ముగింపు(135)

 ముగింపు 

(అంతిమ విశ్వమోక్ష ధ్యానానుభవం) 


స్త్రీ ప్రకృతి:- దక్షిణామూర్తి+రాజేశ్వరి—కదలని ప్రకృతి 


పురుష ప్రకృతి:- నటరాజు+లలిత—కదిలే ప్రకృతి 


మూలప్రకృతి:-ధ్యానమూర్తి+కామాక్షి—కదలని, కదిలే ప్రకృతి 


పూర్ణ శూన్యము:- అండ,పిండ, బ్రహ్మాండములో కదిలే, కదలని, మూల ప్రకృతులున్న ఉన్న విశ్వ జగత్తు. 


శూన్యాధిపతి:- విశ్వ జగత్తునకు శూన్యాతీత పూర్ణశూన్యములో అతీత స్థితిలో ఉన్నవాడు.


శివ నందిని కాస్త…..స్వామి! ఆఖరిగా కనిపించే రూపధారి ఎవరు….? ఆయన చేతిలో సుదర్శన చక్రం ఆకారంలో విశ్వ జగత్తు ఉంది. అది కదలటం లేదు… ఈయన కూడా కదలడం లేదు…. మెదలడం లేదు…. నిర్జీవ మూర్తిగా ఉన్నాడు . అలాగే అసలు ఈయన ఎవరు…. ఎలా ఉద్భవించారు అనగానే…


శివ స్వామి…. నీ భాషలో చెప్పాలంటే, ఆయనే సాధన విగ్రహం మూర్తి. నిశ్చలమూర్తి…మూలస్థానేశ్వర మూర్తి ….

నిర్జీవమూర్తి……శూన్యమునకు అతీత స్థితి పొందిన శూన్యాధిపతి.,.. స్త్రీ ,పురుష, నపుంసక తత్వం లేనివాడు….. త్రిగుణ రహితుడు….. మాయా రహితుడు…రూపాంతరం చెందని స్థితి…కాలాతీతుడు…అంటే స్త్రీ ప్రకృతిలో ఆదిపరాశక్తి సజీవ మూర్తిగా ఉంటే, పురుష ప్రకృతిలో ఆది రుద్రుడు సజీవ మూర్తిగా ఉంటే, మూల ప్రకృతిలో వీరిద్దరూ సజీవ మూర్తులు కాస్త ఆది రుద్రుడు కాస్త తన చేతిలో కారుంగళి శివలింగం పట్టుకుని…. ఆదిపరాశక్తి కాస్త తన చేతిలో గంధ శివలింగం పట్టుకుని ఏకమైతే, లింగ ఆది రుద్రుడి నుండి మూలశివుడు….. ఆదిపరాశక్తి నుంచి ఆది శివుడు వచ్చి వీళ్ళిద్దరూ ఏకమై మూలస్థాన మూర్తి రావడం ….మనం ఇంతవరకు చూడడం జరిగింది. 


ఈయన ఎవరంటే……నిజానికి ఈయన కాస్త లలితాదేవి ఉద్భవం కోసం ప్రాణత్యాగం చేసిన ఏకాదశ రుద్రులలో ఒకరైన శంభు రుద్రుడు అంటారు. ఈయన కాస్త మన్మధుడి చితాభస్మం నుంచి చిత్రకర్మ గణపతి తయారు చేసిన భండాసుర రాక్షసుడి సంహారం కోసం….. విశ్వకర్మ చేత, సప్తసముద్రము లలో….ఒక సముద్రమును నీరు లేకుండా ….. ఇంకింప చేసినప్పుడు ఏర్పడిన మెట్ట భూమిలో ఒక పెద్ద గొయ్యి తవ్వించి …అందులో ఒక చితాగ్ని కుండం ఏర్పరచి…..ఈ కుండంలో తనతో పాటుగా 36 కోట్ల దేవతలకి ప్రతిరూపాలైన త్రిమూర్తులు, ఏకాదశ రుద్రులు… ద్వాదశ ఆదిత్యులు …అష్ట వశువులు…. ఇద్దరు అశ్విని దేవతలు ఇలా 36 మంది కలిసి ఏకకాలంలో దూకి ప్రాణత్యాగం చేయడంతో…. విశ్వ దైవిక శక్తి అంతా ఏకమై … శంభు రుద్ర మూర్తి శరీరంలోకి ప్రవేశించి ఆపై ఆయన నుండి అఖిలాండకోటి బ్రహ్మాండనాయక లలితాదేవి కాస్త ఈ చితాగ్నికుండం నుంచి ఉద్భవించడం….. ఆపై ఈవిడ చేతిలో భండాసుర సంహారం జరగటం…మళ్లీ ఈవిడ కాస్తా కామేశ్వరిగా మారితే నటరాజు మూర్తి కాస్త మదన కామరాజుగా మారి…. ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి…. చనిపోయిన 36 మంది దేవతలను తమ శృంగార కామశక్తితో అండ,పిండ, బ్రహ్మాండాలను తిరిగి ఉద్భవించేటట్లుగా చేయడం జరిగింది. అంటే విశ్వ సృష్టి అంతమైన తర్వాత కూడా అంతము నుండి తిరిగి పునః విశ్వ సృష్టి వీరిద్దరి ద్వారా జరిగిందన్నమాట! నిజానికి భండాసుర రాక్షసుడు కూడా కామకోరిక వలనే సృష్టి విస్తారణ జరుగుతోందని….. దేవతలకి దేవుళ్ళకి దైవ శక్తి కలుగుతోందని గ్రహించి….. ఎవరికివారు కూడా అంటే, బ్రహ్మాండ లోకాలలో ఉండే స్త్రీ, పురుష, మూల ప్రకృతిలో నివసించే సకల జీవరాసులకి …..సర్వ దైవాలకి ….సర్వ పరమాత్మలకి రస శక్తి అనగా వీర్యశక్తి లేకుండా చేస్తూ…. వాళ్ళని నిర్వీర్యం చేయడంతో …అందరిలోనూ కూడా కామాసక్తి కోల్పోవడం… స్త్రీ, పురుష జీవులకి అలాగే దైవాలకు పునః సృష్టి ప్రక్రియ శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం ఉండే సమయంలో….. శంభు రుద్రుడి ప్రాణత్యాగం వలన…. తిరిగి పునః సృష్టి జరిగిందని…. ఆదిలోనే పునః సృష్టి ఆపలేకపోవడంతో ఒకపక్క విశ్వసృష్టి జరుగుతూనే…. ఒక సెకండ్కి నాలుగు జననాలు జరుగుతుంటే, మరొక పక్క విశ్వావినాశనం రెండు మరణాలు చొప్పున నిరంతరంగా అవిచ్ఛిన్నంగా… అవిశ్రాంతిగా…. అంతులేని కథలాగా…. అంతం లేని విధంగా ఒక తిరగలి విధి విధానం అనగా తిరగలి పై చక్రం ఎలా అయితే నిరంతరంగా తిరుగుతూనే ఉంటుందో….ఎలా అయితే కింద చక్రం తిరగకుండా……నిశ్చల స్థితిలో ఉంటుందో….. అలా ఒక శివలింగంలో పైన ఉన్న పాన మట్టంలో ఉన్న లింగభాగానికి నిత్యభిషేకాలు జరుగుతూనే ఉంటే కింద భాగం అంటే పీఠభాగానికి అభిషేకాలు లేని నిశ్చల స్థితిలో ఎలా ఉంటుందో ….. అంతెందుకు….. కదిలే ప్రకృతి అధిదేవత అయిన లలితాదేవి కాస్త, శివుడు మీద కూర్చుని ఉంటే…. కదలని ప్రకృతి అధినేత రాజరాజేశ్వరి దేవి తలకొప్పులో శివమూర్తి ఉంటాడు కదా! అంటే ఈ లెక్కన చూస్తే , కదిలే ప్రకృతి కింద భాగంలో ఉంటే…… కదలని ప్రకృతి పై భాగంలో ఉంటుంది. కానీ మనకి కనిపించేటప్పుడు వ్యతిరేక విధివిధానంలో అనగా పైభాగం కదిలే ప్రకృతిగా….. కింద భాగం కదలని ప్రకృతిగా…..అద్దంలో మన ప్రతిబింబం ఎలా అయితే కుడి ఎడమ ఎడమకుడిగా కనబడుతుందో….. అలా, అందుకే మొదట లలితాదేవి రూపం ఆ తర్వాత అంత్య రూపముగా రాజరాజేశ్వరి రూప ఆరాధన వస్తుంది.


అలా ఇది సృష్టి పై భాగమున , విశ్వ సృష్టి వినాశనము కింద భాగమున కలిసిపోయి…. నిరంతరంగా ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో చేస్తూనే ఉంటాయని… సృష్టి అనేది సృష్టిలో అంతము జరిగిందా…. లేదా అంతంలో సృష్టి జరిగిందా! ఎవరికీ అర్థం కాని విషయం గాను…. అలాగే మనము విశ్వ మోక్షం పొందామో లేదో… తెలిసీ తెలియని విచిత్ర అవస్థకి చేరుకోవడంతో…… తనలో కదిలే స్త్రీ మూర్తికి శక్తి లేకపోవడంతో…. కదలని శక్తితో పూర్ణ ఏకత్వ పురుష శక్తితో….. మూలస్థానేశ్వరుడై కదలడానికి అవకాశం లేని స్థితిని పొందిన ఈ శంభు రుద్రుడు కాస్త సజీవ మూర్తి నుండి నిర్జీవ మూర్తిగా మారి….అంటే ఈయన శూన్యానికి అతీతమైన స్థితిని పొందడం జరిగింది. సజీవ మూర్తి కాస్త నిర్జీవమూర్తి అయింది. శివం కాస్త శవమై శివ శవం అయ్యింది. ఆయన మరణించిన విషయం ఆయనకే తెలియకుండా పోయింది. అంతెందుకు….మనం మరణించిన విషయం మనకి తెలియదు కదా! తెలిస్తే మరణించినట్లే కాదు కదా! బతికి ఉన్నట్లే కదా! అలాగే ఈ మూలస్థాన మూర్తి కూడా….. తను మోక్షం పొందిన విషయం , అనగా తన మరణమే విశ్వ మోక్ష మరణం అని తెలియకుండానే…..నిశ్చల స్థితి పొంది నిర్జీవ మూర్తి అయ్యాడు. ఈ కనిపించే మూర్తి నిజానికి చచ్చిన శివశవం . జ్వాలాగ్నిలో కాలి బూడిద అయిన శరీరం. కానీ చూడటానికి బతికున్న రూప ధారి గా కనబడుతోంది . ఎందుకంటే ఈ బూడిద శరీరం కాస్త కూర్చున్న శరీరాకృతిలో నిశ్చలమయ్యింది. నిర్జీవమైనది…. ఈ ఆకార శరీరం కాస్త నిరాకారమై….. శూన్యంలో కలిసిపోయి ఉంటే ….మరొక రూపంతో రూపాంతరం చెంది పెను ప్రమాదం ఉంటుంది కదా! అందుకని ఆఖరిగా అంతిమంగా రూపాంతరం చెందకుండా …. రూప ధారి నిర్జీవమై ఉండి ఉండాలి .లేదా పద్మాసన ధ్యాన భంగిమలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు…. సజీవమూర్తి కాస్త న నిర్జీవ మూర్తి అవ్వడం జరిగి ఉండాలి. కాకపోతే ఇలా శూన్యాతీత స్థితికి వచ్చిన వాడు….ఈ రూప ధారి స్థానమూర్తి కాస్త , నిర్జీవ మూర్తి అని తెలుసుకుంటే… వాడు కూడా శూన్యం అవుతాడు. లేదు అంటే మరో భావ బ్రహ్మాండానికి ఆది శివుడయ్యి…. అధిపతి అయ్యి ….విశ్వ సృష్టికి పునః సృష్టి చేస్తాడు. ఇందులో నూటికి 99 శాతం మంది తను నిర్జీవ మూర్తి అని తెలిసినా కూడా…. నమ్మకుండా …..సజీవమూర్తి అని భావ ఆలోచనలు చేస్తూ…. విశ్వ పునః సృష్టి తెలిసి లేదా తెలియక చేస్తున్నారు. అదే కోటిలో ఒక్కరు మాత్రమే…. అనగా 0.1% మాత్రమే ఈ రూప ధారిని నిజంగానేసత్యముగా నిర్జీవ మూర్తి అయిన శివశవమని….. తాము కూడా చచ్చిన జీవ శవ మని చచ్చిన శివమని …..చచ్చిన జీవ శివమని అనుభూతి పొందడంతో శూన్యంలో శూన్యం అవుతున్నారు కాకపోతే జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతం ప్రకారంగా శూన్యమునకు శూన్యాతీత స్థితి ఒకటి ఉంటుందని….. ఆయన స్వానుభవంలో జ్ఞాన స్ఫురణ పొందడం జరిగింది. ఎందుకంటే శూన్యం ఉన్నది అని శూన్య భావన మనకి కలుగుతుంది కదా! ఇది ఉన్నదో లేదో తెలియని స్థితిలో ఉంటుంది కదా! ఈ శూన్యభావ అతీత స్థితియే శూన్యాతీత స్థితి అని , దీనినే పూర్ణ శూన్యస్థితి అంటారని……ఇదే ఈ రూప ధారి పొందిన శూన్యాతీత స్థితి అన్నమాట! అలాగే ఆదిశంకరాచార్యుడి అభిప్రాయం ప్రకారం మోక్షం అంటే నిశ్చల స్థితిని పొందడం అని మనకి భజగోవిందం శ్లోకంలో తొమ్మిదవ శ్లోకంగా 


సత్సంగత్యే నిస్సంగత్వం 

నిస్సంగత్వం నిర్మోహత్వం 

నిర్మోహత్వే నిశ్చలతత్వం 

 నిశ్చలతత్వే జీవన్ముక్తి: 


చెప్పడం దానిని బట్టి చూస్తే …..అంతిమంగా మనకి కనపడే రూప ధారి స్థితి నిశ్చల స్థితిలో ఉండి నిర్జీవమై మోక్షం పొందాడని చెప్పకనే తెలుస్తోంది గదా..! .ఈ లెక్కన చూస్తే రూప ధారి నిర్జీవ మూర్తి ఉండటం చేత… విశ్వ మోక్షం పొందామో లేదో తెలియని విచిత్ర అవస్థగా విశ్వమోక్షం ఉంటుంది.


నిజానికి ఈయన జీవ రుద్ర శివమూర్తి కాస్త రుద్ర శివమణి అయ్యాడు. రుద్రమణి అంటే రుద్రుడు ధరించిన మణి అని అర్థం అనుకుంటారు… నిజానికి రుద్ర లేదా శివమణి అంటే రుద్రాంశ అంతిమ రూప ధారి …రుద్రాంశ కాస్త మణిగా మారిందని ఎవరు అనుకోరు…. ఊహించరు…. ఆలోచించరు…. అలాగే మణి మాయ దర్పణమై మన ప్రతిబింబమే ఈ మణిమీద పడి బింబమై చూపిస్తారు. మనం శివాంశ అయిన విషయం గ్రహించము. తెలుసుకోలేము. ఆలోచించలేము… పట్టించుకోము… తెలిసిన మర్చిపోతాము. తద్వారా మన శివాంశ ప్రతిబింబం… ఆ మణి మీద బింబంగా చూసి…. శివుడు బతికే ఉన్నాడు, సజీవ మూర్తిగా ఉన్నాడు అని….. శాశ్వతుడు అని…. నిత్య సత్యుడుగా ఉన్నాడు అని….. అంతిమంగా భ్రమ , బ్రాంతి మాయలో పడిపోయి…పునః సృష్టికి వెళ్ళటం జరుగుతోందని…. ఎందరికీ తెలుసు….! తెలిసినవాడు చెప్పలేడు. చెప్పేవాడు తెలుసుకోలేడు.ఆఖరిగా అంతిమంగా శంభు రుద్రుడు కాస్త రుద్రమణి ఆకారంతో నిర్జీవ మూర్తిగా మారడంతో ఈ రుద్ర మణి ఆదిపరాశక్తి కాస్త …అంటే ఈయన కాస్త అన్నింటికి అతీత స్థితిని పొంది పరిశుద్ధ స్థితికి చేరుకోవడంతో…. పరిశుద్ధ స్పటిక మణిగా మారడం జరిగింది. అదే మనకి సాధనలో మనో శరీరం మోక్ష సమయంలో వచ్చే మనో శివలింగం అన్న మాట! ఎందుకంటే ఈ లింగము యొక్క లింగభాగం స్పటిక లింగ భాగం అయితే…. పీఠ భాగం నల్ల రాతి అవుతుంది. ఇలా ఏర్పడిన రుద్ర స్పటిక మణి అమ్మవారి చేతికి వచ్చేసరికి…. చింతామణిగా మారింది. ఎందుకంటే ఈవిడ విశ్వ జగత్తు లాలన పాలన చూసుకోవాలనే మోహ మాయా కోరిక కర్మ ఉండటం వలన….. 98% శుద్ధమై… చింతలు తీర్చే చింతామణి అయ్యింది. దీనిని ఆవిడ అష్టదళాలు ఉన్న పద్మ మధ్యభాగంలో ఈ మణి వుంచి …..మణి పద్మముగా ఆరాధన చేస్తూ….. మణి సింహాసన ఆసీనురాలై…. మణిద్వీపంలో స్థిర నివాసం చేస్తూ విశ్వజగత్తు పాలన చేయడం జరిగింది. తర్వాత ఈవిడ నుండి రుద్రుడు రావడంతో వీరిద్దరు కాస్త కామ భావానికి గురి అవ్వటంతో…. కామేశ్వరి కామేశ్వరుడై ఇష్ట లోకమును మన హృదయ చక్రంలో ఏర్పరచుకొని….. అండ,పిండ, బ్రహ్మాండాలు మూల ప్రకృతి పరిపాలించే ఆదిదంపతులుగా మారడం జరిగింది. అందుకే దేవి పురాణం ప్రకారం చూస్తే ఆదిపరాశక్తి నుంచి త్రిమూర్తులు రావడం….. ఇలా వచ్చిన వారిలో రుద్రుడు కాస్త ఈమెను మూడు భాగాలుగా మార్చి…. త్రిశక్తి మాతలు చేసి వారిని ఈ త్రిమూర్తులు వివాహం చేసుకోవడం జరిగింది. కానీ నిజానికి మూల ఆదిపరాశక్తి మాత్రం ఆది రుద్ర శంభు ప్రాణత్యాగం నుండి లలితాదేవి ఉద్భవిస్తే ఆ తర్వాత ఈవిడ నుండి త్రిమూర్తి రూపంలో రుద్రుడు రావటం జరిగిందన్నమాట! ఆ తర్వాత అమ్మవారి నుండి చింతామణి కాస్త విష్ణుమూర్తికి చేరి అది కాస్త ఈయనకి ఉన్న పరిపాలనాస్థితి కారకం వలన …ఈ మణి కాస్త కౌస్తభ మణి గా మారడం జరిగింది. ఈయన నుండి బ్రహ్మదేవుడికి ఈ మణి చేరి ఈయనకి ఉన్న సృష్టికర్యం మాయవలన ఈ మణి కాస్త బ్రహ్మ చింతామణిగా మారటం….. ఆ తర్వాత గణపతికి చేరి చింతామణి గణపతి గా మారడం….. ఆ తర్వాత శ్రీరాముడి దగ్గరకు చేరి చూడామణి గా మారడం….. ఆ తరువాత శ్రీకృష్ణుడి దగ్గరికి చేరి బంగారం ఇచ్చే శమంతకమణిగా మారడం….. ఆఖరికి బుద్ధుడికి ఈ మణి కాస్త కైలాస పర్వతం లో చింతామణిగా దర్శనం ఇవ్వటం జరిగింది. దానితో ఈయన కాస్త దీనిని మణి పద్మముగా వర్ణన చేసి…. మణి మంత్రం ఏర్పాటు చేసి… శూన్య సిద్ధాంతమును తన బౌద్ధమత ధర్మముప్రచారం చేయడం జరిగింది.


నిజానికి ఈ స్థానమూర్తి స్పటిక మణి రూపమును చూడటానికి ….అరుణాచల క్షేత్రంలో ఉన్న ఆది అన్నామలై గుడికి బయటవైపు ఒక పెద్ద రావి చెట్టు కింద ఉన్న గణపతి విగ్రహ ఆకారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విగ్రహ మూర్తిలో కేవలం మడతల ఆకారాన్ని బట్టి మనం గణపతి రూపం ఎలా అయితే అనుకుంటామో….. అలా మూలస్థాన మూర్తి రూపములో ఉన్న మడతలను బట్టి అవి రుద్రస్వరూపం గానూ లేదా అమ్మవారి రూపం గాను లేదా గణపతి రూపంలో లేదా ఎవరి భావాన్ని బట్టి ఈ ఆకారంలో భావరూప ఆకారంలో కనబడటం బట్టి.. యద్భావం తద్భవతి అనే సామెత వచ్చిందని శివ స్వామి గ్రహించాడు. అలాగే ఈ రూప ధారి చూడటానికి నిర్జీవమూర్తి అయినా కూడా…. సజీవ మూర్తి అనే భావం కలుగుతోందని…. త్రాడు యొక్క మెలికలు చూస్తే అది పాము అనే భావం ఎలా అయితే కలుగుతుందో.. అలాగే ఈ నిర్జీవ మూర్తి కాస్త సజీవ మూర్తి అనే భావం కలుగుతోందని ఇది ఎలా ఉంటుంది అంటే…. ఠాగూర్ సినిమాలో హీరో యొక్క భార్య పిల్లాడు కాస్త అగ్ని ప్రమాదం లో దహనమై కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగా బూడిద రూపంలో అలా ఆకారంగా కనబడతారు. హీరోకి వీళ్ళ బుడిద ఆకారం చూసి ఒక క్షణం పాటు సజీవ మూర్తిగానే ఉన్నారని భ్రమించి వీళ్ల దగ్గరికి వెళ్లి చేతితో తాకగానే ఆకార బూడిద కాస్త నిరాకార భస్మంగా మారిపోయే దృశ్యం ఎలా అయితే ఉన్నదో… అలా ఈ నిర్జీవ మూర్తి యొక్క బూడిద ఆకారం కాస్త సజీవ మూర్తి ఉన్నట్లుగా మనకి సత్యము నిత్యము, శాశ్వతము అన్నట్లుగా భ్రమ, బ్రాంతి, మాయ జ్ఞానము కలిగిస్తోంది. కాకపోతే ఈ ననిర్జీవ మూర్తి బూడిద రూపాన్ని తాకటానికి ఎవరూ లేరు… ఏమీ లేదు…. చూసేవాడు ఉన్నాడు ….తాకేవాడు లేడు. తాకితే వాడే స్తానేశ్వరుడు అవుతాడు కదా! ఎందుకంటే నిజానికి తాను ఆదిలో చచ్చిన శవం అని విషయ జ్ఞానం మన ఆత్మ నమ్మకపోవడంతో …..మన మరణం మోక్షమరణం అయినప్పటికీ.. భ్రమ, బ్రాంతి, మాయ, జ్ఞాన మాయలో పడి పొందిన మోక్షం మళ్లీ తిరిగి మోక్షం పొందాలని మోక్షజన్మ ఎత్తడం జరుగుతోంది. ఎందుకంటే మనం మరణించిన విషయం అలాగే, మనం మోక్షం పొందిన విషయం మనకు తెలియదు కదా! తెలిస్తే మరణం లేదా మోక్షం పొందినట్లే కాదు కదా! ఏమంటారు నిజమే కదా! అంటే నిజానికి మోక్షం అంటే నిశ్చల స్థితి పొందామని ఎవరికి వారే స్వానుభవ అనుభూతి పొందితే గాని….. మనం మరణం నిశ్చల మోక్ష మరణం అవ్వదు. ఇది నమ్మినవాడు మోక్షం పొంది శూన్యం అవుతాడు . ఇది నమ్మని వాడు విభజన చెంది అమోక్షం పొంది పునః సృష్టి అవుతాడు.


శివనందినికి ఒక సందేహం వచ్చి…. శివ స్వామితో….

 స్వామి! మన మూలమూర్తి నిశ్చల మోక్షస్థితి పొంది నిర్జీవం అయితే…. ఇక మనమెందుకు అనిశ్చల స్థితిలో ఉండి, సజీవ మూర్తులుగా ఉన్నాము. ఇంతకీ మనం ఎవరు? మనకి నిర్జీవ స్థితి రాదా అనేసరికి…


దేవి! మనమంతా కూడా ఈ సాధనా మూలస్థానేశ్వర మూర్తి యొక్క సాధన శరీరాలం..మనమంతా పొందింది శూన్య స్థితి. శూన్యం అవ్వడమే! ఆయనే పొందిన స్థితి శూన్యాతీత స్థితి…నిశ్చల మోక్షస్థితి…. ఆయన తప్ప ఎవరూ పొందలేరు . పొందరు …ఎందుకంటే ఆది నుండి అంతం వరకు ఉన్నది ఆయనే. మరొకరు లేరు. మరొకటి లేదు. ఆయన నుండి మనమంతా కూడా స్త్రీ ,పురుషుడిగా వచ్చిన ఆలోచన… భావరూప స్వప్న శరీరధారులమే…ఎందుకంటే, ఆయనలో ఆదిలో స్త్రీ ,పురుష , నపుంసకస్థితి ఉండేది. అప్పుడు ఆయనలో పురుషతత్వం నుండి నేను ఎవరో తెలుసుకోవాలని ఆలోచన మొదలైంది. అదే స్త్రీ తత్వం నుంచి నేను అనేకం అవ్వాలి అనే ఆలోచన మొదలయ్యింది. దానితో ఈ ఆలోచనలు కలిసి ఏకత్వం కాస్త బహు తత్వస్థితి అనే భావరూప ఆలోచనతో ఈయన నుండి స్త్రీ ,పురుష భావ స్వప్న శరీరాలు బయటికి రావడంతో….. అప్పటిదాకా ఆలోచన స్థితిలో ఉన్న ఆ ఏక మూల మూర్తి కాస్త, అనగా సజీవ మూర్తిగా ఉన్నవాడు కాస్త నిర్జీవమూర్తి అయ్యి నిశ్చల మోక్ష స్థితి పొందడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఆలోచన ఆచరణ చేసే శక్తులైన పురుష , స్త్రీ తత్వాలు తన నుండి బయటకు వచ్చేసాయి. ఈ రెండు తత్వాలు కాస్త మనోదేహాలుగా మారి….. ఆయన నుండి బయటకు వచ్చారు. కానీ వీరిద్దరూ కూడా ఎవరినుండి వచ్చారో ….ఆయన నిశ్చల మోక్షస్థితి అంటే మోక్షమరణం పొందాడని గమనించలేదు. గ్రహించలేదు… ఆయన ధ్యాననిష్ట లో ఉన్నారు అనుకొని …..వీళ్ళు కాస్త 108 డైమెన్షన్స్ నుండి బయటకు వచ్చి, ఒకటవ డైమెన్షన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో పురుషుడు సన్యాస స్థితి యోగంలో ఉండి, నేను ఎవరు అని ఆలోచన ప్రయోగాలు చేస్తూ ఉంటే….. స్త్రీ మూర్తి కాస్త సంసారి స్థితిలో భోగంలో ఉండి …..నేను అనేకం అవ్వాలి అని ఆలోచన ప్రయోగంలో ఉండేది. దాని తర్వాత రెండవ డైమెన్షన్ ఏర్పాటు చేసుకొని స్త్రీ మూర్తి కాస్త గృహస్థ ఆశ్రమ స్థితి , పురుష మూర్తి కాస్త సన్యాస ఆశ్రమ స్థితి ….అంటే స్త్రీ మూర్తి సంసారం వృద్ధి చేస్తే ,పురుష మూర్తి సంసార వృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తూనే….. సన్యాస స్థితులో యోగ స్థితిలో ఉంటూనే ఉన్నాడు అన్నమాట. ఇలా 100 డైమెన్షన్ వరకు అయ్యవారు యోగాన్ని అమ్మవారి భోగాన్ని వదిలిపెట్టలేదు.


అప్పటికే విశ్వ సృష్టిలో ….కోట్లాను కోట్ల అండ, పిండ, బ్రహ్మాండాలు ఉన్న స్త్రీ ,పురుష మూల ప్రకృతులు ఏర్పడ్డాయి . దానితో వీరిద్దరూ 100వ డైమెన్షన్స్ స్థితికి వచ్చేసరికి….. తాము ఎవరో తెలుసుకోవాలని…. తపన, తాపత్రయం, కుతూహలం, ఆశ ,అవసరం కలిగాయి . ఎందుకంటే 100వ డైమెన్షన్స్ స్థితికి వచ్చేసరికి…. వీరిద్దరూ కూడా అనగా పురుషుడు కాస్త విశ్వమునకు విశ్వాధిపతిగా ఉంటే… స్త్రీ మూర్తి కాస్త జగత్తుకి జగద్దాత్రిగా ఉంది. తమని దాటిన శక్తి కానీ లేదా తమని ఎదిరించే శక్తి కానీ లేకపోవడంతో చేసిన సృష్టినే చేస్తున్నామని …..చూస్తున్నామని ……చేసిన దానిని మళ్లీ మళ్లీ చేసి చేస్తూ ఆనందపడుతూ….. ఆవేదన పడుతున్నామని వీటినే పదే పదే చూస్తున్నాం అనే జ్ఞాన స్పురణ వీరిద్దరికి 101వ డైమెన్షన్ లో ఏర్పడింది . దానితో నూట ఒకటవ డైమెన్షన్ లో అన్నిటిని పరిత్యాగం చేసుకుంటూ రావాలని….. అనగా వదిలించుకుంటూ రావాలని…. ఇంద్రియ మనో నిగ్రహంతో దాటుకుంటూ రావాలని…. మనో నిశ్చయం చేసుకొని స్మశాన వైరాగ్య స్థితిని పొంది ….వీరిద్దరూ కాస్త అప్పటికే ఈ స్థితిలో ఉన్న పురుషుడితో కాస్త సంసార భోగ స్థితిలో ఉన్న స్త్రీ మూర్తి కాస్త సన్యాస యోగ స్థితికి రావటంతో…. ఇలా ఇద్దరు కలిసి ఈ డైమెన్షన్ లో భూమి మీద ఆధిపత్యం వదిలేశారు. తర్వాత 102వ డైమెన్షన్ లో నీటి మీద ….తర్వాత 103వ డైమెన్షన్ లో అగ్ని మీద…. 104వ డైమెన్షన్ లో వాయువు మీద …..ఆ తర్వాత 105వ డైమెన్షన్ లో ఆకాశం మీద ఆధిపత్యం వదిలేశారు. అంటే పంచభూతాల మీద ఆధిపత్యం వదిలివేయటం…. వీరిద్దరూ కలిసి చేశారు. ఆ తర్వాత 106వ డైమెన్షన్ లో అయ్యవారు కాస్త సూర్యుడి మీద ఆధిపత్యం వదిలివేస్తే…. అమ్మవారు కాస్త తన మనసు మీద ఆధిపత్యం వదిలివేసింది. ఎందుకంటే పురుషుడు ప్రకృతి అష్టాంగాలు అనగా పంచభూతాలు, సూర్యుడు ,చంద్రుడు, జీవుడు అయితే …..స్త్రీ ప్రకృతి అష్టంగాలు అనగా పంచభూతాలు ,మనస్సు, బుద్ధి ,అహంకారం కదా! ఇందులో భాగంగా అయ్యవారు కాస్త 106 డైమెన్షన్ లో సూర్యుడి మీద… అలాగే అమ్మవారు కాస్త మనసు మీద ఆధిపత్యం వదిలేసింది అన్నమాట ! ఇకపోతే వీరిద్దరూ కాస్త నూట ఏడవ డైమెన్షన్ లో అయ్యవారు కాస్త చంద్రుడు మీద ఆధిపత్యం వదిలేస్తే…. అమ్మవారు కాస్త తన బుద్ధి మీద ఆధిపత్యం వదిలేశారు . ఇక ఆ తర్వాత ఆదిలో ఏర్పడిన ఆది 108 డైమెన్షన్ కి తిరిగి వీరిద్దరూ చేరుకోవడం జరిగింది. అక్కడున్న మూలస్థాన మూర్తి స్వరూపాన్ని వీరిద్దరూ చూడడం జరిగింది. ఇంకా అప్పటికి అయ్యవారిలో ఎనిమిదవ అంగమైన జీవుడి తత్వం అలాగే అమ్మవారి లో ఎనిమిదవ అంగమైన అహంకారతత్వం వదిలించుకోలేదని తెలుసుకోండి ….గ్రహించండి. దానితో అయ్యవారు కాస్త తనకి ఉన్న జీవ తత్వముతో పూర్ణ జ్ఞానమును పొంది మూల మూర్తి కాస్త నిర్జీవ మూర్తి అయ్యి నిశ్చల మోక్షస్థితిని పొందటం…. రూపాంతరం చెందకుండా ….తన శరీర ఆకారంతో అగ్నితత్వ బూడిదగా మారాడని ఈయనకి జ్ఞాన స్ఫురణలు అందడంతో….ఇదే విషయాన్ని అమ్మవారికి చెబితే, ఈవిడలో ఆఖరిగా మిగిలిపోయిన ఎనిమిదవ అంగస్థితి అయిన అహంకారము ఈయన చెప్పిన విషయం నమ్మలేదు. 


మీరు చెప్పింది నిజం కాదు….. ఈయన నిర్జీవమూర్తి కాలేదు…. సజీవ మూర్తిగా ఉండి నిశ్చల ధ్యాననిష్ట లో ఉన్నారని వాదించడం మొదలుపెట్టింది. అంతేకానీ అయ్యవారు చెప్పిన విషయమును తనకి ఉన్న అహంకారం మాయవలన లోతుగా ఆలోచించలేక పోయింది. మూలం గ్రహించలేకపోయింది. సత్య జ్ఞానమును పొందలేకపోయింది. అయ్యవారేమో ఈయన నిర్జీవమూర్తి అయ్యాడని అంటే …..అమ్మవారు కాస్త కాదు.. ఇది సత్యం కాదు… మీరు భ్రమ బ్రాంతి మాయలో పడుతున్నారు… ఈ స్థితి నిర్జీవ మూర్తి స్థితి కాదు . సజీవమూర్తి స్థితియే …ఇది నేను చచ్చినా నమ్మను. నా సత్యాన్ని మీరు అసత్యం చేయాలని అనుకుంటున్నారు. మీ అసత్యాన్ని నాకు సత్యంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కదలటం లేదని…మెదలడం లేదని …అన్న మాత్రమున సజీవ మూర్తి కాస్త నిర్జీవమూర్తి అవుతాడా ? అనగానే 


అయ్యవారు కాస్త అది కాదు దేవి! నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఆయన సజీవమూర్తి అయితే శ్వాస జరగాలి కదా! జరగడం లేదు కదా! శ్వాసే జననం. శ్వాస ఆగిపోతే మరణం కదా…. అనగానే కావాలంటే ఈయన శ్వాస గమనం చూడు….. వైద్యుడు కూడా నాడీ గమనమును బట్టి వాడు చచ్చాడనో లేదా బతికి ఉన్నాడనో తెలుసుకుంటారు కదా! అలా నువ్వు కూడా తెలుసుకో ! అప్పుడు నీకే నమ్మకం వస్తుంది…. అప్పుడు నేను చెప్పింది అక్షర సత్యం అని నీకే తెలుస్తుంది…. అనగానే


అమ్మవారు కాస్త ఈ మూలమూర్తి యొక్క ముక్కు దగ్గర చెయ్యి పెట్టి , శ్వాసగమనం లేదని ఒకటి పదకుండు సార్లు పరిశీలించి ,పరిశోధించి చూసినా… కూడా నమ్మకం రాదు. దానితో ఈమె కాస్త ఉన్నట్టుండి స్వామి! యోగులు కాస్త తమ సాధన పరిసమాప్తి సమయానికి శ్వాసని ముక్కు ద్వారా అనగా…. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసగమనం చేయరని…. గుండె ద్వారా చేస్తారని…. ఈ గమనం కేవలం ఈ ప్రపంచంలో పాముకి మాత్రమే ఉన్నది అని….. అందుకే కుండలినీ శక్తికి ప్రత్యేకముగా పాము గుర్తుగా పెట్టారని…… ఇంతకుముందు మీరే చెప్పారు కదా! ఈ లెక్కన చూస్తే ఈయన శ్వాసగమనం అనేది ముక్కు ద్వారా కాకుండా గుండె ద్వారా చేస్తున్నారేమో …ఎవరికి ఎరుక అనగానే


దేవి! కావాలంటే ఈ గుండె మీద చెయ్యి పెట్టు… లేదా చెవి పెట్టి గుండెచప్పుడు విను…. లేదా నాడీ పట్టుకో విషయం నీకే అర్థమవుతుంది. నీకున్న అహంకారం మాయ వలన పదార్థం దాటి యదార్థం తెలుసుకోలేకపోతున్నావు ….అనగానే,


నాది అహంకారం కాదు …మీది జీవ అహంకారం .మీరు చెప్పింది చెయ్యాలి… మీరు చెప్పిందే వినాలి అనేది మీ అహంకార తత్వము. ఇదంతా కాదు ఏదైనా నేను నా స్వానుభవ అనుభూతి పొంది అసలు సత్యాసత్యాలు ఏమిటో తెలుసుకుంటాను.సాధనా జన్మ పొంది పూర్ణజ్ఞానం పొందుతాను అనగానే ……


దేవి ! నేను పొందిన ఈ అనుభవ అనుభూతి అనగా మూల మూర్తి కాస్త నిర్జీవం అయ్యి నిశ్చల మోక్షస్థితి పొందాడని నేను కాస్త మనసా వాచా పూర్ణ విశ్వాసంతో ఎలాంటి అనుమాన సందేహాలు లేకుండా …..పొందకుండా…. ఈ అంతిమ సత్యాన్ని నమ్ముతున్నాను. నాకు ఎలాంటి సాధనా జన్మ అవసరం లేదు. ఇంక ఎలాంటి పూర్ణజ్ఞానం పొందవలసిన స్థితి లేదు. పొందిన అంతిమ అనుభవ అనుభూతి జ్ఞానమే పూర్ణజ్ఞానం అని….. నీలో ఉన్న అంతిమ అహంకార మాయ వదిలిన నాడు నువ్వు తెలుసుకుంటావు. అప్పటిదాకా నువ్వు సాధనాస్థితిలో ఉండు. నేను పూర్ణ శూన్యంలో పూర్ణ మోక్షం పొంది శూన్యం అవుతాను అంటూ….. ఈ మూలమూర్తి యొక్క చూపుడు వేలికి సుదర్శన చక్రం ఆకారంలో తిరుగుతున్న మూల ఆది విశ్వ జగత్తులోనికి ఆది శివుడు కాస్త లింగ దేహరూపుడే ఆపై కరుంగలి శివలింగమై ఆపై విశ్వశూన్యంలో శూన్యం అవ్వడంతో  ఈ భౌతిక స్థూల దేహం కాస్త క్షణకాలం యోగాగ్నితో దహనం అవడంతో బూడిద కుప్పగా మారింది.


ఇదంతా గమనిస్తున్న ఆదిపరాశక్తి కాస్త ….తనకి ఉన్న అహంకార మాయ వలన తన మాటే సత్యమని…. అనగా మూలమూర్తి కాస్త నిర్జీవమూర్తి కాదని…. సజీవ మూర్తి అని నిరూపణ చేయాలని ….మనోసంకల్పం పెట్టుకొని…. మనో శరీరంతో తన భర్త యొక్క బూడిద కుప్పనుండి ఒక గుప్పెడు బూడిదను తీసుకొని 108వ డైమెన్షన్ నుండి ఒకటవ డైమెన్షన్ కి వచ్చి తను తెచ్చిన బూడిద కుప్ప నుండి పరమేశ్వరుడిని సృష్టించి…. తను కాస్త పరమేశ్వరిగా మారి…. ఇంక ఎవరూ కూడా 108వ డైమెన్షన్ అనగా సత్యలోకానికి వెళ్ళనివ్వకుండా…. పెద్ద అనకొండ లాంటి సర్పరాజముతో ఒకటవడ మెన్షన్ నుంచి 107వ డైమెన్షన్ వరకు నాగబంధం వేసింది. అంటే వైకుంఠపాళీ ఆటలో 107వ గడిలో  పాము తల ఉంటే ఒకటవ గడిలో పాము తోక ఎలా అయితే ఉంటుందో….. అలా అన్నమాట. దానితో ఎవరైనా 108వ డైమెన్షన్ కి వెళ్లాలంటే మహా మృత్యు భయం దాటవలసి ఉంటుంది అన్నమాట! దాటిన నాడే 108వ డైమెన్షన్ కి వెళ్లి ….అక్కడ ఉన్న మూల మూర్తి కాస్త అసలు సిసలైన మూల సత్యమైన జ్ఞానం అనగా ఇక్కడ ఉన్నది సజీవమూర్తి కాదని…. నిశ్చల మోక్ష స్థితి పొందిన నిర్జీవ మూర్తి అయిన స్థాన మూర్తి అని…స్వానుభవ అనుభూతి పొందిన ఈ అంతిమ అనుభవమును ఎవరైతే నమ్ముతారో….. పూర్ణ శూన్యంలో శూన్యం అవుతారు. లేదంటే సాధనా జన్మతో వెనుతిరిగి ఒకటవ డైమెన్షన్ కి వచ్చి పునః సృష్టిలో పడతారు. అనగా మోక్షమును పొందవలసిన చోట అమోక్షమును పొందుతారు . నిజానికి 100 మంది లో ఇద్దరు మాత్రమే ఈ 108వ డైమెన్షన్ కి వస్తారు . ఒకడు మోక్షం పొందితే మరొకడు అనుమాన భయంతో అమోక్షం పొందుతాడు. ఎందుకంటే మోక్షం పొందిన వాడు అహంకార మాయ రహితుడైతే…. అమోక్షం పొందినవాడు అహంకార మాయ సహితుడు అన్నమాట. అందుకే అరుణాచల క్షేత్రంలో అరుణాచలేశ్వరుడు తనకి దానముగా మన అహంకారం ఇవ్వమని అడగడం జరుగుతుంది. ఎవరైతే తనకి ఈ దానం ఇస్తారో ఆయన చేతుల మీదుగానే మన పిండ దేహమును నిర్జీవ మూర్తిని చేసి… దహనం చేసి… ఆపై మన లింగ దేహమును పూర్ణ శూన్యంలో శూన్యం అయ్యేటట్లుగా అనుగ్రహిస్తాడు . అదే ఈ క్షేత్రములో తమ అహంకారమును తనకి ఎవరైతే….. దానము చేయరో…. వారి పిండ దేహాన్ని నిర్జీవ మూర్తిని చెయ్యకుండా…. సజీవమూర్తిగానే అహంకార అజ్ఞాన అగ్నితత్వ శరీర మాయలో ఉన్న ఆదిపరాశక్తికి పునః సృష్టి కోసం వీరికి అందించడం జరుగుతుంది. ఇలా ఈ విశ్వ జగత్తులో ఉన్న ప్రతి జీవి యొక్క పిండ దేహాలను ఈ అరుణగిరి లోపల కోణ లింగాలలో భద్రపరచడం జరిగింది. ఎవరైతే అహంకార రహిత స్థితికి వస్తారో….. ఆ జీవి యొక్క కోణలింగం కాస్త నీలిరంగుగా మారుతుంది. ఇంకా ఎవరైతే అహంకార మాయలో ఉంటారో …..వారి కోణ లింగం కాస్త ఎరుపు రంగులో ఉంటుంది. అహంకారమాయను వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ …ఎవరైతే ఉంటారో వారి కోణ లింగం కాస్త బంగారపు వర్ణంలో ఉంటుంది . ఇలా నలుపు ,తెలుపు ,ఎరుపు ఉంటే…. మాయా సహిత జీవులుగా…ఆకుపచ్చ ,పసుపు, బంగారం వర్ణము ఉంటే మధ్య స్థితి అనగా మాయ సహితకి ,రహిత కి మధ్య స్థితిగా అదే నీలివర్ణం ఉంటే…. మాయ రహిత స్థితి అని ఈ కోణ లింగాల రంగులు చెబుతాయి. ఇవి మన సాధన స్థితిగతులను బట్టి ఈ రంగులు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే వారి కోణ లింగం కాస్త నీలివర్ణం అయిందో ఇంక ఇది మారని మాయ రహిత స్థితి అవుతుంది. అందుకే నీలిరంగు కోణ లింగమును ధరించమని పరమహంస తను ఈ జ్ఞాన అనుభవమును పొంది చెప్పడం జరిగింది. మనలో ఇసుమంత… పిసరంత అహంకారమును అనగా 18 రకాల అహంకారాలు ఉన్నా కూడా మనం మాయాసహితులే అవుతాము. మనం పొందిన సాధనా జ్ఞానము కూడా అపస్మారక స్థితి అనగా తెలుసుకున్న జ్ఞానము మరిచిపోయి 108వ డైమెన్షన్ నుంచి ఒకటవ డైమెన్షన్ కి వెళ్లడం జరుగుతుంది. అందుకే ఈ అరుణాచల క్షేత్రంలో ఎవరు ఉండాలో… ఎవరు ఉండకూడదో ….ఎవరు మోక్షం పొందాలో… ఎవరు మోక్షం పొందకూడదో …ఎవరు దర్శించుకోవాలో… ఎవరు దర్శించుకోకుండా ఉండాలో అనేది…మన అహంకార మాయ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అహంకారానికి విరుగుడు ఓంకారం అని చెప్పడానికి… మన పిండదేహాలకి ఓంకార బంధనం వేయడం జరిగింది. అలాగే అన్ని మంత్రాలకి ఓంకారం పెట్టడం జరిగింది. ఎవరైతే ఓంకారనాద సిద్ధి అనగా తనలో నుంచి అనగా మణిపూరక చక్రం నుంచి సహజ సిద్ధంగా వచ్చే ఓంకారమును వినేస్థితికి వస్తారో…. వారు మాయ రహిత స్థితికి వస్తున్నారని అర్థం. వారే అరుణాచల క్షేత్రానికి వచ్చి మోక్ష సన్యాస దీక్ష పొంది సహజ ఓంకార సాధనను మౌనంగా వింటూ… తన అహంకారమాయ నుండి విముక్తి పొంది పిండదేహం నుండి లింగ దేహమై…. ఆపై శివలింగ దహనమై….ఈ విశ్వ శూన్యంలో శూన్యం అవుతారని ప్రత్యక్ష అనుభవంతో పరమహంస పవనానంద గారు నిరూపించి నిర్ధారణ చేసి శూన్యమయ్యారు. ఇలా మనమంతా కూడా ఆది రుద్రుడు మరియు ఆదిపరాశక్తి యొక్క స్వప్న సాధన శరీరాలుగానూ… స్వప్న భోగ శరీరాలుగాను… ఆదిలో ఏర్పడ్డాము. ఆదిదంపతులు ఎలా అయితే పూర్ణ శూన్య మోక్షం పొందారో… తెలుసుకొని ఎవరికి వారే తమ అహంకార రాహిత్య స్థితి పొందితే మోక్షము పొందడం . లేదంటే అమోక్షము పొందడం అనేది మన చేతుల్లో, మన చేతలలో… సాధనా సాధ్యతే సర్వం సాధ్యమని అనుకుంటూ…. అహంకార రహిత స్థితిని పొందితే పూర్ణ శూన్యంలో శూన్యం అవుతారు . పూర్ణ మోక్షం పొందుతారు . ఈ స్థితి పొందటానికి మనమంతా కూడా సాధన చేయడానికి కదిలే స్థితిలో ఉన్నాము. మనం కాస్త కదలని స్థితికి వెళతాము. కాకపోతే ఈ స్థితి పొందామని మనం తెలుసుకోలేము. ఎందుకంటే మన మరణం పొందామని మనకి తెలియదు కదా! తెలిస్తే పొందినట్లే కాదు కదా ! కానీ మనకి ధ్యానంలో మన కోణ లింగం కాస్త నీలిరంగుగా దర్శనమిస్తే మనం అహంకారం మాయ రహిత స్థితికి చేరుకున్నామని….మనకి అంతిమంగా కారుంగలి లేదా గంధం శివలింగం కాస్త దహనమై శూన్యమైందని…ధ్యాన అనుభవం లేదా స్వప్న అనుభవం పొందితే… ఇక మన భౌతిక మరణం కాస్త మోక్షమరణం అవుతుందని నమ్మాలి. ఎందుకంటే మనం మరణం లేదా మోక్షం పొందాము అనేది మనం తెలుసుకోలేము కదా! కేవలం ఈ రెండు ఆధారాలతోనే మనకి సాధ్యపడుతుంది. మన సాధన భోగంలో ఉన్న లేదా యోగంలో ఉన్నా ….లేదా సంసారంలో ఉన్నా… లేదా సన్యాసంలో ఉన్నా కూడా మన మోక్షం మనకి వస్తుంది. జరిగేది జరగక మానదు. గుడిలో కూర్చున్న… ఒడిలో కూర్చున్న వస్తుంది .జరగనిది జరగదు. ఎందుకంటే మనం అహంకారమాయలు ఈ రెండు భోగాలలో ఉన్నప్పటికీ ….మనకి మోక్షం రాదన్నమాట. యోగంలో జ్ఞానా అహంకార మాయ వస్తే , భోగంలో ధన అహంకార మాయ వస్తుంది. ఎవరైతే ఈ స్థితిలో అంటే భోగంలో లేదా యోగంలో ఉన్నవాడు వారికున్న అంతిమ అహంకారమాయను ఆఖరి మృత్యువు క్షణంలో వదిలిపెట్టిన కూడా ఆ పూర్ణ మోక్షం పొంది శూన్యంలో శూన్యం అవుతాడు.

దీనికి ఏ క్షేత్రం మరణం ….సాధన మరణం… యోగ సమాధి మరణం అవసరం లేదు.


ఎప్పుడైతే నీ ఆఖరి కర్మ అయిన అహంకారమాయ ఎక్కడైనా ,ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా …వదిలించుకుంటావో ఆ క్షణమే… నీ మరణమే మోక్షమరణం అవుతుంది. లేదంటే అహంకార మాయ ఎక్కువైతే అది కాస్త క్షేత్రంలో సన్యాసిగా మారినా కూడా ఆ మరణం అనేది రోగ మరణమై… భౌతిక మరణం అయి… అమోక్షమును పొంది, పునః జన్మ పొందడం జరుగుతుంది. అంటే మన మోక్షమరణం అనేది భోగం లేదా యోగం అలాగే సంసారం లేదా సన్యాసం అలాగే ఇల్లు లేదా క్షేత్రం అనే దాని మీద ఆధారపడదు. కేవలం మనలో అంతిమ కర్మ మాయ అయిన అహంకారం మీద మన మోక్షం ఆధారపడుతుందని తెలుసుకోవాలి. మనం అహంకార రహితులయితే మన భౌతిక మరణమే మోక్షమరణం అవుతుంది. అదే అహంకార సహితులైతే అమోక్షమరణం అవుతుంది. అహంకారం తగ్గే కొద్ది మనలో అణుకువ వస్తుంది. దివ్య తేజస్సు పెరుగుతుంది. ఆకర్షణ సమ్మోహన స్థితి వస్తుంది. మనలో గంభీరత్వం, ప్రశాంత స్థితి నిత్య సంతోష స్థితి… నిత్య ఆనంద స్థితి ..మౌనస్థితి.. కర్మరాహిత్య స్థితి …విశ్వ ఆరాధన స్థితి …యోగత్వస్థితి …భోగరాహిత్య స్థితి …కోరికల రహిత స్థితి… దైవత్వస్థితి …మానవత్వ స్థితి…. పరిశుద్ధ ప్రేమ స్థితి …మున్నగు దయా ,కరుణ ,అహంకారరహితమైన 18 గుణాలు వస్తాయి. ఈ దైవిక లక్షణాలు రావాలంటే భగవద్గీతలో చెప్పిన 32 గుణాలు మనకి అబ్బాలి . అదే బాహ్య శుద్ధి, అంతర శుద్ధి ,ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ,అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం, సత్య పాలన, ఆస్తుల మీద …ధనం మీద ..మమకార వ్యామోహాలు లేకుండా ఉండటం, ఇతర స్త్రీ,పురుషుల మీద కామమోహం లేకుండా చూసుకోవడం, క్షమాగుణం, ఉద్రేఖాలు అదుపులో ఉంచుకునేవాడు, సుఖదుఃఖాలలో ఒకే విధంగా ఉండేవాడు, భయ ఆందోళన రహితంగా ఉండేవాడు ,కలతలు లేకుండా… కలహాలకు దూరంగా ఉండేవాడు, స్వార్థ చింతన లేనివాడు ,నిష్కామకర్మ చేసేవాడు, శుభ అశుభముల యందు ఒకే స్థితిలో ఉండేవాడు.. శత్రుభవం లేనివాడు ,గౌరవ అవమానాలు ఒకే విధంగా చూసేవాడు, చెడు సాంగత్యం చేయనివాడు… దూషణ చేయనివాడు… తృప్తి చెందేవాడు… మౌనంగా ఉండేవాడు ….మమకార ఆసక్తి లేనివాడు… స్థిర మనసు, అలాగే స్థిరబుద్ధి కలిగినవాడు… ఇలాంటి గుణాలున్నవాడు తనకి అత్యంత ప్రియమైన వారు అవుతారని అనుభవ పాండిత్య జగద్గురువు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పడం జరిగింది కదా! అంటే ఈ లెక్కన చూస్తే అంతిమ కర్మ మాయ అయిన అహంకారమాయను వదిలించుకోవడానికి…. కావలసిన ఉన్నత లక్షణాలు పొందటానికి….మన మోక్ష యోగ సాధన ఉన్నదని ఈపాటికి అర్థమయ్య ఉంటుంది కదా! అనగానే


స్వామి ఇప్పుడు అంతా అర్థమయింది . ఎవరైతే అహంకార రహిత స్థితికి వస్తారో…. కదలని ప్రకృతికి వచ్చి… కదిలే స్థితి నుంచి కదలని స్థితి పొంది పూర్ణ శూన్యంలో శూన్యమై….పూర్ణమోక్ష స్థితి పొందడం జరుగుతుంది. లేదంటే అమోక్షం పొంది కదలని ప్రకృతి నుండి కదిలే ప్రకృతిలో కదిలే జీవులుగా పునః ప్రకృతిలో పునః సృష్టికర్తలు అవుతారన్నమాట! 


దేవి !సత్యము. ఇదే సత్యాన్వేషిగా మారి… మనం అంతిమంలో తెలుసుకొనే స్వానుభవ అనుభూతి జ్ఞానం అన్నమాట ! ఇదే సత్యం …ఇదే నగ్న సత్యం …ఇదే అక్షర సత్యం అనగానే, 



స్వామి! ఇక్కడ చిన్న సందేహం. మొదట ఆలోచన నుండి ఆపై భావం నుండి ఆపై ఆఖరిగా అహంకార మాయగా మారింది కదా ! ఇప్పుడు కేవలం అహం పోతే ఆలోచన, భావం మిగలదా ? అనగానే..


దేవి ! ఎప్పుడైతే మనం అహంకార రహిత స్థితికి చేరుతామో ….అప్పుడు మనకి మూలమూర్తి కాస్త సజీవమూర్తి కాదని…. నిర్జీవ మూర్తి అని… అనుభవ అనుభూతి పొందడం …ఇక దానితో “నేను లేను”, “ నేను కానీ నేను” లేదు …అహం లేదు… మాయ లేదు… ఏమీ లేదు… ఏదీ లేదు అనే భావము మొదలవుతుంది. ఈ భావం కాస్త ఏమీ లేని స్థితియే శూన్యస్థితి కదా అనే భావం మొదలవుతుంది . దానితో ఉన్నదో లేదో తెలియని శూన్యమును గూర్చి భావాలు చేస్తూ… శూన్యం ఉన్నదని శూన్య భావన చేస్తాడు. అప్పుడు తనలో నుంచి నిజంగా శూన్యము ఉన్నదో లేదో తెలుసుకోవాలనే ఆలోచన మొదలవుతుంది .శూన్యం లేదు అంటే మరి శూన్యం ఉన్నట్లే కదా ! దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నట్లే కదా !లేకపోతే శూన్యం లేదా దేవుడు అనే భావ ఆలోచన రాదు కదా !ఇక్కడే మన విశ్లేషణ జ్ఞానముతో ఉందో లేదో తెలియని స్థితి అనేది శూన్య భావన ఇస్తుందని …..ఈ భావ రహిత స్థితి తను జ్ఞానముతో పొంది తను ఏమీ లేని స్థితికి అదే పూర్ణ శూన్యస్థితి పొందడం జరుగుతుంది. ఎందుకంటే శూన్య స్థితి అంటే ఉందో లేదో శూన్యభావం ఉంటుంది. అదే పూర్ణ శూన్యస్థితి అంటే శూన్యభావ రహిత స్థితి అవుతుంది. అందుకే వేదాలు కాస్త శూన్యస్థితికి అలాగే శూన్యభావ స్థితికి…. అతీతస్థితికి ….అదే శూన్యతీత పూర్ణ శూన్యం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మూల స్థానమూర్తి ఈ స్థితిని పొంది నిశ్చలమోక్ష స్థితి పొందడం జరిగింది. దీనిని చూసిన మన పూర్వీక మహర్షులు ….ఇదే విషయ జ్ఞానమును మనకి వేదాలలో పురాణ ఇతిహాస ఉపనిషత్తులలో చెప్పడం జరిగింది . అనగా ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటే …ఒక పక్షి ఎగురుతుంటే మరొక పక్షి ఎగరకుండా కొమ్మమీద కదలకుండా మెదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఎగిరే పక్షి కాస్త మనసు లేదా ఆత్మ లేదా శూన్య భావమైతే…. శూన్యస్థితి అయితే ….ఎగరని పక్షి కాస్త భావాలోచన, భావ అహంకార మాయ రహిత స్థితి పొంది…. శూన్యాతీత పూర్ణ శూన్యస్థితికి సంకేతంగా చెప్పడం జరిగింది అనగానే….


స్వామి నాకు మరో సత్యం అర్థం అయింది ….ఎవరైతే మోక్షం పొందాలని తీవ్రమైన ఆలోచన ,ఆచరణ, ఆకాంక్ష ,ఆత్మవిశ్వాసంతో అరుణగిరి అరుణాచల శివున్ని …అహంకార రహిత స్థితిలో మనసా వాచా కర్మేణ సర్వస్య శరణాగతి భావంతో దర్శనం ,గిరి ప్రదక్షిణం, నామస్మరణం చేస్తారో….. వారికి ఈయన అనుగ్రహంతో పూర్ణ మోక్షమిచ్చే గురుదేవుడు అవుతాడని తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కక్షేత్రంలోనే మన అన్నింటికీ మూలమైన అహంకార రాహిత్య స్థితిని పొందగలుగుతాము… అలాగే మోక్షం పొందాలంటే మోక్ష కోరికతో పాటు దైవానుగ్రహం అలాగే గురు అనుగ్రహం కావాలి కాబట్టి ….ఈ మూడు కూడా మనకి ఈ క్షేత్రంలో దర్శనముతో, ప్రదక్షిణముతో, నామస్మరణంతో వరుసగా మోక్ష కోరిక, గురు అనుగ్రహం,దైవానుగ్రహం పొందడం జరుగుతుంది. పిండి కొద్ది రొట్టె లాగా… మన ఆలోచన అంతా ఈయన చుట్టూ ఉంటే ….ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అదే జీవస్థితి నుంచి శివ స్థితికి దీని నుండి శవ స్థితికి….. ఆపై పూర్ణ మోక్షస్థితి పొందడం జరుగుతుంది.


అవును దేవి! ఇది సత్యమే . ఇది ఎంతోమంది స్వానుభవ అనుభూతి పొంది పూర్ణ మోక్షమును పొందారు. ఇది నగ్న సత్యం అని…. అక్షర సత్యం అని…. లోకానికి తమ పూర్ణ మోక్షం పొంది నిరూపించి నిర్ధారణ చేసినారు అనగానే…


స్వామి ! ఇప్పుడు మనం నిశ్చల స్థితిలో ఉన్న మూలస్థాన మూర్తిని ఒక ధ్యాన అనుభవంగా చూశాం కదా! ఇది ఈ భూమి మీద ఎక్కడైనా జరిగి ఉండాలి కదా !ఎక్కడ అయ్యి ఉంటుంది అనగానే 


దేవి! నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే… ఇది అంతా కూడా అరుణాచల క్షేత్రంలో ఉన్న అరుణగిరి మీద జరిగి ఉండాలి . ఎందుకంటే ఈ విశ్వంలో పంచభూత తత్వాలలో స్వయంభు అగ్ని తత్వం ఉన్నది అరుణగిరి యే కదా! మరి దీనికి ఈ అగ్నితత్వం ఎలా వచ్చిందని నా పరిశోధన చేస్తే….. నాకు ఈ కొండమీద ఉన్న విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్లితే కానీ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ గుహలో విరూపాక్ష యోగి స్వయంగా తనంతట తానే యోగాగ్నితో దహనమై… ఒక బూడిద కుప్పగా మారితే… ఇప్పుడు దాని చుట్టూ నలుచతురస్రాకారపు అరుగుగా కట్టారు . అప్పుడు ఇది చూడటానికి స్త్రీ మూర్తి శివలింగాకారముగా మనకి కనపడుతుంది. లింగభాగం చూస్తే గొడుగు లాగా ఉంటుంది. పైగా విచిత్రం ఏమిటంటే ….ఈ గుహ కాస్త పైన ఉన్న స్కంద ఆశ్రమం నుంచి చూస్తే… ఇది లోతుగా ఒక గుంట లాగా కిందకి ఉన్నట్లుగా కనపడుతుంది.పైగా ఈ గుహ చూడటానికి ఓం ఆకారముగా కనపడుతుంది.పైగా దీనిని అంతరగుహలోనికి కొండ గాలి లోపలకి ప్రవేశించినపుడులా సహజసిద్దముగా గాలి ప్రవహము వలన ఓంకారనాదము వినపడుతుందని అక్కడ నిత్యసాధకుల స్వానుభవముగా చెప్పడము జరుగుతోంది. విరూపాక్ష గుహ కింద వైపున ఓం నమశ్శివాయ యోగి సమాధి గుహ ఉంది . ఈయన చూడటానికి కాళ్ళ మీద కాళ్లు వేసుకున్న భంగిమలో కూర్చుని ఉంటాడు. ఈ భంగిమ అనేది మనం తిరువాయుర్ క్షేత్రంలో ఉన్న కమలాదేవి కూడా ఇదే భంగిమలో కూర్చుని ఉంటుంది . ఆవిడకి తన భర్త మీద కామ భావం ఇక్కడే నశించిందని చెబుతారు. ఇలాంటి భంగిమనే మనం ఈ ఓం నమశ్శివాయ యోగిలో ఉండటం బట్టి ….ఈయన కూడా కామ మాయ దాటారని అర్థం అవుతుంది కదా! మొదట ఈ ఓం నమశ్శివాయ గుహ వస్తే, ఆపై విరూపాక్ష గుహ ….ఆపైన స్కందాశ్రమ గుహ వస్తాయి. ఈ లెక్కన చూస్తే ఓం నమశ్శివాయ గుహయోగి వలన మనం కామ భావం….. అలాగే స్కంద ఆశ్రమ గుహ వలన శూన్యభావం పోతాయని….. వీటి మధ్యలో ఉన్న విరూపాక్ష గుహయోగి కాస్త నిర్జీవ నిశ్చల మోక్షస్థితి పొందాడని  నాకు అర్థమైంది. అంటే ఆది యుగంలో ఆదిరుద్రుడు కాస్త భండాసుర సంహారం కోసం…. ఈ క్షేత్రంలో శివసముద్రం ఇంకించి… దాని లోపల ఒక పెద్ద గొయ్యి తవ్వించి…. దానిపై చితాగ్ని కుండం ఏర్పరచి….అందులో తను అలాగే దైవాలు అందరూ కూడా ప్రాణ త్యాగం చేయడం…. ఆపై ఈ శంభు రుద్రుడు నుండి చితాగ్ని కుండంలో లలితాదేవి ఉద్భవించి ఉండి ఉండాలి. కాలాను క్రమంగా ఈ చితాగ్నికుండమే అరుణాచల అరుణగిరి అగ్నిపర్వతం అది కాస్త చల్లారుతూ…. అగ్నితత్వ కొండై ఉంటుంది. ఎందుకంటే ఈ కొండపైన స్కందాశ్రమంలో శూన్యభావం పోవటం మధ్యలో ఉన్న విరూపాక్ష గుహలో యోగాగ్ని తో బూడిద కుప్పగా మారిన యోగి జీవ సమాధి ఉండటం…. కింద ఉన్న ఓం నమశ్శివాయ గుహయోగి కామం మీద ఆధిపత్యం రావటం బట్టి నాకు అర్థం అయింది . అలాగే మనకి మూలస్థాన మూర్తి ధ్యాన అనుభవం చూస్తుంటే… కామ భావం అలాగే శూన్య భావం కలిగాయి కదా.. ఎప్పుడైతే ఈయన కాస్త సజీవమూర్తి కాదని… నిర్జీవ మూర్తి అని పొందిన అనుభవం అనుభూతి సత్యం అని మనం విశ్వసించామో ….ఆ క్షణమే మనకి ఈ రెండు భావాలు నశించి ….పూర్ణ శూన్యస్థితికి చేరుకున్నాము కదా అనగానే…


అవును స్వామి! మీరు ఊహించింది

నిజమే అయ్యుంటుంది…. కానీ ప్రత్యక్ష అనుభవం లేదా ప్రత్యక్ష ఆధారాలు లేవు కదా! ఇదే తేడా! 



శివ నందిని కాస్త శివ స్వామితో….

స్వామి! మన ధ్యాన అనుభవాల ప్రకారం చూస్తే ….అంటే మీరు చూసిన స్త్రీ ప్రకృతిలో అయ్యవారు లేరు అమ్మవారు ఉంది. అదే నేను చూసిన పురుష ప్రకృతిలో అమ్మవారు లేరు అయ్యవారు ఉన్నారు. ఇలా మిగిలిన వీరిద్దరూ కూడా ఇప్పుడు లేరు …అంటే మొత్తానికి దేవుడు లేడు….. అలాగే దేవత లేదు అని తెలుసుకున్నాము. కానీ ఇది లోకానికి చెప్తే ఎలా వెళ్ళిపోతుందో కదా అనగానే..


శివ స్వామి వెంటనే ….

మన ధ్యాన అనుభవాల ప్రకారం దేవుడు లేడు …అలాగే దేవత లేదు అని చెప్పడం లేదు. వాళ్లు ఎలా అయితే మోక్షం పొందారో అలాగే స్త్రీ, పురుషులు కూడా మోక్షం పొందవచ్చునని చెబుతున్నాము. ఇక్కడ దైవానికి సంబంధించిన నామరూపాలు లేవు…. కానీ భగవంతుడు ఉన్నాడని నీవు తెలుసుకోలేకపోతున్నావా? మన ఆది దంపతులను దహనం చేసిన దహన శక్తి అదే జ్వాలాగ్ని శక్తి రూపమే భగవంతుడు. అదియే మూలస్థాన అగ్నితత్వ రూప ధారి మూర్తి కదా! అసలు సిసలైన భగవత్ శక్తి. అదే భగవత్ తత్వం. విగ్రహారాధనలు మానండి…. దాటండి… మాయను దాటండి….మనోభ్రాంతి మాయలు దాటితే ….అదే పదార్థమాయ దాటితే ,యథార్థమైన భగవత్ తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది .అర్థం అవుతుంది.ఇప్పుడు మనం చేసింది అదే…. అలాగే తెలుసుకుంది ఇదే కదా! పదార్ధ రూపాలైన ఆదిరుద్రుడు అలాగే ఆదిపరాశక్తి నామరూప దైవ పదార్థ మాయను దాటితే…. వారు మోక్షం పొందారు అని ….అగ్నియే భగవద్ తత్వం అని తెలుసుకున్నాము. ఇదే విషయాన్ని లోకానికి చెబుతున్నాము . మన ఒంటిలో జఠరాగ్ని రూపంలో….. మన ఇంటిలో వంట రూపంలో…. ఉన్నాడు. దేవాలయంలో దీప జ్యోతిగా ఉంటే …..దేహాలయంలో ఆత్మ జ్యోతిగా ఉన్నాడు. అరుణగిరి మీద అరుణ జ్యోతి గా ఉంటే, మన ఇంటిలో ప్రమిద జ్యోతిగా భగవంతుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నాము. అదే చెబుతున్నాము. దేవుడు లేడు… దేవత లేదు అనేది ఎంతటి సత్యమో….. అలాగే భగవంతుడు ఉన్నాడు….. అది కూడా అగ్నిరూప తత్వంతో ఉన్నాడు అని చెప్పడం కూడా అంతే సత్యమే కదా!



ఇప్పుడు మనం చేసింది అదే….అలాగే తెలుసుకుంది ఇదే కదా! పదార్థ రూపాలైన ఆది రుద్రుడు అలాగే ఆదిపరాశక్తి నామ రూప దైవ పదార్థమాయాలు దాటితే వారు మోక్షం పొందారని అగ్నియే భగవత్ తత్వం అని తెలుసుకున్నాము. ఇదే విషయాన్ని లోకానికి చెప్తున్నాము. మన శరీరంలో జటరాగ్ని రూపంలో, మన ఇంటిలో వంట రూపంలో ఉన్నాడు. దేవాలయంలో దీప జ్యోతిగా ఉంటే….. దేహాలయంలో ఆత్మ జ్యోతిగా ఉన్నాడు . అరుణగిరి మీద అరుణ జ్యోతిగా ఉంటే….. మన ఇంటిలో ప్రమిద జ్యోతిగా భగవంతుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నాము. అదే చెప్తున్నాము. దేవుడు లేడు… దేవత లేదు…. ఎంతటి సత్యమో , అలాగే భగవంతుడు ఉన్నాడు …అది కూడా అగ్ని రూప తత్వంలో ఉన్నాడని చెప్పడం , అంతే సత్యము కదా! అలాగే సృష్టి ఆరంభంలోనే అంతం జరిగింది. సృష్టి అంతం లోను ఆరంభము అయింది. అనగా వెనుదిరిగింది. అంటే సృష్టి నుంచి అంతానికి వస్తే…. తిరిగి అంతము నుంచి సృష్టికి కాలచక్రంలో ముందుకి వెనక్కి కదిలే ,కదలని మూల ప్రకృతిలో తిరుగుతూనే ఉంది. అనగా శూన్య స్థితిలో ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు కాస్త ఉందో లేదో తెలియని శూన్యం గురించి భావన అనగా శూన్యభావం నుంచి బయటపడతాడో ….ఆ క్షణం అన్నింటికి అతీతమైన స్థితి పొంది, శూన్యాతీతమైన స్థితి అనగా పూర్ణ శూన్యస్థితికి చేరుకుంటాడు. తద్వారా చావు పుట్టుకలు లేవని , పంచభూతాలు , కాలము లేవని….. కదిలేవాడు - కదిలించేవాడు లేడని….. ఆడేవాడు -ఆడించేవాడు లేడని….. నేను - నేను కానీ నేను లేదని….. జీవుడు - శివుడు లేడని…. అజ్ఞానం- జ్ఞానం లేదని….. తెలుసుకోవడానికి - తెలియడానికి ఏమీ లేదని…. చెప్పడానికి - చెప్పేవాడు లేడని….వినేవాడు లేడని… వినిపించేవాడు లేడని ….చూసేవాడు - చూపించేవాడు లేడని…. చూడటానికి ఏమీ లేదని…. అనుభవించకుండా - అనుభూతి పొందటానికి ఏమీ లేదని… ఆశ, భయం, ఆలోచన, స్పందన, సంకల్పం, మృత్యు భయాలు, మాయలు లేవని …..చంపేవాడు - చచ్చేవాడు లేడని…. ఆశపడేవాడు - ఆశ పెట్టేవాడు లేడని….. ఇలా ఇవన్నీ కూడా ఆది ఒక్క క్షణం కాలంలో సృష్టి ఆరంభంలో అన్నీ కూడా ఉన్నట్లుగా అనిశ్చల స్థితిలో ఉంటే….. మరుక్షణంలో కాలం సృష్టి అంతములో ఇవన్నీ నిశ్చల స్థితిలో కదలకుండా మెదలకుండా ఆగిపోయాయని….. మూడవ క్షణంలో ఇవన్నీ కూడా  ఉన్నట్లేనని… లేని ఉన్నట్లుగా… కదిలే ప్రకృతిలో ఉన్నట్టుగా… కదలని ప్రకృతిలో లేనట్లుగా…. పుట్టుక లో ఉన్నట్లుగా… చావులో లేనట్టుగా…. పుట్టుక చావు మధ్య ఉండే మూడు క్షణాల జీవితకాలంలో, ఈ మూడు రకాల స్థితిగతులుగా సృష్టి, స్థితి, లయ అనే ప్రక్రియలు జరుగుతున్నాయని…. కానీ సత్యం ఏమిటంటే, ఏవీ కూడా లేవు ….ఏమీ లేదు…. ఎవరూ లేరు. కేవలం ఇవన్నీ కూడా ఉన్నాయని భావం మాత్రమే ఉంది . అంటే నువ్వు ఉన్నావని భావన అనుకుంటే అన్నీ ఉంటాయి. నువ్వే లేవని అనుకొని భావన చేస్తే నువ్వే లేకుండా శూన్యమైపోతావు . నేను మోక్షం పొందాను అనుకుంటే మోక్షం పొందుతావు. లేదు నేను మోక్షం పొందానో లేదో అని అనుమాన భావం పెట్టుకుంటే నువ్వు ఎన్నటికి మోక్షం పొందలేవు. నీ భావానికి తగ్గట్లుగా నీకు నువ్వే పునః సృష్టిలో పడి పునః కర్మజన్మ ఎత్తినట్లుగా… వెనక్కి నీ రికార్డు దృశ్యం చూసిన దానిని మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటావు . అదే నేను లేను పూర్ణ మోక్షం పొంది పూర్ణ శూన్యమునందు శూన్యం అయ్యాను అని భావన చెయ్యి …..నువ్వు చచ్చినట్లుగా నువ్వు పూర్ణ మోక్షగామిగా సాధన చేసి పూర్ణ మోక్షం పొందిన నీ అసలు సిసలైన యదార్థ రికార్డు దృశ్యం నీకు చూపిస్తుంది. అదే ధ్యానాలలో, స్వప్నాలలో చూపించే భావన దృశ్యాలు. ధ్యాన అనుభవాలు స్థితి అన్నమాట


 అంటే మోక్షం అనేది నేను మోక్షం పొందాను అనుకునే భావం. అలాగే అమోక్షం అనేది నేను కాస్త మోక్షం పొందానో లేదో అనుకునే అనుమాన భయ భావం వలనే అమోక్షం వస్తుంది. నిజానికి ఈ విశ్వమంతా కూడా భావం మీద, విశ్వాసం మీద నడుస్తుంది. నువ్వు ఏది బలంగా భావన చేస్తూ…. బలంగా విశ్వసిస్తావో… అదే భావం నీకు కనపడుతుంది. చూపిస్తుంది. సత్యమని నిరూపణ చేస్తుంది. చివరికి మోక్షం అనేది కూడా ఒక భావమే. భగవంతుడు అనేది కూడా ఒక భావమే. ఉన్నాడు అని భావన చేస్తే రాతిలో కూడా కనపడతాడు. లేడు అని భావన చేస్తే నీ పక్కనే… నీతో ఉన్న… నీలో ఉన్నా కూడా…. సజీవ మూర్తి కాస్త నిర్జీవ మూర్తిగా కనపడతాడు. అంటే దేవుడు ఉన్నాడని భావన చేసిన వాడికి ….మనకి కనిపించే మూల స్థాన నిర్జీవ మూర్తిలో కూడా వీడికి కదులుతూ సజీవ మూర్తి కనపడతాడు. కారణం వీడికి ఆయన కాస్త సజీవ మూర్తిగా ఉన్నాడు… మనకి ఈయన లేడు అని భావం వలన అసలు సిసలైన నిర్జీవ మూర్తిగా కనపడతాడు. నేను ఉన్నాను… అలాగే దేవుడున్నాడు అనే భావన చేసిన వాడికి వాడి భావానికి తగ్గట్లుగా విశ్వమంతా కూడా సృష్టి దృశ్య భావాలు చూపిస్తుంది. ఎప్పుడైతే వాడు కాస్త నేను లేను అలాగే దేవుడు లేడు అని భావం చేస్తే వాడికి సృష్టి అంతం యొక్క భావ దృశ్యాలను వాడి ధ్యానా అనుభవంగా చూపిస్తుంది.  ఇదియే ఇది అసలు సిసలైన ఈ విశ్వ మూల తత్వము. అది యద్భావం తద్భవతి అన్నమాట ! భావాన్ని బట్టి అన్ని ఉన్నట్లుగా.. అలాగే ఏమీ లేనట్లుగా కనపడుతుంది. చూపించబడుతుంది… జ్ఞానం తెలుస్తుంది. భావం మాయా సహితంగా… భావం లేకపోతే మాయ రహితంగాను… భావంతో అమోక్షముగాను…. భావం లేకపోతే మోక్షం అవుతుంది. నేను ఉన్నాను అని భావిస్తే, నువ్వు ఉంటావు. అలాగే దేవుడు ఉంటాడు . అమోక్షం వస్తుంది. అదే నేను లేను అంటే, నువ్వు ఉండవు, అలాగే దేవుడు ఉండడు, మోక్షం వస్తుంది. ఇప్పుడు మన భావం నేను లేను అనుకోవడం వలన దేవుడు లేడు ….అనుభవ అనుభూతి పొంది, ఇదే విషయాన్ని చెబుతున్నాము. చూపిస్తున్నాము ఎందుకంటే సృష్టి ఆరంభమై ఇప్పటికీ 18, 446, 774, 073, 709 ,551, 615 కోటానుకోట్ల సంవత్సరాలలో…. ప్రతి 108వ యుగం మాత్రమే, మనలాంటి పూర్ణ జ్ఞాని మాత్రమే నేను లేను అనే పూర్ణ భావం పొంది….పూర్ణ శూన్యంతో శూన్యమై, పూర్ణ మోక్షం పొందాలని పూర్ణ మోక్ష భావ ధ్యానానుభవ అనుభూతులు లోకానికి చెబుతూ….. పూర్ణ శూన్యంలో శూన్యమవుతున్నాము . దీనిని బట్టి ఎవరికి ఏ భావం గావాలో నిశ్చయం చేసుకోండి. భావం చేసిన వాడికి అనిశ్చల అమోక్ష భావం చేస్తే అమోక్ష భావం పొందినట్లుగా… నేను లేను భావం చేసుకుంటే నిశ్చల మోక్ష స్థితి పొందిన భావం పొందడం జరుగుతుంది. దేవుడు లేడు అనేవాడు నాస్తిక భావంతో ఉంటే…. దేవుడు ఉన్నాడు అనేవాడు అస్థిక భావంతో ఉన్నాడని తెలుసుకోండి. మన భావానికి తగ్గట్లుగా మన ఆలోచనలు, స్ఫురణలు, మాయలు ,మరణాలు, ద్వంద ప్రకృతులు ఇలా ఆధారపడి ఉంటాయి. ఎవరైతే మోక్షం పొందాలని స్థిర నిశ్చయభావం చేస్తారో ….వాడి సాధన అనుభవాల రికార్డు దృశ్యం ప్రకృతి మనకి ధ్యానము ద్వారా ….స్వప్నంలో చచ్చినట్లుగా…మోక్షం పొందినట్లుగా…. ఎప్పటికప్పుడు ఎలా మోక్షం పొందామో చూపిస్తుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే మన భావాలు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. తద్వారా మన భావానికి తగ్గట్టుగా మన ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, కాలం పరిస్థితులు మారిపోతాయి. అందుకే క్షణ క్షణానికి కాలం మారిపోతుంది. నిజానికి క్షణానికి ఒకలాగా మన ఆలోచన మారుతుంది. మన మనసు చేసే భావం క్షణానికి మారిపోతుంది . తద్వారా విశ్వ కాలం కూడా క్షణ క్షణానికి మార్పులకి లోనవుతుంది. ఇక్కడ ఎవరి భావం తగ్గట్లుగా క్షణంలో మారిపోతుంది.


కాకపోతే ఎవరి భావ ప్రపంచం వారిది. ఎవరి గోల వాడిది. అందరూ కలిసి ఉన్నట్లుగా ఉంటారు . కానీ ఎవరికి వారే యమునికి తీరే! అంతెందుకు…. నూటికి 99.99 శాతం మంది భోగులైనా లేదా యోగులైనా కూడా ఈ విశ్వం ఉన్నది అని….. నేను ఉన్నాను అని…. ఒకటవ యుగం నుంచి 107వ యుగం దాకా, ఇదే భావం చేస్తూనే ఉంటారు. తద్వారా ఈ విశ్వం ఉన్నట్లుగా… వాడు ఉన్నట్లు సత్యం అని నిత్యం అని నిరూపణ అవుతుంది. అదే కేవలం 108 యుగంలో మాత్రమే…. నేను లేను అనే భావం నూటికి 0.1% మాత్రమే చేస్తారు. వాడే పూర్ణ మోక్షం పొంది విశ్వ పూర్ణ శూన్యంలో శూన్యం అవుతాడు. ఎందుకంటే వాడు లేడని స్థిర నిశ్చల భావం చేయడం వలన…. వాడు ఉన్నాడు అనే భావ జీవ జగన్నాటకం నుండి వాడి మాయ భావ స్వప్న పాత్ర పోతుంది. ఇదే అసలు సిసలైన పూర్ణ మోక్షం అవుతుంది . ఇదే సత్య మోక్ష భావం అవుతుందన్నమాట. నిజానికి మాయ అంటే భావాలు మార్చడం… మార్చుకోవడం అన్నమాట! నువ్వు ఎప్పుడైతే నేను లేను అని…. స్థిర భావమనస్సుతో….. స్థిర మోక్షభావంతో…. భావ నిశ్చల మోక్షస్థితి పొందుతావో …అంటే అంతా కూడా మన చేతులలో , మన చేతలలో మన మనసు యొక్క స్థిర అస్థిర భావాల మీద ఆధారపడే ఈ విశ్వ సృష్టి అంతము అలాగే మనం మోక్షాలు ఉన్నాయని ఇప్పటికైనా తెలుసుకొండి . “యథ్భావం భావం తద్భవతి” 

                  

స్వామి! ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే మోక్షమే ఒక భావం అని నా స్వానుభవం పొందితే ……ఈ విశ్వ జగత్తు అలాగే కోటానుకోట్ల అండ, పిండ, బ్రహ్మాండాలు మూడు ప్రకృతులు కూడా భావమే కదా! మరి ఇవన్నీ ఎవరు చేశారు అనగానే…


దేవి ! మన పూర్విక మహర్షులు ….మన పూర్విక దైవాలు యొక్క భావరూపాలే…. ఈ విశ్వ జగత్తు అన్న మాట! ఎందుకంటే ఎవరి సాధన అయితే సహస్ర చక్రస్థితికి వస్తుందో….. వారు అక్కడ ఎవరికి వారే ఒక భావరూప బ్రహ్మాండమును సృష్టించుకోవచ్చును. దానికి అతని అధిపతిగా ఉండవచ్చును. ఇది ఎవరైనా ఊహించుకోవచ్చును. ఎవరైనా అధిపతిగా ఉండవచ్చును. ఇలా ఆదిలో ఆది రుద్రుడు కాస్త విశ్వ జగత్తు ఉన్నదని భావం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన నుండి ఆదిపరాశక్తి కాస్త బయటకు వచ్చిందో ఆవిడ కాస్త ఆది బ్రహ్మాండమును భావ రూపంలో భావించింది. ఆ తరువాత వీరిద్దరి నుండి త్రిమూర్తులు రావడంతో…… వీరు కాస్త అండపిండ బ్రహ్మాండాలు సృష్టిస్తే….. ఆదిపరాశక్తి నుండి త్రిశక్తి మాతలు రావడంతో….. వీరు కాస్త స్త్రీ, పురుష, మూల ప్రకృతులను భావరూపముతో భావించడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన దైవాలు కాస్త కర్మల భావాలు ….స్థితి భావాలు…. లయ భావాలు…. తిరోగమన భావాలు…..అనుగ్రహ భావాలు….., పాపాలు…. పుణ్యాలు….. కర్మలు…. కర్మ బంధాలు….. బంధనాలు…. బాధ్యతలు….. భయాలు…. స్పందనలు…. ఆలోచనలు…. సంకల్పాలు…. ఆశయాలు…. లక్ష్యాలు ఇలా ఎవరికి వారే వారికి తగ్గట్లుగా 108 గుణభావాలు భావించారు.


ఆది రుద్రుడు కాస్త 64 రుద్ర భావాలు భావిస్తే…. కానీ ఆదిపరాశక్తి కాస్త 64 యోగినీలుగా భావరూపాలు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని కథలాగా అంతం లేని కథలాగా భావం అవుతుంది. ఏకత్వ భావం కాస్త అంతులేని అంకెలేని, చెప్పలేని ,చెప్పటానికి వీలులేని అనంత భావాలుగా ఏర్పడ్డాయి. ఎవరికి వారు (మన) సాధన పరిధి వరకు ఎంత గావాలో అంత భావం పెంచుకుంటూ పోయారు . నీటి బిందువు కాస్త మహా సముద్రం అయింది . నిజానికి నీటి బిందువే మహాసముద్రం అని…. అలాగే మహాసముద్రమే నీటి బిందువు అని…. తమ భావరూపంలో అవుతోందని తెలుసుకునేసరికి…. సమయం దాటిపోయింది . కనుచూపులో ఉండే విశ్వ పరిధి కాస్త…. కనుచూపుకు అందనంత పరిధికి తమ భావరూపం అవధులు దాటి వ్యాప్తి చెందిందని అర్థమయ్యేసరికి….. ఆధిక్యత కోసం , “నేను ఉన్నాను” …..ఉనికి కోసం, నేను ఏమిటో చూపించాలని అహంకారం కోసం, ఏక భావం కాస్త అనంతభావ రూప విశ్వ జగత్తు అయింది . ఇప్పుడు ఎవరికి వారికి విషయ జ్ఞానం అంది …..సాధన చేసి భావ రహిత స్థితికి మోక్షం పేరుతో వస్తున్నారు. కానీ ఒక సెకండ్ కి రెండు భావాలు పాతవి పోతే…. నాలుగు భావాలు కొత్తవి వస్తున్నాయి. పోయేవి తక్కువ, వచ్చేవి రెట్టింపుగా ఉండటంతో …..పోయే భావాలు మనకు కనిపించడం లేదు. వచ్చేవి మనకి కనపడటంతో …..భావరూపరహిత విశ్వ జగత్తు కాస్త భావ హిత జగత్తుగా మనకి కనపడుతుంది. ఎందుకంటే నేను ఉన్నాను…. విశ్వం ఉంది…. అని భావించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు నూటికి 98 శాతం ఉన్నారు. అదే నేను లేను…. విశ్వం లేదు అని భావించే అరూప భావగాళ్ళు….. రెండు శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇలా 98 శాతం మంది కాస్త విశ్వం అనేది తమ భావములలోనే ఉన్నదని తెలిసినా కూడా….. బావ రహిత స్థితిని పొందరు .కావాలని పొందరు . ఎందుకంటే తమ ఉనికిని కోల్పోతారు కదా ! ఫలానా నేను అని భావితరాలకి తెలుసుకోవాలి కదా! అని సరికొత్త భావరూపాలతో…. సరికొత్త ఆలోచన భావ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పుర్రెకి బుద్ధి! ఇది చితికెళ్ళే దాకా పోదు! చింతయే చితి దాకా తీసుకువస్తుందని…. వీరంతా తెలుసుకున్నా కూడా….. మళ్లీ భావరూపస్థితికి వచ్చేసరికి…. ఈసారి తను భావ లోకంలో ఎలా ఉండాలో….. భావాలు చేయడం చూస్తుంటే….. నాకు బుద్ధుడు గుర్తుకు వస్తున్నాడు . ఎందుకంటే ఆయనకి కష్టాలు బాధలు, ఈతి సమస్యలు అనేవి కోరికల వలన వచ్చాయని …..అనుభవ జ్ఞానం పొంది….. చివరికి తన సాధన స్థితి సహస్ర చక్రానికి వచ్చేసరికి, భావ రహిత స్థితి పొందకుండా….. కోరికలేని సమాజం చూడాలని భావించడం ఎందుకు…! పిచ్చి కాకపోతే! కోరిక ఉంటే కర్మ జన్మ ఉంటుంది . దానితో ఈయన భావం భావనముతో ఏర్పడిన కొత్త లోకంలో పునః కర్మ జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. మాయా అంటే భావ సహితముగా ఉండటమే. జ్ఞానము అంటే భావ రహిత స్థితి ఉండడమే అన్నమాట! అందుకే ఆశా, భయం, స్పందన ,ఆలోచన, సంకల్పం అనే పంచ స్థితులే పంచ మాయలుగాచెప్పడం జరిగింది .ఎందుకంటే వీటి మాయలో పడి సాధకుడు కాస్త భావ యుత లోకమును ఏర్పరుస్తాడు. అందుకే మన సాధన ఆరంభంలోనే వీటికి అదుపులో ఉంచుకోవాలని …..మాయగా చెప్పి, మనల్ని అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒక భావమే అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జ్ఞానమే భావము. అలాగే అజ్ఞానమే భావము. ఒక భావము ఉండాలి ……మరొక భావం పోవాలి అనుకోవడమే భావమే కదా ! ఆలోచించండి….. నిజమే కదా! ఎవరైతే భావ రహిత స్థితిలో ఉంటారో…..వారి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ కాస్త స్థిరమై …..నిశ్చలమవుతుంది. ఇదే ఆఖరికి అంతిమంగా మనం పొందామని తెలియని విచిత్ర వ్యవస్థ అయిన….విశ్వమోక్ష స్థితి అన్నమాట! భావ రహిత స్థితియే …..అసలు సిసలైన మోక్షం అవుతుంది. యద్భావం తద్భవతి.


స్వామి ! ఇదంతా బాగానే ఉంది. అంతా భావం మీద నడుస్తోంది ….భావం లేకపోతే ఏమీ లేదు అంటున్నారు…. దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా…?


అమ్మ !తల్లి…… చివరికి మీ సాధన పరిసమాప్తి ధ్యానానుభవంగా పొందిన కూడా….. నీకు అనుమానం రావటం ఏమిటి? నీకు ప్రత్యక్ష నిదర్శనాలు కావాలా ?దానికి నీవే నిదర్శనం ….నువ్వు ఎలా పుట్టావు ?అనగానే …


..అమ్మ కడుపు నుండి 


అది కాదు…… నిజానికి నువ్వు మీ నాన్న 0.1 పరిమాణంలో ఉండే ఒక వీర్యకణం నుండి పుట్టావు. ఇంత చిన్న పరిమాణంలో …..ఇప్పుడు నీవు ఉన్న ఏడు అడుగుల శరీరం ఎలా పుట్టింది ?ఆలోచించు…. అంతేందుకు మన ముందు కనిపించే అతి పెద్ద మర్రిచెట్టు చూడు…. దాని విత్తనం ఎంత ! నీ చిటికెన వేలు గోరు అంతే కదా! మరి ఇంత చిన్న విత్తనంలో అంత చెట్టు ఎలా ఉందో ఆలోచించు….. నీకే విషయం అర్థం అవుతుంది . అంటే మీ నాన్న కాస్త …..నాకు ఒక కూతురు పుట్టాలని ఉందని, భావం చేయడంతో….. వీర్య కణంలో నీ భావరూపం ఏర్పడి… అది కాస్త మీ అమ్మ కడుపు చేరి…. నువ్వు బయటికి వచ్చి ఇలా ఏడు అడుగులతో సంచారం చేస్తున్నావు. నీ పుట్టుకకి మీ నాన్న భావ రూపమే నువ్వు అని అర్థం అయింది కదా ! మీ అమ్మకి నా కడుపున అందమైన ఆడపిల్ల పుట్టాలని భావం చేస్తే….. ఆవిడ భావరూపం అండం ఏర్పడడం…. మీ నాన్నకి భావరూప వీర్యకణం ఏర్పడడం….. వీరిద్దరికీ శృంగార భావం కలగడంతో శరీరాల కలయిక వలన వీర్యకణంలోని భావరూపం కాస్త అండంలోనికి చేరి సజీవ భావరూపం నువ్వు బయటికి తొమ్మిది నెలల తర్వాత వచ్చావు అనగానే…


ఆగండి ……ఒక్క నిమిషం ! ఇది నిజమైతే మా నాన్న భావించగానే క్షణంలోనే పుట్టాలి లేదా బయటకు రావాలి కదా! మరి ఎందుకు తొమ్మిది నెలల సమయం తీసుకోవడం అనగానే…


అమ్మ! తల్లి…… భావం చేయగానే సరిపోదు. ఆ భావం యొక్క స్థిరత్వం మీద భావరూపం రావటం అనేది ఆధారపడి ఉంటుంది . మీ నాన్న కాస్త ఆడపిల్ల పుట్టాలి అనుకుని భావన మొదట చేస్తే….. రాత్రి అయ్యేసరికి దీనిని ఎలా పెంచాలి? ఎలా చదివించాలి? ఏం చదివించాలి? అని ఆలోచన భావాలు చేస్తాడు. ఆ తర్వాత దీనిని ఏమీ ఉద్యోగం చేయించాలి …..దీనికి ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి …..పెళ్లి సమస్యలు లేదా పెళ్లయిన తర్వాత సమస్యలు వస్తే ఏం చేయాలి …..అని ఆలోచన భావాలు చేస్తాడు . దీనికి సంతానం పుడితే ఎవరు పుట్టాలి …..పుట్టకపోతే ఏం చేయాలి? పుట్టినవాడు మన వారసులు కాదు కదా! మన రక్తమే అవుతారు కదా! వాళ్ళని ఎలా పెంచుతుంది…. వాళ్ళని భర్తతో సంతానంతో ఎలా నెట్టుకు వస్తుంది….. పూజలు చేస్తుందా? క్లబ్బులకు వెళ్తుందా…… అసలు దీని ప్రవర్తన అందరికీ నచ్చుతుందా? అందరితో మంచిగా ఉంటుందా …..ఇలా పలు రకాల అనుమాన భయ భావాలు చేస్తాడు. చివరికి ఆడ సంతానం వలన ఏమీ ఉపయోగం……అదే తనకి మగసంతానం ఉంటే వంశాభివృద్ధి జరుగుతుంది కదా ! ఆడపిల్ల పుట్టాలా…. అవసరమా !దీనిని సరిగ్గా పెంచగలనా ……సరిగ్గా చూసుకోగలనా …..పుష్పవతి దగ్గర నుండి పెళ్లయి దీనిని సంతానము పుట్టినా కూడా ఖర్చులు తప్ప ఏమైనా ఉంటుందా…! ఇలా పది రకాల భావాలతో కొట్టుమిట్టాడుకొని చివరికి ఆడపిల్ల మహాలక్ష్మి, అదృష్ట దేవత ,ఇది పుట్టిన తర్వాత మగపిల్లాడి సంగతి చూద్దామని ….ఒక స్థిర నిర్ణయ భావానికి వచ్చేసరికి తొమ్మిది రోజులు పడుతుంది . అదే క్రియారూప భావ స్థితికి అనగా మీ భావరూపం బయటకు రావడానికి అమ్మ కడుపులో ….తొమ్మిది నెలలు పడుతుంది అన్నమాట! అంతెందుకు …..అనసూయ మాతకి దత్తుడు , దుర్వాసుడు ఈ ముగ్గురు కూడా తొమ్మిది క్షణాలలో యోగ పుత్రులుగా పుట్టారు కదా ! ఆవిడ పాతివ్రత్య ధర్మంతో పతి సేవతో ….నిత్యం ఆధ్యాత్మిక స్థితిలో ఉండటం వలన ….ఆవిడ భావ స్థితి క్షణాలలో స్థిరం అవటంతో ….క్షణాలలో సంతానం పొందింది కదా! అంటే ఈ లెక్కన చూస్తే భావించే భావం యొక్క స్థిరత్వం బట్టి భావం ఆధారపడి ఉంటుందని నీకు అర్థమై ఉంటుంది కదా ! అనగానే ….


ఆ …..అర్థమైంది …..తెలిసింది!


 కానీ ఒక సందేహం! అదేమిటంటే భావం స్థిరపడటానికి సమయం తీసుకున్నట్లుగానే భావ రహిత స్థితికి సమయం తీసుకుంటుందా?


ఆ ఖచ్చితంగా తీసుకుంటుంది …..మూలస్థాన మూర్తి కాస్త ఆదిలో…. ఆది రుద్ర మూర్తి అయ్యి  విశ్వ జగత్తు ఉండాలనే భావం చేశాడు.  అదే ఆయన తిరిగి 108వ యుగంలో ఈ విశ్వ జగత్తు ఉండకూడదని భావం చేసి…. రుద్ర సజీవ మూర్తి కాస్త  నిర్జీవ  మూర్తి అయ్యి నిశ్చల స్థాన మూర్తి అయ్యాడు. ఒకటవ యుగం నుంచి వెయ్యవ యుగం వరకూ లోపల ఆయన ఎన్ని భావాలు చేశాడో…. ఏమీ అనుకున్నాడో…. అవన్నీ కూడా మనలాగా భావరూప శరీరాలు కదిలే స్థితిలో ఏర్పడ్డాయి. అది 100 యుగాల తర్వాత ఈయన కాస్త భావ రహిత స్థితి పొంది…. వీటిని అమలు చేయటానికి మరో 108 యుగాలే పట్టవచ్చును…. ఎందుకంటే ఒకే ఒక్కడి భావరూపం ఏర్పడటానికి 108 యుగాలు…. పోవడానికి 108 యుగాలు….. పడితే ఈ విశ్వ జగత్తుని 64 భాగాలుగా భావిస్తే..18,446,774,073,709,551,615 ఇలా ఇరవై ఒక్క అంకెల సంఖ్య వస్తుంది. అదే ఈ విశ్వ జగత్తు అనేది 1000 భాగాలు అయితే ….ఇంకా మనం ఊహించి చెప్పలేము. అనంత భావస్థితి అవుతుంది కదా! ఇందులో రెండు శాతం భావ రహిత స్థితి ఉంటే ….నాలుగు శాతం భావ యుత స్థితి అనగా రెట్టింపు స్థితిలో ఉంది. భావం పోయేవాడు ఇద్దరు అనుకుంటే…. భావం ఉన్నవాడు నలుగురు అన్నమాట! కాడికి ఆ నలుగురు ఉండాలి అనే ఆ భావం ఇందుకే వచ్చింది…… ఎందుకు అంటే చచ్చేవాడి గురించి ఈ నలుగురిలో కనీసం ఒక్కడైనా ఏడ్చి ….బాధపడి….. తను లేకపోతే నేను అని మోహభావం చేస్తాడని ….ఆశ అన్నమాట! దీనివలన చచ్చినవాడు తిరిగి ఎవరికడుపునైనా భావ రూపదారి అవతారం ఎత్తుతాడు. కారణం లేనిదే మన పూర్వీకులు ఏమి చేయరు ….అనుభవ పాండిత్యం అర్థమైతేనే అంతా మూలం తెలుస్తుంది. అంతెందుకు…. భావ రహిత స్థితిలో స్తంభేశ్వర మూర్తి స్థితి ఉంటుంది. అంటే భావ రహితుడు స్తంభించిపోతాడు. కానీ శరీరం కదలదు. మెదలదు. కానీ మనసు కదులుతుంది . కట్టేసి బంధించినవాడు స్థితియే ఈ స్థితి అన్నమాట! వీడు మంది గురించి ఆలోచించడు …..కానీ మది గురించి ఆలోచనలు చేస్తాడు . అంటే వీడు ప్రపంచం గురించి పట్టించుకోడు…. కానీ తన గురించి పట్టించుకుంటాడు అన్నమాట! కానీ అందుకే ఈ స్తంభేశ్వర స్థితి కూడా ఉండి కూడా మూలస్థానం మూర్తి కాస్త నిశ్చల స్థితి పొందడం జరిగింది. ఇందులో మది, మంది ఆలోచనలు… భావాలు ఉండవు . విశ్వమే తను అనుకున్నప్పుడు తను లేకపోతే విశ్వం లేదని ….విశ్వం లేకపోతే తను లేని స్థితి అని నిశ్చలమవడం…. మూలస్థాన మూర్తి కాస్త తర్జనీ ముద్ర ద్వారా విశ్వ జగత్తుని కూడా తనతో పాటుగా నిశ్చల స్థితి చేశాడు . అందుకే మనకి హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర ప్రాంతంలో శ్రీకృష్ణుడు మరియు పంచ పాండవులు చేతుల మీదుగా స్థానేశ్వర మహాదేవ్ శివలింగ ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతంలో స్తంభేశ్వర మహదేవ్ శివాలయం ఉంది. అంటే మన పూర్వీక మహర్షులు ఎంతటి పూర్వజ్ఞానులో నీకు ఇప్పుడు అర్థమైంది. అనుకుంటాను ……అన్ని స్థితిగతులు లోకవాసులకి తెలియటానికి …విశ్వారాధన నుంచి విగ్రహారాధన ఏర్పాటు చేయడం జరిగింది. జ్ఞానం అనేది అనేక పొరలుగా నిండి ఉంటుంది. దాన్ని అందుకునే స్థితిని ఎవరికి వారే వ్యక్తిగతంగా అందుకుంటూ ….ఈ స్థితిగతులు ఏర్పరచడం మనకి హైందవ ధర్మంలో…. ప్రతి భావానికి, భావ శరీరానికి తగ్గట్లుగా…. భావ దైవ విగ్రహ ఆరాధన ఉంటుంది. 36 కోట్ల భావాలు ఉన్నాయని…..  84లక్షల భావరూప శరీరాలు ఉన్నాయని…. జీవుల మరియు దైవాల సంఖ్య బట్టి చెప్పడం జరిగింది. ఏకైక ఈశ్వరుడే 36 కోట్ల భావాలకి 84 లక్షల జీవుల రూప ధారికి మూలమైన వాడు అని అందరికీ తెలుసు. ఒక కేజీ రాయిని ఒక గ్రామున్న 1000 రాళ్లుగా విభజన చేసినప్పుడికి….. కూడా దాని రూపంలో తేడా వస్తుందేమో… కానీ గుణాల్లో,తత్వంలో,బరువులో, తేడా రాదు . ఎందుకంటే ఈ వెయ్యి రాళ్లు ఒక కేజీ రాయితో సమాన సమానమవుతుంది కదా! 1000 అనుకుంటే 1000 . అదే ఒకటి అనుకుంటే ఒకటి . అది ఉంది అనుకుంటే ఉంటుంది….. లేదు అనుకుంటే అమోక్షము అదే మోక్షం రాదు. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏది అనుకుంటే అదే ఉంటుంది . కానీ నువ్వు అనుకుని జరగాలంటే నీ భావం యొక్క స్థిరత్వంను బట్టి కాలం ఆధారపడి ఉంటుంది. అందుకే మనకి కాలంలో కాల మార్పులు వచ్చాయి. భారతదేశంలో ఉన్నవాడికి ఉదయం కాస్త పగలైతే….. ఇదే సమయం అమెరికాలో ఉన్నవాడికి రాత్రి అవుతుంది. మొదటి వాడు పని చేయడానికి చాలా ఎక్కువ మంది భావన చేయడం వలన పగలు అయింది . రెండో వాడు కాస్త ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావన చేయడంతో రాత్రి అయింది . అంటే పగలు అనేది వెలుతురు ప్రపంచం…. అనగా భావ యుతమైతే ….రాత్రి అనేది చీకటి ప్రపంచం అనగా స్తంభ భావ యుతం అవుతుంది. ఎందుకంటే వీడు కదలడు…. మెదలడు . కానీ వీడి మనసు నిద్రలో కూడా స్వప్నంలో కూడా రూపముతో భావాలు చేస్తాడు కదా! అదే హిమాలయ యోగులు అయితే….రాత్రి ,పగలు అనే భేదం లేని కష్టం ,సుఖం తెలియని స్థితి అనగా భావంలో బావ రహిత స్థితికి ….అతీతమైన భావాతీత స్థితిలో అనగా….. నిశ్చల స్థితి సాధనలో ప్రతినిత్యం ఉంటారు. ఇదే అసలు సిసలైన భగవద్గీతలో చెప్పిన స్థిత ప్రజ్ఞత స్థితి అన్నమాట.! అనగా వీరికి రెండు భావాలు ద్వంద ప్రవృత్తులు ఉండవు. ఏక భావ స్థితికి వచ్చి…. ఆపై ఏక భావాతీత స్థితి పొందటానికి సాధనలో ఉంటారు . వీరే మూలస్థాన నిశ్చల మూర్తికి ప్రతిరూపాలు అలాగే…. ప్రతీకలు అన్నమాట ! వీరి వల్లనే విశ్వానికి అసలు సిసలైన అనుభవ పాండిత్య విశ్వమోక్ష జ్ఞానం…. విశ్వ జగత్తులో ఉన్న అన్ని లోక వాసులకి అందుతుంది. నిజానికి వీరిని ఇలా నిశ్చల సాధన స్థితిలో ఉంచేది….ఉంచేవాడు మూలమూర్తి అరుణాచలవాసి అయిన అరుణగిరి అంతరవాసి అయిన మేధా దక్షిణామూర్తి యొక్క సజీవ భౌతిక సిద్ధ పురుష మూర్తి అన్న మాట! ఇక్కడ ఈయన మూలస్థాన మూర్తిగా సజీవమూర్తిగా ఉండటం చేత…. హిమాలయాలలో ఉండే కైలాస పర్వతంలోని నీలి శరీర ధారి శంభు రుద్ర అంశ కాస్త తన స్తంభేశ్వర స్థితి నుండి నిశ్చల సాధన ఇప్పటికీ వీరిద్దరూ కూడా సజీవ మూర్తిగా ఉండి ఒకరు అరుణగిరిలో… మరొకరు కైలాస పర్వతంలో సాధన చేస్తున్నారు . అరుణగిరిలో ఉన్న విలోహిత రుద్ర మూర్తి కాస్త భావ రహిత స్థితి సాధన చేస్తుంటే …..కైలాసగిరిలో ఉన్న శంభో రుద్ర మూర్తి కాస్త భావ యుత స్థితి సాధన చేయడం జరుగుతుంది. తద్వారా అరుణగిరిలో రెండు భావ రహిత మోక్ష మరణాలు 108 యుగంలో జరిగితే అదే కైలాసగిరిలో ప్రతి యుగంలో రెండు భావయుత జననాలు జరుగుతున్నాయని…… ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది. విశ్వం ఉన్నదని…. నేను ఉన్నాను అని…… భావించే వాళ్ళు 98% ఉంటే, విశ్వం లేదు…. నేను లేను….. అని భావించుకునే వాళ్ళు రెండు శాతం మంది మాత్రమే ఉండడం చేత…… నిజానికి, సత్యానికి లేని విశ్వం ఉన్నట్టుగా కనబడటానికి కారణం 98% లేని దానిని ఉన్నట్లుగా భావించడం వలన, ఇంకా ఈ విశ్వం కదిలే స్థితిలో విశ్వమైంది . సత్యం తెలిసిన వాళ్ళు రెండు శాతం భావ రహిత స్థితికి వెళ్లడంతో….. వారి మోక్షం కాస్త వ్యక్తిగత మోక్షమై …. వారు శూన్యం అయిన విషయం విశ్వానికి తెలియకుండా పోతుంది. అలాగే వీరు పొందిన జ్ఞాన అనుభవాలు కూడా ఎవరికి తెలియకుండా…. తెలిసినా నమ్మని స్థితిలోనికి వెళ్లిపోవడం జరుగుతుంది . ఎందుకంటే కర్మ కారణం ఏమిటో నీకు తెలుసు కదా ! అరుణగిరి రుద్ర కాస్త నేను , విశ్వం లేదని భావ రహిత సాధనలో ఉంటే కైలాసగిరి రుద్రుడు కాస్త …….నేను ఉన్నాను అనే విశ్వ మంతా భావయత సాధన చేస్తున్నాడు. అందుకే మన పరమహంస పవనానంద కాస్త అసలు మూలంలో ఏముందో తెలుసుకోవాలని స్త్రీ ,పురుష, మూల ప్రకృతులను దాటి అండ పిండ బ్రహ్మాండాలున్న విశ్వ జగత్తుకు చేరి….. మూల అంతిమ జ్ఞాన అనుభవం ద్వారా ….మూలస్థాన మూర్తి ….అలాగే మూల విశ్వ జగత్తు కూడా భావ రహిత స్థితిలో స్తంభేశ్వర స్థితి దాటి నిశ్చల స్థితిలో నిశ్చల మోక్ష స్థితిగా ఉన్నదని….. అటు అనుమానం ఉన్న అరుణగిరి రుద్ర మూర్తికి ….అలాగే భావ యుతంగా ఉన్న కైలాసగిరి మూర్తికి…..ఏకకాలంలో అంతిమ విశ్వ అనుభూతి ఇవ్వటంతో….ఇదే సత్యం అని , నిత్యమని వీరిద్దరూ నమ్మటంతో….. విశ్వ జగత్తు అంతిమంగా, శాశ్వతంగా, భావహితకి అలాగే నిశ్చల స్థితికి చేరుకుంది. నిజానికి ఇప్పుడు ఈ స్థితి పొందలేదు . ఏనాడో ఆది యుగంలో …..ఆదిలోనే ఈ పూర్ణ నిశ్చల స్థితి పొందింది. కానీ ఆదిపరాశక్తి నమ్మకపోవడంతో ఆది రుద్ర మూర్తి తెలుసుకోకపోవడంతో ఇదంతా జరిగింది. అందుకే విషయ జ్ఞానం తెలిసిన వాడు మాట్లాడలేడు. తెలియనివాడు మాట్లాడతాడు . నమ్మినవాడు మౌని అయితే, నమ్మని వాడు అజ్ఞాని అవుతాడు. యద్భావం తద్భవతి….. శివ స్వామిగా నేను కాస్త మౌని అయితే రుద్ర స్వామి కాస్త అనుమానభయంతో అజ్ఞాని కాస్త జ్ఞాని అయితే నువ్వు సత్యాన్వేషియయి తెలుసుకోవడం కాస్త అంటే ఈ విశ్వ జగత్తులో తెలుసుకున్న లయకర్త శివుడిగా ఉంటే… తెలుసుకునే వాడిగా స్థితికర్త విష్ణువుగా ఉంటే …..తెలియని వాడిగా సృష్టికర్త బ్రహ్మదేవుడిగా ఉంటే …..తను తెలుసుకున్నది నిజమో కాదో అని అనుమానభయం నిత్య సత్యాన్వేషిగా ఆదిపరాశక్తి ఉంటుందన్నమాట! అంటే సృష్టి, స్థితి ,లయ తిరోగమన ప్రక్రియలో వీళ్లంతా ప్రతికలుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్లల్లో ఎవరైతే తమ పొందిన అంతిమ స్వానుభవ అనుభూతి ….అదే విశ్వజగత్తు లేదు, నేను లేను అని విశ్వసించి విశ్వాసంతో ఉంటారో ….. వారు కాస్త విశ్వ శూన్యంలో నిశ్చల మోక్ష స్థితిలో శూన్యం అవుతారు అని ఈపాటికి నీకు అర్థమైంది అని నాకు అర్థమై మౌనబ్రహ్మగా మారుతున్నాను. మంది లేదు , మది లేదు, ఉన్నదో లేదో శూన్యభావము లేదు, సర్వ భావాతీత స్థితిలో స్తంభేశ్వర స్థితి పొంది…. ఆపై నిశ్చల మోక్ష స్థితి పొందే ప్రయత్న సాధనలో …..సాధన పూర్తి అయ్యిందని నాకు తెలియకవచ్చు నీకు తెలియవచ్చు కదా అనుకుంటూ ……


శివ నందిని కాస్త శివానందతో…


స్వామి! మూలస్థాన మూర్తి నిర్జీవ మూర్తి అయినాడని….. నేను అనుభవ అనుభూతి పొందడం ద్వారా…. ఇది సత్యమని మనసా వాచా కర్మణా….. సర్వస్య శరణాగతితో విశ్వాసంగా నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు నా అంతిమ స్థితి ఏమిటో అన్నప్పుడు…. 


ఇదంతా చూసిన దానివి…. నీ అంతిమస్థితి కూడా ధ్యాన దృశ్యం చూసుకో…. నీకే విషయం తెలుస్తుంది…అన్నీ అర్థమవుతాయి అనగానే…



స్వామి! నాకు మోక్షం పొందాలని లేదు. నాకు మీతో సాంగత్యం పొందాలని ఉంది. నాకు మీలో కలిసి పోవాలని ఉంది. ఎటు మీరు ఎలాగో మోక్షం పొంది శూన్యం అవుతారు…. అప్పుడు నేను మీలో ఉన్నప్పుడు నేను కూడా మీతో పాటుగా మోక్షం పొందడం జరుగుతుంది. ఈ ఇష్ట కోరిక తీర్చే మార్గం నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అనగానే….


దేవి! నువ్వు నిజానికి నా కంఠంలో ఉండే స్పటిక లింగానివి. కాకపోతే ఆదిపరాశక్తి కాస్త నా కంఠం నుండి నిన్ను బయటికి తీయడంతో…..స్పటిక శివలింగం కాస్త ఆకాశ శరీరధారిగా మారినావు. తద్వారా నీ మనస్సు యొక్క మనోమాయ అయిన శివసాంగత్యం ధర్మదీక్ష పొందాలని ఇష్ట కోరిక మాయలో….. నీ ఆకాశ శరీరం పడడంతో, అది కాస్త నీ మనో శరీరముగ మారటానికి కారణం అయ్యింది . ఈ కోరిక కోసం నీ ఏకాదశ దేహాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిని నీ మోక్ష జన్మలో మోక్ష సాధన చేసి… మళ్లీ ఇక్కడిదాకా రావడం జరిగింది . ఇది నీ అంతిమ ఇష్ట కోరిక. శివసాంగత్యమును నాతోనే తీరుతుందని …..నీ మనసు ప్రభలంగా నమ్మడంతో , తిరిగి నువ్వు నా కంఠ స్పటిక శివలింగం నీ మనో శరీరంగా మారుతుందని…. అందులో నీ ఆకాశ శరీరం కాస్త…. ఈ లింగం యొక్క లింగభాగంలో ఉండిపోతుందని అనగానే…


స్వామి! నాకు ఎప్పుడూ కూడా నా ఆత్మ కాస్త ఒక శివలింగం యొక్క లింగభాగం లోపల ఉన్నట్లు….. అనేకమార్లు ధ్యానంలో…. అలాగే స్వప్నంలో కనిపించింది. ఇప్పుడు అది ఏమిటో అర్థం అయింది. అర్థం అవుతోంది …అయితే ఇలా మారిన నా శరీర స్పటిక శివలింగమును ఇప్పుడు మీరు మీ కంఠమున ధరిస్తారు. తర్వాత మీరు మీ ఆకాశ శరీరంతో మీ స్థూల శరీరధారియైన పరమహంస పవనానంద స్వామీజీ యొక్క కంఠంలో ఆకాశ శరీరంతో స్పటిక లింగం వెళ్ళటం జరుగుతుందన్నమాట. అప్పుడు మన ఇద్దరం కూడా ఈయన కంఠంలో ఆకాశ శరీర ధారి అనగా ….నేను లింగంలో ఉంటే మీరు లింగం బయట ఆవాసం చేస్తూ…. ఇలా ఒకరినొకరు సాంగత్యం చేసుకుంటూ ఉండగా…. ఎప్పుడైతే పరమహంసగారి స్థూల శరీరం అంతిమ కర్మ సమాప్తి అవుతుందో…. అప్పుడు మన ఆకాశ శరీరాలు ఉన్న స్పటిక లింగ విభేదన జరిగితే ఆయన విశ్వ పూర్ణ శూన్యంలో పూర్ణ మోక్షముతో శూన్యం అవుతారు కదా! 


ఇక్కడ చిన్న సందేహం….అదేమిటంటే పరమహంస గారు విశ్వ మోక్షం పొందుతారా? లేదా పూర్ణ మోక్షం పొందుతారా? అనగానే……


దేవి! విశ్వ మోక్షం అంటే శూన్యమునకు అతీతమైన స్థితి పొందాలి. అది శంభు రుద్రుడు తప్ప ఇంకెవరూ ఈ స్థితిని పొందలేరు. పొందరు కూడా…. ఎందుకంటే ఇది ఏమీ లేని స్థితి. అక్కడ ఆఖరికి శూన్యం కూడా లేని స్థితి . నేను కానీ నేను లేని స్థితి. ఈ స్థితి ఆయన పొందడంతో ఇంక ఎవరూ… ఏమీలేని స్థితి అయ్యింది . కాకపోతే నిర్జీవ బూడిద ఆకార రూప ధారి నిశ్చల మోక్ష స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ఆయన భావ రూప ఆలోచన…. జ్ఞానమాయ నుండి వచ్చిన మనము…. స్వప్న రూప ధారులమే అవుతాము. చూడడం తప్ప…. తెలుసుకోవడం తప్ప… ఏమీ చేయలేని స్థితి …ఏమీ లేని స్థితి అన్నమాట ! కేవలం మనమంతా కూడా ఎవరైతే ఇది సత్యం అని విశ్వసించి నమ్ముతారో…. వారే శూన్యంలో శూన్యం అవుతారు . ఎందుకంటే మనకి శూన్యం ఉన్నది అనే శూన్యభావ స్థితిలో మన సాధన పరిసమాప్తి అవుతుంది. ఇక ఎవరైతే అంతిమ అనుభవ అనుభూతి విశ్వసించరో …..వాళ్లు కాస్త శూన్యము నుండి వెను తిరిగి మూల ప్రకృతికి చేరుకొని….. వారి కారక కర్మ జన్మ బట్టి పునః సృష్టిలోనికి కారణ అకారణజన్మలు ఎత్తడం జరుగుతుంది. ఎందుకంటే విశ్వం అనేది విశ్వాసంతోనే నడుస్తుంది కదా! ఉంది అనే వాడికి ఉన్నట్లుగా….. లేదు అనే వాడికి లేనట్లుగా ….నేను ఉన్నాను అనే వాడికి నేను ఉన్నట్లుగా ….నేను లేను అనే వాడికి లేనట్లుగా కనపడుతుంది కదా! అంటే యద్భావం తద్భవతి అనగానే….


 శివనందిని అంతిమ మోక్షానుభవం :


 శివనందిని వెంటనే



స్వామి! అంటే మీరు చెప్పేది మోక్షం అంటే కేవలం భావమే అని చెప్పడం కదా! ఇప్పుడు కష్టపడి నేను చేసిన సాధన అంతా వృధా యేనా? సాధన చేసి నేను పొందిన ధ్యాన అనుభవాలు ,ధ్యాన దృశ్యాలు నేను సేకరించిన దైవిక వస్తువులు అన్నీ కూడా ఉపయోగం లేవా? కేవలం భావమే మోక్షం అనుకుంటే….. ఇది అంతా చేయడం ఎందుకు. ఇన్ని అష్ట కష్టాలు పడి మాయలు దాటి, మర్మాలు తెలుసుకొని….ఇక్కడిదాకా రావడం ఎందుకు? నేను ఇది నమ్మను. మోక్షం అనేది భావం అంటే… నేను కాస్త ఏదో ఒక గుడిలో కూర్చుని భావన చేస్తే సరిపోద్ది కదా! అయినా నేను మోక్షం పొందాను లేదా “నేను లేను” భావన చేస్తే నాకు నిజంగానే పూర్ణ మోక్షం వస్తుందా? మీరు మరీను ….. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఏదో అనుకున్నాను…. దాని అర్థం ఏమిటో ఇప్పుడు నాకు అర్థం అయింది. మీరు చెప్పేదంతా సత్యమే అని నేను నమ్ముతున్నానని, మోక్షం అంటే భావం అని…. ఇదే సత్యం అని…. చెప్తే నమ్ముతానా ? నేను చచ్చినా నమ్మను….ఎందుకు నమ్మాలి ! ఇప్పుడు ఈ క్షణమే “నేను లేను” అని భావం చేస్తాను. నాకు మోక్షం వస్తుందా! ఆ భరోసా, నమ్మకం , అనుభవం మీరు ఇస్తారా! చూపిస్తారా! అనగానే…. …..


 దేవి! నేను చెప్పింది అక్షరసత్యమే. భావం మీద… విశ్వాసంతో ఈ విశ్వం నడుస్తోంది . ఉంది అంటే ఉంటుంది. లేదు అంటే లేదు . దేవుడున్నాడు అంటే ఉంటాడు. లేడు అంటే లేడు . నేను ఉన్నాను అనుకునే భావంలో ఉంటే నువ్వు ఉంటావు. అదే “నేను లేను”

అనుకుంటే నువ్వు లేకుండా పోతావు . అంతెందుకు….నువ్వు లేవు అని స్థిర మనసుతో…..స్థిర భావం చెయ్యి . నీ భావ స్థిరత్వం బట్టి , మోక్షం అనేది క్షణం పట్టవచ్చును…. లేదా మహా కల్పాలే పడుతుంది . ఖచ్చితంగా వస్తుంది . కాకపోతే నీ మనసు స్థిర భావ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది . అస్థిర భావమును ….అస్థిర మనస్సుతో చేస్తే , నీకు మోక్షం పొందాను అనే భావప్రాప్తి కలగటానికి…. యుగాలే పట్టవచ్చును. .అందుకే సాధకుడు ఇలాంటి అస్థిర భావ స్థితిలో పడి పునః జన్మలు ఎత్తుతాను అనే భావంలోకి పడిపోతాడు. కావాలంటే నువ్వు ఈ క్షణమే స్థిర మనసుతో, స్థిర భావంతో “నేను లేను”.... నేను మోక్షం పొందాను… భావం చెయ్యి. ఆపై ఏం జరుగుతుందో నీకే ధ్యానానుభవాలలో తెలుస్తుంది. పదార్థం దాటితే కానీ యదార్థం తెలియదు కదా ! అస్థిర మనసు దాటితే గాని భావం స్థిరపడదు కదా! అనగానే 


సరే స్వామి! మీరు చెప్పినట్లుగా నా స్థిర మనసుతో ….స్థిర భావంతో …..“నేను లేను” అని భావం చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాము…. అనుకున్న మరుక్షణం లోనే శివనందిని ధ్యానానుభవాలు కాస్త ధ్యానంలో కనిపించడం ఆరంభమైంది . వరుసగా ఆదియుగంలో ఆది జన్మగా మర్రిచెట్టు నుండి ఎన్నో చెట్ల రూపాలు ఎత్తుతూ…. పుడుతూ….చస్తూ…. దృశ్యాలు కనపడగా మద్యయుగానికి వచ్చేసరికి జంతువులు వానర జన్మ నుంచి ఆరంభమై మనుష్య జన్మగా ఎన్నో కోటానుకోట్ల జన్మలు ఎత్తినట్లుగా భోగ జన్మలో కాస్త అంతిమ యుగానికి వచ్చేసరికి….. భోగ జన్మలు కాస్త యోగజన్మలుగా మారుతూ…. అంతిమ భోగ జన్మ ఈ జన్మ భోగ జీవితమైన జ్ఞానేశ్వరి జన్మగాను…. యోగ జన్మ అనేది శివనందిని గాను……దైవజన్మ అనేది అపితకుచాంబికా దేవి అని ధ్యాన అనుభవాలు చూపిస్తుంటే…… ఆయా జన్మల సాధనలో తనకి వచ్చిన దైవీక వస్తువులు అన్నీ కూడా….. ప్రకృతి కాస్త తన భూగర్భములో దాచిపెట్టినట్లుగా…. వాటిని తను ఇప్పుడు ఈ జన్మలో ధ్యానానుభవాలలో చూసి వాటిని తిరిగి పొందిన విషయం జ్ఞానం అందడంతో…… ఇన్నాళ్లు తను ఉన్నాను అనే భావపరంపర కొనసాగుతూ ఆదియుగం నుండి అంతిమ యుగం దాకా కొనసాగటం….. ఎప్పుడైతే అంత్య యుగములో…. అంత్యములో తను ఎవరో తెలుసుకోవాలనే తలంపుతో ……సాధన జీవితానికి అడుగుపెట్టిన క్షణం నుంచి ధ్యాన అనుభవాలు ఒక్కొక్కటిగా కనపడుతుంటే …… ఇప్పుడైనా తనకి నేను అనేది జీవం కాదని దైవం అని అది కూడా శవమైనదని …..శివశవం అయిందని…అనుభవ అనుభూతిని తను గత జన్మలో పొందినప్పటికీ …..అనుమానభయంతో నిజ నిర్ధారణ చేసుకోవాలని….. ప్రస్తుత జన్మ ఎత్తడం జరిగింది. ఇలా తను అనుభవం పొందాలని అనుకుని జన్మ ఎత్తటం జరిగిందని….. నిజానికి ఏ జన్మలో కూడా సాధన చేయలేదని….. తను అస్థిర మనస్సుని స్థిరపరచుకునే విశ్వ ప్రయత్నమే సాధన అయిందని….. భోగ కోరికలు దాటే ప్రయత్నం భోగసాధన అయితే, యోగ కోరికలు దాటే ప్రయత్నమే యోగ సాధన అయిందని….. నిజానికి సాధన అంటే అస్థిర మనసుని స్థిరము చేసుకోవడమే….. ఇది గత జన్మలలోనే పూర్తి అయ్యిందని…. అస్థిర మనసుకి కారణం మనసు యొక్క అస్థిర భావాలే మూలకారకమని….ఎప్పుడైతే తను అస్థిర భావాల నుండి స్థిర భావానికి అలాగే అస్థిర నిశ్చయాలనుంచి స్థిర నిశ్చయాలకి రావడం మొదలైందో….తన అస్థిరమనస్సు కాస్త స్థిరమనస్సు అవడంతో…. భోగము నుండి యోగ జన్మలకి రావడం జరిగిందని….భోగము అంటే అస్థిర మనస్సు యొక్క అస్థిర భావరూపమని…… యోగము అంటే స్థిర మనసుతో స్థిర భావము అని…… మన మనసు ఏమి భావం చేసుకుంటామో, అదే మన మనసు మనకి ధ్యానము లేదా స్వప్నములో ఇన్నాళ్లు చూపిస్తుందని….. ఎందుకంటే మనం దేనికైనా భయపడితే, మనసు కాస్త తను భయపడినట్లుగా లేదా భయపడే ధ్యాన అనుభవాలు లేదా స్వప్నలో చూపిస్తుందని…..ఎప్పుడైతే మనం మన మనసుకు మనోధైర్యం ఇస్తామో …..అప్పుడు మన భావాలకి తగ్గట్లుగా…. మనసుకి భయం పోయినట్లుగా…. ధ్యాన అనుభవాలు చూపిస్తోందని శివనందినికి అర్థమై ఇక “నేను లేను” భావం చేయడం ఆరంభమైంది.


ధ్యాన దృశ్యంగా 64 అడుగులు ఉన్న అగ్నిముతో ఉన్న అమ్మవారి మనో శరీరం కనపడుతుంది.  దీనిని దాటి లోపలికి వెళితే…. నీలి కోణ లింగములో శివనందిని నిర్జీవ మూర్తి యొక్క పిండదేహం దర్శనమిస్తుంది.  ఎందుకంటే తనకి దైవీక వస్తువుగా తన మనో శరీరం మోక్షము తర్వాత మనో లింగం రావటంతో తన పిండదేహం కోణ లింగంలో సజీవ మూర్తిగా దర్శనం అయితే…. అప్పుడు తనకి నీలి  కోణ లింగం రావటంతో….. ఇప్పుడు నీలి కోణ లింగంలో తన పిండదేహం కాస్త నిర్జీవ మూర్తిగా దర్శనం ఇవ్వటం….. శివ నందిని ధ్యాన దృశ్యంగా చూసింది.  ఇక్కడ వచ్చే ఆరు  ఋణ పాశాలు అనగా శివ స్వామి, రుద్ర స్వామి, మహాదేవి, బాలగణపతి, బాల కుమారస్వామి, భైరవ అంశ కుక్కల సేవలు యొక్క కర్మ పాశాలు పూర్తి అవ్వటంతో…. తనకి నీలి  కోణ లింగం వచ్చిందని శివనందిని కి స్ఫురణ అయింది.  ఆ తర్వాత తన నిర్జీవ పిండదేహాన్ని నీలి శివుడయిన శంభు కాస్త దహనం చేయడంతో….తన లింగ దేహం దర్శనం ఇవ్వటం…. ఇది కాస్త దహనమై గంధ శివలింగం అవ్వటం …..ఇది కాస్త దహనం అవ్వడంతో పురుష ప్రకృతిలో తన మోక్ష అనుభవం పూర్తి అయ్యిందని జ్ఞాన స్ఫురణ అందడంతో 


అప్పుడు తననుండి దైవ అంశగా అపితచాంబికా దేవి బయటకు రావటం…… అలాగే శివ స్వామి నుంచి అరుణ శివ బయటకి రావడం…… వీరిద్దరూ కాస్త నిలుచున్న ఏకత్వ అర్ధనారీశ్వర తత్వమును పొంది ……ఏకమై లింగ దేహమై….. దహనమై…… శూన్యంలో శూన్యం అవడం…..అప్పుడు శివ నందిని స్థూల శరీరము కాస్త యోగాగ్ని తో దహనం అవటంతో….. అంతిమంగా ఆది దైవిక వస్తువైన శివ స్వామి ఆకాశ శరీరంలో  కంఠంలోని స్పటిక శివలింగంగా మారింది.తను కాస్త స్పటిక లింగంగా మారుతూ ……శివ స్వామి కంఠంలో చేరుతున్నట్లుగా …..అనుభవ అనుభూతి కలుగుతూ ఉండగా ……అంటే శివ స్వామి చెప్పింది అక్షర సత్యమేనని, తను స్పటిక శివలింగంగా మారతానని….. తను కొన్ని కోటానుకోట్ల యుగాలపాటు …..నేను ఉన్నాను భావంతో ఉండటం వలన, తన జన్మల పరంపర కొనసాగిందని …..ఎప్పుడైతే తను నేను లేను అనే భావమును స్థిర మనసుతో స్థిర భావం చేసిన మరుక్షణమే , నేను అనేది లేకుండా శాశ్వతమై ….శూన్యంలో శూన్యం అవుతున్నానని….. మోక్షం అనేది స్థిర మనసుతో ….స్థిర భావం చేసే మోక్ష భావమని….. అక్షర సత్యమేనని ……అనుభవ అనుభూతి పొందుతూ ఉండగా…… తను అంత్యముగా తన కంఠములో స్పటిక శివలింగంగా మారుతానని , తను ఈ అనుభవం పొందకముందే శివ స్వామి చెప్పాడు అంటే …..తన అంత్య భావం ఏమిటో ఆయన తెలుసుకొని చెప్పడం జరిగిందని…..అదే ఇప్పుడు చూస్తున్న తన భావ దృశ్య అనుభవ అనుభూతి అనుకుంటూ ఉండగా…… చిరు మందహాసం చిరునవ్వుతో ఉండగా …..తన 11 దేహాలు కూడా దహనమై శూన్యమైపోతూ ఉండగా తను మోక్షము పొందాలని చేసిన భావరూప ఫలితము సత్యమేనని….. భావ రహిత స్థితి నుండి భావ రాహిత్య స్థితికి వెళుతూ పూర్ణ శూన్యంలో శూన్యం అయ్యింది. శివ స్వామి చేతిలో తన కంఠము నుండి ఏ ఆదిపరాశక్తి శివలింగం తీసిందో …..తిరిగి ఆదిపరాశక్తి కాస్త శివ నందిని రూపజన్మ ఎత్తి, చివరికి తన కంఠ స్పటిక శివలింగమై …… తన కర్మను పరిసమాప్తి చేసుకోవడంతో తను పూర్ణ మోక్షం పొందడం జరిగింది.ఇంతడితో శివనందిని విశ్వమోక్షానుభవము పూర్తి అయింది.ఇపుడు పరమహంస గారి అంతిమ మొక్షానుభవమును అమృతానుభవముగా విడిగా చెప్పడము జరిగింది.శుభంభూయాత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి