పరిసమాప్తి చేసుకున్నాను. నీ సాధన పరిసమాప్తికి ఎదురుచూస్తున్నాను.
శివ నందిని:- ఒకటికి పది సార్లు నా సాధన అయిపోయింది …నేను ముందున్నాను…. నేను ముందున్నాను అని చెప్పేసి ఒకటి పది సార్లు గుర్తు చేయకండి. మీరు నాకన్నా 12 సంవత్సరాలు ముందు సాధన పూర్తి చేసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత నేను సాధనలో ఉన్నాను. ఒకటి పది సార్లు అదే మాట అనకండి.
శివస్వామి:- సరే తల్లి! నేను అనను. అలా కూడా అనకూడదు అంటే నేను ఎక్కడ చావను…
శివనందిని:- మీరు ముందున్నారు… నేను వెనక ఉన్నాను… అంటే ఏదో తెలియని ఇది మొదలవుతుంది. నేను ఓడిపోయాను… ఓడిపోతున్నాను అనిపిస్తుంది.
శివస్వామి:- అదే తల్లి అహంకారం, గర్వం .ఇక్కడ మన మధ్య పొరపత్యాలు లేవు కదా! పోటీ తత్వం లేదు కదా!
శివ నందిని:- లేదు స్వామి! మీరు నాతో పాటు ఉన్నారు అనే భావన నాకు కలిగించండి. అంతేగాని నా సాధన పూర్తయిపోయింది… నీ సాధన ఇంకా మిగిలింది. నువ్వు ఎప్పుడు పూర్తి చేస్తావో అన్నట్టుగా అంటే…. నాకు చిరాకు వస్తుంది.కోపం వస్తుంది. మళ్లీ ఆ కోపంలో నేనేమైనా అంటే మళ్ళీ బాధపడతారు. మళ్లీ నేనే తగ్గి నేనే సారీ చెప్పాల్సి వస్తుంది. మీరు తప్పు చేసినా నేనే సారీ చెప్పాల్సి వస్తుంది. నేను తప్పు చేసినా కూడా నేనే సారీ చెప్పాల్సి వస్తుంది. మీకు మీరు ఒక మెట్టు కూడా దిగి నాతో మాట్లాడరు.
శివస్వామి:- ఇప్పుడేంటి?నిన్ను బతిమిలాడుకొని నీ కాళ్లు పట్టుకోవాలా ?
శివ నందిని:- అంత ఇది లేదులే స్వామి! మీ కాళ్లు పట్టుకునే అవకాశం నాకు ఇస్తే చాలు. మీ పక్కన పతిసేవ చేసుకునే అవకాశం ఇస్తే చాలు. అసలు అక్కడ అవకాశం లేదు… యోగమే లేదు… మీరేమో శ్రీశైలంలో ఉన్నారు. నన్నేమో యాత్రలకు తిప్పుతున్నారు. ఎక్కడ కలిసేది… ఎక్కడ ఇది చేసేది….అసలు నేను పాతివ్రత్య ధర్మంలో ఉండి శివున్నే భర్తగా భావించుకొని… శివసాంగత్యంలో ఉండాలి అనుకున్నాను. కానీ ఇలా టెలిపతిలో అనుసంధానం అవుతారని అనుకోలేదు. నా పక్కన మీరు ఉంటే సజీవ శివమూర్తి ప్రత్యక్ష శివుడని భావన కలిగించి ….మీరేమో దూరంగా ఉంటారు. అంటి అంటనట్టుగా ఉంటారా అంటే అది కాదు… బాధ్యతగా ఉంటారు. సమస్య వచ్చినప్పుడు నేను ఉన్నాను అని మనోధైర్యం ఇచ్చి సదృశ్యంగా, సాకారంగా కనపడతారు. కానీ మీకు సేవలు చేసుకునే యోగం మాత్రం నాకు కలిగించరు. మీ పాదాలు పట్టుకుని మీ పాద సేవ చేయాలని…. మీకు కావలసింది అందించాలని చెప్పేసి… నా పతిదేవునికి సేవలు చేసుకోవాలని ఆలోచనలు ఉంటాయి కదా! ఆ అవకాశాన్ని ఎందుకు కలిగించరు?
శివస్వామి:- తల్లి! ఇప్పుడు నువ్వు నా మాయలో పడవద్దు. మనం వాటికి అతీతమైన స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకో! ఇప్పుడు నువ్వు ఆదిపరాశక్తి అంశలో ఉండి సాధన చేయాలి. ఇక్కడ నువ్వు నాకు సేవలు చేస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు కదా!
శివ నందిని:- పతి సేవ చేసుకుంటే మోక్షం వస్తుంది అన్నారు కదా! మరి నేను గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ యాత్రలు తిరగటం ఎందుకు? అదేదో మీ చుట్టూ తిరిగితే…..మీకు సేవలు చేస్తే…. నాకు మోక్షం వచ్చేస్తుంది కదా! ఆ వచ్చే దైవిక వస్తువులు ఎక్కడ ఉన్నా వస్తాయి కదా! ఇవన్నీ చేయడం ఎందుకు?
శివస్వామి:- దైవిక వస్తువులు వస్తాయి…. కానీ అవి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నవి వస్తాయి. ఇప్పుడు మట్టి శివలింగం రావటం వేరు….అమ్మవారు ఆరాధన చేసిన మట్టి శివలింగం కావడం వేరు…. ఈ రెండింటికి తేడా ఉందా? లేదా?
శివ నందిని:- ఏదో ఒకటి చెప్తారు. నా నోరు మూయించేస్తారు. నన్ను దూరంగా ఉంచుతారు. అలా అని విడివిడిగా ఉండి విడిపోకుండా చూస్తారు. మీరు అర్థం కారు…. మీ మాటలు అర్థం కావు… మీ చేష్టలు అర్థం కావు… నిజంగానే శివుడి లాగానే మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు నిజంగానే శివాంశ.
శివస్వామి:-ఏంటి తల్లి! నువ్వు నా మీద పడతావు… ఇవాళ భోజనం చేయలేదా! నన్ను తింటూ కూర్చున్నావు. నాకు కపాల భోజనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నావు…. ఇప్పుడు నేను విశ్రాంతి, మనశ్శాంతి కోసమని బయటకు వచ్చాను. నువ్వు కాస్త నీ మాటలతో పౌరుషంగా, ఆవేదనగా మాట్లాడితే మాటలకి నాలో ఉన్న శాంతి కాస్త పోయి… అశాంతి వస్తుంది. ఎందుకు నాలో ఆవేదన కలిగిస్తావు.. విరహవేదన కలిగిస్తావు …ఇప్పటికే నేను అన్నింటినీ దాటుకొని వచ్చి ఏదో సన్యాస దీక్షలో ఉన్నాను అనుకుంటున్న సమయంలో…. ప్రకృతి నువ్వు నా ధర్మపత్ని అని చెప్పేసి లేనిపోని ఆశలు, ఆవేదనలు కలిగిస్తుంది. మనోవేదన, విరహవేదన కలిగిస్తుంది. ప్రేమలు కలిగిస్తుంది. వీటికి తోడు నువ్వు మాట్లాడే వెటకారపు మాటలకి….. నాలో ఆవేదన కలుగడమే తప్ప….. ఆవేశం పెరగడమే తప్ప…. ఏమీ ఉపయోగం లేదు.
శివ నందిని:- ఊరుకోండి స్వామి! నేను ఏదో సరదాగా అన్నాను. మిమ్మల్ని ఏదో ఆటపట్టించాలని అన్నాను… అలా ఏం లేదు…అన్నీ తెలిసిన వాళ్ళు మీరు… మీరు కూడా నన్ను ఆటపాటించడానికి మాటలు కొనసాగిస్తారని అన్నాను… ఆ మాత్రం నాకు తెలియదా!
శివస్వామి:- ఇప్పుడు నన్ను ఎందుకు తలచుకున్నావు! కారణం ఏమిటి?
శివనందిని:-ఏమీ లేదు స్వామి! ఏదో మీ అనుగ్రహం వలన మూలాధార చక్ర సాధన పరిసమాప్తి చేసుకున్నాను.
శివస్వామి:- నా అనుగ్రహం కాదు శివాని… నీకున్న అనుగ్రహం. అది నీకు అర్హత, యోగ్యత,యోగం సంపాదించుకున్నావు. కాబట్టి అమ్మవారే అనుగ్రహించి…. స్వయంగా నీలో ఆత్మశక్తిగా ప్రవేశించింది. ఆమె సాధనను పరిసమాప్తి చేసుకోవడానికి…. ఆవిడకి ఆవిడే పూనుకుంది. కాబట్టి శ్రద్ధా భక్తులతో అహంకార రహితంగా ఉండి….కోరిక రాహిత్యంగా ఉండి…. మీ సాధన పరిసమాప్తి చేసుకో! సర్వకర్మ బంధాల నుంచి, ఋణ బంధాలనుంచి, ఋణ విముక్తి పొందు . సాధన పరిసమాప్తి అవుతుందా? లేదా అనేది శివాజ్ఞ. శివుడికి వదిలెయ్యి . కాల నిర్ణయం. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ మాయలో పడకుండా ఉండు చాలు. ఈ సాధన ఎక్కడ ఆపకుండా ఉంటే చాలు….
శివనందిని:-అదే నేను అనుకుంటున్నాను స్వామి! ఇప్పుడు నా ఆది జన్మ స్థూల శరీరం ఘృష్ణేశ్వర్ క్షేత్రంలో ఉంది అని చెప్పేసి నిర్ధారణ అయింది. అమ్మవారు కూడా ధ్యానంలో ఇదే శివలింగాన్ని చూపించి నిరూపణ చేసింది.
శివస్వామి:- సరే మంచిది… ఇది 12వ జ్యోతిర్లింగం అనుకుంట. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకో! అక్కడ ఉన్న నల్లరాతి శివలింగమును కూడా పొందటానికి సాధన చెయ్యి. అమ్మవారి అనుగ్రహం పొందు.
శివ నందిని:- ఏదో మీలాంటి వాళ్లు నా మీద కనికరం చూపిస్తే… ఆశీస్సులు ఇస్తే… నేను నా సాధనను పూర్తి చేసుకొని… ఆ నల్ల శివలింగాన్ని కూడా పొందుతాననే మనోధైర్యం వస్తుంది.
శివస్వామి:- నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఆశీర్వదించాల్సిన అవసరము లేదు…
శివనందిని:- అది నాకు తెలుసు స్వామి! ఏదో అలా అనాలనిపించింది. నా మనసులో ఉన్నవి అన్నీ నాకు కావలసినట్టుగా, నచ్చినట్టుగా… మీతో ఉండవచ్చు కదా! మళ్లీ ఇందులో షరతులు గానీ నియమాలు కానీ ఉన్నాయా?
శివస్వామి:- అవి ఏమీ లేవు తల్లి.. ఉన్నది ఒక్కటి శరీర వాంఛ మాత్రమే….అది ఉండకూడదు. అంతకుమించి ఇంకేమీ లేదు.
శివ నందిని:- అలాంటి కామ వాంఛలు నాకు లేవు.
శివస్వామి:- సరే అయితే… జాగ్రత్త మరి… నేను ఉంటాను.
శివ నందిని:- సరే స్వామి!
అనేసరికి కాసేపటికి ఈమె నిద్రలోకి జారుకుంది. అలా నిద్రలో ఎంతసేపు ఉందో తెలియదు…. ఉన్నట్టుండి మెలకువ వచ్చేసరికి… ఉదయం 5 గంటల అవుతూ ఉండేసరికి… అందరూ నెమ్మదిగా నిద్రలో నుంచి లెగుస్తూ శివ నందినికి కనిపించారు.
మహాదేవి కాస్త బాలగణపతి కేసీ చూస్తూ….
మహాదేవి:- అరేయ్! నీకు కొత్త అమ్మ శివ నందిని వచ్చేసరికి పాతమ్మని పట్టించుకోవడం మానేశావు.
బాలగణపతి:- ఏమైందమ్మా !
మహాదేవి:- రాత్రిపూట నువ్వు ఎక్కువగా కొత్త అమ్మ దగ్గరే ఉంటున్నావు… నా దగ్గర ఉండటం లేదు కదా!
బాలగణపతి:- నువ్వు కథలు చెప్పవు కదా! అదే కొత్త అమ్మ అయితే… కథలు చెబుతుంది… నిద్రపుచ్చుతుంది….అనేక విషయాలు చెబుతుంది…
మహాదేవి:- నేను ఎందుకు చెప్పను? నన్ను అడిగితే చెప్పనా!
బాలగణపతి:- ఎప్పుడు చూసినా రాత్రిపూట నువ్వు ఆ కపాలం కర్ర చేతిలో పట్టుకొని…. గాలిలో తిప్పుతూ ఉంటావు. ఏదో మంత్రాలు చదువుతూ ఉంటావు…. నిన్ను అడగాలనిపించదు…. ఆ మంత్రాలకి ఆ కపాలం ఉన్న పుర్రెను చూసేసరికి…. నాకు భయం వేస్తుంది. నీ దగ్గర పడుకోవాలంటే ధైర్యం చాలదు.
మహాదేవి:- ఏం చేయమంటావు? రాత్రి పూట నాకు జ్ఞాన స్ఫురణలు అందుతూ ఉంటాయి విశ్వం నుంచి….. దానితో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాను…. నేను ఎప్పుడు ధ్యానంలోకి వెళ్తూ ఉంటానో నాకే తెలియదు. ఎప్పుడు మెలకువగా ఉంటానో నాకు తెలియదు. ఎప్పుడు నిద్ర పోతానో నాకే తెలియదు. ఎప్పుడు నిద్ర నుంచి నిద్ర మెలకువ కానీ యోగ స్థితిలో ఉంటానో… నాకే తెలియదు.
బాలగణపతి:- అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఎలా ఉండగలను చెప్పు..? ఇప్పుడు శివ నందిని అమ్మ ఉందనుకో…. ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తుంది. ఇప్పుడు మాతో గడపాలి అనుకుంటే….. శుభ్రంగా మాతో గడుపుతుంది. మేము వెళ్లి అడిగేసరికి విశ్రాంతిగా కూర్చుని మా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మాకు నచ్చినట్టుగా కావాల్సినవి వండి పెడుతుంది. కావలసినట్టుగా చూసుకుంటుంది. నన్ను అన్నయని ప్రేమగా చూసుకుంటుంది కదా! అదే నీ దగ్గరికి వచ్చేసరికి తత్తర బిత్తర పడుతూ ఉంటావు. కంగారు పడుతూ ఉంటావు… హడావిడి పడిపోతూ ఉంటావు….ఏదో ధ్యానంలో ఉండి గాల్లో చేతులు తిప్పుతూ ఉంటావు…. ఏదో చేస్తూ ఉంటావు… నువ్వు భయంతో బాధ్యతగా చేస్తూ ఉంటావు. శివ నందిని అమ్మ ప్రేమగా చేస్తూ ఉంటుంది. బంధంగా చేస్తూ ఉంటుంది. నీకు అమ్మకి అదే తేడా!
మహాదేవి:- సరేగాని ఇదంతా కాదు గాని….. ఈమధ్య ఏంటి ఉండ్రాళ్లు అడగడం మానేశావు… అసలు అడగటం లేదు ఏంటి?
శివ నందిని:- అవునురా! నిజమే … ఉండ్రాళ్లు అడగడం లేదెంటి?
బాల గణపతి:- ఆ…! గుర్తుకొచ్చింది. మీకు ఒక విషయం చెప్పలేదు కదా! గుర్తుకు వచ్చింది… చెబుతా ఉండండి….. మనం కంచిలో కామకోటి పీఠానికి దర్శనానికి వెళ్ళాం కదా! అక్కడ పీఠాధిపతుల ఫోటోలు అవన్నీ చూస్తూ వచ్చాం కదా! కంచి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి సజీవ మూర్తిగా ఉన్న విగ్రహ మూర్తి ముందు ధ్యానంలో కూర్చున్నాను. అక్కడికి కొంత మంది భక్తులు వచ్చారు. వచ్చి ఏదో విషయం మాట్లాడుతూ ఉండేసరికి…. ధ్యానభంగం అయింది. సరేలే….. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెవులు మిక్కిరించి కళ్ళు మూసుకొని వింటూ ఉన్నాను. అందులో ఒక పెద్దాయన చెబుతూ….. స్వామివారికి ఒక రోజు భోజనంలో తోటకూర పప్పు వేయడం జరిగిందట! అప్పటిదాకా ఆ తోటకూర అంటే ఏమిటో…. ఆ రుచి ఏమిటో …..తెలియని స్వామి వారు ఆప్యాయంగా, ప్రేమగా పప్పుని తినడం చూసిన వంటవాడు….. ఆ రోజు నుంచి ఒక వారం రోజులపాటు పెడుతూ ఉండే….. ఆ రుచికి అలవాటు పడిన మహాస్వామి వారు దానిని ప్రేమగా ఆప్యాయంగా తింటూ ఉండేసరికి…. వంటవాడు సంతోషం చెందాడట. ఒకరోజు అతనికి ఎక్కడా కూడా తోటకూర దొరకలేదట. భక్తుల ఇళ్లకు పంపించినా గానీ తోటకూర దొరకలేదంట. భక్తులు, తోటకూర అమ్మే వాళ్ళ దగ్గర కూడా లేకపోవటంతో…. ఎన్ని అవస్థలు పడినా… ఎన్ని ప్రయత్నాలు చేసినా…. ఆరోజు భోజనానికి తోటకూర పప్పు చేయలేకపోయాడట. ఇక ఆరోజు తోటకూరలేని ఆహార పదార్థాలతో ఆహారం వడ్డించారట. విస్తరాకులో తోటకూర పప్పు లేకపోయేసరికి…. ప్రశ్నార్థకంగా వంట వాడికేసి చూసేసరికి స్వామి! క్షమించండి…. ఎక్కడా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా…. భక్తులను పంపించినా కూడా…. తోటకూర విచిత్రంగా ఎక్కడ దొరకలేదు. మీకు ఇష్టమైన తోటకూర పప్పు చేయలేకపోయాను. …. అనేసరికి తనకి ఉన్న పదార్థ రుచి వలన వంటవాడు అవస్థ పడటం గమనించి….. ఈ పదార్థ రుచికి కారణం తన నాలుగే కదా! నాలుక ఫలానా రుచికి అలవాటు పడటం వలన…. పదార్థ రుచికి అలవాటు పడటం వలన…. అది గమనించిన వంటవాడు క్రమం తప్పకుండా ప్రతిరోజూ నాకు తోటకూర వండి పెడుతున్నాడు. దీనికి కారణం నాలుక అని చెప్పేసి భోజనం చేస్తున్న ఆయన కాస్త లేచి…. గోశాలకు వెళ్లడం…. ఆ గోశాలలో ఆవు పేడను నాలుకకు పరిహార దోషంగా రాసుకొని…. ఇప్పుడు ఇదే తోటకూర పప్పు అని మూడు రోజుల పాటు భోజనం చేయకుండా ఉపవాస దీక్షతో ఉండి పదార్థం రుచిని దాటడం జరిగింది… అని చెప్పేసరికి ఇదంతా విన్న నాకు ఉండ్రాళ్ళ రుచి మీద మోహం పోయింది. నిజమే కదా! ఈ ఉండ్రాళ్ళ రుచికి అలవాటు పడిన మనసు, నాలుక కోరుకోవడం వలనే కదా! మీరందరూ వాటిని తయారు చేయడానికి అవస్థలు పడ్డారు. అసలు నేను ప్రతిపదార్థంలోనూ ఉండ్రాళ్ళ రుచిని చూస్తే… ఈ తిప్పలన్నీ ఉండవు కదా! అని ఆ రోజు నుంచి నాలో ఉండ్రాళ్లు తినాలనే కోరిక తీరిపోయింది. వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు దాన్ని చూస్తే కడుపులో తిప్పుతుంది. వాంతులు అవుతాయేమో అనేలా కూడా ఉంటుంది.
శివ నందిని:- (ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం…. అందులోను ఆహార పదార్థాల మీద రావటం…. ఆహార పదార్థాన్ని దాటాడు అంటే వీడు హృదయ చక్రానికి వచ్చినట్టు ఉన్నాడు….) అని మనసులో అనుకుని …..సరే మంచిది! ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఉండ్రాళ్లు తినవచ్చు. కానీ ఉండ్రాళ్లు మానేయాలని అనుకోవద్దు. కాకపోతే ప్రతిరోజు ఉండ్రాళ్లు ఖచ్చితంగా తినాలని నియమం పెట్టుకోకు. పరిస్థితిని బట్టి అవి దొరకవచ్చు…. దొరకకపోవచ్చు. చేసేవాళ్ళు ఉండచ్చు…. ఉండకపోవచ్చు…. సంవత్సరంలో ఎప్పుడైనా వీలున్నప్పుడు…. సమయం దొరికినప్పుడు…. వాటిని తింటూ ఉండు. నెమ్మదిగా నీకు వాటి మీద వైరాగ్యం కలుగుతుంది.
బాల గణపతి:- అలాగే అమ్మ! ఇక నేను పదార్థ రుచికి చలించను. దానిని దాటేశాను.. ఆ మోహమాయ పోయింది. కాకపోతే ఎప్పుడైనా పరిస్థితులు అనుకూలించినప్పుడు…..అవి దొరికినప్పుడు….సంతృప్తిగా తింటాను. అవే తినాలని ఖచ్చితంగా నియమం అయితే పెట్టుకోను.
మహాదేవి:- ఇలా నువ్వు మారతావని తెలిసి ఉంటే…. ఈ కథను ఎప్పుడో చెప్పేదాన్ని. కంచి స్వామి అనుభవాన్ని నీకు ఎప్పుడో చెప్పేదాన్ని.
రుద్రస్వామి:- వాడికి అప్పుడు చెప్పినంత మాత్రాన వాడికి బుర్రక ఎక్కి పదార్ధ రుచిని మానేవాడు కాదు.అమ్మవారు అనుగ్రహించాలి…. అలాగే చంద్రశేఖర స్వామి అనుగ్రహం కలిగి ఉండాలి. ఆ అనుగ్రహం వలన వీడు పదార్థ రుచిని దాటగలిగాడు. ఆ మాయను దాటగలిగాడు. అంతేకానీ నువ్వేదో చెప్పినంత మాత్రాన మారడు… సిద్ధపురుషుల లీలలు వేరుగా ఉంటాయి. వాళ్ళు చూపుతోనే,మాటతోనే, స్పర్శతోనే, మన జీవితాలను మార్చేస్తారు. గ్రహస్థితిగతులు మార్చేస్తారు. భావాలు మార్చేస్తారు. ఆలోచనలు మార్చేస్తారు. మాయలు మాయమైపోతాయి. అనుగ్రహం పొందడం కూడా కష్టం. ఈ కలియుగంలో…. కలి ప్రభావం వలన నిజగురువులు ఎవరు? నిజ సిద్ధ పురుషులు ఎవరు? దైవాలకు కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. అసలు నిజానికి నిజ దైవం ఎవరో కూడా ఎవరికీ తెలియదు .
అనేసరికి ఇది నిజమే అని ఎవరికి వారే మౌనం వహించి….బస్సు అద్దంలో నుంచి వెళ్ళిపోతున్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ…. ఆనందపడుతూ, సంతోషపడుతూ ఎవరికి వారే ఆలోచనలలో నిమగ్నమయ్యారు. బస్సు మహారాష్ట్ర వైపుకు ప్రయాణం చేయడం ఆరంభించింది.
ఇలా సాధనా కుటుంబం ఘృష్ణేశ్వర క్షేత్రానికి చేరటానికి…బస్సులో సుమారు మూడు రాత్రులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ క్షేత్రానికి చేరుకున్న తర్వాత దగ్గరలో ఉన్న హోటల్ రూమ్ లో గదులు తీసుకుని స్నానాధికాలు చేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలకి ఆకలి వేయడంతో….. టిఫిన్లు చేసుకొని గుడి దర్శనానికి వెళదామని అనుకుని…. కింద దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్లు పూర్తి చేసుకొని….. గుడి దర్శనానికి బయలుదేరుతూ ఉండేసరికి…. దారిలో గుడి దగ్గరలో పూలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్మే షాపులు రెండు వైపులా కనిపించేసరికి….. పిల్లలు ముచ్చటపడి మేము పూజా సామాగ్రి కొంటాము… స్వామివారికి అభిషేకం చేసుకుంటాము అనేసరికి….ఒక పూజా సామాగ్రి సెట్టును శివ నందిని కొని ఇచ్చేసరికి…. ఆనందపడుతూ… సంతోషపడుతూ ఉండేసరికి వీళ్ళ వెనక రుద్ర స్వామి మరియు మహాదేవి ఆ తర్వాత శివ నందిని ఆలయంలోనికి ప్రవేశించడం జరిగింది. చూడటానికి ఆలయం చాలా విశాలంగా ఉంది. ఈ ఆలయంలో ఆవరణ మధ్య భాగంలో ఘృష్ణేశ్వర రాతి శివలింగం కనిపించింది. అన్ని క్యూలు దాటుకొని దర్శనానికి రావడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఒకటిన్నర సమయంలో ఆయనకి రుద్రాభిషేకం చేసి అలంకరణ చేసి హారతి ఇస్తారు అని చెప్పేసరికి….. ఆ సమయానికి వీరు అక్కడ ఉండేసరికి వాళ్ళ ముందే అభిషేకాలు జరగటం…. ఆ తర్వాత అలంకరణలు చేయటం…. హారతి ఇవ్వటం…. అదంత అనుకోకుండా జరిగింది. పిల్లల ముచ్చట తీరింది. ఈ విధంగా శివుడు అనుగ్రహించాడని కృతజ్ఞతలు చెప్పుకొని….ఆ తర్వాత దర్శనం చాలా ప్రశాంతంగా అయ్యింది అని చెప్పి…. అంతగా భక్తుల తాకిడి కూడా లేదని చెప్పేసి…. శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి ఇక్కడ ఎక్కువగా భక్తులు వస్తారేమో అనుకొని… ఆ విశాలమైన ఆవరణలో ఉన్న స్తంభాలలో ఒక స్తంభం దగ్గర కూర్చొని పిల్లలు జపం చేసుకుంటూ ఉంటే…. పెద్దలు ముగ్గురు కలిసి ఏకాంతంగా, ఒంటరిగా ధ్యాన నిమగ్నం అయ్యారు. ఇలా ఎంతసేపు ఉన్నారో ఎవరికీ తెలియదు. భక్తులు వస్తున్నారు …పోతున్నారు…. వీళ్ళని చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. వీళ్ళేమో పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. ఎవరి రందిలో వాళ్ళు ఉన్నారు. ఇలా సుమారుగా రెండు గంటలు గడిచేసరికి…. ఎవరికి వారే ధ్యానంలో నుంచి జపం లో నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చాక శివనందిని కేసి చూసి ఇప్పుడు ఏం చేద్దాం అనేసరికి…. అప్పటికే స్థల పురాణ విశేషాలు వివరంగా తెలిసి ఉండటంతో…దగ్గరలో 300 మీటర్ల దూరంలో శివాలయ కుండు అనే సరస్సు ఉంది…. దానిని శివతీర్థం లేదా శివకుండు అని అంటారు అని అవి చూడటానికి అని వెళ్లారు. నీళ్లు చూడగానే ముచ్చటేసి ఇక అందరూ కలిసి ఆ నీళ్లల్లోకి దిగి స్నానాలు చేశారు. తీర్థ స్నానం చేసి మనసును, శరీరమును ఉల్లాసపరచుకున్నారు. అలా నీటిలో ఎంతసేపు ఉన్నారో వాళ్లకే తెలియనంత సేపు… స్నానాధికాలు చేసుకొని వచ్చి కూర్చున్నారు. అప్పుడు బాల గణపతి ఉన్నట్టుండి
బాల గణపతి:- అమ్మ! ఈ సరస్సులోనే అనుకుంట….. కథలో ఒక ఆవిడ 101 మట్టి శివలింగాలు పూజ చేసి నిమజ్జనం చేసింది అన్నారు కదా! అది ఇదే అయి ఉంటుంది ..
శివ నందిని:- అవును! ఈ సరస్సులోనే నిమజ్జనం చేసింది .
బాల గణపతి:- అలా రోజు 101 చొప్పున మూడు సంవత్సరాల పాటు ఆవిడ చేసిందంటే….
అని లెక్కలు వేస్తూ ఉండేసరికి…
బాలకుమారస్వామి:-1,90,000 మట్టి శివలింగాలను నిమజ్జనం చేసింది.
బాల గణపతి:- అయ్యి ఉండొచ్చు… నాకు లెక్కలు అంతగా తెలియదు. అంటే సుమారుగా అటు ఇటుగా రెండు లక్షల శివలింగాలను నిమజ్జనం చేసింది. అంటే ఈ రెండు లక్షల శివలింగాల శక్తి ఇందులో ఉందన్నమాట! అని అనుకుంటూ గబగబా మళ్లీ నీళ్లలోకి దూకి…. మూడు మునకలు వేసి….ఎందుకైనా మంచిది! ఏ పుట్టలో ఏ పాము ఉందో… ఎవరికి తెలుసు? ఇంత శక్తి నాకు వచ్చేస్తే రెండు లక్షల ధ్యానశక్తి నాకు వచ్చేస్తుంది. నేను చాలా శక్తివంతుణ్ణి అయిపోతాను… నాకు మోక్షం వచ్చేస్తుంది…
అని పిల్లాడు సంబరపడిపోతూ ఉండేసరికి అందరూ నవ్వుకున్నారు. సరే అని అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయని చెప్పేసి విషయం తెలిసి ఉండటంతో…. శివ నందిని సాధనా కుటుంబం ఆటో మాట్లాడుకుని ఎల్లోరా గుహలు చూడటానికి వెళ్లారు. అక్కడ టికెట్ 40 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ ఉంటే….టికెట్లు తీసుకొని లోపలికి వెళ్లారు. ఆ తర్వాత లోపల చూడటానికి 100 గుహలు ఉన్నప్పటికీ…..మనుషులు చూడటానికి వీలుగా 34 గుహలు మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రతి గుహకి ఎదురుగా గుహ నెంబరు ఏర్పాటు చేయడంతో….ఒక్కో గుహను చూసుకుంటూ…. కొన్ని శిధిలమైనవి… కొన్ని బాగున్నవి కనపడుతూ ఉండేసరికి… ఏమైందమ్మా! విగ్రహాలు కొన్ని పగిలిపోయి ఉన్నాయి అని అంటే… ముష్కరులు దాడి చేయడం వలన విగ్రహాలు ఖండన చేయడం జరిగింది. ఇక్కడ 16వ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను…. అనేసరికి సుమారుగా ఒక్కో గుహలో జైన సంబంధ విగ్రహాలు, బౌద్ధ మత స్తూపాలు, బుద్ధుడి విగ్రహాలు, ఇవన్నీ కనిపిస్తూ…. ఆ తర్వాత హిందూ దైవాల విగ్రహాలు కనపడుతూ…. శాంత శివుడు, ఉగ్ర శివుడు ఆ తర్వాత అంధకాసురున్ని సంహరిస్తున్న అమ్మవారి విగ్రహాలు….ఆ తర్వాత కైలాస పర్వతం మోస్తున్న రావణాసురుడి విగ్రహ మూర్తి…. కైలాసం నుంచి సృష్టి స్థితి లయం చేస్తున్న ఆదిదంపతుల విగ్రహాలు…. ఇలా 16వ గుహ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద శివాలయం కనిపించేసరికి…. అప్పుడు శివ నందిని కాస్త పిల్లలకేసి చూస్తూ ….
శివ నందిని:- ఇదే ఏకశిలా కైలాసనాధుడి విగ్రహ గుడి అని అంటారు. అన్ని గుళ్ళు కింద నుంచి పైకి కడితే….ఈ గుడి పైనుంచి కిందకు కట్టడం జరిగింది. ఒక పెద్ద కొండను తీసుకొని…. పైనుంచి చెక్కుకుంటూ కింద దాకా రావటం జరిగింది. కింద మనకి ద్వారం దగ్గర గణపతి కనబడుతూ ఉంటాడు…. ఇది రెండు అంతస్తులు ఉంది చూడండి…
సాధనా కుటుంబం:- అవును ఉంది.
శివ నందిని:- చుట్టూ చూడండి… ఈ ప్రాకారాలన్నీ ఏనుగు మోస్తున్నట్లుగా ఉంది కదా!
సాధనా కుటుంబం:- అవును గుడి నాలుగు పక్కల కూడా గోడలు ఏనుగులు మోస్తున్నట్లుగా కనపడుతున్నాయి. కొన్ని ఏనుగులకి తొండాలు విరిగిపోయినట్టుగా కనబడుతున్నాయి..
శివ నందిని:- అదే చెప్పాను కదా ! ముష్కరుల దాడి వలన జరిగాయి…
సాధనా కుటుంబం:- అయితే మనం లోపలికి వెళ్లి చూడవచ్చా! అనేసరికి
శివ నందిని:- ఆ చూడవచ్చు …
అని అందరూ మెట్లు ఎక్కి వెళితే…. మొదటి ప్రాకారములో గజమహాలక్ష్మి దేవతా విగ్రహం మూర్తి కనబడింది. రెండో ప్రాకారములోకి వెళ్లేసరికి సుమారు 8 నుంచి 10 అడుగులు ఉన్న ఒక పురుష శివలింగం కనిపించింది. దానికి అందరూ నమస్కారం చేసుకున్నారు. ఆ తరువాత కింద దేవాలయ గోడల్లో మహాభారతమ్, రామాయణ ఇతిహాస పురాణాలకు సంబంధించిన విగ్రహమూర్తులు చెక్కి ఉండేసరికి…. పిల్లలకి ఒక్కో ఘట్టం వివరిస్తూ చెబుతూ దర్శనం చేసుకుంటూ….మిగతా గుహలు దర్శనం చేసుకుంటూ….వస్తూ ఆ గుహల్లో ఉన్న వివిధ దేవతా మూర్తులు శివ నందిని గుర్తుపట్టినవి ….రుద్రస్వామి, మహాదేవి గుర్తుపట్టినవి… వాటికి సంబంధించిన ఘట్టాలను వివరిస్తూ…. ఆ శిల్పాలను తాకుతూ… ఆనందపడుతూ…. తన్మయత్వ స్థితిలోకి వెళుతూ…. ఒక విధమైన ఆనందం పొందడం జరిగింది. ఇక సాయంత్రం అయిందని…. తిరిగి హోటల్ రూమ్ కి వెళదామని అక్కడ నుంచి తిరిగి వెళ్ళటానికి ఆటో మాట్లాడుకొని…. హోటల్ కి రావడం జరిగింది. హోటల్ కి వెళ్లేముందే భోజనం కార్యక్రమాలు పూర్తిచేసుకుని విశ్రాంతి తీసుకోవాలని చెప్పి …..గదికి వెళ్లి ఎవరికీ నచ్చినట్టుగా నేల మీద కొంతమంది….మంచం మీద కొంతమంది పడుకుని…. ప్రయాణం వలన అందరూ అలసిపోయి ఉండటంతో….. గాఢ నిద్రలోకి జారుకున్నారు.
మధ్యరాత్రిలో గాఢ నిద్రలో ఉన్న శివ నందినికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఏమైంది అనుకునేసరికి…. తనకి వచ్చిన కల వల్లనే తనకు మెలకువ వచ్చింది అనుకుంది. ఆ కల గురించి విచారణ చేస్తూ ఉండేసరికి…. ఏదో ఒక గుహలో 11 తలల మహాసర్పం ఉన్నట్లుగా….ఆ సర్పమునకు 11మణులు ఉన్నట్లుగా… సుమారు 11 అడుగుల సర్పం కాస్త సజీవ మూర్తిగా ఉన్నట్లుగా…. ఏదో ముని సర్ప శాప నివారణ కోసం 11 తలల సర్పంగా…. ఈ ఎల్లోరా గుహల్లో ఎక్కడో ఉండి సాధన చేస్తున్నట్లుగా….. దానికి ఏదో శిలా శాసనాలు ఉన్నట్లు….. ఎవరో వచ్చి మణుల కోసం ఈ సర్పం మీద దాడి చేస్తున్నట్లు…. ఆ సర్పమునిశ్వరుడు ప్రతిదాడి చేసి వాళ్ళని చంపేయటం ఇలా దృశ్యాలు అదృశ్యాలు కనిపించి కనిపించినట్లుగా కనిపించేసరికి….. ఉలిక్కిపడి నిద్రలేచింది. పెద్దగా ఒక అరుపుతో నిద్రలేచినట్టుగా అనిపించింది. ఆ అరుపుకు రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా లేచేసరికి ఏమైందమ్మా! ఏమైనా పిడకల ఏమైనా కన్నావా? ఏంటి! అనేసరికి…. తనకి వచ్చిన స్వప్నం గురించి వీళ్ళకి చెప్పేసరికి అవునా! మాకు కూడా ఏదో సర్పం కదులుతున్నట్టుగా సజీవ మూర్తిగా తిరుగుతున్నట్టుగా సజీవమూర్తిగా ఉన్నట్టు అనిపించింది. అది నా భ్రమ ,బ్రాంతి అనుకున్నాను అనేసరికి….. మహాదేవి కూడా ఏదో ఒక గుహ దగ్గరికి వెళ్లి సరికి…మల్లెపూల వాసన, మొగలిపూల వాసన ఏదో దేవతా సర్పం సజీవమూర్తిగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. కానీ నేను అంత పెద్దగా పట్టించుకోలేదు అనేసరికి….అది ఏ గుహనో మీకు గుర్తుందా? అంటే నీకు ధ్యానంలో ఏ దగ్గర కనపడింది అనేసరికి….. నాకు 28,29 గుహల మధ్యలో ఏదో ఖాళీ స్థలంలో ఇసుక దిబ్బలో ఉన్నట్టుగా కనిపించింది అనేసరికి…. మాకు అటు ఇటుగా అదే దిశగా 30 నుంచి 32 మధ్య దగ్గరలో ఉన్నట్టుగా కనిపించింది… ఆ వాసన వచ్చింది అనేసరికి….నాకు అంతగా గుర్తులేదు కానీ, 28వ గుహ దగ్గర సర్పం కదులుతున్నట్టుగా…. ఇక్కడ ఏదో సర్పం తిరుగుతున్నట్లుగా అనిపించింది. అనేసరికి ఆ గుహల్లోనే అంతర్గత సర్పాలయం ఉందేమో అనేసరికి…. సరేలే చూద్దాంలే! ఆయన మునీశ్వరుడు అంటున్నారు కదా! ఇప్పుడు లేనిపోనివి, ఎందుకు….. ఆయన ధ్యానంలో ఉన్నారేమో! ఇప్పుడు ఆయన ధ్యాన నిష్టకి మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసరికి…. నాకు కనిపించిన ధ్యానానుభవం నిజమా కాదా ? తెలుసుకోవాలి కదా అయ్యా! అనేసరికి…. రుద్ర స్వామి కాస్త అన్ని తెలుసుకోవాలనే సాహసంతో నువ్వు ప్రయత్నం చేస్తే
అది మొదటికే మోసం రావచ్చు. వారి తపస్సుకి ధ్యాన భంగం కలిగిస్తే…. లేనిపోని శాపాలు, దోషాలు పొందాల్సి ఉంటుంది. ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం అవసరమా? అనేసరికి ఆ మునీశ్వరుడు తనంతట తానే ధ్యానంలో కనిపించారు ….స్వప్న దర్శనం ఇచ్చారు…. మనమేమీ హాని చేయడం లేదు కదా! ఉందా లేదా అని మనం తెలియటం కాదు….. అప్పటికే కొంత మంది బ్రిటిష్ వాళ్ళు ఎవరో అది ఉంది అని మణుల కోసం ఆశపడ్డారు. వారి మీద దాడి చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు ఈ కాలంలో ఉందో లేదో తెలుసుకోవడం తప్ప…. మనమేం చేయలేము కదా! ఆయనతో అవసరం లేదు. ఆయన మణులతోనూ అవసరం లేదు అనేసరికి….. సరే తల్లి! కానీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ముందు మనం సుప్రభాత సేవకు వెళదాము అనేసరికి…. మరి పిల్లలు? అనేసరికి పిల్లలు నిద్రలో ఉన్నారు కదా ! స్నానాధికాలు పూర్తి చేసుకుని సుప్రభాత సేవకు వెళదాం అంటే ….అవేం వద్దులే ….అక్కడ ఉన్న కుండ్ లో స్నానం చేసుకుని వెళ్దాము …..పిల్లలు నిద్రలో ఉండటంతో తలుపుకు తాళం వేసి శివాలయ కుండ్ కు వెళ్లి అక్కడ ఉన్న సరస్సులో స్నానం చేసేసుకొని….. క్యూ ద్వారా సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని నిద్ర లేపి…. ఆ కార్యక్రమాలు అన్నీ చేసుకొని ……ఆ తర్వాత ఉదయకాలం 6 గంటలకు బయటకు వచ్చి….. నదీ ప్రాంగణంలో ఎవరికి వారే ధ్యానంలో కూర్చున్నారు. గుడి ప్రాంగణంలో శివనందిని మూలాధార చక్రం ముద్ర వేసుకొని…. మూలాధార చక్రం విభేదనం కోసం అడ్డంగా ఉన్న స్థూల శరీరమును చూడాలి… ఆ స్థూల శరీరం ఏమిటో తెలుసుకోవాలి ….అనే సంకల్పంతో అలా ధ్యాననిష్టలో ఉండిపోయింది. కానీ ఎలాంటి ధ్యానానుభవాలు కలగలేదు. సరే అని సుమారుగా మూడు నుంచి నాలుగు గంటలసేపు ధ్యానంలో ఉండేసరికి…. ఇక వీళ్ళ ముగ్గురు ధ్యానం నుంచి బయటకు వచ్చి టిఫిన్లు కానిచ్చేసుకుని …..పిల్లలకు టిఫిన్లు తీసుకుని వెళ్ళేసరికి…… పిల్లలు అప్పటికే స్నానాధికాలు పూర్తి చేసుకుని….. జపం కూడా చేసుకొని…. వీళ్ళు వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉండేసరికి…. తెచ్చిన టిఫిన్లు పిల్లలు కూడా తినేసి ….అమ్మ! మరి ఇప్పుడు ఏం చేద్దాం !అనేసరికి రాత్రి స్వప్నలో కనిపించిన 11 తలల సర్పము గురించి చెప్పేసరికి….. మనం ఎల్లోరా గుహల్లోకి వెళ్లి చూద్దాము …..అక్కడ ఆ స్వామి ఉంటే నమస్కారం చేసి వద్దాము అనేసరికి …..వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఆ ప్రభుత్వాధికారులు ఒప్పుకుంటారో లేదో తెలియదు కదా ! అనేసరికి….. ఊరికే…. మనం ఏమైనా తవ్వి తీస్తామా ? అవకాశం ఉంటే చూస్తాము… అవకాశం లేకపోతే లేదు అనేసరికి రుద్రస్వామి కాస్త ఏమో! ఆ మునీశ్వరుడికే ఇష్టం లేదేమో! ఆయన భూగర్భంలో ఉన్నాడు…. ఇప్పుడు ఆయన్ని బయటకి వెలికి తీయడం అవసరమా ? ఏదైనా సమస్య వస్తే తలనొప్పి వస్తుంది అనేసరికి…మహాదేవి రుద్రస్వామి కేసి చూస్తూ ….అయ్యా! నువ్వు ఎందుకు భయపడతావు ……
మమ్మల్ని ఎందుకు భయపెట్టిస్తావు…. మేమేమైనా కావాలని దాని గురించి చెప్పామా? అనుభవాలు అయినాయి…. అది నిజమా కాదా! అని శివ నందిని తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆయన బయట ప్రపంచానికి తెలియాలని అనుకోవడం లేదు. మనకేదైనా సహాయం చేయాలనుకుంటున్నాడో లేదో లేదా ఆయన సహాయం పొందాలనుకుంటున్నాడు ఎవరికి ఎరుక! అనేసరికి సరేలే కాలమే నిర్ణయిస్తుంది. శివాజ్ఞ లేనిదే సంకల్పం రాదు కదా! అని అనుకొని అందరూ ఆటో ఎక్కి ఎల్లోరా గుహకి వెళ్లారు. ఆ తరువాత కైలాసనాధుడి గుడికి వెళ్లి అందరూ ధ్యానంలో కూర్చున్నారు. మధ్యాహ్న సమయం అవుతూ ఉండగా….. తాము తెచ్చుకున్న పులిహోర పొట్లాలు తిని తృప్తిగా ఆరగించుకొని…. ఆ తర్వాత ఎవరికీ ఏ గుహ దగ్గర సర్ప సువాసనలు కలిగినాయో సుమారుగా 27వ గుహ నుండి 28 29 గుహల మధ్య ధ్యానంలో కూర్చునేసరికి ధ్యానంలో పిల్లలతో సహా అందరికీ మొగలిపూల వాసన మల్లెపూల వాసన వస్తూ ఉండే సరికి …..అమ్మ ! ఇక్కడేదో ఉంది ….విచిత్రంగా మొగలి పువ్వుల వాసన వస్తుంది అని పిల్లలు అనేసరికి వీళ్ళు కూడా ఆశ్చర్య ఆనందాలకి లోనయ్యారు. ఆ తర్వాత మహాదేవి నాకు కూడా 11 తలలా సర్పం మహాసర్పం సజీవ మూర్తిగా కదులుతున్నట్టుగా లీలగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది…. ధ్యానానుభవం అయ్యింది అనేసరికి రుద్ర స్వామి మాత్రం నాకైతే మహాసర్పం ఏమీ కనపడలేదు….ఎవరో మునీశ్వరుడు ధ్యానంలో ఉన్నట్టుగా వయోవృద్ధుడిగా ఉన్నట్లుగా కనిపించింది…. అనేసరికి ఇంటర్నెట్లో వాటి వివరాలు ఏమైనా దొరుకుతాయా అనే చూసేసరికి ఎలాంటి వివరాలు దొరకకపోయేసరికి….. మనం భ్రమ పడుతున్నామేమో..! ఇక్కడ అలాంటిది ఏమీ లేదేమో! అంటే మనం భ్రమ పడే కాడికి ధ్యానానుభవాలు ఎందుకు కలుగుతాయి? అని మహాదేవి అనేసరికి సరే ఏం చేద్దాం అని …..అంటే సరే చూద్దాం మనకి మల్లెపూల వాసన ఎక్కడ ఆగిపోతుందో లేదా ఎక్కడ బాగా వస్తుందో చూద్దాం అనేసరికి…… వీళ్లు గుహలు దాటి పైకి వెళ్తూ ఉండేసరికి ఒకచోట ఒక పెద్ద బండరాయి కనిపించింది. అక్కడ స్పష్టంగా మల్లెపూల వాసన ,సుగంధపూల వాసన, మొగలిపూల వాసన విపరీతంగా వస్తూ ఉండేసరికి….. ఆ బండరాయి తొలగించి చూస్తే ….ఏమైనా తెలుస్తుందా అని అనుకుంటూ ఉండేసరికి…. ఉన్నట్టుండి బాలగణపతి ఉన్నవాడు ఊరుకోక బండరాయిని కదిలించేసరికి భూగ్రహంలో ఏదో గుహ ద్వారం ఉన్నట్టుగా కనిపించింది. సరే అని చెప్పి గుహలోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు కానీ….. దానికి అరచెయ్యి అంత రంధ్రం కనిపించేసరికి ఆ రంధ్రమునకు ఉన్న ఇసుక అంతా తోడేసరికి….. చూడ్డానికి ఇదంతా మట్టి దిబ్బలాగా…. ఇసుకదిబ్బ లాగా ఉంది కదా అని ….
ఆ ఇసుకని దులుపుతూ ఉండేసరికి…. చిన్న రంధ్రం కనిపించింది. ఆ తరువాత ఆ రంధ్రంలో నుంచి చూస్తే,కింద 11 తలలు దివ్యకాంతి మణులతో ఉన్న ఒక సర్ప విగ్రహం కనిపించింది . అది సజీవ మూర్తిగా ఉందా అని ఎవరికి వాళ్లే ఒక క్షణకాలం పాటు భ్రమ పడ్డారు. నిజానికి అది సజీవమూర్తిగా లేదు…. నిర్జీవ మూర్తిగా ఉంది అని అనుకునేసరికి…. ఎవర్రా! అది…. నా తపో నిష్ఠను భంగం చేయడానికి వచ్చింది….నా మణులు కావాలా? అని అనేసరికి…. ఇక వాళ్ళు గబుక్కున ఆ కంతను మూసేసరికి …..ఎవరో ఉన్నారు, లోపల మునీశ్వరుడు అనుకుంట..! ధ్యానంలో ఉన్నారు అనేసరికి….. సరే! ఆ మునీశ్వరుడి సన్నిధానంలో మనం ధ్యానం చేసుకుందాం అనుకొని పిల్లలు ,పెద్దలు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి…. ఓహో! మీరు సాధకులా ? మణుల కోసం రాలేదన్న మాట! నేను దైవ శాపం, సర్ప దోష నివారణ కోసం…. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నేను ఇక్కడ 11 తలల సర్పరూపంలో అజ్ఞాతంగా ఉండి దోష నివారణ చేసుకుంటున్నాను. నా ధ్యానానికి ,నా తపస్సుకి భంగం వాటిల్లకుండా…. మానవులు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని…. నా మణులను ఆశించకూడదని …..ఇలా భూగర్భంలో ఏకాంతంగా ఉన్నాను. ఆ ఘృష్ణేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి….. మూడు కిలోమీటర్ల దూరంలో ఏకాంతంగా ఒంటరిగా….. ఎవరూ రాని గుహలో నేను ఆవాసం చేస్తున్నాను. అయినా కూడా మీరు కనిపెట్టి నా దగ్గరికి వచ్చారు. మీకు నేను ఉన్నాను అని ధ్యానానుభవంలో నిదర్శనం చూపించాను . మీరు నా దర్శనానికి రావడం జరిగింది. మీ వలన నాకు ఎలాంటి ఆపద లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా రంధ్రంలో నుంచి చూసుకోండి అని అందరికీ ఏకకాలంలో కనిపించేసరికి …..అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచి ఆ రంధ్రంలో చూసేసరికి ఆయన ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా పైనుంచి కింద నుంచి అభయం ఇస్తున్నట్లుగా చూపించేసరికి….. ఒక్కొక్కళ్ళు నమస్కారం చేసుకుని ఆశీస్సులు కావాలని అడిగేసరికి….. ఇష్ట కామ్య ఫల సిద్ధిరస్తు అని దీవిస్తూ …..శివనందిని దగ్గరకు వచ్చేసరికి…. అమ్మా! నువ్వు ఒక్కదానివే నా శాపవిముక్తి చేయగలవు కాబట్టి…..నా ఆత్మ శక్తితో నీలోకి ప్రవేశిస్తాను. నువ్వు ఆదిపరాశక్తి కామాక్షి దేవి నీ యందు ఉంది అన్నట్టు నాకు ధ్యాన అనుభవం అయ్యింది. అందుకే నీకు నేను ధ్యాన దృశ్యం ఇవ్వటం జరిగింది. నావల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు. నీవల్ల నాకు ఎలాంటి అపాయము కలగదు కాబట్టి….. నాకున్న సర్ప దోష నివారణ కోసం మోక్షం ప్రసాదించగల ఏకైక వ్యక్తివి నువ్వు. మోక్షం పొందుతావా..! లేదా? అన్నది కాల నిర్ణయమునకే వదిలేద్దాము. కాకపోతే నా ఆత్మ శక్తి నీలోకి ప్రవేశించడం వలన…… నువ్వు మోక్షం పొందితే నేను మోక్షం పొందినట్లు అవుతుంది. నాకు ఇక్కడ భౌతిక శరీరానికి విముక్తి కలుగుతుంది అనేసరికి…..సరే స్వామి! మీ ఆజ్ఞ…. నాదేమీ లేదు అనేసరికి…… ఈమెకి బ్రహ్మ రంధ్రంలోకి 11 తలల సర్ప రూపంలో ఆయన ఆత్మ రూపంగా సహస్ర చక్రం లోనికి ప్రవేశించడం జరిగింది.
అప్పటికే ఆత్మ శక్తి స్వరూపంగా ఉన్న కామాక్షి దేవికి ఈయన 11పడగలతో అమ్మవారికి సేవ చేసే స్థితిలో ఉన్నట్లుగా కనిపించేసరికి ……లీలామాత్రంగా అమ్మవారు అనంత శేషుని మీద శయనిస్తున్నట్లుగా కామాక్షి రూపం శివ నందినికి లీలగా కనిపించి…. ఎంతటి అదృష్టం.! కనివిని చూడని దృశ్యమును చూస్తున్నాను కదా! ఇన్నాళ్లు విష్ణుమూర్తి ఆదిశేషుని పడగల మీద ఉన్నాడు. ఇప్పుడు కామాక్షి దేవి పడగల కింద ఉన్నది అని చెప్పేసి…. ఆ దివ్య మంగళ రూపం దర్శనం చేసుకుంటూ… తన్మయత్వం పొందుతూ… ఆనందపడుతూ …..ఉండేసరికి ఒక పెద్ద గాలి దుమారం వచ్చి ఆ ఇసుకతో ఆ భూగ్రహం కప్పి వేయడం జరిగింది. అక్కడ తీరా చూసేసరికి ఇసుక తప్ప ఏమీ కనిపించలేదు. సువాసనలు రావడం ఆగిపోయాయి. కాబట్టి తాము వచ్చిన పని పూర్తి అయ్యింది అని అందరూ కూడా దర్శనం చేసుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి…! ఇక ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది…. ఇంక ఆయన యోగాగ్నితో దహనం చేసుకుంటాడు. భూలోక వాసులకి తన ఉనికి లేకుండా చేసుకుంటాడని….. శివ నందినికి అనిపించి….సరే! అని ఇక అక్కడి నుంచి రావడం జరిగింది. గదిలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకోవడం జరిగింది.
యధావిధిగా సుప్రభాత సేవకి సాధన కుటుంబం అంతా ఘృష్ణేశ్వర స్వామి శివాలయానికి దగ్గరలో ఉన్న శివ కుండ్ కి వెళ్లి స్నానాధికాలు చేసుకొని సుప్రభాత సేవకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత సుప్రభాత సేవ పూర్తి చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఎవరికి వారే ధ్యానాలు, జపాలు చేసుకోవడం ఆరంభించారు. శివ నందిని కాస్త పృథ్వి ముద్రతో మూలాధార చక్ర విభేదనం కోసం….. స్థూల శరీర జాగృతి కోసం తపన తాపత్రయములతో సంకల్పంతో సాధన చేస్తూ ఉంది. ఇలా కొన్నాళ్ళ పాటు సాధన చేసినప్పటికీ…. ఎలాంటి మార్పు రాకపోయేసరికి స్వామి! నన్ను అనుగ్రహించండి. నా సాధనలో ఏ లోపం ఉందో అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది. నా స్థూల శరీరం ఇప్పటికీ నాకు దర్శనం కాలేదు. ఇక్కడ నీ అనుగ్రహం వల్ల నాకు దర్శనం అవుతుందని సాధన విగ్రహం అయితే చెప్పడం జరిగింది. సాధనలో ఎటువంటి ధ్యానానుభవాలు కానీ…. ధ్యాన దృశ్యాలు కానీ కనిపించడం లేదు అనుకుంటూ…. ఆవేదన పడుతూ…. తన ధ్యానం కొనసాగిస్తూ ఉంది. ఇలా సుమారుగా నలభై ఒక్క రోజుల తర్వాత అనుకోకుండా గాఢ నిద్రలో ఉండేసరికి…. శివ కుండ్ తీర్థం నుంచి తనలాంటి రూపం ఒకటి బయటకు వచ్చి అటూ ఇటూ తిరుగుతున్నట్టుగా కనిపించేసరికి….బహుశా ఇదే నా ఆది జన్మ స్థూల శరీరం అయి ఉంటుంది అని అనుకునేసరికి…. నిద్రాభంగం అయింది. లేచి చూసే సరికి సుప్రభాత సేవకు వెళ్ళటానికి అందరూ
సిద్ధంగా ఉండేసరికి….. తను కూడా లేచి రుద్రస్వామికి తన అనుభవం గురించి చెప్పేసరికి…..
రుద్రస్వామి:- మంచిదే తల్లి.! ఇవాళ నీకు ధ్యానంలో అక్కడ ఏమైనా కనపడుతుందేమోలే! ధ్యాన దృశ్యం ఏమైనా తెలుస్తుందేమోలే.! ధ్యాన అనుభవం అవుతుందేమో! ఈలోగా నువ్వు బయలుదేరు…. గుళ్లో స్నానాధికాలు చేసుకొని మనం సుప్రభాత సేవకి వెళదాము….
అనేసరికి అందరూ చేత సంచులు తీసుకొని స్నానాలు చేయడానికి అని శివాలయం చేరుకోవడం జరిగింది. యధావిధిగా అందరూ స్నానాలు చేస్తూ ఉండేసరికి శివనందినికి ఉన్నట్టుండి ఏదో తెలియని యోగమత్తు లాగా ఆవరించేసరికి సరస్సులో తూలిపోయి.. పడిపోయే పరిస్థితికి వచ్చింది. నీటిలో తేలుతూ మునిగిపోతూ ఉండేసరికి….
రుద్రస్వామి:- ఏమైంది! శివ నందిని! ఏం జరిగింది?
అని ఆయన చేతులతో లాగి పైకి తీసుకువచ్చి పెట్టాడు.
శివనందిని:- ఏమో తెలియదు అయ్యా..? ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి…..
రుద్రస్వామి: కాసేపు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకో! సరైన నిద్ర, సరైన ఆహారం లేకపోవడం వల్ల నీకు శరీరం దెబ్బతిన్నదేమో!
శివ నందిని:- కాదు…. అది యోగమత్తులాగా ఆవరించింది. ధ్యానంలో కూర్చుంటాను… నన్ను ఇబ్బంది పెట్టకండి…
అనేసరికి సరే అని పిల్లలు మిగిలిన వాళ్ళు స్నానాధికాలు చేస్తూ ఉండేసరికి…. శివ నందిని కాస్త ధ్యానంలో ఉండేసరికి ఈ కుండ్ నుంచి తన లాంటి శరీరం ఆది జన్మ స్థూల శరీరం ప్రత్యక్షంగా తన స్థూల శరీరంలోనికి…. ఆజ్ఞ చక్రంలోనికి భ్రుకుటి స్థానంలోకి ప్రవేశించి…. మూలధార చక్రంలోనికి వెళ్లి ధ్యానంలో కూర్చున్నట్టుగా….. ధ్యాన అనుభవం అయ్యేసరికి…. కళ్ళు తెరిచి చూసేసరికి…. ఇది ధ్యానానుభవమా? నిజంగా జరిగిందా? అని అనుకునేసరికి….. అమ్మ! అమ్మ! ఇప్పుడు ఒక విచిత్రం జరిగింది. నీలాంటి స్త్రీ మూర్తి ఒక ఆవిడ నీటిలో నుంచి బయటకు వచ్చి నీలో కలిసిపోయింది… మేమంతా చూసాము…. అనేసరికి ధ్యానంలో చూశారా? ప్రత్యక్షంగా చూశారా? అనేసరికి నిజంగానే చూసాము…. కవల పిల్లలు లాగా నీలాగే ఉంది. కాకపోతే ఆవిడ వస్త్రాలు వేసుకున్నట్టుగా కనిపించలేదు అనేసరికి….. అంటే ఆ తన ఆదిజన్మ స్థూలశరీరం తనలోకి ప్రవేశించిందన్నమాట! మూలాధార చక్రంలోకి ప్రవేశించింది…. దీనికోసమే కదా తను వచ్చింది అనుకుంటూ ధ్యానమును కొనసాగిస్తూ….. సరే సుప్రభాత సేవ అవుతుంది కదా! మనం దర్శనానికి వెళ్ళాలి అని రుద్ర స్వామి అనేసరికి….. సరే అని చెప్పి అందరూ దర్శనానికి వెళ్లి సుప్రభాత సేవ పూర్తి చేసుకోవటం….. యధావిధిగా బయటకు వచ్చి గుడి ఆవరణలో ఎవరికి వారే కూర్చున్నారు . పిల్లలు ఇద్దరు జపంలో కూర్చుంటే…. పెద్దవాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. అలా ధ్యానం చేస్తూ ఉండేసరికి తన మూలాధార చక్రంలో తన ఆది జన్మ స్థూల శరీరం కూడా ధ్యానంలో కూర్చున్నట్లుగా లీలాగా కనిపించేసరికి….. తను ఏదో గత జన్మలలో తను ఎత్తిన అవతారాలు, జన్మల రూపాలు, జంతు జన్మలు లీలగా కనపడుతూ ఉండేసరికి….ధ్యానంలో ఉండుండి పులి గాండ్రింపులు, పులి అరుస్తున్నట్టుగా అరవడం, కుక్క అరుస్తున్నట్టుగా అరవడం, సింహం, ఎలుగుబంటి లాగా అరవడం…. కోతి లాగా చేతులు తిప్పడం ….ఇవన్నీ తను ధ్యానంలో ఉండి తనకి తెలియకుండానే చేస్తున్నాను అని అనుకొని….. కళ్ళు తెరిచేసరికి అప్పుడు రుద్ర స్వామి శివ నందినితో….నువ్వేం కంగారుపడమాకు ! అవన్నీ ఆది జన్మలో ఉన్న జంతు జన్మలు. అవి వచ్చినప్పుడు నీ గొంతులో నుంచి అరుపులు వస్తున్నాయి. అవునా! అని అనుకుని మళ్ళీ ధ్యానంలో కూర్చునే సరికి… ఒకసారి ఏడుపు, ఆవేదన, ఆక్రందన, ఏవేవో తెలియని బాధపడటం…. ఇవన్నీ కూడా కలుగుతూ ఉండేసరికి మళ్ళీ ధ్యానభంగం అయ్యేసరికి….. రుద్ర స్వామి కాస్త మానవ జన్మలు ఎత్తినప్పుడు ఆ జన్మలలో మిగిలిపోయిన కర్మశేషాలు యొక్క సంఘటనలు…. అన్నీ కూడా నీకు గుర్తుకు వస్తున్నాయి. దాని కారణంగా నీకు బాధ కలిగినప్పుడు…. కోపావేశాలు బయటికి వస్తాయి. శరీరం జాగృతి అయింది… శుద్ధి అవటానికి ఆరంభం అవుతుంది… జాగ్రత్తగా శుద్ధి కార్యక్రమం చేకూడా చేసుకో! అనేసరికి ఈ విధంగా సుమారుగా శివ నందిని మూడు నెలల పాటు వివిధ ప్రక్రియలతో సమస్యలతో మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఆది జన్మ నుంచి ప్రస్తుత జన్మ వరకు చేసిన పాపాలను పాప దోషాలను కర్మ దోషాలను….. చెడు కర్మ ఫలితాలను కూడా సంపూర్ణంగా నాశనం చేసుకోవడం జరిగింది.
దానితో తన శరీరం ఆది జన్మ స్థూల శరీరం కోరికలన్నీ కూడా నశించిపోయి…. స్మశాన వైరాగ్య స్థితిలో ఉంది అని గ్రహించి….. మోక్షం పొందాలని సంకల్పిస్తుంది అని అనిపించి… ఇక మూలధార చక్రం విభేదానికి వచ్చిందన్నమాట! ఇక విభేదనం అనేది సప్త మోక్షపురాలలో జరుగుతుంది. సప్త మోక్ష పట్టణాలలో ఏదో ఒకటి మూలాధార చక్రం శరీరం అయిన స్థూల శరీరానికి మోక్షం ఇస్తుందో తెలియదు అని చెప్పి అనుకోని….. అప్పుడు మోక్షం పొందే సమయంలో చక్ర విభేదనం జరిగి ఆ తరువాత శరీర దహనం జరుగుతుంది. లేదా స్థూల శరీరం మోక్షం అంటారనుకుంటా! అని శివ నందిని అనుకుంటూ ఉండగా….. శివ నందినికి ధ్యాన దృశ్యంగా నల్ల శివలింగం కనపడింది. ఈ నల్ల శివలింగం కోసమే కదా! ఇప్పుడు తను ఇక్కడ దాకా రావటం జరిగింది. ఈ నల్ల శివలింగంతోనే అమ్మవారిని బంధనం చేయాలి అని అనుకునేసరికి ….ఈ శివలింగంతో ఏ అమ్మవారిని బంధనం చేయాలి..! అసలు అమ్మవారి ఏకాదశ దేహాలు ఏమై ఉంటాయి…! అనే ఆలోచన రావటంతో ధ్యాన భంగం అయ్యింది. సమయం చూసేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి…. పిల్లలు ఆకలితో బిక్క ముఖం వేశారని తెలిసి అందరూ కలిసి హోటల్ కి వెళ్లి….. తమకి ఇష్టమైన ఆహారం తిని….హోటల్ గదికి వెళ్లి విశ్రాంతిగా కూర్చునే సరికి శివ నందిని రుద్ర స్వామితో తనకి వచ్చిన నల్ల శివలింగం ధ్యానానుభవం గురించి చెప్పేసరికి…..
రుద్రస్వామి:- అవునా! సరే ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి.
బాలగణపతి:- దాన్ని తెలుసుకోవడానికి ధ్యానానుభవం ఎందుకు? నేను చెప్తాను…
రుద్రస్వామి:- ఏం చెప్తావ్ రా!అది ఎక్కడ ఉందని చెప్తావు?
బాలగణపతి:- ఇప్పుడు సుమారుగా రెండు లక్షల మట్టి శివలింగాలు శివాలయ తీర్థంలో పెట్టారు కదా! పూజ చేసింది కదా ఆవిడ…. నాకు తెలిసి బహుశా మట్టి శివలింగాలు కలిసి ఒక నల్ల శివలింగంగా మారిపోయి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది కదా! నాకు తెలిసినంతవరకు నీకు అక్కడే శివలింగం దొరుకుతుంది. నిన్ను అందుకే ఊబిలోకి లాగి లోపలికి తీసుకువెళ్లినట్టు ఉంది. ఈ అయ్య ఉన్నాడు కదా…. ముసలాడు…ముసలి గుండె కదా! ఆయన కంగారు పడిపోయి నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అని చెప్పేసి…. నిన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా బయటికి లాగేసాడు. లోపలికి వెళ్లి ఉంటే ఈపాటికి నీకు నల్ల శివలింగం దొరికేది.
రుద్రస్వామి:- ఏమోరా నాకేం తెలుసు! మీ అమ్మ ఎక్కడ చనిపోతుందో అని లాగాను . వెనకాల ఇంత కథ ఉంటుందని నాకేం తెలుసు. తెలిసినా కూడా నేను పంపించేవాడిని కాదు. అది ప్రమాదకరమైన ఊబిలాగా ఉంది. నీళ్లు సుడులు తిరుగుతున్నట్టుగా ఉంది. అంతగా కావాలంటే నేను వెళ్లి తీసుకు వస్తాను.
బాల గణపతి:- సరేలే! నేను అలా అనుకుంటున్నాను. ఏదైనా ధ్యాన అనుభవం అయితే గాని అమ్మ నమ్మదు కదా! అప్పటిదాకా ఊహాజనితమైన కథ ఎందుకు వినటం….
అని పిల్లలు తమ ఆటల్లో తమ ఉండేసరికి ……వీళ్ళు దర్శనానికి వెళదామని…. అందరూ గుడి దర్శనానికి వెళ్తూ….శివ కుండ్ తీర్థంలో స్నానం చేయడానికి దిగటం జరిగింది.
Part -7
ఎప్పుడైతే శివనందిని శివకుండ్ తీర్థంలో దిగిందో…. మోకాలి లోతు దిగేసరికి….ఒక విధమైన యోగమత్తు ఆవరించేసరికి…. శరీర స్పృహ తెలియని స్థితిలో ఉండేసరికి… ఇక శరీరం మునిగిపోతుంది అని…. బయటకు రావాలనే ఆలోచన చేస్తుంది గానీ, శరీరం సహకరించడం లేదు. అరవాలనుకున్న అరపు బయటకు రావడం లేదు అని గ్రహించేసరికి….. ఈ విషయం రుద్ర స్వామి గ్రహించచినా మినుకుండిపోయాడు. ఏం జరిగితే అది జరుగుతుంది మనకెందుకు! అంతగా కావాలంటే ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆలోచించవచ్చు అనేసరికి…. పిల్లలు కాస్త రుద్రయ్య! రుద్రయ్య! అమ్మ నీటిలో మునిగిపోతుంది…. పట్టించుకోవేంటి? పట్టుకుని పైకి తీసుకురా! అనేసరికి…..
రుద్రస్వామి:- చూస్తూ ఉండండి… మౌనంగా ఉండండి….
మహాదేవి:- ఇప్పుడు మౌనంగా ఉండటం అవసరమా? ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. మునిగిపోతుంది. తనకి స్పృహ తెలియడం లేదు. అరవాలని కూడా ప్రయత్నం చేయడం లేదు. అంటే తను స్పృహ కోల్పోతుందని కదా!
రుద్రస్వామి:- ఇది ఒక ప్రయత్నం ఏమో…. చూద్దాం, శివుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నాడేమో! తను నీటిలోకి వెళ్లేసరికి ఎందుకు అలా అవుతుందో తెలియటం లేదు. కారణం లేనిదే కార్యం ఉండదు కదా! ఎదురు చూద్దాం….
అని అంటూ ఉండేసరికి సరే అని వీళ్ళిద్దరూ కూడా వచ్చారు…. పిల్లలు ఇద్దరు కూడా ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు వచ్చేసరికి…. అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. అక్కడ కొంతమంది భక్తులు శివ నందినిని రక్షించాలని నీటిలోకి దూకేసరికి… అప్పటికే మనోవేగంతో శరీరం లోపలికి వెళ్లిపోయేసరికి…. వాళ్ళు బయటకు వచ్చి…. ఆవిడ చాలా వేగంగా నీటిలోకి దిగిపోతుంది. ఏదో శక్తి కిందకి లాగుతున్నట్టుగా అనిపించింది . సుమారుగా 5000 అడుగుల లోతు ఉంటుంది. మహా అయితే మేము 500 అడుగుల వరకు మాత్రమే వెళ్లగలిగాము… ఆవిడని రక్షించలేకపోయాము… ఆవిడ ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి… ఆవిడ చనిపోయినట్లే! ఆవిడ శరీరం బరువుకి ఆవిడ కిందకు వెళ్లిపోయినట్లుగా ఉంది. అడుక్కు చేరుకున్నట్లుగా ఉంది అనేసరికి
రుద్రస్వామి:- సరే ఇక వదిలేయండి ….అమ్మాయి ప్రాణాలు ఇక్కడ పోవాలని రాసి ఉందేమోలే! ఈ క్షేత్రంలో పోవాలని రాసిపెట్టి ఉంది. జ్యోతిర్లింగ క్షేత్రంలోనే అమ్మాయి ప్రాణాలు పోయాయి. సరే పిల్లలు..! మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు….ధ్యానం చేసుకుంటూ ఉండండి… జపం చేసుకుంటూ ఉండండి… నేను కూడా ధ్యానంలో ఉంటాను..
అని మహాదేవి కేసు చూస్తూ నువ్వు కూడా ధ్యానంలో ఉండు…అనేసరికి వీళ్ళు అలా ధ్యానంలో ఉండేసరికి… శివ నందినికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కానీ తను నీటి అడుగుకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి…. లో లోపల భయం ఉన్న కూడా…. తనలో అమ్మవారు ఇతర దైవశక్తులు ఉన్నాయిలే అని ధైర్యం తెచ్చుకుంటూ… కిందకి శరీరం వెళ్లి ఎక్కడ ఆగితే అక్కడదాకా వెళ్లి ఆగుదాం అని వెళుతూ ఉండేసరికి…. లోపల మెట్ల ప్రాకారం అదంతా కనిపిస్తూ ఉండేసరికి…. ఇదేదో కట్టడం లా ఉంది… ఇదేదో పూర్వకాలంలో బావి ఏమో అని అనుకుంటూ…. ఆ కట్టడం లోపలికి అలా వెళుతూ ఉండేసరికి…. చతురస్రాకార పలకలు ఉన్నవి కనపడుతూ…. లోపల పెద్ద బావి లాగా లోపలికి అలా వెళుతూ ఉండేసరికి…పూజ మందిరం లాగా కనిపించింది. ఆ పూజ మందిరం ఎదురుగా లోపల చూసేసరికి పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్ట లోపల నల్ల శివలింగం ఉన్నట్లుగా కనిపించింది. పుట్ట యొక్క కంతల్లో నుంచి చూస్తే…. నల్ల శివలింగం ఉన్నట్లుగా కనిపించేసరికి ఓహో! బహుశా ఈ నల్ల శివలింగం కోసమే బహుశా! నేను రావడం జరిగిందేమో అనుకునేసరికి…. ఉన్నట్టుండి పుట్ట కరిగిపోతూ ఒక అడుగు నల్ల శివలింగం పైకి రావడం జరిగింది. అది తన చేతిలోకి వచ్చేసరికి…. దిగేటప్పుడు ఎంత నెమ్మదిగా దిగిందో…. పైకి వెళ్లేటప్పుడు శివలింగం అందుకున్న కారణం చేత సొరచాపలాగా, తిమింగలం లాగా తేలేసరికి…. అమ్మని చూసేసరికి పిల్లలు పెద్దగా అరుస్తూ అమ్మ వచ్చేసింది! అమ్మ వచ్చేసింది! ఏం ప్రమాదం లేదు …అమ్మకి ఏం కాలేదు… అనేసరికి, ధ్యానంలో ఉన్న వీళ్ళిద్దరూ కాస్త కళ్ళు తెరిచి చూసేసరికి…. శివలింగం చేతిలో పట్టుకుని శివ నందిని కాస్త ఈదుకుంటూ పైకి వస్తూ ఉండేసరికి…. బాల కుమారస్వామి కాస్త శివ నందిని చేతిలో ఉన్న శివలింగాన్ని చేతిలో పట్టుకొని….అమ్మ నువ్వు జాగ్రత్తగా పైకి రా! అనేసరికి…. రుద్రస్వామి చెయ్యి అందించేసరికి ఆ శివ కుండ్ నుంచి బయటకు రావడం జరిగింది. పది నిమిషాల పాటు శ్వాస ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలను సర్దుకొనేసరికి…. ఆయాసం, అలుపు తీర్చుకొని…. అప్పుడు రుద్రస్వామి కేసి చూస్తూ…. తను కింద చూసిన దృశ్యం అంతా వాళ్లకు చెప్పింది. మంచిది తల్లి! నీకు నీ శివలింగం వచ్చింది కదా! అని అనుకుంటూ ఉండేసరికి….. అప్పుడు వేణు గానం వినిపించేసరికి…. ఇక్కడికి కూడా వీడు వచ్చాడా? వీడు తగలబడ్డాడా ?ఇంకా వీడు రాలేదంటా అనుకుంటున్న రుద్రస్వామి కేసి చూస్తున్న కృష్ణస్వామి యోగాంబిక కనిపించారు.
కృష్ణస్వామి చేతిలో కూడా నల్లటి శివలింగం కనిపించేసరికి… శివ నందిని కేసి చూస్తూ…
కృష్ణస్వామి:- ఇది నిజమైన శివలింగం… నా చేతులలో ఉన్నది నిజమైన శివలింగం. ఈ సరస్సులో నల్ల శివలింగం ఉందని నాకు ధ్యాన అనుభవం అయింది. నీకన్నా ముందే మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి…. ఆ శివలింగాన్ని తీసేశాను. ఆ పుట్టలో కనిపించింది కదా! నీకు…. ఆ శివలింగం నేను పెట్టిన శివలింగం. నిజమైన శివలింగం ఇది. నీకు దొరికింది నకిలీ శివలింగం. నేను పెట్టిన శివలింగం.
ఇదేం సమస్యరా నాయన ! అని మహాదేవి మనసులో అనుకుంటూ…. పైకి శివ నందిని కేసి చూస్తూ…..
మహాదేవి:- ఇప్పుడు ఈ శివలింగాలలో ఏది నిజమైన శివలింగం. ఏది నకిలీ శివలింగం అనేది ఎలా తేల్చాలి…
శివనందిని:- ఏమో అమ్మ! నాకేం తెలుస్తుంది… అతను చెప్తున్నాడు కదా! నాకైతే ఇది పుట్టలో దొరికింది. పుట్ట కరిగిపోయిన తర్వాత… ఈ శివలింగం బయటపడింది. మరి అతను చెప్పిన ప్రకారం అయితే నాకు దొరికింది నకిలీ శివలింగమే కదా! అతని చేతిలో ఉన్నది నిజమైన శివలింగమేమో! సరే ఇంక మనకి అవకాశం లేదేమోలే! అమ్మవారిని బంధించడానికి ఉపయోగించే శివలింగం అతని దగ్గర ఉన్నది. కానీ ఏం చేస్తాం…
అని అంటూ ఉండేసరికి శివలింగాన్ని అలాగే పెట్టుకొని ధ్యానంలో ఉండేసరికి… ఒకసారి తన సహస్ర చక్రంలో నిక్షిప్తమైన 14 సర్పాల ఆత్మశక్తి రూపంలో ఉన్న మునీశ్వరుడు కాస్త… శివ నందిని బ్రహ్మారంధ్రం నుంచి బయటకు వచ్చేసి…. 11 తలల సర్పము లాగా…. నీటిలోకి దిగి ఉగ్రంగా కనిపించేసరికి ఆ 11 తలల సర్పము యొక్క మణుల కాంతులు ఈ రెండు శివలింగాల మీద పడేసరికి ….ఆ విష గాలులు కృష్ణస్వామి చేతిలో ఉన్న శివలింగము అలాగే శివ నందిని ఒడిలో ఉన్న శివలింగం మీద ఏకకాలంలో పడేసరికి…. ఒక్కసారిగా కృష్ణస్వామి చేతిలో ఉన్న శివలింగం కాస్త ముక్క లైపోయేసరికి….. శివ నందిని చేతిలో ఉన్న శివలింగంలో అందులో శివుడు ధ్యాన నిష్టలో ఉన్నట్టుగా కనిపించేసరికి…. అమ్మ ఇది అసలైనది అని మళ్ళీ యథాస్థితిలోనికి 11 సర్పాల తలలు ఉన్న మునీశ్వరుడు…. శివ నందిని లోపలికి ప్రవేశించడం జరిగింది. ఇదంతా చూస్తున్న కృష్ణస్వామి….
కృష్ణస్వామి:- అదేంటి! నేను మూడు రోజుల క్రితమే నా చేతుల మీదుగా శివలింగాన్ని మార్చాను. ఇది ఎలా మారింది. నా చేతిలో మట్టి శివలింగం ఉండటం ఏమిటి? నా చేతిలో నకిలీ శివలింగం ఉండటం ఏమిటి? ఇది ఎలా సాధ్యపడింది? నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఏదో సర్ప మాయ చేసింది. నిజానికి తన చేతిలో ఉన్నది నకిలీ శివలింగం కదా! నా చేతిలో ఉన్న నిజమైన శివలింగం నాశనం చేసేసింది.నీ సాధన ఆగిపోయింది. పాముని పెంచుకుంటున్నావు కదా! ఆ పామే నీ సాధన ఆపేసింది. ఇక నీ దగ్గర అమ్మవారిని బంధించే తొలి శివలింగం లేదు. నీ మూలాధార శరీరానికి మోక్షం ఇచ్చే నల్ల శివలింగం లేదు. నేనే జయం పొందాను…
అనేసరికి కృష్ణస్వామి మరియు యోగాంబికా పెద్దగా నవ్వుతూ…. నీ మీద జయం పొందాము… విజయం పొందాము…. అని అనుకుంటూ అదృశ్యం అయ్యేసరికి… శివ నందిని ఆలోచనలో పడింది. అప్పుడు రుద్ర స్వామి
రుద్రస్వామి:- అమ్మ! మనకేం తెలుసు సర్పమునియే కదా నిర్ధారణ చేశాడు. ఇక కాల నిర్ణయం ఏం జరుగుతుందో తెలియదు. ఈ విపత్కర పరిస్థితులలో మనకి సమాధానం చెప్పగలిగేది శివ స్వామి మాత్రమే… ఏం జరిగిందో ఆయనే చెప్పగలడు…
అనేసరికి ధ్యానంలోకి వెళుతూ హృదయం మీద చేయి వేసుకొని స్వామి! అనేసరికి చెప్పు దేవి! అనేసరికి….
శివనందిని:- మీకు ఇక్కడ జరిగిందంతా తెలుసు కదా! ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏ శివలింగం?
శివస్వామి:- సర్ప స్వామి నిరూపణ చేశారు కదా! నీ దగ్గర ఉన్నదే అసలైన శివలింగం అని చెప్పి…. అందులో సందేహం ఏమిటి?
శివ నందిని:- మరి కృష్ణస్వామి లింగం మార్చాడు అన్నాడు..
శివస్వామి:- వీళ్లు మారిస్తే శివుడు మార్చకుండా ఉంటాడా! శివుడు ఎప్పుడో మార్చాడు. నిజమైన శివలింగం బయట ఉన్నది.. పుట్ట లోపల ఉన్నది నకిలీ శివలింగం. వాడు ఆ విషయం గ్రహించకుండా పుట్టలో ఉన్నది నిజమైన శివలింగం అని చెప్పేసి వాడు మట్టి శివలింగం తీసుకోవడం జరిగింది. బయట ఉన్న రాతి శివలింగం పుట్టలో పెట్టడం జరిగింది. శివుడికి మించిన తెలివితేటలు ఎవరికి ఉంటాయి? శివ లీలామాయను అర్థం చేసుకునేవాడు ఎవరు ఉంటారు.. వాడికి దొరికినదే నకిలి శివలింగం. ఇక నువ్వు దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ మార్పు వాడు ఊహించలేదు. వాడి చేతుల మీదుగానే మార్చారు. మాయ చేసారు. ఈ ఆ విషయం వాడికి అర్థం కాలేదులే!
శివ నందిని:- సరే స్వామి! మీరు చెప్పారు కదా! నాకు మనోధర్యం వచ్చింది. ఈ శివలింగమును నేను అంతర్ధానం చేసుకుంటాను…
అనేసరికి మంచిది దేవి అనేసరికి…. ఏం జరిగిందో అక్కడ ఉన్న రుద్ర స్వామి మరియు మిగిలిన వాళ్ళకి చెప్పేసరికి…. మంచిది తల్లి! ఇక శివ స్వామి నిర్ధారణ చేశాక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు… అనేసరికి అప్పుడు ఆ నల్ల శివలింగమును తన హృదయంలోనికి నిక్షిప్తం చేసుకొని…. ఇక అక్కడి నుంచి సుప్రభాత సేవకు అవుతుందని సుప్రభాత సేవకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల దాకా అందరూ ధ్యానంలో ఉండి…. ఆ తర్వాత ఆకలి వేస్తుంది అని భోజనానికి రావడం…. భోజనాలు చేసి గదికి రావడం జరిగింది. అప్పుడు రుద్ర స్వామితో…
శివ నందిని:- అయ్యా! ఇప్పుడు ఇక్కడ మన సాధన పరిసమాప్తి అయిపోయింది కదా! స్థూల శరీరం కూడా జాగృతి, శుద్ధి ఆధీనానికి వచ్చింది కదా! మూలాధార చక్రం కూడా విభేదనా స్థితికి వచ్చింది. మోక్షం పొందే ముందు వచ్చే విభేదనా స్థితి పొందాలి.. అలాగే మనకు రావలసిన నల్ల శివలింగం కూడా వచ్చింది కదా! తదుపరి కార్యక్రమం ఏమిటి?
ఈ శివలింగమే మనకు చెప్పాలి అనేసరికి…. సరే అని చెప్పేసి ఈ శివలింగం ఉన్న సాధనా విగ్రహ మూర్తికి కుడివైపున ఉన్న కమలం మీద ఈ నల్ల శివలింగం పెట్టేసరికి…. ఉన్నట్టుండి స్వాదిష్టాన చక్రం నాలుగు సార్లు తిరగటం ఆరంభించింది. నాలుగు సార్లు మెరుపుల మెరిసి మాయం అవటం కనిపించింది. అమ్మాయి ఇది కూడా జాగృతి, శుద్ధి ,ఆధీనం, విభేదనానికి సంకేతం అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి…..ఈసారి కుమారస్వామి కాస్త అయ్యా! ప్రతిసారి తమ్ముడే కదా తీస్తూన్నాడు…. ఈసారి రాగిరేకు నేను తీసి…. నేను చదువుతాను అనేసరికి సరే తీయి నాయనా! దాంట్లో తప్పేముంది! అనేసరికి…
బాల గణపతి :- అన్నయ్య! నువ్వు తియ్యి… ప్రతిసారి నేను తీయడం ఎందుకు? నీ ముచ్చట కూడా తీరుతుంది… నాకేం ఇది లేదు.
అనేసరికి వీడు చిన్నపిల్లవాడిగా ఉన్నా కూడా పెద్దరికంగా ఆలోచిస్తున్నాడు అని గణపతిని అందరూ మెచ్చుకుంటూ ఉండేసరికి…. సాధనా మూర్తి యొక్క స్వాధీష్ఠాన చక్రం నుంచి ఒక రాగి రేకు బయటకు రావడం జరిగింది. ఆ రాగి రేకు మడతలు విప్పి బాల కుమారస్వామి చదవడం ఆరంభించాడు. ఇందులో ఉన్న ఆధారాలను బాల కుమారస్వామి వరుసగా చదువుతూ ఉండగా….
నేను శ్రీ చక్ర యంత్ర బంధీని …..
మూడు తలల ఆసామీ ఇక్కడ భిక్ష ఆరగింప చేస్తాడు …..
నా చేతులలో పద్మాలే ఆయుధాలు…
నేను లేనిదే జగత్తు నడవదు ….
నాకు అష్ట రూపాలు ఉన్నాయి.
అని ఆధారాలుగా ఉండేసరికి…. అందరూ కూడా ఆలోచనలో పడ్డారు.
కుమారస్వామి చదివిన ఆధారాలు విని అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎవరికి ఒక పట్టానా అర్థం కాలేదు. అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. ఇప్పుడు ఇది అమ్మవారికి సంబంధించింది అని అర్థమవుతుంది. కానీ ఏ అమ్మవారికి సంబంధించిందో అర్థం కావడం లేదు. శ్రీ చక్ర బంధీని అనేసరికి…..ఇప్పుడు రాజరాజేశ్వరిని బందీ చేస్తారు… లలితని బంధనం చేస్తారు…. అంతెందుకు కామాక్షి దేవి కూడా శ్రీ చక్ర బంధనంలో ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి అని అనుకుంటూ ఉండేసరికి… మూడు తలల ఆసామీ ఇక్కడ బిక్ష ఆరగిస్తాడు అనేసరికి…. మూడు తలల ఆసామి ఎవరై ఉంటారా! మూడు తలల ఆసామీ అంటే దత్తాత్రేయుడై ఉండాలి. దత్తాత్రేయుడు బిక్ష ఆరగించేది ఎక్కడ? బిక్ష చేసేది ఎక్కడ? అది తెలియాలి. చేతుల్లో పద్మాలే ఆయుధాలు అంటే ఇప్పుడు లక్ష్మీదేవికి పద్మాలు ఉంటాయి. జ్ఞాన సరస్వతికి, నీల సరస్వతికి కూడా పద్మాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ విధంగా చెప్పాలి అనుకునేసరికి….. నేను లేనిదే జగత్తు నడవదు అంటే….జగత్తు నడవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఏ కారణం చేత ఈ జగత్తు నడవదు అని ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఈవిడకి అష్టరూపాలు ఉన్నాయని తెలుస్తుంది. అష్టరూపాలు అంటే ఇప్పుడు అందరికీ అష్టరూపాలు, నవరూపాలుగా నవదుర్గలు, దశ రూపాలు ఉంటాయి. ఇవి ఏ అమ్మవారి అష్టరూపాలు అని చెప్పాలి…. అని ఎవరికి వాళ్లు ఆలోచనలు చేస్తూ ఉండేసరికి ….బాల కుమారస్వామి కాస్త ఉన్నట్టుండి….
బాల కుమారస్వామి:- అమ్మ! నాకెందుకో ఇది మహాలక్ష్మి దేవి గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది.
శివనందిని:- అదెలా చెబుతున్నావు?
బాల కుమారస్వామి:- ఇప్పుడు నీకు మూలధర చక్ర సాధన పూర్తి అయిపోయింది. రెండోది స్వాధిష్ఠాన చక్రం. స్వాధిష్ఠాన చక్రానికి సాధన మాయగా ఏం వస్తుంది? ధన మాయ వస్తుంది కదా! అంటే ధనానికి అధిపతి ఎవరు? అమ్మవారే కదా! అది మహాలక్ష్మి అమ్మవారే కదా!
శివ నందిని:- అవును….
బాల కుమారస్వామి:- ఇప్పుడు ఈ ఆధారాలని మహాలక్ష్మికి ఆపాదించి చూద్దాం. ఇప్పుడు శ్రీ చక్ర యంత్ర బంధిని అంటే…. అమ్మవారిని శ్రీ చక్ర ఆరాధనలో ఉపయోగిస్తారు కదా! శ్రీ చక్రం ఆరాధన చేస్తే ధనానికి లోటు ఉండదు అని చెప్పి మనకి దేవి పురాణం చెబుతుంది కదా!
శివ నందిని:- అవును…
బాల కుమారస్వామి:- ఇప్పుడు మూడు తలల ఆసామి ఇక్కడ బిక్ష చేస్తారు అంటే…. మూడు తలల ఆసామి అంటే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు గాన్హాపూర్ లో బిక్ష స్వీకరించడం జరుగుతుంది. మహాలక్ష్మి కొల్హాపూర్ లో ఆయన బిక్ష చేస్తూ ఆరగిస్తాడు అని గురు చరిత్రలో చెప్పడం జరిగింది కదా! అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ అమ్మవారు కోల్హాపూర్ మహాలక్ష్మి అయి ఉండాలి అన్నాడు. చేతుల్లో పద్మాలు అంటే ఇప్పుడు లక్ష్మీదేవికి పద్మాలే ఉంటాయి కదా రెండు చేతుల్లో…. ఆవిడ పద్మంలో పుట్టింది కదా!
నేను లేనిదే జగత్తు నడవదు అనేసరికి రుద్రస్వామి కాస్త అందుకొని….
రుద్రస్వామి:- ధనం మూలం ఇదం జగత్ అని చెప్తారు కదా! ధనం లేనిదే జగత్తు ఉండదు అని చెప్పారు కదా! అంటే నాకు తెలిసి ఇది ధనానికి సంబంధించిందే అన్నాడు… అమ్మవారికి అష్టలక్ష్మి స్వరూపాలు ఉంటాయి కదా! సంతాన లక్ష్మీ, గజలక్ష్మి, మహాలక్ష్మి, ధైర్య లక్ష్మీ ఇలా మొత్తం 8 లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి కదా! అంటే ఇది కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి సంకేతం అవుతుంది. అంటే మనం ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న కోల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి వెళ్లాలన్న మాట!
శివ నందిని:- ఇది అవునో కాదో ….నాకు ధ్యానంలో కనబడితే కానీ నేను ఏదీ నిర్ధారణ చేయలేను. పిల్లల విశ్లేషణ సరి అయిందే కావచ్చు…. కానీ అది ధ్యాన అనుభవం అవ్వాలి కదా!
రుద్రస్వామి:-సరే నీ ధ్యానానుభవం నువ్వు చూసుకో! గుడి దాకా వెళ్ళటం ఎందుకు! ఇక్కడే ఈ గదిలోనే కూర్చొని చూసుకో! మేమేమీ ఇబ్బంది పెట్టము..
సరే అని ధ్యానంలో కూర్చుంది. అలా పృథ్వి ముద్రలో దాదాపు ఒక 30 నిమిషాలు ఉండేసరికి….ధ్యానంలో శ్రీ చక్రం ఆకారంలో ఉన్న దేవాలయంలో సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉన్న మహాలక్ష్మి విగ్రహం కనిపించేసరికి…. ధ్యాన భంగమై ఆ విగ్రహ మూర్తిని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పేసి…. అది ఎక్కడ ఉంది అని వెతకడం ఆరంభించేసరికి….అది కోల్హాపూర్ లోని దేవాలయం అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. అంటే శ్రీ చక్రం ఆకారంలో గుడి నిర్మాణం జరిగింది. శ్రీ చక్రబంధీని అని చెప్పవచ్చు. అన్ని దేవాలయాలలో అమ్మవారి ముందు శ్రీ చక్రబంధనం జరిగితే…. ఈమెకి దేవాలయమే శ్రీ చక్ర ఆకారంలో ఉంటుంది అని….అప్పుడు నిర్ధారణ చేసుకొని అక్కడ ఉన్న రుద్రస్వామి తో మనం కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి. స్వాధీష్ఠాన చక్రం జాగృతి ,శుద్ధి, ఆధీనం అక్కడే జరుగుతుంది. నాకు ధ్యానంలో కనిపించిన రూపం, కోల్హాపూర్ మహాలక్ష్మి రూపం ఒకటిగా ఉంది. అనేసరికి సరే ఇప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి ఆఖరి సారిగా స్వామి వారిని దర్శనం చేసుకొని….ఆయన అనుమతి తీసుకుని.. ఇక ఇక్కడి నుంచి కొల్హాపూర్ కి బయలుదేరుదాము అనేసరికి….. సరే అని అందరూ గుడికి వెళ్లి ఆఖరిగా అయ్యవారిని దర్శనం చేసుకుని…. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ధ్యానం చేసుకొని, జపం చేసుకొని, అక్కడ ఉన్న తీర్థంలో స్నానాధికాలు పూర్తి చేసుకుని…. హోటల్లో టిఫిన్లు కానిచ్చుకొని…. కొల్హాపూర్ బయలుదేరే బస్సు ఎక్కేసరికి సాయంత్రం అయ్యింది. తెల్లారి ఉదయం ఏడు గంటలకు చేరుతామని కండక్టర్ చెప్పడంతో…. అందరూ బస్సులో నిద్రలోకి జారుకోవడం జరిగింది.
ఇలా మంచి నిద్రలో ఉండగా…. ఒక పెద్దావిడ వీళ్ళ దగ్గరకు ప్రసాదం అని అందరినీ నిద్రలేపి పెడుతూ ఉండేసరికి…. ఎవరి ప్రసాదం? మీరు చేసిన ప్రసాదమా ? అనేసరికి… అవును మొక్కు కోసమని ఆ దేవుడి ప్రసాదం చేశాము అనేసరికి…. దేవాలయ ప్రసాదమా? మీ ఇంటి ప్రసాదమా? అని రుద్రస్వామి అడిగేసరికి… కొంత దేవాలయ ప్రసాదం ఉంది, కొంత ఇంటి ప్రసాదం కూడా ఉంది….అంటే, మేము గృహస్థాశ్రమంలో ఉన్న వారి ప్రసాదం తీసుకోకూడదు అనేసరికి…. అయితే గుళ్ళో ప్రసాదం తీసుకోండి అనేసరికి…. అది డబ్బులుతో కొన్న ప్రసాదం కదా! అంటే అవును, ఉచితంగా ఎవరూ ఇవ్వరు కదా! అని….అది అమ్మవారి ప్రసాదం, డబ్బులతో కొన్నాము అనేసరికి…. వద్దమ్మా! ఏమీ అనుకోవద్దు! మేము సన్యాసంలో ఉన్నాము… మేము ఎవరి ప్రసాదాలు తీసుకోవడానికి లేదు అనేసరికి…. శివ నందిని ముగ్ధ మనోహర సౌందర్యమును చూసి…. ఈ పెద్దావిడ కాస్త పాదాలను తాకపోతూ ఉండేసరికి…. శివ నందిని పెద్దావిడ కదా! అని వద్దమ్మా తాగకూడదు అనాల్సింది పోయి….. తాకడానికి వీలుగా పాదాలు ఇస్తూ ఉండేసరికి…..అమ్మ వద్దమ్మా ! ఆమె ఆత్మ పిండం పెట్టుకున్న ఆవిడ. సన్యాస దీక్షలో ఉంది. ఆవిడ పాదాలు తాకరాదు. ఆమె సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆమె పాదాలు తాకితే మీరు అధోగతి పాలవుతారు. ఆ స్థితిని తట్టుకోలేరు అనేసరికి… ఏదో తెలియని భయంతో క్షమించండి స్వామి! మానవ స్త్రీ, సన్యాస స్త్రీ అనుకుని, సిద్దులు పొందిన వాళ్లు, మీలాంటి పెద్దలు ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను…. మా పాపాలు పోతాయి అని అనుకున్నాను అనేసరికి…. క్షమించండి అని ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి…. ఇదేమి అర్థంకాని అయోమయ స్థితిలో శివ నందిని ఉండేసరికి….రుద్రస్వామి కాస్త శివ నందిని కేసి చూస్తూ…. అమ్మ సాధన నియమాలు చెప్పాలి…ఈ నియమాలు గుర్తుపెట్టుకో! వీటిని అమలుపరచుకో! అదేమిటంటే….
1)నీ కాళ్ళకి ఎవరి చేత నమస్కరించుకోరాదు. నీ కాళ్ళని ఎవరూ తాకకూడదు . తాకితే వాళ్ళ పాపాలు, కర్మలు ,శాపాలు, దోషాలు అన్నీ కూడా నీలోకి ప్రవేశిస్తాయి. వాటిని నివారణ చేసుకోవడానికి మూడు రోజుల నుంచి 10 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు లేదా జీవిత కాలం పట్టొచ్చు. వాళ్ళ జన్మాంతర పాపాలు అన్నీ కూడా…. నీ సాధనా శక్తికి ఆకర్షిత అవుతాయి…
2) అలాగే నువ్వు వేరే వాళ్ళ పాదాలను కూడా తాకటానికి లేదు. ఒక తల్లిదండ్రులు, గురువుల పాదాలు తప్పితే….ఎవరిని తాకరాదు. అలాగే వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరికి నమస్కారం చేయరాదు. అలాగే దేవత విగ్రహాలను దేవతా యంత్రాలను తాకటానికి లేదు. తాకద్దు. అలాగే ఉచిత ప్రసాదాలు తీసుకోవద్దు. ఉచితంగా పెట్టే అన్నదానాలు, వస్త్రధానాలు కూడా స్వీకరించడానికి లేదు.
శివ నందిని:- ఇప్పుడు పాదాలు తాకినంత మాత్రాన ఏం జరుగుతుంది? వాళ్లకి నాలో ఉన్న పాజిటివ్ శక్తి వాళ్ళకి వెళ్లి ….వాళ్ళలో ఉన్న పాపాలు, దోషాలు…. నెగిటివ్ శక్తి తగ్గటానికి అవకాశం ఉంది కదా!
రుద్రస్వామి:- మరి నీలో ఉన్న పాజిటివ్ శక్తి వాళ్ళలోకి వెళ్ళినప్పుడు…. వాళ్లలో ఉన్న నెగిటివ్ శక్తి నీలోకి రావడానికి అవకాశం ఉంది కదా! అప్పుడు నువ్వు ఆ దోషాలు తీసుకోవాల్సి వస్తుంది కదా! ఇలా ఈ దోషాలు నివారణ చేసుకోవాలి కదా ! దానికి పది నుంచి 20 సంవత్సరాలు లేదా 50 మంది ఇలా వెళ్ళిపోతూ ఉంటే…. వందల్లో దోషాలు తీసుకోవాల్సి వస్తుంది .
మహాదేవి:- నీకు ఒక విషయం చెప్పాలి శివ నందిని. అదేమిటంటే రుద్రస్వామి ఉన్నాడు కదా! ఆయన వివిధ ఘాట్లలో యోగ నిద్రావస్థలో ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాడు. కొంతమంది ఈయన పాదాలు తాకితే పుణ్యం వస్తుంది అని పాదాలు తాకుతూ ఉండేవారు. ఈయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అని దీవించేవాడు. అలా పట్టుకుంటూ ఉండే సరికి…. 3 నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత కాళ్ల పగుళ్లు రావడం, గోర్లు ఊడిపోవడం… ఆ తరువాత పుండ్లు పడటం, ఆ పుండ్లు కూడా విపరీతమైన దురద రావడం, చర్మం ఊడిపోవడం ఇలా ఉచితార్థంగా జరిగేది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఎన్ని మందులు వాడినా నయం అయ్యేది కాదు. అవి పాదాల నుంచి మోకాళ్ళ దాకా వస్తూనే ఉండేవి. విపరీతంగా దురదలు వచ్చేవి. తనకి తప్ప ఇంకెవరికి వచ్చేవి కావు. అలా గోకుతూ ఉండేసరికి చర్మం పొట్టు రాలిపోతూ….. పుండ్లు పడుతూ…. రక్తం కారుతూ ఉండేది. చీము పడుతూ ఉండేది. సరే అని ఇంక ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండకపోయేసరికి ఇక మందులు వాడటం మానేశాడు. కొంతమంది ఈ పగుళ్లు ,చీము, నెత్తురు కారుతున్న పాదాలు చూసి దండాలు పెట్టుకోవడం మానేశారు. అప్పటి నుంచి కొద్దికొద్దిగా తగ్గడం గమనించాడు. అప్పుడు నుంచి ఎవరైనా పాదాలు తాకుతున్నా కూడా…తాక వద్దని చెప్పడం చేశాడు.. అలాగే దేవాలయాలలో ఉచిత ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా! భక్తులు
…. వాటిని స్వీకరించడం వలన తనకి ఉపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, గొంతు సమస్యలు, చెవి సమస్యలు, కంటి సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు వస్తూ ఉండేవి . తర్వాత జీర్ణ క్రియ సమస్యలు కూడా వచ్చేవి. ఆ తర్వాత ఆహారం అరిగేది కాదు. నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అంటే ఈ ఆహార పదార్థాల వలన కూడా దోషాలు వస్తాయని…. ఉచితంగా ఏమి తీసుకోకూడదు అని ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి ఇక ఉచితంగా ఏమి ఇచ్చిన తీసుకోవడం మానేశాడు. దానితో ఆయనకి అనారోగ్య సమస్యలు తగ్గటం ఆరంభించాయి. నమస్కారాలు అన్ని తీసివేయటంతో…. అనారోగ్య సమస్యలు తీరిపోయాయి.
శివ నందిని:- అవునా! ఆయన అనుభవ జ్ఞానంతో తెలుసుకున్న సత్యాలు అన్న మాట! ఇంకేమైనా ఉన్నాయా? నియమాలు ఉంటే చెప్పండి అయ్యా…
రుద్రస్వామి:- అంతేలే శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు. నేను చెబితే నువు నమ్మవు. నా అనుభవాలు చెప్తే గాని నీకు నమ్మకం రాలేదు.
శివ నందిని:- అలా ఏం కాదు… అసలు తెలుసుకోవాలనిపించింది. అందుకనే నేను అలా కొనుక్కోవడం జరిగింది. ఏదైనా కానీ నేను అనుభవం ఉంటేనే నమ్ముతానని…. నిర్ధారణ చేసుకుంటేనే కదా నమ్మేది. అలా జరగటం వలన
రుద్రస్వామి:- నా జీవితంలో జరిగిన వాటి వల్ల ఈ నియమాలు పెట్టుకున్నాను. ఆ నియమాలు నీకు చెబుతున్నాను… ఎందుకంటే అలాంటి పరిస్థితులే నీకు వచ్చినాయి. నీలో ఆకర్షణ శక్తి పెరిగింది . దైవిక శక్తి పెరిగింది. నీ సాధన శక్తి పెరుగుతుంది. నీ చుట్టూ ఇక ప్రసాద భక్తులు, అవసర భక్తులు చేరతారు. వాళ్లని నీ దగ్గరికి రానీయకు. నువ్వు గుప్తంగా ఉండు. అమాయకురాలిగా ఉండు. అజ్ఞానిగా ఉండు. గుప్త సాధన చేసుకుంటూ ఉండు. అలాగే నీ చేతుల మీదుగా విభూతులు ఇవ్వటం…. కుంకాలు ఇవ్వడం…. దైవ విగ్రహం… అలాగే మంత్రోపదేశాలు మాత్రం చేయకు.
శివ నందిని:- నా గురువు కూడా మంత్రం చేయకూడదు అని నియమం పెట్టుకుంటే నా పరిస్థితి ఏమిటి? సాధకులకు గురువు దొరకరు కదా!
రుద్రస్వామి:- అర్హత ఉన్నవాడికే నువ్వు మంత్రోపదేశం చెయ్యి. అర్హత లేని వారికి జ్ఞానబోధ చేసిన కూడా….. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఆస్తికుడికి అర్హత ,యోగ్యత యోగం ఉండి, దేవుని నమ్మేవాడికి మాత్రమే నీకు తోచింది చెయ్యి . నాస్తికుడికి చెప్పడానికి లేదు… వాడు అస్తికుడో , నాస్తికుడా అని ఒకటికి పది సార్లు విచారణ చేసుకో …. ఒక గురువుగా నువ్వు ఒక శిష్యుడికి ఉపదేశం చేస్తావో….. ఆ మంత్రమును తన స్వార్థానికి వాడినా కూడా ఆ దోషం నీకే వస్తుంది. గురు శిష్యుల సంబంధం అంటే సామాన్యమైనది కాదు. అతనికి దేవత విగ్రహాలు ఒకవేళ ఇచ్చినా కూడా….. విగ్రహాలకు ఆరాధన చేయకపోయినా కూడా…. ఆ దోషం గురువుకే వస్తుంది. గురువు అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి నువ్వు శిష్యులను లేదా భక్తులను ఏంచుకునేటప్పుడు…. ఒకటికి పది సార్లు ఆలోచించాలి.వీళ్ళు చేయగలరు…. దైవం మీద నమ్మకం ఉంది. వీళ్ళకి అర్హత, యోగ్యత ఉంది. అంటే మాత్రమే మంత్రోపదేశం చేయాలి. వాళ్ళకి దేవత విగ్రహాలు ఇచ్చి నిత్య అర్చన చెప్పాలి. ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వటానికి లేదు. వాళ్ళు చేసిన దోషాలన్నీ కూడా…. అంటే జపం కానీ ధ్యానం కానీ చేయకపోయినా…. లేదంటే నువ్వు ఇచ్చిన విగ్రహాలకు నిత్య ఆరాధన చేయకపోయినా…. ఆ దోషాలన్నీ నీకే వస్తాయి.
శివ నందిని:- అమ్మో ! అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అర్హత ఉన్న వాళ్లకే ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తాను. ముందే చెప్పి నాకు మంచి పని చేశారు.
రుద్రస్వామి:- అలాగే ఎవరి ముందు కూడా యోగ శక్తులు, యోగసిద్ధులు, పంచభూత శక్తులు, ఉన్నాయని చెప్పేసి ప్రయోగం చేయకూడదు. అలాగే నీ స్వార్థం కోసం…. ఇతరుల మెప్పుకోసం…. ధనం ప్రతిష్టల కోసం….నీ శక్తులు ఉపయోగించకూడదు.
శివ నందిని:- ఏదో ఉత్సుకతో, ఆనందంతో అవి వచ్చినాయా లేదా? అనేది తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు వీటి కోసం నేనెందుకు తహతహలాడుతాను ?
రుద్రస్వామి:- ఇప్పుడు రాబోయేది ధనకాంత మాయ తల్లి. మహాలక్ష్మి మాయ. అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ సాధనలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నూటికి 99 శాతం మంది ఉన్నారు. ఈ ధనం వల్లనే కీర్తి ప్రతిష్టలు వరకు వస్తుంది. ఏమనుకుంటున్నావు…? పరమహంస గారికి కపాల మోక్ష గ్రంథమునకు 10 కోట్లు ఇవ్వటానికి ఒక ఆవిడ సిద్ధపడిందని చెప్పడం జరిగింది కదా! కీర్తి కాంత మాయ అని చెప్పడం జరిగింది కదా! పది కోట్లు పెట్టి ఈ పుస్తకం అమ్మితే….. ఆయన కోటీశ్వరుడు అయ్యేవాడు. జ్ఞానం అమ్ముకోవడం వలన ఆయన సాధన ఆగిపోయేది. రెండోది కీర్తి ప్రతిష్టలు వచ్చేవి. ఆ 10 కోట్లతో విలాసవంతమైన జీవితానికి వెళ్లేసరికి అందరి నోట్లో పడిపోయేవాడు. అభాసుపాలు అయ్యేవాడు కదా! డబ్బు ఆయన ఆశించలేదు. జ్ఞానం అమ్ముకోరాదు. జ్ఞానం నాకు సాధనా సిద్ది వలన వచ్చింది. కాబట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా…. ఏమీ ఆశించకుండా…. నిస్వార్ధంగా ఉచితంగా ఆయన జ్ఞానబోధ అనుభవాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వీటిని నమ్మమని కూడా ఆయన చెప్పలేదు. నాకు ఇవి అనుభవాలు కలిగినాయి… ఇవి దొరికినాయి… ఇవి పొందినాను అని చెప్పాడు . మీకు కావాలంటే ఆ నిజ అనుభవాలు నిజమో కాదా….అని ఎవరికి వారి వ్యక్తిగతంగా సాధన చేసి తెలుసుకోమని చెప్పాడు. నేను పొందిన అనుభవాలు సత్యమో కాదో…. మీరే తెలుసుకోండి సత్యమైతే నమ్మండి… కాదు అనుకుంటే వదిలేసేయండి అని ఆయన చెప్పాడు. అంత ఇదిగా ఆయన సాధన స్థితిలో జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు. నువ్వు అంతే విధంగా సాధనా స్థితిలో ఉండాలి. నియమాలు అవి పాటించు. తెలిసో తెలియకో నువ్వు తప్పులు మాత్రం…. అవి సరిదిద్దుకోలేని తప్పులుగా మారతాయి. కాల క్రమేణ అవి పరిహార దోషాలుగా మారతాయి. వాటిని మనం ఇంక నయం చేయలేని స్థితికి వెళ్ళిపోతాము.
శివ నందిని:- నువ్వు చెప్పినవన్నీ మనసులో పెట్టుకుంటానయ్యా! ఈ నియమాలన్నీ కూడా నా జీవితాంతం నా సాధన పరిసమాప్తి చేసుకుంటూ వెళతాను. నువ్వు చెప్పేది నా మంచికే. కాకపోతే నేను వీటిని ఆచరణ, అమలు చేస్తాను. ఇప్పుడు ముందే చెప్పి మంచి పని చేశావు. ఇక మహాలక్ష్మి మాయ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఎంతటి వాడైనా లక్ష్మీకాంతుడు అవ్వాల్సిందే! ధనానికి దాసులు అవ్వాల్సిందే! యోగికి ధనం కావాల్సిందే! భోగికి ధనం కావాల్సిందే! భోగికి అవసరాల కోసం ధనం అవసరమైతే ….యోగికి వివిధ రకాల రుచుల కోసం ధనం అవసరం అవుతుంది. ఇప్పుడు నాకు అర్థం అయింది. భోగి కూడా వాడికి వచ్చిన డబ్బులు ఎలా రెట్టింపు చేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటే…. యోగ సాధువులు, సన్యాసులు దీక్షలో ఉన్న వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా! వాళ్లు ధనమును ఆశిస్తూ ఉంటారు కదా! వివిధ రకాల రుచుల పదార్థాలను కొనడం జరుగుతుంది కదా!
రుద్ర స్వామి:- అదే తల్లి! సూక్ష్మంలో మోక్షంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే! నువ్వు ఈ రెండో చక్రాన్ని దాటగలిగితే నీ కుండలిని శక్తి శాశ్వత స్థితిలోనికి వెళ్ళిపోతుంది. మణిపురా చక్రానికి చేరిపోతుంది. అక్కడి నుంచి ఇక జీవితాంతం కిందకి చేరదు. మణిపూరక చక్రం నుంచి బ్రహ్మ రంధ్రానికి పైకే ప్రవహిస్తుంది. ఒకవేళ తేడా వస్తే …. స్వాధిష్ఠాన చక్రం నుంచి వెనక్కి తిరిగి…. అజ్ఞాన గ్రంధిలోకి వెళ్లిపోయి…. శాశ్వతంగా నిద్రావస్థలోకి వెళ్లిపోతుంది. అక్కడితో నీ సాధన పరిసమాప్తి అయిపోతుంది. కీర్తి ప్రతిష్టలకి ఎంతటి స్వామీజీ అయినా…. పీఠాధిపతి అయినా … మఠాధిపతి అయినా ధనానికి ఆశపడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు పీఠాధిపతులు, స్వామీజీలు విరాళాల రూపంలో ధనమును సేకరించడం జరుగుతుంది. వాళ్లు ఒక మఠం నుంచి 1000 మఠాల దాకా పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ధనం కోసం, భక్తుల కోసం జరుగుతూ ఉంటుంది. భక్తులకు అనుగుణంగా …..వీలుగా వాళ్ళు ధనాన్ని సంపాదించుకునే వీలు ఉంటుంది. ఇప్పుడు కావాలి అంటే ధనం వద్దు అని, ధనం పరిత్యాగం చేసేసి వెళ్లిన వాడు కాస్త….. సన్యాసిగా మారిన వాడు కాస్త….. ఉన్నట్టుండి స్వామీజీగా మారి, ప్రసాద భక్తులు… అవసర భక్తులు ఆయన్ని స్వామీజీగా మార్చి ఆయన చేత ఆశ్రమాలు, మఠాలు పెట్టించి…. వచ్చే భక్తుల దగ్గర నుంచి విరాళాల రూపంలో సేకరించి… ఒక ఆశ్రమం నుంచి 1000 ఆశ్రమాలకు మార్చడం మనం చూస్తూనే ఉన్నాం కదా! అదేమిటంటే భక్తుల అవసరాలు తీరుస్తున్నాం…. కోరికలు తీరుస్తున్నాము…. ఆశ్రమాలు అభివృద్ధి చెందాలి… కాబట్టి విరాళాలు సేకరిస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. మూలపురుషుడు, మూలస్వామిజీ మూలన కూర్చునే ఉంటాడు. ఆ చుట్టూ ఉన్న అవసర భక్తులు, ప్రసాద భక్తులు మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా…. ఆయన పేరు చెప్పుకొని ధనం వెనకేసుకుంటారు. కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తారు. దాంతో నువ్వు ధనకాంత మాయలో పడిపోతావు. కీర్తికాంత మాయలో పడిపోతావు. జాగ్రత్తగా ఉండు అతిక్లిష్టమైన స్వాధిష్ఠాన చక్రానికి నీ సాధన వెళుతుందని గ్రహించు. ఇది అసాధ్యమని చెప్పలేను. సాధిస్తే సాధ్యం కానిది ఏమున్నది…సాధన సాధ్యతే సర్వం సాధ్యమని గుర్తుపెట్టుకో…
శివనందిని:- సరే అయ్యా! నువ్వు చెప్పినవి నేను తూచా తప్పకుండా ఆచరణ చేస్తాను. నువ్వు ముందే చెప్పినందుకు కృతజ్ఞతలు.
రుద్రస్వామి:- ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు… తథాస్తు..
అనేసరికి ఇక ఎవరికి వాళ్లే ఏకాంతంగా, ఒంటరిగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోతూ ….నిద్రలోకి జారుకోవడం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి